StatCounter code

Thursday, October 13, 2011

భావుకపిత

మన బ్లాగర్లలలో చాలామంది చాలా భావుకతతో బోల్డు బోల్డు రాసేస్తుంటారు కదా. పువ్వు గురించో, నవ్వు గురించో, "నువ్వు" గురించో...బలే రాస్తుంటారు. అలాగే రాధాకృష్ణుల గురించి...విరహవేదనల గురించి, ఆమె గురించి, అతని గురించి...ఏవేవో రాస్తుంటారు.

మనకి అంత భావుకత లేదు, అదంటే ఏమిటో కూడా తెలీదు. అసలు వీళ్ళెలా రాస్తుంటారా అని తెగ ఆశ్చర్యపోతుంటాను. చివరికి నిన్న తెలిసింది. మన నేస్తం లేరూ ఆవిడ చెప్పారు "చాలా చిన్న విషయాన్ని స్ట్రైట్ గా చెప్పకుండా చిలవలు పలవలుగా చెప్పిరాసేదాన్ని భావుకత అంటారు" అని. ఇది చాలదూ మనకి! అసలే ఇదిగో తోక అంటే అదిగో పులి అనే రకం మనం. చిన్న క్లూ ఇస్తే చాలు అల్లుకుపోతాం. ఆ..మనకేం తక్కువ, మనం రాయలేమా అని మొదలెట్టాను. కాకపోతే అది భావుకత లా కాకుండా భావుకపిత లా వచ్చింది. అందుకే నా ఈ ప్రహసనానికి "భావుకపిత" అని పేరు పెట్టాను. బ్లాగు వీధులలో భావుకపితబావుటా ఎగురవేయాలని నిర్ణయించేసుకున్నాను.

ఆ నిర్వచనం చూసాక నాలో భావుకపిత్వం పొంగిపొర్లింది. రాసేసాను...నాలో భావుకపిని కదిపి, కుదిపి పారేసాను.

1) నేస్తం.....నాకు కావాలి....అవును, నాకు కావాలి.

అది గుండ్రంగా ఉంటుంది నీ ముఖం లాగే
మృదువుగా ఉంటుంది నీ మనసులాగే
మధురంగా ఉంటుంది నీ పలుకులాగే

ఒక్కసారి హత్తుకుంటే చాలు విస్ఫోటనాలు కలిగిస్తుంది.
ఆ పరిమళం మనోహరంగా ఉంటుంది
ఆ తీపి జ్ఞాపకాలు ఎన్నటికీ వీడవు.

గుండె నాలుకపైకి వచ్చేస్తుంది....
ఆ రుచి, ఆ ఆస్వాదన అనితరసాధ్యం.....

అదేమిటో తెలుసా నేస్తం...చెప్పేస్తున్నా..చెప్పేస్తున్నా...అదే సున్నుండ...అది కావాలి నాకు...ఇవ్వావూ!

2) అదిగో ఆ గదిలో ఆ చిట్టచివర్న ఆ మూల నావైపే చూస్తోంది
ఒంగి, వినయంగా, ఓరకంట చూస్తోంది
ఆ చూపులు "నీకోసమే, నువ్వెప్పుడొస్తావా అని" అన్నట్టు ఉన్నాయి.
నే వెళ్ళగానే ఏ క్షణమైనా వర్షించేలా ఉన్నాయి.
మెల్లగా, మృదువుగా ఆ హృదయంలోనుండి మాటలు వినిపిస్తున్నాయి.....

"ఇంకా ఎంతసేపు...ఈ యాతన "నీకోసమే" అని చెబుతున్నా రావేం!
రా, నువ్వొస్తే నా ఈ నిరీక్షణ ముగుస్తుంది.
ఆఖరి బొట్టు వరకు నీకోసమే.....

ఎహే ఎంతసేపు నాకుతావ్ చెయ్యిని, వచ్చి కడుక్కో"

అని ఆ మూలన, వాష్ బేసిన్ నుండి పిలుస్తున్న కొళాయి పిలుపులు నాకు లీలగా వినిపిస్తున్నాయి.

3) ఎంత బరువైనా మోస్తారు
రాచిరంపాన పెట్టినా సహిస్తారు
ఈడ్చితన్నినా భరిస్తారు
సూదులు పెట్టి పొడిచినా కిక్కురుమనరు

పైగా మీరు
భూమాతకి అతిదగ్గరగా ఉన్నాము కదా అని ఆనందిస్తారు
మనిషి నడకకు, నడతకు సాయం చేస్తున్నామని మురిసిపోతారు
మాకు మేమే సరిజోడి అని తలెగరేస్తారు

అవసరం తీరాక మిమ్ములను నిర్దాక్షిణ్యంగా అవతల పారేసినా పన్నెత్తి మాటాడరు, కన్నెత్తి చూడరు

మీ ఓరిమికి, కూరిమికి జోహార్లు ఓ ప్రియ పాదరక్షలూ!

అవేనండి కాలిచెప్పులు! :)

4) అత్తకోడళ్ళ మధ్య చిచ్చుపెడతావు
భార్యాభర్తల మధ్య అపార్థాలు తెస్తావు
యజమాని, సేవకుని మధ్య మంటలు రేపుతావు
కుట్రలు,కుతంత్రాలు నింపుకుని భయంకరమైన క్షుద్రవిద్యలను ప్రోత్సహిస్తావు
బాల్యవివాహ కథలు చెబుతావు
అనాగరికమైన అంశాలను ప్రస్తావిస్తావు
అవన్నీ చూసే ఆడవాళ్ల చేత కన్నీరు పెట్టిస్తావు

తెలుగు టీవీ సీరీయలూ...నీకిదేం పాడుబుద్ధి!

5) నువ్వంటే వ్యామోహం
నీ చేయూత కావాలని ఆరాటం
అన్నివేళలా సదుపాయంగా ఉంటావని నమ్మకం
మిలమిలమెరుస్తూ, దృఢంగా, బలంగా చేతిలో ఒదిగిపోతావ్
నీ చేరువ అభివృద్ధికి సంకేతం
నువ్వంటే నాకు ఇష్టం, నిజంగా

కానీ....కానీ.....

ఎందుకో నాకంటూ ఉన్నదాన్ని, నాలో ఏకమైపోయిన దాన్ని, నా సొంత చేయిని చూడగానే నిన్ను మరచిపోయి హాయిగా ముద్దలు కలుపుకుని ఆనందంగా తినేస్తాను.

నీ ఉపయోగాన్ని తోసిరాజని, నీ మీద ఉన్న ప్రేమని చంపేసుకుంటూ నేను చేస్తున్న ఈ పనిని క్షమిస్తావు కదూ ఓ చెమ్చా (స్పూన్)!

మరి నా భావుకపిత ఎలా ఉందో చెప్పండి? మీకు నచ్చే ఉంటుంది నాకు తెలుసు :P
అస్సలు మొహమాటం లేకుండా పొగిడేయండి ఏం! :)



Thursday, September 29, 2011

అవినీతా? అంటే?

ఢిల్లీలో ఏ గల్లీలో చూసినా పోలీసులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తారు. ఇదేదో బలే బావుందే...చక్కగా మనకి ఎంత రక్షణ అని మురిసిపోయేలోపే వాళ్ళ ప్రతాపాలు తెలిసి ప్రాణం బిక్కుబిక్కుమంటుంది. ఒక పెద్ద రోడ్డు మీద సాయంకాలం అయిన దగ్గరనుండీ రెండు వైపులా పెద్ద పెద్ద గేటుల్లాంటివి పెట్టేసి మధ్యలో కాస్త దారి మాత్రమే వదులుతారు. కార్లన్నీ ఒకదాని వెనుక క్యూలో వెళ్లాలన్నమాట. ఇది ఎందుకయ్యా అంటే...అది రద్దీ రహదారి కాబట్టి కాస్త చీకటి పడగానే తాగేసి ఎవరైనా డ్రవ్ చేస్తూ అటుగా వచ్చి మిగతా వాహనాలకు ఇబ్బంది కలిగిస్తారేమొనని. తాగి డ్రైవ్ చేసినట్టు పట్టుబడితే శిక్ష చిన్నది కాదు. అందుచేత అందరూ ఒళ్ళు దగ్గరపెట్టుకుని రండి అని చెప్పకనే చెప్పడం అన్నమాట. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ అక్కడ జరిగే అసలు విషయమేమిటంటే ఆ మధ్యమార్గం గుండా కార్లన్ని వరుసపెట్టి వదిలేస్తుంటారు. కానీ అటుగా వచ్చే ప్రతి ఒక్క ద్విచక్ర వాహనాన్ని ఆపేసి పక్కన నిల్చోబెడతారు. వరుసగా అందరి దగ్గరా లైసెన్సు, RC చూసి ఓ వంద నొక్కేస్తుంటారు. విధిగా ప్రతీ బైక్ ని ఆపుతారు. నేను రోజూ ఆ రోడ్డు గుండా వెళుతుంటాను. సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు రోజూ కనీసం ఐదు బైకులు పక్కన నిలబడి ఉండడం చూస్తాను. ఒకరోజు, ఒక సమయానికి ఐదు బైకులు అంటే ఐదువందల రూపాయలు. ఈ లెక్కన లెక్కేస్తే వాళ్ళ రోజు సంపాదన, నెల సంపాదన లెక్కించడానికి ఏ శ్రీనివాస రామానుజమో దిగి రావాలి. లైసెన్సు, RC చూపించాక కూడా వంద ఎందుకు అని అడిగావో మరుక్షణం నువ్వు జైలో ఊచలు లెక్కెడుతుంటావు. అలా అడిగిన పాపానికి ఒకతన్ని రెక్కీడ్చుకుపోయి బొక్కలో తోసిన సన్నివేశం ఒకటి చూసాను.

