StatCounter code

Tuesday, August 9, 2011

మాయాబజార్ – పాండవులు లేని భారతం

మాయాబజార్ గురించి మరొక్కసారి...

నిన్న బజ్జులో అందరం మాయాబజార్ గురించి తలుచుకుని కొంతసేపు ముచ్చటించి ఆనందించాం. అలా ముచ్చటిస్తుంటే అంతకుముందెప్పుడో మాయాబజార్ గురించి నవతరంగం లో నేను రాసిన వ్యాసం గుర్తొచ్చింది.

వ్యాసంలో ఉన్న కొన్ని తప్పొప్పులను సవరిస్తూ మళ్ళీ ఇక్కడ....

మాయాబజార్ కొత్తగా రంగులద్దుకున్నవేళ నూతనకళతో మిలమిలా మెరిసిపోతోంది. కొత్తవన్నెలద్దడానికి సరియయిన సినిమానే ఎంచుకున్నారు పెద్దలు. మాయాబజార్ సినిమా ఒక అపూర్వమైన, అనన్యసామాన్యమైన కళాఖండం. ఈ సినిమాకి కథ, కథనం ఒక ఎత్తయితే, పింగళి వారి మాటలు, పాటలు ఇంకో ఎత్తు. నటీనటుల కౌశల్యం సరేసరి. మాయాబజార్ సినిమా తెలుగు సినిమాలోకానికి పెద్దబాలశిక్షవంటిది అని “నరేష్ నున్న” అన్నారు. ఇది అక్షరాలా నిజం.

మాయబజార్ – పాండవులు లేని భారతం. ఈ విషయం, సినిమా ఓ పది సార్లు చూసాకయినా ఎవరికీ తట్టదేమో. నిజం, పాండవుల ప్రస్తావన లేకుండా జరిగే కథ. ఈ కథని పూర్వం "శశిరేఖాపరిణయం" అనే పేరుతో కర్నాటక రాష్ట్రంలో వీధి నాటకాలుగా ఆడేవారట. దానికి ఒక మహోన్నత్తమైన స్థానాన్ని కలిపించింది మాత్రం కె.వి.రెడ్డి-పింగళి ద్వయమనే చెప్పుకోవాలి. ఈ సినిమాకి కె.వి.రెడ్డి గారి దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఆయువుపట్టులయితే, పింగళి నాగేంద్ర గారి సాహిత్య చమత్కారాలు ప్రాణం పోసాయి.

లాహిరి లాహిరి లాహిరిలో పాట నోట నానని తెలుగు ప్రేక్షకులుండరని నా ప్రగాఢ విశ్వాసం. లాహిరి అంటే మాయ అని అర్థం. ఈ ఒక్క పాట ఆధారంగా చేసుకుని కథంతా రూపకల్పన చేస్తారు. "లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా, ఊగెనుగా, తూగెనుగా" అని మొదలెట్టి "రసమయజగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో, ఎల్లరి మనములు ఝల్లనజేసే చల్లనిదేవుని అల్లరిలో" అని ముగించడం పింగళివారికే చెల్లింది. ప్రేమ మాయలో జగమంతా ఓలలాడుతోంది అని ఆరంభించి, ఆ మాయకి కారకుడు శ్రీకృష్ణుడే అని ముగింపు పలకడం ఓ అద్భుతమైన ఆలోచన. మొత్తం కథని ఈ ఒక్క పాటలో చెప్పారనిపిస్తుంది. మాయబజార్ కథకి కీలకమైన వ్యక్తి శ్రీకృష్ణుడు, ఆయన మాయావిశేషంవల్లనే కథ అంతా నడుస్తుంది. ఈ విషయాన్ని ఒక్క పాటలోనే ఎంతో అందంగా పొదిగారు పింగళి.

