StatCounter code

Tuesday, March 20, 2012

పనిమనిషి!

"మనీ కోసం పని చేసే షి" అని అర్థం చెప్పుకుని చిన్నప్పుడు చాలా నవ్వుకునేవాళ్ళం.  పనిమనిషంటే మనలో చాలామందికి (నాతో కలిపి) ఉండే అభిప్రాయం "చులకన". అవును, పనిమనిషులు మనకి చులకన. మనం తినగా మిగిలినదో, పాచిదో వాళ్ళకి ఇస్తాం. బాగా వాడి వాడి విసుగెత్తిన బట్టలు ఇస్తాం. మన కాళ్ళ దగ్గర ఉండే మనిషి అని మనకి అభిప్రాయం. వయసులో ఎంత పెద్దవాళ్ళైనా సరే "ఒసేయ్" "ఏమే" అనే ఉంటాయి పిలుపులు. మనం ఆఫీసులో ఎంత పెద్ద తప్పులు చేసినా బాస్ కోప్పడితే ఏదో ఒక్కసారి జరిగినదానికే ఇంతలా అరవాలా అని చాల మధనపడతాం. ఇంట్లో మాత్రం పనిమనిషి మీద ఊరికూరికే కేకలు వేస్తాం. పనిఎగ్గొట్టడానికి వీళ్ళు వెయ్యి నాటకాలు ఆడతారని మన ప్రగాఢ విశ్వాసం. వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ అడిగి తెలుసుకుని మనమేదో గొప్ప తెలివైనవాళ్ళలాగ సలహాలిస్తుంటాం. మన ఇంట్లో విషయాలు మాత్రం నోరిప్పము. కొంచం ఎవరైనా చొరవగా ప్రవర్తిస్తే భగ్గున మండిపడతాము. "నువ్వు" అని సంభోదించారో నానారభస చేస్తాము. పనిమనిషికి టీ తాగడానికి వేరే కప్పు. అన్నానికి వేరే కంచం. నేనేమీ ఈ ప్రవర్తనకు అతీతురాలిని కాదు. అసలిలా చెయ్యొచ్చా, చెయ్యకూడదా అన్న ఆలోచన కూడా నాకెప్పుడూ రాలేదు. ఇంట్లో పనిమనుషుల సంగతి అమ్మ చూసుకుంటుంది. వాళ్ళతో నేనప్పుడూ మాట్లాడేదాన్ని కూడా కాదు. ఆ అవసరం కూడా ఉండేది కాదు. 

ఢిల్లీ లో ఉద్యోగార్థమై అడుగుపెట్టాక మొట్టమొదటిసారి పనిమనిషితో నేను మాట్లాడవలసి వచ్చింది. సంగీత అని చక్కని మనిషి. నన్ను వదిన అని పిలిచేది. ఇక్కడ మనిమనుషులందరూ అంతే యజమానులను అన్నయ్య, వదిన అని పిలుస్తారు. ఇల్లుని కడిగిన ముత్యంలా తయారుచేసేది. అంత పనిమంతురాలిని నా జీవితంలో చూడ్డం అదే మొదటిసారి. ఓరోజు టీ ఇచ్చాను ఒక కప్పులో పోసి. తాగి కడిగేసి ఆ కప్పు ఒక వారగా పెట్టింది. నేను చూసానుగానీ పెద్దగా పట్టించుకోలేదు. మర్నాడు టీ ఇద్దామని కప్పులు తియ్యమంటే మా ఇద్దరికీ రెండు తీసి, ఆ వారగా పెట్టిన తన కప్పు తెచ్చుకుంది. "ఇదేమిటి" అని అడిగాను. కొంచం సందేహిస్తూ నావైపు చూసింది. గట్టిగా చెప్పాను అలా ఏమీ చెయ్యక్కర్లేదు. మేము తాగే కప్పులో నువ్వూ తాగొచ్చు. అలా నీ కప్పు వేరుగా పెట్టొద్దు అని. సంతోషంగా నావైపు చూసింది. నాకెందుకో నేనేదో గొప్ప పనిచేసేసినట్టు ఆనందంగా అనిపించింది. ఇంకోరోజు బట్టలేమైనా ఉంటే ఇమ్మన్నాది. డబ్బులిచ్చి కొత్తవి కొనుక్కొమన్నాను. ఆనందంగా నవ్వుతూ డబ్బులు తీసుకుంది. నాది చాలా విశాల హృదయమని మురిసిపోయాను నేను. సంగీతకి ఇద్దరు పిల్లలు. పెద్దవాడికి ఐదేళ్ళు. చిన్నపాపకి రెండేళ్ళు. పనికి వచ్చినప్పుడు వాళ్ళనీ వెంటబెట్టుకుని వచ్చేది. కుర్రాడు బయటకిపోయి ఆడుకునేవాడుగానీ ఆ చంటిది మాత్రం ఇల్లంతా చిందరవందర చేసేది. దాన్ని కాపలా కాయల్సి వచ్చేది. మొదట్లో చికాకుపడేదాన్ని దీనికి మనమేమైనా పనిమనుషులమా పిల్లని ఆడించడానికి అని. ఆ పసిది మాత్రం బోసినవ్వులతో దగ్గరకు వచ్చేది. కొన్నిరోజుల్లోనే ఆ పిల్లది మాకు దగ్గరైపోయింది. ఆ చంటిదానితో సరదాగా గడిచేది కాలం. అప్పుడే మొదటిసారి నాకే చాలా ఆశ్చర్యమేసిన సంగతి..."పనిమనిషి పిల్లతో ఆడుకోవడమా!" లోపల ఏదో పొర మెల్లిగా కరుగుతున్నట్టు అనిపించింది. 

