StatCounter code

Tuesday, July 23, 2013

సేల్ సేల్ ఆఖరు సేల్

పక్కింటి పంకజం అత్తయ్య కి "సేల్" అంటే మహా పిచ్చి. అందునా "ఆఖరు సేల్" అంటే మరీను. పొద్దున్న లేచిన దగ్గరనుండీ ఏ పేపర్ లో ఏ సేల్ ఉందా అని చూడడమే పని. రోజూ మధ్యాన్నం భోజనాలయ్యక తీరిగా బయలుదేరుతుంది బజారుకి. ఆ షాపు, ఈ షాపు చూసుకుంటూ, ఆఖరు సేల్స్ ఏమైనా పెడతారేమో కనుక్కుంటూ, "సేల్" కనబడితే కొనుక్కుంటూ ఆనందపడిపోతుంటుంది. ఈ ఆఖరు సేల్ పిచ్చి ఒక వస్తువుకి అని పరిమితం కాదు. వంటింట్లో చెంచాల దగ్గరనుండీ ఆరువారాల నగలవరకూ ఏదైనా సరే "ఆఖరు సేల్" లో చవగ్గా కొంటే ఆ మాజాయే వేరు అంటుంటుంది. ఆఖరు, చివర లాంటి మాటలు ఆవిడకి వీనులవిందుగా ఉంటాయి.

వాళ్ళమ్మాయి సరదాపడి సాయంత్రం మూరెడు మల్లెపూలు కొనుక్కుందామంటే "వద్దమ్మాయ్, ఇప్పుడైతే మూరెడు నాలుగు రూపాయిలంటుంది. రాత్రి పూలావిడ ఇంటికెళిపోయేటప్పుడు ఇటువైపే వస్తుందిగా అప్పుడు పిలుద్దాం. రూపాయికి నాలుగు మూరలు ఇస్తుంది" అంటుంది. నిజంగానే పూలావిడ ఆఖరుబేరమని, అమ్మకుండా ఉంచేస్తే మర్నాటికి పూలు వాడిపోతాయని రూపాయికి నాలుగేమిటి, ఐదడిగినా ఇచ్చేసేది. చూసావా నా కిటుకు అన్నట్టు ఆనందంతో కళ్ళెగరేస్తుంది పంకజం అత్తయ్య.

పిల్లలకి స్కూళ్ళు తెరిచి కొత్త పుస్తకాలు కొనేటప్పుడు "ఏడుకొండల స్టోర్స్" కి పరిగెట్టింది. పాత లేపాక్షి నోట్సులు స్టాకు ఉండిపోయాయని "సేల్" పెట్టారు వాళ్ళు. ఒక్కో వంద పేజీల నోటుబుక్కు ఐదురూపాయలు. సంబరపడిపోతూ పిల్లాడికి పది, అమ్మాయికి పది కొని పడేసింది. ఆ పాత పుస్తకాలను చూసి "అమ్మా, అప్పుడే మధ్యకుట్టు విడిపోతోంది" అని ఏడుపు మొహం పెట్టిన పిల్లలతో "వెధవల్లారా, చవగ్గా వస్తే చేదు మీకు. సూకరాలెక్కువ, అన్నిటికీ పేచీ పెడతారు. ఆ దబ్బనం దారం ఇటు పడేయండి. ఒక్క కుట్టు కుట్టి పెట్టానంటే మళ్ళీ బయటకు రావడానికి కాగితాలు భయపడి చావాలి" అని కసిరేసింది. 

వదినా, మా అమ్మాయిని ఆషాఢం అయ్యాక అత్తారింటికి పంపాలి. మా పిల్లకి, వాళ్ళవాళ్ళకు బట్టలు పెడదామనుకుంటున్నాం అంటూ వచ్చింది వెనకింటి పార్వతి. "అబ్బెబ్బే అప్పుడే కొనకు పార్వతీ, ఆషాఢం సేల్ పెడతారు చందన బ్రదర్స్, RS బ్రదర్స్ వాటిల్లో. అప్పుడు చవగ్గా వస్తాయి చీరలు గట్రా. నీకేం తెలీదు నువ్వుండు. నేను సరిగ్గా సేల్ చూసి నీకు చెప్తాగా. మనిద్దరం వెళ్ళి బట్టలన్నీ కొనుక్కొద్దాం" అంది చీరల షాపింగ్ ని ఊహించుకుంటూ ఆనందంగా.

బిగ్ బజార్ లో పాతసామాన్లకి కొత్త సామాన్లు ఎక్స్చేజ్ ఆఫర్ ఉందిట విన్నావా అక్కయ్యా అంటూ చెల్లెలు పరిగెత్తుకొచ్చింది. అక్కకున్న పిచ్చిలో సగం చెల్లికీ ఉంది. "అవునా! మెల్లిగా చెబుతావేం! ఇవాళే వెళ్ళి చూద్దాం పద. ముందు ఇంట్లో పాతసామాన్లేమున్నాయో అన్నీ మూటగట్టాలి, రా, రా " అంటూ వంటింట్లోకి తోవదీసింది. ఇదంతా చూస్తున్న మావయ్య "ఎందుకు ఇప్పుడిదంతా!! మనింట్లో అన్ని వస్తువులూ బాగానే ఉన్నాయిగా. ఆ మధ్యనేగా మిక్సీ అవీ కూడా కొన్నాం" అని చిరాకుపడుతుంటే "అవునే! పాతవి ఏవైనా తీసుకుంటారటే చెల్లాయ్? మీ బావ కూడా మహా పాతవాడేనేవ్" అంది కనుచివర్లనుండీ మావయ్యని చూస్తూ. అంతే ఇంక కిక్కురుమనలేదు ఆయన.

బాటా లో షూస్ "సేల్" పెడితే చవగ్గా వచ్చాయి కదా అని రెండు కొనుక్కొచ్చింది తన సైజుకి ఒకటి, వాళ్ళాయన సైజుకి ఒకటి. "ఇవెందుకు, మనెమెప్పుడైనా ఇలాంటివి వేసుకుని ఎరుగుదుమా!!" అని మావయ్య ఆశ్చర్యపోతుంటే "ఇన్నాళ్ళు వేసుకోకపోతేనేం, ఇప్పటినుండీ వేసుకుందాం. పదండి రేపొద్దున్నుండి ఇద్దరం వాకింగ్ కి వెళదాం" అంది. అసలు బాటా చెప్పులంటే అత్తయ్యకి ఎంత మక్కువో, ఆ చివర్న ఐదుపైసలు తగ్గిస్తున్నందుకు.

టీవిలో కార్ టూల్ కిట్ ఐదువేలది వెయ్యికే అమ్ముతాం అని ప్రకటన వస్తే ఠక్కున ఆర్డరు చేసేసింది. 'మనకి కారు లేదు కదమ్మా" అని పిల్లలు అంటే "ఏం కొనకపోతామా, ఎప్పటికైనా!! పడుంటుంది!" అంది. కొంటే కార్ తో పాటు టూల్ కిట్ ఇస్తారుగా అని అందామనుకుని అత్తయ్య మొహం చూసి జడిసి మాటలు మింగేసాడు మావయ్య.

అది ఇదీ అని లేదు ఏది పెడితే అది "సేల్" అయితే చాలు. ఆఖరి రోజైతే మహదానందం...అప్రతిహతంగా ఆవిడ "సేల్" బాట పడుతూ ఉంటుంది.

ఇవాళ పొద్దున్నే హడావుడిగా హ్యాండ్‌బ్యాగ్ తీసుకుని ఎక్కడికో పరిగెడుతోంది. మధ్యాన్నం అయితేగానీ ఇల్లు కదలదుగా, ఇవాళ పొద్దున్నే ఎక్కడికి బయలుదేరిందబ్బా అనుకుంటూ "అత్తోయ్. ఎక్కడికా పరుగు?" అని కేకేసా. 

"ఇదిగో అమ్మడూ, నీకెన్నిసార్లు చెప్పాను ఎక్కడికి అని అడగొద్దని? అలా అడిగితే వెళ్తోన్న పని అవ్వదే, అశుభం". విసుక్కుంది కోపంగా. 

"అబ్బా, సర్లే అత్తయ్యా అడిగినవాళ్ళకి జవాబు ఇచ్చేస్తే అశుభం కాస్త శుభం అవుతుందిట చివరి నిముషంలో" అన్నాను. "చివరి" అన్నమాట వినగానే అత్తయ్య శాంతించింది. 

"ఊ, సర్లే, ఇంట్లోపిల్లలాంటిదానివి కాబట్టి ఊరుకుంటున్నా. అదికాదే టెలిగ్రాములదుకాణం ఎత్తేస్తున్నారట. ఇవాళే "ఆఖరు సేల్" ట. చవగ్గా వస్తాయని ఓ నాలుగు టెలిగ్రాములు తెచ్చుకోవడానికి వెళ్తున్నా" అంటూ ఉరకలేసింది పంకజం అత్తయ్య.

Monday, December 10, 2012

నేను పులిని చూసానోచ్ చ్చ్ చ్చ్


ఎక్కడ??
అడవిలో

ఏ అడవిలో?
సరిస్కా అనే అడవిలో?

ఎప్పుడు?
మొన్న శనివారం

ఏమిటి కథ కమామిషు?
చెప్తా చెప్తా

పులిని..పెద్దపులిని....దగ్గరగా, 8-10 మీటర్ల దూరంలో...రెండు కళ్ళారా చూసాను. ("శివుని రెండు కళ్ళార చూసాను రామాహరి" లో రేలంగి ఎక్స్‌ప్రెషన్ ఊహించుకోండి)

మొన్న శనివారం సరిస్కా అనే అడివికి వెళ్ళాం. రాజస్థాన్ రాష్ట్రంలో, ఢిల్లీ కి జైపుర్ కి మధ్యలో ఉంది. డిల్లీ నుండి నుండి 200 km దూరంలో ఉంది. కార్ లో లాంగ్ డ్రైవ్ కి బయలుదేరాం. మధ్యలో దారి తప్పి సరిస్కా చేరుకోవడానికి ఆరున్నర గంటలు పట్టింది. సరిస్కా అనేది tiger reserve...ఒకప్పుడు 30 దాకా పులులు ఉండేవిట. కాలక్రమేణ అన్నీ చచ్చిపోయాయి. ఒక నాలుగేళ్ళ క్రితం రణతంబోర్ నుండి ఏడు పులులను తెచ్చి పెట్టారు. అవే ఉన్నాయి ప్రస్తుతానికి. 

మేము సరిస్కా చేరుకుని, మా కార్ అక్కడ పార్క్ చేసి...వాళ్ళ జిప్సీలో బయలుదేరాం. ఓపెన్ టాప్ జిప్సీ. డ్రైవర్, ఒక గైడ్, మేము, మాతో పాటు ఇంకో జంట (45-50 వయసువాళ్ళు).  ఈ అడవి ఆరావళి పర్వతాలు దిగువన ఉంది. మొత్తం 5 జోన్స్ ఉన్నాయి. మాములుగా అయితే రెండు జోన్స్ లోకి మాత్రమే ప్రవేశముంది. రెండో జోన్ లోకి వెళ్ళాక ఒక పక్క ఆరావళి పర్వతాలు, మరోపక్క వింధ్య పర్వతాలు కనిపించాయి. మొదటి రెండు జోన్స్ లో నీల్గాయ్, బోల్డు నెమళ్ళు తప్ప ఇంకేమీ కనిపించలేదు. నేను పులిని చూడాలి అని గోలపెడుతుండడంతో డ్రైవర్ మూడో జోన్ లోకి పోనిచ్చాడు బండిని. కనీసం ఒక్కటైనా క్రూరజంతువుని చూపిస్తానని గైడ్ నాకు భరోసా ఇచ్చాడు. దారి సరిగ్గా లేదు...అంతా గతుకులమయం. రాళ్ళు, రప్పలు, మట్టి, ఎగుడుదిగుళ్ళు...ఒళ్ళు హూనమైపోయింది.  పొదలని కట్ చేసుకుంటూ ముందుకి పోవాలి. ఏదైనా జంతువు కనిపిస్తుందేమో అని కళ్ళు పెద్దవి చేసుకుంటూ అన్ని వైపులా చూస్తూ ఉన్నాం..ఉహూ. కొన్ని జింకలు...చుక్కల జింక, దుప్పి, సాంబర్ జింక, నెమళ్ళు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. దట్టమైన అడవిలోకి జిప్సీ చొచ్చుకుపోతోంది. ఎటు చూసినా చెట్లు, పొదలు...పక్షుల కోలాహలం, జింకల కేకలు, తుమ్మెదల రొదలు. మా డ్రైవర్ కి అలుపొచ్చేసింది. గైడ్ ని కాసేపు బండి తోలమని చెప్పి తనొచ్చి మా పక్కన కూర్చున్నాడు. చిక్కటి దట్టమైన అడవిలోకి సాగిపోతోంది మా బండి. అకస్మాత్తుగా ఏదో పక్షి కూత వినిపించింది. అది వినగానే మా డ్రైవర్ గతుక్కుమన్నాడు. "call" వచ్చింది అన్నాడు. ఏం "call"? అని అడిగాం. అదేదో చీతల్ అనే పక్షిట. అది మిగతా జంతువులకు పిలుపునిస్తోంది....పులొస్తోంది పారిపోండొహో అని. దాని కూత వినగానే మా డ్రైవర్ కి కంగారేసింది. గైడ్ ని పక్కకు పొమ్మని తనే గబగబ బండిని నడపడం మొదలెట్టాడు. మా అందరికీ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. బండి వేగంగా ముందుకి పోతోంది.

అంతే...ఠక్కున బండి ఆగిపోయింది. నిశ్శబ్దం...ఆశ్చర్యం...ఎదురుగా పది మీటర్ల దూరంలో పులి. అటు తిరిగి ఉంది..మెల్లిగా నడుచుకుంటూ వెళుతోంది. పులిని తప్పించుకోవడానికే మేము పరిగెడుతుంటే ఎదురుగుండా కనబడింది. మాకు ఆనందం, భయం, ఆశ్చర్యం, thrilling... నేను పులి పులి అని అరిచేసాను. గైడ్ దెబ్బలాడాడు అరవొద్దు అని. అస్సలు  శబ్దం చెయ్యొద్దు. పులులకి మనుషుల గొంతు చాలా చికాకు కలిగిస్తుంది. అందరూ pin-drop సైలెంట్ గా ఉండాలి అని హెచ్చరికలు జారీ చేసారు. నేనైతే స్థాణువునైపోయాను. చెమటలు పట్టేసాయి. పక్కనే తన చెయ్యి పట్టుకుని నిల్చున్నాను. తన చేతుల్లో వణుకు తెలుస్తోంది నాకు. కదలకుండా బొమ్మల్లాగా...కళ్ళు పెద్దవి చేసుకుని, అచేతనంగా నిలబడి ఎదుగురుండా ఉన్న క్రూరజంతువుని చుస్తూ..అద్భుతం, అదొక వింత అనుభవం. జిప్సీ ఆపేసి మెల్లిగా వెనక్కి పోనిస్తునాడు. ఆ గతుకుల రోడ్డులో జిప్సి కదలట్లేదు. పులి ముందుకి తిరిగిందా...మమ్మల్ని చూస్తుంది. చూసిందా నా మీదకే పంజా విసురుతుందేమో...ఏమో, ఎవరిని లాకెళ్ళిపోతుందో !! రక్తం చల్లబడిందో, స్పర్శ తెలియకుండా పోయిందో, శరీరం గడ్డకట్టుకుపోయిందోగానీ...బిగుసుకుపోయి భయంతో, కళ్లలో ఒక రకమైన మెరుపుతో ఎదురుగా ఉన్న పులిని చూస్తూ నిల్చున్నాం. పులి వెనక్కి తిరగలేదు..మెల్లిగా నడుచుకుంటూ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. పులి ఎక్కడైతే పొదల్లోకి వెళ్ళిపోయిందో సరిగా అక్కడికే జిప్సీ పోనిచ్చి ఆపాడు...మళ్ళి వస్తుందేమో చూద్దామని. పులి లోపలికి వెళ్లగానే రెండు నీల్గాయ్‌లు, రెండు జింకలు అరుచుకుంటూ వేగంగా పరిగెత్తుకుంటు బయటకి వచ్చాయి. మా జిప్సీ వైపు వచ్చి అలా అటువైపు పొదల్లోకి పారిపోయాయి. ఒక అరగంట సేపు వేచి చూసాం. చుట్టూ పొదలు..ఏ మూలనుండి వచ్చి మీదపడుతుందో అని భయం. కానీ thrilling. మళ్ళి పులి బయటకి రాలేదు. బండి ముందుకి కదిలింది. ఎవరిలోనూ చలనం లేదు...మాటల్లేవు. ఆనందమో,ఆశ్చర్యమో,అద్భుతమో, భయమో !!! మెల్లిగా అందరికి తమ తమ స్పర్శలు స్వాధీనంలోకి రాసాగాయి.  జూ లో బంధించి ఉన్న పులిని చూడ్డం కాదు. అడవిలో స్వేచ్ఛా విహారం చేస్తున్న పులిని చూడాలి అన్న నాకోరిక తీరింది.

