StatCounter code

Tuesday, April 17, 2012

సా..రీ...గా...మా..పాఆఆఆఆఆఆఅ....

అవి అత్యంత మధురాతి మధురమైన రోజులు....అనగా నా బాల్యము అన్నమాట :)
మా విజయనగరం సంగీతానికి పెట్టింది పేరు. మా ఇంటా, వంటా సంగీతమే..అందరూ బాగా పాడతారు. మా ఇంట్లో ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులున్నారు. చిన్న, చితక,ముసలి ముతక...అందరూ బాగా పాడతారు. నేను పుట్టకముందే నాకు సంగీతం నేర్పించాలని నిర్ణయం అయిపోయింది. నా మొదటి గురువు మా అక్క (పెద్దనాన్నగారి కూతురు - ఇప్పుడు ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు). అప్పట్లో సంగీతం అంటే ఎంత విసుగ్గా ఉండేదంటే....రోజూ క్లాసులు ఎలా ఎగ్గొట్టాలా అని ఆలోచించేదాన్ని. మనకి ముక్కులో గంగ, యమున అని రెండు జీవ నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఎప్పుడు. వాటి మిష పెట్టుకుని సంగీత పాఠాలు సుబ్బరంగా ఎగ్గొట్టేదాన్ని. మా అక్కకి పెళ్ళైపోయి విశాఖపట్నం వెళ్లిపోయింది.  హమ్మయ్య అని నేను గెంతేసాను. కానీ మా అక్క ఎందుకూరుకుంటుంది!....ఇంకో టీచర్ దగ్గర నన్ను పాఠానికి పెట్టేసి వెళ్ళింది. ఆ టీచరు దగ్గర ఓ నాలుగేళ్ళు కొంచం కుదురుగా సంగీత సాధన చేసాను. నేను శ్రద్ధగా, బాగా నేర్చుకున్నది ఆ నాలుగేళ్ళే! నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదుగానీ ఏమిటో ఆ టీచరు దగ్గర బాగా నేర్చుకున్నాను మరి! పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని...మా అక్క దగ్గర వెయ్యాల్సిన వేషాలన్నీ వేసి, వేరే టీచర్ దగ్గర సుబ్బరంగా నేర్చుకున్నాను. :)

నా జలుబు నన్ను వదలట్లేదు...గాత్రానికి ఇబ్బందిగా ఉంది. ఇలా లాభం లేదు, గాత్రం కంటే ఏదైనా వాయిద్యం నేర్పిస్తే మంచిది అని నాకు వయొలిన్ నేర్పిద్దామని నిర్ణయించారు. మా ఊరి సంగీత కాలేజీలో చేర్పిద్దామని ప్లాను. సంగీత కాలేజీలో మనకి తెలియని వాళ్ళు లేరు. అక్కడ అప్ప్లై చేసాము. అప్పుడు నేను 9th వెలగబెడుతున్నాను. అప్ల్లై చేసినవాళ్ళందరినీ ఒకరోజు ఇంటర్వ్యూకి పిలుస్తారు. గాత్ర సౌలభ్యం ఎలా ఉంది, నేర్పిస్తే ఏమైనా వస్తుందా రాదా అని పరీక్షిస్తారు. ఆ కాలేజీలో సన్యాసిరావుగారని గొప్ప వయొలిన్ విద్వాంసులు. ఆయనకి సంగీతం సర్కిల్ లో ఉన్న పేరు "పులి". కళ్ళు లేవు గానీ వయొలిన్ మాత్రం అద్భుతంగా వాయిస్తారు. ఆయన ఎవరికైనా పక్క వాయిద్యం వాయిస్తునారంటే పాడేవాళ్ళు భయపడతారు. అమ్మో పులే, జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకు పాడాలి అనుకుంటారు. అంత మహానుభావుడు. ఇదిగో ఈ ఇంటర్యూ ఆయనే చేస్తారన్నమాట. నాకు ఈ విషయం ముందే తెలిసి కాళ్ళల్లో వణుకు. ఆయనకి నేను పుట్టినదగ్గరనుండీ తెలుసు. మామూలుగా నాకు ఆయనతో మాట్లాడాలంటేనే భయం. ఎంతో ఆప్యాయంగా పలకరిచేవారు కానీ నేను భయపడుతూనే ఉండేదాన్ని. అలాంటిది ఆయన ఇంటర్వ్యూ చేస్తారని వినగానే పై ప్రాణాలు పైనే పోయాయి. అసలే ఇలాంటి పరీక్షలు ఎఱుగను..చిన్నతనం కూడాను.

