StatCounter code

Tuesday, March 20, 2012

పనిమనిషి!

"మనీ కోసం పని చేసే షి" అని అర్థం చెప్పుకుని చిన్నప్పుడు చాలా నవ్వుకునేవాళ్ళం.  పనిమనిషంటే మనలో చాలామందికి (నాతో కలిపి) ఉండే అభిప్రాయం "చులకన". అవును, పనిమనిషులు మనకి చులకన. మనం తినగా మిగిలినదో, పాచిదో వాళ్ళకి ఇస్తాం. బాగా వాడి వాడి విసుగెత్తిన బట్టలు ఇస్తాం. మన కాళ్ళ దగ్గర ఉండే మనిషి అని మనకి అభిప్రాయం. వయసులో ఎంత పెద్దవాళ్ళైనా సరే "ఒసేయ్" "ఏమే" అనే ఉంటాయి పిలుపులు. మనం ఆఫీసులో ఎంత పెద్ద తప్పులు చేసినా బాస్ కోప్పడితే ఏదో ఒక్కసారి జరిగినదానికే ఇంతలా అరవాలా అని చాల మధనపడతాం. ఇంట్లో మాత్రం పనిమనిషి మీద ఊరికూరికే కేకలు వేస్తాం. పనిఎగ్గొట్టడానికి వీళ్ళు వెయ్యి నాటకాలు ఆడతారని మన ప్రగాఢ విశ్వాసం. వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ అడిగి తెలుసుకుని మనమేదో గొప్ప తెలివైనవాళ్ళలాగ సలహాలిస్తుంటాం. మన ఇంట్లో విషయాలు మాత్రం నోరిప్పము. కొంచం ఎవరైనా చొరవగా ప్రవర్తిస్తే భగ్గున మండిపడతాము. "నువ్వు" అని సంభోదించారో నానారభస చేస్తాము. పనిమనిషికి టీ తాగడానికి వేరే కప్పు. అన్నానికి వేరే కంచం. నేనేమీ ఈ ప్రవర్తనకు అతీతురాలిని కాదు. అసలిలా చెయ్యొచ్చా, చెయ్యకూడదా అన్న ఆలోచన కూడా నాకెప్పుడూ రాలేదు. ఇంట్లో పనిమనుషుల సంగతి అమ్మ చూసుకుంటుంది. వాళ్ళతో నేనప్పుడూ మాట్లాడేదాన్ని కూడా కాదు. ఆ అవసరం కూడా ఉండేది కాదు. 

ఢిల్లీ లో ఉద్యోగార్థమై అడుగుపెట్టాక మొట్టమొదటిసారి పనిమనిషితో నేను మాట్లాడవలసి వచ్చింది. సంగీత అని చక్కని మనిషి. నన్ను వదిన అని పిలిచేది. ఇక్కడ మనిమనుషులందరూ అంతే యజమానులను అన్నయ్య, వదిన అని పిలుస్తారు. ఇల్లుని కడిగిన ముత్యంలా తయారుచేసేది. అంత పనిమంతురాలిని నా జీవితంలో చూడ్డం అదే మొదటిసారి. ఓరోజు టీ ఇచ్చాను ఒక కప్పులో పోసి. తాగి కడిగేసి ఆ కప్పు ఒక వారగా పెట్టింది. నేను చూసానుగానీ పెద్దగా పట్టించుకోలేదు. మర్నాడు టీ ఇద్దామని కప్పులు తియ్యమంటే మా ఇద్దరికీ రెండు తీసి, ఆ వారగా పెట్టిన తన కప్పు తెచ్చుకుంది. "ఇదేమిటి" అని అడిగాను. కొంచం సందేహిస్తూ నావైపు చూసింది. గట్టిగా చెప్పాను అలా ఏమీ చెయ్యక్కర్లేదు. మేము తాగే కప్పులో నువ్వూ తాగొచ్చు. అలా నీ కప్పు వేరుగా పెట్టొద్దు అని. సంతోషంగా నావైపు చూసింది. నాకెందుకో నేనేదో గొప్ప పనిచేసేసినట్టు ఆనందంగా అనిపించింది. ఇంకోరోజు బట్టలేమైనా ఉంటే ఇమ్మన్నాది. డబ్బులిచ్చి కొత్తవి కొనుక్కొమన్నాను. ఆనందంగా నవ్వుతూ డబ్బులు తీసుకుంది. నాది చాలా విశాల హృదయమని మురిసిపోయాను నేను. సంగీతకి ఇద్దరు పిల్లలు. పెద్దవాడికి ఐదేళ్ళు. చిన్నపాపకి రెండేళ్ళు. పనికి వచ్చినప్పుడు వాళ్ళనీ వెంటబెట్టుకుని వచ్చేది. కుర్రాడు బయటకిపోయి ఆడుకునేవాడుగానీ ఆ చంటిది మాత్రం ఇల్లంతా చిందరవందర చేసేది. దాన్ని కాపలా కాయల్సి వచ్చేది. మొదట్లో చికాకుపడేదాన్ని దీనికి మనమేమైనా పనిమనుషులమా పిల్లని ఆడించడానికి అని. ఆ పసిది మాత్రం బోసినవ్వులతో దగ్గరకు వచ్చేది. కొన్నిరోజుల్లోనే ఆ పిల్లది మాకు దగ్గరైపోయింది. ఆ చంటిదానితో సరదాగా గడిచేది కాలం. అప్పుడే మొదటిసారి నాకే చాలా ఆశ్చర్యమేసిన సంగతి..."పనిమనిషి పిల్లతో ఆడుకోవడమా!" లోపల ఏదో పొర మెల్లిగా కరుగుతున్నట్టు అనిపించింది. 