కానీ గుండెల్లోంచి భయం ఇంకా పోలేదు. నేను గైడ్ ని అడిగాను....ఇది చాలా పెద్ద సాహసం కదూ! పులి మీద పడితే ఏం చేస్తారు? ఇలా ఒపనె టాప్ జిప్సీ లో మీరు తీసుకురావడం, మేము వచ్చేయడం....అమ్మో తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది అని. గైడ్ అన్నాడు...మాకు పులి ఆనుపానులన్నీ బాగా తెలుసు, ఎప్పుడు మీదకి దూకుతుందో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో మేము అంచనా వెయ్యగలం. అంతే కాకుండా ప్రకృతి ఇచ్చే సహజమైన "calls" ని కూడా మేము గుర్తుపట్టగలం. మా దగ్గర చిన్న పిస్తోలు కూడా ఉంది అని. ఆ మాటలు విన్నాక కాస్త ధైర్యం వచ్చింది.  

ఇంకాస్త ముందుకి వెళ్ళాం. నాలో ఇంకా ఆశ చావలేదు..మళ్ళీ కనిపిస్తుందేమో. ఈసారి ముందునుండీ చూస్తానేమో అని చిన్న ఆశ. అందరికీ అదే ఆశ కాబోలు చుట్టూ పరికించి దీక్షగా చూస్తున్నాం. ఇంతలో ఆ గుబురుపొదల్లో ఏదో, దేన్నో తరుముతున్నట్టు అలజడి...నాకే కనబడింది...అది కుక్కో, నక్కో, తోడేలో నాకర్థం కాలేదు. కుక్క కాదనిపించింది. నక్క వేటాడదు. తోడేలే అయ్యుంటుంది అని నా బుర్ర వేగంగా పనిచేసింది. తోడేలు తోడేలు అని అరిచాను. అందరూ అటువైపు చూసారు. మా జీప్ కి దగ్గరగా, సమాంతరంగా పొదల్లో తోడేలు, ఒక చిన్న బుజ్జి జింకని తరుముతోంది. మెరుపు వేగంతో ఆ లేడి పొదల్లోకి మాయమైపోయింది. తోడేలు కాసేపు పరిగెత్తి పరిగెత్తి పక్షులను భయపెట్టింది. జిప్సీ తో సమాంతరంగా తోడేలు పరిగెడుతుంటే భలేగా అనిపిచింది. ఆక్షణంలో నాకు చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలు గుర్తొచ్చాయి. పంచతంత్రం కథలు కూడా గుర్తొచ్చాయి.

నీటి ఒడ్డున సేద తీరుతున్న మొసలిని చూసాం. చెట్టుపై కదలకుండా విగ్రహంవలే కూర్చున్న గుడ్లగూబని చూసాం.    అడవిదున్నల్లో ఒక రకాన్ని చూసాం.

కింగ్ ఫిషర్  పక్షి ని చూసాం. ఆహా ఏమి అందం...ఆ నీలం, ఆకాశమంత నీలం..అద్భుతమైన రంగు..ఎంత అందంగా ఉందని!!!! కళ్ళారా చూడవలసిందేగానీ మాటల్లో చెప్పలేము.

నెమలి కంఠం రంగుని, కింగ్ ఫిషర్ పక్షి రంగుని చూసాక ప్రకృతికి కైమోడ్చి జోహార్లు అర్పించడం తప్ప ఇంకేమి చెయ్యగలం!!!

ఓ మూడు గంటలు అడవిలో విహరించి...జ్ఞాపకలన్నీ మూటగట్టుకుని వెనక్కి వచ్చేసాం.

జిం కార్బెట్ లో పులిని చూడలేదని నిరుత్సాహపడిన నాకు సరిస్కాలో పులి కనిపించింది. నార్త్ లో ఉన్న మూడు అడవుల్లో రెండు చూసేసాను. ఇంకా రణతంబోర్ మిగిలి ఉంది. దానికి కూడా ఎప్పుడో పెట్టాలి ముహుర్తం.

నా జిం కార్బెట్ అనుభవాలు
http://vivaha-bhojanambu.blogspot.in/2010/03/blog-post_31.html

To know more about Sariska
http://en.wikipedia.org/wiki/Sariska_Tiger_Reserve


















Tuesday, April 17, 2012

సా..రీ...గా...మా..పాఆఆఆఆఆఆఅ....

అవి అత్యంత మధురాతి మధురమైన రోజులు....అనగా నా బాల్యము అన్నమాట :)
మా విజయనగరం సంగీతానికి పెట్టింది పేరు. మా ఇంటా, వంటా సంగీతమే..అందరూ బాగా పాడతారు. మా ఇంట్లో ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులున్నారు. చిన్న, చితక,ముసలి ముతక...అందరూ బాగా పాడతారు. నేను పుట్టకముందే నాకు సంగీతం నేర్పించాలని నిర్ణయం అయిపోయింది. నా మొదటి గురువు మా అక్క (పెద్దనాన్నగారి కూతురు - ఇప్పుడు ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు). అప్పట్లో సంగీతం అంటే ఎంత విసుగ్గా ఉండేదంటే....రోజూ క్లాసులు ఎలా ఎగ్గొట్టాలా అని ఆలోచించేదాన్ని. మనకి ముక్కులో గంగ, యమున అని రెండు జీవ నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఎప్పుడు. వాటి మిష పెట్టుకుని సంగీత పాఠాలు సుబ్బరంగా ఎగ్గొట్టేదాన్ని. మా అక్కకి పెళ్ళైపోయి విశాఖపట్నం వెళ్లిపోయింది.  హమ్మయ్య అని నేను గెంతేసాను. కానీ మా అక్క ఎందుకూరుకుంటుంది!....ఇంకో టీచర్ దగ్గర నన్ను పాఠానికి పెట్టేసి వెళ్ళింది. ఆ టీచరు దగ్గర ఓ నాలుగేళ్ళు కొంచం కుదురుగా సంగీత సాధన చేసాను. నేను శ్రద్ధగా, బాగా నేర్చుకున్నది ఆ నాలుగేళ్ళే! నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదుగానీ ఏమిటో ఆ టీచరు దగ్గర బాగా నేర్చుకున్నాను మరి! పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని...మా అక్క దగ్గర వెయ్యాల్సిన వేషాలన్నీ వేసి, వేరే టీచర్ దగ్గర సుబ్బరంగా నేర్చుకున్నాను. :)

నా జలుబు నన్ను వదలట్లేదు...గాత్రానికి ఇబ్బందిగా ఉంది. ఇలా లాభం లేదు, గాత్రం కంటే ఏదైనా వాయిద్యం నేర్పిస్తే మంచిది అని నాకు వయొలిన్ నేర్పిద్దామని నిర్ణయించారు. మా ఊరి సంగీత కాలేజీలో చేర్పిద్దామని ప్లాను. సంగీత కాలేజీలో మనకి తెలియని వాళ్ళు లేరు. అక్కడ అప్ప్లై చేసాము. అప్పుడు నేను 9th వెలగబెడుతున్నాను. అప్ల్లై చేసినవాళ్ళందరినీ ఒకరోజు ఇంటర్వ్యూకి పిలుస్తారు. గాత్ర సౌలభ్యం ఎలా ఉంది, నేర్పిస్తే ఏమైనా వస్తుందా రాదా అని పరీక్షిస్తారు. ఆ కాలేజీలో సన్యాసిరావుగారని గొప్ప వయొలిన్ విద్వాంసులు. ఆయనకి సంగీతం సర్కిల్ లో ఉన్న పేరు "పులి". కళ్ళు లేవు గానీ వయొలిన్ మాత్రం అద్భుతంగా వాయిస్తారు. ఆయన ఎవరికైనా పక్క వాయిద్యం వాయిస్తునారంటే పాడేవాళ్ళు భయపడతారు. అమ్మో పులే, జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకు పాడాలి అనుకుంటారు. అంత మహానుభావుడు. ఇదిగో ఈ ఇంటర్యూ ఆయనే చేస్తారన్నమాట. నాకు ఈ విషయం ముందే తెలిసి కాళ్ళల్లో వణుకు. ఆయనకి నేను పుట్టినదగ్గరనుండీ తెలుసు. మామూలుగా నాకు ఆయనతో మాట్లాడాలంటేనే భయం. ఎంతో ఆప్యాయంగా పలకరిచేవారు కానీ నేను భయపడుతూనే ఉండేదాన్ని. అలాంటిది ఆయన ఇంటర్వ్యూ చేస్తారని వినగానే పై ప్రాణాలు పైనే పోయాయి. అసలే ఇలాంటి పరీక్షలు ఎఱుగను..చిన్నతనం కూడాను.

ఆ రోజుకి ముందే ఒక వారం రోజులు కల్యాణి రాగంలో గీతాన్ని తీవ్రంగా సాధన చేసాను. బ్రహ్మాండంగా వచ్చేసినా కూడా భయం కొదీ విపరీతమైన సాధన చేసాను. ఆ రోజు రానే వచ్చింది. మా నాన్నగారితో పాటు సంగీత కాలేజీకి వెళ్ళాను. ఒక క్లాసు రూములో గురువుగారు కూర్చుని, వచ్చినవాళ్ళల్లో ఇద్దరిద్దరిని లోపలికి పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. నా వంతు వచ్చింది. నేను ఇంకో అబ్బాయి వెళ్ళాము. లోపలికెళ్లగానే "నమస్కారం మేషారు" అన్నాను. నా గొంతు పోల్చేసారు. "సౌమ్య, వచ్చావా...కూర్చో" అని పలకరించారు. నేను, ఆ ఇంకో అబ్బాయి కూర్చున్నాము. ఈ గండం గట్టెక్కేదెలాగో నాకు బోధపడలేదు. అసలు  ఆయన ముందు కూర్చుంటే నా గొంతు పెగులుతుందో లేదో అని భయం! లోపల్లోపల దేవుడికి దణ్ణాలు పెట్టేసుకున్నాను. మాఊరి చిన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో కొబ్బరికాయలు, పైడితల్లి అమ్మవారికి ప్రదక్షిణాలు, అయ్యకోనేరు గట్టు మీద ఆంజనేయస్వామికి రెండు రూపాయిలు మొక్కేసుకున్నాను (అప్పట్లో భక్తి విపరీతంగా ఉండేది). :) కల్యాణి గీతం పాడేసుకున్నాను మనసులో మరోసారి. ఈ తతంగమంతా మనసులోనే కానిచ్చేస్తూ నాతోపాటు వచ్చిన కుర్రాడిని చూసాను. నాకన్న కాస్త పెద్దవాడు. ఎక్కడో చూసినట్టే అనిపించింది. మా విజయనగరం చిన్న ఊరే కదా...దాదాపుగా జనాలందరూ బాగానే తెలుస్తారు. నేనేమో  దేవుడా దేవుడా దేవుడా...అనుకుంటూ ఉంటే ఆ కుర్రాడు మామూలుగా ఉన్నాడు. టెన్షన్ లేదు. నవ్వుతూ, అటు ఇటూ పరికిస్తూ ఆ గది తాలూక దూలాలు లెక్కబెడుతున్నాడు. ఇంతలో గురువుగారు మొదట ఆ అబ్బాయిని పిలిచారు. వెళ్ళి ఆయన ఎదురుగా కూర్చున్నాడు. మొదట పేరు, చదువు వివరాలు అడిగాక

"సంగీతం వచ్చా బాబూ?"

"రాదండీ, నేర్చుకోలేదు."

"అలాగా! పాటలు పాడుతూ ఉంటావా?"

"లేదండీ, పెద్దగా పాడను."

సరే పోనీ, ఏదైనా నీకు తెలిసిన ఒక పాట పాడు."

"సినిమా పాటలే వచ్చు."

"సరే నాయనా, అదే పాడు."

చికుబుకు చికుబుకు రైలే.....అదిరెను దీని స్టైలే!
చక్కనైన చిక్కనైన ఫిగరే....అది ఓకే అంటే గుబులే....

పైశృతిలో మొదలెట్టాడు. నాకు మొదట షాకు, తరువుత నవ్వు. మేషారి వైపు చూసాను. ఆయన మొహంలో ఏ భావమూ లేదు. వింటున్నారు. నాకు నవ్వాగట్లేదు. అసలేంటిది...పాట పాడమంటే అదేనా దొరికింది? జెంటిల్ మేన్ సినిమా అప్పుడే వచ్చింది. పాటలు ఒక ఊపు ఊపుతున్నాయి. అయితే మాత్రం! ఆ పాటా పాడతాడా అంతటి మహా విద్వాంసుడి ముందు? నాకు అంత నవ్వులోనూ కోపం కూడా వచ్చింది. ఏంటసలు బుద్ధి లేకుండా అని కొంచం విసుక్కున్నాను కానీ నవ్వాపుకోవడం నావల్ల కాలేదు. ఆ అబ్బాయి మాత్రం పూర్తిగా లీనమైపోయి పాటంతా పాడేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను నా టెన్షను, భయం అన్ని మర్చిపోయి పూర్తిగా రిలాక్స్ అయిపోయాను :D తెరలు తెరలుగా నవ్వొచ్చేస్తున్నాది. ఇంక అక్కడ కూర్చోలేక మంచినీళ్లకోసమని బయటకి వచ్చి పగలబడి నవ్వాను. బయట మా నాన్నగారు కూర్చున్నారు. ఏమయింది అని అడిగారు. ఆ పాట గురించి చెప్పి ఒకటే నవ్వు. కష్టపడి నవ్వాపుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను. ఆ కుర్రాడు పాట పూర్తిచేసాడు. గురువుగారు ఏమంటారో అని కుతూహలంగా చూస్తూ కూర్చున్నా. ఆయన మాత్రం గంభీరంగా "ఊ" అని మాత్రమే అనేసి ఆ అబ్బాయిని పంపించేసారు. 

ఈ దెబ్బతో నాకు ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వచ్చేసింది. మేరుపర్వతం పై అంచున కూర్చున్న భావం కలిగింది ఎందుకో! నాకు తెలుసు నేను పాడబోయే గీతం గురువుగారిని అలరిస్తుందని...నాకు సీటు ఖాయమని. ఇంక అంతే...ఎనలేని ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంగా, శ్రద్ధగా గీతం పాడాను. ముగించగానే మేషారు చిరునవ్వు నవ్వుతూ

"ఇంత బాగా పాడుతున్నావు, నీకు సీటు రాకపోవడమేమీటి! దీనికేనా మీ నాన్న అంత కంగారుపడిపోయాడు!" అన్నారు చనువుగా.

నాకు పట్టరాని ఆనందం కలిగింది. 

"వెళ్ళిరా, మళ్ళీ వారం నుండీ పాఠాలు మొదలవుతాయి....వచ్చేయ్" అన్నారు.

బయటకి హుషారుగా గెంతుకుంటూ వచ్చేసాను. మా నాన్నగారు కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు కాబోలు ఈ మాట విని చాలా సంతోషించారు.

తరువాతేముంది నేను సంగీత కాలేజీలో చేరడం ఒక సంవత్సరం వయొలిన్ వెలగబెట్టడం...పదో క్లాసుకొచ్చానన్న మిషతో ఎగ్గట్టడం అన్నీ అయిపోయాయి.

