StatCounter code

Wednesday, May 5, 2010

అచ్చ తెలుగు పదాలు

నాకు తెలుగు మీదున్న ప్రేమ నా చేత కొన్ని పనులు చేయిస్తూ ఉంటుంది, ఇప్పుడు కొత్తగా నేను చేపట్టిన పని అచ్చ తెలుగు పదాలని వెతకడం.

మూలద్రవిడ భాష నుండి తమిళం, తెలుగు, కన్నడం వచ్చాయని మనకి తెలుసు. ఆర్య సంస్కృతి, ద్రవిడ సంస్కృతిలో విలీనమయినప్పుడు భాగంగా సంస్కృతం, ద్రవిడ భాషలన్నిటిలోనూ బాగా కలిసిపోయింది. ఈరోజుకి ఏది అచ్చ తెలుగు పదమో, ఏది సంస్కృతపదమో పోల్చుకుని, విడదీయలేనంతగా సంస్కృతం తెలుగులో కలిసిపోయింది. గ్రాంధికం నుండి వ్యవహారికానికి, పద్యం నుండి గద్యంలోకి సాహిత్యం మార్పు చెందినా, చాలామటుకు సంస్కృతపదాలు రాతల్లోనూ వాడుకలోనూ దొర్లుతూనే ఉన్నాయి.

ద్రవిడ భాషనుండి ఆర్య భాషను వేరు చెయ్యడం అనే ప్రక్రియలో తమిళులు మనకంటే చాలాముందు ఉన్నారు. అసలు ఎందుకు చెయ్యలి అని అడిగితే నా దగ్గర ఒప్పించదగ్గ సమాధానం లేకపోవచ్చుకానీ, నా భాషలోని అసలు పదాలను తెలుసుకోవలన్న తృష్ణ మాత్రం ఉంది, అంతే. సంస్కృతమంటే నాకు ఇష్టమే. దానిలో ఒక తియ్యదనముంది, అది నాకు ఇష్టమే. కానీ అచ్చ తెలుగు పదాలను వెతకాలన్న జిఙ్ఞాస మాత్రం ఓ 4-5 యేళ్ళ క్రితం "భ్రమణ కాంక్ష" అనే పుస్తకం చదవడంతో మొదలయ్యింది. ఈ పుస్తకాన్ని ఎం.ఆదినారాయణగారు రాసారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఆయనకి దేశలో నలుమూలలకి కాలినడకన పోవడం ఇష్టం. వారు యూనివర్సిటీలో సంపాదిచంచుకున్న శిష్యులతో కలిసి చాలా యాత్రలు చేసారు. కొన్ని నదుల పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి, కొన్ని ప్రదేశాల ఆద్యంతాలు చూడడానికి, ఇలా అనేక కారణాలతో ప్రయాణాన్ని సాగించారు. ఈ పుస్తకం గురించి, ఈయన గురించి మరెప్పుడైనా వివరంగా రాస్తాను.

ఈ పుస్తకంలో, ఆయన గుండ్లకమ్మ నది పరీవహకప్రాంతలో ప్రయాణించినప్పుడు, మధ్యలో తగిలిన గ్రామాల తీరుతెన్నులను పరిశీలిస్తూ వాళ్ళ భాష గురించి కూడా రాసారు. ఈ నది కర్నూలు, ప్రకాశం ప్రాంతాలలో ఉంది అనుకుంటాను, సరిగ్గా గుర్తు లేదు. ఆ వ్యాసంలో కొన్ని పదాలకు నాకు అర్థం తెలియలేదు. పరిశీలిస్తే అవి అచ్చ తెలుగు పదాలని ఆ మారుమూల గ్రామాలలో వాడుకలో ఉన్నాయనీ తెలిసింది. అదే సమయంలో "చరిత్ర" ని అధ్యయనం చేస్తున్న విద్యార్థితో ఈ విషయం ప్రస్తావించగా "అవును, నిజమే కోస్తా ఆంధ్రలో మారుమూల పల్లెలలో, ఎక్కడో గిరిజన ప్రాంతాలలో అచ్చ తెలుగు భాష వాడుకలో ఉంది, అది మనకి అస్సలు అర్థం కాదు" అని చెప్పాడు. ఈ విషయంపై ఎవరో పరిశోధన చేసారు, వివరాలు ఇస్తాను అన్నాడు కానీ ఇవ్వలేదు. ఆ వ్యక్తిని మరల నేను కలవడం జరగలేదు. కాబట్టి ఆ గిరిజన ప్రాంతాలు కనుక్కునే పని, అచ్చ తెలుగు తెలుసుకునే పని అక్కడే ఆగిపోయింది. అప్పటినుండి మొదలయ్యింది నా అచ్చ తెలుగు పదాల వెతుకులాట. కాకపోతే దీనిపై ఎంత కోరిక ఉన్నా, పరిశోధనకి సమయం కేటాయించలేకపోతున్నాను, ఒక చెంచాడు భవసాగరాలు ఈదుతున్నానుకదా మరి. ఈ మధ్యనే అంటే ఓ 2-3 నెలల క్రితం మళ్ళీ ఈ కోరిక కొత్తగా చివురించింది వసంతకాల మహిమో ఏమో మరి. అందుకే ఇక్కడ ఇలా ప్రస్తావిస్తున్నాను.

ఈ బ్లాగులోకంలో తెలుగు బాగా తెలిసిన, రాస్తున్న వాళ్లని చూసాను. ఈ విషయంలో వాళ్ళేమైనా నాకు సమాచారం అందించగలరని ఆశిస్తున్నాను. కొత్త పదాలు నాకు తెలియజేయగలరని కోరుతున్నాను.

బ్రౌణ్య నిఘంటువులో చూస్తే తెలిసిపోతుంది కదా అని నన్ను అడగొచ్చు. నిఘంటువులో చాలమటుకు పదాలకి సంస్కృతం, తెలుగు అని బ్రాకెట్లలో రాస్తూ ఉంటారు. కానీ కొన్నిపదాలు ఉండవు. ఒకే పదమయితే ఉండొచ్చేమోగానీ, రెండు పదాల కలయికతో ఉన్నవి నిఘంటువులో లేవు. కాబట్టి మీరంతా మీకు తెలిసిన అచ్చ తెలుగుపదాలను నాకు తెలుపగలరని ఆశిస్తున్నాను.

నాకు తెలిసిన కొన్ని అచ్చ తెలుగు పదాలని ఇక్కడ ప్రస్తావిస్తాను.

మేలిపొద్దులు - అంటే శుభోదయం. చూసారా మన పరిస్థితి, అచ్చ తెలుగు పదానికి సంస్కృతంలో అర్థం చెప్పుకోవలసి వస్తున్నది. మనకి శుభోదయం అనే పదం తెలుసే తప్ప మేలిపొద్దులు అన్నది తెలియదు, బహుశా చాలా తక్కువమందికి తెలుసేమో. "మేలు", "పొద్దు" అన్నవి ద్రవిడ భాషలో నుండి వచ్చిన పదాలే.ఈ పదం నేను నేర్చుకున్న దగ్గరనుండీ వాడకం అలవాటు చేసుకుంటున్నాను. అలాగే నా బ్లాగ్మిత్రులు కొందరికి అలవాటు చేసాను. మేము ఆన్లైన్లో కలిసినప్పుడు, లేదా ఏదైనా బ్లాగులో కలిసినప్పుడు మేలిపొద్దులు అని చెప్పుకోవడం పరిపాటిగా మారింది.

