StatCounter code

Monday, June 28, 2010

ము.వెం.ర-హాస్య గుళికలు

ముళ్ళపూడి వెంకట రమణ గారి గురంచి తెలియనివారు ఆంధ్రదేశంలో ఉండరు. ఆయన గురించి అందరు అన్ని రకాలుగా చెప్పేసారు, పొగిడేసారు. ఇహ నేను కొత్తగా చెప్పాల్సిందేమీలేదు. ఈరోజు ఆయన జన్మదినం...ఆయనకెలాగూ ముఖాముఖి జన్మదిన శుభాకాంక్షలు తెలుపలేము కాబట్టి ఆయన కలము నుండి జాలువారిన హాస్య చతురోక్తులలో కొన్నింటిని తలుచుకోవడమే ఆయనకు నేను చెప్పగల జేజేలు.

రమణగారి భాష గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆయన రచనలే అందుకు సాక్ష్యాలు. ఆయన జీవితం ఒక ముళ్ళబాట, జీవితంలో కష్టాలను అలవోకగా అవేమీ పట్టనట్టు అలా అలా రాసేస్తారు, చదువుతున్న మనకే కన్నీళ్ళు ధారలా కారిపోతాయి. ఆయన గురించి ఒకచోట శ్రీరమణ అంటారూ...
"పచ్చని గోరింటలో అరుణిమలు దాగినట్లు
ముళ్ళపూడి నవ్వుల్లో ముళ్ళలాంటి వేదన"

బాపు-రమణ అంటే స్నేహం అని మనం నిర్వచనం చెప్పుకోవచ్చు.
రమణగారి మానసపుత్రుడు బుడుగు గురిచి తెలియనిదెవరికి?
రమణగారు బోలెడు రమణీయాలు రచించారు....సినీరమణీయం, కదంబరమణీయం, ఇలా ఎన్నో....వాటిల్లో కొన్ని రమణీయమైన గుళికలు......

ఒకసారి ముళ్ళపూడి వారికి అప్పు అవసరమై ఒక స్నేహితుడికి ఫోన్ చేసి అడిగారట.

రమణ: ఓయ్ కాస్త అప్పు కావాలోయ్
స్నేహితుడు: అలాగా, ఎప్పటికి కావాలి?
రమణ: మొన్నటికి

....ఇలా ఉంటుంది వీరి వ్యవహారం

...............................
రచయితల మీద వేసిన జోకు:
"నా కొత్త నవల మీద పత్రికలో విమర్శ వేయించండి" అంటూ రచయిత ఒక పుస్తకం అందించాడు. పుస్తకం బాగా నలిగి చిరిగిపోయింది.
"పబ్లిషర్ నాకు ఒక్కటే కాపీ ఇచ్చాడండీ, మా అబ్బాయి దాన్ని నలిపి చింపేశాడు, మరోలా అనుకోకండి," అన్నాడు రచయిత.
"అయితే ఇంకా విమర్శ ఎందుకు? మీ అబ్బాయి అభిప్రాయం తెలుస్తూనే ఉందిగా" అన్నాడు సంపాదకుడు.


"1960 లో తన ఋణానందలహరి పుస్తకం ఫస్ట్ ఎడిషన్ వెలువడింది. ఆ కాపీని ఇచ్చేటప్పుడు దానిపై అచ్చుతప్పులతో, అభినందనలతో అని రాసి మరీ సంతకం చేసి ఇచ్చారట ఆ గ్రంధకర్త శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ-కొంత వరకైనా పాప పరిహారం అవుతుందని."
....................................
ఎత్తిపొడుపులలో రమణ గారి చమత్కారం:
"ఆహా కోట్లార్జించినా మీలో ఆవగింజంత మార్పు కూడా లేదండీ, నాడెంతో నేడూ అంతే" అన్నడొక స్నేహితుడు.

"మార్పులేకేం. పూర్వం నేను పొగరుబోతుని, ఇప్పుడు నాది ఆత్మవిశ్వాసం. లోగడ మొండి రాస్కెల్ ని, ఇప్పుడు చిత్తశుద్ధి-దృఢసంకల్పం కలవాడిని. ఆ మధ్య జడ్డివెధవని, ఇప్పుడు సజ్జనుణ్ణి. లోగడ నోరు విప్పితే అవాకులు -చవాకులు దొర్లేవి, ఇప్పుడు చమత్కారంగా.....సరసంగా మాట్లాడుతున్నాను అంటున్నారు" అన్నాడు శ్రీమంతుడు.
..................................
దృష్టిలోపం:
ఒక కళాసృష్టి జరిగినప్పుడు
రసికుడు: అందులో మంచినీ, అందాన్ని వెతుకుతాడు
విమర్శకుడు: అచ్చుతప్పుల్నీ-తతిమా దోషాల్ని వెతుకుతాడు.
సెన్సారువాడు: బూతునే వెతుకుతాడు
.............................................
జోస్యం
"మీరు డెబ్బైయేళ్ళు బతుకుతారండీ"
"ఏడిసినట్టే ఉంది, నాకు ఇప్పుడు డెబ్బైయేళ్ళే"
"చూసారా, నే చెప్పలే!"
..........................

ప్రముఖుల గురించి రమణగారి మాటల్లో

అమరావతి కథల గురించి చెప్తూ...
"అమరావతి కథలు ప్రేమతో, భక్తితో, ఆవేశంతో సత్యంగారి హృదయం లోంచి ఉప్పొంగాయి. జలపాతంలా ఉరికాయి. బాలకృష్ణవేణిలా పరిగెత్తాయి. స్వామి కోవెల దగ్గర కృష్ణలా భయభక్తులతో తలవంచుకుని నడిచాయి" అన్నారు.

సాలూరి రాజేశ్వరరావుగారి గురించి....
"నిఘంటువులో 'శ్రావ్యసంగీతం' అనే మాటకి అర్థం రాయటానికి మాటలు వెతికి చేర్చేబదులు రాజేశ్వరరావు అని టూకీగా రాస్తే చాలు"

యెస్.వి.రంగారావు గురించి....
"వెండితెరకి రాకుంటే రంగారావు ఏం చేసేవాడు? ఎప్పుడో అప్పుడు ఝామ్మని వచ్చేసేవాడు, అందుకు సందేహమేమిటి!"

కె.వి.రెడ్డి గురించి.....
కృతకమైన సాంఘికం కన్నా సహజమైన జానపదం లక్షరెట్లు మెరుగు. కె.వి. దగ్గర ఉంటే పది లక్షలు మెరుగు. దైవమిచ్చిన జానపదానికి మకుటంలేని రాజు కె.వి.

భానుమతి గురించి.....
చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షర క్రమాన పేర్లు ఎన్నికచేస్తే "బి" శీర్హిక కింద బహుముఖ ప్రఙ్ఞావతి భానుమతి పేరు చేరుతుంది"


రమణగారి గురించి ఇలా రాసుకుంటు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో....ఒక జీవితం చాలదు!







