StatCounter code

Wednesday, July 7, 2010

మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారి ముచ్చట్లు

నిన్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జన్మదినమట, నాకు ఈరోజు తెలిసింది. ఆలశ్యమైనా కూడా ఆయనకు నా బ్లాగు ముఖంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.

ఆయన గురించి కొన్ని విశేషాలు:

బాలమురళీకృష్ణగారు మా యూనివర్సిటీకి వచ్చారు ఓ 4-5 యేళ్ళ క్రితం. అదెలా అంటే మా యూనివర్సిటీలో తెలుగు విభాగానికి హెడ్ బేతవోలు రామబ్రహ్మంగారు. ఆయన, బాలమురళీకృష్ణ (MBK) గారు మంచి దోస్తులు. బేతవోలుగారి విన్నపం మీద MBK మా కేంపస్ లో ఓ వారం రోజులు గడిపారు. MBK ముఖతా ఒక సంగీత విభాగాన్ని కూడా మొదలెట్టాలనే ఆలోచన ఉండేది అప్పట్లో. వచ్చిన మొదటిరోజు మా విద్యార్ధులందరికి ఒక ఉపన్యాసం ఇచ్చారు. అందులో కొన్ని విషయాలు నన్ను అబ్బుర పరిచాయి, ఆహా అనుకున్నాను. మరికొన్ని విస్మయపరిచాయి, అదేమిటి ఇలా? అనుకున్నాను.

MBK సంగీత కచేరిలలో కొన్ని కొత్త పద్ధతులు ప్రవేశపెట్టారట. అవి నాకు బాగా నచ్చాయి. కచేరి మధ్యలో మృదంగం టర్న్ వస్తుంది. గాత్రం లో స్వరం అయ్యాక మృదంగం, వయొలిన్ టర్నులొస్తాయి. అప్పుడు చాలామంది కచేరీ నుండి లేచివెళ్ళిపోయి బయట కాసేపు విశ్రాంతి తీసుకునొస్తారు. నేను కూడా ఇది చాలాసార్లు గమనించాను కచేరీల్లో. ఒకసారి ముంబాయిలో MBK కచేరీ జరుగుతుండగా, మృదంగం టర్న్ వచ్చినప్పుడు ఆయన మైమరచి కళ్ళు మూసుకుని వింటున్నారట. అంత బాగా వాయిస్తున్నారట ఆ మృదంగ విద్వాంసులు. కాసేపయ్యాక కళ్ళు తెరిచి చూస్తే హాల్ లో ఓ పది మంది మాత్రమే ఉన్నారట. మిగతావారంతా హాల్ బయట పిచ్చాపాటీ వేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారట. ఇది గమనించిన వెంటనే ఆయన కచేరీ నిలిపివేసారట. మృదంగం ఆయన ఇంత అద్భుతంగా వాయిస్తుంటే ఎవరూ వినట్లేదేమిటి అని ఆలోచించారట. అప్పుడు ఆయనకి తట్టిన విషయం కచేరీలో "బ్రేక్" ఇవ్వడం. సినిమా చూస్తే భ్రేక్ ఇస్తారు. టీవీలలో బ్రేకులుంటాయి. క్లాసులో పాఠం చెప్తున్నప్పుడు కూడా బ్రేక్ తీసుకుంటారు. మరి కచేరీకి ఎందుకు బ్రేక్ ఇవ్వకూడదు, తప్పేమిటి? వింటున్న జనాలకి మధ్యలో విశ్రాంతి లేక ఇలా మృదంగం టర్నో, వయలిన్ టర్నో వచ్చినప్పుడు బ్రేక్ తీసుకుంటున్నారు. ఈ పక్కవాయిద్యాల విద్వత్తును గుర్తించలేకపోతున్నారు అని అనుకున్నవారై అప్పటినుండి తన ప్రతీ కచేరీకి మృదంగం టర్న్ ముందు బ్రేక్ ఇవ్వడం మొదలెట్టారట. అలా అయినా జనాలు పక్కవాయిద్యాలను పక్కనబెట్టకుండా విని ఆస్వాదిస్తారని.

