StatCounter code

Monday, November 21, 2011

శ్రీరామరాజ్యం

నేనూ శ్రీరామరాజ్యం చూసేసానోచ్. శనివారమే చూసాను కానీ "ఆ శని, ఆది వారాలు బ్లాగు/బజ్జు ఎవరు చూస్తారులే, సోమవారం తాజాగా రాద్దాం" అని ఊరుకుంటే...అయ్యబాబోయ్ అందరూ చూసేయడం, రాసేయడం కూడా అయిపోయింది. అయినాసరే నేను రాసి తీరుతాను...మీకూ చదవక తప్పదు. :P

కథ మనకు తెలిసినదే. దానిలో న్యాయాన్యాలు, వాదోపవాదాలు ఎరిగినవే. దాని గురించి మళ్ళీ రాయక్కర్లేదు. బాపూ ఈ సినిమాని ఎలా తీసారో చూద్దామని వెళ్ళాను. సినిమా నేను అనుకున్నంత గా లేదు....నాకు కొంచం నిరాశ కలిగినమాట వాస్తవం. చాలరోజులుగా వేచి చూస్తున్నాను దీని కోసం. వెళ్ళే ముందు పెద్దగా రివ్యూలు చదవలేదు. బాగుంది అన్న టాక్ మాత్రం విన్నాను. చాలా expectatios తో వెళ్లాను. కానీ కొంచం నిరాశ ఎదురయింది.....గొప్పగా లేదు, బాపూ చమక్కులున్నాయి కాబట్టి బానే ఉంది.

కానీ ఏంటో నాకు లవకుశ జ్ఞాపకాలను వీడిపోవడం దుస్సాధ్యమయింది ఎంత ప్రయత్నిచినా సరే. ముఖ్యంగా లవకుశలో పద్యాలు, పాటలు అన్నీ కంఠతా రావడంతో ఏ సీనులో ఏపద్యమొస్తుందో పాడేసుకుంటూ ఉన్నాను. బొమ్మ ఇప్పటిది, పద్యాలు-పాటలు ఆనాటివి అన్నట్టు అయింది నాకు. అతి ముఖ్యంగా "ఏ మహనీయసాద్వి, ప్రతిదినమేను తొలుదొల్త, ఇది మన ఆశ్రమమ్ము, హ్రీంకారాసంగర్భితానలశిఖాం, కన్నులారగ తొలిసారి కొలువుదీరి" లాంటి పద్యాలు గుర్తురాకపోవడం అసాధ్యం అనిపించింది.

కుశలవుల బొమ్మలు పోస్టర్లలో ఎక్కడా కనిపించనివ్వకుండా ఉత్సుకతని పెంచారు. నేను మొట్టమొదటినుండీ వేచి చూసినది వారికోసమే. అయితే చూసాకా కాస్త నిరుత్సాహమనిపించింది. ఆ లవకుశులతో పోలిస్తే ఈ కుశలవులు తేలిపోయారు. నటన బాగానే ఉందిగానీ ఏమిటో...నాకు అంత నచ్చలేదు. పైగా డబ్బింగ్ పిల్లలిద్దరికీ వేరే ఎవరిచేతనో చెప్పించినట్టు అనిపించింది. ఆంజనేయుడు చిన్నపిల్లాడుగా రావడం నచ్చింది. ఆ అబ్బాయి కూడా బాగా చేసాడు. రామ రామ పాట నాకెంతో నచ్చింది.

ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా నయనతార గురించి చెప్పుకోవాలి. ఆహా ఎంత ప్రసన్నత, ఏమి అందం, ఎంత ఒదిగిపోయింది ఆ పాత్రలో! నయనతార ఎంపికని అనుమానించినందుకు ఇప్పుడు లెంపలు వేసుకుంటున్నాను. అయితే అంజలి దేవితో పోలిక లేదు కానీ పాత్రకి న్యాయం చేసిందనే చెప్పాలి. కన్నెసీత గా భలే ముద్దుగా ఉంది. సాధ్వీమణిగా అంతకన్నా ఇంపుగా ఉంది. నయనతార నటనకి సగం మార్కులు, సునీత డబ్బింగ్ కి సగం మార్కులు ఇవ్వాలి.