Wednesday, June 23, 2010

"అ" చిన్నదయిపోయింది

ఓలమ్మీ అల్లుడుగోరొచ్చేసినారు కుర్సీ యెయ్యవే.

అత్తా బోగుండావా? మామేడకెల్లినాడు?

బోగున్నానబ్బీ, మీ మామ పట్నమెల్లినాడురా, బళ్ళోకి అయేటో సరుకులు కావలని...సాయంత్రానికొచ్చేస్తాడు.

ఒలేయ్ రావేటే, అల్లుడు నిలబడిపోనాడు బేగి రా.

ఏండీ ఎప్పుడొచ్చారు, కూకోండి. ఊల్లో అత్తా మామా అంతా బోగున్నారా?

బోగున్నారు మల్లీ, నీ ఆరోగ్యం ఎట్టా ఉన్నాదే?

మీరిద్దరు కూకోండి నాయనా, పొయ్యిమీద ఇగురెట్టినాను, సూసొత్తాను.

అలాగే అత్తమ్మా, ఏటొండుతున్నావేటి?

నీకిత్తమని నెత్తల్లు తీసుకొచ్చినానయ్యా :)

...................................................................

అత్తమ్మా కూర బలే సేసినావే....తిన్నాకా ఆయాసమొత్తన్నాది.......మల్లీ నీకు వేవిల్లు తగ్గినాయంటనే?

టిక్ టిక్ టిక్......ఎవరండీ లోపల, మీకు ఉత్తరం వచ్చింది.

సూడల్లుడూ అదేదో వచ్చినాదంట.

నాను సూత్తానత్తమ్మా, నువ్వు తొంగో.

ఏటల్లుడూ ఏటిరాసుంది అందులో, మొగమేటి అలాగయిపోతన్నాది?

అత్తమ్మ, అ అ అ అ ....అ అ అ

ఏటల్లుడూ అట్టా గాబరాపడిపోతన్నావు, ఏటయినాదో సెప్పు.

అ అ అ అ....అ అ అ

ఓలమ్మో ఒరినాయనో ఏటయిపోనాది, నాకు కాల్లు సేతులు ఆట్టంలేదు బగమంతుడో.

అది అ అ అ...

ఏటండీ ఏటిరాసుందందులో, సెప్పండి.

అ అ అ అ....

అ అ అంటున్నారు, మీ అమ్మకేటయిందండీ, ఓలమ్మో అత్తమ్మకేటయిపోనాది? మొన్న సూసినప్పుడు దిమ్మిసెక్కలా బాగానే ఉంది, ఉప్పుడేటయిపోనాది.

ఓలమ్మో ఇయ్యపురాలికేటయిపోనాది...మాయరోగమేటొచ్చినాదో...నానేటి సేసేదిరా దేవుడో.....ఆ రోగమేదో నాకొచ్చినా బాగున్ను, దాని జిమ్మడిపోనూ...సిన్న వయసులో బొట్టికెంతకట్టమొచ్చినాదిరో :(

ఓరల్లుడో అందులో ఏటి రాసున్నాదో సెప్పిసావరా...నాకు రగతం చల్లబడిపోనాది. ఓరేయ్ రాములూ...లగెత్తుకు రారా, ఓ రిక్సా తీసుకురా, బస్సుకెల్లాలి. బేగి రా రా...

అదికాదత్తమ్మా అదీ అదీ అత్తమ్మా అ అ అ అ......

ఓరి గుంటడో సరిగా సెప్పిసావరా...

ఏండీ, మావ ఏడున్నాడు? అత్తమ్మ కి కాల్లుసేతులడిపోనాయా, దేవుడిదగ్గరకెల్లిపోయినాదా...ఏటయినాదండీ, సెప్పండీ?
.....................................................................

ఏవయిందర్రా, ఎందుకలా ఏడుస్తున్నారు అందరూ. ఎప్పుడొచ్చావల్లుడూ, ఏమయింది? ఆ కాగితం ఏమిటి చేతిలో...ఏదీ ఇలా చూడనీ.

ఆపండి ఏడుపులు, ఉత్తరం చదువుతున్నాగా....చూసి చెప్తా.

గౌరవనీయులైన నాయుడుగారికి
అందరూ కుశలమే కదా. నేను వచ్చే వారం మీ ఊరొస్తున్నాను. మిమ్మల్ని కలుస్తాను.
ఇట్లు
గోపాలం

ఇందులో ఏడవడానికేముంది? ఎందుకు అల్లుడూ అలా కంగారు పడ్డావు?

ఏటల్లుడూ ఎందుకంత గాబరా ఎట్టేసినావూ....ఏటయిపోనాది?

అదీ అదీ "అ" చిన్నదయిపోయింది.

అ చిన్నదయిపోవడమేమిటి అల్లుడూ?

అదికాదు మావా, సిన్నప్పుడు సదుకునేటప్పుడు "అ" తాటికాయంత పెద్దగా ఉండేదికదా పలకమీద, ఉప్పుడేమో ఉసిరికాయంత సిన్నదయిపోయింది ఈ కాగితం మీద. అది సూస్తే ఏడుపొచ్చేసినాది.

ఓరి నీతెలివిసంతకెల్ల, "అ" చిన్నదయిపోవడమంటే అదా. చిన్నప్పుడు బాగా రావాలని పెద పెద్ద అక్షరాలు రాసి దిద్దిస్తారు. పెద్దయ్యాక చిన్న అక్షరాలు రాయక తాటికాయంత అక్షరాలు రాస్తారేమిటిరా, నీ తెలివిపాడుగాను. చిన్నప్పుడు సరిగ్గా చదువుకోరా అని ఎన్నిసార్లు చెప్పిన బడి ఎగ్గొట్టి ఇప్పుడు ఇలా అఘోరించావు. చెల్లెలి కొడుకువి కదా అని పిల్లనిస్తే ఇంట్లో వాళ్ళందరిని ఇలా కంగారుపెడతావా, ఏడ్చినట్టే ఉంది.

నీ జిమ్మడిపోనూ ఏటల్లుడూ ఇది, బాగానే ఉంది సంబడం...ఇదేనా నువ్వు సదిగిన సదుగు...కలకటేరులా మాటాడతావు ఒప్పుడూనూ, ఇదేనేటి నీ సదుగు. బొట్టికేటయిపోనాదోనని ఎంత గిలగిల్లాడిపోనానూ.....ఓరి గుంటడా, పేనం పోనాదిగందా !

ఏటండీ ఏదో పేద్ద సదుగు సదిగీసినట్టు నాతో ఆసికాలాడతారు ఒప్పుడూనూ....ఇదేనేటి మీరు సేసిన నిర్వాకమూ.

ఒరేయ్ అందుకే చెప్పేది సరిగ్గా చదువుకోవాలి, అందరూ చదువుకోవాలి అని.

తప్పైపోనాది మావా.