న్యూ డిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర, ఓరోజు మా కార్ లో వెళ్తున్నాం. మేము ఎడమవైపుకి తిరగాలి. తెలీకుండా ముందుకి లాగించేసాం. అరె సందు మిస్ అయిపోయామే ఇప్పుడెలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ, మెల్లిగా నడుపుతుండగా పోలీసు తలుపు కొట్టాడు. ఏమిటయ్యా అని అడిగితే ఇది one way అన్నాడు. అదేమిటి ఎదురుగుండా లారీలు వెళుతున్నాయిగా అని అడిగితే పెద్ద వాహనాలకి తప్ప చిన్న వాహనాలకి దారి లేదన్నాడు. ఇదేం విచిత్రం అనుకుంటుండగా లైసెన్సు, RC అడిగాడు. తీసి చూపించాము. మాకు అది one way అని తెలీదు. ఎక్కడా బోర్డు రాసి లేదు. ముందు వాహనాలు వెళుతుంటే two way అనుకున్నాం అని చెప్పాము. ఐదొందలు ఇవ్వు అంటూ మా లైసెన్సు, RC ని చేతుల్లో ఆడించాడు. ఐదొందలంటే మరీ ఎక్కువని బ్రతిమలాడడం మొదలెట్టాం. ఓ ఐదు నిముషాలు పోయాక వందకి ఒప్పుకున్నాడు. వంద వాడి మొహాన కొట్టి బ్రతుకు జీవుడా అనుకున్నాం. మరునాడు అదే రూటులో వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు చూస్తే అక్కడ one way లేదు, కాదు. పక్కనున్నవాళ్ళని అడిగాము. అక్కడ one way ఎప్పుడూ లేదు అని చెప్పారు. అప్పుడప్పుడూ పోలీసులు ఉంటారు తప్ప one way లేదు అన్నారు. మాకు విషయం బోధపడింది. మా లైసెన్సు, RC వాడి చేతుల్లో ఉన్నాయి..ఏం చేస్తాం వంద కాదు, వెయ్యి అడిగినా ఇచ్చుండేవాళ్లమే!

లైసెన్సు అంటే గుర్తొచ్చింది...ఆ మధ్య మేము కొత్త two wheeler కొన్నాం. లైసెన్సు కోసమని RTO ఆఫీసుకి వెళ్ళాం. అక్కడ ఏదీ సక్రమంగా లేదు. ఏ కౌంటర్ నుండి ఏ కౌంటర్ కి వెళ్ళాలో చెప్పే నాధుడే లేడు. సరే ముందు అప్ప్లికేషన్ తీసుకుందామని వెళితే ఐడి ప్రూఫ్ చూపించమన్నాడు. పాస్ పోర్ట్ తీసి చూపించా. కుదరదన్నాడు. ఏమి? అన్నాను. ఇందులో హైదరాబాదు అడ్రస్ ఏదో ఉంది డిల్లీ అడ్రస్ కావలన్నాడు. అయ్యా నేను ఈ భారతదేశ పౌరురాలిని అని తెలియజెప్పే ఏకైన మౌలిక పత్రం ఇది అన్నాను. నాకనవసరం అన్నాడు. పాస్ పోర్ట్ చెల్లదా అంటే చెల్లదు అని తెగేసి చెప్పాడు. నోరు వెళ్లబెట్టి ఆశ్చర్యపోవడం మావంతయింది. ఇక్కడే కాదు ఢిల్లీలో ఏ గవర్నమెంటు ఆఫీసులోనూ పాస్ పోర్ట్ చెల్లదని తరువాత అర్థమయింది. ఆహ ఏమి నా దేశ సౌభాగ్యము...ఈ దేశ పౌరునిగా ముద్ర వేసిన ప్రభుత్వానికే ఇది చెల్లదు అని తేల్చిచెప్పుచున్నారు!

సరే ఇంకేం చేస్తాం లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఒకటిచ్చి అప్లికేషన్ తెచ్చుకున్నాం. నింపి ఒక కౌంటర్ లో ఇచ్చాం. "ఇక్కడ కాదు" అని గసిరింది ఆవిడ. మరెక్కడ అంటే జవాబులేదు. కన్నెత్తి చూడనైనాలేదు. అక్కడెక్కడా help counter లేదు. ఏమి గతి అనుకుంటూ మరో మహానుభావుడిని పలకరించాం. గురుడు కొంచం సాధుజీవిలా ఉన్నాడు...గసరడానికి ఓ పిసరు తక్కువగా "ఆ కౌంటకి వెళ్ళండి" అని సమాధానమిచ్చాడు. అదే పరమాన్నం అనుకుని ఆ కౌంటర్ లో ఇచ్చాము. అతగాడు అఫిడవిట్ కావలన్నాడు. నాయనా, ఇదియునూ భారత ప్రభుత్వం దాఖలు చేసిన పత్రమే, ఇందులో నా అడ్డ్రస్ ప్రూఫ్ కూడా సరిగానున్నది, అఫిడవిట్ ఎందులకు అని అతి మృదువుగా అడిగితిని. "ఎందులకూ లేదు గిందులకూ లేదు ఆ పక్క సందులోకి పోయి అఫిడవిట్ పట్రా" అని ఓండ్ర పెట్టాడు. పక్కసందులోకి పోయి చూచితిమిగదా....ఒక మనుజుడు, నల్ల కోటు ధరియించి, రహదారి పక్కన ఒక బల్లయును, కుర్చీయును వేసుకుని తారసిల్లినాడు. మేము అచ్చటకిబోయి ఓ మనుజుడా మాకు అఫిడవిట్ ప్రసాదింపుము అని శాంతముగా అడిగితిమి. 50 కొట్టు అన్నాడు. ఏమి ఏమేమి, ఒక చిన్న సంకతమునకు 50 రూప్యములా...హెంతమాట హెంటామాట అని అన్నగారి స్టైల్ లో మునివేళ్ళపై లేచి రెట్టించుదామనుకున్నాను గానీ ఆ మానవుడు ఎర్రగా చూసి "అవును, 50 ఇవ్వు" అని గద్దించాడు. మేము ఈ చేతను 50 ఇచ్చి, ఆ చేతను అఫిడవిట్ పుచ్చుకుని మరల RTO కి ఏతెంచితిమి. మాలాంటి సజ్జనులు, అమాయకులు ఒకరోజుకి ఎంతమంచి ఏతెంచెదరో! ప్రతీ ఒక్కని దగ్గర 50 రూప్యములు నొక్కిన అతని ఆదాయము నెలకి ఎంత వచ్చునో లెక్కింప మానవమాత్రునికి సాధ్యం కాదు.