కొన్నాళ్ళకి ఇల్లు మారాం. "అమీనా" బక్కచిక్కిన మనిషి.  పేరు వినగానే చలం కథ "అమీనా" గుర్తొచ్చింది. మొదటిసారి ఇంటికొచ్చినప్పుడు "అసలు ఇది పనిచేస్తుందా, ఒంట్లో ఓపిక ఉందా" అని డౌటొచ్చింది. సంగీత అంతకాకపోయినా 80% చేసేది. అమాయకంగా ఉండేది అమీనా. రాజస్థానీట. కొన్నేళ్ళ క్రితం ఢిల్లీ వచ్చి పనులు చేసుకోవడం మొదలెట్టారు. ఇంట్లో అక్కచెల్లెళ్ళు, వదినలు అందరూ పనిమనుషులే. సంగీత లాగే ఈ అమీనా కూడా చాలా నిజాయితీపరురాలు. ఎక్కడ ఉన్న వస్తువు అక్కడే ఉండేది. ఈ అమీనా ఉన్నప్పుడయితే మేము ఒక్కోసారి పొద్దున్నే లేచేవాళ్ళం కూడా కాదు. తను మాత్రం వచ్చి నిశబ్దంగా పనిచేసేసుకుని, వెళ్ళిపోయేటప్పుడు నిద్రలేపేది. ఏరోజూ ఇంట్లో చిల్లి గవ్వ కూడా పోయిన దాఖలా లేదు. కొన్ని నెలల తరువాత అమీనా వచ్చి "వదిన, మా ఊరెళ్ళాలి. అమ్మకి ఒంట్లో బాగాలేదు. నేను వెళ్ళి సాయం ఉండొస్తాను" అంది. "అయ్యో మరి ఇంట్లో పనెలా?" అని అడిగాను. "నేనొచ్చేవరకూ మా చెల్లి చేస్తుంది" అంది. "సరే వెళ్ళిరా. బెంగపడకు, అమ్మకి నయమవుతుందిలే" అని చెప్పి కొంత డబ్బు చేతిలో పెట్టాను. తటాలున వచ్చి కౌగలించుకుంది. నేను ఉలిక్కిపడ్డాను. పనిమనిషి వచ్చి నన్ను కౌగలించుకోవడం....నేను కలలో కూడా ఊహించలేదు. నా మొహంలో ప్రసన్నత పోయిందని నాకే అర్థమయ్యింది. కష్టపడి చిరునవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు నాకే తెలిసింది. నన్ను విడిచి సంజాయిషీ చెబుతున్నట్టు "కొన్నాళ్ళు పనిచేసాక వాళ్లపై అభిమానం ఏర్పడుతుంది వదిన...వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉంటుంది" అంది. నాకు కళ్ళంట నీళ్ళు తిరిగిగాయి. మనసులో గొప్ప దుఃఖం పొంగిపొర్లుతున్నట్టు అనిపించింది. బయటకి మాత్రం "ఊ" అని అనగలిగాను, అంతే. ఓ రెండు నిముషాల్లో తేరుకుని అది వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి భుజం మీద చెయ్యి వేసి, దగ్గరకు తీసుకుని మళ్ళీ ధైర్యం చెప్పాను. పాపం అమీనా కళ్లనీళ్ళు పెట్టుకుంది ఎందుకో! నాకు లోపల ఒక్కో తెర తొలగిపోతున్నట్టు ఒక ఫీలింగ్. పనిమనిషి నన్ను కౌగలించుకుంది అన్న విషయం కుదిపి పారేసింది. కొన్నిరోజులు అది నా బుర్రలో తిరుగుతూనే ఉంది. నా ఆలోచనలు సుడి తిరుగుతూనే ఉన్నాయి.

