ఓలమ్మీ అల్లుడుగోరొచ్చేసినారు కుర్సీ యెయ్యవే.
అత్తా బోగుండావా? మామేడకెల్లినాడు?
బోగున్నానబ్బీ, మీ మామ పట్నమెల్లినాడురా, బళ్ళోకి అయేటో సరుకులు కావలని...సాయంత్రానికొచ్చేస్తాడు.
ఒలేయ్ రావేటే, అల్లుడు నిలబడిపోనాడు బేగి రా.
ఏండీ ఎప్పుడొచ్చారు, కూకోండి. ఊల్లో అత్తా మామా అంతా బోగున్నారా?
బోగున్నారు మల్లీ, నీ ఆరోగ్యం ఎట్టా ఉన్నాదే?
మీరిద్దరు కూకోండి నాయనా, పొయ్యిమీద ఇగురెట్టినాను, సూసొత్తాను.
అలాగే అత్తమ్మా, ఏటొండుతున్నావేటి?
నీకిత్తమని నెత్తల్లు తీసుకొచ్చినానయ్యా :)
...................................................................
అత్తమ్మా కూర బలే సేసినావే....తిన్నాకా ఆయాసమొత్తన్నాది.......మల్లీ నీకు వేవిల్లు తగ్గినాయంటనే?
టిక్ టిక్ టిక్......ఎవరండీ లోపల, మీకు ఉత్తరం వచ్చింది.
సూడల్లుడూ అదేదో వచ్చినాదంట.
నాను సూత్తానత్తమ్మా, నువ్వు తొంగో.
ఏటల్లుడూ ఏటిరాసుంది అందులో, మొగమేటి అలాగయిపోతన్నాది?
అత్తమ్మ, అ అ అ అ ....అ అ అ
ఏటల్లుడూ అట్టా గాబరాపడిపోతన్నావు, ఏటయినాదో సెప్పు.
అ అ అ అ....అ అ అ
ఓలమ్మో ఒరినాయనో ఏటయిపోనాది, నాకు కాల్లు సేతులు ఆట్టంలేదు బగమంతుడో.
అది అ అ అ...
ఏటండీ ఏటిరాసుందందులో, సెప్పండి.
అ అ అ అ....
అ అ అంటున్నారు, మీ అమ్మకేటయిందండీ, ఓలమ్మో అత్తమ్మకేటయిపోనాది? మొన్న సూసినప్పుడు దిమ్మిసెక్కలా బాగానే ఉంది, ఉప్పుడేటయిపోనాది.
ఓలమ్మో ఇయ్యపురాలికేటయిపోనాది...మాయరోగమేటొచ్చినాదో...నానేటి సేసేదిరా దేవుడో.....ఆ రోగమేదో నాకొచ్చినా బాగున్ను, దాని జిమ్మడిపోనూ...సిన్న వయసులో బొట్టికెంతకట్టమొచ్చినాదిరో :(
ఓరల్లుడో అందులో ఏటి రాసున్నాదో సెప్పిసావరా...నాకు రగతం చల్లబడిపోనాది. ఓరేయ్ రాములూ...లగెత్తుకు రారా, ఓ రిక్సా తీసుకురా, బస్సుకెల్లాలి. బేగి రా రా...
అదికాదత్తమ్మా అదీ అదీ అత్తమ్మా అ అ అ అ......
ఓరి గుంటడో సరిగా సెప్పిసావరా...
ఏండీ, మావ ఏడున్నాడు? అత్తమ్మ కి కాల్లుసేతులడిపోనాయా, దేవుడిదగ్గరకెల్లిపోయినాదా...ఏటయినాదండీ, సెప్పండీ?
.....................................................................
ఏవయిందర్రా, ఎందుకలా ఏడుస్తున్నారు అందరూ. ఎప్పుడొచ్చావల్లుడూ, ఏమయింది? ఆ కాగితం ఏమిటి చేతిలో...ఏదీ ఇలా చూడనీ.
ఆపండి ఏడుపులు, ఉత్తరం చదువుతున్నాగా....చూసి చెప్తా.
గౌరవనీయులైన నాయుడుగారికి
అందరూ కుశలమే కదా. నేను వచ్చే వారం మీ ఊరొస్తున్నాను. మిమ్మల్ని కలుస్తాను.
ఇట్లు
గోపాలం
ఇందులో ఏడవడానికేముంది? ఎందుకు అల్లుడూ అలా కంగారు పడ్డావు?
ఏటల్లుడూ ఎందుకంత గాబరా ఎట్టేసినావూ....ఏటయిపోనాది?
