ఈ మధ్య కల్పన రెంటలగారు మన అమ్మ చెప్పిన కథలు అని ఒక టపా రాసారు. మన చిన్నప్పుడు అమ్మలు, నాన్నలు, బామ్మలు, తాతలు చెప్పిన కథలనీ ఒకచోట పోగేసే ప్రయత్నమది. నాకు నచ్చింది. అందుకే నాకు గుర్తున్న కథలు కూడా రాద్దామని....
యూనివర్సిటీ లో ఉన్నప్పుడు "అంటరాని వసంతం" రాసిన "కల్యాణరావు" గారు ఒక సభకి వచ్చారు. అప్పుడాయనో మాట అన్నారు. రాజశేఖర చరిత్రే తెలుగులో మొదటి కథ ఎందుకవుతుంది. "రాజుగారికి ఏడుగురు కొడుకులు" ఎందుకు మొదటి కథ కాదు అని. నాకు ఆ మాటలు చాలా నిజమనిపించాయి. ఈ రాజుగారి ఏడుగురు కొడుకుల కథ తెలియని పసిపాపలు ఉండరేమో మన ఆంధ్ర దేశంలో. మరి అలాంటప్పుడు అదే మొదటి కథ అవ్వాలి కదా. అలాగే ఆవు-పులి, కుందేలు-తాబేలు కథలు తెలియని వారెవ్వరు ఉండరు. కానీ లిఖితపూర్వకంగా ఈ కథలు లేకపోవడం వలన, అవి రాసినవారెవరో స్పష్టంగా తెలియకపోవడం వలన ఈ కథలకు "మొదటి కథలు" అన్న స్థానం రాలేదేమో అని నాకు అనిపించింది.
ఈ దిశలో వాటిని లిఖితపూర్వకంగా ఒకచోట చేర్చడం అనే ప్రక్రియ మంచిపనే, కల్పనగారు అందుకు అభినందనీయులు.
నాకు గుర్తొచ్చిన రెండు-మూడు కథలు రాసేస్తే ఈ బృహత్కార్యానికి మనమూ ఓ చెయ్యి వేసినట్టుగా అవుతుంది కదా అని ఇలా...
....................................................................
అనగా అనగా ఒక రాజుగారుండేవారట
ఆయనకి ఏడుగురు కొడుకులుండేవారట
ఆ ఏడుగురు కొడుకులు ఒకరోజు వేటకెళ్ళి, ఏడు చేపలు తెచ్చి ఎండబెట్టారట.
అందులో ఒక చేప ఎండలేదట.
చేపా చేపా ఎందుకెండలేదు అని అడిగితే
గడ్డిమోపు అడ్డొచ్చింది అందిట
గడ్డిమోపూ గడ్డిమోపూ ఎందుకు అడ్డొచ్చావు అని అడిగితే
ఆవు నన్ను మేయలేదు అందిట
ఆవూ అవూ ఎందుకు మేయలేదు అని అడిగితే
దూడ పాలు తాగలేదు అందిట
దూడా దూడా పాలెందుకు తాగలేదు అని అడిగితే
యజమాని నన్ను విప్పలేదు అందిట
యజమానీ యజమానీ ఎందుకు విప్పలేదు అని అడిగితే
మా పిల్లాడికి చీమ కుట్టింది అన్నాట్ట
చీమా చీమా ఎందుకు కుట్టావూ అని అడిగితే
నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అందిట
....................................................................
