StatCounter code

Thursday, July 28, 2011

చిత్రలేఖనం - ఓ వైవిధ్యమైన దృక్కోణం - ఆంజనేయులు

"కళతో లీనమయ్యే ఏ కళాకారుడైనా తన కళాసృష్టి ముగించాక దానికేసే కొద్ది క్షణాలు తమకంగా చూసుకుంటాడు.ప్రసవవేదన పడి బిడ్డను కన్నాక తల్లి ఆ బిడ్డ కేసి చూసుకోడానికి, అలానే ఒక కళాకారుడు తన "సృష్టిని" చూసుకోడానికి మధ్య తేడాలేదు." అని ఎక్కడో చదివాను.

ఊహకి రూపమిచ్చి, జన్మనిచ్చే ఒకే ఒక సాధనం చిత్రలేఖనం. భావవ్యక్తీకరణకి తిరుగులేని సాధనం చిత్రలేఖనం. ప్రకృతి అందాలను, జీవితపరమార్ధాలను, సంప్రదాయలను, చరిత్రను, భవిష్యత్తులోని ఆశలను అన్నిటినీ కుంచెనుండి జాలువార్చగల కళాకారుని ఊహ అద్వితీయం. అటువంటి ఊహాశక్తిగల కళాకారుడిగా పుట్టడం ఒక అదృష్టం. అటువంటి ఒక అదృష్టవంతుడు ఆంజనేయులు ఉరఫ్ అంజి.

ఆర్కూట్ పరిచయమైన కొత్తల్లో నా పైంటింగ్స్ కొన్ని అందులో పెట్టాను. ఒకరోజు ఒక మెసేజ్ వచ్చింది. మీ బొమ్మలు బావున్నాయి, నా బొమ్మలు కూడా చూడండి అని. సహజంగానే పొంగిపోయి వెళ్ళి అతని ప్రొఫైల్ చూసాను. చాలా మామూలుగా ఉన్నాడు. సరే బొమ్మలు చూద్దామని వెళ్ళాను...అంతే ఆశ్చర్యం, అద్భుతం....అతను వేసిన బొమ్మలు చూసి చేష్టలుడిగిపోయాను. అతను ఎంత పెద్దచిత్రకారుడో తెలిసాక నా బొమ్మలు బావున్నాయి అని మెచ్చుకున్న అతని మంచి మనసుని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. మైల్ చేసాను మీ అంత గొప్ప కళాకారుడు నా బొమ్మలను బావున్నాయి అనడం నా అదృష్టం అంటూ. చాలా సాదాసీదాగా వచ్చింది జవాబు. నాకు ఉత్సాహం వచ్చింది. నా బొమ్మలని కొన్నిటిని పంపించాను. వాటిని ఎలా అభివృధి పరుచుకోవలో వివరిస్తూ మైల్ ఇచ్చారు అంజి. అలా మొదలైంది మా పరిచయం 2007 లో.

నల్గొండ జిల్లలో, గారిడెపల్లి గ్రామంలో లక్షమ్మ, సత్యం దంపతులకు 1976 లో జన్మించిన ఆంజనేయులు విద్యాభ్యాసం అక్కడే కొనసాగించారు. చిన్నతనంలో commercial signboard ల మీద పైంటింగ్ వేసేవారు. ఆ తరువాత చిత్రకళపై ఉన్న ఆసక్తి తో హైదరాబాదులో JNTU college of Fine Arts లో విద్యనభ్యసించారు.

ఒక్కో కళాకరునిది ఒక్కో శైలి, ఒక్కో రకమైన చిత్రం. ఈ వైవిధ్యానికి కారణం అతడు/ఆమె జీవితాన్ని, సమాజాన్ని చూస్తే దృష్టి కోణం. అంజి గారి ఊహ ఎప్పుడూ ఒక తెల్లని గోడ కి అతుక్కున వస్తువులు, దాని నీడ చుట్టూ తిరుగుతుంటాయి. జీవితం అంటే అనంతం కాదు...అది ఒక చట్రంలో బంధించబడి ఉంటుంది. It is Specific, Precise and Finite.....కాబట్టి ఏది చేసినా perfect గా గోడకు మేకు కొట్టినట్టు చెయ్యాలి అని చెబుతున్నట్టు తోస్తాయి. తన చిత్రాలు ఊహాప్రపంచంలో కొట్టుకుపోతున్నట్టు ఉండవు. ఇక్కడలేనిదేదో చూపించవు. మన చుట్టూ ఉన్న విషయాలే, మనకి తెలిసిన వస్తువులే కేన్వాస్ పై కనిపిస్తాయి. తన బొమ్మలు మనల్ని వేరే ప్రపంచానికి తీసుకుని వెళ్ళవు కానీ ఈ ప్రపంచంలోనే, ఈ మనుషుల మధ్యనే ఒక కొత్త భావాన్ని కలిగిస్తాయి. ఈ లోకాన్నే మరింత అందంగా చూపుతాయి.

ఫొటో తీసారా లేదా బొమ్మ వేసారా అని విస్మయం కలుగుతుంది. His observation capacity is mind blowing! తన ప్రతిభ అసాధారణం. ఎన్నో రకాల పైంటింగ్స్ చూసిన నాకు "ఇలా కూడా వెయ్యొచ్చా" అనిపించింది తన బొమ్మలు చూసాక. ఈ చిత్రాలను చూస్తే మీకూ అలాగే అనిపిస్తుంది.





మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అంజి గారూ చాలా exhibitions కండక్ట్ చేసారు ఇప్పటివరకూ....వాటి వివరాలు:

TANGERINE ART SPACE “TURN OF THE TIDE”
THE GRAND BALL ROOM, THE TAJ WEST END,
BANGOLORE, 2011,INDIA

LATTITUDE 28 ART GALLERY " THE ANNUAL"
NEW DELHI 2011, INDIA

INDIA FINE ART GALLERY "HY-TIMES"
MUMBAI 2011, INDIA

KALAKRITI ART GALLERY‘PENTAGRAM’
HYDERABAD 2010, INDIA

KALAKRITI ART GALLERY,
HYDERABAD 2009, INDIA

HASTA GALLERY ' A LONG SHORT CUT '
HYDERABAD 2009, INDIA

OPEN EYED DREAMS ‘ VISIBLE INVISIBILITIES’
COCHIN 2008, INDIA

KANVAS ART GALLERY ‘COLORS OF HYDERABAD’
KOLKATTA 2008, INDIA

OPEN EYED DREAMS 'MYSTERIES:PICTURES OF MYSTICAL MEMORIES'
COCHIN 2007 , INDIA

OPEN EYED DREAMS 'THE DOUBLE',
COCHIN 2007, INDIA

HASTA GALLERY, 'LOOK AGAIN"
HYDERABAD 2007, INDIA

KALAHITA ART FOUNDATION
HYDERABAD 2006, INDIA

SHILPARAMAM,
HYDERABAD 2006, INDIA

ఇప్పుడు ఈ జూలై 31 న బెంగళూరులో ఒక exhibition నిర్వహించబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు వెళ్ళి చూడవచ్చు, నచ్చితే తన బొమ్మలు కొనుక్కోవచ్చు.


