StatCounter code

Wednesday, May 19, 2010

వశీకరణవిద్య (హిప్నాటిజం)

నిన్న "అమరావతి" సినిమా చూసాను. రవిబాబు (చలపతిరావు కొడుకు) నటించి దర్శకత్వం వహించిన సినిమా. సాధారణంగా ఇతని సినిమాలు నాకు నచ్చుతాయి. ఏ ముఢనమ్మకానికి వ్యతిరేకంగానో, లేదా సైన్సు కి సంబంధించిన విశ్లేషణలతోనో సినిమాలు తీస్తూ ఉంటాడు. ఒక శాస్త్రీయ అంశం ఉంటుంది సినిమాలో.

అమరావతి విషయానికొస్తే "హిప్నాటిజం లేదా వశీకరణవిద్యను మానవళికి ఉపయోగపడేలా ఎంత ఉన్నతంగా వాడుకోవచ్చో అంతే అధమంగా మనుషులకి చెడు కలిగించడానికి కూడా వాడుకోవచ్చు, కాబట్టి జగ్రత్తగా ఉండండి. ఈ హిప్నాటిజం ని ఎవరికిబెడితే వాళ్ళకి నేర్పితే ప్రమాదాలు జరగవచ్చు" అనేది ఈ సినిమాలో పాయింటు. దాదాపు రెండు గంటల నిడివి తో కాస్త ఉత్కంఠ రేగిస్తూ బాగానే తీసారు సినిమా.

ఈ సినిమా చూసాక నాకు నా చిన్నతనంలో జరిగిన విషయం గుర్తొచ్చింది. 10 వ తరగతి వేసవి శెలవులు, ఇంకా ఫలితాలు రాలేదు. మంచి మార్కులొస్తాయని తెలిసినా ఏక్కడో చిన్న ఉత్కంఠ ఉండేది మనసులో. మా ఇల్లు ఊరి మధ్యలో కాకుండా కాస్త దూరంగా ఉండేది. అది అప్పుడే పుట్టిన కొత్త కాలనీ. అప్పటికి మా కాలనీలో 10-12 ఇళ్ళు మాత్రమే ఉండేవి. ఆ కాలనీ కి ఎదురుగా, ఎడమవైపు కనుచూపుమేర పచ్చని పొలాలు. కాలనీలో అడుగు పెట్టగానే ఎడమచేతి పక్క ఒక ఇల్లు, దానికి ఎదురుగా గేస్ గొడౌన్. తరువాత ఒక 100 మీటర్ల దూరంలో మా ఇల్లు, దానికి ఆనుకుని పక్కిల్లు. అంతే ఆ వరసలో ఇంక ఇళ్ళు లేవు. వెనక వరసల్లో అక్కడా అక్కడా ఒక్కోటి చొప్పున ఓ 10-12 ఇళ్ళు ఉన్నాయి. ఇంక చుట్టూరా పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు గొప్ప ఆహ్లాదంగా ఉండేది వాతావరణం. ఎక్కువ జనసంచారం కూడా ఉండేది కాదు. మా ఇంటి వెనక ఎడమచేతి వైపు ఒక చిన్న చెరువు, మా ఇంటి ఎదురుగా ఒక పేద్ద బావి కనీసం ఓ 5-6 మంది ఒకే టైంలో ఈతకొట్టగలిగేటంత పెద్ద బావి. అంత పెద్ద బావిని చూడడం అదే మొదలు, చివర. ఇప్పటివరకు మళ్ళీ అంత పెద్ద నుయ్యిని చూడలేదు, చూడబోనేమో. ఆ బావి పక్కనే ఒక చిన్న ఇల్లు ఉందేది. ఒకే గది ఉన్న చిన్న పెంకుటిల్లు. వాళ్ళకి ఓ రెండుమూడు గేదెలు, కాస్త పొలం ఉండేవి. ముసలి తల్లిదండ్రులు, పెద్దకొడుకు-భార్య, వాళ్ళకి చంటిపిల్ల, చిన్నకొడుకు ఉండేవారు ఆ ఇంట్లో. పాపం బాగా పేదవారు. పాలవ్యాపారం మీదే వాళ్ళ గమనం సాగుతూ ఉండేది ఎక్కువగా. ఎదురుగా ఉండేవారు కాబట్టి ఏ చిన్నపనికైనా వాళ్ళనే పిలిచేవాళ్ళం ఎప్పుడూ. అలాగే అప్పుడప్పుడూ డబ్బు, భోజనం వంటి సహాయాలు చేస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళింట్లో అందరితో మాకు బాగా పరిచయం. వాళ్ళింటికి చుట్టాలొస్తే మా ఇంటి ముందు గదిలో పడుకునేవాళ్ళు కూడా. వాళ్ళింటికి వాళ్ళ మేనమామ తరచూ వస్తూ ఉండేవాడూ. అతను కూడా మాకు బాగా తెలుసు.