“చూపులు కలిసిన శుభవేళ పాట” మరో ఆణిముత్యం. “ఆలాపనలు, సల్లాపములు కలకలకోకిలగీతములే, చెలువములన్నీ చిత్రరచనలే, చలనములన్నీ నాట్యములే. శరముల వలనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే, ఉద్యానములో వీరవిహారమే, చెలికడనోహో శౌర్యములే”. ఇంత అందంగా, సంధర్భానికి అచ్చు గుద్దినట్టుగా రాయడం పింగళి వారు ఉగ్గుపాలతో నేర్చిన విద్య అనుకుంటాను. సాధారణంగా మనం ఎవరినైనా చాలరోజుల తరువాత కలిస్తే ముగిసిన కాలపు విశేషాలు ప్రస్తావించుకుంటాం. అన్నినాళ్ళలో ఏమేమి జరిగాయో చెప్పుకుంటాం. అలాగే ఎప్పుడో చిన్నప్పుడు విడిపోయిన శశిరేఖాభిమన్యులు యుక్తవయసులో కలుసుకోగానే వారి గతం గురించి ఒకరికొకరు ఈ ఒక్క పాటలో చెప్పుకునేలా చిత్రీకరించారు. రాకుమారి శశిరేఖ అంతఃపురంలో ఉంటూ సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటివి నేర్చుకుని ఉంటుంది. సాధారణంగా అంతఃపురంలో అమ్మాయిలు అవే చేస్తారు. మరి అభిమన్యుడు - వీరవిద్యలు అభ్యసించి ఉంటాడు. ఈ విషయాలు ఒకరికొకరు చెప్పుకోకుండానే గ్రహించినట్లు ఎంతో పొందికగా రాసారు పింగళిగారు. ఆమె ఆలాపనలు కోకిలగీతాలట, అందాలన్ని చిత్రరచనలట, నడకలే నాట్యమట. అంటే నువ్వు నేర్చుకున్నవన్నీ నాకు కనిపిస్తున్నాయిలే అని చెప్పకనే చెప్తున్నాడు అభిమన్యుడు. నీ బాణాల వేగము, శౌర్యప్రతాపాలను నేను గమనించానులే అని శశిరేఖ అన్యాపదేసంగా చెప్పినట్టు. ఎంత చక్కని ప్రయోగం!

“నీవేనా నను తలచినది”, “నీకోసమే నే జీవించునది” …ఈ రెండు పాటల్లోనూ ప్రేయసీప్రియులు వేరు వేరు ప్రదేశాలలో ఉంటారు. కానీ మొదటి పాట లో విడివిడిగా ఉన్నా కలివిడితనం, రెండవ పాటలో కలివిడిగా ఉండాలనుకున్నా విడివిడిగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. “విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురం కాదా”…..అంటే కలిసి ఉండడం ఒక భావన, విడిపోయి కూడా పరిమళించడం ఇంకొక భావన. ఇవన్నీ ఆలోచిస్తున్న కొలదీ గుబాళించే అనంతమైన సాహితీ సౌరభాలు.

అసలు ఏ పాట తీసుకున్న అందులో భావచాతుర్యం మిళితమై ఉంటుంది. మాయబజార్ సినిమా చూడకుండా పాటలు మాత్రమే వింటే మొత్త కథ అర్థమయిపోతుంది మనకి. అంత భావ సమామ్నాయం ఉంటుంది పింగళి వారి సాహిత్యంలో. మొదటిది “శ్రీకరులు దేవతలు” పాటలోనే ఈ సినిమాలో వచ్చే ముఖ్య పాత్రల పరిచయం జరుగుతుంది. దానితో కథ ఎవరు చుట్టూ తిరుగుతుందో మనకి తెలిసిపోతుంది. తరువాత “అల్లిబిల్లి అమ్మాయికి” పాటలో శశిరేఖాభిమన్యుల మధ్య ఉన్న సంబంధాన్ని చిగురింపజేస్తూ వాళ్ళిద్దరు ఒక దగ్గరలేరనే విషయం తెలియజేస్తారు. “నీవేనా నను పిలచినది” పాటతో వారి మధ్య ఉన్న ప్రగాఢ అనుబంధాన్ని పెంపుజేస్తారు. చూపులు కలిసిన శుభవేళ పాటవల్ల వాళ్ళిద్దరు మళ్ళీ కలిసారని తెలుస్తుంది. “లాహిరి లాహిరి పాట” సరేసరి, అంత తెలుస్తుంది అందులోనే. ‘భళి భళి భళి దేవా” పాటలో శ్రీకృష్ణుడి చక్రం కనిపిస్తుంది. ఘటోత్కచుడి పరిచయ పద్యంలో వారి పాత్ర, “శకుని ఉన్న చాలు” పద్యంలో వీరి పాత్ర ప్రస్పుటంగా గోచరిస్తుంది. “నీకోసమే” పాటలో వారు దూరమయ్యారని తెలుస్తుంది. “అహనా పెళ్ళియంట, వివాహ భోజనంభు” పాటల్లో మాయశశిరేఖగా ఉన్న ఘటోత్కచుని చాణతనం, “సుందరి నీవంటి” లో లక్ష్మణ కుమారుడి బేలతనం కనిపిస్తుంది. “విన్నావ యశోదమ్మ”, “దయచేయండి దయచేయండి” పాటలు, మధ్యలో జరుగుతున్న కథని మనకు చెప్పకనే చెబుతాయి.