అంజి గారు బోలెడు పుస్తకాలు చదువుతారు. నాకు MARIA ABROMOVICH అనే చిత్రకారిణి గురించి ఆవిడ వేసిన live performance photos గురించి నాకు చెప్పేవారు. అలాగే arts and feminism గురించి కూడా చెప్పేవారు. తను వేసిన బొమ్మలు పూర్తయినవి, సగం వేసినవి నాకు చూపించేవారు. ఇప్పటివరకూ తనని ముఖాముఖి కలవకపోయినా తన స్నేహం నాకు అపురూపం.

చిత్ర కళకి పరిమితులు లేవు. ఎటువంటి భావననైనా ఆవిష్కరించగల శక్తి ఈ కళకి మాత్రమే ఉంది. అటువంటి చిత్రకళను తన సాధనతో, అకుంఠిత దీక్షతో సొంత చేసుకున్న ఆంజనేయులు గారికి హేట్స్ ఆఫ్. ఇంతటి అపురూపమైన స్నేహం నాకు లభించడం నా అదృష్టం.


Tuesday, July 26, 2011

బాలనందం - రేడియో కార్యక్రమాలు

మొన్న సుజాత గారు శారదా శ్రీనివాసన్ గారి పుస్తకం గురించి తన బ్లాగులో రాసాక, నాదగ్గరున్న ఎప్పటివో పాత బాలనందం కార్యక్రమాలు గుర్తొచ్చాయి. "ఆపాత" జ్ఞాపకాలు మీకోసం. బాలన్నయ్య, బాలక్కయ్య తెలిసినవాళ్ళకి ఇవి అపురూపాలు. ఇవి విని అందరూ తమతమ బాల్యంలోకి హాయిగా వెళ్ళిపోండి! :)






Wednesday, July 20, 2011

గొలుసు కట్టు వ్రాత

మా చిన్నప్పుడు ఈ వ్రాత గురించి వినడం తప్ప ఇంకేమి తెలీదు. పూర్వం రోజుల్లో ఒక అక్షరానికి ఇంకో అక్షరాన్ని కలిపేస్తూ రాసేవారని వింటూ ఉండేదాన్ని. మధురైలో తిరుమలనాయకర్ మహల్ లో ఉన్న పెద్ద లైబ్రరీకి వెళ్ళినప్పుడు అత్యంత పురాతన గ్రంధాల్లో ఈ వ్రాతని గమనించాను. ఎక్కడా ఖాళీ లేకుండా, ఎత్తిన చెయ్యి దించకుండా ఉన్న ఆ వ్రాత ఒక్క ముక్క బోధపడలేదు. పూర్వం ఘంటిక ని సిరాలో ముంచి రాసేవారు కాబట్టి చెయ్యి ఎత్తితే సిరా చుక్క పడుతుందనో లేదా సిరా వేస్ట్ అవుతుందనో అలా గొలుసులా రాసేవారేమో!

మన ఇంగ్లీషులో కూడా కలిపి వ్రాత రాస్తాం కదా....కాకపోతే అది అర్థమవుతుంది మనకి అలవాటు అయింది కాబట్టి. నేను ఇంగ్లీషులో చిన్నక్షరాలు రాసేటప్పుడు m, n, u, w ల లాంటివి పక్క పక్కనొస్తే అన్నీ కలిపేసి రాసేదాన్ని. చూడ్డానికి అది ఒక తరంగంలా ఉండేది. ఏది m, ఏది n, ఏది u అన్నది ఎవరికీ బోధపడేది కాదు. ఒక్కోసారి ఉండవలసినవాటి కన్నా ఎక్కువ వేవ్స్ ఉండేవి దాన్లో! :) మా టీచర్లందరూ తిట్టేవారు...తల్లీ నువ్వు కలిపి రాయక్కర్లేదు, విడివిడిగా రాయి చాలు. అసలే రైటింగ్ కోడికెలికినట్టుంటుంది ఇంక కలిపిరాత అయితే ఇక చెప్పక్కర్లేదు...అనేవారు. పాపం వాళ్లని బాధపెట్టడమెందుకని ఆ కలిపిరాతని కాస్త తగ్గించుకున్నాను.

నేను పదో క్లాసులో ఉండగా అనుకుంటా....మా ఇంట్లో నేలమాళిగలలో తవ్వుతుంటే కొన్ని ఉత్తరాలు బయటపడ్దాయి 1959 నాటివి. మా ముత్తాతగారు మా తాతగారికి రాసినవి. గొలుసుకట్టు వ్రాత...ఒక్క ముక్క బోధపడితే ఒట్టు. అది చూసాక మనమెందుకు ఇలా ప్రయత్నించకూడదు అని చెప్పి తెలుగు లో గొలుసుకట్టు మొదలెట్టాను. అంతా రాసేసాక తిరిగి చదువుదామంటే నా వ్రాత నాకే బోధపడేది కాదు. అలా కొన్నాళ్ళు ప్రయత్నించాను...ఉహూ నా కళ్ళకి శ్రమ తప్ప అంతకన్నా ప్రయోజనం కనపడలేదు. ఇంక వదిలేసాను. ఈ గొలుసుకట్టు పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలని నాకు చాలా కోరిక... ఎవరికైనా తెలిస్తే చెప్పండి.

