StatCounter code

Wednesday, May 19, 2010

వశీకరణవిద్య (హిప్నాటిజం)

నిన్న "అమరావతి" సినిమా చూసాను. రవిబాబు (చలపతిరావు కొడుకు) నటించి దర్శకత్వం వహించిన సినిమా. సాధారణంగా ఇతని సినిమాలు నాకు నచ్చుతాయి. ఏ ముఢనమ్మకానికి వ్యతిరేకంగానో, లేదా సైన్సు కి సంబంధించిన విశ్లేషణలతోనో సినిమాలు తీస్తూ ఉంటాడు. ఒక శాస్త్రీయ అంశం ఉంటుంది సినిమాలో.

అమరావతి విషయానికొస్తే "హిప్నాటిజం లేదా వశీకరణవిద్యను మానవళికి ఉపయోగపడేలా ఎంత ఉన్నతంగా వాడుకోవచ్చో అంతే అధమంగా మనుషులకి చెడు కలిగించడానికి కూడా వాడుకోవచ్చు, కాబట్టి జగ్రత్తగా ఉండండి. ఈ హిప్నాటిజం ని ఎవరికిబెడితే వాళ్ళకి నేర్పితే ప్రమాదాలు జరగవచ్చు" అనేది ఈ సినిమాలో పాయింటు. దాదాపు రెండు గంటల నిడివి తో కాస్త ఉత్కంఠ రేగిస్తూ బాగానే తీసారు సినిమా.

ఈ సినిమా చూసాక నాకు నా చిన్నతనంలో జరిగిన విషయం గుర్తొచ్చింది. 10 వ తరగతి వేసవి శెలవులు, ఇంకా ఫలితాలు రాలేదు. మంచి మార్కులొస్తాయని తెలిసినా ఏక్కడో చిన్న ఉత్కంఠ ఉండేది మనసులో. మా ఇల్లు ఊరి మధ్యలో కాకుండా కాస్త దూరంగా ఉండేది. అది అప్పుడే పుట్టిన కొత్త కాలనీ. అప్పటికి మా కాలనీలో 10-12 ఇళ్ళు మాత్రమే ఉండేవి. ఆ కాలనీ కి ఎదురుగా, ఎడమవైపు కనుచూపుమేర పచ్చని పొలాలు. కాలనీలో అడుగు పెట్టగానే ఎడమచేతి పక్క ఒక ఇల్లు, దానికి ఎదురుగా గేస్ గొడౌన్. తరువాత ఒక 100 మీటర్ల దూరంలో మా ఇల్లు, దానికి ఆనుకుని పక్కిల్లు. అంతే ఆ వరసలో ఇంక ఇళ్ళు లేవు. వెనక వరసల్లో అక్కడా అక్కడా ఒక్కోటి చొప్పున ఓ 10-12 ఇళ్ళు ఉన్నాయి. ఇంక చుట్టూరా పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు గొప్ప ఆహ్లాదంగా ఉండేది వాతావరణం. ఎక్కువ జనసంచారం కూడా ఉండేది కాదు. మా ఇంటి వెనక ఎడమచేతి వైపు ఒక చిన్న చెరువు, మా ఇంటి ఎదురుగా ఒక పేద్ద బావి కనీసం ఓ 5-6 మంది ఒకే టైంలో ఈతకొట్టగలిగేటంత పెద్ద బావి. అంత పెద్ద బావిని చూడడం అదే మొదలు, చివర. ఇప్పటివరకు మళ్ళీ అంత పెద్ద నుయ్యిని చూడలేదు, చూడబోనేమో. ఆ బావి పక్కనే ఒక చిన్న ఇల్లు ఉందేది. ఒకే గది ఉన్న చిన్న పెంకుటిల్లు. వాళ్ళకి ఓ రెండుమూడు గేదెలు, కాస్త పొలం ఉండేవి. ముసలి తల్లిదండ్రులు, పెద్దకొడుకు-భార్య, వాళ్ళకి చంటిపిల్ల, చిన్నకొడుకు ఉండేవారు ఆ ఇంట్లో. పాపం బాగా పేదవారు. పాలవ్యాపారం మీదే వాళ్ళ గమనం సాగుతూ ఉండేది ఎక్కువగా. ఎదురుగా ఉండేవారు కాబట్టి ఏ చిన్నపనికైనా వాళ్ళనే పిలిచేవాళ్ళం ఎప్పుడూ. అలాగే అప్పుడప్పుడూ డబ్బు, భోజనం వంటి సహాయాలు చేస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళింట్లో అందరితో మాకు బాగా పరిచయం. వాళ్ళింటికి చుట్టాలొస్తే మా ఇంటి ముందు గదిలో పడుకునేవాళ్ళు కూడా. వాళ్ళింటికి వాళ్ళ మేనమామ తరచూ వస్తూ ఉండేవాడూ. అతను కూడా మాకు బాగా తెలుసు.

