StatCounter code

Thursday, September 30, 2010

చెక్కిన చేతులకు జోహార్లు-3

మధురై....బహుశా ఈ పేరు తెలియని భారతీయులుండరేమో. మధురం (తియ్యనిది) అన్న పదం నుండి మధురై వచ్చిందని చెబుతారు. మొదట ఈ ప్రదేశంలో కదంబవనం అనే అరణ్యం ఉండేదని, అక్కడ స్వయంభువు అయిన శివలింగం కనిపించిందని, ఆ శివుని ఆదిగా చేసుకుని గుడిని, దాన్ని పునాదిగా చేసుకుని నగరాన్ని పాండ్య రాజులు నిర్మించారని చెబుతారు. ఆ శివలింగం నుండి మధురం (అమృతం) జాలువారినది కాబట్టే ఆ నగరానికి మధురై అని పేరు వచ్చిందని ఒక కథ. మరో కథనం ప్రకారం మీనాక్షిని పెళ్ళి చేసుకోవడానికి శివుడు భూలోకానికి వచ్చినప్పుడు కొన్ని అమృతపు చుక్కలను రాల్చాడని అందుకే మధురై అని పేరు వచ్చిందని ఒక నమ్మకం. ఆధునిక చరిత్రజ్ఞులు ఏమి చెబుతున్నారంటే ఈ గుడి క్రీ.శ 7 వ శతాబ్దానికి చెందినదని, ఆనాటి గుర్తులన్నిటినీ తరువాతి కాలంలో వచ్చిన ముస్లిం రాజులు ధ్వంసం చేసారని, పిమ్మట నాయకర్ రాజులలో మొదటివాడైన విశ్వనాథ నాయకర్ దీన్ని పునఃనిర్మించాడానికి పునాది సిద్ధం చేసారని, నాయక రాజులలో అగ్రగణ్యుడైన తిరుమల నాయకర్ ఈ గుడిని అభివృద్ధి పరిచారని.

"సంగం" కాలం నుండి క్రీ.శ 10-11 శతాబ్దాల వరకు పాండ్యులు మధురైని రాజధానిగా చేసుకుని పరిపాలించేవారు. తరువాతి కాలంలో కొన్నాళ్ళు చోళులు, ముస్లిం రాజులు, విజయనగర రాజులు పరిపాలించారు. విజయనగర రాజులకి సామంతులుగా ఉన్న నాయకర్ రాజులు ఈ ప్రదేశాన్ని కాపుగాసేవారు. శ్రీకృష్ణదేవరాయుని కాలానంతరం నాయకర్ రాజులు ఈ మొత్తం రాజ్యాన్ని చేజిక్కించుకుని క్రీ.శ 16 వ శతాబ్దము నుండి సుమారు 200 యేళ్ళు అజరామరంగా పాలించారు. పాండ్యుల కాలంలో రోమ్, గ్రీసు లతో నుండి వ్యాపారాలు జరుగుతూ ఉండేవి. మధురై ని "Athens of the East" గా పిలిచేవారు. ఈనాటికీ తమిళనాట రెండవ పెద్ద పట్టణంగా వెలుగొందుతున్న మధురై, మీనాక్షి అమ్మవారి ఆలయానికి ప్రసిద్ధి. మరి ఆ ఆలయ విశేషాలు, ఇతర చారిత్రాత్మక ప్రదేశాల వివరాలేంటో చూద్దామా? రండి.

