StatCounter code

Tuesday, May 31, 2011

నేను, నా పుస్తకాల గోల

పుస్తకాలు చదవడం ఒక మంచి అలవాటు (హాబీ) అని చిన్నప్పటినుండీ పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ అదేంటో నాకు ఈ అలవాటు కానేలేదు చిన్నవయసునుండీ. పెద్దనాన్నగారు చెప్పే పద్యాలు అలాగే నేర్చేసుకుని తిరిగి ఒప్పజెప్పడం తప్ప పుస్తకాలు చదివిన పాపాన పోలేదు. చిన్నవయసులో చందమామ పుస్తకాలు మాత్రం విపరీతంగా చదివేదాన్ని. అవి తప్పితే వేరే పుస్తకాలు ముట్టుకుంటే ఒట్టు. అసలు అంతంత పెద్ద పెద్ద పుస్తకాలు ఎలా చదువుతారో బాబోయ్ అని భయమేసేది నాకు. క్లాసు పుస్తకాలు చదవడానికే బద్దకంగా ఉండేది ఇంక జనరల్ రీడింగ్ ఎక్కడేడిసింది!మా ఇంట్లో రకరకాల పుస్తకాలు ఉండేవి మా కుటుంబంలో అందరికీ చదవడం బాగా అలవాటు. నేను వీళ్ళ మధ్య తప్పబుట్టానేమో అనుకునేదాన్ని ఒక్కోసారి. :(

మా ఇంట్లో అందరూ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారికి పంఖాలు. ఆయన పుస్తకాలన్నీ ఇంట్లో ఉండేవి. సరే మరీ ఇంతలా చెబుతున్నారుగా ఓపాలి చదివి పడేస్తే పోలా అని తొమ్మిదో తరగతిలో మొదలెట్టా "వడ్లగింజలు"...బ్రహ్మాండంగా అనిపించింది....గుక్కతిప్పుకోకుండా చదివేసాను (అప్పట్లో నాకు కళ్ళతో కాకుండా, శబ్దం బయటికి రాకుండా నోటితో చదివే అలవాటుండేది). తరువాత "మార్గదర్శి" చదివాను....అమృతకలశం...వడ్లగింజలకంటే బాగా నచ్చింది. అంతే ఇంక పుస్తకాలు చదవాలన్న తృష్ణ పెరిగింది. "శ్రీపాద కథలు" రెండు భాగాలు ఎకాయెకిని చదివేసాను. నేను పుట్టకముందు రంగనాయకమ్మ గారి స్వీట్ హోమ్ ఆంధ్యజ్యోతిలోనో ప్రభలోనో సీరియల్ గా వచ్చేదిట. ఆ కాగితాలు చింపి బైండ్ చేసి ఒక పుస్తకంగా కుట్టి ఉంచారు మా ఇంట్లో. అది "స్వీట్ హోమ్ పార్ట్-2"...పెద్ద పుస్తకం. అది చదవడం మొదలెట్టా..విపరీతంగా నచ్చేసింది. తరువాత చేతికి దొరికినది చలం "స్త్రీ"...అప్పటికి నేను పదికి వచ్చాను. స్త్రీ చదివి వెర్రెక్కిపోయాను..అప్పటికి చలం బతికున్నాడా లేడా, చలం ఎవరు అన్న స్పృహ లేదు నాకు. చలం ఎక్కడ ఉన్న ఓసారి వెళ్ళి కలిసిరావాలని అనిపించింది స్త్రీ చదివాక. ఆ తరువాత విశ్వనాథవారి "హాహాహూహూ" పుస్తకం మా అత్త వాళ్ళింట్లో కనిపించింది..బలే గమ్మత్తైన కథ..ఓ దేవతాశ్వం, అది కిందకి దిగి రావడం...బలే వింతగా ఉంటుంది. కొత్తగా, సరదాగా, ఆలోచింపదగినదిగా అనిపించింది అప్పట్లో. చాసో గారు మా ఊరే కదా మా కుటుంబానికి చాలా పరిచయం...మా ఇంటికి కూడా వస్తుండేవారు. నాకు చిన్నతనం కాబట్టి పెద్దగా పరిచయం ఉండేదికాదు. మా ఇంటికొచ్చినా నేనెప్పుడూ ఆయనతో మాట్లాడలేదు. ఓసారి మా నాన్నగారు నన్ను, ఆయనకి పరిచయం చేసారు. అప్పుడు ఆయన సంతకం చేసిన కథల పుస్తకం ఒకటి బహుమతిగా ఇచ్చారు నాకు. అందులో "కుంకుడాకు" మాత్రమే చదివాను. తరువాత యండమూరి "తులసీదళం"...ఇది కూడా ఏదో సంచికలో సీరియల్‌గా వచ్చేది. దాన్ని కూడా కుట్టి బైండింగ్ చేసి పెట్టారు మా ఫ్రెండు వాళ్ళింట్లో. తనదగ్గరనుండి తెచ్చుకుని అది మొత్తం చదివాను. ఓసారి మా నాన్నగారు, నాకు రూట్స్ తెలుగనువాదం "ఏడు తరాలు" కొని ఇచ్చారు. అది ఎంత హృద్యంగా అనిపించిందంటే...చదువుతూ ఎన్నిసార్లు కళ్లనీళ్లు పెట్టుకున్నానో నాకే తెలీదు. మనసుకి హత్తుకుపోయింది ఆ పుస్తకం. వేదుల సత్యనారాయణ శర్మ గారు రాసిన "ఆర్య చాణక్య" చదివాను...అద్భుతమైన కథనం...చాలా ఉత్తేజపరిచింది ఈ కథ. ఇంక అంతే, పదికొచ్చేసానుగా పుస్తకాలు పక్కన పడేసి క్లాసు పుస్తకాల మీద పడ్డాను...పై చెప్పినవన్నీ నా అంతట నాకు బుద్ధి పుట్టి చదివిన మొట్టమొదటి పుస్తకాలు. వీటిని ఈ జన్మకి మరచిపోలేను.