ఇక పింగళివారి మాటలహేల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసమదీయులు, తసమదీయులు అన్న పదాలు ప్రతీ ఆంధ్రుని నోటా కొలువుదీరి ఉన్నాయంటే ఆశ్చర్యమేమీ కాదు. “పాండిత్యం కన్నా ఙ్ఞానం ముఖ్యం”, “శాస్త్రం ఏది చెప్పినా ఎప్పుడూ నిష్కర్షగానూ కర్కశంగానే చెబుతుంది, మనం సారాంశం గ్రహించాలి-అంటే శాస్త్రం ఎలా ఉన్నా ఒక సమన్వయం లో ఉంటుందన్నమాట” “ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి” లాంటి నగ్న సత్యాలను ఔచిత్యంగా చొప్పించారు. చినచేపను, పెదచేప, చినమాయను పెనుమాయ అది స్వాహా, ఇది స్వాహా అన్నదాన్లోనే బలహీనవర్గాల బాధలను నర్మగర్భంగా చర్చించారు. “పాండవుల ప్రతాపాల కన్నా, కౌరవుల ఐశ్వర్యాలు గొప్పవి కావు” – సామర్ధ్యాలకు, ఆస్తి అంతస్థులకు సాధారణ సమాజంలో పొంతన లేదన్న విషయాన్ని ఉటంకించారు. ఈ పదాలన్నింటిలోనూ బ్రహ్మాండమైన సాహిత్య స్ఫురణ, సామాజిక స్పృహ కనిపిస్తాయి.

“ఓహోహో నీవా, నీకు తెలియదూ నేనెవరో, తెలియనివారికి చెప్పినా తెలియదు” – అంటే నాకు నువ్వెవరో తెలుసు, నీకు నేను తెలియదూ, ఎదురుగుండా ఉన్న నన్నే గ్రహించలేకపొతే, చెప్తే మాత్రం తెలుస్తుందా…ఎంత సత్యం! నేను ఎవరో నీకు తెలీదు – అన్న దాన్లో ఎంత అర్థముందంటే, అహం బ్రహ్మాస్మి అంటే నేనెవరో తెలుసుకోవాలి, నువ్వెవరో తెలుసుకోవాలి.ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి దాన్లో ఒక కుర్చీ, మంచం, ఇలాంటివన్ని ఉంటాయి. వాటిని చూడగలగాలి, గ్రహించగలగాలి. చూడలేకపోతే, తెలుసుకోలేకపోతే ఎవరైనా చెప్పినా తెలియదు. ఎంత ఔచిత్యం పాటించారో ప్రతీ ఒక్క సంభాషణలోనూ. భావిస్తే ఎంతైనా గ్రహించవచ్చు ఆయన రాసిన మాటలలో. ఒక్క పొల్లు కూడా అనవసరంగా పడదు. ప్రతీ పదంలోను సాహిత్య సంపద, భావ చాతుర్యం గుబాళించి ఉంటుంది. పదాలు వాడడంలో ఆయన బ్రహ్మాండనాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎరుకకుండ వచ్చావు, ఎరుకలేకపోతావు- ఆధ్యాత్మికత- నేనున్నాని తెలుసుకోలేకపోతే నువ్వున్నావని తెలుసుకోలేవు అని భగవంతుడు చెబుతున్నట్టు – అద్భుతం కదూ. ఇంకా అగ్గిబుగ్గీకాకయ్యా, వీరతాడు వంటి పడికట్టు పదాలను తెలుగు ప్రజలనోళ్లలో నానేటట్టుగా చెక్కారు. “సభాపిరికి”, “అలమలం” లాంటి కొత్తపదాలు చక్కిలిగింతలు పెడతాయి. “నచ్చినా నచ్చకపోయినా పెళ్ళికూతురిని పెళ్ళి కొడుకు చూసి తీరాలి అది నా ప్రతిఙ్ఞ” అన్న ఒక్క వాక్యంలోనే లక్ష్మణ కుమారుడి బుద్ధిహీనత గోచరింపజేస్తారు.

