నా స్నేహితురాలి కూతురు బలే చురుకైన పిల్ల. వాగుడు కాయ నెంబర్ వన్ ...ఒకసారి మొదలెట్టిందంటే ఆపడం చాలా కష్టం. చురుకైనది, చాలా తెలివైనది కూడా. అలాంటిది మొన్న ఆ మధ్య కలిసినప్పుడు చాలా డల్ గా ఉన్నాది. మాటలు బాగా తగ్గించేసింది. నేను దాన్ని పిలిచి, కొత్త స్కూలు లో చేరానన్నావు, ఆ విశేషాలు చెప్పు అని అడిగితే పెదవి విరిచేసి, మాట మార్చేసింది. ఏమయింది దీనికి అని మా ఫ్రెండుని అడిగాను. కొత్త స్కూలు లో చేర్చాక దానికి చదువు మీద శ్రద్ధ పెరిగింది. వాగుడు తగ్గించి బుద్ధిగా చదువుకుంటున్నాది. మంచిదే, కొత్త స్కూలులో బాగా చెబుతున్నారు, పిల్ల దారిన పడుతోంది అదే నాకు సంతోషం అని ఇంత మొహం చేసుకుని మెరిసే కళ్ళతో నా ఫ్రెండు చెబుతుంటే నాకు ఎక్కడో అనుమానపు పొర మెదిలింది. సరే అని సమయం చూసి దాన్ని పిలిచి, ఆ మాట ఈ మాట కలిపి, మెల్లిగా స్కూలు గురించి అడగడం మొదలెట్టను. మొదట్లో తప్పించుకోవాలని చూసినా, ఎట్టకేలకు పెదవి విప్పింది. దానికి కొత్త స్కూలు అస్సలు నచ్చలేదు. అక్కడ పాఠాలు చెప్పి చంపేస్తున్నారు. ఏమీ బుర్రకెక్కట్లేదు. కావలసినట్టు ఆడుకోవడనికి, చందమామలు చదువుకోవడానికి టైము ఉండట్లేదు, విసుగొస్తున్నాది పాపం. ఇంతా చేస్తే అది చదువుతున్నది ఆరో తరగతి. మేథ్స్ టీచరు మహా కర్కోటకుడుట. చెప్పినది వినడం, పది సార్లు బట్టీ పట్టడం తప్ప ఏదైనా అర్థం కాలేదని అడిగితే చెంపలు వాయిస్తాడట. ఏదైనా డౌటు అడిగితే ఆ మాత్రం అర్థం చేసుకోలేవూ, చూడు నీ తోటి పిల్లలు ఎంత చక్కగా అర్థం చేసుకుంటున్నారో అని ఎద్దేవా చేస్తాడట. దాని మేథ్స్ నోట్ బుక్ చూసాను. ఆరో తరగతిలో logarithms ఉన్నాయి. ఇదేమిటి మన చదువుకున్నప్పుడు ఏడు లో కొంత పరిచయం మాత్రమే చేసేవారు. ఇప్పుడు ఆరు లోనే చెప్పేస్తున్నారా, సర్లే కాలం మారిందిగా అనుకున్నాను (ఈ మధ్య స్కూల్లో సిలబస్సు అవీ ఎలా మారాయో నేను గమనించలేదు). పాపం ఆ చిన్ని బుర్రకి లాగ్ పవర్ e కి లాగ్ పవర్ 10 కి ఉన్న తేడా అర్థం కావట్లేదు. చాలా కష్టంగా ఉంది అంటున్నాది. దాని తెలుగు అసైన్మెంట్ చూసాను. "సువర్ణదీర్ఘసంధి" అని ఉంది...దానికి టిక్ పెట్టబడి, మార్కులు కూడా వేయబడి ఉన్నాయి. వాళ్ళ టీచరే కరక్ట్ చేసిందిట...రెండు సార్లు 'సువర్ణ అని రాసినా అది తప్పుగా కనిపించలేదు మహతల్లికి.
ఇంతలో పక్కింటి అమ్మయి ఒకర్తి వచ్చింది పుస్తకాలు పట్టుకుని. వాళ్ళిద్దరూ రోజూ ఓ గంట కుర్చుని చదువుకుంటారట. ఆ పిల్ల 8 చదువుతున్నాది. ఆ పిల్ల నోట్స్ చూసాను. అందులో ప్రోబబిలిటీ ఉంది....ఏదో భయంకరమైన కౄర జంతువుని చూసినట్టు అదిరిపడ్డాను నేను. ఎనిమిది లోనే ప్రోబబిలిటీ ఏమిటి, మాకు పది లో ప్రోబబిలిటీ గురించి కొంచం పరిచయం మాత్రం చేసేవారు అంతే. ఆ మాత్రం దానికే చుక్కలు కనిపించాయి నాకు. ఇప్పుడేమో ఈ పిల్ల ఎనిమిదిలోనే చదివేస్తున్నాది. పైగా ఆ పిల్ల చెప్పినది విన్నాక నాకు కళ్ళు తిరిగినంత పనయింది. వాళ్లకి ప్రోబబిలిటీ పాఠ్య పుస్తకంలో లేదుట. పై క్లాసులలో ఉంటుందిట. కానీ కింది క్లాసులలోనే అది చదివేసుకుంటే పదికి వచ్చేసరికి సులువుగా ఉండి పదిలోనే ఇంటర్ లెక్కలు అవీ నేర్చేసుకోవడానికి వీలుగా ఉంటుందిట. అప్పుడు ఇంటర్ లో మొత్తం సమయమంతా IIT కోచింగ్ మీద ఖర్చు పెట్టి మంచి ర్యాంకులు తెచ్చేసుకోవచ్చుట. ఇది వాళ్ల స్కూలో ప్లాను. అందుకని వీళ్ళని ఇలా రుద్దేస్తున్నారు. ఇది విన్నాక నాకు ఒక విచిత్రమైన, భయంకరమైన ఊహ వచ్చింది. రేపొద్దున్న కడుపులో పిండం పడీ పడగానే, ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వడానికి కావలసిన ఆసక్తిని రేకిత్తించే మందులను ఇంజక్ట్ చేసేసి, పుట్టగానే చదువు మొదలెట్టేసి,ఆరో తరగతి లోపే పదో తరగతి పూర్తిచేయించేసి, పదో తరగతి లోపు IIT కోచింగు పూర్తయిపోయి, ఇంటర్ లో ఇంజనీరింగు కోర్సులు చెప్పేసి, B.Tech లో M.Tech, M.Tech లో phd చేయించేసి...అమ్మో...తలుచుకుంటేనే కడుపులో దేవినట్టనిపించింది. :( సరే ఇంతకీ మీరిద్దరూ వేరేవేరే క్లాసులు కదా కలిసి చదువుకోవడమేమిటర్రా అని అడిగితే.... పక్కింటి పిల్ల తో కూర్చుని చదువుకుంటే ఎనిమిదో క్లాసు లెక్కలు కూడా దీనికి కొంచం తెలుస్తాయిట (ఇది నా ఫ్రెండు పైత్యం) అప్పుడు ఎనిమిదో క్లాసుకొచ్చేసరికి దీనికి సులువుగా ఉంటుందిట. అలాగే దీనికి చెబుతూ చదువుకోవడం వల్ల పక్కింటి పిల్లకి ఆ లెక్కలు బాగా వంటబట్టి ఇంకెప్పటికీ మరచిపోదుట. ఆహ ఏమి తెలివితేటలే తల్లి అని, ఇంక లాభం లేదని చెప్పి, ముందు ట్రీట్మెంట్ వీళ్ల అమ్మకి జరగాలి అనుకుని...నామిని రాసిన "చదువులా, చావులా?" పుస్తకం ఇచ్చాను నా ఫ్రెండుకి. ఈ మధ్యనే ఈ పుస్తకం నేను చదివాను.
ఇంతలో పక్కింటి అమ్మయి ఒకర్తి వచ్చింది పుస్తకాలు పట్టుకుని. వాళ్ళిద్దరూ రోజూ ఓ గంట కుర్చుని చదువుకుంటారట. ఆ పిల్ల 8 చదువుతున్నాది. ఆ పిల్ల నోట్స్ చూసాను. అందులో ప్రోబబిలిటీ ఉంది....ఏదో భయంకరమైన కౄర జంతువుని చూసినట్టు అదిరిపడ్డాను నేను. ఎనిమిది లోనే ప్రోబబిలిటీ ఏమిటి, మాకు పది లో ప్రోబబిలిటీ గురించి కొంచం పరిచయం మాత్రం చేసేవారు అంతే. ఆ మాత్రం దానికే చుక్కలు కనిపించాయి నాకు. ఇప్పుడేమో ఈ పిల్ల ఎనిమిదిలోనే చదివేస్తున్నాది. పైగా ఆ పిల్ల చెప్పినది విన్నాక నాకు కళ్ళు తిరిగినంత పనయింది. వాళ్లకి ప్రోబబిలిటీ పాఠ్య పుస్తకంలో లేదుట. పై క్లాసులలో ఉంటుందిట. కానీ కింది క్లాసులలోనే అది చదివేసుకుంటే పదికి వచ్చేసరికి సులువుగా ఉండి పదిలోనే ఇంటర్ లెక్కలు అవీ నేర్చేసుకోవడానికి వీలుగా ఉంటుందిట. అప్పుడు ఇంటర్ లో మొత్తం సమయమంతా IIT కోచింగ్ మీద ఖర్చు పెట్టి మంచి ర్యాంకులు తెచ్చేసుకోవచ్చుట. ఇది వాళ్ల స్కూలో ప్లాను. అందుకని వీళ్ళని ఇలా రుద్దేస్తున్నారు. ఇది విన్నాక నాకు ఒక విచిత్రమైన, భయంకరమైన ఊహ వచ్చింది. రేపొద్దున్న కడుపులో పిండం పడీ పడగానే, ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వడానికి కావలసిన ఆసక్తిని రేకిత్తించే మందులను ఇంజక్ట్ చేసేసి, పుట్టగానే చదువు మొదలెట్టేసి,ఆరో తరగతి లోపే పదో తరగతి పూర్తిచేయించేసి, పదో తరగతి లోపు IIT కోచింగు పూర్తయిపోయి, ఇంటర్ లో ఇంజనీరింగు కోర్సులు చెప్పేసి, B.Tech లో M.Tech, M.Tech లో phd చేయించేసి...అమ్మో...తలుచుకుంటేనే కడుపులో దేవినట్టనిపించింది. :( సరే ఇంతకీ మీరిద్దరూ వేరేవేరే క్లాసులు కదా కలిసి చదువుకోవడమేమిటర్రా అని అడిగితే.... పక్కింటి పిల్ల తో కూర్చుని చదువుకుంటే ఎనిమిదో క్లాసు లెక్కలు కూడా దీనికి కొంచం తెలుస్తాయిట (ఇది నా ఫ్రెండు పైత్యం) అప్పుడు ఎనిమిదో క్లాసుకొచ్చేసరికి దీనికి సులువుగా ఉంటుందిట. అలాగే దీనికి చెబుతూ చదువుకోవడం వల్ల పక్కింటి పిల్లకి ఆ లెక్కలు బాగా వంటబట్టి ఇంకెప్పటికీ మరచిపోదుట. ఆహ ఏమి తెలివితేటలే తల్లి అని, ఇంక లాభం లేదని చెప్పి, ముందు ట్రీట్మెంట్ వీళ్ల అమ్మకి జరగాలి అనుకుని...నామిని రాసిన "చదువులా, చావులా?" పుస్తకం ఇచ్చాను నా ఫ్రెండుకి. ఈ మధ్యనే ఈ పుస్తకం నేను చదివాను.