చిన్నప్పటినుండీ పద్యాలు అనర్గళంగా చెప్పే అలవాటు మాత్రం అబ్బింది. దాంతో భారత, భాగవత, రామాయణాల్లో పద్యాలు బాగా నేర్చుకున్నాను. స్కూల్ లో పద్య పఠన పోటీలు పెడితే నాకే కచ్చితంగా ఫస్ట్ వచ్చేది. ఓసారి శతక పద్య పఠన పోటీలు పెట్టారు. "లలితసుగుణజాల తెలుగుబాల" అనే మకుటంతో ఉండే శతకం (ఈ పద్యాలు కరుణశ్రీ రాసారు) లో 100 పద్యాలూ కంఠతా పట్టాను. కానీ పోటీకెళ్ళేసరికి 85 మాత్రమే గుర్తు ఉన్నాయి...అయినా ఫస్ట్ నాకే. (సెకండ్ వచ్చిన అమ్మయి 56 పద్యాలే చెప్పింది). ఈ పద్యాలు నేర్చుకునే అలవాటు మా ఇంట్లో చిన్నపిల్లలందరికీ ఉంది. కాబట్టి మా పెద్దనాన్నగారు మా మధ్య ఒక పద్యపఠన పోటీ పెట్టారు. దానికోసమనీ నా పదవతరగతి సెలవుల్లో విరాటపర్వం మొత్తం బట్టీ పట్టాను. మా ఇంట్లో భారతం పర్వాలవారీగా ఒక్కో పుస్తకం ఉండేది. కాబట్టి విరాటపర్వాన్ని కూడ ఓ పుస్తకం గా లెక్కేసేస్తున్నా. :)

ఇంక అంతే, మళ్ళీ జనరల్ రీడింగ్ జోలికి పోలేదు. మా ఇంట్లో అందరూ "దీనికి పుస్తకాలు చదివే అలవాటు ఈ జన్మకి అబ్బదు, ఇది ఎందుకూ పనికిరాదు" అని నిర్ణయించేసుకునే సందర్భంలో మళ్ళీ మొదలెట్టాను ఓ నాలుగేళ్ళు గడిచాక...నా డిగ్రీ లో. కానీ తెలుగు కాదు. ఇంగ్లీషు నేర్చుకోవాలనే ప్రయాసతో Ayn Rand రాసిన "Fountain Head". మనకి వచ్చిన ఇంగ్లీషే అంతంత మాత్రం ఇంక అంత పెద్ద పెద్ద పుస్తకాలు కొరుకుడుపడాలంటే సాధ్యమా!...ఓ సంవత్సరం చదివా. తరువాత "Atlas Shrugged"...ఇది కూడా ఓ యేడాది పట్టింది. మాక్సీం గోర్కీ "అమ్మ" చదివాను...బావుంది కానీ ఏడుతరాలంత కదిలించలేదు.

ఇంకేముంది డిగ్రీ అయిపోగానే విజయనగరం వదిలేసి హైదరాబాదుకి చలో....HCU లో చేరాక పుస్తకాలు వగైరా మూలన పడేసి కెరీర్ అనుకుంటూ దానివెంట పరిగెత్తాను. మళ్ళీ ఏ పుస్తకం తెరవలేదు. మా HCU లో ఉన్న తెలుగు లైబ్రరీ లాంటిది నేనెక్కడా చూడలేదు. అసలు రెండు కళ్ళు చాలవు ఆ పుస్తకాలు చూడడానికి. కానీ నేనెప్పుడు అటువైపు పోనేలేదు. PhD కొచ్చాక...మూడేళ్ళు దాటాయి 2007కి...ఎంతకీ మా గైడ్ తెమల్చడు...నరకం చూపిస్తున్నారు. అసలు ఈ జన్మకి నా PhD అవుతుందా అని కళ్ళనీళ్లు పెట్టుకునేదాన్ని రోజూ. విసుగు, నిరాశ, నిస్పృహ, విరక్తి ఇలాంటివన్నీ కలిగి ఏమి చెయ్యలో తెలీదు. నాతోటివారికి చెప్పుకుందామా అంటే ఇంచుమిందు వారూ అదే పరిస్థితిలో ఉంటారు. పెద్దవారికి చెబితే PhD యా మాజాకా, అలాగే ఉంటుంది, తట్టుకోవాలి అన్నీ అంటారు. ఇక ఎటూపాలుపోక పుస్తకంలో తలదూర్చాను. లైబ్రరీకెళ్ళి "కన్యాశుల్కం" తెచుకున్నాను. ఆపాకుండా చదివాను. ఎంత నచ్చేసిందంటే ఇన్నాళ్ళు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదవనందుకు ఎన్ని సార్లు నన్ను నేనే తిట్టుకున్నానో చెప్పలేను. మా ఇంట్లో ఉండి కూడా ఎప్పుడూ చదవలేదే అని తెగ బాధపడిపోయాను. ఏకబిగిన చదివేసి మొత్తం పూర్తిచేసాను. సంతృప్తి కలగలేదు, మళ్ళీ మొదటి పేజీ నుండి మొదలెట్టాను. అలాగే ఏకబిగిన చదివాను. ఇప్పటివరకూ ఒకే పుస్తకం వరుసగా రెండు సార్లు చదవడం అన్నది కన్యాశుల్కం విషయంలో మాత్రమే జరిగింది. ఇంకే పుస్తకం అలా చదవలేదు. ఆ తరువాత చలం ది "సత్యం, శివం, సుందరం" తీసాను. అప్పుడు పట్టింది నాకు చలం పిచ్చి...దాదాపు ఆయనవి అన్నిపుస్తకాలు ఉన్నాయి మా లైబ్రరీలో...ఒక్కోటి చదవడం మొదలెట్టాను. కొన్ని వీపరీతంగా నచ్చాయి. కొన్ని కొంచం నచ్చాయి, కొన్ని అస్సలు నచ్చలేదు, ఇంకొన్ని చిరాకేసాయి. కానీ వాటిని ఎలా విశ్లేషించుకోవాలో తెలియలేదు. అప్పుడు రంగనాయకమ్మగారి "చలం సాహిత్యం" పుస్తకం చదివాను. అది చదివాకే చలం ఇంకా బాగా బోధపడ్డాడు అని చెప్పగలను. అలా RN పుస్తాకాల మీద పడ్డాను. స్త్రీవాద రచనలు బాగా నచ్చాయి. మార్కిజం పాళ్ళు ఎక్కువవుతున్నకొద్దీ కొద్దిగా బోర్ కొట్టాయి.