అదీ అదీ "అ" చిన్నదయిపోయింది.
అ చిన్నదయిపోవడమేమిటి అల్లుడూ?
అదికాదు మావా, సిన్నప్పుడు సదుకునేటప్పుడు "అ" తాటికాయంత పెద్దగా ఉండేదికదా పలకమీద, ఉప్పుడేమో ఉసిరికాయంత సిన్నదయిపోయింది ఈ కాగితం మీద. అది సూస్తే ఏడుపొచ్చేసినాది.
ఓరి నీతెలివిసంతకెల్ల, "అ" చిన్నదయిపోవడమంటే అదా. చిన్నప్పుడు బాగా రావాలని పెద పెద్ద అక్షరాలు రాసి దిద్దిస్తారు. పెద్దయ్యాక చిన్న అక్షరాలు రాయక తాటికాయంత అక్షరాలు రాస్తారేమిటిరా, నీ తెలివిపాడుగాను. చిన్నప్పుడు సరిగ్గా చదువుకోరా అని ఎన్నిసార్లు చెప్పిన బడి ఎగ్గొట్టి ఇప్పుడు ఇలా అఘోరించావు. చెల్లెలి కొడుకువి కదా అని పిల్లనిస్తే ఇంట్లో వాళ్ళందరిని ఇలా కంగారుపెడతావా, ఏడ్చినట్టే ఉంది.
నీ జిమ్మడిపోనూ ఏటల్లుడూ ఇది, బాగానే ఉంది సంబడం...ఇదేనా నువ్వు సదిగిన సదుగు...కలకటేరులా మాటాడతావు ఒప్పుడూనూ, ఇదేనేటి నీ సదుగు. బొట్టికేటయిపోనాదోనని ఎంత గిలగిల్లాడిపోనానూ.....ఓరి గుంటడా, పేనం పోనాదిగందా !
ఏటండీ ఏదో పేద్ద సదుగు సదిగీసినట్టు నాతో ఆసికాలాడతారు ఒప్పుడూనూ....ఇదేనేటి మీరు సేసిన నిర్వాకమూ.
ఒరేయ్ అందుకే చెప్పేది సరిగ్గా చదువుకోవాలి, అందరూ చదువుకోవాలి అని.
తప్పైపోనాది మావా.
...........................
ఇది నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు మా బళ్ళో వేసిన నాటిక. ఇది మా తెలుగు టీచరు శ్రీమతి దేవీ ప్రకాష్ గారు మా చేత వేయించారు. దీన్లో నేను అత్తగారి పాత్ర పోషించాను. నాకు మంచి పేరు తెచ్చిన నాటిక ఇది. స్కూలు స్థాయి నాటకపోటీలో గెలిచి జిల్లా స్థాయి నాటకపోటీల్లో అవకాశమిప్పించింది ఈ నాటిక. అక్కడ కూడా మూడవ బహుమతి గెలుచుకుకున్నాం. నాకు ఒక తెలుగు సామెతల పుస్తకం, Rs.116 మరియు చిన్న సరస్వతీ దేవి విగ్రం ప్రైజుగా ఇచ్చారు. మా టీచరు మా చేత వేయించిన నాటికలు నాకెప్పుడూ చెరిగిపోని మధుర స్మృతులే!
46 comments:
సౌమ్య గారూ !
చాలా బాగుంది, మీ చిన్నప్పటి జ్ఞాపకం.
@ SR రావు గారు
ధన్యవాదములు :)
ఎప్పుడూ ఇదే యాసతో మీ చిన్నప్పటి అనుభవాలు రాయండి..
అన్నట్టు "నెత్తల్లు" అంటే ఏంటో రెండు పంక్తులకు మించకుండా సమాదానమిమ్ము.
మీ బలాగు ఓపెను సేయగానే ఎదో బౄందావను గార్డెను పొటొ లాంటిది కళ్ళకు దగ్గరగా పెట్టుకొని సూస్తున్నట్టు అనిపించి కళ్ళనుంచి ఆనందబాష్పాలు జలజలా రాలుతున్నాయి..బ్యాకుగ్రౌండు పోటొ మారుస్తారని నేననుకోవచ్చా???
@ మృత్యుంజయ్ గారూ
ధన్యవాదములు. నెత్తళ్ళు అంటే చేపల్లో రకాలు కాదా? నెత్తిలి అని కూడా అంటారు వాటినే. చిన్నచిన్న చేపలు.