నామిని రాసిన ఈ పుస్తకం నాకు చాలా నచ్చింది. ఇది 2008 లో వచ్చిందనుకుంటా. ఈ పుస్తకం గురించి ఆయన మాటల్లో: "పాత కాలంలో పిల్లల్లు సరి అయిన వైద్యం అందక లేత వయసులోనే చచ్చిపోయేవాళ్ళు. ఈ కొత్త కాలంలో చేతికి అంది వచ్చిన పిల్లలు, మనం కోరిన చదువుల్ని అందుకోలేక అన్యాయంగా చచ్చిపోతున్నారు"
అలా ఉంది ఇవాల్టి పరిస్థితి. నామిని 'ఇస్కూలు పిల్లకాయల కథ', 'పిల్లల భాషలో ఆల్జీబ్రా' అనే రెండు పుస్తకాలు రాసారు ఇంతకుముందే. కానీ ఈ చదవుల చేతిలో నలిగిపోయే పిల్లల బాధలు చూడలేక ఈ పుస్తకం రాసారుట. ఈ పుస్తకం లో రాయదలుచుకున్న విషయాన్ని 50 మంది పిల్లలకు చెప్పారట. వాళ్ళంతా దీనికి "చదువులా చావులా" అనే పేరు పెట్టమని సూచించారట. పాపం కదూ...వాళ్ళ చిన్నారి మనసులు ఎంత నలిగిపోకపోతే ఈ మాటంటారు! బడి,చదువు అంటేనే అగ్నిగుండం లో దూకుతున్నట్టు బాధపడుతున్నారు.
చిన్నవయసునుండే పిల్లలు ఎంత ఒత్తిడిని భరిస్తున్నారో, తల్లిదండ్రుల గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి ఎన్ని అవస్థలు పడుతున్నారో, వారి మానసిక పరిస్థితి ఎలా తయారవుతున్నాదో ఈ పుస్తకంలో ఉదాహరణలతో వివరిస్తారు. అంతేకాక పాఠాలు చెప్పే పంతుళ్ళ రాక్షసత్వం, విద్యా బోధనలోని కర్కసత్వం కళ్లకు గట్టినట్టుగా చూపిస్తారు. ఇవన్నీ నామిని కల్పించిన కథలు కావు...చేదు నిజాలు, నిజంగా కళ్ళజూచిన చేదు అనుభవాలు. ఇది ఇప్పటి విద్యావిధానాల పై స్వీయ అనుభవాలను చేర్చి ఝళిపించిన కొరడా.
తన భార్యే తన కూతురితో చదువు విషయమై ఎలా మాట్లడుతుందో, ఎలా హింసిస్తుందో కళ్లకు కట్టినట్టుగా రాస్తారు. "14 ఏండ్ల నాకూతురి మీద, 30 కేజీల నా కూతురి మీద, 300 కిలోల బరువూ బాధ్యతా" అని వాపోతారు. పిల్లలని చావచితగ్గొట్టకుండా వారికి అర్థమయిన రీతిలో బుజ్జగిస్తూ, అరటిపండు తొక్క వలిచి చేతిలో పెట్టినట్టుగా ఎలా పాఠాలు చెప్పొచ్చో వివరిస్తారు. బిడ్దను ఒళ్ళో కూర్చోబెట్టుకుని మజ్జిగన్నం తినిపించి మూతి తుడిచినంత ప్రేమతో లెక్కలు అవీ చెప్పాలి అంటారు, నిజమే కదూ!
కోళ్ళ ఫారం లా స్కూళ్ళు పెట్టి పిల్ల జీవితాలతో ఎలా ఆడుకుంతున్నారో స్వీయ అనుభవాలతో రాస్తారు. ఆయన స్వయంగా విన్న విషయం: "ఒక షెడ్డేసి రెండువేల పిల్లలతో బ్రాయ్లర్స్ పెట్టేసాను. మనకింకా అరవై అంకణాలుంది. దాంట్లో కూడా షెడ్డేసి స్కూలు పెట్టేసాను. ఏక్‌దమ్మున 200 మంది పిల్లలు చేరిపోయారు." కొత్తగా పెట్టిన స్కూలులో అంతమంది పిల్లలు ఎలా చేరిపోయారూ అని అడిగితే "బలే ఐడియా వేసానులెండి. LKG, UKG - ఫిఫ్టీ రుపీస్. 1st to 7th - 100 రుపీస్ ఫీజు. అంతే ముందు ఆట్లాగే పెట్టలి. షెడ్ బాగుంది. మద్రాసు దాకా పోయి 5 వేలు పెట్టి టాయ్స్ అవీకొనుక్కొచ్చాను. చేరి పోయారు" అని చెప్పాట్ట ఒక మహానుభావుడు.
"ఈ speed, acceleration మీ నెత్తినేసుకు రుద్దుకోండి, ఈ physics లేని లోకానికి వెళ్ళిపోతున్నాను" అని ఓ చిన్నారి ఉత్తరం రాసి పెట్టి, నిండు జీవితాన్ని బలి చేసుకున్న కథ వింటే మనసు కకావికలమవుతుంది. ఒక పాప స్కూలు డ్రెస్ మీద స్వెట్టర్ వేసుకుందిట. "ఏమ్మా ఉక్కబెడుతుంటే స్వెట్టర్ కూడా వేసుకున్నవ్" అని అడిగితే "టీచర్లు కొడతారు కదా సార్, ఈ స్వెట్టర్ వేసుకుంటే కాస్త మెత్తగా ఉండి నెప్పి తక్కువగా ఉంటుందని వేసుకున్నా సార్" అందిట. ఈ మాట విన్నాక నాకైతే ఇంకో ఉపయోగం కూడా కనిపించింది. ఆ పుస్తకాల సంచి మొయ్యడానికి కూడా, మెత్తగా ఉండి, పనికివస్తుంది అనిపించింది. చిన్న తరగతులనుండే బండెడు పుస్తకాలు మోయలేక వాళ్ళ మొహాలు ఎంత వడిలిపోతుంటాయో!
ఇంటర్ లో చదువుల గురించి రాస్తూ....కోడిని కొయ్యడానికి మెడ మీద కత్తిపెట్టాక దాని గుండెకాయలు ఎంత స్పీడుగా కొట్టుకుంటాయో అంత ఉద్విగ్నంగా ఉంటారుట పిల్లలు ఎంసెట్ ఫలితాల వెల్లడి అప్పుడు.
"చదువులో పసలేదుగానీ సోకులకేం కొదవలేదు. పుస్తకం ముందు నిముషం కూర్చోలేవు. అద్దం తీసుకుంటే మాత్రం ఒళ్లే తెలవదు. బిడ్డ చదివితే ముచ్చట. ఈ సోకులు చేసుకుంటే కాదు. ఆ సుజాతని చూడు. పుట్టుక అంటే అది! ఆ పిల్ల చదివే స్కూలే కదా నువ్వూ చదివేది, ఆ పిల్లకి చెప్పే టీచర్లే కదా నీకూ చెప్పేది. నీ తలకాయలో ఉండేది బంకమట్టి కదా" - ఒక తల్లి.
"కన్ననేరానికి టెన్త్ ఫెయిలవగానే దీనికి ఎవణ్ణో ఒక పంగమాలిన వెధవను చూసి తగిలించేస్తే పోతుంది" - ఒక తండ్రి.
"అమ్మా, తల్లి! నీ కథ నాకు తెలుసు. నువ్వు ఒక్క ఫార్ములా కూడా నేర్చుకోలేవు. నీకు పవన్ కల్యాణ మీద ఉండే శ్రద్ధ సబ్జెక్టు మీద లేదు" - ఒక టీచరు.
దీన్ని దెయ్యల భాష అంటారు నామిని. ఇది మనుషులు మాట్లాడవలసిన భాష కాదు, అందుకే ఈ పుస్తకం రాసానంటారు. మేజిక్ ఫిగర్ 500 కోసం మేథ్స్ టీచర్లు పిల్లలని ఎలా చావబాదుతున్నారో, క్లవర్లు, మొద్దులు అని పిల్లలని విడదీసి వాళ్ళ పసి మనసులని ఎంత నుసి చేస్తున్నారో అన్న విషయలు వింటుంటే మనకే గుండె తరుక్కుపోతుంది, ఇంక ఆ పిల్లల సంగతి ఏంగాను! తల్లిదండ్రులకి కూడా పిల్లల సమగ్రవికాసం అక్కర్లేదు. కావల్సినది ర్యాకులే. వారికి ఆటలు అక్కర్లేదు. లలితకళల ప్రాధాన్యత చెప్పక్కర్లేదు. మానసికోల్లాసం కలిగించక్కర్లేదు. చదివేసుకుని మార్కులు తెచ్చుకుంటే చాలు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు.
ఒకాయన వాళ్ళ పిల్లాడి రోజువారీ కార్యక్రమాల గురించి చెప్పాడట....
1)మా హరీ ఉదయన్నే నాలుగ్గంటలకి నిద్ర లేవాలి. మనసు ప్రశాంతంగా ఉండడానికి అరగంట ధ్యానం.
2)తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని, యూనిఫాం వేసుకుని రెడీ అయిపోతాడు. 5 గంటలకల్లా Maths, physics, chemistry చెప్పే ట్యూషన్ మాస్టారు వస్తాడు. 7 వరకూ ఆయన పాఠాలు చెబుతాడు. తర్వాత ఎనిమిదిన్నరకల్లా మరోసారి రివిజన్ చేసుకుని కప్పు నానబెట్టిన బఠానీలు, ఒక గ్లాసుడు పాలూ...స్కూలికెళ్ళిపోతాడు.