మధురైలో చెప్పుకోదగ్గ ప్రదేశాలు రెండు; ఒకటి మీనాక్షి గుడి, రెండవది తిరుమల నాయకర్ మహల్. మొదట గుడి చూసేద్దామేం. ఈ గుడిలో 14 గోపురాలున్నాయి. అందులో రెండు బంగారు గోపురాలు. ఈ 14 గోపురాలలో అతి పొడవైన గోపురం ఎత్తు 170 అడుగులు. ఇక్కడ పార్వతినే మీనాక్షిగా కొలుస్తారు. శివుని పేరు సుందరేశ్వరుడు. మీనాక్షి, సుందరేశ్వరుని గర్భగుడులకి బంగారు గోపురాలున్నాయి. ఈ ఆలయం మొత్తం రకరాకల రంగులతో నిండి ఉంటుంది. ఎక్కువగా ఆకుపచ్చ రంగు కనిపిస్తూ ఉంటుంది. గుడి లోకి అడుగు పెట్టగానే ఆకర్షించిన విషయమేమిటంటే స్థంబాల మీద ధర్మరాజు, అర్ఝునుడు మొదలగువారికి పెద్ద పెద్ద మీసాలుండడం, ద్రావిడుల (దక్షిణ భారత దేశపు ప్రజల) ముఖ కవళికలు, శరీర దారుడ్యం స్పష్టంగా తెలియడం ....భలే నవ్వొచ్చింది, అవన్నీ చూస్తే. కాసింత ముందుకెళ్లగానే మీనాక్షి గుడి నమూనా కనిపించింది. మొత్తం గుడి నమూనాని అలా చూడడం భలే అనిపించింది. గుడి మధ్యలో ఉండే కొలను ప్రత్యేకాకర్షణ. కానీ మేము వెళ్ళినప్పటికి అక్కడ ఉన్న కొలనుని కడుగుతున్నారు కాబట్టి బంగారు పద్మం, ఆ అందాలు చూడలేకపోయాము.

గుడి ముఖద్వార గోపురం

ఆలయ నమూనా

మీనాక్షి, సుందరేశ్వరుల కల్యాణం

ఇది చాలా పెద్ద గుడి, లోపలంతా తిరిగాలంటే గంట పైనే పడుతుంది. ఆ గుడి మండపం అంతా అద్భుతమయిన కళా సంపద కలిగి ఉంది.. వసంత మండపం, వేయి స్థంబాల మండపం, బంగారు పద్మం, అష్ట శక్తి మండపం, ఉయ్యాల మండపం (ఇక్కడ చిలుకలు అమ్మ నామస్మరణ చేస్తూ ఉండడం విశేషం), ముఖ్యంగా ప్రవేశ ద్వారం దగ్గరే ఉండే సిద్థివినాయకుడు చూసితీరాల్సినవే. ఈ గుడిలో దేనికదే ప్రత్యేకమయినా అన్నిటికన్నా ప్రత్యేక ఆకర్షణ నలువైపులా ఉన్న వరండాయే, అందులో ఉన్న శిల్పకళా సంపద.

గుడి లోపలి భాగం-1

గుడి లోపలి భాగం-2

గుడి లోపలి విగ్రహాలు-1

గుడి లోపలి విగ్రహాలు-2

గుడి లోపల కొంతదూరమెళ్ళాక ఫొటోలు నిషిద్ధం, అందుకే ఎక్కువ తియ్యలేకపోయాను. మీనాక్షి దర్శనం చేసుకున్నాం. బృహదీశ్వరాలయంలో శివుణ్ణి చూసినప్పటి ఉద్వేగం అయితే కలగలేదు నాకు. సుందరేశ్వరుడు కూడా మామూలే. అయితే ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే మీనాక్షికి, సుందరేశ్వరునికి ఒక పడక గది ఉంది. అది చూస్తే నాకు విపరీతమైన నవ్వు వచ్చింది, నమ్మకం వెర్రితలలు వెయ్యడమంటే ఇదేనేమో అనిపించింది.

