StatCounter code

Friday, December 30, 2011

ఈ యేడాది (2011) -నేను-నా పుస్తకాలు

సంవత్సరం చివరికొచ్చేసరికి అందరూ సింహావలోకనం చేసుకుంటూ ఉంటారు కదా...నేనిప్పుడు అటువంటి కార్యక్రమాలు ఏవీ చేపట్టదలుచుకోలేదుగానీ ఈ యేడాదిలో నాకు బాగా సంతృప్తినిచ్చిన విషయం నేనెక్కువ పుస్తకాలు చదవడం, కొనుక్కోవడం. గత మూడు నాలుగేళ్ళుగా మూలన పడేసిన నా పుస్తక పఠనాన్ని తిరిగి ఆరభించాను. ఎలాగా ఏమిటి అన్నది ఇంతకుముందే నేను-నా పుస్తకాల గోల అంటూ అరిచి గీపెట్టాను. ఇప్పుడు మళ్ళీ అరవనుగానీ ఈ యేడదిలో నేను చదివిన పుస్తకాల్ను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందామని.

చదువులా, చావులా? - నామిని
ఈ పుస్తకం గురించి ఇదివరకే ఒక టపాలో కూలంకషంగా చర్చించాను. కార్పొరేటు విద్యా సంస్థల్లో చిన్నారులు ఎటువంటి కష్టాలు పడుతున్నారో, ఆటపాటలకు దూరం అవుతూ చదువు బరువును ఎలా మోస్తున్నారో కళ్ళకు కట్టినట్టు చెబుతూ తన అనుభవాలను పాఠకులతో పంచుకున్నారు నామిని. ఆ బుజ్జాయిల మనసుని తెలుసుకుంటే ఎంతో బాధగా అనిపించింది. మిగతా వివరాలన్నీ ఈ పోస్ట్ లో చదవొచ్చు.

కృష్ణవేణి - రంగనాయకమ్మ
రంగనాయకమ్మ గారు తన పంతొమ్మిదవ యేట రాసిన మొట్టమొదటి నవలకి ఫుట్ నోట్స్ ని జోడిస్తూ తిరిగి ప్రచురించారు. ఈ కథ అప్పట్లో జ్యోతిలోనో, ప్రభలోనో సీరియల్ గా వచ్చేదిట. కథలో చెప్పుకోదగ్గ గొప్ప విషయాలేమీ లేవుగాని ఆవిడ రాసిన ఫుట్ నోట్స్ కోసం ఈ పుస్తకం చదివి తీరాలి. ఎప్పుడో తన చిన్నప్పుడు రాసిన కథని తనే విశ్లేషించుకుంటూ, విమర్శించుకుంటూ ఆవిడ రాసిన విధానం అద్వితీయం. ఒక నలభై, యాభై యేళ్ళ తరువాత రచయిత్రి తన ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుతో, పరిణితితో తన పాత రచనను నిర్మొహమాటంగా విమర్శించుకోవడమనేది రంగనాయకమ్మగారికి ఉన్న గొప్ప గుణం. Hats off to you Madam! ఫుట్ నోట్స్ లో కూడా తన హాస్యశైలిని వదిలిపెట్టలేదు. చదువుతున్నంతసేపు బాగా నవ్వుకున్నాను.

మానవి, సహజ - ఓల్గా
సుజాతగారి ధర్మమా ఆని మొట్టమొదటిసారి ఓల్గా రచనలు చదివాను. మానవి, సహజ రెండూ విలక్షణమైన రచనలు. రెండూ స్త్రీవాద రచనలే. స్త్రీకి తనదైన వ్యక్తిత్వం ఉండాలని, పెళ్ళి అయినా కూడా భర్త, పిల్లలే కాకుండా తనకంటూ ఇష్టాయిష్టాలను కలిగి ఉండాలని చెప్పే నవలలు.

సహజ విషయానికొస్తే నలుగురు చిన్ననాటి స్నేహితురాళ్ళు- పెళ్ళయ్యాక వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులు. సహజ తప్ప మిగతా ముగ్గురు పెళ్ళి వల్ల తమ తమ వ్యక్తిత్వాలను కోల్పోయి జీవచ్ఛవాల్లా బతుకుతున్నవాళ్ళే. ఎన్నో యేళ్ళ తరువాత నలుగురు కలుసుకోవడం వారి జీవితాలను చూసి సహజ ఆశ్చర్యపోవడము, పెళ్ళి అంటే వ్యక్తిత్వం కోల్పోవడం కాదని మెత్తగా చివాట్లు పెడుతూ తన ఇద్దరు స్నేహితురాళ్ళ ఆలోచనా విధానంలో మార్పు తేగలగడం ఇదీ కథ. స్నేహితురాళ్ల మధ్య జరిగే వాదోపవాదాలు, సహజకి తన భర్తకి మధ్య జరిగే చర్చలు ఎంతో ఆలోచింపజేస్తాయి. సహజ ఉద్యోగం చేసుకుంటూ తన మనసుకి నచ్చిన ప్రసాద్ ని పెళ్ళి చేసుకుంటుంది. ప్రసాద్ స్వతహాగా మంచివాడు. భార్య భర్తలలో ఎక్కువ తక్కువలు లేవని, ఇద్దరూ సమానమేనని మనస్ఫూర్తిగా నమ్మినవాడు. పెళ్ళయ్యాక అలాగే మెలుగుతాడు కూడా. ఇద్దరూ ఉద్యోగస్థులు అవ్వడం వలన సహజ, ప్రసాద్ కూడా ఇంటి పనులలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తుంటారు. అయితే ప్రసాద్ కి ఒక పెద్ద చిక్కొచ్చిపడుతుంది. తను అందరి మగవాళ్లలా కాకుండా మంచి భర్తగా మెలుగుతూ సహజకి ఇంటి పనుల్లో కూడా సాయం చేస్తూ ఉన్నాడు కదా, మరి సహజ ఇవన్నీ ఎందుకు గుర్తించడం లేదు? తనని మంచివాడుగానో లేదా ఉత్తమ భర్తగానో ఎందుకు గుర్తించడం లేదో అనుకుంటూ మధనపడుతుంటాడు. ఇంక ఆగలేక ఒకరోజు ఈ విషయాన్ని సహజ దగ్గర ప్రస్తావిస్తాడు. దానికి సమాధానంగా సహజ నవ్వుతూ చెప్పే మాటలే ఈ పుస్తకం లోని "Take away". అవి యథాతథంగా…
“నేనిన్నాళ్ళు నీ భార్యననుకోలేదు ప్రసాద్ నీకు అత్యంత ఆప్తురాలినన స్నేహితురాలిననుకున్నాను. స్నేహితులతో ప్రవర్తిస్తున్నటే ప్రవర్తిస్తున్నావు అనుకున్నానుగానీ నువు ప్రత్యేకంగా నన్ను మంచిగా, దయగా చూస్తూ నా కృతజ్ఞతను ఆశిస్తున్నావనుకోలేదు. ఎంత భ్రమలో ఉన్నాను! నేను ఆడదాన్ని ఏ హక్కులూ లేనిదాన్ని, బానిసను. నువ్వు మంచివాడివి. నీ బానిసకి అన్ని సహాయాలు చేసావు, దయగా చూసావు. అయినా ఈ బానిస తన యజమానిని గుర్తించలేదు. లోకంలో చాలామంది మగవాళ్ళు దుర్మార్గంగా ఉంటారు, నువ్వు అలా కాకుండా మంచివాడివనీ నీకు తెలుసు. కానీ నా సంగతేమిటి? నేను చాలా భ్రమల్లో ఉన్నాను. స్త్రీ పురుషులు సమానమనన్నట్లు ప్రవర్తించాను. నేను ఏ పురుషుడి కన్నా తక్కువదాన్ని అనుకోలేదు. ఏ పురుషుడైనా నా పట్ల దయగా ఉంటేనే తప్ప నా సమానత్వం సాధ్యం కాదనే విషయం నాకివాళ తెలిసింది. ఔను...సమాజంలో స్త్రీలంతా బానిసలుగా ఉన్నప్పుడు నాలాంటి ఒకరిద్దరు-మేం స్వేచ్ఛగా ఉన్నాం. పురుషులతో సమానులం అనుకోవటం ఎంత వెర్రితనం. అసలు బానిసలం అనే స్పృహ స్త్రీలకు రావాలి. ఇవాళ నాకు గొప్ప కనువిప్పు కలిగింది." అని వ్యంగ్యంగా చురక అంటిస్తుంది.
ఈ మాటలతో ప్రసాద్ కు, చదివే ప్రేక్షకులకూ కూడా జ్ఞానోదయం అవుతుంది. :)

ఇంక మానవి పుస్తకంలో భర్త, ఇల్లు, పిల్లలే లోకం అనుకుంటూ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఇంట్లో పనిమనిషిలా చాకిరీ చేస్తూ అదే జీవితం అనుకుని ఆనందంగా గడిపే ఇల్లాలి జీవితంలో సంభవించే పెనుమార్పులు, తరువాతి పరిణామాలే మానవి కథ. వసంత, భర్త, ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి తల్లిలాగే ఉంటుంది అన్ని కోణాలలోనూ. చిన్నమ్మాయి స్వతంత్ర్య భావాలు కలిగిన వ్యక్తి. వసంత అంటే ఇంట్లో అందరికీ ఇష్టమే. కాకపోతే రాను రాను తన వ్యక్తిత్వం త్యజించి, అభిరుచులను పక్కనబెట్టి ఒక పనిమనిషిలా మారిపోతున్న భార్యతో కాపరం చెయ్యడం దుస్సాధ్యమవుతున్న భర్త మరొకరిని ఆశ్రయిస్తాడు. తల్లిని అవసరాలకు వాడుకోవాలనే చూసే పెద్ద కూతురి చెర నుండి విడిపించి తల్లిని తనతో పాటే తీసుకువెళుతుంది చిన్న కూతురు. వసంత, చిన్న కూతురు, తన స్నేహితురాళ్ళు, వాళ్ల ఆశయాలు, ఉద్యమాలు అన్నిటిలో పాలుపంచుకుంటూ జీవితంలో తను ఏమి కోల్పోయిందో, తన వ్యక్తిత్వాన్ని ఎలా విడిచిపెట్టిందో మెల్లిమెల్లిగా గ్రహిస్తూ తనదైన వ్యక్తిత్వాన్ని సాధించి మానవి అవుతుంది. ఈ రచనలో మార్కిజం పాళ్ళు కాస్త ఎక్కువైనట్టు అనిపించినా చదవదగ్గ పుస్తకం.

కోమలి గాంధారం - మృణాళిని
స్వీట్ హోం తో చాలా పోలికలున్న చిన్న కథల సమాహారం. అన్ని స్త్రీవాద కథలే. కోమలి చాలా తెలివైంది. తన భర్తకి, తనతో పాటు పనిచేస్తున్న మగవాళ్ళకూ అవసరమైనప్పుడల్లా చురకలు అంటిస్తూ చాకచక్యంగా పనులను నెట్టుకొస్తూ ఉంటుంది. మొదట్లో బావున్నట్టు అనిపించినా కొన్ని కథలయ్యాక చాలా బోర్ కొట్టింది. నాకు నచ్చని విషయం ఏమిటంటే కోమలికి తన భర్త మీద అస్సలు గౌరవం లేదు. ఎప్పుడూ తీసి పారేస్తూ ఉంటుంది. ప్రేమించి పెళ్ళి చేసుకుని కాపురం చేస్తున్న భర్తని మరీ అంత హీనంగా, చులకన చెయ్యడం ఏమిటో నాకర్థం కాలేదు. స్వీట్ హోం తో పోల్చుకుంటే విమల, బుచ్చిబాబుని ఎంత వెక్కిరించినా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. అతను వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కించపరచదు. కానీ కోమలి అలా కాదు. ఇది నాకు కనిపించిన నెగటివ్ పాయింట్. పాజిటివ్ పాయింట్ ఏమిటంటే కోమలి, తన అత్తగారు రెగ్యులర్ అత్త-కోడళ్ళ సీరియల్స్ లాగ కీచులాడుకోకుండా చక్కగా కలిసిమెలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, మంచి స్నేహితురాళ్ళలా ఉంటారు. ఇది నాకు బాగా నచ్చింది.

కోతికొమ్మచ్చి - మూడు భాగాలు - ముళ్ళపూడి వెంకటరమణ
కోతికొమ్మచ్చి గురించి కొత్తగా చెప్పేదేముంది. పసందైన విందు భోజనంలాంటి రచన. మెల్లిగా చదువుతూ ప్రతీ వాక్యాన్ని ఆస్వాదిస్తూ, కాసేపు నవ్వుతూ, కాసేపు ఏడుస్తూ కొంత జీర్ణం చేసుకుంటూ, కొంత నెమరువేసుకుంటూ....ఇక్కడ తమిళంలో ఉన్న ఒక expression వాడాలనుంది...."రసిచ్చి, రుసిచ్చి, ఇనిచ్చి" చదివాను. అంటే రసాస్వాదన చేస్తూ, రుచిని అనుభవిస్తూ, తియ్యదనాన్ని నెమరువేసుకుంటూ చదివాను.

ఈ రమణ గారేంటో ఆయన కష్టాలను కూడా ఏదో కథ చెబుతునట్టు, ఆయనేకేం పట్టనట్టు చాలా మామూలుగా చెబుతారు. చదువుతున్న మనకే గుటక పడదు. తెల్లబోయి తేరుకుని కన్నీళ్ళు పెట్టాలా, వద్దా అన్న మీమాంసలో ఉండిపోతాం. కళ్ళు మాత్రం మనమాట వింటాయేంటి...మెదడు ఏదో ఆలొచిస్తుందిలే మనం కన్నీళ్ళు కార్చేద్దాం అంటూ నీళ్ళకుండల్ని జారవిడుస్తాయి. తెప్పరిల్లే టైము కూడా ఇవ్వకుండా వెనువెంటనే నవ్వించేస్తారు. ఈయన మాత్రం అసాధ్యులు, నిజంగా! ఆయన రచనావ్యాసగం, ఉద్యోగం, సినిమ అనుభవం కడురమణీయంగా ఉన్నాయి. మూడు భాగాలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చదివాను.

అతడు అడవికి జయించాడు - డా. కేశవరెడ్డి
పట్టుమని వంద పేజీలు కూడా లేని పుస్తకం...పొద్దున్నుండీ, సాయంత్రం వరకూ ఒక ముసలాడి జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు - అంతే కథ. చెప్పడానికి ఇంత సులువుగా ఉందిగానీ ఆ తొంభై పేజీలలో జీవిత పరమార్ధాన్ని చూపించారు. పందులను పెంచుకునే ఒక ముసలివాడు, అతని మనవడు, రెండు సుక్క పందులు - ఇవే కథలో పాత్రలు. ఒకరోజు సాయంత్రం ముసలివాని మనవడు మేతకు తీసుకువెళ్ళిన రెండు పందుల్లో ఒకదానితో మాత్రమే తిరిగొస్తాడు. రెండో పంది - కడుపుతో ఉన్నది తప్పిపోయిందని తెలుసుకున్న ముసలివాడు దాన్ని వెతుక్కుంటూ అడవిలోకెళ్ళి, రాత్రంతా అక్కడ గడిపి మర్నాడు తెల్లారాక ఇంటికి తిరిగొస్తాడు. అయితే సుక్క పంది దొరికిందా లేదా? అతని జరిపిన పోరాటం ఏమిటి? అన్నదే మొత్తం కథ. జీవనము- మరణము, సంతోషం-దుఃఖము, నిశ్చలత-అనిశ్చలత, ఆశ-నిరాశ, జయము-అపజయము, నిర్వేదం-స్థితప్రజ్ఞత, అన్వేషణ-అస్థిత్వ సంఘర్షణ...ఒకటేమిటి, వీటన్నిటి గురించీ ఉంది. మొత్తం జీవితం యొక్క తత్వాన్ని ఆ చిన్న కథలో బంధించారు. చెప్పాలంటే చాలా హెవీ డోస్. ఒక్కటి మాత్రం అర్థమయ్యింది. ఈ పుస్తకం ఒకసారి చదివి పక్కనపెట్టేసేది కాదు. కొంచం కొంచం మెల్లిగా చదువుతూ, అర్థం చేసుకుంటూ, ఆలోచిస్తూ దానిలో మమైకమైపోతేగానీ పరమార్థం బోధపడదు. చాలా బరువైన రచన. భాష కొంచం కొత్తగా ఉండి నలగడానికి కాస్త సమయం పట్టిందిగానీ భావం నలగడానికి మాత్రం చాలా సమయమే పట్టేట్టుంది. ఇది పూర్తిచేసేసరికి ఏమిటో నేను వేదాంతంలో పడిపోయాను..ఎంతోసేపటికిగానీ తేరుకోలేదు. ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది.

వెన్నెల్లో ఆడపిల్ల - యండమూరి వీరేంద్రనాథ్
ఆ మధ్య యండమూరి నవలల గురించి బ్లాగు/బజ్జు మితృలతో ఓ పెద్ద చర్చ జరిఒగింది. యండమూరిని ని మరీ అంత తీసిపారేయక్కర్లేదు, కొన్ని చదవాల్సినవి ఉనాయి అన్న మితృల సలహా మీదట మళ్ళీ వెన్నెల్లో ఆడపిల్లతో మొదలెట్టాను. ఒక చెస్ క్రీడాకారుడు, అతన్ని అజ్ఞాతంగా ప్రేమిస్తూ కవ్వించే ఒక ఫోనమ్మాయి. ఆ అమ్మాయిని కనిపెట్టడానికి అతనికి క్లూలిస్తూ ఉంటుంది. అతను కనిపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని ప్రయత్నం ఫలించిందా, ఆ అమ్మాయి కనిపెట్టాడా లేదా అన్నది కథ చదివి తెలుసుకోవాల్సిందే. మొదట్లో ఓ 20 పేజీలకవరకూ కథ బాగానే నడించింది. పాత్రల పరిచయం అదీ బాగానే ఉంది. ఆ పిల్ల ఇచ్చే పజిల్స్ అవీ తమాషాగా అనిపించాయిగానీ కాసేపయ్యేటప్పటికి బండి అస్సలు ముందుకి నడవలేదు. నాకు ఆ పజిల్స్ గోల చాలా ఎక్కువైపోయింది అనిపించింది. నిక్కుతూ నీల్గుతూ మెల్లిగా నడిపించాను మొత్తానికి. అయితే మధ్యలో జేమ్స్ పెళ్ళి గురించి జేమ్స్ మనస్తత్వ విశ్లేషణ మొదలయినదగ్గరనుండీ బాగుందనిపించింది. ఆఖరాఖరుకి ఆ పజిల్స్ ని ఆ తెలివితేటల్ని చాలా ఎంజాయ్ చేసాను. కానీ చివరికి అలా జరగడం నాకెందుకో నచ్చలేదు. ఒక్క నెల రోజులు బతికే అమ్మాయి తన కాలక్షేపం కోసం నిండు నూరేళ్ళు జీవించే ఒక అబ్బాయి జీవితంలో చిచ్చు రేపడం సమంజసంగా లేదు. ఆ పిల్లకేం, ఎలాగూ పోతుంది కానీ ఆ అబ్బాయి ఇకపై బతకాలి...అది కష్టం కదా! ఆ పజిల్స్, కథ నడిపించిన తీరు బాగుంది అనిపించింది. అయితే మళ్ళీ మళ్ళీ చదివే నవల మాత్రం కాదు.

సాయంకాలమైంది - గొల్లపూడి మారుతీరావు
నాకు అస్సలు అస్సలు నచ్చలేదు అన్నది చిన్న expression అవుతుంది. ఏ కాలానికీ, ఏ సంఘానికీ పనికిరాని, అవసరంలేని కథ ఇది అనిపించింది. పోనీ కొత్తగా ఏదైనా నేర్చుకుందామా అంటే అదీ లేదు. పోనీ నిజాయుతీగా, చిత్తశుద్ధితో అనుకున్నది అనుకున్నట్టుగా రాసారా అంటే అదీ లేదు...రంగులు పులిమి, కంటి తుడుపు కోసం అక్కర్లేని పాత్రలు ప్రవేశపెట్టడం. పోనీ వర్ణనలను, రచనాశైలిని మెచ్చుకుందామా అంటే ఉహూ మనసొప్పట్లేలేదు.