మప్పితాలు - అంటే ధన్యవాదాలు, కృతఙ్ఞతలు అని విన్నాను. కానీ మప్పితము అంటే మితము, పరిమితము అని నిఘంటువులో ఉంది. మీకెవరికైనా అసలు అర్థం తెలిస్తే చెప్పండి.

సుమాళి - సంతోషంగా జీవించునది/వాడు అని అర్థం.

పెద్దలమనిషి - గర్భవతి, కడుపుతో ఉన్నవారు

విరాళి - వలపు

అంకిలి - కలత

కంగారు, కంగిస - యుద్ధం

మంచుతెఱి - హేమంత ఋతువు

మలికితము - సందేహం

సరవి - క్రమము, సరళి

సవరన - చక్కన, చదును చెయ్యడం

సాకము - ఉత్సవము

సాకు - వాయిద్యము

ఇలా మీకు తెలిసిన కొత్తపదాలేమైనా ఉంటే తెలుపగలరు.

58 comments:

తెలుగు అభిమాని said...

బాగా వ్రాశారు. మేలిపొద్దులు అన్న పదం అద్భుతంగా ఉంది.

Anonymous said...

నెనర్లు.మరి శ్రీకాకుళం ప్రాంతం లో వున్న మీ అన్నయ్య సహాయం తీసుకోవలిసింది కదా!

కొత్త పాళీ said...

Interesting exercise.
భ్రమణకాంక్ష రాసిన వారిపేరు ఎం. ఆదినారాయణ. ఆం.వి.వి.లో లలితకళల విభాగంలో చిత్ర శిల్పకళల విభాగానికి ప్రధానాచార్యులుగా ఉన్నారు

నాగేస్రావ్ said...

సౌమ్య గారూ, ముందుగా మేలిపొద్దులు. బావుంది మీ వెతుకులాట. "చాలామటుకు సంస్కృతపాదాలు" - కావాలని (శ్లోకాల్లోని పాదాలని) రాసారా, లేక తప్పులో కాలేసారా?
గూగిలిస్తే ఆదినారాయణ గారి ఇంటి పేరు "ఎం." అనేవరకు తెలిసింది. భ్రమణకాంక్ష గురించి తప్పకుండా రాయగలరు.
నిన్నేదో గూగాలిస్తుంటే దాదాపు రెండువేలు అన్నమాచార్య సంకీర్తనలు .పిడిఎఫ్ లు దొరికాయి, శిష్ట్లా శ్రీరామచంద్రమూర్తి గారు కూర్చినవి. ఆసంకీర్తనల్లో చాలా పదాలు తెలియనివి ఉన్నాయి, అంటే అచ్చతెలుగయ్యుంటుంది అనుకున్నా.
మీ ఈబలాగు బహు బాగు.

Anonymous said...

మేలి పొద్దులు వలన నాకు మేలి ముసుగు గుర్తుకొస్తూంది.
పెద్దల మనిషి అనేదినాకు పెద్దమనిషి అవ్వటం (రజస్వల అవ్వటం) అనె ప్రయోగాన్ని గుర్తుకు తెస్తోంది.
అలానే మర్యాదా మప్పితమూ అంటారు కదా.
bondalapati

అశోక్ చౌదరి said...

.. Till now i thought i m good in telugu.. But frankly.. మీరు చెప్పిన తెలుగు పదాలలలో ఒక్క దానికి కూడా నాకు అర్ధం తెలియదు.. :-(

Thx for the initiation..

Vinay Chakravarthi.Gogineni said...

sowmya

whats the meaning of sinjini

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

సౌమ్య గారు,"ఈ పుస్తకాన్ని ఎం.ఆదినారాయణ అనే ఆయన రాసారు. కానీ ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉండేవారు"--ఆయన ఇప్పటికీ అచార్యులుగానే ఉన్నారు.మరొక త్వరలో ఫ్రాన్స్ దేశం లో పాదయాత్రలు చేసే ఏర్పాట్లలో ఉన్నారు.నేను ఆదినారాయణ గారిని చేసిన ఇంటర్వ్యూ ఈ యూట్యూబ్ వీడియో లింకుల్లో చూడగలరు.
http://www.youtube.com/results?search_query=M.Adinarayana&aq=f
గుండ్లకమ్మ నది కర్నూలు జిల్లాలో పుట్టి గుంటూరు,ప్రకాశం జిల్లాల్లో ప్రవహిస్తుంది.కాబట్టి మీ అన్నయకు కాస్త శ్రమ తప్పింది.
అలాగే ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లిని ఒక ఎర్రపెన్సిలు పక్కన పెట్టుకుని చదవటం మొదలుపెట్టండి.కనీసం ఒక వంద పదాలు అచ్చతెలుగుపదాలు దొరుకుతాయి.పాతతెలుగు పాటల్లో కూడా మరికొన్ని.అచ్చుతప్పులున్నాయి టపాలో సవరించండి.

'Padmarpita' said...

అమ్మో ఎన్ని పదాలున్నాయో, నాకు తెలియనివి! చక్కగా చెప్పారు.

చిన్ని said...

మప్పితము -కుదురుగా ,ఒద్దికగా ,ఓబ్బిడిగా అనుకుంటాను .
అన్నట్లు గుండ్లకమ్మ నది ప్రకాశం జిల్లాలో కదండీ ,ఒంగోలు కి దగ్గరలో రిజర్వాయర్ కూడా వుంది కదండీ !
చాలా బాగుంది మీ టపా

sowmya said...

@తెలుగు అభిమాని
నెనర్లు, అవునండీ నాకూ ఆ పదం చాలా నచ్చింది.

@ కృష్ణ
మీ పిలక నా చేతిలో ఉంది, మరచిపోవద్దు :)

sowmya said...

@ కొత్తపాళీగారూ
కరక్ట్ గా నేను అనుకున్నట్టే జరిగింది. మీరు వచ్చి ఆయన పేరు ఖచ్చితంగా సరి చేస్తారు అనుకున్నాను, అలాగే జరిగింది....చాలా చాలా ధన్యవాదములు. సరి దిద్దాను.

sowmya said...

@ నాగేస్రావుగారూ
అవునండీ తప్పులో కాలేసాను, కడిగేసుకునానులెండి(సరిదిద్దాను):)
ఓహ అలాగా, అయితే ఆన్నమాచార్య్కీర్తనలలో ఉన్న తెలుగు పదాలు సేకరించండి, మాకూ పంచండి. మనమందరం అవి వాడడం అలావాటు చేసుకుందాం, ఏమంటారు?
నా బ్లాగ్ ని మెచ్చినందుకు చాలా సంతోషం, నెనర్లు.


@Anonymous
నాకూ మీలాగే అవే పదాలు గుర్తొచ్చాయి. మర్యాద, మన్నన అంటారు కదా. మప్పితము అంటే సరిగ్గా అర్థమేమిటో ఇప్పటికీ తెలియట్లేదు. ఎవరైనా పెద్దలు తెలియజెప్పాలి మరి.

sowmya said...