పిమ్మట ఆ form ని సమర్పించుకుని కౌంటర్ తరువాత కౌంటర్ కి వెళుతూ ఉన్నాం. నాలుగో కౌంటర్ లో ఒకమ్మాయి, వయసు 25 కి మించదు...ఎంతసేపు నిల్చున్నా పలకదు, ఉలకదు. పలకరిస్తే కన్నెత్తి చూసిందే తప్ప పెదవి విప్పదు. ఏం చెయ్యాలో తెలియక కొంచం స్వరం పెంచాను. బాణంలా దూసుకొచ్చింది జవాబు "ఏం కాసేపు ఆగలేరా? ప్రతీఒక్కరికీ జవాబు ఇవ్వడమేనా మా పని? మీ అర్జీ చూసాక బదులిస్తాను" అంది. నాకు ఒళ్ళు మండిపోయింది...మేము పశువులమనుకుంటున్నారా, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని స్వరం పెంచాను. నా అర్జీని నా చేతిలో పెట్టి "నీ దిక్కున్నచోట చెప్పుకో నీ అప్ప్లికేషన్ ముందుకి వెళ్ళనివ్వను" అంది. నేను ఇంకాస్త గట్టిగా అరిచాను. చిన్న సైజు రామ-రావణ యుద్ధమే జరిగింది. ఇంత జరుగుతున్నా మిగతా సభ్యులు నోరుమెదపరే! కొందరు ఆసక్తిగా వింటున్నారు, ఇంకొందరు రోజూ ఉండే గొడవేగా అన్నట్టు తమపని తాము చేసుకుపోతున్నారు. అరిచి అరిచి నాకే విసుగొచ్చి పక్క కౌంటర్ కి వెళ్ళాను. అతనికి నాపై జాలేసినట్టుంది...కరుణించి నా అర్జీని ముందుకి తీసుకెళ్ళాడు పెద్దగా చిరాకుపడకుండా. ఈ అగచాట్లు అన్నీ పడ్డాక టెస్ట్ రూములోకి వెళ్ళాను. అక్కడున్న పెద్దమనిషి కుక్కని చూసినట్టు చూసి "అక్కడ కూర్చో, ఆ టెస్ట్ రాయి" అని విసుక్కున్నాడు. అదేదో తగలెట్టి, అతని దగ్గరకెళ్ళి నా పేరులో చిన్న మార్పుని సూచించాను. అంతే అతను కయ్యిమని అరిచాడు "మేమేం పనిపాట లేకుండా ఉన్నామనుకున్నారా మీ ఇష్టమొచ్చినట్టు మార్చడానికి" అంటూ చిందులు తొక్కాడు. నేను అప్లికేషన్లో సరిగ్గానే రాసాను కానీ వాళ్ళు తప్పు టైపు చేసారు అని చెప్పినా వినిపించుకోడే! నిజంగా పురుగుని చూసినట్టే చూసాడు. అప్పటికే నాకు తలనొప్పి వచ్చేసింది. అసహ్యం, విసుగు, కోపం...ఒకటేమిటి చీ ఈ లైసెన్సు నాకవసరమా, ఎంతదూరమైనా నడిచి వెళ్ళిపోతే ఇంతకన్నా హాయి కదా అనిపించింది. చివరి ప్రశ్నగా ఎన్నాళ్లలో learner లైసెన్సు పంపిస్తారు అని అడిగాను. "ఏమో, ఎప్పుడొస్తే అప్పుడొస్తుంది, మాకేం తెలుసు..మీ ఇంటికొస్తుంది అప్పుడు చూసుకోండి" అని సమాధానం. ఇంక అక్కడ ఒక్క క్షణం ఉన్నా మహా పాపం చుట్టుకుంటుంది అన్నట్టు వడివడిగా బయటికొచ్చేసాము. తెలిసినవాళ్ళకి ఈ ఉదంతం చెబితే ఇక్కడ అలాగే ఉంటారు, అలాగే మాట్లాడతారు...అసలు మీకెందుకీ బాధ, మిమ్మలని ఎవరెళ్ళమన్నారు, ఏజెంట్ కి ఇచ్చేస్తే వాడే అన్నీ చేసి పెడతాడు. ఓ 2000 వాడి మొహాన కొట్టండి అన్నారు. అప్పటికే పాలిపోయి ఉన్న మా మొహాలు మరింత తెల్లబోయాయి.....ఇదేమి విచిత్రం! మానవమాత్రులు RTO కి వెళ్ళి లైసెన్సు సులువుగా తెచ్చుకోలేరా! సరే, ఎలాగోల లెర్నర్ వచ్చింది. ఆరు నెలలు గడిచాక లైసెన్సు తెప్పించుకుందామనేలోపు కారు కొన్నాం. మళ్ళీ RTO ఆఫీసు గుర్తొచ్చి ఏడుపొచ్చింది. ఏమిదారి అనుకుంటుండగా ఏజెంట్ విషయం గుర్తొచ్చింది. ఒక driving school కి వెళ్ళి మాట్లాడాము. 15 రోజులు డ్రైవింగ్ క్లాసులు, లైసెన్సు పని కలిపి 4000 అన్నాడు. మూర్ఛ రాబోతుండగా ఆపుకుని సరే అన్నాము.

ఈసారి RTO ఆఫీసు లో బలే తమాషా జరిగింది. మా ఏజెంట్ వెనకల వెళ్లాం. అప్లికేషన్ నింపి ఇచ్చేసాం. అంతే, కాసేపు కూర్చోమన్నాడు. బుద్ధిగా కూర్చున్నాం. ఓ 15 నిముషాలలో వచ్చి అన్నీ అయిపోయాయి అని చెప్పి టెస్ట్ రూముకి పంపించాడు. అక్కడున్న అసిస్టంట్ తో ఏదో చెప్పాడు. నేను కంప్యూటర్ ముందు కూర్చున్నాను. mouse నా చేతిలో లేదు. మొదటి ప్రశ్న వచ్చింది. "జవాబేమిటి?" అన్నాడు. చెప్పాను...అది తప్పయింది. ఇంక అంతే రెండో జవాబు నుండి నేను నిమిత్తమాతృరాలినే....అతగాడే టకటకమని జవాబులు నింపేస్తూ ముందుకి పోతున్నాడు. మధ్యలో కావాలనే కొన్ని తప్పు జవాబులిచ్చాడు. అన్నీ కరక్ట్ అయితే అసలు నిజం తెలిసిపోతుందనో ఏమో! మొత్తానికి 20 కి 16 మార్కులు వచ్చాయి నాకు....కాదు కాదు అతనికి. బయటికొచ్చేసాము. "మీరు వెళ్ళిపోండి మేడం రెండు రోజుల తరువాత లెర్నర్ ఇంటికి పంపిస్తాను" అన్నాడు. ఆహా ఏమిటీ...20 నిముషాలలో అంత అయిపోయిందా!...కేకలు, అరుపులు, తగవులు, చికాకులు లేకుండా! నిజమే! నమ్మబుద్ధి కాలేదు. అబ్బ 4000 లకి ఎంత శక్తి! ప్రశాంతంగా ఇంటికి వచ్చేసాము. రెండు రోజుల్లో లెర్నర్ వచ్చింది.

నెలరోజులలో నేను కారు ఓ మోస్తరుగా నడిపి నేర్చుకునాను. ఇప్పుడు లైసెన్సుకి వెళితే ఎనిమిది వెయ్యమంటారో ఏడున్నర వెయ్యమంటారో ఏం దారి దేవుడో అని బిక్కుబిక్కుమంటూ మా ఏజెంట్ వెనకాల వెళ్ళి మళ్ళీ RTO గుమ్మం తొక్కాము....ఈసారి ఇంకా మజా వచ్చింది. మరో form నింపమన్నాడు. నింపేసి ఇచ్చాము. 10 నిముషములు కూర్చోబెట్టాడు. తరువాత మా ఏజెంట్ మరొకతనితో కలిసి మా దగ్గరకి వచ్చి నన్ను చూపించి "ఈమెకే లైసెన్సు కావాలి, జాగ్రత్తగా మనిషిని చూడు" అని చెప్పేసి దూరంగా కౌంటర్ లో ఉన్న వ్యక్తికి నా పేరు గట్టిగా అరిచి చెప్పి "చూసుకో" అన్నాడు. అంతే, "మీరింక వెళ్ళిపోండి మేడం. ఒక వారం రోజులలోగా లైసెన్సు ఇంటికి తెచ్చి ఇస్తాను" అన్నాడు. నేను విస్తుపోతూ "అయిపోయిందా, మరి డ్రైవింగ్ టెస్టో అన్నాను" మా ఏజెంట్ నన్నో పల్లెటూరిదానిలాగ చూసి, ఓ చిన్ననవ్వు నవ్వి "అవన్నీ అక్కర్లేదులెండి" అన్నాడు. వాహ్ వాహ్...బలే బలే, నాకు కారు నడపడం వచ్చో రాదో చూడకుండా నా చేతిలోకి లైసెన్సు వస్తుంది. ఆహా మన ప్రభుత్వము ఎంత బాగా నడుస్తున్నదో కదా అని మిక్కిలి సంతసించితిమి. ఈ వ్యాపారం చిన్నదేం కాదు. ప్రతీ సందుకీ ఓ డ్రైవింగ్ స్కూలు ఉంది. ప్రతీవాళ్ళు ఈ ఏజెంట్ల ద్వారానే లైసెన్సు తెచ్చుకుంటారు.

