StatCounter code

Wednesday, July 20, 2011

గొలుసు కట్టు వ్రాత

మా చిన్నప్పుడు ఈ వ్రాత గురించి వినడం తప్ప ఇంకేమి తెలీదు. పూర్వం రోజుల్లో ఒక అక్షరానికి ఇంకో అక్షరాన్ని కలిపేస్తూ రాసేవారని వింటూ ఉండేదాన్ని. మధురైలో తిరుమలనాయకర్ మహల్ లో ఉన్న పెద్ద లైబ్రరీకి వెళ్ళినప్పుడు అత్యంత పురాతన గ్రంధాల్లో ఈ వ్రాతని గమనించాను. ఎక్కడా ఖాళీ లేకుండా, ఎత్తిన చెయ్యి దించకుండా ఉన్న ఆ వ్రాత ఒక్క ముక్క బోధపడలేదు. పూర్వం ఘంటిక ని సిరాలో ముంచి రాసేవారు కాబట్టి చెయ్యి ఎత్తితే సిరా చుక్క పడుతుందనో లేదా సిరా వేస్ట్ అవుతుందనో అలా గొలుసులా రాసేవారేమో!

మన ఇంగ్లీషులో కూడా కలిపి వ్రాత రాస్తాం కదా....కాకపోతే అది అర్థమవుతుంది మనకి అలవాటు అయింది కాబట్టి. నేను ఇంగ్లీషులో చిన్నక్షరాలు రాసేటప్పుడు m, n, u, w ల లాంటివి పక్క పక్కనొస్తే అన్నీ కలిపేసి రాసేదాన్ని. చూడ్డానికి అది ఒక తరంగంలా ఉండేది. ఏది m, ఏది n, ఏది u అన్నది ఎవరికీ బోధపడేది కాదు. ఒక్కోసారి ఉండవలసినవాటి కన్నా ఎక్కువ వేవ్స్ ఉండేవి దాన్లో! :) మా టీచర్లందరూ తిట్టేవారు...తల్లీ నువ్వు కలిపి రాయక్కర్లేదు, విడివిడిగా రాయి చాలు. అసలే రైటింగ్ కోడికెలికినట్టుంటుంది ఇంక కలిపిరాత అయితే ఇక చెప్పక్కర్లేదు...అనేవారు. పాపం వాళ్లని బాధపెట్టడమెందుకని ఆ కలిపిరాతని కాస్త తగ్గించుకున్నాను.

నేను పదో క్లాసులో ఉండగా అనుకుంటా....మా ఇంట్లో నేలమాళిగలలో తవ్వుతుంటే కొన్ని ఉత్తరాలు బయటపడ్దాయి 1959 నాటివి. మా ముత్తాతగారు మా తాతగారికి రాసినవి. గొలుసుకట్టు వ్రాత...ఒక్క ముక్క బోధపడితే ఒట్టు. అది చూసాక మనమెందుకు ఇలా ప్రయత్నించకూడదు అని చెప్పి తెలుగు లో గొలుసుకట్టు మొదలెట్టాను. అంతా రాసేసాక తిరిగి చదువుదామంటే నా వ్రాత నాకే బోధపడేది కాదు. అలా కొన్నాళ్ళు ప్రయత్నించాను...ఉహూ నా కళ్ళకి శ్రమ తప్ప అంతకన్నా ప్రయోజనం కనపడలేదు. ఇంక వదిలేసాను. ఈ గొలుసుకట్టు పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలని నాకు చాలా కోరిక... ఎవరికైనా తెలిస్తే చెప్పండి.

మా ఇంట్లో దొరికిన ఉత్తరాలని భద్రంగా దాచిపెట్టాను నా ఖజానాలో. ఇన్నాళ్ళకి వాటిని స్కాన్ తీయగలిగాను. వాటిని చూస్తే బలే గమ్మత్తుగా ఉంటుంది. ఉత్తరం మొత్తం చదవడానికి చాలాసార్లు ప్రయత్నించాను...కాని పావు వంతులో పావు వంతు కూడా బోధపడలేదు. ఆ ఉత్తరాలు ఇక్కడ మీ కోసం:
14 comments:

Anonymous said...

మీ తాతగారి రాత బావుంది(=అర్ధంకాలేదు). మా పెద్దాళ్లు పద్యాల్లో ఉత్తరాలు రాసుకునేవారు. వెర్రివేయివిధాలంటారు కదా ఇదో విధం. ఆ ఉత్తరాలు పెడతాను బ్లాగులో.

Indian Minerva said...

