StatCounter code

Wednesday, July 6, 2011

పరీక్షలమ్మో పరీక్షలు !

ఈ మధ్య పిల్లలందరూ పరీక్షలు, ర్యాంకులనీ తెగ హడావుడి చేసేసారుగా...అవన్నీ చూస్తే నా పరీక్షల హడావుడిగుర్తొచ్చింది.

చిట్టి సౌమ్యకి పరీక్షలతో ఎన్ని కష్టాలో! అసలు చిన్నప్పటినుండీ పరీక్షలంటే అస్సలు ఇష్టముండదు...వెధవ పరీక్షలుఎందుకొస్తాయో అని విసుక్కునేది. చిన్నప్పటినుండీ ఇష్టమున్న పని చాలా హాయిగా చేస్తూ ఇష్టం లేని పని అస్సలుచేసేది కాదు. అదే సూత్రం పాఠాలకీ వర్తించేది. ఇష్టమున్న సబ్జెక్టులు బాగా చదివి, ఇష్టం లేనివి పక్కకు పెట్టేసేది. దానితోపరీక్షలొచ్చేసరికి ఎడతెగని కష్టాలు పాపం! పరీక్షలయిపోయిన రోజు ఇంక పండగే పండగ. :)

ఓసారి తొమ్మిదో క్లాసులో ఏం జరిగిందంటే....(ఇంక "ఉత్తమ స్త్రీ" లోకొచ్చేస్తా :P).

ఆఫ్ ఇయర్లీ పరీక్షలన్నమాట. చివరి పరీక్ష సోషలు. ఆ సోషల్ టీచర్ మహా కరుకు...ఆవిడని చూస్తే పిల్లలందరికీ వణుకు. ఒకే ఒక్క తిట్టు తిట్టేదావిడ..."నవరంధ్రాలు మూసుకుని పాఠం వినండి". అంతే ఎక్కడ దొంగలు అక్కడే గప్‌చుప్. ఈ ఆఫ్ ఇయర్లీ పరీక్షలలో లాస్ట్ పేపర్ సోషలు-ఆవిడది. తలుచుకుంటేనే నాకు ఉత్సాహం వెల్లివిరిసింది...ఆహా ఇంకొక్క రోజు...ఇంకొక్క పరీక్ష....అంతే ఇంక సెలవులిచ్చేస్తారుఅని మురిసిపోతున్నాను. అదే ఆనందాన్ని మనసులో నింపుకుని పొద్దున్నే బడికెళ్ళి పరీక్ష బరికేసాను. ఒక అరగంట ముందే రాసిపారేసాను. రాయడం ముగియడమేమిటి, క్లాసు నుండి బయటకి ఒక్క అంగలో దూకబోతుంటే వెనుకనుండి ఆ సోషలు టీచర్ కంచు కంఠం..."రేపు బడి ఉంది, ఎల్లుండి నుండి సెలవులు. రేపు వచ్చేటప్పుడు అసైన్మెంట్ చేసి తీసుకురా" అని వినిపించింది. ఆ..ఇంత పెద్ద పరీక్షే రాసేసాను, అసైన్మెంట్ ఓ లెక్కా అని గ్రౌండ్ కి పారిపోయాను. నాలాగే ఉత్సాహం ఉరకలు వేస్తున్న స్నేహితులు కనిపించారు...వారందరితో పిచ్చాపాటి వేసి, పెద్దపండగ (సంక్రాంతి) కి ఏమేమి కొనుక్కున్నామో ముచ్చటించి తీరికగా మధ్యాన్నం భోజనాలవేళకి ఇల్లు చేరుకున్నా. సుష్ఠుగా తినేసి, కమ్మటినిద్ర తీసి, సాయంత్రం నాన్న ఇంటికొచ్చేసాక బోలెడు కబుర్లు చెప్పేసి, పుస్తకాల సంచి తీసా...సర్దుకుందామని, అసైన్మెంట్ చేద్దామని. అందులో చిత్తు కాగితాలన్నీ ఏరిపారేస్తూ ఒకచోట ఆగిపోయాను. పెద్ద ఠావులు కట్ట. తెల్లకాగితాలు దొంతిగాపెట్టి మధ్యకి మడవబడి ఉన్నాయి. ఓ 5-6 కాగితాలుండొచ్చు. నేను చిత్తు ఎప్పుడూ ఇలా పధ్ధతిగా మడతబెట్టనే, అయినా ఠావు కాగితాలపై చిత్తు రాయనే, ఇవేంటబ్బా! అని విస్మయం చెందుతూ తెరిచి చూసా...నేను పొద్దున్న రాసిన సోషల్ పరీక్ష- జవాబు పత్రం...ఇదెలా వచ్చింది నా సంచీలోకి? అంతా అయోమయంగా అనిపించింది. కెవ్వుమని కేకేసి, కళ్ళుతిరిగిపడిపోయినంత పని చేసాను. మా నాన్నారు పరిగెత్తుకుంటూ వచ్చారు "ఏమయిందమ్మా" అంటూ. నాకు మెల్లిగా విషయం బోధపడింది....పొద్దున్న పరీక్షలయిపోయాయనే సరదాలో జవాబుపత్రం టీచరుకి ఇవ్వకుండా, మడిచి సంచీలో పెట్టేసుకునాను. మరి ప్రశ్నాపత్రం ఏమయినట్టు? సంచీ అంతా వెతికా....కొంపదీసి జవాబు పేపర్ కి బదులు ప్రశ్నాపత్రం టీచరుకిచ్చానా! :O కళ్ళలో నీళ్ళు...కాళ్ళు, చేతులు వణుకు....నోట మాట పెగలట్లేదు. నా చేతిలో కాగితాలందుకుని నాన్నచూసి "ఇదేమిటే" అని అడిగారు. అదే నాకూ అర్థం కావట్లేదు...ఇదెలా నా సంచిలోకొచ్చింది....అయ్యో అసలే ఆవిడ చండశాసనురాలు....ఏమిటి దారి? అప్పుడు మా నాన్నారికి గుర్తొచ్చింది ఆవిడ ఇల్లు మన వీధికి ఎదురువీధేగా..."ఇంటికెళ్ళి ఇచ్చిరా పో" అన్నారు. "అమ్మో, నాన్నా చింతకర్రుచ్చుకుని కొడతారేమో"? nangih "అబ్బా, ఏం కాదులే, వెళ్ళీ రామ్మా..ఇచ్చేసి పొరపాటయిపోయిందడీ అని సారీ చెప్పి రా" అన్నారు. నేను భయం భయంగా, బెరుకుగా బయలుదేరాను వాళ్ళింటికి. వెళ్ళి తలుపు తట్టాక...టీచరు వచ్చారు. "ఏంటి ఈ టైములో వచ్చావు" అని గడియారంచూసారు....రాత్రి 7.30. "ఏం లేదు టీచరు, ఇది మీకిచ్చి వెళదామని"...నసిగాను. నా చేతిలో కాగితాలు అందుకుని, చూసి నావైపు ఒక్క చూపు చూసారు...ఆవిడ కళ్ళలో ఎర్రని జీరలు...నాకు ఏడుపొక్కటే తక్కువ."అది కాదు టీచర్, పొరపాటు...చూసుకోలేదు. కావాలని చేసినది కాదు టీచర్...సంచిలో కనిపించగానే తెచ్చి ఇచ్చేసాను. నేనేమీ మార్చలేదు టీచర్...ఒట్టు, నిజంగా పొరపాటునే జరిగిందండీ" అని బిక్కమొహంతో చెప్పా. ఆవిడేమీ అనలేదు..."మ్మ్ సరే, వెళ్ళి రా" అన్నారు. బ్రతుకుజీవుడా అనుకుంటూ ఒక్క గెంతులో బయటకి దూకి, ఇంటికి పరుగో పరుగు. కానీ నాకింకా ఆశ్చర్యం...ఆ కాగితాలు చూసి టీచరు నిప్పులు కక్కుతారనుకున్నా, ఏమీ అనలేదు...బాబోయ్ మిన్ను విరిగిమీదపడదు కదా! ఏ కళనున్నారో ఏమో, తిట్టకుండా వదిలేసారు అనుకుంటూ హాయిగా నిద్రపోయా. మర్నాడు బడికెళ్ళా గెంతుకుంటూ. ఆరోజు ఇంట్రబిల్లు (అప్పట్లో మేము అలాగే అనేవాళ్ళం :D) లో స్టాఫ్ రూము నుండి పిలుపొచ్చింది. ఇంక చూసుకోండి...అందరు టీచర్ల మధ్యన పెట్టి నన్ను ఎడాపెడా వాయించేసారు. నా మీదా కక్షగట్టి ఉన్న మా ఇంగ్లీషు మేషారు విజృంభించేసారు. నన్ను అభిమానించే సంస్కృతం, తెలుగు, సైన్సు టీచర్లు నన్ను కాపాడాలాని శతవిధాలా ప్రయత్నించారు. మా సోషల్ టీచర్ ఆగితే కదా...ఎంత ధైర్యం చూడండి....పైగా రాత్రి మా ఇంటికొచ్చి ఆ కాగితాలన్నీఇచ్చింది. ఎంత పొగరో చూడండి...అల్లరి మితిమీరిపోతున్నాది. లాభం లేదు దీని అంతు చూస్తా. HM కి కంప్లైంట్ ఇస్తాను. ఈ పప్పులన్నీ నా దగ్గర ఉడకవు. ఓ సంవత్సరం పరీక్షలు రాయకపోతే సంకటం కట్టేస్తుంది" అని భీభత్సంగా అరుపులు. నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. భగవంతుడా...ఏ తీరుగ నను చూసెదవో, నా తరమా ఈ బడిసాగరమీదను...అని మనసులో పాడుకుంటూ, "ఆహా మహాతల్లీ ఇందుకా నిన్న రాత్రి ఏమీ అనకుండా పంపించేసావు..మర్నడు ఈ ప్రోగ్రాం పెట్టాలని ఆలోచనతోనేనా" అని మనసులో తిట్టుకుంటూ, ఉబికి వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ బ్రతిమాలడం మొదలెట్టాను...ఇంకెప్పుడూ అలా చేయనండీ. పోరపాటున జరిగింది. కావాలని చేసినదికాదు. నా తప్పే, ఒప్పుకుంటున్నా...మన్నించండి అంటూ ఏవో చెప్పాను. చివరికి మిగతా టీచర్లు కూడా నాతో కలిసి ఆవిడని శాంతింపజేసి "ఇలాంటి పనులు జీవితంలో ఎప్పటికీ చెయ్యనని" ప్రమాణం చేయించడం కోసం హారతి పళ్ళెం, భగవద్గీత వెతికారు, కానీ దొరకలేదు. అప్పుడు ఉత్తినే ప్రమాణం చేయించారు...నేనూ ఉత్తుత్తినే ప్రమాణం చేసేసా ;) హమ్మయ్య....గండం గడిచింది అనుకుంటూ పరుగెత్తుకుంటూ, పడుతూ లేస్తూ, దొర్లుతూ, పిల్లిమొగ్గలేస్తూ క్లాసురూమ్‌కి చేరిపోయాను.
................................................

