StatCounter code

Thursday, September 29, 2011

అవినీతా? అంటే?

ఢిల్లీలో ఏ గల్లీలో చూసినా పోలీసులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తారు. ఇదేదో బలే బావుందే...చక్కగా మనకి ఎంత రక్షణ అని మురిసిపోయేలోపే వాళ్ళ ప్రతాపాలు తెలిసి ప్రాణం బిక్కుబిక్కుమంటుంది. ఒక పెద్ద రోడ్డు మీద సాయంకాలం అయిన దగ్గరనుండీ రెండు వైపులా పెద్ద పెద్ద గేటుల్లాంటివి పెట్టేసి మధ్యలో కాస్త దారి మాత్రమే వదులుతారు. కార్లన్నీ ఒకదాని వెనుక క్యూలో వెళ్లాలన్నమాట. ఇది ఎందుకయ్యా అంటే...అది రద్దీ రహదారి కాబట్టి కాస్త చీకటి పడగానే తాగేసి ఎవరైనా డ్రవ్ చేస్తూ అటుగా వచ్చి మిగతా వాహనాలకు ఇబ్బంది కలిగిస్తారేమొనని. తాగి డ్రైవ్ చేసినట్టు పట్టుబడితే శిక్ష చిన్నది కాదు. అందుచేత అందరూ ఒళ్ళు దగ్గరపెట్టుకుని రండి అని చెప్పకనే చెప్పడం అన్నమాట. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ అక్కడ జరిగే అసలు విషయమేమిటంటే ఆ మధ్యమార్గం గుండా కార్లన్ని వరుసపెట్టి వదిలేస్తుంటారు. కానీ అటుగా వచ్చే ప్రతి ఒక్క ద్విచక్ర వాహనాన్ని ఆపేసి పక్కన నిల్చోబెడతారు. వరుసగా అందరి దగ్గరా లైసెన్సు, RC చూసి ఓ వంద నొక్కేస్తుంటారు. విధిగా ప్రతీ బైక్ ని ఆపుతారు. నేను రోజూ ఆ రోడ్డు గుండా వెళుతుంటాను. సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు రోజూ కనీసం ఐదు బైకులు పక్కన నిలబడి ఉండడం చూస్తాను. ఒకరోజు, ఒక సమయానికి ఐదు బైకులు అంటే ఐదువందల రూపాయలు. ఈ లెక్కన లెక్కేస్తే వాళ్ళ రోజు సంపాదన, నెల సంపాదన లెక్కించడానికి ఏ శ్రీనివాస రామానుజమో దిగి రావాలి. లైసెన్సు, RC చూపించాక కూడా వంద ఎందుకు అని అడిగావో మరుక్షణం నువ్వు జైలో ఊచలు లెక్కెడుతుంటావు. అలా అడిగిన పాపానికి ఒకతన్ని రెక్కీడ్చుకుపోయి బొక్కలో తోసిన సన్నివేశం ఒకటి చూసాను.

న్యూ డిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర, ఓరోజు మా కార్ లో వెళ్తున్నాం. మేము ఎడమవైపుకి తిరగాలి. తెలీకుండా ముందుకి లాగించేసాం. అరె సందు మిస్ అయిపోయామే ఇప్పుడెలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ, మెల్లిగా నడుపుతుండగా పోలీసు తలుపు కొట్టాడు. ఏమిటయ్యా అని అడిగితే ఇది one way అన్నాడు. అదేమిటి ఎదురుగుండా లారీలు వెళుతున్నాయిగా అని అడిగితే పెద్ద వాహనాలకి తప్ప చిన్న వాహనాలకి దారి లేదన్నాడు. ఇదేం విచిత్రం అనుకుంటుండగా లైసెన్సు, RC అడిగాడు. తీసి చూపించాము. మాకు అది one way అని తెలీదు. ఎక్కడా బోర్డు రాసి లేదు. ముందు వాహనాలు వెళుతుంటే two way అనుకున్నాం అని చెప్పాము. ఐదొందలు ఇవ్వు అంటూ మా లైసెన్సు, RC ని చేతుల్లో ఆడించాడు. ఐదొందలంటే మరీ ఎక్కువని బ్రతిమలాడడం మొదలెట్టాం. ఓ ఐదు నిముషాలు పోయాక వందకి ఒప్పుకున్నాడు. వంద వాడి మొహాన కొట్టి బ్రతుకు జీవుడా అనుకున్నాం. మరునాడు అదే రూటులో వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు చూస్తే అక్కడ one way లేదు, కాదు. పక్కనున్నవాళ్ళని అడిగాము. అక్కడ one way ఎప్పుడూ లేదు అని చెప్పారు. అప్పుడప్పుడూ పోలీసులు ఉంటారు తప్ప one way లేదు అన్నారు. మాకు విషయం బోధపడింది. మా లైసెన్సు, RC వాడి చేతుల్లో ఉన్నాయి..ఏం చేస్తాం వంద కాదు, వెయ్యి అడిగినా ఇచ్చుండేవాళ్లమే!