...........................

ఇది నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు మా బళ్ళో వేసిన నాటిక. ఇది మా తెలుగు టీచరు శ్రీమతి దేవీ ప్రకాష్ గారు మా చేత వేయించారు. దీన్లో నేను అత్తగారి పాత్ర పోషించాను. నాకు మంచి పేరు తెచ్చిన నాటిక ఇది. స్కూలు స్థాయి నాటకపోటీలో గెలిచి జిల్లా స్థాయి నాటకపోటీల్లో అవకాశమిప్పించింది ఈ నాటిక. అక్కడ కూడా మూడవ బహుమతి గెలుచుకుకున్నాం. నాకు ఒక తెలుగు సామెతల పుస్తకం, Rs.116 మరియు చిన్న సరస్వతీ దేవి విగ్రం ప్రైజుగా ఇచ్చారు. మా టీచరు మా చేత వేయించిన నాటికలు నాకెప్పుడూ చెరిగిపోని మధుర స్మృతులే!

Tuesday, June 22, 2010

డింగుటక ఆహా డింగుటక

భ.రా.గో గారి చిరకాల మిత్రుడు అమెరికానుండి వచ్చిన సందర్భంలో "తెలుగు సినిమా చూసి చాన్నాళ్లయింది, వెళదాం రారా" అన్నాట్ట.

భ.రా.గో గారేమో "వద్దురా, నువ్వుభరించలేవు, మనకాలమనుకున్నవా, కానే కాదు ఇంటి దగ్గరే కబుర్లు చెప్పుకుందాం చక్కగా అన్నారట".

"ఊహు లేదు వెళ్లాల్సిందే" అని పట్టుబట్టారట ఆ స్నేహితుడు. "సరే కానీ" అని ఇద్దరూ వెళ్లారట.

అందులో మోకాలు ఊపుకుంటూ, నడ్డి ముందుకి వెనక్కి తిప్పుతూ డేన్సులు వేస్తూ పాడుతున్నారట. కాసేపయ్యక ఆ మిత్రుడు అడిగాడట "ఓరేయ్ ఆ పాటకి అర్థమేమిటంటావ్?" అని

భ.రా.గో గారికి చిర్రెత్తుకొచ్చి "మనసున మల్లెల మాలలూగెనే" అంటే అర్థం చెప్పగలను కానీ "డింగుటక ఆహా డింగుటక ఓహో డింగుటక" అంటే ఏమి చెప్పమంటావురా" అన్నారట.

ఈ మధ్య ఇలాటి సంఘటనే మా ఇంట్లో జరిగింది.

మా దూరపు బంధువు (మామయ్య వరస) పాతికేళ్ల తరువాత ఇండియా వచ్చారు. "పొద్దున్నే 9.30 కి రెడియోలో మనోరంజని వస్తుంది పెట్టవే చాలా రోజులయింది మంచి తెలుగు పాటలు విని" అని అడిగారు.

మావయ్య ఏ కాలం పాటలనుకుంటున్నారో అని నవ్వుకుని రేడియో పెట్టాను.

మొదటి పాట "బిల్లా" సినిమా లోది.

"ఏమిటే హిందీ పాటలిస్తున్నారు" అని గాబరాపడ్డారు మావయ్య. "లేదు మావయ్యా అది ఈ మధ్యనే వచ్చిన తెలుగు సినిమావే" అన్నాను.

"బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వొదలా బొమ్మాళీ"...పాట విని ఆయన అసహనంగా కుర్చీలో కదిలారు.

రెండవ పాట అదుర్స్ లో "వేర్ ఈజ్ ద పంచకట్టు వేర్ ఈజ్ ఇట్"......... ఆయన కుర్చీలోంచి లేచి అటు ఇటు తిరిగనారంభించారు.

మూడో పాట :
"ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ల చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను"......ఇంక ఆయనకి సహనం చచ్చిపోయింది. ఈ పాటకి కంటిన్యుయేషన్ గా ఇలా పాడారు

ముక్కు ఏమో మూతి ఆయెను
బుద్ధి కాస్త వంకరాయెను
గోళ్ళ చివర గడ్డి మొలిచెను
మెదడు కాస్త అరికాలుకి పాకెను
తెలుగు పాటలు బురదలో పొర్లెను


ఆ పాట విని మేమంతా ఒకటే నవ్వులు.








Monday, June 21, 2010

సీత అభిమానించిన "రావణ్"

ద్రవిడ భారతంలో ముఖ్యంగా తమిళంలో ఇదే కథావస్తువుతో రామయణం అనేక మార్పులు చెంది రాయబడింది. రాముని కన్నా రావణుడే సీతని ఎక్కువగా గొప్పగా అభిమానించి ప్రేమించాడు అనే వాదన కూడా ఉంది. తెలుగులో చలం కూడా ఇదే కాన్సెప్టు తో రెండు కథలు రాసారు."సావిత్రి" "జెలసీ" పుస్తకంలో ఈ కథలు ఉంటాయి.

ఇప్పుడొచ్చిన రావణ్ సినిమా తమిళ సాహిత్యంలోంచి పుట్టుకొచ్చినదే. రాముడికి వ్యతిరేకంగా రాసిన తమిళ కథలు నేను చదవలేదుగానీ విషయాలు మాత్రం కాస్త తెలుసు. రాముడిని ఆర్యులకు ప్రతినిధిగా, రావణుణ్ణి ద్రావిడులకి ప్రతినిధిగా చేసి ద్రావిడులను తక్కువచేసి చూపడానికి, ఆర్యులను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి రామాయణం రాయబడినదని వాదన. ఈ వాదన లోంచి కొంత కథావస్తువుని తీసుకుని "రావణ్" తీసారు మణిరత్నం.

ప్రచారంలో ఉన్న రామాయణంతో పోల్చి చూస్తే ఈ కథ ఎవరికీ నచ్చదు. ఎందుకంటే ఈ కథలో రాముణ్ణి చెడ్డవాడుగానూ, అన్యాయం చేసేవాడుగానూ చూపించారు. రావణుడు మంచివాడుగానూ, మంచి మనసున్నవాడుగాను, సీతని నిజంగా ప్రేమించినవాడుగానూ చూపించారు. అలాగే సీత కూడా రావణుడి మంచితనాన్ని చూసి అభిమానిస్తుంది చివరికి.

రామాయణాన్ని పక్కనబెట్టి దానితో ఈ కథని పోల్చకుండా చూస్తే "వీరా" (రావణ్) మీద మనకి అభిమానము, పోలీస్ ఆఫీసర్ (రాముడు) మీద ద్వేషం కలగకమానదు. పోలీసుల కుళ్ళుకుతంత్రాల మీద, గిరిజనుల మంచితనం మీద మనకి ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిని మనం ఆదరించాం, అలాగే దీన్ని మనం ఆదరించగలం. కానీ రామాయణంతో పోలిక పెట్టడం వలన దీన్ని ఆదరించి మెచ్చుకోవడం సమాజానికి కష్టమే.