అదేరోజు, సరిగ్గా అదే సమయానికి అటుపక్కగా "అన్నహాజారే కి సపోర్ట్ ఇవ్వాలి" అంటూ జెండాలు పట్టుకుని ర్యాలీ వెళుతున్నాది. "ఈ అన్నాహజారే ఏంది భయ్, ఈ అవినీతి ఏంది భయ్, ఏం సమజౌతలే" అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మా చెవులబడింది. అవును, అసలింతకీ అవినీతి అంటే ఏమిటి?

తా.క: అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికైనా ఈ అవినీతి తప్పదు. అది దాని లక్షణం. అమెరికాకి తప్పలేదు, జర్మనీకి తప్పలేదు...మనకీ తప్పదు.

Friday, September 16, 2011

ఎం.ఎస్.జన్మదినం-చిరు కానుక


ఇవాళ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి పుట్టినరోజు. కంచిపట్టు చీర మీద ముత్యం దొర్లినట్టుగా ఉండే ఆవిడ గానం...అమృతం!

పొద్దున్నే లేచి ఆవిడ పాడిన సుప్రభాతం వినని తెలుగిల్లు ఉంటుందా! ఎంత పుణ్యం చేసుకున్నామో ఆవిడ మనకు వరం గా దొరికారు. ఆవిడ గాత్రాన్ని విని మనం జన్మలు ధన్యం చేసుకున్నాం! ఆవిడ గురించి తెలియనిదెవరికి! నేను కొత్తగా చెప్పేదేమీలేదుగాని ఈరోజు ఆవిడ జన్మదిన సందర్భంగా మితృలకు ఓ చిరు కానుక. సుబ్బలక్ష్మి గారూ ఇంగ్లీషులో పాడిన పాట...విని ఆనందించండి.



Friday, September 2, 2011

సహాయం చెయ్యండి...ప్లీజ్! (updated)

Up date -1 (02-09-2011)

ప్రతీక్ కి సొంత అక్కచెల్లెళ్ళు, అన్నాదమ్ములు ఉంటే వాళ్ళ బోన్ మేరో తో ప్రతీక్ బోన్ మేరో 99% మేచ్ అవుతుంది కాబట్టి పని సులువయ్యేది. కానీ ప్రతీకే మొదటి బిడ్డ. తన తల్లి బోన్ మేరో ని టెస్ట్ చేసారు. రిపోర్ట్స్ నిన్న సాయంకాలం వచ్చాయి. తల్లి బోన్ మేరో తో కుదరదని చెప్పారు. కాబట్టి ఆ option కూడా మూసుకుపోయింది. ఇంక డోనర్స్ కోసం వేచి చూస్తున్నారు. కేసు ఇంకా complicate అయ్యింది. ఇప్పుడు డోనర్ involve అయి ఉన్నారు కాబట్టి కావలసిన డబ్బు 20 లక్షలు దాటుతుందని అంచనా. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అది కనుక మంజూరు అయితే 10 లక్షలు వస్తాయి. అయినా కూడా ఇంకా 15-20 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. దయచేసి సహాయం చెయ్యండి. చిన్నారి ప్రతీక్ ని బ్రతికించండి.

Actual (01-09-2011)

ముందుగా బ్లాగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు!

ఈ పండుగ రోజు ఇటువంటి విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు బాధగా ఉంది కానీ తప్పట్లేదు.

నా స్నేహితుడు దూసీ శ్రీనివాస్, చీపురుపల్లి వాస్తవ్యుడు, ఇప్పుడు హిస్టరీలో phd చేస్తూ, DL పాస్ అయి, భద్రాచలం లో గవర్న్మెంట్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. నేను శ్రీనివాస్ MA కలిసి చదువుకున్నాము HCU లో. అతని చెల్లెలు పద్మజ తరువాత మా HCU లోనే ఆంత్రపోలజీలో MA చేసింది. హాస్టల్ లో తను నా రూములోనే ఉండి HCU పరీక్షకి ప్రిపేర్ అయ్యేది. దానితో పద్మ కూడా నాకు బాగా క్లోజ్ అయింది. MA పూర్తి అయిన వెంటనే పద్మజ కి పెళ్ళి అయింది. తన భర్త వైజాగ్ లో ఉద్యోగి. వాళ్ళకి ఆరునెలల క్రితం బాబు పుట్టాడు. బుల్లబ్బాయి గారిని చూసి తల్లిదండ్రులు మురుసిపోతూ పెద్దల ఆశీర్వాదంతో, అందరి సమక్షంలో ప్రతీక్ అని పేరు పెట్టారు. మూడు నెలలు గడిచిన తరువాత రాకుమారుడు ఎనీమిక్ గా ఉన్నాడని తెలిసి డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్ళారు. కొంతకాలం ట్రీట్‌మెంట్ జరిపాక తెలిసిన భయంకరమైన నిజం ఆ తల్లిదండ్రులను, మేనమామను కుదిపేసింది. పిల్లాడికి బోన్ మేరో ట్రాన్స్‌ప్లాన్టేషన్ చెయ్యాలి. ఎక్కడో లక్షలలో ఒకరికి సంక్రమించే ఈ వ్యాధి మా చిన్నారి ప్రతీక్ కి దాపురించడం విచారకరం. ప్రతీక్ కి ఇప్పుడు ఆరునెలలు. తను ఇప్పుడు వెల్లూర్ CMC ఆస్పత్రిలో ఉన్నాడు. బాబుకి నాలుగు వారల లోపు బోన్ మేరో ట్రాన్స్‌ప్లాన్టేషన్ జరగాలి. దానికి 20 లక్షలు ఖర్చు అవుతుంది. నా స్నేహితుడి కుటుంబం మనలాంటి మధ్య తరగతి కుటుంబమే. 20 లక్షలు అంటే భరించలేనంత భారం. నా మితృడు ఎలాగైనా అష్టకష్టాలు పడి fund raise చెయ్యాలని చూస్తున్నాడు. అందులో భాగం గా ఈ కింది బ్లాగు మొదలెట్టాడు. ఈ బ్లాగులో అన్ని వివరాలు ఇవ్వబడ్డాయి. అన్నీ చదివి ఆ చిట్టిబాబుని బతికించడానికి మీకు చేతనైన సహయం చెయ్యండి...ప్లీజ్.


ఈ ఆపరేషన్ నెలరోజులలోపు జరగాలి. మీరు చేసేది ఎంత చిన్న సహాయమైనా సరే ఓ పసిప్రాణాన్ని కాపాడుతుంది. ఏ తప్పు చెయ్యని ఆ చిన్నారి ఆరునెలల వయసులో ఆస్పత్రిలో దీనంగా పడుకుని ఉన్నాడు. ఇంక వాళ్ళ అమ్మ పద్మజ పరిస్థితి వర్ణనాతీతం. మీకు చేతనైన సహాయం చేసి ఆ తల్లిని కడుపుకోతకి దూరం చెయ్యండి. ఆ చిన్నారి మొహం లో నవ్వులు పూయించండి. ఇది హాక్స్ మైల్ కాదు. నన్ను నమ్మండి. ఫోన్ నంబర్లు, బ్యాంకు వివరాలు అన్నీ పైన ఇచ్చిన బ్లాగులో ఉన్నాయి. గుర్తుంచుకోండి...సమయం చాలా తక్కువ ఉంది. నాలుగు వారాలలోపు ఆపరేషన్ జరగాలి. మీ సహయానికి వారి కుటుంబము, నేను ఎల్లప్పుడు కృతజ్ఞులుగా ఉంటాము. సహాయంతో పాటు బాబు తొందరగా కోలుకోవాలని ఆశీర్వదించడం మరచిపోకండి.