ఇంక అక్కడమొదలయింది నా పుస్తక పఠన ప్రవాహం. ఒకటేమిటి విశ్వనాథ వేయిపడగలు, శ్రీరమణ మిధునం, పేరడీలు, హాస్యజ్యోతి, కథలు...అన్నీ, ముళ్ళపూడి రమణీయాలు అన్నీ, కొ.కు చదువు, వ్యాసాలు, నామిని పచ్చనాకుసాక్షిగా, మిట్టూరోడి కథలు, పానుగంటి వారి సాక్షి వ్యాసాలు, తిలక్ కథలు, శ్రీపాద క్షీరసాగర మధనం,పుల్లంపేట జరీచీర,అనుభవాలు-జ్ఞాకపకాలు, ఆరుద్ర రచనలు కొన్ని, యండమూరి యుగాంతం, భ.రా.గో రచనలు, గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర, ఇరావతీ కర్వే యుగాంతం, గురజాడ దిద్దుబాటు, భానుమతి అత్తగారి కథలు, నాలో నేను, మొక్కపాటి బారిస్టరు పార్వతీశం, మల్లాది కృష్ణాతీరం,శ్రీదేవి కాలాతీతావ్యక్తులు....ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే రెండు టపాలు అవుతాయి...అలా చేతికి ఏది దొరికితే అది చదివేసాను. అలా చదవడం వల్ల నాకు ఎలాంటి భావనలు నచ్చుతాయి, ఎలాంటివి భరించలేను అన్న లైన్ క్లియర్ కట్ గా బోధపడంది. ఇలా చదవడమే కాకుండా విశాలాంధ్ర పై దాడి కూడా చేసాను. నచ్చిన పుస్తకాలన్నీ కొనేసుకున్నాను. కోటీలో విశాలాంధ్ర exhibition ఉంటుంది ఎప్పుడూ. అక్కడ 10% ఆఫ్ ఇస్తాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు బోల్డు పుస్తకాలు కొనేసాను రూ. 1000 రూపాయలయింది. ఆ పుస్తకాలు యూనివర్సిటీకి ఎలా తీసుకెళ్ళాలన్నది సమస్య. కోటీలో పెద్ద బేగు కొని అందులో అన్నీ నింపేసి తీసుకెళ్ళాను. కేంపస్ లో అడుగుపెడుతుంటే అందరూ ఏంటి ఊరెళ్ళి వస్తున్నావా అని పలకరించారు. :D ఇంక అప్పటినుండీ ప్రతీ ఆదివారం కోటీ కి ఆ బేగుతో వెళ్ళడం రూ. 1000-1500 రూ వరకూ పుస్తకాలు కొనడం. విశాలాంధ్రవాడు సంతోషం పట్టలేక నాకు 15% ఆఫ్ ఇచ్చేవాడు. తరువాత అది 18% పెంచాడు. ఓరెండు వారాలు నేను వెళ్ళకపోతే నాకు ఫోన్ చేసి 'ఏంటి మేడం మీరు రావట్లేదు' అని అడిగేవాడు. :D ఏదైనా పుస్తకం లేకపోతే నాకోసం తెప్పించేవాడు. చలం పుస్తకాల కోసం అతన్ని పెట్టించిన పరుగులు అన్నీ ఇన్నీ కాదు. ప్రింట్ లో లేని పుస్తకాలు కొన్ని వాళ్ళ గోడౌన్ లో ఎక్కడో పడి ఉంటే అవి వెతికి మరీ తెప్పించుకున్నాను. ఎప్పుడు ఖాళీ దొరికినా ఆ exhibition కి వెళ్ళి ఏదో ఒక్కటైనా పుస్తకం కొనకుండా బయటకి వచ్చినది ఏనాడూ లేదు. చివరికి PhD అయిపోయాక ప్రత్యేకంగా వాడిదగ్గరకెళ్ళి స్వీట్స్ ఇచ్చి ఇంకో నాలుగు పుస్తకాలు కొని మరీ వచ్చాను. అలా ఆ యేడాది మొత్తం పుస్తకాల మీదే గడిపాను. ఓ 6-7 వేల దాకా పుస్తకాల మీద ఖర్చుపెట్టాను. ఆ మొత్తం సంవత్సరం PhD అన్నది పట్టించుకోలేదు. పూర్తిగా పక్కన పెట్టేసాను. ఆ తరువాత మా గైడ్‌ ఎందుకో, ఏమిటో దారిలోకొచ్చి నన్ను పట్టించుకోవడం మొదలెట్టారు. ఇంక అప్పటినుండీ నేనూ ఈ జనరల్ రీడింగ్ పక్కనపెట్టేసి సీరియస్ గా రిసెర్చి చేసాను. అంతే మళ్ళీ వదిలేసాను పుస్తకాలని. (మధ్యమధ్యలో యండమూరి నవలలు, యద్ధనపూడి సులోచనారాణి నవలలు కొన్ని చదివాను. కానీ ఏదో కాలక్షేపానికే).

ఇదిగో ఇప్పుడు ఈ మధ్యనే మళ్ళీ మొదలెట్టాను. ఎలా అంటే...రోజూ ఆఫీసుకి మెట్రోలో వెళ్ళేటప్పుడు 20-25 ని. వచ్చేటప్పుడు 20-25 ని. ప్రయాణం చెయ్యవలసి ఉంటుంది. మొదట్లో ఆ ప్రయాణం కొత్త కాబట్టి ఆ టైములో వచ్చేపోయేవారిని గమనిస్తూ ఉండేదాన్ని. తరువాత కాస్త బోర్ కొట్టి పాటలు వినడం మొదలెట్టాను అదీ బోర్ కొట్టాక ఆ 20 ని. ఏదో పెద్ద ప్రయాణంలాగ అనిపించడం మొదలెట్టింది. మామూలుగా దూరప్రయాణాలలో పుస్తకం చదువుకునే అలవాటుంది, అదే ఇక్కడ ఎందుకు మళ్ళీ మొదలెట్టకూడదూ అనిపించింది. మెల్లిగా మొదలెట్టాను. ఈసారి కాస్త ఇంగ్లీషు పుస్తకాలు కూడా చదువుదామని నిర్ణయించుకున్నాను. గత మూడు నెలలలో నేను పూర్తి చేసిన పుస్తకాలు

1.చదువులా చావులా - నామిని
2. The White Tiger - Aravind Adiga
3. The Illustrated Brief History of Time, Updated and Expanded Edition - Stephen Hawking
4. సహజ - ఓల్గా
5. మానవి - ఓల్గా

'చదువులా చావులా' గురించి ఇంతకుముందే బ్లాగులో రాసాను.