గర్భ గుడి బయటకి వచ్చిన తరువాత గమనించిన విషయమేమిటంటే ఒక స్థంబం పక్కన ఉన్న ఒక చిన్న పలక మీద ఒక్కొక్కరూ నిలుచుని పై కప్పుకేసి చూస్తున్నారు. ఎందుకు అందరూ అలా చూస్తున్నారో అని మేమూ వెళ్ళాం. ఆ పలక ఎక్కకుండా స్థబం పక్కనుండి పైకి చూసాం. పైకప్పుకి ఒక చిన్న కన్నముంది. అందులో నుండి ఆకాశం కనిపిస్తున్నాది. గుడి బయటికెళ్తే హాయిగా విశాలమైన ఆకాశాన్ని చూడొచ్చు, ఇక్కడ ఈ చిన్న కన్నంలో నుండి చూసేదేమిటబ్బా అని ఆశ్చర్యపోతూ కాసేపు అక్కడే తచ్చాడాం. అటు జరిగి, ఇటు జరిగి రకరకాల భంగిమలలో నిలుచుని పైకప్పుకేసి చూస్తూ ఉన్నాం ఏమైనా కనిపిస్తుందేమో అని. కాసేప్పయ్యాక మాకు వెలిగింది ఆ పలక ఖచ్చితంగా ఎక్కాలని. ఎక్కి చూసాక తెలిసింది అసలు విషయం, ఏమిటంటే... ఆ కన్నం లో నుండి చూస్తే బంగారు గోపురం కనిపిస్తుంది. ఆ సువర్ణ గోపురం మీద పడ్డ సూర్యకిరణాలు పరావర్తనం చెంది ఆ పలక మీద నిల్చున్న మన మీద ప్రకాశిస్తాయి. మేలిమి బంగారు ఛాయలో ఉన్న ఆ కిరణాలు మా మీద పడగానే భలే సరదా వేసింది. ఒక్కొక్కరం మళ్ళీ మళ్ళీ ఆ కిరణాల కింద నిలుచున్నాం. ఆ కిరణాలు మనమీద అలా జారుతూ ఉంటే ఒక రకమైన మంచి అనుభూతి.....హ్మ్ ఎలాగంటే దివ్య తేజస్సుతో వెలుగుతున్నట్టు, అందరికంటే ఎత్తులో మనమున్నట్టు, శరీరం కొత్త ఛాయలను సంతరించుకున్నట్టు, మనసు స్వేచ్చావిహంగమైనట్టు, ముద్దపప్పులో ఆవకాయ కలుపుకున్నట్టు (నాకు తెలిసిన గొప్ప అనుభూతుల్లో ఇదీ ఒకటి మరి :D)

ఇప్పుడు అతి ముఖ్యమైన, నేను నా టపాకి పెట్టిన పేరుని సార్థకపరిచే అంశం. ఇక్కడ ఒక వేయి స్థంబాల మడపం ఉంది. సౌందర్య ప్రభంజనం అంటారే, అదేమిటో తెలిసొచ్చింది మండపంలోకి అడుగుపెట్టగానే. వెళుతూనే కుడివైపున కొన్ని సన్నని స్థంబాలున్నాయి. వాటి మీద వాయిస్తే "స రి గ మ ప ద ని" అన్న స్వరాలు చాలా ఖచ్చితంగా వినిపిస్తాయి. "రాతి స్థంబాలకే చేతనత్వము కలిగి సరి గమ ప ద ని స పాడగా" అన్న (శిల్పుల) చరణాలు గుర్తొచ్చాయి. ఒక్కో స్థంబం పైన ఒక్కో కళాసృష్టి..."వస్తువు"లో ఉండే అత్యంత సూక్ష్మ విషయాలను కూడా అతి లాఘవంగా చెక్కిన రీతి.... ప్రతీ ప్రతిమలోనూ హృదయాన్ని ఆవిష్కరించిన కళా పిపాస.....భావ వైశాల్యపు హద్దులు చూసిన సృజన. కాలి వేళ్ళు, నరాలు, కండలు, నెమలి ఈకలు, బుట్ట అల్లికలు, ఒకటేమిటి......అవి రాళ్ళు కావు, అది శిలాప్రతిమలు కావు, నవనాడుల్లోనూ జీవం పోసుకున్న అద్భుత మూర్తులు....మనిషి సృష్టించిన అపురూప ఆనందస్వరూపాలు. అవి చూసాక నరనరాల్లోంచి ఉప్పొంగిన ఆనందాన్ని, హృదయం భరించలేక కళ్ళంట నీరుగా వదిలింది, నిజం. ఆ మహా శిల్పులకు, ఉత్తమోత్తములైన కళాపిపాసకులకు జోహార్లు జోహార్లు జోహార్లు! ఈ మండపంలో ఉన్న మరో విశేషం ఎటుచూసినా స్థంబాలు ఒకే వరుసలో కనిపిస్తాయి. అన్ని కోణాలలోనుండి మండపం "చివర" ను చూడవచ్చు. ఈ మండపం లోపల నటరాజస్వామి చూడచక్కని రూపంతో కనువిందు చేస్తాడు. అన్నిటినీ తనివితీరా చూసి, గొప్పదైన స్పూర్తితో, హృదయాంతరాళాల్లోంచి పొంగిన ఆనందంతో గుడి బయటకొచ్చాము. చాలు, ఇక అన్నం తినకపోయినా ఫరవాలేదనిపించింది.

నెమలిపైనున్న కార్తికేయుడు

నెమలి ఈనెలు, పాదం తొడని తగిలిన చోట వంపు ఇంకా ఎన్నో ఎన్నెన్నో....గమనించండి

కాలి వేళ్ళు, గోళ్ళు...పరిశీలించండి

నెమలి వేళ్ల మీద ఉబ్బిన నరాలు...చూసారా!