ఇంక సినిమా పరంగా చూస్తే ఫొటోగ్రపీ చాలా బాగుంది, విక్రం నటన, ఐశ్వర్య అందం బాగున్నాయి. కానీ కథలో ఒక ఇంటిగ్రిటీ లోపించింది. ఏమి చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నడో సగం సినిమా అయ్యేవరకు అర్థం కాదు. కథావస్తువు కొత్తగా ఉన్నా కట్టె కొట్టె తెచ్చే అని చెప్పినట్లనిపించింది. ఆ ముక్కల్ని కూడా సాగదీస్తూ చెప్పాడనిపించింది.

తన వాదన జనప్రచారంలో ఉన్న కథకి వ్యతిరేకంగా ఉన్నా, తను అనుకున్నదానికి బలమైన కారణాలను, తర్కాన్ని చూపెట్టి ఉంటే బాగుండేది. కనీసం కథకి పట్టునిచ్చే సంభాషణలు పెట్టినా బాగుండేది. ఈ సినిమాలో అవేవీ లేవు. అసలు ఈ సినిమాకి రావణ్ అని పేరు పెట్టకుండా, ఇది రామాయణం అని హైప్ ఇవ్వకుండా ఉండి ఉంటే బాగుండేది దళపతి సినిమాలా (దళపతి దుర్యోధన, కర్ణుల కథ). ఇదేమి కథో ప్రేక్షకుల విఙ్ఞతకే వదిలేయాల్సింది.

కాకపోతే దేశభక్తి పేరు పెట్టుకుని లవ్ స్టొరీస్ (రోజా, బోంబే) తీసిన మణిరత్నం ఆ మాత్రం బుర్రపెట్టి తీసాడే అని అనిపించింది నాకయితే (మణిరత్నం అసలు బుర్రలేనివాడని, పనికిరాని పిచ్చి సినిమాలు తీస్తాడని నాకో ఒపీనియన్). సినిమా మొదటిభాగం బోరు, చివరి భాగం పర్లేదు. విక్రం అంటే ఇష్టమున్నవాళ్ళు (అంటే నాలాంటి వాళ్ళు) సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తూ (అంటే విక్రం ని చూస్తూ) చూడొచ్చు.

రాముడిని నమ్మినవారికి ఈ సినిమా అస్సలు నచ్చదు. చూసే ప్రయత్నం కూడా చెయ్యకండి. కానీ దేవుని నమ్మనివాళ్ళకి, ద్రవిడులకి ఆర్యులు అన్యాయం చేసారు అని నమ్మేవాళ్లకి ఈ సినిమా ఫరవాలేదనిపిస్తుంది.

పోలికలేం పెట్టకుండా కాస్త లాజిక్కు ఉంటే చాలు అనుకునేవాళ్ళకి, ఏది ఏమైనా ఈ సినిమా చూస్తాం అనుకునే ఔత్సాహికులకు ఉచిత సలహా: సినిమా OK. ఒకసారి చూడొచ్చు.






Monday, June 14, 2010

ఆ వ్యాఖ్యలు నావి కావు

ప్రియమైన బ్లాగరులందరికీ,
నా ప్రొఫైల్ వాడుకుని, నా పేరుతో ఎవరో ఫేక్ కామెంట్లు రాస్తున్నారు. ఇది చాలా బ్లాగులలో నేను గమనించాను. ఎవరికి నా మీద ఎటువంటి కక్షలున్నయో నాకు తెలీదు. అసలిదంతా ఎందుకు చేస్తున్నారో కూడా నాకు తెలీదు. తెలిసి నేనెవ్వరికి ఎటువంటి హాని తలపెట్టలేదు. తెలియక కూడా నేను ఎవ్వరినీ హర్ట్ చెయ్యలేదు. మీరు నా పేరు మీద ఎటువంటు అసభ్యకరమైన వ్యాఖ్యలు చూసినా అవి నేను రాసినవి కావు అని గమనించగలరు. నేను ఇప్పటి వరకు ఎవరి బ్లాగులోనూ అసభ్యకరమైన కామెంట్లు గానీ, ఎవరినీ కించపరుస్తున్నట్టుగానీ, బూతులుగానూ రాయలేదు, రాయను కూడా.

నా పేరు మీద ఎటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చూసినా వాటిని వెంటనే డిలీట్ చేయవలసిందిగా బ్లాగరులందరికి హృదయపూర్వక మనవి.

ధన్యవాదములతో
సౌమ్య










Thursday, June 10, 2010

ముద్దు పేర్లతో వచ్చిన తంటా

మొన్న ముద్దుపేర్ల గురించి ఇక్కడ టపా రాసారు. అది చూసాకా మా ఇంట్లో ఉన్న ముద్దుపేర్ల విషయం గుర్తొచ్చింది. ఈ ముద్దుపేర్లు వింటే ఎంత నవ్వొస్తుందంటే.....తినబోతూ రుచెందుకు, మీరే చదివి నవ్వుకోండి.

మా అమ్మ వాళ్ల పెద్దక్కకి "అమ్మాయి" అని ముద్దు పేరు పెట్టారు. ఆవిడకి మా అమ్మకి ఒక 20 యేళ్ల తేడా ఉంటుంది. ఆవిడ అలా అలా అందరికీ అమ్మాయయిపోయారు. మా అమ్మకి "అమ్మాయక్క" మాకేమో "అమ్మాయి దొడ్డమ్మ". ఈవిడ అసలు పేరు నాకిప్పటికీ తెలీదు.

అలాగే ఆవిడ కొడుకుకి "బాబు" అని ముద్దు పేరు. ఈ అబ్బాయికి మా అమ్మకి ఒక యేడాదే తేడా. ఇహ అందరూ ఆయన్ని బాబు అని పిలవడం మొదలెట్టారు. మరి మాకేమో ఆయన "బాబు అన్నయ్య - బాబన్నయ్య".

అలాగే మా కజిన్ వాళ్ల తమ్ముడిని చిన్నప్పుడు నోరు తిరక్క తమ్ముడుకి బదులు "తమ్మూ" అని పిలవడం మొదలెట్టింది. అదే తన ముద్దుపేరయిపోయింది. అందరు తనని "తమ్మూ" అని పిలుస్తారు. మేమేమో "తమ్మూ అన్నయ్య" అంటాము.

మా పెద్దమావయ్య ముద్దుపేరు "బాబ్జీ". మేమంతా "బాబ్జీ మావయ్య" అంటాము. ఆయన అసలు పేరేంటో నాకిప్పటికీ తెలీదు. అలాగే మా మూడో మావయ్యకి ముద్దు పేరు "పెద్దబాబు", నాలుగో మావయ్య ముద్దు పేరు "చిన్నబాబు". కాబట్టి వాళ్ళిద్దరూ మాకు "పెద్దమావయ్య" "చిన్నమావయ్య" అయ్యారు. పెద్దమావయ్య అంటే అందరికన్నా పెద్దవారా అని ఫ్రెండ్స్ అడిగితే కాదు కాదు మూడో మావయ్య, కానీ ఆయన పేరు పెద్దబాబు అని వివరణ ఇచ్చుకోవాల్సొచ్చేది ప్రతీసారీ.