3) 12-45కి మధ్యాహ్నం భోజనం, డ్రైవర్ తీసుకెళ్తాడు, రోకటితో దంచిన దంపుడు బియ్యం భోజనం-అదీ 150 గ్రాములు. మరోవంద గ్రాముల దాకా పచ్చి కూరగాయలు. గుడ్డూగానీ మటన్ గానీ నహీ. పిల్లవాడు sharp గా ఉండడానికి ఉడకబెట్టిన వంటలేవీ లేవు - అంతా పచ్చికూరగాయలే!2)తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని, యూనిఫాం వేసుకుని రెడీ అయిపోతాడు. 5 గంటలకల్లా Maths, physics, chemistry చెప్పే ట్యూషన్ మాస్టారు వస్తాడు. 7 వరకూ ఆయన పాఠాలు చెబుతాడు. తర్వాత ఎనిమిదిన్నరకల్లా మరోసారి రివిజన్ చేసుకుని కప్పు నానబెట్టిన బఠానీలు, ఒక గ్లాసుడు పాలూ...స్కూలికెళ్ళిపోతాడు.
4) సాయంకాలం నాలుగ్గంటలకల్లా స్కూలుకెళ్ళి వాణ్ణి pick up చేసుకుని 4.30 కి - నల్లకుంట రామయ్య కోచింగ్ సెంటర్ లో సీటు రావడానికి తీసుకునే కోచింగ్. 7.30 కి అక్కడ అయిపోతుంది.
5) రాత్రి ఎనిమిదికి ఇంటికి రాగానే మంచినీటి స్నానం. అర్థగంట ప్రశాంతత కోసం flute వాయించాలి. 8.30 కి పచ్చికూరలతో దంపుడు బియ్యం భోజనం.
6) రాత్రి పదకొండు దాకా మళ్ళీ subjects మీద పడడం.
ఇలాగే రోజూ జరుగుతుందిట. ఆదివారాలు ట్యూషన్ మాస్టర్లు, కోచింగ్ సెంటర్లూ...బలే బిజీ. ఆ తండ్రికి ఇదొక యజ్ఞంట. ఇంతా చేస్తే ఆ కుర్రాడు చదువుతున్నది 8 వ తరగతి. ఈ మహా యజ్ఞం గురించి సదరు తండ్రే స్వయంగా నామిని కి చెప్పాడుట.
ఒక పిల్లడు తన నోట్స్ చివర టైమ్ టేబిల్ లో సోమ నుండీ శని వరకూ అన్ని పీరియడ్లలోనూ playing అని రాసుకుని చివరి పీరియడ్లో మాత్రం subject రాసుకున్నాడట. ఏంటమ్మా ఇలా టైమ్ టేబిల్ తయారుచేసుకున్నావ్ అని అడిగితే "ఇలా ఉంటే ఎంత బాగుంటుందా అని తమాషాగా రాసుకున్నా" అన్నాడుట. పాపం ఆ పిల్లవాడికి ఆడుకోవాలని ఎంత ఆశగా ఉండి ఉంటుందో కదా! ఇటువంటి దృష్టాంతాలెన్నో కళ్ళకుగట్టినట్టుగా రాసారు. ఆ పిల్లల బాధలు వింటూ ఉంటే మనసు చివుక్కుమంటుంది.
ఈ మధ్య నేను ఇంకో కొత్త విషయం చూసాను. ఒక కార్పరేటు స్కూల్లో మాకు తెలిసినవాళ్ళ పిల్లాడిని LKG లో పడేసారు. అక్కడ రూలు ఏమిటంటే పిల్లలు ఆ రోజు ఏమి తినాలో వాళ్ళు ముందే చార్ట్ ఇచ్చేస్తారుట. మొత్తం స్కూల్లు ఉన్న అన్నిరోజుల్లోను పిల్లలకి బాక్సుల్లో ఏమి పెట్టి పంపించాలో రాసి ఇచ్చేస్తారట. తల్లిదండ్రులు అవే చేసి పెట్టాలట. మారిస్తే ఒప్పుకోరుట, ఏదో ఫైన్ ఉంటుందిట. అయితే అందులో బలవర్థకమైన ఆహరమే ఉంది. కానీ ఇదేం దౌర్భాగ్యం, వాళ్ళు ఏమి తినాలో కూడా స్కూలు యాజమాన్యమే నిర్ణయిస్తుందా! ఒకవేళ ఆ తల్లిదండ్రులకి అలా చెయ్యడం కుదరకపోతే? ఒక తల్లిదండ్రుల ఆవేదన ఏమిటంటే - మంచి స్కూలని, ఎలాగొలా కష్టపడి స్కూలు ఫీజు కట్టి జాయిన్ చేసారు కానీ ఈ రూలు ప్రకారం ఆహారాన్ని అందించగలిగే స్థోమత లేదు...ఈ రూలు మా పిల్లకి పెట్టకండి అని ఎంతో ప్రాధేయపడినా యాజమాన్యం ఒప్పుకోలేదు. దాంతో ఇంక గతి లేక ఆ పిల్లని ఆ స్కూలునుండి విడిపించి వేరే స్కూలులో జాయిన్ చేసారు. ఇది నా కళ్ళముందే జరిగిన విషయం. ఆ తల్లిదండ్రులని చూస్తే నాకు బలే జాలేసింది. అయితే కొంతమంది తల్లిదండ్ర్లులు దీన్నో గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఇలాగైనా పిల్లలకి తిండిలో క్రమశిక్షణ అలవడుతుందని, పోషకపదార్థాలు చేరుతాయని. అలా రూలు ఉండడమే మంచిదని కొందరి భావన.
కార్పరేటు స్కూళ్ళ పరిస్థితి ఇలా ఉంటే గవర్నమెంటు స్కూళ్ళ పరిస్థితి మరో రకంగా ఉంది. నాకు తెలిసిన స్నేహితుడి అక్క, బావ ఇద్దరూ గవర్నమెంటు బడులలో టీచర్లు. అక్కడ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదుట. ఇన్స్పెక్షన్ కి వస్తే వీళ్ళే రిపోర్టులు రాసి ఇచ్చేస్తారుట. చదువు లేక, చెప్పేవారు లేక ఆ పసిమొగ్గలు బాధపడుతున్నాయి. అంతెందుకు మా విజయనగరంలో జరిగిన ఒక కథ: నాతోపాటూ BA చదివిన ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను BA లో ఒకసారి ఫైల్ అయి రెండోసారి ఎలాగోలా పూర్తి చేసాడు. తరువాత ప్రైవేటుగా MA కట్టి మూడు సార్లు ఫెయిల్ అయి, నాలుగోసారి గట్టెక్కించాడు. అతనికి, మా విజయనగరంలో, ఓ 30 సంవత్సరాలపాటు మంచి బడిగా ప్రసిద్ధి చెందిన ఒక స్కూల్లో సైన్సు టీచరుగా ఉద్యోగం. పార్ట్ టైమే గానీ ఇతనే ఆ పిల్లలకి పాఠాలు చెప్పేది. మళ్ళి 10 వ తరగతి పిల్లలకి చెబుతున్నాడట. పాఠాలు పెద్దగా చెప్పక్కర్లేదుట. ఏదో నోట్స్ ఇస్తే చాలుట. పిల్లలు పాస్ అయినా ఫెయిల్ అయినా అనవసరం. మన జీతం మనకొస్తుంది అని అతను చెబుతుంటే నోరు వెళ్లబెట్టుకుని వినడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయాను.
మొత్తనికి ఎక్కడైనా నలిగిపోయేది పసికందులే. పిల్లలకి తల్లిదండ్రుల మీద ఆశ ఉండొచ్చుగాని అది వారికి భారం కారాదు. "మనకి తలకాయలైతే ఉన్నాయిగదా ఆలోచిద్దాం" అంటారు నామిని. ఇదే విషయంపై నామిని పదే పదే రాస్తున్నాడు, ఇక ఆపితే బాగుందును అన్నది ఒక విమర్శ. కానీ పైన చెప్పిన లాంటి పరిస్థితులున్నప్పుడు ఇలాంటి పుస్తకాలు ఇంకా ఎన్నో, ఎన్నెన్నో రాయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. "చదువులా చావులా" ప్రతీ ఒక్కరూ చదవవలసిన పుస్తకం ఇది. వెల 20 రూపాయిలు మాత్రమే. నేనైతే ఇది పదిమందికి పంచిపెట్టి, వీలైనంత మంది చేత చదివించాలని నిర్ణయించుకున్నాను. అంటే ఇది చదివేసి తల్లిదండ్రులూ,టీచర్లూ అందరూ మారిపోతారని కాదు, కనీసం ఆలోచిస్తారని. మరి మీరు కూడా చదువుతారు కదూ?
58 comments:
చదువులా చావులా అని కాదు టైటిల్ ఉండాల్సింది. చదివిస్తున్నారా మీ పిల్లలతో వ్యభిచారం చేయిస్తున్నారా అని ఉంటే ఇంకా బాగుండేదేమో.
హ్మ్మ్... చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ పోస్ట్ రాశారు..
సరిగ్గా ఇలాంటిదే.. ఒకటి నేను చూశాను. మా పిన్ని గారబ్బాయి చిన్నప్పటీ నుండీ చాలా షార్ప్. అలాంటి వాడిని 7th క్లాస్ నుండీ IIT కోచింగ్ అని చెప్పీ, శని , ఆదివారాలు కూడా ఖాళీ వదల కుండా, సెలవుల్లో కూడా ఎక్కడికీ తిరగనివ్వకుండా, కేబుల్ కనెక్షణ్ తీయించేసి, చదువూ..చదువూ.. అని చావగొట్టేస్తున్నారు. హ్మ్మ్..
మీ పోస్ట్ చదివాక నాకు ఒకటే అనిపిస్తుంది. నేను చాలా లక్కీ. పదేళ్ళు ముందు పుట్టేశాను. నిజంగా జాలేస్తుంది ఆ పిల్లల్ని చూస్త్సుంటే.. ప్చ్..
excellent post..
excellent post andi.
ఈ ఇద్దరు పేరెంట్స్ కనిపించినా మా వాడు IIT అంటే మా వాడు Bits Pilani అని మాట్లాడుకొవడమే పని.
ఆంటే మాములు స్కూల్స్ లో చదివే వాళ్ళు పనికి రాని వాళ్ళా.
మా వదిన వాళ్ళ అబ్బాయిని నారాయణ లొ జాయిన్ చేయిస్తాను అంటే ,అక్కడ క్లాస్స్ కి 200 మెంబర్స్ వుంటారు,మన వాడు వున్నాడొ వుడాడొ కుడా ఎవరికి తేలీదు.
ఎందుకొచ్చిన గొడవ చిన్న స్కూల్స్ లొ అయితే పిల్లల మీద కెరింగ్ వుంతుంది,మరీ అంత రుద్దరు అంటె అప్పటికి అర్దం అయి మానుకొంది.