మీకు అంత సంతోషాన్ని కలిగించి, ఆనందభాస్పాలు కురిపింపజేసిన నా బ్లాగు బ్యాకుగ్రౌండు పోటొ ఎలా మార్చమంటారండీ....మీలాగే ఇంకా ఎందరికో ఆనందాన్ని కలిగించాలని నాకోరిక ;)
సర్లెండి ఆచోచిస్తా...ఇంకా మంచిదేదైనా దొరికితే మారుస్తా :D
ఇదే యాసలో రాయడానికి ప్రయత్నిస్తానండీ, కానీ నాకు అంతగా రాదు. ఇదే మొదటిసారి ట్రై చేసా.
కామెంటినందుకు మరొక్కసారి థాంక్సులు :)
చదువు విలువ తెలిపిన పద్దతి బాగుంది .
బహుమతులు గెలుచుకున్న అత్తమ్మ కు అభినందనలు .
super
చాలా బాగా రాసారు
Very nice..
Thanq..
@ మాలా కుమార్ గారు
ధన్యవాదములు. అవునండీ చదువువిలువ మా తెలుగు టీచర్ ఈ నాటకం ద్వారా మాచేత చెప్పించారు.
@ హరే కృష్ణ
థాంక్సండీ
@ ramnarsimha
Thank you.
హ హ..సౌమ్య గారూ .. బాగుందండి...
కొత్త టెంప్లేట్ బాగుంది...
ఐతే చిత్ర లేఖనం తో పాటు నటన లో కూడ ప్రవేశం ఉన్నదన్న మాట మీకు.
నేనొల్లనోలె పిల్లా నీ యాసనీ,
అబ్బా నీ సదువునీ, మీ పక్కూరి యాసనీ,
ఒల్లనోలే పిల్లా నేనొల్లనూ,
సదుంకున్నోడికంటే ఇస్త్రీ పెట్టె నయమంట,
అందుకే నేనొల్లనోలె పిల్లా నీ బాసని.
@ venuram
నాటకాలు బాగానే వేసేదాన్నండీ.. చాలా నాటకాలు రేడియోలో కూడా ప్రసారమయ్యయి. బడిలో 6 నుండి 10వ తరగతి వరకు ఎక్కువ చేసిన పని ఇదే నాటకాలెయ్యడం. అందులోనూ అన్ని ప్రధాన పాత్రలే. మనం చాలా ఫేమస్ అన్నమాట :)
@పప్పుసారు
వొల్లొకో అయ్యా వొల్లొకో, ఇది పక్కురి బాస మాత్రం కాదు మా ఉత్తరాంధ్ర బాస, ఏటనుకున్నారో ఏటో. మీది కూడా మన బాసేగదేటి, మరేటిట్టాగంటన్నారూ? ఇస్త్రీ పెట్టెలా...హిహిహి మనమందరం ఇస్త్రీపెట్టెలేగందా.
ఆకాశవాణి హైదరాబాదు సైన్సు సీరియళ్లలో , జపాఫోర్ లో మీరేనా ?!
చదువు ప్రాధాన్యత తెలియచేసేందుకు అరవైలలో బహుళ ప్రచారంలో వున్న కథ ఇది.ఆ కథ నాటకీకరించబడి మీకు బహుమతినందించడం శభాష్.అందుకోండి అభినందనలు.
@ Ranjani
కాదండీ, మావి ఆకాశవాణి విశాకపట్నం జోన్ లో ప్రసారమయ్యేవి. మాది విజయనగరం కదండీ మరి.
Thanks!
@ ఉమదేవి గారు
ఇది 60 ల నాటి కథా! నాకు తెలీదండీ. చాలామంచి విషయం తెలియజేసారు. మా తెలుగు టీచర్ ఈ నాటకం వేయించారు మా చేత.
మీ అభినందనలు అందుకున్నాను, ధన్యవాదములు!
చాలా బాగుంది, చాలా బాగా రాసారు
@ hanu
Thank you so much!
ఈ టపాకు సంబంధంలేదు క్షమించాలి।
శిరాకదంబంలో మీరు మండా సుధారాణి గారి చెల్లెలు అని తెలిసింది। నేను ఒక సారి మీ అక్కగారి కచేరీని తితిదేభస్రలో చూశాను। నాకు చాలా బాగా నచ్చింది। రోజూ ఎన్నో చూసినా, సుధారాణిగారి పేరు అలా గుర్తుండుపోయింది। మీ అక్కగారికి నా అభినందనలు॥
బ్లాగు మొదలుపెట్టిన అనతి కాలంలో మీరు చాలా ప్రఖ్యాతిగాంచారు కాబట్టి మీకూఁ అభినందనలు॥
@ రాకేశ్వరరావు గారు, అవునండీ సుధారాణిగారు స్వయాన మా అక్కే.