బాలకృష్ణకి, NTR తోనూ పోలిక రాక తప్పదు. బాలయ్యబాబు బాగా చేసాడు, నిజంగా. నాకు బాగా నచ్చినది అతని డైలాగ్ డెలివరీ. బాధతో, దుఃఖం తో గొంతు జీరబోయినట్టు పలికిన సంభాషణలు ఇంకెవ్వరివల్లా కాదు అనిపించింది. కొంత గాంభీర్యం, కొంత దైన్యం, కొంత నిస్సహాయత, కొంత బాధ...బాగా చూపించగలిగాడు. లవకుశలో NTR లో అన్నీ పరిస్థితులలోనూ గాంభీర్యమే కనిపిస్తుంది. కానీ ఈ రాముడిలో కొంత దైన్యం కనిపిచింది. అది సహజం కూడా. అలా పాత్రని రూపొందించడంలో బాపు గారిని మెచ్చుకోవాలి. కొన్ని చోట్ల రామారావు రూపు ని గుర్తు తెచ్చింది...NTR ని ఇమిటేట్ చేసినట్టూ అనిపించింది. ఒకచోట "చిరంజీవులారా" అని తమ్ములతో అన్నప్పుడు అచ్చు రామారావే కనిపించాడు. అది NTR ఆహార్యమే. కాకపొతే క్లోజప్ షాట్లలో బాలయ్య ని భరించడం నావల్ల కాలేదు. ముదిమి ఛాయలు మీదపడిన బాలయ్యని ఎందుకు అన్ని క్లోజప్ షాట్లలో చూపించారో అర్థం కాలేదు. దగ్గరనుండి చూస్తే మరీ ఇంకులో ముంచినట్టు మేకప్ ఎక్కువయిందనిపించింది. బాపూగారు ఈ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉండవలసినది. ఓ పదేళ్ళ క్రితం బాలయ్య ఈ సినిమా చేసుంటే ఆ రాముడి పాత్రకి పూర్తి న్యాయం చేసేవాడేమో! నవ్వొచ్చిన విషయం ఏమిటంటే వీపు మీద కాటుకమచ్చ పెట్టడం, అది కనిపించేలా రెండు షాట్లు తియ్యడం. :)

ఇళయరాజా సంగీతం మొదట్లో అంత గొప్పగా ఏమీలేదు అనిపించినా వినగా వినగా నచ్చింది. కానీ ఆడియోలో విన్న అన్ని పాటలూ సినిమాలో లేకపోవడం నిరుత్సాహపరిచింది. "కలయా, నిజమా" పాట ఎలా తీసుంటారో అని తెగ ఆశగా చూసాను...కానీ ఆ పాట సినిమాలో లేదు. :( నేపథ్య సంగీతంలో వయొలిన్ బిట్స్ చాలా వినసొంపుగా బావున్నాయి. పాత-కొత్త సంగీతాల కలయికలా ఉన్న నేపథ్య సంగీతం వీనులవిందుగా ఉంది. సీత సీమంతం పాట అనవసరమనిపించింది. జొన్నవిత్తుల సాహిత్యం చెప్పుకోదగ్గది. కానీ పద్యాలు లేని లవకుశని ఊహించడం కష్టమయింది.

వాల్మీకి పాత్రలో నాగేస్రావు గంభీరంగా కనిపించారు. ఆయన నటనని, ఆహార్యాన్ని శంకించే పనిలేదు గానీ...నాగయ్యగారిలో ఉన్న ప్రశాంతత కనిపించలేదు. నాకెందుకో ఏ విశ్వామితృడి పాత్రకో, పరశురాముడి పాత్రకో సరిపోతాడేమో అనిపించింది. కానీ ఇంత వయసులోనూ ఉచ్ఛారణలోని స్పష్ఠత, అభినయం మెచ్చుకోదగ్గది. అదే కంటితో బాలయ్యని (వశిష్టుడు) చూస్తే బాధేసింది. ఒకప్పుడు ఎంత చక్కగా డైలాగులు చెప్పేవాడు. ఇప్పుడు ఏదో నొక్కిపట్టినట్టు, వత్తి వత్తి కష్టపడి డైలాగులు చెబుతుంటే కష్టమనిపించింది. మిగతా పాత్రలలో అందరూ బాగానే సరిపోయారు.

కాకపోతే సినిమాలో మెలోడ్రామా ఎక్కువైనట్లుగానూ, మధ్యలో కాస్త సాగతీతగానీ అనిపిచింది. పాత లవకుశలో ఏడుపు తక్కువ...కళ్ల నీళ్ళు సున్నితంగా చిందించడం తప్ప భోరున ఏడవడం లేదు. కానీ ఇందులో ఉంది. కుశలవులు అంతఃపురంలో రామాయణ గానం చేస్తున్నప్పుడు కౌసల్య మున్నగువారు భోరు భోరున విలపించడం కాస్త చికాకు కలిగించింది. వాళ్ళు రాజమాతలు...ఎంత కష్టంలోనైనా కొంత సంయమనం, గాంభీర్యం ప్రదర్శించడం అవసరం. దీనాలాపన అంతగా నప్పలేదు. అలాగే సీత పాత్రలో కూడా...చాలా చోట్ల ఏడుపు ఎక్కువయినట్టు అనిపించింది. మిగతా పాత్రలలో కూడా అక్కడకడా ఏడుపుని చొప్పించారు. ఏడవని పాత్ర ఏదీ లేదనుకుంటా. ఈ మెలోడ్రామా కొంత భరించలేకపోయాను.