సదాచారసాంప్రదాయాన్ని పాటించే ఒక వైష్ణవుల కుటుంబం. నాలుగో తరం నుండి వారింట్లో వచ్చే మార్పులు. పిల్లాడు పైచదువుల కోసం అమెరికా వెళ్ళడం. అమ్మాయి వేరే కులస్థుడిని పెళ్ళి చేసుకోవడం. తద్వారా ఆ దంపతులు ఎలా బాధపడ్డారు - ఇదీ కథ.

ఏ రకంగానూ నచ్చలేదు నాకు. కొన్ని వర్ణనలైతే రోత పుట్టించాయి. నవనీతాన్ని ఒక దరిద్రుడు రేప్ చేస్తుంటే కోపంతో ఆ అమ్మాయి వాడిని సగం విరిగిన సీసాని తూట్లు తూట్లుగా పొడుస్తుంటుంది. అయినా కూడా వాడు పట్టు విడువడు. అప్పుడు "కూలిపోతున్న యోధుడు శరీరమంతా బుల్లెట్లు తూట్లు పొడిచినా ఆఖరి తూటా పేల్చి ఒక్క శతృవునైనా కబళించి పోతాడు. దేశభక్తి, బాధ్యత, కర్తవ్యనిరతి వీటన్నిటినీ మించిన అతీంద్రియశక్తి శరీరంలో సమీకృతమవుతుంది. కడుపులో, గుండెల్లో, ముఖం మీద సీసా గుచ్చుకుని రక్తం కారుతున్నా పొన్నయ్య ఆ అందమయిన శరీరానికి అఖరి నివాళి సమర్పించి ఆమె కౌగిలిలో ప్రాణం వదిలాడు." యుద్ధంలో యోధుడికి, రేపిస్ట్ కి పోలికా? ఇంతటి జుగుప్సాకరమైన వర్ణనని నేనింతవరకూ చదవలేదు, నిజంగా.

అలాగే ఒక వైష్ణువుడికి, క్రిస్టియన్ కి పుట్టిన అమ్మాయిని కలుపుమొక్కతో పోల్చడం....దారుణం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అందులో.

సమాజం మారుతోంది, నిజమే. అలా మారడం పై రచయిత ఏ మాత్రము గౌరవము లేనట్టు అనిపించింది. నన్నడిగితే అలా మారడం చాలా గొప్ప విషయం. ఈ సమాజపు అభివృద్ధికి సంకేతం.అయినా కుటుంబాలలో మార్పు అన్నది ఒక్క వైష్ణవ కుటుంబానికే పరిమితం కాదు. అన్ని కులాలలోనూ ఈ మార్పు జరిగింది. ఎవరి పరిధుల్లో వాళ్ళు సంప్రదాయపు బంధాల నుండి బయటపడ్డారు, పడుతున్నారు. ఈ మార్పు మంచిదే కదా. సంప్రదాయాలు, సదాచారాలు కాలానుగుణంగా మారుతాయి, మారాలి. కానీ అదేదో మహాఘోరాపరాధం అన్న భావన కలిగించారు రచయిత ఈ పుస్తకంలో. అంతే కాకుండా ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన భారతీయులపై ఏ మాత్రమూ గౌరవము లేకపోవడం. వాళ్ళేదో తల్లిదండ్రులను వదిలేసి వారి సుఖం వారు చూసుకున్నట్టు, పై దేశం వెళ్ళగానే అన్నీ వదిలేసుకున్నట్టు చిత్రీకరించారు. అది చాలా అన్యాయంగా తోచింది నాకు.

ఈ పుస్తకం గురించి ఎంత తక్కువ చెపుకుంటే అంత మంచిది.

పాకుడు రాళ్ళు - డా. రావూరి భరద్వాజ
500 పేజిల పుస్తకం. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోయిన్ల కథ - వాళ్ళు పడే కష్టాలు, ఆ పరిశ్రమలో ఉండే రాజకీయాలు, కుళ్ళు, కుతంత్రాలు. చదువుతున్నంతసేపు ఎంత అసహ్యం కలుగుతుందంటే సినిమా అంటే విరక్తి కలుగుతుంది. ముఖ్యంగా హీరోయిన్ అవ్వాలనుకుని వచ్చేవాళ్ళ దయనీయ పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు రాసారు. ఈ పరిశ్రంలో ఆడది అంటే అంగడిబొమ్మ. పనికావాలంటే పక్కలోకి చేరాల్సిందే. ఈ పుస్తకం 1990 లో రాసారు. అంటే అప్పటివరకూ సినిమా పరిశ్రమలో జరిగిన సంఘటనలపై పరిశోధన చేసి రాసి ఉంటారు. అసలు అవి ఎంతవరకు నిజమో తెలీదుగానీ అలా జరిగి ఉంటుంది అన్న ఊహే గొప్ప భయంకరంగా అనిపించింది. మనకు తెలిసిన హీరోయిన్లను ఆ స్థితిలో ఊహించుకోవడానికి భయం వేసింది. అసలు ఊహించుకోవడం అసాధ్యం అయ్యింది. నమ్మబుద్ధి కాలేదు. ఏంటో బాధనిపించింది, ఏడుపొచ్చింది కూడా. ఇంకా 100 పేజీలు మిగిలున్నాయి. ఈ యేడాది లోపల అనగా రేపటి లోపల పూర్తిచెయ్యాలనుకుంటున్నాను :)

వైట్ టైగర్ - అరవింద్ అడిగా (ఇంగ్లీషు)
ఇంగ్లీషు సాహిత్యం..ఈ యేడాదిలో ఈ ఒక్కటే చదివాను. ఢిల్లీ లో ఉండే కారుడ్రైవర్ల దయనీయ పరిస్థితిని వివరించే గొప్ప రచన. మూడేళ్ళు ఢిల్లీ లో ఉంటూ కారు డ్రైవర్ల జీవన విధానాన్ని పరిశీలిస్తున్నానేమో నన్ను గొప్పగా కదిలించిది ఈ పుస్తకం. ఎక్కడో బీహార్ లో పుట్టి, తిండికి గతిలేక, ఒక్కడు పని చేసినా చాలు ఇంటిల్లిపాదీ కనీసం రెండు-మూడు రోజులకైనా తింటారు అనుకునే పరిస్థితులలోనుండి కారు డ్రైవర్లుగా నెలకి రెడు-మూడు వేల రూపాయల జీతానికి ఢిల్లీకి వస్తారు. యజమానులు వాళ్ళని కుక్కల కంటే హీనంగా చూస్తారు. అడుగులకు మడుగులు ఒత్తిస్తారు. నిస్సారమైన జీవితాన్ని గడుపుతూ, మనిషిని అన్న విషయమే మరచిపోయి బతుకులీడుస్తున్న కారు డ్రైవర్ల కష్టాలను కళ్ళకు కట్టినట్టుగా రాయడంలో అరవింద్ సఫలమయ్యారు. ప్రతీ ఒక్కరు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.

ఇవే కాకుండా కినిగె ద్వారా గిఫ్ట్ గా పుచ్చుకున్న పుస్తకాలు సెబాసురా శంకరా, తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు చదివాను. రెండూ అద్భుతమైన రచనలు. ఇంకా కినిగె పుస్తకాలు కొన్ని ఉన్నాయి. చదవాలి.

మొత్తానికి ఈ యేడాది నా పుస్తకపఠనము సంతృప్తికరంగానే ఉంది. ఒకే ఒక్క చిన్న అసంతృప్తి ఏమిటంటే ఇంగ్లీషు సాహిత్యం ఎక్కువ చదవలేకపోయాను. చాలా పుస్తకాలు సగం సగం చదివి ఆపేసాను. ఈసారి అలా చెయ్యకూడదనుకుంటున్నాను. వచ్చే యేడాది ఇవి కూడా ఎక్కువ చదవాలి.

ఇక పుస్తకాల సేకరణ విషయంలో నేను అద్భుతంగా మరో అడుగు ముందుకేసాను. బోలెడన్ని పుస్తకాలు కొనుకున్నాను. బహుమతులుగా కొన్ని పుస్తకాలు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది నాకు.

2011 లో నేను కొనుక్కున్న పుస్తకాలు





ఇవి బహుమతులుగా వచ్చినవి

ఇవే కాకుండా కృష్ణవేణి, చలం-సత్యం, శైవం, సుందరం కూడా వచ్చాయి. మిధునం పుస్తకాన్ని శంకర్ గారు పంపించారు. వారికి కృతజ్ఞతలు. మిగతా పుస్తకాలన్నీ సుజాత గారు (మనసులో మాట) పంపించారు...ఆవిడకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. తనకి నేనెంతో ఋణపడిపోయాను. ఇంకా కినిగె పుస్తకాలు బహుమతిగా ఇచ్చిన రెహ్మాన్ ని, మురళి కి, నాగార్జున కి ధన్యవాదములు!

ఇవే కాకుండా మరికొన్ని కొన్నాను. కానీ అవి ఇంకా నాచేతికి రాలేదు కాబట్టి, వాటిని వచ్చే యేడాడి ఖాతాలో వేస్తున్నా.

ఈ పుస్తకపఠనాన్ని, కొనుగోలుని 2012 లో కూడా ఇదే విధంగా కొనసాగించాలని అనుకుంటున్నాను...చూద్దాం! :)


Monday, December 26, 2011

రాజన్న నాకు నచ్చింది

నాకు రాజన్న నచ్చింది

ముందుగా
ఇలాంటి ఆలోచనతో ముందుకొచ్చిన విజయేంద్రప్రసాద్ గారికి ఒక సెబాస్
ఈ సినిమా చేసిన నాగార్జున కి ఒక భేష్
మొత్తం సినిమాని భుజస్కందాలపై మోసిన కీరవాణికి జేజేలు.

దిక్కుమాలిన కాలేజీ ప్రేమలు, అడ్డం గా నరుక్కోవడాలు, వెకిలి కామెడీలు, వందమందిని ఇరగదియ్యడాలు లేవు.

కొత్తగా, హాయిగా పోరాటవీరుడి చరిత్ర ఉత్తేజం కలిగించేలా ఉంది. మనకి ఇటువంటి కథలు సినిమాలుగా ఇంకా ఇంకా రావాలి.

ఈ సినిమాకి ప్రాణం కీరవాణి సంగీతం. పాటలు చాలా బావున్నాయి. నేపథ్య సంగీతం అంతకంటే బావుంది. నేపథ్య సంగీతం మాత్రం రికార్డ్ దొరికితే బాగుందును. రికార్డ్ వింటున్నప్పుడు "అమ్మ అవని" పాట బాగా నచ్చింది కానీ సినిమాలో ఇది mis fit అనిపించింది. రాజన్న పాడిన పాటలైనా పోరాటపటిమను నింపే జానపదాలు, మల్లమ్మ పాడిన పాటలు అందమైన జానపదాలు. చివరికి సడన్ గా వచ్చి మల్లమ్మ కర్నాటక సంగీతం పాడితే ఎలా? ఒక ఉద్వేగభరితమైన జానపదం....నేలమ్మతల్లి మీద...పెడితే ఇంకా రక్తి కట్టి ఉండేది. "వెయ్ వెయ్యరా వెయ్" పాటకి రోమాలు నిక్కబొడుచుకున్నాయి నిజంగానే.

బాగా కదిలించిన దృశ్యం రాజన్న వెనక్కి తిరిగొచ్చినప్పుడు ప్రాణం లేని పసిబిడ్డని ఒళ్ళో పెట్టుకుని "గంగా మేలుకో" అని పాడే పిచ్చి తల్లి ఆవేదన. ఈ దృశ్యం ఒక్క కుదుపు కుదిపి పారేసింది.

అలాగే మల్లమ్మా రాజన్న సమాధిగా భావించే తులసికోటకి ఆకర్షితురాలు అవుతున్నాది అని గమనించి, భయపడ్డ ముసలితాత "అక్కడికి వెళ్ళొద్దు దెయ్యాలుంటాయని" మల్లమ్మని భయపెడతాడు. మల్లమ్మ భయపడి తాతని పట్టుకుని నిద్రపోతుంది. కానీ మధ్య రాత్రిలో తాత లేచి చూస్తే మల్లమ్మ రాజన్న సమాధి దగ్గరే కూర్చుని ఉంటుంది. అప్పుడు బ్యాక్ గ్రౌండ్ లోఅపుడు ఒక పాట వస్తుంది...."చెడు మనసులో ఉన్న మనుషులకన్నా పెద్ద దెయ్యాలు లేవని రాజన్న చెబుతున్నాడో ఏమో" అన్న అర్థం లో వస్తుంది. చాలా బావుంది ఆ చిన్న బిట్.

ఒక పెద్ద అసంతృప్తి నాకు కనిపించింది ఏమిటంటే రాజన్నలాంటి ఉద్యమకారులు ఎందరో పుట్టారు ఆ సమాజంలో. ఇది ఒక వ్యక్తి తెచ్చిన విప్లవం కాదు. ఈ ఉద్యమాన్ని కొందరు వ్యక్తులు, కొన్ని తరాలు నడిపించారు...రజకార్లని ఎదిరించారు. కానీ ఇందులో రాజన్న ఒక్కడే ఎదిరించినట్టు, రాజన్న పోయక మళ్ళీ వాళ్ళ బతుకులు రజకార్ల కిందన నలిగిపోయినట్టు చూపించడం కొంత నచ్చలేదు. రాజన్న ఇచ్చిన స్ఫూర్తి కొన్ని తరాలకి కంటిన్యూ అయ్యింది అన్నటు చూపించి ముగిస్తే బావుండేది. అనవసరంగా నెహ్రూ గారిని తీసుకొచ్చి, ఎలా ముగించాలో తెలియక ముగించినట్టు అనిపించింది.

నాగార్జున డైలాగ్ డెలివరీ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుందును. చిన్నపిల్ల మల్లమ్మ నడిచి ఢిల్లీకి వెళ్ళడం అస్సలు నప్పలేదు. అదిలాబాదు నుండి ఢీల్లి కి వెళుతూ పంజాబ్ ని, రాజస్థాన్ ని ఎందుకు టచ్ చేసిందో తెలీదు.

మల్లమ్మగా ఏనీ, స్నేహ, రాజన్న నలుగురు మితృలూ, మల్లమ్మ ని పెంచిన ముసలోడు, దొరసానిగా వేసిన శ్వేతా మీనన్....అందరూ బాగా నటించారు.

నాకు బాగా నచ్చిన విషయమేమిటంటే రాజన్న ఊరికి వచ్చిన తరువాతా రజకార్లను, వారి కింద పనిచేసినవారినీ ఒక్క దెబ్బతో ముక్కలు ముక్కలుగా నరికేయలేదు....అందరికీ అండా దండా నేనేనంటూ ఒంటరిగా అందరినీ చావచితగ్గొట్టలేదు...రాఖీ సినిమాలోలాగ. ప్రజలలో పోరాట స్ఫూర్తిని నింపుతూ, కావలసి వచ్చినప్పుడు నడుం బిగించి పోరాటానికి దిగిన రాజన్న పాత్ర మలచిన తీరు చాలా బావుంది.

సినిమాలో హేమాహేమీలైన నటులున్నారు. వారందరీ పాత్రల నిడివి బాగా తగ్గినట్టనిపించింది. పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. అలాగే దొరసాని పాత్రధారి శ్వేతా మీనన్ ని కూడా పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు అనిపించింది. పుర్తిగా సంతృప్తినిచ్చిన పాత్రలు ముసలి తాత, మల్లమ్మ మాత్రమే. ఎందుకో సినిమా complete అని అనిపించలేదు. అయినా సరే నాకు నచ్చింది. మంచి సినిమా చూసాం అనిపించింది.

ఈ సినిమాలో లోపాలు లేవని కాదు, కానీ ఇటువంటి సినిమాలకి ఇది ముందడుగు అయితే బావుంటుంది. అయితే దీన్ని ఇంకా చాలా గొప్పగా తీసి ఒక చరిత్ర సృష్టించగలిగిన golden chance మిస్ చేసుకున్నారనిపించింది. ఏది ఏమైనా ఇది మన తెలుగు సినిమాలకి స్ఫూర్తి ని అందించగలిగితే అంతకన్నా ఇంకేం కావాలి.



Wednesday, December 14, 2011

పొట్టి నవ్వులు - BUZZ సీరీస్ 1

ఆమధ్య బజ్జులొచ్చి బ్లాగులని మింగేసాయని కొందరు...లేదు, కాదు బజ్జుల వల్ల మంచే జరిగింది అని నాలాంటి వారు కొందరు చిన్న చిన్న వాక్బాణాలు విసురుకున్నాం కద! సుజాతగారైతే (మనసులో మాట) ఏకంగా బజ్జా? బ్లాగా? అని పోస్ట్ కూడా పెట్టేసారు.

ఇప్పుడేమో గూగలోడు బజ్జు మూసేస్తున్నానొహో అని ప్రకటించేసాడు. మా అందరికీ ఒకటే ఏడుపొచ్చేసింది. సరే ఇంక చేసేది ఏమీలేక బజ్జులో జరిగిన కొన్ని సరదా విషయాలు బ్లాగులో పంచుకుందామనే మొదటి ప్రయత్నం ఇది.

బజ్జు సీరీస్-1

"మన గురువుగారు బులుసుగారు ఒకరు తిన్నగా ఉండరు కదా...ఎప్పుడో ఏదో ఒకటి చెప్పి మనల్ని నవ్విస్తూ ఉంటారు. ఇప్పుడేమి చేసారంటే...నవ్వులని కుదించారు....బ్లాకెట్ల కొలతలు కొలవలేక విసుగొస్తున్నాదట అందుకని. సరే గురువుగారు కదా అని రాజ్, నేను చేతులు కలిపాం. "తెలుగులోనే నవ్వుదాం. బ్రాకెట్లలో వద్దు" అన్న నినాదం తో పని మొదలెట్టాం. అదెట్లనిన.....

చి.న = చిరునవ్వు
మ.హా = మందహాసం
ద.హా = దరహాసం
అ.హా = అట్టహాసం
వి.టా.హా = వికటాట్టహాసం
బా.హా. = బాలయ్య హాసం
సు.చి.న = సుమన్ చిరునవ్వు
రా.న = రాక్షస నవ్వు
కో.న - కోతి నవ్వు
బి.న = బిస్కట్ నవ్వు (అర్ధం కాలేదా? మీ పెట్ డాగ్ ముందు కూర్చొని బిస్కట్ తింటూ దాని వైపు చూడండి..యెస్..అదే ..)

ఇంకా మీకేమైనా తడితే కలుపుకోవచ్చు.

మా గురువుగారు ఇకనుండి ఇవి మాత్రమే ఉపయోగిస్తానని శపధం చేసారు. వారి శిష్యులలో అగ్రగణ్యులమైన మేము (అదంతే మమ్మల్ని మేమే పొగుడుకుంటాము :P)...వారి అడుగుజాడలలోనే నడవాలని నిశ్చయించుకున్నవారమై ఇవే ఉపయోగించబోతున్నాం. మరి మీరు?"

ఈ విధంగా మొదలయ్యిందండీ బజ్జులో ఈ పొట్టినవ్వుల ప్రహసనం...అంతే ఇంక మన జానాలు విజృంభించారు చూడండీ...నేనేం చెప్పను, మీరే చదవండి :)

దు.హా = దుఃఖహాసం (సుమన్ బాబు సినిమాలు చూసేటప్పుడు వచ్చేది)
పి.న - పిచ్చి నవ్వు (సుమన్ బాబు సినిమా చూసిన తరువాత వచ్చేది)
ప.న = పగలబడి నవ్వు
వె.న1 = వెకిలి నవ్వు
న.న.న - నవ్వలేక నవ్వే నవ్వు
కిం.ప.దొ.న కింద పడి దొర్లే నవ్వు (ఇది పాతదే, కొత్తగా కలుపుతున్నా)
ఎ. న - ఎదవ నవ్వు. (మన మ్యానేజరు ని చూసి నవ్వేది)
శు.హా = శుష్క హాసం
కె.న = కెవ్వు నవ్వు
ఏ.న = ఏడవలేక నవ్వు
పొ.ప.న = పొట్ట పగిలేటట్టు నవ్వు
ఏ. న. న = ఏడ్చినట్టు నవ్వే నవ్వు (మన హీరో సుమన్ బాబు లాగా)
కొం.న = కొంటె నవ్వు
చ.న.న = చచ్చినట్టు నవ్వాల్సిన నవ్వు (బాసు జోక్ కి మనం నవ్వే నవ్వు)
అ.భ.అ.పూ.న = అవమాన భరిత అవహేళనా పూర్వక నవ్వు (దుర్యోధనుని చూచి ద్రౌపది నవ్విన నవ్వు)
దీన్నే
కొం.కూ.న/కొం.అం.న = కొంపలు కూల్చే/అంటుకునే నవ్వు అని కూడా అనవచ్చు.

