......అంటే కొంత నచ్చింది, కొంత నచ్చలేదు. ఈ సినిమా గురించి చాలామంది చాలా రాసేసారు. కాబట్టి నేను కథ అదీ మళ్ళీ చర్చించదలచుకోలేదు. నాకు తట్టిన ఒకే ఒక్క విషయం గురించి చర్చించదలుచుకున్నాను.
ప్రేమలో నిజాయితీ ఉండాలి, నిజమైన ప్రేమలో అబద్దాలాడకూడదు అన్న పాయింట్ నాకు నచ్చింది. నిజమే ప్రేమలో నిజాయితీ అన్నది చాలా ముఖ్యం. కానీ అది ఎలాంటి ప్రేమ అవ్వాలి? ఈ విషయంలో దర్శకుడు భాస్కర్ కి ఉన్నన్ని అపోహలు ఇంకెవ్వరికీ ఉండవేమో! చూడగానే ప్రేమించేస్తే అది జీవితకాలం ఎలా నిలుస్తుంది? అలాంటి ప్రేమని నిలుపుకోవాలంటే అబద్దాలు ఆడక తప్పదు మరి. చరణ్ చేత చెప్పించినట్టు ప్రేమ అనేది రెండు బ్రైన్స్ కి సంబంధించిన విషయం. ఏ రెండూ మెదడులు ఒకేరకంగా ఆలోచించవు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తూ ఉంటే ప్రేమ జీవితకాలం ఎలా నిలుస్తుంది? ఒకరిని ప్రేమించాలంటే వాళ్ళలో నచ్చిన విషయమేదో ఉండాలిగా. వాళ్ల గుణగణాలో, వ్యక్తిత్వమో లేదా మరోటో...ఏదో ఒకటి నచ్చాలిగా. ప్రతీ మనిషిలోను కొంత మంచి, కొంత చెడు ఉంటుంది. కొన్ని ఇష్టాయిష్టాలుంటాయి. కొంత సహజసిద్ధమైన స్వభావం ఉంటుంది. ఇవేమీ చూడకుండా మొదటి చూపులోనే వచ్చే ప్రేమ ఎలా నిలుస్తుంది? ప్రేమలో ఒకరి ఇష్టాయిష్టాలను చంపుకోనక్కర్లేదుగానీ చిన్న సర్దుబాట్లు కచ్చితంగా ఉంటాయి.
చరణ్ మొదట ప్రేమించిన అమ్మాయి ఎందుకు నచ్చిదో తనకే తెలీదు. వెతుక్కుంటూ ముంబై వెళ్ళాడు. ఆ అమ్మాయికి ఉన్న విపరీతమైన possessiveness ని తట్టుకోలేకపోయాడు. అబద్దాలు చెప్పాడు, అది తనకి నచ్చలేదు విడిపోయడు. రెండు బ్రైన్స్ ఒకటి కావు అని తెలిసిన అబ్బాయికి ప్రేమ చివరిదాకా బతకాలంటే అవతలి బ్రైన్ ఎలాంటిదో, అందులో ఏముందో తెలుసుకోవడం చాలా అవసరం అని ఎందుకు తెలీలేదో!
9 ప్రేమలన్నాడు, మనకి అవేమీ చూపించలేదూగానీ జానూ ని ప్రేమించినప్పుడు కూడా తనలో ఏమి చూసాడు తింగరితనం తప్ప. జీవితాంతం కలిసి బతకడానికి ఆ తింగరితనం మాత్రం కచ్చితంగా సరిపోదు. మరి ఏమీ చూడకుండా ప్రేమించిన ప్రేమ చివరి వరకూ ఎలా నిలాస్తుందిట? అలా నిలవదు అని ఆ అబ్బయి చెబుతూ ఉంటే అందులో తప్పేమిటిట? సముద్రమంత ప్రేమని చూడాలంటే ఆ మనిషిపై మనకి ఎంత అభిమానం ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి! అలా ఉండాలంటే ఆ వ్యక్తిలో మనల్ని కట్టిపడేసేది ఏదో ఒకటి ఉండాలి కదా. అలాంటి ప్రేమ తొలిచూపులో ఎలా రాగలదో నాకర్థం కావట్లేదు. చివరికి ఇంకొంచం ప్రేమిస్తానన్నాడు, అది కూడా ఎందుకు, ఏం చూసి? ఈ విషయంలో జానూ పాత్ర కొంతలో కొంత నయం. మొదట్లో ప్రేమించాలన్న ఆకాంక్ష తప్పితే ఆ పిల్లకి ఏమీ తెలీదు. రామ్ ని కలిసిన తరువాత తనకేం కావాలో మెల్లమెల్లగా తెలుసుకుంది. రాను రానూ ఆ పాత్రకి ఒక రకమైన మెచ్యూరిటీని తీసుకొచ్చారు. జానూకి తనకేం కావాలో తెలుసు. నిజంగా జీవితాంతం ప్రేమించే వ్యక్తి కావాలి అనుకుంది. అది సరి అయిన కోరికా కాదా అన్నది వేరే విషయం. కనీసం ఏదో ఒక క్లారిటీ ఉంది కదా ఆ అమ్మాయికి. ఇతగాడికీ అదీ లేదు, ఎవరిని ఎందుకు ప్రేమిస్తున్నాడో తనకి తెలీదు. మరి అలాంటి ప్రేమ కొంతకాలంకన్నా నిలవదు అని చెప్పే తన ఫిలాసఫీ కరక్టే కదా. అందులో తప్పేముంది? దానికంత చర్చ ఎందుకు? అంత సినిమా తీయడమెందుకు?