ఇంక రమణ గారి డైలాగులకి వంక లేదు. బాపూగారి చమక్కులు మాత్రం మరోసారి గుర్తుచేసుకోదగ్గవి. నాకు బాగా నచ్చిన విషయం...చివరిలో సీత రామునికి నమస్కారం పెట్టే అంశం....సీతకి రామునిపై అవ్యాజ్యమైన ప్రేమ ఉంది కానీ మాటమాత్రమైనా చెప్పకుండా ఇలా విడిచిపెట్టాడే అన్న కోపం, అలక కూడా ఉన్నాయి. అలా లేకపోతే అసహజం. ఆ కోపాన్ని, అలకని బాపు గారు చిత్రించిన తీరు అనితరసాధ్యం. అలాగే ఆపద సమయంలో ఆదుకుని రక్షగా నిలిచిన వాల్మీకికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుని నమస్కరించే సన్నివేశం.....రామునికి, వాల్మీకికి నమస్కారాలలో తేడా ని గొప్పగా చూపించారు బాపూగారు. ఎంత అలక, కోపం ఉన్నా, తన తల్లి భూదేవితో వెళ్ళిపోతున్నప్పుడు చివరిసారిగా రాముని ప్రేమతో, ఆర్తితో చూసే సీతని చూస్తే నిజంగా ఏడుపొచ్చింది.

ఇక సీత కుటీరంలో ఒక రాతిపై రామబాణాన్ని ప్రతిష్ఠింపజేసి పూజిస్తుంటుంది. ఆ బాణం మొదట్లో విరిగిన తన గాజుని చంద్రవంకగా నిలిపి తమ అనురాగానికి సాక్ష్యాన్ని ఆ బాణంలో పొదగడం నన్ను విశేషంగా ఆకర్షించింది. రామబాణం, రాముని సీత - తిరుగులేనివి, చెక్కుచెదరనివి. ఈ రెండు విషయాలను ఒకే ఒక్క అంశంలో బంధించడం బలేగా ఉంది.

కౌటిల్య రాసినట్టు సీత చేతినుండి గాజులు ఊడిపడడం - ఆమె రాముని గూర్చి ఆలోచించి చిక్కిశల్యమైపోయినదనే విషయాన్ని అన్యాపదేశంగా వివరించడం...జయహో బాపు.

సింహాసనం ఎక్కబోతూ సీతను చిటికినవేలు పట్టుకుని సహా తీసుకెళ్లడం. సింహాసనం పై కూర్చున్న సీతను స్వయంగా లేపి సీత తో సహా రాజ్యపాలన సాగించబోతున్నట్టు రామరాజ్యం అనగా రాముడు సేవించిన రాజ్యం అని చెప్పడం. మొదట్లో సీత ఒడిలో తలపెట్టుకుని ఎలా కూర్చున్నాడో, మధ్యలో బంగారు సీత తొడిలో తలపెట్టుకుని అదే ఫోజులో కూర్చోవడం.....అంటే అదే మమతను, అనురాగాన్ని అనుభవిస్తున్నట్టు చూపించడం....బావుంది. సీతాలక్షణభరతశతృఘ్న సమేతంగా రాజ్యపాలన గావిస్తాను అని ప్రమాణం చేసినప్పుడు భరతలక్షణులు అవును అన్నట్టు తలూపడం లాంటి subtle expressions బాగా చిత్రీకరించారు.

"లేరుకుశలవుల సాటి" పాట పల్లవిని మాత్రం కుశలవుల చేత పాడించడం నచ్చింది. రాముడు, సీత మధ్య సరసం సున్నితంగా ఉంది. బాపు గారి postures తెలిసినవే కదా..చూడ్డానికి బావున్నాయి. సెట్టింగులు బావున్నాయి కానీ వనం లో జింకలు, నెమళ్ళని గ్రాఫిక్స్ లో పెట్టడం నచ్చలేదు. సహజమైనవాటిని వాడి ఉంటే బాగుండేది. పేటా తో గొడవ వస్తుందనో ఏమో అసహజంగా చిత్రీకరించారు. అవెందుకో కంట్లో ముల్లులా గుచ్చుకున్నాయి అక్కడక్కడా.

సినిమా చూస్తున్నప్పుడు ఒక చిన్న సరదా సంఘటన జరిగింది. ముందే చెప్పానుగా లవకుశలో పద్యాలు నోటవెంట వచ్చేస్తున్నాయని. అతికష్టంచే బయటకి రాకుండా నోట్లో పాడుకుంటూ ఉన్నాను.