వె.న2 = వెర్రి నవ్వు
టి.అ.న = టివీ అనౌన్సర్ నవ్వు
చిపి.న = చిలిపి నవ్వు
వి.న = వికీ నవ్వు (మన నవ్వుకి ఎవడో వివరణ ఇస్తే అది వికీ నవ్వు)
అ.న.న = అనుమానంగా నవ్వే నవ్వు
ఏ.పో.మ.న = ఏడుస్తూ పోనీ మన మంచికే అనుకునే నవ్వు
అప.హా = అపహాస్యం
అ.భ.అ.పూ.న = అవమాన భరిత అవహేళనా పూర్వక నవ్వు

ఈ అ.భ.అ.పూ.న వెనుక చిన్న కథ ఉంది. నేను పోస్ట్ వేస్తున్నప్పుడు "గురువుగారి" అని రాయబోయి "గురువుగాడి" అని పొరపాటున రాసాను. అది చూసి బులుసు గారు ఒక వె.న నవ్వి "గాడి" అని చూసి నేను ఏ నవ్వు నవ్వాలి? అని అడిగారు. నేనందుకు ఇంకో చిన్న నవ్వునవ్వాననమాట. నేను నవ్విన ఆ నవ్వుకి గురువుగారు "అ.భ.అ.పూ.న" అని నామకరణం చేసారు. :D

ఇదయ్యాక బులుసుగారికి ఇంకో ఐడియా వచ్చింది అదేంటంటే: యథాతథంగా క్రిందన

"Bulusu Subrahmanyam - మరేమో నే ఇప్పుడేమో మనం శ్రీకృష్ణ రాయబారం నాటకం వేస్తామన్నమాట . మరేమో నే మీ అందరూ నన్ను బలవంత పెడితే, పెట్టండి మరి, నేను శ్రీకృష్ణుడి వేషం వేస్తానన్నమాట. ఎవరో కింద పడిపోయారు. లేపండి అక్కడే కాలుతుంది. మీరందరూ బలవంత పెడితే కదా నేనొప్పుకుంట. అప్పుడేమో నాటకం అయిన తరువాత, మీరందరూ నన్ను మెచ్చుకుంటూ నవ్వే నవ్వు ని మెహా అని కానీ మెన అనీకాని అనాలి కదా మరి.

sowmya alamuru - మెహా, మెన.....ఈ నవ్వునకర్థమేమి గురువర్యా??????????
మెంటల్ హాసం, మెంటల్ నవ్వు అని కాదుగదా (దొ.న)

Bulusu Subrahmanyam - మెచ్చుకుంటూ నవ్వే నవ్వు

Bulusu Subrahmanyam - సౌమ్యా.. కోప హాసం కో.హా"

అంటూ కోపాన్ని ప్రకటించారన్నమాట :) దానితో మె.న, కో.హా కూడా చేరాయి.

పై అన్ని నవ్వులను క్రియేట్ చేసినవారిలో ప్రముఖులు బులుసుగారు, రాజ్ కుమార్, శంకర్ గారు మరియు నేను. గిరీష్ కూడా కొన్ని నవ్వులు చేర్చారు.

ఇదిలా జరుగుతుండగా పప్పు శ్రీనివాసరావు గారు ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టు వచ్చారు. ఆయనొచ్చాక జరిగిన తమాషా సంభాషణ ఇక్కడ:

"pappu sreenivasa rao - ఎహే ఆపండీ గోల (ఎ.ఆ.గో)

Bulusu Subrahmanyam - వెన, ననన...అంటే శ్రీనివాస రావు గారూ గోలలకి స్థానం కల్పిద్దామా అని నా ఉద్దేశ్యం

sowmya alamuru - గోలలకి తావు లేదు...నవ్వులొక్కటే ఉండాలి

pappu sreenivasa rao - నవ్వుల గోలన్నమాట (న.గో)

Bulusu Subrahmanyam - కొంచె మార్చండి సారూ గోల నవ్వు - గోన సమూహం గా అందరూ కలిసి బలవంతాన నవ్వే నవ్వు అనుకుందామా హాస్య క్లబ్బుల్లో లాగా. "

అలా గో.న కూడా లిస్ట్ లోకి చేరిపోయింది.

ఇది ఇక్కడితో ఆగలేదు. ఇంక అందరూ బజ్జులో ఈ పొట్టినవ్వులనే ఉపయోగించడం మొదలెట్టారు. కొందరికిన్ని గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉండడంతో నేను మళ్ళీ ఒక పోస్ట్ వేసాను.

"బజ్జు జనాలందరికీ పొట్టి గుర్తులతో కాస్త తికమకగా ఉన్నదని వార్త అందింది...అంచేత ఇప్పటివరకూ పోగయినవాటన్నిటినీ క్రోడీకరించి ఇక్కడ పెడుతున్నా. ఇకనుండి మీకు ఎప్పుడు ఏ డౌటు వచ్చినా ఈ బజ్జుని రిఫరెన్స్ గా వాడుకోవచ్చు."

అంటూ మొత్తం అన్ని నవ్వులనూ ఒకచోట చేర్చాను. కథ అక్కడే ఆగిపోతే అది మన జనాలా అల్లరి ఎలా అవుతుంది? మళ్ళీ మొదలెట్టారు.

మె.హ = మెచ్చుకుంటూ నవ్వు
కో.హా = కోప హాసం
గో.న = గోల నవ్వు
బో.న = బోసి నవ్వు
తి.న = తిట్టుకుంటూ నవ్వు
తిం.న = తింగరి నవ్వు
క.గీ.న = కన్నుగీటుతూ నవ్వు
గొ.న = గొర్రె నవ్వు
ఆ.భా.న = ఆనందభాష్పాలతో నవ్వు
వి.న = విలన్ నవ్వు
పొ.న = పొగరుబోతు నవ్వు
హే.న= హేళనగా నవ్వు
గ.న = గర్వంతో నవ్వు
ద్రౌ.న. = ద్రౌపది నవ్వు
త.తా.న = తలకాత తాటిస్తూ నవ్వు

ఇంతలోనేమో వేణూ శ్రీకాంత్ వచ్చి అ.భ.అ.పూ.న కొంచెం గజిబిజి గా ఉందండీ.. దీన్ని ద్రౌ.న. (ద్రౌపది నవ్వు)గా మార్చాలని అభ్యర్ధించారు. అభ్యర్థనని మన్నించి అ.భ.అ.పూ.న ని ద్రౌ. న గా మార్చేసాం.

అలాగే తి.న, తిం. న నవ్వుల వెనుక కథ:

"Bulusu Subrahmanyam - ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాం. మనకి రావాల్సిన ప్రోమోషన్ పక్క వాడికి వచ్చింది. వెధవ, పార్టీ కూడా ఇస్తున్నాడు. అక్కడ మనం లోపల తిట్టుకుంటూ పైకి నవ్వే నవ్వు తినన తిట్టుకుంటూ నవ్వే నవ్వు. ఇది మరో రూపం లో వచ్చిందా సంపాదక మహాశయా.

sowmya alamuru - తినన రాలేదు గురువుగారూ...కలిపేస్తా ఇప్పుడే. దాన్ని తిన చేసేస్తా.

Bulusu Subrahmanyam - తింగరి నవ్వు తిన అని అనుకున్నట్టున్నాము

sowmya alamuru - తింగరి నవ్వు లేదు...అదీ కలిపేపెస్తా ....తిం.న"

ఈ గోల ఇలా జరుగుతుండగా V.B.సౌమ్య వచ్చి ఒక పొగడ్త విసిరారు.

"Sowmya V.B. - మీరు పదాల కూర్పే కాక, జనాల మధ్యలోకి తీసుకురావడానికి కూడా ఇతోధికంగా కృషి చేస్కుంటున్నారనమాట. (క.న - కన్నుగీటుతూ నవ్వు)"

ఈ క. న ని కొంచం మార్చి క.గీ.న గా లిస్ట్ లో పెట్టేసాం.

అలాగే వేణు శ్రీకాంత్, రెహ్మాన్, శ్రీనివాస్, సంతోష్, కల్లూరి శైలబాల, వరూధిని గారు, మధుర, కొత్తావకాయ, నైమిష్ గారు, అపర్ణ మున్నగువారందరూ వచ్చి ఇంకాసిన్ని పొగడ్తలు మామీద కురిపించి ఇతోధికంగా కొన్ని నవ్వులు కూడా చేర్చారు.

ఈ మొత్తం ప్రహసనం చూసి మా గురువుగారు ఆనందపరవశులై

"Bulusu Subrahmanyam - 67 ఏళ్లగా నవ్వుతున్నాను కానీ ఇన్ని నవ్వులున్నాయని ఇప్పుడే తెలిసింది.
సౌమ్య కి ధన్యవాదాలు"

అన్నారన్నమట :)

"sowmya alamuru - హహహ గురువుగారూ....అంతా మీ ఆశ్వార్వాదం...నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షి (ద.హా)"

అని గురుభక్తిని చాటుకున్నానన్నమాట :D

అదండీ గమ్మత్తైన పొట్టినవ్వుల కథ!

ఇంత గొప్ప ప్రయోగానికి తెర తీసిన బులుసు సుబ్రహ్మణ్యం గారికి అందరం కలిసి మరొక్కసారి జేజేలు చెబుదాం!

ఇకనుండీ మనందరం కూడా వీలైనంత వరకూ బ్లాగుల్లోనూ, బజ్జుల్లోనూ తెలుగులో నవ్వుదాం, ఏమంటారు? (చి.న)

Monday, November 21, 2011

శ్రీరామరాజ్యం

నేనూ శ్రీరామరాజ్యం చూసేసానోచ్. శనివారమే చూసాను కానీ "ఆ శని, ఆది వారాలు బ్లాగు/బజ్జు ఎవరు చూస్తారులే, సోమవారం తాజాగా రాద్దాం" అని ఊరుకుంటే...అయ్యబాబోయ్ అందరూ చూసేయడం, రాసేయడం కూడా అయిపోయింది. అయినాసరే నేను రాసి తీరుతాను...మీకూ చదవక తప్పదు. :P

కథ మనకు తెలిసినదే. దానిలో న్యాయాన్యాలు, వాదోపవాదాలు ఎరిగినవే. దాని గురించి మళ్ళీ రాయక్కర్లేదు. బాపూ ఈ సినిమాని ఎలా తీసారో చూద్దామని వెళ్ళాను. సినిమా నేను అనుకున్నంత గా లేదు....నాకు కొంచం నిరాశ కలిగినమాట వాస్తవం. చాలరోజులుగా వేచి చూస్తున్నాను దీని కోసం. వెళ్ళే ముందు పెద్దగా రివ్యూలు చదవలేదు. బాగుంది అన్న టాక్ మాత్రం విన్నాను. చాలా expectatios తో వెళ్లాను. కానీ కొంచం నిరాశ ఎదురయింది.....గొప్పగా లేదు, బాపూ చమక్కులున్నాయి కాబట్టి బానే ఉంది.

కానీ ఏంటో నాకు లవకుశ జ్ఞాపకాలను వీడిపోవడం దుస్సాధ్యమయింది ఎంత ప్రయత్నిచినా సరే. ముఖ్యంగా లవకుశలో పద్యాలు, పాటలు అన్నీ కంఠతా రావడంతో ఏ సీనులో ఏపద్యమొస్తుందో పాడేసుకుంటూ ఉన్నాను. బొమ్మ ఇప్పటిది, పద్యాలు-పాటలు ఆనాటివి అన్నట్టు అయింది నాకు. అతి ముఖ్యంగా "ఏ మహనీయసాద్వి, ప్రతిదినమేను తొలుదొల్త, ఇది మన ఆశ్రమమ్ము, హ్రీంకారాసంగర్భితానలశిఖాం, కన్నులారగ తొలిసారి కొలువుదీరి" లాంటి పద్యాలు గుర్తురాకపోవడం అసాధ్యం అనిపించింది.

కుశలవుల బొమ్మలు పోస్టర్లలో ఎక్కడా కనిపించనివ్వకుండా ఉత్సుకతని పెంచారు. నేను మొట్టమొదటినుండీ వేచి చూసినది వారికోసమే. అయితే చూసాకా కాస్త నిరుత్సాహమనిపించింది. ఆ లవకుశులతో పోలిస్తే ఈ కుశలవులు తేలిపోయారు. నటన బాగానే ఉందిగానీ ఏమిటో...నాకు అంత నచ్చలేదు. పైగా డబ్బింగ్ పిల్లలిద్దరికీ వేరే ఎవరిచేతనో చెప్పించినట్టు అనిపించింది. ఆంజనేయుడు చిన్నపిల్లాడుగా రావడం నచ్చింది. ఆ అబ్బాయి కూడా బాగా చేసాడు. రామ రామ పాట నాకెంతో నచ్చింది.

ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా నయనతార గురించి చెప్పుకోవాలి. ఆహా ఎంత ప్రసన్నత, ఏమి అందం, ఎంత ఒదిగిపోయింది ఆ పాత్రలో! నయనతార ఎంపికని అనుమానించినందుకు ఇప్పుడు లెంపలు వేసుకుంటున్నాను. అయితే అంజలి దేవితో పోలిక లేదు కానీ పాత్రకి న్యాయం చేసిందనే చెప్పాలి. కన్నెసీత గా భలే ముద్దుగా ఉంది. సాధ్వీమణిగా అంతకన్నా ఇంపుగా ఉంది. నయనతార నటనకి సగం మార్కులు, సునీత డబ్బింగ్ కి సగం మార్కులు ఇవ్వాలి.

బాలకృష్ణకి, NTR తోనూ పోలిక రాక తప్పదు. బాలయ్యబాబు బాగా చేసాడు, నిజంగా. నాకు బాగా నచ్చినది అతని డైలాగ్ డెలివరీ. బాధతో, దుఃఖం తో గొంతు జీరబోయినట్టు పలికిన సంభాషణలు ఇంకెవ్వరివల్లా కాదు అనిపించింది. కొంత గాంభీర్యం, కొంత దైన్యం, కొంత నిస్సహాయత, కొంత బాధ...బాగా చూపించగలిగాడు. లవకుశలో NTR లో అన్నీ పరిస్థితులలోనూ గాంభీర్యమే కనిపిస్తుంది. కానీ ఈ రాముడిలో కొంత దైన్యం కనిపిచింది. అది సహజం కూడా. అలా పాత్రని రూపొందించడంలో బాపు గారిని మెచ్చుకోవాలి. కొన్ని చోట్ల రామారావు రూపు ని గుర్తు తెచ్చింది...NTR ని ఇమిటేట్ చేసినట్టూ అనిపించింది. ఒకచోట "చిరంజీవులారా" అని తమ్ములతో అన్నప్పుడు అచ్చు రామారావే కనిపించాడు. అది NTR ఆహార్యమే. కాకపొతే క్లోజప్ షాట్లలో బాలయ్య ని భరించడం నావల్ల కాలేదు. ముదిమి ఛాయలు మీదపడిన బాలయ్యని ఎందుకు అన్ని క్లోజప్ షాట్లలో చూపించారో అర్థం కాలేదు. దగ్గరనుండి చూస్తే మరీ ఇంకులో ముంచినట్టు మేకప్ ఎక్కువయిందనిపించింది. బాపూగారు ఈ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉండవలసినది. ఓ పదేళ్ళ క్రితం బాలయ్య ఈ సినిమా చేసుంటే ఆ రాముడి పాత్రకి పూర్తి న్యాయం చేసేవాడేమో! నవ్వొచ్చిన విషయం ఏమిటంటే వీపు మీద కాటుకమచ్చ పెట్టడం, అది కనిపించేలా రెండు షాట్లు తియ్యడం. :)

ఇళయరాజా సంగీతం మొదట్లో అంత గొప్పగా ఏమీలేదు అనిపించినా వినగా వినగా నచ్చింది. కానీ ఆడియోలో విన్న అన్ని పాటలూ సినిమాలో లేకపోవడం నిరుత్సాహపరిచింది. "కలయా, నిజమా" పాట ఎలా తీసుంటారో అని తెగ ఆశగా చూసాను...కానీ ఆ పాట సినిమాలో లేదు. :( నేపథ్య సంగీతంలో వయొలిన్ బిట్స్ చాలా వినసొంపుగా బావున్నాయి. పాత-కొత్త సంగీతాల కలయికలా ఉన్న నేపథ్య సంగీతం వీనులవిందుగా ఉంది. సీత సీమంతం పాట అనవసరమనిపించింది. జొన్నవిత్తుల సాహిత్యం చెప్పుకోదగ్గది. కానీ పద్యాలు లేని లవకుశని ఊహించడం కష్టమయింది.

వాల్మీకి పాత్రలో నాగేస్రావు గంభీరంగా కనిపించారు. ఆయన నటనని, ఆహార్యాన్ని శంకించే పనిలేదు గానీ...నాగయ్యగారిలో ఉన్న ప్రశాంతత కనిపించలేదు. నాకెందుకో ఏ విశ్వామితృడి పాత్రకో, పరశురాముడి పాత్రకో సరిపోతాడేమో అనిపించింది. కానీ ఇంత వయసులోనూ ఉచ్ఛారణలోని స్పష్ఠత, అభినయం మెచ్చుకోదగ్గది. అదే కంటితో బాలయ్యని (వశిష్టుడు) చూస్తే బాధేసింది. ఒకప్పుడు ఎంత చక్కగా డైలాగులు చెప్పేవాడు. ఇప్పుడు ఏదో నొక్కిపట్టినట్టు, వత్తి వత్తి కష్టపడి డైలాగులు చెబుతుంటే కష్టమనిపించింది. మిగతా పాత్రలలో అందరూ బాగానే సరిపోయారు.

కాకపోతే సినిమాలో మెలోడ్రామా ఎక్కువైనట్లుగానూ, మధ్యలో కాస్త సాగతీతగానీ అనిపిచింది. పాత లవకుశలో ఏడుపు తక్కువ...కళ్ల నీళ్ళు సున్నితంగా చిందించడం తప్ప భోరున ఏడవడం లేదు. కానీ ఇందులో ఉంది. కుశలవులు అంతఃపురంలో రామాయణ గానం చేస్తున్నప్పుడు కౌసల్య మున్నగువారు భోరు భోరున విలపించడం కాస్త చికాకు కలిగించింది. వాళ్ళు రాజమాతలు...ఎంత కష్టంలోనైనా కొంత సంయమనం, గాంభీర్యం ప్రదర్శించడం అవసరం. దీనాలాపన అంతగా నప్పలేదు. అలాగే సీత పాత్రలో కూడా...చాలా చోట్ల ఏడుపు ఎక్కువయినట్టు అనిపించింది. మిగతా పాత్రలలో కూడా అక్కడకడా ఏడుపుని చొప్పించారు. ఏడవని పాత్ర ఏదీ లేదనుకుంటా. ఈ మెలోడ్రామా కొంత భరించలేకపోయాను.

