చెన్నై నుండి తిరుచిరాపల్లి (తిరిచ్చి) కి ఐదు గంటలు ప్రయాణం రైల్లో. రాత్రి 9.00 కి ఎక్కి, అర్థరాత్రి 2.00 కి తిరుచ్చి లో దిగి ఆటోవాళ్ల సహాయంతో హొటేలు చేరుకున్నాం. మర్నాడు ఉదయాన్నే ఉపాహారం సుబ్బరంగా లాగించి శ్రీరంగం ప్రయాణం కట్టాం. తిరుచ్చి నుండి శ్రీరంగానికి ఏడు కిలోమీటర్లు మాత్రమే, కారులో అరగంట ప్రయాణం. శ్రీరంగం అసలు పేరు "తిరువారంగం". ఇక్కడ విష్ణుమూర్తి పడుకుని ఉంటాడు, రంగనాథుడి పేరుతో కొలవబడుతూ ఉంటాడు. అక్కడ తమిళ్ లో రాసిన కథని నేను అర్థం చేసుకున్న విధంబెట్టిదనిన......సముద్రమధ్యంలో ఉన్న విష్ణువుని బ్రహ్మ పూజిస్తూ ఉండేవాడట. ఆ విష్ణువుని, బ్రహ్మ కొందరు ఋషులకు (నాకు పేర్లు గుర్తు లేవు) ఇచ్చి నిత్య పూజలు జరుపమని చెప్పాడట. వారు ఇంకెవరికో ఇవ్వగా...అలా అలా తిరిగి తిరిగి ఇక్ష్వాకుల రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి యాగానికి వెళ్ళిన చోళరాజు ఆ విగ్రహాన్ని చూసి "అరే ఇది మా దక్షిణ భారతంలో దొరికిన విగ్రహం, ఇది మాది, మాకు ఇప్పించండి" అని వేడుకున్నాడట. "బెంగపడకు రాజా, ఇది మీకు చేరుతుంది" అని ఇక్ష్వాక మహారాజు అభయమివ్వగా" ఆనందహృదయుడై చోళరాజు తన రాజ్యమునకు మరల ఏతెంచను. రాముడు తన పటాభిషేకానంతరం విభీషణునికి ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వగా, సంతోషంతో అది తీసుకుని ఆయన శ్రీలంకకి పయనమయిరి. మార్గమధ్యంలో శ్రీరంగం లో విభీషణుడు, సూర్యుడుకి అర్ఘ్యం ఇద్దామని.......ఆ అదిగో మీ అందరికీ భూకైలాస్ సినిమా గుర్తొచ్చింది కదూ, అచ్చం అలానే ఆ విగ్రహం శ్రీరంగ పట్టణంలో భూమిలోకి దిగిపోయింది. బాధపడుతున్న విభీషణుడితో విష్ణువు అన్నాడట..."భయపడకు, బాధపడకు, నేనెప్పుడు నిన్ను కాచుకుంటూ ఉంటాను. నీ రాజ్యాన్ని ఓ కంట చూస్తూ ఉంటాను". అందుకే ఆ విగ్రహం చూపు శ్రీలంక వైపు ఉందిట. ఆ విగ్రహం కళ్ళు శ్రీలంకని చూస్తూ ఉంటాయట. ఈ గుడి ని 14-17 శతాబ్దాల మధ్యన కట్టారు. గోపురం ఎత్తు 236 అడుగులు. గుడి లోపల విగ్రహాం చాలా చాలా పెద్దది. నల్లగా, నిగనిగలాడుతూ కనులకు నిండుగా ఉంటుంది. ఏకశిలపై, ఆదిశేషువుపై పవళించే విష్ణుమూరిని చెక్కిన కళ చూసితీరవలసినదే. గుడి లోపల నేలపై తెలుగు లిపి కనిపించింది. చాలా చోట్ల తమిళంకన్నా ఎక్కువగా తెలుగు లిపి కనిపించింది. కాస్త అర్థమయీ అవనట్టు ఉన్నాది. అక్షరాలు చదవగలిగానేగానీ భావం బోధపడలేదు. చాలాచోట్ల గొలుసుకట్టు లో రాసి ఉంది. అక్షరాలు విడగొట్టడానికి కూడా కష్టపడవలసి వచ్చింది. ఇంకా గుడి లోపల శిల్పాలు కడు రమణీయంగా ఉన్నాయి. కంబర్ తను రాసిన రామాయణాన్ని (అదే కంబ రామాయణం) గానం చేసి, వినిపించే ప్రదేశం ఉంది. అది ఒక చిన్న మండపంలా ఉంది, అందులో నిలుచుని ఆయన గానం చేస్తూ ఉంటే చుట్టూ ప్రజలు కూర్చుని వినేవారట.