ప్రాసలలో ఆయన ఉద్దండపండితుడు. “పేరు చెప్పించి, బిరుదు విడిపించి శరణనిపించిరా” – పేరు చెప్పిస్తే చాలదు, బిరుదు విడిపించి అంటే వాడి పై గెలిచి, దాసోహమనిపించిరావాలి, అమృతం తాగుతున్నట్లనిపించడం లేదూ !

“ఏవడో నరుడు, నన్ను పొడి పొడి చేసాడు సురసూరలాడుతున్నాడు కుర్రాడు"

"వాడిని మసి చేసి, నుసి చేసి పిడికిలించి పట్టుకొస్తాం నాయకా” – ఇలాంటివన్నీ బహుముచ్చటగా ఉంటాయి.

ఘటోత్కచుని పరిచయపద్యం ఆయన పాండిత్య సంపదకు నిదర్శనం.

"అష్టదిక్కుంభికుంభాగ్రాలపై మనశుంభధ్వజముగ్రాలచూడవలదే,
గగనపాతాళలోకాలలోని సమస్తభూతకోటులునాకెమ్రొక్కవలదే,
ఏదేశమైన, నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాలజరుగవలదే,
హై హై ఘటోత్కచ, జై హే ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే
యేనె ఈయుర్వినెల్ల సాశించవలదే,యేనె ఐశ్వర్యమెల్ల సాధించవలదే
యేనె మనబంధుహితులకు ఘనతలెల్ల కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదే"

పింగళి వారి రచనా సామర్ధ్యం గురించి ఇలా ఎంత చెప్పుకున్నా అనంతమైన సముద్రంలో నీటిచుక్కే అవుతుంది. భావిస్తున్న కొలదీ అర్థం, పరమార్థం బోధపడుతుంది. ఇంతటి మహానుభావులు మన ఆంధ్రులకి వరం గా దొరికారు. వారికి శతకోటి, సహస్రకోటి ప్రణామాలు.


Tuesday, August 2, 2011

భూకంపం

చిన్నప్పటినుండీ భూకంపం ఎలా ఉంటుందో, జస్ట్ ఆ భావనని మాత్రం పొందాలని బలే సరదాగా ఉండేది. భూకంపం వల్ల వచ్చే పరిణామాలు వద్దు, ఊరికే ఆ అనుభవం మత్రం కావాలి. ఇది ఒక వింత కోరికగా ఉండేది నాకు. ఓసారి నేను పదో తరగతిలో ఉండగా అనుకుంటా...దీపావళి ఇంకో నాలుగురోజులలో వస్తుందనగా...ఓరోజు రాత్రి 8.00 అవుతుండగా ఇంట్లో సామానులు అదిరిపడ్దాయి. భూకంపం అనుకుని నేను, చెల్లి, అమ్మ బయటకి పరుగు....వెంటవెంటనే భయంకరమైన విస్ఫోటనాలు...వరుస ప్రేలుళ్ళు...అప్పుడర్థమయింది అది భూకంపం కాదని. మరో అరగంటలో వార్త మాదాకా వచ్చింది. అక్కడెక్కడో 5-6 కి.మీ దూరంలో ఉన్న టపకాయల దుకాణాల్లో అగ్నిప్రమాదం...వరుసగా 4-5 కొట్లు తగలబడిపోయాయి. ఎంత పెద్ద ప్రమాదమంటే దూరంగా ఉన్న మా ఇంట్లో సామానులు కదిలాయి. చాలా భయమేసింది, బాధేసింది. కాకపోతే భూకంపం కాదా అన్న చిన్న నిరాశ ఎక్కడో మనసులో తళుక్కుమంది. నా కోరిక అలాగే మిగిలిపోయింది.

