StatCounter code

Monday, June 28, 2010

ము.వెం.ర-హాస్య గుళికలు

ముళ్ళపూడి వెంకట రమణ గారి గురంచి తెలియనివారు ఆంధ్రదేశంలో ఉండరు. ఆయన గురించి అందరు అన్ని రకాలుగా చెప్పేసారు, పొగిడేసారు. ఇహ నేను కొత్తగా చెప్పాల్సిందేమీలేదు. ఈరోజు ఆయన జన్మదినం...ఆయనకెలాగూ ముఖాముఖి జన్మదిన శుభాకాంక్షలు తెలుపలేము కాబట్టి ఆయన కలము నుండి జాలువారిన హాస్య చతురోక్తులలో కొన్నింటిని తలుచుకోవడమే ఆయనకు నేను చెప్పగల జేజేలు.

రమణగారి భాష గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆయన రచనలే అందుకు సాక్ష్యాలు. ఆయన జీవితం ఒక ముళ్ళబాట, జీవితంలో కష్టాలను అలవోకగా అవేమీ పట్టనట్టు అలా అలా రాసేస్తారు, చదువుతున్న మనకే కన్నీళ్ళు ధారలా కారిపోతాయి. ఆయన గురించి ఒకచోట శ్రీరమణ అంటారూ...
"పచ్చని గోరింటలో అరుణిమలు దాగినట్లు
ముళ్ళపూడి నవ్వుల్లో ముళ్ళలాంటి వేదన"

బాపు-రమణ అంటే స్నేహం అని మనం నిర్వచనం చెప్పుకోవచ్చు.
రమణగారి మానసపుత్రుడు బుడుగు గురిచి తెలియనిదెవరికి?
రమణగారు బోలెడు రమణీయాలు రచించారు....సినీరమణీయం, కదంబరమణీయం, ఇలా ఎన్నో....వాటిల్లో కొన్ని రమణీయమైన గుళికలు......

ఒకసారి ముళ్ళపూడి వారికి అప్పు అవసరమై ఒక స్నేహితుడికి ఫోన్ చేసి అడిగారట.

రమణ: ఓయ్ కాస్త అప్పు కావాలోయ్
స్నేహితుడు: అలాగా, ఎప్పటికి కావాలి?
రమణ: మొన్నటికి

....ఇలా ఉంటుంది వీరి వ్యవహారం

...............................
రచయితల మీద వేసిన జోకు:
"నా కొత్త నవల మీద పత్రికలో విమర్శ వేయించండి" అంటూ రచయిత ఒక పుస్తకం అందించాడు. పుస్తకం బాగా నలిగి చిరిగిపోయింది.
"పబ్లిషర్ నాకు ఒక్కటే కాపీ ఇచ్చాడండీ, మా అబ్బాయి దాన్ని నలిపి చింపేశాడు, మరోలా అనుకోకండి," అన్నాడు రచయిత.
"అయితే ఇంకా విమర్శ ఎందుకు? మీ అబ్బాయి అభిప్రాయం తెలుస్తూనే ఉందిగా" అన్నాడు సంపాదకుడు.


"1960 లో తన ఋణానందలహరి పుస్తకం ఫస్ట్ ఎడిషన్ వెలువడింది. ఆ కాపీని ఇచ్చేటప్పుడు దానిపై అచ్చుతప్పులతో, అభినందనలతో అని రాసి మరీ సంతకం చేసి ఇచ్చారట ఆ గ్రంధకర్త శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ-కొంత వరకైనా పాప పరిహారం అవుతుందని."
....................................
ఎత్తిపొడుపులలో రమణ గారి చమత్కారం:
"ఆహా కోట్లార్జించినా మీలో ఆవగింజంత మార్పు కూడా లేదండీ, నాడెంతో నేడూ అంతే" అన్నడొక స్నేహితుడు.

"మార్పులేకేం. పూర్వం నేను పొగరుబోతుని, ఇప్పుడు నాది ఆత్మవిశ్వాసం. లోగడ మొండి రాస్కెల్ ని, ఇప్పుడు చిత్తశుద్ధి-దృఢసంకల్పం కలవాడిని. ఆ మధ్య జడ్డివెధవని, ఇప్పుడు సజ్జనుణ్ణి. లోగడ నోరు విప్పితే అవాకులు -చవాకులు దొర్లేవి, ఇప్పుడు చమత్కారంగా.....సరసంగా మాట్లాడుతున్నాను అంటున్నారు" అన్నాడు శ్రీమంతుడు.
..................................
దృష్టిలోపం:
ఒక కళాసృష్టి జరిగినప్పుడు
రసికుడు: అందులో మంచినీ, అందాన్ని వెతుకుతాడు
విమర్శకుడు: అచ్చుతప్పుల్నీ-తతిమా దోషాల్ని వెతుకుతాడు.
సెన్సారువాడు: బూతునే వెతుకుతాడు
.............................................
జోస్యం
"మీరు డెబ్బైయేళ్ళు బతుకుతారండీ"
"ఏడిసినట్టే ఉంది, నాకు ఇప్పుడు డెబ్బైయేళ్ళే"
"చూసారా, నే చెప్పలే!"
..........................