ఇంక రమణ గారి డైలాగులకి వంక లేదు. బాపూగారి చమక్కులు మాత్రం మరోసారి గుర్తుచేసుకోదగ్గవి. నాకు బాగా నచ్చిన విషయం...చివరిలో సీత రామునికి నమస్కారం పెట్టే అంశం....సీతకి రామునిపై అవ్యాజ్యమైన ప్రేమ ఉంది కానీ మాటమాత్రమైనా చెప్పకుండా ఇలా విడిచిపెట్టాడే అన్న కోపం, అలక కూడా ఉన్నాయి. అలా లేకపోతే అసహజం. ఆ కోపాన్ని, అలకని బాపు గారు చిత్రించిన తీరు అనితరసాధ్యం. అలాగే ఆపద సమయంలో ఆదుకుని రక్షగా నిలిచిన వాల్మీకికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుని నమస్కరించే సన్నివేశం.....రామునికి, వాల్మీకికి నమస్కారాలలో తేడా ని గొప్పగా చూపించారు బాపూగారు. ఎంత అలక, కోపం ఉన్నా, తన తల్లి భూదేవితో వెళ్ళిపోతున్నప్పుడు చివరిసారిగా రాముని ప్రేమతో, ఆర్తితో చూసే సీతని చూస్తే నిజంగా ఏడుపొచ్చింది.

ఇక సీత కుటీరంలో ఒక రాతిపై రామబాణాన్ని ప్రతిష్ఠింపజేసి పూజిస్తుంటుంది. ఆ బాణం మొదట్లో విరిగిన తన గాజుని చంద్రవంకగా నిలిపి తమ అనురాగానికి సాక్ష్యాన్ని ఆ బాణంలో పొదగడం నన్ను విశేషంగా ఆకర్షించింది. రామబాణం, రాముని సీత - తిరుగులేనివి, చెక్కుచెదరనివి. ఈ రెండు విషయాలను ఒకే ఒక్క అంశంలో బంధించడం బలేగా ఉంది.

కౌటిల్య రాసినట్టు సీత చేతినుండి గాజులు ఊడిపడడం - ఆమె రాముని గూర్చి ఆలోచించి చిక్కిశల్యమైపోయినదనే విషయాన్ని అన్యాపదేశంగా వివరించడం...జయహో బాపు.

సింహాసనం ఎక్కబోతూ సీతను చిటికినవేలు పట్టుకుని సహా తీసుకెళ్లడం. సింహాసనం పై కూర్చున్న సీతను స్వయంగా లేపి సీత తో సహా రాజ్యపాలన సాగించబోతున్నట్టు రామరాజ్యం అనగా రాముడు సేవించిన రాజ్యం అని చెప్పడం. మొదట్లో సీత ఒడిలో తలపెట్టుకుని ఎలా కూర్చున్నాడో, మధ్యలో బంగారు సీత తొడిలో తలపెట్టుకుని అదే ఫోజులో కూర్చోవడం.....అంటే అదే మమతను, అనురాగాన్ని అనుభవిస్తున్నట్టు చూపించడం....బావుంది. సీతాలక్షణభరతశతృఘ్న సమేతంగా రాజ్యపాలన గావిస్తాను అని ప్రమాణం చేసినప్పుడు భరతలక్షణులు అవును అన్నట్టు తలూపడం లాంటి subtle expressions బాగా చిత్రీకరించారు.

"లేరుకుశలవుల సాటి" పాట పల్లవిని మాత్రం కుశలవుల చేత పాడించడం నచ్చింది. రాముడు, సీత మధ్య సరసం సున్నితంగా ఉంది. బాపు గారి postures తెలిసినవే కదా..చూడ్డానికి బావున్నాయి. సెట్టింగులు బావున్నాయి కానీ వనం లో జింకలు, నెమళ్ళని గ్రాఫిక్స్ లో పెట్టడం నచ్చలేదు. సహజమైనవాటిని వాడి ఉంటే బాగుండేది. పేటా తో గొడవ వస్తుందనో ఏమో అసహజంగా చిత్రీకరించారు. అవెందుకో కంట్లో ముల్లులా గుచ్చుకున్నాయి అక్కడక్కడా.

సినిమా చూస్తున్నప్పుడు ఒక చిన్న సరదా సంఘటన జరిగింది. ముందే చెప్పానుగా లవకుశలో పద్యాలు నోటవెంట వచ్చేస్తున్నాయని. అతికష్టంచే బయటకి రాకుండా నోట్లో పాడుకుంటూ ఉన్నాను.

వాల్మీకి సీతని ఆశ్రమానికి తీసుకొచ్చి చూపిస్తూ ఇంకా డైలాగులు మొదలెట్టలేదు....అనుకోకుండా నా నోటివెంట "ఇది మన ఆశ్రమంబు ఇచట నీవు వశియింపుము లోకపావని" అని పైకే వచ్చేసింది. సరిగ్గా అదే పద్యాన్ని నా వెనుక వరుసలోనూ, ఆపై వరుసలోనూ ఇద్దరు అందుకున్నారు. ముగ్గురం ఒకేసారి బయటకి పాడేసరికి హాలంతా ఘొల్లున నవ్వులు. ఎంత తమాయించుకుందామన్నా నాలాగే మరికొందరికి లవకుశ వదలడం లేదన్నమాట అనుకున్నాను. :)

అయితే మనల్నే కాదు బాపు-రమణ గార్లని కూడా వీడలేదు. అందుకే ఒకచోట వాల్మీకి సీతను లోకపావని అని పిలుస్తారు (లక్ష్మి అని నామకరణం చేసినా సరే). అలాగే "లేరుకుశలవుల సాటి" పాట పాడించడం...మున్నగునవి. :)

మొత్తానికి సినిమా కాస్త నిరాశపరిచినా బాపు-రమణల కోసం, నయనతార కోసం, వైవిధ్యమైన బాలయ్యబాబు కోసం ఒకసారి చూడొచ్చు. నయనతార ఎక్కువ మార్కులు కొట్టేసింది.


Thursday, November 17, 2011

అపురూపమైన ఆనందహేల!

కార్తీక్ పెళ్ళి అని తెలిసిన రెండు నెలల ముందు నుండి మొదలయ్యింది హడావుడి. తను పెళ్ళి తేదీ చెప్పగానే "అరే సరిగ్గా నేను మా ఊరు వెళ్ళే ట్రిప్ ప్లాన్ చేసుకునే టైములోనే పడిందే" అని ఒకింత ఆశ్చర్యం, సంబరం. బలే బలే అనుకుంటూ తయారయిపోయాను. చాలామంది బ్లాగు మితృలు వస్తున్నారని తెలిసి సంతోషమనిపించింది. బ్లాగు/బజ్జు లలో పరిచయమైన మితృలతో సరదాగా కబుర్లు చెబుతున్నానుగానీ ఇప్పటివరకూ కలవలేదు. బాగ తెలిసిన స్నేహితులు కానీ కలుసుకోలేదు...ఇప్పుడు కలుసుకోబోతున్నాను. బ్లాగు మితృలతో కలిసి హైదరాబాదునుండి ప్రయాణం....మరి హైదరాబాదులో మితృలను కూడా కలిసేస్తే పోలే! చాలామందికి కలుస్తానని చాలాసార్లు మాటిచ్చాను. కానీ కుదరలేదు. ఇప్పుడు అవకాశమొచ్చింది. నవంబర్ 10 సాయంత్రం మా ఊరునుండి రైలెక్కాను. ఎన్నో చిత్రమైన ఊహలు...వాళ్ళు అలా ఉంటారా, ఇలా ఉంటారా....ముఖాముఖి కలిసి మాట్లాడితే ఎలా ఉంటుంది! ఇవే ఆలోచనలతో గడిపాను.

బ్లాగులోకంలో ఒక పెద్దాయన మా ఇంటిపేరు చూసి మీకు ఫలనావాళ్ళు తెలుసా అని అడిగారు ఓ రెండేళ్ళ క్రితం. "తెలుసు" అని చెప్పగానే మొదలయ్యింది మా స్నేహం. ఆయనతో మాట్లాడుతుంటే మా మావయ్యతోనో, మా పెద్దన్నయ్యతోనో మాట్లాడుతున్నట్టు ఉంటుంది నాకు. ఆయానెవరో ఇంకా తెలీలేదా అదేనండీ మన పప్పుసారు - పప్పు శ్రీనివాసరావు గారు. హైదరాబాదులో రైలు దిగి నేరుగా పప్పుశ్రీనివాసరావు గారింటికి వెళ్ళాను. మరి ముందే మాటిచ్చేసాను కదా. నేను ఢిల్లీ నుండి బయలుదేరుతున్నాను అని చెబితే "పుట్టింటికి స్వాగతం" అని చెప్పారు. ఏంటో అనుకున్నాను...కానీ నిజంగా అక్కడకి వెళ్ళాక నాకు మా ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. కాంతిగారు ఎంత సరదాగా, ఎంత చనువు గా మాట్లాడారని. ఇంట్లో పిల్లలాగే చూసుకున్నారు. నిజంగా నాకు అస్సలు కొత్తగా అనిపించలేదు. వాళ్ళ అమ్మాయి ఎంతో సరదాగా కబుర్లు చెప్పింది. నాకస్సలు కొత్తగా అనిపించలేదు. వాళ్ళింట్లో పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి బోల్డు కబుర్లుచెప్పి బయలుదేరుతుటే....కాంతి గారు బొట్టు పెట్టి, బట్టలు చేతిలో పెట్టారు. మొదట కోపం వచ్చినా, ఆ ఆప్యాయతకి, అభిమానానికి మనసు తడి అయ్యింది.

ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు ఇంచుమించు ఒకటే. కబుర్లు చెప్పుకోవడం మొదలెట్టామా గంటలు గంటలు...టైమెంత గడిచిందో తెలియదు. మనిషిని చూడకపోయినా మనసుకి ఎంతో దగ్గర. ఆవిడ దగ్గర నాకెంతో చనువు, ఎంతో అభిమానం. మరి ఆవిడకి నేనంటే ఇంకా అభిమానం లేకపోతే నాకెందుకు కావలసిన పుస్తకాలు పంపిస్తారు చెప్పండి. :D మీకర్థమయిపోయింది కదూ...అవును, సుజాతగారే....చిన్ననాటి స్నేహితురాలిని కలిసినట్టు అనిపించింది. గలగల కబుర్లు చెప్పేసుకున్నాం. నాకిష్టమైనవన్నీ వండి పెట్టారు మధ్యాన్నం భోజనానికి. బలే తమాషాగా అక్కడకి వేణు గారు వచ్చారు. ఉన్నది కొన్ని నిముషాలే అయినా, ఆయనని కలిసి మాట్లాడడం బావుంది. ఇంతలో గురువుగారు ఫోను "వస్తున్నానండీ" అని. ముందే తెలుసు బులుసుగారు వస్తునారని. ఇంక ఇద్దరం ఎదురుచూస్తూ కూర్చున్నాం. నవ్వితే నవ్వండి అనుకుంటూ వచ్చేసారు. అదే సమయానికి నా ప్రియస్నేహితురాలు అపర్ణ వచ్చింది. ఇంకేముంది కబుర్లే కబుర్లు. బులుసు గారిని కలవడం ఎంత సంతోషమనిపించిందో చెప్పలేను. బ్లాగులో ఎంత హుషారుగా టపాలు రాస్తారో అంతే హుషారుగా కబుర్లు కూడా చెబుతారు. ఆయన శరీరానికే వయసొచ్చిందిగానీ మనసుకి కాదు. మాతో కలిసిపోయి ఎంత చక్కగా మాట్లడారో....ఆయన హుషారు చూస్తే నాకు కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది. ఈలోగా నమూనా అదే అదే నాగమురళీధర్ నామాల వచ్చారు అక్కడకి. :) తరువాత రెహ్మాన్ వచ్చాడు. వీళ్ళందరినీ ఇలా కలుసుకోవడం ఎంత బావుందో చెప్పలేను. క్షణాలు ఎలా దొర్లిపోయాయో తెలియలేదు. సుజాతగారింటికి వెళ్ళడం, కబుర్లుచెప్పుకోవడం....ఒక గొప్ప అనుభూతి. నేను జీవితంలో అపురూపంగా దాచుకునేవాటిలో సుజాతగారి స్నేహం ఒకటి.

(వరూధినిగారూ...అలా చూడకండి...నాకు వణుకొస్తోంది...బాబోయ్ గజ గజ. :( నేను పప్పుసారింటికి, సుజాతగారింటికి మాత్రమే ప్లాన్ చేసాను. మిగతావన్నీ వాటంతట అవే జరిగిపోయాయి. ఈసారి మీ ఇంటికి తప్పకుండా వస్తానని మాటిచ్చాగా...మనిద్దరం మధ్య ఒప్పందం జరిగిపోయింది...మీరు మళ్ళీ అలక్కూడదన్నమాట, నాతో మాట్లడకుండా ఉండకూడదన్నమాట..సరేనా! ) :D

రాత్రి ప్రయాణం అనంతపురానికి అదే జీవనికి. మజ్జిగ చిలికే (మనసుపలికే-అపర్ణ), అల్లవుద్దిన్ మిల్క్ షేక్(రెహ్మానుద్దిన్ షేక్), గెంతి (బంతి), కలిసి రైలెక్కాం. సుజాతగారు మాకు రైల్లోకి ఫలహారాలు కట్టిచ్చారు. నాకిష్టమైన బొబ్బట్లు నాకోసం ప్రత్యేకంగా కట్టి ఇచ్చారు. రైలు ప్రయాణం ఎంతో సరదాగా సాగిపోయింది. బంతి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎంత శ్రద్ధ, ఎంత caring, ఎంత బాధ్యత! ఎవ్వరికీ అసౌకర్యం కలగకూడదని ఎంత తాపత్రయపడ్డాడో! బలే ముచ్చటేసింది నాకు. అనుకున్నట్టుగానే జీవని ప్రసాద్ గారింట్లో దిగాము. ఆయనకి ఇబ్బంది అవుతుంది మనసులో అనిపిస్తూనే ఉంది గానీ వేరొకచోట దిగడానికి ఆయన ససేమిరా అన్నారు. అక్కడకు చేరాక నా కుడిభుజం, ప్రియ మితృడు అయిన రాజ్ ని కలుసుకోవడం గొప్ప ఆనందంగా అనిపించింది. నా బజ్జు నేస్తాలయిన నాగార్జున, వికటకవి శ్రీను, వెన్నెల కిరణ్ కూడా వచ్చారు.

జీవని గురించి గత యేడాదికి పైగా తెలుసు. ప్రసాద్ గారి నిజాయితీ, సమర్థత...జీవని సభ్యుల దయార్ద్ర హృదయం గురించి తెలుసు కానీ అక్కడికి వెళ్ళి కళ్ళారా చూసాక అర్థమయ్యింది మన బ్లాగుల్లో జీవని గురించి విన్నది కన్నది ఎంతో తక్కువ అని. మేరుపర్వతమంటి మనసులు అంటే ఏంటో స్వయంగా చూసాకగానీ అర్థం కాలేదు నాకు. వారి ముందు చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో చిన్నదిగా కనిపిచింది. కుటుంబంలో ఏ ఒక్కరికో ఇటువంటి మనసు ఉంటే సరిపోదు బృహత్కార్యాలకి....ఎలా రాసిపెట్టి ఉందో, ఎక్కడ కుదిరారోగానీ ప్రసాద్ గారు, వారి సతీమణి made for each other మాత్రమే కాకుండా also made for others అనిపించారు. దాదాపు పదిమందిమి వెళ్ళాము అక్కడకి. పొద్దున్నే లేచి ఎంతో ఓపికతో మాకోసం ఫలహారాలు, మధ్యాన్నం భోజం అన్నీ వండి ఎంతో ఆదరణ చూపించారు. ప్రసాద్ గారి తల్లిదండ్రులు వయసులో ఎంత పెద్దవారో మనసులోనూ అంతే పెద్దవారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. "మాకోసం చాలా శ్రమపడుతున్నారండీ" అంటే "నీకలా కనిపిస్తున్నాదా? చూడు మా ముఖాల మీద చెమట బిందువైనా లేదు" అని నవ్వుతూ చమత్కరించారు. వారి ఆప్యాయత చూసాక నాకు అనిపించింది "జీవని పిల్లలు ఎంత అదృష్టవంతులో" అని. జీవని విద్యాలయం కడుతున్న చోటు చూడడానికి వెళ్లాము. మాతో పాటు కారులో ఎవరో ఇద్దరుముగ్గురు వచ్చారు. వారెవరో తెలీదు. ఒక కుర్రాడు...నాకంటే కొంచం పెద్దవారేమో, రాజ్ తో ఏవో మాట్లాడారు. ఎవరోలే అని నేను పట్టించుకోలేదు. జీవని విద్యాలయం కడుతున్న ప్రదేశం ఎంత బావుందని! చుట్టూ కొండలు, పచ్చని చెట్లు......ఆహ్లాదకరమైన ప్రకృతి. అటువంటి బడిలో, ఆ ప్రకృతి ఒడిలో పిల్లలు పెరిగితే ఇంక అంతకుమించి అదృష్టం ఏముంది. ఎదురుగా ఉన్నా "శ్రీనివాస రామానుజం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(SRIT) కి వెళ్లాము. అక్కడకి వెళ్ళగానే ఒకతను వచ్చి మీరొస్తున్నారని చైర్మేన్ గారు చెప్పారంటూ సాదర అతిధి మర్యాదలు చేసి కాలేజీ మొత్తం చూపించాడు. ఈ చైర్మేన్ ఎవరబ్బా అనుకుంటూ ఆశ్చర్యపోయాను. SRIT చాల పెద్ద కాలేజీ. విశాలమైన ప్రాంగణం, అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లేబ్స్, తరగతి గదులు. అక్కడ నన్ను బాగా ఆకర్షించినది వారి రీడీంగ్ రూం మరియు లైబ్రరీ. ఏ కాలేజీ లైబ్రరీలలోనూ చూడని పుస్తకాలు కనిపించాయి అక్కడ. పాఠ్య పుస్తకాలతోపాటు మంచి తెలుగు సాహిత్యం కనిపించింది. నాకిష్టమైన పుస్తకాలెన్నో కనిపించాయి. ఆ పుస్తకాల సేకరణ వెనుకాల కర్త, కర్మ క్రియ జీవని ప్రసాద్ గారేనని తరువాత తెలిసింది.

కాసేపటికి బిలబిలమంటూ పిల్లలు చుట్టుముట్టారు. అక్క, అన్నయ్యా అంటూ మా ఒళ్ళో కూర్చుని, భుజాలమీదెక్కి ఊపిరి సలపనిచ్చారు కాదు. మేము తెచ్చిన చిన్న చిన్న బహుమతులు అందుకుంటుంటే వారి మొహాలలో వెల్లివెరిసిన ఆనందం చూసి "ఇది చాలు ఈ జన్మకి" అనిపిచింది. ఆ చిన్నారుల నవ్వుల ముందు వేల వజ్రాలు కూడా దిగదుడుపే. చిట్టి పొట్టి పిల్లలు సీతాకోకచిలుకల్లా చుట్టూ చేరి "అక్కా ఇది కావాలి, అది కావాలి, వీడు చూడు ఇలా చేస్తున్నాడు, నా రిబ్బను పోయింది, నేనో జోక్ చెబుతా, నేను మిమిక్రీ చేస్తా, నేను పాట పాడుతా, నాకు ఇన్ని మార్కులొచ్చాయి, మా మేషారు ఇలా అన్నారు " అని కబుర్లు చెబుతుంటే ఏవో తెలియని ఆనందలోకాల్లో విహరిస్తున్నట్టు అనిపించింది. నాకు జామకాయలు ఇవ్వలేదు అని ఒక పిల్ల అలక, వీడు నన్ను బెదిరిస్తున్నాడు అని ఇంకో పిల్ల కోపం, అమ్మాయిల చేతికి ఏవో వేసారు (గాజులు) అవి నాకు కావాలి అని ఒక బుజ్జి బాబు అల్లరి, నాకు ఫొటో తియ్యవా అన్నయ్యా అని ఇంకో చిన్నారి సరదా....ఓహ్ ఒకటా, రెండా! వారి అలకలు తీరుస్తూ, బుజ్జగిస్తూ, సరదాగా ఆటపట్టిస్తూ, చక్కిలిగింతలు పెడుతూ నేను నా వయసు మరచిపోయి చిన్నపిల్లనైపోయాను. వారితో గడిపిన ఆ కొన్ని గంటలు వెలకట్టలేనివి. వారితో సమయం గడిపిన తరువాత అమ్మ ఒడిలో నిదురిస్తున్నంత ప్రశాంతంగా అనిపించింది. ఎర్రటి ఎండ తరువాత కురిసిన చిరుజల్లు వలే హాయిగా అనిపించింది. మనసుకి కొత్త శక్తిని, కొత్త ఉత్తేజాన్ని కలిగించింది.