ఇలా ఉన్న ఆ కాలనీ లో ఓ రోజు మధ్యాన్నాం 12.00 గంటలవేళ "సోది చెబుతానమ్మ సోది" అంటూ కేకలు వినిపించాయి. ఆ కోలనీలో ఎక్కువ ఇళ్ళు లేకపోవడం వలన వీధిలోకి వచ్చి ఎవరూ సరుకులు అమ్మడమో, ఇలా సోది వాళ్ళు రావడమో సాధారణంగా జరగేది కాదు. ఆరోజు ఈ కేక వినిపించింది. నేను మా గదిలో కూర్చుని బొమ్మలు వేసుకుంటున్నాను. చెల్లి హాల్ లో టి.వి చూస్తున్నాది. అమ్మ మిషన్ కుట్టుకుంటున్నాది. ఒక 5 నిముషాల తరువాత మిషన్ శబ్దం ఆగిపోయింది. ఇంట్లో కూడా అమ్మ అలికిడి వినిపించలేదు. ఎక్కడకెళ్ళిందబ్బా, చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళదే అని ఆలోచిస్తూ బయటకి వచ్చి చూస్తే, వీధి గుమ్మంలో ఆ సోది ఆవిడ తో మా అమ్మ కూర్చుని ఉంది. సాధారణంగా మా అమ్మ ఇలాంటివి నమ్మదు. ఎప్పుడూ ఎవరితోనైనా ఇలాంటివాటి గురించి మాట్లాడడం కూడా వినలేదు. ఇదేమిటి ఇప్పుడు ఇలా ఈవిడతో సోది చెప్పించుకుంటున్నాది అని ఆశ్చర్యపోయాను. సరేలే ఎదో ముచ్చటపడింది కాబోలు ఊరికే అని అనుకుని లోపలికి వెళ్ళిపోయాను. ఒక 10 నిముషాల తరువాత "సౌమ్యా" అని పిలిచింది.

"ఏంటమ్మా?"
"వెళ్ళి కొంచం బియ్యం, పప్పు పట్రా"
"ఎందుకు?"

ఎర్రగా చూసింది నా వైపు. మాట్లాడకుండా వెళ్ళి ఓ గ్లాసుడు బియ్యం, పప్పు తెచ్చి ఇచ్చాను.

"సరే వెళ్ళి నీ పని చూసుకో"
"సరేనమ్మా"

ఇంకో పది నిముషాలు పోయాక మా చెల్లిని పిలిచింది. తరువాత నాకేమి వినిపించలేదు. ఇంకో 15 నిముషాల తరువాత

"అక్కా, అమ్మ ఇంకా బియ్యం, పప్పు తెమ్మంటున్నాది. ఇప్పటికే రెండుసార్లు ఇచ్చాను నేను" అంది మా చెల్లి.

సరే ఈ కథేమిటో చూద్దాం అని వెళ్ళి పరిశీలనగా చూస్తే మా అమ్మ తదేకంగా ఆ సోది ఆవిడని చూస్తున్నాది. ఆవిడ ఓ ఎముక పట్టుకుని ఏవో మంత్రాలు చెప్తున్నాది. ఒక పెద్ద వెదురుబుట్టలో ఎముకలు, పసుపుకట్టిన గుడ్డలు, కాసింత కుంకం, ఇంకా ఏవో తాయెత్తులు, నిమ్మకాయలు, మన్ను, మశానం అన్నీ ఉన్నాయి. ఆ బుట్టలోనే మేము అప్పటివరకు ఇచ్చిన బియ్యం, పప్పు కూడా ఓ వారగా పోసి ఉన్నాయి.