Tuesday, August 9, 2011

మాయాబజార్ – పాండవులు లేని భారతం

మాయాబజార్ గురించి మరొక్కసారి...

నిన్న బజ్జులో అందరం మాయాబజార్ గురించి తలుచుకుని కొంతసేపు ముచ్చటించి ఆనందించాం. అలా ముచ్చటిస్తుంటే అంతకుముందెప్పుడో మాయాబజార్ గురించి నవతరంగం లో నేను రాసిన వ్యాసం గుర్తొచ్చింది.

వ్యాసంలో ఉన్న కొన్ని తప్పొప్పులను సవరిస్తూ మళ్ళీ ఇక్కడ....

మాయాబజార్ కొత్తగా రంగులద్దుకున్నవేళ నూతనకళతో మిలమిలా మెరిసిపోతోంది. కొత్తవన్నెలద్దడానికి సరియయిన సినిమానే ఎంచుకున్నారు పెద్దలు. మాయాబజార్ సినిమా ఒక అపూర్వమైన, అనన్యసామాన్యమైన కళాఖండం. ఈ సినిమాకి కథ, కథనం ఒక ఎత్తయితే, పింగళి వారి మాటలు, పాటలు ఇంకో ఎత్తు. నటీనటుల కౌశల్యం సరేసరి. మాయాబజార్ సినిమా తెలుగు సినిమాలోకానికి పెద్దబాలశిక్షవంటిది అని “నరేష్ నున్న” అన్నారు. ఇది అక్షరాలా నిజం.

మాయబజార్ – పాండవులు లేని భారతం. ఈ విషయం, సినిమా ఓ పది సార్లు చూసాకయినా ఎవరికీ తట్టదేమో. నిజం, పాండవుల ప్రస్తావన లేకుండా జరిగే కథ. ఈ కథని పూర్వం "శశిరేఖాపరిణయం" అనే పేరుతో కర్నాటక రాష్ట్రంలో వీధి నాటకాలుగా ఆడేవారట. దానికి ఒక మహోన్నత్తమైన స్థానాన్ని కలిపించింది మాత్రం కె.వి.రెడ్డి-పింగళి ద్వయమనే చెప్పుకోవాలి. ఈ సినిమాకి కె.వి.రెడ్డి గారి దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఆయువుపట్టులయితే, పింగళి నాగేంద్ర గారి సాహిత్య చమత్కారాలు ప్రాణం పోసాయి.

లాహిరి లాహిరి లాహిరిలో పాట నోట నానని తెలుగు ప్రేక్షకులుండరని నా ప్రగాఢ విశ్వాసం. లాహిరి అంటే మాయ అని అర్థం. ఈ ఒక్క పాట ఆధారంగా చేసుకుని కథంతా రూపకల్పన చేస్తారు. "లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా, ఊగెనుగా, తూగెనుగా" అని మొదలెట్టి "రసమయజగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో, ఎల్లరి మనములు ఝల్లనజేసే చల్లనిదేవుని అల్లరిలో" అని ముగించడం పింగళివారికే చెల్లింది. ప్రేమ మాయలో జగమంతా ఓలలాడుతోంది అని ఆరంభించి, ఆ మాయకి కారకుడు శ్రీకృష్ణుడే అని ముగింపు పలకడం ఓ అద్భుతమైన ఆలోచన. మొత్తం కథని ఈ ఒక్క పాటలో చెప్పారనిపిస్తుంది. మాయబజార్ కథకి కీలకమైన వ్యక్తి శ్రీకృష్ణుడు, ఆయన మాయావిశేషంవల్లనే కథ అంతా నడుస్తుంది. ఈ విషయాన్ని ఒక్క పాటలోనే ఎంతో అందంగా పొదిగారు పింగళి.

“చూపులు కలిసిన శుభవేళ పాట” మరో ఆణిముత్యం. “ఆలాపనలు, సల్లాపములు కలకలకోకిలగీతములే, చెలువములన్నీ చిత్రరచనలే, చలనములన్నీ నాట్యములే. శరముల వలనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే, ఉద్యానములో వీరవిహారమే, చెలికడనోహో శౌర్యములే”. ఇంత అందంగా, సంధర్భానికి అచ్చు గుద్దినట్టుగా రాయడం పింగళి వారు ఉగ్గుపాలతో నేర్చిన విద్య అనుకుంటాను. సాధారణంగా మనం ఎవరినైనా చాలరోజుల తరువాత కలిస్తే ముగిసిన కాలపు విశేషాలు ప్రస్తావించుకుంటాం. అన్నినాళ్ళలో ఏమేమి జరిగాయో చెప్పుకుంటాం. అలాగే ఎప్పుడో చిన్నప్పుడు విడిపోయిన శశిరేఖాభిమన్యులు యుక్తవయసులో కలుసుకోగానే వారి గతం గురించి ఒకరికొకరు ఈ ఒక్క పాటలో చెప్పుకునేలా చిత్రీకరించారు. రాకుమారి శశిరేఖ అంతఃపురంలో ఉంటూ సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటివి నేర్చుకుని ఉంటుంది. సాధారణంగా అంతఃపురంలో అమ్మాయిలు అవే చేస్తారు. మరి అభిమన్యుడు - వీరవిద్యలు అభ్యసించి ఉంటాడు. ఈ విషయాలు ఒకరికొకరు చెప్పుకోకుండానే గ్రహించినట్లు ఎంతో పొందికగా రాసారు పింగళిగారు. ఆమె ఆలాపనలు కోకిలగీతాలట, అందాలన్ని చిత్రరచనలట, నడకలే నాట్యమట. అంటే నువ్వు నేర్చుకున్నవన్నీ నాకు కనిపిస్తున్నాయిలే అని చెప్పకనే చెప్తున్నాడు అభిమన్యుడు. నీ బాణాల వేగము, శౌర్యప్రతాపాలను నేను గమనించానులే అని శశిరేఖ అన్యాపదేసంగా చెప్పినట్టు. ఎంత చక్కని ప్రయోగం!

“నీవేనా నను తలచినది”, “నీకోసమే నే జీవించునది” …ఈ రెండు పాటల్లోనూ ప్రేయసీప్రియులు వేరు వేరు ప్రదేశాలలో ఉంటారు. కానీ మొదటి పాట లో విడివిడిగా ఉన్నా కలివిడితనం, రెండవ పాటలో కలివిడిగా ఉండాలనుకున్నా విడివిడిగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. “విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురం కాదా”…..అంటే కలిసి ఉండడం ఒక భావన, విడిపోయి కూడా పరిమళించడం ఇంకొక భావన. ఇవన్నీ ఆలోచిస్తున్న కొలదీ గుబాళించే అనంతమైన సాహితీ సౌరభాలు.

అసలు ఏ పాట తీసుకున్న అందులో భావచాతుర్యం మిళితమై ఉంటుంది. మాయబజార్ సినిమా చూడకుండా పాటలు మాత్రమే వింటే మొత్త కథ అర్థమయిపోతుంది మనకి. అంత భావ సమామ్నాయం ఉంటుంది పింగళి వారి సాహిత్యంలో. మొదటిది “శ్రీకరులు దేవతలు” పాటలోనే ఈ సినిమాలో వచ్చే ముఖ్య పాత్రల పరిచయం జరుగుతుంది. దానితో కథ ఎవరు చుట్టూ తిరుగుతుందో మనకి తెలిసిపోతుంది. తరువాత “అల్లిబిల్లి అమ్మాయికి” పాటలో శశిరేఖాభిమన్యుల మధ్య ఉన్న సంబంధాన్ని చిగురింపజేస్తూ వాళ్ళిద్దరు ఒక దగ్గరలేరనే విషయం తెలియజేస్తారు. “నీవేనా నను పిలచినది” పాటతో వారి మధ్య ఉన్న ప్రగాఢ అనుబంధాన్ని పెంపుజేస్తారు. చూపులు కలిసిన శుభవేళ పాటవల్ల వాళ్ళిద్దరు మళ్ళీ కలిసారని తెలుస్తుంది. “లాహిరి లాహిరి పాట” సరేసరి, అంత తెలుస్తుంది అందులోనే. ‘భళి భళి భళి దేవా” పాటలో శ్రీకృష్ణుడి చక్రం కనిపిస్తుంది. ఘటోత్కచుడి పరిచయ పద్యంలో వారి పాత్ర, “శకుని ఉన్న చాలు” పద్యంలో వీరి పాత్ర ప్రస్పుటంగా గోచరిస్తుంది. “నీకోసమే” పాటలో వారు దూరమయ్యారని తెలుస్తుంది. “అహనా పెళ్ళియంట, వివాహ భోజనంభు” పాటల్లో మాయశశిరేఖగా ఉన్న ఘటోత్కచుని చాణతనం, “సుందరి నీవంటి” లో లక్ష్మణ కుమారుడి బేలతనం కనిపిస్తుంది. “విన్నావ యశోదమ్మ”, “దయచేయండి దయచేయండి” పాటలు, మధ్యలో జరుగుతున్న కథని మనకు చెప్పకనే చెబుతాయి.