అలాగే మా కజిన్స్ ఇద్దరి ముద్దు పేర్లు "బుజ్జి", "అమ్మలు". వాళ్ళని మేము "బుజ్జక్క" "అమ్మలక్క" అని పిలుస్తాం. బుజ్జక్క సంగతి ఫరవాలేదుగానీ అమ్మలక్క దగ్గరే వచ్చింది తంటా. అలా పిలిస్తే అమ్మలక్క ఏమిటే "అమ్మలక్కలు లో ఆవిడ ఒకరా" అని ఫ్రెండ్స్ అంతా తెగ నవ్వేవారు. నాకింకొక "బుజ్జి బావ", "బుజ్జన్నయ్య" కూడా ఉన్నారు సుమండీ.

మా నాన్నగారి అత్తలకి ముద్దు పేర్లు "చిట్టి", "చిన్ని". వాళ్ళేమ్మో "చిట్టత్తయ్య, చిన్నత్తయ్య" అని పిలిస్తే మేమేమో "చిట్టిమామ్మగారు, చిన్నిమామ్మగారు" అని పిలుస్తాం.

మా నాన్నగారి మావయ్యల ముద్దుపేర్లు "చిట్టి", బంగారం". మా నాన్నగారికి వాళ్ళు "బంగారం మావయ్య", "చిట్టి మావయ్య". మాకేమో "బంగరాం తాతయ్య", "చిట్టి తాతయ్య". ఈ తాతయ్యల తమ్ముడిని వీళ్ళు "తమ్ముడు" అని పిలిచేవారు. కాబట్టి ఆయన ముద్దుపేరు "తమ్ముడు" అయింది. సో ఆయన మా నాన్నగారికి "తమ్ముడు మావయ్యా", మాకేమో "తమ్ముడు తాతగారు".

మా అమ్మ తరపు చుట్టాలో ఒకావిడ పేరు "బేబీ". ఆవిడనందరూ "బేబక్క, బేబొదిన" అని పిలుస్తారు.

మా ఫ్రెండు పేరు వింధ్య వాసిని. మేము దాన్ని ముద్దుగా "వివా" అని పిలిచేవాళ్ళం. వాళ్లింటికి తరచూ వెళ్ళేవాళ్ళం. మేము వీవా అని పిలుస్తూ ఉంటే వినడం అలవాటయిపోయి, తన పిన్ని కొడుకులు "వీవా అక్క" అని పిలిచేవారు చాలారోజులు. మెల్లిగా తరువాత మానిపించారనుకోండి.

మా ఇంట్లో నేను మా చెల్లిని "చెల్లీ" అనే పిలుస్తాను. దానితో అది మా కజిన్స్ అందరికీ చెల్లిగానే ఫేమస్ అయిపోయింది. అందరూ దాన్ని చెల్లీ అనే పిలుస్తారు. అది నన్ను "అక్కా" అనే అంటుంది. కానీ నన్నెవ్వరూ అక్కా అనరు. మరీ చిన్నవాళ్లు అక్కా అంటారుగానీ నాకంటే 1-2 యేళ్ళు చిన్నవాళ్ళు అక్కా అనరు, పేరు పెట్టి పిలుస్తారు. దాన్ని మాత్రం ఎంతపెద్దవాళ్లైనా చెల్లీ అంటారు. ఒక్కోసారి మా నాన్నగారు, అమ్మ కూడా "చెల్లీ ఇలా రావే, చెల్లీ అది తేవే" అని అనేస్తూ ఉంటారు.

Wednesday, June 9, 2010

అనగా అనగా............

ఈ మధ్య కల్పన రెంటలగారు మన అమ్మ చెప్పిన కథలు అని ఒక టపా రాసారు. మన చిన్నప్పుడు అమ్మలు, నాన్నలు, బామ్మలు, తాతలు చెప్పిన కథలనీ ఒకచోట పోగేసే ప్రయత్నమది. నాకు నచ్చింది. అందుకే నాకు గుర్తున్న కథలు కూడా రాద్దామని....

యూనివర్సిటీ లో ఉన్నప్పుడు "అంటరాని వసంతం" రాసిన "కల్యాణరావు" గారు ఒక సభకి వచ్చారు. అప్పుడాయనో మాట అన్నారు. రాజశేఖర చరిత్రే తెలుగులో మొదటి కథ ఎందుకవుతుంది. "రాజుగారికి ఏడుగురు కొడుకులు" ఎందుకు మొదటి కథ కాదు అని. నాకు ఆ మాటలు చాలా నిజమనిపించాయి. ఈ రాజుగారి ఏడుగురు కొడుకుల కథ తెలియని పసిపాపలు ఉండరేమో మన ఆంధ్ర దేశంలో. మరి అలాంటప్పుడు అదే మొదటి కథ అవ్వాలి కదా. అలాగే ఆవు-పులి, కుందేలు-తాబేలు కథలు తెలియని వారెవ్వరు ఉండరు. కానీ లిఖితపూర్వకంగా ఈ కథలు లేకపోవడం వలన, అవి రాసినవారెవరో స్పష్టంగా తెలియకపోవడం వలన ఈ కథలకు "మొదటి కథలు" అన్న స్థానం రాలేదేమో అని నాకు అనిపించింది.

ఈ దిశలో వాటిని లిఖితపూర్వకంగా ఒకచోట చేర్చడం అనే ప్రక్రియ మంచిపనే, కల్పనగారు అందుకు అభినందనీయులు.

నాకు గుర్తొచ్చిన రెండు-మూడు కథలు రాసేస్తే ఈ బృహత్కార్యానికి మనమూ ఓ చెయ్యి వేసినట్టుగా అవుతుంది కదా అని ఇలా...

....................................................................
అనగా అనగా ఒక రాజుగారుండేవారట
ఆయనకి ఏడుగురు కొడుకులుండేవారట
ఆ ఏడుగురు కొడుకులు ఒకరోజు వేటకెళ్ళి, ఏడు చేపలు తెచ్చి ఎండబెట్టారట.
అందులో ఒక చేప ఎండలేదట.
చేపా చేపా ఎందుకెండలేదు అని అడిగితే
గడ్డిమోపు అడ్డొచ్చింది అందిట
గడ్డిమోపూ గడ్డిమోపూ ఎందుకు అడ్డొచ్చావు అని అడిగితే
ఆవు నన్ను మేయలేదు అందిట
ఆవూ అవూ ఎందుకు మేయలేదు అని అడిగితే
దూడ పాలు తాగలేదు అందిట
దూడా దూడా పాలెందుకు తాగలేదు అని అడిగితే
యజమాని నన్ను విప్పలేదు అందిట
యజమానీ యజమానీ ఎందుకు విప్పలేదు అని అడిగితే
మా పిల్లాడికి చీమ కుట్టింది అన్నాట్ట
చీమా చీమా ఎందుకు కుట్టావూ అని అడిగితే
నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అందిట
....................................................................

