StatCounter code

Friday, April 9, 2010

పిచ్చ పిచ్చగా లైట్ తీసుకో-రెండవ భాగము (ఎంగిలితెలుగు)

నిన్న అనవసరంగా టివీలో వార్తలు చదివేవాళ్ళని దుమ్మెత్తిపోసానేమోనని అనిపించేట్టుగా మరిన్ని అంశాలు తారసపడ్డాయి నాకు.

తెలుగుని సరిగ్గా పలకకపోవడం ఒక అంశమైతే ఎంగిలి చెయ్యడం ఇంకో అంశం.

నిన్న రాత్రి జీ-తెలుగు లో వచ్చిన "స రి గ మ ప" అనే పాటల పోటీని వీక్షించాను. అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాలెండి. అది తెలుగు పాటల పోటీ. తెలుగు వాళ్ళు రాసిన, బాణీలు కట్టిన పాటలని తెలుగు పిల్లలు పాడుతారు. తెలుగువాళ్ళే వ్యవహారకర్తలు, తెలుగువాళ్ళే న్యాయధిపతులు. ఇక్కడ మార్గదర్శకులు (mentors) అని ఇంకో తరగతి ఉంది. పెద్ద, బుల్లి మార్గదర్శకులు ఉన్నారు. న్యాయధిపతులుగా వచ్చే SP శైలజ, మాధవపెద్ది సురేష్ (నిన్నటికి వేటూరివారు వచ్చారనుకోండి) గార్లు చాలా చక్కగా తెలుగు మాట్లాడతారు. అంతగా తెలుగు రాని వ్యవహారకర్త నోయెల్ కి కూడా తెలుగులో మాట్లాడడం నేర్పించి, ఆ కుర్రాడు చక్కని తెలుగు మాట్లాడే స్థాయి కి తీసుకుని వచ్చారు. ఇకపోతే మార్గదర్శకులున్నారే...హేమచంద్ర, హిమబిందు. వీరిరువురూ కూడ నేపధ్య గాయకులే. వీళ్ళు...అసలుసిసలైన తెలుగుగాళ్ళు. ఎలాగంటారా,ఇలాగ....

"నేను actual గా, మాకు ఒక music company ఉంది. ఆ company through అమ్మ నన్ను వేటురిగారి దగ్గరకి తీసుకుని వెల్లరన్నమాట. I am lucky, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నేను, I want to sing వేటురిగారి పాట. sir, with your permission"

ఈవిడగారికి "ద్వారా", "దీవెనలు", "అనుమతి" లాంటి తెలుగు పదాలు తెలియవా????? (కోటి రూపాయల ప్రశ్న)

హేమచంద్ర ఏమీ తక్కువ కాదు. actual గా నువ్వు బానే పాడావు. but there is some shake in your voice, nasal వస్తున్నది. its good, బావుంది. but u have to improve a lot. మధ్యలో ఆ గమకం వస్తుంది కదా there u went wrong."......ఇలా ఉంటుంది వరస.

అసలు ఈ మధ్య ఇదో వింత పోకడ! గత 3-4 యేళ్ళుగా గమనిస్తున్నాను, కొందరి సంభాషణలు ఎలా ఉంటాయంటే....

"I went there అన్నమాట. అప్పుడు my friend told me this. సరే అని i did that"..... ఇలా ఉంటుంది. ఆ ఏడ్చేదేదో పూర్తిగా ఇంగ్లీషులోనే ఏడవచ్చుకదా, ఏమిటో విడ్డూరం !

సరే, అసలు విషయానికొద్దాం. నాకు ఈ ప్రోగ్రాం చూసి పిచ్చ పిచ్చగా తిక్క రేగింది. ఛీ థూ అని చెప్పి ఐ.పి.ఎల్ పెట్టానా, మన DC ఆడుతోంది. ఉత్సాహంగా చూసాను.