అమ్మా అని పిలిస్తే ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు చూసింది మా అమ్మ. బియ్యం, పప్పు తీసుకునిరా అంది. వద్దమ్మా అని వారించబోతే చెడామడా ఆవిడ ముందే తిట్టింది. నాకు చిరాకేసి తెచ్చిపడేసాను. అప్పటికే బియ్యం, పప్పు రెండూ నిండుకున్నాయి. అక్కడే నిలుచుని చూస్తున్నాను ఏమి జరుగుతుందో అని. ఇలాంటి విషయాలు నాకు కొత్త. అడపాదడపా వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. అయినా సోది చెప్పేవాళ్ళు ఏదో భవిష్యత్తు గురించి నాలుగు అబద్ధాలు చెప్పి కాసింత బియ్యం, కూసింత పప్పు తీసుకెళ్తారని మాత్రమే నాకు తెలుసు. కానీ ఈ ఎముకలు, నిమ్మకాయలు ఏమిటో నాకు అర్థం కాలేదు. మళ్ళీ బియ్యం తెమ్మంది. అన్నీ అయిపోయాయి అని చెప్పాను. ఆ సోది ఆవిడ నన్ను లోపలకి వెళ్ళిపోమంది. నేను వెళ్ళను, ఉంటాను అన్నాను. మా అమ్మ చాలా కోపంగా నన్ను పిచ్చి పిచ్చిగా తిట్టింది. నాకు ఏడుపు ఒక్కటే తక్కువ. లోపలకి వెళ్ళకపోతే కొడతానని కూడా చెప్పింది. మా చెల్లి అప్పటికే బిక్కచచ్చిపోయింది. ఏమిచెయ్యాలో తెలియక లోపలికెళ్ళి ఆలోచిస్తూ కూర్చున్నాను. మరో 10 నిముషాలలో ఒక మగగొంతు అరుపులు, కేకలు వింపించాయి. చెల్లి నేను పరిగెట్టుకొచ్చి చూసాము. ఆ ఎదురింటివాళ్ళ మేనమామ ఆ సోది ఆవిడని చెడామడా తిడుతున్నాడు. అమ్మ బిత్తరపోయి చూస్తున్నాది. నిన్ను పోలీసులకప్పజెబుతాను, నాటకాలాడుతున్నవా అని నానా తిట్లు తిట్టి కొట్టబోయాడు కూడా. ఆవిడ కూడ ఏవో మంత్రాలు గట్టిగా చదువుతూ అతన్ని తిడుతూ ఉంది. అతను, ఆవిడ జబ్బట్టుకుని రోడ్డుమీదకి లాకెళ్ళి ఒక్కటి పీకాడు. ఆ దెబ్బకి తట్ట, బుట్ట పట్టుకుని పరుగులంగించుకుంది. కానీ అతను వదల్లేదు. ఆ బియ్యం, పప్పు వదిలేసి వెళ్ళమన్నాడు. కానీ అమ్మ వద్దంది, అప్పటికే వాటి నిండా ఎముకలు, పసుపు అన్ని పెట్టి ఉన్నాయి. సరే అని చెప్పి మళ్ళీ ఇటువైపు వచ్చావో చస్తావు అని ఒక్క గసురు గసిరాడు అతను. ఆ దెబ్బతో వెనక్కి తిరిగిచూడకుండా పరుగెత్తింది ఆ సోది ఆవిడ.

ఏమయిందని అతన్ని అడిగాను.

"నేను ఇందాకటి నుండీ గమనిస్తున్ననమ్మా, మీరు బియ్యం, పప్పు తెచ్చి ఇస్తున్నారు. అమ్మ మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు, ఏదేదో అంటున్నారు. అప్పుడే వచ్చి విషయం కనుక్కుందామనుకున్నాను, కానీ ఏమోలే ఆవిడ తెలిసే చేస్తున్నారు అనుకున్నాను. కానీ కాసేపోయాక మీ అమ్మగారు మంగళసూత్రం తీసి దాని బుట్టలో వేసారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఏమిటీవిడ బంగారం అలా వేసేస్తున్నారు అని గమనిస్తూ ఉన్నాను. వెనువెంటనే నల్లపూసలు కూడా తీసి వెయ్యబోయారు. పరిగెత్తుకొచ్చి ఆ సోది దాన్ని గదమాయించాను. అమ్మేమో ఉలిక్కిపడి, ఏమీ అర్థం కానట్లు చూస్తున్నారు. అప్పటికి నాకు విషయం పూర్తిగా అర్థమయింది. దానిమీద నాలుగు కేకలు వేసాను, ఈ లోగా మీరు కూడా వచ్చారు. నేను చూసి ఉండకపోతే ఇల్లంతా దోచేసి ఇచ్చేద్దురు మీ అమ్మగారు. ఏమిటమ్మా మీలాంటి చదువుకున్నవాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తే ఎలామ్మా" అని కాస్త చివాట్లు కూడా పెట్టాడు.

నాకు మా అమ్మ మీద ఎక్కడలేని కోపమొచ్చింది. కానీ తనని చూస్తే జాలేసింది. కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏమీ మాట్లాడలేకపోయింది. తనే అలా చేసింది, అలా బంగారం తీసి ఇచ్చింది అని నమ్మలేకపోయింది. తనకి ఏమీ తెలియలేదని కూడా చెప్పింది. సరేలెండి ఏదో అయిపోయింది, అమ్మని లోపలకి తీసుకెళ్ళి తలుపేసుకోండి అని చెప్పేసి అతనెళ్ళిపోయాడు. అమ్మేమీ మాట్లడలేదు. అసలేం జరిగింది, ఏమి జరుగుతోంది అని కూడా తెలుసుకోలేని పరిస్థితిలో మతిపోయినదానిలా ఉంది. బాగా షాక్ తిన్నట్టు ఉంది. అన్నం తినమంటే తినకుండా గదిలోకి వెళ్ళి పడుకుంది. నేను, చెల్లి ఏదో ఇంత ముద్ద తినేసి భయంగా, బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాం. సాయంత్రం 6.00 గంటలకి నాన్నగారింటికొచ్చారు. ఆయన రాగనే అమ్మ లేచి భోరున ఏడవడం మొదలెట్టింది. వెక్కి వెక్కి ఏడ్చింది. నాన్న కంగారు పడ్డారు. నేను జరిగిన విషయమంతా చెప్పాను. ఒక్క నిముషం ఆయన మొహంలో భయం, ఆందోళన చూసాను. వెంటనే నవ్వేసి "సరేలెండి జరిగిపోయిందేదో జరిగింది, ఇక మీదట జాగ్రత్తగా ఉండండి."అన్ని చెప్పి మా అమ్మ ఏడుపు ఆపే ప్రయత్నం చేసారు. ఇంక అక్కడనుండి మా అమ్మ మీద, జరిగిన విషయం మీద జోకులేస్తూ ఉన్నారు అమ్మ నవ్వే వరకు.