అదంతా ఏమో తెలీదుగానీ ఈ గొలుసుకట్టు రాత అనబడే cursive script వున్న భాషలను వేగంగా రాయడానికి వీలవుతుంది. Boustrophedon గురించి ఎప్పుడైనా విన్నారా? లిపిచాలా పాతదిలెండి(అంతరించి పోయిందికూడా). వాళ్ళు వేగంగా రాయగలగడంకోసమేమో తెలీదుగానీ లెఫ్టు టు రైటు రాసుకుంటూ పోయి పేజి చివర్లు తగలగానే రైటు టు లెఫ్టు రాసేవాళ్ళట (seek time సేవ్ అవుతుంది కదా!)

మనసు పలికే said...

బాబోయ్ సౌమ్య గారూ:) భలే ఉంది మీ ముత్తాత గారి రాత. అసలు ఇలాంటిదొకటి ఉంటుందన్న విషయం కూడా నాకు తెలీదు :( మీ దగ్గర చాలా విషయాలు తెలుసుకోవచ్చు:))..
భలే మంచి విషయాన్ని పంచుకున్నారు సౌమ్య.. నేను కూడా ప్రయత్నిస్తా ఈ గొలుసు కట్టు వ్రాత:))

సుజాత said...

అవును, ఈ గొలుసు కట్టు రాతలు పాతవాళ్ల స్క్రిప్ట్స్ లోనే దొరుకుతాయి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ కావిడి పెట్లో తాత గారు మహాదేవుడి మీద ఛందోబద్ధంగా రాసిన పద్యాలు ఈ గొలుసుకట్టు రాతలోనే చూశాను. వాటిని దాచి ఉంచాలనీ జ్ఞానం అప్పట్లో లేకపోయింది మరీ చిన్నపిల్లలం కావడం వల్ల.


BTW, ఈ ఉత్తరాలు కాకుండా మీ నేలమాళిగలో రత్నాలూ అవీ ఏమైనా ఉన్నాయేమో ఇంకోసారి చూడరాదూ!:-))

మురళి said...

మా తాతగార్లిద్దరివీ గొలుసుకట్టు రాతలే.. వాళ్ళ ఉత్తరాలు చదివీ చదివీ నాకు చదవడం పట్టు బడింది కానీ, రాయడానికి ప్రయత్నించ లేదండీ!! అలా నాది కూడా 'కోడి కెలుకుడు' రాతే.. ఈ గొలుసు కట్టు చూడగానే ప్రాణం లేచొచ్చింది కానీ, పరాయి వాళ్ళ ఉత్తరాలు చదవకూడదని ప్రయత్నించలేదు.. అన్నట్టు, 'కోమలి గాంధారం' ఇంకా పూర్తి చేయలేదా? ఏమంత పెద్ద పుస్తకం చెప్పండి?!

ఆ.సౌమ్య said...

@ పక్కింటబ్బాయి గారూ
పద్యాల్లో ఉత్తరాలా...బలే బలే!
తప్పకుండా పెట్టండి...ధన్యవాదములు!

@ Indian Minerva
అవునండీ అలవాటయితే వేగంగా రాయొచ్చు ఈ వ్రాతలో
Boustrophedon గురించి ఇంతకుముందు తెలీదు. ఇప్పుడు మీరు చెప్పాక వికీలో చదివాను...amazing, very interesting! thanks for sharing this info!

ఆ.సౌమ్య said...

@ అప్పు
నువ్వెప్పుడూ వినలేదా దీని గురించి! భలే...అయితే ఈ విషయం బ్లాగులో పంచుకోవడం మంచిదయింది కదా!
ఊ నువ్వు కూడా ప్రయత్నించి చూడు...చాలా కష్టం కానీ మజా వస్తుంది...ట్రై చెయ్యి.
ధన్యవాదములు!

@ సుజాత గారూ
అవునా, మీ ఇంట్లో ఉండేవా...అయ్యయ్యో దాచవలసిందండీ!

మా నేలమాళిగల్లో రత్నాల్లాంటి ఈ జ్ఞాపకాలే తప్ప...అబ్బే రత్నాలు అవీ ఎక్కడండీ! :)

ఆ.సౌమ్య said...

@ మురళీగారూ
అవునా, మీకు చదవడమొచ్చా...బలే బలే!
చదవడం వస్తే రాయడం సులువుగా వస్తుందేమో కదండీ!