కొన్నాళ్ళకి ఇల్లు మారాం. "అమీనా" బక్కచిక్కిన మనిషి.  పేరు వినగానే చలం కథ "అమీనా" గుర్తొచ్చింది. మొదటిసారి ఇంటికొచ్చినప్పుడు "అసలు ఇది పనిచేస్తుందా, ఒంట్లో ఓపిక ఉందా" అని డౌటొచ్చింది. సంగీత అంతకాకపోయినా 80% చేసేది. అమాయకంగా ఉండేది అమీనా. రాజస్థానీట. కొన్నేళ్ళ క్రితం ఢిల్లీ వచ్చి పనులు చేసుకోవడం మొదలెట్టారు. ఇంట్లో అక్కచెల్లెళ్ళు, వదినలు అందరూ పనిమనుషులే. సంగీత లాగే ఈ అమీనా కూడా చాలా నిజాయితీపరురాలు. ఎక్కడ ఉన్న వస్తువు అక్కడే ఉండేది. ఈ అమీనా ఉన్నప్పుడయితే మేము ఒక్కోసారి పొద్దున్నే లేచేవాళ్ళం కూడా కాదు. తను మాత్రం వచ్చి నిశబ్దంగా పనిచేసేసుకుని, వెళ్ళిపోయేటప్పుడు నిద్రలేపేది. ఏరోజూ ఇంట్లో చిల్లి గవ్వ కూడా పోయిన దాఖలా లేదు. కొన్ని నెలల తరువాత అమీనా వచ్చి "వదిన, మా ఊరెళ్ళాలి. అమ్మకి ఒంట్లో బాగాలేదు. నేను వెళ్ళి సాయం ఉండొస్తాను" అంది. "అయ్యో మరి ఇంట్లో పనెలా?" అని అడిగాను. "నేనొచ్చేవరకూ మా చెల్లి చేస్తుంది" అంది. "సరే వెళ్ళిరా. బెంగపడకు, అమ్మకి నయమవుతుందిలే" అని చెప్పి కొంత డబ్బు చేతిలో పెట్టాను. తటాలున వచ్చి కౌగలించుకుంది. నేను ఉలిక్కిపడ్డాను. పనిమనిషి వచ్చి నన్ను కౌగలించుకోవడం....నేను కలలో కూడా ఊహించలేదు. నా మొహంలో ప్రసన్నత పోయిందని నాకే అర్థమయ్యింది. కష్టపడి చిరునవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు నాకే తెలిసింది. నన్ను విడిచి సంజాయిషీ చెబుతున్నట్టు "కొన్నాళ్ళు పనిచేసాక వాళ్లపై అభిమానం ఏర్పడుతుంది వదిన...వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉంటుంది" అంది. నాకు కళ్ళంట నీళ్ళు తిరిగిగాయి. మనసులో గొప్ప దుఃఖం పొంగిపొర్లుతున్నట్టు అనిపించింది. బయటకి మాత్రం "ఊ" అని అనగలిగాను, అంతే. ఓ రెండు నిముషాల్లో తేరుకుని అది వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి భుజం మీద చెయ్యి వేసి, దగ్గరకు తీసుకుని మళ్ళీ ధైర్యం చెప్పాను. పాపం అమీనా కళ్లనీళ్ళు పెట్టుకుంది ఎందుకో! నాకు లోపల ఒక్కో తెర తొలగిపోతున్నట్టు ఒక ఫీలింగ్. పనిమనిషి నన్ను కౌగలించుకుంది అన్న విషయం కుదిపి పారేసింది. కొన్నిరోజులు అది నా బుర్రలో తిరుగుతూనే ఉంది. నా ఆలోచనలు సుడి తిరుగుతూనే ఉన్నాయి.