ఆ రోజుకి ముందే ఒక వారం రోజులు కల్యాణి రాగంలో గీతాన్ని తీవ్రంగా సాధన చేసాను. బ్రహ్మాండంగా వచ్చేసినా కూడా భయం కొదీ విపరీతమైన సాధన చేసాను. ఆ రోజు రానే వచ్చింది. మా నాన్నగారితో పాటు సంగీత కాలేజీకి వెళ్ళాను. ఒక క్లాసు రూములో గురువుగారు కూర్చుని, వచ్చినవాళ్ళల్లో ఇద్దరిద్దరిని లోపలికి పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. నా వంతు వచ్చింది. నేను ఇంకో అబ్బాయి వెళ్ళాము. లోపలికెళ్లగానే "నమస్కారం మేషారు" అన్నాను. నా గొంతు పోల్చేసారు. "సౌమ్య, వచ్చావా...కూర్చో" అని పలకరించారు. నేను, ఆ ఇంకో అబ్బాయి కూర్చున్నాము. ఈ గండం గట్టెక్కేదెలాగో నాకు బోధపడలేదు. అసలు  ఆయన ముందు కూర్చుంటే నా గొంతు పెగులుతుందో లేదో అని భయం! లోపల్లోపల దేవుడికి దణ్ణాలు పెట్టేసుకున్నాను. మాఊరి చిన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో కొబ్బరికాయలు, పైడితల్లి అమ్మవారికి ప్రదక్షిణాలు, అయ్యకోనేరు గట్టు మీద ఆంజనేయస్వామికి రెండు రూపాయిలు మొక్కేసుకున్నాను (అప్పట్లో భక్తి విపరీతంగా ఉండేది). :) కల్యాణి గీతం పాడేసుకున్నాను మనసులో మరోసారి. ఈ తతంగమంతా మనసులోనే కానిచ్చేస్తూ నాతోపాటు వచ్చిన కుర్రాడిని చూసాను. నాకన్న కాస్త పెద్దవాడు. ఎక్కడో చూసినట్టే అనిపించింది. మా విజయనగరం చిన్న ఊరే కదా...దాదాపుగా జనాలందరూ బాగానే తెలుస్తారు. నేనేమో  దేవుడా దేవుడా దేవుడా...అనుకుంటూ ఉంటే ఆ కుర్రాడు మామూలుగా ఉన్నాడు. టెన్షన్ లేదు. నవ్వుతూ, అటు ఇటూ పరికిస్తూ ఆ గది తాలూక దూలాలు లెక్కబెడుతున్నాడు. ఇంతలో గురువుగారు మొదట ఆ అబ్బాయిని పిలిచారు. వెళ్ళి ఆయన ఎదురుగా కూర్చున్నాడు. మొదట పేరు, చదువు వివరాలు అడిగాక

"సంగీతం వచ్చా బాబూ?"

"రాదండీ, నేర్చుకోలేదు."

"అలాగా! పాటలు పాడుతూ ఉంటావా?"

"లేదండీ, పెద్దగా పాడను."

సరే పోనీ, ఏదైనా నీకు తెలిసిన ఒక పాట పాడు."

"సినిమా పాటలే వచ్చు."

"సరే నాయనా, అదే పాడు."

చికుబుకు చికుబుకు రైలే.....అదిరెను దీని స్టైలే!
చక్కనైన చిక్కనైన ఫిగరే....అది ఓకే అంటే గుబులే....

పైశృతిలో మొదలెట్టాడు. నాకు మొదట షాకు, తరువుత నవ్వు. మేషారి వైపు చూసాను. ఆయన మొహంలో ఏ భావమూ లేదు. వింటున్నారు. నాకు నవ్వాగట్లేదు. అసలేంటిది...పాట పాడమంటే అదేనా దొరికింది? జెంటిల్ మేన్ సినిమా అప్పుడే వచ్చింది. పాటలు ఒక ఊపు ఊపుతున్నాయి. అయితే మాత్రం! ఆ పాటా పాడతాడా అంతటి మహా విద్వాంసుడి ముందు? నాకు అంత నవ్వులోనూ కోపం కూడా వచ్చింది. ఏంటసలు బుద్ధి లేకుండా అని కొంచం విసుక్కున్నాను కానీ నవ్వాపుకోవడం నావల్ల కాలేదు. ఆ అబ్బాయి మాత్రం పూర్తిగా లీనమైపోయి పాటంతా పాడేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను నా టెన్షను, భయం అన్ని మర్చిపోయి పూర్తిగా రిలాక్స్ అయిపోయాను :D తెరలు తెరలుగా నవ్వొచ్చేస్తున్నాది. ఇంక అక్కడ కూర్చోలేక మంచినీళ్లకోసమని బయటకి వచ్చి పగలబడి నవ్వాను. బయట మా నాన్నగారు కూర్చున్నారు. ఏమయింది అని అడిగారు. ఆ పాట గురించి చెప్పి ఒకటే నవ్వు. కష్టపడి నవ్వాపుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను. ఆ కుర్రాడు పాట పూర్తిచేసాడు. గురువుగారు ఏమంటారో అని కుతూహలంగా చూస్తూ కూర్చున్నా. ఆయన మాత్రం గంభీరంగా "ఊ" అని మాత్రమే అనేసి ఆ అబ్బాయిని పంపించేసారు. 