జనవరి 19, 2011, ఢిల్లీ - ఇంట్లో ఒక్కర్తినే ఉన్నాను. పొద్దున్న లేచి ఆఫీసుకి బయలుదేరుతుండగా కడుపులో తిప్పుతున్నట్టు అనిపించింది...విరేచనాలు. ఇంక ఆఫీసుకి వెళ్ళే ఓపిక లేక సెలవు పెట్టేసాను. ముందురోజు బయట తిన్నదేదో పడలేదు. వాంతులు అవ్వనంతవరకూ ఫరవాలేదనుకున్నాను. ఆస్పత్రికి వెళ్లలేదు. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాను. కానీ మోషన్స్ తగ్గట్లేదు. పంచదార, ఉప్పు కలిపిన నీళ్ళు తాగాను. మా ఇంటికి ఒక అర కి.మీ దూరంలోనే పేద్ద ఆస్పత్రి...ఫరవాలేదు. పది నిముషాలలో వెళ్లిపోవచ్చు....వాంతి అవ్వలేదు కాబట్టి ధైర్యం. సాయంత్రం వరకు ఓ పది పన్నెండు అయ్యాయి...ఎక్కడలేని నీరసం. కాస్త గ్లూకోజ్ తాగి, మజ్జిగాన్నం తిని అలా హాల్ లో సోఫా మీదే పడుకుని టీవీ చూస్తున్నాను. నిద్ర పట్టట్లేదు...పొద్దున్నుండీ పడుకునే ఉన్నాను. సర్లే అని టీవీలో వస్తున్న అడ్డమైన సినిమాలు చూస్తున్నా. అర్థరాత్రి ఒంటిగంట...రెండు...ఉహూ, నిద్ర రావట్లేదు. రెండున్నర అవుతుండగా సోఫా, టీవీ దడదడలాడిపోయాయి. వేగంగా ఊగుతున్నాయి. భయమేసింది, ఒక అరక్షణం ఏమీ అర్థం కాలేదు. ఒక్క గెంతులో కిందకి దూకి బయటకి పరుగెత్తాను. మా ఇల్లు మూడో ఫ్లోర్ లో....తలుపు తీసి బయటకు వెళ్ళాక అనిపించింది చేతిలో సెల్ అయినా ఉంటే బావుంటుందని. మళ్ళీ లోపలికి వెళ్ళి ఎదురుగా కనిపించిన సెల్ తీసుకుని లేప్టాప్ కోసం చూసాను....కళ్ళ ఎదురుగా కనిపించలేదు, బయటకి పరిగెత్తాను. మెట్లు దిగబోతుండగా డౌటొచ్చింది, నిజమేనా? అని. మెట్ల దగ్గర ఎలాంటి కదలిక ఉన్నట్టు తోచలేదు. మళ్ళీ ఇంట్లోకి తొంగి చూసాను. టీవీ, సోఫా ఊగిపోతున్నాయి. డైనింగ్ టేబిల్ కుర్చీలు కదులుతున్నాయి. వెంటనే ఇంటికి తాళం పెట్టి మెట్లు దిగేసాను. మూడు అంతస్థులు దిగేసి చుట్టూ చూసేసరికి మా సొసైటీ అంతా ప్రశాంతమైన నిద్రలో ఉంది. అక్కడా అక్కడా 3-4 మనుషులు తిరుగుతున్నారు తప్ప అలికిడి లేదు. ఒక ఫ్లాట్ లో ఇద్దరు బాల్కనీ లో నిలుచుని కబుర్లు చెప్పుకుంటున్నారు. గార్డ్ దగ్గర ఇద్దరు-ముగ్గురు నిలుచుని మాట్లాడుతున్నారు. మరేమీ ఆలోచించకుండా గార్డ్ దగ్గరకి పరుగెత్తాను. వాళ్ళని అడిగాను ఇక్కడేమైనా భూకంపం వచ్చిందా అని? వాళ్లు అలాంటిదేమీ లేదు అన్నారు. నాకు చాలా భయమేసింది...ఇంటికి ఒంటరిగా వెళ్ళే ధైర్యం లేదు. దొంగ ఎవరైనా వచ్చి బాల్కనీలోకి దూకి తలుపులూ అవీ బాదాడా? ఈ ఊహ రాగానే మరింత గజగజ...అయినా మా సొసైటీలో దొంగతనాలు జరిగే అవకాశమే లేదు....చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకైనా మంచిదని ఆ మాటే గార్డ్ తో చెప్పి ఇంటివరకూ రమ్మన్నాను. అతగాడు నాతో ఇంటిలోపలకి వచ్చి, బాల్కనీలోకెళ్ళి అన్నీ చూసాడు. మళ్ళా ఇంట్లో వాడు, నేను ఇద్దరమే...ఇదే అలుసుగా తీసుకుని వాడేమైనా చేస్తాడేమో అని వంటింట్లోకెళ్ళి చిన్న కత్తి తీసుకుని వాడి వెనకాలే వెళ్ళాను. అతను పాపం అన్నీ చూసి "ఏమీలేదు మేడమ్, మీరు ఊరికే భయపడుతున్నారు...హాయిగా పడుకోండి" అని వెళ్ళిపోయాడు. బతుకుజీవుడా అని కత్తి వంటింట్లో పెట్టేసి, అతను వెళ్ళాక తలుపులు వేసుకుని కూర్చుని ఆలోచించడం మొదలెట్టాను...భ్రమా, భ్రాంతా, చిత్తచాంచల్యమా...ఏమిటి? పొద్దున్నుండీ ఉన్న నీరసం వల్ల మెదడులో ప్లేట్లు ఏమైనా కదిలి అలా అనిపించాయా? అలా అనుకోవడానికి మనసొప్పుకోవట్లేదు. నేను బాగా చూసాను, అన్నీ కదిలాయి. రెండోసారి కూడా చూసాను.....వస్తువులు కదలడం, కాళ్ళు కంపించడం...నేను ఫీల్ అయ్యాను...ఇది నిజం. ఇలా ఆలోచిస్తున్నకొద్దీ ముచ్చెమటలు పోసాయి. మర్నాడు ఎవరిని అడిగినా అలా మాకేమీ అవ్వలేదు అనే జవాబు. ఇంటికి ఫోన్ చేసి చెబితే నీ చిత్తచాంచల్యమే అని ఖరారు చేసేసారు. నాకు మాత్రం అదొక పెద్ద మిస్టరీ లా ఉండిపోయింది. నమ్మలేని నిజం...నా భ్రాంతి అనుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు. నా వెధవ బుర్రకి న్యూస్ పేపర్లు చూడాలన్న జ్ఞానం కలుగలేదు, రోజూ దీని గురించే ఆలోచిస్తూ కొన్నాళ్ళకి మరచిపోయాను (తాత్కాలికంగానే).