మళ్ళీ ఇల్లు మారాము. ఈసారి భారతి వచ్చింది మా ఇంటికి. మంచి చలాకీ మనిషి. వయసు 40 పైనే. నిజాయితీకి మారుపేరు. చురుకుగా సరదాగా ఉంటుంది. నేను ఏదైనా అంటే నామీదే మళ్ళీ అరుస్తుంది (నవ్వుతూ అరిచేది). మొదట్లో నామీద అరుస్తోందేంటి అని విస్మయంగా ఉండేది. కానీ అప్పటికే మాయపొరలు తొలగి ఉండడంతో చిరాకు కలిగేదికాదు. నేను తిరిగి "అరుస్తున్నావెందుకు" అని అరిచేదాన్ని. :) అలా ఇద్దరం  సరదాగా ఒకరిమీద ఒకరం అరుచుకుంటాం ఇప్పటికీ. రెండేళ్ళై మా ఇంట్లోనే పని చేస్తోంది. మిగిలిపోయినది, పాచివి ఇవ్వడం అన్న సమస్యే లేదు. మేమైదైనా కొనుక్కుంటే తనకీ ఒక పొట్లాం కట్టిస్తాను. డబ్బుల దగ్గర పేచీయే లేదు. వచ్చిన దగ్గర నుండీ కబుర్లు చెబుతూ పనిచేస్తుంది. తన నోరు ఒక్క నిముషం మూతపడదు. తన సొంత విషయాలు, ఊర్లో విషయాలు అన్నీ చెబుతుంది. మా అమ్మ, నాన్న ఇంటికి వస్తే ఎంతో ఆదరంగా వాళ్ళతో మాట్లాడుతుంది. అమ్మకి మంచి ఫ్రెండ్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ కాళ్ళకి దణ్ణం పెడుతుంది పెద్దవాళ్ళ ఆశీస్సులు కావాలంటూ. అలా పడేసింది వాళ్ళని :) ఈ మధ్యన తనకి కాస్త ఒంట్లో బాగాలేక ఒక ఇల్లు మానేద్దామనుకుంది. మానేస్తే మా ఇల్లు గానీ, మా కింది ఇల్లుగానీ మానేయాలి. నాతో ఆ మాటే చెప్పింది. "మా ఇల్లు మానేయకు" అని మాత్రం చెప్పాను నేను. కిందింటి వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. దానితో పాటు "పై ఇల్లు మానేయ్ కావాలంటే" అని కూడా చెప్పారట. మొన్నోరోజు వచ్చి "కింద వాళ్ళ ఇల్లు మానేసాను వదినా...వాళ్ళ ప్రవర్తన బాలేదు. నన్నసలు మనిషిలాగే చూడరు. మీతో ఇంత సరదాగా ఉంటానా, అక్కడికి వెళితే నోరే మెదపను. పైగా ఈ మధ్య మీ ఇల్లు మానేయమని బలవంతపెట్టారు నన్ను. మీ ఇల్లు ఎలా మానేస్తాను. మీరు నాకు ఎంత దగ్గరయ్యారు! అందుకే వాళ్ళదే మానేసాను" అని దగ్గరకొచ్చి ఆప్యాయంగా చెయ్యి పట్టుకుంది. నామొహం వెయ్యొ ఓల్టుల బల్బులా వెలిగిపోయింది అని వేరే చెప్పక్కర్లేదుగా!

