StatCounter code

Wednesday, January 27, 2010

ఎవరి పేగులు?

నా చిన్నప్పుడు అంటే నేను ఆరో, ఏడో చదువుతున్నప్పుడు (సరిగ్గా గుర్తులేదు), మా విజయనగరంలో NCS హాల్ కి సీతారామకల్యాణం (1961) సినిమా వచ్చింది. బంధుపరివారమంతా ఓ పదిమందిమి కలిసి సినిమాకి వెళ్ళాము. సినిమా బావుంది, ఎన్టీవోడు విజృంభించేస్తున్నాడు. రావణుడి పాత్రలో ఒదిగిపోయాడు. వీరలెవెల్లో సాగిపోతోంది సినిమా. రావణుడు, శివుని దర్శనం కోసం కైలాసానికెళ్ళి, శివుని కానలేక, నంది చేతిలో భంగపడి ఓ అద్భుతమైన పాట అందుకుంటాడు. ఘంటసాల జీవం పోసిన "కానరార, కైలాసనివాస..." పాట అది. పాట బాగా పాడేసినా శివుడు కనికరించకపోవడంతో, శివస్తోత్రం అందుకుంటాడు. "జయద్వదభ్రవిభ్రమ..." అంటూ భీకరంగా ఘంటసాల పాడేస్తూ ఉంటే కైలాసంలో శివుడు శివతాండవం ఆడేస్తూ ఉంటాడు. అయినా రావణుడికి కనిపించడు. అప్పుడు ఎన్టీవోడు "పరమశైవాచార..." అనే పద్యం ఎత్తుకున్నాడు. అదీ అయిపోయింది. ఉహూ శివుడు కనికరించలేదు. హాల్ అంతా ఉత్కంఠతో చూస్తున్నాది. సగం మంది సీట్లపై లేచి కూర్చున్నారు. ఏంజరుగుతుందో ఏమో అని అందరు ఊపిరి బిగపట్టి కూర్చున్నారు. ఘంటసాల గాత్రానికి, ఎన్టీవోడి నటనకి జనాలు జోహార్లర్పిస్తూ, నందిని తిట్టుకుంటూ శివుడు త్వరగా దర్శనమివ్వాలని ముక్తకంఠంతో ప్రార్థిస్తున్నారు. చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది హాల్ లో. అప్పుడు వినిపించింది వెనుక వరసలో నుండి ఒక ఆడావిడ గొంతు

"ఇప్పుడు చూడు పేగులు తీసి వాయిస్తాడూ"

వెంటనే భయతో వణికిపోతూ మరో ఆవిడ గొంతు

"ఎవరి పేగులు?"

అంతే అంత సీరియస్సు సీనులోనూ జనాలు ఘొల్లున నవ్వారు.

అవతల రావణాసురుడు పేగులు తీసి వాయించడం (తన పేగులే సుమండీ), శివుడు ప్రత్యక్షమవ్వడం జరిగేపోయింది ఈ లోపల. మా ఇంట్లో ఇంకో నెలరోజులవరకు ఇదే టాపిక్ నవ్వుకోవడానికి.

ఇలాంటి సంఘటనే మొన్న మగధీర చూసినప్పుడు జరిగింది.

కాలభైరవుడికి, విలన్ కి మధ్య పోటీ వచ్చినప్పుడు, యువరాణి వస్త్రం తీసి గుర్రాల మీద పడేసి,దాన్ని తెచ్చి ఇచ్చినవారికే మిత్రవింద దక్కుతుంది అని ప్రకటిస్తారు కదా. ఆ సీను జరుగుతోంది. అప్పుడు కూడా నేను చిన్నప్పుడు సీతారామకల్యాణం సినిమా లో అనుభవించిన నిశ్శబ్దమే ఉంది హాల్ లో. విచిత్రంగా అదే NCS హాల్ ఈసారి కూడా. కాలబైరవుడే గెలుస్తాడు అని తెలిసినా (చిరంజీవి కొడుకు కదా గెలవక చస్తాడా, గెలవకపోతే ఛస్తాడు డైరక్టరు), ఎలా గెలుస్తాడా అని పరమ వీరావేశంతో జనాలు చూస్తున్నారు, నేను కూడా అనుకోండి. ఈసారీ వినిపించింది గొంతు వెనుక వరుసలోంచి, కాకపొతే ఆరెడేళ్ళ చిన్నపిల్లది.