వాల్మీకి సీతని ఆశ్రమానికి తీసుకొచ్చి చూపిస్తూ ఇంకా డైలాగులు మొదలెట్టలేదు....అనుకోకుండా నా నోటివెంట "ఇది మన ఆశ్రమంబు ఇచట నీవు వశియింపుము లోకపావని" అని పైకే వచ్చేసింది. సరిగ్గా అదే పద్యాన్ని నా వెనుక వరుసలోనూ, ఆపై వరుసలోనూ ఇద్దరు అందుకున్నారు. ముగ్గురం ఒకేసారి బయటకి పాడేసరికి హాలంతా ఘొల్లున నవ్వులు. ఎంత తమాయించుకుందామన్నా నాలాగే మరికొందరికి లవకుశ వదలడం లేదన్నమాట అనుకున్నాను. :)

అయితే మనల్నే కాదు బాపు-రమణ గార్లని కూడా వీడలేదు. అందుకే ఒకచోట వాల్మీకి సీతను లోకపావని అని పిలుస్తారు (లక్ష్మి అని నామకరణం చేసినా సరే). అలాగే "లేరుకుశలవుల సాటి" పాట పాడించడం...మున్నగునవి. :)

మొత్తానికి సినిమా కాస్త నిరాశపరిచినా బాపు-రమణల కోసం, నయనతార కోసం, వైవిధ్యమైన బాలయ్యబాబు కోసం ఒకసారి చూడొచ్చు. నయనతార ఎక్కువ మార్కులు కొట్టేసింది.


Thursday, November 17, 2011

అపురూపమైన ఆనందహేల!

కార్తీక్ పెళ్ళి అని తెలిసిన రెండు నెలల ముందు నుండి మొదలయ్యింది హడావుడి. తను పెళ్ళి తేదీ చెప్పగానే "అరే సరిగ్గా నేను మా ఊరు వెళ్ళే ట్రిప్ ప్లాన్ చేసుకునే టైములోనే పడిందే" అని ఒకింత ఆశ్చర్యం, సంబరం. బలే బలే అనుకుంటూ తయారయిపోయాను. చాలామంది బ్లాగు మితృలు వస్తున్నారని తెలిసి సంతోషమనిపించింది. బ్లాగు/బజ్జు లలో పరిచయమైన మితృలతో సరదాగా కబుర్లు చెబుతున్నానుగానీ ఇప్పటివరకూ కలవలేదు. బాగ తెలిసిన స్నేహితులు కానీ కలుసుకోలేదు...ఇప్పుడు కలుసుకోబోతున్నాను. బ్లాగు మితృలతో కలిసి హైదరాబాదునుండి ప్రయాణం....మరి హైదరాబాదులో మితృలను కూడా కలిసేస్తే పోలే! చాలామందికి కలుస్తానని చాలాసార్లు మాటిచ్చాను. కానీ కుదరలేదు. ఇప్పుడు అవకాశమొచ్చింది. నవంబర్ 10 సాయంత్రం మా ఊరునుండి రైలెక్కాను. ఎన్నో చిత్రమైన ఊహలు...వాళ్ళు అలా ఉంటారా, ఇలా ఉంటారా....ముఖాముఖి కలిసి మాట్లాడితే ఎలా ఉంటుంది! ఇవే ఆలోచనలతో గడిపాను.

బ్లాగులోకంలో ఒక పెద్దాయన మా ఇంటిపేరు చూసి మీకు ఫలనావాళ్ళు తెలుసా అని అడిగారు ఓ రెండేళ్ళ క్రితం. "తెలుసు" అని చెప్పగానే మొదలయ్యింది మా స్నేహం. ఆయనతో మాట్లాడుతుంటే మా మావయ్యతోనో, మా పెద్దన్నయ్యతోనో మాట్లాడుతున్నట్టు ఉంటుంది నాకు. ఆయానెవరో ఇంకా తెలీలేదా అదేనండీ మన పప్పుసారు - పప్పు శ్రీనివాసరావు గారు. హైదరాబాదులో రైలు దిగి నేరుగా పప్పుశ్రీనివాసరావు గారింటికి వెళ్ళాను. మరి ముందే మాటిచ్చేసాను కదా. నేను ఢిల్లీ నుండి బయలుదేరుతున్నాను అని చెబితే "పుట్టింటికి స్వాగతం" అని చెప్పారు. ఏంటో అనుకున్నాను...కానీ నిజంగా అక్కడకి వెళ్ళాక నాకు మా ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. కాంతిగారు ఎంత సరదాగా, ఎంత చనువు గా మాట్లాడారని. ఇంట్లో పిల్లలాగే చూసుకున్నారు. నిజంగా నాకు అస్సలు కొత్తగా అనిపించలేదు. వాళ్ళ అమ్మాయి ఎంతో సరదాగా కబుర్లు చెప్పింది. నాకస్సలు కొత్తగా అనిపించలేదు. వాళ్ళింట్లో పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి బోల్డు కబుర్లుచెప్పి బయలుదేరుతుటే....కాంతి గారు బొట్టు పెట్టి, బట్టలు చేతిలో పెట్టారు. మొదట కోపం వచ్చినా, ఆ ఆప్యాయతకి, అభిమానానికి మనసు తడి అయ్యింది.

ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు ఇంచుమించు ఒకటే. కబుర్లు చెప్పుకోవడం మొదలెట్టామా గంటలు గంటలు...టైమెంత గడిచిందో తెలియదు. మనిషిని చూడకపోయినా మనసుకి ఎంతో దగ్గర. ఆవిడ దగ్గర నాకెంతో చనువు, ఎంతో అభిమానం. మరి ఆవిడకి నేనంటే ఇంకా అభిమానం లేకపోతే నాకెందుకు కావలసిన పుస్తకాలు పంపిస్తారు చెప్పండి. :D మీకర్థమయిపోయింది కదూ...అవును, సుజాతగారే....చిన్ననాటి స్నేహితురాలిని కలిసినట్టు అనిపించింది. గలగల కబుర్లు చెప్పేసుకున్నాం. నాకిష్టమైనవన్నీ వండి పెట్టారు మధ్యాన్నం భోజనానికి. బలే తమాషాగా అక్కడకి వేణు గారు వచ్చారు. ఉన్నది కొన్ని నిముషాలే అయినా, ఆయనని కలిసి మాట్లాడడం బావుంది. ఇంతలో గురువుగారు ఫోను "వస్తున్నానండీ" అని. ముందే తెలుసు బులుసుగారు వస్తునారని. ఇంక ఇద్దరం ఎదురుచూస్తూ కూర్చున్నాం. నవ్వితే నవ్వండి అనుకుంటూ వచ్చేసారు. అదే సమయానికి నా ప్రియస్నేహితురాలు అపర్ణ వచ్చింది. ఇంకేముంది కబుర్లే కబుర్లు. బులుసు గారిని కలవడం ఎంత సంతోషమనిపించిందో చెప్పలేను. బ్లాగులో ఎంత హుషారుగా టపాలు రాస్తారో అంతే హుషారుగా కబుర్లు కూడా చెబుతారు. ఆయన శరీరానికే వయసొచ్చిందిగానీ మనసుకి కాదు. మాతో కలిసిపోయి ఎంత చక్కగా మాట్లడారో....ఆయన హుషారు చూస్తే నాకు కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది. ఈలోగా నమూనా అదే అదే నాగమురళీధర్ నామాల వచ్చారు అక్కడకి. :) తరువాత రెహ్మాన్ వచ్చాడు. వీళ్ళందరినీ ఇలా కలుసుకోవడం ఎంత బావుందో చెప్పలేను. క్షణాలు ఎలా దొర్లిపోయాయో తెలియలేదు. సుజాతగారింటికి వెళ్ళడం, కబుర్లుచెప్పుకోవడం....ఒక గొప్ప అనుభూతి. నేను జీవితంలో అపురూపంగా దాచుకునేవాటిలో సుజాతగారి స్నేహం ఒకటి.

(వరూధినిగారూ...అలా చూడకండి...నాకు వణుకొస్తోంది...బాబోయ్ గజ గజ. :( నేను పప్పుసారింటికి, సుజాతగారింటికి మాత్రమే ప్లాన్ చేసాను. మిగతావన్నీ వాటంతట అవే జరిగిపోయాయి. ఈసారి మీ ఇంటికి తప్పకుండా వస్తానని మాటిచ్చాగా...మనిద్దరం మధ్య ఒప్పందం జరిగిపోయింది...మీరు మళ్ళీ అలక్కూడదన్నమాట, నాతో మాట్లడకుండా ఉండకూడదన్నమాట..సరేనా! ) :D