ఇలా ఉన్న ఆ కాలనీ లో ఓ రోజు మధ్యాన్నాం 12.00 గంటలవేళ "సోది చెబుతానమ్మ సోది" అంటూ కేకలు వినిపించాయి. ఆ కోలనీలో ఎక్కువ ఇళ్ళు లేకపోవడం వలన వీధిలోకి వచ్చి ఎవరూ సరుకులు అమ్మడమో, ఇలా సోది వాళ్ళు రావడమో సాధారణంగా జరగేది కాదు. ఆరోజు ఈ కేక వినిపించింది. నేను మా గదిలో కూర్చుని బొమ్మలు వేసుకుంటున్నాను. చెల్లి హాల్ లో టి.వి చూస్తున్నాది. అమ్మ మిషన్ కుట్టుకుంటున్నాది. ఒక 5 నిముషాల తరువాత మిషన్ శబ్దం ఆగిపోయింది. ఇంట్లో కూడా అమ్మ అలికిడి వినిపించలేదు. ఎక్కడకెళ్ళిందబ్బా, చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళదే అని ఆలోచిస్తూ బయటకి వచ్చి చూస్తే, వీధి గుమ్మంలో ఆ సోది ఆవిడ తో మా అమ్మ కూర్చుని ఉంది. సాధారణంగా మా అమ్మ ఇలాంటివి నమ్మదు. ఎప్పుడూ ఎవరితోనైనా ఇలాంటివాటి గురించి మాట్లాడడం కూడా వినలేదు. ఇదేమిటి ఇప్పుడు ఇలా ఈవిడతో సోది చెప్పించుకుంటున్నాది అని ఆశ్చర్యపోయాను. సరేలే ఎదో ముచ్చటపడింది కాబోలు ఊరికే అని అనుకుని లోపలికి వెళ్ళిపోయాను. ఒక 10 నిముషాల తరువాత "సౌమ్యా" అని పిలిచింది.

"ఏంటమ్మా?"
"వెళ్ళి కొంచం బియ్యం, పప్పు పట్రా"
"ఎందుకు?"

ఎర్రగా చూసింది నా వైపు. మాట్లాడకుండా వెళ్ళి ఓ గ్లాసుడు బియ్యం, పప్పు తెచ్చి ఇచ్చాను.

"సరే వెళ్ళి నీ పని చూసుకో"
"సరేనమ్మా"

ఇంకో పది నిముషాలు పోయాక మా చెల్లిని పిలిచింది. తరువాత నాకేమి వినిపించలేదు. ఇంకో 15 నిముషాల తరువాత

"అక్కా, అమ్మ ఇంకా బియ్యం, పప్పు తెమ్మంటున్నాది. ఇప్పటికే రెండుసార్లు ఇచ్చాను నేను" అంది మా చెల్లి.

సరే ఈ కథేమిటో చూద్దాం అని వెళ్ళి పరిశీలనగా చూస్తే మా అమ్మ తదేకంగా ఆ సోది ఆవిడని చూస్తున్నాది. ఆవిడ ఓ ఎముక పట్టుకుని ఏవో మంత్రాలు చెప్తున్నాది. ఒక పెద్ద వెదురుబుట్టలో ఎముకలు, పసుపుకట్టిన గుడ్డలు, కాసింత కుంకం, ఇంకా ఏవో తాయెత్తులు, నిమ్మకాయలు, మన్ను, మశానం అన్నీ ఉన్నాయి. ఆ బుట్టలోనే మేము అప్పటివరకు ఇచ్చిన బియ్యం, పప్పు కూడా ఓ వారగా పోసి ఉన్నాయి.