మన సినిమా బాబుల్లో ఒకరైన వెంకటేష్ బాబు ఆ ఆట చూడడానికి అక్కడకి వచ్చారు. DC గెలిచింది, ఆట ముగుసింది. మన బాబుని పిలిచి వ్యాఖ్యానించమని కోరారు. ఆ బాబు ఎంగిలిపీసులో టపా టపా బాగానే వాగారు. వాగిన పిమ్మట సదరు వ్యాఖ్యాత "మీ DC టీం గురించి తెలుగులో ఏమైనా చెప్పండి" అని అడుగగా మన బాబు "DC కి support చెయ్యండి. DC should go to final, we will support them" అని చెప్పారు.

ఇది విన్న వ్యాఖ్యాత this is not telugu అని చెప్పగా....హి హి అని ఒక వెకిలినవ్వు నవ్వి మరల DC కి సపోర్ట్ చెయ్యండి, thats it అని నిస్సిగ్గుగా అన్నారు.

ఒక ఛీ థూ తో సరిపెట్టుకుందామంటే ఉండనివ్వరుగా వీళ్ళు అని ఛీ ఛీ థూ థూ అని రెండుసార్లు అన్నాను.

మరల ఛానెల్ మార్చబడినది. (నీకేం పనిలేదా టీవీ చూడడం తప్ప అని అడగకండి. నిన్న నిద్ర రాక, నా ఖర్మ కాలి చూసాను అర్థరాత్రి వరకు).

మన ఇంకో బాబు, బాలయ్య బాబు కొత్త సినిమా "సింహ" సినిమా ప్రకటన వస్తున్నాది. అందులో ఒక డవిలాగు " నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పని చెయ్యాలి, లేకపోతే నీకు next birthday ఉండదు." అసలే గురుడు హావభావ ప్రకటనలో దిట్ట. ఆ రకంగా ఈ డవిలాగు చెబుతూ ఉంటే, నా సామి రంగ... కడుపులోంచి తన్నుకొచ్చింది వాంతి.

ఈ బాబుదే ఒక్క మగాడు అనే ఇంకో కళాఖండం వచ్చింది, కిందటి యేడాదో, ఆ ముందటి యేడాదో. అందులో ఒక డవిలాగు...."నేను decision తీసుకుంటే compromise అవ్వను. compromise అయితే decision తీసుకోను.
బాబు ఎంత సత్యం చెప్పారు. ఈ సూక్తిని మీరంతా కూడా పాటించండి అమ్మలారా, అయ్యలారా ! మిగతాబాబులు బాగా మాట్లాడుతున్నారని కాదు, కొన్ని ఉదాహరణలిచ్చాను అంతే.

డవిలాగులే కాదు పాటలూ అదే పద్ధతిలో ఉన్నాయి.

"హేయ్ టిప్పు టాపు దొర కదిలిండో, ఎవరికి వీడు దోరకడులెండో, ముదురండో
ఉప్పుకప్పురంబు ఒక్క లుక్కునుండో, వీడి లుక్కు చూసి మోసపోకండో (వేమన గారు వింటే ఆత్మహత్య చేసేసుకుంటారు, అమంగళం ప్రతిహతమగుగాక)
కం ఆన్ కం ఆన్ మోస్టు కన్నింగు, మస్తు టైమింగు, రైటులలో రాంగు" (ఇంక రాయలేను)

"పాషు పాషు పరదేశి నేను, ఫారిన్ నుండి దిగి వచ్చాను
రోషమున్న కుర్రాళ్ల కోసం వాషింగుటన్ను వదిలేసాను"

"ఓం నమస్తే బోలో బేబీ, ఓం నమస్తే బోలో దిల్ మే డాష్ కొట్టే పార్టీ టైం లో
ఓం నమస్తే బాబా ఓం నమస్తే బోలో నీతో పార్ట్ నర్ అవుతా ఫ్యూచర్ క్రైం లో"

(రాసేసి చేతులు, నోరు సబ్బుతో కడిగేసుకున్నాను. మీరూ చెవులు, కళ్ళు కడిగేసుకోండి).