అప్పుడు నాకే అనిపించింది......నేను పూర్తిగా మారిపోయాను. మా భారతి, నేను తనని అభిమానిస్తున్నానని మనస్పూర్తిగా నమ్మింది. నేను మారాను. నా ఆలోచనలు మారాయి! ఇప్పుడు పనిమనుషులంటే నాకు చులకన కాదు.


Tuesday, March 6, 2012

మా ఊరుకి పుస్తకాల పండగొచ్చిందోచ్చ్!

పుస్తకాలు పుస్తకాలు!
"అటు నేనే ఇటు నేనే" అన్నట్టు ఎటు చూసినా పుస్తకాలు!
ముందుకు వెళితే పుస్తకాలు, వెనక్కి చూస్తే పుస్తకాలు, పక్కకు జరిగితే పుస్తకాలు!

చంద్రుణ్ణి చూసి ఎగిసే అలల్లా మీదకి దూకుతున్నాయి!
తేనెపట్టు మీద రాయేసి కొట్టినట్టు ఝుమ్మన్ని మీదకు ముసురుతున్నాయి!
కలకండ చుట్టూ చేరిన చీమల్లా చుట్టుముట్టేస్తున్నాయి!
వలసపోయే పక్షుల్లా బారులు తీరి ఉన్నాయి!
ఉఛ్వాశనిశ్వాసల్లా ఎగసెగసి పడుతున్నాయి.
ఊపిరి సలపనివ్వకుండా ఉక్కిరిబికిరి చేస్తూ "నన్ను చదువు అంటే నన్ను చదువు" అని పోటీపడుతున్నాయి.

సుమారు 13 లక్షల పైచిలుకు పుస్తకాలు. 2500 స్టాల్స్ ...కనివినీ ఎరుగని రీతిలో పుస్తకాలు. బొమ్మలకొలువులో బొమ్మల్లా అందంగా అమర్చబడ్డాయి 20th Wolrd Boof Fair పుణ్యమా అని. ఢిల్లీ లో ప్రతీ రెండేళ్లకొకమాటు World Book Fair జరుగుతుంది. ఈసారి 25 ఫిబ్రవరి నుండీ 4 మార్చి వరకూ జరిగింది.


26 ఆదివారం మేము వెళ్ళేసరికి ఆ ప్రభంజనం చూసి మా ఊరి పైడితల్లి అమ్మవారి పండుగ గుర్తొచ్చిందంటే అతిశయోక్తి కదు. ఢిల్లీలో పుస్తకప్రియులు ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యమేసింది. ఈ  పండుగ గురించి ఏ రకమైన సమాచారం మాకు తెలీదు. పేపర్ లో చూసి ఆదివారం కదా అని బయలుదేరాం. అడుగుపెట్టగానే "మీకేమైనా సహాయం" కావాలా అని అడిగారు. ఒక Information book 20 రూపాయిలు కొనుక్కొమన్నారు. కొనుక్కుని చూసాం. కళ్ళు గబగబ తెలుగుని వెతికాయి. కనిపించింది కనిపిచింది....యాహూ తెలుగుకి మూడు స్టాల్సు ఉన్నాయట. ముందు అటుపోదాం అని Regional Books ఉన్న హాల్ కి వెళ్ళాము. అది హాలా! దానికదే ఓ పెద్ద భవనంలా ఉంది. ఎన్నెన్ని పుస్తకాలో! తెలుగుకి మూడు, తమిళానికి ఓ పది. మళయాళం, ఒడిసా, మరాఠీ...అబ్బ ఒకటేమిటీ అన్నీను! ఉర్దూ పుస్తకాలైతే ఫ్రీ గా పంచుతున్నారు. ఉర్దూకే అత్యధికం స్టాల్స్.