అమ్మా అని పిలిస్తే ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు చూసింది మా అమ్మ. బియ్యం, పప్పు తీసుకునిరా అంది. వద్దమ్మా అని వారించబోతే చెడామడా ఆవిడ ముందే తిట్టింది. నాకు చిరాకేసి తెచ్చిపడేసాను. అప్పటికే బియ్యం, పప్పు రెండూ నిండుకున్నాయి. అక్కడే నిలుచుని చూస్తున్నాను ఏమి జరుగుతుందో అని. ఇలాంటి విషయాలు నాకు కొత్త. అడపాదడపా వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. అయినా సోది చెప్పేవాళ్ళు ఏదో భవిష్యత్తు గురించి నాలుగు అబద్ధాలు చెప్పి కాసింత బియ్యం, కూసింత పప్పు తీసుకెళ్తారని మాత్రమే నాకు తెలుసు. కానీ ఈ ఎముకలు, నిమ్మకాయలు ఏమిటో నాకు అర్థం కాలేదు. మళ్ళీ బియ్యం తెమ్మంది. అన్నీ అయిపోయాయి అని చెప్పాను. ఆ సోది ఆవిడ నన్ను లోపలకి వెళ్ళిపోమంది. నేను వెళ్ళను, ఉంటాను అన్నాను. మా అమ్మ చాలా కోపంగా నన్ను పిచ్చి పిచ్చిగా తిట్టింది. నాకు ఏడుపు ఒక్కటే తక్కువ. లోపలకి వెళ్ళకపోతే కొడతానని కూడా చెప్పింది. మా చెల్లి అప్పటికే బిక్కచచ్చిపోయింది. ఏమిచెయ్యాలో తెలియక లోపలికెళ్ళి ఆలోచిస్తూ కూర్చున్నాను. మరో 10 నిముషాలలో ఒక మగగొంతు అరుపులు, కేకలు వింపించాయి. చెల్లి నేను పరిగెట్టుకొచ్చి చూసాము. ఆ ఎదురింటివాళ్ళ మేనమామ ఆ సోది ఆవిడని చెడామడా తిడుతున్నాడు. అమ్మ బిత్తరపోయి చూస్తున్నాది. నిన్ను పోలీసులకప్పజెబుతాను, నాటకాలాడుతున్నవా అని నానా తిట్లు తిట్టి కొట్టబోయాడు కూడా. ఆవిడ కూడ ఏవో మంత్రాలు గట్టిగా చదువుతూ అతన్ని తిడుతూ ఉంది. అతను, ఆవిడ జబ్బట్టుకుని రోడ్డుమీదకి లాకెళ్ళి ఒక్కటి పీకాడు. ఆ దెబ్బకి తట్ట, బుట్ట పట్టుకుని పరుగులంగించుకుంది. కానీ అతను వదల్లేదు. ఆ బియ్యం, పప్పు వదిలేసి వెళ్ళమన్నాడు. కానీ అమ్మ వద్దంది, అప్పటికే వాటి నిండా ఎముకలు, పసుపు అన్ని పెట్టి ఉన్నాయి. సరే అని చెప్పి మళ్ళీ ఇటువైపు వచ్చావో చస్తావు అని ఒక్క గసురు గసిరాడు అతను. ఆ దెబ్బతో వెనక్కి తిరిగిచూడకుండా పరుగెత్తింది ఆ సోది ఆవిడ.

ఏమయిందని అతన్ని అడిగాను.

"నేను ఇందాకటి నుండీ గమనిస్తున్ననమ్మా, మీరు బియ్యం, పప్పు తెచ్చి ఇస్తున్నారు. అమ్మ మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు, ఏదేదో అంటున్నారు. అప్పుడే వచ్చి విషయం కనుక్కుందామనుకున్నాను, కానీ ఏమోలే ఆవిడ తెలిసే చేస్తున్నారు అనుకున్నాను. కానీ కాసేపోయాక మీ అమ్మగారు మంగళసూత్రం తీసి దాని బుట్టలో వేసారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఏమిటీవిడ బంగారం అలా వేసేస్తున్నారు అని గమనిస్తూ ఉన్నాను. వెనువెంటనే నల్లపూసలు కూడా తీసి వెయ్యబోయారు. పరిగెత్తుకొచ్చి ఆ సోది దాన్ని గదమాయించాను. అమ్మేమో ఉలిక్కిపడి, ఏమీ అర్థం కానట్లు చూస్తున్నారు. అప్పటికి నాకు విషయం పూర్తిగా అర్థమయింది. దానిమీద నాలుగు కేకలు వేసాను, ఈ లోగా మీరు కూడా వచ్చారు. నేను చూసి ఉండకపోతే ఇల్లంతా దోచేసి ఇచ్చేద్దురు మీ అమ్మగారు. ఏమిటమ్మా మీలాంటి చదువుకున్నవాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తే ఎలామ్మా" అని కాస్త చివాట్లు కూడా పెట్టాడు.