మా ఇంట్లో దొరికిన ఉత్తరాలని భద్రంగా దాచిపెట్టాను నా ఖజానాలో. ఇన్నాళ్ళకి వాటిని స్కాన్ తీయగలిగాను. వాటిని చూస్తే బలే గమ్మత్తుగా ఉంటుంది. ఉత్తరం మొత్తం చదవడానికి చాలాసార్లు ప్రయత్నించాను...కాని పావు వంతులో పావు వంతు కూడా బోధపడలేదు. ఆ ఉత్తరాలు ఇక్కడ మీ కోసం:








Tuesday, July 12, 2011

చెత్త కబుర్లు

ఈ మధ్య మనసుని కాస్త కలచివేసిన కబుర్లన్నమాట:

1) మొన్న ఆ మధ్య నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కి వెళ్లాల్సొచ్చింది. స్టేషన్ బయట ఓ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు....వాళ్ళ చేతుల్లో చిన్న చిన్న జెండా కాగితాలు, గుండుసూదులు (అల్పీలు). ఎవరినీ ఏమీ అడగకుండా, చేతికి ఎవరు దొరికితే వాడి చొక్కాకి ఆ జెండాలు అతికించేస్తూ రెండు రూపాయిలు వసూలు చేస్తున్నారు. అసలు ఎంత సామర్ధ్యంగా చొక్కాలో, చేతులో దొరకబుచ్చుకుంటున్నారంటే...ఇంక చెప్పలేను. చుట్టూ ఉన్నవాళ్ళందరికీ తగిలించేస్తున్నారు. అడక్కుండా. విదిలించుకుపోతే అల్పీ గుచ్చుకుంటుందేమో అని భయం. పైగా తగిలిస్తున్నది జాతీయ జెండా. వద్దు పో అంటే జెండాకి అవమానమనో లేక నలుగురూ గేలి చేస్తారనో, కోప్పడతారనో అందరూ పెట్టించుకుంటున్నారు. పెట్టించుకున్నాక చచ్చినట్టు రెండు రూపాయలు ఇవ్వాల్సిందే. లేదంటే ఆ ఆడవాళ్ళు అరిచి గోల చేసి నానాయాగీ చేస్తారు. వాళ్ల చేతికి దొరికిన ప్రతీవాడు, జెండా గుచ్చుతుంటే బిత్తరపోయి చూడడం...అసహాయంగా జేబులోనుండి రెండు రూపాయలు తీసి ఇవ్వడం. ఐదు నిముషాలో ఓ ఐదుగురికైనా గుచ్చుతున్నారు జెండాలు. ఆ లెక్కన ఐదు నిముషాలకి పది రూపాయిలు. గంటలో 120 రూపాయలు...బాగానే ఉంది సంపాదన. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న నాకు ఎంత చిరాకేసిందో! ఏమిటీ దౌర్జన్యం! దేశభక్తిని, జాతీయ జెండాని ఉపయోగించుకుని (అడ్డం పెట్టుకుని) అక్రమాలు, అరాచకాలు చెయ్యడం ఇంత దిగువ స్థాయి నుండీ ఉందని నాకిప్పటివరకూ తెలీదు.

2) రేడియో లో...అదే ఏదో ఒక FM లోఓ దిక్కుమాలిన ప్రోగ్రాం వస్తుంది. దాని పేరు "లాయల్టీ టెస్టు". మొన్న విన్నాను....జాకీలు ఒకబ్బాయికి ఫోన్ చేసి
జాకీ: నిన్న మీ సాయంత్రం ఎలా గడిచింది. ఏం చేసారు? మీ అనుభవాలు మాతో పంచుకోవచ్చు.
అబ్బాయి: అశ్విని తో ఉన్నాను.
జాకీ: అశ్విని ఎవరు?
అబ్బాయి: నా గర్ల్ ఫ్రెండు
జాకీ: మీరిద్దరూ ఏం చేసారు? ఎక్కడెక్కడ తిరిగారు మాతో పంచుకోవాలనుకుంటే చెప్పొచ్చు.
అబ్బాయి: సినిమా, డిన్నర్...వగైరా వగైరా.

వెంటనే జాకీలు ఇంకో అమ్మయికి లైన్ కలిపారు. అవతలనుండి ఆ పిల్ల గొంతు...

అమ్మాయి: అశ్విని ఎవరు? దానితో నువ్వేం చేసావు? ఎక్కడ తిరిగావు? ఎన్నిసార్లు పడుకున్నావు? నిన్న నన్ను కలవడానికి రాను అని చెప్పినదానికి కారణం ఇదా? ఎన్నాళ్ళుగా సాగుతోంది ఈ వ్యవహారం?
అబ్బాయి: ఓహ్ అనిత....నువ్వా, అదీ అదీ ప్చ్ అదీ అది కాదు...అశ్విని అంటే.... (నసుగుతున్నాడు)
అమ్మాయి: 4 letter word కనీసం ఓ ఐదు సార్లు!
అబ్బాయి: ఇంకా నసుగుతూనే ఉన్నాడు
అమ్మాయి: పిచ్చి పిచ్చిగా తిడుతోంది, బూతులు తిడుతున్నాది...విజృంభించేస్తున్నాది. ఒకే మాట "దానితో ఎన్నిసార్లు పడుకున్నావ్" అని కనీసం పదిసార్లు అడిగుంటుంది.

లైన్ కట్ అయింది.

జాకీ: యా చెప్పండి, అనిత మీ గర్ల్ ఫ్రెండు కాదా?
అబ్బాయి: అవును తను నా గర్ల్ ఫ్రెండే
జాకీ: మరి అశ్విని? మీ ఇంకో గర్ల్ ఫ్రెండా?
అబ్బాయి: యా అవును, ఇప్పుడు పెంట పెంట అయింది
జాకీ: గుడ్ లక్!

లైన్ కట్ అయింది.

జాకీ: అదండీ సంగతి. ఆ అబ్బాయి తన సమస్యని పరిష్కరించుకుంటాడని అనుకుంటున్నాము. వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. ఇంకా మీరెవరైనా ఈ లాయల్టీ టెస్టు కి మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ని పంపించాలనుకుంటున్నారా అయితే పేరు, ఫోన్ నంబర్ మాకు పంపించండి.

ఇది విన్నాక నాకు ఒళ్ళుమండిపోయి ఆ రేడియో పీక నొక్కాను. ఆ ప్రోగ్రాం కనిపెట్టినవాడిని జైల్ లో పెట్టాలి. వెర్రి వేయి తలలతో వీర విహారం చేస్తోంది. ....పైత్యప్రకోపానికి కాబోలు!