లైసెన్సు అంటే గుర్తొచ్చింది...ఆ మధ్య మేము కొత్త two wheeler కొన్నాం. లైసెన్సు కోసమని RTO ఆఫీసుకి వెళ్ళాం. అక్కడ ఏదీ సక్రమంగా లేదు. ఏ కౌంటర్ నుండి ఏ కౌంటర్ కి వెళ్ళాలో చెప్పే నాధుడే లేడు. సరే ముందు అప్ప్లికేషన్ తీసుకుందామని వెళితే ఐడి ప్రూఫ్ చూపించమన్నాడు. పాస్ పోర్ట్ తీసి చూపించా. కుదరదన్నాడు. ఏమి? అన్నాను. ఇందులో హైదరాబాదు అడ్రస్ ఏదో ఉంది డిల్లీ అడ్రస్ కావలన్నాడు. అయ్యా నేను ఈ భారతదేశ పౌరురాలిని అని తెలియజెప్పే ఏకైన మౌలిక పత్రం ఇది అన్నాను. నాకనవసరం అన్నాడు. పాస్ పోర్ట్ చెల్లదా అంటే చెల్లదు అని తెగేసి చెప్పాడు. నోరు వెళ్లబెట్టి ఆశ్చర్యపోవడం మావంతయింది. ఇక్కడే కాదు ఢిల్లీలో ఏ గవర్నమెంటు ఆఫీసులోనూ పాస్ పోర్ట్ చెల్లదని తరువాత అర్థమయింది. ఆహ ఏమి నా దేశ సౌభాగ్యము...ఈ దేశ పౌరునిగా ముద్ర వేసిన ప్రభుత్వానికే ఇది చెల్లదు అని తేల్చిచెప్పుచున్నారు!

సరే ఇంకేం చేస్తాం లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఒకటిచ్చి అప్లికేషన్ తెచ్చుకున్నాం. నింపి ఒక కౌంటర్ లో ఇచ్చాం. "ఇక్కడ కాదు" అని గసిరింది ఆవిడ. మరెక్కడ అంటే జవాబులేదు. కన్నెత్తి చూడనైనాలేదు. అక్కడెక్కడా help counter లేదు. ఏమి గతి అనుకుంటూ మరో మహానుభావుడిని పలకరించాం. గురుడు కొంచం సాధుజీవిలా ఉన్నాడు...గసరడానికి ఓ పిసరు తక్కువగా "ఆ కౌంటకి వెళ్ళండి" అని సమాధానమిచ్చాడు. అదే పరమాన్నం అనుకుని ఆ కౌంటర్ లో ఇచ్చాము. అతగాడు అఫిడవిట్ కావలన్నాడు. నాయనా, ఇదియునూ భారత ప్రభుత్వం దాఖలు చేసిన పత్రమే, ఇందులో నా అడ్డ్రస్ ప్రూఫ్ కూడా సరిగానున్నది, అఫిడవిట్ ఎందులకు అని అతి మృదువుగా అడిగితిని. "ఎందులకూ లేదు గిందులకూ లేదు ఆ పక్క సందులోకి పోయి అఫిడవిట్ పట్రా" అని ఓండ్ర పెట్టాడు. పక్కసందులోకి పోయి చూచితిమిగదా....ఒక మనుజుడు, నల్ల కోటు ధరియించి, రహదారి పక్కన ఒక బల్లయును, కుర్చీయును వేసుకుని తారసిల్లినాడు. మేము అచ్చటకిబోయి ఓ మనుజుడా మాకు అఫిడవిట్ ప్రసాదింపుము అని శాంతముగా అడిగితిమి. 50 కొట్టు అన్నాడు. ఏమి ఏమేమి, ఒక చిన్న సంకతమునకు 50 రూప్యములా...హెంతమాట హెంటామాట అని అన్నగారి స్టైల్ లో మునివేళ్ళపై లేచి రెట్టించుదామనుకున్నాను గానీ ఆ మానవుడు ఎర్రగా చూసి "అవును, 50 ఇవ్వు" అని గద్దించాడు. మేము ఈ చేతను 50 ఇచ్చి, ఆ చేతను అఫిడవిట్ పుచ్చుకుని మరల RTO కి ఏతెంచితిమి. మాలాంటి సజ్జనులు, అమాయకులు ఒకరోజుకి ఎంతమంచి ఏతెంచెదరో! ప్రతీ ఒక్కని దగ్గర 50 రూప్యములు నొక్కిన అతని ఆదాయము నెలకి ఎంత వచ్చునో లెక్కింప మానవమాత్రునికి సాధ్యం కాదు.