బుట్ట మీద ఉన్న అల్లిక.....కనిపించిందా!


ఇందులో నాలుగు కోతులున్నాయి...కనుక్కోండి చూద్దాం :)

వేయి స్థంభాల మడపంలోని నటరాజు
మండపంలోని నాలుగు దిక్కులూ

ఇక ఈ మధురైనగరిలో చూడవలసిన ప్రాముఖ్యమైన ప్రదేశం తిరుమల నాయకర్ మహల్. ఈ కోటలోని అతి ముఖ్య భాగాలను మాత్రమే తమిళనాడు ప్రభుత్వం నిబద్దతతో కాపాడుతోంది. మిగతా భాగాలు జనవాహినిలో కలిసిపోయాయిట. ఈ కోటలో పురాతన కాలం నాటి నాణాలు, వస్తువులు, శిల్పాలు అనేకం ఉన్నాయి. కోటలోని కొన్ని దృశ్యాలు మీ కోసం.....

కోట లోపలి పైకప్పు

నాట్య శాల


రాజు గారి సభా మండపం


క్రీ.శ 900 కాలంనాటి శిల్పం


అవండీ మధురై వింతలూ, విశేషాలు.

అయిపోలేదు, ఇంకా ఉంది.... మరో కొత్త ప్రపంచాన్ని చూడాలంటే కాస్త ఆగాలి సుమండీ.

Tuesday, September 28, 2010

లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు....

ఇవాళే ఖలేజా పాటలు విన్నాను, "సదాశివా" పాటలోని లిరిక్స్ నాకు బాగా నచ్చాయి. ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రాసారు. ఈయన సాహిత్యం అంటే నాకు మాచెడ్డ చిరాకు, ఏదో పిచ్చిపిచ్చిగా రాస్తుంటారు. కానీ ఈ పాట బాగా రాసారు, సిరివెన్నెల రాసారేమో అన్నంత బాగా రాసారు. ముఖ్యంగా "లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు, నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనేపోడు"....ఈ రెండు ముక్కలు నాకు బాగా నచ్చాయి. శివతత్వాన్ని జనపదాల్లో బాగా చెప్పారు. దేవుని గురించి వర్ణించే పాటలనగానే ఎక్కువగా సంస్కృత పదాలొచ్చేస్తాయి అందులో. కానీ ఈ పాటని అతి తక్కువ సంస్కృత పదాలతో, చక్కని తెలుగులో ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే జనపదాలలో, పల్లెపదాలలో, సూటిగా చక్కగా చిక్కులేకుండా చెప్పారు. కాకపోతే పాట మధ్యలో ఓ మూడు, నాలుగు ఇంగ్లీషు ముక్కలొచ్చాయి, అదొక్కటే కాస్త ఎబ్బెట్టుగా ఉంది (సంస్కృతం పోయి, ఇంగ్లీషు వచ్చె ఢాం ఢాం ఢాం అని పాడుకోవాలేమో ఇప్పుడు :D). ఈ పాటని మణిశర్మ సంగీత సారధ్యంలో కారుణ్య, రమేష్ వినాయగం పాడారు. సంగీతం చాలా వెరైటీగా, గొంతులు కూడా విలక్షణంగా ఉన్నాయి. ముఖ్యంగా రమేష్ గారి గొంతులో ఒకరకమైన వణుకు ఉంది, అది వినడానికి ముచ్చటగా ఉంది. ఆ పాట మీకోసం....


పల్లవి: సదాశివా, సన్యాసి, తాపసి, కైలాసవాసి,
నీ పాదముద్రలు మోసి పొంగిపోయినాది పల్లెకాశీ.

చరణం1: ఏయ్...సూపులసుక్కాని దారిగా, చుక్కలతివాసీ మీదిగా,
సూడసక్కనిసామి దిగినాడురా, ఏసెయ్‌రా ఊరువాడా దండోరా.
ఏ రంగులహంగుల పొడలేదురా, ఈడు జంగమశంకరశివుడేనురా...
నిప్పు, గొంతున నిలుపు మచ్చ సాచ్చిగా; నీ తాపం, శాపం తీర్చేవాడేరా.

పైపైకాలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల...

లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు,
నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనేపోడు.