నాకు కూడా చాలాసార్లు కచేరీలో బ్రేక్ తీసుకోవాలనిపించేది. నేనూ ఎన్నోసార్లు మృదంగం టర్న్ లో బ్రేక్ తీసుకున్నాను. వయొలిన్ నేను నేర్చుకున్నాను కాబట్టి, అదంటే నాకిష్టం కాబట్టి వయలిన్ టర్న్ వస్తే తాళం వేస్తూ శ్రద్ధగా వినేదాన్ని. మృదంగం టర్న్ కి మాత్రం బయటికెళ్ళిపోయేదాన్ని కాసేపు. నేనే కాదు చాలామంది అలా వెళ్లిపోయేవారు. ఆరోజు ఉపన్యాసంలో MBK ఈ విషయం చెప్పగానే ఉలిక్కిపడ్డాను నేను. నాకు కూడా ఈ బ్రేక్ కాన్సెప్టు చాలా నచ్చింది. కచేరీ చేసేవాళ్లందరూ దీన్ని పాటిస్తే బాగుందును అనుకున్నాను.

మరో నిఖార్సైన విషయం.....ఆరోజుల్లో కచేరీలు ఆడవాళ్ళకి నిషిద్దం. వాళ్ళు స్టేజీ ఎక్కకూడదు. ఇంట్లో కూర్చుని జోలపాటలు మాత్రమే పాడుకుంటూ గడపొచ్చు. ఒకవేళ ఎవరైనా ఆడవాళ్ళు ధైర్యం చేసి కచేరీ చేసినా వాటిని సంగీతంలో పెద్దలందరూ బేన్ చేసేవారట. ఆ కచేరీకి ఎవరినీ వెళ్ళనిచ్చేవారు కాదట. అటువంటి సమయంలో MBK కచేరికి తంబురా వెయ్యడానికి ఒక ఆవిడని కూర్చోమన్నారట. అదేదో చాలా పెద్ద కచేరీట, ప్రముఖులు, విద్వాంసులు అందరూ వచ్చారట. హాల్ అంతా జనంతో కిటకిటలాడిపోతున్నాదిట. ఆ కచేరీలో ఈవిడ తంబురా పట్టుకుని కూర్చోగానే అందరూ వ్యతిరేకించారట. MBK మాత్రం ఆవిడ తంబురా వేస్తేనే పాడతానన్నారట. పెద్దలందరూ సభ విడిచి బయటికెళ్ళిపోయారట. ఆడవాళ్ల పట్ల ఇటువంటి దృక్పధం మంచిది కాదు. వాళ్ళూ మగవాళ్లతో పాటు సమానంగా సంగీతం నేర్చుకోగల, పాడగల సత్తా ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి, ప్రోత్సహించాలి అని చెప్పి,ఎవరు విన్నా, లేకున్నా నేను కచేరీ చేస్తాను, ఆవిడే తంబురా వేస్తారు. ఇష్టం వచ్చినవాళ్ళు ఉండండి, లేకపోతే దయచేయండి అని చెప్పేసారట. ఈయన మాటని కొట్టేసి చాలామంది వెళ్ళిపోగా మిగిలిన 20-25 మందిని పెట్టుకుని కచేరీ చేసారట. ఇది ఒక పెద్ద issue అయి ఒక విప్లవంలా మొదలయ్యిందిట ఆ రోజుల్లో.

ఇలాంటి మంచి విషయాలు ఇంకా బోల్డు చెప్పారు ఆ ఉపన్యాసంలో.

మరి కొన్ని సరదా విషయాలు కూడా చెప్పారు. ఆయన నారదుడుగా వేసిన భక్తప్రహ్లాద సినిమా గుర్తందిగా అందరికీ. ఆ సినిమా సూపరు డూపరు హిట్టు అయ్యాక ఆయనకి 12 సినిమాలలో నారదుడి వేషం వేసే అవకాశం వచ్చిందిట. బాబోయ్ ఇలా అయితే నేను సినిమాల్లో పెర్మనంటు నారదుణ్ణుయిపోతాను ఎందుకొచ్చిన గొడవ అని అన్ని అవకాశాలను తోసిపుచ్చారట. ఆయనకి సినిమాలలో నటించాలని చాలా సరదాట. హీరోగా వెయ్యాలని ఉండేదిట. అవకాశమొస్తే చెయ్యడానికి రెడీగా ఉన్నారట. కానీ పాపం అన్ని నారదుడి వేషాలొచ్చాయి :). నాకయితే ఈ మాట విని ఎంత నవ్వొచ్చిందో చెప్పలేను......భక్త ప్రహ్లాదలో ఆయన పర్సనాలిటీ ఏమిటి, ఆయన ఎత్తెంత, మనిషి బక్కపలచగా, పొట్టిగా ఊదితే గాల్లో ఎగిరిపోయేలా ఉండేవారు...ఈయనకి హీరో వేషమెవడిస్తాడని ఎదురుచూసారో అని తెగ నవ్వుకున్నాను. భక్తప్రహ్లాదలో జోలపాట గుర్తుందా? గుర్తులేనివాళ్ళకి ఇదిగో లింకు.
నాకయితే ఈ రోజుకీ జోలపాటల్లో "సిరిసిరి లాలి, చిన్నారి లాలి" ప్రధమ స్థానంలోనే ఉంటుంది.