మళ్ళీ ఇల్లు మారాము. ఈసారి భారతి వచ్చింది మా ఇంటికి. మంచి చలాకీ మనిషి. వయసు 40 పైనే. నిజాయితీకి మారుపేరు. చురుకుగా సరదాగా ఉంటుంది. నేను ఏదైనా అంటే నామీదే మళ్ళీ అరుస్తుంది (నవ్వుతూ అరిచేది). మొదట్లో నామీద అరుస్తోందేంటి అని విస్మయంగా ఉండేది. కానీ అప్పటికే మాయపొరలు తొలగి ఉండడంతో చిరాకు కలిగేదికాదు. నేను తిరిగి "అరుస్తున్నావెందుకు" అని అరిచేదాన్ని. :) అలా ఇద్దరం  సరదాగా ఒకరిమీద ఒకరం అరుచుకుంటాం ఇప్పటికీ. రెండేళ్ళై మా ఇంట్లోనే పని చేస్తోంది. మిగిలిపోయినది, పాచివి ఇవ్వడం అన్న సమస్యే లేదు. మేమైదైనా కొనుక్కుంటే తనకీ ఒక పొట్లాం కట్టిస్తాను. డబ్బుల దగ్గర పేచీయే లేదు. వచ్చిన దగ్గర నుండీ కబుర్లు చెబుతూ పనిచేస్తుంది. తన నోరు ఒక్క నిముషం మూతపడదు. తన సొంత విషయాలు, ఊర్లో విషయాలు అన్నీ చెబుతుంది. మా అమ్మ, నాన్న ఇంటికి వస్తే ఎంతో ఆదరంగా వాళ్ళతో మాట్లాడుతుంది. అమ్మకి మంచి ఫ్రెండ్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ కాళ్ళకి దణ్ణం పెడుతుంది పెద్దవాళ్ళ ఆశీస్సులు కావాలంటూ. అలా పడేసింది వాళ్ళని :) ఈ మధ్యన తనకి కాస్త ఒంట్లో బాగాలేక ఒక ఇల్లు మానేద్దామనుకుంది. మానేస్తే మా ఇల్లు గానీ, మా కింది ఇల్లుగానీ మానేయాలి. నాతో ఆ మాటే చెప్పింది. "మా ఇల్లు మానేయకు" అని మాత్రం చెప్పాను నేను. కిందింటి వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. దానితో పాటు "పై ఇల్లు మానేయ్ కావాలంటే" అని కూడా చెప్పారట. మొన్నోరోజు వచ్చి "కింద వాళ్ళ ఇల్లు మానేసాను వదినా...వాళ్ళ ప్రవర్తన బాలేదు. నన్నసలు మనిషిలాగే చూడరు. మీతో ఇంత సరదాగా ఉంటానా, అక్కడికి వెళితే నోరే మెదపను. పైగా ఈ మధ్య మీ ఇల్లు మానేయమని బలవంతపెట్టారు నన్ను. మీ ఇల్లు ఎలా మానేస్తాను. మీరు నాకు ఎంత దగ్గరయ్యారు! అందుకే వాళ్ళదే మానేసాను" అని దగ్గరకొచ్చి ఆప్యాయంగా చెయ్యి పట్టుకుంది. నామొహం వెయ్యొ ఓల్టుల బల్బులా వెలిగిపోయింది అని వేరే చెప్పక్కర్లేదుగా!

అప్పుడు నాకే అనిపించింది......నేను పూర్తిగా మారిపోయాను. మా భారతి, నేను తనని అభిమానిస్తున్నానని మనస్పూర్తిగా నమ్మింది. నేను మారాను. నా ఆలోచనలు మారాయి! ఇప్పుడు పనిమనుషులంటే నాకు చులకన కాదు.


23 comments:

జ్యోతిర్మయి said...