ఓం నమఃశ్శివ జై జై జై

(ఇక్కడ ఉన్న ఇంగ్లీషు ముక్కలని కట్ చేస్తున్నాను)

సదాశివా సన్యాసి, తాపసి కైలాసవాసి,
నీ పాదముద్రలు మోసి పొంగిపోయినాది పల్లెకాశీ.

చరణం2: ఏయ్...ఎక్కడ వీడుంటే నిండుగా, అక్కడ నేలంతా పండగా..
చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా, అడుగేసాడంటా కాచే దొరలాగా.
మంచును మంటను ఒక్కతీరుగా లెక్క సెయ్యనేసెయ్యని శంకరయ్యగా,
ఉక్కుపంచగా ఊపిరి నిలుపాడుగా, మనకండాదండా వీడే నికరంగా.

సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా...

లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు,
నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనేపోడు.

ఈ పాటని వినాలనుకునేవారికి:Monday, September 27, 2010

చెక్కిన చేతులకు జోహార్లు-2

....అంత అలసటతో, నిస్సత్తువతో ఉన్న నాకు ఎదురుగా కనిపిస్తున్న కట్టడం బయటనుండి చాలా మమూలుగా అనిపించింది. ఇప్పుడు ఇది చూసే ఓపిక నాకు లేదురా మొర్రో అన్నా నన్ను లాక్కొచ్చారే అని మా వాళ్ళని కోప్పడ్డాను. మొదటి ద్వారం దాటి లోపలకి ప్రవేశించాము, ఏదో తెలియని పరిమళం ఆహా కాదు గొప్ప మట్టి వాసన ఆ గాలిలో ఉందనిపించింది. అడుగులు ముందుకువేస్తున్నకొద్దీ కొత్త ఉత్సాహం పరవళ్ళు తొక్కింది. రెండవ ద్వారం దాటగానే నా అలసటంతా మాయమయి నా మొహంమీద చిరునవ్వు, మొత్తం తిరిగి చూడాలన్న ఉబలాటం తొంగిచూసాయి. ఆ అద్భుత కట్టడమే తంజావూరులో ఉన్న "బృహదీశ్వరాలయం". తమిళ్ లో దాన్ని "పెరియ కోయిల్" అంటారు. అంటే పెద్ద కోవెల అని అర్థం. గుడి ద్వారాల పై చెక్కిన కళాకృతులు విస్మయం కలిగించాయి.