నెను నారాయణ లొ ఒక ఇయర్ లాంగ్ టెర్మ్ తీసుకొన్నను లెండి.
ఛీ నా జీవితం,ఇప్పటికి తలుచుకొన్న విరక్థి వస్తుంది.
వుదయం 4 టూ రాత్రి 11 వరకు చదువుతునే వుండాలి.
నా వల్ల కాలెదు,నా కూతురి ని మాత్రం చచ్చిన కార్పొరేట్ స్కూల్స్ లొ జాయిన్ చెయ్యను.
ఇలాంటివన్నీ విని, చూసి, ఇంటర్వ్యూలు చేసి, తల్లిదండ్రులతో మాట్లాడి, నచ్చజెప్పి, విసిగి పోయి ఉన్నాను నేను! వీటన్నిటికీ తల్లిదండ్రులు హాయిగా అలవాటు పడి పోయి ఉన్నారు.
ఈ విష వలయం లోంచి బయట పడటం, చాలా కష్టం! ముఖ్యంగా తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాల్లో పిల్లల్ని పట్టించుకునే తీరిక ఇద్దరికీ తగినంతగా ఉండదు. అందుకే వాళ్ల బాధ్యత పూర్తిగా స్కూలు మీద పెట్టేస్తున్నారు. బాధ్యత పూర్తిగా తీసుకున్న స్కూళ్లు లక్షల్లో ఫీజులు తీసుకుంటారు. తీసుకున్నందుకు గానూ పిల్లని పిండి పారేస్తున్నారు.
దీనికి పరిష్కారం కేవలం తల్లి దండ్రుల చేతిలో కాదు, మొత్తం అందరి చేతిలో ఉంది. ఒకరు మారితే జరిగే మార్పు కాదు ఇది.
:-)
ఇవన్నీ తెలిసి చేర్పిస్తున్న చదువుకొన్న కొంతమంది తల్లిదండ్రులను ఏమనాలి..?
ప్రైవేటు పాఠశాల యాజమాన్యం వాళ్ళ స్వార్ధం కోసం, డబ్బు మరియు పరపతి కోసం అలా చేస్తుంటే మనోళ్ళు ఆహా, ఓహో ఆ పాఠశాల వాళ్ళకి అన్ని ర్యాంకులు వచ్చాయ అని చేర్పిస్తున్నారు. దీనికి ఇంకో కారణం ప్రభుత్వ పాఠశాలల విఫలం కూడ. ప్రభుత్వ పాఠశాలకి కలెక్టరు వస్తున్నాడంటే ఒక్కసారిగా ఆ స్కూలు షేపే మారిపోతుంది. మిగతా సమయాలలో లైట్.
Nice Post.
సౌమ్య గారు..
>>నల్లకుంట రామయ్య కోచింగ్ సెంటర్ లో సీటు రావడానికి తీసుకునే కోచింగ్
ఇది చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మనసును కదిలించే టపా రాసారు.
నిజంగానే ఈ చదువులేంటో అర్థం కాదు. అలాగని మార్పు మన చేతిలో లేదు కదా అనుకోవడం కూడా ఇష్టం లేదు నాకు.మా పాప ఇప్పుడు వయసు 3 1/2 యేళ్ళు తనకు రెండు నిండినప్పటినుండి అందరూ ఏంటి ఇంకా స్కూల్‌లో వెయ్యలేదు అని అడగడమే. ఇంత చిన్నప్పుడే స్కూల్‌లో వేయడం నాకు ఇష్టం లేదు యల్.కె.జి కి వెళ్ళె వయసు రాగానే చేర్పిస్తాను అని చెప్తాను. మా బాబు ఎప్పుడు రెండవ తరగతి కి వెళ్తాడు. వాడికి ఎప్పుడూ చదువుకో, హోంవర్క్ చేసుకో అని చెప్పలేదు. పరీక్షలప్పుడు కూడా హాయిగా కథల పుస్తకాలు చదువుతూ ఉంటాడు. వాడిని చూసి నాకనిపిస్తుంది వీడు ఎప్పటికి ఇలాగే ఆడుతూ పాడుతూ చదువుకోవాలి అని. స్కూల్‌కూడా మంచి స్కూల్ అని లక్షల్లో ఫీజులు కట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని ఇంటికి అతి దగ్గరలో ఉన్న స్కూల్‌లో వేసాం.
"ఈ స్వెట్టర్ వేసుకుంటే కాస్త మెత్తగా ఉండి నెప్పి తక్కువగా ఉంటుందని వేసుకున్నా సార్"
:'(
నిజమండీ. ఇలా చేయడం చాలా అన్యాయం.
ఇంటర్మీడియట్‌లో కొందరు ర్యాంకర్లనీ వాళ్ళు రోజులు గడిపే విధానాన్నీ చూశాక retarted పిల్లలు కూడా వీళ్ళకంటే చురుగ్గా వుంటారే అనిపించింది. సీరియస్‌గా జాలి పడేవాణ్ణి. ఇప్పుడు అది చిన్నపిల్లల వరకూ పాకింది.
నామిని పుస్తకం గురించి విన్నాను కానీ నేనింకా చదవలేదు. మీ టపాలోని అంశాలు కొందరు తల్లిదండ్రులకైనా ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయ్.
కొన్ని ప్రైవేటు స్కూళ్ళలో ఎనిమిదో తరగతి తర్వాత 9వతరగతి చదివించకుండా టెన్త్ బుక్సే రెండేళ్ళపాటు చదివిస్తారట! ఇక కార్పొరేట్ కాలేజీల్లో లెక్కల స్టెప్పులను పిల్లలతో బట్టీ పట్టిస్తారని మీకు తెలుసా? ఎందుకంటే ఎంసెట్ పేపర్లో ఇంటర్ బుక్ లోని లెక్కలే... ఒక్క అంకె కూడా మారకుండా యథాతథంగా ఇచ్చేస్తారు కదా, అందుకన్నమాట!
హాహాహ్హా మీ ఉద్దేశ్యం ఏమిటీ. మా పిల్లలు బాగా చదువుకోనఖ్ఖరలేదా? సాఫ్ట్వేర్ ఇంజనీరు కానఖ్ఖర లేదా? IIM లలో చేరద్దా? 15 ఏళ్ళు చదివి కష్టపడితే AC కార్లలోను, విమానాల్లోనూ తిరగవచ్చు కదా. అమెరికానో అంటార్టికాకో తిరగవచ్చు కదా. చిన్న చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు రాక జీవితాంతం కష్టపడే బదులు, 10-15 ఏళ్ళు కష్టపడి ఆపైన సుఖపడవచ్చు కదా.
ఇవి నేను విన్న మాటలు తల్లి తండ్రుల నుంచి, వీళ్లకేమి చెప్పలేము ఎందుకంటే వీళ్ళు చదువు 'కొన్న' వారే. పాపం పిల్లలు.
చాలా బాగా రాసారు. వారమంతా చదువులు, వారాంతంలో చెస్, అబాకస్...చిన్న పిల్లల బాల్యాన్ని హరించేస్తున్నాము. రెండు రోజుల క్రితం మా అపార్ట్మెంట్ కింద ఫ్లోర్ లో ఉండే ఒక తెలుగావిడ మా ఇంటికి వచ్చారు. నేను మహా పొంగిపోయాను...పరిచయం చేసుకోవటానికి వచ్చారు, భలే మంచి వారు అనుకుంట. అసలు సంగతి ఏమిటంటే ఆవిడ నా పిల్లల బుక్స్ చూడటానికి వచ్చారు. ఆవిడ పాప చదివే స్కూల్ బుక్స్, నా పిల్లలు చదివే బుక్స్ ఎలా ఉన్నాయో compare చేద్దామని అంట...ఇంతకీ నా పిల్లలు చదివేది UKG. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు...
"డిగ్రీలు లేని పాండిత్యంబు వన్నెకు రాని యీ పాడుకాలానఁ బుట్టి..." అని నాఁడు విశ్వనాథ సత్యనారాయణగారు వాపోయారు.
ఇప్పుడు "చిన్నతనమునాఁడె యెన్నెన్నొ పొత్తముల్ చదువకున్నను వాఁడు చవట గాడె?" అనుకునే తల్లిదండ్రులవలన పిల్లలు "తప్పదా మా తల్లిదండ్రులకొఱకునై నలిగిపోవుట? వారు తెలియలేరె?" అనుకోవలసిన పరిస్థితి!
నిజంగా బాధాకరమండీ.
సౌమ్య గారు - మీ పోస్ట్ ,ఆ పుస్తకం ప్రతి టీచర్..ప్రతి తల్లి తండ్రులు చదివితే బాగుండు..
మా పిన్ని కొడుకు ఆరవ తరగతి చదువుతున్నాడు...మొన్న ఇంటికి వచ్చినప్పుడు వాడు homework చేస్తుంటే చాలా రోజులయ్యింది..అసలు ఈ పుస్తకాలను ముట్టి అని తిరగేస..
నా బుర్ర తిరిగిపోయింది..:(...వాడిని నేను ఎంత జాలి గా చూసానో...మా పిన్ని ని వెళ్లి తిడ్తే...మామూలు స్కూల్ లో చేర్చండి..అలాంటివి వద్దు..అంటే...నీకేమే శుబ్రంగా సంపాదిస్తున్నావ్..ఇలాగే అంటావ్..అనింది..ఏం చెప్పాలి.. :(
సౌమ్యా మా బాగా వ్రాసారు. అయినా మీరు చాలా వెనకబడి ఉన్నారు మరి :)
"పుట్టగానే చదువు మొదలెట్టేసి,ఆరో తరగతి లోపే పదో తరగతి పూర్తిచేయించేసి, పదో తరగతి లోపు IIT కోచింగు పూర్తయిపోయి"...ఇప్పుడు నిజంగా జరుగుతుంది అదే! పదో తరగతి కాదు..ఆరో తరగతిలోనే IIT కోచింగు మొదలయిపోతుంది. ఎప్పుడో ఇంజనీరింగులో చదివే physics by Resnick and Halliday పుస్తకం ఎనిమిదో తరగతి నుండే బట్టీ పెట్టించేస్తున్నారు...వాళ్ల బుర్రల్లోకి ఎంతపోతుందని మాత్రం అడగకండి. పదో తరగతి చదువు నామమాత్రం అయిపోయింది.
మన రాష్ట్రంలో ఓ ప్రసిద్ధ స్కూల్లో మా పిల్లలకి పదో తరగతిలో ఇంత తక్కువ మార్కులు వచ్చాయేంటండీ అంటే..వాళ్ల సమాధానం ఏంటో తెలుసా....మీకు పదో తరగతిలో మార్కులు కావాలా...IIT లో సీటు కావాలా ..IIT లో సీటు కావాలంటే పదో తరగతి మార్కులు పట్టించుకోకండి అని.....అలా ఉన్నాయి మన చదువులు.