ఈ దెబ్బతో నాకు ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వచ్చేసింది. మేరుపర్వతం పై అంచున కూర్చున్న భావం కలిగింది ఎందుకో! నాకు తెలుసు నేను పాడబోయే గీతం గురువుగారిని అలరిస్తుందని...నాకు సీటు ఖాయమని. ఇంక అంతే...ఎనలేని ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంగా, శ్రద్ధగా గీతం పాడాను. ముగించగానే మేషారు చిరునవ్వు నవ్వుతూ

"ఇంత బాగా పాడుతున్నావు, నీకు సీటు రాకపోవడమేమీటి! దీనికేనా మీ నాన్న అంత కంగారుపడిపోయాడు!" అన్నారు చనువుగా.

నాకు పట్టరాని ఆనందం కలిగింది. 

"వెళ్ళిరా, మళ్ళీ వారం నుండీ పాఠాలు మొదలవుతాయి....వచ్చేయ్" అన్నారు.

బయటకి హుషారుగా గెంతుకుంటూ వచ్చేసాను. మా నాన్నగారు కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు కాబోలు ఈ మాట విని చాలా సంతోషించారు.

తరువాతేముంది నేను సంగీత కాలేజీలో చేరడం ఒక సంవత్సరం వయొలిన్ వెలగబెట్టడం...పదో క్లాసుకొచ్చానన్న మిషతో ఎగ్గట్టడం అన్నీ అయిపోయాయి.

ఇంతకీ విషయమేమిటంటే ఆ అబ్బాయికి కూడా సీటు ఇచ్చారు. ఆ అబ్బాయి "చికుబుకు రైలే" అన్నా చక్కగా శృతిలో పాడాడని, నేర్పిస్తే సంగీతం వస్తుందని భావించి సీటు ఇచ్చారు. నేను, తను ఒకేసారి జాయిన్ అయ్యాం. క్లాస్ మేట్స్ అయిపోయాం. తను, నాకంటే ఏడాది పెద్దవాడు. మంచి కుర్రాడు. నన్ను "చెల్లి" అనేవాడు. ఇద్దరికి బాగా పరిచయం పెరిగాక నేనడిగాను "అదేం పాట, గురువుగారి ముందు ఆ పాటెలా పాడగలిగావ్? అని. "నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు. గురువుగారు అలా ఠక్కున ఏదైన పాడమని అడగగానే నాకేం గుర్తు రాలేదు, అంతకుముందురోజు రాత్రి విన్న ఈ పాట తప్ప" అన్నాడు. మా  క్లాసులో అదో పెద్ద జోక్ అయిపోయింది. అందరూ తలుచుకుని తలుచుకుని నవ్వేవాళ్ళం. ఆ అబ్బాయి మొదట్లో కొంచం ఉడుక్కునేవాడుగానీ తరువాత మాతోపాటు నవ్వేసేవాడు. ఆ తరువాత చాలా యేళ్ళు ఈ పాట పేరుతో ఆ కుర్రాడిని నేను ఏడిపించేదాన్ని. ఇప్పుడెక్కడున్నాడో ఏంటో! ఏం పాడుతున్నాడో! :P

ఇదే మా సంగీత కాలేజీ





P.S. అప్పట్లో సంగీతమంటే విసుకున్నానుగానీ ఓ ఇరవయ్యేళ్ళు వచ్చాక సడన్ గా సంగీతం మీద శ్రద్ధ పుట్టింది. కానీ అప్పటికి నేను నేర్చుకునే పరిస్థితి లేదు. ఏదో పాడుకుంటూ ఉండేదాన్ని. మా అక్క నా పాట విని "అయ్యో, ఎందుకే అప్పుడు శ్రద్ధగా నేర్చుకోలేదు?" అని బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ మొదలెడదామంటే ఇప్పటికీ కుదరట్లేదు. ఈ విషయం నాకెప్పుడూ బాధగానే ఉంటుంది....అయ్యో, అన్నీ చేతిలోనే ఉంచుకుని బుద్ధిగా, శ్రద్ధగా నేర్చుకోలేకపోయానే అని! :(