అయినా ఇది భాస్కర్ కి మొదటిసారి కాదు. "పరుగు" సినిమాలో కూడా అంతే. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ప్రేమ పుట్టేస్తుందిట. తండ్రీకూతుళ్ళ బంధం గురించి గొప్పగా చెబుతూ యువతీయువకుల ప్రేమ విషయంలో మాత్రం పప్పులో కాలేసాడు. ఆ సినిమాలో మిగతా విషయాలన్నీ బాగుంటాయిగానీ ఈ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగానే వచ్చేసే ప్రేమే మింగుడుపడదు. ఇప్పుడు ఆరెజ్ సినిమాలోనూ అదే చూపించాడు. మరీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం లేదుగానీ తొలిచూపు ప్రేమ మాత్రం బలంగా చూపించాడు. పైగా ఆ ప్రేమ మీద పెద్ద పెద్ద చర్చలు, వాగ్యుద్ధాలు. అవసరమా అనిపించింది. బొమ్మరిల్లు సినిమాలో ప్రేమకి కావలసినదేమిటి అన్నది ఎంతో బాగా చూపించాడు. హాసినిని హీరో ఎందుక్లు ఇష్టపడుతున్నాడనే విషయాన్ని కనీసం 1-2 సార్లయినా చెప్పించాడు సినిమాలో. హీరో తనకి నచ్చినట్టు జీవితం గడపలేకపోతున్నాడు. కాబట్టి అలా స్వతంత్ర్యంగా తనకి నచ్చినట్టు గడిపే ఒక అమ్మయిని చూసి చాలా ఇష్టపడతాడు. "నీకు ఏది నచ్చితే అది చేస్తావు, నీకు కావలసినట్టు బతుకుతావు అదే నీలో నాకు నచ్చింది" అని హీరో చేత చెప్పిస్తాడు. అది బావుంది. మరి అదే పద్ధతి మిగతా సినిమాలలో ఎందుకు పనికిరాలేదో!
ప్రేమ అంటే అభిరుచులు, ఇష్టాయిష్టాలు ఒకటవడం మాత్రమే కాదు అవి కలవకపోయినా పెద్దగా వచ్చే నష్టం లేదు ( మరీ ఉత్తరదక్షిణ ధృవాల్లా ఉంటే చెప్పలేంగానీ)... కానీ భావాలు కలవడం, వ్యక్తిత్వం నచ్చడం అనేది చాలా ముఖ్యం. ప్రేమంటే ఒకరి ఇష్టాన్ని ఇంకొకరు గౌరవించుకోగలగడం, ఒకరి తప్పుని ఇంకొకరు మన్నించగలగడం, ఒకరి సుఖదుఃఖాలను ఇంకొకరు పంచుకోగలగడం. ఒక సీనులో "నాకు క్రికెట్ అంటే ఇష్టం, నీకు గోల్ఫ్ అంటే ఇష్టం. నాకు గ్రఫిటీ అంటే ఇష్టం, నీకు ఇష్టం లేదు. ఇవాళ నాకు నచ్చింది, రేపు నచ్చకపోవచ్చు. జీవితం మొత్తం ప్రేమ ఒకలాగే ఉండదు" ఇందులో చివరి చెప్పిన వాక్యాలు కరక్టే కానీ వాటిని అన్వయించిన విషయాలే కరక్టు కాదు.