ప్రముఖుల గురించి రమణగారి మాటల్లో

అమరావతి కథల గురించి చెప్తూ...
"అమరావతి కథలు ప్రేమతో, భక్తితో, ఆవేశంతో సత్యంగారి హృదయం లోంచి ఉప్పొంగాయి. జలపాతంలా ఉరికాయి. బాలకృష్ణవేణిలా పరిగెత్తాయి. స్వామి కోవెల దగ్గర కృష్ణలా భయభక్తులతో తలవంచుకుని నడిచాయి" అన్నారు.

సాలూరి రాజేశ్వరరావుగారి గురించి....
"నిఘంటువులో 'శ్రావ్యసంగీతం' అనే మాటకి అర్థం రాయటానికి మాటలు వెతికి చేర్చేబదులు రాజేశ్వరరావు అని టూకీగా రాస్తే చాలు"

యెస్.వి.రంగారావు గురించి....
"వెండితెరకి రాకుంటే రంగారావు ఏం చేసేవాడు? ఎప్పుడో అప్పుడు ఝామ్మని వచ్చేసేవాడు, అందుకు సందేహమేమిటి!"

కె.వి.రెడ్డి గురించి.....
కృతకమైన సాంఘికం కన్నా సహజమైన జానపదం లక్షరెట్లు మెరుగు. కె.వి. దగ్గర ఉంటే పది లక్షలు మెరుగు. దైవమిచ్చిన జానపదానికి మకుటంలేని రాజు కె.వి.

భానుమతి గురించి.....
చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షర క్రమాన పేర్లు ఎన్నికచేస్తే "బి" శీర్హిక కింద బహుముఖ ప్రఙ్ఞావతి భానుమతి పేరు చేరుతుంది"


రమణగారి గురించి ఇలా రాసుకుంటు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో....ఒక జీవితం చాలదు!







27 comments:

రాజ్ కుమార్ said...

ముళ్ళపూడి వారికి జన్మదిన శుభాకాంక్షలు..
మంచి కలెక్షన్ సౌమ్య గారు.. పొద్దున్నే మంచి పోస్ట్ చదివించారు.

ఆ.సౌమ్య said...

@venuram
ధన్యవాదములు,ముళ్లపూడివారివి ఎప్పుడు చదువుకున్నా మనసుకి ఆహ్లాదంగానే ఉంటుంది.

సుజాత వేల్పూరి said...

చదివినవీ, తెలిసినవే అయినా ఇలాంటివి మళ్ళీ చదివి నవ్వుకోడం బావుంటుంది. థాంక్స్ సౌమ్యా!

ఆ.సౌమ్య said...

@సుజాత గారు
అవునండీ రమణ గారివి ఎన్నిసార్లు అన్ని చదివినా అన్ని సార్లూ నవ్వు వస్తూనే ఉంటుంది. thanks for the comment!

..nagarjuna.. said...

చిచ్చర పిడుగు బుడుగుని, నిష్కల్మషమైన స్నేహాన్ని పరిచయం చేసిన రమణ గారికి మీ బ్లాగుముఖంగా పుట్టినరోజు శుభాకాంక్షలు

శ్రీనివాస్ పప్పు said...

నిజమేనండి భాషతో నవ్వించి భావంతో ఏడిపించడం రమణ కొక్కరికే చెల్లింది.హేట్సాఫ్ టు యూ రమణగారూ.

అవునా ఈ రోజే ఆయన జన్మ దినమా అయితే ఇంకో మేధావి పుట్టిన రోజునే పుట్టారన్నమాట :)

స్వర్ణమల్లిక said...

థాంక్స్ సౌమ్యా! చదివిన కొద్దీ ఇంకా చదవాలనిపిస్తోంది. సునిసితమైన హాస్యం కదూ... కళ్ళను సన్నటి నీటి తెర తో నింపాయి.

హరే కృష్ణ said...

very nice
సూపర్ గా రాసారు
బాపు రమణ గురుంచి మీరు చెప్పినట్టు ఎంత చెప్పుకున్నా తక్కువే
రమణ గారికి బ్లాగుపూర్వకంగా జన్మ దిన శుభాకాంక్షలు

తార said...

నాకైతే బాగున్నది అని అనిపించలేదు, అలాని బాలేదు అని కాదు, మాములుగా వున్నది, ఎదో తెలియని వెలితి.

ఆ.సౌమ్య said...

@శ్రీనివాస్ పప్పు
పప్పుసారు భలే చెప్పారండీ..."భాషతో నవ్వించి భావంతో ఏడిపించడం"...బావుంది.
కొంపదీసి ఆ మేధావి మీరేనా...మిమ్మల్ని మీరే పొగిడేసుకుంటున్నారా?

@ నాగార్జున 4E గారు
thank you!

ఆ.సౌమ్య said...