పిమ్మట ఆ form ని సమర్పించుకుని కౌంటర్ తరువాత కౌంటర్ కి వెళుతూ ఉన్నాం. నాలుగో కౌంటర్ లో ఒకమ్మాయి, వయసు 25 కి మించదు...ఎంతసేపు నిల్చున్నా పలకదు, ఉలకదు. పలకరిస్తే కన్నెత్తి చూసిందే తప్ప పెదవి విప్పదు. ఏం చెయ్యాలో తెలియక కొంచం స్వరం పెంచాను. బాణంలా దూసుకొచ్చింది జవాబు "ఏం కాసేపు ఆగలేరా? ప్రతీఒక్కరికీ జవాబు ఇవ్వడమేనా మా పని? మీ అర్జీ చూసాక బదులిస్తాను" అంది. నాకు ఒళ్ళు మండిపోయింది...మేము పశువులమనుకుంటున్నారా, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని స్వరం పెంచాను. నా అర్జీని నా చేతిలో పెట్టి "నీ దిక్కున్నచోట చెప్పుకో నీ అప్ప్లికేషన్ ముందుకి వెళ్ళనివ్వను" అంది. నేను ఇంకాస్త గట్టిగా అరిచాను. చిన్న సైజు రామ-రావణ యుద్ధమే జరిగింది. ఇంత జరుగుతున్నా మిగతా సభ్యులు నోరుమెదపరే! కొందరు ఆసక్తిగా వింటున్నారు, ఇంకొందరు రోజూ ఉండే గొడవేగా అన్నట్టు తమపని తాము చేసుకుపోతున్నారు. అరిచి అరిచి నాకే విసుగొచ్చి పక్క కౌంటర్ కి వెళ్ళాను. అతనికి నాపై జాలేసినట్టుంది...కరుణించి నా అర్జీని ముందుకి తీసుకెళ్ళాడు పెద్దగా చిరాకుపడకుండా. ఈ అగచాట్లు అన్నీ పడ్డాక టెస్ట్ రూములోకి వెళ్ళాను. అక్కడున్న పెద్దమనిషి కుక్కని చూసినట్టు చూసి "అక్కడ కూర్చో, ఆ టెస్ట్ రాయి" అని విసుక్కున్నాడు. అదేదో తగలెట్టి, అతని దగ్గరకెళ్ళి నా పేరులో చిన్న మార్పుని సూచించాను. అంతే అతను కయ్యిమని అరిచాడు "మేమేం పనిపాట లేకుండా ఉన్నామనుకున్నారా మీ ఇష్టమొచ్చినట్టు మార్చడానికి" అంటూ చిందులు తొక్కాడు. నేను అప్లికేషన్లో సరిగ్గానే రాసాను కానీ వాళ్ళు తప్పు టైపు చేసారు అని చెప్పినా వినిపించుకోడే! నిజంగా పురుగుని చూసినట్టే చూసాడు. అప్పటికే నాకు తలనొప్పి వచ్చేసింది. అసహ్యం, విసుగు, కోపం...ఒకటేమిటి చీ ఈ లైసెన్సు నాకవసరమా, ఎంతదూరమైనా నడిచి వెళ్ళిపోతే ఇంతకన్నా హాయి కదా అనిపించింది. చివరి ప్రశ్నగా ఎన్నాళ్లలో learner లైసెన్సు పంపిస్తారు అని అడిగాను. "ఏమో, ఎప్పుడొస్తే అప్పుడొస్తుంది, మాకేం తెలుసు..మీ ఇంటికొస్తుంది అప్పుడు చూసుకోండి" అని సమాధానం. ఇంక అక్కడ ఒక్క క్షణం ఉన్నా మహా పాపం చుట్టుకుంటుంది అన్నట్టు వడివడిగా బయటికొచ్చేసాము. తెలిసినవాళ్ళకి ఈ ఉదంతం చెబితే ఇక్కడ అలాగే ఉంటారు, అలాగే మాట్లాడతారు...అసలు మీకెందుకీ బాధ, మిమ్మలని ఎవరెళ్ళమన్నారు, ఏజెంట్ కి ఇచ్చేస్తే వాడే అన్నీ చేసి పెడతాడు. ఓ 2000 వాడి మొహాన కొట్టండి అన్నారు. అప్పటికే పాలిపోయి ఉన్న మా మొహాలు మరింత తెల్లబోయాయి.....ఇదేమి విచిత్రం! మానవమాత్రులు RTO కి వెళ్ళి లైసెన్సు సులువుగా తెచ్చుకోలేరా! సరే, ఎలాగోల లెర్నర్ వచ్చింది. ఆరు నెలలు గడిచాక లైసెన్సు తెప్పించుకుందామనేలోపు కారు కొన్నాం. మళ్ళీ RTO ఆఫీసు గుర్తొచ్చి ఏడుపొచ్చింది. ఏమిదారి అనుకుంటుండగా ఏజెంట్ విషయం గుర్తొచ్చింది. ఒక driving school కి వెళ్ళి మాట్లాడాము. 15 రోజులు డ్రైవింగ్ క్లాసులు, లైసెన్సు పని కలిపి 4000 అన్నాడు. మూర్ఛ రాబోతుండగా ఆపుకుని సరే అన్నాము.