ఇక పింగళివారి మాటలహేల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసమదీయులు, తసమదీయులు అన్న పదాలు ప్రతీ ఆంధ్రుని నోటా కొలువుదీరి ఉన్నాయంటే ఆశ్చర్యమేమీ కాదు. “పాండిత్యం కన్నా ఙ్ఞానం ముఖ్యం”, “శాస్త్రం ఏది చెప్పినా ఎప్పుడూ నిష్కర్షగానూ కర్కశంగానే చెబుతుంది, మనం సారాంశం గ్రహించాలి-అంటే శాస్త్రం ఎలా ఉన్నా ఒక సమన్వయం లో ఉంటుందన్నమాట” “ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి” లాంటి నగ్న సత్యాలను ఔచిత్యంగా చొప్పించారు. చినచేపను, పెదచేప, చినమాయను పెనుమాయ అది స్వాహా, ఇది స్వాహా అన్నదాన్లోనే బలహీనవర్గాల బాధలను నర్మగర్భంగా చర్చించారు. “పాండవుల ప్రతాపాల కన్నా, కౌరవుల ఐశ్వర్యాలు గొప్పవి కావు” – సామర్ధ్యాలకు, ఆస్తి అంతస్థులకు సాధారణ సమాజంలో పొంతన లేదన్న విషయాన్ని ఉటంకించారు. ఈ పదాలన్నింటిలోనూ బ్రహ్మాండమైన సాహిత్య స్ఫురణ, సామాజిక స్పృహ కనిపిస్తాయి.

“ఓహోహో నీవా, నీకు తెలియదూ నేనెవరో, తెలియనివారికి చెప్పినా తెలియదు” – అంటే నాకు నువ్వెవరో తెలుసు, నీకు నేను తెలియదూ, ఎదురుగుండా ఉన్న నన్నే గ్రహించలేకపొతే, చెప్తే మాత్రం తెలుస్తుందా…ఎంత సత్యం! నేను ఎవరో నీకు తెలీదు – అన్న దాన్లో ఎంత అర్థముందంటే, అహం బ్రహ్మాస్మి అంటే నేనెవరో తెలుసుకోవాలి, నువ్వెవరో తెలుసుకోవాలి.ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి దాన్లో ఒక కుర్చీ, మంచం, ఇలాంటివన్ని ఉంటాయి. వాటిని చూడగలగాలి, గ్రహించగలగాలి. చూడలేకపోతే, తెలుసుకోలేకపోతే ఎవరైనా చెప్పినా తెలియదు. ఎంత ఔచిత్యం పాటించారో ప్రతీ ఒక్క సంభాషణలోనూ. భావిస్తే ఎంతైనా గ్రహించవచ్చు ఆయన రాసిన మాటలలో. ఒక్క పొల్లు కూడా అనవసరంగా పడదు. ప్రతీ పదంలోను సాహిత్య సంపద, భావ చాతుర్యం గుబాళించి ఉంటుంది. పదాలు వాడడంలో ఆయన బ్రహ్మాండనాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎరుకకుండ వచ్చావు, ఎరుకలేకపోతావు- ఆధ్యాత్మికత- నేనున్నాని తెలుసుకోలేకపోతే నువ్వున్నావని తెలుసుకోలేవు అని భగవంతుడు చెబుతున్నట్టు – అద్భుతం కదూ. ఇంకా అగ్గిబుగ్గీకాకయ్యా, వీరతాడు వంటి పడికట్టు పదాలను తెలుగు ప్రజలనోళ్లలో నానేటట్టుగా చెక్కారు. “సభాపిరికి”, “అలమలం” లాంటి కొత్తపదాలు చక్కిలిగింతలు పెడతాయి. “నచ్చినా నచ్చకపోయినా పెళ్ళికూతురిని పెళ్ళి కొడుకు చూసి తీరాలి అది నా ప్రతిఙ్ఞ” అన్న ఒక్క వాక్యంలోనే లక్ష్మణ కుమారుడి బుద్ధిహీనత గోచరింపజేస్తారు.

ప్రాసలలో ఆయన ఉద్దండపండితుడు. “పేరు చెప్పించి, బిరుదు విడిపించి శరణనిపించిరా” – పేరు చెప్పిస్తే చాలదు, బిరుదు విడిపించి అంటే వాడి పై గెలిచి, దాసోహమనిపించిరావాలి, అమృతం తాగుతున్నట్లనిపించడం లేదూ !

“ఏవడో నరుడు, నన్ను పొడి పొడి చేసాడు సురసూరలాడుతున్నాడు కుర్రాడు"

"వాడిని మసి చేసి, నుసి చేసి పిడికిలించి పట్టుకొస్తాం నాయకా” – ఇలాంటివన్నీ బహుముచ్చటగా ఉంటాయి.

ఘటోత్కచుని పరిచయపద్యం ఆయన పాండిత్య సంపదకు నిదర్శనం.

"అష్టదిక్కుంభికుంభాగ్రాలపై మనశుంభధ్వజముగ్రాలచూడవలదే,
గగనపాతాళలోకాలలోని సమస్తభూతకోటులునాకెమ్రొక్కవలదే,
ఏదేశమైన, నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాలజరుగవలదే,
హై హై ఘటోత్కచ, జై హే ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే
యేనె ఈయుర్వినెల్ల సాశించవలదే,యేనె ఐశ్వర్యమెల్ల సాధించవలదే
యేనె మనబంధుహితులకు ఘనతలెల్ల కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదే"

పింగళి వారి రచనా సామర్ధ్యం గురించి ఇలా ఎంత చెప్పుకున్నా అనంతమైన సముద్రంలో నీటిచుక్కే అవుతుంది. భావిస్తున్న కొలదీ అర్థం, పరమార్థం బోధపడుతుంది. ఇంతటి మహానుభావులు మన ఆంధ్రులకి వరం గా దొరికారు. వారికి శతకోటి, సహస్రకోటి ప్రణామాలు.


Tuesday, August 2, 2011

భూకంపం

చిన్నప్పటినుండీ భూకంపం ఎలా ఉంటుందో, జస్ట్ ఆ భావనని మాత్రం పొందాలని బలే సరదాగా ఉండేది. భూకంపం వల్ల వచ్చే పరిణామాలు వద్దు, ఊరికే ఆ అనుభవం మత్రం కావాలి. ఇది ఒక వింత కోరికగా ఉండేది నాకు. ఓసారి నేను పదో తరగతిలో ఉండగా అనుకుంటా...దీపావళి ఇంకో నాలుగురోజులలో వస్తుందనగా...ఓరోజు రాత్రి 8.00 అవుతుండగా ఇంట్లో సామానులు అదిరిపడ్దాయి. భూకంపం అనుకుని నేను, చెల్లి, అమ్మ బయటకి పరుగు....వెంటవెంటనే భయంకరమైన విస్ఫోటనాలు...వరుస ప్రేలుళ్ళు...అప్పుడర్థమయింది అది భూకంపం కాదని. మరో అరగంటలో వార్త మాదాకా వచ్చింది. అక్కడెక్కడో 5-6 కి.మీ దూరంలో ఉన్న టపకాయల దుకాణాల్లో అగ్నిప్రమాదం...వరుసగా 4-5 కొట్లు తగలబడిపోయాయి. ఎంత పెద్ద ప్రమాదమంటే దూరంగా ఉన్న మా ఇంట్లో సామానులు కదిలాయి. చాలా భయమేసింది, బాధేసింది. కాకపోతే భూకంపం కాదా అన్న చిన్న నిరాశ ఎక్కడో మనసులో తళుక్కుమంది. నా కోరిక అలాగే మిగిలిపోయింది.