బడి వదిలి కాలేజీలో చేరడం. ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ లో చేరడం జరిగింది. డిగ్రీలో నాది MES ( maths, eco, stats). మా కాలేజీలో stats ఉన్న గ్రూపులు మూడు MPS (maths, pysics, stats), MES and CES (commerce, eco, stats). MPS, MES వాళ్ళకి maths, stats కలిపే క్లాసులవుతాయన్నమాట. పెద్ద సంతలా ఉండేది. CES వాళ్ళకి stats చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఏదో మీన్, మోడ్, మీడియన్...మహా అయితే correlation చెబుతారు అంతే. అంత ఈజీ గా ఉంటుందన్నమాట. ఇంక మాకు యేడాదికి మూడు ఇంటర్నల్స్ (40మార్కులు), ఒక ఎక్స్‌టర్నల్(60 మార్కులు) ఉండేది. ఇంటర్నల్ లో బాగా రాసిన రెండు పరీక్షల మార్కులుతీసుకుంటారు అన్నమాట. మనం డిగ్రీ చివరి సంవత్సరం లో ఉన్నాం. stats మొదటి ఇంటర్నల్ ఎగ్గొట్టాం (ఏదో బలమైనకారణం ఉండే ఉంటుంది, నాకు ఇప్పుడు గుర్తులేదుగానీ) :). రెండో ఇంటర్నల్ సరిగ్గా రాయలేదు...12/20 వచ్చాయి. అమ్మో మూడోది బాగా రాసి మార్కులు తెచ్చుకోకపోతే కష్టం. 20 లేదా కనీసం 18 అయినా తెచ్చుకోవాలి. అప్పుడే 30/40 వస్తాయి అని లెక్కలేసుకుని బాగా చదివేసా. పరీక్ష మధ్యాన్నం 2.00 కి. నా హాల్ టికెట్ నంబర్ అదీ చుసుకుని వెళ్ళి పరీక్ష గదిలో కూర్చున్నా. మొదటి బెంచీలో రెండో సీటు.....వెనక్కి తిరిగి చూస్తే స్నేహితులంతా పలకరించారు. మేషారు పేపర్లిచ్చారు. మొదటి ప్రశ్న చూసా...డెడ్ ఈజీ. రెండో ప్రశ్న...అరే చాలా సింపులూ....మూడోది...ఓహ్హొహ్హో బహు సులభం...నా పంట పండిందనుకున్నా . అయినా ఇంత ఈజీగా ఇచ్చారేమిటబ్బా పేపరూ అనుకుంటూ చాయిస్ లో ప్రశ్నలకి కూడా జవాబులు రాసేసి అరగంటలో పూర్తి చేసేసా (గంట పరీక్షన్నమాట). వెనక్కి తిరిగి చూసా...ఫ్రెండ్స్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ, రాసేస్తున్నారు. మూడో బెంచీలో ఫ్రెండు తలెత్తిచూసి, అప్పుడే అయిపోయిందా అని ఆశ్చర్యం గా చూసాడు. "ఆ, ఈజీ కదా" అని నా మొహంలో భావం...తనకు మరింత విస్మయం! రెండో బెంచీలో పిల్ల అనుమానంగా చూసింది...అసలు ఇది పరీక్ష రాసిందా లేదా అన్నట్టు. వీళ్ళంతా ఎందుకబ్బా ఏదో చాలా కష్టమైన పేపర్ రాస్తున్నట్టు ఫోజు కొడుతున్నారు...ఓవర్ ఏక్షన్ లే అనుకుంటూ పేపర్ ఇచ్చేసి బయటికొచ్చేసాను. గంట కి ఓ పది నిముషాల ముందు ఓ ఫ్రెండు పరీక్ష పూర్తి చేసి బయటికొచ్చింది. ఆ పిల్ల నన్నుచూస్తూనే బాగా రాసావా? అంది. పేపర్ చింపేసాను...డెడ్ ఈజీ కదా అన్నాను. ఆ పిల్ల ఆశ్చర్యంగా "అవునా, రెండోప్రశ్నకి ఏం రాసావు" అని అడిగింది పేపర్ చేతికిస్తూ. నేను అందుకుని రెండో ప్రశ్న చూసా...ఇదేంటి ఈ ప్రశ్న నేను రాయలేదే, నేను చూడలేదే అసలు! మొదటి ప్రశ్న చూసా...అయ్యయో ఇదీ లేదే...మూడోది...ఉహూ...అమ్మో ఏంటి ఈ ప్రశ్నలు...నేను ఈ పరీక్ష రాయలేదు..మరి నేను రాసినదేమిటి? నా పేపర్ విప్పి చూసాను...వేరే ప్రశ్నలు. ఇదేలా సాధ్యం!....నాకు బుర్ర తిరిగిపోయింది. ఆ అమ్మయికి చూపించా...తనకీ కళ్ళు తిరిగాయి. ఇద్దరిలో ఎవరిదో తప్పో అర్థంకాలేదు. ఈలోగా మిగతా కొందరు బయటికొచ్చారు. ఓ నలుగురైదుగురి దగ్గర పేపర్లు తీసుకు చూసా...వాళ్ళందరివీ ఒకేలా ఉన్నాయి. నాదే వేరుగా ఉంది. బాబోయ్...ఏమిటీ వైపరీత్యం? విధి మళ్ళీ నాతో ఏనాటకం ఆడబోతోంది? :( నేనే పరీక్ష రాసానసలు? అందరం ఒకే హాల్లో కూర్చున్నాం. అందరికీ ఒకేలాంటి పేపర్ ఇచ్చారు. మరి నేనేం రాసాను? ఈ సందేహాలతో కాళ్ళు, చేతులు వణుకుతుండగా ఇన్విజిలేటర్ దగ్గరకెళ్ళి నా గోడు వెళ్ళబోసుకున్నా. ఆయన కూడా మొదట కొంత గందరగోళానికి గురి అయీ రెండూ పేపర్లూ దగ్గర పెట్టుకుని తీక్షణం గా పరిశీలించి చూస్తే......నేను రాసిన పేపర్ మీద హెడ్డింగ్ లో BA STATISTICS EXAM FOR CES అని తాటికాయంత అక్షరాలతో రాసుంది. అది చూసి ఢాం అని కిందపడిపోయా. జరిగిందేమిటంటే మా stats పరీక్ష పత్రాలలో పొరపాటున CES stats పేపర్ ఒకటి కలిసింది. అదీ, రాక రాక నాకే వచ్చింది. నేను వెనక ముందు చూసుకోకుండా తిన్నగా ప్రశ్నలు చూడడం మొదలెట్టాను. ఈజీగా ఉన్నాయని చెప్పి రాసి పారేసాను. పోనీ అంతా సులువుగా ఉన్నప్పుడైనా ఇది మా పేపరేనా అని డౌటు రావాలా నాకు? కాస్త తల యెత్తి చూసుంటే తెలిసేది. పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగ్ లో రాసుంది...కానీ నేను చూడలేదు. ఈ విషయం గ్రహించేసరికి పరీక్ష టైము అయిపోయింది. ఒక అరగంట టైం ఇవ్వండి...పరీక్ష రాసేస్తాని అని ఇన్విజిలేటర్ ని బతిమాలుకున్నాను....ఊహూ, ససేమిరా అన్నారు. నాకు ఏడుపొచ్చేసింది...అయ్యో ఉన్న ఒక్క పరీక్షా పోయింది, ఏమిటి నా గతి! మూడు ఇంటర్నల్స్ లో ఒక్కటే రాస్తే ఎక్స్‌టర్నల్ కి allow చెయ్యరు. నాకు కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టనిపించింది. ఏం చెయ్యలో తోచలేదు. వెంటనే eco dept వైపు పరిగెట్టా. మా మావయ్యగారు అక్కడ లెక్చరర్....ఆయన ఆరోజు సెలవుట. తెలుగు డిపార్ట్మెంట్ కి పరిగెట్టా...మా అత్తయ్య అక్కడ లెక్చరర్. తనూ సెలవులో ఉందిట. ఎటూ పాలుపోక మావయ్యగారికి ఫోన్ చేసాను. ఆయన అంతా విని కాసేపయ్యక మళ్ళీ ఫోన్ చెయ్యి అని పెట్టేసారు. ఈలోగా నా క్లాస్మేట్స్ లో కొందరు దరిద్రులు నన్ను తెగ భయపెట్టారు...ఇంక నీ పని అంతే. డిగ్రీ ఫైనల్ ఇయర్ stats exam పోయింది. మళ్ళీ యేడాది మళ్ళీ రాసుకోవడమే. సాధారణంగా ఇలా మళ్ళీ పరీక్ష రాయడానికి allow చెయ్యరు అంటూ నానా కూతలూ కూసారు. నాకు గుండె జారిపోయింది. అయినా మావయ్యగారు, అత్త ఉన్నారుగా ఏదో ఒకటి చేస్తారులే అని ఏదో మూల ధైర్యం మిణుకుమిణుకుమంటూన్నది. మావయ్యగారు, కాలేజీలో తన ఫ్రెండ్స్/తోటి లెక్చరర్లకి ఫోన్ చేసి నా సంగతి చూడమన్నారు. ఆయనకి చాల క్లోజ్ అయిన ఇంకో లెక్చరర్ ని కలవమన్నారు. ఆయన్ని కలిస్తే "అలా ఎలా రాసేసావమ్మయ్...చూసుకోవద్దూ" అని నాలుగు తిట్టి ప్రిన్సిపల్ దగ్గరకి తీసుకెళ్ళి, అన్నీ వివరించి...పొరపాటున జరిగింది, ఇందులో ఇన్విజిలేటర్ తప్పు కూడా కొంచం ఉంది... పేపర్లు చూసుకోకుండా ఇచ్చాడు కాబట్టి ఈ అమ్మాయికి మళ్ళీ చాన్స్ ఇవ్వండి అని మనవి చేసారు. వెంటనే ప్రిన్సిపల్, నన్నుఇంకో నాలుగు తిట్టేసి, ముఖ్యమైన లెక్చరర్లతో సమావేశమయ్యి ఒక నిర్ణయానికొచ్చారు....ఓ గంటలో కొత్తగా పేపర్ సెట్ చేసి ఇస్తారు.....దాన్ని నేను అరగంటలో రాసివ్వలి. హమ్మయ్య అనుకుని వెంటనే ఒప్పేసుకున్నాను. నాకు తెలుసు ఈసారి పేపర్ కష్టంగా ఇస్తారని. ఆ గంటలో మళ్ళీ పుస్తకాలు అన్నీ తిరగేసి, తరువాత ప్రిన్సిపల్ ముందే కూర్చుని అరగంటలో పరీక్ష రాసేసి ఇచ్చేసాను. నేను రాసిన రెండు పేపర్లూ దిద్దబడ్డాయి. CSE stats లో 20/20. మా stats లో16 వచ్చాయి . కాలేజీలో నా పేరు మారుమ్రోగిపోయింది. కొందరు లెక్చరర్లు అన్నారుట...చూడు ఆ అమ్మాయికి ఎన్నితెలివితేటలో, ఏ పేపర్ ఇచ్చినా బాగా రాసేసింది" అని. :D ఈ సంగతి మా అత్త, మావయ్యగారికి చెబితే వాళ్ళు చచ్చేట్టు తిట్టారు...సిగ్గులేదూ ..వెధవ పని చేసేసి మళ్ళీ గొప్పలొకటి అని. అమ్మ, నాన్నా మెత్తగా చివాట్లు పెట్టారు. ఈ విషయం ఎవరికి ఎవరు చెప్పారో ఏమొగానీ మా బంధురబంధురబంధు గణానికంతటికీ తెలిసిపోయింది. ఒక ఫంక్షన్ లో మా పెద్దనాన్నగారి కూతురి అత్తగారు నన్ను పిలిచి అడిగారు "అలా చేసావుట కదా, పరిక్షలో అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మాయ్" అని సాగదీసుకుంటూ. :( దేవుడా...నా ప్రతిభ దశదిశాలా వ్యాపించిందా....జిల్లాలు దాటి పాకిందా అనుకుంటూ మనసులో ఏడ్చుకున్నా. :( ఇలా ఒక రోజు కాదు, ఒక మనిషి కాదు. మొత్తం అందరికీ తెలిసిపోయింది. సంవత్సరం పాటు నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ ఇదే అడగడం....పిచ్చెక్కిపోయింది. నేను ఊరు వదిలి హైదరాబాదుకి ప్రయాణమవుతున్నప్పుడు (యూనివర్సిటీ లో జాయిన్ అవ్వడానికి) కూడా అందరూ ఇదే చెప్పారు. పరీక్షా పత్రాన్ని హెడింగ్ తో సహా క్షుణ్ణంగా చదువు, తరువాత రాయి అని. ఈ గోల దాదాపు ఓ యేడాదిన్నర వరకూ సాగింది.
...............................................