"ఇవాళ నచ్చినది రేపు నచ్చకపోవచ్చు"...నిజమే, కానీ అది ఏ గోల్ఫ్ ఆటకో, గ్రఫిటీకో సంబంధించిన ఇష్టమయితే నచ్చకపోయినా ఫరవాలేదు, దానికోసం విడిపోనక్కర్లేదు. అలా చిన్న చిన్న విషయాలకోసం విడిపోయేవాళ్ళు అసలు ప్రేమించకుండా ఉంటేనే మంచిది. కానీ జీవితంలో పెద్దవి అనుకునే విషయాల్లో, ఇప్పుడు నచ్చి తరువాత నచ్చకపోతే దానికి ఏదో ఒక సరి అయిన కారణం ఉండే ఉంటుంది. అలా కాకుండా నాఇష్టం నాకు నచ్చలేదంతే అని అంటే హాయిగా విడిపోవచ్చు, అలాంటి మూర్ఖులతో ఉండక్కర్లేదు. కాబటి ఇవాళ నచ్చింది, రేపు నచ్చకపోవడం అనేది అభిరుచులకి మాత్రమే సంబంధించిన అంశంగా చూపించి, విడిపోవడానికి అదొక కారణంగా చూపించి వాదించడం హాస్యాస్పదంగా ఉంది.
"జీవితం మొత్తం ప్రేమ ఒకలాగే ఉండదు"...ఇదీ నిజమే. ప్రేమతో పాటు బాధ్యతలు వస్తాయి. వాటిని నిర్వర్తించే క్రమములో ప్రేమ తగ్గినట్టుగానో, పెరిగినట్టుగానో అనిపించొచ్చు. అసలు ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి ఒక్కరోజులోనూ, ఒక్క సంవత్సరంలోనో తెలుసుకోలేడు. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిస్తున్న కాలంలో ఒక్కోరొజూ ఒక్కో కొత్త అనుభూతి వస్తుంటుంది. కొత్త విషయం తెలుస్తుంటుంది. ఆ అనుభూతులు చాలామాటుకు జీవితంలో ఎదురయ్యే సంఘటనలపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తులు ఎదుగుతూ ఉంటారు, కొత్తకొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో ఒకరినొకరు ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు. ఇది నిరంతర ప్రక్రియేగానీ ఒక్కరోజులో జరిగేది కాదు. అలా వ్యక్తులు మారుతున్నప్పుడు ప్రేమ తగ్గడమో, పెరగడమో జరుగుతూ ఉంటుంది. అంత మాత్రనా విడిపోవడమే పరిష్కారం కాదు, మరీ భరించలేనంతాగా మారిపోతే తప్ప.
మొత్తం ఇలాంటి కంఫ్యూజన్ తోనే సినిమా నడిచింది. సినిమా చివరివరకూ చూసిన తరువాత ఇందులో చెప్పిన విషయమేమిటో నాకు బోధపడలేదు. ప్రేమలో నిజాయితీ ఉండాలి అన్నదే పాయింటయితే తొలిచూపు ప్రేమల్లో "కొంతకాలం ప్రేమ", "జీవితం చివరి వరకూ ప్రేమ" అన్న వాదనేమిటి విడ్డూరంగా! పోనీ చివరికి దర్శకుడు ఏ విషయాన్ని బలపరిచాడో కూడా అర్థం కాలేదు.
అందరిలాగే కాన్సెప్టు గురించి పెద్దగా ఆలోచించకుండా ఏదో మూసలో సినిమాలు తీస్తే ఈ తొలిచూపు ప్రేమలని చూడొచ్చు. తాతల కాలము నుండి భరిస్తున్నాం కదా ఇంకో సినిమాకి కూడా సర్దుకుపోతాం. కానీ ఏదో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చిస్తూ, conceptual movie తీద్దామనుకున్నప్పుడు మాత్రం ఈ తొలిచూపు ప్రేమని చూపించడం, దానిలో వాదనలు, చర్చలు....చాలా అనవసరం.
ఇంక మిగతా విషయాలకొస్తే ప్రపంచంలో ఎవరి ప్రేమలోనూ నిజాయితీ లేదని చూపడం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. జానూ తల్లిదండ్రుల మధ్య ప్రేమ గురించి చూపించినప్పుడు కూడా...వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళయిపోయారు. జీవితంలో బాధ్యలు, బరువులు పెరిగాయి. అలాంటి సమయంలో ఒకరి మీద ఒకరు ప్రేమని వ్యక్తపరుచుకునే సందర్భాలు ఎక్కువగా రావు. అంతమాత్రాన గుండెల్లో ప్రేమ లేదని కాదు.