ఏదో సిరివెన్నెలలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టీ

"తలయెత్తి జీవించు తమ్ముడా,
తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని
తలవంచి కైమోడ్చు తమ్ముడా,
తెలుగుతల్లి నను కనిపెంచినాదని, కనుక తులలేని జన్మమ్ము నాదని" అనో

"ఉండుండి ఇలా ఉబికొస్తుందేం కమ్మానైన కన్నీరు, తీయనైన గుబులిది అంటే నమ్మేదెవ్వరు?
మధురమైన కబురందిందే కలతపడకు బంగారు, పెదవి తోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరు !
గంగలాగ పొంగిరానా ప్రేమసంద్రమా, నీలో కరిగి అంతమవ్వనా ప్రాణబంధమా!
అంతులేని దాహమవనా ప్రియప్రవాహమా, నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా"

అనో చెవులకి ఇంపుగా అప్పుడప్పుడూ వినిపిస్తున్నాది.

అదండీ సంగతి. వీళ్ళండి మన తెలుగుకి ప్రతినిధులు ! ఇప్పుడు చెప్పండి, ఎలాగోలా కల్లనో, నీల్లనో, అనర్గళం అనకనో, ఏకసంతగ్రాహి అనో అష్టకష్టాలు పడైనా ఆ మాత్రం తెలుగు మాట్లాడుతున్న మన న్యూస్ రీడర్స్ మేలా, తెలుగుని ఎంగిలి చేస్తున్న బాబులు, వాళ్ళ సినిమాలు మేలా?


Thursday, April 8, 2010

పిచ్చపిచ్చగా లైట్ తీసుకో !


ఇదే మన తెలుగు న్యూస్ ఛానెళ్ల భాష.

వీటీకి ఆదిగురువు...వేరే చెప్పక్కర్లేదనుకుంటా, అదేనండీ మన నిరంతర వార్తా స్రవంతి TV9.

ఆ మధ్య ఎప్పుడో నా ఖర్మ కాలి అందులో ఏదో దిక్కుమాలిన ప్రోగ్రాం చూసాను. అందులో వాళ్ళ భాష మహ కనికిష్టం.

" ఇవాల అక్కడ పబ్లిక్ పిచ్చ పిచ్చ గా ఎంజాయ్ చేస్తున్నారు"

"జరిగిందేదో జరిగింది అనుకుని జనాలు లైట్ తీసుకున్నారు"

ఇవి వింటుంటే నాకు చెవుల్లో ఆముదం పోసినంత బాధగా అనిపించింది.

పిచ్చ పిచ్చగా, లైట్ తీసుకో అన్న పదప్రయోగాలు చూసి నివ్వెరపోయాను. ఈ పదాలు మనం సరదాగా, మన స్నేహితులతో అంటూ ఉంటాం. వాటిని తీసుకొచ్చి తమ ప్రోగ్రామ్ముల్లో వాడితే జనాల్లోకి దూసుకుపోవడం అనుకుంటున్నారు కాబోలు ఆ సదరు టివివారు.

ఈ మధ్య నా దురదృష్టం పుచ్చిపోయి జెమిని వార్తలు వినాల్సిన అగత్యం ఏర్పడింది. ఆ సదరు మహాతల్లికి "విద్యార్థి" అనడం రాదు. అరగంటసేపు చదివిన వార్తల్లో ఓ 10-15 సార్లు విద్యార్థి అన్న పదం వచ్చి ఉంటుంది. అన్నిసార్లు ఆవిడ "విధ్యార్థి" అని అంటూనే ఉంది. ధ కి ఒత్తులేదన్న విషయం సదరు పఠకురాలికి తెలియదనుకుంటాను. సరే, ఆ రోజు పొరపడినట్టున్నారు మర్నాడు సరి చేసుకుంటారని ఆశపడ్డాను. ఆ ఆశ అడియాశ అని ఋజువయింది. వరుసగా నేను చూసిన మూడు రోజులు ఆవిడ విధ్యార్థి అనే చదివింది. చెవుల్లో చీమలు దూరినట్టు అనిపించింది.

