StatCounter code

Wednesday, August 11, 2010

పి.హెచ్.డి కష్టాలు (సరదాగా...)


PHD అంటేనే "Permanent Head Damage" అని అర్థం..మరి కష్టాలు కాక ఇంకేముంటాయి చెప్పండి.

నేను ఐదు సంవత్సరాలు చేసాను. ఆ ఐదేళ్ళు చాలా రకాల టెన్షన్లు, బాధలు, సరదాలు, సంతోషాలు, సాహసాలు ...ఓహ్ ఒకటా రెండా. ఒక్కోసారి కొన్ని సంఘటనలు తలుచుకుంటే నవ్వు వస్తుంది, కానీ అవి జరిగినప్పుడు విపరీతమైన టెన్షన్ పడ్డాం, అలాంటివి కొన్ని...

ఒకరోజు నేను, మా ఫ్రెండు కోటీ వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాం. బస్ మా కేంపస్ గేట్ దగ్గర ఆగింది. బస్ వెనక తలుపు దగ్గరనుండి మా ఫ్రెండు ముందు దిగాడు, తన వెనకే నేను దిగబోతున్నంతలో డ్రైవరు లాగించేసాడు....బొక్క బోర్లా పడ్డాను, మోకాలి చిప్ప పగిలిపోయింది. మా ఫ్రెండు చెయ్యి పట్టుకుని కుంటుకుంటూ హెల్త్ సెంటర్ కి వెళ్ళాను. ఎముకలు కాస్త అటుఇటు అయ్యాయి ఎక్స్-రే తీయించాలన్నారు. సైకిల్ తొక్కకూడదు, మెట్లెక్కకూడదు, ఎక్కువ నడవకూడదు, కూర్చోకూడదు, నిల్చోకూడదు అంటూ బోల్డు కండీషన్లు పెట్టారు. సరే, డాక్టరు చెప్పినవన్నీ చక్కా వినేసి, మందులు మాకులు పుచ్చేసుకుని రూముకి చేరాను. మర్నాడు నేను డిపార్ట్‌మెంటుకి వెళుతూ ఉంటే మా సీనియర్ ఎదురొచ్చి "సౌమ్య పడిపోయావంటగా, ఎలా ఉంది, డాక్టర్ ఏమన్నారు?" అని అడిగాడు. ఎముకలు కాస్త డిస్‌లొకేటయ్యాయట, డాక్టర్ గారు జెరాక్స్ తీయించుకోమన్నారు అని చెప్పాను. "ఏంటి?" అని మళ్ళీ అడిగాడా అబ్బాయి, కాస్త ఆశ్చర్యపోతూ. "జెరాక్స్ తీయించుకోమన్నారు" అని మళ్ళీ చెప్పాను. ఆ పిల్లాడు నవ్వాపుకోలేక పడీ పడీ నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక వెర్రిమొహం వేసాను. ఆ అబ్బాయి ఈసారి ఇంకాస్త విపులంగా "ఏం తీయించుకోమన్నారు?" అని అడిగాడు. జెరాక్స్ అనబోతూ ఆగిపోయాను...అప్పుడర్థమయింది నాకు. మొదట ఉడుక్కున్నా తరువాత నవ్వేసాను:). కానీ ఆ అబ్బాయి ఊరుకుంటాడా! వెళ్ళి అందరికి టమకు వేసాడు. ఇహ చూసుకోండి....ప్రతీ ఒక్కరూ "సౌమ్యా, నీ కాలికి జెరాక్స్ తీయించుకున్నవటగా, బాగా వచ్చిందా? సైడులు కట్ అయిపోకుండా అన్ని సరిగ్గా వచ్చాయా" అని ఒకటే గోల. నేను ఎక్కువ నడవకూడదు, సైకిల్ తొక్క కూడదు కాబట్టి రోజూ ఎవరో ఒకరు నన్ను డిపార్ట్‌మెంటుకి, రూము కి సైకిలు మీద తిప్పుతూ ఉండేవారు. రెండు రోజులు పోయాక నేను మళ్ళీ హెల్త్ సెంటర్ కి వెళ్లవలసి వచ్చింది కాలు చూపించుకోవడానికి. నా ఫ్రెండు నన్ను దింపుతానన్నాడు. నేను సైకిల్ మీద ఎక్కి కూర్చోగానే తను "సౌమ్య ఎక్కడికి వెళ్ళమంటావు జెరాక్స్ సెంటర్ కా, హెల్త్ సెంటర్ కా?" అని అడిగాడు. నాకు మండింది చూడండి....ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక అని పాడుకుంటూ నేను తలకొట్టుకున్నాను. ఇలా నా కాలు నొప్పి తగ్గేవరకు జనాలు నన్ను వదలలేదు. అక్కడితో అయిపోయిందా అబ్బే...... ఎప్పుడైన్నా ఏదైన ఫొటో కాపీ తీయించుకోవాలంటే "సౌమ్యా ఎక్స్ రే తీయించమంటావా" అని ఓ వెకిలి నవ్వు నవ్వేవారు. ఈరోజుకి ఎవరూ ఆ విషయాన్ని మరచిపోలేదు నాతో సహా :D