ఒక అడవిలో ఒక నక్క, ఒక కొంగ ఉండేవారట. ఒకరోజు ఆ నక్కకి కొంగని బాగ ఏడిపించాలని అనిపించిందిట. అప్పుడు నక్కగారేమో కొంగని ఇంటికి విందుకి పిలిచారట. విందుకి వెళ్ళిన కొంగకి నక్క పాయసం వండి ఒక పళ్ళెంలో పెట్టిందిట. పొడుగు మెడ ఉన్న కొంగ పళ్ళెంలో పాయసం తినలేక అవస్థ పడిందిట. అది చూసి నక్క తెగ నవ్వుకుంటూ పళ్ళెంలో పాయసం నాకి నాకి చక్కగా తిన్నదట. ఇలా ఉందా ఈ నక్క సంగతి చెప్తా అని అనుకుని కొంగ ఆ మర్నాడు నక్కని ఇంటికి విందుకి పిలిచిందిట. నక్క వెళ్ళగా కొంగ చేపలు వండి ఒక కూజాలో నక్కకి వడ్డించిందిట. నక్క మూతి కూజాలోకి దూరక, చేపల సువాసన కడుపులో ఆకలి రేపుతూ ఉంటే నానా బాధలు పడ్డాదిట నక్క. అది చూసి మంచిపని అయ్యిదిలే అని కొంగ సంతోషించిందిట.
....................................................................

ఒక అడవిలో ఒక సింహం ఉండేదిట. అది చాలా కౄరమయినది. దాని బలంతో రోజూ జంతువులని వేటాడి తినేస్తూ ఉందేదిట. ఇలా అయితే లాభం లేదని, అడవిలో జంతువులనీ సమావేశమయ్యి, ఆ సింహాన్ని రాజుగా చేసి, రోజుకో జంతువుని మేమే మీకు పంపిస్తాం, మీరు వేటాడి మమ్మల్ని హింసించకండి అని ప్రాధేయపడ్డాయిట. సరే అలాగే పంపించండి అని సింహం ఒప్పుకుని ఆ అడవికి రాజై కూర్చిందిట. పాపం జంతువులన్నీ ఒక్కొరోజు ప్రాణత్యాగం చేస్తూ ఆ మృగరాజు కడుపు నింపుతున్నాయట. ఇంతలో ఒక కుందేలు వంతు వచ్చిందిట. చిట్టి పొట్టి కుందేలు బుర్రలో లెక్కలేనన్ని తెలివితేటలు. ఆరోజు రాగానే కుందేలు సింహం దగ్గరకి ఆలస్యంగా వెళ్ళిందిట. కోపంతో సింహం ఊగిపోతూ కుందేలు మీద గర్జించిందిట. అప్పుడు కుందేలేమో "శాంతించండి మహారాజా, మీలాంటివాడే ఇంకొకడు ఈ అడవిలో ఉన్నాడు. వాడు నన్ను ఆపి ఈ అడవికి రాజు వాడే మీరు కాదు అని నన్ను బెదిరించాడు. వాడి నుండి ఎలాగో తప్పించుకుని మీ చెంతచేరాను" అని కుందేలు చెప్పిందిట. "ఏమిటీ ఈ అడవికి ఇంకో రాజా...వీలులేదు" అని గాండ్రించి "వాడేక్కడున్నాదో చూపించు, ఇవాళ వాడో నేనో తేలిపోవాలి" అని కుందేలుని అడిగిందిట. చిత్తం మహారాజా అలాగే చూపిస్తాను అని చెప్పి ఆ సింహాన్ని కుందేలు ఒక బావి దగ్గరకి తీసుకుని వెళ్ళిందిట. అదిగో ఆ బావిలో ఉన్నాడు చూడండి అని చూపించిందిట. తెలివిలేని సింహం ఆ బావి లో తన నీడని చూసుకుని ఇంకో సింహం అనుకుని కోపంతో దానిపై దూకిందిట. ఇంకేముంది ఆ మూర్ఖ సింహం బావిలో పడి మరణించింది. పీడా వదిలిపోయిందని, చిన్నారి కుందేలు తెలివితేటలని మెచ్చుకుంటూ జంతువులన్నీ హాయిగా ఆడిపాడాయట.
....................................................................

అనగా అనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేదిట. ఒకరోజు ఆ కాకికి ఒక మాంసం ముక్క దొరికిందిట. అది ఆ ముక్కని నోటకరుచుకుని చెట్టు మీద వాలిందిట. కాకినోట్లో మాంసం ముక్కని చూసి నక్కకి దానిపై ఆశ కలిగిందిట. వెంటనే ఆ ముక్కని ఎలాగైనా కాకినుండి కాజెయ్యాలని నక్క అనుకుని "కాకీ కాకీ నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా బాగా పాటలు పాడతావు ఒక పాట పాడవా" అని అడిగిందిట. కాకేమో ఆ పొగడ్తకి మురిసిపోయి మా మాంసం ముక్కని కాలివేళ్ల మధ్యన పెట్టుకుని కావు కావు మని పాడిందిట. అది చూసి నక్క "అబ్బా నా జిత్తులు ఫలించలేదే అని చెప్పి ఈసారి "కాకి కాకి నువ్వు బాగా నాట్యం చేస్తావు, చెయ్యవా" అని అడిగిందిట. కాకి మళ్ళీ మురిసిపోయి ఆ ముక్కని ముక్కున కరిచి నాట్యం చేసిందిట. ఇలా కాదని చెప్పి నక్క "కాకీ కాకీ నువ్వు పాటపాడుతూ నాట్యం బాగా చేస్తావు, చెయ్యవా" అని అడిగిందిట. ఆ కాకేమో బోలెడు సంబరపడిపోయి కావు కావుమంటూ నాట్యం చేసిందిట. వెంటనే మాంసం ముక్క నోటి నుండి కిందపడిపోయింది. ఆ జిత్తులమారి నక్కేమో ఆ ముక్కని లొట్టలేసుకుని తింటూ చక్కా సాగిపోయిందిట.









Monday, June 7, 2010

ఔనౌనౌనౌను పేరులోనేముంది????

char 'i' గారి, కిత్నమూతిగారు పేర్ల గురించి టపాలు చూసాక నా పేరు వెనకాల దాగి ఉన్న కథ గురించి కూడా రాయాలని దురద పుట్టింది.

నా పేరు చక్కగా, చిన్నగా "సౌమ్య" అని బావుంది కదా, కానీ నా అసలు పేరు ఇది కాదు. నాకొక సిసలైన మాంచి నిఖార్సైన చాంతాడంత పేద్ద పేరుంది.