"రోజూ ఎన్నో చూసినా, సుధారాణిగారి పేరు అలా గుర్తుండుపోయింది."....ఇదే మాట నాతో చాలాసార్లు, చాలామంది అన్నారు. అలా అన్నప్పుడల్లా కాస్త గర్వంగా ఉంటుంది అందులో నా ప్రతిభ ఏమీ లేకపోయినా. మీ అభినందనలు మా అక్కకి తప్పకుండా తెలియజేస్తాను.
"బ్లాగు మొదలుపెట్టిన అనతి కాలంలో మీరు చాలా ప్రఖ్యాతిగాంచారు కాబట్టి మీకూఁ అభినందనలు"....అమ్మో ఇలా అనేసారేంటండీ! ఇది నిజమో కాదో నాకు తెలీదు కానీ మీరు అంటూంటే నిజంలాగే అనిపిస్తున్నాది. ఆనందంగా ఉంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.
super Soumya garu!
mana bhashanu caalaa baagaa raasi andariki teliyajesaru.
@సవ్వడి
ధన్యవాదములు.
మన భాష మనం రాసుకోకపోతే ఇంకెవరు రాస్తారు చెప్పండి, అందుకే కాస్త ట్రై చేసా :)
thanks!
చిన్నప్పటి నాటకం లో ప్రతి డైలాగు భలే గుర్తుందండి మీకు. :)
ఇంతకి బొట్టి అంటే ఏమిటి? "బొట్టికెంతకట్టమొచ్చినాదిరో"
@ sai praveen
హ హ హ ఆ నాటకం చిన్నప్పుడు చాలాసార్లు వేసానండీ, అందుకే సంభాషణలన్నీ నాలో జీర్ణించుకుపోయాయి.
బొట్టి అంటే వియ్యపురాలు అని అర్థమండీ.
కామెంటినందుకు ధన్యవాదములు.
చాలా సరదాగా ఉంది. అలా స్కూల్ పిల్లలు వేసారి ఊహించుకుంటే ఎంత బావుందో! అందుకే బహుమతులు కూడా వచ్చి ఉంటాయి :-)
@ మధురవాణి
హ హ హ అవును అప్పట్లో చాలా పొట్టిగా ఉండేదాన్ని, మా అమ్మచీర నాలుగు మడతలు పెట్టి కట్టారు నాకు. అది మొయ్యలేక ఒకటే పాట్లు.
thanks for commenting.
మధురవాణి గారు,
మీరు ఇక్కడ ప్రచురించనవసరం లేదు అంటూ పెట్టిన కామెంటు ఇక్కడ ప్రచురించబడలేదు కానీ హారంలో కనిపిస్తూంది. అంటే కామెంట్ మోడరేషన్ ఉన్నా కూడా బ్లాగుల్లో కామెంట్లు మోడరేట్ చేయకుండానే, వ్యాఖ్యను పోస్ట్ చేసిన వెంటనే హారంలో కనిపిస్తున్నాయి. గమనించగలరు.
@Anonumous
adela?
nenu aa comment reject chesane, malaika lo kanipinchatledu ga?
అంతే కాదు సౌమ్య గారు. నేను పైన కామెంట్ రాసినప్పుడు follow up comments కి subscribe చేశాను. మీరు రిజెక్ట్ చేశాను అంటున్న కామెంట్ నాకు మెయిల్ లో వచ్చింది.
@ Anonymous
మీరు కాపీ చేసిన "ఆ వ్యాఖ్య" ని రిజెక్ట్ చేసాను, ఆ కామెంటు మళ్ళీ ఇక్కడ ఎందుకు రావడమని.
ఈ విషయం నాకు తెలియజేసినందుకు చాలా చాలా కృతఙ్ఞతలు. ఇప్పుడే దీని గురించి హారం వారికి తెలియజేస్తాను.
once again many many thanks for the timely help!
@ Sai Praveen
మీ మైల్ లో నేను రిజెక్ట్ చేసిన కామెంటు రావడమేమిటండీ, చాలా ఆశ్చర్యంగా ఉంది...బాబోయ్ ఇది బ్లాగరులో సమస్యా, లేక హారంలో సమస్యో తెలియట్లేదు. దయచేసి ఆ మైల్ డిలీట్ చేసేయండి. ఈ విషయం నాకు తెలియజేసినందుకు చాలా చాలా thanks.
సౌమ్య గారు, నమస్కారములు.