కోమలి గాంధారానికి మధ్యలో పెద్ద బ్రేక్ పడిందండీ..బ్రేక్ తరువాత మొన్ననే మళ్ళీ మొదలెట్టా. నాకు ఒక్కో పుస్తకానికి ఒక్కో టైమింగ్ ఉంటుంది...ఆ టైములో ఎంత అయితే అంత...మళ్ళీ మర్నాడు అదే టైములో చదువుతానన్నమాట. ఇలా అయితే ఎక్కువ పుస్తకాలు చదవగలనేమో అని అలా సెట్ చేసుకున్నా. :D అందుకని కాస్త లేట్ అవుతుంటుంది. ఇంకో రెండు రోజుల్లో అయిపోతుందిలెండి :)

కృష్ణప్రియ said...

డియర్ వీర్రాజు, విజయనగరం 17/10/59
ఇచ్చట అంతా క్షేమము. మీక్షేమం ..... చి || సీతా రామ రత్నం ఇప్పుడు కులాసా గా తిరుగు చున్నట్టు తలుస్తాను.
...గారు వచ్చి .... లు చ్చినారు. 629/58 7/9/59 రు లోగి .... భానుమతమ్మ అమలు చేయ్చున్నట్టు రూ 151.11.0 లు జప్తు చేసినట్టు కాగితం వచ్చనది. .. .. అటార్నీ .. తే. 20.10.59 కి ... వేసినారు. ఆ రోజున further steps ... తెలియ జేసెదరు. అందువల్ల .. తగలకుండా ఆ సొమ్ము కట్టి వేస్తె ఈ వ్యవహారం పూర్తీ గా పరిష్కారమయిపోతుంది. ... పత్రముకు లోబడి జప్తు చేయించినారు.

కాని ... .... తేదీ 151-11.0 లు తీర్చివేస్తే .. అమలు పూర్తీ పరిష్కారమవుతుంది. తన ... క.. నుంచి తీర్చ తేనీ .. .. తీర్చ తెలియ వచ్చును. గనుక .. చేయుటకు .. .. సహా రు. 155/- lu అక్షరములలో నూట యాభై ఐదు రూపాయలు .. అర్జెంటు గా ప్రగోడ పేరా .. మామ తో పైకం పంపిస్తే తే... రుటలో కట్టించి వేస్తాను. .... వగైరా కాగితం లో ప్రసాదముకు యిస్తున్నారు.... వాడి .. వద్దనే వుంచు తానని చెప్పినారు.

yours affly,
....

కృష్ణప్రియ said...

సౌమ్య,

ఏంటో .. ఒక ఉత్తరం అంత వరకూ చదవగలిగాను.
అర్థం కానివి చుక్కలు పెట్టి వదిలేసాను. మీకు అర్థం అయితే.. సరదాగా పూర్తి చేసి చూద్దాం...

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

బావుందండి మీ గొలుసుకట్టు టపా.ఉత్తరాలు చదవడానికి ప్రయత్నించా కానీ ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు

బులుసు సుబ్రహ్మణ్యం said...

గొలుసుకట్టు వ్రాతలు, డాక్టరు గారి ప్రిస్క్రిప్షన్ ఒకే జాతికి చెందినవి. వ్రాసిన తరువాత వ్రాసిన వాడు కూడా చదవలేడు.ఆ యొక్క దేముడు ఉండమట్టి, మా ఇంట్లో ఎవరికీ ఈ వ్రాతలు అలవాటు లేవు.

వేగంగా వ్రాయడానికే ఈ పద్ధతి ఉపయోగించే వారంటే నేను నమ్మలేకపోతున్నాను. అంత వేగం గా వ్రాసే అవసరం ఆ కాలం లో ఉందంటారా. బహుశా ఇంకేదైనా పరమార్ధం ఉండచ్చేమో. (ఉదా: చదివే వాడి బుర్ర వేడెక్కించటానికి).. చిన

ఆ.సౌమ్య said...

@కృష్ణప్రియ గారూ
మీరు గ్రేట్...నిజంగా మీకు అంతైనా అర్థమయింది...నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మీరు రాసినది చూసాక కూడబలుక్కుని చదివాను...మిగతాది ఊహూ అస్సలు అర్థం కావట్లేదు. మీరు భలే చదివారు.
ధన్యవాదములు!

@ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్
ధన్యవాదములు!
హహహ...నాదీ అదే పరిస్థితి!

@బులుసు గారూ
హహహ "చదివే వాడి బుర్ర వేడెక్కించటానికి"...ఏమో ఇది కారణం అయ్యుండొచ్చు!
ధన్యవాదములు!

మధురవాణి said...

నాకసలు ఇంగ్లీషులో గొలుసుకట్టు రాతే సరిగ్గా రాదు. ఇంకా తెలుగులో కూడానా.. కానీ, మీరు పెట్టిన ఉత్తరంలో భలే రాసారు కదా! నాకూ ఒక్క ముక్కన్నా అర్థం కాలేదనుకోండి.. అది వేరే విషయం.. :P