అదే "ఆలమూరు వెంకట పైడి రమా నాగ రామరత్న సౌమ్య"....ఇంగ్లీషులో గనక రాస్తే A-Z అన్ని అక్షరాలుంటాయి.

ఈ పొడవాటి పేరులో ప్రతీ చిన్న పేరుకి వెనక ఓ పేద్ద కథ ఉంది. నాకు కొద్దిగా ఊహ తెలియగానే మా నాన్నారు ఈ పేరు నాచేత బట్టీ పట్టించి అర్థాలు పరమార్థాలు వివరించి చెప్పారు.

ఆ విధంబెట్టిదనిన.....

ఆలమూరు - మా ఇంటిపేరు

వెంకట - మా కులదైవం వెంకటేశ్వరుడి పేరు...మా ఇంట్లో ఆడ, మగ తేడా లేకుండా అందరికి ఉంటుంది, అలా నాకూ తగిలించేసారు (మనలో మనమాట మా ఇంట్లో మగవాళ్లలో సగం మంది వెంకటరమణమూర్తులు మిగతా సగం మంది వెంకటాచలంలు అదీ కాకపోతే రామకృష్ణలు ఉంటారు).

పైడి - మా ఊరిదేవత పైడితల్లమ్మవారు, ఆవిడ పండగ రోజునే నేను పుట్టాను, ఇంకేముంది అదీ కలిసింది.

రమా - అప్పటికి మా ఇంట్లో రెండు తరాలుగా ఆడపిల్లలు లేరు. మా తాతగారు, పెద్దనాన్నగార్లు ఆడపిల్లకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉండగా పుసుక్కున నేను పుట్టేసాను...మా ఇంటి మహలక్ష్మి అనిచెప్పి "రమా" అని తగిలించేసారట

నాగ - ఇక్కడుంది అసలు కథ - డెలివరీ టైంలో అమ్మ ని ఆస్పత్రిలో జాయిన్ చేసారు. ఆరోజు సాయంత్రం నాన్నగారు ఆస్పత్రి నుండి ఇంటికి వచ్చి రాత్రికి కావలసిన సామానులు, అమ్మకి భోజనం అన్ని సర్దుకుని బయలుదేరబోయేటంతలో నాగుపాముపిల్ల తోక తొక్కేసారట పొరపాటున. అది కాటేసేలోపల ఆయన తప్పించుకుని ఒడుపుగా పట్టుకుని దూరంగా విసిరేసారట. ఆ టెన్షన్ నుండి బయటకి రాకముందే, ఆస్పత్రికెళ్ళగానే అమ్మకి సిజైరిన్ చెయ్యాలని ఇంకో టెన్షన్ పెట్టారట డాక్టరు. మొత్తానికి నలుసు క్షేమంగా బయటపడగానే, నాగుపాము కథ అమ్మకి వివరించగా "నాగ" పేరు మన అమ్మాయికి పెట్టాలి అంతే అని తీర్మానించిందిట మా అమ్మ....అలా అదీ తగిలించారు. (పేరు పెట్టడం వలనో ఏమోగానీ పాములకి నాకు అవినాభావ సంబంధం ఉంది...అదేమిటో తరువాతి టపాలో చెప్తా)

రామరత్న - రామరత్నం మా నాన్నమ్మ పేరు.

అలా ఏరి కూర్చి నా పేరుని పెద్దదిగా చేసారు. సౌమ్య అనే ఇంట్లో పిలిచినా మొత్తం పేరు బడిలో వెయ్యాలని మా తాతగారు పట్టుబట్టారట. బడిలో ససేమిరా అన్నారట. పోనీ కుదించి "A.V.P.R.N.RR. సౌమ్య " అని రాయమన్నారట. కుదించినా కూడా రిజిస్టర్ లో లైన్లు పట్టవు అనేసారట.

మా నాన్నారు "సరేలే" అనుకుని ఆలమూరు సౌమ్య అనే వేయించారు చివరికి (నా అదృష్టం బావుండి.)

కానీ మాతాతగారు నా పేరు దాని పుట్టుపూర్వోత్తరాలు తరతరాలకి తెలియజేయాలని మా నాన్నగారిచేత ఒట్టేయించుకున్నారట...ఇంకేముంది ఎక్కడకి వెళ్ళినా నా పూర్తి పేరు "ఇది" అని చెప్పి వెనకదాగిన కథలు బుర్రకథలా పాడడం పరిపాటయిపోయింది.

పోనీలే తెగ్గొట్టి, దిగొట్టి పేరు కుదించారుగా అని సంతోషించేలోపలే నా అందమైన పేరుకి కష్టాలు మొదలయ్యాయి. "సౌమ్య" అని చెప్పగానే "సేమ్యా" అనేయడం ప్రతీవారికి అలవాటయిపోయింది. కోపం, ఉక్రోషం, కళ్ళలో నీళ్ళు, దిగమింగుకోవడాలు అన్నీ అయ్యాక పోనీలే ఏ కాకరకాయకూరో అనకుండా నాకిష్టమైన సేమ్యా (పాయసం) అంటున్నారుగా అని సరిపెట్టేసుకున్నాను.

అక్కడితో ఆపారా, అబ్బే......సౌమ్య కాస్త "సోమియా" అయి కూర్చుంది. మా వీధిలో వాళ్ళాంతా సోమియా అని పిలిచేవారు, మాచెడ్దచిరాకుగా ఉండేది. నాపేరుని కరక్ట్ చెయ్యడంతోనే నా జీవితం అయిపోయుందేమో అని తెగబాధపడేదన్ని.

ఇహ కాలేజీ కొచ్చేసరికి అసలైన తంటా మొదలయ్యింది. నా పేరు ఎంతో సరళంగా చక్కగా పలకడానికి సులువుగా ఉంటుంది కదా. అదేమిటో నా ఖర్మ సౌమ్య కి బదులు సౌజన్య అని పిలిచేవారు. సౌజన్య అన్నది సౌమ్య కంటే కష్టమైన పదమే, అయినా అదేమి కంఫ్యూజనో నాకర్థమై చావదు. ఎవరికైనా సౌమ్య అని చెప్పగానే సౌజన్య అని పిలిచేవారు. సౌమ్య, సౌమ్య అని వారిచేత పదే పదే వల్లెవేయించాల్సి వచ్చేది. నాకు ఎంత విసుగు, కోపము వచ్చేదో చెప్పలేను. ఒక సుముహూర్తాన సౌజన్య అని ఎవరు పిలిచినా పలకకూడదు అని నిశ్చయించేసుకున్నాను. అంతే పలకడం మనేసాను. దెబ్బకి దారికొచ్చారు జనాలు. అయిన కూడా ఈనాటికి మొదటి పిలిపు సౌజన్య అని రావడం కడు బాధాకరం. మొన్నటికి మొన్న ఎవరో ఒకావిడకి మా అమ్మ నన్ను పరిచయం చేసి పేరు చెప్పగానే " సౌజన్యా ఎక్కడుంటున్నవమ్మా నువ్వు అని అడిగారు"....నాకు కోపం నసాళానికి అంటింది, కానీ ఏం చేస్తాం....హి హి హి అని ఓ వెకిలి నవ్వు నవ్వి "సౌమ్య" అని కరక్ట్ చేసాను....అలవాటయిపోయింది మరి.