IIT కి రామయ్యలో కోచింగు..ఆ రామయ్యలో జేరటానికి మరో దానయ్య కోచింగు...ఆ కోచింగుకి ముందు స్కూళ్లలో IIT ఫౌండేషను కోర్సులు...ఇదో పెద్ద బిజినెస్సులేండి...ఇందులో బోలెడంత ఎకానామిక్సు కూడానూ!...అబ్బో మాలాంటి వాళ్లకి పిచ్చి లేస్తుంది. మీరింకా ఆ పిల్లల సైన్సు పుస్తకాలు చూసుండరు...చూసుంటే ఇంకేమనేవారో!
ముందు మారాల్సింది మన విద్యా వ్యవస్థ..అది మారితే తల్లిదండ్రులు వాళ్లే మారతారు
అతి సర్వత్రా వజ్రయేత్ !!
అదే సమయం లో పిల్లలు "T.V." / "కార్టూన్స్", "ఇంటర్నెట్ / కంప్యూటర్ గేమ్స్ " తగ్గిస్తే చాలా మంచిది.
కనీసం పరీక్షల టైమ్ లో అయినా కొద్దిగా చదవాల్సిన వాటి మీద శ్రద్ద పెడితే మంచిది.
chala baga rasaru. ee topic meeda pedda charcha jaragalsina avasaram undi. Americalo kooda ee trend peruguthundatam choosthunnam.
Regards,
Himabindu.S
@ నాగ ప్రసాద్
మరీ అంత ఘాటైన పదజాలం చిన్నపిల్లల మీద ప్రయోగించడం బావుండదులే. అయినా నువ్వు చెప్పినదాన్లో నిజమూ లేకపోలేదు. ధన్యవాదములు.
@ రాజ్ కుమార్
అమ్మబాబోయ్, నిజమా...7th నుండే IIT కోచింగా! :(
నిజమే, నువ్వు చెప్పినట్టు మనం ముందు పుట్టి పుణ్యం చేసుకున్నాం. ధన్యవాదములు.
@ శ్రావ్య గారూ
నిజమేనండీ....అసలు ఇంజనీరింగులు, మెడిసిన్ తప్ప వేరే చదువులేవీ చదువులు కానట్టు మాట్లాడతారు. economics చదువుకోవడం వల్ల నేను బోలెడు ఇలాంటి మాటలు పడ్డానులెండి. హ్మ్ మీరు నారాయణ బారిన పడినవాళ్లేనా...ప్చ్. మీరు మీ పాప విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు, చాలా సంతోషమండీ. ధన్యవాదములు.
@ సుజాత గారు,
అవునా! నాకు ఇవన్ని కొత్తగా ఉన్నాయి. ఇంత లోతుగా విషయాలు తెలీవు. ఇవన్నీ చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.
మీరన్నదాన్లోనూ పాయింట్ ఉంది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలకెళ్ళిపోతూ పిల్లల బాధ్యత స్కూలు మీద వదిలేస్తున్నారు. కానీ దీనికి కొన్ని పరిష్కారాలున్నాయి. శని, ఆదివారాలు పిల్లల సంగతి కనిపెట్టడం. వారిని ఆ రెండు రోజులైనా ఆడుకోనివ్వడం. లేదా లలిత కళలు నేర్పించడం....పిల్లలకి ఇది stress relief గా కూడా పనిచేస్తుంది.
ఇంకో మంచి మార్గం - పిల్లలని అమ్మమ్మ, బామ్మ, తాతయ్యల దగ్గర పెరగనివ్వడం, తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలలో వదిలేసి చేతులు దులిపేసుకోకుండా పిల్లల బాగోగులు గమనించేందుకు వారిని తమ వద్దనే ఉంచుకుంటే ఉభయులకు లాభదాయకం, సంతోషం. మన ఖర్మ ఎలా ఏడిసిందంటే చివరిరోజుల్లో తల్లిదండ్రులను చూసుకోవడంలో కూడా లాభాలు చూపించాల్సిన పరిస్థితి (దీని గురించి మరో పోస్ట్ లో రాస్తా).
అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం - ఇంజనీరింగులు, మెడిసిన్ తప్ప వేరే చదువులున్నాయని గుర్తించడం, వాటి విలువలని గ్రహించడం. ఆ దిశలో పిల్లలను ప్రోత్సహించడం.
ధన్యవాదములు.
గిరీష్ గారూ
తప్పు ఒకరిమీద ఉంది అని చెప్పలేము. తల్లిదండ్రులు, టీచర్లు అసలు మొత్తం సమాజం మారాలి.
మీరు మంచి పాయింట్ లేవనెత్తారు.. ప్రభుత్వ పాఠశాలల విఫలం కూడా దీనికి ఒక కారణమే. ధన్యవాదములు.
@అపర్ణ
అయ్యో నీకు తెలీదా! హైదరబాదులో ఇలాంటివి బోల్డు, రామయ్య లో చేరడానికి కోచింగులిస్తారు. నేను ఎన్ని చూసానో! నిజమే నవ్వలో, ఏడవాలో తెలియని పరిస్థితి. ధన్యవాదములు.
సౌమ్యా చాలా బాగా రాసారు ..
నిజంగానే పిల్లల మీద దయ దాక్షిణ్యం లేకుండా ప్రవర్తిస్తున్నారు అందరు ..
నాకైతే చదువు ఎలా చదివాము అన్నది కాదు ఇంపార్టెంట్ .. వాళ్ళ కారెక్టర్ బిల్డ్ చెయ్యడం అసలు ముఖ్యమైన విషయం ..
విజ్ఞత లేని విజ్ఞానం ఎంతున్న దండగే సో మార్కులు అవి ఇవి అని వాళ్ళ బాల్యాన్ని నరకప్రాయం చెయ్యడం ఎంత వరకు నిజం కాదు .. అల చేసిన వాళ్ళని తీస్కెళ్ళి జైలు లో పెట్టాలి అప్పుడు కాని బుద్ధి రాదు
@స్నేహ గారూ
మార్పు మనచేతిలోనే ఉందండీ. మన ఆలోచనా సరళిలోనే మార్పు రావాలి. దీని గురించి చర్చలు జరగాలి, మేలుకోవాలి. పిల్లలని రెండేళ్ల నుండీ నర్సరీలోవేసేసి వేలకి వేలు ఫీజులు కట్టేస్తున్నారు. మీ పిల్లల విషయంలో మీరు అవలంబిస్తున్న పద్ధతులు అభినందనీయం. భవిష్యత్తులో కూడా మీరు ఇలగే పాటించండి, వాళ్ళు సుఖపడతారు. ధన్యవాదములు.
@ Indian Minerva
మీరన్నది నిజమే...retarted పిల్లలు కూడా వీళ్ళకంటే చురుగ్గా వుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా పాకింది. ఆరు-ఏడు తరగతుల్లోనే IIT కోచింగులు...ఎంత దారుణం కదా. తలుచుకుంటేనే నరకంలా అనిపిస్తున్నాది మనకి, పాపం వాళ్ళెంత నలిగిపోతున్నారో! :(
@ వేణు గారూ,
మీరు చెప్పేది నిజమా? లెక్కల స్టెప్పులు బట్టీ పట్టిస్తారా, ఎంసెట్ లో అవే మక్కీ కి మక్కి వస్తాయా...హ్మ్ అయితే నేనిన్నాళ్ళూ ఈ లోకంలో లేనన్నమాట.....సమాజం ఎటు వెళ్తొందో, ఏమిటో :(
నామిని పుస్తకం బావుంటుందండి, వీలైతే చదవండి. నా టపా మీకు నచ్చినందుకు ధన్యవాదములు. కనీసం కొందరైనా ఆలోచించగలిగితే అదే పదివేలు. ఒక చర్చ అయినా జరగాలి అదే ముఖ్యోద్దేశం.
అన్నట్టు మీ సలహా బావుంది, నాకు తట్టనేలేదు సుమండీ. next time నుండీ అలాగే చేస్తాను. thanks a lot! :)
@ బులుసు గారూ,
అదే, అదే నేను చెప్పేది....ఈ తల్లిదండ్రుల అలోచనలు IIT లు IIM లు దాటి ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు.ఈ ఇంజనీరుంగులు, డాక్టరు చదువులు మాత్రమే చదువులన్న అపోహ పోవాలి. చిన్న చదువులు పెద్ద చదువులు అంటూ ఉంటాయా? ఈ సత్యం ఎప్పుడు గ్రహిస్తారో! చక్రం సినిమాలో ఓ డైలగు ఉంటుంది....."చిన్న పనులు పెద్ద పనులు అంటూ ఏమీ ఉండవు. చిన్న పెద్ద మనసులు పెద్ద మనసులే ఉంటాయి" అని.
"ఎందుకంటే వీళ్ళు చదువు 'కొన్న' వారే"....బాగా చెప్పారు. 'కొన్న'వారికి ఎలా తెలుస్తుందిలెండి అసలు విలువ. నిజమే, పాపం పిల్లలు!
@ ప్రవీణ గారూ,
ఎంత హాస్యాస్పదం. UKG కే కంపేరిజనా? హ్మ్ పిల్లల దురదృష్టం. "వారాంతంలో చెస్, అబాకస్"...పోనీ అవైనా ఆడుకోనిస్తున్నందుకు సంతోషించాలమడీ. అవీ లేక extra coahings తీసుకుంటున్న పిల్లలెందరో! ధన్యవాదములు.
@ కిరణ్
అవును, పరిస్థితులు అలాగే ఉన్నాయి. మన చదువుకున్నప్పటి, ఇప్పటి సిలబస్ పూర్తిగా వేరు. పిల్లల ప్రాణాలు తీసే ఈ చదువులు ఎందుకో అర్థం కాదు. ధన్యవాదములు.
@రాఘవ గారూ
విశ్వనాథ వారి మాట అక్షరాలా నిజం.
"చిన్నతనమునాఁడె యెన్నెన్నొ పొత్తముల్ చదువకున్నను వాఁడు చవట గాడె?"
"తప్పదా మా తల్లిదండ్రులకొఱకునై నలిగిపోవుట? వారు తెలియలేరె?" .....ఎంత బాచెప్పారండీ...నేను అంత పెద్ద పోస్ట్ రాసాను గానీ మీరు మూడు ముక్కల్లో మొత్తం సారాంశం చెప్పారు. ధన్యవాదములు.