మళ్ళీ...ఉగాది రోజు, 2011 - మా అత్తయ్య కొడుకు, ఆంధ్ర భవన్ లో ఉగాది వేడుకల్లో భాగంగా కచేరీ ఇవ్వడానికి వచ్చాడు. తను వయొలిన్ విద్వాంసుడు. ముందురోజు వరల్డ్ కపు ఫైనల్స్ మా ఇంట్లోనే చూసి మర్నాడు పొద్దున్నే వాడు ఏ.పీభవన్ కి, మేము ఆఫీసుకి. సాయంత్రం కచేరికి వస్తాములేరా అని చెప్పాము. సరే ఆరోజు పని అంతా త్వరగా పూర్తి చేసుకుని 5.30 కల్లా దుకాణం కట్టేసి ఏ.పీ భవన్ కి వెళ్ళాలని ప్లాను. 5.00 అవుతుండగా నా కళ్ళ ముందు ఉన్న మానిటర్ ఊగసాగింది. నేను కూర్చున్న కుర్చీ ఊగిపోతోంది. కిందకు దిగుదామంటే దిగలేకపోయాను. సిస్టం ఊగిపోతుంటే దానివైపు భయంగా చూస్తూ ఉన్నాను. అంతే, ప్రకంపనాలు ఆగిపోయాయి. ఒక్క నిముషంలో మళ్ళీ మొదలు...మానిటర్, కుర్చీ అదిరిపోతున్నాయి. ఎలాగోలా దూకి (కిందపడ్డంత పని జరిగింది) నా గదిలో నుండి బయటకి వచ్చేసరికి ఆఫీసులో అందరూ బయటకి వచ్చారు. గోలగోలగా ఉంది. భూకంపం అని అందరూ అరుపులు....నాకు ముచ్చెమటలు పోసాయి. కిందకి పరుగెడదామంటే మా ఆఫీసు ఐదో అంతస్థులో ఉంది. అందరూ గోలగోలగా అటూ ఇటూ పరిగెడుతున్నారు...మరో రెండు నిముషాల్లో అన్ని కంపనాలు ఆగిపోయాయి. అందరూ సర్దుమణిగారు. మరో ఐదు నిముషాలు వేచి చూసి ఇంక కంపనాలు రావు అని నిర్ధారించుకున్నాక "హమ్మయ్యా గండం గడిచింది" అనుకున్నాం. ఇంక అందరూ గుంపులు గుంపులుగా చేరి దీని గురించే మాటలు. అప్పుడు...సరిగ్గా అదే సమయంలో....నా సహ ఉద్యోగి అన్నాడు "మీకు గుర్తున్నాదా, జనవరిలో రాత్రి 2.00 గంటల ప్రాంతంలో ఇలాగే పెద్దగా వచ్చింది. పడుకున్నవాళ్ళం నేను నాభార్య భయపడి బయటకి పరుగెత్తాం" అని చెప్పాడు. ఆ అద్దీ...ఇప్పుడు క్లూ దొరికింది...వెంటనే నేను అడిగాను "జనవరి 19 కదా...రాత్రి 2.30 కి కదా...బాగా కంపనాలు వచ్చాయి కదా...చాలా భయం వేసింది కదా". "అవును" అని నలుగురైదుగురి సమాధానం. హమ్మయ్య అయితే ఆరోజు వచ్చింది భూకంపం అన్నమాట... నా చిత్తచాంచల్యమూ, భ్రాంతి కాదన్నమాట. ఎట్టకేలకు నా చిక్కుముడి విడిపోయింది. కానీ కాళ్ళలోంచి సన్నటి వణుకు వెన్నెముకకి పాకింది. అంటే...అంటే ఆరోజు నేను ఒక్కర్తినీ ఉన్నరోజు భూకంపం వచ్చిందన్నమాట...అది చిన్నదేకానీ భూకంపమేకదా! చాలా భయమేసింది. ఈరోజు...