మధ్యాహ్నం మా అందరి భోజనాలయ్యాక పిల్లలకి భోజనాలు పెడుతున్నారు ప్రసాద్ గారి అమ్మగారు మరియు శ్రీమతి. వారితో పాటు రెహ్మాన్ కూడా వడ్డిస్తున్నాడు. అటుగా వెళ్తూ ఈ తతంగాన్ని గమనించాను. మొత్తం పాతిక మంది పిల్లలకి ఎంతో లాలనగా, ఒక్కొక్కరిని ప్రత్యేకంగా చూస్తూ, ఎవరికి ఏమి కావాలో శ్రద్ధగా అడిగి తెలుసుకుని, కొసరి కొసరి వడ్డించి, తినకపోతే మెల్లిగా మందలించి ఆప్యాయంగా తినిపిస్తున్నారు వారు. ఆ దృశ్యం చూసి నా కళ్ళకొసల నీరు నిలిచింది. ఆ కరుణార్ద్రహృదయులముందు నాకు నేను ఎంతో చిన్నదానిగా కనిపించాను. వారి జీవితం ఎంత ధన్యం! ఇంక నేను ఆగలేకపోయాను. వారితో చేరి నేనూ కూడా పిల్లలకు వడ్డిస్తూ, తినిపిస్తూ అలౌకికానందాన్ని పొందాను. అన్నాలయ్యాక విశ్రాంతి తీసుకుంటుంటే ఇందాకల కారులో కనిపించిన కుర్రాడు మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ పక్కనే బల్లేసుకుని మామూలుగా, అతిసాధారణంగా అందరిలాగా భోజనం చేస్తున్నారు. ఎవరబ్బా ఇతను అని విచారిస్తే అతనే ఆ SRIT చైర్మేన్ సాంబశివరావుగారు అని తెలిసింది. అవాక్కయిపోయాను, నిజంగా. ఎంత సాదాసీదాగా ఉన్నారు! ప్రసాద్ గారిని అభిమానంగా అన్నయ్య అని పిలుస్తూ, ఏ భేషజం లేకుండా, ఇంట్లో మనిషిలాగ మెసలుతున్నారు. SRIT లో మాకు నచ్చిన విషయాలు తెలియపరుస్తూ వారిని మనస్పూర్తిగా అభినందిందాము. జీవని విద్యాలయంలో వీరూ భాగస్వాములే అని తెలిసి సంతోషించాము.

ఇందరి కరుణమాయుల చల్లని చేతులలో ఎదగబోయే ఆ పసిమొగ్గలకన్నా అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. ఎవరన్నారు ఆ పిల్లలకి ఎవరూ లేరని?...చల్లని మనసులు కలిగిన ఇందరు ఉత్తములు వారికి అండగా ఉండగా వారికన్నా ధనవంతులు ఎవరు!

ఆ భూమి మీద విరిసిన నక్షత్రాల కోసం ఇంతటి కృషి చేస్తున్న ప్రసాద్ గారి కుటుంబానికి, మిగతా జీవని సభ్యులకు ఇవే నా హృదయపూర్వక జోహార్లు. నేను సైతం నేను సైతం జీవని పాటకు గొంతు కలిపేను అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది.

ప్రసాద్ గారి కుటుంబ సభ్యుల అభిమానాన్ని, చిన్నారుల నవ్వుల పువ్వులను ఒడుపుగా మూటగట్టుకుని కార్తీక్ పెళ్ళికి పులివెందులకి బయలుదేరాం. ఇంక అక్కడనుండి మొదలయ్యింది ఆనందహేల. బ్లాగులోనూ, బజ్జులోనూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడు కొట్టుకుంటూ ఉండే మేము అందరం ఇలా డైరెక్ట్ గా కలిస్తే ఇంకేమైనా ఉందా...మా నవ్వులతో పులివెందుల దద్దరిల్లింది. మా ఆటపాటలతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. మేము మా గోల తప్ప మరో ప్రపంచాన్ని పట్టించుకోలేదు. పెళ్ళికి శంకర్ గారు, విజయమోహన్ గారు, నాగ ప్రసాద్ కూడా వచ్చారు. ఇంక ఆటలు, పాటలు, అరుపులు, కేకలు, జోకులు, సెటైర్లు...ఒకటేమిటి...రెండు రోజులు ఎడతెరిపి లేకుండా నవ్వుతూనే ఉన్నాం. ఒక్కసారిగా కాలేజీ రోజులకు వెళ్ళిపోయినట్టనిపించింది. అందరం చిన్నపిల్లలమైపోయాం. ఎప్పటినుండో పరిచయమున్న నేస్తాల్లా కబుర్లు చెప్పేసుకున్నాం. కార్తీక్ అటువైపు పెళ్ళిలో కూర్చున్నాడేగానీ మనసంతా ఇటువైపే ఉంది. పది నిముషాలకొకసారి మమ్మల్ని చూస్తూనే ఉన్నాడు.

ఇంక అసలు విషయం గురించి నాలుగు మాటలు - అదే కార్తీక్ పెళ్ళి - వధూవరులిద్దరూ చిలుకాగోరింకల్లా లాగ చక్కగా ఉన్నారు. పెళ్ళి చాలా బాగా జరిగింది. రాయలసీమ, కర్ణాటక రుచులతో పసందైన భోజనాలు, అందమైన పందిళ్ళు, అభిమానించే మనుషుల మధ్య కార్తీక్ పెళ్ళి వైభోగంగా జరిగింది. కార్తీక్-సౌమ్య లు కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, స్నేహితుల్లా కలిసిమెలిసి ఆనందంగా జీవితం గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. వారిద్దరికీ వివాహమహోత్సవ శుభాకాంక్షలు!

పెళ్ళి అయిన తరువాత మేమంతా చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. ఎంత మంచి విషయమైనా ముగింపుకి రాక తప్పదు కదా.... మరచిపోలేని మధురానుభూతులను మూటగట్టుకుని, అందరివద్దా వీడుకోలు తీసుకుని ఎవరిదారిన వాళ్ళు బయలుదేరాం. మళ్ళీ ఎప్పుడో, ఎక్కడో.....తప్పకుండా కలుసుకుందాం నేస్తాలూ!

మూడురోజులు ఆనందజలధిలో ముంచేసి, అందమైన అనుభూతులను బహుమతిగా ఇచ్చిన బ్లాగు/బజ్జు నేస్తాలందరికి ఇవే నా హృదయపూర్వక కృతజ్ఞతలు!



Thursday, October 13, 2011

భావుకపిత

మన బ్లాగర్లలలో చాలామంది చాలా భావుకతతో బోల్డు బోల్డు రాసేస్తుంటారు కదా. పువ్వు గురించో, నవ్వు గురించో, "నువ్వు" గురించో...బలే రాస్తుంటారు. అలాగే రాధాకృష్ణుల గురించి...విరహవేదనల గురించి, ఆమె గురించి, అతని గురించి...ఏవేవో రాస్తుంటారు.

మనకి అంత భావుకత లేదు, అదంటే ఏమిటో కూడా తెలీదు. అసలు వీళ్ళెలా రాస్తుంటారా అని తెగ ఆశ్చర్యపోతుంటాను. చివరికి నిన్న తెలిసింది. మన నేస్తం లేరూ ఆవిడ చెప్పారు "చాలా చిన్న విషయాన్ని స్ట్రైట్ గా చెప్పకుండా చిలవలు పలవలుగా చెప్పిరాసేదాన్ని భావుకత అంటారు" అని. ఇది చాలదూ మనకి! అసలే ఇదిగో తోక అంటే అదిగో పులి అనే రకం మనం. చిన్న క్లూ ఇస్తే చాలు అల్లుకుపోతాం. ఆ..మనకేం తక్కువ, మనం రాయలేమా అని మొదలెట్టాను. కాకపోతే అది భావుకత లా కాకుండా భావుకపిత లా వచ్చింది. అందుకే నా ఈ ప్రహసనానికి "భావుకపిత" అని పేరు పెట్టాను. బ్లాగు వీధులలో భావుకపితబావుటా ఎగురవేయాలని నిర్ణయించేసుకున్నాను.

ఆ నిర్వచనం చూసాక నాలో భావుకపిత్వం పొంగిపొర్లింది. రాసేసాను...నాలో భావుకపిని కదిపి, కుదిపి పారేసాను.

1) నేస్తం.....నాకు కావాలి....అవును, నాకు కావాలి.

అది గుండ్రంగా ఉంటుంది నీ ముఖం లాగే
మృదువుగా ఉంటుంది నీ మనసులాగే
మధురంగా ఉంటుంది నీ పలుకులాగే

ఒక్కసారి హత్తుకుంటే చాలు విస్ఫోటనాలు కలిగిస్తుంది.
ఆ పరిమళం మనోహరంగా ఉంటుంది
ఆ తీపి జ్ఞాపకాలు ఎన్నటికీ వీడవు.

గుండె నాలుకపైకి వచ్చేస్తుంది....
ఆ రుచి, ఆ ఆస్వాదన అనితరసాధ్యం.....

అదేమిటో తెలుసా నేస్తం...చెప్పేస్తున్నా..చెప్పేస్తున్నా...అదే సున్నుండ...అది కావాలి నాకు...ఇవ్వావూ!

2) అదిగో ఆ గదిలో ఆ చిట్టచివర్న ఆ మూల నావైపే చూస్తోంది
ఒంగి, వినయంగా, ఓరకంట చూస్తోంది
ఆ చూపులు "నీకోసమే, నువ్వెప్పుడొస్తావా అని" అన్నట్టు ఉన్నాయి.
నే వెళ్ళగానే ఏ క్షణమైనా వర్షించేలా ఉన్నాయి.
మెల్లగా, మృదువుగా ఆ హృదయంలోనుండి మాటలు వినిపిస్తున్నాయి.....

"ఇంకా ఎంతసేపు...ఈ యాతన "నీకోసమే" అని చెబుతున్నా రావేం!
రా, నువ్వొస్తే నా ఈ నిరీక్షణ ముగుస్తుంది.
ఆఖరి బొట్టు వరకు నీకోసమే.....

ఎహే ఎంతసేపు నాకుతావ్ చెయ్యిని, వచ్చి కడుక్కో"

అని ఆ మూలన, వాష్ బేసిన్ నుండి పిలుస్తున్న కొళాయి పిలుపులు నాకు లీలగా వినిపిస్తున్నాయి.

3) ఎంత బరువైనా మోస్తారు
రాచిరంపాన పెట్టినా సహిస్తారు
ఈడ్చితన్నినా భరిస్తారు
సూదులు పెట్టి పొడిచినా కిక్కురుమనరు

పైగా మీరు
భూమాతకి అతిదగ్గరగా ఉన్నాము కదా అని ఆనందిస్తారు
మనిషి నడకకు, నడతకు సాయం చేస్తున్నామని మురిసిపోతారు
మాకు మేమే సరిజోడి అని తలెగరేస్తారు

అవసరం తీరాక మిమ్ములను నిర్దాక్షిణ్యంగా అవతల పారేసినా పన్నెత్తి మాటాడరు, కన్నెత్తి చూడరు

మీ ఓరిమికి, కూరిమికి జోహార్లు ఓ ప్రియ పాదరక్షలూ!

అవేనండి కాలిచెప్పులు! :)

4) అత్తకోడళ్ళ మధ్య చిచ్చుపెడతావు
భార్యాభర్తల మధ్య అపార్థాలు తెస్తావు
యజమాని, సేవకుని మధ్య మంటలు రేపుతావు
కుట్రలు,కుతంత్రాలు నింపుకుని భయంకరమైన క్షుద్రవిద్యలను ప్రోత్సహిస్తావు
బాల్యవివాహ కథలు చెబుతావు
అనాగరికమైన అంశాలను ప్రస్తావిస్తావు
అవన్నీ చూసే ఆడవాళ్ల చేత కన్నీరు పెట్టిస్తావు

తెలుగు టీవీ సీరీయలూ...నీకిదేం పాడుబుద్ధి!

5) నువ్వంటే వ్యామోహం
నీ చేయూత కావాలని ఆరాటం
అన్నివేళలా సదుపాయంగా ఉంటావని నమ్మకం
మిలమిలమెరుస్తూ, దృఢంగా, బలంగా చేతిలో ఒదిగిపోతావ్
నీ చేరువ అభివృద్ధికి సంకేతం
నువ్వంటే నాకు ఇష్టం, నిజంగా

కానీ....కానీ.....

ఎందుకో నాకంటూ ఉన్నదాన్ని, నాలో ఏకమైపోయిన దాన్ని, నా సొంత చేయిని చూడగానే నిన్ను మరచిపోయి హాయిగా ముద్దలు కలుపుకుని ఆనందంగా తినేస్తాను.

నీ ఉపయోగాన్ని తోసిరాజని, నీ మీద ఉన్న ప్రేమని చంపేసుకుంటూ నేను చేస్తున్న ఈ పనిని క్షమిస్తావు కదూ ఓ చెమ్చా (స్పూన్)!

మరి నా భావుకపిత ఎలా ఉందో చెప్పండి? మీకు నచ్చే ఉంటుంది నాకు తెలుసు :P
అస్సలు మొహమాటం లేకుండా పొగిడేయండి ఏం! :)



Thursday, September 29, 2011

అవినీతా? అంటే?

ఢిల్లీలో ఏ గల్లీలో చూసినా పోలీసులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తారు. ఇదేదో బలే బావుందే...చక్కగా మనకి ఎంత రక్షణ అని మురిసిపోయేలోపే వాళ్ళ ప్రతాపాలు తెలిసి ప్రాణం బిక్కుబిక్కుమంటుంది. ఒక పెద్ద రోడ్డు మీద సాయంకాలం అయిన దగ్గరనుండీ రెండు వైపులా పెద్ద పెద్ద గేటుల్లాంటివి పెట్టేసి మధ్యలో కాస్త దారి మాత్రమే వదులుతారు. కార్లన్నీ ఒకదాని వెనుక క్యూలో వెళ్లాలన్నమాట. ఇది ఎందుకయ్యా అంటే...అది రద్దీ రహదారి కాబట్టి కాస్త చీకటి పడగానే తాగేసి ఎవరైనా డ్రవ్ చేస్తూ అటుగా వచ్చి మిగతా వాహనాలకు ఇబ్బంది కలిగిస్తారేమొనని. తాగి డ్రైవ్ చేసినట్టు పట్టుబడితే శిక్ష చిన్నది కాదు. అందుచేత అందరూ ఒళ్ళు దగ్గరపెట్టుకుని రండి అని చెప్పకనే చెప్పడం అన్నమాట. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ అక్కడ జరిగే అసలు విషయమేమిటంటే ఆ మధ్యమార్గం గుండా కార్లన్ని వరుసపెట్టి వదిలేస్తుంటారు. కానీ అటుగా వచ్చే ప్రతి ఒక్క ద్విచక్ర వాహనాన్ని ఆపేసి పక్కన నిల్చోబెడతారు. వరుసగా అందరి దగ్గరా లైసెన్సు, RC చూసి ఓ వంద నొక్కేస్తుంటారు. విధిగా ప్రతీ బైక్ ని ఆపుతారు. నేను రోజూ ఆ రోడ్డు గుండా వెళుతుంటాను. సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు రోజూ కనీసం ఐదు బైకులు పక్కన నిలబడి ఉండడం చూస్తాను. ఒకరోజు, ఒక సమయానికి ఐదు బైకులు అంటే ఐదువందల రూపాయలు. ఈ లెక్కన లెక్కేస్తే వాళ్ళ రోజు సంపాదన, నెల సంపాదన లెక్కించడానికి ఏ శ్రీనివాస రామానుజమో దిగి రావాలి. లైసెన్సు, RC చూపించాక కూడా వంద ఎందుకు అని అడిగావో మరుక్షణం నువ్వు జైలో ఊచలు లెక్కెడుతుంటావు. అలా అడిగిన పాపానికి ఒకతన్ని రెక్కీడ్చుకుపోయి బొక్కలో తోసిన సన్నివేశం ఒకటి చూసాను.

న్యూ డిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర, ఓరోజు మా కార్ లో వెళ్తున్నాం. మేము ఎడమవైపుకి తిరగాలి. తెలీకుండా ముందుకి లాగించేసాం. అరె సందు మిస్ అయిపోయామే ఇప్పుడెలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ, మెల్లిగా నడుపుతుండగా పోలీసు తలుపు కొట్టాడు. ఏమిటయ్యా అని అడిగితే ఇది one way అన్నాడు. అదేమిటి ఎదురుగుండా లారీలు వెళుతున్నాయిగా అని అడిగితే పెద్ద వాహనాలకి తప్ప చిన్న వాహనాలకి దారి లేదన్నాడు. ఇదేం విచిత్రం అనుకుంటుండగా లైసెన్సు, RC అడిగాడు. తీసి చూపించాము. మాకు అది one way అని తెలీదు. ఎక్కడా బోర్డు రాసి లేదు. ముందు వాహనాలు వెళుతుంటే two way అనుకున్నాం అని చెప్పాము. ఐదొందలు ఇవ్వు అంటూ మా లైసెన్సు, RC ని చేతుల్లో ఆడించాడు. ఐదొందలంటే మరీ ఎక్కువని బ్రతిమలాడడం మొదలెట్టాం. ఓ ఐదు నిముషాలు పోయాక వందకి ఒప్పుకున్నాడు. వంద వాడి మొహాన కొట్టి బ్రతుకు జీవుడా అనుకున్నాం. మరునాడు అదే రూటులో వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు చూస్తే అక్కడ one way లేదు, కాదు. పక్కనున్నవాళ్ళని అడిగాము. అక్కడ one way ఎప్పుడూ లేదు అని చెప్పారు. అప్పుడప్పుడూ పోలీసులు ఉంటారు తప్ప one way లేదు అన్నారు. మాకు విషయం బోధపడింది. మా లైసెన్సు, RC వాడి చేతుల్లో ఉన్నాయి..ఏం చేస్తాం వంద కాదు, వెయ్యి అడిగినా ఇచ్చుండేవాళ్లమే!

లైసెన్సు అంటే గుర్తొచ్చింది...ఆ మధ్య మేము కొత్త two wheeler కొన్నాం. లైసెన్సు కోసమని RTO ఆఫీసుకి వెళ్ళాం. అక్కడ ఏదీ సక్రమంగా లేదు. ఏ కౌంటర్ నుండి ఏ కౌంటర్ కి వెళ్ళాలో చెప్పే నాధుడే లేడు. సరే ముందు అప్ప్లికేషన్ తీసుకుందామని వెళితే ఐడి ప్రూఫ్ చూపించమన్నాడు. పాస్ పోర్ట్ తీసి చూపించా. కుదరదన్నాడు. ఏమి? అన్నాను. ఇందులో హైదరాబాదు అడ్రస్ ఏదో ఉంది డిల్లీ అడ్రస్ కావలన్నాడు. అయ్యా నేను ఈ భారతదేశ పౌరురాలిని అని తెలియజెప్పే ఏకైన మౌలిక పత్రం ఇది అన్నాను. నాకనవసరం అన్నాడు. పాస్ పోర్ట్ చెల్లదా అంటే చెల్లదు అని తెగేసి చెప్పాడు. నోరు వెళ్లబెట్టి ఆశ్చర్యపోవడం మావంతయింది. ఇక్కడే కాదు ఢిల్లీలో ఏ గవర్నమెంటు ఆఫీసులోనూ పాస్ పోర్ట్ చెల్లదని తరువాత అర్థమయింది. ఆహ ఏమి నా దేశ సౌభాగ్యము...ఈ దేశ పౌరునిగా ముద్ర వేసిన ప్రభుత్వానికే ఇది చెల్లదు అని తేల్చిచెప్పుచున్నారు!