@సిరిసిరి మువ్వ
మీరు చెప్పినది విన్నాక, నేను నోరు తెరిచి ఉండిపోయాననుకోండి. నిజంగానే నేను చాలా వెనుకబడి ఉన్నాను. :( ఇప్పుడిప్పుడే ఇవన్నీ తెలుస్తున్నాయి. ఒకప్పుడు పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోవడం గొప్ప, దానికోసం పాఠ్యాంశాలను అర్థం చేసుకుని, మార్కులు తెచ్చుకునేవాళ్ళం బట్టిపట్టి కాకుండా. ఇప్పుడు 10th మార్కులకే విలువ లేకుండా పోయిందా! సైన్సు పుస్తకాలు అవీ చూడలేదులెండి...చూసుంటే అక్కడికక్కడే ఏడ్చేసుండేదాన్నేమో. :(
ఏమి బిజినెస్సో పాడో....చిన్నారుల జీవితాలను కాలరాస్తున్నారు. విద్యావ్యవస్థ మాత్రమే మారాలనుకోవడం పొరపాటండీ. తల్లిదండ్రులు కూడా ఈ IIT, IIM ల పరిధి దాటి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాదంటారా? ధన్యవాదములు.
@ శ్రీరామ్ గారు
మీరు చెప్పినది నాణానికి మరోవైపు. ఈ కంప్యూటర్ గేమ్స్, సినిమాలు పిల్లల సమయాన్ని వృధా చేస్తున్నాయి అన్నది కూడా నిజమే. కానీ వాళ్ళకి మంచి అభిరుచులను అలవాటు చేసే బాధ్యత మనది కాదా? చందమామ చదవడంలో దొరికే ఆనందమో లేదా లలితకళలు నేర్చుకోవడంలో దొరికే తృప్తో లేదా చెస్సో, క్రికెట్టో, వాలీబాలో, టెన్నీసో ఏదో ఒకటి - ఆటలు ఆడడంలో ఉండే మజా వాళ్ళు గ్రహించేలా చేయగలిగితే వాళ్ళు మళ్ళీ కంప్యూటర్ గేమ్స్ జోలికి పోతారా? అన్నివేళలా ఇలా చెయ్యడం కష్టమే కావొచ్చు కానీ తప్పదు, అది మన బాధ్యత. ధన్యవాదములు.
@ హిమబిందు గారూ
ధన్యవాదములు. అవునండి చర్చలు జరగాలి, పుస్తకాలు రాయాలి. అప్పుడైనా కాస్త ఆలోచన మారుతుందేమో అని ఆశ.
@కావ్య
"విజ్ఞత లేని విజ్ఞానం ఎంతున్నా దండగే"...బాగా చెప్పావు కావ్య...కనీసం మనం అంటే ముందు తరాలవాళ్ళమైనా ఈ ఉచ్చులో పడకుండా ఉండేలా ప్రయత్నించాలి.ధన్యవాదములు.
అబ్బే మీరు ఇంకా సత్తేకాలంలో ఉన్నారు సౌమ్యాజీ. ఈ మాటలు ఈ కాలం పిల్లలకు చెబితే వాళ్లన్నా వింటారుగాని తల్లిదండ్రులు వినే ప్రసక్తేలేదు. ప్రస్తుతం తల్లిదండ్రులకు వాళ్ల పిల్లలు క్లాసు ఫస్టు మాత్రమే రావాలి ,99.99% మార్కులతో, అని ఉంటుంది రెండొ స్థానం వచ్చినా ఒప్పుకోరు, చదివేది ఇంటరైనా ఇంజినీరింగ్ ఐనా...
ఇక్కడ కొందరు విద్యా వ్యవస్థ మారాలి దాంతో తల్లిదండ్రులు మారుతారు అని అన్నారు....ఎందుకో నాకది అర్ధం కావట్లా. ’మా పిల్లలకు కోచింగ్ మా ఇష్టపూర్వకంగా ఇప్పిస్తున్నాం’ అని పేరెంట్స్ చెబుతుంటే విద్యావ్యవస్థను మార్చి ఏం లాభం? అపుడెపుడో స్కూల్ ఫీజులు ఎక్కువౌతున్నాయని పేరెంట్స్ ఆందోళన చేసినట్టు చేస్తే సరి....కాని చెప్పానుగా, పిల్లలన్నా ఈ మాటలు వింటారుగాని ఈ కాలం తల్లిదండ్రులా..... no chance
@ నాగార్జున
అవును నిజమే, మీ అందరి కామెంట్లు చూసాకా నేనెంత వెనకబడి ఉన్నానో అర్థమయింది. బలే చెప్పావు...పిల్లలైనా వింటారుగానీ పెద్దలు వినరని. పిల్లలు ఎగిరిగెంతేసి వింటారులే. పాపం వాళ్ళకి విసుగొస్తున్నాదిగా.
అదే, విద్యావ్యవస్థ ఒక్కటే మారాలి అన్నదానికి నేనూ ఒప్పుకోను. మొత్తం సమాజం మారాలి. అందరి ఆలోచనలూ మారాలి. ధన్యవాదములు.
విద్యా వ్యవస్థ మారడం గురించి నేను చెప్పలేను. ఏదైనా "వ్యవస్థ" ఐన తర్వాత దానిలో ఉన్న చేదు విషయాలు తెలియడం మొదలవుతుంది. మార్పు కావలసి వస్తుంది. ప్రతి మార్పూ కొంత రెసిస్టెన్సును ఎదుర్కోవలసి వస్తుంది. ఆ రెసిస్టన్సు ఫ్రిక్షను లాంటిది. అది లేక పోతే మార్పు సులభమైతే అది కూడా నష్టమే కలిగిస్తుంది.
ప్రస్తుత విషయానికి వస్తే నాకు తెలిసిన వాళ్ళు (కొందరే అనుకోండి) వాళ్ళ పిల్లలని కార్పొరేటు స్కూళ్ళలో చదివించట్లేదు. ప్రస్తుతం చదువుతున్న స్కూళ్ళలో మంచిగా బోధించడం లేదని (బట్టీ పట్టించట్లేదని కాదు), మార్చడం గురించి ఆలోఛిస్తున్న వారు ఉన్నారు, ఉన్న స్కూలుతో తృప్తి పడుతున్న వారూ ఉన్నారు.
కార్పొరేటు స్కూళ్ళలో చదివించే కుటుంబాలన్నిటిలోనూ తల్లి దండ్రులిద్దరూ పని చెయ్యడం కూడా లేదు. పిల్లలకి ఈ కాలానికి తగ్గట్టు ఇంట్లో నేర్పించలేము, పిల్లలు ఇంట్లో వాళ్ళ మాట కన్నా టీచర్ల మాట వింటారు (చాలా మటుకు ఇది నిజం) అనే ఉద్దేశంతో ట్యూషన్లు పెట్టిస్తారు చాలా మంది.
జనాభా చాలా ఉంది. అందులో పోటీలు పడుతూ ఎంత మంది ఉన్నారో తమ మానాన తాము వెళ్తున్న వారూ చాలా మందే ఉంటారు అని నా నమ్మకం (తప్పు కావచ్చు).
చదువు ఉద్యోగం కోసం (కోటి విద్యలు కూటి కొరకే) - తప్పు లేదు. ఐతే 'పరువు ' , అందరి కంటే పై మెట్టులో ఉంటేనే జీవితానికి సార్థకత అనుకోవడం, అన్ని లగ్జరీలూ అత్యవసరాలు అనుకోవడం వంటి ఆలోఛనా ధోరణి వల్ల పిల్లలు నష్టపోతారు. ఒక్కో సారి తల్లి దండ్రులకి అనిపిస్తుంది కూడ, పక్క వాళ్ళు చెయ్యగా లేనిది మేము చెయ్యక పోతే తల్లి దండ్రులుగా మా బాధ్యత నెరవేర్చడం లేదేమో అని. మా పిల్లలు ఎందులో తక్కువ, మేమే ఏదైనా లోపం చేస్తున్నమేమో, వాళ్ళకి అందించవలసినవన్నీ అందించడం లేదేమో అనిపిస్తుంది.
ఇన్నిటి మధ్య, పరీక్షా ఫలితాలు విడుదలైనా ప్రతి సారీ ఆడుతూ పాడుతూ చదువుతూ చక్కగా ఆత్మస్థైర్యంతో మంచి స్థానాలు సంపాదించే వారు ఒకరిద్దరి గురించైనా చదువుతుంటాము. అది వారు పెరిగే వాతావరణం బట్టి ఉంటుంది. అందరు తల్లి దండ్రులకూ అది కుదరక పోవచ్చు.
ఒకటి మాత్రం నిజం. తల్లి దండ్రులు పిల్లలకి అందించవలసినది పుష్కలమైన ప్రేమ. సమయమూ, అటెన్షనూ వారి కోసం కేటాయించగలగడం.
మన పిల్లలు ఎందులో రాణించగలరో మనకి తెలియదు. వారి ఎంపిక పైన నమ్మకం కలగదు. దీనికి ఎవరైనా ఏమైనా చెయ్యాలి అనుకుంటే రక రకాల కెరీర్ ఆప్షన్స్ గురించి, వివిధ వృత్తులలో పేరూ, డబ్బూ గడించి సంతోషంగా ఉంటూ సమాజానికి మేలు చేస్తున్న వారి గురించి పూనుకుని తెలియ పరచడం. నేను సాఫ్ట్వేర్ లో పైకొచ్చి ఇందులో ఏం లేదు మీ పిల్లలని ఇంకో వైపు తీసుకెళ్ళండి అని చెప్తే అది ఎవరైనా ఎందుకు వింటారు?
ఇలాంటివేవో చెయ్యాలి. మన (అంటే పోటీ చదువులు మాకొద్దు అనుకునే వారు) పిల్ల దగ్గరికి వచ్చే సరికి వాళ్ళు తిన్నగా పైకి మాత్రమే ఎదగాలనుకోకుండా విశాలంగా ఎదుగుతూ కొన్ని సార్లు పొరపాట్లు చేసినా పాఠాలు నేర్చుకుంటూ సంపాదనతో పాటు సంతృప్తి విలువ కూడా నేర్పుతూ పెంచగలగాలి.
ఇది నా అభిప్రాయం. కావాలనుకున్నానేను ఎక్కువ పోటీ పడలేనని నాకు అర్థమయ్యింది కనుక నా నా ఆలోఛనా విధానం నాకు ముందు ముందు ఎటువంటి పరీక్షలు పెడుతుందో ఆలోచిస్తూ , నా ఉద్దేశాలను నేను అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగాలు నా వ్యాఖ్యలు.