నాకు మా అమ్మ మీద ఎక్కడలేని కోపమొచ్చింది. కానీ తనని చూస్తే జాలేసింది. కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏమీ మాట్లాడలేకపోయింది. తనే అలా చేసింది, అలా బంగారం తీసి ఇచ్చింది అని నమ్మలేకపోయింది. తనకి ఏమీ తెలియలేదని కూడా చెప్పింది. సరేలెండి ఏదో అయిపోయింది, అమ్మని లోపలకి తీసుకెళ్ళి తలుపేసుకోండి అని చెప్పేసి అతనెళ్ళిపోయాడు. అమ్మేమీ మాట్లడలేదు. అసలేం జరిగింది, ఏమి జరుగుతోంది అని కూడా తెలుసుకోలేని పరిస్థితిలో మతిపోయినదానిలా ఉంది. బాగా షాక్ తిన్నట్టు ఉంది. అన్నం తినమంటే తినకుండా గదిలోకి వెళ్ళి పడుకుంది. నేను, చెల్లి ఏదో ఇంత ముద్ద తినేసి భయంగా, బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాం. సాయంత్రం 6.00 గంటలకి నాన్నగారింటికొచ్చారు. ఆయన రాగనే అమ్మ లేచి భోరున ఏడవడం మొదలెట్టింది. వెక్కి వెక్కి ఏడ్చింది. నాన్న కంగారు పడ్డారు. నేను జరిగిన విషయమంతా చెప్పాను. ఒక్క నిముషం ఆయన మొహంలో భయం, ఆందోళన చూసాను. వెంటనే నవ్వేసి "సరేలెండి జరిగిపోయిందేదో జరిగింది, ఇక మీదట జాగ్రత్తగా ఉండండి."అన్ని చెప్పి మా అమ్మ ఏడుపు ఆపే ప్రయత్నం చేసారు. ఇంక అక్కడనుండి మా అమ్మ మీద, జరిగిన విషయం మీద జోకులేస్తూ ఉన్నారు అమ్మ నవ్వే వరకు.


Wednesday, May 5, 2010

అచ్చ తెలుగు పదాలు

నాకు తెలుగు మీదున్న ప్రేమ నా చేత కొన్ని పనులు చేయిస్తూ ఉంటుంది, ఇప్పుడు కొత్తగా నేను చేపట్టిన పని అచ్చ తెలుగు పదాలని వెతకడం.

మూలద్రవిడ భాష నుండి తమిళం, తెలుగు, కన్నడం వచ్చాయని మనకి తెలుసు. ఆర్య సంస్కృతి, ద్రవిడ సంస్కృతిలో విలీనమయినప్పుడు భాగంగా సంస్కృతం, ద్రవిడ భాషలన్నిటిలోనూ బాగా కలిసిపోయింది. ఈరోజుకి ఏది అచ్చ తెలుగు పదమో, ఏది సంస్కృతపదమో పోల్చుకుని, విడదీయలేనంతగా సంస్కృతం తెలుగులో కలిసిపోయింది. గ్రాంధికం నుండి వ్యవహారికానికి, పద్యం నుండి గద్యంలోకి సాహిత్యం మార్పు చెందినా, చాలామటుకు సంస్కృతపదాలు రాతల్లోనూ వాడుకలోనూ దొర్లుతూనే ఉన్నాయి.

ద్రవిడ భాషనుండి ఆర్య భాషను వేరు చెయ్యడం అనే ప్రక్రియలో తమిళులు మనకంటే చాలాముందు ఉన్నారు. అసలు ఎందుకు చెయ్యలి అని అడిగితే నా దగ్గర ఒప్పించదగ్గ సమాధానం లేకపోవచ్చుకానీ, నా భాషలోని అసలు పదాలను తెలుసుకోవలన్న తృష్ణ మాత్రం ఉంది, అంతే. సంస్కృతమంటే నాకు ఇష్టమే. దానిలో ఒక తియ్యదనముంది, అది నాకు ఇష్టమే. కానీ అచ్చ తెలుగు పదాలను వెతకాలన్న జిఙ్ఞాస మాత్రం ఓ 4-5 యేళ్ళ క్రితం "భ్రమణ కాంక్ష" అనే పుస్తకం చదవడంతో మొదలయ్యింది. ఈ పుస్తకాన్ని ఎం.ఆదినారాయణగారు రాసారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఆయనకి దేశలో నలుమూలలకి కాలినడకన పోవడం ఇష్టం. వారు యూనివర్సిటీలో సంపాదిచంచుకున్న శిష్యులతో కలిసి చాలా యాత్రలు చేసారు. కొన్ని నదుల పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి, కొన్ని ప్రదేశాల ఆద్యంతాలు చూడడానికి, ఇలా అనేక కారణాలతో ప్రయాణాన్ని సాగించారు. ఈ పుస్తకం గురించి, ఈయన గురించి మరెప్పుడైనా వివరంగా రాస్తాను.