అలాగే బోలెడంతమంది ప్రేమజంటలని చూపించారు సినిమాలో. కానీ అన్ని జంటల్లోనూ మగవాళ్లదే తప్పు, మగవాళ్ల ప్రేమలోనే అబద్దాలుంటాయి అని చూపించడం ఏమీ బాలేదు. సినిమాలో రామ్ చెప్పిన విషయాన్ని గ్రహించిన అన్ని జంటల్లోనూ అబ్బయిలదే నిజాయితీలేని ప్రేమ అన్నట్టు ఆ అమ్మాయిలందరూ అబ్బాయిలని వదిలేసి వెళ్ళిపోతారు.
ఇక నాగబాబు చేత చివర్లో చెప్పించిన మాటలు బావున్నాయికానీ అసలు ఆ పాత్ర ఎందుకు, ఆ పాత్ర ఉద్దేశమేమిటో అస్సలు బోధపడలేదు. నాగబాబు భార్య ఎప్పుడూ ఆయనగారి నెత్తిమీద పూలకుండీలు విసిరేస్తూ ఉంటుంది. సినిమా మొత్తం వాళ్ళిద్దరూ భయంకరంగా తగవులాడుకుంటున్నట్టే చూపించారు. మరి అప్పుడు కూడా సముద్రమంత ప్రేమని పొందడానికి ఒక్కరినే ప్రేమించాలా, ఒక్కరితోనే ఉండాలా? హేవిటో!
చాలా ఒళ్ళు మండిన విషయం ఆ truth or dare ఆట. ఒకమ్మాయి నీ దగ్గరకొచ్చి లవ్ or సెక్స్ అని అడిగితే....లవ్ అని సమాధానమిస్తాడు ఆ అబ్బాయి. అది తప్పంటాడు హీరో. అదెలా తప్పవుతుందో నాకర్థం కాలేదు. అది ఒక hypotheticle question, దీనికి సమాధానం చెప్పినప్పుడు ముందు 30 యేళ్ళు ఏమి జరిగింది, వెనుక 30 యేళ్ళు ఏమి జరిగింది అని ఆలోచించి చెబుతారా ఎవరినా బుద్ధి లేకుండా. ఇంక ఆ చీటీల బేఛ్ ముగ్గురూ జానూ ని మిగతావారికోసం త్యాగం చేస్తామంటారు. అంతమాత్రాన జానూని ముగ్గురూ వదిలేసినట్టెలా అవుతుంది, తిక్క ప్రశ్నలు కాకపోతే. మిగతా ప్రశ్నలలో కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని అస్థవ్యస్థంగా ఉన్నాయి.
ఇంక, బాగా నచ్చిన సీను.....రామ్ తనని ఎన్నిసార్లు కాపాడాడు, ఎన్నిసార్లు తనకి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా చేసాడు అని జానూ చెప్పే సీను. అలాగే రామ్ "నేను ఏదీ నిన్ను కాపాడాలని చెయ్యలేదు,నా ప్రేమలో నిజాయితీ చూపించాను." అని చెప్పే సీను.
జెనీలియాని అస్సలు భరించలేకపోయాను. ఏదో బొమ్మరిల్లు హాసిని ఊహించుకుని వెళితే ఇకేదో కనిపించింది. చరణ్ నటనలో కొంత మెచ్యూరిటీ కనిపించింది. మనిషి కూడా కాస్త బావున్నాడు ముందర సినిమాలతో పోలిస్తే. పాటలు కొన్ని బావున్నాయి, సందర్భోచితంగా ఉన్నాయి.
మొత్తానికి ఒక అర్థం లేని విషయం కోసం ఒక అనవసర చర్చ అనిపించింది సినిమా చూసాక. ఏ విషయాన్ని ప్రధానంగా చూపించాలనుకున్నాడో ఆ విషయం గురించి సరైన పద్ధతిలో చర్చించకపోవడంతో సినిమా తేలిపోయింది.
అయితే ఒక్కటి.....
సినిమా చూస్తున్నంతసేపూ ఎక్కడో ఓకచోట ప్రతీ ఒక్కరికీ "నా ప్రేమలో ఎంత నిజాయితీ ఉంది" అన్న ప్రశ్న రావడం, తమని తాము బేరీజు వేసుకోవడం కచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ అదే సినిమా లక్ష్యమయితే అది నెరవేరినట్టే!
---------------------------------
ఇదే వ్యాసం
నవతరంగం లో కూడా ప్రచురితమయింది.