3) మొన్న మెట్రోలో వెళ్ళవలసి వచ్చింది. రద్దీగా ఉండడంతో నేను, నా ఫ్రెండు నిలుచున్నాము. మిగతావాళ్ళు కూడా మా వెనుకే తోసుకుంటూ ఎక్కడంతో మేమిద్దరం కాస్త దూరం అయ్యాము. నేను తన దగ్గరకి వెళ్ళిపోదామనుకునేంతలో ఒక స్టేషన్ వచ్చింది. బిలబిలమంటూ జనాలు ఎక్కారు. కొందరు ఆడవాళ్ళు ఎక్కి నా చుట్టూ చేరారు. చూడడానికి చాలా మొరటుగా ఉన్నారు. కొందరు పల్లెటూరి వాళ్ళలాగ అడ్డపంచె కట్టుకున్నారు. ఓ 7-8 మంది ఉంటారు. అటు, ఇటు తోసుకుంటూ నా చుట్టూ తిరుగుతున్నారు. నేను నా ఫ్రెండు దగ్గరకి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తుంటే వాళ్ళు నాకు అడ్డొస్తున్నారు. నన్నస్సలు వెళ్ళనివ్వట్లేదు. జాగా లేదు అంటున్నారు. నాకు చిరాకేసింది. ఎందుకు వీళ్ళు నన్నిలా ఆపుతున్నారు అని విసుక్కున్నాను. నన్ను పద్మవ్యూహంలో బిగించినట్టు బిగించారు. ఎటూ కదలడానికి కుదరలేదు. ఊపిరి ఆడకుండా ఉంది. కాసేపు అలాగే నిల్చున్నాక ఇంక వాళ్ళకి గట్టిగా చెప్పాను నేను అటు వెళ్ళాలి దారి ఇవ్వమని. చాలా ఇరుకుగా కొంత దారి ఇచ్చారు. కష్టపడి వాళ్ళని తప్పించుకుని అటువైపు చేరాను. నేను నడుస్తున్నంతసేపు వాళ్ళు నాకు తగులుతూనో, గుద్దుతూనో ఉన్నారు. నా ఫ్రెండు దగ్గరకి చేరి ఎందుకో నా బేగు మీద చెయ్యి పెట్టేసరికి అది తెరిచి ఉంది. లోపల పర్స్ లేదు. నాకెంత గాబరా వేసిందో! నా పర్స్ కనిపించడం లేదు అంటూ పెద్దగా అరిచాను. నాకు కావలసినవి, ముఖ్యమైనవి అన్నీ అందులో ఉన్నాయి. మేమిద్దరం కింద పడిపోయిందేమో అని వెతుకుతున్నాం. నాకు మతిపోయింది. నేనెప్పుడూ పర్స్ పోగొట్టుకోలేదు. నా బేగు విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇలా ఎప్పుడూ జరగలేదు...ఎక్కడ పోయిందో అనుకుంటూ ఇద్దరం వెతుకుతున్నాం. ఈ లోగా ఆ ఆడవాళ్ళు అక్కడనుండి కదిలే ప్రయత్నంలో ఉన్నారు. బహుసా తరువాతి స్టేషన్లో దిగుతారు కాబోలనుకుని నా పర్స్ కోసం చూస్తున్నాను. ఆ ఆడవాళ్ళ కాళ్ళ మధ్యలో కనిపించింది. ఒకావిడ దాన్ని కాళ్ళ మధ్యలోకి తోస్తోంది. నేను గబుక్కున ముందుకి దూకి పర్స్ దొరకపుచ్చుకున్నాను. వాళ్ళు కాస్త బిత్తరపోయినట్టు చూసి మళ్ళీ మామూలయిపోయారు. అక్కడ ఉన్న మాకు, మిగతావాళ్ళకి స్పష్టంగా అర్థమవుతున్నది ఇది వాళ్ళ పనే అని. అంతవరకూ నన్ను పద్మవ్యూహంలో బంధించడానికి కారణం కూడా అదే. వెంటనే బేగులో సెల్ కోసం చూసాను. ఉంది. ఇంకేమీ పోలేదు పర్స్ తప్ప. నా అదృష్టం బావుండి దొరికింది. బహుసా వాళ్లు దొంగిలించినప్పుడు పొరపాటున కిందకి జారిపడినట్టుంది. అదే నిముషంలో అది నా కళ్ళబడింది. నేను మెరుపులా ముందుకి దూకి తీసుకోవడంతో నాకు దక్కింది. వాళ్ళతో గొడవపెట్టుకుని తిడదామనుకున్నాను. కానీ నా దగ్గరా సాక్ష్యాలు ఏవి? నీ సంచికి నువ్వు జిప్ పెట్టుకోలేదు, పర్స్ పడిపోయింది అని వాళ్ళు నా మీద పడితే? పైగా వాళ్ళు చాల బలిష్ఠంగా, మొరటుగా ఉన్నారు. "డిల్లీలో మొదటి పాఠం: ఎవరితో గొడవపెట్టుకోకూడదు. ఇక్కడి మనుషులతో వేగలేము." ఇది గుర్తొచ్చి ఊరుకున్నాము. వాళ్ళు అక్కడనుండి కదిలి తరువాతి బోగీకి వెళ్ళారు. అక్కడనుండి అలా కదులుతూ ఒక్కో బోగీకి వెళుతున్నారు. ఇలా ఊరుకుంటే లాభం లేదనిపించింది. తరువాత స్టేషన్ లో పోలీసులు మెట్రోలో చెకింగ్ కి వచ్చినప్పుడు వాళ్ళకి కంప్లైంట్ చేసాను. ఇలా ఇలా జరిగింది. నా అనుమానం వాళ్ళ మీద. పైగా వాళ్ళు ఇలా ఒక బోగీ నుండి ఇంకో బోగీకి వెళుతూ ఉన్నారు అని చెప్పాను. వెంటనే ఆ పోలీసులు వాళ్ళ వెనుకే వెళ్ళారు. వాళ్ళని ఏవో అడుగుతూ ఉన్నారు. ఈలోగా నా స్టేషన్ వచ్చి నేను దిగిపోయాను.

ఈ అనుభవం నాకు బాధగానూ, భయంకరంగా అనిపించింది. ఇలా గుంపులు గుంపులుగా వచ్చి రైళ్లలో, బస్సులలో దొంగతనాలు చేస్తారని నాకు తెలీదు.


............................................................చెత్త కబుర్లు సమాప్తం..................................................



Wednesday, July 6, 2011

పరీక్షలమ్మో పరీక్షలు !

ఈ మధ్య పిల్లలందరూ పరీక్షలు, ర్యాంకులనీ తెగ హడావుడి చేసేసారుగా...అవన్నీ చూస్తే నా పరీక్షల హడావుడిగుర్తొచ్చింది.

చిట్టి సౌమ్యకి పరీక్షలతో ఎన్ని కష్టాలో! అసలు చిన్నప్పటినుండీ పరీక్షలంటే అస్సలు ఇష్టముండదు...వెధవ పరీక్షలుఎందుకొస్తాయో అని విసుక్కునేది. చిన్నప్పటినుండీ ఇష్టమున్న పని చాలా హాయిగా చేస్తూ ఇష్టం లేని పని అస్సలుచేసేది కాదు. అదే సూత్రం పాఠాలకీ వర్తించేది. ఇష్టమున్న సబ్జెక్టులు బాగా చదివి, ఇష్టం లేనివి పక్కకు పెట్టేసేది. దానితోపరీక్షలొచ్చేసరికి ఎడతెగని కష్టాలు పాపం! పరీక్షలయిపోయిన రోజు ఇంక పండగే పండగ. :)

ఓసారి తొమ్మిదో క్లాసులో ఏం జరిగిందంటే....(ఇంక "ఉత్తమ స్త్రీ" లోకొచ్చేస్తా :P).