41 comments:

Srujana Ramanujan said...

Hmm

Srujana Ramanujan said...

Your writing style is very cool Sowmya garu. Great narration skills :)

కత్తి మహేష్ కుమార్ said...

ని...జ...మా....

sowmya said...

@Srujana

Thank you so much for the compliment :)

sowmya said...

@ మహేష్

అవునండీ "అక్షరాలా" నిజం, నమ్మలేని సత్యం!

గీతాచార్య said...

Hipnotism in Amaravati? Has he lifted it from Oldboy movie? Or is there another movie like that.

మీరు వ్రాసింది చదువుతుంటే చాలా ఆశ్చర్యంగానూ, అయోమయంగానూ అనిపించింది

గీతాచార్య said...

నిజమైతే సమస్య లేదండి. సత్యమైతేనే అసలు సమస్య

sowmya said...

@ గీతాచార్య
ఏమోనండీ ఏ మూవీలో నుండి లేపాడో తెలీదు కానీ అమరావతి మాత్రం హిప్నాటిజం గురించే.

తలుచుకుంటే మాకూ ఇప్పటికీ అయోమయంగానే ఉంటుంది. ఈరోజుకీ మా అమ్మ దానికి సమాధానం చెప్పలేకపోతోంది. ఏం జరిగిందో నాకు తెలీదనే అంటున్నాది. నిజంగా ఆవిడకి ఒంటి మీద స్పృహలేదుట. ఎంత గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నించినా గుర్తురావట్లేదు ఆవిడకి.

హ హ హ బాగా చెప్పారు. ఇది నిజం, సత్యం కూడా. సత్యమవ్వొచ్చనే "అమరావతి" సినిమాలో చెప్పారు.

karthik said...

విజయనగరం లాంటి వెనకబడ్డ జిల్లాల్లో ఇలాంటివి జరగడం లో వింతేమీ లేదు. ఇలాంటివాటి గురించి బాగా అర్థం చేసుకోవాలంటే వి ఎల్ సీ ప్లేయర్ సాయం తో చెహోవ్ రచనలు చదవాలి. నేను ఐదవ తరగతి లో ఉండగా మా క్లాస్ వాళ్ళు కూడా నన్ను విమర్శించారు కానీ నేను వాటిని పట్టించుకోలేదు ఎందుకంటే నేను వీర నాస్తికుణ్ణి కాబట్టి.

ఇట్లు
-మీ అన్న

sowmya said...

ఏమిటి కార్తీక్ నీమీద కూడ ఎవరైనా వశీకరణ విద్య ప్రదర్శించారా ఏమిటీ? అచ్చు ప్ర.నా లా అయిపో అని చెప్పుంటారు. నువ్విలా తయారయ్యావు :) అయ్యో అయైతే ప్ర.పీ.స.స కు ప్రచార కార్యదర్శి ఇక లేనట్టేనా?????????

manasa said...

>>ఒక్క గసురు గసిరాడు అతను.
ఎన్ని రోజుల తరువాత విన్నానో గసరడం అనే మాట.
సూపర్ గా ఉంది మీ నెరేషన్.

మా అమ్మ కూడా చెప్పింది ఒకసారి ఒక కోయవాడికి ఇలా బియ్యం అదీ ఇవ్వనందుకు కోపగించి నీ బట్టలు అన్నీ తగలబడిపోతున్నాయి చూడు అన్నాడుట.మా అమ్మ చూసేసరికి నిజం గా బట్టల తీగ మండుతూ కనిపించేసరికి దెబ్బకి వాడు అడిగినవి ఇచ్చి పంపగానే చూస్తే,తీగ మీద బట్టలు మామూలుగానే ఉన్నాయి ట.

ఇలాంటివి కొన్ని లాజిక్ కి అందవు ఏమిటి ఎందుకు అని.

Aavakaya said...

నెరేషన్ బాగుంది.అలా ఆ సీను ని మా కళ్ళ ముందు ఆవిష్కరించారు.ఇప్పుడే వరుసగా మీ టపాలు చదువుతున్నా.

sowmya said...

@ మానస
ధన్యావాదాలండీ!
వాడలా చెప్పగానే మీ అమ్మగారు కాస్త భ్రమ పడి ఉంటారు. కానీ హిప్నాటిజం అన్నది నిజంగానే ఉంది కద, మన పట్టాభిరాం గారు చాలా ఫేమస్ కాదా దాన్లో. కానీ ఈ కోయవాళ్ళకి, సోదిగాళ్ళకి ఈ విద్యలు ఎలా తెలుస్తాయో ఏమో !