సౌమ్యగారూ జీవిత౦ నుంచి అహాన్ని వదిలివేసే పాఠం నేర్చుకున్నారు. ఆ విషయాన్ని ఏ భేషజాలు లేక మాతో పంచుకున్నారు కూడానూ.
మిమ్మల్ని చూస్తే అసూయగా ఉందండీ..పాఠం నేచుకునే ప్రహసంలో ముగ్గురి మనసులు దోచేశారు...

రాజ్ కుమార్ said...

హ్మ్మ్.. బాగుందండీ.. మీ ఫ్రెండ్సూ, మీరూనూ.

మా ఇంట్లో పనిమనుషులు ఎవరూ లేరు. ఇప్పుడు ఉన్నారు గానీ నేను ఇంట్లో లేను కాబట్టీ పెద్దగా తెలీదు.

అయితే చాకలమ్మ/అయ్య లతో మాత్రం అబ్బో.. మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మా లచ్చిమి[ముసలావిడే గానీ మహానుభావురాలు] తో ఎంత అనుబంధమంటే, మేము ఊరుమారిపోయినప్పటి నుండీ కూడా మా నాన్నగారు బట్టలన్నీ ఇంటికి తీసుకెళ్ళీస్తున్నారు [20km] ఇప్పటికీ.. :):):)

ఇక్కడ బెంగుళూర్ మా రజక్ నాగరాజు ని మేమంతా "నాగరాజు గారూ" అని పిలుస్తాం. ఎంత క్లోజంటే ఇంటికొచ్చి స్నాక్స్ పాకెట్స్ అన్నీ మాకు మిగల్చకుండా తినేస్తాడు ;)))

నలభై ఏళ్ళూ పైబడిన మీ భారతి మిమ్మల్ని వదినా అని పిలుస్తాదా?? మీ వయసెంతండీ?? ;)

Narayanaswamy S. said...

nice

మాలా కుమార్ said...

నా దగ్గరా అంతే పనివాళ్ళు చనువుగా ఇంట్లో మన్షుల్లాగానే వుంటారు . పనిమనుషులు మారటము అన్న సమస్యే వుండదు నాకు . ఇల్లు మారినప్పుడు మారుతారు అంతే :)

మధురవాణి said...

మామూలు మనుషుల్లోలానే పనిమనుషుల్లో కూడా మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉంటారు గానీ అంతవరకూ వెళ్ళకుండానే మీరన్నట్టు ముందు నుంచే 'పనిమనిషి' అని లోకువగా చూస్తుంటాం. ఆలోచింపజేసేలా ఉన్నాయి మీ అనుభవాలు. Very nice post! :)

శశి కళ said...

avunu soumya...mana vaallu andaru doorangaa unna vaalle mananu aadukune...ayina vaallu...panilo...lekunte udyogaalu yelaa chestaamu?

బాలకృష్ణా రెడ్డి said...

soumya garu,

మీ గొప్ప హృదయానికి జోహారులు
పిల్లలను సైతం ప్రేమించడం మరిచి పోయిన ఈ కాలంలో మీరు పనిమనిషుల్నిఎంతో దయగా చూడడం అద్భుతం .ఎందరికో మీరు ఆదర్శం కావాలని ఆశిస్తున్నాను

శేఖర్ (Sekhar) said...

గొప్ప మనసు...:))

ఒకసారి ధోబి ఘాట్ చుడండి ఈ సందర్భం లో

సుజాత said...

ఏమిటంతా పని మనుషుల వెంట పడ్డారు?


బావున్నారోయ్ నీ పని మనుషులు! రంగనాయకమ్మ గారి "పని మనుషులు కూడా మనుషులే" వ్యాసం చదివావా నువ్వు?

మా ఇంట్లో ఒకామె పని చేసేది. నన్ను భలే అదుపులో పెట్టేసేది పెద్దరికంతో! "మీ ఆయన్ని 'నువ్వు ' అంటావేం?"

"ఆఫీసుకు వెళ్ళేదాకా ఆ మనిషికేం కావాలో దగ్గరుండి చూడవేం"
"పిల్లని వాళ్ళ నాన్న ముందు తిట్టొద్దు,. అవమాన పడుతుంది" _______ఇలా! ఇంకా చాలా ఉన్నాయిలే!

ఎన్ని చెప్పినా, పూర్తిగా మనం వాళ్లలో కల్సి పోయి మనతో సమానంగా చూడగలమంటావా? మన స్నేహితుల్లాగా ఉండగలమంటావా? మన బాస్ లు ఎంతో కొంత దూరం పాటిస్తూ "అధికారం" చూపించినట్టే మనమూ అలాగే ఉంటామా?