ఈయనకి సినిమాలలో డిష్యుం డిష్యుం ఫైటింగులు చాలా ఇష్టమట. కారణం అవి ఆయన చెయ్యలేరు గనక...ఏమిటో భలే విచిత్రంగా ఉంది కదా! ఈయనేమిటి ఫైటింగులిష్టముండడమేమిటి....ఎక్కడో ఏదో అసమతౌల్యంగా ఉన్నట్టనిపించింది. సంగీతం ముఖ్యంగా కర్నాటక సంగీతం నేర్చుకున్నవాళ్ళు ప్రధానంగా భక్తి, శాంతి లో కూరుకుపోయి ఉంటారు. మరి ఈయనకి ఈ హింసా పద్ధతులు నచ్చడమేమిటో నాకర్థం కాలేదు.

MBK 72 మేళ కర్తలలో కృతులు రచించారన్న విషయం లోకవిదితమే కదా. ఆయనొక సంగీత శిఖరాగ్రం, అంతే ఇంకా వేరే మాట లేదు. సంగీతంలో ఎన్నో రకాల ప్రయోగాలు చేసారు. ఆయన "హనుమా, వినుమా"...అని ఒక కీర్తన రాసారట. ఇందులో గమ్మత్తేమిటంటే స్వరంలో మధ్యమం వచ్చినచోటల్లా సాహిత్యంలో "మ" అనే అక్షరం వచ్చేట్టు రాసారట. ఇప్పుడు "హనుమ" లో "మ" వచ్చినదగ్గర మధ్యమం వస్తుంది.....అలాగే మొత్తం కీర్తనంతా ఉంటుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో చెప్పారు. చాలా కీర్తనలు పాడి వింపించారు. పెద్దవారవడం మూలానగాబోలు చాలా వాటికి సాహిత్యం, కొన్ని సార్లు స్వరం కూడా మరచిపోయేవారు. ఆయన శిష్యుడు మోహనకృష్ణ గారు అందిచేవారు మరచిపోయినప్పుడల్లా. ఇంకొక సరదా కలిగించిన విషయమేమిటంటే MBK కి తెలుగు నోటి ముందు ఉంటుంది. ఆయన చక్కగా తెలుగులోనే మాట్లాడతారు. కానీ ఉపన్యాసం ఇంగ్లీషులో ఇచ్చారనుకోండి తెలుగురాని వాళ్ళు కూడా ఉంటారని. కాకపోతే అవకాశం చిక్కినప్పుడల్లా సుబ్బరంగా తెలుగులోనే మాట్లాడేస్తారు. ఈ ఇంగ్లీషు ఉపన్యాసంలో కూడా అప్పుడప్పుడు తెలుగు వచ్చేస్తూనే ఉంది...భలే ముచ్చటేసింది విన్నంతసేపూ :D.


ఆ ఉపన్యాసం మొత్తం విన్నక నాకు చాలా సరదాగా, హాయిగా, గర్వంగా అనిపించింది. గర్వం ఎందుకనుకుంటున్నారా ఆయన ఉపన్యాసం డైరెక్టుగా వినే అవకాశం వచ్చింది కదా అందుకని :).