@ఆవకాయ
Thank you so much!
నా టపాలనీ ఓపికగా చదువుతానన్నందుకు నెనర్లు....చదివేయండి, చదివేయండి :)
మీ మెంతిబద్దల ఫొటో మాత్రం తెగ నచ్చిందండీ, భలే నూరూరించేస్తోంది.

స్వర్ణమల్లిక said...

ఇలాంటి ఒక సంఘటన నాకు కూడా ఎదురయింది. మా ఇంటి ఎదురు ఆవిడ బట్టల వ్యాపారం చేస్తుంది ఇంట్లోనే. ఒక రోజు మధ్యాన్నం పన్నెండు గంటలకి అనుకుంటా,.. ఎవరో పల్లెటూరు వాళ్ళలా ఉన్నారు వారింటికి వెళ్లడం మేము చూసాము. ఎవరో బట్టలు కొనుక్కోడానికి వచ్చారేమో అనుకున్నాము. ఆ తరువాత పట్టించుకోలేదు. తీరా సాయంకాలం తెలిసిన విషయం ఏంటంటే.. వారు ఆమె మీద ఏం ప్రయోగించారో తెలియదు. మొత్తం బట్టలన్నీ మూటలు కట్టుకుని వెళ్ళిపోయారు. ఆమె అలా బొమ్మలా ఉండిపోయింది. సాయంత్రం ఆ ఇంటాయన వచ్చి చూసుకుని లేపితే గానీ ఆమె ఆ కూర్చున్న చోటు నుంచి లేవలేదు. బట్టలు పెట్టిన గది మాత్రం ఖాళీ, వాళ్ళ టైం బాగుంది బీరవా జోలికి పోలేదు దొంగలు.

karthik said...

ఈ కామెంట్ నీ వశీకరణ టపాకి మరియూ సిరివెన్నెల గారి పై రాసిన టపాకి రెండిటికీ పనికి వస్తుంది ;) ;)

వైజాగ్ లో ఉన్న ఒకానొక సైక్రియాటిస్ట్ హాస్పిటల్ లో జరిగిన సంఘటన ఇది. డిప్రెషన్ లో ఉన్న ఒక అబ్బాయి డాక్టర్ రూం బయట వెయిట్ చేస్తున్నాడట. ఆ పక్కనుంచీ సిరివెన్నెల గారు రాసిన "ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ" పాట వినిపించిందట. అది విన్న అబ్బాయి ఇంకోసారి ఆ పాట పెట్టమని విన్నాడట. అలా 4-5 సార్లు విని ఇక నాకు ఏ సైక్రియాటిస్ట్ అవసరం లేదు అని చెప్పాడట. ఇది కూడా ఒక రకం వశీకరణమే!! కాదనగలమా???

ఈ సంఘటన హాసం బుక్కులో 2003 లో కులశేఖర్ చెప్పారు. ఏ నెల బుక్కో గుర్తులేదు.

-కార్తీక్

sowmya said...

@ స్వర్ణమాలికగారూ
అవునండీ ఇలాంటివి అడపాదడపా జరుగుతూనే ఉన్నయి. మా ఇంట్లో ఇది జరిగేటంత వరకు నేను నమ్మేదాన్ని కాదు. పట్టాభి రాం గారి షోలు చూడడమేతప్ప పెద్దగా ఏమీ తెలీదు. ఈ విద్య గురించి అప్పట్లో ఆయన రాసిన కొన్ని వ్యాసాలు చదివాను. ఆయన మా ఊర్లో ప్రోగ్రాం ఇచ్చినప్పుడు ఒక పిల్ల నెత్తిమీద టీ కాచారు. ఆశ్చర్యపోయాను. కానీ ఈ విద్యలన్నీ పల్లెటూరివాళ్ళకి ఎల తెలుస్తాయన్నదే నా కర్థం కాని విషయం.

sowmya said...

@కార్తీక్,
wow, thats the greatness of "sirivennela".
వశం చేసుకునే ఏ విద్య అయినా వశీకరణమే. సిరివెన్నెలకి ఆ విద్య బాగా తెలుసు అందుకే అందరూ ఆయన పాటలు విని వివశులైపోతూ ఉంటారు :)
మంచి విషయం చెప్పావు కార్తీక్, Thanks !

శ్రీవాసుకి said...

సౌమ్య గారు

మీ వశీకరణ టపా బాగుంది. మీరు నాస్తికవాదైనా ఇలాంటివి నమ్ముతారన్నమాట. బహుశా స్వీయానుభవం కావొచ్చు. మా ఇంట్లోను మా పిన్ని గారి వల్ల మాకు ఇది తెలిసింది. సోదామె దెబ్బకి మెడలో ఉన్న బంగారపు గొలుసు ఇవ్వబోతుంటే మా మామయ్య అడ్డుపడ్డాడు. లేకపోతే సమర్పయామి అయ్యేది. వశీకరణ విద్యలాంటివి ఉన్నాయిలేండి. కాకపోతే ఒకప్పటిలా కాదు. ఒరిస్సా, కేరళ ఇలాంటి వాటికి ప్రసిద్ధి. నమ్ము నమ్మకపోండి.