ఆలయ మొదటి ద్వారం

రెండవ ద్వారం

ద్వారం గోడలపై శిల్పాలు

ఆ ఆలయ పరిసరాల్లో ఏదో తెలియని గొప్పతనం, మత్తు ఉన్నాయి....అవును మరి ఆ పరిసరాలు మనల్ని వెయ్యేళ్ల వెనక్కి తీసుకునివెళ్ళిపోతాయిగా. దీన్ని తొలుత రాజరాజచోళుడు క్రీ.శ 1010 లో కట్టించాడు. తరువాత వచ్చిన రాజులు క్రీ.శ 11-14 శతాబ్దాల మధ్య కాలంలో మొత్తం ఆలయనిర్మాణాన్ని పూర్తి చేసారు. ఈ గుడి మొత్తం గ్రానైట్ తో కట్టినది. రెండు ద్వారాలు దాటి లోపలకి ప్రవేశించగానే ఆహ్లాదకరమైన ప్రాంగణం, పెద్ద పెద్ద ప్రాకారాలు (500/250 అడుగులు). మేము సాయంసంధ్యవేళ వెళ్లామేమో ఆ నీరెండ కి కోవెల ప్రాగణం అంతా మెరిసిపోతూ కనిపించింది. కోవెల ప్రాకారాలపైనా చిన్న చిన్న నంది విగ్రహాలు అమర్చబడి ఉన్నాయి, అవి గుడి చుట్టూరా ఉన్నాయి. గోడల అవతల నాటబడిన పెద్ద పెద్ద కొబ్బరిచెట్లు ప్రాకారాలపై నుండి కనిపిస్తూ కనులవిందు చేసాయి. విశాలమైన ప్రాంగణం, ఆహ్లాదకరమైన వాతావరణం, కనుసొంపైన కళాకృతులు...ఓహ్ అనిర్వచనీయమైన అనుభూతి, నిజంగా వర్ణనాతీతం.కాస్త నడిచి ముందుకెళ్ళాక నంది కనిపిస్తుంది. దాదాపు 12 అడుగుల ఎత్తు, 20 అడుగులు వెడల్పు, 25 టన్నుల బరువుగల బృహత్‌నంది. ఈ నందికి మండపాన్ని చోళరాజుల తరువాతి కాలంలో వచ్చిన నాయకర్ రాజులలో అగ్రగణ్యుడైన తిరుమల నాయకర్ కట్టించారట. చిన్నప్పుడు, నంది చెవిలో ఏవైనా మన కోరికలని చెబితే అవి నేరుగా శివును చెవికి చేరుతాయని ఒక నమ్మకం ఉండేది. మేము శివుని గుళ్ళకి వెళ్ళినప్పుడల్లా నా కోరికలన్నీ నంది చెవిలో తప్పనిసరిగా చెబుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ నమ్మకాలు తగ్గాయి కాబట్టి సరిపోయింది లేదంటే ఈ నంది చెవిలో చెప్పాలంటే నేను పెద్ద పెద్ద నిచ్చెనలు ఎక్కాల్సి ఉండేది :).
నందిని దాటుకుని ముందుకి నడిస్తే అసలు గుడి వస్తుంది. ఆలయగోపురం ఎత్తు 216 అడుగులు. ఆ గోపురం ఎత్తు, దాని మీదున్న రమణీయమైన శిల్పాలు కనులకు మిరిమిట్లుగొలిపాయి. దాని చుట్టూ తిరిగి ఎంతసేపు చూసినా తనివితీరలేదు. నేను 3-4 రౌండ్లు వేసాను, ప్రతీసారి కొత్తగా ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంది. ఆలశిఖరంపై 81 టన్నుల పద్మం ఉంది. అది గ్రానైట్‌తో చేసిన ఏకశిల, ముడుచుకున్న తామరపువ్వు ఆకారంలో ఉంటుంది. దాన్ని 200 అడుగుల ఎత్తు ఎలా ఎక్కించారో, అక్కడ ఎలా అమర్చారో ఇప్పటికీ అంతుబట్టని రహస్యం. BBC వారు the lost temples of India, the stroty of India అని డాక్యుమెంటరీలు తీసారు. అందులో వారు చెప్పిన ఒక ఊహ ఏమిటంటే...."ఆ గుడికి ఒక 15 మైళ్ళ దూరంలో ఒక క్వారీ ఉంది. అక్కడే ఈ పద్మాన్ని తయారుచేసి ఉంటారు. ఆ క్వారీ నుండి గుడి గోపురానికి సమాంతరంగా మట్టినిగానీ, కలపనిగానీ పేర్చి ఉంటారు. అలా పేర్చినదానిపై ఏనుగుల సహాయంతో ఆ 80 టన్నుల పద్మాన్ని చేర్చి ఉంటారు." ఇవన్నీ ఊహలేగానీ నిజంగా ఎలా చేర్చారో ఎవరికీ తెలీదు. ఆ టెక్నాలజీకి సంబంధించిన ఏ వివరాలు మనం భద్రపరచుకోలేదు. ఈరోజుకి భారతదేశంలో అత్యధికంగా 25 టన్నుల బరువుని మాత్రమే మోయవచ్చు. అంతకన్న ఎక్కువగా తీసుకెళ్ళకూడదని రూలు. మరి ఆ కాలంలో 80 టన్నులను ఏనుగుల చేత మోయిస్తూ అంత పైకి తెసుకెళ్ళడమంటే మాటలా! అటువంటి కళాకారులకు, అంతటి కళాపిపాస ఉన్న రాజులకు చేతులెత్తి మొక్కాలి కదా! ఆ BBC కి సంభందిచిన లింక్స్ క్రింద ఉన్నాయి. అందరూ తప్పక చూడండి.

http://www.youtube.com/watch?v=rVHQPWxmdAM

http://www.youtube.com/watch?v=BfhesYL_wp0

ఈ కింది లింక్స్ కూడా చూడండి, మంచి సమాచారం ఉంది.

http://www.youtube.com/watch?v=_QgFLDjKBAk

http://www.youtube.com/watch?v=Q52u4rs3_sI

ఈ వీడియోలు చూసాక అక్కడ ఆ గుళ్ళో రాజు గారు, ఆ శిల్పులు నడయాడుతున్నట్టు, నేను వారి పక్కనుండే నడిచివెళ్ళినట్టు ఏదో అనుభూతి కలిగింది.