వీళ్లకి ఎక్కడ ఒత్తు పెట్టలో, ఎక్కడ పెట్టకూడదో తెలీదు.
"సంబంధం", "భేదం" "బాధ" లాంటి పదాలు వారి నోట పడి మనకు కడు ఖేదాన్ని కలిగిస్తాయి. "ళ" పలకడం రాదు. వీల్లకి, వాల్లకి, నీల్లు అంటారు.

ఇంకొక ఉదంతం TV5లో...."సంభ్రమాశ్చర్యాలు" అనేది మాహా కష్టమైన పేద్ద పదం ఆ సదరు పఠకుడికి.

ఆయనగారు సంబ్ర్ సంబ్ర్ సంభ్రమాశ్చర్యాలు అని చదివారు.

ఇదేమిటి పాటలే రీమిక్సు అనుకున్నాను ఇప్పుడు మాటలు కూడా రీమిక్సు చేస్తున్నారా అని హాశ్చర్యపడ్డాను.

(మొన్ననే పాడుతా తీయగా లో SPB "కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అనే పాటని రీమిక్సు చెయ్యకుండా మనమీద దయతలచి వదిలేసారు మహానుభావులు, లేదంటే కడవెత్ కడవెత్ కడవెత్ కొచ్చి కొచ్చి కొచ్చి అని మొదలెడతారు ఈ లోపల కడవ పగిలిపోతుంది" అన్నారు.)

అలాగే సంబ్ర్ సంబ్ర్ సంభ్రమాశ్చర్యాలు అంతే అదేదో రీమిక్సు మాట అనుకున్నాను.
నోరు తిరగకపోతే ఏం దొరా మేమే తిరుగుతాం (మాయాబజార్ డైలాగు) అన్నట్టు ఆ ముక్క పలకడానికి అష్టవంకర్లు తిరిగాడు మహానుభావుడు.

ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఈటీవి లో ఈ బాధ చాలమటుకు లేదు. ఈటీవీలో వచ్చే వాళ్ళందరు వార్తలు బాగా చదువుతారు. వాళ్ల ఉచ్చారణ, పద్ధతి అన్నీ బాగుంటాయి. 99 శాతం మంచి తెలుగులోనే వార్తలు చదువుతారు. అడపాదడపా 2-3 ఇంగ్లీషు పదాలు దొర్లినా, అవి తెలుగులోకి మార్చబడనివో, మార్చబడలేనివో అయి ఉంటాయి. ఈ విషయంలో మాత్రం ఈటివి వారికి జోహార్లు !