తెలుగుకి విశాలాంధ్ర, విజయవాడ పబ్లిషర్స్, మంచిపుస్తకం వాళ్ళు స్టాల్స్ పెట్టారు. ఆ ఆదివారం నాటికి విశాలాంధ్రలో మాత్రమే పుస్తకాలు వచ్చాయి. మిగతావి ఇంకా రాలేదు. విశాలాంధ్రలో మంచి కలక్షన్ ఏమీ లేదు. అంటే మంచి పుస్తకాలు ఉన్నాయి. కానీ అక్కడున్నవి చాలామటుకు నా దగరున్నాయి. నాకు కావలసినవి పెద్దగా లేవన్నమాట. :) కానీ పెట్టారన్న సంబరంలో ఏవో కొన్నాను. విశాలాంధ్ర స్టాల్ పెట్టినాయన అనంతపురమునుండీ వచ్చారట- సోమశేఖరెడ్డిగారు.మొత్తం వారం రోజుల పడుగలో మూడురోజులు వెళ్ళాను నేను ఆస్టాల్స్ వైపు రెడ్డిగారు బాగా ఫ్రెండ్ అయిపోయారు. మంచి పుస్తకప్రియులు కూడాను. మేమిద్దరం చాలా పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడొక వింత సంఘటన జరిగింది. మొదటిరోజు నేను పుస్తకాలు చూస్తూ ఇది ఉందా అది ఉందా అని అడుగుతుంటే రెడ్డి గారు సరదాపడి మూలమూలలనుండి పుస్తకాలు తీస్తూ నాతో వాటి గురించి చర్చిస్తూ తిరిగారు. ఈలోగా ఓ పెద్దమనిషి అక్కడకు వచ్చాడు. ఓ 45 ఉంటుందేమో వయసు. ఊరికే కనిపించిన పుస్తకాలన్ని తిరగేస్తున్నాడు. నేను రెడ్డి గారు మాట్లాడుకుంటూ ఉంటే ఇతగాడు నావైపు తెరిగి "మీరు బాచదువుతారా పుస్తకాలు" అన్నాడు. "అవును" అన్నాను. "ఓ మంచి పుస్తకం" చెప్పండి అన్నాడు. ఎదురుగా రమణీయాలు కనిపిస్తే చూపించాను. "ఇవి బావుంటాయా! పి.వి నరసింహా రావు గారు ఏదో రాసారుట మీరు చదివారా" అన్నాడు. "అట, కానీ నేను చదవలేదు,నాకు తెలీదు" అన్నాను. మీ ఇంట్లో బోలడు పుస్తకాలున్నాయా! ఇవన్నీ ఏం చదువుతాం. చదివాక ఏం చెయ్యాలి. మా ఇంట్లో నేనొక్కడినీ ఉన్నాను, చదివేసాక ఏం చెయ్యను ఈ పుస్తకాన్ని. ఎన్నని కొనుక్కు చదువుతాము. అసలు ఏంటివన్నీ...ఏం పుస్తకాలు, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఏవైనా పుస్తకాలు కావాలంటే అడుగుతాను. మీ ఇంటికొచ్చి పుస్తకాలు చూస్తాను." అంటూ అతను మాట్లాడుతుంటే నేను, రెడ్డి గారు తెల్లబోయాం. ఏదో వింత జీవి వేరే గ్రహం నుండి దిగి వచ్చినట్టు అనిపించింది. చదివేసాక పుస్తకాన్ని ఏమి చెయ్యాలా! నాకు బుర్ర తిరిగిపోయింది ఈ ప్రశ్న చూసి. ఎంత కోపం వచ్చిందంటే "అసలు మిమ్మల్ని ఎవడండీ ఇక్కడకు రమ్మన్నాడు?" అని అడగాలనిపిచింది. పుస్తకాలు ఎందుకు చదావాలి అన్న దానిపై చిన్న లెక్చరు ఇద్దామా అని ఆలోచించాను రెండు నిముషాలు. కానీ నాకు అప్పుడు అంత ఓపిక లేదు. పైగా బోల్డు పని ఉంది, ఇంకా బోల్డు పుస్తకాలూ చూడొద్దూ! అందుకే చిన్నగా నవ్వేసి మెల్లిగా జారుకున్నాను అక్కడినుండి. ఆ జిడ్డు మనిషి అక్కడనుండి పోయాడు అని తెలిసాక మళ్ళీ వెళ్ళాను. :) విజయవాడ పబ్లిషర్లు మీద బోల్డు ఆశలు పెట్టుకుని మర్నాడు వెళ్ళానుగానీ ఆశ అడియాశ అయిపోయింది. ఏమీ లేవు అక్కడ. యండమూరి, యద్దనపూడి లేదంటే దేవుడి పుస్తకాలు, అదీ కాదంటే వంటల పుస్తకాలు. ఓ నమస్కారం పెట్టి "మంచి పుస్తకం" లో చూస్తే అన్నీ చిన్నపిల్లల పుస్తకాలే. సరదావేసి కొన్ని కొనుక్కున్నాను.