ప్రధాన గుడి గోపురం
గోపురం పైన 80 టన్నుల ముకుళిత పద్మం


గుడి బయట కథ అయిపోలేదు, ఇంకా ముఖ్య విశేషాలు బోలెడున్నాయి. ముందు లోపలికి వెళ్ళి, శివుని దర్శించి మళ్ళీ బయటకి వచ్చి మిగతావి చూద్దామే, రండి మరి. లోపలకి వెళ్లగానే ఈశ్వరుడు దర్శనమిచ్చాడు. నిజంగా బృహదీశ్వరుడే, ఎంత పెద్ద లింగం! బాబోయ్, రెండు కళ్ళు చాలవు...నిజంగా కళ్ళారా చూసితీరవలసిందే. లింగాన్ని చక్కగా కన్నులపండువుగా అలంకరించారు. మేము వెళ్ళేటప్పటికి హారతి ఇస్తున్నారు.

బృహదీశ్వరుడు

నాకు మనసు మనసులో లేదు, ఏదో ఉద్వేగం, మనసు నిండినప్పుడు కలిగే ఆనందం....అటు బయట ఆలయ ప్రాంగణాన్ని చూడాలా, ఆలయం పై చెక్కిన కళాకృతులను చూడాలా, లోపల శివుని చూడాలా, బయట నందిని చూడాలా ఎన్నని చూడాలి, ఎన్నిసార్లు చూడాలి. అన్నిటినీ మళ్ళీ మళ్ళీ తనివితీరా చూసేయాలని ఆతృత, ఒకచోట నిలువలేకపోయాను. బయటకొచ్చి మళ్ళీ ప్రధాన గోపురం చుట్టూ మళ్ళీ చక్కర్లు కొట్టాను, ఎన్ని సార్లు చూసినా తనివితీరితేగా!


ఎంతో మనోహరంగా ఉంది కదా ఆలయప్రాంగణం. ఎన్నిసార్లు చుటూ తిరిగి చూసానో నాకే తెలీదు. కానీ అప్పటికి నాకు తెలీదు ఇంకా చూడవలసిన అద్భుతాలు ఆ గుళ్ళో చాలా ఉన్నాయని. ప్రధాన గోపురానికి కాస్త ఎడంగా ఎడమచేతివైపు వెళ్ళాం. అక్కడ వరుసగా లింగాలు ప్రతిష్టించబడి ఉన్నాయి. ప్రతీ లింగానికి చిన్న గదిలాంటిది కట్టబడి, ఆ గదికి ఊచలు పెట్టి ఉంచారు. అబ్బ ఈ ఊచలెందుకు పెట్టారో, దగ్గరకి వెళ్ళి చూడనీయకుండా అని కాస్త విసుక్కున్నాను అప్పుడు. మొత్తం లింగాలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టలేదుగానీ దాదాపుగా 50-60 ఉండొచ్చు. రకరకాల పరిమాణాల్లో ఉన్నాయి. ఇక్క్డ అతి ముఖ్యంగా చెప్పుకోవలసినది ఆ లింగాల వెనకాతల గోడల మీద వేసిన బొమ్మలు. అవేమి చిత్రాలు, అదేమి కళ, అదేమి సృష్టి!.....అన్నీ సహజసిద్ధమైన రంగులతో వేసినవి. శివుని రూపాలు, పురాణ కథలు ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఎప్పుడో వెయ్యేళ్ల క్రితం వేసిన రంగులు ఈనాటికీ చెక్కుచెదరక అలా ఉన్నాయంటే వేసిన ఆ మహానుభావులను ఏమని పొగడాలి! ఎన్నిసార్లు వేనోళ్ళకొనియాడినా సరిపోతుందా! ఆ చిత్రపటాల్లో ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ కెమికల్స్ తో వేసినవి లేవుట. అన్నీ నేచురల్ కలర్సే. అంత మంచి వర్ణాలను ఎలా సంపాదించారో, వాటి కలయికలో ఉన్న రహస్యాలేమిటో ఈనాటికీ ఎవరికీ తెలీదుట. తన్మయత్వంతో, అచ్చెరువుతో అలా కళ్ళు అప్పగించేసి ఓ 10-15 గదులు చూసినతరువాత అర్థమయింది వాటికి ఊచలు ఈ మధ్యనే పెట్టారని, అలా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని. ఎందుకంటే.....ఆ ముచ్చటైన చిత్రాల పక్కనే గోడల మీద "రాజేష్ లవ్స్ రమ, నాకు పరీక్షలో 100 మార్కులు రావాలి, ఓం నమశ్శివాయః, బోలెడు లవ్ సింబల్స్, బాణాల గుర్తులు, వాటికి అటు ఇటు అమ్మాయిల, అబ్బాయిల పేర్లు, తమిళ్ ఈజ్ గ్రేట్, నాయకర్ రాజులు తెలుగువారు...ఇలా అన్ని రకాలూ రాసేసారు మన జనాలు. ఆ చూడచక్కని చిత్రాల పక్కనే ఇవీ కనబడుతున్నాయి కంట్లో నలకల్లా. తమిళ ప్రభుత్వానికి మన పురజనుల క్రియేటివిటీ కాస్త ఆలశ్యంగా అర్థమైనట్టుంది. మరీ అంత సృజనాత్మకతని తట్టుకోలేక ఊచలు పెట్టేసినట్టున్నారు. సరే అసలు కథలోకి వద్దాం. మరి ఆ వి"చిత్రాల"ను మచ్చుకి కొన్ని మీరూ చూడండి.