అక్కడితో అయిపోయిందా, లేదు...MA లో కొచ్చేసరికి పరీక్షలు ఎక్కువయిపోయాయి....ఎంత విసుగొచ్చేసిందో...నాజీవితంలో ఈ పరీక్షల అధ్యాయం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూసేదాన్ని. ఓసారి మా ఇంటర్నల్స్ ముందు హైదరాబాదులో ఏదో భీభత్సం జరిగింది....మర్నాడు బహుసా సెలవు ప్రకటించవచ్చు అని ఊహాగానాలు సాగాయి. మర్నాడు నాకు ఇంటర్నల్...అందులోనూ నాకు అస్సలు ఇష్టం లేని సబ్జెక్ట్...ఆహా ఇంక పరీక్ష ఉండదు అని సంబరపడుతూ, పుస్తకాలూ మూసేసి, దుప్పటి కప్పుకుని పడుకుండిపోయా. కానీ నా దురదృష్టవశాత్తు మర్నాడు పరీక్ష ఉన్నాది, నేను రాసాను. 5/20 వచ్చాయి...అవే నాకు MA లో వచ్చిన అతి తక్కువ మార్కులు. ఎలాగోలా externalలో కాసిన్ని మార్కులు తెచ్చుకుని పాస్ అయ్యాననిపించుకున్నాను. మార్కులు ఇచ్చేరోజు ఆ సబ్జెక్ట్ టీచర్ పిలిచి "నీకుమిగతా అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులొచ్చాయి, ఏమ్మా ఇందులో మాత్రం పాస్ మార్కులు వచ్చాయి. నీకు నేను నచ్చలేదో, నా పాఠాలు నచ్చలేదో" అని నొచ్చుకున్నారు. అప్పుడు ఎందుకో నాకు చాలా గిల్టీగా అనిపించింది....చ చ ఆయన్నిబాధపెట్టానా అనిపించింది. లేదండీ...నాకు ఆ సబ్జెక్ట్ అంటే అంత ఇష్టం లేదు అని నిర్మొహమాటంగా చెప్పేసాను. ఆయనకూడా సరే నీకు నచ్చిన సబ్జెక్ట్ చదువుకుని బాగా పైకి రా అని దీవించి పంపేసారు. ఇంక phd కొచ్చాక...హమ్మయ్య ఇంక నా జీవితంలో పరీక్షలు రాయక్కర్లేదు అనుకుని తెగ సంబరపడ్డాను.

ఇంక ఫైనల్ టచ్ ఈ పోస్ట్ కి...నాకు జీవితంలో వచ్చిన ఒకే ఒక సున్న. :P
కాగితం పైన నా పేరు పక్కన, మేథ్స్ టాలెంట్ స్పెల్లింగ్ చూడడం మరచిపోకండి!
(బొమ్మ పెద్దది కావడానికి ఇమేజ్ మీద నొక్కండి)




చూసారా నా మేథ్స్ టాలెంట్......ఇంకెప్పుడూ నన్ను లెక్కల గురించి అడగకండి. :D
కానీ తరువాతి సంవత్సరం జరిగిన జిల్లాస్థాయి Maths Talent Test లో నాకు మొదటి బహుమతి వచ్చింది....అదే మరి మేజిక్ అంటే! :P

అదీ నా పరీక్షల ప్రహసనం. :)


Tuesday, June 28, 2011

రాధనురా నీ రాధనురా!

నిన్న మధురవాణి బ్లాగులో రాసిన కృష్ణా! నేను...నీ రాధని! అన్న టపా చూసాక నాకు పింగళి వారు రాసిన "రాధనురా నీ రాధనురా" అన్న పాట గుర్తొచ్చింది. ఇది పెళ్ళి చేసి చూడు (1952) సినిమాలోది.

రాధనురా నీ రాధనురా!

రాసలీలలా ఊసే తెలియని కసుగాయలకారాధనురా!
వలపున కుమిలే ప్రణయజీవులకు వల్లమాలిన బాధనురా!

రాధనురా నీ రాధనురా!

ఎంతో తెలిసిన వేదాంతులకే అంతు దొరకని గాధనురా!
మధురానగరి మర్మమెరిగిన మాధవ నీకె సుబోధనురా!

రాధనురా నీ రాధనురా!
రాధనురా
నీ దాననురా!

రాధ అనగానే నాకు బోలెడు సందేహాలు ఎప్పుడూ...అసలు రాధ ఎవరు? కొందరు రాధ కృష్ణుడి ప్రియురాలంటారు, అతని కన్నా పెద్దది అంటారు. రాధామాధవుల ప్రేమ అద్వితీయం అంటారు, ప్రణయానికి పర్యాయపదమంటారు. కృష్ణుడిని అనంతంగా ఆరాధించడమే రాధకి తెలిసిన పని అంటారు. రాధ పై కృష్ణుడికి అవ్యాజమైన ప్రేమ, ఎనలేని అనురాగం ఉంది అంటారు కానీ పెళ్ళి చేసుకోలేదంటారు....ఇటువంటి సందేహాలే ఎప్పుడూ. రాధ నాకు ఎప్పుడూ బోధపడలేదు. పింగళి వారి పాట విన్నాక రాధ నాకు ఇంకా చిక్కులు తెచ్చి పెట్టింది. అర్థమయింది అనిపిస్తూనే అంతు చిక్కకుండా ఉంది.

ఈ పాట పింగళిగారి సాహిత్య ప్రతిభని ఆవిష్కరిస్తుంది. రాధని ఒక్కొక్కరు ఒక్కో రకంగా భావిస్తుంటారు. ఈ భావన ని పింగళి వారు నాలుగు స్థాయిలలో చెప్పారు.

రాసలీలలా ఊసే తెలియని కసుగాయలకు ఆరాధనురా!

ఇక్కడ ఆరాధనురా...అంటే ఆరాధ(న)నురా అని అర్థం చేసుకోవాలి.
చిన్నపిల్లలు, రొమాన్స్ అంటే తెలియని లేత ప్రాయం ఉన్నవారికి రాధ ఆరాధన అట. రాధని చూసి అలా ఉండాలి జీవితంలో ఎప్పటికైనా అనుకుంటారు కదా. ఎంతో ఆరాధనగా రాధని తమలో మిళితం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ రాధ కాబట్టి ఆడవారు మాత్రమే అనుకునేరు. కాదు, అటువంటి అనురాగాన్ని తమలో నింపుకోవాలి అని ఆడ, మగ ఇద్దరూ అనుకుంటారు అప్పుడే రెక్కలు విప్పుతున్న నవ యవ్వనంలో.

వలపున కుమిలే ప్రణయజీవులకు వల్లమాలిన బాధనురా!

పై స్థాయి దాటి ప్రేమలో పడ్డవారు/ఉన్నవారికి రాధ ఒక బాధ. ప్రణయానికి, విరహానికి తేడా తెలీనంత ప్రేమలో కూరుకుపోయి బాధపడుతుంటారట. దగ్గరగా ఉన్నప్పుడు ప్రణయం, దూరంగా ఉన్నప్పుడు విరహం రెండూ ఎంతో బావుంటాయి. "విరహం కూడా సుఖమే కాదా, విరహము చింతన మధురము కాదా" అని కూడా పింగళి వారే అన్నారు. "ప్రేమా, పిచ్చీ ఒకటే" అని అనురాగం సినిమాలో భానుమతి పాడతారు. ఇది ఆ స్థాయి అన్నమాట. ఇక్కడ ఆ"రాధ"న కాస్తా బాధగా మారుతుంది, అది తియ్యటి బాధ.

ఎంతో తెలిసిన వేదాంతులకే అంతు దొరకని గాధనురా!

తరువాతి స్థాయి....అన్ని తెలిసి, జీవిత సారం గ్రహించిన వేదాంతులకు రాధ అంతు తెలియని గాధ ట. ఇది నాకెలా అర్థమవుతున్నాదంటే...జీవితంలో ఎంతో ప్రేమని అనుభవించి, ప్రేమ పై తనివి తీరక...ఇంకా కావాలనుకుంటూ, ఎప్పటికీ సంతృప్తి కలగక వేదాంత ధోరణికి చేరి ఈ ప్రేమ కి అంతులేదా అనుకుంటారేమో! అప్పుడు వాళ్ళకి రాధ అలా అనంతంగా మాధవుణ్ణి ఎలా ప్రేమిస్తుందో అని సందేహంతో అంతులేని గాధ గా మిగిలిపోతుంది (ఇది నా కవి హృదయం)

మధురానగరి మర్మమెరిగిన మాధవ నీకె సుబోధనురా!

ఇది పతాక స్థాయి....మానవుని జ్ఞానానికి చిట్టచివరి మెట్టు అహం బ్రహ్మాస్మి అనుకోవడం (దీనిపై విశ్వాసం ఉన్నవారు).....అటువంటి స్థాయికి చేరుకున్నవాడు శ్రీకృష్ణుడే కాబట్టి...ఓ మాధవా, మధురా నగరం మూలమూలలా తెలిసినవాడవు నీకు నేను బాగా తెలిసినదానను...నా గురించి నీకు తప్ప ఎవరికీ గొప్పగా తెలీదు అంటోంది రాధ.

పింగళి వారు ఎంత చమత్కారులో కదా...కాదేదీ కవితకనర్హం అని...రాధని తీసుకుని మానవ జీవిత సారాంశాన్ని ఎంత చక్కగా చెప్పారో!

పాటను వినాలనుకునేవారు ఇక్కడ వినవచ్చు.

P.S: మధురా, ఈ పాటని గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చిన నీకు (నీ పోస్టుకి) ధన్యవాదములు. నీ పోస్టు చదివి తరువాత ఈ పాట విని, భావాన్ని ఆకళింపు చేసుకుని పరవశించాను. నిజం!


Tuesday, May 31, 2011

నేను, నా పుస్తకాల గోల

పుస్తకాలు చదవడం ఒక మంచి అలవాటు (హాబీ) అని చిన్నప్పటినుండీ పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ అదేంటో నాకు ఈ అలవాటు కానేలేదు చిన్నవయసునుండీ. పెద్దనాన్నగారు చెప్పే పద్యాలు అలాగే నేర్చేసుకుని తిరిగి ఒప్పజెప్పడం తప్ప పుస్తకాలు చదివిన పాపాన పోలేదు. చిన్నవయసులో చందమామ పుస్తకాలు మాత్రం విపరీతంగా చదివేదాన్ని. అవి తప్పితే వేరే పుస్తకాలు ముట్టుకుంటే ఒట్టు. అసలు అంతంత పెద్ద పెద్ద పుస్తకాలు ఎలా చదువుతారో బాబోయ్ అని భయమేసేది నాకు. క్లాసు పుస్తకాలు చదవడానికే బద్దకంగా ఉండేది ఇంక జనరల్ రీడింగ్ ఎక్కడేడిసింది!మా ఇంట్లో రకరకాల పుస్తకాలు ఉండేవి మా కుటుంబంలో అందరికీ చదవడం బాగా అలవాటు. నేను వీళ్ళ మధ్య తప్పబుట్టానేమో అనుకునేదాన్ని ఒక్కోసారి. :(