ఈసారి RTO ఆఫీసు లో బలే తమాషా జరిగింది. మా ఏజెంట్ వెనకల వెళ్లాం. అప్లికేషన్ నింపి ఇచ్చేసాం. అంతే, కాసేపు కూర్చోమన్నాడు. బుద్ధిగా కూర్చున్నాం. ఓ 15 నిముషాలలో వచ్చి అన్నీ అయిపోయాయి అని చెప్పి టెస్ట్ రూముకి పంపించాడు. అక్కడున్న అసిస్టంట్ తో ఏదో చెప్పాడు. నేను కంప్యూటర్ ముందు కూర్చున్నాను. mouse నా చేతిలో లేదు. మొదటి ప్రశ్న వచ్చింది. "జవాబేమిటి?" అన్నాడు. చెప్పాను...అది తప్పయింది. ఇంక అంతే రెండో జవాబు నుండి నేను నిమిత్తమాతృరాలినే....అతగాడే టకటకమని జవాబులు నింపేస్తూ ముందుకి పోతున్నాడు. మధ్యలో కావాలనే కొన్ని తప్పు జవాబులిచ్చాడు. అన్నీ కరక్ట్ అయితే అసలు నిజం తెలిసిపోతుందనో ఏమో! మొత్తానికి 20 కి 16 మార్కులు వచ్చాయి నాకు....కాదు కాదు అతనికి. బయటికొచ్చేసాము. "మీరు వెళ్ళిపోండి మేడం రెండు రోజుల తరువాత లెర్నర్ ఇంటికి పంపిస్తాను" అన్నాడు. ఆహా ఏమిటీ...20 నిముషాలలో అంత అయిపోయిందా!...కేకలు, అరుపులు, తగవులు, చికాకులు లేకుండా! నిజమే! నమ్మబుద్ధి కాలేదు. అబ్బ 4000 లకి ఎంత శక్తి! ప్రశాంతంగా ఇంటికి వచ్చేసాము. రెండు రోజుల్లో లెర్నర్ వచ్చింది.