@ ఆశోక్ గారూ
అదే నా ఆశయమండీ, ఈ అచ్చ తెలుగు పదాలను నలుగురికి తెలియజెయ్యలని, తద్వా
రా నేనూ ఇంకా ఎక్కువ తెలుసుకోవలానే నాకోరిక,ఆశయం. అది నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది.


@ వినయ్
శింజిని అంటే వింటినారి, కాలి అందె అని అర్థములున్నాయి

sowmya said...

@ రాజేంద్ర గారూ
ఓహ్ అవునా, తప్పకుందా యూట్యూబ్ వీడియో చూస్తానండీ. అబ్బో ఫ్రాన్సుకి పాదయాత్ర చేస్తారా ! ఆయన ఓపికకి జోహార్లు.
గుండ్లకమ్మ నది గురించి సరిచేసానండీ.
హ్మ్ అయితే వెంటనే "మాలపల్లి" పుస్తకమ కొని చదవాలి. ఇంతకీ పుస్తకం పేరు "మాలపల్లె" యా, "మాలపిల్ల" నా?....మాలపల్లి అంటే కొంచం తేడా గా ఉంది అందుకే అడిగాను
అప్పుతచ్చులు సరిచేసానండీ....తెలియజేసినందుకు ధన్యవాదాలు.

@ పద్మగారూ
నెనర్లు, మరి ఈ కొత్త పదాలు వాడడం మొదలెట్టండి !

sowmya said...

@చిన్ని
హ్మ్ అదేనండీ మప్పితముకి సరి అయిన అర్థం దొరకలేదు ఇంకా.
గుండ్లకమ్మ నది గురించి సమాచారం సరిచేసానండీ

తార said...

గుండ్లకమ్మ నుంచి పేరంటాలమ్మ మధ్య ప్రాంతమే కమ్మ నాడు, అది శ్రీ క్రిష్ణ దేవరాయలు పెమ్మసాని వారికి బహుమతిగా ఇచ్చెను... ఇలా పోతుంది మా ప్రాంత చరిత్ర....
బెండ్ కూడా అచ్చ తెలుగు పదమే అనుకుంటాను, తెల్లవారు కొట్టేశేరు అని ఎవరో చెప్పగా వింటిని.

తార said...

http://www.andhrauniversity.info/andhrauniversity/Resume.jsp?var=E520

http://www.andhrauniversity.info/arts/finearts/faculty.html

tara said...

విసాగు మప్పితాలు (culture and civilisation) ani http://www.telugupeople.com/content/Content.asp?ContentID=1011521&catID=53 lo vaadaru mari

naa comments ni edit cheyagaligithey 3 merge cheyagalaru.

శ్రీవాసుకి said...

మీ భాషాభిమానం బాగుంది. ప్రయత్నించండి. అన్నమాచార్య కీర్తనలలో కొన్ని లేదా చాలా తెలుగు పదాలు దొరుకుతాయి. జాగ్రత్తగా ఆ పాటలు వున్న పుస్తకం సంపాదించండి. ఏవైనా తెలిస్తే చెప్పడానికి ప్రయత్నిస్తాను.

శ్రీవాసుకి

సవ్వడి said...

సౌమ్య గారు మేలిపొద్దులు! మంచి ఆశయం. నాకా ఓపిక లేదు, తీరిక లేదు కాని మీరే మన తెలుగు పదాలను కనుక్కొని బ్లాగులో పెట్టండి. నేణు తెలుసుకుంటాను.

sowmya said...

@ తారా,
మంచి సమాచారం అందించారు, ధన్యవాదాలు. Telugupeople లో వచ్చిన వ్యాసం బాగుంది. మళీ మప్పితం అర్థం తెలియలేదు, తికమకగానే ఉంది.
links ఇచ్చినందుకు thanks!

@శ్రీవాసుకిగారూ
అలాగేనండీ, అన్నమాచార్యకీర్తనల పుస్తకం నా దగ్గర ఒకటుండేది. మా యూనివర్సిటీలో పాటలపోటీలో మూడవ బహుమతి కింద నాకు అది ఇచ్చారు. అది కాస్త వెతుకుతాను కొత్త తెలుగు పదాలకోసం.

@సవ్వడి
అమ్మో మీకు భలే ఆశండీ......ఇలా కష్టపడకపోతే లాభంలేదండోయ్,మన తెలుగుని మనం పరిరక్షించుకోవాలా వద్దా....మీరూ ఓ చెయ్యి వెయ్యాలి మరి. పనిగట్టుకుని వెతకక్కరలేదుగానీ,ఓ కన్నేసి ఉంచండి.

tara said...

సౌమ్యగారు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, బెండ్ తెలుగు పదం అని చెప్పినందుకా??

sowmya said...

@తార
ఈ బెండ్ గొడవేమిటి బాబూ, అది కొంతమంది ప్రావీణ్యులకే తప్ప అందరికి అర్థం కావు :)

హరే కృష్ణ . said...

చాలా బావుంది
తెలుగు బాష కు మనవంతు కృషి చెయ్యడం లో ఆనందాన్ని పొందుతున్నారు
మీ ప్రయత్నం ద్విగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాం

శ్రీలలిత said...

సౌమ్యగారూ,
నాకు తెలిసున్నంత వరకూ మప్పితము అంటే "నేర్పించడము" అనుకుంటానండీ. వాడుకలో "ఏం మప్పి పెట్టారండీ మీ పిల్లకీ" అని అనడం విన్నట్టు గుర్తు.

sowmya said...

@ హరే కృష్ణ
ధన్యావాదాలండీ,మరి మీరూ ఓ చెయ్యి వెయ్యండి

@లలితగారూ
ఆ మప్పించడం వేరు, ఈ మప్పితము వేరండీ. నిఘంటువులో మాత్రం మితం, పరిమితం అని ఉన్నాది.

కొత్త పాళీ said...

నిఘంటువు చూడకుండా నేను కూడా మప్పితము అంటే నేర్పబడినది, నేర్చినది అనుకున్నాను, పైన శ్రీలలితగారి లాగానే. ఎందుకంటే మర్యాదగానీ మన్నన గానీ నేర్పితే రావలసిందే కదా (ఇది నా లాజిక్కు!).
అదలా ఉండగా .. ఉన్నవవారి నవల పేరు "మాలపల్లి". తెలుగు వారందరూ చదవాల్సిన పది పుస్తకాల్లో ఒకటి. తెలుగు నాటకానికి కన్యాశుల్కం ఎలాగో, ఆధునిక కవిత్వానికి మహాప్రస్థానం ఎలాగో, కనీసం నా దృష్టిలో, తెలుగు నవలకు మాలపల్లి అలాగు. ఇటీవలనే పలుమార్లు మలిముద్రణ పొందింది కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతోందనే ఆశిస్తాను.

sowmya said...

@ కొత్తపాళీగారూ
హ్మ్ మీ లాజిక్కు బావుంది కానీ ఇక్కడ పనిచెయ్యలేదు.
ఎవరో చెప్పారు నాకు మప్పితాలు అంటే ధన్యావాదములు అని ఇంకో అర్థం....సరి అయిన అర్థం ఎలా తెలుస్తుందో నాకు తెలియట్లేదు.
మాలపల్లి పుస్తకం పేరు విన్నానండీ చాలాసార్లు, తప్పకుండా కొని చదువుతాను.