రాత్రి ప్రయాణం అనంతపురానికి అదే జీవనికి. మజ్జిగ చిలికే (మనసుపలికే-అపర్ణ), అల్లవుద్దిన్ మిల్క్ షేక్(రెహ్మానుద్దిన్ షేక్), గెంతి (బంతి), కలిసి రైలెక్కాం. సుజాతగారు మాకు రైల్లోకి ఫలహారాలు కట్టిచ్చారు. నాకిష్టమైన బొబ్బట్లు నాకోసం ప్రత్యేకంగా కట్టి ఇచ్చారు. రైలు ప్రయాణం ఎంతో సరదాగా సాగిపోయింది. బంతి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎంత శ్రద్ధ, ఎంత caring, ఎంత బాధ్యత! ఎవ్వరికీ అసౌకర్యం కలగకూడదని ఎంత తాపత్రయపడ్డాడో! బలే ముచ్చటేసింది నాకు. అనుకున్నట్టుగానే జీవని ప్రసాద్ గారింట్లో దిగాము. ఆయనకి ఇబ్బంది అవుతుంది మనసులో అనిపిస్తూనే ఉంది గానీ వేరొకచోట దిగడానికి ఆయన ససేమిరా అన్నారు. అక్కడకు చేరాక నా కుడిభుజం, ప్రియ మితృడు అయిన రాజ్ ని కలుసుకోవడం గొప్ప ఆనందంగా అనిపించింది. నా బజ్జు నేస్తాలయిన నాగార్జున, వికటకవి శ్రీను, వెన్నెల కిరణ్ కూడా వచ్చారు.

జీవని గురించి గత యేడాదికి పైగా తెలుసు. ప్రసాద్ గారి నిజాయితీ, సమర్థత...జీవని సభ్యుల దయార్ద్ర హృదయం గురించి తెలుసు కానీ అక్కడికి వెళ్ళి కళ్ళారా చూసాక అర్థమయ్యింది మన బ్లాగుల్లో జీవని గురించి విన్నది కన్నది ఎంతో తక్కువ అని. మేరుపర్వతమంటి మనసులు అంటే ఏంటో స్వయంగా చూసాకగానీ అర్థం కాలేదు నాకు. వారి ముందు చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో చిన్నదిగా కనిపిచింది. కుటుంబంలో ఏ ఒక్కరికో ఇటువంటి మనసు ఉంటే సరిపోదు బృహత్కార్యాలకి....ఎలా రాసిపెట్టి ఉందో, ఎక్కడ కుదిరారోగానీ ప్రసాద్ గారు, వారి సతీమణి made for each other మాత్రమే కాకుండా also made for others అనిపించారు. దాదాపు పదిమందిమి వెళ్ళాము అక్కడకి. పొద్దున్నే లేచి ఎంతో ఓపికతో మాకోసం ఫలహారాలు, మధ్యాన్నం భోజం అన్నీ వండి ఎంతో ఆదరణ చూపించారు. ప్రసాద్ గారి తల్లిదండ్రులు వయసులో ఎంత పెద్దవారో మనసులోనూ అంతే పెద్దవారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. "మాకోసం చాలా శ్రమపడుతున్నారండీ" అంటే "నీకలా కనిపిస్తున్నాదా? చూడు మా ముఖాల మీద చెమట బిందువైనా లేదు" అని నవ్వుతూ చమత్కరించారు. వారి ఆప్యాయత చూసాక నాకు అనిపించింది "జీవని పిల్లలు ఎంత అదృష్టవంతులో" అని. జీవని విద్యాలయం కడుతున్న చోటు చూడడానికి వెళ్లాము. మాతో పాటు కారులో ఎవరో ఇద్దరుముగ్గురు వచ్చారు. వారెవరో తెలీదు. ఒక కుర్రాడు...నాకంటే కొంచం పెద్దవారేమో, రాజ్ తో ఏవో మాట్లాడారు. ఎవరోలే అని నేను పట్టించుకోలేదు. జీవని విద్యాలయం కడుతున్న ప్రదేశం ఎంత బావుందని! చుట్టూ కొండలు, పచ్చని చెట్లు......ఆహ్లాదకరమైన ప్రకృతి. అటువంటి బడిలో, ఆ ప్రకృతి ఒడిలో పిల్లలు పెరిగితే ఇంక అంతకుమించి అదృష్టం ఏముంది. ఎదురుగా ఉన్నా "శ్రీనివాస రామానుజం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(SRIT) కి వెళ్లాము. అక్కడకి వెళ్ళగానే ఒకతను వచ్చి మీరొస్తున్నారని చైర్మేన్ గారు చెప్పారంటూ సాదర అతిధి మర్యాదలు చేసి కాలేజీ మొత్తం చూపించాడు. ఈ చైర్మేన్ ఎవరబ్బా అనుకుంటూ ఆశ్చర్యపోయాను. SRIT చాల పెద్ద కాలేజీ. విశాలమైన ప్రాంగణం, అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లేబ్స్, తరగతి గదులు. అక్కడ నన్ను బాగా ఆకర్షించినది వారి రీడీంగ్ రూం మరియు లైబ్రరీ. ఏ కాలేజీ లైబ్రరీలలోనూ చూడని పుస్తకాలు కనిపించాయి అక్కడ. పాఠ్య పుస్తకాలతోపాటు మంచి తెలుగు సాహిత్యం కనిపించింది. నాకిష్టమైన పుస్తకాలెన్నో కనిపించాయి. ఆ పుస్తకాల సేకరణ వెనుకాల కర్త, కర్మ క్రియ జీవని ప్రసాద్ గారేనని తరువాత తెలిసింది.