ఈ పుస్తకంలో, ఆయన గుండ్లకమ్మ నది పరీవహకప్రాంతలో ప్రయాణించినప్పుడు, మధ్యలో తగిలిన గ్రామాల తీరుతెన్నులను పరిశీలిస్తూ వాళ్ళ భాష గురించి కూడా రాసారు. ఈ నది కర్నూలు, ప్రకాశం ప్రాంతాలలో ఉంది అనుకుంటాను, సరిగ్గా గుర్తు లేదు. ఆ వ్యాసంలో కొన్ని పదాలకు నాకు అర్థం తెలియలేదు. పరిశీలిస్తే అవి అచ్చ తెలుగు పదాలని ఆ మారుమూల గ్రామాలలో వాడుకలో ఉన్నాయనీ తెలిసింది. అదే సమయంలో "చరిత్ర" ని అధ్యయనం చేస్తున్న విద్యార్థితో ఈ విషయం ప్రస్తావించగా "అవును, నిజమే కోస్తా ఆంధ్రలో మారుమూల పల్లెలలో, ఎక్కడో గిరిజన ప్రాంతాలలో అచ్చ తెలుగు భాష వాడుకలో ఉంది, అది మనకి అస్సలు అర్థం కాదు" అని చెప్పాడు. ఈ విషయంపై ఎవరో పరిశోధన చేసారు, వివరాలు ఇస్తాను అన్నాడు కానీ ఇవ్వలేదు. ఆ వ్యక్తిని మరల నేను కలవడం జరగలేదు. కాబట్టి ఆ గిరిజన ప్రాంతాలు కనుక్కునే పని, అచ్చ తెలుగు తెలుసుకునే పని అక్కడే ఆగిపోయింది. అప్పటినుండి మొదలయ్యింది నా అచ్చ తెలుగు పదాల వెతుకులాట. కాకపోతే దీనిపై ఎంత కోరిక ఉన్నా, పరిశోధనకి సమయం కేటాయించలేకపోతున్నాను, ఒక చెంచాడు భవసాగరాలు ఈదుతున్నానుకదా మరి. ఈ మధ్యనే అంటే ఓ 2-3 నెలల క్రితం మళ్ళీ ఈ కోరిక కొత్తగా చివురించింది వసంతకాల మహిమో ఏమో మరి. అందుకే ఇక్కడ ఇలా ప్రస్తావిస్తున్నాను.

ఈ బ్లాగులోకంలో తెలుగు బాగా తెలిసిన, రాస్తున్న వాళ్లని చూసాను. ఈ విషయంలో వాళ్ళేమైనా నాకు సమాచారం అందించగలరని ఆశిస్తున్నాను. కొత్త పదాలు నాకు తెలియజేయగలరని కోరుతున్నాను.

బ్రౌణ్య నిఘంటువులో చూస్తే తెలిసిపోతుంది కదా అని నన్ను అడగొచ్చు. నిఘంటువులో చాలమటుకు పదాలకి సంస్కృతం, తెలుగు అని బ్రాకెట్లలో రాస్తూ ఉంటారు. కానీ కొన్నిపదాలు ఉండవు. ఒకే పదమయితే ఉండొచ్చేమోగానీ, రెండు పదాల కలయికతో ఉన్నవి నిఘంటువులో లేవు. కాబట్టి మీరంతా మీకు తెలిసిన అచ్చ తెలుగుపదాలను నాకు తెలుపగలరని ఆశిస్తున్నాను.

నాకు తెలిసిన కొన్ని అచ్చ తెలుగు పదాలని ఇక్కడ ప్రస్తావిస్తాను.