'వైట్ టైగర్' చాలా ఎంజయ్ చేస్తూ చదివాను. డిల్లీ లో రెండేళ్ళుగా కారు డ్రైవర్ల పరిస్థితి గమనించి ఉన్నానేమో ఈ పుస్తకం అద్భుతంగా అనిపించింది. బీహార్ నుండి వచ్చే కారు డ్రైవర్ల దయనీయ పరిస్థితి, వారి మానసిక సంఘర్షణ. స్వేచావాయువులు పీల్చాలనే ఆరాటం...ఇవన్నీ చాలా బాగా చిత్రీకరించారు. అందరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం. డిల్లీ పరిస్థితులు తెలిసున్నవాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు.

నాకు ఫిజిక్స్ అంటే కొంచం ఆసక్తి. ఇంతకుముందే Brief History of Time చదివాను. ఇప్పుడు updated version వచ్చిందని తెలిసి వెంటనే కొని చదివేసాను. Stephen Hawking గురించి నేను కొత్తగా చెప్పేదేముంది...ఆ పుస్తకం చదువుతుంటే ఏదో వేరే ప్రపంచంలో ఉన్నట్టు అబ్బురంగా తోస్తుంది.

'సహజ', 'మానవి'..ముందుగా సుజాత (మనసులో మాట) గారికి బోలెడు బోలెడు ధన్యవాదములు ఈ పుస్తకాలు పంపించినందుకు. ఓల్గా వ్యాసాలు ఎప్పుడో చిన్నప్పుడు ఒకటి రెండు చదివానుకానీ దృష్టిపెట్టి ఎప్పుడూ చదవలేదు. ఈ పుస్తకాల గురించి తెలియజెప్పడమే కాకుండా వెంటనే పంపించినందుకు నేను సుజాత గారికి ఋణపడిపోయాను. రెండూ మంచి పుస్తకాలు....స్త్రీ చైతన్యం, హక్కులు ప్రధాన ప్రాతిపదికగా రాయబడిన కథలు...నాలో ఎన్నో ఆసక్తికరమైన ఆలోచనలను రేకెత్తించాయి.

తెలుగయితే 20 నిముషాలలో ఓ 30 పేజీల వరకూ అయిపోయేవి. ఇంగ్లీషు అయితే ఓ 15 వరకు అయ్యేవి. మూడునెలలలో ఐదు పుస్తకాలు చదివానంటే నాకే గొప్ప ఆనందంగా ఉంది.

ఇప్పుడు చదువుతున్నది Ideas and Opinions - Einstein. ఇది కొంచం కష్టంగా ఉంది...అయినా ఇష్టం గా చదువుతున్నాను. కాకపోతే కాస్త మెల్లిగా నడుస్తున్నాది బండి.

తరువాత లిస్ట్ లో ఉన్నవి.

1. విశ్వదర్శనం - నండూరి
2. Delhi - Kuswanth Singh
3. The Motorcycle Diaries (ఎప్పటినుండో చదవాలని అనుకుంటూ ఉన్నాను, ఇప్పటికి నా లిస్టులోకొచ్చింది).
4. చివరికి మిగిలేది - బుచ్చిబాబు (ఇది సగమే చదివాను, పూర్తిచెయ్యాలి).

ఇవి పూర్తయ్యాక మళ్ళీ కొత్త లిస్ట్ పెట్టుకుంటాను. చినవీరభద్రుడి కథలు , కా.రా కథలు చదవాలని కోరిక. తరువాతి లిస్టులో అవి ఉంటాయి. ఏది ఏమైనా అసలు పుస్తకాలు చదవడం అలవాటు లేని స్థాయి నుండీ మెల్లిమెల్లిగా లిస్టుగా పెట్టుకుని పుస్తకాలు చదివే స్థాయికి రావడం ఆనందంగా ఉంది. ఈ పుస్తకాలన్నీ నన్ను నేను మలుచుకోవడానికి ఎంతో తోడ్పడ్డాయి. ఎంతో మానసికోల్లసాన్ని కలిగించాయి. వీటినుండి ఎంతో నేర్చుకున్నాను. ఆలోచనా శక్తి అభివృద్ధి చెందింది. పరిశోధనాసక్తి పెరిగింది. కొత్త కొత్త విషయాలు తెలిసాయి. అంతర్గత భావాలను వ్యక్తపరచగలిగే సామార్థ్యం పెంపొందింది. భాష మీద పట్టు చిక్కింది. ఈ పుస్తకాలు నాకు నేస్తాలు....చిరాకులో, బాధలో నాకు తోడుగా నిలిచాయి, మరువలేని ఆనందాన్ని పంచాయి. ఈ పుస్తకాలే లేకపోతే నా జీవితంలో అతి ముఖ్యమైన ఒక భాగం లేనట్టే. గత రెండు మూడేళ్ళుగా ఎవరికైనా బహుమతి ఇవ్వాలనుకుంటే పుస్తకమే ఇస్తున్నాను. ఇది, ఇప్పుడు ఒక అలవాటుగా కూడా మారింది. వేరే బహుమతుల వైపు దృష్టి పోనేపోవట్లేదు. సందర్భానికి తగ్గట్టుగా ఏం పుస్తకం ఇద్దాం అని ఆలోచిస్తుంటాను. కానీ నేను చదివినవి ఏమీ కావు...ఇంకా ఎన్నో ఏన్నెన్నో ఉన్నాయి. ప్రతీసారి నేను ఈ పుస్తకం చదవలేదే అనిపిస్తే ఎంతో బాధగా ఉంటుంది. అవన్నీ ఎప్పుడు చదువుతానో ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఈ జీవితకాలం సరిపోతుందా అని బెంగగా ఉంటుంది. కానీ నిరంతరంగా చదవడం తప్పించి చేయగలిగినది ఏమీ లేదు కదా!

Let books be your dining table,
And you shall be full of delights
Let them be your mattress
And you shall sleep restful nights.... అని ఎక్కడో చదివాను. ఇది నాకు బాగా నచ్చింది!Monday, May 9, 2011

చదువులా, చావులా?