Vadapalli SeshatalpaSayee said...

"మప్పు" అనే పదానికి అర్థం చూడండి
http://www.andhrabharati.com/dictionary
బ్రౌణ్యం నుంచి
--
mappu [Tel. contracted from మరపు.] v. a. To break in, or train (any animal). అలవరచు, అభ్యాసముచేయించు, అలవాటుచేయు. మప్పవచ్చును గాని తిప్పలేము it is easy for us to teach but not to correct.
మప్పితము adj. Limited, tolerable, మితము, పరిమితము.
--
అచ్చతెనుగు నిఘంటువులు చాలా ఉన్నాయి. DLIలో కొన్ని దోరకుతాయి.
--
Regards,
Vadapalli SeshatalpaSayee.

malli said...

సౌమ్యా
మీ బ్లాగ్ ఇపుడే చూడటం...బావుంది.
మప్పితం అంటే చిన్ని గారూ చెప్పిన అర్ధం లో
వాడటం తెలుసు నాకు.గోదావరి జిల్లాల్లో
వాడుకలో వుంది.

sowmya said...

@శేషతల్పసాయిగారూ ధన్యవాదములు,
బ్రౌణ్య నిఘంటువులో నేను కూడా అర్థం చూసానండి.
మీరిచ్చిన సైటు బావుంది.thanks!

@ మల్లిగారూ నెనర్లు

శ్రీవాసుకి said...

సౌమ్య గారు

సాక్షి ఆదివారం ఫన్ డే పుస్తకంలో అన్నమయ్య కీర్తనలలోని తెలుగు పదాలకు అర్థం ఇస్తున్నారు అలాగే మన రాష్ట్రంలో ఉండే జిల్లాలలో మాట్లాడే మాటల అర్థాలు కూడా. వీలుంటే ఒకసారి చూడండి.

sowmya said...

@వాసుకిగారూ
అవునండీ నేను సాక్షి ఆదివారం పుస్తకాలు చూసాను. "పెద్దలమనిషి" అనే మాట అక్కడనుండే పట్టుకున్నాను. మాండలికాలు ఎక్కువగా ప్రచురిస్తున్నారు.

కమల్ said...

తెలుగు పదాలు తెలుసుకోవాలి అన్న జిఙ్ఞాస మీలో ఉండడం అభినందనీయం..! చాలా బాగా రాసారు. ఎవరో కొందరు సాహితీమిత్రులు చెప్పగా విన్న విషయం.." అచ్చు తెలుగు పదాలు ప్రస్తుత కడప - కర్నూల్ సరిహద్దు ప్రాంతాంలో ఒకప్పుడు మాట్లాడే వారని ఆ ప్రాంతాన్ని " రేనాడు " అని పిలిచే వారని. ప్రముఖ శతవధాని శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు చెప్పారని విన్నాను, అందుకు నిదర్శనమే " శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి కీర్తనలలో అచ్చ తెనుగు పదాలు ఉండడం ", కాకపోతె కొందరు వాటిని ఆ ప్రాంతపు " మాండలికాలు " అని అన్నారు..! మరి ఏవి నిజమో..? కడప ప్రాంతపు కొన్ని పదాలు వింటే అవి మాండలికాలు అని అనుకునేవాడిని..కాని .." ఈనాడు " వారి తెలుగు నిఘంటవు లో చూసాక తెలిసింది అవి తెలుగు పదాలని..! అలా కొన్ని తెలుగు పదాలున్నాయి. మీకు అవకాశం ఉంటే " ఈనాడు " వారి తెలుగు పదకోశంలో చూడండి చాలా తెలుగు పదాలు కనపడతాయి. అలా విన్న వాటిలో " జాలాడి " పదం....అంటే జలకాలు(స్నానం) ఆడే గదిని జాలాడి అనిపిలుస్తారు అక్కడ..! అసలు మనం ఎప్పుడన్నా ఆంగ్ల " బాత్‌రూమ్ " ని తెలుగులో పిలుస్తామా..? ఇలాంటివి చాలానే ఉన్నాయి.

sowmya said...

@కమల్ గారూ
ధన్యవాదాలు

నేనయితే అచ్చ తెలుగు శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కాడో ఉంది అని విన్నాను. కర్నూలు లో అయినా శ్రీకాకుళంలో అయినా, మాండలీకాలు ఎక్కువగా ఉంటాయన్నదే నా అభిప్రాయం కూడాను. ఉదాహరణకి పైన చెప్పిన పదాలలో "పెద్దల మనిషి" అనేది మాండలీకమే అనుకుంటాను. మీరు చెప్పిన "జాలాడి" పదం కూడా నేనింతకుముందు విన్నాను. మరి మాండలీకమో, అచ్చతెలుగు పదమో నాకూ తెలీదు. అయితే మాండలీకాలే అచ్చతెలుగు పదాలు అనే ఇంకొక భావన కూడా ఉంది. అన్నమయ్య రచనలలో అచ్చతెలుగు పదాలు ఉంటాయి అనేది వాస్తవమే.

ఈనాడు పదకోశం గురించి చెప్పినందుకు చాలా చాలా thanks. తప్పక చూస్తాను.

Anonymous said...

Beautiful..
ఇప్పుడు బ్లాగ్ ఫాలో అవుతాను.

Anonymous said...

నామ విఙ్ఞానము - రచయిత ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు.
ఈ పుస్తకంలో కొన్ని పదాలు :
కక్కాయి = తండ్రి తమ్ముడు
ఉప్పిండి = ఉప్మా
ఉడ్డెనలు = ఇడ్లీలకన్నా పెద్దవి,
పొది = సక్రమంగా,సర్ది పెట్టు
మల్లు = తెలుపు
కొరునేల = మెట్ట భూమి
పరకచేను = బీడు భూమి

బూదరాజు రాధాకృష్ణ తెలుగు పదాలపై ఏదో పుస్తకం రాసినట్టు గుర్తు...

ఆ.సౌమ్య said...

@ఆదిత్య గారూ
మంచి పదాలు తెలిపారు. ధన్యవాదములు.
మా అమ్మగారు వాళ్ళు వాళ్ల చిన్నాన్నని "కక్కి" అనే అంటారండీ. కక్కాయి, కక్కీ ఒకటే అనుకుంటా.

ఉప్పిండి .....మేము ఉప్పు పిండి ని వేరే చేసుకుంటాం. మొరుం (బియ్యం రవ్వ) తో చేసుకుంటాం. ఉప్మా లాగే ఉంటుంది కాకపొతే రవ్వ వేరు అంతే.

మిగతా పదాలు నేను వినలేదు. నాకు కొత్తవే. నా పదకోశంలో మరిన్ని పదాలు చేరాయి. చాలా చాలా thanks!

ఈ నామ విజ్ఞానము చదవాలి అయితే.

భాస్కర్ రామరాజు said...