ఇంతకీ విషయమేమిటంటే ఆ అబ్బాయికి కూడా సీటు ఇచ్చారు. ఆ అబ్బాయి "చికుబుకు రైలే" అన్నా చక్కగా శృతిలో పాడాడని, నేర్పిస్తే సంగీతం వస్తుందని భావించి సీటు ఇచ్చారు. నేను, తను ఒకేసారి జాయిన్ అయ్యాం. క్లాస్ మేట్స్ అయిపోయాం. తను, నాకంటే ఏడాది పెద్దవాడు. మంచి కుర్రాడు. నన్ను "చెల్లి" అనేవాడు. ఇద్దరికి బాగా పరిచయం పెరిగాక నేనడిగాను "అదేం పాట, గురువుగారి ముందు ఆ పాటెలా పాడగలిగావ్? అని. "నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు. గురువుగారు అలా ఠక్కున ఏదైన పాడమని అడగగానే నాకేం గుర్తు రాలేదు, అంతకుముందురోజు రాత్రి విన్న ఈ పాట తప్ప" అన్నాడు. మా  క్లాసులో అదో పెద్ద జోక్ అయిపోయింది. అందరూ తలుచుకుని తలుచుకుని నవ్వేవాళ్ళం. ఆ అబ్బాయి మొదట్లో కొంచం ఉడుక్కునేవాడుగానీ తరువాత మాతోపాటు నవ్వేసేవాడు. ఆ తరువాత చాలా యేళ్ళు ఈ పాట పేరుతో ఆ కుర్రాడిని నేను ఏడిపించేదాన్ని. ఇప్పుడెక్కడున్నాడో ఏంటో! ఏం పాడుతున్నాడో! :P

ఇదే మా సంగీత కాలేజీ





P.S. అప్పట్లో సంగీతమంటే విసుకున్నానుగానీ ఓ ఇరవయ్యేళ్ళు వచ్చాక సడన్ గా సంగీతం మీద శ్రద్ధ పుట్టింది. కానీ అప్పటికి నేను నేర్చుకునే పరిస్థితి లేదు. ఏదో పాడుకుంటూ ఉండేదాన్ని. మా అక్క నా పాట విని "అయ్యో, ఎందుకే అప్పుడు శ్రద్ధగా నేర్చుకోలేదు?" అని బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ మొదలెడదామంటే ఇప్పటికీ కుదరట్లేదు. ఈ విషయం నాకెప్పుడూ బాధగానే ఉంటుంది....అయ్యో, అన్నీ చేతిలోనే ఉంచుకుని బుద్ధిగా, శ్రద్ధగా నేర్చుకోలేకపోయానే అని! :(

Tuesday, March 20, 2012

పనిమనిషి!

"మనీ కోసం పని చేసే షి" అని అర్థం చెప్పుకుని చిన్నప్పుడు చాలా నవ్వుకునేవాళ్ళం.  పనిమనిషంటే మనలో చాలామందికి (నాతో కలిపి) ఉండే అభిప్రాయం "చులకన". అవును, పనిమనిషులు మనకి చులకన. మనం తినగా మిగిలినదో, పాచిదో వాళ్ళకి ఇస్తాం. బాగా వాడి వాడి విసుగెత్తిన బట్టలు ఇస్తాం. మన కాళ్ళ దగ్గర ఉండే మనిషి అని మనకి అభిప్రాయం. వయసులో ఎంత పెద్దవాళ్ళైనా సరే "ఒసేయ్" "ఏమే" అనే ఉంటాయి పిలుపులు. మనం ఆఫీసులో ఎంత పెద్ద తప్పులు చేసినా బాస్ కోప్పడితే ఏదో ఒక్కసారి జరిగినదానికే ఇంతలా అరవాలా అని చాల మధనపడతాం. ఇంట్లో మాత్రం పనిమనిషి మీద ఊరికూరికే కేకలు వేస్తాం. పనిఎగ్గొట్టడానికి వీళ్ళు వెయ్యి నాటకాలు ఆడతారని మన ప్రగాఢ విశ్వాసం. వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ అడిగి తెలుసుకుని మనమేదో గొప్ప తెలివైనవాళ్ళలాగ సలహాలిస్తుంటాం. మన ఇంట్లో విషయాలు మాత్రం నోరిప్పము. కొంచం ఎవరైనా చొరవగా ప్రవర్తిస్తే భగ్గున మండిపడతాము. "నువ్వు" అని సంభోదించారో నానారభస చేస్తాము. పనిమనిషికి టీ తాగడానికి వేరే కప్పు. అన్నానికి వేరే కంచం. నేనేమీ ఈ ప్రవర్తనకు అతీతురాలిని కాదు. అసలిలా చెయ్యొచ్చా, చెయ్యకూడదా అన్న ఆలోచన కూడా నాకెప్పుడూ రాలేదు. ఇంట్లో పనిమనుషుల సంగతి అమ్మ చూసుకుంటుంది. వాళ్ళతో నేనప్పుడూ మాట్లాడేదాన్ని కూడా కాదు. ఆ అవసరం కూడా ఉండేది కాదు. 

ఢిల్లీ లో ఉద్యోగార్థమై అడుగుపెట్టాక మొట్టమొదటిసారి పనిమనిషితో నేను మాట్లాడవలసి వచ్చింది. సంగీత అని చక్కని మనిషి. నన్ను వదిన అని పిలిచేది. ఇక్కడ మనిమనుషులందరూ అంతే యజమానులను అన్నయ్య, వదిన అని పిలుస్తారు. ఇల్లుని కడిగిన ముత్యంలా తయారుచేసేది. అంత పనిమంతురాలిని నా జీవితంలో చూడ్డం అదే మొదటిసారి. ఓరోజు టీ ఇచ్చాను ఒక కప్పులో పోసి. తాగి కడిగేసి ఆ కప్పు ఒక వారగా పెట్టింది. నేను చూసానుగానీ పెద్దగా పట్టించుకోలేదు. మర్నాడు టీ ఇద్దామని కప్పులు తియ్యమంటే మా ఇద్దరికీ రెండు తీసి, ఆ వారగా పెట్టిన తన కప్పు తెచ్చుకుంది. "ఇదేమిటి" అని అడిగాను. కొంచం సందేహిస్తూ నావైపు చూసింది. గట్టిగా చెప్పాను అలా ఏమీ చెయ్యక్కర్లేదు. మేము తాగే కప్పులో నువ్వూ తాగొచ్చు. అలా నీ కప్పు వేరుగా పెట్టొద్దు అని. సంతోషంగా నావైపు చూసింది. నాకెందుకో నేనేదో గొప్ప పనిచేసేసినట్టు ఆనందంగా అనిపించింది. ఇంకోరోజు బట్టలేమైనా ఉంటే ఇమ్మన్నాది. డబ్బులిచ్చి కొత్తవి కొనుక్కొమన్నాను. ఆనందంగా నవ్వుతూ డబ్బులు తీసుకుంది. నాది చాలా విశాల హృదయమని మురిసిపోయాను నేను. సంగీతకి ఇద్దరు పిల్లలు. పెద్దవాడికి ఐదేళ్ళు. చిన్నపాపకి రెండేళ్ళు. పనికి వచ్చినప్పుడు వాళ్ళనీ వెంటబెట్టుకుని వచ్చేది. కుర్రాడు బయటకిపోయి ఆడుకునేవాడుగానీ ఆ చంటిది మాత్రం ఇల్లంతా చిందరవందర చేసేది. దాన్ని కాపలా కాయల్సి వచ్చేది. మొదట్లో చికాకుపడేదాన్ని దీనికి మనమేమైనా పనిమనుషులమా పిల్లని ఆడించడానికి అని. ఆ పసిది మాత్రం బోసినవ్వులతో దగ్గరకు వచ్చేది. కొన్నిరోజుల్లోనే ఆ పిల్లది మాకు దగ్గరైపోయింది. ఆ చంటిదానితో సరదాగా గడిచేది కాలం. అప్పుడే మొదటిసారి నాకే చాలా ఆశ్చర్యమేసిన సంగతి..."పనిమనిషి పిల్లతో ఆడుకోవడమా!" లోపల ఏదో పొర మెల్లిగా కరుగుతున్నట్టు అనిపించింది. 

కొన్నాళ్ళకి ఇల్లు మారాం. "అమీనా" బక్కచిక్కిన మనిషి.  పేరు వినగానే చలం కథ "అమీనా" గుర్తొచ్చింది. మొదటిసారి ఇంటికొచ్చినప్పుడు "అసలు ఇది పనిచేస్తుందా, ఒంట్లో ఓపిక ఉందా" అని డౌటొచ్చింది. సంగీత అంతకాకపోయినా 80% చేసేది. అమాయకంగా ఉండేది అమీనా. రాజస్థానీట. కొన్నేళ్ళ క్రితం ఢిల్లీ వచ్చి పనులు చేసుకోవడం మొదలెట్టారు. ఇంట్లో అక్కచెల్లెళ్ళు, వదినలు అందరూ పనిమనుషులే. సంగీత లాగే ఈ అమీనా కూడా చాలా నిజాయితీపరురాలు. ఎక్కడ ఉన్న వస్తువు అక్కడే ఉండేది. ఈ అమీనా ఉన్నప్పుడయితే మేము ఒక్కోసారి పొద్దున్నే లేచేవాళ్ళం కూడా కాదు. తను మాత్రం వచ్చి నిశబ్దంగా పనిచేసేసుకుని, వెళ్ళిపోయేటప్పుడు నిద్రలేపేది. ఏరోజూ ఇంట్లో చిల్లి గవ్వ కూడా పోయిన దాఖలా లేదు. కొన్ని నెలల తరువాత అమీనా వచ్చి "వదిన, మా ఊరెళ్ళాలి. అమ్మకి ఒంట్లో బాగాలేదు. నేను వెళ్ళి సాయం ఉండొస్తాను" అంది. "అయ్యో మరి ఇంట్లో పనెలా?" అని అడిగాను. "నేనొచ్చేవరకూ మా చెల్లి చేస్తుంది" అంది. "సరే వెళ్ళిరా. బెంగపడకు, అమ్మకి నయమవుతుందిలే" అని చెప్పి కొంత డబ్బు చేతిలో పెట్టాను. తటాలున వచ్చి కౌగలించుకుంది. నేను ఉలిక్కిపడ్డాను. పనిమనిషి వచ్చి నన్ను కౌగలించుకోవడం....నేను కలలో కూడా ఊహించలేదు. నా మొహంలో ప్రసన్నత పోయిందని నాకే అర్థమయ్యింది. కష్టపడి చిరునవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు నాకే తెలిసింది. నన్ను విడిచి సంజాయిషీ చెబుతున్నట్టు "కొన్నాళ్ళు పనిచేసాక వాళ్లపై అభిమానం ఏర్పడుతుంది వదిన...వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉంటుంది" అంది. నాకు కళ్ళంట నీళ్ళు తిరిగిగాయి. మనసులో గొప్ప దుఃఖం పొంగిపొర్లుతున్నట్టు అనిపించింది. బయటకి మాత్రం "ఊ" అని అనగలిగాను, అంతే. ఓ రెండు నిముషాల్లో తేరుకుని అది వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి భుజం మీద చెయ్యి వేసి, దగ్గరకు తీసుకుని మళ్ళీ ధైర్యం చెప్పాను. పాపం అమీనా కళ్లనీళ్ళు పెట్టుకుంది ఎందుకో! నాకు లోపల ఒక్కో తెర తొలగిపోతున్నట్టు ఒక ఫీలింగ్. పనిమనిషి నన్ను కౌగలించుకుంది అన్న విషయం కుదిపి పారేసింది. కొన్నిరోజులు అది నా బుర్రలో తిరుగుతూనే ఉంది. నా ఆలోచనలు సుడి తిరుగుతూనే ఉన్నాయి.

మళ్ళీ ఇల్లు మారాము. ఈసారి భారతి వచ్చింది మా ఇంటికి. మంచి చలాకీ మనిషి. వయసు 40 పైనే. నిజాయితీకి మారుపేరు. చురుకుగా సరదాగా ఉంటుంది. నేను ఏదైనా అంటే నామీదే మళ్ళీ అరుస్తుంది (నవ్వుతూ అరిచేది). మొదట్లో నామీద అరుస్తోందేంటి అని విస్మయంగా ఉండేది. కానీ అప్పటికే మాయపొరలు తొలగి ఉండడంతో చిరాకు కలిగేదికాదు. నేను తిరిగి "అరుస్తున్నావెందుకు" అని అరిచేదాన్ని. :) అలా ఇద్దరం  సరదాగా ఒకరిమీద ఒకరం అరుచుకుంటాం ఇప్పటికీ. రెండేళ్ళై మా ఇంట్లోనే పని చేస్తోంది. మిగిలిపోయినది, పాచివి ఇవ్వడం అన్న సమస్యే లేదు. మేమైదైనా కొనుక్కుంటే తనకీ ఒక పొట్లాం కట్టిస్తాను. డబ్బుల దగ్గర పేచీయే లేదు. వచ్చిన దగ్గర నుండీ కబుర్లు చెబుతూ పనిచేస్తుంది. తన నోరు ఒక్క నిముషం మూతపడదు. తన సొంత విషయాలు, ఊర్లో విషయాలు అన్నీ చెబుతుంది. మా అమ్మ, నాన్న ఇంటికి వస్తే ఎంతో ఆదరంగా వాళ్ళతో మాట్లాడుతుంది. అమ్మకి మంచి ఫ్రెండ్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ కాళ్ళకి దణ్ణం పెడుతుంది పెద్దవాళ్ళ ఆశీస్సులు కావాలంటూ. అలా పడేసింది వాళ్ళని :) ఈ మధ్యన తనకి కాస్త ఒంట్లో బాగాలేక ఒక ఇల్లు మానేద్దామనుకుంది. మానేస్తే మా ఇల్లు గానీ, మా కింది ఇల్లుగానీ మానేయాలి. నాతో ఆ మాటే చెప్పింది. "మా ఇల్లు మానేయకు" అని మాత్రం చెప్పాను నేను. కిందింటి వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. దానితో పాటు "పై ఇల్లు మానేయ్ కావాలంటే" అని కూడా చెప్పారట. మొన్నోరోజు వచ్చి "కింద వాళ్ళ ఇల్లు మానేసాను వదినా...వాళ్ళ ప్రవర్తన బాలేదు. నన్నసలు మనిషిలాగే చూడరు. మీతో ఇంత సరదాగా ఉంటానా, అక్కడికి వెళితే నోరే మెదపను. పైగా ఈ మధ్య మీ ఇల్లు మానేయమని బలవంతపెట్టారు నన్ను. మీ ఇల్లు ఎలా మానేస్తాను. మీరు నాకు ఎంత దగ్గరయ్యారు! అందుకే వాళ్ళదే మానేసాను" అని దగ్గరకొచ్చి ఆప్యాయంగా చెయ్యి పట్టుకుంది. నామొహం వెయ్యొ ఓల్టుల బల్బులా వెలిగిపోయింది అని వేరే చెప్పక్కర్లేదుగా!

అప్పుడు నాకే అనిపించింది......నేను పూర్తిగా మారిపోయాను. మా భారతి, నేను తనని అభిమానిస్తున్నానని మనస్పూర్తిగా నమ్మింది. నేను మారాను. నా ఆలోచనలు మారాయి! ఇప్పుడు పనిమనుషులంటే నాకు చులకన కాదు.


Tuesday, March 6, 2012

మా ఊరుకి పుస్తకాల పండగొచ్చిందోచ్చ్!

పుస్తకాలు పుస్తకాలు!
"అటు నేనే ఇటు నేనే" అన్నట్టు ఎటు చూసినా పుస్తకాలు!
ముందుకు వెళితే పుస్తకాలు, వెనక్కి చూస్తే పుస్తకాలు, పక్కకు జరిగితే పుస్తకాలు!

చంద్రుణ్ణి చూసి ఎగిసే అలల్లా మీదకి దూకుతున్నాయి!
తేనెపట్టు మీద రాయేసి కొట్టినట్టు ఝుమ్మన్ని మీదకు ముసురుతున్నాయి!
కలకండ చుట్టూ చేరిన చీమల్లా చుట్టుముట్టేస్తున్నాయి!
వలసపోయే పక్షుల్లా బారులు తీరి ఉన్నాయి!
ఉఛ్వాశనిశ్వాసల్లా ఎగసెగసి పడుతున్నాయి.
ఊపిరి సలపనివ్వకుండా ఉక్కిరిబికిరి చేస్తూ "నన్ను చదువు అంటే నన్ను చదువు" అని పోటీపడుతున్నాయి.

సుమారు 13 లక్షల పైచిలుకు పుస్తకాలు. 2500 స్టాల్స్ ...కనివినీ ఎరుగని రీతిలో పుస్తకాలు. బొమ్మలకొలువులో బొమ్మల్లా అందంగా అమర్చబడ్డాయి 20th Wolrd Boof Fair పుణ్యమా అని. ఢిల్లీ లో ప్రతీ రెండేళ్లకొకమాటు World Book Fair జరుగుతుంది. ఈసారి 25 ఫిబ్రవరి నుండీ 4 మార్చి వరకూ జరిగింది.