ఇంతకీ విషయమేమిటంటే మేమేమి చదువుకోవాలన్నా లైబ్రరీకెళ్ళి కావలసినవి జెరాక్స్ తీసుకోవడమేగానీ పుస్తకాలు కొనుక్కుని చదివే అలవాటు లేదు. కొనుక్కోలేము కూడా. ఇక జర్నల్స్, పీరియాడికల్స్ అయితే కొనడమన్న మాటే లేదు. అలా జెరాక్సులు తీసి తీసి ఎక్స్-రే కి బదులు జెరాక్సు అని అన్నాననమాట.

ఇంకోసారేమయిందంటే....
మాకు పి.హెచ్.డి లో రెండేళ్ళ పూర్తి అయిన తరువాత నుండీ ప్రతీ ఆరునెలలకొకసారి ఒక సెమినార్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీ విద్యార్థికి గైడ్ కాక ఇంకో ముగ్గురితో కూడిన డాక్టరల్ కమిటీ ఉంటుంది. వాళ్ళ ముందు అప్పటివరకు మేము చేసిన ఘనకార్యాలన్నీ అదేనండీ రిసెర్చి అంతా చెప్పి ఒప్పించాలన్నమాట. వాళ్ళేమో రకరకాల వంకలు పెడుతూ మమ్మల్ని చీల్చి చెండాడేస్తారు. ఈ సెమినార్ అయి, వాళ్ళ చేత సంతకం పెట్టించుకుంటే తప్ప స్కాలర్షిప్ వచ్చి చావదు. అందుకని ఈ డాక్టరల్ సెమినార్ అంటేనే ప్రతీ ఒక్కరికి దడ. నా స్నేహితురాలికి వాళ్ళ గైడ్ తో సబ్జెక్ట్ విషయంలో కాస్త సమస్య వచ్చి ఈ డాక్టరల్ కమిటీ సెమినార్ వచ్చేసరికి చాలా టెన్షన్ పడింది. తను అగ్రిగల్చర్ ఎకనామిక్స్ లో రిసెర్చి చేస్తోంది. ఈ పిల్లకి రెండు రోజులముందు నుండే విపరీతమైన టెన్షన్. ఆ సెమినార్ కి ముందురోజు నేను తను, ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి లంచ్ కి మెస్‌కెళుతూ ఉండగా మాలో ఒకర్తి కళ్ళు తిరిగి పడిపోయింది. మేము గాబరాపడి ఆ అమ్మాయిని హెల్త్ సెంటర్ కి తీసుకెళ్ళాం. ఏ కళనున్నాడో ఆ డాక్టరు మహానుభావుడు చిటపటలాడుతూ కనిపించాడు. "ఈ అమ్మాయి బాగా నీరసంగా ఉంది, అందుకే కళ్ళు తిరిగాయి" అన్నాడు. అసలే సెమినార్ టెన్షన్ లో ఉన్న నా ఫ్రెండు డ్రిప్ ఇస్తారా అనబోయి "అయితే డ్రిప్ ఇరిగేషన్" ఇస్తారా అంది. దాంతో ఆ డాక్టరుకి పిచ్చ కోపం వచ్చింది, మండిపడిపోయాడు. కళ్ళతో నిప్పులు కురిపిస్తూ "యు ఆర్ ఇన్సల్టింగ్ మై ప్రొఫెషన్" అన్నాడు. డ్రిప్ ఇరిగేషన్ అంటావా అని అంత ఎత్తున ఎగిరాడు. నేను వెంటనే తేరుకుని "హయ్యో ఆ పిల్ల టెన్షన్లో అలా మాట్లాడిందండీ. మిమ్మల్ని కించపరచడం తన ఉద్దేశ్యం కాదు అని సర్ది చెప్పబోయాను. ఊహూ వింటేగా...అసలు ముందు నుండే ఏదో కోపంలో ఉన్నట్టున్నాడు, హాట్ హూట్ అని ఎగిరాడు. పక్కనే నా స్నేహితురాలికి కళ్ళమ్మట నీళ్ళు ధారగా కారిపోతున్నాయి. ఒక్కసారిగా అతను అలా అరిచేసరికి తను నిశ్చేష్టురాలయిపోయింది. తేరుకుని సారీ చెప్పింది. మేము అతన్ని బతిమాలి, తప్పయిపోయింది పొరపాటున అలా అన్నాది అని సర్ది చెప్పేసరికి మా తల ప్రాణం తోకకొచ్చింది. మరేమనుకున్నాడో ఏమో, ఇంకెప్పుడు అలా ఒళ్లు పై తెలియకుండా మాట్లాడకండి అని చెప్పి తనకి సెలైన్ ఎక్కించాడప్పుడు.