మా ఇంట్లో అందరూ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారికి పంఖాలు. ఆయన పుస్తకాలన్నీ ఇంట్లో ఉండేవి. సరే మరీ ఇంతలా చెబుతున్నారుగా ఓపాలి చదివి పడేస్తే పోలా అని తొమ్మిదో తరగతిలో మొదలెట్టా "వడ్లగింజలు"...బ్రహ్మాండంగా అనిపించింది....గుక్కతిప్పుకోకుండా చదివేసాను (అప్పట్లో నాకు కళ్ళతో కాకుండా, శబ్దం బయటికి రాకుండా నోటితో చదివే అలవాటుండేది). తరువాత "మార్గదర్శి" చదివాను....అమృతకలశం...వడ్లగింజలకంటే బాగా నచ్చింది. అంతే ఇంక పుస్తకాలు చదవాలన్న తృష్ణ పెరిగింది. "శ్రీపాద కథలు" రెండు భాగాలు ఎకాయెకిని చదివేసాను. నేను పుట్టకముందు రంగనాయకమ్మ గారి స్వీట్ హోమ్ ఆంధ్యజ్యోతిలోనో ప్రభలోనో సీరియల్ గా వచ్చేదిట. ఆ కాగితాలు చింపి బైండ్ చేసి ఒక పుస్తకంగా కుట్టి ఉంచారు మా ఇంట్లో. అది "స్వీట్ హోమ్ పార్ట్-2"...పెద్ద పుస్తకం. అది చదవడం మొదలెట్టా..విపరీతంగా నచ్చేసింది. తరువాత చేతికి దొరికినది చలం "స్త్రీ"...అప్పటికి నేను పదికి వచ్చాను. స్త్రీ చదివి వెర్రెక్కిపోయాను..అప్పటికి చలం బతికున్నాడా లేడా, చలం ఎవరు అన్న స్పృహ లేదు నాకు. చలం ఎక్కడ ఉన్న ఓసారి వెళ్ళి కలిసిరావాలని అనిపించింది స్త్రీ చదివాక. ఆ తరువాత విశ్వనాథవారి "హాహాహూహూ" పుస్తకం మా అత్త వాళ్ళింట్లో కనిపించింది..బలే గమ్మత్తైన కథ..ఓ దేవతాశ్వం, అది కిందకి దిగి రావడం...బలే వింతగా ఉంటుంది. కొత్తగా, సరదాగా, ఆలోచింపదగినదిగా అనిపించింది అప్పట్లో. చాసో గారు మా ఊరే కదా మా కుటుంబానికి చాలా పరిచయం...మా ఇంటికి కూడా వస్తుండేవారు. నాకు చిన్నతనం కాబట్టి పెద్దగా పరిచయం ఉండేదికాదు. మా ఇంటికొచ్చినా నేనెప్పుడూ ఆయనతో మాట్లాడలేదు. ఓసారి మా నాన్నగారు నన్ను, ఆయనకి పరిచయం చేసారు. అప్పుడు ఆయన సంతకం చేసిన కథల పుస్తకం ఒకటి బహుమతిగా ఇచ్చారు నాకు. అందులో "కుంకుడాకు" మాత్రమే చదివాను. తరువాత యండమూరి "తులసీదళం"...ఇది కూడా ఏదో సంచికలో సీరియల్‌గా వచ్చేది. దాన్ని కూడా కుట్టి బైండింగ్ చేసి పెట్టారు మా ఫ్రెండు వాళ్ళింట్లో. తనదగ్గరనుండి తెచ్చుకుని అది మొత్తం చదివాను. ఓసారి మా నాన్నగారు, నాకు రూట్స్ తెలుగనువాదం "ఏడు తరాలు" కొని ఇచ్చారు. అది ఎంత హృద్యంగా అనిపించిందంటే...చదువుతూ ఎన్నిసార్లు కళ్లనీళ్లు పెట్టుకున్నానో నాకే తెలీదు. మనసుకి హత్తుకుపోయింది ఆ పుస్తకం. వేదుల సత్యనారాయణ శర్మ గారు రాసిన "ఆర్య చాణక్య" చదివాను...అద్భుతమైన కథనం...చాలా ఉత్తేజపరిచింది ఈ కథ. ఇంక అంతే, పదికొచ్చేసానుగా పుస్తకాలు పక్కన పడేసి క్లాసు పుస్తకాల మీద పడ్డాను...పై చెప్పినవన్నీ నా అంతట నాకు బుద్ధి పుట్టి చదివిన మొట్టమొదటి పుస్తకాలు. వీటిని ఈ జన్మకి మరచిపోలేను.

చిన్నప్పటినుండీ పద్యాలు అనర్గళంగా చెప్పే అలవాటు మాత్రం అబ్బింది. దాంతో భారత, భాగవత, రామాయణాల్లో పద్యాలు బాగా నేర్చుకున్నాను. స్కూల్ లో పద్య పఠన పోటీలు పెడితే నాకే కచ్చితంగా ఫస్ట్ వచ్చేది. ఓసారి శతక పద్య పఠన పోటీలు పెట్టారు. "లలితసుగుణజాల తెలుగుబాల" అనే మకుటంతో ఉండే శతకం (ఈ పద్యాలు కరుణశ్రీ రాసారు) లో 100 పద్యాలూ కంఠతా పట్టాను. కానీ పోటీకెళ్ళేసరికి 85 మాత్రమే గుర్తు ఉన్నాయి...అయినా ఫస్ట్ నాకే. (సెకండ్ వచ్చిన అమ్మయి 56 పద్యాలే చెప్పింది). ఈ పద్యాలు నేర్చుకునే అలవాటు మా ఇంట్లో చిన్నపిల్లలందరికీ ఉంది. కాబట్టి మా పెద్దనాన్నగారు మా మధ్య ఒక పద్యపఠన పోటీ పెట్టారు. దానికోసమనీ నా పదవతరగతి సెలవుల్లో విరాటపర్వం మొత్తం బట్టీ పట్టాను. మా ఇంట్లో భారతం పర్వాలవారీగా ఒక్కో పుస్తకం ఉండేది. కాబట్టి విరాటపర్వాన్ని కూడ ఓ పుస్తకం గా లెక్కేసేస్తున్నా. :)

ఇంక అంతే, మళ్ళీ జనరల్ రీడింగ్ జోలికి పోలేదు. మా ఇంట్లో అందరూ "దీనికి పుస్తకాలు చదివే అలవాటు ఈ జన్మకి అబ్బదు, ఇది ఎందుకూ పనికిరాదు" అని నిర్ణయించేసుకునే సందర్భంలో మళ్ళీ మొదలెట్టాను ఓ నాలుగేళ్ళు గడిచాక...నా డిగ్రీ లో. కానీ తెలుగు కాదు. ఇంగ్లీషు నేర్చుకోవాలనే ప్రయాసతో Ayn Rand రాసిన "Fountain Head". మనకి వచ్చిన ఇంగ్లీషే అంతంత మాత్రం ఇంక అంత పెద్ద పెద్ద పుస్తకాలు కొరుకుడుపడాలంటే సాధ్యమా!...ఓ సంవత్సరం చదివా. తరువాత "Atlas Shrugged"...ఇది కూడా ఓ యేడాది పట్టింది. మాక్సీం గోర్కీ "అమ్మ" చదివాను...బావుంది కానీ ఏడుతరాలంత కదిలించలేదు.

ఇంకేముంది డిగ్రీ అయిపోగానే విజయనగరం వదిలేసి హైదరాబాదుకి చలో....HCU లో చేరాక పుస్తకాలు వగైరా మూలన పడేసి కెరీర్ అనుకుంటూ దానివెంట పరిగెత్తాను. మళ్ళీ ఏ పుస్తకం తెరవలేదు. మా HCU లో ఉన్న తెలుగు లైబ్రరీ లాంటిది నేనెక్కడా చూడలేదు. అసలు రెండు కళ్ళు చాలవు ఆ పుస్తకాలు చూడడానికి. కానీ నేనెప్పుడు అటువైపు పోనేలేదు. PhD కొచ్చాక...మూడేళ్ళు దాటాయి 2007కి...ఎంతకీ మా గైడ్ తెమల్చడు...నరకం చూపిస్తున్నారు. అసలు ఈ జన్మకి నా PhD అవుతుందా అని కళ్ళనీళ్లు పెట్టుకునేదాన్ని రోజూ. విసుగు, నిరాశ, నిస్పృహ, విరక్తి ఇలాంటివన్నీ కలిగి ఏమి చెయ్యలో తెలీదు. నాతోటివారికి చెప్పుకుందామా అంటే ఇంచుమిందు వారూ అదే పరిస్థితిలో ఉంటారు. పెద్దవారికి చెబితే PhD యా మాజాకా, అలాగే ఉంటుంది, తట్టుకోవాలి అన్నీ అంటారు. ఇక ఎటూపాలుపోక పుస్తకంలో తలదూర్చాను. లైబ్రరీకెళ్ళి "కన్యాశుల్కం" తెచుకున్నాను. ఆపాకుండా చదివాను. ఎంత నచ్చేసిందంటే ఇన్నాళ్ళు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదవనందుకు ఎన్ని సార్లు నన్ను నేనే తిట్టుకున్నానో చెప్పలేను. మా ఇంట్లో ఉండి కూడా ఎప్పుడూ చదవలేదే అని తెగ బాధపడిపోయాను. ఏకబిగిన చదివేసి మొత్తం పూర్తిచేసాను. సంతృప్తి కలగలేదు, మళ్ళీ మొదటి పేజీ నుండి మొదలెట్టాను. అలాగే ఏకబిగిన చదివాను. ఇప్పటివరకూ ఒకే పుస్తకం వరుసగా రెండు సార్లు చదవడం అన్నది కన్యాశుల్కం విషయంలో మాత్రమే జరిగింది. ఇంకే పుస్తకం అలా చదవలేదు. ఆ తరువాత చలం ది "సత్యం, శివం, సుందరం" తీసాను. అప్పుడు పట్టింది నాకు చలం పిచ్చి...దాదాపు ఆయనవి అన్నిపుస్తకాలు ఉన్నాయి మా లైబ్రరీలో...ఒక్కోటి చదవడం మొదలెట్టాను. కొన్ని వీపరీతంగా నచ్చాయి. కొన్ని కొంచం నచ్చాయి, కొన్ని అస్సలు నచ్చలేదు, ఇంకొన్ని చిరాకేసాయి. కానీ వాటిని ఎలా విశ్లేషించుకోవాలో తెలియలేదు. అప్పుడు రంగనాయకమ్మగారి "చలం సాహిత్యం" పుస్తకం చదివాను. అది చదివాకే చలం ఇంకా బాగా బోధపడ్డాడు అని చెప్పగలను. అలా RN పుస్తాకాల మీద పడ్డాను. స్త్రీవాద రచనలు బాగా నచ్చాయి. మార్కిజం పాళ్ళు ఎక్కువవుతున్నకొద్దీ కొద్దిగా బోర్ కొట్టాయి.


ఇంక అక్కడమొదలయింది నా పుస్తక పఠన ప్రవాహం. ఒకటేమిటి విశ్వనాథ వేయిపడగలు, శ్రీరమణ మిధునం, పేరడీలు, హాస్యజ్యోతి, కథలు...అన్నీ, ముళ్ళపూడి రమణీయాలు అన్నీ, కొ.కు చదువు, వ్యాసాలు, నామిని పచ్చనాకుసాక్షిగా, మిట్టూరోడి కథలు, పానుగంటి వారి సాక్షి వ్యాసాలు, తిలక్ కథలు, శ్రీపాద క్షీరసాగర మధనం,పుల్లంపేట జరీచీర,అనుభవాలు-జ్ఞాకపకాలు, ఆరుద్ర రచనలు కొన్ని, యండమూరి యుగాంతం, భ.రా.గో రచనలు, గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర, ఇరావతీ కర్వే యుగాంతం, గురజాడ దిద్దుబాటు, భానుమతి అత్తగారి కథలు, నాలో నేను, మొక్కపాటి బారిస్టరు పార్వతీశం, మల్లాది కృష్ణాతీరం,శ్రీదేవి కాలాతీతావ్యక్తులు....ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే రెండు టపాలు అవుతాయి...అలా చేతికి ఏది దొరికితే అది చదివేసాను. అలా చదవడం వల్ల నాకు ఎలాంటి భావనలు నచ్చుతాయి, ఎలాంటివి భరించలేను అన్న లైన్ క్లియర్ కట్ గా బోధపడంది. ఇలా చదవడమే కాకుండా విశాలాంధ్ర పై దాడి కూడా చేసాను. నచ్చిన పుస్తకాలన్నీ కొనేసుకున్నాను. కోటీలో విశాలాంధ్ర exhibition ఉంటుంది ఎప్పుడూ. అక్కడ 10% ఆఫ్ ఇస్తాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు బోల్డు పుస్తకాలు కొనేసాను రూ. 1000 రూపాయలయింది. ఆ పుస్తకాలు యూనివర్సిటీకి ఎలా తీసుకెళ్ళాలన్నది సమస్య. కోటీలో పెద్ద బేగు కొని అందులో అన్నీ నింపేసి తీసుకెళ్ళాను. కేంపస్ లో అడుగుపెడుతుంటే అందరూ ఏంటి ఊరెళ్ళి వస్తున్నావా అని పలకరించారు. :D ఇంక అప్పటినుండీ ప్రతీ ఆదివారం కోటీ కి ఆ బేగుతో వెళ్ళడం రూ. 1000-1500 రూ వరకూ పుస్తకాలు కొనడం. విశాలాంధ్రవాడు సంతోషం పట్టలేక నాకు 15% ఆఫ్ ఇచ్చేవాడు. తరువాత అది 18% పెంచాడు. ఓరెండు వారాలు నేను వెళ్ళకపోతే నాకు ఫోన్ చేసి 'ఏంటి మేడం మీరు రావట్లేదు' అని అడిగేవాడు. :D ఏదైనా పుస్తకం లేకపోతే నాకోసం తెప్పించేవాడు. చలం పుస్తకాల కోసం అతన్ని పెట్టించిన పరుగులు అన్నీ ఇన్నీ కాదు. ప్రింట్ లో లేని పుస్తకాలు కొన్ని వాళ్ళ గోడౌన్ లో ఎక్కడో పడి ఉంటే అవి వెతికి మరీ తెప్పించుకున్నాను. ఎప్పుడు ఖాళీ దొరికినా ఆ exhibition కి వెళ్ళి ఏదో ఒక్కటైనా పుస్తకం కొనకుండా బయటకి వచ్చినది ఏనాడూ లేదు. చివరికి PhD అయిపోయాక ప్రత్యేకంగా వాడిదగ్గరకెళ్ళి స్వీట్స్ ఇచ్చి ఇంకో నాలుగు పుస్తకాలు కొని మరీ వచ్చాను. అలా ఆ యేడాది మొత్తం పుస్తకాల మీదే గడిపాను. ఓ 6-7 వేల దాకా పుస్తకాల మీద ఖర్చుపెట్టాను. ఆ మొత్తం సంవత్సరం PhD అన్నది పట్టించుకోలేదు. పూర్తిగా పక్కన పెట్టేసాను. ఆ తరువాత మా గైడ్‌ ఎందుకో, ఏమిటో దారిలోకొచ్చి నన్ను పట్టించుకోవడం మొదలెట్టారు. ఇంక అప్పటినుండీ నేనూ ఈ జనరల్ రీడింగ్ పక్కనపెట్టేసి సీరియస్ గా రిసెర్చి చేసాను. అంతే మళ్ళీ వదిలేసాను పుస్తకాలని. (మధ్యమధ్యలో యండమూరి నవలలు, యద్ధనపూడి సులోచనారాణి నవలలు కొన్ని చదివాను. కానీ ఏదో కాలక్షేపానికే).