నా స్నేహితురాలి కూతురు బలే చురుకైన పిల్ల. వాగుడు కాయ నెంబర్ వన్ ...ఒకసారి మొదలెట్టిందంటే ఆపడం చాలా కష్టం. చురుకైనది, చాలా తెలివైనది కూడా. అలాంటిది మొన్న ఆ మధ్య కలిసినప్పుడు చాలా డల్ గా ఉన్నాది. మాటలు బాగా తగ్గించేసింది. నేను దాన్ని పిలిచి, కొత్త స్కూలు లో చేరానన్నావు, ఆ విశేషాలు చెప్పు అని అడిగితే పెదవి విరిచేసి, మాట మార్చేసింది. ఏమయింది దీనికి అని మా ఫ్రెండుని అడిగాను. కొత్త స్కూలు లో చేర్చాక దానికి చదువు మీద శ్రద్ధ పెరిగింది. వాగుడు తగ్గించి బుద్ధిగా చదువుకుంటున్నాది. మంచిదే, కొత్త స్కూలులో బాగా చెబుతున్నారు, పిల్ల దారిన పడుతోంది అదే నాకు సంతోషం అని ఇంత మొహం చేసుకుని మెరిసే కళ్ళతో నా ఫ్రెండు చెబుతుంటే నాకు ఎక్కడో అనుమానపు పొర మెదిలింది. సరే అని సమయం చూసి దాన్ని పిలిచి, ఆ మాట ఈ మాట కలిపి, మెల్లిగా స్కూలు గురించి అడగడం మొదలెట్టను. మొదట్లో తప్పించుకోవాలని చూసినా, ఎట్టకేలకు పెదవి విప్పింది. దానికి కొత్త స్కూలు అస్సలు నచ్చలేదు. అక్కడ పాఠాలు చెప్పి చంపేస్తున్నారు. ఏమీ బుర్రకెక్కట్లేదు. కావలసినట్టు ఆడుకోవడనికి, చందమామలు చదువుకోవడానికి టైము ఉండట్లేదు, విసుగొస్తున్నాది పాపం. ఇంతా చేస్తే అది చదువుతున్నది ఆరో తరగతి. మేథ్స్ టీచరు మహా కర్కోటకుడుట. చెప్పినది వినడం, పది సార్లు బట్టీ పట్టడం తప్ప ఏదైనా అర్థం కాలేదని అడిగితే చెంపలు వాయిస్తాడట. ఏదైనా డౌటు అడిగితే ఆ మాత్రం అర్థం చేసుకోలేవూ, చూడు నీ తోటి పిల్లలు ఎంత చక్కగా అర్థం చేసుకుంటున్నారో అని ఎద్దేవా చేస్తాడట. దాని మేథ్స్ నోట్ బుక్ చూసాను. ఆరో తరగతిలో logarithms ఉన్నాయి. ఇదేమిటి మన చదువుకున్నప్పుడు ఏడు లో కొంత పరిచయం మాత్రమే చేసేవారు. ఇప్పుడు ఆరు లోనే చెప్పేస్తున్నారా, సర్లే కాలం మారిందిగా అనుకున్నాను (ఈ మధ్య స్కూల్లో సిలబస్సు అవీ ఎలా మారాయో నేను గమనించలేదు). పాపం ఆ చిన్ని బుర్రకి లాగ్ పవర్ e కి లాగ్ పవర్ 10 కి ఉన్న తేడా అర్థం కావట్లేదు. చాలా కష్టంగా ఉంది అంటున్నాది. దాని తెలుగు అసైన్మెంట్ చూసాను. "సువర్ణదీర్ఘసంధి" అని ఉంది...దానికి టిక్ పెట్టబడి, మార్కులు కూడా వేయబడి ఉన్నాయి. వాళ్ళ టీచరే కరక్ట్ చేసిందిట...రెండు సార్లు 'సువర్ణ అని రాసినా అది తప్పుగా కనిపించలేదు మహతల్లికి.

ఇంతలో పక్కింటి అమ్మయి ఒకర్తి వచ్చింది పుస్తకాలు పట్టుకుని. వాళ్ళిద్దరూ రోజూ ఓ గంట కుర్చుని చదువుకుంటారట. ఆ పిల్ల 8 చదువుతున్నాది. ఆ పిల్ల నోట్స్ చూసాను. అందులో ప్రోబబిలిటీ ఉంది....ఏదో భయంకరమైన కౄర జంతువుని చూసినట్టు అదిరిపడ్డాను నేను. ఎనిమిది లోనే ప్రోబబిలిటీ ఏమిటి, మాకు పది లో ప్రోబబిలిటీ గురించి కొంచం పరిచయం మాత్రం చేసేవారు అంతే. ఆ మాత్రం దానికే చుక్కలు కనిపించాయి నాకు. ఇప్పుడేమో ఈ పిల్ల ఎనిమిదిలోనే చదివేస్తున్నాది. పైగా ఆ పిల్ల చెప్పినది విన్నాక నాకు కళ్ళు తిరిగినంత పనయింది. వాళ్లకి ప్రోబబిలిటీ పాఠ్య పుస్తకంలో లేదుట. పై క్లాసులలో ఉంటుందిట. కానీ కింది క్లాసులలోనే అది చదివేసుకుంటే పదికి వచ్చేసరికి సులువుగా ఉండి పదిలోనే ఇంటర్ లెక్కలు అవీ నేర్చేసుకోవడానికి వీలుగా ఉంటుందిట. అప్పుడు ఇంటర్ లో మొత్తం సమయమంతా IIT కోచింగ్ మీద ఖర్చు పెట్టి మంచి ర్యాంకులు తెచ్చేసుకోవచ్చుట. ఇది వాళ్ల స్కూలో ప్లాను. అందుకని వీళ్ళని ఇలా రుద్దేస్తున్నారు. ఇది విన్నాక నాకు ఒక విచిత్రమైన, భయంకరమైన ఊహ వచ్చింది. రేపొద్దున్న కడుపులో పిండం పడీ పడగానే, ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వడానికి కావలసిన ఆసక్తిని రేకిత్తించే మందులను ఇంజక్ట్ చేసేసి, పుట్టగానే చదువు మొదలెట్టేసి,ఆరో తరగతి లోపే పదో తరగతి పూర్తిచేయించేసి, పదో తరగతి లోపు IIT కోచింగు పూర్తయిపోయి, ఇంటర్ లో ఇంజనీరింగు కోర్సులు చెప్పేసి, B.Tech లో M.Tech, M.Tech లో phd చేయించేసి...అమ్మో...తలుచుకుంటేనే కడుపులో దేవినట్టనిపించింది. :( సరే ఇంతకీ మీరిద్దరూ వేరేవేరే క్లాసులు కదా కలిసి చదువుకోవడమేమిటర్రా అని అడిగితే.... పక్కింటి పిల్ల తో కూర్చుని చదువుకుంటే ఎనిమిదో క్లాసు లెక్కలు కూడా దీనికి కొంచం తెలుస్తాయిట (ఇది నా ఫ్రెండు పైత్యం) అప్పుడు ఎనిమిదో క్లాసుకొచ్చేసరికి దీనికి సులువుగా ఉంటుందిట. అలాగే దీనికి చెబుతూ చదువుకోవడం వల్ల పక్కింటి పిల్లకి ఆ లెక్కలు బాగా వంటబట్టి ఇంకెప్పటికీ మరచిపోదుట. ఆహ ఏమి తెలివితేటలే తల్లి అని, ఇంక లాభం లేదని చెప్పి, ముందు ట్రీట్మెంట్ వీళ్ల అమ్మకి జరగాలి అనుకుని...నామిని రాసిన "చదువులా, చావులా?" పుస్తకం ఇచ్చాను నా ఫ్రెండుకి. ఈ మధ్యనే ఈ పుస్తకం నేను చదివాను.