సరే ఇంకేం చేస్తాం లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఒకటిచ్చి అప్లికేషన్ తెచ్చుకున్నాం. నింపి ఒక కౌంటర్ లో ఇచ్చాం. "ఇక్కడ కాదు" అని గసిరింది ఆవిడ. మరెక్కడ అంటే జవాబులేదు. కన్నెత్తి చూడనైనాలేదు. అక్కడెక్కడా help counter లేదు. ఏమి గతి అనుకుంటూ మరో మహానుభావుడిని పలకరించాం. గురుడు కొంచం సాధుజీవిలా ఉన్నాడు...గసరడానికి ఓ పిసరు తక్కువగా "ఆ కౌంటకి వెళ్ళండి" అని సమాధానమిచ్చాడు. అదే పరమాన్నం అనుకుని ఆ కౌంటర్ లో ఇచ్చాము. అతగాడు అఫిడవిట్ కావలన్నాడు. నాయనా, ఇదియునూ భారత ప్రభుత్వం దాఖలు చేసిన పత్రమే, ఇందులో నా అడ్డ్రస్ ప్రూఫ్ కూడా సరిగానున్నది, అఫిడవిట్ ఎందులకు అని అతి మృదువుగా అడిగితిని. "ఎందులకూ లేదు గిందులకూ లేదు ఆ పక్క సందులోకి పోయి అఫిడవిట్ పట్రా" అని ఓండ్ర పెట్టాడు. పక్కసందులోకి పోయి చూచితిమిగదా....ఒక మనుజుడు, నల్ల కోటు ధరియించి, రహదారి పక్కన ఒక బల్లయును, కుర్చీయును వేసుకుని తారసిల్లినాడు. మేము అచ్చటకిబోయి ఓ మనుజుడా మాకు అఫిడవిట్ ప్రసాదింపుము అని శాంతముగా అడిగితిమి. 50 కొట్టు అన్నాడు. ఏమి ఏమేమి, ఒక చిన్న సంకతమునకు 50 రూప్యములా...హెంతమాట హెంటామాట అని అన్నగారి స్టైల్ లో మునివేళ్ళపై లేచి రెట్టించుదామనుకున్నాను గానీ ఆ మానవుడు ఎర్రగా చూసి "అవును, 50 ఇవ్వు" అని గద్దించాడు. మేము ఈ చేతను 50 ఇచ్చి, ఆ చేతను అఫిడవిట్ పుచ్చుకుని మరల RTO కి ఏతెంచితిమి. మాలాంటి సజ్జనులు, అమాయకులు ఒకరోజుకి ఎంతమంచి ఏతెంచెదరో! ప్రతీ ఒక్కని దగ్గర 50 రూప్యములు నొక్కిన అతని ఆదాయము నెలకి ఎంత వచ్చునో లెక్కింప మానవమాత్రునికి సాధ్యం కాదు.

పిమ్మట ఆ form ని సమర్పించుకుని కౌంటర్ తరువాత కౌంటర్ కి వెళుతూ ఉన్నాం. నాలుగో కౌంటర్ లో ఒకమ్మాయి, వయసు 25 కి మించదు...ఎంతసేపు నిల్చున్నా పలకదు, ఉలకదు. పలకరిస్తే కన్నెత్తి చూసిందే తప్ప పెదవి విప్పదు. ఏం చెయ్యాలో తెలియక కొంచం స్వరం పెంచాను. బాణంలా దూసుకొచ్చింది జవాబు "ఏం కాసేపు ఆగలేరా? ప్రతీఒక్కరికీ జవాబు ఇవ్వడమేనా మా పని? మీ అర్జీ చూసాక బదులిస్తాను" అంది. నాకు ఒళ్ళు మండిపోయింది...మేము పశువులమనుకుంటున్నారా, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని స్వరం పెంచాను. నా అర్జీని నా చేతిలో పెట్టి "నీ దిక్కున్నచోట చెప్పుకో నీ అప్ప్లికేషన్ ముందుకి వెళ్ళనివ్వను" అంది. నేను ఇంకాస్త గట్టిగా అరిచాను. చిన్న సైజు రామ-రావణ యుద్ధమే జరిగింది. ఇంత జరుగుతున్నా మిగతా సభ్యులు నోరుమెదపరే! కొందరు ఆసక్తిగా వింటున్నారు, ఇంకొందరు రోజూ ఉండే గొడవేగా అన్నట్టు తమపని తాము చేసుకుపోతున్నారు. అరిచి అరిచి నాకే విసుగొచ్చి పక్క కౌంటర్ కి వెళ్ళాను. అతనికి నాపై జాలేసినట్టుంది...కరుణించి నా అర్జీని ముందుకి తీసుకెళ్ళాడు పెద్దగా చిరాకుపడకుండా. ఈ అగచాట్లు అన్నీ పడ్డాక టెస్ట్ రూములోకి వెళ్ళాను. అక్కడున్న పెద్దమనిషి కుక్కని చూసినట్టు చూసి "అక్కడ కూర్చో, ఆ టెస్ట్ రాయి" అని విసుక్కున్నాడు. అదేదో తగలెట్టి, అతని దగ్గరకెళ్ళి నా పేరులో చిన్న మార్పుని సూచించాను. అంతే అతను కయ్యిమని అరిచాడు "మేమేం పనిపాట లేకుండా ఉన్నామనుకున్నారా మీ ఇష్టమొచ్చినట్టు మార్చడానికి" అంటూ చిందులు తొక్కాడు. నేను అప్లికేషన్లో సరిగ్గానే రాసాను కానీ వాళ్ళు తప్పు టైపు చేసారు అని చెప్పినా వినిపించుకోడే! నిజంగా పురుగుని చూసినట్టే చూసాడు. అప్పటికే నాకు తలనొప్పి వచ్చేసింది. అసహ్యం, విసుగు, కోపం...ఒకటేమిటి చీ ఈ లైసెన్సు నాకవసరమా, ఎంతదూరమైనా నడిచి వెళ్ళిపోతే ఇంతకన్నా హాయి కదా అనిపించింది. చివరి ప్రశ్నగా ఎన్నాళ్లలో learner లైసెన్సు పంపిస్తారు అని అడిగాను. "ఏమో, ఎప్పుడొస్తే అప్పుడొస్తుంది, మాకేం తెలుసు..మీ ఇంటికొస్తుంది అప్పుడు చూసుకోండి" అని సమాధానం. ఇంక అక్కడ ఒక్క క్షణం ఉన్నా మహా పాపం చుట్టుకుంటుంది అన్నట్టు వడివడిగా బయటికొచ్చేసాము. తెలిసినవాళ్ళకి ఈ ఉదంతం చెబితే ఇక్కడ అలాగే ఉంటారు, అలాగే మాట్లాడతారు...అసలు మీకెందుకీ బాధ, మిమ్మలని ఎవరెళ్ళమన్నారు, ఏజెంట్ కి ఇచ్చేస్తే వాడే అన్నీ చేసి పెడతాడు. ఓ 2000 వాడి మొహాన కొట్టండి అన్నారు. అప్పటికే పాలిపోయి ఉన్న మా మొహాలు మరింత తెల్లబోయాయి.....ఇదేమి విచిత్రం! మానవమాత్రులు RTO కి వెళ్ళి లైసెన్సు సులువుగా తెచ్చుకోలేరా! సరే, ఎలాగోల లెర్నర్ వచ్చింది. ఆరు నెలలు గడిచాక లైసెన్సు తెప్పించుకుందామనేలోపు కారు కొన్నాం. మళ్ళీ RTO ఆఫీసు గుర్తొచ్చి ఏడుపొచ్చింది. ఏమిదారి అనుకుంటుండగా ఏజెంట్ విషయం గుర్తొచ్చింది. ఒక driving school కి వెళ్ళి మాట్లాడాము. 15 రోజులు డ్రైవింగ్ క్లాసులు, లైసెన్సు పని కలిపి 4000 అన్నాడు. మూర్ఛ రాబోతుండగా ఆపుకుని సరే అన్నాము.

ఈసారి RTO ఆఫీసు లో బలే తమాషా జరిగింది. మా ఏజెంట్ వెనకల వెళ్లాం. అప్లికేషన్ నింపి ఇచ్చేసాం. అంతే, కాసేపు కూర్చోమన్నాడు. బుద్ధిగా కూర్చున్నాం. ఓ 15 నిముషాలలో వచ్చి అన్నీ అయిపోయాయి అని చెప్పి టెస్ట్ రూముకి పంపించాడు. అక్కడున్న అసిస్టంట్ తో ఏదో చెప్పాడు. నేను కంప్యూటర్ ముందు కూర్చున్నాను. mouse నా చేతిలో లేదు. మొదటి ప్రశ్న వచ్చింది. "జవాబేమిటి?" అన్నాడు. చెప్పాను...అది తప్పయింది. ఇంక అంతే రెండో జవాబు నుండి నేను నిమిత్తమాతృరాలినే....అతగాడే టకటకమని జవాబులు నింపేస్తూ ముందుకి పోతున్నాడు. మధ్యలో కావాలనే కొన్ని తప్పు జవాబులిచ్చాడు. అన్నీ కరక్ట్ అయితే అసలు నిజం తెలిసిపోతుందనో ఏమో! మొత్తానికి 20 కి 16 మార్కులు వచ్చాయి నాకు....కాదు కాదు అతనికి. బయటికొచ్చేసాము. "మీరు వెళ్ళిపోండి మేడం రెండు రోజుల తరువాత లెర్నర్ ఇంటికి పంపిస్తాను" అన్నాడు. ఆహా ఏమిటీ...20 నిముషాలలో అంత అయిపోయిందా!...కేకలు, అరుపులు, తగవులు, చికాకులు లేకుండా! నిజమే! నమ్మబుద్ధి కాలేదు. అబ్బ 4000 లకి ఎంత శక్తి! ప్రశాంతంగా ఇంటికి వచ్చేసాము. రెండు రోజుల్లో లెర్నర్ వచ్చింది.

నెలరోజులలో నేను కారు ఓ మోస్తరుగా నడిపి నేర్చుకునాను. ఇప్పుడు లైసెన్సుకి వెళితే ఎనిమిది వెయ్యమంటారో ఏడున్నర వెయ్యమంటారో ఏం దారి దేవుడో అని బిక్కుబిక్కుమంటూ మా ఏజెంట్ వెనకాల వెళ్ళి మళ్ళీ RTO గుమ్మం తొక్కాము....ఈసారి ఇంకా మజా వచ్చింది. మరో form నింపమన్నాడు. నింపేసి ఇచ్చాము. 10 నిముషములు కూర్చోబెట్టాడు. తరువాత మా ఏజెంట్ మరొకతనితో కలిసి మా దగ్గరకి వచ్చి నన్ను చూపించి "ఈమెకే లైసెన్సు కావాలి, జాగ్రత్తగా మనిషిని చూడు" అని చెప్పేసి దూరంగా కౌంటర్ లో ఉన్న వ్యక్తికి నా పేరు గట్టిగా అరిచి చెప్పి "చూసుకో" అన్నాడు. అంతే, "మీరింక వెళ్ళిపోండి మేడం. ఒక వారం రోజులలోగా లైసెన్సు ఇంటికి తెచ్చి ఇస్తాను" అన్నాడు. నేను విస్తుపోతూ "అయిపోయిందా, మరి డ్రైవింగ్ టెస్టో అన్నాను" మా ఏజెంట్ నన్నో పల్లెటూరిదానిలాగ చూసి, ఓ చిన్ననవ్వు నవ్వి "అవన్నీ అక్కర్లేదులెండి" అన్నాడు. వాహ్ వాహ్...బలే బలే, నాకు కారు నడపడం వచ్చో రాదో చూడకుండా నా చేతిలోకి లైసెన్సు వస్తుంది. ఆహా మన ప్రభుత్వము ఎంత బాగా నడుస్తున్నదో కదా అని మిక్కిలి సంతసించితిమి. ఈ వ్యాపారం చిన్నదేం కాదు. ప్రతీ సందుకీ ఓ డ్రైవింగ్ స్కూలు ఉంది. ప్రతీవాళ్ళు ఈ ఏజెంట్ల ద్వారానే లైసెన్సు తెచ్చుకుంటారు.

అదేరోజు, సరిగ్గా అదే సమయానికి అటుపక్కగా "అన్నహాజారే కి సపోర్ట్ ఇవ్వాలి" అంటూ జెండాలు పట్టుకుని ర్యాలీ వెళుతున్నాది. "ఈ అన్నాహజారే ఏంది భయ్, ఈ అవినీతి ఏంది భయ్, ఏం సమజౌతలే" అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మా చెవులబడింది. అవును, అసలింతకీ అవినీతి అంటే ఏమిటి?

తా.క: అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికైనా ఈ అవినీతి తప్పదు. అది దాని లక్షణం. అమెరికాకి తప్పలేదు, జర్మనీకి తప్పలేదు...మనకీ తప్పదు.

Friday, September 16, 2011

ఎం.ఎస్.జన్మదినం-చిరు కానుక


ఇవాళ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి పుట్టినరోజు. కంచిపట్టు చీర మీద ముత్యం దొర్లినట్టుగా ఉండే ఆవిడ గానం...అమృతం!

పొద్దున్నే లేచి ఆవిడ పాడిన సుప్రభాతం వినని తెలుగిల్లు ఉంటుందా! ఎంత పుణ్యం చేసుకున్నామో ఆవిడ మనకు వరం గా దొరికారు. ఆవిడ గాత్రాన్ని విని మనం జన్మలు ధన్యం చేసుకున్నాం! ఆవిడ గురించి తెలియనిదెవరికి! నేను కొత్తగా చెప్పేదేమీలేదుగాని ఈరోజు ఆవిడ జన్మదిన సందర్భంగా మితృలకు ఓ చిరు కానుక. సుబ్బలక్ష్మి గారూ ఇంగ్లీషులో పాడిన పాట...విని ఆనందించండి.



Friday, September 2, 2011

సహాయం చెయ్యండి...ప్లీజ్! (updated)

Up date -1 (02-09-2011)

ప్రతీక్ కి సొంత అక్కచెల్లెళ్ళు, అన్నాదమ్ములు ఉంటే వాళ్ళ బోన్ మేరో తో ప్రతీక్ బోన్ మేరో 99% మేచ్ అవుతుంది కాబట్టి పని సులువయ్యేది. కానీ ప్రతీకే మొదటి బిడ్డ. తన తల్లి బోన్ మేరో ని టెస్ట్ చేసారు. రిపోర్ట్స్ నిన్న సాయంకాలం వచ్చాయి. తల్లి బోన్ మేరో తో కుదరదని చెప్పారు. కాబట్టి ఆ option కూడా మూసుకుపోయింది. ఇంక డోనర్స్ కోసం వేచి చూస్తున్నారు. కేసు ఇంకా complicate అయ్యింది. ఇప్పుడు డోనర్ involve అయి ఉన్నారు కాబట్టి కావలసిన డబ్బు 20 లక్షలు దాటుతుందని అంచనా. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అది కనుక మంజూరు అయితే 10 లక్షలు వస్తాయి. అయినా కూడా ఇంకా 15-20 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. దయచేసి సహాయం చెయ్యండి. చిన్నారి ప్రతీక్ ని బ్రతికించండి.

Actual (01-09-2011)

ముందుగా బ్లాగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు!

ఈ పండుగ రోజు ఇటువంటి విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు బాధగా ఉంది కానీ తప్పట్లేదు.

నా స్నేహితుడు దూసీ శ్రీనివాస్, చీపురుపల్లి వాస్తవ్యుడు, ఇప్పుడు హిస్టరీలో phd చేస్తూ, DL పాస్ అయి, భద్రాచలం లో గవర్న్మెంట్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. నేను శ్రీనివాస్ MA కలిసి చదువుకున్నాము HCU లో. అతని చెల్లెలు పద్మజ తరువాత మా HCU లోనే ఆంత్రపోలజీలో MA చేసింది. హాస్టల్ లో తను నా రూములోనే ఉండి HCU పరీక్షకి ప్రిపేర్ అయ్యేది. దానితో పద్మ కూడా నాకు బాగా క్లోజ్ అయింది. MA పూర్తి అయిన వెంటనే పద్మజ కి పెళ్ళి అయింది. తన భర్త వైజాగ్ లో ఉద్యోగి. వాళ్ళకి ఆరునెలల క్రితం బాబు పుట్టాడు. బుల్లబ్బాయి గారిని చూసి తల్లిదండ్రులు మురుసిపోతూ పెద్దల ఆశీర్వాదంతో, అందరి సమక్షంలో ప్రతీక్ అని పేరు పెట్టారు. మూడు నెలలు గడిచిన తరువాత రాకుమారుడు ఎనీమిక్ గా ఉన్నాడని తెలిసి డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్ళారు. కొంతకాలం ట్రీట్‌మెంట్ జరిపాక తెలిసిన భయంకరమైన నిజం ఆ తల్లిదండ్రులను, మేనమామను కుదిపేసింది. పిల్లాడికి బోన్ మేరో ట్రాన్స్‌ప్లాన్టేషన్ చెయ్యాలి. ఎక్కడో లక్షలలో ఒకరికి సంక్రమించే ఈ వ్యాధి మా చిన్నారి ప్రతీక్ కి దాపురించడం విచారకరం. ప్రతీక్ కి ఇప్పుడు ఆరునెలలు. తను ఇప్పుడు వెల్లూర్ CMC ఆస్పత్రిలో ఉన్నాడు. బాబుకి నాలుగు వారల లోపు బోన్ మేరో ట్రాన్స్‌ప్లాన్టేషన్ జరగాలి. దానికి 20 లక్షలు ఖర్చు అవుతుంది. నా స్నేహితుడి కుటుంబం మనలాంటి మధ్య తరగతి కుటుంబమే. 20 లక్షలు అంటే భరించలేనంత భారం. నా మితృడు ఎలాగైనా అష్టకష్టాలు పడి fund raise చెయ్యాలని చూస్తున్నాడు. అందులో భాగం గా ఈ కింది బ్లాగు మొదలెట్టాడు. ఈ బ్లాగులో అన్ని వివరాలు ఇవ్వబడ్డాయి. అన్నీ చదివి ఆ చిట్టిబాబుని బతికించడానికి మీకు చేతనైన సహయం చెయ్యండి...ప్లీజ్.


ఈ ఆపరేషన్ నెలరోజులలోపు జరగాలి. మీరు చేసేది ఎంత చిన్న సహాయమైనా సరే ఓ పసిప్రాణాన్ని కాపాడుతుంది. ఏ తప్పు చెయ్యని ఆ చిన్నారి ఆరునెలల వయసులో ఆస్పత్రిలో దీనంగా పడుకుని ఉన్నాడు. ఇంక వాళ్ళ అమ్మ పద్మజ పరిస్థితి వర్ణనాతీతం. మీకు చేతనైన సహాయం చేసి ఆ తల్లిని కడుపుకోతకి దూరం చెయ్యండి. ఆ చిన్నారి మొహం లో నవ్వులు పూయించండి. ఇది హాక్స్ మైల్ కాదు. నన్ను నమ్మండి. ఫోన్ నంబర్లు, బ్యాంకు వివరాలు అన్నీ పైన ఇచ్చిన బ్లాగులో ఉన్నాయి. గుర్తుంచుకోండి...సమయం చాలా తక్కువ ఉంది. నాలుగు వారాలలోపు ఆపరేషన్ జరగాలి. మీ సహయానికి వారి కుటుంబము, నేను ఎల్లప్పుడు కృతజ్ఞులుగా ఉంటాము. సహాయంతో పాటు బాబు తొందరగా కోలుకోవాలని ఆశీర్వదించడం మరచిపోకండి.

Tuesday, August 9, 2011

మాయాబజార్ – పాండవులు లేని భారతం

మాయాబజార్ గురించి మరొక్కసారి...

నిన్న బజ్జులో అందరం మాయాబజార్ గురించి తలుచుకుని కొంతసేపు ముచ్చటించి ఆనందించాం. అలా ముచ్చటిస్తుంటే అంతకుముందెప్పుడో మాయాబజార్ గురించి నవతరంగం లో నేను రాసిన వ్యాసం గుర్తొచ్చింది.

వ్యాసంలో ఉన్న కొన్ని తప్పొప్పులను సవరిస్తూ మళ్ళీ ఇక్కడ....