నెలరోజులలో నేను కారు ఓ మోస్తరుగా నడిపి నేర్చుకునాను. ఇప్పుడు లైసెన్సుకి వెళితే ఎనిమిది వెయ్యమంటారో ఏడున్నర వెయ్యమంటారో ఏం దారి దేవుడో అని బిక్కుబిక్కుమంటూ మా ఏజెంట్ వెనకాల వెళ్ళి మళ్ళీ RTO గుమ్మం తొక్కాము....ఈసారి ఇంకా మజా వచ్చింది. మరో form నింపమన్నాడు. నింపేసి ఇచ్చాము. 10 నిముషములు కూర్చోబెట్టాడు. తరువాత మా ఏజెంట్ మరొకతనితో కలిసి మా దగ్గరకి వచ్చి నన్ను చూపించి "ఈమెకే లైసెన్సు కావాలి, జాగ్రత్తగా మనిషిని చూడు" అని చెప్పేసి దూరంగా కౌంటర్ లో ఉన్న వ్యక్తికి నా పేరు గట్టిగా అరిచి చెప్పి "చూసుకో" అన్నాడు. అంతే, "మీరింక వెళ్ళిపోండి మేడం. ఒక వారం రోజులలోగా లైసెన్సు ఇంటికి తెచ్చి ఇస్తాను" అన్నాడు. నేను విస్తుపోతూ "అయిపోయిందా, మరి డ్రైవింగ్ టెస్టో అన్నాను" మా ఏజెంట్ నన్నో పల్లెటూరిదానిలాగ చూసి, ఓ చిన్ననవ్వు నవ్వి "అవన్నీ అక్కర్లేదులెండి" అన్నాడు. వాహ్ వాహ్...బలే బలే, నాకు కారు నడపడం వచ్చో రాదో చూడకుండా నా చేతిలోకి లైసెన్సు వస్తుంది. ఆహా మన ప్రభుత్వము ఎంత బాగా నడుస్తున్నదో కదా అని మిక్కిలి సంతసించితిమి. ఈ వ్యాపారం చిన్నదేం కాదు. ప్రతీ సందుకీ ఓ డ్రైవింగ్ స్కూలు ఉంది. ప్రతీవాళ్ళు ఈ ఏజెంట్ల ద్వారానే లైసెన్సు తెచ్చుకుంటారు.

అదేరోజు, సరిగ్గా అదే సమయానికి అటుపక్కగా "అన్నహాజారే కి సపోర్ట్ ఇవ్వాలి" అంటూ జెండాలు పట్టుకుని ర్యాలీ వెళుతున్నాది. "ఈ అన్నాహజారే ఏంది భయ్, ఈ అవినీతి ఏంది భయ్, ఏం సమజౌతలే" అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మా చెవులబడింది. అవును, అసలింతకీ అవినీతి అంటే ఏమిటి?

తా.క: అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికైనా ఈ అవినీతి తప్పదు. అది దాని లక్షణం. అమెరికాకి తప్పలేదు, జర్మనీకి తప్పలేదు...మనకీ తప్పదు.

Friday, September 16, 2011

ఎం.ఎస్.జన్మదినం-చిరు కానుక


ఇవాళ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి పుట్టినరోజు. కంచిపట్టు చీర మీద ముత్యం దొర్లినట్టుగా ఉండే ఆవిడ గానం...అమృతం!

పొద్దున్నే లేచి ఆవిడ పాడిన సుప్రభాతం వినని తెలుగిల్లు ఉంటుందా! ఎంత పుణ్యం చేసుకున్నామో ఆవిడ మనకు వరం గా దొరికారు. ఆవిడ గాత్రాన్ని విని మనం జన్మలు ధన్యం చేసుకున్నాం! ఆవిడ గురించి తెలియనిదెవరికి! నేను కొత్తగా చెప్పేదేమీలేదుగాని ఈరోజు ఆవిడ జన్మదిన సందర్భంగా మితృలకు ఓ చిరు కానుక. సుబ్బలక్ష్మి గారూ ఇంగ్లీషులో పాడిన పాట...విని ఆనందించండి.



Friday, September 2, 2011

సహాయం చెయ్యండి...ప్లీజ్! (updated)

Up date -1 (02-09-2011)

ప్రతీక్ కి సొంత అక్కచెల్లెళ్ళు, అన్నాదమ్ములు ఉంటే వాళ్ళ బోన్ మేరో తో ప్రతీక్ బోన్ మేరో 99% మేచ్ అవుతుంది కాబట్టి పని సులువయ్యేది. కానీ ప్రతీకే మొదటి బిడ్డ. తన తల్లి బోన్ మేరో ని టెస్ట్ చేసారు. రిపోర్ట్స్ నిన్న సాయంకాలం వచ్చాయి. తల్లి బోన్ మేరో తో కుదరదని చెప్పారు. కాబట్టి ఆ option కూడా మూసుకుపోయింది. ఇంక డోనర్స్ కోసం వేచి చూస్తున్నారు. కేసు ఇంకా complicate అయ్యింది. ఇప్పుడు డోనర్ involve అయి ఉన్నారు కాబట్టి కావలసిన డబ్బు 20 లక్షలు దాటుతుందని అంచనా. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అది కనుక మంజూరు అయితే 10 లక్షలు వస్తాయి. అయినా కూడా ఇంకా 15-20 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. దయచేసి సహాయం చెయ్యండి. చిన్నారి ప్రతీక్ ని బ్రతికించండి.

Actual (01-09-2011)

ముందుగా బ్లాగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు!