నాణానికి రెండో వైపు :)
హ్మ్... నామిని గారి పుస్తకం పంచిపెట్టినా లాభం లేదు సౌమ్య గారు! నేను ఆ పని చేసి, చివరకు వాళ్ళ చేతుల్లో చీవాట్లు తిన్నా! పైన ఎవరో అన్నట్లు, నీకేం ఉద్యోగం చేస్తున్నావు, సంపాదిస్తున్నావు.. మా పిల్లలు చదవక్కర్లేదా, సంపాదించక్కర్లేదా అని నాకే ఎదురు క్లాసులు తీసుకోబోయారు..
నిన్నా మొన్నటి వరకూ ఇంజనీరింగ్, డాక్టర్.. ఇప్పుడు సివిల్స్ మీద పడింది వీళ్ళందరి కన్ను.. అసలు ఇలా బట్టీ పట్టి చదివే వాళ్ళు రేప్రొద్దున్న Civil Servants గా ఎలా work చేయగలరో...!
@ lalitag
ముందు ఒక డౌటు...మీరు, సిరిసిరిమువ్వగారూ ఒకరేనా?
లలితగారూ
"మన పిల్ల దగ్గరికి వచ్చే సరికి వాళ్ళు తిన్నగా పైకి మాత్రమే ఎదగాలనుకోకుండా విశాలంగా ఎదుగుతూ కొన్ని సార్లు పొరపాట్లు చేసినా పాఠాలు నేర్చుకుంటూ సంపాదనతో పాటు సంతృప్తి విలువ కూడా నేర్పుతూ పెంచగలగాలి."...బాచెప్పారు. క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్నది ఇదే. ఈ పోటీ చదువులొక్కటే కాదు ప్రపంచం అంటే. ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటి విలువ గ్రహించాలి. మీరు "విద్యా వ్యవస్థ మారడం" అన్నది ఈ point of view నుండి చెబితే మాత్రం నేను పూర్తిగా మీతో అంగీకరిస్తాను. ఇంజనీరింగు, మెడిసిన్, IIT లు IIM లు మాత్రమే కాదు చదువులంటే. (అవి తక్కువ అని కాదు నా ఉద్దేశం). ఈ పోటీల మోజులో పడి జీవితాన్ని పిల్లలు అనుభవించవలసిన రీతిలో అనుభవించట్లేదని నా బెంగ. కష్టపడకుండా ఏదీ రాదు, కానీ ఈ పోటీ చదువే జీవితమనుకుంటూ మిగతా పార్శ్వాలని రుచిచూడకపోవడం చాలా బాధాకరం. అవి అవసరమని, సమగ్రవికాసానికి తోడ్పడతాయని తల్లిదండ్రులు గ్రహించలేకపోవడం ఇంకా బాధాకరం.
"దీనికి ఎవరైనా ఏమైనా చెయ్యాలి అనుకుంటే రక రకాల కెరీర్ ఆప్షన్స్ గురించి, వివిధ వృత్తులలో పేరూ, డబ్బూ గడించి సంతోషంగా ఉంటూ సమాజానికి మేలు చేస్తున్న వారి గురించి పూనుకుని తెలియ పరచడం."....ఇది చాలా నచ్చింది నాకు. ఇదే ప్రతీ ఒక్కరూ చేయవల్సినది.
మీరిచ్చిన నాణానికి మరోవైపు చదివాను. నవ్వొచ్చింది నాకు. ఒక్కో సమాజానికి ఒక్కో రకమైన సమస్య.
@ మేధ గారూ
అంతేనంటారా :(
సివిల్స్ మీద మోజు ఇప్పటిది కాదులెండి. మా చిన్నతనంలో సివిల్స్ మీద మోజు ఎక్కువుండేది. క్లాసులో ఉన్న 30 మందిలో 25 మంది civils aspirents గా ఉండేవారు. కాకపొతే aspiration కి కావలసిన కష్టం ఇంత చిన్నవయసులోనే మొదలవ్వదు. అది కొంత నయం కదా.
అన్నిటికన్నా కెవ్వ్ కామెడీ మీరు ఒకటి మిస్సైపోయారు. అది పుట్టిన ఆరునెలలకే పిల్లాడిని ప్లే స్కూళ్లో చేర్చాలనే నిబంధన. రెండేళ్ళకు L.K.Gలో పడెయ్యాలి ఆ పిల్లాడిని. ఆ L.K.G లో సీట్ రావాలంటే ప్లే స్కూల్ సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలి పిల్లాడికి. ప్లస్ IAS లాంటి ఇంటర్వ్యూ ఒకటి పాసైతేనేగానీ ఆ పిల్లాడికి LKG లో చేరడానికి స్కూల్లో సీటివ్వరు. :-))
"ముందు ఒక డౌటు...మీరు, సిరిసిరిమువ్వగారూ ఒకరేనా?"
అయ్యో సౌమ్యా నేను లలిత గారు ఒకటి కాదు. నా పేరు వరూధిని ..బజ్జులో మీతో గొడవపడుతుంటానే..ఆ వరూధినిని:). లలిత గారు వేరు. ఆవిడ అంతకుముందు బ్లాగు కూడా వ్రాసేవాళ్ళు కానీ తరువాత మూసేసారు. ప్రస్తుతం http://telugu4kids.com అనే సైటు నడుపుతున్నారు.
http://balasahityam.blogspot.com/ అనే బ్లాగు వ్రాస్తున్నారు.
ఏంటో ఈ మధ్య ఫేకుల గొడవ ఎక్కువయిపోయిందిగా అందుకని ఈ వివరణ!
చాలా మంచి టపా అండీ!
ఇది చదివాక నాకు "రైలు బడి" పుస్తకం గుర్తు వచ్చింది. అందులో కూడా మధ్యాహ్న భోజనంలో సముద్రం నుంచి కొంత, కొండల నుంచి కొంత తెచ్చుకోమని చెపుతారు పిల్లలకు.సముద్రం నుంచి కొంత అంటే,చేపలు లాంటివి, కొండల నుంచి కొంత అంటే,దుంపలు లాంటివి. ఒకవేళ ఎవరైనా అలా తెచ్చుకోలేక పొతే ప్రిన్సిపల్ గారి భార్య వాళ్ళకి అవి వడ్డిస్తారు. ఎందుకంటే పిల్లలకి పౌష్టికాహరం కూడా ముఖ్యమే. కానీ మీరు చెప్పిన స్కూల్లో లాగ తల్లితండ్రుల్ని వేధించరు. మీరు ఈ పుస్తకం చదివారా? చదవకపొతే ఒకసారి చదవండి. ఇది కూడా స్కూల్ అంటే ఎలా వుండాలో చెప్పే పుస్తకం.
ఏది ఏమైన ఇవాల్టి స్కూల్స్ అన్నీ అలానే వున్నాయి. పిల్లల్ని స్కూల్ కి పంపాలంటేనే భయంగా వుంది.
@ నాగ
పుట్టిన ఆరునెలలకే పిల్లాడిని ప్లే స్కూళ్లో చేర్చాలనే నిబంధన....అది నిజంగా నిబంధనేనా? ఎక్కడ ఏ ఊర్లో? బాబోయ్ ఈ సర్టిఫికెట్ల గోలేమిటి, ఎక్కడ జరుగుతోంది ఇలా? ఇది మరీ భయంకరంగా ఉంది. :(
@సిరిసిరిమువ్వ
ఓహ్ వరూధిని గారూ మీరా! :)
ఫేకులగోల కాదండీ.. మీరు, లలితగారు కూడా విద్యావ్యవస్థ మారాలి అని ఒకే పాయింట్ చెప్పేసరికి నేను కాస్త confuse అయ్యాను అంతే. మరేమీ లేదు. :D
@వైణిక గారూ
నా టపాని మెచ్చినందుకు ధన్యవాదములు.
రైలుబండి పుస్తకం నేను చదవలేదండీ...ఉత్తమ బడి గురించి రాసారా అందులో? అయితే చదవాల్సిందే. ఎవరు రాసారో, ఎక్కడ దొరుకుతుందో వివరాలు చెప్పగలరా?
అవునండీ స్కూలు గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది. :(
సౌమ్యా, ప్లే స్కూళ్ళో చేర్చాలనే నిబంధన బెంగళూరులో ఉంది.
మా బావగారు, తన రెండున్నరేళ్ళ కొడుకుని స్కూల్లో చేర్చడానికి వెళితే ప్లే స్కూల్ సర్టిఫికెట్ కావాలన్నారట. ఇక మా బావగారికి ఏం చెయ్యాలో అర్థంకాక, వాళ్ళను కన్విన్స్ చెయ్యడానికి, మా ఆవిడ ఉద్యోగం చెయ్యదు, ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి ప్లే స్కూల్లో చేర్పించాల్సిన అవసరం మాకు రాలేదు, అలాగే పిల్లాడు పుట్టినప్పట్నుంచీ వాళ్ళమ్మ దగ్గరే ఆడుకున్నాడు. ప్లే స్కూల్లో ఉండే ఆటబొమ్మలన్నీ మా ఇంట్లో కూడా ఉన్నాయి అని చెప్పడంతో... ఆ స్కూల్ వాళ్ళు ఆ రెండున్నరేళ్ళ పిల్లవాణ్ణి ఇంటర్వ్యూకు అనుమతించారంట. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాక LKG కి అక్షరాలా 80 వేల రూపాయల ఫీజు చెల్లించి అందులో చేర్పించాడంట మా బావ. అలాగే ఆ స్కూల్లో పిల్లాన్ని చేర్పించాలంటే, తల్లిదండ్రులిద్దరూ మినిమం డిగ్రీ చదివి ఉండాలన్న నిబంధన కూడా ఉంది.
ఇట్టాంటి డకోటా స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్పించే అవకాశం ఉండదనే ఉద్దేశ్యంతోనే, ఆ మధ్య నేను పదవతరగతి ఫెయిల్ అయిన అమ్మాయిని చేసుకుంటానని చెప్పాను. :-))
@ నాగ
నిజమా :( అయ్యబాబోయ్ ఇంత దారుణమా, నమ్మలేకపోతున్నాను. ఇదేమి పైత్యం! :( అసలు అలాంటి స్కూళ్ల జోలికే వెళ్ళకూడదు. బెంగళూరులో 80 వేలా, హైదరాబాదులో లక్షల్లో ఉన్నాయని వినికిడి.