"ఆ గుర్రాలు ఎటెళ్ళాయో వీళ్ళకేం తెలుస్తుంది, మరీ విచిత్రంగా ఉంది, ఈ పందెం ఏమీ బాలేదు. మా స్కూల్ లో అయితే....."

ఇక వేరే చెప్పాలా, మా నవ్వులు ఆగేలోపు మిత్రవింద ఒంటిపై వస్త్రం ఉంది.
Friday, January 22, 2010

కుడిఎడమైతే పొరపాటులేదోయ్, ఓడిపోలేదోయ్....పాట

కుడిఎడమైతే పొరపాటులేదోయ్, ఓడిపోలేదోయ్... నాకిప్పటికీ అర్థం కాని పాట ఇది. ఎన్నోసార్లు జాగ్రత్తగా విని భావం బోధపరుచుకునే ప్రయత్నం చేసానుకాని, కొరుకుడుపడలేదు నాకు.

'కుడిఎడమైతే పొరపాటులేదోయ్, ఓడిపోలేదోయ్ సుడిలో దూకి ఎదురీదక, మునకే సుఖమనుకోవోయ్'
.........
ఇక్కడిదాకా బాగానే ఉంది. నిరాశ లో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తి, విధికి ఎదురునిలవలేక మునిగిపోదామనుకున్నాడు...బావుంది.

'మేడలోనే అలపైడి బొమ్మ, నీడనే చిలకమ్మ...కొండలే రగిలే వడగాలి, నీ సిగలో పూవేనోయ్'
.........
అంటే ఎవరి గురించి/దేని గురించి పాడుతున్నట్టు? ఒకవేళ పార్వతి అనుకుంటే మొదట పార్వతి మేడలో ఉండే అలపైడి బొమ్మకాదే? ఆమె గురించే అనుకుంటే మొదట నీడనే చిలకమ్మ ఆ తరువాత మేడపైన పైడిబొమ్మ అని రావాలి కదా. పొనీ అప్పటి పరిస్థితికి మేడలోని పైడిబొమ్మే అనుకుందాం, కాని నీడలో చిలకమ్మ ఎవరు? దేవదాసు అవ్వడు, ఎందుకంటే సాధారణంగా చిలకమ్మ అని positive sense లోనే వాడతారు. అప్పటి దేవదాసు పరిస్థితి కి ఏ కాకో, గద్దో అని రాయాలి. ..నా మొద్దుబుర్రకి ఏమి ఎక్కలేదు.

'చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్, లాహిరి నడిసంద్రంలోనా లంగరుతో పనిలేదోయ్"
.........
ఇదయితే నమోనమః...ఒక్క ముక్క అర్థమయితే ఒట్టు. దేవదాసు, పార్వతి, చద్రముఖి ఎవరి పక్షాన ఆలోచించినా కూడా, అర్థం మెదడు దరిదాపులకు కూడా పోలేదు.

కాని భావం పూర్తిగా బోధపడకపోయినా ఈపాట విన్న ప్రతీసారి హ్రుదయం కకావికలమైపోతుంది, నిరాశ, నిస్ప్రుహ లతో తల్లడిల్లిపోతుంది. ఆ మహిమ రాసినవారిదో, పాడినవారిదో, సంగీతం సమకూర్చినవారిదో లేదా వీరందరిదీ కలిపోగానీ ఆ మహనుభావులకు వేలవేల దండాలు.
మళ్ళీ మళ్ళీ కూడా తెలుగు వింటూ,తెలుగు మాట్లాడుతూ, తెలుగు చదువుతూ, తెలుగన్నం తింటూ, తెలుగు నిద్రపోయే తెలుగింటమ్మాయిగానే పుట్టాలి పుట్టాలి పుట్టాలి ట్టాలి ట్టాలి లి అని మనసారా కోరుకుంటున్నాను.

ఈ పాటమీద ఒక జోకు ఉంది.

ఒకసారి ఆరుద్రగారు,ప్రతిభాశాస్త్రిగారు కలిసి విజయవాడలో రిక్షామీద వెళ్తూ, ఈ పాటలో కవి హ్రుదయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, దీనికర్థం అదయుంటుంది, ఇదయుంటుంది అని చర్చించుకుంటున్నారట. చాలాసేపు అదంతా విన్న రిక్షావాడు చివరకి అన్నాడట... "తాగుబోతు మాటలకి అర్థలేటుంటాయి బాబు, మీ ఆలోచనలేగాని...". అక్కడితో వాళ్ళ చర్చ కి పుల్ స్టాప్ పడిందట.