జనవరి 19, 2011, ఢిల్లీ - ఇంట్లో ఒక్కర్తినే ఉన్నాను. పొద్దున్న లేచి ఆఫీసుకి బయలుదేరుతుండగా కడుపులో తిప్పుతున్నట్టు అనిపించింది...విరేచనాలు. ఇంక ఆఫీసుకి వెళ్ళే ఓపిక లేక సెలవు పెట్టేసాను. ముందురోజు బయట తిన్నదేదో పడలేదు. వాంతులు అవ్వనంతవరకూ ఫరవాలేదనుకున్నాను. ఆస్పత్రికి వెళ్లలేదు. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాను. కానీ మోషన్స్ తగ్గట్లేదు. పంచదార, ఉప్పు కలిపిన నీళ్ళు తాగాను. మా ఇంటికి ఒక అర కి.మీ దూరంలోనే పేద్ద ఆస్పత్రి...ఫరవాలేదు. పది నిముషాలలో వెళ్లిపోవచ్చు....వాంతి అవ్వలేదు కాబట్టి ధైర్యం. సాయంత్రం వరకు ఓ పది పన్నెండు అయ్యాయి...ఎక్కడలేని నీరసం. కాస్త గ్లూకోజ్ తాగి, మజ్జిగాన్నం తిని అలా హాల్ లో సోఫా మీదే పడుకుని టీవీ చూస్తున్నాను. నిద్ర పట్టట్లేదు...పొద్దున్నుండీ పడుకునే ఉన్నాను. సర్లే అని టీవీలో వస్తున్న అడ్డమైన సినిమాలు చూస్తున్నా. అర్థరాత్రి ఒంటిగంట...రెండు...ఉహూ, నిద్ర రావట్లేదు. రెండున్నర అవుతుండగా సోఫా, టీవీ దడదడలాడిపోయాయి. వేగంగా ఊగుతున్నాయి. భయమేసింది, ఒక అరక్షణం ఏమీ అర్థం కాలేదు. ఒక్క గెంతులో కిందకి దూకి బయటకి పరుగెత్తాను. మా ఇల్లు మూడో ఫ్లోర్ లో....తలుపు తీసి బయటకు వెళ్ళాక అనిపించింది చేతిలో సెల్ అయినా ఉంటే బావుంటుందని. మళ్ళీ లోపలికి వెళ్ళి ఎదురుగా కనిపించిన సెల్ తీసుకుని లేప్టాప్ కోసం చూసాను....కళ్ళ ఎదురుగా కనిపించలేదు, బయటకి పరిగెత్తాను. మెట్లు దిగబోతుండగా డౌటొచ్చింది, నిజమేనా? అని. మెట్ల దగ్గర ఎలాంటి కదలిక ఉన్నట్టు తోచలేదు. మళ్ళీ ఇంట్లోకి తొంగి చూసాను. టీవీ, సోఫా ఊగిపోతున్నాయి. డైనింగ్ టేబిల్ కుర్చీలు కదులుతున్నాయి. వెంటనే ఇంటికి తాళం పెట్టి మెట్లు దిగేసాను. మూడు అంతస్థులు దిగేసి చుట్టూ చూసేసరికి మా సొసైటీ అంతా ప్రశాంతమైన నిద్రలో ఉంది. అక్కడా అక్కడా 3-4 మనుషులు తిరుగుతున్నారు తప్ప అలికిడి లేదు. ఒక ఫ్లాట్ లో ఇద్దరు బాల్కనీ లో నిలుచుని కబుర్లు చెప్పుకుంటున్నారు. గార్డ్ దగ్గర ఇద్దరు-ముగ్గురు నిలుచుని మాట్లాడుతున్నారు. మరేమీ ఆలోచించకుండా గార్డ్ దగ్గరకి పరుగెత్తాను. వాళ్ళని అడిగాను ఇక్కడేమైనా భూకంపం వచ్చిందా అని? వాళ్లు అలాంటిదేమీ లేదు అన్నారు. నాకు చాలా భయమేసింది...ఇంటికి ఒంటరిగా వెళ్ళే ధైర్యం లేదు. దొంగ ఎవరైనా వచ్చి బాల్కనీలోకి దూకి తలుపులూ అవీ బాదాడా? ఈ ఊహ రాగానే మరింత గజగజ...అయినా మా సొసైటీలో దొంగతనాలు జరిగే అవకాశమే లేదు....చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకైనా మంచిదని ఆ మాటే గార్డ్ తో చెప్పి ఇంటివరకూ రమ్మన్నాను. అతగాడు నాతో ఇంటిలోపలకి వచ్చి, బాల్కనీలోకెళ్ళి అన్నీ చూసాడు. మళ్ళా ఇంట్లో వాడు, నేను ఇద్దరమే...ఇదే అలుసుగా తీసుకుని వాడేమైనా చేస్తాడేమో అని వంటింట్లోకెళ్ళి చిన్న కత్తి తీసుకుని వాడి వెనకాలే వెళ్ళాను. అతను పాపం అన్నీ చూసి "ఏమీలేదు మేడమ్, మీరు ఊరికే భయపడుతున్నారు...హాయిగా పడుకోండి" అని వెళ్ళిపోయాడు. బతుకుజీవుడా అని కత్తి వంటింట్లో పెట్టేసి, అతను వెళ్ళాక తలుపులు వేసుకుని కూర్చుని ఆలోచించడం మొదలెట్టాను...భ్రమా, భ్రాంతా, చిత్తచాంచల్యమా...ఏమిటి? పొద్దున్నుండీ ఉన్న నీరసం వల్ల మెదడులో ప్లేట్లు ఏమైనా కదిలి అలా అనిపించాయా? అలా అనుకోవడానికి మనసొప్పుకోవట్లేదు. నేను బాగా చూసాను, అన్నీ కదిలాయి. రెండోసారి కూడా చూసాను.....వస్తువులు కదలడం, కాళ్ళు కంపించడం...నేను ఫీల్ అయ్యాను...ఇది నిజం. ఇలా ఆలోచిస్తున్నకొద్దీ ముచ్చెమటలు పోసాయి. మర్నాడు ఎవరిని అడిగినా అలా మాకేమీ అవ్వలేదు అనే జవాబు. ఇంటికి ఫోన్ చేసి చెబితే నీ చిత్తచాంచల్యమే అని ఖరారు చేసేసారు. నాకు మాత్రం అదొక పెద్ద మిస్టరీ లా ఉండిపోయింది. నమ్మలేని నిజం...నా భ్రాంతి అనుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు. నా వెధవ బుర్రకి న్యూస్ పేపర్లు చూడాలన్న జ్ఞానం కలుగలేదు, రోజూ దీని గురించే ఆలోచిస్తూ కొన్నాళ్ళకి మరచిపోయాను (తాత్కాలికంగానే).