@స్వర్ణమాలిక గారూ
అవునండి సున్నితమైన హాస్యం...మనసుని తడిపేస్తుంది.

@హరే కృష్ణ
thank you!

@తార
నా పైత్యం జోడించలేదు ఇక్కడ...బహుసా అందుకే మీకు వెలితిగా ఉందేమో :)

కొత్త పాళీ said...

good show.
కానీ చిన్న వయసులో విపరీతంగా అభిమానించినాక, ఈ మధ్యన (అంటే 2,3 ఏళ్ళ కిందట) విశాలాంధ్ర వాళ్ళు వేసిన సర్వస్వం సంపుటాలు చదువుతుంటే చాలా చిరాకు కలిగించినాయి రమణగారి కథలు, నవలికలు. సినీ రమణీయంలో ఆయన ఆనాటి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల సమీక్షలు మట్టుకు బాగా ఆస్వాదించాను.

చందు said...

bagundi :-)

ఆ.సౌమ్య said...

కొత్తపాళీ గారు
ధన్యవాదములు.
అవునండీ నాకు కూడా సినీరమణీయమే బాగా నచ్చింది. కదంబ రమణీయంలో కొన్ని జోకులు చిరాకు కలిగించాయి. అలాగే బుడుగు లో కూడా కొన్ని విషయాలు ముఖ్యంగా బుడుగు వాళ్ల బాబాయి సీతకి లైన్ వెయ్యడం ఇలాంటివి కాస్త చిరాకు కలిగించాయి. చిన్నపిలాడి చేత ఇలాంటి మాటలు చెప్పించారే అనిపించింది. ఈ విషయమై కౌముదిలో అస్త్రం అనే శీర్ధిక కింద ప్రసాద్ గారు ఒక వ్యాసం రాసారు, వీలైతే చూడండి. "అస్త్రం" మీకు కౌముది గ్రంధాలయంలో దొరుకుతుంది.

అందుకే ఇక్కడ కొన్ని మంచివి మాత్రమే ఏరి ప్రచురించాను.

ఆ.సౌమ్య said...

@సావిరహే గారూ
Thank you so much!

Anonymous said...

I can see smileys :P

script taking to execute :x

-- Badri

సవ్వడి said...

good post..
naadi kudaa Srinivas gaari abhipraayame..

ఆ.సౌమ్య said...

ఎక్కడ బద్రిగారూ, నాకు కనిపించట్లేదే :(

ఆ.సౌమ్య said...

@ savvadi
thank you so much!

తార said...

కోతికొమ్మొచ్చి కుడా మొదట్లో బాగుండేడి, తరువాత తరువాత చెప్పిందే చెప్పి విసిగించేస్తున్నారు అని చదవటం మానేసాను. వారు తీసినవి గొప్ప సినిమాలే, కానీ మా సినిమా గొప్ప, గొప్ప అని పదే పదే చెప్తుంటే విసుగొచ్చేస్తుంది.

ఆ.సౌమ్య said...

@tara
హ్మ్ అవునండీ, పెద్దవాళ్ళయ్యాక కాస్త చాదస్తం రావడం సహజమే. కానీ ఆయాన రాసిన కొన్ని ఆణిముత్యాలకి మాత్రం సాటి లేదు.

హను said...

manchi vishayalu gurtu chersaru thnk u

ఆ.సౌమ్య said...

@ hanu
thanks for commenting !

శివరంజని said...

సౌమ్య గారు మీరు పెట్టిన కామెంట్ , శ్రీనివాస్ పప్పు గారు పెట్టిన కామెంట్స్ కూడా పబ్లిష్ కావడం లేదండీ . ఉదయం నుండి ట్రై చేస్తున్నా . పబ్లిష్ అయినా బ్లాగ్ లో కనిపించడం లేదండీ . ప్రాబ్లం ఏమిటో కూడా తెలియడం లేదండీ . నా కామెంట్ కూడా నా బ్లాగ్ లో పబ్లిష్ కావడం లేదు . మీరు పెట్టిన కామెంట్ పబ్లిష్ చేయలేక పోతున్నందుకు క్షమిస్తారు కదూ

ఆ.సౌమ్య said...

@ శివరంజని
మేము రాసిన కామెంట్లు, మీరు ఇచ్చిన రిప్లైలు అన్ని పబ్లిష్ అయ్యాయి. బ్లాగరులో కాస్త ప్రోబ్లం ఉంది అందుకే మీకు కనిపించట్లేదు, కానీ నాకు కనిపిస్తున్నాయి. ఏం బాధపడకండి :)

karthik said...

హాసం పత్రికలో రమణ గారు ఇద్దరు మితృలు సినిమాను సీరియల్ గా రాశారు.. మనం చూసిన సినిమాని మళ్ళీ చాలా కొత్తగా ఆవిష్కరించారు.. ప్రతీ లైన్ లో ఆయన మార్క్ కనిపిస్తూనే ఉంటుంది..

ఆ.సౌమ్య said...

@కార్తీక్
ఓహ్ అవునా, అయితే చదవాల్సిందే...Thanks!