(ఈ విషయాన్ని శ్రీరమణగారు తన 'హాస్యజ్యోతి' లో ప్రస్తావించారు)

ఆ రిక్షావాడి లెక్కనే నేనూ అనుకుంటున్నాను తాగుబోతుమాటలకి అర్థమేముంటుంది....హమ్మయ్య అర్థం కాలేదనే గుండెభారం దిగిపోయింది :)

Friday, January 15, 2010

పెద్దపండగ-సంక్రాంతి

సంక్రాంతి పండగంటే నాకు చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టం. ఆ సంబరాలే వేరు. అందుకే దాన్ని పెద్ద పండగ అంటారు. పండక్కి ఎంచక్కా బడికి శెలవులిచ్చేస్తారు. హాయిగా పది రోజులు ఆడుతూ పాడుతూ గడిపేస్తూ ఉండేవాళ్ళం చిన్నతనంలో. పెద్దపండగ వస్తుందంటే నెల రోజుల ముందు నుండి హడావుడి మొదలవుతుంది.

అసలు ఈ పండగకి దేవుడితో కన్నా జీవుడితో సంభందాలు ఎక్కువ, అందుకే హ్రుదయానికి దగ్గరేమో. ధాన్యాలు ఇంటికి చేరేవేళ, కొత్త బియ్యం ఎసట్లో పొంగేవేళ, ఇంటి ముందు గొబ్బెమ్మలు కూర్చునేవేళ, పిన్నపెద్ద కలిసి ఆడేపాడేవేళ, సంక్రాంతి శోభలు ఇంటింటా విరజుల్లుతూ ఉంటాయి.

సంక్రాతికి సరీగ్గా నెలరోజులకి ముందు మా విజయనగరం మూడుకోవెళ్ళలో నెలగంటు పెట్టడంతో ఆరంభమయ్యేవి మా ఉత్సవాలు. అదేమి లెక్కోగానీ అప్పటునుండి సంక్రాంతివెళ్ళేవరకు ఇంటిముందు ముగ్గులు వెయ్యడం ఆనవాయితీ. ఈ ఆవాయితీ అంటే నాకు మహా పట్టింపు ఉండేది ఎందుకంటే చక్కగా ముగ్గులు పెట్టేసుకోవచ్చు నెలరోజులునూ. ఆ నెలరోజులు పెట్టే ముగ్గులకోసం 4-5 నెలల ముందు నుండి ముగ్గులు సేకరించేవాళ్ళం నేను మా చెల్లి కలిసి. ముగ్గుల పుస్తకాలు కొని, ఈనాడు పేపర్లో వచ్చే ముగ్గులను కట్ చేసి భద్రపరిచేవాళ్ళం. ఇక వాటిని కష్టపడి నేర్చుకోవడం, నేను వేస్తానంటే నేను వేస్తానని మా అక్కచెల్లెళ్ళం పోటీ పడడం జరిగేది. పోటీ నామమాత్రమే. పెద్దదాన్ని కనుక నేనే గెలిచేదాన్ని ఎప్పుడూ. 6 చుక్కలుతో ప్రారంభించి 12, 15 అలా 20 చుక్కల ముగ్గు వరకు వేసేదాన్ని. ఇంటిముందు పేడ కలిపిన నీళ్ళని కళ్ళాబి జల్లి(మా ఊర్లో అలాగే అంటారు) శుభ్రపరచడం మా ఎదురింటి పాలు పోసే ఆవిడ వంతు. ఆవిడ ఉదయం ఆ పని చేస్తే నేను సాయంత్రం మళ్ళీ మాములు నీళ్ళతో కళ్ళాబి జల్లి మొదలెట్టేదాన్ని ముగ్గులు. నాకు సాయం మా చెల్లి, నాన్నగారును. చుక్కలు పెట్టి ఎన్నిసార్లు చెరిపుంటానో నాకే తెలీదు. వంకరగా వచ్చాయని, ఎక్కువయ్యాయని, తప్పు పెట్టానని కారణాలు బోలెడు. అది సరిగ్గా పుస్తకం లో ఉన్నట్టు రాకపోతే నాకు నిద్ర పట్టేదికాదు. అసలు రాత్రంతా మరునాడు పెట్టబోయే ముగ్గు కోసం కలలుకనేదాన్ని. మా లంకవీధిలో నాదే పెద్దది, అందమయినది అయిన ముగ్గు అనిపించుకోవలని కోరిక. కానీ నాకంటే పెద్దవాళ్ళయిన భవాని, సుశీల, సునీత (పక్కింటి, ఎదురింటి అక్కలు) బాగా వేసేవారు. ఎవరు ఎలా వేసినా మా నాన్నగారు మాత్రం నా ముగ్గే బ్రహ్మాండం అనేవారు. ఆయన చెప్పినదాన్లో నిజం లేదని నాకు తెలిసినా, అలా ఆయనచేత అనిపించుకుంటే నాకదో తుత్తి. అలా మొదలయిన ముగ్గుల కథ, జనవరి 1 నాడు పెద్ద రంగులముగ్గు వెయ్యడంతో సగం పైగా మెట్లెక్కేసేది, చివరాఖరి మెట్టు సంక్రాంతి ముగ్గన్నమాట.