ఇదిగో ఇప్పుడు ఈ మధ్యనే మళ్ళీ మొదలెట్టాను. ఎలా అంటే...రోజూ ఆఫీసుకి మెట్రోలో వెళ్ళేటప్పుడు 20-25 ని. వచ్చేటప్పుడు 20-25 ని. ప్రయాణం చెయ్యవలసి ఉంటుంది. మొదట్లో ఆ ప్రయాణం కొత్త కాబట్టి ఆ టైములో వచ్చేపోయేవారిని గమనిస్తూ ఉండేదాన్ని. తరువాత కాస్త బోర్ కొట్టి పాటలు వినడం మొదలెట్టాను అదీ బోర్ కొట్టాక ఆ 20 ని. ఏదో పెద్ద ప్రయాణంలాగ అనిపించడం మొదలెట్టింది. మామూలుగా దూరప్రయాణాలలో పుస్తకం చదువుకునే అలవాటుంది, అదే ఇక్కడ ఎందుకు మళ్ళీ మొదలెట్టకూడదూ అనిపించింది. మెల్లిగా మొదలెట్టాను. ఈసారి కాస్త ఇంగ్లీషు పుస్తకాలు కూడా చదువుదామని నిర్ణయించుకున్నాను. గత మూడు నెలలలో నేను పూర్తి చేసిన పుస్తకాలు

1.చదువులా చావులా - నామిని
2. The White Tiger - Aravind Adiga
3. The Illustrated Brief History of Time, Updated and Expanded Edition - Stephen Hawking
4. సహజ - ఓల్గా
5. మానవి - ఓల్గా

'చదువులా చావులా' గురించి ఇంతకుముందే బ్లాగులో రాసాను.

'వైట్ టైగర్' చాలా ఎంజయ్ చేస్తూ చదివాను. డిల్లీ లో రెండేళ్ళుగా కారు డ్రైవర్ల పరిస్థితి గమనించి ఉన్నానేమో ఈ పుస్తకం అద్భుతంగా అనిపించింది. బీహార్ నుండి వచ్చే కారు డ్రైవర్ల దయనీయ పరిస్థితి, వారి మానసిక సంఘర్షణ. స్వేచావాయువులు పీల్చాలనే ఆరాటం...ఇవన్నీ చాలా బాగా చిత్రీకరించారు. అందరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం. డిల్లీ పరిస్థితులు తెలిసున్నవాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు.

నాకు ఫిజిక్స్ అంటే కొంచం ఆసక్తి. ఇంతకుముందే Brief History of Time చదివాను. ఇప్పుడు updated version వచ్చిందని తెలిసి వెంటనే కొని చదివేసాను. Stephen Hawking గురించి నేను కొత్తగా చెప్పేదేముంది...ఆ పుస్తకం చదువుతుంటే ఏదో వేరే ప్రపంచంలో ఉన్నట్టు అబ్బురంగా తోస్తుంది.

'సహజ', 'మానవి'..ముందుగా సుజాత (మనసులో మాట) గారికి బోలెడు బోలెడు ధన్యవాదములు ఈ పుస్తకాలు పంపించినందుకు. ఓల్గా వ్యాసాలు ఎప్పుడో చిన్నప్పుడు ఒకటి రెండు చదివానుకానీ దృష్టిపెట్టి ఎప్పుడూ చదవలేదు. ఈ పుస్తకాల గురించి తెలియజెప్పడమే కాకుండా వెంటనే పంపించినందుకు నేను సుజాత గారికి ఋణపడిపోయాను. రెండూ మంచి పుస్తకాలు....స్త్రీ చైతన్యం, హక్కులు ప్రధాన ప్రాతిపదికగా రాయబడిన కథలు...నాలో ఎన్నో ఆసక్తికరమైన ఆలోచనలను రేకెత్తించాయి.

తెలుగయితే 20 నిముషాలలో ఓ 30 పేజీల వరకూ అయిపోయేవి. ఇంగ్లీషు అయితే ఓ 15 వరకు అయ్యేవి. మూడునెలలలో ఐదు పుస్తకాలు చదివానంటే నాకే గొప్ప ఆనందంగా ఉంది.

ఇప్పుడు చదువుతున్నది Ideas and Opinions - Einstein. ఇది కొంచం కష్టంగా ఉంది...అయినా ఇష్టం గా చదువుతున్నాను. కాకపోతే కాస్త మెల్లిగా నడుస్తున్నాది బండి.

తరువాత లిస్ట్ లో ఉన్నవి.

1. విశ్వదర్శనం - నండూరి
2. Delhi - Kuswanth Singh
3. The Motorcycle Diaries (ఎప్పటినుండో చదవాలని అనుకుంటూ ఉన్నాను, ఇప్పటికి నా లిస్టులోకొచ్చింది).
4. చివరికి మిగిలేది - బుచ్చిబాబు (ఇది సగమే చదివాను, పూర్తిచెయ్యాలి).

ఇవి పూర్తయ్యాక మళ్ళీ కొత్త లిస్ట్ పెట్టుకుంటాను. చినవీరభద్రుడి కథలు , కా.రా కథలు చదవాలని కోరిక. తరువాతి లిస్టులో అవి ఉంటాయి. ఏది ఏమైనా అసలు పుస్తకాలు చదవడం అలవాటు లేని స్థాయి నుండీ మెల్లిమెల్లిగా లిస్టుగా పెట్టుకుని పుస్తకాలు చదివే స్థాయికి రావడం ఆనందంగా ఉంది. ఈ పుస్తకాలన్నీ నన్ను నేను మలుచుకోవడానికి ఎంతో తోడ్పడ్డాయి. ఎంతో మానసికోల్లసాన్ని కలిగించాయి. వీటినుండి ఎంతో నేర్చుకున్నాను. ఆలోచనా శక్తి అభివృద్ధి చెందింది. పరిశోధనాసక్తి పెరిగింది. కొత్త కొత్త విషయాలు తెలిసాయి. అంతర్గత భావాలను వ్యక్తపరచగలిగే సామార్థ్యం పెంపొందింది. భాష మీద పట్టు చిక్కింది. ఈ పుస్తకాలు నాకు నేస్తాలు....చిరాకులో, బాధలో నాకు తోడుగా నిలిచాయి, మరువలేని ఆనందాన్ని పంచాయి. ఈ పుస్తకాలే లేకపోతే నా జీవితంలో అతి ముఖ్యమైన ఒక భాగం లేనట్టే. గత రెండు మూడేళ్ళుగా ఎవరికైనా బహుమతి ఇవ్వాలనుకుంటే పుస్తకమే ఇస్తున్నాను. ఇది, ఇప్పుడు ఒక అలవాటుగా కూడా మారింది. వేరే బహుమతుల వైపు దృష్టి పోనేపోవట్లేదు. సందర్భానికి తగ్గట్టుగా ఏం పుస్తకం ఇద్దాం అని ఆలోచిస్తుంటాను. కానీ నేను చదివినవి ఏమీ కావు...ఇంకా ఎన్నో ఏన్నెన్నో ఉన్నాయి. ప్రతీసారి నేను ఈ పుస్తకం చదవలేదే అనిపిస్తే ఎంతో బాధగా ఉంటుంది. అవన్నీ ఎప్పుడు చదువుతానో ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఈ జీవితకాలం సరిపోతుందా అని బెంగగా ఉంటుంది. కానీ నిరంతరంగా చదవడం తప్పించి చేయగలిగినది ఏమీ లేదు కదా!

Let books be your dining table,
And you shall be full of delights
Let them be your mattress
And you shall sleep restful nights.... అని ఎక్కడో చదివాను. ఇది నాకు బాగా నచ్చింది!



Monday, May 9, 2011

చదువులా, చావులా?

నా స్నేహితురాలి కూతురు బలే చురుకైన పిల్ల. వాగుడు కాయ నెంబర్ వన్ ...ఒకసారి మొదలెట్టిందంటే ఆపడం చాలా కష్టం. చురుకైనది, చాలా తెలివైనది కూడా. అలాంటిది మొన్న ఆ మధ్య కలిసినప్పుడు చాలా డల్ గా ఉన్నాది. మాటలు బాగా తగ్గించేసింది. నేను దాన్ని పిలిచి, కొత్త స్కూలు లో చేరానన్నావు, ఆ విశేషాలు చెప్పు అని అడిగితే పెదవి విరిచేసి, మాట మార్చేసింది. ఏమయింది దీనికి అని మా ఫ్రెండుని అడిగాను. కొత్త స్కూలు లో చేర్చాక దానికి చదువు మీద శ్రద్ధ పెరిగింది. వాగుడు తగ్గించి బుద్ధిగా చదువుకుంటున్నాది. మంచిదే, కొత్త స్కూలులో బాగా చెబుతున్నారు, పిల్ల దారిన పడుతోంది అదే నాకు సంతోషం అని ఇంత మొహం చేసుకుని మెరిసే కళ్ళతో నా ఫ్రెండు చెబుతుంటే నాకు ఎక్కడో అనుమానపు పొర మెదిలింది. సరే అని సమయం చూసి దాన్ని పిలిచి, ఆ మాట ఈ మాట కలిపి, మెల్లిగా స్కూలు గురించి అడగడం మొదలెట్టను. మొదట్లో తప్పించుకోవాలని చూసినా, ఎట్టకేలకు పెదవి విప్పింది. దానికి కొత్త స్కూలు అస్సలు నచ్చలేదు. అక్కడ పాఠాలు చెప్పి చంపేస్తున్నారు. ఏమీ బుర్రకెక్కట్లేదు. కావలసినట్టు ఆడుకోవడనికి, చందమామలు చదువుకోవడానికి టైము ఉండట్లేదు, విసుగొస్తున్నాది పాపం. ఇంతా చేస్తే అది చదువుతున్నది ఆరో తరగతి. మేథ్స్ టీచరు మహా కర్కోటకుడుట. చెప్పినది వినడం, పది సార్లు బట్టీ పట్టడం తప్ప ఏదైనా అర్థం కాలేదని అడిగితే చెంపలు వాయిస్తాడట. ఏదైనా డౌటు అడిగితే ఆ మాత్రం అర్థం చేసుకోలేవూ, చూడు నీ తోటి పిల్లలు ఎంత చక్కగా అర్థం చేసుకుంటున్నారో అని ఎద్దేవా చేస్తాడట. దాని మేథ్స్ నోట్ బుక్ చూసాను. ఆరో తరగతిలో logarithms ఉన్నాయి. ఇదేమిటి మన చదువుకున్నప్పుడు ఏడు లో కొంత పరిచయం మాత్రమే చేసేవారు. ఇప్పుడు ఆరు లోనే చెప్పేస్తున్నారా, సర్లే కాలం మారిందిగా అనుకున్నాను (ఈ మధ్య స్కూల్లో సిలబస్సు అవీ ఎలా మారాయో నేను గమనించలేదు). పాపం ఆ చిన్ని బుర్రకి లాగ్ పవర్ e కి లాగ్ పవర్ 10 కి ఉన్న తేడా అర్థం కావట్లేదు. చాలా కష్టంగా ఉంది అంటున్నాది. దాని తెలుగు అసైన్మెంట్ చూసాను. "సువర్ణదీర్ఘసంధి" అని ఉంది...దానికి టిక్ పెట్టబడి, మార్కులు కూడా వేయబడి ఉన్నాయి. వాళ్ళ టీచరే కరక్ట్ చేసిందిట...రెండు సార్లు 'సువర్ణ అని రాసినా అది తప్పుగా కనిపించలేదు మహతల్లికి.