మళ్ళీ...ఉగాది రోజు, 2011 - మా అత్తయ్య కొడుకు, ఆంధ్ర భవన్ లో ఉగాది వేడుకల్లో భాగంగా కచేరీ ఇవ్వడానికి వచ్చాడు. తను వయొలిన్ విద్వాంసుడు. ముందురోజు వరల్డ్ కపు ఫైనల్స్ మా ఇంట్లోనే చూసి మర్నాడు పొద్దున్నే వాడు ఏ.పీభవన్ కి, మేము ఆఫీసుకి. సాయంత్రం కచేరికి వస్తాములేరా అని చెప్పాము. సరే ఆరోజు పని అంతా త్వరగా పూర్తి చేసుకుని 5.30 కల్లా దుకాణం కట్టేసి ఏ.పీ భవన్ కి వెళ్ళాలని ప్లాను. 5.00 అవుతుండగా నా కళ్ళ ముందు ఉన్న మానిటర్ ఊగసాగింది. నేను కూర్చున్న కుర్చీ ఊగిపోతోంది. కిందకు దిగుదామంటే దిగలేకపోయాను. సిస్టం ఊగిపోతుంటే దానివైపు భయంగా చూస్తూ ఉన్నాను. అంతే, ప్రకంపనాలు ఆగిపోయాయి. ఒక్క నిముషంలో మళ్ళీ మొదలు...మానిటర్, కుర్చీ అదిరిపోతున్నాయి. ఎలాగోలా దూకి (కిందపడ్డంత పని జరిగింది) నా గదిలో నుండి బయటకి వచ్చేసరికి ఆఫీసులో అందరూ బయటకి వచ్చారు. గోలగోలగా ఉంది. భూకంపం అని అందరూ అరుపులు....నాకు ముచ్చెమటలు పోసాయి. కిందకి పరుగెడదామంటే మా ఆఫీసు ఐదో అంతస్థులో ఉంది. అందరూ గోలగోలగా అటూ ఇటూ పరిగెడుతున్నారు...మరో రెండు నిముషాల్లో అన్ని కంపనాలు ఆగిపోయాయి. అందరూ సర్దుమణిగారు. మరో ఐదు నిముషాలు వేచి చూసి ఇంక కంపనాలు రావు అని నిర్ధారించుకున్నాక "హమ్మయ్యా గండం గడిచింది" అనుకున్నాం. ఇంక అందరూ గుంపులు గుంపులుగా చేరి దీని గురించే మాటలు. అప్పుడు...సరిగ్గా అదే సమయంలో....నా సహ ఉద్యోగి అన్నాడు "మీకు గుర్తున్నాదా, జనవరిలో రాత్రి 2.00 గంటల ప్రాంతంలో ఇలాగే పెద్దగా వచ్చింది. పడుకున్నవాళ్ళం నేను నాభార్య భయపడి బయటకి పరుగెత్తాం" అని చెప్పాడు. ఆ అద్దీ...ఇప్పుడు క్లూ దొరికింది...వెంటనే నేను అడిగాను "జనవరి 19 కదా...రాత్రి 2.30 కి కదా...బాగా కంపనాలు వచ్చాయి కదా...చాలా భయం వేసింది కదా". "అవును" అని నలుగురైదుగురి సమాధానం. హమ్మయ్య అయితే ఆరోజు వచ్చింది భూకంపం అన్నమాట... నా చిత్తచాంచల్యమూ, భ్రాంతి కాదన్నమాట. ఎట్టకేలకు నా చిక్కుముడి విడిపోయింది. కానీ కాళ్ళలోంచి సన్నటి వణుకు వెన్నెముకకి పాకింది. అంటే...అంటే ఆరోజు నేను ఒక్కర్తినీ ఉన్నరోజు భూకంపం వచ్చిందన్నమాట...అది చిన్నదేకానీ భూకంపమేకదా! చాలా భయమేసింది. ఈరోజు...ఈరోజు కూడా భూకంపమే...వెర్రెక్కినట్టయింది...ఏం జరుగుతోంది. భూకంపం అన్న సరదా లేదు పాడు లేదు....అసలేం జరుగుతోంది ఇక్కడ. వెంటనే గూగలోడి సహాయం తీసుకున్నాను. తేలిన విషయమేమిటంటే "ఢిల్లీ లో ప్రకంపనాలు సర్వసాధారణం. ఎక్కడో పాకిస్థాన్ లోనో, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోనో భూకంపం వస్తే ఢిల్లీలో అదురుతుంది. రిక్టరు పై 5 నుండి 5.5 వరకూ నమొదయింది ఇంతవరకూ. 6 దాటితే ప్రమాదం సంభవించవచ్చు. 2009 లో ఒకసారి పెద్ద ప్రకంపనాలే వచ్చాయి. అప్పుడు కాస్త ఆస్థి నష్టం జరిగింది (అదే యేడాది నేను ఢిల్లిలో అడుగు పెట్టాను :P). ఇప్పటివరకూ వచ్చిన భూకంపాలలో అదే పెద్దది". ఇదంతా చదివాక భయం తగ్గిందో, పెరిగిందో తెలీని స్థితి....కానీ అస్తమానం ఇలా వస్తుంటే ఎలా? సరే అక్కడ మా వాడి కచేరీ మొదలయిపోతుందేమో అని ఆఘమేఘాలమీద పరిగెత్తాం ఏ.పీ భవన్ కి. మేము వెళ్లేసరికి ఇంకా గంట టైము ఉంది అన్నాడు. ఈ భూకంపం ధాటికి మా వాడు బెదిరిపోయాడు. వాళ్ళ ట్రూపు మూడో అంతస్థులో ఉందిట. రెండో అంతస్థులో కూచపూడి నృత్యం చెయ్యడానికి వచ్చిన ట్రూపు ఉంది. మావాడు అప్పుడే స్నానం చేసి వచ్చి తువ్వాలుతో ఉన్నాడు. కంపనాలు రాగానే కిందకి పరుగో పరుగు అలా తడి తువ్వాలుతోనే. ఆ నృత్యకళాకారులలో అమ్మాయిలు అప్పుడే డాన్సు బట్టలు వేసుకుంటున్నాను. ఈ దెబ్బకి వాళ్ళు జడిసిపోయి అలా సగం సగం బట్టలతోనే కిందకి పరుగులుట. కాస్త కుదుటపడ్డాక అందరూ ఎవరి గదులకి వాళ్ళు చేరుకున్నారు. మొత్తానికి ఏ.పీ భవన్లో అల్లకల్లోలమైపోయింది. మా వాడు ఒకటే వణుకు...మేము వాడికి పరిస్థితి వివరించి చెప్పాం. "మీరిక్కడుండొద్దు...వచ్చేయండి మనవైపుకి...మీ గురించి ఇలా భయపడుతూ మేము ఉండలేము...ఈ ఉద్యోగాలు వద్దు పాడూ వద్దు" అని వాడు ఒకటే గోల. ఎలాగోలా వాడికి సర్దిచెప్పి కచేరీ మొదలయ్యేలోగా వాడిని కూల్ చేసి పంపించాం స్టేజి మీదకి. ఆ రోజు రాత్రి వార్తలలో ఈ విషయం చెప్పారుట. అమ్మావాళ్లు ఫోను..."ఏమయింది, మీరంతా బాగానా ఉన్నారా?" అని. అందరికి భయం లేదని సర్దిచెప్పాం. మర్నాడు పేపర్లో వార్త...నిన్న సాయంత్రం ఢిల్లీలో కొన్ని ప్రాంతాలలో భూకంపం అని.

ఇంక అది మొదలు నెలా పదిహేను రోజులకో, నెలకోసారో చిన్న చిన్న ప్రకంపనాలు తెలుస్తూనే ఉన్నాయి. నాకు ఎక్కడ ఏ శబ్దం వచ్చినా, గిన్నెలు కదిలినా...ఇంట్లో వస్తువులు కదిలినా నాకు ఇదే భయం. పనిమనిషి ఇల్లు తుడుస్తుంటే టీవీ కదిలింది...పేపరు చదువుకుంటున్నదాన్ని భయంతో దిగ్గున లేచి నిల్చున్నా. నా గుండె ఎప్పుడు అలర్ట్ గా ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న కదలిక కనిపించినా నేను అలర్ట్ అయిపోతాను. పరిస్థితి ఎలా తయారయిందంటే గాలికి పేపరు కదిలినా నా మెదడు అలర్ట్ అయిపోతుంది. కానీ ఎన్నాళ్ళని? చాలా విసుగొచ్చేస్తోంది. నా భయానికి, విసుగుకి తోడు....1. ఇల్లు -మేముండే ప్రాంతాలలో ఈ ప్రకంపనాలు ఎక్కువగా తెలుస్తాయట. 2. ఆఫీసు - మా ఆఫీసు "L" షేప్ లో రెండు పెద్ద బిల్డింగుల మధ్య ఒక వారధిలా ఉంటుంది ఐదో అంతస్థులో. L లో అడ్డగీతేమో ఒక బిల్డింగులో ఉంటుంది. నిలువు గీత వారధిలా ఉంటుంది. ఆ నిలువు గీత కి సరిగ్గా మధ్యలో నా సీటు. వారధిలా ఉండడం వల్ల కంపనాలు ఎక్కువగా తెలుస్తాయి. నా ఖర్మకి ఈ ఎక్ష్‌ట్రా ఫెసిలిటీస్ ఒకటి. మొన్ననే ఓ 4-5 రోజుల క్రితం ఆఫీసులో కుర్చీలు, టేబిళ్ళూ దడదడ...నేను గజగజ! ఇప్పుడు కాస్త అలవాటయిందిగానీ తీవ్రత ఎంత ఉంటుందో తెలీదు కాబట్టి ప్రతీసారి వణుకు మొదలయి కాసేపట్లో సర్దుకుంటుంది.

ఏ ముహూర్తాన భూకంపం ప్రకంపనాల్ని అనుభవించాలని కోరుకున్నానో...అడ్డు ఆపు లేకుండా తెలుస్తున్నాయి. తథాస్తు దేవతలు ఉంటారని ఇందుకే అంటారు కాబోలు!