ఇక పండక్కి రెండు జతల బట్టలు కొనుక్కోవడం,కొత్త గాజులు, కొత్త రిబ్బన్లు,రంగురంగుల సైడుపిన్నులు, కొత్త చెంకీ బొట్టుబిళ్ళలు, ముగ్గులకి రంగులు, చెంకీలు లాంటివి మా అమ్మ, నాన్నగార్లతో బజారుకి వెళ్ళి కొనుక్కోవడంతో భోగీ రానే వస్తుంది. భోగీ అంటే మా తాతగారికి చెప్పలేని భయం. మా ఇంటి దొడ్డి తలుపు, వీధి తలుపు చెక్కతో చేసినవి, చాలా బలహీనంగా ఒక తాపు తంతే పడిపోయేలా ఉండేవి. మా వీధి కుర్రాళ్ళు, పిల్లలు భోగీమంటలకోసం కర్రలు సేకరించేవాళ్ళు వారం రోజులముందునుండి. ఆ కుర్రాళ్ళెవరైనా అర్ధరాత్రి వచ్చి మా తలుపులెత్తుకెళ్ళిపోతారేమోనని ఆయన భయం. అందుకని భోగీ ముందురోజు తెల్లవార్లు ఆ తలుపులకి కాపలా కాసేవారు. ఎవరైనా ఎత్తుకుపోతే మళ్ళీ చేయించుకుందాంలెండి, వెళ్ళి పడుకోండి అని మా నాన్నగారు ఎన్నిసార్లు చెప్పిన ఆయన ఏ భోగీ కి వినేలేదు. ఆయనకి మనసంతా ఆ ఇల్లే. ఇల్లాలి కోరిక మేర తాతల నుండి వారసత్వంగా వస్తున్న ఇంటిని పోగొట్టుకోకూడదని, తను కొని నిలబెట్టుకున్న ఇల్లు అది. ఆ ఇల్లే ఆయనకి సర్వస్వం....ఆ ఇంట్లో పుట్టడం నా అద్రుష్టం.