ఆఫ్ ఇయర్లీ పరీక్షలన్నమాట. చివరి పరీక్ష సోషలు. ఆ సోషల్ టీచర్ మహా కరుకు...ఆవిడని చూస్తే పిల్లలందరికీ వణుకు. ఒకే ఒక్క తిట్టు తిట్టేదావిడ..."నవరంధ్రాలు మూసుకుని పాఠం వినండి". అంతే ఎక్కడ దొంగలు అక్కడే గప్‌చుప్. ఈ ఆఫ్ ఇయర్లీ పరీక్షలలో లాస్ట్ పేపర్ సోషలు-ఆవిడది. తలుచుకుంటేనే నాకు ఉత్సాహం వెల్లివిరిసింది...ఆహా ఇంకొక్క రోజు...ఇంకొక్క పరీక్ష....అంతే ఇంక సెలవులిచ్చేస్తారుఅని మురిసిపోతున్నాను. అదే ఆనందాన్ని మనసులో నింపుకుని పొద్దున్నే బడికెళ్ళి పరీక్ష బరికేసాను. ఒక అరగంట ముందే రాసిపారేసాను. రాయడం ముగియడమేమిటి, క్లాసు నుండి బయటకి ఒక్క అంగలో దూకబోతుంటే వెనుకనుండి ఆ సోషలు టీచర్ కంచు కంఠం..."రేపు బడి ఉంది, ఎల్లుండి నుండి సెలవులు. రేపు వచ్చేటప్పుడు అసైన్మెంట్ చేసి తీసుకురా" అని వినిపించింది. ఆ..ఇంత పెద్ద పరీక్షే రాసేసాను, అసైన్మెంట్ ఓ లెక్కా అని గ్రౌండ్ కి పారిపోయాను. నాలాగే ఉత్సాహం ఉరకలు వేస్తున్న స్నేహితులు కనిపించారు...వారందరితో పిచ్చాపాటి వేసి, పెద్దపండగ (సంక్రాంతి) కి ఏమేమి కొనుక్కున్నామో ముచ్చటించి తీరికగా మధ్యాన్నం భోజనాలవేళకి ఇల్లు చేరుకున్నా. సుష్ఠుగా తినేసి, కమ్మటినిద్ర తీసి, సాయంత్రం నాన్న ఇంటికొచ్చేసాక బోలెడు కబుర్లు చెప్పేసి, పుస్తకాల సంచి తీసా...సర్దుకుందామని, అసైన్మెంట్ చేద్దామని. అందులో చిత్తు కాగితాలన్నీ ఏరిపారేస్తూ ఒకచోట ఆగిపోయాను. పెద్ద ఠావులు కట్ట. తెల్లకాగితాలు దొంతిగాపెట్టి మధ్యకి మడవబడి ఉన్నాయి. ఓ 5-6 కాగితాలుండొచ్చు. నేను చిత్తు ఎప్పుడూ ఇలా పధ్ధతిగా మడతబెట్టనే, అయినా ఠావు కాగితాలపై చిత్తు రాయనే, ఇవేంటబ్బా! అని విస్మయం చెందుతూ తెరిచి చూసా...నేను పొద్దున్న రాసిన సోషల్ పరీక్ష- జవాబు పత్రం...ఇదెలా వచ్చింది నా సంచీలోకి? అంతా అయోమయంగా అనిపించింది. కెవ్వుమని కేకేసి, కళ్ళుతిరిగిపడిపోయినంత పని చేసాను. మా నాన్నారు పరిగెత్తుకుంటూ వచ్చారు "ఏమయిందమ్మా" అంటూ. నాకు మెల్లిగా విషయం బోధపడింది....పొద్దున్న పరీక్షలయిపోయాయనే సరదాలో జవాబుపత్రం టీచరుకి ఇవ్వకుండా, మడిచి సంచీలో పెట్టేసుకునాను. మరి ప్రశ్నాపత్రం ఏమయినట్టు? సంచీ అంతా వెతికా....కొంపదీసి జవాబు పేపర్ కి బదులు ప్రశ్నాపత్రం టీచరుకిచ్చానా! :O కళ్ళలో నీళ్ళు...కాళ్ళు, చేతులు వణుకు....నోట మాట పెగలట్లేదు. నా చేతిలో కాగితాలందుకుని నాన్నచూసి "ఇదేమిటే" అని అడిగారు. అదే నాకూ అర్థం కావట్లేదు...ఇదెలా నా సంచిలోకొచ్చింది....అయ్యో అసలే ఆవిడ చండశాసనురాలు....ఏమిటి దారి? అప్పుడు మా నాన్నారికి గుర్తొచ్చింది ఆవిడ ఇల్లు మన వీధికి ఎదురువీధేగా..."ఇంటికెళ్ళి ఇచ్చిరా పో" అన్నారు. "అమ్మో, నాన్నా చింతకర్రుచ్చుకుని కొడతారేమో"? nangih "అబ్బా, ఏం కాదులే, వెళ్ళీ రామ్మా..ఇచ్చేసి పొరపాటయిపోయిందడీ అని సారీ చెప్పి రా" అన్నారు. నేను భయం భయంగా, బెరుకుగా బయలుదేరాను వాళ్ళింటికి. వెళ్ళి తలుపు తట్టాక...టీచరు వచ్చారు. "ఏంటి ఈ టైములో వచ్చావు" అని గడియారంచూసారు....రాత్రి 7.30. "ఏం లేదు టీచరు, ఇది మీకిచ్చి వెళదామని"...నసిగాను. నా చేతిలో కాగితాలు అందుకుని, చూసి నావైపు ఒక్క చూపు చూసారు...ఆవిడ కళ్ళలో ఎర్రని జీరలు...నాకు ఏడుపొక్కటే తక్కువ."అది కాదు టీచర్, పొరపాటు...చూసుకోలేదు. కావాలని చేసినది కాదు టీచర్...సంచిలో కనిపించగానే తెచ్చి ఇచ్చేసాను. నేనేమీ మార్చలేదు టీచర్...ఒట్టు, నిజంగా పొరపాటునే జరిగిందండీ" అని బిక్కమొహంతో చెప్పా. ఆవిడేమీ అనలేదు..."మ్మ్ సరే, వెళ్ళి రా" అన్నారు. బ్రతుకుజీవుడా అనుకుంటూ ఒక్క గెంతులో బయటకి దూకి, ఇంటికి పరుగో పరుగు. కానీ నాకింకా ఆశ్చర్యం...ఆ కాగితాలు చూసి టీచరు నిప్పులు కక్కుతారనుకున్నా, ఏమీ అనలేదు...బాబోయ్ మిన్ను విరిగిమీదపడదు కదా! ఏ కళనున్నారో ఏమో, తిట్టకుండా వదిలేసారు అనుకుంటూ హాయిగా నిద్రపోయా. మర్నాడు బడికెళ్ళా గెంతుకుంటూ. ఆరోజు ఇంట్రబిల్లు (అప్పట్లో మేము అలాగే అనేవాళ్ళం :D) లో స్టాఫ్ రూము నుండి పిలుపొచ్చింది. ఇంక చూసుకోండి...అందరు టీచర్ల మధ్యన పెట్టి నన్ను ఎడాపెడా వాయించేసారు. నా మీదా కక్షగట్టి ఉన్న మా ఇంగ్లీషు మేషారు విజృంభించేసారు. నన్ను అభిమానించే సంస్కృతం, తెలుగు, సైన్సు టీచర్లు నన్ను కాపాడాలాని శతవిధాలా ప్రయత్నించారు. మా సోషల్ టీచర్ ఆగితే కదా...ఎంత ధైర్యం చూడండి....పైగా రాత్రి మా ఇంటికొచ్చి ఆ కాగితాలన్నీఇచ్చింది. ఎంత పొగరో చూడండి...అల్లరి మితిమీరిపోతున్నాది. లాభం లేదు దీని అంతు చూస్తా. HM కి కంప్లైంట్ ఇస్తాను. ఈ పప్పులన్నీ నా దగ్గర ఉడకవు. ఓ సంవత్సరం పరీక్షలు రాయకపోతే సంకటం కట్టేస్తుంది" అని భీభత్సంగా అరుపులు. నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. భగవంతుడా...ఏ తీరుగ నను చూసెదవో, నా తరమా ఈ బడిసాగరమీదను...అని మనసులో పాడుకుంటూ, "ఆహా మహాతల్లీ ఇందుకా నిన్న రాత్రి ఏమీ అనకుండా పంపించేసావు..మర్నడు ఈ ప్రోగ్రాం పెట్టాలని ఆలోచనతోనేనా" అని మనసులో తిట్టుకుంటూ, ఉబికి వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ బ్రతిమాలడం మొదలెట్టాను...ఇంకెప్పుడూ అలా చేయనండీ. పోరపాటున జరిగింది. కావాలని చేసినదికాదు. నా తప్పే, ఒప్పుకుంటున్నా...మన్నించండి అంటూ ఏవో చెప్పాను. చివరికి మిగతా టీచర్లు కూడా నాతో కలిసి ఆవిడని శాంతింపజేసి "ఇలాంటి పనులు జీవితంలో ఎప్పటికీ చెయ్యనని" ప్రమాణం చేయించడం కోసం హారతి పళ్ళెం, భగవద్గీత వెతికారు, కానీ దొరకలేదు. అప్పుడు ఉత్తినే ప్రమాణం చేయించారు...నేనూ ఉత్తుత్తినే ప్రమాణం చేసేసా ;) హమ్మయ్య....గండం గడిచింది అనుకుంటూ పరుగెత్తుకుంటూ, పడుతూ లేస్తూ, దొర్లుతూ, పిల్లిమొగ్గలేస్తూ క్లాసురూమ్‌కి చేరిపోయాను.
................................................