సరే ఆ రోజు ఆయన చెప్పిన విషయాల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ, ఆస్వాదిస్తూ, నవ్వుకుంటూ గడిపేసాను. మర్నాడు తెలిసిన విషయమేమిటంటే MBK తెలుగు డిపార్టుమెంటులో ఒక క్లాసురూములో మూడురోజులపాటు సంగీత పాఠాలు చెప్తారు, ఔత్సాహికులు వెళ్ళి నేర్చుకోవచ్చు అని. మరోమాట వినకుండా, పుస్తకం పెన్ను చేతబట్టి, పరిగేట్టుకొని వెళ్ళి క్లాసులో కూర్చున్నాను. కానీ ఆ పాఠం విన్నాక నాకు చెప్పలేనంత చిరాకు వేసింది. స్వరం చెప్పకుండా సాహిత్యం మాత్రమే చెబుతున్నారు. విసుగొచ్చింది. ఇంత పెద్దయన ఇలా పాఠం చెప్తున్నారేమిటి అనిపిచింది. ఓ పేద్ద పుస్తకం ఆయన దస్తూరీతో ఉన్నది పట్టుకొచ్చి అందులో చూస్తూ కీర్తన చెబుతున్నారు. ఆయన అంటూంటే వెనక మేము అనడం...అలా ఒక్కో కీర్తన మూడు సార్లు పాడించారు. మధ్యలో ఒక స్వరజతికి మాత్రం స్వరం చెప్పారు. కొంతమంది వర్ణాలు చెప్పమనడిగితే మధ్యలో కాస్త స్వరం చెప్పారు, అంతే. నాకయితే అస్సలు నేర్చుకోబుద్ధెయ్యలేదు. సరే ఇవాళ ఇలా చెప్పేరు కాబోలు రేపు చూద్దామని మర్నాడు వెళితే మళ్ళీ అదే తంతు. స్వరం లేకుండా సాహిత్యం చెబుతూ పాడించేస్తున్నారు. అక్కడ ఓ పాతికమంది విద్యార్ధులు చేరారు. నాలాగ మిడిమిడి ఙ్ఞానం ఉన్నవాళ్ళు కొందరయితే, రాగాలు, తాళాలు తెలిసినవారు ఇంకొందరు. మిస్సమ్మలో నాగేస్రావులా సపసలు తీసేసి పాట చెప్పండి అనేవాళ్ళు మరికొందరు. కానీ స్వరం చెప్పకుండా కీర్తన ఎలా నేర్చుకోవడం, నాకేమీ అర్థం కాలేదు. సాహిత్యం చెబితే స్వరం అల్లుకునేటంత సంగీత ఙ్ఞానమే ఏడిస్తే నేనెందుకు economics లో PhD చేస్తాను, చోద్యం కాకపోతే! నాకు తెలిసి నాలాగ మిడిమిడి ఙ్ఞానం ఉన్నవాళ్లే తప్ప అలా స్వరఙ్ఞానమున్నవాళ్ళు ఆ గుంపులో ఎవరూ లేరు. అవేవో ఊరికే పాటలు పాడుకున్నట్టు అందరూ పుస్తకాలలో సాహిత్యం రాసేసుకున్నారు, ఆయన వెనకే పాడుతున్నరు. అపశ్రుతులు చెవులకి కన్నం పెట్టేస్తున్నాయి. తాళాలు తప్పుతుంటే నా చెయ్యి బాధగా మూలిగింది. అలా ఒక వారం రోజులు చెప్పినా ఎవరికీ ఆ కీర్తనలు వచ్చే అవకాశమే లేదు. మరి అంత సమయం వెచ్చించి చేస్తున్న పని బూడిదలో పోసిన పన్నీరే కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తున్నారీయన అని అనిపించింది నాకు. లేచి అడుగుదామనుకున్నాను. కానీ తిరిగి ఆయన నీకేంతెలుసు అని ఓ రెండు ప్రశ్నలేసారనుకోండి, నేను అచేతనురాలినయిపోతా, ఎందుకొచ్చిన గొడవలే అని కిం అనకుండా కూర్చున్నాను. ఇంక మూడవరోజు వెళ్లనేలేదు.