భోగీనాడు తెల్లవారుఝామున నాలుగు గంటలకి లేచి మా లంకవీధిలో రామాలయం ముందు వేసే భోగీమంట దగ్గరకి వెళ్ళేవాళ్ళం. చెప్పొద్దూ, ఆ మంటలు నిజ్జంగా ఆకాశాన్ని తాకేవి ! ఒక వైపు చిన్న చలి, ఇంకో వైపు వెచ్చని మంటలు, ఒక చిన్న దుప్పటి కప్పుకుని ఆ మంటలముందు హాయి హాయి గా కూర్చుని చలి కాచుకునేవాళ్ళం. వీధిలోవాళ్ళంతా చేరి ఇంకా కర్రపుల్లలు వేస్తూ మంటని ఎగదోస్తూ ఉంటే ఆ అనుభూతే వేరు. అలా మెల్లిగా పొద్దెక్కాక, మంట కాస్త చల్లరాక, ఎవరింటి నుండి వాళ్లు గిన్నెలతో నీళ్ళు తెచ్చుకుని దాని మీద పెట్టి కాగనిచ్చేవారు. భోగీమంటల మీద మరిగిన వేడి వేడి నీళ్ళతో తలంటు పోసుకుంటూ ఉంటే ఆహా నా రాజా భలే ఉండేది. తరువాత కొత్తగా కొనుక్కున్న ఏ గీతాంజలి మిడ్డీయో, ప్రేమపావురాలు పంజాబి డ్రెస్సో లేదా మా అమ్మ కుట్టిన రంగురంగుల గౌనో వేసుకుని అద్దం ముందు వయ్యారాలుపోయేవాళ్లం. నేను ఏమి చేసిన పొగడడానికి మా నాన్నారు ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు. ఈ ప్రపంచంలో బట్టలంటే నీవేనమ్మా, అంత బ్రహ్మాండంగా ఉన్నాయి అనేవారు. నాకు, మాచెల్లికి ఈ విషయంలో పోటీ వచ్చేది కాదు. ఎందుకంటే అది చిన్నప్పటి నుండి మగపిల్లల బట్టలే వేసుకునేది. తరువాత అమ్మతో పాటు పూజలో కూర్చుని, పెద్దవాళ్ళ కాళ్ళకి దణ్ణం పెట్టి, వాళ్ళిచ్చే పదో పరకో బహుమానాలు పుచ్చుకుని ఊరిమీద పడేవాళ్ళం. ఇక కొత్త బట్టలు ప్రపంచానికి చూపించడం ఇంకొక కార్యక్రమం. ఎదురింటి ఆంటీగారింటికి, పక్కింటి అనసూయత్తగారింటికి, గేటింటి మామ్మగారి దగ్గరకి, వెనుకవీధి బంగారమ్మపిన్నింటికి పనిలేకపోయినా వెళ్ళేవాళ్ళం కొత్త బట్టలు చూపించడానికి. అందరు ఆహా, ఓహో అంటే తెగ మురిసిపోయేవాళ్ళం. కొత్త సినిమాలలో హీరోయిన్ లా తెగ ఫీల్ అయిపోయేవాళ్ళం.

ఇక మా పెద్దనాన్న,చిన్నాన్నగార్ల పిల్లలతో, హౌసీ, వైకుంఠపాళి, లూడో లేకపోతే బెచ్చాట, నేల బండ, దొంగాట, ఏడు పెంకులాట, బంతాటో ఆడుకునేవాళ్ళం. అమ్మ చేసిన కమ్మనైన బూర్లు, పులిహార పుష్టిగా తినేసి బారెడు సాయంత్రం అయ్యేదాక పడుకునేవాళ్ళం. సాయంత్రం అలా దొడ్డమ్మవాళ్ళింటికో, ఉమాత్త వాళ్ళింటికో వెళ్ళి కబుర్లు చెప్పి గడిపేసేవాళ్ళం. తరువాత సంక్రాంతి ముగ్గుకి సన్నాహాలు ప్రారంభించేవాళ్ళం. నేనెప్పుడు గొబ్బెమ్మలు పెట్టలేదు. కాని చెంకీలు, పువ్వులు జల్లేదాన్ని. నాకు మాచెల్లి, మాతమ్ముడు (మా పెద్దనాన్నగరి కొడుకు) రంగులద్దడంలో సహాయం చేసేవారు. రంగు, ముగ్గు గీతకి అటు ఇటు అవ్వకూడదు. సరిగ్గా ముగ్గులో పడాలి, అది నా రూలు. వాళ్ళిద్దరిలో ఎవరు తూచాతప్పక పాటించకపోయిన వాళ్ళకి ఉద్వాసన, నా చేత తిట్లు తప్పేవి కావు.