నా ఫ్రెండు అగ్రిగల్చర్ ఎకనామిక్స్ లో చేస్తోంది అని చెప్పాగా...తను ఇరిగేషన్ ఫెసిలిటీస్ మీద ఏదో చేస్తోంది. దాని పర్యవసానమే ఈ డ్రిప్ ఇరిగేషన్ అన్నమాట :P.

మరోసారేమయిందంటే...
గోప్స్ (గోపాల్‌జీ షాపుకి షార్ట్ కట్ అన్న మాట) అని ఒక ప్రదేశముండేది. అక్కడ చిరుతిళ్లు, టీ, కాఫీలు దొరుకుతాయి. వీటి కోసం కాకపోయినా, పిచ్చపాటీ వేసుకోవడానికి సాయంత్రమయ్యేసరికి విద్యార్థులంతా అక్కడకి చేరుతారన్నమాట. ఒకరోజు మేమంతా గోప్స్ లో ఉన్నప్పుడు యధాతధంగా గైడ్స్-వాళ్ళతో మా కష్టాలు (సాధారణంగా రిసెర్చి చేసేవాళ్ళకి ఉండే కామన్ టాపిక్ "గైడ్") గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మా గుంపులో ఆర్థికశాస్త్రము, తెలుగు, పొలిటికల్ సైన్స్, హిందీ లలో పి.హెచ్.డీ చేస్తున్నవాళ్ళు ఉన్నారు. ఎవరి కష్టాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. తెలుగులో రిసెర్చి చేస్తున్న అబ్బాయి " మా గైడ్ చాదస్తంతో చంపేస్తున్నాడురా బాబు, పదాలల చివర "ము" పెడితే "అం" పెట్టమంటాడు. "అం" పెడితే "ము" పెట్టమంటాడు. అంటే కలము అని రాస్తే కలం అని రాయమంటాడు, కలం అని రాస్తే కలము అని రాయమంటాడు. ఏదైనా రాసి ఇస్తే విషయం చూడకుండా విసర్గ ఏది అంటాడు, కామా లేదంటాడు, బుర్ర తినేస్తున్నాడు. ఏది రాసినా ఇంకా బాగా రాయలంటాడు. నీ ఆలోచనలు సరిగ్గా ఆవిష్కృతం కాలేదంటాడు. ఏమైనా తెలుగులో రిసెర్చి చెయ్యడం కష్టం రా బాబూ" అని తన గోడు వెళ్ళబోసుకున్నాడు. అంతా విన్నక మరొక మితృడు "ఎళ్ళెళ్ళవోయ్, తెలుగులో రిసెర్చి ఏమి కష్టం?.... ఏదో ఒక కథో, కవితో తీసుకుని మరు చూపు, ముందు చూపు, తొలి చూపు అని దాన్నే మళ్ళీ తిరగరాస్తారు. లేదా కొత్త కోణం, దృక్కోణం, లంబకోణం అని వెనకనుండి ముందుకి రాస్తారు అంతే కదా" అన్నాడు. అది విని మేమంతా పగలబడి నవ్వాము. తను సరదాకే అన్నాడని మాకు తెలుసు. ఆ తెలుగు లో రిసెర్చి చేస్తున్న అబ్బాయి కూడా పడి పడి నవ్వుతూ ఎందుకో వెనక్కి తిరిగాడు.....వెనుక దృశ్యం చూసి హతాశుడైపోయాడు. ఏముంది సిగరెట్ కాల్చుకోవడానికి అక్కడికొచ్చిన వాళ్ళ గైడు ఉరిమి ఉరిమి చూస్తున్నారు. మాకు పై ప్రాణాలు పైనే పోయాయి, "విన్నాడా" అని సందేహమొచ్చింది. ఇహ చూసుకోండి ఆ గురుడు మొదలెట్టాడు.....