StatCounter code

Monday, November 8, 2010

భాషా ప్రవీణులు

అనగా అనగా విజయనగరంలో ఒక సౌమ్య ఉంది. ఆ సౌమ్యేమో డిగ్రీ వరకూ అన్నీ తెలుగు మాధ్యమంలోనే చదువుకుంది. తరువాతేమో సెంట్రల్ యూనివర్సిటీలో సీటొచ్చి హైదరాబాదొచ్చేసింది. యూనివర్సిటీలోనేమో అందరూ ఇంగ్లీషు, హిందీ తప్ప తెలుగు మాట్లాడడం లేదు. మన అమ్మాయికేమో తెలుగు తప్ప మరే భాష రాదు. ఎలారా దేవుడా అనుకుంటూ జాయిన్ అయింది. హిందీ కాస్తో కూస్తో వచ్చు. హిందీ ప్రచార పరీక్షలలో "రాష్ట్ర భాష" వరకు పాస్ అయింది. కానీ మాట్లాడడం అలవాటు లేదు కదా, అందుకని కాస్త బిడియం. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఒక ఒరియా పిల్ల తనకి రూమ్మేట్ గా వచ్చింది. ఆ పిల్లేమో చిన్నప్పటినుండీ అన్నీ ఇంగ్లీషు మీడియం లో చదివిన ఘనాపాటి. హిందీ కూడా దంచేస్తుంది. ఇహ మన సౌమ్య పని అయిపోయినట్టే. పోనీలే ఆ చందాన అయినా మనకి భాషలు వచ్చేస్తాయి కదా అని సర్దిచెప్పుకుంది. ఆ ఒరియా అమ్మాయి చాలా మంచిది. సౌమ్యకొచ్చిన కష్టాన్ని అర్థం చేసుకుని తనకి సహాయం చేస్తూ ఉండేది. తప్పుగా మాట్లాడితే కరక్ట్ చేస్తూ ఉండేది. ఎలాగోలా అష్టకష్టాలు పడి అవకతవకలతో హిందీ, ఇంగ్లీషు రెండూ కలిపేసి బండి లాగించేస్తూ ఉండేది మన హీరోయిన్. ఆ ఒరియాపిల్లకి అప్పుడప్పుడూ మాంచి ఝలక్కులిచ్చేది. ఇలా కథ నడుస్తూ ఉండగా ఓరోజు మన సౌమ్య ఆ ఒరియా అమ్మాయితో అందీ " నేను రేపొద్దున్నే క్లాసుకి ఈ పుస్తకం తీసుకెళ్ళాలి, remember me అంది. ఆ పిల్ల "ఏమిటీ" అని మళ్ళీ అడిగింది. remember me అని ఓ 2-3 సార్లు చెప్పాక అప్పటికి అర్థమయింది ఆ అమ్మాయికి. ఒహో remind me ఆ అని "అలాగే remind చేస్తాను" అని చెప్పి, ముసిముసిగా నవ్వుకుంటూ బయటకి వెళ్ళిపోయింది. మరి బయటికెళ్ళి భళ్ళున నవ్వుకుందేమో తెలీదుకానీ ఆ దెబ్బతో remind అన్న పదం తెలిసింది మన సౌమ్యకి. ఇంకోసారేమో మన సౌమ్య, ఆ ఒరియా అమ్మాయి తమ గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా తెగ దోమలు కుట్టేస్తూ ఉన్నాయి. అప్పుడు మన సౌమ్య "అబ్బ ఇస్ రూం మే బహుత్ సారే మచిలియా హై" అంది ఠక్కున. ఇహ చూసుకోండి ఆ ఒరియా పిల్ల పడీ పడీ నవ్వింది. కింద పొర్లి పొర్లి నవ్వి కడుపునొప్పి తెచ్చుకుంది. "మచిలియా కాదు సౌమ్యా మచ్చర్ అనాలి, మచిలియా అంటే చేపలు" అని చెప్పింది. అర్రె ఈ మచ్చర్ అన్న పదం మనకి తెలుసు కద మరి మచిలియా అని ఎందుకన్నానబ్బ అని నాలుక కరుచుకుంది మన హీరోయిన్. ఇలాంటి ఝలక్‌లు అబ్బో ఒకటా రెండా...మన సౌమ్య దెబ్బకి ఆ ఒరియాపిల్ల ఢంగైపోతూ ఉండేది.

ఇదిలా ఉండగా మన సౌమ్యతో పాటు వాళ్ళ ఊరినుండి ఇంకో అమ్మాయి కెమిస్ట్రీలో జాయిన్ అయింది. ఓనాడు ఆ తెలుగమ్మాయితో ముచ్చట్లాడుతూ "సబ్బులు అవీ కొనుక్కోవాలీ ఎక్కడ దొరుకుతాయి" అని అడిగింది సౌమ్య.
"గోప్స్ లో దొరుకుతాయి" అంది ఆ తెలుగుపిల్ల.
"గోప్స్ అంటే? అదెక్కడుంది?" అని అడిగింది సౌమ్య.
"గోప్స్ తెలీదా" అంటూ రూట్ చెప్పి అక్కడ అన్నీ దొరుకుతాయి అని చెప్పింది ఆ అమ్మాయి.