శశిరేఖ గారూ
వందనుములు
మీ బ్లాగుయందలి టపాలు బహుబాగు. తెలుఁగు భాష యడల మీ ప్రేమ మెచ్చతగినది.
మీ టపాలు అ నుండి ఇ (ఇప్పటివరకు) అన్నీ చదివితిని. సంతోషం.
మన కండ్ల ముందే పొంగిపొరలు అచ్చతెలుఁగు మాటలు బోలెడు.
ఎలపట - కుడి
దాపట - ఎడమ
మా నాయనమ్మ వాళ్ళ కక్కయ్య గురించి చెప్పునది మా చిన్నతనములో
మారిమి
కూరిమి
ముదిమి
మిసిమి
ఇటువంటి పదములు వేలాదులు

ధన్యవాదములు

ఆ.సౌమ్య said...

@రాజు గారూ
నమస్కారం, నా బ్లాగుకి స్వాగతం.
ధన్యవాదములు.
నా టపాలు అన్నీ చదివితిరా....అంత కృప కలిగిందేం ఇవాళ? :D
ధన్యోస్మి. :)

మంచి పదాలు చెప్పారండీ. ఎలపట, దాపట అన్న పదాలు నాకు తెలీవు. ఇవాళ నేర్చుకున్నాను. కూరిమి, ముదిమి ఇవన్నీ వినగానీ సంస్కృత పదాలలాగ అనిపిస్తాయి. కానీ అవి అచ్చ తెలుగు పదాలే. మీ కామెంటు వల్ల నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇక ముందు టపాలు రాసేటప్పుడు ఎక్కువగా అచ్చ తెలుగు పదాలు వాడుటకు ప్రయత్నిస్తాను. స్నేహం, కి బదులు కూరిమి, కాంతి కి బదులు మిసిమి ఇలా అన్నమాట. మొదట్లో రాయడానికి, చదవడానికి కూడా కొత్తగా అనిపించొచ్చు. వాడితేనే కదా అలవాటయ్యేది. ఇలా అయినా వాడుకలో లేని అచ్చ తెలుగు పదాలకు కొంత వెలుగుతేవచ్చు కదా. ఇప్పటికే మేలిపొద్దులు అన్న పదాన్ని మా స్నేహితులకి ఎక్కించాను. దాదాపుగ మేము good morning మానేసి మేలి పొద్దులు చెప్పుకుంటున్నాం. అలాగే ఈ పదాలన్నీ కూడా వాడితేనే అలవాటవుతాయి, ఏమంటారు?

సంస్కృతమంటే నాకేమీ ఏహ్యం కాదు...నాకిష్టం కూడా, కానీ అచ్చ తెలుగుని వాడుకలోకి తీసుకురావడం ఇంకా ఇష్టం.

మీ కామెంటు వల్ల నాకివాళ జ్ఞానోదయం కలిగింది. కృతజ్ఞురాలిని. :)

భాను said...

సౌమ్య గారూ
మేలి పొద్దులు. నేను నేర్చేసుకున్న తెలుగు. తెలుగు వాళ్ళమై ఉండి ఇప్పుడు తెలుగు నేర్చుకోవడం వినడానికి ఎలానో ఉంది కాని వాస్తవం. మీ పోస్ట్ చదివాక తెలుగు పదాలపై ఓ కన్నేసి ఉంచాలని అనిపించింది. నిజం అప్పుడప్పుడు కొన్నింటిని తెలుగులో ఏమి అనాలో వెతుక్కోవాల్సి వస్తుంది నిత్య జీవితంలో కూడా

ఆ.సౌమ్య said...

@భాను
అవునండీ, అలా అనుకోవడానికి సిగ్గేస్తోంది కానీ ఏం చేస్తాం. కనీసం సిగ్గు వచ్చి నేర్చుకుంటే మంచిదే కదా అని మొదలెట్టాను. మీరూ చేయి కలుపుతానన్నారు సంతోషం.

"నిజం అప్పుడప్పుడు కొన్నింటిని తెలుగులో ఏమి అనాలో వెతుక్కోవాల్సి వస్తుంది"....దీని మీద త్వరలో ఓ పోస్ట్ రాయబోతున్నాను నేను.

భాను said...

సౌమ్య
ఇప్పుడే లేటెస్ట్ :) (తెలుగు లో ఏమిటో చప్పున గుర్తుకు రాదు) మిసిమి లో "తెలుగు భాష పై పత్రికల ప్రభావం" అని చుందూర్ మాణిక్య రావు గారు రాసిన వ్యాసం చదివా .వీలయితే చదవండి

ఆ.సౌమ్య said...

@భాను
ఆ మీ పోస్ట్ చూసానండీ, కానీ ఇంకా చదవలేదు...చదువుతా!

-- said...

ఈ లంకె లో అన్నమాచార్య వారి మీద వ్రాసిన 27 పుస్తకాలూ ఉన్నాయి. ఎన్నెన్నో తెలుగు పదాలకు అర్ధాలు చాలా సులువుగా దొరుకుతాయి. http://cid-d00028d6c320ac50.office.live.com/browse.aspx/.Public/Books%20on%20Sri%20Tallapaka%20Annamacharya

ఈ లంకె లో 700 లకు పైగా అన్నమాచార్యుల వారి సంకీర్తనలు ఉన్నాయి. చూడగా చూడగా వినగా వినగా నాకు ఎన్నో అచ్చ తెలుగు పదాలు సందర్భానుసారం అర్ధం అయ్యాయి. http://annamacharya-lyrics.blogspot.com/

ఈ లంకె లో కవయిత్రి డా. అనిపిండి జయప్రభ గారు అన్నమయ్య వారి గరించి, వారి తెలుగు బాష గురించి చాలా బాగా వ్రాసారు. నేను చదువుతున్నాను. ఎన్నో పదాలకు అర్ధాలు చాలా బాగా వ్రాసారు. http://annamayya-pada-parichayam.blogspot.com/


అయినా జనం విచిత్రం కానీ, ఏ మండలీకం అయితే ఏంటి, అది తెలుగా కాదా? ఈ మధ్య వచ్చాయి ఈ ప్రాంతీయ విభేదాలు. అన్ని మాండలీకాలు తెలుగు మండలీకాలే కదండీ. అన్నిటిని విని వాడి ఆనందించాలి కానీ. అన్నమయ్య రాయలసీమ ప్రాంతం వాసి. ఆయన పదాల్లో ఎన్నో ఇప్పటి తెలంగాణా ప్రాంతాల్లో ఇప్పటికి రొజూ వాడుతున్నారు. ఉదా. నూకు, పొద్దు. కానీ ఇప్పుడు ఆ బాష అనాగరికులు వాడె బాష(ట). ఆ పదాలు మాట్లాడితే తిట్టడం ఎగతాళి చేయడం మామూలే. మన చదువుకున్న వాళ్ళు సంస్కృతాన్ని తెలుగు లో కలిపి తెలుగు బాష మాట్లాడే వాళ్ళని తెలుగు రాదని ఎద్దేవా చేయడం మరో విచిత్రం. బాగా చదువుకున్నావాళ్ళకి సంస్కృతాంద్రం మాట్లాడితే గొప్ప. అదే తెలుగు (ట)! నిజానికి చదువు రాని రైతులు, శ్రామికులు, కూలీలు నిజమయిన తెలుగు మాట్లాడతారు.