ఎడమ పక్కన కనిపిస్తున్న ఊచల వెనకాలే లింగాలు ఉన్నాయి

ఇది బృహత్‌నంది ఉన్న మండపం పై కప్పు మీద వేసిన చిత్రం

ఇలా మొత్తం అన్నీ చూసేసరికి రెండు గంటలు పట్టింది. నాకసలు కాళ్ళు నొప్పులూ లేవు, అలసటా లేదు. పైగా ఇంకో రెండు మూడు ఇలాంటి గుళ్ళైనా తిరిగేయగలనంత ఉత్సాహం, మనసు నిండిన సంతోషం. మనసుకి కలిగిన ఉత్తేజం శరీరపు నొప్పులను పోగొట్టింది. మొదట్లో ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మత్తుని కలిగించే మట్టి వాసన వచ్చిందని చెప్పాగా, అదేమిటో ఇప్పుడు తెలిసింది....అవును మట్టి వాసనే గత చరిత్రపు కళా వైభవాలను ఇముడ్చుకున్న మట్టి వాసన. గుండెలనిండా మరొక్కసారి గట్టిగా పీల్చుకున్నాను. అది నా జీవితంలో ఒక గొప్ప రోజు, మనకున్న గొప్ప శిల్పులను, చిత్రకారులను తలుచుకుని పులకించిన రోజు. వారెవరో, పేర్లేమిటో తెలీదు. కనీసం వారి మొహాలైనా ఎలా ఉంటాయో తెలీదు. కానీ ఈరోజు వారిని తలుచుకుని ప్రణామాలర్పిస్తున్నామంటే....వారు నిజంగా ధన్యజీవులు, కారణజన్ములు. ఎన్నటికీ మరచిపోలేని అనుభూతులను మిగిల్చింది బృహదీశ్వరాలయం. కానీ అంత సంతోషంలోనూ ఒక చిన్న బాధ, గుండెలో ఏమూలో కలుక్కుమంటున్న నొప్పి. అంతటి కళని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈరోజుకి మనం నిలుపుకోలేకపోయామే అని.

ఇలా నేను దీని గురించి విశదీకరించి రాయడానికి కారణం ఆ మధుర స్మృతులను మరొక్కసారి నెమరువేసుకోవడానికి, ఆ మన "గొప్ప" ని మీకందరికీ రుచి చూపించి, మిమ్మలనందరినీ అక్కడకు వెళ్ళేలా ప్రేరేపింపజేయడానికి. ఎక్కడకి వెళ్ళినా, వెళ్ళకపోయినా తంజావూరు వెళ్ళండి. జీవితంలో ఒక్కసారైన చూడల్సిన ప్రదేశం బృహదీశ్వరాలయం, మిస్ అవ్వకండి.

మరికొన్ని చక్కని చిత్రాలు -బృహదీశ్వరాలయం

http://www.youtube.com/watch?v=ruGIkMAKq8k&feature=related


(ఇంకా ఉంది)

మరి కొన్ని అద్భుతాలకోసం కాస్త వేచి చూడాల్సిందే, తప్పదు మరి :)