వేణూ శ్రీకాంత్ said...

ప్రజంటేషన్ / నెరేషన్ చాలా బాగుంది సౌమ్య, మీరు అర్జంట్ గా కథల్రాసేయడం మొదలెట్టేయాలి.

వశీకరణం/హిప్నాటిజం పల్లెల్లోకి ఎలా పాకిందన్నది మిష్టరీ ఏమీ కాదండీ, కొద్ది సాథన చేస్తే అవలీలగా అబ్బేస్తుంది అని విన్నాను, అదే వృత్తిగా బ్రతికే వాళ్ళకు అట్టే కష్టమవక పోవచ్చు.

కానీ మీరు చెప్పిన సంఘటనను ఊహించుకుంటే నమ్మలేనట్లుగా ఉంది.

sowmya said...

@వాసుకిగారూ,
మీరు పొరబడుతున్నారు. వశీకరణానికి మూఢనమ్మకాలకి చాలా తేడా ఉంది. మీరు వశీకరణం, క్షుద్రవిద్యలు ఒక కోవకే చెందినవని పొరబడుతున్నట్టుగా అనిపిస్తున్నాది నాకు. రెంటికీ చాలా తేడా ఉందండీ, మొదటిది సైన్సు, రెందవది మూఢనమ్మకం.

హిప్నాటిజం అనేది సైంటిఫిక్ గా నిరూపించబడిన విద్య, అందుకే నమ్ముతున్నాను. స్వీయానుభవమే కాదు, పట్టభిరాం గారి షోలు, ఇంకా అనేక హిప్నాటిజం షోలు నేను చూసాను. హిప్నాటిజంతో మానసికరోగాలు, భయభ్రాంతులు పోగొట్టవచ్చు. అలగే ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసం కూడా పెంపొందిచవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. నాస్తికవాదం ఎప్పుడూ సైన్సునే కదండి నమ్ముతుంది, నేనూ ఆ కోవకే చెందుతాను.

అయితే మీ ఇంట్లోనూ బంగారు గొలుసులు స్వాహా ఆయిఉండేవన్నమాట....హ్మ్ గండం తప్పింది కదా, అదే పదివేలు.

ఎస్పీ జగదీష్ said...

నిజమే నండి సౌమ్య గారు.. నేను కూడా ఇలాంటి వాతి గురించి విన్నాను. ఎవరయినా వీటి గురించి పరిశోధన చేసి, "హారీ పోటర్: మ్యాజిక్ స్కూల్ లాంటిది పెట్టొచ్చు కదా అనిపిస్తుంది. మీ ప్రెజెంటేషన్ బాగుంది.

sowmya said...

@వేణూ శ్రీకాంత్
అంతేనంటారా ! అయితే మొత్తానికి మా అన్నలా నన్ను కథలు రాసేయమంటారు, అయితే వాకే......అలాగే రాసేద్దాం, దానిదేముంది :)

అవునండీ కాస్త ప్రాక్టీసు చేస్తే వచ్చేస్తుందనుకుంటాను. చెడు ఆలోచనలున్నవళ్ళకి అందుకే ఈ విద్యని నేర్పించకూడదు అని అంటారు.

హ్మ్ ఆ సంఘటన నమ్మశక్యంగా లేకపోయినా పచ్చి నిజం.

sowmya said...

@జగదీష్
హ్మ్ స్కూలు పెట్టొచ్చు, కానీ వీటిని మంచికి కాకుండా చెడుకి ఉపయోగిస్తే సమాజానికే ప్రమాదం.
థాంక్సండీ!

హరే కృష్ణ . said...

చాలా బాగా రాసారు

మంచు - పల్లకీ said...

హిప్నాటిజం - Is it legal ? proven ?
If yes, why are we not using that technique in place of "lie detector tests" ?

sowmya said...

@మంచు - పల్లకీ
I don't know so many details.
కానీ సైకాలజికల్సై ట్రిట్మెంట్ కి వెళ్ళినప్పుడు కొంత హిప్నాటిజం కూడా చేస్తారని విన్నాను. ఒకవేళ అది లీగల్ కాకపోతే పట్టాభిరాం లాంటి వాళ్ళని ఎందుకు ప్రభుత్వం నివారించలేదు. మీకు గుర్తు ఉంటే అపరిచితుడు సినిమాలో కూడా విక్రం కి హిప్నాటిజం చేసి అతని వివరాలు డాక్టర్స్ కనుక్కుంటారు.
నాకు ఇందులో అంత ఙ్ఞానం లేదు, మీకు తెలిస్తే చెప్పండి.

sowmya said...

thanks harekrishna!

మంచు - పల్లకీ said...