ప్రస్తుతం మా ఇంట్లో పని చేసే ఆమె ముస్లిమ్! చేరిన రోజు "దేవుడి గది మీరే తుడుచుకుంటారా? నేను తుడిస్తే పర్లేదా" అని అడిగింది. "నాకూ, మా దేవుడికీ కూడా అలాంటివేమీ లేవు. నువ్వు తుడవొచ్చు" అని చెప్పాను.

ఒక టీ యాడ్ వస్తుంది సౌమ్యా! అందులో సదరు టీ తాగ్గానే యజమానురాలికి హృదయ వైశాల్యం పెరిగి పని మనిషి తన స్టీలు గ్లాసు తెచ్చుకుని, కూచోగానే(కింద)లోపలికి వెళ్ళి తను తాగే కప్పు లాంటిదే తెచ్చి అందులో టీ పోసి ఇస్తుంది. నాకూ సంతోషం అనిపించింది. ఇంతలో మా పిల్లది "అంత మంచిది అయితే తను సోఫాలో కూచుని, పనిమనిషిని కింద కూచోబెడుతుందేం? ఆమెను కూడా సోఫాలో కూచోబెట్టొచ్చుగా"అని ప్రశ్న వేసింది.

ఏం చెప్తాం?

Surabhi said...

మీ పోస్ట్ ఎన్నొ జ్ఞాపకాలను తట్టి లేపింది.
మా ఇంట్లో ఎప్పుడు ఆస్థాన సహాయకులు వుండె వారు.
నాకు తెలిసి 35 years లొ ముగ్గురె మనుషులు మారారు. అసలు వాళ్ళని ఎప్పుడు బయటి మనుషులుగా చూడలెదు మా అమ్మ వాళ్ళు. వాళ్ళూ కూడా ఎంతొ ఆత్మీయంగా వుండె వారు. ఎంత మంచి రోజులవి.ఇక్కడ ! ఇంట్లొ మనుషులే కరువు ఇంకా పనిమనుషులు కూడానా !

I'am posting comment in telugu for the first time. Trying to learn

Surabhi

.శ్రీ. said...

jandhyala,s 'vivaha bojanambu' movie lo rajendra prasad panimanishi lanti vallu kooda vuntarandi.
Nenu mumbai lo unde rojullo maa intlo panichesina 'mousi' nenu choosina manchi panammayi.

శేఖర్ (Sekhar) said...

Sujatha garu.....Excellent

Anonymous said...

సౌమ్యగారు, మీ కథనం చాలా భాగుంది,కాని ఈ పనిమనుషి కి కులం కూడా తోడూ అయితే ఎలా ఉంటుందో? చిన్నప్పుడు నేను పడ్డ అవమానాలు గుర్తొచ్చి ఏడ్చాను. మనుషులుగా కాదు జంతువులుకన్న హీనంగా చూసేవారు(వీరి కుక్కలికి, ఆవులకి పేర్లు ఉంటాయి.కాని పనిమనుషులకు పేర్లు ఉండవు, మా ముందే మా అమ్మా నాన్నలను మాల నాయాల, ఇంకా ఇక్కడ వ్రాయలేని మాటలతో పిలిచేవారు.

vasantham said...

పని మనుషులూ మనుషులే..అన్న జ్ఞానం కలగా డానికి, చాల సాధన, శోధన అవసరమే..అందులో..
మన చిన్నతనం నించి పేరుకు పోయిన కొన్ని అపోహలు..చూసినవి, విన్నవి.
ఇప్పిదిప్పుడు అది కూడా ఒక వ్రుత్తి లాగా మారిపోతోంది.
నేను యూ కే. లండన్, వెళ్ళినప్పుడు.. ఒకర్తిని .మ్యాప్ పెట్టుకుని చాల ప్రదేశాలు తిరిగెను.
ఒక చోట, బితుకు బితుకు మని, ఉన్నాను, పిట్ట మనిషి లేరు, ఇంతలో, నల్ల కళ్ళజోడు
పెట్టుకుని, బాత్రూం..లోకి ఒక ఆవిడ వచ్చింది..చాల స్టైల్ గా ఉంది.
కళ్ళజోడు తీసి, ఒక అప్రోన్ కట్టుకుని, బత్ర్రోం లు ..కడగడం మొదలు పెట్టింది, నేను నిజం గా
నిర్ఘాత పోయాను. మొదట ఇసారి అవడం వల్ల..
నాకు, సారీ చెప్పింది, పని లోకి లేట్ అయ్యాను అని.
అలాగ..ప్రతి పని ఒక వ్రుత్తి లాగా చూసే రోజులు వస్తున్నాయి.
ఇంట్లో మనిషి లాగా పక్కన కోర్చో బెట్టుకో పోయినా, ఎవరు, మా ఇంట్లో పని చేసే వాళ్ళు,
విచారం గా మటుకు వెళ్లారు.. మా అమ్మా కి అయితే, ఎప్పుడూ ఒక్కరో, ఇద్దరో, చుట్టూ
తిరుగుతారు, మేం అంటే మేం..అని..అంతా బాగా చూస్తుంది ఆమె..
vasantham.