ఆ.సౌమ్య said...

@--
మీ పేరు ఎలా రాయాలో తెలియట్లేదు. పేరు చెప్పి ఉంటే ఇంకా బావుండేది.
మీరిచ్చిన లింకులన్నీ అద్భుతమండీ. జయప్రభగారి వ్యాసాలు బలే ఉన్నాయి. ఇంకా ఆ సైట్ లో అన్నమయ్య పాటలు ఎన్నో ఉన్నాయి. మీకు బోలెడు ధన్యావదములు (దీనికి అచ్చ తెలుగు పదమేదైనా ఉందేమో చెప్పగలరా?). నా పని మొదలెడతాను. అన్నమయ్య పాటల్లో అచ్చతెలుగుని గమనించి ఒకచోట ప్రోగు చేయాలి.

మాండలీకాలన్నవి భాష అనే కిరీటంలో పొదగబడిన వజ్రాల్లాంటివి, వాటిని విస్మరిస్తే భాష అందమే పోతుంది.

మీరన్నది నిజమే, సంస్కృతం కలిపి మాట్లాడితేనే చక్కని తెలుగు అనుకుంటున్నారు చాలామంది. అయితే సంస్కృతం కూడా బావుంటుంది అది వేరే విషయం. కానీ అచ్చ తెలుగు మాట్లాడితే మీరన్నట్టు తక్కువ చేసి చూస్తారు. ఈ పద్దతిని మనం మార్చాలి. మార్చగలమో లేదోగానీ కనీసం మనవంతు ప్రయత్నమైనా చెయ్యలి. మొదటిమెట్టుగా మనం మాట్లాడాలి సిగ్గుపడకుండా.

ఈ లింకులన్నీ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.

శిశిర said...

ఈ టపా వల్ల చాలా అందమైన అచ్చ తెనుగు పదాలు తెలిసాయి. బాగుందండి.

ఆ.సౌమ్య said...

శిశిర గారూ
ధన్యవాదములు!
అదే నాకు కావలసినది...అందరూ ఈ పదాలు నేర్చుకుని వాడుకుంటూ మన తెలుగుని అభివృధి పరచుకోవాలి.

p.vijay said...

నమస్కారమండి..
మీరు అచ్చ తెలుగు మీద రాసిన వ్యాసము నాకు చాలా నచ్చింది. చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదివినందు వల్లనో, ఊరివాడనవడం వల్లనో తెలియదు కానీ, అచ్చ తెలుగు అంటే నాకు మక్కువ ఎక్కువ. చదువుల కోసం పట్నాలలో ఉండవలసి వస్తున్నది కాని, ఇంటికి పోయినప్పుడల్లా, ఊర్లో జనాలు మాట్లాడే పదాలను గమనిస్తుంటాను. తెలుగు భాషాచరిత్ర చదివినప్పటినుండి, ఈ యావ(కోరిక) మరీ ఎక్కువ అయ్యింది. చిన్నప్పుడు, మా సంస్కృతం పంతులు చెప్పేవారు 'ఎల్ల భాషలకు తల్లి సంస్కృతంబె ' అని.మనలో చాలా మందిమి ఇట్టనే (ఇలాగే) అనుకుంటూ ఉంటాము. అంతెందుకు, నేను కూడా మొన్న మొన్నటి దాకా అట్టా(అలాగే) అనుకున్నవాడినే. ఆర్యుల రాకకు ముందునుంచే, అంటే సంస్కృతం ఈ దేశానికి తెలియక మునుపే, ద్రావిడ భాషల తల్లి అయిన మూలద్రావిడ(లేదా, వేరుద్రావిడ, 'వేరు ': మొక్కవేరు) ఉన్నదన్న మాట ఎవరూ కాదనలేనిది. దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. మనము తెలుగులో పెక్కు ('అనేక ', అనే సంస్కృత పదానికి సరి)సంస్కృత పదాలు, తద్భవాలు, తత్సమాలు చూసి అలా పొరపాటు పడుతుంటాము. పెద్దలు చెప్పేదేమిటంటే, సంస్కృతం ద్రావిడ భాషలలోకి పెక్కు మాటలను చొప్పించగా, ద్రావిడ భాషలు అంతకన్న ఎక్కువగా సంస్కృతమూ దాని తర్వాతి భాషలను వ్యాకరణరూపంలో ప్రభావితం చేసాయి. మచ్చుకు(='ఉదాహరణకు '), రేడియోలో వచ్చే సంస్కృత వార్తల చివర్లో 'ఇతి వార్తా:' అన్న మాటలో ఉన్న 'ఇతి ' అన్న నిర్మాణం ద్రావిడ భాషలనుండే వచ్చిందని చెప్తారు. కానీ మామూలు జనాలకు ఇవి తెలిసే సందు(అవకాశం) లేదు. మిగతా ద్రావిడ భాషలయినట్టి, తమిళం, కన్నడం కన్నా, తెలుగూ, మలయాళమూ, సంస్కృత పదాలను బాగా కలుపుకున్నాయి. అన్నింటికన్నా తమిళం చాల కొద్దిగా ప్రభావితం అయ్యింది. ఇందుకుగల కారణాలు పలు రకాలు. మొదటగా, తమిళనాడు బాగా దక్షిణములో ఉన్నది, మనకన్నా, కన్నడిగులకన్నా. కావున, ఉత్తరాన్నుంచి వచ్చిన ఆర్య భాషల ప్రభావం మొదటగా, ఎక్కువగా మన భాషమీదా, కన్నడం మీదా పడింది. మన దేశంలో రాత అనేది, మిగతా ప్రపంచంతో పోలిస్తే, చాలా జాగుగా(='ఆలస్యంగా ') పుట్టింది, అదీ కూడా , క్రీస్తుకు ముందు మూడువందల యేళ్ళకు, అంటే అశోకుని కాలంలో. అప్పుడు మనమూ, కన్నడిగులూ, అశోకుని పాలనలో ఉంటిమి. కానీ, తమిళులకు వారి రాజులే ఉండిరి, పాండ్యులు. ఏ భాష అయినా రాతకోతల్లో, అంటే రాజ్య వ్యవహారాలలో, శాసనాలలో కనిపించాలంటే, సాహిత్యం వెల్లివిరియాలంటే, రాజుల ప్రోత్సాహం తప్పనిసరి. అంతే కాకుండా, రాజభాష ప్రభావం, జనుల భాషమీద తప్పకుండా ఉంటుంది. మనకది లేకపొయె. తమిళులకది ఉండె. అదృష్టవంతులు వారు. వాళ్ళ రాజుల తమిళ సాహిత్యాన్ని ప్రోత్సహించారు. అప్పుడె కదా గొప్పదైనట్టి 'తిరుక్కురల్ ' రాయబడినది. అశోకుని పిమ్మట (=తర్వాత, 'పిదప ' అని కూడా అనవచ్చు) మనల్ని ఏలిన(పాలించిన) శాతవాహనులు తెలుగు రాజులే అయినప్పటికీ, వారి రాజ్యం ఉత్తరానికి వ్యాపించి ఇప్పటి మహారాష్ట్ర, మొదలైన ప్రాంతాలని ఏలారు.అప్పటికి, ఉత్తరాన ప్రాకృతం ప్రజల వాడుకలో ఉండె. అందువల్లనో, మరెందువల్లనో తెలియదు కానీ, వారు ప్రాకృతమును ప్రోత్సహించారు. అప్పుడే కదా, గొప్ప కథల కూర్పు అయినట్టి, 'గాథాసప్తశతి ' రాశారు. నాకు తెలిసినంత మట్టుకు,వరంగల్లు కాకతీయ ఏలికల కాలం దాకా తెలుగుకు ప్రోత్సాహం కొరవడింది.(ఈ వరంగల్లును (లేదా, 'ఓరుగల్లు ')గూర్చి ఒక చిన్న మాట. ఈ పట్టణానికి 'ఏకశిలానగరం' అని సంస్కృత పేరు. అంటే, ఒకే రాతి పట్టణమని తెలుగర్థం. తమిళంలో 'ఒరు ' అన్న మాటకు 'ఒక ' అని అర్థం. ఇంకా, 'కల్లు ' అనే మాటకు తెలుగులో, తాటి చెట్టునుంచి తీసే మత్తుద్రవమే కాకుండా, 'రాయి ' అన్న అర్థం కూడా ఉంది. మా అమ్మ ఇప్పటికీ 'కల్లుల ఉప్పు ', ' మెత్తటి ఉప్పు ' అని ఉప్పుని వేరు చేసి చెప్తుంది. కల్లుల ఉప్పు అంటే ముడి ఉప్పు అని, చిన్న చిన్న రాళ్ళలాగ ఉంటుందది. వెరసి(మొత్తం కలిపి), 'ఒరుకల్లు ', 'ఓరుగల్లు ' అయ్యిందని నేననుకుంటున్నాను). క్రీస్తు తర్వాత వెయ్యేండ్లకు గాని, తెలుగులో సాహిత్యం రాలేదంటే ఇదీ కారణం.ఇంకా ఉంది..