గూగ్లింగ్ చెస్తే ఇది దొరికింది .. makes sense..

--

Forensic hypnosis is the use of hypnosis in the field of law enforcement. Forensic use of hypnosis is often used to help witnesses recall events and descriptions of suspects that normal memory recall cannot. One thing that a forensic hypnotist cannot do is and is never called to do is to help a suspect confess to a crime. Not only is this impossible, but any confession arrived at through hypnosis would never be admissible in court.

--

వేణూ శ్రీకాంత్ said...

ఆహా అలా నా వ్యాఖ్యలోని ప్రతి లైన్ కీ మీరిచ్చిన జవాబు చూసి చాలా ముచ్చటేసిందండీ :-) థ్యాంక్యూ

వామ్మో మీ అన్నలా వద్దులేండి బ్లాగ్లోకానికి ఒకళ్ళు చాలు :-) మీరు చక్కగా మీ శైలిలో రాసేయండి. (నిజానికి నిన్నటి వ్యాఖ్యలో రాసి కొట్టేసిన నా స్వగతం : "వాళ్ళ అన్నగారి కథలు అన్ని చదివికూడా ఆ ప్రభావం లేకుండా ఇంత బాగా రాయగలిగారంటే సెగట్రీ గారు ఘటికులే" :-)

అవకాశం వచ్చే వరకూ అందరూ మంచి వాళ్ళేనండీ.. నేర్చుకునేప్పుడు చెడు ఉద్దేశ్యాలుండకపోవచ్చు కానీ ఇటువంటి ప్రత్యేకమైన విద్య చేతిలో ఉండి, అవకాశం రాగానే దురాశ మనిషిలో ఉన్న రాక్షసుడ్ని నిద్ర లేపుతుంది. అలా కూడా జరగనివ్వని నిగ్రహ శక్తి ఉన్న వాళ్ళని ఎన్ను కోవడం కష్టమే...

వేణూ శ్రీకాంత్ said...

@మంచు గారు,
నాకు తెలిసినంత వరకు హిప్నాటిజం లీగల్ కానీ లై డిటెక్షన్ లో ఉపయోగించడం అంత ఆమోదయోగ్యం కాకపోవచ్చు. ఇప్పుడు వాడుక లో ఉన్న లైడిటెక్టర్ సబ్జెక్ట్ లో ఏవిధమైన మార్పులకు కారణం కాకుండా సహజసిద్దంగా ఆబద్దం ఆడినపుడు తనలో కలిగే మార్పులను రికార్డ్ చేసి చెప్తుంది.

కానీ హిప్నాటిజం మనిషిని సహజ స్థితి నుండి ఒక ట్రాన్స్ లోకి తీసుకు వెళ్తుంది అదీకాక సబ్జెక్ట్ నిజమే చెప్తున్నారు అన్న గ్యారెంటీ లేదు హిప్నాటిస్ట్ ఏం చెప్పమంటే అది చెప్పే అవకాశం కూడా ఉంది ఇటువంటి హ్యూమన్ ఇంటర్ ఫియరెన్స్ వల్ల కూడా దీన్ని లై డిటెక్షన్ కు ఉపయోగించక పోతుండవచ్చు. అలానే సోడియం పెంటథాల్ గురించి విన్నారా దీన్నే ట్రూత్ డ్రగ్ అంటారు మనిషిని ఒక అలౌకికమైన స్థితిలోకి తీసుకు వెళ్ళి నిజం చెప్పిస్తుంది. కానీ ఇది కూడా లీగల్ కాదు ఎంతటి నేరస్థుడి పై ఐనా ఇది ఉపయోగించడం చట్ట సమ్మతం కాదు.

sowmya said...

@ మంచు పల్లకి గారూ
వివరణ ఇచ్చినందుకు ధన్యావాదాలు.

మీరు చెప్పినది చూస్తే మరచిపోయిన సంఘటనలని గుర్తుతెచ్చేలా చేయడమే కాకుండా, హిప్నాటిజం చేసేవాళ్ళు అవతలి వ్యక్తులచేత తమకి నచ్చిన రీతిలో పని చేయించుకునే విధానం కూడా కనబడుతున్నాది. సో ఈ వశీకరణ విద్య కాస్త సైన్సుకి సంబంధించిన విద్యే అయినా, సరిగ్గా ఉపయోగించకపోతే ప్రమాదకారిగానే కనిపిస్తున్నాది.

sowmya said...

@ వేణూ శ్రీకాంత్
హ హ హ....మా అన్న ప్రభావం నామీదుంటే నేను ప్ర.పీ.స.స లో ఎందుకు చేరతానండీ !
భయపడకండి, మీకు ఆడ ప్ర.నా ని చూసే అవకాశం ఇవ్వను. నా శైలిలోనే రాసే ప్రయత్నం చేస్తాను. మీ ప్రోత్సాహక వ్యాఖ్యలకు కృతఙ్ఞతలు.