నామిని రాసిన ఈ పుస్తకం నాకు చాలా నచ్చింది. ఇది 2008 లో వచ్చిందనుకుంటా. ఈ పుస్తకం గురించి ఆయన మాటల్లో: "పాత కాలంలో పిల్లల్లు సరి అయిన వైద్యం అందక లేత వయసులోనే చచ్చిపోయేవాళ్ళు. ఈ కొత్త కాలంలో చేతికి అంది వచ్చిన పిల్లలు, మనం కోరిన చదువుల్ని అందుకోలేక అన్యాయంగా చచ్చిపోతున్నారు"

అలా ఉంది ఇవాల్టి పరిస్థితి. నామిని 'ఇస్కూలు పిల్లకాయల కథ', 'పిల్లల భాషలో ఆల్జీబ్రా' అనే రెండు పుస్తకాలు రాసారు ఇంతకుముందే. కానీ ఈ చదవుల చేతిలో నలిగిపోయే పిల్లల బాధలు చూడలేక ఈ పుస్తకం రాసారుట. ఈ పుస్తకం లో రాయదలుచుకున్న విషయాన్ని 50 మంది పిల్లలకు చెప్పారట. వాళ్ళంతా దీనికి "చదువులా చావులా" అనే పేరు పెట్టమని సూచించారట. పాపం కదూ...వాళ్ళ చిన్నారి మనసులు ఎంత నలిగిపోకపోతే ఈ మాటంటారు! బడి,చదువు అంటేనే అగ్నిగుండం లో దూకుతున్నట్టు బాధపడుతున్నారు.

(పై ఫొటో వీవెన్ గారి సౌజన్యం)

చిన్నవయసునుండే పిల్లలు ఎంత ఒత్తిడిని భరిస్తున్నారో, తల్లిదండ్రుల గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి ఎన్ని అవస్థలు పడుతున్నారో, వారి మానసిక పరిస్థితి ఎలా తయారవుతున్నాదో ఈ పుస్తకంలో ఉదాహరణలతో వివరిస్తారు. అంతేకాక పాఠాలు చెప్పే పంతుళ్ళ రాక్షసత్వం, విద్యా బోధనలోని కర్కసత్వం కళ్లకు గట్టినట్టుగా చూపిస్తారు. ఇవన్నీ నామిని కల్పించిన కథలు కావు...చేదు నిజాలు, నిజంగా కళ్ళజూచిన చేదు అనుభవాలు. ఇది ఇప్పటి విద్యావిధానాల పై స్వీయ అనుభవాలను చేర్చి ఝళిపించిన కొరడా.

తన భార్యే తన కూతురితో చదువు విషయమై ఎలా మాట్లడుతుందో, ఎలా హింసిస్తుందో కళ్లకు కట్టినట్టుగా రాస్తారు. "14 ఏండ్ల నాకూతురి మీద, 30 కేజీల నా కూతురి మీద, 300 కిలోల బరువూ బాధ్యతా" అని వాపోతారు. పిల్లలని చావచితగ్గొట్టకుండా వారికి అర్థమయిన రీతిలో బుజ్జగిస్తూ, అరటిపండు తొక్క వలిచి చేతిలో పెట్టినట్టుగా ఎలా పాఠాలు చెప్పొచ్చో వివరిస్తారు. బిడ్దను ఒళ్ళో కూర్చోబెట్టుకుని మజ్జిగన్నం తినిపించి మూతి తుడిచినంత ప్రేమతో లెక్కలు అవీ చెప్పాలి అంటారు, నిజమే కదూ!

కోళ్ళ ఫారం లా స్కూళ్ళు పెట్టి పిల్ల జీవితాలతో ఎలా ఆడుకుంతున్నారో స్వీయ అనుభవాలతో రాస్తారు. ఆయన స్వయంగా విన్న విషయం: "ఒక షెడ్డేసి రెండువేల పిల్లలతో బ్రాయ్లర్స్ పెట్టేసాను. మనకింకా అరవై అంకణాలుంది. దాంట్లో కూడా షెడ్డేసి స్కూలు పెట్టేసాను. ఏక్‌దమ్మున 200 మంది పిల్లలు చేరిపోయారు." కొత్తగా పెట్టిన స్కూలులో అంతమంది పిల్లలు ఎలా చేరిపోయారూ అని అడిగితే "బలే ఐడియా వేసానులెండి. LKG, UKG - ఫిఫ్టీ రుపీస్. 1st to 7th - 100 రుపీస్ ఫీజు. అంతే ముందు ఆట్లాగే పెట్టలి. షెడ్ బాగుంది. మద్రాసు దాకా పోయి 5 వేలు పెట్టి టాయ్స్ అవీకొనుక్కొచ్చాను. చేరి పోయారు" అని చెప్పాట్ట ఒక మహానుభావుడు.