బడి వదిలి కాలేజీలో చేరడం. ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ లో చేరడం జరిగింది. డిగ్రీలో నాది MES ( maths, eco, stats). మా కాలేజీలో stats ఉన్న గ్రూపులు మూడు MPS (maths, pysics, stats), MES and CES (commerce, eco, stats). MPS, MES వాళ్ళకి maths, stats కలిపే క్లాసులవుతాయన్నమాట. పెద్ద సంతలా ఉండేది. CES వాళ్ళకి stats చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఏదో మీన్, మోడ్, మీడియన్...మహా అయితే correlation చెబుతారు అంతే. అంత ఈజీ గా ఉంటుందన్నమాట. ఇంక మాకు యేడాదికి మూడు ఇంటర్నల్స్ (40మార్కులు), ఒక ఎక్స్‌టర్నల్(60 మార్కులు) ఉండేది. ఇంటర్నల్ లో బాగా రాసిన రెండు పరీక్షల మార్కులుతీసుకుంటారు అన్నమాట. మనం డిగ్రీ చివరి సంవత్సరం లో ఉన్నాం. stats మొదటి ఇంటర్నల్ ఎగ్గొట్టాం (ఏదో బలమైనకారణం ఉండే ఉంటుంది, నాకు ఇప్పుడు గుర్తులేదుగానీ) :). రెండో ఇంటర్నల్ సరిగ్గా రాయలేదు...12/20 వచ్చాయి. అమ్మో మూడోది బాగా రాసి మార్కులు తెచ్చుకోకపోతే కష్టం. 20 లేదా కనీసం 18 అయినా తెచ్చుకోవాలి. అప్పుడే 30/40 వస్తాయి అని లెక్కలేసుకుని బాగా చదివేసా. పరీక్ష మధ్యాన్నం 2.00 కి. నా హాల్ టికెట్ నంబర్ అదీ చుసుకుని వెళ్ళి పరీక్ష గదిలో కూర్చున్నా. మొదటి బెంచీలో రెండో సీటు.....వెనక్కి తిరిగి చూస్తే స్నేహితులంతా పలకరించారు. మేషారు పేపర్లిచ్చారు. మొదటి ప్రశ్న చూసా...డెడ్ ఈజీ. రెండో ప్రశ్న...అరే చాలా సింపులూ....మూడోది...ఓహ్హొహ్హో బహు సులభం...నా పంట పండిందనుకున్నా . అయినా ఇంత ఈజీగా ఇచ్చారేమిటబ్బా పేపరూ అనుకుంటూ చాయిస్ లో ప్రశ్నలకి కూడా జవాబులు రాసేసి అరగంటలో పూర్తి చేసేసా (గంట పరీక్షన్నమాట). వెనక్కి తిరిగి చూసా...ఫ్రెండ్స్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ, రాసేస్తున్నారు. మూడో బెంచీలో ఫ్రెండు తలెత్తిచూసి, అప్పుడే అయిపోయిందా అని ఆశ్చర్యం గా చూసాడు. "ఆ, ఈజీ కదా" అని నా మొహంలో భావం...తనకు మరింత విస్మయం! రెండో బెంచీలో పిల్ల అనుమానంగా చూసింది...అసలు ఇది పరీక్ష రాసిందా లేదా అన్నట్టు. వీళ్ళంతా ఎందుకబ్బా ఏదో చాలా కష్టమైన పేపర్ రాస్తున్నట్టు ఫోజు కొడుతున్నారు...ఓవర్ ఏక్షన్ లే అనుకుంటూ పేపర్ ఇచ్చేసి బయటికొచ్చేసాను. గంట కి ఓ పది నిముషాల ముందు ఓ ఫ్రెండు పరీక్ష పూర్తి చేసి బయటికొచ్చింది. ఆ పిల్ల నన్నుచూస్తూనే బాగా రాసావా? అంది. పేపర్ చింపేసాను...డెడ్ ఈజీ కదా అన్నాను. ఆ పిల్ల ఆశ్చర్యంగా "అవునా, రెండోప్రశ్నకి ఏం రాసావు" అని అడిగింది పేపర్ చేతికిస్తూ. నేను అందుకుని రెండో ప్రశ్న చూసా...ఇదేంటి ఈ ప్రశ్న నేను రాయలేదే, నేను చూడలేదే అసలు! మొదటి ప్రశ్న చూసా...అయ్యయో ఇదీ లేదే...మూడోది...ఉహూ...అమ్మో ఏంటి ఈ ప్రశ్నలు...నేను ఈ పరీక్ష రాయలేదు..మరి నేను రాసినదేమిటి? నా పేపర్ విప్పి చూసాను...వేరే ప్రశ్నలు. ఇదేలా సాధ్యం!....నాకు బుర్ర తిరిగిపోయింది. ఆ అమ్మయికి చూపించా...తనకీ కళ్ళు తిరిగాయి. ఇద్దరిలో ఎవరిదో తప్పో అర్థంకాలేదు. ఈలోగా మిగతా కొందరు బయటికొచ్చారు. ఓ నలుగురైదుగురి దగ్గర పేపర్లు తీసుకు చూసా...వాళ్ళందరివీ ఒకేలా ఉన్నాయి. నాదే వేరుగా ఉంది. బాబోయ్...ఏమిటీ వైపరీత్యం? విధి మళ్ళీ నాతో ఏనాటకం ఆడబోతోంది? :( నేనే పరీక్ష రాసానసలు? అందరం ఒకే హాల్లో కూర్చున్నాం. అందరికీ ఒకేలాంటి పేపర్ ఇచ్చారు. మరి నేనేం రాసాను? ఈ సందేహాలతో కాళ్ళు, చేతులు వణుకుతుండగా ఇన్విజిలేటర్ దగ్గరకెళ్ళి నా గోడు వెళ్ళబోసుకున్నా. ఆయన కూడా మొదట కొంత గందరగోళానికి గురి అయీ రెండూ పేపర్లూ దగ్గర పెట్టుకుని తీక్షణం గా పరిశీలించి చూస్తే......నేను రాసిన పేపర్ మీద హెడ్డింగ్ లో BA STATISTICS EXAM FOR CES అని తాటికాయంత అక్షరాలతో రాసుంది. అది చూసి ఢాం అని కిందపడిపోయా. జరిగిందేమిటంటే మా stats పరీక్ష పత్రాలలో పొరపాటున CES stats పేపర్ ఒకటి కలిసింది. అదీ, రాక రాక నాకే వచ్చింది. నేను వెనక ముందు చూసుకోకుండా తిన్నగా ప్రశ్నలు చూడడం మొదలెట్టాను. ఈజీగా ఉన్నాయని చెప్పి రాసి పారేసాను. పోనీ అంతా సులువుగా ఉన్నప్పుడైనా ఇది మా పేపరేనా అని డౌటు రావాలా నాకు? కాస్త తల యెత్తి చూసుంటే తెలిసేది. పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగ్ లో రాసుంది...