StatCounter code

Tuesday, February 23, 2010

కనివిని ఎరుగని ఈ కల...

ఆ మధ్య వచ్చిన కొత్త మాయబజార్ లోది ఈ పాట.
సినిమా బాగానే ఉంటుంది, అద్భుతం అని చెప్పను కానీ చూడదగినదే. ఈ సినిమా 2006 లో వచ్చింది.

చలంగారి కథ ఆధారంగా గ్రహణం సినిమా తీసి, నేషనల్ అవార్డ్ సంపాదించి, ఈ మధ్యనే అష్టా చమ్మ అనే కామెడీ సినిమా తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణే దీనికి కూడా దర్శకుడు. కాస్త పూరాణాలతో జతపడ్డ సినిమా ఇది. రాజా, భూమిక హీరోహీరోయిన్లు. S.P. బాలసుబ్రహ్మణ్యం కుబేరుడిగా, జయలలిత ఆయన భార్యగా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం నారదుడిగా వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.

కుబేరుడు ఆయన శాపాలు - మానవునికి సహాయం - శాప విమోచనం అన్న అంశాలతో ముడిపడి ఉంటుంది కథ. కుబేరుడు తన స్వార్ధానికి, కష్టాల్లో చిక్కుకుని ఉన్న మానవుని ఉపయోగించుకోజూస్తే ఆయన కూతురు, నారదులవారు, ఇంకొద్దిమంది గంధర్వులు ఒక మంచి మనిషికి ఎలా సహాయపడ్డారు అనేదే మూలాంశం.

సినిమా మాట ఎలా ఉన్నా ఇందులో ఉన్న ఆరు పాటలు ఆరు ఆణిముత్యాలు. సిరివెన్నెల సాహిత్యం గురించి వేరే చెప్పాలా. ఆయన సాహిత్య ప్రక్రియల గురించి చెప్పాలంటే ప్రత్యేకం గా ఒక పోస్ట్ రాయాలి. చక్కని సంగీతాన్ని అందించే కె.ఎం.రాధాకృష్ణన్ తన ఉనికిని మళ్ళీ చాటుకున్నారు.

ఈ పాటలు అంత పాపులర్ అయ్యాయో లేదో నాకు తెలీదు, ఎందుకంటే అప్పుడు ఇప్పుడూ కూడా టివీలోనూ, రేడియోనూ ఈ పాటలను చాలా అరుదు గా విన్నాను.

"ఇప్పటికింకా నావయసు నిండా పదహారే" అన్న పాటల మధ్యలో "వరలాస్యాల వైభోగాల వయసే తెగ తుళ్ళిపడగా" అని రాస్తే మరి హిట్ అవ్వదేమో నాకు తెలియదు.

ఇందులో నాక అన్నిటికన్నా నచ్చిన పాట...కుబేరుని కుమార్తె మొట్టమొదటిసారి భూలోకానికొచ్చినప్పుడు ఆ అందాలను చూసి పరవశించి పాడే పాట.


పల్లవి: కనివిని ఎరుగని ఈ కల, నిజమని పలికెను కోకిల,
ప్రతి ఒక అణువున నేడిలా, అవనికి వచ్చెను నవకళ,
అలరులు కురిసిన ఈ ఇల మెరిసెను నూతన వధువులా,
తొణికిన తూరుపు వెలుగిలా పుడమికి అలరెను మేఖల.

చరణం1: చెదిరే అలల ఝంకారాల ఝరులే జలకన్యకురులా,
హిమతీరాల సుమగంధాల తెరలే వలపుతిమ్మెరలా,
మధుమాసాల ఋతురాగాల జతులే వనరాణి శ్రుతులా,
అరవిందాల మకరందాల ఋతువే చిలిపితుమ్మెదలా,
విరిసిన హరివిల్లే రంగులవిరిజల్లై చిలకరించె భూమిపైన తొలకరులే.

చరణం2: శిఖిపించాల సఖిలా నేడు మనసే తొలిపురులు విడగా,
వరలాస్యాల వైభోగాల వయసే తెగతుళ్ళిపడగా,
పలు అందాల జగతీ చూసి పలుకే మరిమూగవోగా,
అతిలోకాల సౌందర్యాల లయలే ఇలనల్లుకోగా,
తన్మయమై నేనే ధన్యతనే పొందే తరుణమేదో ముందు నిలిపె క్షణములనే.

కనివిని ఎరుగని ఈ కల..... (పల్లవి)


శిఖిపించాల సఖిలా నేడు మనసే తొలిపురులు విడగా.... అనందంతో మనసే మయూరమై ఆడింది అని చెప్పేస్తే మనకి సిరివెన్నెలకి తేడా ఏటుంటది, సిరివెన్నెలన్నాక కాస్త కలాపోసనుండొద్దూ (రావు గోపాలరావు డవిలాగు)

వరలాస్యాల వైభోగాల వయసే తెగతుళ్ళిపడగా...కుబేరుని కుమార్తె కదా మరి

మధుమాసాల ఋతురాగాల జతులే వనరాణి శ్రుతులా,
అరవిందాల మకరందాల ఋతువే చిలిపితుమ్మెదలా......ప్రకృతి అందాలను ఇంతకంటే ఉన్నతంగా వర్ణిచడం సాధ్యామా !

అలరులు కురిసిన ఈ ఇల మెరిసెను నూతన వధువులా,
తొణికిన తూరుపువెలుగిలా పుడమికి అలరెను మేఖల...భావగర్భితమైన అంత్య ప్రాసలంటే ఇవి కావా!

ఈ పాట మొదటిసారి విన్నప్పుడు మాత్రం నేను ఇలా పాడుకున్నాను....
తన్మయమై నేనే ధన్యతనే పొందే తరుణమేదో ముందు నిలిపె క్షణములనే !













Monday, February 1, 2010

నా బొమ్మలు....

నావంటే నావి కావు, నేను వేసినవి.
ఇవన్నీ నేను ఓ పన్నెండు సంవత్సరాల క్రితం వేసినవి.


నర్తనశాల సావిత్రి


మిస్సమ్మ సావిత్రి


ఘంటసాల



ఘటోత్కచులవారు...నా మారురూపం...హి హి హి


మన రేలంగే....అలా అనిపించట్లేదా?


రఫీసాబ్...my all time favorite


ఇప్పుడు ఈ బొమ్మలు చూస్తున్న వారికో ప్రశ్న.
ఈ కిందిది నేను పూర్తిచేయని బొమ్మ...ఎవరో చెప్పుకోండి చూద్దాం? క్లూ ఇమ్మంటారా....ఇతనిని తెలియని వ్యక్తి భారతదేశంలో ఉండరు