అసలు ఈ పోటీ ఎవరితోనో, ఎందుకో నాకు అర్ధం కాదు. ఎప్పుడు చూసినా ఆ పిల్లలపై ఏదో ఒక వత్తిడి, వెధవ కంపేరిజన్లు. ఒకప్పుడు నాకు కారుంది, స్వంత ఇల్లుంది అని తమ హోదా చూపించుకోడానికి గర్వంగా చెప్పేవారు. ఇప్పుడు మా వాడు రెండో క్లాస్ నుంచే అదేదో టెక్నో స్కూల్లో బిట్స్ పిలానికి ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పుకోవడం హోదా అయిపొయింది. ఛీ వీళ్ళ బ్రతుకులు. పిల్లలకి ర్యాంకులు రావాలి అన్న ఏడుపే గానీ ఈ ఒత్తిళ్ళతో వాళ్ళు జీవితం లో అన్నిటికన్నా అపురూపమైన బాల్యాన్ని నిస్సారంగా గడిపేస్తున్నారని వీళ్ళకు ఎందుకు తోచదో? అసలు ఎన్ని స్కూళ్ళలో గేమ్స్ పిరియడ్, స్వంత గ్రౌండ్ ఉన్నాయి? ఆటలకి, పిల్లలకి అసలు సంబంధమే లేదనుకుంటారేమో ఆ స్కూళ్ళ వాళ్ళు. గవర్నమెంట్ కూడా అసలు ఆ విషయమే పట్టించుకోదు.
ఏమో కొన్నాళ్ళకి అభిమన్యుడు పద్మవ్యూహం తల్లి కడుపులో నేర్చుకోలేదా అని ఉదాహరణ చూపి ఏ రెండో నెలలోనో,మూడో నెలలోనో (తల్లి కడుపులో) ఇంటెన్సివ్ ఐ ఐ టి కోచింగ్ ఇచ్చినా ఇచ్చేస్తారు.
>>"ఏమో కొన్నాళ్ళకి అభిమన్యుడు పద్మవ్యూహం తల్లి కడుపులో నేర్చుకోలేదా అని ఉదాహరణ చూపి ఏ రెండో నెలలోనో,మూడో నెలలోనో (తల్లి కడుపులో) ఇంటెన్సివ్ ఐ ఐ టి కోచింగ్ ఇచ్చినా ఇచ్చేస్తారు."
హిహిహి శంకర్ గారు, తల్లి కడుపులో ఉన్నప్పుడే పిల్లాడికి చదువు చెప్పే పద్ధతి ఆల్రెడీ మనదేశంలో పదేళ్ళ క్రిత్రం నుంచే అందుబాటులో ఉంది. కాకపోతే, ఎందుకో పూర్తి స్థాయిలో ప్రచారం జరగలేదు దానికి. నాకు కూడా అలా చదువు చెప్పడం నేర్చుకునే అవకాశం ఆరేళ్ళ క్రితమే వచ్చింది. అప్పట్లో నాకు కుదరక ఆ అవకాశాన్ని వదిలేశాను. లేకపోతే, ఈ పాటికి నేను "మీ కడుపులో ఉన్న పిల్లాడికి ఐఐటీ కోచింగ్ ఇవ్వబడును" అనే బోర్డ్ తగిలించేవాడిని ఇంటిముందర. :P
@SHANKAR గారూ,
మీ ఆవేదనే మా అందరిదీ. అయినా అదేంటండీ ఆటలంటారు, అవెలా ఉంటయో ఎమో! అసలు ఆటలలో టైం వేస్ట్ ఎందుకూ, ఆ సమయంలో కూడా చదివేసుకుంటే ర్యాకులొచ్చేస్తాయిగా, అవి చాలు :డ్ గవర్నమెంటు ఏమి చేస్తుందండీ, కార్పరేటు స్కూళ్ళు మా ఇష్టం మాది అంటుంటే. ఒకవేళ ఏదైనా చెయ్యాలి అనుకుంటే ముందు గవర్నమెంటు స్కూళ్ళ దుమ్ము దులపాలి.
అదేనండీ ఈ అభిమన్యుడి పద్మవ్యూహమే నాకు భయంగా ఉంది. అలాంటిదేమైనా జరిగిపోతుందేమో అని :(
ధన్యవాదములు!
@ నాగ
వామ్మో నువ్వేమిటి కొత్త కొత్త విషయాలు చెబుతున్నావ్? ఉన్న విషయాలే జీర్ణించుకోలేక్పోతున్నాం. ఆ పద్మవ్యూహ రచనా విద్యలెక్కడున్నాయో చెప్పగలవా? దాని గురించి ఏదైనా సమాచారం ఉందా పబ్లిక్ లో, ఉంటే మాతో పంచుకో. మేము కూడా తెలుసుకుని తరిస్తాం.
ఎంటో గుండె మహా బరువెక్కిపోయిందే.. కనిపించని కరుణ రసం ఉంది నీ ఈ పోస్టులో, తెలుసా? అద్సరే కానీ "నీ" ఫ్రెండు, "మన" ఫ్రెండు అయితే కనుక నా తరపున ఓ మొట్టికాయ వెయ్ దానికి.
"పంగమాలిన వెధవ" నాకు తెలీయని ప్రయోగం. అంటే హేవిటి చెప్మా!
సౌమ్య గారు, ఆ పుస్తకం పేరు "రైలు బడి" అండి, "రైలు బండి" కాదు!
ఇది “టోటో చాన్” అనే చిన్నారి కథ. ఆ అమ్మాయి ఒక బడిలో చేరుతుంది, ఆ బడిలో తరగతి గదులకు బదులుగా రైలు పెట్టెలు వుంటాయి. అందుకే ఆ పుస్తకానికి "రైలు బడి" అని పేరు పెట్టారు.
ఈ పుస్తకాన్ని “నేషనల్ బుక్ ట్రస్ట్” వాళ్ళు ముద్రిచారు.
మీకు ఆ పుస్తకం గురించిన వివరాలు ఈ కింద ఇచ్చిన లింక్ లో దొరుకుతాయి, చూడండి.
http://hyderabadbooktrust.blogspot.com/2010/02/blog-post_16.html
ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవండి.
ఊరందరిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది ఒక దారని నవ్విపోరమ్మా పిల్లల్ని పెద్ద స్కూళ్ళలో వెయ్యకపోతే!! కబుర్లెందుకు కానీ రాబోయే తరానికి అన్నీ సరైన పాళ్ళలో అందించే "చక్కటి బడి" ఒకటి ప్లాన్ చెయ్యకూడదూ! నేనూ ఓ చెయ్యేస్తా.
@ కొత్తావకాయ
హ్మ్ అవునే, ఆ బాధలు వింటుంటే గుండె బరువెక్కకమానుతుందా! ఆ ఫ్రెండు, మన ఫ్రెండు కాదులే.
"పంగమాలిన" అంటే పనికిమాలిన అని అనుకుంటున్నా నేను. రాయలసీమ యాసలో ప్రయోగం అనుకుంటా.
"చక్కటి బడి" గురించి వ్యూహాత్మక రచనైతే చేసాను. చూడాలి భవిష్యత్తులో అది ఎంతవరకూ రూపుదిద్దుకుంటుందో. నీ సహాయం తప్పక తీసుకుంటా. నాకు కావలసివస్తే నీ ముక్కు పిండి మరీ నీ చెయ్యి తీసుకుంటా, అందులో సందేహమే లేదు :)
@ వైణిక గారూ
thanks అండీ. మంచి లింక్ ఇచ్చారు. తప్పకుండా రైలుబడి పుస్తకం చదువుతాను.
సౌమ్య మీరు పోస్ట్ ఎప్పుడు రాసారు ...నేను చూడనే లేదు .....నిజంగా జాలేస్తుంది ఆ పిల్లల్ని చూస్త్సుంటే.. ప్చ్..
మనసును కదిలించే టపా రాసారు..........
శివరంజని
రాసి వారం పైనే అయ్యింది శివా...నువ్వు బిజీగా ఉన్నవుగా, చూడలేదేమో!
అవును జాలేస్తుంది, ఏడుపు కూడా వస్తుంది. ధన్యవాదములు.
సౌమ్య,
పోస్ట్ చదువుతుంటే చాలా బరువు గా అనిపించింది. నిజంగానే ఎంత మంది ఇలాగ చదువు తున్నారో.. చుట్టూ అలాగే ఉన్నారు. ఎందుకో నాకు ఆంధ్ర ప్రదేశ్ లో ఈ గోల ఎక్కువేమో కర్ణాటక మీద అనిపిస్తోంది. మా అమ్మాయి ఈ సంవత్సరం ఆరో క్లాస్ అంటే అందరూ ఒకటే గొడవ.. చేర్పిస్తున్నావా లేదా ? IIT కోచింగ్ లో ... అని.
పైన కామెంట్లలో స్నేహ చెప్పినట్టు.. మా పిల్లలు ఇంటి పక్క స్కూలు, వాళ్ల కి స్కూల్, వారానికో సంగీతం క్లాస్ తప్ప బలాదూర్ ఆటలు తప్ప వేరే వ్యాపకం అన్నది మేము పెట్టలేదు.
మీ పోస్ట్ చాలా లేట్ గా చూస్తున్నాను. మీరింత సీరియస్ సబ్జెక్ట్ రాస్తారని, చదివాక ఇంత భారం గా ఫీల్ అవుతామని అనుకోలేదు. చాలా బాగా రాసారు. అభినందనలు....
కృష్ణప్రియ గారూ
నా పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు.
ముందుగా మీకు అభినందనలు...మీ పిల్లలపై చదువులని రుద్దకుండా బాల్యాన్ని ఆస్వాదించే అవకాశం మీరు కల్పిస్తున్నందుకు....చాలా సంతోషం.
మీ పాప ఆరుకొచ్చిందా అయితే మీరు చెవులు శాశ్వతంగా మూసేసుకోండి లేకపోతే జొరీగల్లాగ దురిపోతాయి IIT, Mcet వగైరాలన్నీ. :)
అవునండీ ఆంధ్రలోనే ఈ గోల చాలా ఎక్కువ. అందుకే ఈసారి IIT ల్లో ఎక్కువ ఆంధ్రవాళ్లకే ర్యాకులు వచ్చాయని చెబుతున్నారు. నేను డిల్లీ లో కూడా ఇంత గోల చూడలేదు. ఈ పిచ్చి ఎప్పుడు తగ్గుతుందో! చదువుకోవడానికి వేరే సబ్జెక్ట్స్, అవకాశాలూ కూడా ఉన్నాయని ఎప్పుడు గ్రహిస్తారో!
మొన్న నా ఫ్రెండ్ కూడా అలానే చెప్పింది సౌమ్యా ,రెండు స్కూల్స్ బాగా నచ్చాయంట ఒకటి సాయంత్రం 5 కి పంపేస్తారట ఇంకొకటి 7 కి పంపుతారట ... రెండోదే సెలెక్ట్ చేస్తున్నా...ఇంకా బాగా చదువుతారుగా అంటుంది... పాపం పిల్లలు ఈ తరంలో పుట్టి చాలా నలిగిపోతున్నారు
@ నేస్తం
నిజమా నిజమా? చ పాపం ఆ పిల్ల 7.00 వరకు స్కూలులో పడి ఏడవాలా, అన్యాయం.
Post a Comment