మీకేం తెలుసు తెలుగు గురించి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమైనా అంటే క్షమించవచ్చు. తెలుగు విద్యార్ధివైయుండి నువ్వు కూడా నవ్వుతావా అని మా స్నేహితుడిని చెడామడా తిట్టి, నా ఆఫీసుకి రా నీ పని చెప్తాను అన్నట్టు చూసి అక్కడనుండి వెళ్ళిపోయాడు. ఇక మా ఫ్రెండుకి ఒకటే భయం, గుండెదడ, వణికిపోయాడు. మేము అక్కడ జేవురించిన మొహాలతో బిక్కచచ్చిపోయాము. కాళ్ళు చేతులు ఆడలేదు ఎవ్వరికీ. ఆ అబ్బాయి సంగతేమవుతుందో అని మా అందరికీ బెంగే. మర్నాడు భయపడుతూ భయపడుతూ వాళ్ళ గైడ్ ఆఫీసుకి వెళ్ళాడు. బెరుకు బెరుకుగా చూస్తూ నిల్చున్నాడు. వాళ్ళ గైడేమో "రావోయ్, ఏదీ నేనిచ్చిన కరక్షన్స్ చేసావా, చూపించు" అంటూ నవ్వుతూ మాట్లాడాడట. ఇదేమిటి ఇలా మామూలుగా మాట్లాడేస్తున్నారు అని తను ఆశ్చర్యపోయి తను చేసిన వర్క్ చూపించాడట. ఆ గైడేమో అసలు నిన్నటి విషయమేమీ జరగనట్టు చాలాసేపు నా స్నేహితుడితో మాట్లాడి చివర్లో "నిన్న ఎందుకో మీ స్నేహితుల మాటలు వినగానే గొప్ప కోపం వచ్చేసిందోయ్, కాని తరువాత తలుచుకుంటే నవ్వొచ్చింది, ఆ అబ్బాయి సరదాకే అన్నా తను చెప్పిన దాన్లోనూ నిజం లేకపోలేదనిపించింది. నిన్న అనవసరంగా మీ అందరినీ తిట్టేసాను, సారీ అని మీ మితృలందరి చెప్పు" అన్నారట. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని మా స్నేహితుడు పరిగెత్తుకుంటూ మా వద్దకొచ్చి విషయం చెప్పాడు. విన్నాక మేమంతా తేలికగా ఊపిరి పీల్చుకున్నాం :).

ఇలాంటివి ఇంకా బోలేడు. ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే నవ్వొస్తున్నాది, కానీ ఆ రోజు వచ్చిన దడ, టెన్షన్ చెప్పనలవి కాదు. వీటితో పాటు గైడ్స్ సరిగ్గా సహకరించక కొన్ని పాట్లు, సహకరించినా అనుకున్న రిజల్ట్స్ రాక మరికొన్ని బాధలు. అన్నీ సరిగ్గా అమరినా సెమినార్స్‌లో అందరినీ ఒప్పించడానికి పడే కష్టాలు...ఇంకో వైపు ఇంకా అవ్వలేదా, ఎన్నేళ్ళు చేస్తావు అంటూ బంధువుల సొడ్డు మాటలు. ఇవన్నీ చూస్తూ అమ్మనాన్నాల విచారం. ఇన్ని పాములూ దాటుకుని నిచ్చెన ఎక్కేసరికి తల ప్రాణం తోకకి వస్తుంది. అందుకే అన్నాను "Permanent Head Damage" అని. అది పూర్తి చెయ్యడమంటే వైకుంఠపాళీ యే.



ఏది ఏమైనా పి.హెచ్.డీ పూర్తి చేసాక వచ్చే విజయ గర్వం,ఆనందాలతో సరిసమానమయినది ఏదీ లేదు. అది అది అనుభవైకవేద్యమే తప్ప చెప్పనలవి కాదు.