కాసేపటికి బిలబిలమంటూ పిల్లలు చుట్టుముట్టారు. అక్క, అన్నయ్యా అంటూ మా ఒళ్ళో కూర్చుని, భుజాలమీదెక్కి ఊపిరి సలపనిచ్చారు కాదు. మేము తెచ్చిన చిన్న చిన్న బహుమతులు అందుకుంటుంటే వారి మొహాలలో వెల్లివెరిసిన ఆనందం చూసి "ఇది చాలు ఈ జన్మకి" అనిపిచింది. ఆ చిన్నారుల నవ్వుల ముందు వేల వజ్రాలు కూడా దిగదుడుపే. చిట్టి పొట్టి పిల్లలు సీతాకోకచిలుకల్లా చుట్టూ చేరి "అక్కా ఇది కావాలి, అది కావాలి, వీడు చూడు ఇలా చేస్తున్నాడు, నా రిబ్బను పోయింది, నేనో జోక్ చెబుతా, నేను మిమిక్రీ చేస్తా, నేను పాట పాడుతా, నాకు ఇన్ని మార్కులొచ్చాయి, మా మేషారు ఇలా అన్నారు " అని కబుర్లు చెబుతుంటే ఏవో తెలియని ఆనందలోకాల్లో విహరిస్తున్నట్టు అనిపించింది. నాకు జామకాయలు ఇవ్వలేదు అని ఒక పిల్ల అలక, వీడు నన్ను బెదిరిస్తున్నాడు అని ఇంకో పిల్ల కోపం, అమ్మాయిల చేతికి ఏవో వేసారు (గాజులు) అవి నాకు కావాలి అని ఒక బుజ్జి బాబు అల్లరి, నాకు ఫొటో తియ్యవా అన్నయ్యా అని ఇంకో చిన్నారి సరదా....ఓహ్ ఒకటా, రెండా! వారి అలకలు తీరుస్తూ, బుజ్జగిస్తూ, సరదాగా ఆటపట్టిస్తూ, చక్కిలిగింతలు పెడుతూ నేను నా వయసు మరచిపోయి చిన్నపిల్లనైపోయాను. వారితో గడిపిన ఆ కొన్ని గంటలు వెలకట్టలేనివి. వారితో సమయం గడిపిన తరువాత అమ్మ ఒడిలో నిదురిస్తున్నంత ప్రశాంతంగా అనిపించింది. ఎర్రటి ఎండ తరువాత కురిసిన చిరుజల్లు వలే హాయిగా అనిపించింది. మనసుకి కొత్త శక్తిని, కొత్త ఉత్తేజాన్ని కలిగించింది.


మధ్యాహ్నం మా అందరి భోజనాలయ్యాక పిల్లలకి భోజనాలు పెడుతున్నారు ప్రసాద్ గారి అమ్మగారు మరియు శ్రీమతి. వారితో పాటు రెహ్మాన్ కూడా వడ్డిస్తున్నాడు. అటుగా వెళ్తూ ఈ తతంగాన్ని గమనించాను. మొత్తం పాతిక మంది పిల్లలకి ఎంతో లాలనగా, ఒక్కొక్కరిని ప్రత్యేకంగా చూస్తూ, ఎవరికి ఏమి కావాలో శ్రద్ధగా అడిగి తెలుసుకుని, కొసరి కొసరి వడ్డించి, తినకపోతే మెల్లిగా మందలించి ఆప్యాయంగా తినిపిస్తున్నారు వారు. ఆ దృశ్యం చూసి నా కళ్ళకొసల నీరు నిలిచింది. ఆ కరుణార్ద్రహృదయులముందు నాకు నేను ఎంతో చిన్నదానిగా కనిపించాను. వారి జీవితం ఎంత ధన్యం! ఇంక నేను ఆగలేకపోయాను. వారితో చేరి నేనూ కూడా పిల్లలకు వడ్డిస్తూ, తినిపిస్తూ అలౌకికానందాన్ని పొందాను. అన్నాలయ్యాక విశ్రాంతి తీసుకుంటుంటే ఇందాకల కారులో కనిపించిన కుర్రాడు మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ పక్కనే బల్లేసుకుని మామూలుగా, అతిసాధారణంగా అందరిలాగా భోజనం చేస్తున్నారు. ఎవరబ్బా ఇతను అని విచారిస్తే అతనే ఆ SRIT చైర్మేన్ సాంబశివరావుగారు అని తెలిసింది. అవాక్కయిపోయాను, నిజంగా. ఎంత సాదాసీదాగా ఉన్నారు! ప్రసాద్ గారిని అభిమానంగా అన్నయ్య అని పిలుస్తూ, ఏ భేషజం లేకుండా, ఇంట్లో మనిషిలాగ మెసలుతున్నారు. SRIT లో మాకు నచ్చిన విషయాలు తెలియపరుస్తూ వారిని మనస్పూర్తిగా అభినందిందాము. జీవని విద్యాలయంలో వీరూ భాగస్వాములే అని తెలిసి సంతోషించాము.