ఇక అసలు పండగ సంక్రాంతినాడు, ఇంటికి హరిదాసులొచ్చేవారు. ప్రతీ ఆదివారం మా ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చేవారు. ఆయనకి ఒక 50-60 మధ్యలో యేళ్ళు ఉండేవి. ఆయనకి బియ్యం వెయ్యడం అంటే మాకెందుకో చాలా సరదాగా ఉండేది. బియ్యం వేస్తే ఆయన మాకు విభూది పెట్టేవారు. ఆ విభూది పెట్టించుకోవడం భలే ఇష్టంగా ఉండేది. ఆయనకి సంక్రాంతినాడు ఎక్కువ బియ్యం డబ్బులు ప్రత్యేకం. ఇంకా హరిదాసులు, గంగిరెద్దులు మములే. గంగిరెద్దులు ఇంటికి వస్తే ఆ సన్నయి వింటూ, ఆ ఎద్దుల మీద ఉండే రంగురంగుల బట్టలను ఆహ్లాదంగా, విడ్డూరంగా చూసేవాళ్ళం. మా తమ్మూడువాళ్ళు వార్తాపత్రికలతో గాలిపటాలు తయారుచేసేవారు. వాటికి రంగురంగుల తోకలు అంటించడం మా వంతు. నాకు మాత్రం గాలిపటం ఎగరేయడం ఇప్పటికి రాలేదు. మహా అయితే నా ఎత్తు ఎగిరేది అంతే. ఆరోజు పిండివంటలు నాకెంతో ఇష్టమయిన బొబ్బట్లు, పులిహార లేదా పొంగలి. బాగా నెయ్యి వేసుకుని బొబ్బట్లు లాగించేసేదాన్ని. బొబ్బట్లతోపాటు అందులో పెట్టే పూర్ణం ముద్ద వేరేగా తినడం నాకింకా ఇష్టంగా ఉండేది. ఇక కనుమనాడు గారెలు తినకపోతే వచ్చే జన్మలో కాకి అయి పుడతారని చెప్పే నమ్మకాని నేను బలంగా విశ్వసించేదాన్ని, ఎందుకంటే గార్లంటే నాకు ప్రాణం మరి. ఆరోజు గార్లు, పెరుగు గార్లు, సేమ్యా పాయసం లేదా బెల్లం పరవాణ్ణం తిని హాయిగా బజ్జొనేవాళ్ళం. ముక్కనుమనాడు పెద్దగా విశేషాలు ఏమీ ఉండేవి కాదుగాని గత మూడు రోజులుగా జరిగిన సంగతులన్నీ ముచ్చటించుకునేవాళ్ళం. ఇక ఆ వారంతో ముగుసే శెలవుల తరువాత వచ్చే శనివారం, బడికి కొత్తబట్టలేసుకుని వెళ్ళి స్నేహితులందరికి చూపించడంతో సంక్రాతి సంబరాలు ముగిసేవి.

ఆరోజులు, ఆ ఆనందం మళ్ళీ రావు కదా !


ఇక ఈ 2010 సంక్రాంతి ముచ్చట్లు...
ఈసారీ వేసాను ముగ్గులు, కానీ కొత్తా రకంగా....ఈ వారాంతరంలో నేను టోక్యో వెళ్ళి సమర్పించబోయే పేపర్ కోసం తయారు చేసిన ppt slides, అవే నేను వేసిన ముగ్గులు.

భోగీపళ్ళు పోయించుకున్నాను మా డైరెట్టరు చేత...పేపర్ బాగా రాసానని పొగిడించుకున్నాను.

తిన్నాను బొబ్బట్లు, బూర్లు....మా ఆఫీసుకి దగ్గరగా ఉన్న తమిళతంబి చిదంబరం హొటేలు నుండి తెప్పించుకున్న పనీర్ ఇడ్లీలు, చోలే బటూరాలు.

ఇవాళ కనుమ, ఒక్క గారె ముక్కయినా తినలేదు...వచ్చే జన్మలో నాకు కాకి రూపు తప్పదు కాబోలు.

అసలు పండగ వచ్చిందనిగానీ, వెళ్ళిందనిగానీ ఊహే లేకుండా రెండురోజులు ఆఫీసులో పనితో సతమతమయిపోయాను. అయితే బాసు నుండి పొగడ్తలు, పేద్ద కాంఫరెన్సులో invited lecture, అది సమర్పించుకోగానే గొప్ప కీర్తి వస్తాయి. కానీ భోగీ మంటల ఆనందం, సంక్రాంతి ముగ్గుల సరదా, బొబ్బట్లు, గారెల రుచి ఏవీ?

ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములేవి తల్లీ లాగ

ఏవి తల్లీ నిరుడు ఎగసిన భోగిమంటలేవి తల్లి,
ఏవి తల్లీ నిరుడు వేసిన రంగుముగ్గులు ఏవితల్లీ,
ఏవి తల్లీ నిరుడు చేసిన పిండివంటలు ఏవి తల్లి.....కాకి జన్మను రూపు మాపే పెరుగుగారెలు ఏవి తల్లీ?