26 ఆదివారం మేము వెళ్ళేసరికి ఆ ప్రభంజనం చూసి మా ఊరి పైడితల్లి అమ్మవారి పండుగ గుర్తొచ్చిందంటే అతిశయోక్తి కదు. ఢిల్లీలో పుస్తకప్రియులు ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యమేసింది. ఈ  పండుగ గురించి ఏ రకమైన సమాచారం మాకు తెలీదు. పేపర్ లో చూసి ఆదివారం కదా అని బయలుదేరాం. అడుగుపెట్టగానే "మీకేమైనా సహాయం" కావాలా అని అడిగారు. ఒక Information book 20 రూపాయిలు కొనుక్కొమన్నారు. కొనుక్కుని చూసాం. కళ్ళు గబగబ తెలుగుని వెతికాయి. కనిపించింది కనిపిచింది....యాహూ తెలుగుకి మూడు స్టాల్సు ఉన్నాయట. ముందు అటుపోదాం అని Regional Books ఉన్న హాల్ కి వెళ్ళాము. అది హాలా! దానికదే ఓ పెద్ద భవనంలా ఉంది. ఎన్నెన్ని పుస్తకాలో! తెలుగుకి మూడు, తమిళానికి ఓ పది. మళయాళం, ఒడిసా, మరాఠీ...అబ్బ ఒకటేమిటీ అన్నీను! ఉర్దూ పుస్తకాలైతే ఫ్రీ గా పంచుతున్నారు. ఉర్దూకే అత్యధికం స్టాల్స్.

తెలుగుకి విశాలాంధ్ర, విజయవాడ పబ్లిషర్స్, మంచిపుస్తకం వాళ్ళు స్టాల్స్ పెట్టారు. ఆ ఆదివారం నాటికి విశాలాంధ్రలో మాత్రమే పుస్తకాలు వచ్చాయి. మిగతావి ఇంకా రాలేదు. విశాలాంధ్రలో మంచి కలక్షన్ ఏమీ లేదు. అంటే మంచి పుస్తకాలు ఉన్నాయి. కానీ అక్కడున్నవి చాలామటుకు నా దగరున్నాయి. నాకు కావలసినవి పెద్దగా లేవన్నమాట. :) కానీ పెట్టారన్న సంబరంలో ఏవో కొన్నాను. విశాలాంధ్ర స్టాల్ పెట్టినాయన అనంతపురమునుండీ వచ్చారట- సోమశేఖరెడ్డిగారు.మొత్తం వారం రోజుల పడుగలో మూడురోజులు వెళ్ళాను నేను ఆస్టాల్స్ వైపు రెడ్డిగారు బాగా ఫ్రెండ్ అయిపోయారు. మంచి పుస్తకప్రియులు కూడాను. మేమిద్దరం చాలా పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడొక వింత సంఘటన జరిగింది. మొదటిరోజు నేను పుస్తకాలు చూస్తూ ఇది ఉందా అది ఉందా అని అడుగుతుంటే రెడ్డి గారు సరదాపడి మూలమూలలనుండి పుస్తకాలు తీస్తూ నాతో వాటి గురించి చర్చిస్తూ తిరిగారు. ఈలోగా ఓ పెద్దమనిషి అక్కడకు వచ్చాడు. ఓ 45 ఉంటుందేమో వయసు. ఊరికే కనిపించిన పుస్తకాలన్ని తిరగేస్తున్నాడు. నేను రెడ్డి గారు మాట్లాడుకుంటూ ఉంటే ఇతగాడు నావైపు తెరిగి "మీరు బాచదువుతారా పుస్తకాలు" అన్నాడు. "అవును" అన్నాను. "ఓ మంచి పుస్తకం" చెప్పండి అన్నాడు. ఎదురుగా రమణీయాలు కనిపిస్తే చూపించాను. "ఇవి బావుంటాయా! పి.వి నరసింహా రావు గారు ఏదో రాసారుట మీరు చదివారా" అన్నాడు. "అట, కానీ నేను చదవలేదు,నాకు తెలీదు" అన్నాను. మీ ఇంట్లో బోలడు పుస్తకాలున్నాయా! ఇవన్నీ ఏం చదువుతాం. చదివాక ఏం చెయ్యాలి. మా ఇంట్లో నేనొక్కడినీ ఉన్నాను, చదివేసాక ఏం చెయ్యను ఈ పుస్తకాన్ని. ఎన్నని కొనుక్కు చదువుతాము. అసలు ఏంటివన్నీ...ఏం పుస్తకాలు, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఏవైనా పుస్తకాలు కావాలంటే అడుగుతాను. మీ ఇంటికొచ్చి పుస్తకాలు చూస్తాను." అంటూ అతను మాట్లాడుతుంటే నేను, రెడ్డి గారు తెల్లబోయాం. ఏదో వింత జీవి వేరే గ్రహం నుండి దిగి వచ్చినట్టు అనిపించింది. చదివేసాక పుస్తకాన్ని ఏమి చెయ్యాలా! నాకు బుర్ర తిరిగిపోయింది ఈ ప్రశ్న చూసి. ఎంత కోపం వచ్చిందంటే "అసలు మిమ్మల్ని ఎవడండీ ఇక్కడకు రమ్మన్నాడు?" అని అడగాలనిపిచింది. పుస్తకాలు ఎందుకు చదావాలి అన్న దానిపై చిన్న లెక్చరు ఇద్దామా అని ఆలోచించాను రెండు నిముషాలు. కానీ నాకు అప్పుడు అంత ఓపిక లేదు. పైగా బోల్డు పని ఉంది, ఇంకా బోల్డు పుస్తకాలూ చూడొద్దూ! అందుకే చిన్నగా నవ్వేసి మెల్లిగా జారుకున్నాను అక్కడినుండి. ఆ జిడ్డు మనిషి అక్కడనుండి పోయాడు అని తెలిసాక మళ్ళీ వెళ్ళాను. :) విజయవాడ పబ్లిషర్లు మీద బోల్డు ఆశలు పెట్టుకుని మర్నాడు వెళ్ళానుగానీ ఆశ అడియాశ అయిపోయింది. ఏమీ లేవు అక్కడ. యండమూరి, యద్దనపూడి లేదంటే దేవుడి పుస్తకాలు, అదీ కాదంటే వంటల పుస్తకాలు. ఓ నమస్కారం పెట్టి "మంచి పుస్తకం" లో చూస్తే అన్నీ చిన్నపిల్లల పుస్తకాలే. సరదావేసి కొన్ని కొనుక్కున్నాను.


ఆ తర్వాత ఇంగ్లీషు మీద పడ్డాం. అవేం పుస్తకాలురా నాయనా...తెలుగంటే ఏవి చదవాలో ఏవి వద్దో, నాకేవి నచ్చుతాయో ఏవి నచ్చవో....ఒక జ్ఞానం ఉంది. కానీ ఇవో! ఏవో కొన్ని చాలా ఫేమస్ పుస్తకాలు తప్పితే పెద్దగా తెలీదే :(  సరే చూద్దం అని అడుగుపెట్టాం. అబ్బ అబ్బ అబ్బ...కళ్ళు చెదిరిపోయేలా పుస్తకాలు. అన్నీ చదవాలనిపిస్తుంది. ఏది చదవాలో తెలీదు. ఇది బావుంటుందా...ఏమో కొనేసాక బాగోకపోతే! ఒకవేళ కొనకపోతే మంచి పుస్తకం మిస్ అయిపోతామేమో! అని ఒకటే పీకులాట.

ప్రగతి మైదాన్ అన్న స్థలంలో జరిగింది ఈ పండుగ. ఆ మైదానం మా విజయనగరమంత ఉంటుందేమో అనిపించింది. అందులో మొత్తం 16 హాల్స్. Pages, Oxfor, Penguin, Pacific, Goodwell, Cambridge, Just Read, Om Books, Flipcart....చిన్న చితకా, ముసలి, ముతక అన్నీ రకాల పబ్లిషర్స్ ఉన్నారు. ఆదివారం నాడు మేము రెండు స్టాల్స్ చూసేసరికి మాకు మొహం తిరిగిపోయింది. ఇంకా 14 చూడాలా అని అనుకుంటేనే కళ్ళు తిరిగాయి. ఇంక లాభం లేదని ఆరోజుకి దుకాణం కట్టేసాము. మర్నాడు వెళితే జనం కాస్త తక్కువ ఉన్నారు. కొంచం హాయిగా ఇంకో రెండు హల్స్ తిరిగాము. కొన్ని బుక్స్ కొన్నాము. 

ముఖ్యంగా చెప్పుకోవలసినది Nationla Book Trust గురించీ, Sahitya Academy గురించీ. NBT లో పుస్తకం ధర చాలా చౌక. 20-30 రూపాయలనుండీ ఉన్నాయి పుస్తకాలు. మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. సాహిత్య అకాడమీలో కూడా చాలా భాషల పుస్తకాలు ఉన్నాయి. నేను తెలుగువి కొన్ని కొన్నాను. 


ఈ పండుగకి ఒక ప్రత్యేకత ఉంది. "150 యేళ్ళ రవీంధ్రనాథ్ ఠాగూర్", "100 యేళ్ళ ఢిల్లీ" సంబరాలు జరుపుకుంటున్నాయి. రవీంద్రనాథ్ రచనలు, ఢిల్లీ కి సంబంధించిన రచనలు అనేకం ఉన్నాయి. వీటికి ఎక్కువ స్టాల్స్ కేటాయించారు. 

అలాగే నేను చూసిన అత్యధిక స్టాల్స్ ఓషో వి. ప్రతీ హాల్ లోనూ ఓషో రచనలు, సీడీలతో స్టాల్స్ ఉన్నాయి. అంతేకాకుండా శ్రీలంక, భూటాన్ అంటూ విదేశీ భాషల పబ్లిషర్స్ కి కూడా కొన్ని స్టాల్స్ కేటాయించారు. పిల్లలపుస్తకాలకి మాత్రం ఇది నిజమైన పండుగ. Children Pavilion అని వాళ్లకు ప్రత్యేకంగా ఒకటి పెట్టారు. ప్రతీ హాల్ లోనూ చాలా ఎక్కువ Children's Books ఉన్న స్టాల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎన్నెన్ని పుస్తకాలో! అంబేద్కర్ కి కొన్ని ప్రత్యేకంగా స్టాల్స్. అన్నాహజారే కి ఒకటి. చిన్న, పెద్ద పబ్లిషర్స్ మాత్రమే కాకుండా రోడ్డు సైడ్ పుస్తకాలు అమ్మేవాళ్లలాంటివాళ్లున్నారు. వీళ్లకి స్టాల్స్ ఉండవు. ఏమూల జాగా కనిపిస్తే అక్కడ వాళ్ళ పుస్తకాలు పెట్టేసుకుంటారు. ప్రతీ పుస్తకమూ 100 రూపాయిలు మాత్రమే. చాలా పుస్తకాలు సెకండ్ హేండువి. నాకు హైదరాబాదులో కోటీ సెకండ్ హేండ్ బుక్స్ మార్కెట్ గుర్తొచ్చింది. వీళ్ల దగ్గర కూడా 100 కి కొన్ని పుస్తకాలు కొన్నాము. 

నవ్వు తెప్పించిన ఒక విషయం ఏమిటంటే రిలయన్స్ కూడా ఇందులోకి దిగింది. అచ్చు కూరగాయలు అమ్మినట్టే ఒకటి కొంటె రెండు ఫ్రీ అని. మూడు కొంటే ఐదు ఫ్రీ అని. కొన్నిటి మీద 30% డిస్కౌంట్, కొన్నిటి మీద 10%...ఇలా రకరకాల options పెట్టారు. రిలయన్స్ షాపింగ్ మాల్ లో ఉన్నట్టే. నవ్వొచ్చింది అది చూసాక. :)

ఈ పండుగలో పుస్తకాలే కాకుండా రకరకాల కార్యక్రమాలు జరిగాయి. రోజూ సాయంత్రం ఏవో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. రోజూ ఏదో ఒక పుస్తకావిష్కరణ సభ. రచనావ్యాసంగం గురించీ, పుస్తకాల గురించీ ఏదో ఒక Workshop, Seminar జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ పండుగకి "వందేళ్ళ భారతీయ సినిమా" అన్నది కూడా ప్రత్యేకం. సినిమా గురించి రకరాకల Workshops జరిగాయి. How to Read a Cinema? అనే work shop కి వెళ్ళాము. చాలా అద్భుతంగా ఉంది. అది విన్నాక సినిమాలు తియ్యడం ఇంత కష్టమా అనిపించింది. సినిమాకోసం ప్రత్యేకంగా ఒక హాల్ ఉంది. అందులో సినిమాలకి సంబంధించిన పుస్తకాలన్నీ ఉన్నాయి. ఎక్కువ హిందీ సినిమాల గురించి. తరువాత బెగాలీ సినిమాల గురించి. కొంచం తమిళ సినిమాల గురించి. అంతే. మిగతా భాషల్లో సినిమాలు ఇటువంటి రచనలకు నోచుకోలేదు గాబోలు! రోజూ ఏదో ఒక సినిమా వేసేవారు సాయంత్రం పూట. పథేర్ పాంచాలి, చారుశీల - సత్యజిత్ రే సినిమాలు రెండూ చూద్దాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదు :(. మాల్గుడీ డేస్ కాసేపు చూసాం :) 

మేము వరుసగా మూడు రోజులు సాయంత్రం అక్కడకి వెళ్ళడం పుస్తకాలు చూడడం, ఏవో కొనుక్కోవడం, కొనుక్కోవలసినవటి గురించి ఆలోచించడం ఇదే పని మాకు. :) చివరి రోజులు కదా అని మళ్ళీ 3 మార్చి శనివారం నాడు వెళ్ళాం. ఆరోజైతే ఇసుక వేస్తే రాలనంత జనం. మాకు చాలా విసుగొచ్చింది. కొందరిని చూస్తే వీళ్ళు అసలు అక్షరాస్యులేనా అనిపించేది. వాళ్ల వాలకం అలా ఉండేది...నిజంగా వీళ్ళకి చదవడం, రాయడం వచ్చా అని సందేహమొచ్చింది. పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు తండోపతండాలుగా వచ్చేసారు. పిక్నిక్ కి వచ్చినట్టు వచ్చేసారు. మేము వెళ్ళినట్టే! :)

ఇంతా చేస్తే మేము నాలుగు రోజులు వెళ్ళి చూసినవి మొత్తం 5 హాళ్ళు...అంతే! అవి చూసేసారికే మాకు తల ప్రాణం తోకకొచ్చింది. నిజం చెప్పాలంటే, ఒకానొక సమయంలో పుస్తకాలంటే విరక్తి వచ్చేసింది. బాబోయ్ ఈ పుస్తకాలు నాకొద్దు అని దూరంగా పారిపోవాలనిపించింది. :)

అలా సరదా సరదాగా సాగిపోయింది మా ఊర్లో పుస్తకాల పండుగ! ఇంతమంచి పండుగలో మేము పాల్గొనగల్గినందుకు చాలా ఆనందంగా అనిపించింది. 

మేము కొన్న పుస్తకాలు....