మాయాబజార్ కొత్తగా రంగులద్దుకున్నవేళ నూతనకళతో మిలమిలా మెరిసిపోతోంది. కొత్తవన్నెలద్దడానికి సరియయిన సినిమానే ఎంచుకున్నారు పెద్దలు. మాయాబజార్ సినిమా ఒక అపూర్వమైన, అనన్యసామాన్యమైన కళాఖండం. ఈ సినిమాకి కథ, కథనం ఒక ఎత్తయితే, పింగళి వారి మాటలు, పాటలు ఇంకో ఎత్తు. నటీనటుల కౌశల్యం సరేసరి. మాయాబజార్ సినిమా తెలుగు సినిమాలోకానికి పెద్దబాలశిక్షవంటిది అని “నరేష్ నున్న” అన్నారు. ఇది అక్షరాలా నిజం.

మాయబజార్ – పాండవులు లేని భారతం. ఈ విషయం, సినిమా ఓ పది సార్లు చూసాకయినా ఎవరికీ తట్టదేమో. నిజం, పాండవుల ప్రస్తావన లేకుండా జరిగే కథ. ఈ కథని పూర్వం "శశిరేఖాపరిణయం" అనే పేరుతో కర్నాటక రాష్ట్రంలో వీధి నాటకాలుగా ఆడేవారట. దానికి ఒక మహోన్నత్తమైన స్థానాన్ని కలిపించింది మాత్రం కె.వి.రెడ్డి-పింగళి ద్వయమనే చెప్పుకోవాలి. ఈ సినిమాకి కె.వి.రెడ్డి గారి దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఆయువుపట్టులయితే, పింగళి నాగేంద్ర గారి సాహిత్య చమత్కారాలు ప్రాణం పోసాయి.

లాహిరి లాహిరి లాహిరిలో పాట నోట నానని తెలుగు ప్రేక్షకులుండరని నా ప్రగాఢ విశ్వాసం. లాహిరి అంటే మాయ అని అర్థం. ఈ ఒక్క పాట ఆధారంగా చేసుకుని కథంతా రూపకల్పన చేస్తారు. "లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా, ఊగెనుగా, తూగెనుగా" అని మొదలెట్టి "రసమయజగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో, ఎల్లరి మనములు ఝల్లనజేసే చల్లనిదేవుని అల్లరిలో" అని ముగించడం పింగళివారికే చెల్లింది. ప్రేమ మాయలో జగమంతా ఓలలాడుతోంది అని ఆరంభించి, ఆ మాయకి కారకుడు శ్రీకృష్ణుడే అని ముగింపు పలకడం ఓ అద్భుతమైన ఆలోచన. మొత్తం కథని ఈ ఒక్క పాటలో చెప్పారనిపిస్తుంది. మాయబజార్ కథకి కీలకమైన వ్యక్తి శ్రీకృష్ణుడు, ఆయన మాయావిశేషంవల్లనే కథ అంతా నడుస్తుంది. ఈ విషయాన్ని ఒక్క పాటలోనే ఎంతో అందంగా పొదిగారు పింగళి.

“చూపులు కలిసిన శుభవేళ పాట” మరో ఆణిముత్యం. “ఆలాపనలు, సల్లాపములు కలకలకోకిలగీతములే, చెలువములన్నీ చిత్రరచనలే, చలనములన్నీ నాట్యములే. శరముల వలనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే, ఉద్యానములో వీరవిహారమే, చెలికడనోహో శౌర్యములే”. ఇంత అందంగా, సంధర్భానికి అచ్చు గుద్దినట్టుగా రాయడం పింగళి వారు ఉగ్గుపాలతో నేర్చిన విద్య అనుకుంటాను. సాధారణంగా మనం ఎవరినైనా చాలరోజుల తరువాత కలిస్తే ముగిసిన కాలపు విశేషాలు ప్రస్తావించుకుంటాం. అన్నినాళ్ళలో ఏమేమి జరిగాయో చెప్పుకుంటాం. అలాగే ఎప్పుడో చిన్నప్పుడు విడిపోయిన శశిరేఖాభిమన్యులు యుక్తవయసులో కలుసుకోగానే వారి గతం గురించి ఒకరికొకరు ఈ ఒక్క పాటలో చెప్పుకునేలా చిత్రీకరించారు. రాకుమారి శశిరేఖ అంతఃపురంలో ఉంటూ సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటివి నేర్చుకుని ఉంటుంది. సాధారణంగా అంతఃపురంలో అమ్మాయిలు అవే చేస్తారు. మరి అభిమన్యుడు - వీరవిద్యలు అభ్యసించి ఉంటాడు. ఈ విషయాలు ఒకరికొకరు చెప్పుకోకుండానే గ్రహించినట్లు ఎంతో పొందికగా రాసారు పింగళిగారు. ఆమె ఆలాపనలు కోకిలగీతాలట, అందాలన్ని చిత్రరచనలట, నడకలే నాట్యమట. అంటే నువ్వు నేర్చుకున్నవన్నీ నాకు కనిపిస్తున్నాయిలే అని చెప్పకనే చెప్తున్నాడు అభిమన్యుడు. నీ బాణాల వేగము, శౌర్యప్రతాపాలను నేను గమనించానులే అని శశిరేఖ అన్యాపదేసంగా చెప్పినట్టు. ఎంత చక్కని ప్రయోగం!

“నీవేనా నను తలచినది”, “నీకోసమే నే జీవించునది” …ఈ రెండు పాటల్లోనూ ప్రేయసీప్రియులు వేరు వేరు ప్రదేశాలలో ఉంటారు. కానీ మొదటి పాట లో విడివిడిగా ఉన్నా కలివిడితనం, రెండవ పాటలో కలివిడిగా ఉండాలనుకున్నా విడివిడిగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. “విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురం కాదా”…..అంటే కలిసి ఉండడం ఒక భావన, విడిపోయి కూడా పరిమళించడం ఇంకొక భావన. ఇవన్నీ ఆలోచిస్తున్న కొలదీ గుబాళించే అనంతమైన సాహితీ సౌరభాలు.

అసలు ఏ పాట తీసుకున్న అందులో భావచాతుర్యం మిళితమై ఉంటుంది. మాయబజార్ సినిమా చూడకుండా పాటలు మాత్రమే వింటే మొత్త కథ అర్థమయిపోతుంది మనకి. అంత భావ సమామ్నాయం ఉంటుంది పింగళి వారి సాహిత్యంలో. మొదటిది “శ్రీకరులు దేవతలు” పాటలోనే ఈ సినిమాలో వచ్చే ముఖ్య పాత్రల పరిచయం జరుగుతుంది. దానితో కథ ఎవరు చుట్టూ తిరుగుతుందో మనకి తెలిసిపోతుంది. తరువాత “అల్లిబిల్లి అమ్మాయికి” పాటలో శశిరేఖాభిమన్యుల మధ్య ఉన్న సంబంధాన్ని చిగురింపజేస్తూ వాళ్ళిద్దరు ఒక దగ్గరలేరనే విషయం తెలియజేస్తారు. “నీవేనా నను పిలచినది” పాటతో వారి మధ్య ఉన్న ప్రగాఢ అనుబంధాన్ని పెంపుజేస్తారు. చూపులు కలిసిన శుభవేళ పాటవల్ల వాళ్ళిద్దరు మళ్ళీ కలిసారని తెలుస్తుంది. “లాహిరి లాహిరి పాట” సరేసరి, అంత తెలుస్తుంది అందులోనే. ‘భళి భళి భళి దేవా” పాటలో శ్రీకృష్ణుడి చక్రం కనిపిస్తుంది. ఘటోత్కచుడి పరిచయ పద్యంలో వారి పాత్ర, “శకుని ఉన్న చాలు” పద్యంలో వీరి పాత్ర ప్రస్పుటంగా గోచరిస్తుంది. “నీకోసమే” పాటలో వారు దూరమయ్యారని తెలుస్తుంది. “అహనా పెళ్ళియంట, వివాహ భోజనంభు” పాటల్లో మాయశశిరేఖగా ఉన్న ఘటోత్కచుని చాణతనం, “సుందరి నీవంటి” లో లక్ష్మణ కుమారుడి బేలతనం కనిపిస్తుంది. “విన్నావ యశోదమ్మ”, “దయచేయండి దయచేయండి” పాటలు, మధ్యలో జరుగుతున్న కథని మనకు చెప్పకనే చెబుతాయి.

ఇక పింగళివారి మాటలహేల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసమదీయులు, తసమదీయులు అన్న పదాలు ప్రతీ ఆంధ్రుని నోటా కొలువుదీరి ఉన్నాయంటే ఆశ్చర్యమేమీ కాదు. “పాండిత్యం కన్నా ఙ్ఞానం ముఖ్యం”, “శాస్త్రం ఏది చెప్పినా ఎప్పుడూ నిష్కర్షగానూ కర్కశంగానే చెబుతుంది, మనం సారాంశం గ్రహించాలి-అంటే శాస్త్రం ఎలా ఉన్నా ఒక సమన్వయం లో ఉంటుందన్నమాట” “ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి” లాంటి నగ్న సత్యాలను ఔచిత్యంగా చొప్పించారు. చినచేపను, పెదచేప, చినమాయను పెనుమాయ అది స్వాహా, ఇది స్వాహా అన్నదాన్లోనే బలహీనవర్గాల బాధలను నర్మగర్భంగా చర్చించారు. “పాండవుల ప్రతాపాల కన్నా, కౌరవుల ఐశ్వర్యాలు గొప్పవి కావు” – సామర్ధ్యాలకు, ఆస్తి అంతస్థులకు సాధారణ సమాజంలో పొంతన లేదన్న విషయాన్ని ఉటంకించారు. ఈ పదాలన్నింటిలోనూ బ్రహ్మాండమైన సాహిత్య స్ఫురణ, సామాజిక స్పృహ కనిపిస్తాయి.

“ఓహోహో నీవా, నీకు తెలియదూ నేనెవరో, తెలియనివారికి చెప్పినా తెలియదు” – అంటే నాకు నువ్వెవరో తెలుసు, నీకు నేను తెలియదూ, ఎదురుగుండా ఉన్న నన్నే గ్రహించలేకపొతే, చెప్తే మాత్రం తెలుస్తుందా…ఎంత సత్యం! నేను ఎవరో నీకు తెలీదు – అన్న దాన్లో ఎంత అర్థముందంటే, అహం బ్రహ్మాస్మి అంటే నేనెవరో తెలుసుకోవాలి, నువ్వెవరో తెలుసుకోవాలి.ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి దాన్లో ఒక కుర్చీ, మంచం, ఇలాంటివన్ని ఉంటాయి. వాటిని చూడగలగాలి, గ్రహించగలగాలి. చూడలేకపోతే, తెలుసుకోలేకపోతే ఎవరైనా చెప్పినా తెలియదు. ఎంత ఔచిత్యం పాటించారో ప్రతీ ఒక్క సంభాషణలోనూ. భావిస్తే ఎంతైనా గ్రహించవచ్చు ఆయన రాసిన మాటలలో. ఒక్క పొల్లు కూడా అనవసరంగా పడదు. ప్రతీ పదంలోను సాహిత్య సంపద, భావ చాతుర్యం గుబాళించి ఉంటుంది. పదాలు వాడడంలో ఆయన బ్రహ్మాండనాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎరుకకుండ వచ్చావు, ఎరుకలేకపోతావు- ఆధ్యాత్మికత- నేనున్నాని తెలుసుకోలేకపోతే నువ్వున్నావని తెలుసుకోలేవు అని భగవంతుడు చెబుతున్నట్టు – అద్భుతం కదూ. ఇంకా అగ్గిబుగ్గీకాకయ్యా, వీరతాడు వంటి పడికట్టు పదాలను తెలుగు ప్రజలనోళ్లలో నానేటట్టుగా చెక్కారు. “సభాపిరికి”, “అలమలం” లాంటి కొత్తపదాలు చక్కిలిగింతలు పెడతాయి. “నచ్చినా నచ్చకపోయినా పెళ్ళికూతురిని పెళ్ళి కొడుకు చూసి తీరాలి అది నా ప్రతిఙ్ఞ” అన్న ఒక్క వాక్యంలోనే లక్ష్మణ కుమారుడి బుద్ధిహీనత గోచరింపజేస్తారు.

ప్రాసలలో ఆయన ఉద్దండపండితుడు. “పేరు చెప్పించి, బిరుదు విడిపించి శరణనిపించిరా” – పేరు చెప్పిస్తే చాలదు, బిరుదు విడిపించి అంటే వాడి పై గెలిచి, దాసోహమనిపించిరావాలి, అమృతం తాగుతున్నట్లనిపించడం లేదూ !

“ఏవడో నరుడు, నన్ను పొడి పొడి చేసాడు సురసూరలాడుతున్నాడు కుర్రాడు"

"వాడిని మసి చేసి, నుసి చేసి పిడికిలించి పట్టుకొస్తాం నాయకా” – ఇలాంటివన్నీ బహుముచ్చటగా ఉంటాయి.

ఘటోత్కచుని పరిచయపద్యం ఆయన పాండిత్య సంపదకు నిదర్శనం.

"అష్టదిక్కుంభికుంభాగ్రాలపై మనశుంభధ్వజముగ్రాలచూడవలదే,
గగనపాతాళలోకాలలోని సమస్తభూతకోటులునాకెమ్రొక్కవలదే,
ఏదేశమైన, నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాలజరుగవలదే,
హై హై ఘటోత్కచ, జై హే ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే
యేనె ఈయుర్వినెల్ల సాశించవలదే,యేనె ఐశ్వర్యమెల్ల సాధించవలదే
యేనె మనబంధుహితులకు ఘనతలెల్ల కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదే"

పింగళి వారి రచనా సామర్ధ్యం గురించి ఇలా ఎంత చెప్పుకున్నా అనంతమైన సముద్రంలో నీటిచుక్కే అవుతుంది. భావిస్తున్న కొలదీ అర్థం, పరమార్థం బోధపడుతుంది. ఇంతటి మహానుభావులు మన ఆంధ్రులకి వరం గా దొరికారు. వారికి శతకోటి, సహస్రకోటి ప్రణామాలు.


Tuesday, August 2, 2011

భూకంపం

చిన్నప్పటినుండీ భూకంపం ఎలా ఉంటుందో, జస్ట్ ఆ భావనని మాత్రం పొందాలని బలే సరదాగా ఉండేది. భూకంపం వల్ల వచ్చే పరిణామాలు వద్దు, ఊరికే ఆ అనుభవం మత్రం కావాలి. ఇది ఒక వింత కోరికగా ఉండేది నాకు. ఓసారి నేను పదో తరగతిలో ఉండగా అనుకుంటా...దీపావళి ఇంకో నాలుగురోజులలో వస్తుందనగా...ఓరోజు రాత్రి 8.00 అవుతుండగా ఇంట్లో సామానులు అదిరిపడ్దాయి. భూకంపం అనుకుని నేను, చెల్లి, అమ్మ బయటకి పరుగు....వెంటవెంటనే భయంకరమైన విస్ఫోటనాలు...వరుస ప్రేలుళ్ళు...అప్పుడర్థమయింది అది భూకంపం కాదని. మరో అరగంటలో వార్త మాదాకా వచ్చింది. అక్కడెక్కడో 5-6 కి.మీ దూరంలో ఉన్న టపకాయల దుకాణాల్లో అగ్నిప్రమాదం...వరుసగా 4-5 కొట్లు తగలబడిపోయాయి. ఎంత పెద్ద ప్రమాదమంటే దూరంగా ఉన్న మా ఇంట్లో సామానులు కదిలాయి. చాలా భయమేసింది, బాధేసింది. కాకపోతే భూకంపం కాదా అన్న చిన్న నిరాశ ఎక్కడో మనసులో తళుక్కుమంది. నా కోరిక అలాగే మిగిలిపోయింది.

జనవరి 19, 2011, ఢిల్లీ - ఇంట్లో ఒక్కర్తినే ఉన్నాను. పొద్దున్న లేచి ఆఫీసుకి బయలుదేరుతుండగా కడుపులో తిప్పుతున్నట్టు అనిపించింది...విరేచనాలు. ఇంక ఆఫీసుకి వెళ్ళే ఓపిక లేక సెలవు పెట్టేసాను. ముందురోజు బయట తిన్నదేదో పడలేదు. వాంతులు అవ్వనంతవరకూ ఫరవాలేదనుకున్నాను. ఆస్పత్రికి వెళ్లలేదు. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాను. కానీ మోషన్స్ తగ్గట్లేదు. పంచదార, ఉప్పు కలిపిన నీళ్ళు తాగాను. మా ఇంటికి ఒక అర కి.మీ దూరంలోనే పేద్ద ఆస్పత్రి...ఫరవాలేదు. పది నిముషాలలో వెళ్లిపోవచ్చు....వాంతి అవ్వలేదు కాబట్టి ధైర్యం. సాయంత్రం వరకు ఓ పది పన్నెండు అయ్యాయి...ఎక్కడలేని నీరసం. కాస్త గ్లూకోజ్ తాగి, మజ్జిగాన్నం తిని అలా హాల్ లో సోఫా మీదే పడుకుని టీవీ చూస్తున్నాను. నిద్ర పట్టట్లేదు...పొద్దున్నుండీ పడుకునే ఉన్నాను. సర్లే అని టీవీలో వస్తున్న అడ్డమైన సినిమాలు చూస్తున్నా. అర్థరాత్రి ఒంటిగంట...రెండు...ఉహూ, నిద్ర రావట్లేదు. రెండున్నర అవుతుండగా సోఫా, టీవీ దడదడలాడిపోయాయి. వేగంగా ఊగుతున్నాయి. భయమేసింది, ఒక అరక్షణం ఏమీ అర్థం కాలేదు. ఒక్క గెంతులో కిందకి దూకి బయటకి పరుగెత్తాను. మా ఇల్లు మూడో ఫ్లోర్ లో....తలుపు తీసి బయటకు వెళ్ళాక అనిపించింది చేతిలో సెల్ అయినా ఉంటే బావుంటుందని. మళ్ళీ లోపలికి వెళ్ళి ఎదురుగా కనిపించిన సెల్ తీసుకుని లేప్టాప్ కోసం చూసాను....కళ్ళ ఎదురుగా కనిపించలేదు, బయటకి పరిగెత్తాను. మెట్లు దిగబోతుండగా డౌటొచ్చింది, నిజమేనా? అని. మెట్ల దగ్గర ఎలాంటి కదలిక ఉన్నట్టు తోచలేదు. మళ్ళీ ఇంట్లోకి తొంగి చూసాను. టీవీ, సోఫా ఊగిపోతున్నాయి. డైనింగ్ టేబిల్ కుర్చీలు కదులుతున్నాయి. వెంటనే ఇంటికి తాళం పెట్టి మెట్లు దిగేసాను. మూడు అంతస్థులు దిగేసి చుట్టూ చూసేసరికి మా సొసైటీ అంతా ప్రశాంతమైన నిద్రలో ఉంది. అక్కడా అక్కడా 3-4 మనుషులు తిరుగుతున్నారు తప్ప అలికిడి లేదు. ఒక ఫ్లాట్ లో ఇద్దరు బాల్కనీ లో నిలుచుని కబుర్లు చెప్పుకుంటున్నారు. గార్డ్ దగ్గర ఇద్దరు-ముగ్గురు నిలుచుని మాట్లాడుతున్నారు. మరేమీ ఆలోచించకుండా గార్డ్ దగ్గరకి పరుగెత్తాను. వాళ్ళని అడిగాను ఇక్కడేమైనా భూకంపం వచ్చిందా అని? వాళ్లు అలాంటిదేమీ లేదు అన్నారు. నాకు చాలా భయమేసింది...ఇంటికి ఒంటరిగా వెళ్ళే ధైర్యం లేదు. దొంగ ఎవరైనా వచ్చి బాల్కనీలోకి దూకి తలుపులూ అవీ బాదాడా? ఈ ఊహ రాగానే మరింత గజగజ...అయినా మా సొసైటీలో దొంగతనాలు జరిగే అవకాశమే లేదు....చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకైనా మంచిదని ఆ మాటే గార్డ్ తో చెప్పి ఇంటివరకూ రమ్మన్నాను. అతగాడు నాతో ఇంటిలోపలకి వచ్చి, బాల్కనీలోకెళ్ళి అన్నీ చూసాడు. మళ్ళా ఇంట్లో వాడు, నేను ఇద్దరమే...ఇదే అలుసుగా తీసుకుని వాడేమైనా చేస్తాడేమో అని వంటింట్లోకెళ్ళి చిన్న కత్తి తీసుకుని వాడి వెనకాలే వెళ్ళాను. అతను పాపం అన్నీ చూసి "ఏమీలేదు మేడమ్, మీరు ఊరికే భయపడుతున్నారు...హాయిగా పడుకోండి" అని వెళ్ళిపోయాడు. బతుకుజీవుడా అని కత్తి వంటింట్లో పెట్టేసి, అతను వెళ్ళాక తలుపులు వేసుకుని కూర్చుని ఆలోచించడం మొదలెట్టాను...భ్రమా, భ్రాంతా, చిత్తచాంచల్యమా...ఏమిటి? పొద్దున్నుండీ ఉన్న నీరసం వల్ల మెదడులో ప్లేట్లు ఏమైనా కదిలి అలా అనిపించాయా? అలా అనుకోవడానికి మనసొప్పుకోవట్లేదు. నేను బాగా చూసాను, అన్నీ కదిలాయి. రెండోసారి కూడా చూసాను.....వస్తువులు కదలడం, కాళ్ళు కంపించడం...నేను ఫీల్ అయ్యాను...ఇది నిజం. ఇలా ఆలోచిస్తున్నకొద్దీ ముచ్చెమటలు పోసాయి. మర్నాడు ఎవరిని అడిగినా అలా మాకేమీ అవ్వలేదు అనే జవాబు. ఇంటికి ఫోన్ చేసి చెబితే నీ చిత్తచాంచల్యమే అని ఖరారు చేసేసారు. నాకు మాత్రం అదొక పెద్ద మిస్టరీ లా ఉండిపోయింది. నమ్మలేని నిజం...నా భ్రాంతి అనుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు. నా వెధవ బుర్రకి న్యూస్ పేపర్లు చూడాలన్న జ్ఞానం కలుగలేదు, రోజూ దీని గురించే ఆలోచిస్తూ కొన్నాళ్ళకి మరచిపోయాను (తాత్కాలికంగానే).