శ్రీరంగం గోపురం
ఈ గుడికి గల ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఇది కావేరీ నది ఒడ్దున ఉంది. ఇక్కడ ఉన్న కావేరికి పేరు "కొల్లిడం" అంటే "చంపబడిన ప్రదేశం (కొల్=చంపడం, ఇడం=ప్రదేశం)" అని అర్థం. ఈ గుడి కట్టాక, ఆ కట్టిన వాళ్ళని కావేరి మధ్యలోకి తీసుకెళ్ళి చంపేసారట. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. వారిని ఈ క్రింది ద్వారం గుండానే తీసుకెళ్ళారట అందుకని ఈ ద్వారానికి "పరమపద వాసల్" అని పేరు. అంటే పరమపద గుమ్మం అని అర్థం. గూడార్థం ఏమిటంటే....వారి కళను అక్కడితో నిలిపివేయడానికి చంపారని, వారిని గుడి ముందర పవిత్ర కావేరీ మధ్యలో చంపేసారు కాబట్టి వారు పరమపదం చేరే ఉంటారని, అలా వారిని పరమపదం చేర్చిన కావేరీ నది కి మొక్కాలని. ఈ ద్వారాలు తెరిస్తే కావేరి కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం విన్న, చదివిన వెంటనే అంతవరకూ అక్కడి కళాకృతులు చూస్తూ ఆనందిస్తున్న నాకు ఒక్కసారిగా ఒళ్ళు ఝల్లు మంది. భయం, బాధతో కంపించిపోయాను. చాలా ఘోరం, పాపం, అన్యాయం కదూ! ఆ గుమ్మానికి భక్తులు మొక్కుతూ, కావేరిలో భక్తితో మునుగుతూ ఉంటే నాకెందుకో ఏవగింపు కలిగింది. అలా మునిగితే వారూ చివరికాలంలో పరమపదం చేరుతారని వారి నమ్మకం.
ఇక్కడ కనిపించిన ఇంకో విచిత్రం: కింది ఫొటోలో మూడు చిన్న గదులు కనిపిస్తున్నాయిగా అవి చిన్న చిన్న గుళ్ళు. అందులో కొలువుతీరిన మూర్తులు బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు. ముగ్గురూ లింగాకారంలో ఉంటారు. చాలా ఆశ్చర్యమేసింది. బ్రహ్మ, విష్ణువులను లింగాకారంలో నేనెప్పుడూ చూడలేదు, ఇదే మొదటిసారి.
అక్కడినుంచి తిరిగి తిరుచ్చి వచ్చి మలైకోట ఎక్కాము. ఇక్కడ వినాయకుడి గుడి ఉంది. ఇక్కడి నుండి ఏరియల్ వ్యూ బావుంటుంది. మలైకోట నుండి శ్రీరంగం గుడి గోపురం చూడడానికి బావుంటుంది. ఇంకా ఇక్కడ చూడవలసినవి జలకంఠేశ్వరుని గుడి, ఇది పురాతనమైనది, కానీ చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు.