ఈ నిముషలో నాకర్థం కావట్లేదు....కీర్తి ద్వారా వచ్చే సంతోషం గొప్పదో, జీవితంలో వచ్చే చిన్నచిన్న ఆనందాలు గొప్పవో!

Saturday, January 9, 2010

అప్పు తచ్చులు

మా యూనివర్శిటీలో ఆర్థికశాస్త్ర విభాగంలో ఒక లెక్చరర్ ఉండేవారు/ఉన్నారు. ఆయన్ని సూక్ష్మార్థికశాస్త్రం అంటే ఏమిటి అని అడిగితే అవి కాయలా పళ్ళా అని మనల్ని ఎదురుప్రశ్నడుగుతాడు. కొందరు పనికిమాలిన పెద్దల పంచనచేరి, మసి పూసి మారెడుకాయజేసి యూనివర్సిటీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. గవర్నమెంటు ఉద్యోగాల్లో ఒకసారి చోటు సంపాదించాక అక్కడనుండి వాళ్ళని కదపడం బ్రహ్మతరం కాదు. ఈ సదరు వ్యక్తికి పొట్టవిప్పితే పేగులేతప్ప అక్షరం ముక్క కనపడదాయే, మరి నలుగురు మధ్య గుర్తింపు పొందడమెట్లా? విద్యార్ధులను బుట్టలో వేసుకోవడమెట్లా? ఒకానొక మండుటెండవేళ, ఆచ్చి మసాలాలాంటి ఘాటైన మాయోపాయం తట్టిది గురుడికి. పుస్తకాలు రాసిపారేద్దామని గాఠ్ఠిగా నిర్ణయించేసుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒక తలకుమాసిన పబ్లిషర్ ని పట్టుకుని, ఇంకో నలుగు పనిలేని వెధవాయిలచేత ఆర్టికల్స్ రాయించి ఈయనగారు ఆ పుస్తకాన్ని చించి(ఎడిట్)అవతలపారేసారు. దుడ్డు తో బాది, ఘనులను రప్పించి, పుస్తకావిష్కరణ కార్యక్రమం సశేషంగా జరిపించీసేడు. ఇక అసలు విషయమేమిటంటే, ఆ పుస్తకం తెరవగానే మనకి కనబడేది...

పుస్తకం పేరు
సదరు వ్యక్తి పేరు
Faculty in Economics అని ఉండవలసిన చోట Faulty in Economics అని అచ్చు పడింది. ‘C’మిస్ అయింది. ఇంకేముంది అచ్చుతప్పు అతనికి సరిగ్గా అన్వయమయింది.

ముఖ్య గమనిక: ఈ పుస్తకం, దేశంలో ఉన్న అన్ని గ్రంధాలయాలకు ఉచితముగా ఇవ్వబడింది.
వెల: 450 రూ.
బరువు: అరకేజీ
పదార్ధము: మేడిపండు

ఈ సందర్భంలో రమణగారు అదేనండి మన ముళ్ళపూడి వెంకటరమణగారు గుర్తొస్తున్నారు, ఎందుకంటారా...

1960 లో తన ౠణానందలహరి పుస్తకం ఫస్ట్ ఎడిషన్ వెలువడింది. ఆ కాపీని ఇచ్చేటప్పుడు దానిపై అచ్చుతప్పులతో, అభినందనలతో అని రాసి మరీ సంతకం చేసి ఇచ్చారట ఆ గ్రంధకర్త శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ-కొంత వరకైనా పాప పరిహారం అవుతుందని.

ఒక్కోసారి అలవాటులో చిన్న చిన్న పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. నిర్వచనోత్తరరామాయణం అట్టమీద పద్యకావ్యం అని బ్రాకెట్లో ప్రచురించారట.

రెండవ టపాలోనే అచ్చుతప్పుల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఒకవేళ ఎప్పుడైనా నా టపాలలో అప్పుతచ్చులు దొర్లితే మీరు సంయమనం పాటించగలరని.