కథలో హాస్యాన్ని చాలా బాగా పండించారు.
భవదీయుడు,
మాధవరావు.
@ మాధవరావు గారు
నమస్కారం. మా నాటకం మీకు నచ్చినందుకు చాల సంతోషం. ధన్యవాదములు.
సౌమ్య గారూ,
భలే ఉన్నాయి డైలాగులు. ఎంత గుర్తో మీకు..
కృష్ణప్రియ/
@కృష్ణప్రియ గారూ,
ధన్యవాదములు :)
చెప్పాను కదండీ ఈ నాటకం వేసి వేసి అరగదేసేసాము...ఈ జన్మకే కాదు ఏ జన్మకీ మరచిపోలేను :D
సంగీతం, నాటకాలు...అబ్బో.... చాలా వాటిల్లో ప్రవేశం ఉన్నట్టుండే మీకు. ఈ నాటకం చిన్న పిల్లలు వేసారు అని ఆలోచిస్తుంటే చాలా సరదాగా అనిపించింది..
నేను చిన్నప్పుడు రెండో క్లాసు లో ఒకే ఒక్క నాటకం వేసా..పాత్రలన్నీ మీ నాటకం లోనివే ఆల్మోస్ట్...
నాది మామ పాత్ర..కొత్త కోడలు ఏదో అంటే...నేను దాన్ని చెంప మీద ఒక్కటి ఇవ్వాలి..నాటకం లో...
నేను నాటకం లో మునిగిపోయి...నిజంగానే పెడేల్మని ఒకటి ఇచ్చా..
జనం చప్పట్లే చప్పట్లు....నాటకం ఆనుకుని...
@ స్థితప్రజ్ఞుడు
నాకు చాలా చాలా అనందంగా ఉంది. ఎంతో ఓపికగా నా టపాలనీ చదివి కామెంటు కూడా పెట్టారు. ఇప్పటివరకు ఇలా ఏకబిగిన నా టపాలు చదివి (చదివారేమో) కామెంటు పెట్టినవాళ్ళు లేరు. Thank you, Thank you so much. ఇలాగే మీ ప్రోత్సాహం నాకెప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను :).
స్థిత ప్రజ్ఞుడి గారికి ఓపిక ఎక్కువ ;)
@ సౌమ్య గారు,
అయ్ బాబొయ్ ! ఉత్తినే సరదాగా అన్నాను లెండీ.. మరీ సీరియస్సు అయిపోవద్దు!
@ కృష్ణ
లాభం లేదు, మీ సంగతి మీ ఊరి వాళ్ళకి చెప్పాల్సిందే....హన్న నన్నే వెటకారం చేస్తారా!....ఉండండి మీ సంగతి చెప్తాను :P
bagundi..
inthaki mari treat eppudu...adhe prize vacchindi kada ee natakaniki..!!
సౌమ్యగోరికి దండాలు,
సానా సక్కగ రాసినారండి.అదేటొనండి సికాకుళంలో ఉన్నామన్న మాటే గానీ మాకు ఒక్క ముక్క మీ లాగ పలకలేమండీ.బస్సుకి టైమైనాది,ఈ పూటకింతె.
వివేక్
ఊరుకో నువ్వు మరీను, ఎప్పుడో ఏడో తరగతిలో వచ్చిన ప్రైజుకి ఇప్పుడు పార్టీ ఏమిటి, జోకులు కాకపోతే :D
@దుర్గా ప్రసాద్ గారు,
దండాలండీ
ఏదో మీ అభిమానంగానండీ,నాకూ అంత బాస ఏటీ రాదండీ. ఓపాలి ట్రై సేసి సూసినా, అంతే.
మీకు నచ్చినందుకు సంతోషమండీ.ధన్యవాదములు.
ఈ పోస్టు గురించి మా అమ్మగారికి చెప్పానండి. చాలా సంతోషించారు.
ఇన్నాళ్ళయినా గుర్తుపెట్టుకొని నాటకం గురించి, అది వేయించిన టిచరు గురించి రాయడం విశేషమే!
@కామేశ్వరరావు గారూ
ధన్యవాదములు.
బలేవారే...గురువులను గుర్తుపెట్టుకోని శిష్యులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే...చదువు చెప్పిన వారిని ఎలా మరచిపోతామండీ!
Hi..
mee natakam chala chala bagundi..
edaina mandalikam lo rasinavi chala baguntayi...
chaduvutunte edo oka anandam, adi cheppedi kadu lendi..
mee posts theerikunnappudalla chaduvutunnanu....bagunnayi..
:- Kasi
Post a Comment