మేలిపొద్దులు - అంటే శుభోదయం. చూసారా మన పరిస్థితి, అచ్చ తెలుగు పదానికి సంస్కృతంలో అర్థం చెప్పుకోవలసి వస్తున్నది. మనకి శుభోదయం అనే పదం తెలుసే తప్ప మేలిపొద్దులు అన్నది తెలియదు, బహుశా చాలా తక్కువమందికి తెలుసేమో. "మేలు", "పొద్దు" అన్నవి ద్రవిడ భాషలో నుండి వచ్చిన పదాలే.ఈ పదం నేను నేర్చుకున్న దగ్గరనుండీ వాడకం అలవాటు చేసుకుంటున్నాను. అలాగే నా బ్లాగ్మిత్రులు కొందరికి అలవాటు చేసాను. మేము ఆన్లైన్లో కలిసినప్పుడు, లేదా ఏదైనా బ్లాగులో కలిసినప్పుడు మేలిపొద్దులు అని చెప్పుకోవడం పరిపాటిగా మారింది.

మప్పితాలు - అంటే ధన్యవాదాలు, కృతఙ్ఞతలు అని విన్నాను. కానీ మప్పితము అంటే మితము, పరిమితము అని నిఘంటువులో ఉంది. మీకెవరికైనా అసలు అర్థం తెలిస్తే చెప్పండి.

సుమాళి - సంతోషంగా జీవించునది/వాడు అని అర్థం.

పెద్దలమనిషి - గర్భవతి, కడుపుతో ఉన్నవారు

విరాళి - వలపు

అంకిలి - కలత

కంగారు, కంగిస - యుద్ధం

మంచుతెఱి - హేమంత ఋతువు

మలికితము - సందేహం

సరవి - క్రమము, సరళి

సవరన - చక్కన, చదును చెయ్యడం

సాకము - ఉత్సవము

సాకు - వాయిద్యము

ఇలా మీకు తెలిసిన కొత్తపదాలేమైనా ఉంటే తెలుపగలరు.

Monday, May 3, 2010

"సిరివెన్నెల" పాటలు

గతవారం కొత్తపాళీగారు "మూడు ప్రభంజనాలు" అని ఒక టపా పెట్టారు. ఆ మూడు ప్రభంజనాలు ఏమనగా

యండమూరి వీరేంద్రనాథ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మరియు ఇళయరాజా.

నేను సిరివెన్నెల గురించి రాసాను. అదే మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను కొన్ని సవరణలతో.

సిరివెన్నెలగారి పాటలంటే నాకు ఎంతో ఇష్టం. మొట్టమొదటగా నేను విన్నవి సిరివెన్నెల సినిమలోవే. అందులోనా "ఆదిభిక్షువువానినేమి అడిగేది" అనే పాట గొప్పగా అనిపించింది. చిన్నచిన్న పదాలతో గొప్ప భావాలను పొందుపరిచారు. నిందాస్తుతి అనేది ఒక ప్రక్రియ. దేవుని మీద భక్తి కన్న భాష మీద భక్తి ఎక్కువ నాకు. ఆమూలంగా ఈ పాట బాగా నచ్చింది. ఆ పాట విన్నప్పుడల్లా ఏదో తెలియని గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇది అని చెప్పలేను కానీ శక్తివంతంగా అనిపిస్తుంది. బహుసా అది భాష గొప్పతనమేమో మరి.

నన్ను బాగా ఉత్తేజపరిచిన పాట అంకురం సినిమాలో "ఎవరో ఒకరు ఎపుడో ఒపుడు".

"ఎవరో ఒకరు ఎపుడో ఒపుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు
మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుకవచ్చు వాళ్ళకు బాట అయినది"
......అన్న పదాలు నేను ఎప్పుడూ పాడుకుంటూ ఉంటాను. ఎందరో సంస్కర్తలు ప్రపంచం నలుమూలలా ఇలాగే ఆలోచించి ముందుకి కదిలి ఉంటారు. ఆ పద్ధతిలోనే నేను నా జీవితంలో ఎన్నో కొత్త పద్ధతులను ఆచరించాను. అవన్ని ఇప్పుడు రాయలంటే కష్టం కానీ ఏదో ఒకరోజు నా బ్లాగులో రాస్తాను.

తరువాత గాయం సినిమాలో "నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని" మరియు అలుపన్నది ఉందా ఎగిరే అలకు" అన్న పాటలు.

"నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ, ఎవ్వరు ఏమైపోనీ"

పాతరాతి గృహలు పాలరాతి గృహాలైనా, అడవినీతిమారిందా ఎన్నియుగాలైనా
వేట అదే, వేటు అదే, నాటి కథే అంతా,నట్టడువులు నడివీధికి నడిచొస్తే వింతా?
బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ"

నిన్ననే ఒక పోస్ట్ చూసాను (http://palavelli.blogspot.com/2010/05/blog-post.html) దళితులని ఇంకా తక్కువగా చూస్తూ, అంతరానితనాన్ని అవలంబిస్తున్న ఒక గ్రామం గురించి. ఆ పోస్ట్ చదివునప్పుడు నాకీపాటే గుర్తొచ్చింది. "వేట అదే వేటు అదే నాటి కథే అంతా".....నిజమేననిపించింది.

........ఎప్పుడైన వ్యవస్థలో ఉన్న కుళ్ళుని చూసినప్పుడల్లా ఈ పాట గుర్తు వస్తుంది నాకు. నేనేమీ చెయ్యలేనా అని బాధపడినప్పుడు "ఎవరో ఒకరు ఎపుడో ఒపుడు" పాట గుర్తొస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది.

అలుపన్నది ఉందా ఎగిరే అలకు, యదలోని లయకు,
నాకోసమే చినుకై విరిసి ఆకాసమే దిగదా ఇలకు
.....ఈ పాట విన్నప్పుడల్లా ఏవేవో లోకాలకి వెళ్ళిపోతూ ఉంటాను.

ఈ మధ్య వచ్చిన "మహాత్మ" సినిమాలో
"తలయెత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక తులలేని జన్మమ్మునాదని"
.......
తెలుగు చాలా ఇష్టమైన నాకు ఈ పాట గొప్ప ఉత్తేజాన్ని, ఆత్మవిశ్వాశాన్ని కలిగించింది. ఎన్నిసార్లు విన్ననో నాకే తెలీదు.

మరొక అద్భుతమైన పాట

"అర్ధశతాభ్ధపు అజ్ణానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మవినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా, దానికి సలాముచేద్దామా...."

నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా దాన్నే స్వరాజ్యమందామా"

అన్నిటికంటే గొప్ప పాట:
"ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏక్షణం, విస్మరించవద్దు నిర్ణయం. అప్పుడే నీ జయం నిశ్చయం రా"

మానవుడు తన ఉనికి కొసం ప్రకృతితోనూ, వ్యవస్థ తోనూ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉండాలి అనే విషయాన్ని సూచిస్తుంది. జీవించాలనే గొప్ప ఆశని కలిగిస్తుంది. ఈ పాట "పట్టుదల" అనే సినిమాకోసం రాసినది. కానీ సినిమాలో రాలేదు.

ఇంకా చెప్పాలంటే
"జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాది, సన్యాసి జీవితం నాది

మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై
రవినై, శశినై, దివమై, నిస్నీ
నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే భ్రమిస్తూ"
ఒంటరినై ప్రతి నిమిషం కంతున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాలా, హరిణాన్ని హరిణాల, చరణాల్ని చరణాల చలనాల కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని"
............
అహం బ్రహ్మాస్మి భావన.

రుద్రవీణలో "నమ్మకు నమ్మకు ఈ రేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి, మత్తులోన మెత్తగ తోసి కలలే వలగా విసిరే చీకట్లను"....గొప్ప పాట

కొత్త "మాయాబజార్" లో"కనివిని ఎరుగని ఈ కల, నిజమని పలికెను కోకిల,
ప్రతి ఒక అణువున నేడిలా, అవనికి వచ్చెను నవకళ,
అలరులు కురిసిన ఈ ఇల మెరిసెను నూతన వధువులా, తొణికిన తూరుపు వెలుగిలా పుడమికి అలరెను మేఖల"

నాకు నచ్చిన ఒంకొక మంచి పాట లిటిల్ సోల్డియర్స్ లోనిది

"సరేలే ఊరికో, పరేషానెందుకు?
చలేసే ఊరిలో జనాలే ఉందరా!
ఎడారి దారిలో ఒయాసిస్ ఉండదా!"

"కోకిలమ్మ ఆకలైనా ట్యూను మాత్రం మార్చదే
రామచిలక రాతిరైనా కీచురాయై కూయదే
అలాగే నీ పెదాల్లో నవ్వునెప్పుడు మారనీయకే ఏమైనా
కష్టమొస్తే కేరు చెయ్యక నవ్వుతో తరిమేయవమ్మా"

చిన్న చిన్న ఆగ్ల పదాలను కలిపి అవి కూడా తెలుగే అనే భ్రమని సృష్టించడంలో ఈయన దిట్ట. అలాంటి ప్రయోగమే ఇంకొక పాట

"భద్రం బికేర్ఫుల్ బ్రదరు
భర్తగ మారకు బేచులరు
షాదీమాటే వద్దు గురు
సోలో బ్రతుకే సో బెటరూ"

అలాగే మనీ సినిమాలో చిన్న చిన్న పదాలతో లోకం తత్వాన్ని చెప్పే పాట. డబ్బు పేరు పెట్టి మనుషుల స్వభావాలను చాలా గొప్పగా చెప్తారు.