క్రితం నెల ఉగాది రోజున సాయంత్రం మన తెలుగువాళ్ళు ఒకానొకచోట వేడుకలు జరుపుకుంటూ ఉంటే ఆహ్వానితులుగా వెళ్ళాము. ఎవరో కూచిపూడి చేస్తూ ఉంటే నిమగ్నమయిపోయిన నా ముందుకి ఒకతను వచ్చి "మేడం ఉగాది గురించి మాట్లాడతారా?" అన్నాడు. ఎందుకు,ఎక్కడ అని అడిగాను. మేము న్యూస్ ఛానెల్ నుండి వచ్చాము. ఇక్కడ మన పండగ జరుగుతోంది కదా, దీనిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి అన్నాడు. ఇంత అచ్చ తెలుగులో అడగలేదనుకోండి. ఉగాది ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు కదా దానిపై మీ ఒపీనియన్ చెప్పండి అన్నాడు. సరే మన ఉగాది గురించి మనం కాకపొతే ఇంకెవరు మాట్లాడతారని ముందుకెళ్ళాను. ఒక 5-6 మైకులు నా నోటి ముందుకొచ్చాయి. TV9, TV5, HM, i news, జెమిని ఉన్నాయి. కెమెరా ఆన్, షాట్ రెడీ అన్నారు. మనం గొంతు విప్పి గడ గడ ఐదు నిముషాలు మాట్లాడేసాం. ఉగాది పండగ గురించి, ఉగాది పచ్చడి ప్రాశస్త్యం గురించి వివరించి నాలుగు ముక్కలు చెప్పేసాను. అయిపోగానే TV5 నుండి వచ్చిన రిపోర్టరు "ఏకసంతాగ్రాహి" ఎలా మాట్లాడేసారో అని తెగ హాశ్చర్యపోయాడు. నాకు ఒక్క నిముషం అర్థం కాలేదు. నేను ఏమి చదవలేదు, వినలేదు, ఏకసంతగ్రాహినెలా అయ్యానబ్బా అని ఆలోచిస్తే తెలిసిన విషయమేమిటంటే వాడికి "అనర్గళం" అన్న పదం తెలీదు అని. అనర్గళంగా మాట్లాడేసారు అనడానికి బదులు ఏకసంతగ్రాహి అన్నాడు. వాడికి అనర్గళం అన్న మాట తెలియకపోగా ఏకసంతగ్రాహికి కూడా అర్థం తెలీదు.

అదండీ విషయం, వీటన్నిటినీ మనం పిచ్చ పిచ్చ గా లైట్ తీసుకుని మన తెలుగు బ్లాగులలోనైన చక్కని తెలుగు ఉపయోగిస్తున్నందుకు సంతోషిద్దాం, ఏమంటారు?


Tuesday, April 6, 2010

దేవుని రూపం !

దేవుణ్ణి నమ్ముతావా అని ఒక స్నేహితుడు అడిగిన ప్రశ్నకి నా సమాధానం:

"ఈ ప్రపంచలో ఏదో ఒక శక్తి ఉంది అని నేను నమ్ముతున్నాను. దానికి ఒక ప్రత్యేక రూపమిచ్చి ఆ రూపం కోసం గొడవపడను. ఆ శక్తి ఈ కొట్లాటలకు, నమ్మకాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు అతీతమైనది. అది నాకు ప్రాణాన్నిచ్చింది. అంతకుమించి ఇంకేం కాదు. అది నన్ను ముందుకు నడిపించదు, చావకుండా ఆపదు. నా స్వశక్తితోనే నేను ముందుకు సాగాలి. మార్గంలో వచ్చే అవాంతరాలను నేనే ఎదుర్కోవాలి. నా శరీరంలో అవయవాలకు చేవ తగ్గగానే నేను నశించిపోతాను. అంతే. ఆ శక్తి ఏమిటి, ఎక్కడనుండి వచ్చింది, దానికి మూలమేమిటి అన్న దానిపై ఈనాటికి పరిశోధన జరుగుతూనే ఉంది. సైన్సు దాన్ని “ఇది” అని నిరూపించేవరకు దానికి నేను రూపమివ్వను. ఒకవేళ దాన్ని సైన్సు నిరూపించలేకపోతే అందరు దాని రూపం ఒకటే అని నమ్మేవరకు నేను దానికి రూపమివ్వను. ఒకవేళ అలాంటి శక్తే ఉంటే అది ప్రపంచం మొత్తానికి ఒకే విధంగా కనిపించాలి. అలా కనిపించేవరకు దానికి నేను ఏ రూపు ఇచ్చుకోలేను. శక్తికి వివిధ రూపాలనివ్వడమే ఈ రాగద్వేషాలకి ప్రధాన కారణం. దానికి నేను లోను కాను, కాలేను."