కొత్తావకాయ said...

నా చిన్నప్పటి అప్పల్నరస తప్ప ఇంట్లో మనిషిలా కలిసిపోయే పనిమనిషి నాకు కనిపించనే లేదు. ఇప్పుడింక అవకాశమూ లేదు. ఆ మధ్యెప్పుడో బాగా గుర్తొచ్చిందోయ్ మా అప్పల్నరస. ఇప్పుడు నీ టపా చదివాక మళ్ళీ... నా చేతా రాయించేసేలా ఉన్నావ్. :) మంచి టపా. బాగుంది.

రామ said...

కంపాటిబిలిటీ కుదిరితే పనిమనుషులతో ఎంతో సులువుగా ఉంటుంది. అస్తమానూ చికాకు పడడం, "మీ ఇంటికి ఎప్పుడూ చుట్టాలు ఎక్కువండి" అనడం చెయ్యకుండా సర్దుకుపోయే మనుషులు దొరకడం కూడా కష్టమే. కాకినాడ లో మా ఇంట్లో పని మనిషి దుర్గ. మా అమ్మగారికి ఎంత అలవాటు అయిపొయింది అంటే, ఒక ఏడాదిలో రెండుసార్లు అమెరికా వచ్చి, వాళ్ళు అమెరికా లో ఉన్న రోజుల్లో అక్కడ దుర్గ కి పని ఉంటుందో లేదో, మళ్ళీ తిరిగి వెళ్ళిన తరవాత మనకి చెయ్యడానికి ఖాళీగా ఉండదేమో అని - సంవత్సరం లో తొమ్మిది నెలలు పని లేకుండా జీతం ఇచ్చి అట్టిపెట్టుకున్నారు. ఆవిడ కూడా ఆ గౌరవం నిలబెట్టుకుంటుంది. ఆమె కూతురు ఇప్పుడు మా వాళ్లకి నాలుగో మనవరాలు :).

chicha.in said...

hii.. Nice Post Great job. Thanks for sharing.

Best Regarding.

More Entertainment

ఆ.సౌమ్య said...

@ అందరికి
ఆలశ్యంగా స్పందిస్తున్నందుకు ఏమి అనుకోకండి.
నన్ను అభినందించినందుకు ధన్యవాదములు!
మీ అందరూ కూడా పనిమనుషులను మన మనుషులుగా చూసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది.
thanks everyone!

ఆ.సౌమ్య said...

@ అరవం
మీ బాధని నేను అర్థం చేసుకోగలను. అలాంటి పరిస్థితులు ఉన్నందుకు ఈ సమాజంలోని వ్యక్తిగా సిగ్గుపడుతున్నాను.

ఆ.సౌమ్య said...

@ సుజాత గారూ
మీ కామెంటు నాలో మరికొన్ని ఆలోచనలను రేపింది. ఎంత మన మనుషులుగా చూసుకున్నా ఎక్కడో ఒకమూలన ఏదో "ఇగో" దాగే ఉంటుంది. మన బాసులు మనల్ని దూరం పెట్టినట్టే, మనమూ మన కింది వాళ్ళని.
ఆ "ఇగో" ని ఎప్పుడు అధిగమించగలుగుతామో!

Creatiwitty said...

Somya gaaru...abba gundelu pindesaru mee tapa tho.. me manastatwanni meemanasu laage..chala sunnitanga maku chepparu...
Mee tapa ne kaadu miru kuda abhinanda neeyulu :)

Pavan (witty)

Vinay Reddy said...

సౌమ్యగారు, మీ కథనం చాలా భాగుంది

Vinay Chakravarthi.Gogineni said...

baagundi post....