"ఈ speed, acceleration మీ నెత్తినేసుకు రుద్దుకోండి, ఈ physics లేని లోకానికి వెళ్ళిపోతున్నాను" అని ఓ చిన్నారి ఉత్తరం రాసి పెట్టి, నిండు జీవితాన్ని బలి చేసుకున్న కథ వింటే మనసు కకావికలమవుతుంది. ఒక పాప స్కూలు డ్రెస్ మీద స్వెట్టర్ వేసుకుందిట. "ఏమ్మా ఉక్కబెడుతుంటే స్వెట్టర్ కూడా వేసుకున్నవ్" అని అడిగితే "టీచర్లు కొడతారు కదా సార్, ఈ స్వెట్టర్ వేసుకుంటే కాస్త మెత్తగా ఉండి నెప్పి తక్కువగా ఉంటుందని వేసుకున్నా సార్" అందిట. ఈ మాట విన్నాక నాకైతే ఇంకో ఉపయోగం కూడా కనిపించింది. ఆ పుస్తకాల సంచి మొయ్యడానికి కూడా, మెత్తగా ఉండి, పనికివస్తుంది అనిపించింది. చిన్న తరగతులనుండే బండెడు పుస్తకాలు మోయలేక వాళ్ళ మొహాలు ఎంత వడిలిపోతుంటాయో!


ఇంటర్ లో చదువుల గురించి రాస్తూ....కోడిని కొయ్యడానికి మెడ మీద కత్తిపెట్టాక దాని గుండెకాయలు ఎంత స్పీడుగా కొట్టుకుంటాయో అంత ఉద్విగ్నంగా ఉంటారుట పిల్లలు ఎంసెట్ ఫలితాల వెల్లడి అప్పుడు.

"చదువులో పసలేదుగానీ సోకులకేం కొదవలేదు. పుస్తకం ముందు నిముషం కూర్చోలేవు. అద్దం తీసుకుంటే మాత్రం ఒళ్లే తెలవదు. బిడ్డ చదివితే ముచ్చట. ఈ సోకులు చేసుకుంటే కాదు. ఆ సుజాతని చూడు. పుట్టుక అంటే అది! ఆ పిల్ల చదివే స్కూలే కదా నువ్వూ చదివేది, ఆ పిల్లకి చెప్పే టీచర్లే కదా నీకూ చెప్పేది. నీ తలకాయలో ఉండేది బంకమట్టి కదా" - ఒక తల్లి.

"కన్ననేరానికి టెన్త్ ఫెయిలవగానే దీనికి ఎవణ్ణో ఒక పంగమాలిన వెధవను చూసి తగిలించేస్తే పోతుంది" - ఒక తండ్రి.

"అమ్మా, తల్లి! నీ కథ నాకు తెలుసు. నువ్వు ఒక్క ఫార్ములా కూడా నేర్చుకోలేవు. నీకు పవన్ కల్యాణ మీద ఉండే శ్రద్ధ సబ్జెక్టు మీద లేదు" - ఒక టీచరు.

దీన్ని దెయ్యల భాష అంటారు నామిని. ఇది మనుషులు మాట్లాడవలసిన భాష కాదు, అందుకే ఈ పుస్తకం రాసానంటారు. మేజిక్ ఫిగర్ 500 కోసం మేథ్స్ టీచర్లు పిల్లలని ఎలా చావబాదుతున్నారో, క్లవర్లు, మొద్దులు అని పిల్లలని విడదీసి వాళ్ళ పసి మనసులని ఎంత నుసి చేస్తున్నారో అన్న విషయలు వింటుంటే మనకే గుండె తరుక్కుపోతుంది, ఇంక ఆ పిల్లల సంగతి ఏంగాను! తల్లిదండ్రులకి కూడా పిల్లల సమగ్రవికాసం అక్కర్లేదు. కావల్సినది ర్యాకులే. వారికి ఆటలు అక్కర్లేదు. లలితకళల ప్రాధాన్యత చెప్పక్కర్లేదు. మానసికోల్లాసం కలిగించక్కర్లేదు. చదివేసుకుని మార్కులు తెచ్చుకుంటే చాలు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు.

ఒకాయన వాళ్ళ పిల్లాడి రోజువారీ కార్యక్రమాల గురించి చెప్పాడట....
1)మా హరీ ఉదయన్నే నాలుగ్గంటలకి నిద్ర లేవాలి. మనసు ప్రశాంతంగా ఉండడానికి అరగంట ధ్యానం.
2)తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని, యూనిఫాం వేసుకుని రెడీ అయిపోతాడు. 5 గంటలకల్లా Maths, physics, chemistry చెప్పే ట్యూషన్ మాస్టారు వస్తాడు. 7 వరకూ ఆయన పాఠాలు చెబుతాడు. తర్వాత ఎనిమిదిన్నరకల్లా మరోసారి రివిజన్ చేసుకుని కప్పు నానబెట్టిన బఠానీలు, ఒక గ్లాసుడు పాలూ...స్కూలికెళ్ళిపోతాడు.
3) 12-45కి మధ్యాహ్నం భోజనం, డ్రైవర్ తీసుకెళ్తాడు, రోకటితో దంచిన దంపుడు బియ్యం భోజనం-అదీ 150 గ్రాములు. మరోవంద గ్రాముల దాకా పచ్చి కూరగాయలు. గుడ్డూగానీ మటన్ గానీ నహీ. పిల్లవాడు sharp గా ఉండడానికి ఉడకబెట్టిన వంటలేవీ లేవు - అంతా పచ్చికూరగాయలే!
4) సాయంకాలం నాలుగ్గంటలకల్లా స్కూలుకెళ్ళి వాణ్ణి pick up చేసుకుని 4.30 కి - నల్లకుంట రామయ్య కోచింగ్ సెంటర్ లో సీటు రావడానికి తీసుకునే కోచింగ్. 7.30 కి అక్కడ అయిపోతుంది.
5) రాత్రి ఎనిమిదికి ఇంటికి రాగానే మంచినీటి స్నానం. అర్థగంట ప్రశాంతత కోసం flute వాయించాలి. 8.30 కి పచ్చికూరలతో దంపుడు బియ్యం భోజనం.
6) రాత్రి పదకొండు దాకా మళ్ళీ subjects మీద పడడం.

ఇలాగే రోజూ జరుగుతుందిట. ఆదివారాలు ట్యూషన్ మాస్టర్లు, కోచింగ్ సెంటర్లూ...బలే బిజీ. ఆ తండ్రికి ఇదొక యజ్ఞంట. ఇంతా చేస్తే ఆ కుర్రాడు చదువుతున్నది 8 వ తరగతి. ఈ మహా యజ్ఞం గురించి సదరు తండ్రే స్వయంగా నామిని కి చెప్పాడుట.