ఈరోజు కూడా భూకంపమే...వెర్రెక్కినట్టయింది...ఏం జరుగుతోంది. భూకంపం అన్న సరదా లేదు పాడు లేదు....అసలేం జరుగుతోంది ఇక్కడ. వెంటనే గూగలోడి సహాయం తీసుకున్నాను. తేలిన విషయమేమిటంటే "ఢిల్లీ లో ప్రకంపనాలు సర్వసాధారణం. ఎక్కడో పాకిస్థాన్ లోనో, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోనో భూకంపం వస్తే ఢిల్లీలో అదురుతుంది. రిక్టరు పై 5 నుండి 5.5 వరకూ నమొదయింది ఇంతవరకూ. 6 దాటితే ప్రమాదం సంభవించవచ్చు. 2009 లో ఒకసారి పెద్ద ప్రకంపనాలే వచ్చాయి. అప్పుడు కాస్త ఆస్థి నష్టం జరిగింది (అదే యేడాది నేను ఢిల్లిలో అడుగు పెట్టాను :P). ఇప్పటివరకూ వచ్చిన భూకంపాలలో అదే పెద్దది". ఇదంతా చదివాక భయం తగ్గిందో, పెరిగిందో తెలీని స్థితి....కానీ అస్తమానం ఇలా వస్తుంటే ఎలా? సరే అక్కడ మా వాడి కచేరీ మొదలయిపోతుందేమో అని ఆఘమేఘాలమీద పరిగెత్తాం ఏ.పీ భవన్ కి. మేము వెళ్లేసరికి ఇంకా గంట టైము ఉంది అన్నాడు. ఈ భూకంపం ధాటికి మా వాడు బెదిరిపోయాడు. వాళ్ళ ట్రూపు మూడో అంతస్థులో ఉందిట. రెండో అంతస్థులో కూచపూడి నృత్యం చెయ్యడానికి వచ్చిన ట్రూపు ఉంది. మావాడు అప్పుడే స్నానం చేసి వచ్చి తువ్వాలుతో ఉన్నాడు. కంపనాలు రాగానే కిందకి పరుగో పరుగు అలా తడి తువ్వాలుతోనే. ఆ నృత్యకళాకారులలో అమ్మాయిలు అప్పుడే డాన్సు బట్టలు వేసుకుంటున్నాను. ఈ దెబ్బకి వాళ్ళు జడిసిపోయి అలా సగం సగం బట్టలతోనే కిందకి పరుగులుట. కాస్త కుదుటపడ్డాక అందరూ ఎవరి గదులకి వాళ్ళు చేరుకున్నారు. మొత్తానికి ఏ.పీ భవన్లో అల్లకల్లోలమైపోయింది. మా వాడు ఒకటే వణుకు...మేము వాడికి పరిస్థితి వివరించి చెప్పాం. "మీరిక్కడుండొద్దు...వచ్చేయండి మనవైపుకి...మీ గురించి ఇలా భయపడుతూ మేము ఉండలేము...ఈ ఉద్యోగాలు వద్దు పాడూ వద్దు" అని వాడు ఒకటే గోల. ఎలాగోలా వాడికి సర్దిచెప్పి కచేరీ మొదలయ్యేలోగా వాడిని కూల్ చేసి పంపించాం స్టేజి మీదకి. ఆ రోజు రాత్రి వార్తలలో ఈ విషయం చెప్పారుట. అమ్మావాళ్లు ఫోను..."ఏమయింది, మీరంతా బాగానా ఉన్నారా?" అని. అందరికి భయం లేదని సర్దిచెప్పాం. మర్నాడు పేపర్లో వార్త...నిన్న సాయంత్రం ఢిల్లీలో కొన్ని ప్రాంతాలలో భూకంపం అని.