p.vijay said...

ఇప్పటి కరీంనగర జిల్లాలోని వేములవాడవాసి అయినట్టి, పంప కవి(నన్నయ్య కంటే ముందువాడు) కన్నడ దేశం పోయి అక్కడ కన్నడంలో రాసి అక్కడీ 'ఆదికవి ' అవడానికి ఆ ప్రోత్సాహమే కారణం. తెలుగుకు రాజభాషగా చోటు దక్కేటప్పటికి, దేశంలో భక్తి ఉద్యమం ఊపందుకుంది. ఇంక మనవాళ్ళు సంస్కృత గ్రంథాల మీద పడ్డారు. వాటిని అనువదించడమే పనిగా పెట్టుకున్నారు. ఆ వరుసలో, పెక్కు సంస్కృత పదాలు తెలుగులోకి వచ్చి పడ్డాయి. కొన్ని సార్లు కవి గారి సంస్కృత అభిమానంవల్లనో, అనువాద పాటవలోపంవల్లనో, మరెందుచేతనో గాని లెక్కలేనన్ని పదాలు తెలుగులోకి ఊడిపడ్డాయి. రచనలన్నీ అలాంటివే అని కాదు, చాలమట్టుకు అని. ఇలా తెలుగులోకి వచ్చిన, తెచ్చిన పదాలు రామాయణ భారత భాగవతాల వల్ల జనాల నోళ్ళలోకి చేరాయి. దీని ప్రభావం రెండురకాలుగా ఉంది. ఒకటి, తెలుగు కలిమి గలదయ్యింది, పెక్కు మాటలతో. రెండవది, అప్పటికే ఉన్న అచ్చ తెలుగు పదాలు చాల మాయమయ్యి వాటి తావులో(దుక్కులో,చోటులో, స్థానంలో) సంస్కృత మాటలు వచ్చాయి. అది ఎంతగా పెరిగిందంటే, ఊర్లలోకి పోయి చూసినా కొన్ని మాటలకు తెలుగు పదమే వినిపించదు. అలాగని, సంస్కృత భాష అక్కడెక్కడ్నుచో, యూరపు నుంచి ఇప్పుడున్నట్టుగా దిగుమతి అయిన భాష కాదు. ద్రావిడ భాషలనుంచి కూడా చాలా పదాలు అందులోకి జొర్రాయి (ప్రవేశించాయి). మచ్చుకు, 'కదళీ ఫలం'= అరటి పండు. ఈ 'కదళి ' అన్న మాట ద్రావిడ భాషలనుంచే వెళ్ళిందని అంటారు. అదీ మన భాష మీద వేరే భాషల ప్రభావ గోల. ఇప్పుడు ఇంగిలీషు ప్రభావం కొత్తగా. ఇన్నాళ్ళూ, మన భాషని ఎవరూ ప్రోత్సహించలేదు అని గుండెలు బాదుకుని పెద్ద ప్రయోజనం లేదు. ఇప్పుడు మాత్రం మన భాషని ప్రోత్సహించడానికి ఒక రాష్ట్రం అంతూ ఒకటి ఉన్న ఉపయొగమే లేదు. పేరుకు మాత్రమే అధికార భాష. ఏలినవారి రాతకోతలన్నీ ఆంగ్లమునందే జరుగును.ఎవరైనా అచ్చ తెలుగులొ మాట్లాడితె, వాడికి మర్యాద లేదంటారు. పుస్తకాలలో, 'గేదె ' అని ఉంది కాబట్టి, అదే ప్రామాణికం. ఎవడైనా, 'బర్రె ' అనో, 'ఎనుము ' అనో, అంటే, వాడు అనాగరికుడు.ఇక మన తెలుగు అకాడెమిది,పత్రికలది చిత్రమయిన దారి. వేరే భాషా పదాలను తెలుగులోకి అనువదించేటప్పుడు, వీలయితే తెలుగు మాటలనుండి, లేనట్లయితే, వేరే ద్రవిడ భాషా వాసనలున్నట్టి పదాల కలయికతో, కొత్త మాటల పుట్టుక, ఎలుపు(సృష్టి) జరగాలిగానీ, ఎట్టి చుట్టరికమూ లేని సంస్కృత పదాలతో కాదు. మచ్చుకు, ఇంగిలీషులోని, 'యూజర్ ' లేదా 'కస్టమర్ ' అన్న మాటకు 'వినియోగదారుడు ' కి బదులుగా 'వాడుకరి ' అని అనవచ్చు కదా. అలా అనరు. సంస్కృత భాషే కావాలి.ఎప్పుడైనా మీకు వీలు దొరికితే తెలుగు మీడియం సైన్సు పుస్తకాలను చూడండి. ఆ 'టర్మినాలజి ' లేదా 'పారిభాషిక పదాలు ' అర్థం తెలుసుకోవాలంటే, సంస్కృతం నేర్చుకోవలసిందే. వీటన్నిటికి వేరు కారణం(వేరు: చెట్టు వేరు) మన భాష గురించి మనం తక్కువగా అనుకోవడమే. తమిళులను చూసి నేర్చుకొవలసినది మనకు ఎంతో ఉంది.మనం తినే 'అన్నం ' ని 'కూడు ' /'బువ్వ ' అని అనవచ్చని మనలో ఎంతమందికి తెలుసు? 'కూడు ' అంతే ఏదైనా తినే వంట. అల ఎవరైన అంటే, వాళ్ళకు అస్సలు మర్యాద ఉండదు. కానీ మలయాళీలు తినడాన్ని,'కయిచ్చో ' అంటారు. అది మన 'కుడుచుట '(కుడవబడునది 'కూడు ') అనే మాటకు సరి. పొద్దాకా ఎదుటివాళ్ళను దుమ్మెత్తి పోయడమే కాకుండా, నా వంతుగా నేను చేయదలంచిన పని ఒకటుంది. అదేమంటే, నేను ఏగినంతవరకు(ప్రయాణించినన్ని) ఊర్లళ్ళో వినిపించే పదాలనన్నిటినీ(అచ్చ తెలుగువి) ఒక చోట కూర్చాలన్నది.
మీ ఓపికకు ధన్యవదములు.
విజయుడు.