తెలుగు:
సాహిత్య అకాడమీ: కాళోజీనారాయణరావు - పేర్వారంజగన్నాథం, శాస్తి - కాన్హుచరణ్ (ఒడియాఅనువాదం)
తాపీ ధర్మారావు: ఇనుపకచ్చడాలు, రాలు-రప్పలు, దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు?
శరత్‌ సాహిత్యం: దేవదాసు, శ్రీకాంత్, చరిత్రహీనులు
సహవాసి: పంచతంత్రం, బేతాళకథలు, అమ్మ
గణిత విశారద - అవసరాల రామకృష్ణారావు
నామిని ఇస్కూలు పుస్తకం
రైలుబడి - టెట్సుకో కురొయనాగి (తెలుగుఅనువాదం)
జరుక్‌శాస్త్రి పేరడీలు
అనువాద సమస్యలు - రాచమల్లు రామచంద్రారెడ్డి
ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వారుస్వామి
డా.బాబాసాహెబ్ అంబేద్కర్ - చాగంటి తులసి
కాదంబరి - రావూరి భరద్వాజ
మధురాంతకం రాజారాం కథలు - రెండు భాగాలు
గోనగన్నారెడ్డి - అడివి బాపిరాజురచనలు
సిప్రాలి -శ్రీశ్రీ
దక్షిణభారతంలో దేవాలయాలు - వాకాటి పాండురంగారావు (అనువాదం)
కథాసరిత్సాగం - జగన్నాథశర్మ
భమిడిపాటి కామేశ్వరరావు - నాటకాలు
రంగుటద్దాలకిటికీ - ఎస్.నారాయణస్వామి
పండితపరమేశ్వరశాస్త్రి వీలునామా - గోపీచంద్
కథాసరిత్సాగము - జగన్నాథశర్మ
కృష్ణశాస్త్రి సాహిత్యం: వ్యాసావళి - వ్యాసాలు, కృష్ణపక్షము
రాహుల్సాంకృత్యాయన్: ఓల్గానుండిగంగవరకు, మనిషికథ, ప్రాక్పశ్చిమదర్శనాలు

English:
The Summons & The King of Torts - John Grisham
Life of Pi - Yann Martel
Why I am an Athiest? - Bhagat Singh
Indian Food: A Historical Companion - K. T. Achaya
The Monk Who Sold his Ferrari - Robin Sharma
Fall of Gaints - Ken Follet
Piccadilly Jim - Wodehouse
Freedom Struggle - Bipin Chandra
A History of South India - K. A. NilakanthaSastri
The Alchemist - Paulo Coelho
The Immortal of Meluha& The Secret of Nagas - Amish
The Dairy of a Young Gilr - Anne Frank
Twilight in Delhi – Ahmed Ali
The Davinci Code – Dan Brown

ఇంకా చాలా తమిళ పుస్తకాలు :)


Monday, February 27, 2012

సిద్ధాంతం

ముక్తేశ్వర్...సముద్రం మట్టం నుండి 800 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతం - హిమాలయాలలో భాగం. నైనితాల్ నుండి ఓ రెండుగంటల ప్రయాణం. కొండ పై కొనకి చేరుకుని, కారు దిగి చుట్టూ చూస్తుంటే ఇద్దరు ముగ్గురొచ్చారు "గైడ్ కావాలా" అంటూ. అక్కడ ఉన్నది చిన్న ముక్తేశ్వరుడి గుడి, దానికి ఓ పక్క రాళ్ళ గుట్టలు, మరో పక్క అడవి . ఇంతే కదా. ఏముంది చూడ్డానికి, గైడ్ ఎందుకు అనుకునేలోగా ఒకతను వచ్చి మా మనసులో మాటలు పసిగట్టినవానిలా "ఈ చుట్టుపక్కల చూడ్డానికి ఏముంది అనుకోకండి, మీకు తెలీదు కాబట్టి ఏమీ లేదు అనుకుంటున్నారు. ఈ ఏమీ లేని చోట మీకు నేను అన్నీ చూపిస్తాను" అని మాటలతో మేజిక్ చేసాడు సంతోష్ కుమార్ శర్మ. ఎంతడుగుతాడో అన్నట్టు పెట్టిన మా మొహాలు చూసి "150 ఇవ్వండి" అన్నాడు. చాల ఏక్కువేమో అని మేము సందేహంగా చూస్తుంటే "సరే 100 ఇవ్వండి" అన్నాడు. ఇతనికి మనసులో మాటలు తెలుసుకునే విద్య ఏమైనా వచ్చా అని సందేహమొచ్చింది. మా చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ ని లాక్కుంటూ "ఆ బ్యాగ్ నేను నా భుజానికి తగిలిచుకుంటానమ్మా, మీరు నడవలేరు దీనితో. మీరు హాయిగా, నేను చెప్పే విషయాలు వింటూ నా వెనుక రండి" అని వడివడిగా నడవడం మొదలెట్టాడు సంతోష్.

ఆ కొండ కి అదే చివర. ఆ గుడి చుట్టూరా ప్రకృతి సహంజం గా ఆవరించుకున్న పెద్ద పెద్ద బండరాళ్ళ కంచె. ఆ కంచె మీద జాగ్రత్త నడవకపోతే కింద లోయలో రెండు మూడూ కిలోమీటర్ల అట్టడుగున దొరుకుతాం. చెంగు చెంగుమని దూకుతూ, అవసరమైనప్పుడు ఆ రాళ్ళ చివరకి వెళుతూ, పడిపోతాడేమో అని మనల్ని కాస్త భయానికి గురిచేస్తూ ఏవేవో కథలు చెబుతూ ముందుకి సాగిపోతున్నాడు సంతోష్. అతని వెనుక పడుతూ, లేస్తూ అతను చెప్పే చిత్ర విచిత్ర కథలను ఆసక్తిగా వింటూ నడుస్తున్నాం. మా చేతిలో నుండి కెమేరా తీసుకుని "మీరు దీని సంగతి మరచిపోయి హాయిగా రండి. మీకు బ్రహ్మాండమైన, సహజమైన ఫొటోలు తీసే పూచీ నాది" అంటూ క్లిక్కుమనిపించాడు. అక్కడనుండి కనిపిస్తున్న పెద్ద పెద్ద హిమాలయ పర్వత శ్రేణులను ఒక్కోటిగా చూపిస్తూ, వాటి పేర్లు, వాటి వెనుక కథలు వివరిస్తూ ఉత్సాహంగా సాగుతున్న సంతోష్ ని చూస్తే భలే ఆశ్చర్యంగానూ, ఉత్సాహంగానూ అనిపించింది. మనిషికి ఎంత వయసుంటుందో అంచనా వేస్తూ, రోజుకి ఇతనికి ఎన్ని వందలు చేరుతాయో, ఇతని జీవితం ఎలా గడుస్తుందో, సంసారం ఎంత పెద్దదో అన్న లెక్కలు వేస్తూ నా ఆలోచనల్లో నేనుండగానే ఆ వెనకున్న అడవుల్లోకి తీసుకెళ్ళాడు. 800-900 యేళ్ళ దేవదారు వృక్షాలను చూపిస్తూ ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో ఎలాంటి రిసెర్చ్ జరుగుతుందో వివరించాడు. ఏ చెట్టు నుండి ఏ రకమైన ద్రవం/నూనె వస్తుంది. వాటిని ఏ యే ఔషధాల్లో వాడతారో వివరంగా చెప్పాడు. చాలావాటికి శాస్త్రీయ నామాలను కూడా చెప్పాడు. అక్కడ ఉన్న "ఏనిమల్ రిసెర్చ్ సెంటర్" గురించి, దానిలో జరిగే పరిశోధనల గురించి చెప్పాడు. ఆ తరువాత ముక్తేశ్వరుడి దర్శనం చేయించి స్థల పురాణం  కూడా చెప్పాడు.

అతను చెప్పినవన్నీ ఆసక్తిగా వింటూ, ఇన్ని విషయాల గురించి ఎంత అనర్గళంగా మాట్లాడుతున్నాడో అని ఆశ్చర్యపోతూ ఆ గుడి దగ్గర ఉన్న ఒక పెద్ద బండ రాయి మీద సేద తీరుతూ సంతోష్ తో మాటలు కలిపాము. సంతోష్ అక్కడకు దగ్గరగా ఉన్న ఒక గ్రామంలో నివసిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెదబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. చిన్న అమ్మాయి ఆరోక్లాసు చదువుతోంది. పెళ్ళయిన కొత్తల్లో, సంతోష్ ఢిల్లీ లో కొన్నాళ్ళు పనిచేసి నగర జీవితంలో మనశ్శాంతి లేక, రోజు గడవడానికి సరిపోయే డబ్బు రాక తన గ్రామానికి తిరిగి వచ్చేసాడు. అప్పటినుండీ ఈ గైడింగ్ వృత్తిని చేపట్టి జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ వృత్తిలో మంచి సీజన్లో రోజుకి అధికం 500-600 వస్తాయి. సీజన్ లేనప్పుడు 100 రావడం కూడా గగనమే. సంతోష్ కి తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన ఒక ఇల్లు ఉంది. తనబోటి వాళ్ళందరూ ఇలా వారసత్వం గా వచ్చిన ఇళ్ళను, పొలాలను అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో వ్యాపారలు చేసి లాభాలు గడించారు. వ్యాపారాలు చేసి దివాలా తీసినవారూ ఉన్నారు. వ్యాపారానికి తను పనికిరానని సంతోష్ కి నమ్మకంగా అనిపించిందిట, అందుకే అందులోకి దిగలేదు. ఉండడానికి ఇల్లు ఉంది, కానీ తిండానికి తగినంత తిండి మాత్రం రోజూ దొరకదు. ఈ పరిస్థితి చూసి ఎంతోమంది సలహాలిచ్చారుట...ఎన్నాళ్ళు ఇలా కష్టపడతావు? నీకున్న ఇల్లు అమ్మేసి వ్యాపరంలోకి దిగు, డబ్బు ఆర్జించి ఇళ్ళ పై ఇళ్ళు కట్టు. ఆస్థులు పెంచుకో అని. మనకి చేతగాని విషయములో చెయ్యి పెట్టి వేళ్ళు విరుచుకోవడం అన్నంత బుద్ధి తక్కువ పనింకోటుండదు, నేను నా ఇల్లు అమ్మను అని చెప్పేవాడట వాళ్లకి. 

"అమ్మా...నా సిద్ధాతం ఒకటేనమ్మా! ఆస్థులు కూడబెట్టడం కాదు, నా పిల్లలని బాగా చదివించాలి. వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి అదే నా లక్ష్యం, నా సిద్ధాంతం. ఆస్థులు కూడబెట్టి ఏమి చేస్తాము? పిల్లలకి మించిన ఆస్థి ఇంకేముంటుంది! వాళ్ళు వృద్ధిలోకి రావడానికి నా రక్తమాంసాలు పణంగా పెట్టి కష్టపడతాను. వాళ్ళు చదువుకుని మా వంశంలో ఇంత చదువుని నింపితే చాలు. అదే నాకు ఆస్థి. ఇప్పటికి జీవితంలో నేను ఏర్పరచుకున్న సిద్ధాతం ఇదే. దీన్ని అనుసరించడానికే రేయింబవళ్ళు కష్టపడుతున్నాను." 

అని మెరిసే కళ్ళతో చెబుతున్న సంతోష్ వెనుక ఆ ముక్తేశ్వరుడు వచ్చి నిలబడ్డాడా అనిపించింది నాకు. గుండె నిండిపోయింది. కళ్ళలో తడి చేరింది.  అతని ముఖంలోని దృడనిశ్చయాన్ని, కళ్ళలో కనబడిన నిజాయితీని మనస్పూర్తిగా అభినందించాం.

సంతోష్ కుమార్ శర్మ పిల్లలిద్దరూ బాగా చదువుకుని, వృద్ధిలోకి వచ్చి వాళ్ళ నాన్న సిద్ధాంతాలని, ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తూ అతనికి ఇవ్వవలసిన దానికంటే కాస్త ఎక్కువే ఇచ్చి సెలవు తీసుకున్నాము. 

Tuesday, January 31, 2012

ఏదో...ఏదో నవీన భావం!

అమరసందేశం అన్న సినిమాలో శ్రీ శ్రీ విరచితమైన ఈ పాట నాకు ఎంతో ఇష్టం. ఈ పాటకి ఏ.ఎం రాజ ప్రాణం పోసారు అనే చెప్పొచ్చు. గొప్ప సాహిత్యానికి గొప్ప కంఠం తోడైతే ఆ పాట జనరంజకం కాక ఇంకేమవుతుంది! శ్రీ శ్రీ సాహిత్యం లోని అందం, లోతు, పదాల ఎంపిక అద్వితీయంగా ఉంటాయి.



http://www.oldtelugusongs.com/cgi-bin/search2/search.pl?mucode=P0087

పల్లవి:
ఏదో ఏదో నవీన భావం
కదిలించే మధుర మధుర గానం

చరణం:
సుమదళాల పరిమళాల తేటలలో
మయూరాల ఒయ్యారాల ఆటలలో
ఎలతుమ్మెద నెరతెమ్మెఱ మాటలలో

ఏదో ఏదో నవీన భావం
కదిలించే మధుర మధుర గానం

చరణం:
తలిరుటాకు మెఱుగుబాకు పదనులో
తరంగాల తురంగాల కదనులో
ఘనసాధనకొనసాగిన అదనులో

ఏదో ఏదో నవీన భావం
కదిలించే మధుర మధుర గానం

ఏదో సరికొత్త భావం కవిని కదిలిస్తోందిట. ఆ నూతన భావోద్వేగం కవి నోట తియ్యని గానాన్ని పలికిస్తోందిట. ఆ నవీన చేతన విరిబాలలపరిమళాలలో, నెమళ్ళు ఒలికించే నాట్య హొయలులో, తుంటరి తూనీగ గుసగుసలలో కనిపిస్తోందిట.

మొదటి చరణంలో ఆ నవీన భావం ఎక్కడినుండి వస్తోందో చెబుతుంటే రెండవ చరణంలో ఆ భావం నుండి ప్రేరణ పొందిన తన మనసు ఎలా ఉందో వివరిస్తున్నాడు కవి.

తలిరుటాకు మెఱుగుబాకు పదనులో
చిగురాకు లాంటి తన హృదయం పదునైన కత్తిలా మారినప్పుడు

తరంగాల తుఱంగాల కదనులో
ఘనసాధనకొనసాగిన అదనులో
సముద్రంలోని అలలు గుర్రాల్లా కదం తొక్కుతున్నప్పుడు...అదీ ఎలాంటి కదనుట? అలాంటి ఇలాంటిది కాదు...ఘనసాధన కొనసాగిన అదనులో..అంటే గుర్రాలు తీవ్రమైన సాధన చేస్తున్నప్పుడు ఎలా కదం తొక్కుతాయో అలా ఆ అలలు ఉవ్వెత్తున ఎగసిపడితే ఎలా ఉంటుందో అలా ఉందిట అతని మనసు.

ఎంత అందమైన వర్ణన!

ప్రకృతిలోని మృదువైన, మనోహరమైన అంశాలనుండి ఉద్భవించిన నవీన భావాన్ని గ్రహిస్తూ అతని మనసు కదన వేగంతో దౌడు తీస్తున్న గుర్రాలని ప్రతిబింబించే సముద్రపు అలల్లా తేజోభరితమై, ఉత్తేజితమై ఉందిట.

ప్రకృతి శోభను తిలకించిన ప్రతీ మనసు పులకించి అవ్యక్తమైన ఆనందాన్ని నింపుకుంటుంది. కొత్త ఉత్సాహాన్ని పెంపొందించుకుంటుంది. మనసులో విరిసిన ఆ సరికొత్త కాంతి, దానికి ప్రేరణ అయిన అంశాలంత సున్నితంగా ఉండదు. ఉద్వేగ భరితంగా ఉంటుంది..పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. నిజమే కదూ! ఎంత చక్కని భావన! ఇంతటి చక్కటి భావాన్ని తన అందమైన మాటల్లో ఎంత మధురంగా పొదిగారో శ్రీశ్రీ!

పైపాటకు అర్థాన్ని నేను సరిగా వివరించలేదు అనిపిస్తే ఎవరైన సవరించవచ్చు. నేనూ నేర్చుకుంటాను!

ఇంత గొప్ప సాహిత్యానికి మంచి సంగీతాన్ని అందించినవారు ప్రసాదరావు, కేల్కర్ అట. వీరు స్వరపరచిన ఇంకే సినిమా నాకు తెలీదు. కానీ అమరసందేసంలో మాత్రం మంచి మంచి పాటలున్నాయి. వినాలనుకున్నవారు ఇక్కడ వినొచ్చు.

http://www.sakhiyaa.com/amara-sandesam-1954-%E0%B0%85%E0%B0%AE%E0%B0%B0-%E0%B0%B8%E0%B0%82%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/



Friday, December 30, 2011

ఈ యేడాది (2011) -నేను-నా పుస్తకాలు

సంవత్సరం చివరికొచ్చేసరికి అందరూ సింహావలోకనం చేసుకుంటూ ఉంటారు కదా...నేనిప్పుడు అటువంటి కార్యక్రమాలు ఏవీ చేపట్టదలుచుకోలేదుగానీ ఈ యేడాదిలో నాకు బాగా సంతృప్తినిచ్చిన విషయం నేనెక్కువ పుస్తకాలు చదవడం, కొనుక్కోవడం. గత మూడు నాలుగేళ్ళుగా మూలన పడేసిన నా పుస్తక పఠనాన్ని తిరిగి ఆరభించాను. ఎలాగా ఏమిటి అన్నది ఇంతకుముందే నేను-నా పుస్తకాల గోల అంటూ అరిచి గీపెట్టాను. ఇప్పుడు మళ్ళీ అరవనుగానీ ఈ యేడదిలో నేను చదివిన పుస్తకాల్ను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందామని.