ఒక అడవిలో ఒక నక్క, ఒక కొంగ ఉండేవారట. ఒకరోజు ఆ నక్కకి కొంగని బాగ ఏడిపించాలని అనిపించిందిట. అప్పుడు నక్కగారేమో కొంగని ఇంటికి విందుకి పిలిచారట. విందుకి వెళ్ళిన కొంగకి నక్క పాయసం వండి ఒక పళ్ళెంలో పెట్టిందిట. పొడుగు మెడ ఉన్న కొంగ పళ్ళెంలో పాయసం తినలేక అవస్థ పడిందిట. అది చూసి నక్క తెగ నవ్వుకుంటూ పళ్ళెంలో పాయసం నాకి నాకి చక్కగా తిన్నదట. ఇలా ఉందా ఈ నక్క సంగతి చెప్తా అని అనుకుని కొంగ ఆ మర్నాడు నక్కని ఇంటికి విందుకి పిలిచిందిట. నక్క వెళ్ళగా కొంగ చేపలు వండి ఒక కూజాలో నక్కకి వడ్డించిందిట. నక్క మూతి కూజాలోకి దూరక, చేపల సువాసన కడుపులో ఆకలి రేపుతూ ఉంటే నానా బాధలు పడ్డాదిట నక్క. అది చూసి మంచిపని అయ్యిదిలే అని కొంగ సంతోషించిందిట.
....................................................................
ఒక అడవిలో ఒక సింహం ఉండేదిట. అది చాలా కౄరమయినది. దాని బలంతో రోజూ జంతువులని వేటాడి తినేస్తూ ఉందేదిట. ఇలా అయితే లాభం లేదని, అడవిలో జంతువులనీ సమావేశమయ్యి, ఆ సింహాన్ని రాజుగా చేసి, రోజుకో జంతువుని మేమే మీకు పంపిస్తాం, మీరు వేటాడి మమ్మల్ని హింసించకండి అని ప్రాధేయపడ్డాయిట. సరే అలాగే పంపించండి అని సింహం ఒప్పుకుని ఆ అడవికి రాజై కూర్చిందిట. పాపం జంతువులన్నీ ఒక్కొరోజు ప్రాణత్యాగం చేస్తూ ఆ మృగరాజు కడుపు నింపుతున్నాయట. ఇంతలో ఒక కుందేలు వంతు వచ్చిందిట. చిట్టి పొట్టి కుందేలు బుర్రలో లెక్కలేనన్ని తెలివితేటలు. ఆరోజు రాగానే కుందేలు సింహం దగ్గరకి ఆలస్యంగా వెళ్ళిందిట. కోపంతో సింహం ఊగిపోతూ కుందేలు మీద గర్జించిందిట. అప్పుడు కుందేలేమో "శాంతించండి మహారాజా, మీలాంటివాడే ఇంకొకడు ఈ అడవిలో ఉన్నాడు. వాడు నన్ను ఆపి ఈ అడవికి రాజు వాడే మీరు కాదు అని నన్ను బెదిరించాడు. వాడి నుండి ఎలాగో తప్పించుకుని మీ చెంతచేరాను" అని కుందేలు చెప్పిందిట. "ఏమిటీ ఈ అడవికి ఇంకో రాజా...వీలులేదు" అని గాండ్రించి "వాడేక్కడున్నాదో చూపించు, ఇవాళ వాడో నేనో తేలిపోవాలి" అని కుందేలుని అడిగిందిట. చిత్తం మహారాజా అలాగే చూపిస్తాను అని చెప్పి ఆ సింహాన్ని కుందేలు ఒక బావి దగ్గరకి తీసుకుని వెళ్ళిందిట. అదిగో ఆ బావిలో ఉన్నాడు చూడండి అని చూపించిందిట. తెలివిలేని సింహం ఆ బావి లో తన నీడని చూసుకుని ఇంకో సింహం అనుకుని కోపంతో దానిపై దూకిందిట. ఇంకేముంది ఆ మూర్ఖ సింహం బావిలో పడి మరణించింది. పీడా వదిలిపోయిందని, చిన్నారి కుందేలు తెలివితేటలని మెచ్చుకుంటూ జంతువులన్నీ హాయిగా ఆడిపాడాయట.
....................................................................