ఇక నా పేరుని ఇంగ్లీషులో రాసే విషయానికొస్తే.....చెప్పగానే ఎవడూ కూడా SOWMYA/SOUMYA అని రాయరు. SOMA అనో SOMAYA అనో SOMIYA అనో SAMIYA అనో రాస్తారు. స్పెల్లింగు చెప్పలేక తలప్రాణం తోకకొచ్చేది.

యూనివర్సిటీకి రాగానే కొత్తల్లో "సోమియా" వా "సోనియా" వా అని అడిగేవారు కొందరు. ఓ 2-3 నెలల తరువాత సీనియర్లు, స్నేహితులు అంతా ఆలమూరు అని పిలవడం మొదలెట్టారు. సౌమ్య ని నానావంకర్లు తిప్పడం కంటే ఇదేదో బాగనే ఉందిలే అని నేను కూడా ఊరుకున్నాను. ఇహ ఆలమూరు అష్టవంకర్లు తిరగడం ప్రారంభించంది."అలుమురు,ఆలమీరు,అలిమేరు"....ఇలా నానారాకాలుగా వర్ధిల్లింది. ఒకరోజు మా స్నేహితురాలు వాళ్ళ అన్నని పరిచయం చేసింది. నా పేరు చెప్పగానే ఓ "అలమారు సౌమ్య" అంటే మీరేనా అన్నాడు. చెప్పొద్దూ నాకు ఏడుపొక్కటే తక్కువ !

ఇప్పుడు మీ అందరికో క్విజ్....పైన చూడకుండా నా పూర్తి పేరుని తిరిగి చెప్పండి చూద్దాం?





















Friday, June 4, 2010

నా వరాల మూట, బంగారు కొండ...

నా చిట్టితల్లిని చూడబోతున్నననగానే ఎంత ఆనందమేసిందో, అసలిప్పుడేమిటి ఎప్పుడూ అలాగే అనిపిస్తుంది. నా బంగారు తల్లిని వదిలిపెట్టి పదేళ్ళయింది. దానికి నా మీద ఎంత ఆపేక్ష ఉందో తెలీదుకానీ నాకు మాత్రం అపారమైన ప్రేమ ఉంది, రోజూ గుర్తు వస్తూ ఉంటుంది. ఆచిట్టితల్లితో గడిపిన రోజులు, ఆ సహవాసం ఎన్ని జన్మలకైనా మరచిపోగలనా! దాదాపు యేడాది తరువాత మొన్ననే నా వైడూర్యాన్ని కలుసుకున్నాను. అసలు నా వజ్రాల మూటని చేరుకోబోతున్నాననగానే నాకు ఎక్కడలేని శక్తి వచ్చింది. చేరువగా వెళ్తూ ఉంటే ఆ గాలిలో నా బంగారం తాలూక వాసనలు పరిమళించాయి. నా బుజ్జితల్లి కరుణామయి, ఎప్పుడూ నన్ను చేతులు చాచి ఆప్యాయంగా ఆహ్వానిస్తుంది. ఆమెతో అనుభూతులు ఏమని వర్ణించగలను. ఆమె నాకు ఇన్నాళ్ళూ తల్లిలా అనిపించింది. ఇప్పుడేమో కొత్తగా కన్నకూతురిలా తోస్తోంది. ఇన్నాళ్ళూ నాకు తల్లి అయి నన్ను కంటికి రెప్పలా కాపాడింది. నా కన్నతల్లి, ఆమె ఒడిలో ఆడిన క్షణాలు మధురాతిమధురం. ఆమె చల్లని చేతులలో నేను పొందే సేద అనిర్వచనీయం. ఆమె అందించే ప్రేమ అనంతం. ఆవిడ సన్నిధి మనసుకి ఎంత ఉల్లసానిస్తుందో చెప్పలేను. నేనెప్పుడెళ్ళినా నా చల్లని తల్లి నన్ను అక్కున చేర్చుకుంటుంది. ఆపారమైన ప్రేమనందిస్తుంది. మాటల్లో చెప్పలేని ఆనందాన్నందిస్తుంది. కన్నపేగు మమకారం అలా ఉంటుంది కాబోలు.

కానీ.....చెప్పాగా, ఈమధ్యనే నాకు ఆవిడ కూతురిలా కనిపించడం మొదలుపెట్టింది. తనని మా బుజ్జితల్లి, బంగారు తల్లి, చిట్టి పాపాయి అని లాలించాలనిపించింది. అంతే ఆ క్షణమే నాకు ఆమె కూతురయిపోయింది. ముద్దులొలొకిస్తూ నా ఒడి చేరిన చిన్నిపాపలా అనిపించింది. పదేళ్ళయింది నా ముద్దులపాపని వదిలి. అప్పుడప్పుడు వచ్చి చూసిపోవడమే తప్ప తనతో గడిపిన సుదీర్ఘ క్షణాలు తక్కువే. చానాళ్ళ తరువాత ఈసారి రెండు వారాలు గడిపాను. ఎప్పుడు వెళ్ళినా నాలుగైదు రోజులకి వెళ్ళడమే తప్ప ఇన్ని రోజులు గడపలేదు. నా బంగారు తల్లి ఎంతో మారింది, గొప్పగా ఎదిగింది. నవయవ్వనశోభలు సంతరించుకుంది. నాకు తెలియని కొత్త విశేషాలు కనిపించాయి. తన శరీరపు లావణ్యం చాలా కొత్తగా అనిపించింది. బిడ్డ ఎలా ఉన్నా తల్లికి కొత్తగాను, గొప్పగానే కనిపిస్తుందేమో మరి! చాలారోజుల తరువాత సాయంత్రం షికారుకెళ్తున్నప్పుడు చూస్తే నా అమ్మి అందాలు ఏమని వర్ణించను. నా తల్లితో గడిపిన పాతరోజులన్నీ గిర్రున కళ్ళలో తిరిగాయి. ఆ ఆనందం అనుభవించగలిగేదేకానీ చెప్పనలవికాదు.

ఇంతకీ ఈ నా గారాలపట్టి ఎవరనుకుంటున్నరా అదేనండి మా "ఊరు". నను కన్న నా తల్లి, నా బంగారు తల్లి మా "విజయనగరం".
ఈ మధ్యే మా ఊరు వెళ్ళాను. ఊరు చేరువవుతూండగా నాకు ఇలాంటి భావనలు కలిగాయి. ఇదిగో ఇలా మీముందుంచాను.