ఆ.సౌమ్య said...

విజయ్ గారూ ఓపికగా అంత పెద్ద కామెంట్లు పెట్టినందుకు ధన్యవాదములు! మంచి విషయాలు చెప్పారు.

srisavvadi said...

సౌమ్యా గారు, అంకిలి..అనే పదాన్ని శ్రీనాథుడు శృంగార నైషథంలో ఉపయోగించాడు. నలుడితో దమయంతి పలుకుతున్న సందర్భంలో.. అంకిలి లేక యప్పుదరుణాధర పల్లవ నిర్గతంబులై
పంకరు హయతాక్షి నును బల్కులు తేనియ లొల్కుచున్ శ్రవో
లంకృతులై నృపాలు మది లగ్నము లయ్యె వినోద లీలకై
మంకెన పూవు జాపమున మన్మథుడేసిన తూపులో యనన్..
అని శ్రీనాథుడు అద్భుతమైన పద్యాన్ని చెప్పాడు.

srisavvadi said...

సౌమ్యా గారు, అంకిలి..అనే పదాన్ని శ్రీనాథుడు శృంగార నైషథంలో ఉపయోగించాడు. నలుడితో దమయంతి పలుకుతున్న సందర్భంలో.. అంకిలి లేక యప్పుదరుణాధర పల్లవ నిర్గతంబులై
పంకరు హయతాక్షి నును బల్కులు తేనియ లొల్కుచున్ శ్రవో
లంకృతులై నృపాలు మది లగ్నము లయ్యె వినోద లీలకై
మంకెన పూవు జాపమున మన్మథుడేసిన తూపులో యనన్..
అని శ్రీనాథుడు అద్భుతమైన పద్యాన్ని చెప్పాడు.

సత్యం పోతంశెట్టి said...

చదువూ సంధ్యా లేని అనాగరికుల మాటలని కొట్టి పారేసిన ఎన్నో పాత తెలుగు పదాలను తవ్వి తీస్తున్నందుకు మీకు అభినందనలు. ఈ పదాలతో మన భాష మరింత విస్తరిస్తుంది. మన నిఘంటవులలో ఎన్ని ఎక్కువ పదాలు చేరితే అంత మంచిది. ఈ భాషాసంపద చక్కటి కవిత్వం వ్రాయడానికి కవులకు మరింత అవసరం. కానీ సంస్కృత పదాలను దూరం చేసుకొంటే మాత్రం మనం సాధించిన దానికంటే కోల్పోయినదే ఎక్కువవుతుంది!

అన్నట్లు, 'పెద్దల మనిషి' అంటే 'పెద్దవాళ్ళు చూసుకోవలసిన మనిషి' అని అర్ధం అనుకొంటా. కడుపుతున్న వారిని పెద్దవాళ్ళు సంరక్షించడం సాధారణమైన విషయమే. ముఖ్యంగా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకొనే (చేసే) పాత కాలంలో.

మీ బ్లాగు పోష్టులాగే ఇక్కడ విజయుడు గారు, మరికొంత మంది పెట్టిన వ్యాఖ్యలు కూడా చాలా ఇన్‌ఫర్‌మేటివ్‌గా వున్నాయి!

మారుతున్న సమాజంలో (అ)నాగరికులు కూడా తమ తాత ముత్తాతలు వాడిని పదాలను మరింత అనాగరికంగా భావించి వాటిని తిట్టు కోవడానికి వాడుకొంటున్నారు. ఉదాహరణకు "గేదెలను పొలానికి తోలుకెళ్తున్నా " అనేవాడు కూడా ఇంట్లో పెళ్ళాం మీద కోపం వచ్చినప్పుడు 'బర్రి లం..' అని తిట్టడం చూస్తున్నాము. ఇక్కడ గేదె కంటే బర్రె మరింత అనాగరికం. ఎంత అనాగరికమైతే అంత మంచి తిట్టు అన్నది అందరికీ తెలిసిన విషయమే.

Elia Manne said...

చాల సంతోషం మీరు ఇంతటి సమాచారం సేకరించి అందిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు ఇంకా అచ్చ తెలుగు గురించి కథలు ,సామెతలు మొదలగునవి వ్రాయగలరు .అందరంటారు " డు ము లు తీసేస్తే మేగిలేదంతా సంస్కృతమే " అని .నిజమే ఇప్పుడు మన తెలుగు ఏమైనట్టు ఆలోచిస్తే బాధేస్తుంది ,అసలు తెలుగు అర్ధం అవుతదా? అని అనిపిస్తుంది .
నాదో చిన్న విన్నపం ....ఈ సమాచారాన్ని కాపి చేసుకొనే సౌలభ్యం కల్పించండి దయచేసి .మాలాంటి వారికి ఏంతో ఉపయోగ పడుతుంది ,ఆలోచించండి .

మన్నె ఏళియా కథ రచయిత

Elia Manne said...

గొలుసు కట్టు వ్రాత గురించి నేను ఎన్నో రోజులుగు ప్రయత్నిస్తున్నాను దయచేసి మనం నేర్చుకొని ఇంకొందరికి నేర్పించి బ్రతికించుకుందాం .ఎవరికైనా నేర్పడం వస్తే దయచేసి పేస్ బుక్ లో పెట్టి అందరికి మీ జ్ఞానం ఉపయోగ పడేలా తోడ్పడండి .

మన్నె ఏలియా

ukkadamkrishnamurthy said...

TELUGU KOYA KOLAVA GONDU SAVARA BHASHALA MOLAALU NUNDI PUTTINA BHASHA.JALADI - PITTA -UBBA KALAMU --VANA -VANA KALAMU --MANDU --ABBA -- PEDDA MANISHI AINADI-- PALLELA LO GIRIJANULALO DAGI UNNAVI -------------------SANI - PEMMA SANI -- RANGA SANI -- EE NAADU KOTTA KULAALU VADUTOO ARTHANNI MACRHI VESTUNNARU -- PEMMA SANI RAMA LINGA VOKA SANI PUTRUDU --KANI KHAIPHIYAT ANGLEYULU ADHIKARAMU HODA KALPINHI NAARU
MANAMU BANISA SANKELLU TENCHU KONNA RAJAKEEYA SWATANTRAMU SAMANYULAKU DAKKKITE AMMA NUDI BRATAKA GALADU U.KRISHNAMURTHY