ఆ తర్వాత ఇంగ్లీషు మీద పడ్డాం. అవేం పుస్తకాలురా నాయనా...తెలుగంటే ఏవి చదవాలో ఏవి వద్దో, నాకేవి నచ్చుతాయో ఏవి నచ్చవో....ఒక జ్ఞానం ఉంది. కానీ ఇవో! ఏవో కొన్ని చాలా ఫేమస్ పుస్తకాలు తప్పితే పెద్దగా తెలీదే :(  సరే చూద్దం అని అడుగుపెట్టాం. అబ్బ అబ్బ అబ్బ...కళ్ళు చెదిరిపోయేలా పుస్తకాలు. అన్నీ చదవాలనిపిస్తుంది. ఏది చదవాలో తెలీదు. ఇది బావుంటుందా...ఏమో కొనేసాక బాగోకపోతే! ఒకవేళ కొనకపోతే మంచి పుస్తకం మిస్ అయిపోతామేమో! అని ఒకటే పీకులాట.

ప్రగతి మైదాన్ అన్న స్థలంలో జరిగింది ఈ పండుగ. ఆ మైదానం మా విజయనగరమంత ఉంటుందేమో అనిపించింది. అందులో మొత్తం 16 హాల్స్. Pages, Oxfor, Penguin, Pacific, Goodwell, Cambridge, Just Read, Om Books, Flipcart....చిన్న చితకా, ముసలి, ముతక అన్నీ రకాల పబ్లిషర్స్ ఉన్నారు. ఆదివారం నాడు మేము రెండు స్టాల్స్ చూసేసరికి మాకు మొహం తిరిగిపోయింది. ఇంకా 14 చూడాలా అని అనుకుంటేనే కళ్ళు తిరిగాయి. ఇంక లాభం లేదని ఆరోజుకి దుకాణం కట్టేసాము. మర్నాడు వెళితే జనం కాస్త తక్కువ ఉన్నారు. కొంచం హాయిగా ఇంకో రెండు హల్స్ తిరిగాము. కొన్ని బుక్స్ కొన్నాము. 

ముఖ్యంగా చెప్పుకోవలసినది Nationla Book Trust గురించీ, Sahitya Academy గురించీ. NBT లో పుస్తకం ధర చాలా చౌక. 20-30 రూపాయలనుండీ ఉన్నాయి పుస్తకాలు. మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. సాహిత్య అకాడమీలో కూడా చాలా భాషల పుస్తకాలు ఉన్నాయి. నేను తెలుగువి కొన్ని కొన్నాను. 


ఈ పండుగకి ఒక ప్రత్యేకత ఉంది. "150 యేళ్ళ రవీంధ్రనాథ్ ఠాగూర్", "100 యేళ్ళ ఢిల్లీ" సంబరాలు జరుపుకుంటున్నాయి. రవీంద్రనాథ్ రచనలు, ఢిల్లీ కి సంబంధించిన రచనలు అనేకం ఉన్నాయి. వీటికి ఎక్కువ స్టాల్స్ కేటాయించారు. 