ఇంతలో పక్కింటి అమ్మయి ఒకర్తి వచ్చింది పుస్తకాలు పట్టుకుని. వాళ్ళిద్దరూ రోజూ ఓ గంట కుర్చుని చదువుకుంటారట. ఆ పిల్ల 8 చదువుతున్నాది. ఆ పిల్ల నోట్స్ చూసాను. అందులో ప్రోబబిలిటీ ఉంది....ఏదో భయంకరమైన కౄర జంతువుని చూసినట్టు అదిరిపడ్డాను నేను. ఎనిమిది లోనే ప్రోబబిలిటీ ఏమిటి, మాకు పది లో ప్రోబబిలిటీ గురించి కొంచం పరిచయం మాత్రం చేసేవారు అంతే. ఆ మాత్రం దానికే చుక్కలు కనిపించాయి నాకు. ఇప్పుడేమో ఈ పిల్ల ఎనిమిదిలోనే చదివేస్తున్నాది. పైగా ఆ పిల్ల చెప్పినది విన్నాక నాకు కళ్ళు తిరిగినంత పనయింది. వాళ్లకి ప్రోబబిలిటీ పాఠ్య పుస్తకంలో లేదుట. పై క్లాసులలో ఉంటుందిట. కానీ కింది క్లాసులలోనే అది చదివేసుకుంటే పదికి వచ్చేసరికి సులువుగా ఉండి పదిలోనే ఇంటర్ లెక్కలు అవీ నేర్చేసుకోవడానికి వీలుగా ఉంటుందిట. అప్పుడు ఇంటర్ లో మొత్తం సమయమంతా IIT కోచింగ్ మీద ఖర్చు పెట్టి మంచి ర్యాంకులు తెచ్చేసుకోవచ్చుట. ఇది వాళ్ల స్కూలో ప్లాను. అందుకని వీళ్ళని ఇలా రుద్దేస్తున్నారు. ఇది విన్నాక నాకు ఒక విచిత్రమైన, భయంకరమైన ఊహ వచ్చింది. రేపొద్దున్న కడుపులో పిండం పడీ పడగానే, ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వడానికి కావలసిన ఆసక్తిని రేకిత్తించే మందులను ఇంజక్ట్ చేసేసి, పుట్టగానే చదువు మొదలెట్టేసి,ఆరో తరగతి లోపే పదో తరగతి పూర్తిచేయించేసి, పదో తరగతి లోపు IIT కోచింగు పూర్తయిపోయి, ఇంటర్ లో ఇంజనీరింగు కోర్సులు చెప్పేసి, B.Tech లో M.Tech, M.Tech లో phd చేయించేసి...అమ్మో...తలుచుకుంటేనే కడుపులో దేవినట్టనిపించింది. :( సరే ఇంతకీ మీరిద్దరూ వేరేవేరే క్లాసులు కదా కలిసి చదువుకోవడమేమిటర్రా అని అడిగితే.... పక్కింటి పిల్ల తో కూర్చుని చదువుకుంటే ఎనిమిదో క్లాసు లెక్కలు కూడా దీనికి కొంచం తెలుస్తాయిట (ఇది నా ఫ్రెండు పైత్యం) అప్పుడు ఎనిమిదో క్లాసుకొచ్చేసరికి దీనికి సులువుగా ఉంటుందిట. అలాగే దీనికి చెబుతూ చదువుకోవడం వల్ల పక్కింటి పిల్లకి ఆ లెక్కలు బాగా వంటబట్టి ఇంకెప్పటికీ మరచిపోదుట. ఆహ ఏమి తెలివితేటలే తల్లి అని, ఇంక లాభం లేదని చెప్పి, ముందు ట్రీట్మెంట్ వీళ్ల అమ్మకి జరగాలి అనుకుని...నామిని రాసిన "చదువులా, చావులా?" పుస్తకం ఇచ్చాను నా ఫ్రెండుకి. ఈ మధ్యనే ఈ పుస్తకం నేను చదివాను.

నామిని రాసిన ఈ పుస్తకం నాకు చాలా నచ్చింది. ఇది 2008 లో వచ్చిందనుకుంటా. ఈ పుస్తకం గురించి ఆయన మాటల్లో: "పాత కాలంలో పిల్లల్లు సరి అయిన వైద్యం అందక లేత వయసులోనే చచ్చిపోయేవాళ్ళు. ఈ కొత్త కాలంలో చేతికి అంది వచ్చిన పిల్లలు, మనం కోరిన చదువుల్ని అందుకోలేక అన్యాయంగా చచ్చిపోతున్నారు"

అలా ఉంది ఇవాల్టి పరిస్థితి. నామిని 'ఇస్కూలు పిల్లకాయల కథ', 'పిల్లల భాషలో ఆల్జీబ్రా' అనే రెండు పుస్తకాలు రాసారు ఇంతకుముందే. కానీ ఈ చదవుల చేతిలో నలిగిపోయే పిల్లల బాధలు చూడలేక ఈ పుస్తకం రాసారుట. ఈ పుస్తకం లో రాయదలుచుకున్న విషయాన్ని 50 మంది పిల్లలకు చెప్పారట. వాళ్ళంతా దీనికి "చదువులా చావులా" అనే పేరు పెట్టమని సూచించారట. పాపం కదూ...వాళ్ళ చిన్నారి మనసులు ఎంత నలిగిపోకపోతే ఈ మాటంటారు! బడి,చదువు అంటేనే అగ్నిగుండం లో దూకుతున్నట్టు బాధపడుతున్నారు.

(పై ఫొటో వీవెన్ గారి సౌజన్యం)

చిన్నవయసునుండే పిల్లలు ఎంత ఒత్తిడిని భరిస్తున్నారో, తల్లిదండ్రుల గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి ఎన్ని అవస్థలు పడుతున్నారో, వారి మానసిక పరిస్థితి ఎలా తయారవుతున్నాదో ఈ పుస్తకంలో ఉదాహరణలతో వివరిస్తారు. అంతేకాక పాఠాలు చెప్పే పంతుళ్ళ రాక్షసత్వం, విద్యా బోధనలోని కర్కసత్వం కళ్లకు గట్టినట్టుగా చూపిస్తారు. ఇవన్నీ నామిని కల్పించిన కథలు కావు...చేదు నిజాలు, నిజంగా కళ్ళజూచిన చేదు అనుభవాలు. ఇది ఇప్పటి విద్యావిధానాల పై స్వీయ అనుభవాలను చేర్చి ఝళిపించిన కొరడా.

తన భార్యే తన కూతురితో చదువు విషయమై ఎలా మాట్లడుతుందో, ఎలా హింసిస్తుందో కళ్లకు కట్టినట్టుగా రాస్తారు. "14 ఏండ్ల నాకూతురి మీద, 30 కేజీల నా కూతురి మీద, 300 కిలోల బరువూ బాధ్యతా" అని వాపోతారు. పిల్లలని చావచితగ్గొట్టకుండా వారికి అర్థమయిన రీతిలో బుజ్జగిస్తూ, అరటిపండు తొక్క వలిచి చేతిలో పెట్టినట్టుగా ఎలా పాఠాలు చెప్పొచ్చో వివరిస్తారు. బిడ్దను ఒళ్ళో కూర్చోబెట్టుకుని మజ్జిగన్నం తినిపించి మూతి తుడిచినంత ప్రేమతో లెక్కలు అవీ చెప్పాలి అంటారు, నిజమే కదూ!

కోళ్ళ ఫారం లా స్కూళ్ళు పెట్టి పిల్ల జీవితాలతో ఎలా ఆడుకుంతున్నారో స్వీయ అనుభవాలతో రాస్తారు. ఆయన స్వయంగా విన్న విషయం: "ఒక షెడ్డేసి రెండువేల పిల్లలతో బ్రాయ్లర్స్ పెట్టేసాను. మనకింకా అరవై అంకణాలుంది. దాంట్లో కూడా షెడ్డేసి స్కూలు పెట్టేసాను. ఏక్‌దమ్మున 200 మంది పిల్లలు చేరిపోయారు." కొత్తగా పెట్టిన స్కూలులో అంతమంది పిల్లలు ఎలా చేరిపోయారూ అని అడిగితే "బలే ఐడియా వేసానులెండి. LKG, UKG - ఫిఫ్టీ రుపీస్. 1st to 7th - 100 రుపీస్ ఫీజు. అంతే ముందు ఆట్లాగే పెట్టలి. షెడ్ బాగుంది. మద్రాసు దాకా పోయి 5 వేలు పెట్టి టాయ్స్ అవీకొనుక్కొచ్చాను. చేరి పోయారు" అని చెప్పాట్ట ఒక మహానుభావుడు.

"ఈ speed, acceleration మీ నెత్తినేసుకు రుద్దుకోండి, ఈ physics లేని లోకానికి వెళ్ళిపోతున్నాను" అని ఓ చిన్నారి ఉత్తరం రాసి పెట్టి, నిండు జీవితాన్ని బలి చేసుకున్న కథ వింటే మనసు కకావికలమవుతుంది. ఒక పాప స్కూలు డ్రెస్ మీద స్వెట్టర్ వేసుకుందిట. "ఏమ్మా ఉక్కబెడుతుంటే స్వెట్టర్ కూడా వేసుకున్నవ్" అని అడిగితే "టీచర్లు కొడతారు కదా సార్, ఈ స్వెట్టర్ వేసుకుంటే కాస్త మెత్తగా ఉండి నెప్పి తక్కువగా ఉంటుందని వేసుకున్నా సార్" అందిట. ఈ మాట విన్నాక నాకైతే ఇంకో ఉపయోగం కూడా కనిపించింది. ఆ పుస్తకాల సంచి మొయ్యడానికి కూడా, మెత్తగా ఉండి, పనికివస్తుంది అనిపించింది. చిన్న తరగతులనుండే బండెడు పుస్తకాలు మోయలేక వాళ్ళ మొహాలు ఎంత వడిలిపోతుంటాయో!


ఇంటర్ లో చదువుల గురించి రాస్తూ....కోడిని కొయ్యడానికి మెడ మీద కత్తిపెట్టాక దాని గుండెకాయలు ఎంత స్పీడుగా కొట్టుకుంటాయో అంత ఉద్విగ్నంగా ఉంటారుట పిల్లలు ఎంసెట్ ఫలితాల వెల్లడి అప్పుడు.

"చదువులో పసలేదుగానీ సోకులకేం కొదవలేదు. పుస్తకం ముందు నిముషం కూర్చోలేవు. అద్దం తీసుకుంటే మాత్రం ఒళ్లే తెలవదు. బిడ్డ చదివితే ముచ్చట. ఈ సోకులు చేసుకుంటే కాదు. ఆ సుజాతని చూడు. పుట్టుక అంటే అది! ఆ పిల్ల చదివే స్కూలే కదా నువ్వూ చదివేది, ఆ పిల్లకి చెప్పే టీచర్లే కదా నీకూ చెప్పేది. నీ తలకాయలో ఉండేది బంకమట్టి కదా" - ఒక తల్లి.

"కన్ననేరానికి టెన్త్ ఫెయిలవగానే దీనికి ఎవణ్ణో ఒక పంగమాలిన వెధవను చూసి తగిలించేస్తే పోతుంది" - ఒక తండ్రి.

"అమ్మా, తల్లి! నీ కథ నాకు తెలుసు. నువ్వు ఒక్క ఫార్ములా కూడా నేర్చుకోలేవు. నీకు పవన్ కల్యాణ మీద ఉండే శ్రద్ధ సబ్జెక్టు మీద లేదు" - ఒక టీచరు.