కానీ నేను చూడలేదు. ఈ విషయం గ్రహించేసరికి పరీక్ష టైము అయిపోయింది. ఒక అరగంట టైం ఇవ్వండి...పరీక్ష రాసేస్తాని అని ఇన్విజిలేటర్ ని బతిమాలుకున్నాను....ఊహూ, ససేమిరా అన్నారు. నాకు ఏడుపొచ్చేసింది...అయ్యో ఉన్న ఒక్క పరీక్షా పోయింది, ఏమిటి నా గతి! మూడు ఇంటర్నల్స్ లో ఒక్కటే రాస్తే ఎక్స్‌టర్నల్ కి allow చెయ్యరు. నాకు కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టనిపించింది. ఏం చెయ్యలో తోచలేదు. వెంటనే eco dept వైపు పరిగెట్టా. మా మావయ్యగారు అక్కడ లెక్చరర్....ఆయన ఆరోజు సెలవుట. తెలుగు డిపార్ట్మెంట్ కి పరిగెట్టా...మా అత్తయ్య అక్కడ లెక్చరర్. తనూ సెలవులో ఉందిట. ఎటూ పాలుపోక మావయ్యగారికి ఫోన్ చేసాను. ఆయన అంతా విని కాసేపయ్యక మళ్ళీ ఫోన్ చెయ్యి అని పెట్టేసారు. ఈలోగా నా క్లాస్మేట్స్ లో కొందరు దరిద్రులు నన్ను తెగ భయపెట్టారు...ఇంక నీ పని అంతే. డిగ్రీ ఫైనల్ ఇయర్ stats exam పోయింది. మళ్ళీ యేడాది మళ్ళీ రాసుకోవడమే. సాధారణంగా ఇలా మళ్ళీ పరీక్ష రాయడానికి allow చెయ్యరు అంటూ నానా కూతలూ కూసారు. నాకు గుండె జారిపోయింది. అయినా మావయ్యగారు, అత్త ఉన్నారుగా ఏదో ఒకటి చేస్తారులే అని ఏదో మూల ధైర్యం మిణుకుమిణుకుమంటూన్నది. మావయ్యగారు, కాలేజీలో తన ఫ్రెండ్స్/తోటి లెక్చరర్లకి ఫోన్ చేసి నా సంగతి చూడమన్నారు. ఆయనకి చాల క్లోజ్ అయిన ఇంకో లెక్చరర్ ని కలవమన్నారు. ఆయన్ని కలిస్తే "అలా ఎలా రాసేసావమ్మయ్...చూసుకోవద్దూ" అని నాలుగు తిట్టి ప్రిన్సిపల్ దగ్గరకి తీసుకెళ్ళి, అన్నీ వివరించి...పొరపాటున జరిగింది, ఇందులో ఇన్విజిలేటర్ తప్పు కూడా కొంచం ఉంది... పేపర్లు చూసుకోకుండా ఇచ్చాడు కాబట్టి ఈ అమ్మాయికి మళ్ళీ చాన్స్ ఇవ్వండి అని మనవి చేసారు. వెంటనే ప్రిన్సిపల్, నన్నుఇంకో నాలుగు తిట్టేసి, ముఖ్యమైన లెక్చరర్లతో సమావేశమయ్యి ఒక నిర్ణయానికొచ్చారు....ఓ గంటలో కొత్తగా పేపర్ సెట్ చేసి ఇస్తారు.....దాన్ని నేను అరగంటలో రాసివ్వలి. హమ్మయ్య అనుకుని వెంటనే ఒప్పేసుకున్నాను. నాకు తెలుసు ఈసారి పేపర్ కష్టంగా ఇస్తారని. ఆ గంటలో మళ్ళీ పుస్తకాలు అన్నీ తిరగేసి, తరువాత ప్రిన్సిపల్ ముందే కూర్చుని అరగంటలో పరీక్ష రాసేసి ఇచ్చేసాను. నేను రాసిన రెండు పేపర్లూ దిద్దబడ్డాయి. CSE stats లో 20/20. మా stats లో16 వచ్చాయి . కాలేజీలో నా పేరు మారుమ్రోగిపోయింది. కొందరు లెక్చరర్లు అన్నారుట...చూడు ఆ అమ్మాయికి ఎన్నితెలివితేటలో, ఏ పేపర్ ఇచ్చినా బాగా రాసేసింది" అని. :D ఈ సంగతి మా అత్త, మావయ్యగారికి చెబితే వాళ్ళు చచ్చేట్టు తిట్టారు...సిగ్గులేదూ ..వెధవ పని చేసేసి మళ్ళీ గొప్పలొకటి అని. అమ్మ, నాన్నా మెత్తగా చివాట్లు పెట్టారు. ఈ విషయం ఎవరికి ఎవరు చెప్పారో ఏమొగానీ మా బంధురబంధురబంధు గణానికంతటికీ తెలిసిపోయింది. ఒక ఫంక్షన్ లో మా పెద్దనాన్నగారి కూతురి అత్తగారు నన్ను పిలిచి అడిగారు "అలా చేసావుట కదా, పరిక్షలో అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మాయ్" అని సాగదీసుకుంటూ. :( దేవుడా...నా ప్రతిభ దశదిశాలా వ్యాపించిందా....జిల్లాలు దాటి పాకిందా అనుకుంటూ మనసులో ఏడ్చుకున్నా. :( ఇలా ఒక రోజు కాదు, ఒక మనిషి కాదు. మొత్తం అందరికీ తెలిసిపోయింది. సంవత్సరం పాటు నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ ఇదే అడగడం....పిచ్చెక్కిపోయింది. నేను ఊరు వదిలి హైదరాబాదుకి ప్రయాణమవుతున్నప్పుడు (యూనివర్సిటీ లో జాయిన్ అవ్వడానికి) కూడా అందరూ ఇదే చెప్పారు. పరీక్షా పత్రాన్ని హెడింగ్ తో సహా క్షుణ్ణంగా చదువు, తరువాత రాయి అని. ఈ గోల దాదాపు ఓ యేడాదిన్నర వరకూ సాగింది.
...............................................