ఈ పండుగ రోజు ఇటువంటి విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు బాధగా ఉంది కానీ తప్పట్లేదు.

నా స్నేహితుడు దూసీ శ్రీనివాస్, చీపురుపల్లి వాస్తవ్యుడు, ఇప్పుడు హిస్టరీలో phd చేస్తూ, DL పాస్ అయి, భద్రాచలం లో గవర్న్మెంట్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. నేను శ్రీనివాస్ MA కలిసి చదువుకున్నాము HCU లో. అతని చెల్లెలు పద్మజ తరువాత మా HCU లోనే ఆంత్రపోలజీలో MA చేసింది. హాస్టల్ లో తను నా రూములోనే ఉండి HCU పరీక్షకి ప్రిపేర్ అయ్యేది. దానితో పద్మ కూడా నాకు బాగా క్లోజ్ అయింది. MA పూర్తి అయిన వెంటనే పద్మజ కి పెళ్ళి అయింది. తన భర్త వైజాగ్ లో ఉద్యోగి. వాళ్ళకి ఆరునెలల క్రితం బాబు పుట్టాడు. బుల్లబ్బాయి గారిని చూసి తల్లిదండ్రులు మురుసిపోతూ పెద్దల ఆశీర్వాదంతో, అందరి సమక్షంలో ప్రతీక్ అని పేరు పెట్టారు. మూడు నెలలు గడిచిన తరువాత రాకుమారుడు ఎనీమిక్ గా ఉన్నాడని తెలిసి డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్ళారు. కొంతకాలం ట్రీట్‌మెంట్ జరిపాక తెలిసిన భయంకరమైన నిజం ఆ తల్లిదండ్రులను, మేనమామను కుదిపేసింది. పిల్లాడికి బోన్ మేరో ట్రాన్స్‌ప్లాన్టేషన్ చెయ్యాలి. ఎక్కడో లక్షలలో ఒకరికి సంక్రమించే ఈ వ్యాధి మా చిన్నారి ప్రతీక్ కి దాపురించడం విచారకరం. ప్రతీక్ కి ఇప్పుడు ఆరునెలలు. తను ఇప్పుడు వెల్లూర్ CMC ఆస్పత్రిలో ఉన్నాడు. బాబుకి నాలుగు వారల లోపు బోన్ మేరో ట్రాన్స్‌ప్లాన్టేషన్ జరగాలి. దానికి 20 లక్షలు ఖర్చు అవుతుంది. నా స్నేహితుడి కుటుంబం మనలాంటి మధ్య తరగతి కుటుంబమే. 20 లక్షలు అంటే భరించలేనంత భారం. నా మితృడు ఎలాగైనా అష్టకష్టాలు పడి fund raise చెయ్యాలని చూస్తున్నాడు. అందులో భాగం గా ఈ కింది బ్లాగు మొదలెట్టాడు. ఈ బ్లాగులో అన్ని వివరాలు ఇవ్వబడ్డాయి. అన్నీ చదివి ఆ చిట్టిబాబుని బతికించడానికి మీకు చేతనైన సహయం చెయ్యండి...ప్లీజ్.


ఈ ఆపరేషన్ నెలరోజులలోపు జరగాలి. మీరు చేసేది ఎంత చిన్న సహాయమైనా సరే ఓ పసిప్రాణాన్ని కాపాడుతుంది. ఏ తప్పు చెయ్యని ఆ చిన్నారి ఆరునెలల వయసులో ఆస్పత్రిలో దీనంగా పడుకుని ఉన్నాడు. ఇంక వాళ్ళ అమ్మ పద్మజ పరిస్థితి వర్ణనాతీతం. మీకు చేతనైన సహాయం చేసి ఆ తల్లిని కడుపుకోతకి దూరం చెయ్యండి. ఆ చిన్నారి మొహం లో నవ్వులు పూయించండి. ఇది హాక్స్ మైల్ కాదు. నన్ను నమ్మండి. ఫోన్ నంబర్లు, బ్యాంకు వివరాలు అన్నీ పైన ఇచ్చిన బ్లాగులో ఉన్నాయి. గుర్తుంచుకోండి...సమయం చాలా తక్కువ ఉంది. నాలుగు వారాలలోపు ఆపరేషన్ జరగాలి. మీ సహయానికి వారి కుటుంబము, నేను ఎల్లప్పుడు కృతజ్ఞులుగా ఉంటాము. సహాయంతో పాటు బాబు తొందరగా కోలుకోవాలని ఆశీర్వదించడం మరచిపోకండి.