దీన్ని దెయ్యల భాష అంటారు నామిని. ఇది మనుషులు మాట్లాడవలసిన భాష కాదు, అందుకే ఈ పుస్తకం రాసానంటారు. మేజిక్ ఫిగర్ 500 కోసం మేథ్స్ టీచర్లు పిల్లలని ఎలా చావబాదుతున్నారో, క్లవర్లు, మొద్దులు అని పిల్లలని విడదీసి వాళ్ళ పసి మనసులని ఎంత నుసి చేస్తున్నారో అన్న విషయలు వింటుంటే మనకే గుండె తరుక్కుపోతుంది, ఇంక ఆ పిల్లల సంగతి ఏంగాను! తల్లిదండ్రులకి కూడా పిల్లల సమగ్రవికాసం అక్కర్లేదు. కావల్సినది ర్యాకులే. వారికి ఆటలు అక్కర్లేదు. లలితకళల ప్రాధాన్యత చెప్పక్కర్లేదు. మానసికోల్లాసం కలిగించక్కర్లేదు. చదివేసుకుని మార్కులు తెచ్చుకుంటే చాలు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు.

ఒకాయన వాళ్ళ పిల్లాడి రోజువారీ కార్యక్రమాల గురించి చెప్పాడట....
1)మా హరీ ఉదయన్నే నాలుగ్గంటలకి నిద్ర లేవాలి. మనసు ప్రశాంతంగా ఉండడానికి అరగంట ధ్యానం.
2)తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని, యూనిఫాం వేసుకుని రెడీ అయిపోతాడు. 5 గంటలకల్లా Maths, physics, chemistry చెప్పే ట్యూషన్ మాస్టారు వస్తాడు. 7 వరకూ ఆయన పాఠాలు చెబుతాడు. తర్వాత ఎనిమిదిన్నరకల్లా మరోసారి రివిజన్ చేసుకుని కప్పు నానబెట్టిన బఠానీలు, ఒక గ్లాసుడు పాలూ...స్కూలికెళ్ళిపోతాడు.
3) 12-45కి మధ్యాహ్నం భోజనం, డ్రైవర్ తీసుకెళ్తాడు, రోకటితో దంచిన దంపుడు బియ్యం భోజనం-అదీ 150 గ్రాములు. మరోవంద గ్రాముల దాకా పచ్చి కూరగాయలు. గుడ్డూగానీ మటన్ గానీ నహీ. పిల్లవాడు sharp గా ఉండడానికి ఉడకబెట్టిన వంటలేవీ లేవు - అంతా పచ్చికూరగాయలే!
4) సాయంకాలం నాలుగ్గంటలకల్లా స్కూలుకెళ్ళి వాణ్ణి pick up చేసుకుని 4.30 కి - నల్లకుంట రామయ్య కోచింగ్ సెంటర్ లో సీటు రావడానికి తీసుకునే కోచింగ్. 7.30 కి అక్కడ అయిపోతుంది.
5) రాత్రి ఎనిమిదికి ఇంటికి రాగానే మంచినీటి స్నానం. అర్థగంట ప్రశాంతత కోసం flute వాయించాలి. 8.30 కి పచ్చికూరలతో దంపుడు బియ్యం భోజనం.
6) రాత్రి పదకొండు దాకా మళ్ళీ subjects మీద పడడం.

ఇలాగే రోజూ జరుగుతుందిట. ఆదివారాలు ట్యూషన్ మాస్టర్లు, కోచింగ్ సెంటర్లూ...బలే బిజీ. ఆ తండ్రికి ఇదొక యజ్ఞంట. ఇంతా చేస్తే ఆ కుర్రాడు చదువుతున్నది 8 వ తరగతి. ఈ మహా యజ్ఞం గురించి సదరు తండ్రే స్వయంగా నామిని కి చెప్పాడుట.

ఒక పిల్లడు తన నోట్స్ చివర టైమ్ టేబిల్ లో సోమ నుండీ శని వరకూ అన్ని పీరియడ్లలోనూ playing అని రాసుకుని చివరి పీరియడ్లో మాత్రం subject రాసుకున్నాడట. ఏంటమ్మా ఇలా టైమ్ టేబిల్ తయారుచేసుకున్నావ్ అని అడిగితే "ఇలా ఉంటే ఎంత బాగుంటుందా అని తమాషాగా రాసుకున్నా" అన్నాడుట. పాపం ఆ పిల్లవాడికి ఆడుకోవాలని ఎంత ఆశగా ఉండి ఉంటుందో కదా! ఇటువంటి దృష్టాంతాలెన్నో కళ్ళకుగట్టినట్టుగా రాసారు. ఆ పిల్లల బాధలు వింటూ ఉంటే మనసు చివుక్కుమంటుంది.

ఈ మధ్య నేను ఇంకో కొత్త విషయం చూసాను. ఒక కార్పరేటు స్కూల్లో మాకు తెలిసినవాళ్ళ పిల్లాడిని LKG లో పడేసారు. అక్కడ రూలు ఏమిటంటే పిల్లలు ఆ రోజు ఏమి తినాలో వాళ్ళు ముందే చార్ట్ ఇచ్చేస్తారుట. మొత్తం స్కూల్లు ఉన్న అన్నిరోజుల్లోను పిల్లలకి బాక్సుల్లో ఏమి పెట్టి పంపించాలో రాసి ఇచ్చేస్తారట. తల్లిదండ్రులు అవే చేసి పెట్టాలట. మారిస్తే ఒప్పుకోరుట, ఏదో ఫైన్ ఉంటుందిట. అయితే అందులో బలవర్థకమైన ఆహరమే ఉంది. కానీ ఇదేం దౌర్భాగ్యం, వాళ్ళు ఏమి తినాలో కూడా స్కూలు యాజమాన్యమే నిర్ణయిస్తుందా! ఒకవేళ ఆ తల్లిదండ్రులకి అలా చెయ్యడం కుదరకపోతే? ఒక తల్లిదండ్రుల ఆవేదన ఏమిటంటే - మంచి స్కూలని, ఎలాగొలా కష్టపడి స్కూలు ఫీజు కట్టి జాయిన్ చేసారు కానీ ఈ రూలు ప్రకారం ఆహారాన్ని అందించగలిగే స్థోమత లేదు...ఈ రూలు మా పిల్లకి పెట్టకండి అని ఎంతో ప్రాధేయపడినా యాజమాన్యం ఒప్పుకోలేదు. దాంతో ఇంక గతి లేక ఆ పిల్లని ఆ స్కూలునుండి విడిపించి వేరే స్కూలులో జాయిన్ చేసారు. ఇది నా కళ్ళముందే జరిగిన విషయం. ఆ తల్లిదండ్రులని చూస్తే నాకు బలే జాలేసింది. అయితే కొంతమంది తల్లిదండ్ర్లులు దీన్నో గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఇలాగైనా పిల్లలకి తిండిలో క్రమశిక్షణ అలవడుతుందని, పోషకపదార్థాలు చేరుతాయని. అలా రూలు ఉండడమే మంచిదని కొందరి భావన.

కార్పరేటు స్కూళ్ళ పరిస్థితి ఇలా ఉంటే గవర్నమెంటు స్కూళ్ళ పరిస్థితి మరో రకంగా ఉంది. నాకు తెలిసిన స్నేహితుడి అక్క, బావ ఇద్దరూ గవర్నమెంటు బడులలో టీచర్లు. అక్కడ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదుట. ఇన్స్పెక్షన్ కి వస్తే వీళ్ళే రిపోర్టులు రాసి ఇచ్చేస్తారుట. చదువు లేక, చెప్పేవారు లేక ఆ పసిమొగ్గలు బాధపడుతున్నాయి. అంతెందుకు మా విజయనగరంలో జరిగిన ఒక కథ: నాతోపాటూ BA చదివిన ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను BA లో ఒకసారి ఫైల్ అయి రెండోసారి ఎలాగోలా పూర్తి చేసాడు. తరువాత ప్రైవేటుగా MA కట్టి మూడు సార్లు ఫెయిల్ అయి, నాలుగోసారి గట్టెక్కించాడు. అతనికి, మా విజయనగరంలో, ఓ 30 సంవత్సరాలపాటు మంచి బడిగా ప్రసిద్ధి చెందిన ఒక స్కూల్లో సైన్సు టీచరుగా ఉద్యోగం. పార్ట్ టైమే గానీ ఇతనే ఆ పిల్లలకి పాఠాలు చెప్పేది. మళ్ళి 10 వ తరగతి పిల్లలకి చెబుతున్నాడట. పాఠాలు పెద్దగా చెప్పక్కర్లేదుట. ఏదో నోట్స్ ఇస్తే చాలుట. పిల్లలు పాస్ అయినా ఫెయిల్ అయినా అనవసరం. మన జీతం మనకొస్తుంది అని అతను చెబుతుంటే నోరు వెళ్లబెట్టుకుని వినడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయాను.

మొత్తనికి ఎక్కడైనా నలిగిపోయేది పసికందులే. పిల్లలకి తల్లిదండ్రుల మీద ఆశ ఉండొచ్చుగాని అది వారికి భారం కారాదు. "మనకి తలకాయలైతే ఉన్నాయిగదా ఆలోచిద్దాం" అంటారు నామిని. ఇదే విషయంపై నామిని పదే పదే రాస్తున్నాడు, ఇక ఆపితే బాగుందును అన్నది ఒక విమర్శ. కానీ పైన చెప్పిన లాంటి పరిస్థితులున్నప్పుడు ఇలాంటి పుస్తకాలు ఇంకా ఎన్నో, ఎన్నెన్నో రాయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. "చదువులా చావులా" ప్రతీ ఒక్కరూ చదవవలసిన పుస్తకం ఇది. వెల 20 రూపాయిలు మాత్రమే. నేనైతే ఇది పదిమందికి పంచిపెట్టి, వీలైనంత మంది చేత చదివించాలని నిర్ణయించుకున్నాను. అంటే ఇది చదివేసి తల్లిదండ్రులూ,టీచర్లూ అందరూ మారిపోతారని కాదు, కనీసం ఆలోచిస్తారని. మరి మీరు కూడా చదువుతారు కదూ?


Friday, February 25, 2011

చిత్రమాలికలో నా వ్యాసం - 1

చిత్రమాలికలో వ్యాసపరంపర ఇలా మొదలెడతానని కలలో కూడా అనుకోలేదు. అంతా ఆ రమణ గారి వల్లే...చెప్తా చెప్తా ఆయన సంగతి...దీనికి ప్రతిఫలంగా ఆయన రచనలన్నిటినీ నేను ఇంకో పది సార్లు చదివి మరో పదిమంది చేత చదివిస్తా ఆ.

Thursday, February 24, 2011

చీకటి రోజు :(

ఈరోజు ఎంతటి అశుభదినం...నాకు కన్నీళ్ళు ఆగట్లేదు. మా అభిమాన రచయిత ముళ్ళపూడి వారు ఇక లేరనే నిజం నన్ను వణికిస్తోంది. ఇన్నాళ్లు మనల్ని ఆయన కోతికొమ్మచ్చి ఆడించి ఇప్పుడేమో జాటర్ డమాల్ అనేసారు. నాకే ఇలా ఉంటే బాపూగారికి ఎలా ఉంటుండో ఊహించడం కూడా కష్టంగా ఉంది. అప్పుడెప్పుడో ఒకసారి "నా తెగులు" మృత్యుంజయ్ గారు బాపూ గారి బొమ్మ వేసి బ్లాగులో పెడితే సరిగ్గా రాలేదండీ...బహుసా బాపూగారిని ఒంటిరిగా వేసారు కదా రమణ గారిని పక్కనబెట్టకుండా అందుకే బాగా రాలేదేమో" అని నేను వ్యాఖ్య రాసాను. ఆయన కూడా దానికి ఒప్పుకున్నారు. బాపూ-రమణలని విడదీసి చూడడం మన కళ్ళకి అలవాటు లేదు. మనకే అలవాటు లేకపోతే బాపూగారికి ఎలా ఉంటుంది! ఈ కష్టాన్ని తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని బాపూగారికి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

క్రితసారి చెన్నై వెళ్ళినప్పుడు వారిరువురినీ కలవాలని ప్రయత్నించాను. వారు బిజీగా ఉండడం, నాకు టైం కుదరకపోవడంతో కలవలేకపోయాను.వచ్చేసారి వెళ్ళినప్పుడు తప్పకుండా కలవాలని ఒట్టుపెట్టుకున్నాను....ఇప్పుడిలా...మాటలు రావట్లేదు, దుఖం తన్నుకుని వస్తోంది. గుండెకోత కోసినట్టుగా ఉంది. అభిమాన ఉంటే ఇంత దుఖం వస్తుందా....నాకు తెలీదు. ఆయన నా మనసుకి ఇంత దగ్గరవారని....ఇంత అనురాగాన్ని నింపుకున్నానని నాకు ఈరోజు బాగా తెలుస్తోంది. భానిమతిగారు చనిపోయినప్పుడు ఏడ్చాను, మళ్ళీ ఇప్పుడు ఏడుపు ఆగట్లేదు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. మొదటిసారి భానుమతిగారిని కలుసుకోవాలని తీవ్ర నిర్ణయం తీసుకున్న ఒక నెల రోజులకే ఆవిడ పోవడం, ఇప్పుడు ఏప్రిల్ లో చెన్నై వెళ్ళేటప్పుడు బాపు-రమణలని కలవాలని ఒట్టుపెట్టుకోవడం...ఇలా జరగడం. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో...ఇంక నేను వారిని చూడలేను కదా.