ఎలాగైనా MBK గారితో ముఖాముఖి మాట్లాడాలనిపించింది. బేతవోలుగారు మా చెల్లికి గైడు. అది అప్పుడు ఆయన దగ్గర Mphil చేస్తున్నాది. నేను దాన్ని గోకి, అది ఆయన్ని గోకితే మర్నాడు ఉదయం 10.00 గంటలకి నాకు అరగంట టైం దక్కింది MBK తో మాట్లాడడానికి. గబగబా రూముకొచ్చేసి ఆయనని అడగవలసిన ప్రశ్నలన్నీ రాసేసుని మళ్ళీ మళ్ళీ మననం చేసేసుకున్నాను. ఒకవేళ నేను ఏ ప్రశ్న అడిగితే ఆయన తిరిగి ఏ ప్రశ్నలేస్తారో ఊహించేసుకుని, వాటికి జవాబులు కూడా తయారు చేసేసుకుని రెడీగా కూర్చున్నాను. రాత్రి మళ్ళీ అన్ని చూసుకుని పడుకున్నాను.....చెప్పొద్దూ రాత్రంతా బాలమురళిగారే కలల్లో. రోజూ 9.00 అయినా పొద్దు మొహమెరగని నేను ఆరోజు ఆరింటికే లేచి, ఫలహారం కానిచ్చి, చక్కగా ముస్తాబయిపోయి ఎనిమిదింటికల్లా సైకిలు పట్టుకుని రెడీ అయిపోయాను. మరీ ఇంత తొందరగా వెళ్తే బావుండదులే అని చెప్పి, 9.00 వరకు అటూఇటూ కాలక్షేపం చేసేసి అప్పుడు వెళ్ళిపోయా తెలుగు డిపార్టుమెంటుకి. ఒక రకమైన ఉత్సాహం, ఒకరకమైన భయం, ఇంకో రకమైన బిడియం, మరో రకమైన ఆసక్తి మొత్తం కలగలిసి నాలుగు వర్ణాల ఇంధ్రధనస్సూలా మెరిసింది నా ముఖం (బాచెప్పానా? ;)). అక్కడే ఇంకో అబ్బాయి నాలాగే నాలుగు వర్ణాలతో మెరిసిపోతూ కనిపించాడు. విషయమేమిటని ఆరాతీస్తే అతనికీ 10.00 గంటలకే టైం ఇచ్చారట. ఇద్దరం కలిసి ఎనిమిది వర్ణాలయిపోయి ఏమైనా కామన్ ప్రశ్నలున్నయేమొ చూసుకుని ఉన్నవి కొట్టేసి, లేనివి మళ్ళీ మళ్ళీ బట్టీ పట్టేసి, వాచీ చూసుకుంటూ కూర్చున్నాం. ఇంతలో ఒక దుర్వార్త మాకు చేరింది. మా V.C కి అర్జంటుగా అప్పుడే టైం కుదిరిందిట. MBK ని అప్పుడే కలవాలని ముహూర్తం పెట్టేసారట. కాబట్టి ఆయన డిపార్టుమెంటుకి రావట్లేదు, ఆయన ఇచ్చిన టైములన్నీ కేన్సిల్ చేసేసుకున్నారు అని దుర్వార్త వచ్చింది. మా మొహాలు వివర్ణమయిపోయాయి. విభ్రాంతితో కూడిన బాధ వల్ల వచ్చిన ఏడుపుని దిగమింగుకుని రూముముఖం పట్టాము ఇద్దరమూ :(. ఇక ఆ ఆవేదనలోంచి తేరుకోవడం నా వల్ల కాలేదు. అందుకే నా రిసెర్చిని వారం రోజులకి వాయిదా వేసాను. చాలారోజులుగా బాగా పడుకోవాలనుకున్నాను, ఇప్పుడు ఈ బాధవల్ల ఆ టైం వచ్చిందని చెప్పి హాయిగా ముసుగుదీసాను. you see నేనెప్పుడూ ఇంతే, positive thinking ఎక్కువ. ఎలాంటి పరిస్థితినైనా సద్వినియోగం చేసేసుకుంటాను :P. అలా బాలమురళిగారిని కలిసే అవకాశం చేతిదాకా వచ్చి బాగా వెలిగిన తోలుగొట్టం విసిరేయకముందే అరచేతిలో చీదేసినట్టు చీదేసింది. దాంతో మనసు కాలగా వచ్చిన పొగ మెదడుని కమ్మేసి నన్ను నిద్రలో ముంచేసింది :).

ఇప్పుడు ఇంకో మంచి విషయానికొద్దాం. బాలమురళీకృష్ణ గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు కలిసి ఎంకిపాటలు పాడారన్న విషయం మీకు తెలుసా? అవును పాడారు, మామూలుగా కాదు అద్భుతంగా పాడారు. మచ్చుకి మీకు కొన్ని వినిపిస్తాను, వినండి.



అవండీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి ముచ్చట్లు.