చదువులా, చావులా? - నామిని
ఈ పుస్తకం గురించి ఇదివరకే ఒక టపాలో కూలంకషంగా చర్చించాను. కార్పొరేటు విద్యా సంస్థల్లో చిన్నారులు ఎటువంటి కష్టాలు పడుతున్నారో, ఆటపాటలకు దూరం అవుతూ చదువు బరువును ఎలా మోస్తున్నారో కళ్ళకు కట్టినట్టు చెబుతూ తన అనుభవాలను పాఠకులతో పంచుకున్నారు నామిని. ఆ బుజ్జాయిల మనసుని తెలుసుకుంటే ఎంతో బాధగా అనిపించింది. మిగతా వివరాలన్నీ ఈ పోస్ట్ లో చదవొచ్చు.

కృష్ణవేణి - రంగనాయకమ్మ
రంగనాయకమ్మ గారు తన పంతొమ్మిదవ యేట రాసిన మొట్టమొదటి నవలకి ఫుట్ నోట్స్ ని జోడిస్తూ తిరిగి ప్రచురించారు. ఈ కథ అప్పట్లో జ్యోతిలోనో, ప్రభలోనో సీరియల్ గా వచ్చేదిట. కథలో చెప్పుకోదగ్గ గొప్ప విషయాలేమీ లేవుగాని ఆవిడ రాసిన ఫుట్ నోట్స్ కోసం ఈ పుస్తకం చదివి తీరాలి. ఎప్పుడో తన చిన్నప్పుడు రాసిన కథని తనే విశ్లేషించుకుంటూ, విమర్శించుకుంటూ ఆవిడ రాసిన విధానం అద్వితీయం. ఒక నలభై, యాభై యేళ్ళ తరువాత రచయిత్రి తన ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుతో, పరిణితితో తన పాత రచనను నిర్మొహమాటంగా విమర్శించుకోవడమనేది రంగనాయకమ్మగారికి ఉన్న గొప్ప గుణం. Hats off to you Madam! ఫుట్ నోట్స్ లో కూడా తన హాస్యశైలిని వదిలిపెట్టలేదు. చదువుతున్నంతసేపు బాగా నవ్వుకున్నాను.

మానవి, సహజ - ఓల్గా
సుజాతగారి ధర్మమా ఆని మొట్టమొదటిసారి ఓల్గా రచనలు చదివాను. మానవి, సహజ రెండూ విలక్షణమైన రచనలు. రెండూ స్త్రీవాద రచనలే. స్త్రీకి తనదైన వ్యక్తిత్వం ఉండాలని, పెళ్ళి అయినా కూడా భర్త, పిల్లలే కాకుండా తనకంటూ ఇష్టాయిష్టాలను కలిగి ఉండాలని చెప్పే నవలలు.

సహజ విషయానికొస్తే నలుగురు చిన్ననాటి స్నేహితురాళ్ళు- పెళ్ళయ్యాక వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులు. సహజ తప్ప మిగతా ముగ్గురు పెళ్ళి వల్ల తమ తమ వ్యక్తిత్వాలను కోల్పోయి జీవచ్ఛవాల్లా బతుకుతున్నవాళ్ళే. ఎన్నో యేళ్ళ తరువాత నలుగురు కలుసుకోవడం వారి జీవితాలను చూసి సహజ ఆశ్చర్యపోవడము, పెళ్ళి అంటే వ్యక్తిత్వం కోల్పోవడం కాదని మెత్తగా చివాట్లు పెడుతూ తన ఇద్దరు స్నేహితురాళ్ళ ఆలోచనా విధానంలో మార్పు తేగలగడం ఇదీ కథ. స్నేహితురాళ్ల మధ్య జరిగే వాదోపవాదాలు, సహజకి తన భర్తకి మధ్య జరిగే చర్చలు ఎంతో ఆలోచింపజేస్తాయి. సహజ ఉద్యోగం చేసుకుంటూ తన మనసుకి నచ్చిన ప్రసాద్ ని పెళ్ళి చేసుకుంటుంది. ప్రసాద్ స్వతహాగా మంచివాడు. భార్య భర్తలలో ఎక్కువ తక్కువలు లేవని, ఇద్దరూ సమానమేనని మనస్ఫూర్తిగా నమ్మినవాడు. పెళ్ళయ్యాక అలాగే మెలుగుతాడు కూడా. ఇద్దరూ ఉద్యోగస్థులు అవ్వడం వలన సహజ, ప్రసాద్ కూడా ఇంటి పనులలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తుంటారు. అయితే ప్రసాద్ కి ఒక పెద్ద చిక్కొచ్చిపడుతుంది. తను అందరి మగవాళ్లలా కాకుండా మంచి భర్తగా మెలుగుతూ సహజకి ఇంటి పనుల్లో కూడా సాయం చేస్తూ ఉన్నాడు కదా, మరి సహజ ఇవన్నీ ఎందుకు గుర్తించడం లేదు? తనని మంచివాడుగానో లేదా ఉత్తమ భర్తగానో ఎందుకు గుర్తించడం లేదో అనుకుంటూ మధనపడుతుంటాడు. ఇంక ఆగలేక ఒకరోజు ఈ విషయాన్ని సహజ దగ్గర ప్రస్తావిస్తాడు. దానికి సమాధానంగా సహజ నవ్వుతూ చెప్పే మాటలే ఈ పుస్తకం లోని "Take away". అవి యథాతథంగా…
“నేనిన్నాళ్ళు నీ భార్యననుకోలేదు ప్రసాద్ నీకు అత్యంత ఆప్తురాలినన స్నేహితురాలిననుకున్నాను. స్నేహితులతో ప్రవర్తిస్తున్నటే ప్రవర్తిస్తున్నావు అనుకున్నానుగానీ నువు ప్రత్యేకంగా నన్ను మంచిగా, దయగా చూస్తూ నా కృతజ్ఞతను ఆశిస్తున్నావనుకోలేదు. ఎంత భ్రమలో ఉన్నాను! నేను ఆడదాన్ని ఏ హక్కులూ లేనిదాన్ని, బానిసను. నువ్వు మంచివాడివి. నీ బానిసకి అన్ని సహాయాలు చేసావు, దయగా చూసావు. అయినా ఈ బానిస తన యజమానిని గుర్తించలేదు. లోకంలో చాలామంది మగవాళ్ళు దుర్మార్గంగా ఉంటారు, నువ్వు అలా కాకుండా మంచివాడివనీ నీకు తెలుసు. కానీ నా సంగతేమిటి? నేను చాలా భ్రమల్లో ఉన్నాను. స్త్రీ పురుషులు సమానమనన్నట్లు ప్రవర్తించాను. నేను ఏ పురుషుడి కన్నా తక్కువదాన్ని అనుకోలేదు. ఏ పురుషుడైనా నా పట్ల దయగా ఉంటేనే తప్ప నా సమానత్వం సాధ్యం కాదనే విషయం నాకివాళ తెలిసింది. ఔను...సమాజంలో స్త్రీలంతా బానిసలుగా ఉన్నప్పుడు నాలాంటి ఒకరిద్దరు-మేం స్వేచ్ఛగా ఉన్నాం. పురుషులతో సమానులం అనుకోవటం ఎంత వెర్రితనం. అసలు బానిసలం అనే స్పృహ స్త్రీలకు రావాలి. ఇవాళ నాకు గొప్ప కనువిప్పు కలిగింది." అని వ్యంగ్యంగా చురక అంటిస్తుంది.
ఈ మాటలతో ప్రసాద్ కు, చదివే ప్రేక్షకులకూ కూడా జ్ఞానోదయం అవుతుంది. :)

ఇంక మానవి పుస్తకంలో భర్త, ఇల్లు, పిల్లలే లోకం అనుకుంటూ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఇంట్లో పనిమనిషిలా చాకిరీ చేస్తూ అదే జీవితం అనుకుని ఆనందంగా గడిపే ఇల్లాలి జీవితంలో సంభవించే పెనుమార్పులు, తరువాతి పరిణామాలే మానవి కథ. వసంత, భర్త, ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి తల్లిలాగే ఉంటుంది అన్ని కోణాలలోనూ. చిన్నమ్మాయి స్వతంత్ర్య భావాలు కలిగిన వ్యక్తి. వసంత అంటే ఇంట్లో అందరికీ ఇష్టమే. కాకపోతే రాను రాను తన వ్యక్తిత్వం త్యజించి, అభిరుచులను పక్కనబెట్టి ఒక పనిమనిషిలా మారిపోతున్న భార్యతో కాపరం చెయ్యడం దుస్సాధ్యమవుతున్న భర్త మరొకరిని ఆశ్రయిస్తాడు. తల్లిని అవసరాలకు వాడుకోవాలనే చూసే పెద్ద కూతురి చెర నుండి విడిపించి తల్లిని తనతో పాటే తీసుకువెళుతుంది చిన్న కూతురు. వసంత, చిన్న కూతురు, తన స్నేహితురాళ్ళు, వాళ్ల ఆశయాలు, ఉద్యమాలు అన్నిటిలో పాలుపంచుకుంటూ జీవితంలో తను ఏమి కోల్పోయిందో, తన వ్యక్తిత్వాన్ని ఎలా విడిచిపెట్టిందో మెల్లిమెల్లిగా గ్రహిస్తూ తనదైన వ్యక్తిత్వాన్ని సాధించి మానవి అవుతుంది. ఈ రచనలో మార్కిజం పాళ్ళు కాస్త ఎక్కువైనట్టు అనిపించినా చదవదగ్గ పుస్తకం.

కోమలి గాంధారం - మృణాళిని
స్వీట్ హోం తో చాలా పోలికలున్న చిన్న కథల సమాహారం. అన్ని స్త్రీవాద కథలే. కోమలి చాలా తెలివైంది. తన భర్తకి, తనతో పాటు పనిచేస్తున్న మగవాళ్ళకూ అవసరమైనప్పుడల్లా చురకలు అంటిస్తూ చాకచక్యంగా పనులను నెట్టుకొస్తూ ఉంటుంది. మొదట్లో బావున్నట్టు అనిపించినా కొన్ని కథలయ్యాక చాలా బోర్ కొట్టింది. నాకు నచ్చని విషయం ఏమిటంటే కోమలికి తన భర్త మీద అస్సలు గౌరవం లేదు. ఎప్పుడూ తీసి పారేస్తూ ఉంటుంది. ప్రేమించి పెళ్ళి చేసుకుని కాపురం చేస్తున్న భర్తని మరీ అంత హీనంగా, చులకన చెయ్యడం ఏమిటో నాకర్థం కాలేదు. స్వీట్ హోం తో పోల్చుకుంటే విమల, బుచ్చిబాబుని ఎంత వెక్కిరించినా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. అతను వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కించపరచదు. కానీ కోమలి అలా కాదు. ఇది నాకు కనిపించిన నెగటివ్ పాయింట్. పాజిటివ్ పాయింట్ ఏమిటంటే కోమలి, తన అత్తగారు రెగ్యులర్ అత్త-కోడళ్ళ సీరియల్స్ లాగ కీచులాడుకోకుండా చక్కగా కలిసిమెలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, మంచి స్నేహితురాళ్ళలా ఉంటారు. ఇది నాకు బాగా నచ్చింది.

కోతికొమ్మచ్చి - మూడు భాగాలు - ముళ్ళపూడి వెంకటరమణ
కోతికొమ్మచ్చి గురించి కొత్తగా చెప్పేదేముంది. పసందైన విందు భోజనంలాంటి రచన. మెల్లిగా చదువుతూ ప్రతీ వాక్యాన్ని ఆస్వాదిస్తూ, కాసేపు నవ్వుతూ, కాసేపు ఏడుస్తూ కొంత జీర్ణం చేసుకుంటూ, కొంత నెమరువేసుకుంటూ....ఇక్కడ తమిళంలో ఉన్న ఒక expression వాడాలనుంది...."రసిచ్చి, రుసిచ్చి, ఇనిచ్చి" చదివాను. అంటే రసాస్వాదన చేస్తూ, రుచిని అనుభవిస్తూ, తియ్యదనాన్ని నెమరువేసుకుంటూ చదివాను.

ఈ రమణ గారేంటో ఆయన కష్టాలను కూడా ఏదో కథ చెబుతునట్టు, ఆయనేకేం పట్టనట్టు చాలా మామూలుగా చెబుతారు. చదువుతున్న మనకే గుటక పడదు. తెల్లబోయి తేరుకుని కన్నీళ్ళు పెట్టాలా, వద్దా అన్న మీమాంసలో ఉండిపోతాం. కళ్ళు మాత్రం మనమాట వింటాయేంటి...మెదడు ఏదో ఆలొచిస్తుందిలే మనం కన్నీళ్ళు కార్చేద్దాం అంటూ నీళ్ళకుండల్ని జారవిడుస్తాయి. తెప్పరిల్లే టైము కూడా ఇవ్వకుండా వెనువెంటనే నవ్వించేస్తారు. ఈయన మాత్రం అసాధ్యులు, నిజంగా! ఆయన రచనావ్యాసగం, ఉద్యోగం, సినిమ అనుభవం కడురమణీయంగా ఉన్నాయి. మూడు భాగాలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చదివాను.

అతడు అడవికి జయించాడు - డా. కేశవరెడ్డి
పట్టుమని వంద పేజీలు కూడా లేని పుస్తకం...పొద్దున్నుండీ, సాయంత్రం వరకూ ఒక ముసలాడి జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు - అంతే కథ. చెప్పడానికి ఇంత సులువుగా ఉందిగానీ ఆ తొంభై పేజీలలో జీవిత పరమార్ధాన్ని చూపించారు. పందులను పెంచుకునే ఒక ముసలివాడు, అతని మనవడు, రెండు సుక్క పందులు - ఇవే కథలో పాత్రలు. ఒకరోజు సాయంత్రం ముసలివాని మనవడు మేతకు తీసుకువెళ్ళిన రెండు పందుల్లో ఒకదానితో మాత్రమే తిరిగొస్తాడు. రెండో పంది - కడుపుతో ఉన్నది తప్పిపోయిందని తెలుసుకున్న ముసలివాడు దాన్ని వెతుక్కుంటూ అడవిలోకెళ్ళి, రాత్రంతా అక్కడ గడిపి మర్నాడు తెల్లారాక ఇంటికి తిరిగొస్తాడు. అయితే సుక్క పంది దొరికిందా లేదా? అతని జరిపిన పోరాటం ఏమిటి? అన్నదే మొత్తం కథ. జీవనము- మరణము, సంతోషం-దుఃఖము, నిశ్చలత-అనిశ్చలత, ఆశ-నిరాశ, జయము-అపజయము, నిర్వేదం-స్థితప్రజ్ఞత, అన్వేషణ-అస్థిత్వ సంఘర్షణ...ఒకటేమిటి, వీటన్నిటి గురించీ ఉంది. మొత్తం జీవితం యొక్క తత్వాన్ని ఆ చిన్న కథలో బంధించారు. చెప్పాలంటే చాలా హెవీ డోస్. ఒక్కటి మాత్రం అర్థమయ్యింది. ఈ పుస్తకం ఒకసారి చదివి పక్కనపెట్టేసేది కాదు. కొంచం కొంచం మెల్లిగా చదువుతూ, అర్థం చేసుకుంటూ, ఆలోచిస్తూ దానిలో మమైకమైపోతేగానీ పరమార్థం బోధపడదు. చాలా బరువైన రచన. భాష కొంచం కొత్తగా ఉండి నలగడానికి కాస్త సమయం పట్టిందిగానీ భావం నలగడానికి మాత్రం చాలా సమయమే పట్టేట్టుంది. ఇది పూర్తిచేసేసరికి ఏమిటో నేను వేదాంతంలో పడిపోయాను..ఎంతోసేపటికిగానీ తేరుకోలేదు. ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది.