హ్మ్ మీరు చెప్పినది నిజమేనండీ, అవకాశం బట్టి మనుషులు మారొచ్చు....ఈ హిప్నాటిజం కాస్త ప్రమాదకారియే.

Anonymous said...

నమ్మ శఖ్యం కాని విషయం, అయినా మీరు ఇంత గట్టిగా చెబుతున్నారు కాబట్టి నమ్ముతున్నాను. కాకపోతే, హిప్నోటిజం చేయాలి అంటే, ముందుగా చేయింకునే వ్యక్తి మానసికంగా దానికి ఒప్పుకోవాలి. మనకు ఇష్టం లేకుండా మనల్ని ఎవ్వరూ హిప్నొటైజ్ చేయలేరు. ఆఫ్‌కోర్స్, ఇది మీకు తెలీదని నేను అనుకోవడం లేదు.

నాకు ఈ రేంజులో కాకపోయినా, కాటి కాపరి దగ్గరకి వెల్లి 300 వదిలించుకున్న అనుభవం ఉందిలెండి. కాకపోతే అతను మాటలు మాత్రమే చెప్పాడు. దీని మీద నేను రాసిన టపాని ఒక సారి చూడండి.
భూత వైద్యునితో ఒక రోజు..!!

sowmya said...

@ఆకాశరామన్న గారూ,
అవునండీ, ముందు ఆ వ్యక్తి ఒప్పుకోవాలి. ఆ సోది ఆవిడ చెప్పేవన్ని వినడానికి మా అమ్మ ముందు ఒప్పుకునే కూర్చుంది. మీ ఇంట్లో ఏదో పీడ ఉంది, పోగొడతాను అని మొదలెట్టిందిట. తరువాత ఏమి చెప్పిందో గుర్తులేదు అంటుంది మా అమ్మ. అసలు ఇలాంటివన్నీ మా అమ్మ నమ్మదు, ఆ రోజెందుకలా ఆమె మాటలకి పడిపోయిందో అర్థం కావట్లేదు ఇప్పటికీ.

హ హ హ మీ భూతవైద్యుడి కథ ఇంతకుముందే చదివేసాను, పోనీలెండి మీకు 300 తో వదిలిపోయింది. మా ఇంట్లో ఎన్నో వేలు పోయుండేవి కథ ఇంకాస్త ముందుకెళ్ళుంటే :)

Anonymous said...

ఇంకోకటి, వ్యాఖ్యలన్నీ చదివిన తరువాత ఇది చెప్పాలనిపించింది. పట్టాభిరాం గారు రాసిన్ హిప్నాటిస్మ్ పుస్తకం చదవండి. హిప్నాటిజం ఏమైనా చేయగలమనుకోవడం కేవలం మన ఊహ మాత్రమే. హిప్నాటైస్ చేయడానికి ఆ మనిషి సమ్మతి పూర్తిగా ఉండాలి. మన అనుమతి లేకుండా మనల్ని ఎవ్వరూ హిప్నటైస్ చేయలేరు. అంతే కాదు, ఒక వేల మన సమ్మతితోనే హిప్నటైస్ చేసినా ఒకసారి ట్రాన్స్‌లో ఉన్నప్పుడు మనకు నచ్చని పనులు మనతో చేయించడం కుదరదు. అలా చేయించాలని ప్రయత్నిస్తే వెంటనే మనకి మెలకువ వచ్చేస్తుంది అని పట్టాభిరాం గారే ఒక సారి చెప్పినట్టు గుర్తు.

sowmya said...

@ ఆకాశ రామన్న
ఓహ్ మీరిచ్చిన సమాచారం బావుంది, కాస్త భయం తగ్గించింది. నేను ఆయన పుస్తకం చదవలేదుకానీ, ఒక రెండు-మూడు వ్యాసాలు ఎప్పుడో చదివినట్టు గుర్తు. అందులో కూడా సమ్మతి లేకుండా హిప్నటైజ్ చెయ్యలేము అని చెప్పినట్టు లీలగా గుర్తు.

శరత్ 'కాలమ్' said...

నేను అప్పట్లో కొంతకాలం హిప్నటిజం చేసాను. నాకు హిప్నటిజం వచ్చుకానీ ఆ పప్పులు మా ఆవిడ దగ్గర ఉడకడం లేదు :(

sowmya said...

@శరత్ గారూ
హ హ హ..... మీ ఇంటావిడకి మీ సంగతి బాగా తెలిసి, హిప్నాటిజానికి సమ్మతి తెలుపట్లేదు కాబోలు :)

హిప్నాటిజం లో ముఖ్య విషయం అది చేయబడుతున్న వ్యక్తి సమ్మతం.

hanu said...

ayya baboi ilamTivi nijamga vunnayaa.

sowmya said...

@ హను
అదేమిటండీ అంత ఆశ్చర్యపోతారు హిప్నాటిజం షోలు ఎప్పుడూ చూడలేదా?

tara said...

baboye inkemaina vunnada, mee annayya chuste, deni meeda oka 200 postlu vestadu, asale canada canada ani japam chestunnadu ee madhya.