అసమదీయులకు స్వాగతం

నేనొచ్చేసానోచ్... నేను సైతం చేతిదురదకి బ్లాగునొక్కట్టి మొదలుపెట్టాను అంటూ విచ్చేసా :)
చిన్నప్పటి నుండి తెలుగు పుస్తకాలు చదువుకుంటూ, పైంటింగ్స్ వేసుకుంటూ కాలక్షేపం చెయ్యడం నాకలవాటు. ఈ మధ్యనే కొత్త గా ఉద్యోగంలో చేరానా, నా కాలక్షేపానికి సమయం చిక్కట్లేదు. కాలు చెయ్యి విరిచీసుకున్నట్లయింది. ఎలా మళ్ళీ నా కాలక్షేప కార్యక్రమానికి దగ్గరవుదామబ్బా అని ఆలోచిస్తూంటే ఓ గోపిక తటస్థపడి, పిల్లా ఇలా రా అని తీసుకెళ్ళి తోటరాముణ్ణి చూపించింది, చంద-మామనందించింది, చేగోడీలు తినిపించింది. ఇహ అంతే ...అసలే కొస చూపిస్తే అల్లుకుపోయేరకం నేను...ఇలా వచ్చి ఈ బ్లాగ్లోకం లో పడ్డా. పడినదగ్గరనుండి ఒకటే వింతలు విడ్డూరాలునూ. ఇక్కడ రెండు రెళ్ళు ఆరట, చేగోడీలు తింటే నవ్వొస్తుందిట, జూ లో రన్నింగ్ సినిమాలట, టెక్కునిక్కుల వీవెనలట, ఏకి పారేసి పీకిపందిరేస్తారట, ఒకడు అరిస్తే వాద్యంట-కరిస్తే వైద్యంట, మధ్యమధ్యలో మలక్పేటరౌడీ బెదిరింపులు, చాకిరేవు లో ప్రశస్థమయిన ఉతుకుడు కార్యక్రమాలు, పక్కనే ప్రవహించే అంతర్వాహినిలో జాలువారే హిమబిందువులు, మదిలో నిలిచే ఆలోచనాతరంగాలు, చక్కని పర్ణశాల వంటి చిన్ని ప్రపంచంలో వినిపించే అసంఖ్యాకమైన తేటగీతులు, రసఙ్ఞులాలపించే వేణువులు, ఆనందం కలిగించే వరాళి వీచికలు, మనసులోని మాటలు, ఊసుపోని కబుర్లు ఇలా కలగూరగంపలా ఎన్నో ఎన్నేన్నో చిత్రవిచిత్రాలు. అలా అక్కడ విహారిర్తూండగా స్త్రీవాదం పేరిట ఒక పైత్యావలోకనం ఎదురుపడింది. ఆ పైత్యానికి తగ్గ వైద్యం చెయ్యడానికి, సహబ్లాగర్లతో చేరి ప్ర.పీ.స.స ఆస్పత్రి నిర్మించి దాని సెగట్రీగా ఉంటూ వచ్చాను. అంటే చెప్పుకుంటే బాగుండదుగానీ అక్కడ నాకు ఫ్యాన్లు, ఏసీ లు ఎక్కువయిపోయి బ్లాగు మొదలుపెట్టమని మరీ మొహమాటపెట్టేస్తూంటేనూ సర్లేపోనీ అని బ్లాగు మొదలెట్టేసా. ఆ ఆ ఆగండాగండి అప్పుడే కీబోర్డులుచ్చుకుని మీ మీ బ్లాగులవైపు పరిగెట్టేస్తున్నారా నా మీద బరికెయ్యడానికి...మీరు ఆపని చెయ్యకుండా ఉండడానికే ముందే వేసానుగదా సమ్మోహనాస్త్రం అసమదీయులని….కోప్పడకండేం, నాక్కొచం చేతి దురదెక్కువని ముందే సవినయంగా విన్నవించుకున్ననుగా. ఇలాగే మీ ఆదరాభిమానాలు నా మీద, నా బ్లాగు మీద ఉండాలని కోరుకుంటూ శెలవు కాదు మొదలు.....అంతం కాదిది ఆరంభం.....టడట్టడట్టడాయ్ తసమదీయులకు హెచ్చరిక: ఏదో సౌమ్యంగా ఉంటానని నా బ్లాగుకొచ్చి పిచ్చిరాతలు రాసి, కారుకూతలు కూసారో సహించను, క్షమించను. అసలే నేను మాయాశశిరేఖని, కనికట్టులు, కరకట్టులు నాకు వెన్నతో పెట్టిన విద్య. మీ మీ బ్లాగులకొచ్చి చిత్తచాంచల్యం, భ్రమ, భ్రాంతి లాంటివన్ని కలిగించేస్తాను. తస్మాత్ జాగ్రత్త !