అనగా అనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేదిట. ఒకరోజు ఆ కాకికి ఒక మాంసం ముక్క దొరికిందిట. అది ఆ ముక్కని నోటకరుచుకుని చెట్టు మీద వాలిందిట. కాకినోట్లో మాంసం ముక్కని చూసి నక్కకి దానిపై ఆశ కలిగిందిట. వెంటనే ఆ ముక్కని ఎలాగైనా కాకినుండి కాజెయ్యాలని నక్క అనుకుని "కాకీ కాకీ నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా బాగా పాటలు పాడతావు ఒక పాట పాడవా" అని అడిగిందిట. కాకేమో ఆ పొగడ్తకి మురిసిపోయి మా మాంసం ముక్కని కాలివేళ్ల మధ్యన పెట్టుకుని కావు కావు మని పాడిందిట. అది చూసి నక్క "అబ్బా నా జిత్తులు ఫలించలేదే అని చెప్పి ఈసారి "కాకి కాకి నువ్వు బాగా నాట్యం చేస్తావు, చెయ్యవా" అని అడిగిందిట. కాకి మళ్ళీ మురిసిపోయి ఆ ముక్కని ముక్కున కరిచి నాట్యం చేసిందిట. ఇలా కాదని చెప్పి నక్క "కాకీ కాకీ నువ్వు పాటపాడుతూ నాట్యం బాగా చేస్తావు, చెయ్యవా" అని అడిగిందిట. ఆ కాకేమో బోలెడు సంబరపడిపోయి కావు కావుమంటూ నాట్యం చేసిందిట. వెంటనే మాంసం ముక్క నోటి నుండి కిందపడిపోయింది. ఆ జిత్తులమారి నక్కేమో ఆ ముక్కని లొట్టలేసుకుని తింటూ చక్కా సాగిపోయిందిట.
22 comments:
తెలిసిన కథలే అయినా మళ్ళీ గుర్తు చేసుకోవడం బాగుంది. గుర్తు చేసినందుకు మీకు థాంక్స్ :)
@ మధురవాణి గారు
అవునండీ తెలిసిన కథలే....వాటినే రాసేస్తే పోలే అని రాసేసా....కామెంటినందుకు ధన్యవాదాలు!
రాజుగారికి ఏడుగురు కొడుకులు కధ మినహా మిగతావి పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి.
ఒక చిన్న సందేహం "అంటరాని వసంతం" నవల రాసింది ఐలయ్య గారా ? కళ్యాణరావు గారని చదివినట్లు/విన్నట్లు గుర్తు.
అన్నట్టు, నా బ్లాగులో రాసిన మిరపకాయ్ పొట్టోడి కథ చూశారా మీరు?
http://madhuravaani.blogspot.com/2010/05/blog-post_7927.html
@ మధురవాణి గారూ
చూసానండి, చదివి భలే నవ్వుకున్నాను కూడా. అసలు కల్పన గారి కథల టపా గురించి తెలిసినది మీ టపా ద్వారానే. ఈ కథల క్రమములో మోట్టమొదట చదివినది మీ మిరపకాయపొట్టోడి కథే :)
@ రమణ
ఒహ్ క్షమించండి అంటరాని వసంతం రాసింది కల్యాణరావుగారే....పొరపాటున రాసాను. ఇప్పుడే సరిదిద్దాను. తప్పు సరిదిద్దినందుకు చాలా చాలా thanks!
సౌమ్య
నీ చీమ కధ చదువుతుంటే నేను చేసిన ప్రయోగం గుర్తొచ్చింది. :)
http://jyothivalaboju.blogspot.com/2008/07/blog-post_08.html
@జ్యోతిగారూ
హ హ హ మీ చీమ కథ బాగుందండీ....భలే ప్రయోగం, నవ్వలేక చచ్చను ఆ భాషలో చీమ కథ చదివి. లింకు ఇచ్చినందుకు thanks :)
చాలా మంచి ఆలోచన. అభినందనలు.
"అనగా అనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేదిట. " madam,We usually tell this story in a different way...
an old lady prepares vadas. a crow picks one of the vadas and there it goes.... any how its ok... whether its a meat or vada... theme is the same...
@ maheash
Thank you!