వెన్నెల్లో ఆడపిల్ల - యండమూరి వీరేంద్రనాథ్
ఆ మధ్య యండమూరి నవలల గురించి బ్లాగు/బజ్జు మితృలతో ఓ పెద్ద చర్చ జరిఒగింది. యండమూరిని ని మరీ అంత తీసిపారేయక్కర్లేదు, కొన్ని చదవాల్సినవి ఉనాయి అన్న మితృల సలహా మీదట మళ్ళీ వెన్నెల్లో ఆడపిల్లతో మొదలెట్టాను. ఒక చెస్ క్రీడాకారుడు, అతన్ని అజ్ఞాతంగా ప్రేమిస్తూ కవ్వించే ఒక ఫోనమ్మాయి. ఆ అమ్మాయిని కనిపెట్టడానికి అతనికి క్లూలిస్తూ ఉంటుంది. అతను కనిపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని ప్రయత్నం ఫలించిందా, ఆ అమ్మాయి కనిపెట్టాడా లేదా అన్నది కథ చదివి తెలుసుకోవాల్సిందే. మొదట్లో ఓ 20 పేజీలకవరకూ కథ బాగానే నడించింది. పాత్రల పరిచయం అదీ బాగానే ఉంది. ఆ పిల్ల ఇచ్చే పజిల్స్ అవీ తమాషాగా అనిపించాయిగానీ కాసేపయ్యేటప్పటికి బండి అస్సలు ముందుకి నడవలేదు. నాకు ఆ పజిల్స్ గోల చాలా ఎక్కువైపోయింది అనిపించింది. నిక్కుతూ నీల్గుతూ మెల్లిగా నడిపించాను మొత్తానికి. అయితే మధ్యలో జేమ్స్ పెళ్ళి గురించి జేమ్స్ మనస్తత్వ విశ్లేషణ మొదలయినదగ్గరనుండీ బాగుందనిపించింది. ఆఖరాఖరుకి ఆ పజిల్స్ ని ఆ తెలివితేటల్ని చాలా ఎంజాయ్ చేసాను. కానీ చివరికి అలా జరగడం నాకెందుకో నచ్చలేదు. ఒక్క నెల రోజులు బతికే అమ్మాయి తన కాలక్షేపం కోసం నిండు నూరేళ్ళు జీవించే ఒక అబ్బాయి జీవితంలో చిచ్చు రేపడం సమంజసంగా లేదు. ఆ పిల్లకేం, ఎలాగూ పోతుంది కానీ ఆ అబ్బాయి ఇకపై బతకాలి...అది కష్టం కదా! ఆ పజిల్స్, కథ నడిపించిన తీరు బాగుంది అనిపించింది. అయితే మళ్ళీ మళ్ళీ చదివే నవల మాత్రం కాదు.

సాయంకాలమైంది - గొల్లపూడి మారుతీరావు
నాకు అస్సలు అస్సలు నచ్చలేదు అన్నది చిన్న expression అవుతుంది. ఏ కాలానికీ, ఏ సంఘానికీ పనికిరాని, అవసరంలేని కథ ఇది అనిపించింది. పోనీ కొత్తగా ఏదైనా నేర్చుకుందామా అంటే అదీ లేదు. పోనీ నిజాయుతీగా, చిత్తశుద్ధితో అనుకున్నది అనుకున్నట్టుగా రాసారా అంటే అదీ లేదు...రంగులు పులిమి, కంటి తుడుపు కోసం అక్కర్లేని పాత్రలు ప్రవేశపెట్టడం. పోనీ వర్ణనలను, రచనాశైలిని మెచ్చుకుందామా అంటే ఉహూ మనసొప్పట్లేలేదు.

సదాచారసాంప్రదాయాన్ని పాటించే ఒక వైష్ణవుల కుటుంబం. నాలుగో తరం నుండి వారింట్లో వచ్చే మార్పులు. పిల్లాడు పైచదువుల కోసం అమెరికా వెళ్ళడం. అమ్మాయి వేరే కులస్థుడిని పెళ్ళి చేసుకోవడం. తద్వారా ఆ దంపతులు ఎలా బాధపడ్డారు - ఇదీ కథ.

ఏ రకంగానూ నచ్చలేదు నాకు. కొన్ని వర్ణనలైతే రోత పుట్టించాయి. నవనీతాన్ని ఒక దరిద్రుడు రేప్ చేస్తుంటే కోపంతో ఆ అమ్మాయి వాడిని సగం విరిగిన సీసాని తూట్లు తూట్లుగా పొడుస్తుంటుంది. అయినా కూడా వాడు పట్టు విడువడు. అప్పుడు "కూలిపోతున్న యోధుడు శరీరమంతా బుల్లెట్లు తూట్లు పొడిచినా ఆఖరి తూటా పేల్చి ఒక్క శతృవునైనా కబళించి పోతాడు. దేశభక్తి, బాధ్యత, కర్తవ్యనిరతి వీటన్నిటినీ మించిన అతీంద్రియశక్తి శరీరంలో సమీకృతమవుతుంది. కడుపులో, గుండెల్లో, ముఖం మీద సీసా గుచ్చుకుని రక్తం కారుతున్నా పొన్నయ్య ఆ అందమయిన శరీరానికి అఖరి నివాళి సమర్పించి ఆమె కౌగిలిలో ప్రాణం వదిలాడు." యుద్ధంలో యోధుడికి, రేపిస్ట్ కి పోలికా? ఇంతటి జుగుప్సాకరమైన వర్ణనని నేనింతవరకూ చదవలేదు, నిజంగా.

అలాగే ఒక వైష్ణువుడికి, క్రిస్టియన్ కి పుట్టిన అమ్మాయిని కలుపుమొక్కతో పోల్చడం....దారుణం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అందులో.

సమాజం మారుతోంది, నిజమే. అలా మారడం పై రచయిత ఏ మాత్రము గౌరవము లేనట్టు అనిపించింది. నన్నడిగితే అలా మారడం చాలా గొప్ప విషయం. ఈ సమాజపు అభివృద్ధికి సంకేతం.అయినా కుటుంబాలలో మార్పు అన్నది ఒక్క వైష్ణవ కుటుంబానికే పరిమితం కాదు. అన్ని కులాలలోనూ ఈ మార్పు జరిగింది. ఎవరి పరిధుల్లో వాళ్ళు సంప్రదాయపు బంధాల నుండి బయటపడ్డారు, పడుతున్నారు. ఈ మార్పు మంచిదే కదా. సంప్రదాయాలు, సదాచారాలు కాలానుగుణంగా మారుతాయి, మారాలి. కానీ అదేదో మహాఘోరాపరాధం అన్న భావన కలిగించారు రచయిత ఈ పుస్తకంలో. అంతే కాకుండా ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన భారతీయులపై ఏ మాత్రమూ గౌరవము లేకపోవడం. వాళ్ళేదో తల్లిదండ్రులను వదిలేసి వారి సుఖం వారు చూసుకున్నట్టు, పై దేశం వెళ్ళగానే అన్నీ వదిలేసుకున్నట్టు చిత్రీకరించారు. అది చాలా అన్యాయంగా తోచింది నాకు.

ఈ పుస్తకం గురించి ఎంత తక్కువ చెపుకుంటే అంత మంచిది.

పాకుడు రాళ్ళు - డా. రావూరి భరద్వాజ
500 పేజిల పుస్తకం. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోయిన్ల కథ - వాళ్ళు పడే కష్టాలు, ఆ పరిశ్రమలో ఉండే రాజకీయాలు, కుళ్ళు, కుతంత్రాలు. చదువుతున్నంతసేపు ఎంత అసహ్యం కలుగుతుందంటే సినిమా అంటే విరక్తి కలుగుతుంది. ముఖ్యంగా హీరోయిన్ అవ్వాలనుకుని వచ్చేవాళ్ళ దయనీయ పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు రాసారు. ఈ పరిశ్రంలో ఆడది అంటే అంగడిబొమ్మ. పనికావాలంటే పక్కలోకి చేరాల్సిందే. ఈ పుస్తకం 1990 లో రాసారు. అంటే అప్పటివరకూ సినిమా పరిశ్రమలో జరిగిన సంఘటనలపై పరిశోధన చేసి రాసి ఉంటారు. అసలు అవి ఎంతవరకు నిజమో తెలీదుగానీ అలా జరిగి ఉంటుంది అన్న ఊహే గొప్ప భయంకరంగా అనిపించింది. మనకు తెలిసిన హీరోయిన్లను ఆ స్థితిలో ఊహించుకోవడానికి భయం వేసింది. అసలు ఊహించుకోవడం అసాధ్యం అయ్యింది. నమ్మబుద్ధి కాలేదు. ఏంటో బాధనిపించింది, ఏడుపొచ్చింది కూడా. ఇంకా 100 పేజీలు మిగిలున్నాయి. ఈ యేడాది లోపల అనగా రేపటి లోపల పూర్తిచెయ్యాలనుకుంటున్నాను :)

వైట్ టైగర్ - అరవింద్ అడిగా (ఇంగ్లీషు)
ఇంగ్లీషు సాహిత్యం..ఈ యేడాదిలో ఈ ఒక్కటే చదివాను. ఢిల్లీ లో ఉండే కారుడ్రైవర్ల దయనీయ పరిస్థితిని వివరించే గొప్ప రచన. మూడేళ్ళు ఢిల్లీ లో ఉంటూ కారు డ్రైవర్ల జీవన విధానాన్ని పరిశీలిస్తున్నానేమో నన్ను గొప్పగా కదిలించిది ఈ పుస్తకం. ఎక్కడో బీహార్ లో పుట్టి, తిండికి గతిలేక, ఒక్కడు పని చేసినా చాలు ఇంటిల్లిపాదీ కనీసం రెండు-మూడు రోజులకైనా తింటారు అనుకునే పరిస్థితులలోనుండి కారు డ్రైవర్లుగా నెలకి రెడు-మూడు వేల రూపాయల జీతానికి ఢిల్లీకి వస్తారు. యజమానులు వాళ్ళని కుక్కల కంటే హీనంగా చూస్తారు. అడుగులకు మడుగులు ఒత్తిస్తారు. నిస్సారమైన జీవితాన్ని గడుపుతూ, మనిషిని అన్న విషయమే మరచిపోయి బతుకులీడుస్తున్న కారు డ్రైవర్ల కష్టాలను కళ్ళకు కట్టినట్టుగా రాయడంలో అరవింద్ సఫలమయ్యారు. ప్రతీ ఒక్కరు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.

ఇవే కాకుండా కినిగె ద్వారా గిఫ్ట్ గా పుచ్చుకున్న పుస్తకాలు సెబాసురా శంకరా, తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు చదివాను. రెండూ అద్భుతమైన రచనలు. ఇంకా కినిగె పుస్తకాలు కొన్ని ఉన్నాయి. చదవాలి.

మొత్తానికి ఈ యేడాది నా పుస్తకపఠనము సంతృప్తికరంగానే ఉంది. ఒకే ఒక్క చిన్న అసంతృప్తి ఏమిటంటే ఇంగ్లీషు సాహిత్యం ఎక్కువ చదవలేకపోయాను. చాలా పుస్తకాలు సగం సగం చదివి ఆపేసాను. ఈసారి అలా చెయ్యకూడదనుకుంటున్నాను. వచ్చే యేడాది ఇవి కూడా ఎక్కువ చదవాలి.

ఇక పుస్తకాల సేకరణ విషయంలో నేను అద్భుతంగా మరో అడుగు ముందుకేసాను. బోలెడన్ని పుస్తకాలు కొనుకున్నాను. బహుమతులుగా కొన్ని పుస్తకాలు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది నాకు.

2011 లో నేను కొనుక్కున్న పుస్తకాలు





ఇవి బహుమతులుగా వచ్చినవి

ఇవే కాకుండా కృష్ణవేణి, చలం-సత్యం, శైవం, సుందరం కూడా వచ్చాయి. మిధునం పుస్తకాన్ని శంకర్ గారు పంపించారు. వారికి కృతజ్ఞతలు. మిగతా పుస్తకాలన్నీ సుజాత గారు (మనసులో మాట) పంపించారు...ఆవిడకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. తనకి నేనెంతో ఋణపడిపోయాను. ఇంకా కినిగె పుస్తకాలు బహుమతిగా ఇచ్చిన రెహ్మాన్ ని, మురళి కి, నాగార్జున కి ధన్యవాదములు!

ఇవే కాకుండా మరికొన్ని కొన్నాను. కానీ అవి ఇంకా నాచేతికి రాలేదు కాబట్టి, వాటిని వచ్చే యేడాడి ఖాతాలో వేస్తున్నా.

ఈ పుస్తకపఠనాన్ని, కొనుగోలుని 2012 లో కూడా ఇదే విధంగా కొనసాగించాలని అనుకుంటున్నాను...చూద్దాం! :)


Monday, December 26, 2011

రాజన్న నాకు నచ్చింది

నాకు రాజన్న నచ్చింది

ముందుగా
ఇలాంటి ఆలోచనతో ముందుకొచ్చిన విజయేంద్రప్రసాద్ గారికి ఒక సెబాస్
ఈ సినిమా చేసిన నాగార్జున కి ఒక భేష్
మొత్తం సినిమాని భుజస్కందాలపై మోసిన కీరవాణికి జేజేలు.

దిక్కుమాలిన కాలేజీ ప్రేమలు, అడ్డం గా నరుక్కోవడాలు, వెకిలి కామెడీలు, వందమందిని ఇరగదియ్యడాలు లేవు.

కొత్తగా, హాయిగా పోరాటవీరుడి చరిత్ర ఉత్తేజం కలిగించేలా ఉంది. మనకి ఇటువంటి కథలు సినిమాలుగా ఇంకా ఇంకా రావాలి.

ఈ సినిమాకి ప్రాణం కీరవాణి సంగీతం. పాటలు చాలా బావున్నాయి. నేపథ్య సంగీతం అంతకంటే బావుంది. నేపథ్య సంగీతం మాత్రం రికార్డ్ దొరికితే బాగుందును. రికార్డ్ వింటున్నప్పుడు "అమ్మ అవని" పాట బాగా నచ్చింది కానీ సినిమాలో ఇది mis fit అనిపించింది. రాజన్న పాడిన పాటలైనా పోరాటపటిమను నింపే జానపదాలు, మల్లమ్మ పాడిన పాటలు అందమైన జానపదాలు. చివరికి సడన్ గా వచ్చి మల్లమ్మ కర్నాటక సంగీతం పాడితే ఎలా? ఒక ఉద్వేగభరితమైన జానపదం....నేలమ్మతల్లి మీద...పెడితే ఇంకా రక్తి కట్టి ఉండేది. "వెయ్ వెయ్యరా వెయ్" పాటకి రోమాలు నిక్కబొడుచుకున్నాయి నిజంగానే.

బాగా కదిలించిన దృశ్యం రాజన్న వెనక్కి తిరిగొచ్చినప్పుడు ప్రాణం లేని పసిబిడ్డని ఒళ్ళో పెట్టుకుని "గంగా మేలుకో" అని పాడే పిచ్చి తల్లి ఆవేదన. ఈ దృశ్యం ఒక్క కుదుపు కుదిపి పారేసింది.

అలాగే మల్లమ్మా రాజన్న సమాధిగా భావించే తులసికోటకి ఆకర్షితురాలు అవుతున్నాది అని గమనించి, భయపడ్డ ముసలితాత "అక్కడికి వెళ్ళొద్దు దెయ్యాలుంటాయని" మల్లమ్మని భయపెడతాడు. మల్లమ్మ భయపడి తాతని పట్టుకుని నిద్రపోతుంది. కానీ మధ్య రాత్రిలో తాత లేచి చూస్తే మల్లమ్మ రాజన్న సమాధి దగ్గరే కూర్చుని ఉంటుంది. అప్పుడు బ్యాక్ గ్రౌండ్ లోఅపుడు ఒక పాట వస్తుంది...."చెడు మనసులో ఉన్న మనుషులకన్నా పెద్ద దెయ్యాలు లేవని రాజన్న చెబుతున్నాడో ఏమో" అన్న అర్థం లో వస్తుంది. చాలా బావుంది ఆ చిన్న బిట్.

ఒక పెద్ద అసంతృప్తి నాకు కనిపించింది ఏమిటంటే రాజన్నలాంటి ఉద్యమకారులు ఎందరో పుట్టారు ఆ సమాజంలో. ఇది ఒక వ్యక్తి తెచ్చిన విప్లవం కాదు. ఈ ఉద్యమాన్ని కొందరు వ్యక్తులు, కొన్ని తరాలు నడిపించారు...రజకార్లని ఎదిరించారు. కానీ ఇందులో రాజన్న ఒక్కడే ఎదిరించినట్టు, రాజన్న పోయక మళ్ళీ వాళ్ళ బతుకులు రజకార్ల కిందన నలిగిపోయినట్టు చూపించడం కొంత నచ్చలేదు. రాజన్న ఇచ్చిన స్ఫూర్తి కొన్ని తరాలకి కంటిన్యూ అయ్యింది అన్నటు చూపించి ముగిస్తే బావుండేది. అనవసరంగా నెహ్రూ గారిని తీసుకొచ్చి, ఎలా ముగించాలో తెలియక ముగించినట్టు అనిపించింది.