అక్కడితో అయిపోయిందా, లేదు...MA లో కొచ్చేసరికి పరీక్షలు ఎక్కువయిపోయాయి....ఎంత విసుగొచ్చేసిందో...నాజీవితంలో ఈ పరీక్షల అధ్యాయం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూసేదాన్ని. ఓసారి మా ఇంటర్నల్స్ ముందు హైదరాబాదులో ఏదో భీభత్సం జరిగింది....మర్నాడు బహుసా సెలవు ప్రకటించవచ్చు అని ఊహాగానాలు సాగాయి. మర్నాడు నాకు ఇంటర్నల్...అందులోనూ నాకు అస్సలు ఇష్టం లేని సబ్జెక్ట్...ఆహా ఇంక పరీక్ష ఉండదు అని సంబరపడుతూ, పుస్తకాలూ మూసేసి, దుప్పటి కప్పుకుని పడుకుండిపోయా. కానీ నా దురదృష్టవశాత్తు మర్నాడు పరీక్ష ఉన్నాది, నేను రాసాను. 5/20 వచ్చాయి...అవే నాకు MA లో వచ్చిన అతి తక్కువ మార్కులు. ఎలాగోలా externalలో కాసిన్ని మార్కులు తెచ్చుకుని పాస్ అయ్యాననిపించుకున్నాను. మార్కులు ఇచ్చేరోజు ఆ సబ్జెక్ట్ టీచర్ పిలిచి "నీకుమిగతా అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులొచ్చాయి, ఏమ్మా ఇందులో మాత్రం పాస్ మార్కులు వచ్చాయి. నీకు నేను నచ్చలేదో, నా పాఠాలు నచ్చలేదో" అని నొచ్చుకున్నారు. అప్పుడు ఎందుకో నాకు చాలా గిల్టీగా అనిపించింది....చ చ ఆయన్నిబాధపెట్టానా అనిపించింది. లేదండీ...నాకు ఆ సబ్జెక్ట్ అంటే అంత ఇష్టం లేదు అని నిర్మొహమాటంగా చెప్పేసాను. ఆయనకూడా సరే నీకు నచ్చిన సబ్జెక్ట్ చదువుకుని బాగా పైకి రా అని దీవించి పంపేసారు. ఇంక phd కొచ్చాక...హమ్మయ్య ఇంక నా జీవితంలో పరీక్షలు రాయక్కర్లేదు అనుకుని తెగ సంబరపడ్డాను.

ఇంక ఫైనల్ టచ్ ఈ పోస్ట్ కి...నాకు జీవితంలో వచ్చిన ఒకే ఒక సున్న. :P
కాగితం పైన నా పేరు పక్కన, మేథ్స్ టాలెంట్ స్పెల్లింగ్ చూడడం మరచిపోకండి!
(బొమ్మ పెద్దది కావడానికి ఇమేజ్ మీద నొక్కండి)




చూసారా నా మేథ్స్ టాలెంట్......ఇంకెప్పుడూ నన్ను లెక్కల గురించి అడగకండి. :D
కానీ తరువాతి సంవత్సరం జరిగిన జిల్లాస్థాయి Maths Talent Test లో నాకు మొదటి బహుమతి వచ్చింది....అదే మరి మేజిక్ అంటే! :P

అదీ నా పరీక్షల ప్రహసనం. :)