అలాగే నేను చూసిన అత్యధిక స్టాల్స్ ఓషో వి. ప్రతీ హాల్ లోనూ ఓషో రచనలు, సీడీలతో స్టాల్స్ ఉన్నాయి. అంతేకాకుండా శ్రీలంక, భూటాన్ అంటూ విదేశీ భాషల పబ్లిషర్స్ కి కూడా కొన్ని స్టాల్స్ కేటాయించారు. పిల్లలపుస్తకాలకి మాత్రం ఇది నిజమైన పండుగ. Children Pavilion అని వాళ్లకు ప్రత్యేకంగా ఒకటి పెట్టారు. ప్రతీ హాల్ లోనూ చాలా ఎక్కువ Children's Books ఉన్న స్టాల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎన్నెన్ని పుస్తకాలో! అంబేద్కర్ కి కొన్ని ప్రత్యేకంగా స్టాల్స్. అన్నాహజారే కి ఒకటి. చిన్న, పెద్ద పబ్లిషర్స్ మాత్రమే కాకుండా రోడ్డు సైడ్ పుస్తకాలు అమ్మేవాళ్లలాంటివాళ్లున్నారు. వీళ్లకి స్టాల్స్ ఉండవు. ఏమూల జాగా కనిపిస్తే అక్కడ వాళ్ళ పుస్తకాలు పెట్టేసుకుంటారు. ప్రతీ పుస్తకమూ 100 రూపాయిలు మాత్రమే. చాలా పుస్తకాలు సెకండ్ హేండువి. నాకు హైదరాబాదులో కోటీ సెకండ్ హేండ్ బుక్స్ మార్కెట్ గుర్తొచ్చింది. వీళ్ల దగ్గర కూడా 100 కి కొన్ని పుస్తకాలు కొన్నాము. 

నవ్వు తెప్పించిన ఒక విషయం ఏమిటంటే రిలయన్స్ కూడా ఇందులోకి దిగింది. అచ్చు కూరగాయలు అమ్మినట్టే ఒకటి కొంటె రెండు ఫ్రీ అని. మూడు కొంటే ఐదు ఫ్రీ అని. కొన్నిటి మీద 30% డిస్కౌంట్, కొన్నిటి మీద 10%...ఇలా రకరకాల options పెట్టారు. రిలయన్స్ షాపింగ్ మాల్ లో ఉన్నట్టే. నవ్వొచ్చింది అది చూసాక. :)

ఈ పండుగలో పుస్తకాలే కాకుండా రకరకాల కార్యక్రమాలు జరిగాయి. రోజూ సాయంత్రం ఏవో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. రోజూ ఏదో ఒక పుస్తకావిష్కరణ సభ. రచనావ్యాసంగం గురించీ, పుస్తకాల గురించీ ఏదో ఒక Workshop, Seminar జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ పండుగకి "వందేళ్ళ భారతీయ సినిమా" అన్నది కూడా ప్రత్యేకం. సినిమా గురించి రకరాకల Workshops జరిగాయి. How to Read a Cinema? అనే work shop కి వెళ్ళాము. చాలా అద్భుతంగా ఉంది. అది విన్నాక సినిమాలు తియ్యడం ఇంత కష్టమా అనిపించింది. సినిమాకోసం ప్రత్యేకంగా ఒక హాల్ ఉంది. అందులో సినిమాలకి సంబంధించిన పుస్తకాలన్నీ ఉన్నాయి. ఎక్కువ హిందీ సినిమాల గురించి. తరువాత బెగాలీ సినిమాల గురించి. కొంచం తమిళ సినిమాల గురించి. అంతే. మిగతా భాషల్లో సినిమాలు ఇటువంటి రచనలకు నోచుకోలేదు గాబోలు! రోజూ ఏదో ఒక సినిమా వేసేవారు సాయంత్రం పూట. పథేర్ పాంచాలి, చారుశీల - సత్యజిత్ రే సినిమాలు రెండూ చూద్దాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదు :(. మాల్గుడీ డేస్ కాసేపు చూసాం :) 

మేము వరుసగా మూడు రోజులు సాయంత్రం అక్కడకి వెళ్ళడం పుస్తకాలు చూడడం, ఏవో కొనుక్కోవడం, కొనుక్కోవలసినవటి గురించి ఆలోచించడం ఇదే పని మాకు. :) చివరి రోజులు కదా అని మళ్ళీ 3 మార్చి శనివారం నాడు వెళ్ళాం. ఆరోజైతే ఇసుక వేస్తే రాలనంత జనం. మాకు చాలా విసుగొచ్చింది. కొందరిని చూస్తే వీళ్ళు అసలు అక్షరాస్యులేనా అనిపించేది. వాళ్ల వాలకం అలా ఉండేది...నిజంగా వీళ్ళకి చదవడం, రాయడం వచ్చా అని సందేహమొచ్చింది. పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు తండోపతండాలుగా వచ్చేసారు. పిక్నిక్ కి వచ్చినట్టు వచ్చేసారు. మేము వెళ్ళినట్టే! :)