నాగార్జున డైలాగ్ డెలివరీ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుందును. చిన్నపిల్ల మల్లమ్మ నడిచి ఢిల్లీకి వెళ్ళడం అస్సలు నప్పలేదు. అదిలాబాదు నుండి ఢీల్లి కి వెళుతూ పంజాబ్ ని, రాజస్థాన్ ని ఎందుకు టచ్ చేసిందో తెలీదు.

మల్లమ్మగా ఏనీ, స్నేహ, రాజన్న నలుగురు మితృలూ, మల్లమ్మ ని పెంచిన ముసలోడు, దొరసానిగా వేసిన శ్వేతా మీనన్....అందరూ బాగా నటించారు.

నాకు బాగా నచ్చిన విషయమేమిటంటే రాజన్న ఊరికి వచ్చిన తరువాతా రజకార్లను, వారి కింద పనిచేసినవారినీ ఒక్క దెబ్బతో ముక్కలు ముక్కలుగా నరికేయలేదు....అందరికీ అండా దండా నేనేనంటూ ఒంటరిగా అందరినీ చావచితగ్గొట్టలేదు...రాఖీ సినిమాలోలాగ. ప్రజలలో పోరాట స్ఫూర్తిని నింపుతూ, కావలసి వచ్చినప్పుడు నడుం బిగించి పోరాటానికి దిగిన రాజన్న పాత్ర మలచిన తీరు చాలా బావుంది.

సినిమాలో హేమాహేమీలైన నటులున్నారు. వారందరీ పాత్రల నిడివి బాగా తగ్గినట్టనిపించింది. పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. అలాగే దొరసాని పాత్రధారి శ్వేతా మీనన్ ని కూడా పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు అనిపించింది. పుర్తిగా సంతృప్తినిచ్చిన పాత్రలు ముసలి తాత, మల్లమ్మ మాత్రమే. ఎందుకో సినిమా complete అని అనిపించలేదు. అయినా సరే నాకు నచ్చింది. మంచి సినిమా చూసాం అనిపించింది.

ఈ సినిమాలో లోపాలు లేవని కాదు, కానీ ఇటువంటి సినిమాలకి ఇది ముందడుగు అయితే బావుంటుంది. అయితే దీన్ని ఇంకా చాలా గొప్పగా తీసి ఒక చరిత్ర సృష్టించగలిగిన golden chance మిస్ చేసుకున్నారనిపించింది. ఏది ఏమైనా ఇది మన తెలుగు సినిమాలకి స్ఫూర్తి ని అందించగలిగితే అంతకన్నా ఇంకేం కావాలి.



Wednesday, December 14, 2011

పొట్టి నవ్వులు - BUZZ సీరీస్ 1

ఆమధ్య బజ్జులొచ్చి బ్లాగులని మింగేసాయని కొందరు...లేదు, కాదు బజ్జుల వల్ల మంచే జరిగింది అని నాలాంటి వారు కొందరు చిన్న చిన్న వాక్బాణాలు విసురుకున్నాం కద! సుజాతగారైతే (మనసులో మాట) ఏకంగా బజ్జా? బ్లాగా? అని పోస్ట్ కూడా పెట్టేసారు.

ఇప్పుడేమో గూగలోడు బజ్జు మూసేస్తున్నానొహో అని ప్రకటించేసాడు. మా అందరికీ ఒకటే ఏడుపొచ్చేసింది. సరే ఇంక చేసేది ఏమీలేక బజ్జులో జరిగిన కొన్ని సరదా విషయాలు బ్లాగులో పంచుకుందామనే మొదటి ప్రయత్నం ఇది.

బజ్జు సీరీస్-1

"మన గురువుగారు బులుసుగారు ఒకరు తిన్నగా ఉండరు కదా...ఎప్పుడో ఏదో ఒకటి చెప్పి మనల్ని నవ్విస్తూ ఉంటారు. ఇప్పుడేమి చేసారంటే...నవ్వులని కుదించారు....బ్లాకెట్ల కొలతలు కొలవలేక విసుగొస్తున్నాదట అందుకని. సరే గురువుగారు కదా అని రాజ్, నేను చేతులు కలిపాం. "తెలుగులోనే నవ్వుదాం. బ్రాకెట్లలో వద్దు" అన్న నినాదం తో పని మొదలెట్టాం. అదెట్లనిన.....

చి.న = చిరునవ్వు
మ.హా = మందహాసం
ద.హా = దరహాసం
అ.హా = అట్టహాసం
వి.టా.హా = వికటాట్టహాసం
బా.హా. = బాలయ్య హాసం
సు.చి.న = సుమన్ చిరునవ్వు
రా.న = రాక్షస నవ్వు
కో.న - కోతి నవ్వు
బి.న = బిస్కట్ నవ్వు (అర్ధం కాలేదా? మీ పెట్ డాగ్ ముందు కూర్చొని బిస్కట్ తింటూ దాని వైపు చూడండి..యెస్..అదే ..)

ఇంకా మీకేమైనా తడితే కలుపుకోవచ్చు.

మా గురువుగారు ఇకనుండి ఇవి మాత్రమే ఉపయోగిస్తానని శపధం చేసారు. వారి శిష్యులలో అగ్రగణ్యులమైన మేము (అదంతే మమ్మల్ని మేమే పొగుడుకుంటాము :P)...వారి అడుగుజాడలలోనే నడవాలని నిశ్చయించుకున్నవారమై ఇవే ఉపయోగించబోతున్నాం. మరి మీరు?"

ఈ విధంగా మొదలయ్యిందండీ బజ్జులో ఈ పొట్టినవ్వుల ప్రహసనం...అంతే ఇంక మన జానాలు విజృంభించారు చూడండీ...నేనేం చెప్పను, మీరే చదవండి :)

దు.హా = దుఃఖహాసం (సుమన్ బాబు సినిమాలు చూసేటప్పుడు వచ్చేది)
పి.న - పిచ్చి నవ్వు (సుమన్ బాబు సినిమా చూసిన తరువాత వచ్చేది)
ప.న = పగలబడి నవ్వు
వె.న1 = వెకిలి నవ్వు
న.న.న - నవ్వలేక నవ్వే నవ్వు
కిం.ప.దొ.న కింద పడి దొర్లే నవ్వు (ఇది పాతదే, కొత్తగా కలుపుతున్నా)
ఎ. న - ఎదవ నవ్వు. (మన మ్యానేజరు ని చూసి నవ్వేది)
శు.హా = శుష్క హాసం
కె.న = కెవ్వు నవ్వు
ఏ.న = ఏడవలేక నవ్వు
పొ.ప.న = పొట్ట పగిలేటట్టు నవ్వు
ఏ. న. న = ఏడ్చినట్టు నవ్వే నవ్వు (మన హీరో సుమన్ బాబు లాగా)
కొం.న = కొంటె నవ్వు
చ.న.న = చచ్చినట్టు నవ్వాల్సిన నవ్వు (బాసు జోక్ కి మనం నవ్వే నవ్వు)
అ.భ.అ.పూ.న = అవమాన భరిత అవహేళనా పూర్వక నవ్వు (దుర్యోధనుని చూచి ద్రౌపది నవ్విన నవ్వు)
దీన్నే
కొం.కూ.న/కొం.అం.న = కొంపలు కూల్చే/అంటుకునే నవ్వు అని కూడా అనవచ్చు.

వె.న2 = వెర్రి నవ్వు
టి.అ.న = టివీ అనౌన్సర్ నవ్వు
చిపి.న = చిలిపి నవ్వు
వి.న = వికీ నవ్వు (మన నవ్వుకి ఎవడో వివరణ ఇస్తే అది వికీ నవ్వు)
అ.న.న = అనుమానంగా నవ్వే నవ్వు
ఏ.పో.మ.న = ఏడుస్తూ పోనీ మన మంచికే అనుకునే నవ్వు
అప.హా = అపహాస్యం
అ.భ.అ.పూ.న = అవమాన భరిత అవహేళనా పూర్వక నవ్వు

ఈ అ.భ.అ.పూ.న వెనుక చిన్న కథ ఉంది. నేను పోస్ట్ వేస్తున్నప్పుడు "గురువుగారి" అని రాయబోయి "గురువుగాడి" అని పొరపాటున రాసాను. అది చూసి బులుసు గారు ఒక వె.న నవ్వి "గాడి" అని చూసి నేను ఏ నవ్వు నవ్వాలి? అని అడిగారు. నేనందుకు ఇంకో చిన్న నవ్వునవ్వాననమాట. నేను నవ్విన ఆ నవ్వుకి గురువుగారు "అ.భ.అ.పూ.న" అని నామకరణం చేసారు. :D

ఇదయ్యాక బులుసుగారికి ఇంకో ఐడియా వచ్చింది అదేంటంటే: యథాతథంగా క్రిందన

"Bulusu Subrahmanyam - మరేమో నే ఇప్పుడేమో మనం శ్రీకృష్ణ రాయబారం నాటకం వేస్తామన్నమాట . మరేమో నే మీ అందరూ నన్ను బలవంత పెడితే, పెట్టండి మరి, నేను శ్రీకృష్ణుడి వేషం వేస్తానన్నమాట. ఎవరో కింద పడిపోయారు. లేపండి అక్కడే కాలుతుంది. మీరందరూ బలవంత పెడితే కదా నేనొప్పుకుంట. అప్పుడేమో నాటకం అయిన తరువాత, మీరందరూ నన్ను మెచ్చుకుంటూ నవ్వే నవ్వు ని మెహా అని కానీ మెన అనీకాని అనాలి కదా మరి.

sowmya alamuru - మెహా, మెన.....ఈ నవ్వునకర్థమేమి గురువర్యా??????????
మెంటల్ హాసం, మెంటల్ నవ్వు అని కాదుగదా (దొ.న)

Bulusu Subrahmanyam - మెచ్చుకుంటూ నవ్వే నవ్వు

Bulusu Subrahmanyam - సౌమ్యా.. కోప హాసం కో.హా"

అంటూ కోపాన్ని ప్రకటించారన్నమాట :) దానితో మె.న, కో.హా కూడా చేరాయి.

పై అన్ని నవ్వులను క్రియేట్ చేసినవారిలో ప్రముఖులు బులుసుగారు, రాజ్ కుమార్, శంకర్ గారు మరియు నేను. గిరీష్ కూడా కొన్ని నవ్వులు చేర్చారు.

ఇదిలా జరుగుతుండగా పప్పు శ్రీనివాసరావు గారు ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టు వచ్చారు. ఆయనొచ్చాక జరిగిన తమాషా సంభాషణ ఇక్కడ:

"pappu sreenivasa rao - ఎహే ఆపండీ గోల (ఎ.ఆ.గో)

Bulusu Subrahmanyam - వెన, ననన...అంటే శ్రీనివాస రావు గారూ గోలలకి స్థానం కల్పిద్దామా అని నా ఉద్దేశ్యం

sowmya alamuru - గోలలకి తావు లేదు...నవ్వులొక్కటే ఉండాలి

pappu sreenivasa rao - నవ్వుల గోలన్నమాట (న.గో)

Bulusu Subrahmanyam - కొంచె మార్చండి సారూ గోల నవ్వు - గోన సమూహం గా అందరూ కలిసి బలవంతాన నవ్వే నవ్వు అనుకుందామా హాస్య క్లబ్బుల్లో లాగా. "

అలా గో.న కూడా లిస్ట్ లోకి చేరిపోయింది.

ఇది ఇక్కడితో ఆగలేదు. ఇంక అందరూ బజ్జులో ఈ పొట్టినవ్వులనే ఉపయోగించడం మొదలెట్టారు. కొందరికిన్ని గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉండడంతో నేను మళ్ళీ ఒక పోస్ట్ వేసాను.

"బజ్జు జనాలందరికీ పొట్టి గుర్తులతో కాస్త తికమకగా ఉన్నదని వార్త అందింది...అంచేత ఇప్పటివరకూ పోగయినవాటన్నిటినీ క్రోడీకరించి ఇక్కడ పెడుతున్నా. ఇకనుండి మీకు ఎప్పుడు ఏ డౌటు వచ్చినా ఈ బజ్జుని రిఫరెన్స్ గా వాడుకోవచ్చు."

అంటూ మొత్తం అన్ని నవ్వులనూ ఒకచోట చేర్చాను. కథ అక్కడే ఆగిపోతే అది మన జనాలా అల్లరి ఎలా అవుతుంది? మళ్ళీ మొదలెట్టారు.

మె.హ = మెచ్చుకుంటూ నవ్వు
కో.హా = కోప హాసం
గో.న = గోల నవ్వు
బో.న = బోసి నవ్వు
తి.న = తిట్టుకుంటూ నవ్వు
తిం.న = తింగరి నవ్వు
క.గీ.న = కన్నుగీటుతూ నవ్వు
గొ.న = గొర్రె నవ్వు
ఆ.భా.న = ఆనందభాష్పాలతో నవ్వు
వి.న = విలన్ నవ్వు
పొ.న = పొగరుబోతు నవ్వు
హే.న= హేళనగా నవ్వు
గ.న = గర్వంతో నవ్వు
ద్రౌ.న. = ద్రౌపది నవ్వు
త.తా.న = తలకాత తాటిస్తూ నవ్వు

ఇంతలోనేమో వేణూ శ్రీకాంత్ వచ్చి అ.భ.అ.పూ.న కొంచెం గజిబిజి గా ఉందండీ.. దీన్ని ద్రౌ.న. (ద్రౌపది నవ్వు)గా మార్చాలని అభ్యర్ధించారు. అభ్యర్థనని మన్నించి అ.భ.అ.పూ.న ని ద్రౌ. న గా మార్చేసాం.

అలాగే తి.న, తిం. న నవ్వుల వెనుక కథ:

"Bulusu Subrahmanyam - ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాం. మనకి రావాల్సిన ప్రోమోషన్ పక్క వాడికి వచ్చింది. వెధవ, పార్టీ కూడా ఇస్తున్నాడు. అక్కడ మనం లోపల తిట్టుకుంటూ పైకి నవ్వే నవ్వు తినన తిట్టుకుంటూ నవ్వే నవ్వు. ఇది మరో రూపం లో వచ్చిందా సంపాదక మహాశయా.

sowmya alamuru - తినన రాలేదు గురువుగారూ...కలిపేస్తా ఇప్పుడే. దాన్ని తిన చేసేస్తా.

Bulusu Subrahmanyam - తింగరి నవ్వు తిన అని అనుకున్నట్టున్నాము

sowmya alamuru - తింగరి నవ్వు లేదు...అదీ కలిపేపెస్తా ....తిం.న"

ఈ గోల ఇలా జరుగుతుండగా V.B.సౌమ్య వచ్చి ఒక పొగడ్త విసిరారు.

"Sowmya V.B. - మీరు పదాల కూర్పే కాక, జనాల మధ్యలోకి తీసుకురావడానికి కూడా ఇతోధికంగా కృషి చేస్కుంటున్నారనమాట. (క.న - కన్నుగీటుతూ నవ్వు)"

ఈ క. న ని కొంచం మార్చి క.గీ.న గా లిస్ట్ లో పెట్టేసాం.

అలాగే వేణు శ్రీకాంత్, రెహ్మాన్, శ్రీనివాస్, సంతోష్, కల్లూరి శైలబాల, వరూధిని గారు, మధుర, కొత్తావకాయ, నైమిష్ గారు, అపర్ణ మున్నగువారందరూ వచ్చి ఇంకాసిన్ని పొగడ్తలు మామీద కురిపించి ఇతోధికంగా కొన్ని నవ్వులు కూడా చేర్చారు.

ఈ మొత్తం ప్రహసనం చూసి మా గురువుగారు ఆనందపరవశులై

"Bulusu Subrahmanyam - 67 ఏళ్లగా నవ్వుతున్నాను కానీ ఇన్ని నవ్వులున్నాయని ఇప్పుడే తెలిసింది.
సౌమ్య కి ధన్యవాదాలు"

అన్నారన్నమట :)

"sowmya alamuru - హహహ గురువుగారూ....అంతా మీ ఆశ్వార్వాదం...నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షి (ద.హా)"

అని గురుభక్తిని చాటుకున్నానన్నమాట :D

అదండీ గమ్మత్తైన పొట్టినవ్వుల కథ!

ఇంత గొప్ప ప్రయోగానికి తెర తీసిన బులుసు సుబ్రహ్మణ్యం గారికి అందరం కలిసి మరొక్కసారి జేజేలు చెబుదాం!

ఇకనుండీ మనందరం కూడా వీలైనంత వరకూ బ్లాగుల్లోనూ, బజ్జుల్లోనూ తెలుగులో నవ్వుదాం, ఏమంటారు? (చి.న)