రమణగారి మీద ఉన్న ప్రేమతో ఆయన పుట్టినరోజునాడు ఒక టపా కూడా రాసాను. ఆయన రమణీయాలు చదివి ఎంత ఉత్సాహాన్ని పొందానో నాకే తెలీదు. ఆయన రచనాశైలి అద్వితీయం. ఆ శైలికే నేను కట్టుబడిపోయాను. నేను ఈ సమయంలో చెయ్యగలిగినది ఒక్కటే ఆయన రచనలను చదవడం, వీలైతే కొందరిచేతైనా చదివించగలగడం. రమణ గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. బాపూ గారికి మనశ్శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.

ఆయన గురించి నేను రాసిన పోస్ట్ మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను.

ముళ్ళపూడి వెంకట రమణ గారి గురంచి తెలియనివారు ఆంధ్రదేశంలో ఉండరు. ఆయన గురించి అందరు అన్ని రకాలుగా చెప్పేసారు, పొగిడేసారు. ఇహ నేను కొత్తగా చెప్పాల్సిందేమీలేదు. ఈరోజు ఆయన జన్మదినం...ఆయనకెలాగూ ముఖాముఖి జన్మదిన శుభాకాంక్షలు తెలుపలేము కాబట్టి ఆయన కలము నుండి జాలువారిన హాస్య చతురోక్తులలో కొన్నింటిని తలుచుకోవడమే ఆయనకు నేను చెప్పగల జేజేలు.

రమణగారి భాష గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆయన రచనలే అందుకు సాక్ష్యాలు. ఆయన జీవితం ఒక ముళ్ళబాట, జీవితంలో కష్టాలను అలవోకగా అవేమీ పట్టనట్టు అలా అలా రాసేస్తారు, చదువుతున్న మనకే కన్నీళ్ళు ధారలా కారిపోతాయి. ఆయన గురించి ఒకచోట శ్రీరమణ అంటారూ...
"పచ్చని గోరింటలో అరుణిమలు దాగినట్లు
ముళ్ళపూడి నవ్వుల్లో ముళ్ళలాంటి వేదన"

బాపు-రమణ అంటే స్నేహం అని మనం నిర్వచనం చెప్పుకోవచ్చు.
రమణగారి మానసపుత్రుడు బుడుగు గురిచి తెలియనిదెవరికి?
రమణగారు బోలెడు రమణీయాలు రచించారు....సినీరమణీయం, కదంబరమణీయం, ఇలా ఎన్నో....వాటిల్లో కొన్ని రమణీయమైన గుళికలు......

ఒకసారి ముళ్ళపూడి వారికి అప్పు అవసరమై ఒక స్నేహితుడికి ఫోన్ చేసి అడిగారట.

రమణ: ఓయ్ కాస్త అప్పు కావాలోయ్
స్నేహితుడు: అలాగా, ఎప్పటికి కావాలి?
రమణ: మొన్నటికి

....ఇలా ఉంటుంది వీరి వ్యవహారం

...............................
రచయితల మీద వేసిన జోకు:
"నా కొత్త నవల మీద పత్రికలో విమర్శ వేయించండి" అంటూ రచయిత ఒక పుస్తకం అందించాడు. పుస్తకం బాగా నలిగి చిరిగిపోయింది.
"పబ్లిషర్ నాకు ఒక్కటే కాపీ ఇచ్చాడండీ, మా అబ్బాయి దాన్ని నలిపి చింపేశాడు, మరోలా అనుకోకండి," అన్నాడు రచయిత.
"అయితే ఇంకా విమర్శ ఎందుకు? మీ అబ్బాయి అభిప్రాయం తెలుస్తూనే ఉందిగా" అన్నాడు సంపాదకుడు.

"1960 లో తన ఋణానందలహరి పుస్తకం ఫస్ట్ ఎడిషన్ వెలువడింది. ఆ కాపీని ఇచ్చేటప్పుడు దానిపై అచ్చుతప్పులతో, అభినందనలతో అని రాసి మరీ సంతకం చేసి ఇచ్చారట ఆ గ్రంధకర్త శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ-కొంత వరకైనా పాప పరిహారం అవుతుందని."
....................................
ఎత్తిపొడుపులలో రమణ గారి చమత్కారం:
"ఆహా కోట్లార్జించినా మీలో ఆవగింజంత మార్పు కూడా లేదండీ, నాడెంతో నేడూ అంతే" అన్నడొక స్నేహితుడు.

"మార్పులేకేం. పూర్వం నేను పొగరుబోతుని, ఇప్పుడు నాది ఆత్మవిశ్వాసం. లోగడ మొండి రాస్కెల్ ని, ఇప్పుడు చిత్తశుద్ధి-దృఢసంకల్పం కలవాడిని. ఆ మధ్య జడ్డివెధవని, ఇప్పుడు సజ్జనుణ్ణి. లోగడ నోరు విప్పితే అవాకులు -చవాకులు దొర్లేవి, ఇప్పుడు చమత్కారంగా.....సరసంగా మాట్లాడుతున్నాను అంటున్నారు" అన్నాడు శ్రీమంతుడు.
..................................
దృష్టిలోపం:
ఒక కళాసృష్టి జరిగినప్పుడు
రసికుడు: అందులో మంచినీ, అందాన్ని వెతుకుతాడు
విమర్శకుడు: అచ్చుతప్పుల్నీ-తతిమా దోషాల్ని వెతుకుతాడు.
సెన్సారువాడు: బూతునే వెతుకుతాడు
.............................................
జోస్యం
"మీరు డెబ్బైయేళ్ళు బతుకుతారండీ"
"ఏడిసినట్టే ఉంది, నాకు ఇప్పుడు డెబ్బైయేళ్ళే"
"చూసారా, నే చెప్పలే!"
..........................

ప్రముఖుల గురించి రమణగారి మాటల్లో

అమరావతి కథల గురించి చెప్తూ...
"అమరావతి కథలు ప్రేమతో, భక్తితో, ఆవేశంతో సత్యంగారి హృదయం లోంచి ఉప్పొంగాయి. జలపాతంలా ఉరికాయి. బాలకృష్ణవేణిలా పరిగెత్తాయి. స్వామి కోవెల దగ్గర కృష్ణలా భయభక్తులతో తలవంచుకుని నడిచాయి" అన్నారు.

సాలూరి రాజేశ్వరరావుగారి గురించి....
"నిఘంటువులో 'శ్రావ్యసంగీతం' అనే మాటకి అర్థం రాయటానికి మాటలు వెతికి చేర్చేబదులు రాజేశ్వరరావు అని టూకీగా రాస్తే చాలు"

యెస్.వి.రంగారావు గురించి....
"వెండితెరకి రాకుంటే రంగారావు ఏం చేసేవాడు? ఎప్పుడో అప్పుడు ఝామ్మని వచ్చేసేవాడు, అందుకు సందేహమేమిటి!"

కె.వి.రెడ్డి గురించి.....
కృతకమైన సాంఘికం కన్నా సహజమైన జానపదం లక్షరెట్లు మెరుగు. కె.వి. దగ్గర ఉంటే పది లక్షలు మెరుగు. దైవమిచ్చిన జానపదానికి మకుటంలేని రాజు కె.వి.

భానుమతి గురించి.....
చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షర క్రమాన పేర్లు ఎన్నికచేస్తే "బి" శీర్హిక కింద బహుముఖ ప్రఙ్ఞావతి భానుమతి పేరు చేరుతుంది"

రమణగారి గురించి ఇలా రాసుకుంటు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో....ఒక జీవితం చాలదు!
......... అశృనయనాలతో నివాళులర్పిస్తున్నాను.

Thursday, January 27, 2011

యేడాదయిందోచ్!

చాలారోజులయింది నా బ్లాగ్ మొహం చూసి. ఈ సంవత్సరానికి ఇదే మొదటి పోస్టులాగుంది (కొత్తసంవత్సర శుభాకాంక్షలు మినహాయిస్తే). ముందుగా నా ఈ పోస్ట్ చదువుతున్నవాళ్ళందరూ నాకు శుభాకాంక్షలు తెలుపండి. నేను బ్లాగు రాయడం మొదలెట్టి ఒక సంవత్సరమైంది (జనవరి 9 కి). దిగ్విజయంగా బ్లాగుల్లో యేడాది పూర్తిచేసినందుకు సంతోషంగా ఉంది. ఈ యేడాదిపాటూ నాకు చేయూతనిచ్చి, ప్రోత్సహించిన బ్లాగ్మితృలందరికీ ధన్యవాదములు. నా చేత బ్లాగు మొదలెట్టించిన ఒక అజ్ఞాత అభిమానికి కృతజ్ఞతలు. అసలు ఆ అజ్ఞాత బ్లాగు మొదలెట్టమని చెప్పినప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. కాబట్టి అతనికి/ఆమెకి ప్రత్యేక ధన్యవాదములు. ఈ సంవత్సరకాలంలో నేను కొద్దిమంది స్నేహితులని, కొద్దిమంది శతృవులని సంపాయించుకున్నాను. శతృవులందరూ అజ్ఞాతలే కాబట్టి వారి సంగతి పక్కనబెడితే కొందరు వ్యక్తులతో నాకు కలిగిన స్నేహం మరపురానిది, అపురూపమయింది. నా బ్లాగు కష్టాలలో అండగా నిలిచి, చేయూతనిచ్చిన నా స్నేహితులకు ఇవే మనఃపూర్వక కృతజ్ఞతలు. నన్ను మెచ్చుకుంటూ/వ్యతిరేకిస్తూ కామెంట్ల వర్షం కురిపించినవారందరికీ పేరు పేరునా ధన్యవాదములు.

ఈ సంవత్సర కాలంలో 38 పోస్టులు రాయగలగడమే కాక మరొక కొత్త ఫొటోల బ్లాగు కూడా మొదలెట్టగలిగాను. 4000 పైచిలుకు హిట్లు వచ్చాయి. అందులో పైచిలుకు హిట్లు నేను చూసినవే అనుకున్నా నాలుగువేల సంఖ్య చూడముచ్చటగా ఉంది. నేను చర్చించదలుచుకున్న విషయాలు మరెన్నో ఉన్నా, ఇప్పటివరకూ రాసినవి సంతృప్తికరంగానే ఉన్నాయి. నా రాత, టపా టపాకి అభివృద్ధి చెందతున్నదని మితృలు చెబుతున్నప్పుడు సంతోషంగా ఉంది. ఈ రకంగా తెలుగుకి మరింత దగ్గరగా ఉండడంలో ఒక ఆనందం లభిస్తున్నాది. నాకిష్టమైన సాహిత్య చర్చకు ఇక్కడ ఎక్కువ ఆస్కారం లభిస్తుండడం కూడా సంతోషంగా ఉంది. తెలుగులో వస్తున్న కొత్త సాహిత్య ప్రక్రియలు, కథలు, కవితలు అన్నిటినీ తెలుసుకునేందుకు చాలా ఉపయోగకరంగా ఉంది. అంతేకాక బిజీ బిజీ బ్రతుకులలో నా అల్లరిని, చిలిపితన్నాన్ని బయటపెట్టుకునే మరో వేదికగా కూడా మారింది. నా ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకునేందుకు నాదంటూ ఉన్న నా బ్లాగుపై మక్కువ ఎక్కువతూనే ఉంది. ఈ బ్లాగు ఒక వ్యాపకం స్థాయి నుండీ వ్యసనం స్థాయికి పెరిగి దుర్వ్యసనంగా మారుతుందేమోనని భయంగా ఉంది. :)

మరొక్కసారి నన్ను ప్రోత్సహించిన మితృలందరికీ ధన్యవాదములు. ఈ కొత్త సంవత్సరంలో కూడా మీ ప్రోత్సాహాన్నీ ఆశిస్తున్నాను, ఇస్తారు కదూ!