ఇంతా చేస్తే మేము నాలుగు రోజులు వెళ్ళి చూసినవి మొత్తం 5 హాళ్ళు...అంతే! అవి చూసేసారికే మాకు తల ప్రాణం తోకకొచ్చింది. నిజం చెప్పాలంటే, ఒకానొక సమయంలో పుస్తకాలంటే విరక్తి వచ్చేసింది. బాబోయ్ ఈ పుస్తకాలు నాకొద్దు అని దూరంగా పారిపోవాలనిపించింది. :)

అలా సరదా సరదాగా సాగిపోయింది మా ఊర్లో పుస్తకాల పండుగ! ఇంతమంచి పండుగలో మేము పాల్గొనగల్గినందుకు చాలా ఆనందంగా అనిపించింది. 

మేము కొన్న పుస్తకాలు....

తెలుగు:
సాహిత్య అకాడమీ: కాళోజీనారాయణరావు - పేర్వారంజగన్నాథం, శాస్తి - కాన్హుచరణ్ (ఒడియాఅనువాదం)
తాపీ ధర్మారావు: ఇనుపకచ్చడాలు, రాలు-రప్పలు, దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు?
శరత్‌ సాహిత్యం: దేవదాసు, శ్రీకాంత్, చరిత్రహీనులు
సహవాసి: పంచతంత్రం, బేతాళకథలు, అమ్మ
గణిత విశారద - అవసరాల రామకృష్ణారావు
నామిని ఇస్కూలు పుస్తకం
రైలుబడి - టెట్సుకో కురొయనాగి (తెలుగుఅనువాదం)
జరుక్‌శాస్త్రి పేరడీలు
అనువాద సమస్యలు - రాచమల్లు రామచంద్రారెడ్డి
ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వారుస్వామి
డా.బాబాసాహెబ్ అంబేద్కర్ - చాగంటి తులసి
కాదంబరి - రావూరి భరద్వాజ
మధురాంతకం రాజారాం కథలు - రెండు భాగాలు
గోనగన్నారెడ్డి - అడివి బాపిరాజురచనలు
సిప్రాలి -శ్రీశ్రీ
దక్షిణభారతంలో దేవాలయాలు - వాకాటి పాండురంగారావు (అనువాదం)
కథాసరిత్సాగం - జగన్నాథశర్మ
భమిడిపాటి కామేశ్వరరావు - నాటకాలు
రంగుటద్దాలకిటికీ - ఎస్.నారాయణస్వామి
పండితపరమేశ్వరశాస్త్రి వీలునామా - గోపీచంద్
కథాసరిత్సాగము - జగన్నాథశర్మ
కృష్ణశాస్త్రి సాహిత్యం: వ్యాసావళి - వ్యాసాలు, కృష్ణపక్షము
రాహుల్సాంకృత్యాయన్: ఓల్గానుండిగంగవరకు, మనిషికథ, ప్రాక్పశ్చిమదర్శనాలు

English:
The Summons & The King of Torts - John Grisham
Life of Pi - Yann Martel
Why I am an Athiest? - Bhagat Singh
Indian Food: A Historical Companion - K. T. Achaya
The Monk Who Sold his Ferrari - Robin Sharma
Fall of Gaints - Ken Follet
Piccadilly Jim - Wodehouse
Freedom Struggle - Bipin Chandra
A History of South India - K. A. NilakanthaSastri
The Alchemist - Paulo Coelho
The Immortal of Meluha& The Secret of Nagas - Amish
The Dairy of a Young Gilr - Anne Frank
Twilight in Delhi – Ahmed Ali
The Davinci Code – Dan Brown

ఇంకా చాలా తమిళ పుస్తకాలు :)