మళ్ళీ...ఉగాది రోజు, 2011 - మా అత్తయ్య కొడుకు, ఆంధ్ర భవన్ లో ఉగాది వేడుకల్లో భాగంగా కచేరీ ఇవ్వడానికి వచ్చాడు. తను వయొలిన్ విద్వాంసుడు. ముందురోజు వరల్డ్ కపు ఫైనల్స్ మా ఇంట్లోనే చూసి మర్నాడు పొద్దున్నే వాడు ఏ.పీభవన్ కి, మేము ఆఫీసుకి. సాయంత్రం కచేరికి వస్తాములేరా అని చెప్పాము. సరే ఆరోజు పని అంతా త్వరగా పూర్తి చేసుకుని 5.30 కల్లా దుకాణం కట్టేసి ఏ.పీ భవన్ కి వెళ్ళాలని ప్లాను. 5.00 అవుతుండగా నా కళ్ళ ముందు ఉన్న మానిటర్ ఊగసాగింది. నేను కూర్చున్న కుర్చీ ఊగిపోతోంది. కిందకు దిగుదామంటే దిగలేకపోయాను. సిస్టం ఊగిపోతుంటే దానివైపు భయంగా చూస్తూ ఉన్నాను. అంతే, ప్రకంపనాలు ఆగిపోయాయి. ఒక్క నిముషంలో మళ్ళీ మొదలు...మానిటర్, కుర్చీ అదిరిపోతున్నాయి. ఎలాగోలా దూకి (కిందపడ్డంత పని జరిగింది) నా గదిలో నుండి బయటకి వచ్చేసరికి ఆఫీసులో అందరూ బయటకి వచ్చారు. గోలగోలగా ఉంది. భూకంపం అని అందరూ అరుపులు....నాకు ముచ్చెమటలు పోసాయి. కిందకి పరుగెడదామంటే మా ఆఫీసు ఐదో అంతస్థులో ఉంది. అందరూ గోలగోలగా అటూ ఇటూ పరిగెడుతున్నారు...మరో రెండు నిముషాల్లో అన్ని కంపనాలు ఆగిపోయాయి. అందరూ సర్దుమణిగారు. మరో ఐదు నిముషాలు వేచి చూసి ఇంక కంపనాలు రావు అని నిర్ధారించుకున్నాక "హమ్మయ్యా గండం గడిచింది" అనుకున్నాం. ఇంక అందరూ గుంపులు గుంపులుగా చేరి దీని గురించే మాటలు. అప్పుడు...సరిగ్గా అదే సమయంలో....నా సహ ఉద్యోగి అన్నాడు "మీకు గుర్తున్నాదా, జనవరిలో రాత్రి 2.00 గంటల ప్రాంతంలో ఇలాగే పెద్దగా వచ్చింది. పడుకున్నవాళ్ళం నేను నాభార్య భయపడి బయటకి పరుగెత్తాం" అని చెప్పాడు. ఆ అద్దీ...ఇప్పుడు క్లూ దొరికింది...వెంటనే నేను అడిగాను "జనవరి 19 కదా...రాత్రి 2.30 కి కదా...బాగా కంపనాలు వచ్చాయి కదా...చాలా భయం వేసింది కదా". "అవును" అని నలుగురైదుగురి సమాధానం. హమ్మయ్య అయితే ఆరోజు వచ్చింది భూకంపం అన్నమాట... నా చిత్తచాంచల్యమూ, భ్రాంతి కాదన్నమాట. ఎట్టకేలకు నా చిక్కుముడి విడిపోయింది. కానీ కాళ్ళలోంచి సన్నటి వణుకు వెన్నెముకకి పాకింది. అంటే...అంటే ఆరోజు నేను ఒక్కర్తినీ ఉన్నరోజు భూకంపం వచ్చిందన్నమాట...అది చిన్నదేకానీ భూకంపమేకదా! చాలా భయమేసింది. ఈరోజు...ఈరోజు కూడా భూకంపమే...వెర్రెక్కినట్టయింది...ఏం జరుగుతోంది. భూకంపం అన్న సరదా లేదు పాడు లేదు....అసలేం జరుగుతోంది ఇక్కడ. వెంటనే గూగలోడి సహాయం తీసుకున్నాను. తేలిన విషయమేమిటంటే "ఢిల్లీ లో ప్రకంపనాలు సర్వసాధారణం. ఎక్కడో పాకిస్థాన్ లోనో, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోనో భూకంపం వస్తే ఢిల్లీలో అదురుతుంది. రిక్టరు పై 5 నుండి 5.5 వరకూ నమొదయింది ఇంతవరకూ. 6 దాటితే ప్రమాదం సంభవించవచ్చు. 2009 లో ఒకసారి పెద్ద ప్రకంపనాలే వచ్చాయి. అప్పుడు కాస్త ఆస్థి నష్టం జరిగింది (అదే యేడాది నేను ఢిల్లిలో అడుగు పెట్టాను :P). ఇప్పటివరకూ వచ్చిన భూకంపాలలో అదే పెద్దది". ఇదంతా చదివాక భయం తగ్గిందో, పెరిగిందో తెలీని స్థితి....కానీ అస్తమానం ఇలా వస్తుంటే ఎలా? సరే అక్కడ మా వాడి కచేరీ మొదలయిపోతుందేమో అని ఆఘమేఘాలమీద పరిగెత్తాం ఏ.పీ భవన్ కి. మేము వెళ్లేసరికి ఇంకా గంట టైము ఉంది అన్నాడు. ఈ భూకంపం ధాటికి మా వాడు బెదిరిపోయాడు. వాళ్ళ ట్రూపు మూడో అంతస్థులో ఉందిట. రెండో అంతస్థులో కూచపూడి నృత్యం చెయ్యడానికి వచ్చిన ట్రూపు ఉంది. మావాడు అప్పుడే స్నానం చేసి వచ్చి తువ్వాలుతో ఉన్నాడు. కంపనాలు రాగానే కిందకి పరుగో పరుగు అలా తడి తువ్వాలుతోనే. ఆ నృత్యకళాకారులలో అమ్మాయిలు అప్పుడే డాన్సు బట్టలు వేసుకుంటున్నాను. ఈ దెబ్బకి వాళ్ళు జడిసిపోయి అలా సగం సగం బట్టలతోనే కిందకి పరుగులుట. కాస్త కుదుటపడ్డాక అందరూ ఎవరి గదులకి వాళ్ళు చేరుకున్నారు. మొత్తానికి ఏ.పీ భవన్లో అల్లకల్లోలమైపోయింది. మా వాడు ఒకటే వణుకు...మేము వాడికి పరిస్థితి వివరించి చెప్పాం. "మీరిక్కడుండొద్దు...వచ్చేయండి మనవైపుకి...మీ గురించి ఇలా భయపడుతూ మేము ఉండలేము...ఈ ఉద్యోగాలు వద్దు పాడూ వద్దు" అని వాడు ఒకటే గోల. ఎలాగోలా వాడికి సర్దిచెప్పి కచేరీ మొదలయ్యేలోగా వాడిని కూల్ చేసి పంపించాం స్టేజి మీదకి. ఆ రోజు రాత్రి వార్తలలో ఈ విషయం చెప్పారుట. అమ్మావాళ్లు ఫోను..."ఏమయింది, మీరంతా బాగానా ఉన్నారా?" అని. అందరికి భయం లేదని సర్దిచెప్పాం. మర్నాడు పేపర్లో వార్త...నిన్న సాయంత్రం ఢిల్లీలో కొన్ని ప్రాంతాలలో భూకంపం అని.

ఇంక అది మొదలు నెలా పదిహేను రోజులకో, నెలకోసారో చిన్న చిన్న ప్రకంపనాలు తెలుస్తూనే ఉన్నాయి. నాకు ఎక్కడ ఏ శబ్దం వచ్చినా, గిన్నెలు కదిలినా...ఇంట్లో వస్తువులు కదిలినా నాకు ఇదే భయం. పనిమనిషి ఇల్లు తుడుస్తుంటే టీవీ కదిలింది...పేపరు చదువుకుంటున్నదాన్ని భయంతో దిగ్గున లేచి నిల్చున్నా. నా గుండె ఎప్పుడు అలర్ట్ గా ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న కదలిక కనిపించినా నేను అలర్ట్ అయిపోతాను. పరిస్థితి ఎలా తయారయిందంటే గాలికి పేపరు కదిలినా నా మెదడు అలర్ట్ అయిపోతుంది. కానీ ఎన్నాళ్ళని? చాలా విసుగొచ్చేస్తోంది. నా భయానికి, విసుగుకి తోడు....1. ఇల్లు -మేముండే ప్రాంతాలలో ఈ ప్రకంపనాలు ఎక్కువగా తెలుస్తాయట. 2. ఆఫీసు - మా ఆఫీసు "L" షేప్ లో రెండు పెద్ద బిల్డింగుల మధ్య ఒక వారధిలా ఉంటుంది ఐదో అంతస్థులో. L లో అడ్డగీతేమో ఒక బిల్డింగులో ఉంటుంది. నిలువు గీత వారధిలా ఉంటుంది. ఆ నిలువు గీత కి సరిగ్గా మధ్యలో నా సీటు. వారధిలా ఉండడం వల్ల కంపనాలు ఎక్కువగా తెలుస్తాయి. నా ఖర్మకి ఈ ఎక్ష్‌ట్రా ఫెసిలిటీస్ ఒకటి. మొన్ననే ఓ 4-5 రోజుల క్రితం ఆఫీసులో కుర్చీలు, టేబిళ్ళూ దడదడ...నేను గజగజ! ఇప్పుడు కాస్త అలవాటయిందిగానీ తీవ్రత ఎంత ఉంటుందో తెలీదు కాబట్టి ప్రతీసారి వణుకు మొదలయి కాసేపట్లో సర్దుకుంటుంది.

ఏ ముహూర్తాన భూకంపం ప్రకంపనాల్ని అనుభవించాలని కోరుకున్నానో...అడ్డు ఆపు లేకుండా తెలుస్తున్నాయి. తథాస్తు దేవతలు ఉంటారని ఇందుకే అంటారు కాబోలు!



Thursday, July 28, 2011

చిత్రలేఖనం - ఓ వైవిధ్యమైన దృక్కోణం - ఆంజనేయులు

"కళతో లీనమయ్యే ఏ కళాకారుడైనా తన కళాసృష్టి ముగించాక దానికేసే కొద్ది క్షణాలు తమకంగా చూసుకుంటాడు.ప్రసవవేదన పడి బిడ్డను కన్నాక తల్లి ఆ బిడ్డ కేసి చూసుకోడానికి, అలానే ఒక కళాకారుడు తన "సృష్టిని" చూసుకోడానికి మధ్య తేడాలేదు." అని ఎక్కడో చదివాను.

ఊహకి రూపమిచ్చి, జన్మనిచ్చే ఒకే ఒక సాధనం చిత్రలేఖనం. భావవ్యక్తీకరణకి తిరుగులేని సాధనం చిత్రలేఖనం. ప్రకృతి అందాలను, జీవితపరమార్ధాలను, సంప్రదాయలను, చరిత్రను, భవిష్యత్తులోని ఆశలను అన్నిటినీ కుంచెనుండి జాలువార్చగల కళాకారుని ఊహ అద్వితీయం. అటువంటి ఊహాశక్తిగల కళాకారుడిగా పుట్టడం ఒక అదృష్టం. అటువంటి ఒక అదృష్టవంతుడు ఆంజనేయులు ఉరఫ్ అంజి.

ఆర్కూట్ పరిచయమైన కొత్తల్లో నా పైంటింగ్స్ కొన్ని అందులో పెట్టాను. ఒకరోజు ఒక మెసేజ్ వచ్చింది. మీ బొమ్మలు బావున్నాయి, నా బొమ్మలు కూడా చూడండి అని. సహజంగానే పొంగిపోయి వెళ్ళి అతని ప్రొఫైల్ చూసాను. చాలా మామూలుగా ఉన్నాడు. సరే బొమ్మలు చూద్దామని వెళ్ళాను...అంతే ఆశ్చర్యం, అద్భుతం....అతను వేసిన బొమ్మలు చూసి చేష్టలుడిగిపోయాను. అతను ఎంత పెద్దచిత్రకారుడో తెలిసాక నా బొమ్మలు బావున్నాయి అని మెచ్చుకున్న అతని మంచి మనసుని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. మైల్ చేసాను మీ అంత గొప్ప కళాకారుడు నా బొమ్మలను బావున్నాయి అనడం నా అదృష్టం అంటూ. చాలా సాదాసీదాగా వచ్చింది జవాబు. నాకు ఉత్సాహం వచ్చింది. నా బొమ్మలని కొన్నిటిని పంపించాను. వాటిని ఎలా అభివృధి పరుచుకోవలో వివరిస్తూ మైల్ ఇచ్చారు అంజి. అలా మొదలైంది మా పరిచయం 2007 లో.

నల్గొండ జిల్లలో, గారిడెపల్లి గ్రామంలో లక్షమ్మ, సత్యం దంపతులకు 1976 లో జన్మించిన ఆంజనేయులు విద్యాభ్యాసం అక్కడే కొనసాగించారు. చిన్నతనంలో commercial signboard ల మీద పైంటింగ్ వేసేవారు. ఆ తరువాత చిత్రకళపై ఉన్న ఆసక్తి తో హైదరాబాదులో JNTU college of Fine Arts లో విద్యనభ్యసించారు.

ఒక్కో కళాకరునిది ఒక్కో శైలి, ఒక్కో రకమైన చిత్రం. ఈ వైవిధ్యానికి కారణం అతడు/ఆమె జీవితాన్ని, సమాజాన్ని చూస్తే దృష్టి కోణం. అంజి గారి ఊహ ఎప్పుడూ ఒక తెల్లని గోడ కి అతుక్కున వస్తువులు, దాని నీడ చుట్టూ తిరుగుతుంటాయి. జీవితం అంటే అనంతం కాదు...అది ఒక చట్రంలో బంధించబడి ఉంటుంది. It is Specific, Precise and Finite.....కాబట్టి ఏది చేసినా perfect గా గోడకు మేకు కొట్టినట్టు చెయ్యాలి అని చెబుతున్నట్టు తోస్తాయి. తన చిత్రాలు ఊహాప్రపంచంలో కొట్టుకుపోతున్నట్టు ఉండవు. ఇక్కడలేనిదేదో చూపించవు. మన చుట్టూ ఉన్న విషయాలే, మనకి తెలిసిన వస్తువులే కేన్వాస్ పై కనిపిస్తాయి. తన బొమ్మలు మనల్ని వేరే ప్రపంచానికి తీసుకుని వెళ్ళవు కానీ ఈ ప్రపంచంలోనే, ఈ మనుషుల మధ్యనే ఒక కొత్త భావాన్ని కలిగిస్తాయి. ఈ లోకాన్నే మరింత అందంగా చూపుతాయి.

ఫొటో తీసారా లేదా బొమ్మ వేసారా అని విస్మయం కలుగుతుంది. His observation capacity is mind blowing! తన ప్రతిభ అసాధారణం. ఎన్నో రకాల పైంటింగ్స్ చూసిన నాకు "ఇలా కూడా వెయ్యొచ్చా" అనిపించింది తన బొమ్మలు చూసాక. ఈ చిత్రాలను చూస్తే మీకూ అలాగే అనిపిస్తుంది.





మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అంజి గారూ చాలా exhibitions కండక్ట్ చేసారు ఇప్పటివరకూ....వాటి వివరాలు:

TANGERINE ART SPACE “TURN OF THE TIDE”
THE GRAND BALL ROOM, THE TAJ WEST END,
BANGOLORE, 2011,INDIA

LATTITUDE 28 ART GALLERY " THE ANNUAL"
NEW DELHI 2011, INDIA

INDIA FINE ART GALLERY "HY-TIMES"
MUMBAI 2011, INDIA

KALAKRITI ART GALLERY‘PENTAGRAM’
HYDERABAD 2010, INDIA

KALAKRITI ART GALLERY,
HYDERABAD 2009, INDIA

HASTA GALLERY ' A LONG SHORT CUT '
HYDERABAD 2009, INDIA

OPEN EYED DREAMS ‘ VISIBLE INVISIBILITIES’
COCHIN 2008, INDIA

KANVAS ART GALLERY ‘COLORS OF HYDERABAD’
KOLKATTA 2008, INDIA

OPEN EYED DREAMS 'MYSTERIES:PICTURES OF MYSTICAL MEMORIES'
COCHIN 2007 , INDIA

OPEN EYED DREAMS 'THE DOUBLE',
COCHIN 2007, INDIA

HASTA GALLERY, 'LOOK AGAIN"
HYDERABAD 2007, INDIA

KALAHITA ART FOUNDATION
HYDERABAD 2006, INDIA

SHILPARAMAM,
HYDERABAD 2006, INDIA

ఇప్పుడు ఈ జూలై 31 న బెంగళూరులో ఒక exhibition నిర్వహించబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు వెళ్ళి చూడవచ్చు, నచ్చితే తన బొమ్మలు కొనుక్కోవచ్చు.


అంజి గారు బోలెడు పుస్తకాలు చదువుతారు. నాకు MARIA ABROMOVICH అనే చిత్రకారిణి గురించి ఆవిడ వేసిన live performance photos గురించి నాకు చెప్పేవారు. అలాగే arts and feminism గురించి కూడా చెప్పేవారు. తను వేసిన బొమ్మలు పూర్తయినవి, సగం వేసినవి నాకు చూపించేవారు. ఇప్పటివరకూ తనని ముఖాముఖి కలవకపోయినా తన స్నేహం నాకు అపురూపం.

చిత్ర కళకి పరిమితులు లేవు. ఎటువంటి భావననైనా ఆవిష్కరించగల శక్తి ఈ కళకి మాత్రమే ఉంది. అటువంటి చిత్రకళను తన సాధనతో, అకుంఠిత దీక్షతో సొంత చేసుకున్న ఆంజనేయులు గారికి హేట్స్ ఆఫ్. ఇంతటి అపురూపమైన స్నేహం నాకు లభించడం నా అదృష్టం.