@ Anonymous
అలా అవ్వ-వడ చెయ్యడం తమిళంలో చెప్తారండీ, తెలుగులో కాదనుకుంటా. "పాటీ వడ సుట్టు కథై" అని తమిళలో ఇదే కథని మీరు చెప్పినట్టుగా చెప్తారు. తెలుగులో మాత్రం కాకి-మాసం ముక్క అనే విన్నాను నేను.
"రాజుగారి కొడుకులు, ఏడు చేపలు" కథ లేని తెలుగు బాల్యం ఉండదని లక్ష రూపాయల బెట్ కట్టొచ్చు!
అసలు జంతువుల పాత్రలతో కథలల్లి చెప్పుకోవడంలోనే ఒక మజా ఉంటుంది. పంచతంత్రం వీటన్నిటికీ మూలమేమో!
భలే ఉంది సౌమ్యా, పాత కథలన్నీ తవ్వి తీశారు.
మధురవాణీ,
మీ మిరపకాయ పొట్టోడి కథ కూడా చదివాను. మా పాపకు భలే నచ్చింది. మూడు రోజులు వరసాగ్గా చెప్పించుకుంది.
sontha talent upayoginchi kotta kadhalu rayandi...plz
అది గుంటనక్క అయి ఉంటుంది
గుంటనక్క ల కోసం మార్తాండ ఏమనేవాడు ?
గుంటనక్కల వలలో పడింది అనేవాడేమో
చక్కగా చిన్నప్పుడు చదువుకున్న కథలను గుర్తు చేశారు. సంతోషం.
వావ్ నాకు ఈ కథలంటే ఎంతిష్టమో... మళ్ళీ చిన్నతనంలోకి వెళ్లిపోయా మీ కథలు వింటూ... :-)
సౌమ్య గారు చిన్న నాటి కథలు తెలిసిన కథలే అయినా మళ్ళీ గుర్తు చేసుకోవడం బాగుంది.
గుర్తుచేసిన౦దుకు చాలా చాలా థ్యా౦క్స్.
పిల్లలకి మొదటగా Logic Sense నేర్పడానికి రాజు గారికి ‘ఏడుగురు కొడుకులు - చేప’ కథ మించింది లేదని నా అభిప్రాయం. మీరేమంటారు!:)
సౌమ్య, తెలిసిన కథలే అయినా మీరు మళ్ళీ రాయడం, మేము ఇలా చదవడం బాగుంది. కొన్ని కొత్త కథలు కూడా సేకరించి రాయండి.
@ సుజాత గారూ
ధన్యవాదములు. నిజమేనండీ లక్షలేమిటి కోట్లు బెట్ కట్టొచ్చు. అవునండీ పంచతంత్ర కథలంటే నాకెంతో ఇష్టం. జంతువుల పేరుతో కథలు చదివితేనే "కథ" అనిపిస్తుంది. నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తూ రాసాను.
@ నక్షత్ర
ఇక్కడ సొంత కథలు రాయడం ఉద్దేశ్యం కాదండీ, చిన్నప్పటి కథలను తవ్వితీయడమే దీని పరమార్థం.
ఇంతకీ సొంత టేలంటు ఉపయోగించి కథలు రాయమనడం సజెషనా? రిక్వస్టా? లేక ఎత్తిపొడుపా? :)
@ హరే కృష్ణ
గుంటనక్క అయితే అంతే :)
@ Anonymous
ధన్యవాదాలండీ.
@ కిషన్ రెడ్డి
మిమ్మల్ని చిన్నతనంలోకి తీసుకుని వెళ్ళానా, అయితే నేను సక్సెస్ అయినట్టే. అయినా మీ కథలలోని ఉన్నంత సస్పెన్స్ ఉండదులెండి :)
@ శేషు
థాంక్సండీ
@ అమ్మ ఒడి గారూ
ఖచ్చితంగా అవునంటాను.కామెంటినందుకు చాలా thanks!
@ కల్పన గారూ
థాంక్సండీ, అలాగే తప్పకుండా కొత్త కథలు కూడా రాస్తాను.
Post a Comment