అక్కడకి మధ్యాన్నం అయింది. భోజనం చేసి తంజావూరు పయనమయ్యాము. వెళ్ళడానికి గంటంపావో, గంటన్నరో పట్టింది, 54 కిలోమీటర్లు కదా మరి. ఉదయమునుండి తిరిగి తిరిగి ఉన్నామేమో కడుపులో బువ్వ పడగానే గొప్ప అలసట వచ్చేసింది. కారులో మాంచి కునుకు తీసాము. తంజావూరులో దిగి మొదట "సరస్వతీ మహల్" గ్రంధాలయానికి వెళ్ళాము. ఇది క్రీ.శ. 1500-1600 లలో తంజావూరుని పాలిస్తున్న నాయకర్ రాజుల ప్రైవేటు గ్రంధాలయంగా ఉండేది. 1675 లో తంజావూరుని మరాఠా రాజులు ఆక్రమించుకున్నాక ఈ గ్రంధాలయాన్ని చాల విస్తృతపరిచారు. సర్‌ఫోజీ అనే మరాఠీ రాజు పఠనాసక్తిగల గొప్ప రాజు. సర్‌ఫోజీ అనగానే త్యాగయ్య సినిమా గుర్తొస్తోందా? ఆ, అవును ఆ శరభోజి మహారాజే ఈ సర్‌ఫోజీ గారు. తంజావూరు అనగానే త్యాగయ్య గుర్తురాని తెలుగువారుండరేమో కదా! ఈ సర్‌ఫోజీ మహారాజుకి ఉన్న పఠనాశక్తి వలన ఎక్కడెక్కడి నుండో పుస్తకాలను సంపాదించి ఇక్కడ భద్రపరిచారు. ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచ్ లాంటి భాషల్లో ఉన్న అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకొక ముఖ్య విశేషమేమిటంటే అత్యంత పురాతనమైనవి, పొడవైనవి అయిన తాళపత్రగ్రంధాలు ఇక్కడ ఉన్నాయి. చిన చిన్న అక్షరాలతో, గొలుసుకట్టు రాతతో భలే ఉన్నాయి ఆ తాళపత్రాలు. మాములు కంటితో వాటిని చదవలేము అంత చిన్న అక్షరాలు. సందర్శకుల సౌలభ్యం కోసం అక్కడ ఒక భూతద్దం పెట్టారు. అసలు నాలుగు అంగుళాల వెడల్పు, ఒక అడుగు పొడవు ఉన్న తాళపత్రం పై ప్రింటింగ్ లో రెండు ఠావులలో పట్టేటంత విషయాన్ని ఎలా రాసారో ఏమిటో! నాకైతే ఆ రాతలు చూసి మతిపోయింది. ఆవగింజంత అక్షరాలు, అలా కలిపేసుకుంటూ రాసుకుంటూ పోయారు. మనకి ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెంది అక్షరాలని ఎంత పెద్దవి కావాలంటే అంత పెద్దవి చేసుకుని చదువుకోవచ్చుగానీ, ఈ రోజుకీ అలాంటి తాళపత్రాలే చదువుకోవాల్సి వస్తేనా మనందరికీ ఖచ్చితంగా సోడాబుడ్డికళ్ళద్దాలు వచ్చేవి. ఇంకా అక్కడ అప్పటి భౌగోళిక నియమాలను సూచించే పత్రాలు, మేప్ లు ఉన్నాయి. అప్పటి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలను సూచించే రకారకాల చిత్రపటాలు కూడా ఉన్నాయి.
అలా ఆ గ్రంధాలయం చూడడం పూర్తి అయ్యాక పక్కనే ఉన్న గంట ఆకారపు భవనం (bell shaped building) చేరుకున్నాం. దీని ప్రాముఖ్యత ఏమిటో తెలీదు. కొంతమందేమో జైల్ అన్నారు. కొంతమందేమో ఊరికే కట్టారన్నారు.
ఆ పక్కనే ఉన్న మ్యూజియం కి వెళ్ళాం. అక్కడ క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం నుండి దొరికిన దేవుని విగ్రహాలున్నాయి. కొన్ని విగ్రహాలు చెక్కిన తీరుని చూస్తే చెక్కిన ఆ చేతులకి జోహార్లు అర్పించక మానరు, ముఖ్యంగా ఏకశిలావిగ్రహాలు.
నటరాజు - క్రీ.శ 11 వ శతాబ్దం
ఇవన్నీ చూసేసరికి సాయంత్రం 4.00 అయింది. చాలా అలసిపోయాము. పైన చెప్పినవాటిల్లో చాలామటుకు చెప్పులు లేకుండా అరికాళ్లతో తిరిగాము. ఆ దెబ్బకి కాళ్ళు నొప్పులు పుట్టాయి. ఇంక నడవలేమేమో అనిపించింది. ఓపిక నశించిపోయింది. గొప్ప నీరసం ఆవరించింది...నాకయితే ఇంటికి పోయి కాళ్ళకి కాసింత నూనె రాసుకుని వేన్నీళ్ళ కాపడం పెట్టుకుంటేగానీ ఎక్కడికీ కదలలేను అనిపించింది.
కానీ కానీ............
ఏం చెప్పను, ఎలా చెప్పను ఈ కళ్ళతో చూసిన అద్భుతాన్ని మాటలలో వర్ణించగలనా, నా తరమౌనా!
(సశేషం)