"చక్రవర్తికీ వీధి బిచ్చగత్తికి బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు అయినా అన్నీ అంది మనీ మనీ

రోటీ కపడా రూము అన్ని రూపీ రూపాలే
సొమ్ములే శరణమ్మని చరణమ్మునమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మి ని లవ్వాడి కట్టుకోరా"

ప్రేమ పాటలు రాయడంలో ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి

"నా ప్రతి యుద్ధం నువు, నా సైన్యం నువ్వు
నా ప్రియశత్రు నువ్వు, నువ్వు
వెచ్చని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు, నచ్చే కష్టం నువ్వు"

"నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
"పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని
ఏతోడుకూ నోచుకోని నడకెంత అలుపో అని"

తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు,
తప్పని స్నేహం నువ్వు నువ్వు,
తియ్యని గాయం చేసే అన్యాయం నువ్వు, అయినా ఇష్టం నువ్వు నువ్వు"

"వెంటనే నీ మది, పొందనీ నెమ్మది
అని తలచే యద సడిని పదమై పలికి మంత్రం వేయనీ"

"భూమి కనలేదు ఇన్నాళ్ళుగా, ఈమెలా ఉన్న ఏ పొలికా
అరుదైన చిన్నారిగా, కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా"

"నేననీ నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒక్కరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా"

"ఉండుండి ఇలా ఉబికొస్తుందేం కమ్మానైన కన్నీరు, తీయనైన గుబులిది అంటే నమ్మేదెవ్వరు?
మధురమైన కబురందిందే కలతపడకు బంగారు, పెదవి తోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరు !"

"గంగలాగ పొంగిరానా ప్రేమసంద్రమా, నీలో కరిగి అంతమవ్వనా ప్రాణబంధమా!
అంతులేని దాహమవనా ప్రియప్రవాహమా, నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా"

"సమయమా చలించకే, బిడియమా తలొంచకే
తీరం ఇలా తనకు తానే వెతికి జతకి చేరే క్షణాలలో"

"పాదం కదలనంటుందా ఎదురుగా ఏమలుపుందో కాలం ముందే చూపందే
దూరం కరగనంటుందా తారలను దోసిట పట్టే ఆశలు దూసుకుపోతుంటే
లోతెంటో అడగనని పడవల్లే అడుగేస్తే దారీయను అంటుందా కడలైనా
తన కలలుగ మెరిసే తళుకులతీరం నిజమై నిలిచే నిముషం కోసం దిశలను తరిమే ఉరుమే ప్రేమంటే
నువ్వే తన ఐదోతనమని నోచే నోముంటే నిత్యం నీ జీవితమంతా పచ్చనిపంటవదా?
తానే నీ పెదవులపై చిరునవ్వై నిలిచే ప్రేముంటే ఆ తీపికి విషమైనా అమృతమైపొదా"

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.....

కొన్ని పదాల కలయిక, వాటి భావం కొత్తకొత్త అర్థాలని చెప్తూ ఉంటాయి.
ఉదాహరణకి

"నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే"

"ఆటనే మాట కర్ధం ...నిను నువే గెలుచు యుద్దం"

"వెక్కెక్కి ఏడ్చే కన్నీళ్ళు ఉప్పన
ఫక్కుమన్న నవ్వే ఒక తేనె ఉప్పెన"

"ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా
గుండెబావిలో వున్న ఆశతడి ఆవిరి అవుతున్నా"

ఇలా అడుగడుగునా, అణువణువునీ కదిలించే ఎన్నో ఆణిముత్యాలు సీతరామశాస్త్రిగారి కలం నుండి జారిపడ్డాయి. ఇంకా గొప్ప కవులు లేరని కారు, కానీ నాలో ఉత్తేజాని కలిగించింది పింగళిగారి తరువాత ఖచ్చితంగా సీతారామశాస్త్రిగారే.

మూడు దశాబ్దాలైనా "బూతు పట్టని కలం" సిరివెన్నెల మనం.....కాదంటారా?