ఒక పిల్లడు తన నోట్స్ చివర టైమ్ టేబిల్ లో సోమ నుండీ శని వరకూ అన్ని పీరియడ్లలోనూ playing అని రాసుకుని చివరి పీరియడ్లో మాత్రం subject రాసుకున్నాడట. ఏంటమ్మా ఇలా టైమ్ టేబిల్ తయారుచేసుకున్నావ్ అని అడిగితే "ఇలా ఉంటే ఎంత బాగుంటుందా అని తమాషాగా రాసుకున్నా" అన్నాడుట. పాపం ఆ పిల్లవాడికి ఆడుకోవాలని ఎంత ఆశగా ఉండి ఉంటుందో కదా! ఇటువంటి దృష్టాంతాలెన్నో కళ్ళకుగట్టినట్టుగా రాసారు. ఆ పిల్లల బాధలు వింటూ ఉంటే మనసు చివుక్కుమంటుంది.

ఈ మధ్య నేను ఇంకో కొత్త విషయం చూసాను. ఒక కార్పరేటు స్కూల్లో మాకు తెలిసినవాళ్ళ పిల్లాడిని LKG లో పడేసారు. అక్కడ రూలు ఏమిటంటే పిల్లలు ఆ రోజు ఏమి తినాలో వాళ్ళు ముందే చార్ట్ ఇచ్చేస్తారుట. మొత్తం స్కూల్లు ఉన్న అన్నిరోజుల్లోను పిల్లలకి బాక్సుల్లో ఏమి పెట్టి పంపించాలో రాసి ఇచ్చేస్తారట. తల్లిదండ్రులు అవే చేసి పెట్టాలట. మారిస్తే ఒప్పుకోరుట, ఏదో ఫైన్ ఉంటుందిట. అయితే అందులో బలవర్థకమైన ఆహరమే ఉంది. కానీ ఇదేం దౌర్భాగ్యం, వాళ్ళు ఏమి తినాలో కూడా స్కూలు యాజమాన్యమే నిర్ణయిస్తుందా! ఒకవేళ ఆ తల్లిదండ్రులకి అలా చెయ్యడం కుదరకపోతే? ఒక తల్లిదండ్రుల ఆవేదన ఏమిటంటే - మంచి స్కూలని, ఎలాగొలా కష్టపడి స్కూలు ఫీజు కట్టి జాయిన్ చేసారు కానీ ఈ రూలు ప్రకారం ఆహారాన్ని అందించగలిగే స్థోమత లేదు...ఈ రూలు మా పిల్లకి పెట్టకండి అని ఎంతో ప్రాధేయపడినా యాజమాన్యం ఒప్పుకోలేదు. దాంతో ఇంక గతి లేక ఆ పిల్లని ఆ స్కూలునుండి విడిపించి వేరే స్కూలులో జాయిన్ చేసారు. ఇది నా కళ్ళముందే జరిగిన విషయం. ఆ తల్లిదండ్రులని చూస్తే నాకు బలే జాలేసింది. అయితే కొంతమంది తల్లిదండ్ర్లులు దీన్నో గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఇలాగైనా పిల్లలకి తిండిలో క్రమశిక్షణ అలవడుతుందని, పోషకపదార్థాలు చేరుతాయని. అలా రూలు ఉండడమే మంచిదని కొందరి భావన.

కార్పరేటు స్కూళ్ళ పరిస్థితి ఇలా ఉంటే గవర్నమెంటు స్కూళ్ళ పరిస్థితి మరో రకంగా ఉంది. నాకు తెలిసిన స్నేహితుడి అక్క, బావ ఇద్దరూ గవర్నమెంటు బడులలో టీచర్లు. అక్కడ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదుట. ఇన్స్పెక్షన్ కి వస్తే వీళ్ళే రిపోర్టులు రాసి ఇచ్చేస్తారుట. చదువు లేక, చెప్పేవారు లేక ఆ పసిమొగ్గలు బాధపడుతున్నాయి. అంతెందుకు మా విజయనగరంలో జరిగిన ఒక కథ: నాతోపాటూ BA చదివిన ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను BA లో ఒకసారి ఫైల్ అయి రెండోసారి ఎలాగోలా పూర్తి చేసాడు. తరువాత ప్రైవేటుగా MA కట్టి మూడు సార్లు ఫెయిల్ అయి, నాలుగోసారి గట్టెక్కించాడు. అతనికి, మా విజయనగరంలో, ఓ 30 సంవత్సరాలపాటు మంచి బడిగా ప్రసిద్ధి చెందిన ఒక స్కూల్లో సైన్సు టీచరుగా ఉద్యోగం. పార్ట్ టైమే గానీ ఇతనే ఆ పిల్లలకి పాఠాలు చెప్పేది. మళ్ళి 10 వ తరగతి పిల్లలకి చెబుతున్నాడట. పాఠాలు పెద్దగా చెప్పక్కర్లేదుట. ఏదో నోట్స్ ఇస్తే చాలుట. పిల్లలు పాస్ అయినా ఫెయిల్ అయినా అనవసరం. మన జీతం మనకొస్తుంది అని అతను చెబుతుంటే నోరు వెళ్లబెట్టుకుని వినడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయాను.

మొత్తనికి ఎక్కడైనా నలిగిపోయేది పసికందులే. పిల్లలకి తల్లిదండ్రుల మీద ఆశ ఉండొచ్చుగాని అది వారికి భారం కారాదు. "మనకి తలకాయలైతే ఉన్నాయిగదా ఆలోచిద్దాం" అంటారు నామిని. ఇదే విషయంపై నామిని పదే పదే రాస్తున్నాడు, ఇక ఆపితే బాగుందును అన్నది ఒక విమర్శ. కానీ పైన చెప్పిన లాంటి పరిస్థితులున్నప్పుడు ఇలాంటి పుస్తకాలు ఇంకా ఎన్నో, ఎన్నెన్నో రాయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. "చదువులా చావులా" ప్రతీ ఒక్కరూ చదవవలసిన పుస్తకం ఇది. వెల 20 రూపాయిలు మాత్రమే. నేనైతే ఇది పదిమందికి పంచిపెట్టి, వీలైనంత మంది చేత చదివించాలని నిర్ణయించుకున్నాను. అంటే ఇది చదివేసి తల్లిదండ్రులూ,టీచర్లూ అందరూ మారిపోతారని కాదు, కనీసం ఆలోచిస్తారని. మరి మీరు కూడా చదువుతారు కదూ?