నిన్న మధురవాణి బ్లాగులో రాసిన కృష్ణా! నేను...నీ రాధని! అన్న టపా చూసాక నాకు పింగళి వారు రాసిన "రాధనురా నీ రాధనురా" అన్న పాట గుర్తొచ్చింది. ఇది పెళ్ళి చేసి చూడు (1952) సినిమాలోది.
రాధనురా నీ రాధనురా!
రాసలీలలా ఊసే తెలియని కసుగాయలకారాధనురా!
వలపున కుమిలే ప్రణయజీవులకు వల్లమాలిన బాధనురా!
రాధనురా నీ రాధనురా!
ఎంతో తెలిసిన వేదాంతులకే అంతు దొరకని గాధనురా!
మధురానగరి మర్మమెరిగిన మాధవ నీకె సుబోధనురా!
రాధనురా నీ రాధనురా!
రాధనురా
నీ దాననురా!
రాధ అనగానే నాకు బోలెడు సందేహాలు ఎప్పుడూ...అసలు రాధ ఎవరు? కొందరు రాధ కృష్ణుడి ప్రియురాలంటారు, అతని కన్నా పెద్దది అంటారు. రాధామాధవుల ప్రేమ అద్వితీయం అంటారు, ప్రణయానికి పర్యాయపదమంటారు. కృష్ణుడిని అనంతంగా ఆరాధించడమే రాధకి తెలిసిన పని అంటారు. రాధ పై కృష్ణుడికి అవ్యాజమైన ప్రేమ, ఎనలేని అనురాగం ఉంది అంటారు కానీ పెళ్ళి చేసుకోలేదంటారు....ఇటువంటి సందేహాలే ఎప్పుడూ. రాధ నాకు ఎప్పుడూ బోధపడలేదు. పింగళి వారి పాట విన్నాక రాధ నాకు ఇంకా చిక్కులు తెచ్చి పెట్టింది. అర్థమయింది అనిపిస్తూనే అంతు చిక్కకుండా ఉంది.
ఈ పాట పింగళిగారి సాహిత్య ప్రతిభని ఆవిష్కరిస్తుంది. రాధని ఒక్కొక్కరు ఒక్కో రకంగా భావిస్తుంటారు. ఈ భావన ని పింగళి వారు నాలుగు స్థాయిలలో చెప్పారు.
రాసలీలలా ఊసే తెలియని కసుగాయలకు ఆరాధనురా!
ఇక్కడ ఆరాధనురా...అంటే ఆరాధ(న)నురా అని అర్థం చేసుకోవాలి.
చిన్నపిల్లలు, రొమాన్స్ అంటే తెలియని లేత ప్రాయం ఉన్నవారికి రాధ ఆరాధన అట. రాధని చూసి అలా ఉండాలి జీవితంలో ఎప్పటికైనా అనుకుంటారు కదా. ఎంతో ఆరాధనగా రాధని తమలో మిళితం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ రాధ కాబట్టి ఆడవారు మాత్రమే అనుకునేరు. కాదు, అటువంటి అనురాగాన్ని తమలో నింపుకోవాలి అని ఆడ, మగ ఇద్దరూ అనుకుంటారు అప్పుడే రెక్కలు విప్పుతున్న నవ యవ్వనంలో.
వలపున కుమిలే ప్రణయజీవులకు వల్లమాలిన బాధనురా!
పై స్థాయి దాటి ప్రేమలో పడ్డవారు/ఉన్నవారికి రాధ ఒక బాధ. ప్రణయానికి, విరహానికి తేడా తెలీనంత ప్రేమలో కూరుకుపోయి బాధపడుతుంటారట. దగ్గరగా ఉన్నప్పుడు ప్రణయం, దూరంగా ఉన్నప్పుడు విరహం రెండూ ఎంతో బావుంటాయి. "విరహం కూడా సుఖమే కాదా, విరహము చింతన మధురము కాదా" అని కూడా పింగళి వారే అన్నారు. "ప్రేమా, పిచ్చీ ఒకటే" అని అనురాగం సినిమాలో భానుమతి పాడతారు. ఇది ఆ స్థాయి అన్నమాట. ఇక్కడ ఆ"రాధ"న కాస్తా బాధగా మారుతుంది, అది తియ్యటి బాధ.
ఎంతో తెలిసిన వేదాంతులకే అంతు దొరకని గాధనురా!
తరువాతి స్థాయి....అన్ని తెలిసి, జీవిత సారం గ్రహించిన వేదాంతులకు రాధ అంతు తెలియని గాధ ట. ఇది నాకెలా అర్థమవుతున్నాదంటే...జీవితంలో ఎంతో ప్రేమని అనుభవించి, ప్రేమ పై తనివి తీరక...ఇంకా కావాలనుకుంటూ, ఎప్పటికీ సంతృప్తి కలగక వేదాంత ధోరణికి చేరి ఈ ప్రేమ కి అంతులేదా అనుకుంటారేమో! అప్పుడు వాళ్ళకి రాధ అలా అనంతంగా మాధవుణ్ణి ఎలా ప్రేమిస్తుందో అని సందేహంతో అంతులేని గాధ గా మిగిలిపోతుంది (ఇది నా కవి హృదయం)
మధురానగరి మర్మమెరిగిన మాధవ నీకె సుబోధనురా!
ఇది పతాక స్థాయి....మానవుని జ్ఞానానికి చిట్టచివరి మెట్టు అహం బ్రహ్మాస్మి అనుకోవడం (దీనిపై విశ్వాసం ఉన్నవారు).....అటువంటి స్థాయికి చేరుకున్నవాడు శ్రీకృష్ణుడే కాబట్టి...ఓ మాధవా, మధురా నగరం మూలమూలలా తెలిసినవాడవు నీకు నేను బాగా తెలిసినదానను...నా గురించి నీకు తప్ప ఎవరికీ గొప్పగా తెలీదు అంటోంది రాధ.
పింగళి వారు ఎంత చమత్కారులో కదా...కాదేదీ కవితకనర్హం అని...రాధని తీసుకుని మానవ జీవిత సారాంశాన్ని ఎంత చక్కగా చెప్పారో!
పాటను వినాలనుకునేవారు ఇక్కడ వినవచ్చు.
P.S: మధురా, ఈ పాటని గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చిన నీకు (నీ పోస్టుకి) ధన్యవాదములు. నీ పోస్టు చదివి తరువాత ఈ పాట విని, భావాన్ని ఆకళింపు చేసుకుని పరవశించాను. నిజం!