ఇంక అది మొదలు నెలా పదిహేను రోజులకో, నెలకోసారో చిన్న చిన్న ప్రకంపనాలు తెలుస్తూనే ఉన్నాయి. నాకు ఎక్కడ ఏ శబ్దం వచ్చినా, గిన్నెలు కదిలినా...ఇంట్లో వస్తువులు కదిలినా నాకు ఇదే భయం. పనిమనిషి ఇల్లు తుడుస్తుంటే టీవీ కదిలింది...పేపరు చదువుకుంటున్నదాన్ని భయంతో దిగ్గున లేచి నిల్చున్నా. నా గుండె ఎప్పుడు అలర్ట్ గా ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న కదలిక కనిపించినా నేను అలర్ట్ అయిపోతాను. పరిస్థితి ఎలా తయారయిందంటే గాలికి పేపరు కదిలినా నా మెదడు అలర్ట్ అయిపోతుంది. కానీ ఎన్నాళ్ళని? చాలా విసుగొచ్చేస్తోంది. నా భయానికి, విసుగుకి తోడు....1. ఇల్లు -మేముండే ప్రాంతాలలో ఈ ప్రకంపనాలు ఎక్కువగా తెలుస్తాయట. 2. ఆఫీసు - మా ఆఫీసు "L" షేప్ లో రెండు పెద్ద బిల్డింగుల మధ్య ఒక వారధిలా ఉంటుంది ఐదో అంతస్థులో. L లో అడ్డగీతేమో ఒక బిల్డింగులో ఉంటుంది. నిలువు గీత వారధిలా ఉంటుంది. ఆ నిలువు గీత కి సరిగ్గా మధ్యలో నా సీటు. వారధిలా ఉండడం వల్ల కంపనాలు ఎక్కువగా తెలుస్తాయి. నా ఖర్మకి ఈ ఎక్ష్‌ట్రా ఫెసిలిటీస్ ఒకటి. మొన్ననే ఓ 4-5 రోజుల క్రితం ఆఫీసులో కుర్చీలు, టేబిళ్ళూ దడదడ...నేను గజగజ! ఇప్పుడు కాస్త అలవాటయిందిగానీ తీవ్రత ఎంత ఉంటుందో తెలీదు కాబట్టి ప్రతీసారి వణుకు మొదలయి కాసేపట్లో సర్దుకుంటుంది.

ఏ ముహూర్తాన భూకంపం ప్రకంపనాల్ని అనుభవించాలని కోరుకున్నానో...అడ్డు ఆపు లేకుండా తెలుస్తున్నాయి. తథాస్తు దేవతలు ఉంటారని ఇందుకే అంటారు కాబోలు!Monday, August 1, 2011