ఇందరి కరుణమాయుల చల్లని చేతులలో ఎదగబోయే ఆ పసిమొగ్గలకన్నా అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. ఎవరన్నారు ఆ పిల్లలకి ఎవరూ లేరని?...చల్లని మనసులు కలిగిన ఇందరు ఉత్తములు వారికి అండగా ఉండగా వారికన్నా ధనవంతులు ఎవరు!

ఆ భూమి మీద విరిసిన నక్షత్రాల కోసం ఇంతటి కృషి చేస్తున్న ప్రసాద్ గారి కుటుంబానికి, మిగతా జీవని సభ్యులకు ఇవే నా హృదయపూర్వక జోహార్లు. నేను సైతం నేను సైతం జీవని పాటకు గొంతు కలిపేను అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది.

ప్రసాద్ గారి కుటుంబ సభ్యుల అభిమానాన్ని, చిన్నారుల నవ్వుల పువ్వులను ఒడుపుగా మూటగట్టుకుని కార్తీక్ పెళ్ళికి పులివెందులకి బయలుదేరాం. ఇంక అక్కడనుండి మొదలయ్యింది ఆనందహేల. బ్లాగులోనూ, బజ్జులోనూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడు కొట్టుకుంటూ ఉండే మేము అందరం ఇలా డైరెక్ట్ గా కలిస్తే ఇంకేమైనా ఉందా...మా నవ్వులతో పులివెందుల దద్దరిల్లింది. మా ఆటపాటలతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. మేము మా గోల తప్ప మరో ప్రపంచాన్ని పట్టించుకోలేదు. పెళ్ళికి శంకర్ గారు, విజయమోహన్ గారు, నాగ ప్రసాద్ కూడా వచ్చారు. ఇంక ఆటలు, పాటలు, అరుపులు, కేకలు, జోకులు, సెటైర్లు...ఒకటేమిటి...రెండు రోజులు ఎడతెరిపి లేకుండా నవ్వుతూనే ఉన్నాం. ఒక్కసారిగా కాలేజీ రోజులకు వెళ్ళిపోయినట్టనిపించింది. అందరం చిన్నపిల్లలమైపోయాం. ఎప్పటినుండో పరిచయమున్న నేస్తాల్లా కబుర్లు చెప్పేసుకున్నాం. కార్తీక్ అటువైపు పెళ్ళిలో కూర్చున్నాడేగానీ మనసంతా ఇటువైపే ఉంది. పది నిముషాలకొకసారి మమ్మల్ని చూస్తూనే ఉన్నాడు.

ఇంక అసలు విషయం గురించి నాలుగు మాటలు - అదే కార్తీక్ పెళ్ళి - వధూవరులిద్దరూ చిలుకాగోరింకల్లా లాగ చక్కగా ఉన్నారు. పెళ్ళి చాలా బాగా జరిగింది. రాయలసీమ, కర్ణాటక రుచులతో పసందైన భోజనాలు, అందమైన పందిళ్ళు, అభిమానించే మనుషుల మధ్య కార్తీక్ పెళ్ళి వైభోగంగా జరిగింది. కార్తీక్-సౌమ్య లు కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, స్నేహితుల్లా కలిసిమెలిసి ఆనందంగా జీవితం గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. వారిద్దరికీ వివాహమహోత్సవ శుభాకాంక్షలు!

పెళ్ళి అయిన తరువాత మేమంతా చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. ఎంత మంచి విషయమైనా ముగింపుకి రాక తప్పదు కదా.... మరచిపోలేని మధురానుభూతులను మూటగట్టుకుని, అందరివద్దా వీడుకోలు తీసుకుని ఎవరిదారిన వాళ్ళు బయలుదేరాం. మళ్ళీ ఎప్పుడో, ఎక్కడో.....తప్పకుండా కలుసుకుందాం నేస్తాలూ!

మూడురోజులు ఆనందజలధిలో ముంచేసి, అందమైన అనుభూతులను బహుమతిగా ఇచ్చిన బ్లాగు/బజ్జు నేస్తాలందరికి ఇవే నా హృదయపూర్వక కృతజ్ఞతలు!