అసలే మన భాషా ప్రావీణ్యతతో జనాల్ని అబ్బురపరుస్తున్నాం ఇప్పుడు ఈ గోప్స్ కి అర్థం తెలీదంటే మనూరి అమ్మాయి ముందు మనకి అవమానమయిపోతుంది అని అనుకుని "సరే సరే వెళ్ళి కొనుక్కుంటా" అని చెప్పి సరాసరి తన గదికి వెళ్ళిపోయి తనతో పాటు తెచ్చుకున్న oxford పెద్ద డిక్షనరీ తీసి గోప్స్ కోసం వెతికింది. స్పెల్లింగ్ ఏమయుంటుందబ్బా అని తెగ ఆలోచించి gops, gopse ఇలా రకరకాలుగా వెతికింది. ఉహూ అర్థం దొరకలేదు. ఇందులో లేదంటే ఇదేదో లాటినో, ఫ్రెంచో అయుంటుంది. పోనీ అక్కడికే వెళ్ళి చూద్దాం అని అనుకుని గోప్స్ కి ప్రయాణం కట్టింది. అక్కడికి వెళ్ళి చూస్తే అదో కిరాణా కొట్టు. ఒహో గోప్స్ అంటే కిరాణాకొట్టా అని తన మెదడులో ఆ పదాన్ని ముద్రించేసుకుంది. ఓ రెండ్రోజులు పోయాక తన స్నేహితులతో పిచ్చాపాటిలో ఉండగా
"నాకు ఈ వస్తువు మన యూనివర్సిటీ గోప్స్ లో దొరకలేదు, బయట గోప్స్ లో ఉంటుందేమో చూడాలి" అంది.
వెంటనే ఫ్రెండొకడు "అదేంటి గోపాల్‌జీ కి బయట మరో దుకాణం ఉందా" అని అడిగాడు.
"గోపాల్‌జీ దుకాణమేమిటి, నేనంటున్నది గోప్స్ గురించి" అంది సౌమ్య.
"అదే నేనూ అంటున్నా గోపాల్‌జీ కి మరో దుకాణం ఉందా బయట అని" అన్నాడు అతడు.
అప్పటికి మన సౌమ్యకి బల్బ్ వెలిగింది. "ఒహో గోప్స్ అంటే 'గోపాల్‌జీ షాప్' కి షార్ట్ కట్ అని తెలుసుకుంది. అసలే చావు తెలివితేటలు ఎక్కువున్న మన సౌమ్య వెంటనే తన తప్పుని కప్పి పుచ్చుకుంటూ " అవును గోపాల్‌జీకి బయట ఇంకో షాపు ఉందని నేను విన్నాను, మరి నిజమో కాదో తెలీదు" అని చక్కగా కవర్ చేసేసుకుంది. కానీ మనసులో "హమ్మ ఎంత ప్రమాదం తప్పింది. నేను గోప్స్ పదం కోసం డిక్షనరీ వెతికానని వీళ్లకిగానీ తెలిస్తే ఇంక ఊరుకుంటారా, జీవితాంతం నన్నాడుకోరూ" అనుకుంటూ పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డందుకు సంతోషించింది. ఇలా ప్రజలని తన ప్రావీణ్యతతో అబ్బురపరుస్తూ ఓ 2-3 మూడునెలలకి అన్ని భాషలు చక్కగా నేర్చేసుకుంది మన సౌమ్య. అదండీ కథ.
.......................................

ఇలాంటి భాషాకష్టాలు పలుమార్లు మనం వింటూ ఉంటాం. భాషలతోటి, accent తోటి అప్పుడప్పుడూ బలే తిప్పలు వస్తూ ఉంటాయి. ఇంగ్లీషు, హిందీలతోటే కాకుండా మన భారతీయ భాషల విషయంలో కూడా బలే సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి అప్పుడప్పుడూ.

వరుసకి మావయ్య అయిన ఒకాయనకి విశాఖనుండి జబల్‌పూర్ కి ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడ హిందీ తప్ప వేరే గతి లేదు. ఆఫీసులో అయితే ఇంగ్లీషుతో ఏదో కాలక్షేపం చేసేవారు కానీ చుట్టుపక్కల వారితో మాట్లాడాలన్నా, బయట పనులు చేసుకోవాలన్నా హిందీ ఒక్కటే మాధ్యమం. మా అత్తయ్యకి హిందీ బాగానే తెలుసు, కానీ మావయ్యకి అసలు తెలీదు, ఏవో రెండు మూడు ముక్కలు తప్ప. హిందీ సినిమాలు చుస్తూ, అత్తయ్యని అడిగి తెలుసుకుంటూ మెల్లిగా కాస్త నేర్చుకున్నారు. ఆయనకి పందుంపుల్లలతో పళ్ళు తోముకునే అలవాటుంది. అవేమో ఆయనకి ఎక్కడా దొరకలేదు. ఓరోజు వాళ్ళ క్వార్టర్స్ గార్డ్ ని పిలిచి "ముఝే లడకీ చాహియె, రాత్ కో భేజో" అన్నారట. ఆయన భావమేమిటంటే నాకు పుల్లలు కావాలి, రాత్రి లోపల పంపించు" అని. హిందీలో కర్రను, పుల్లని "లకడీ" అంటారని ఆయనకి తెలుసు. కానీ అది కాస్త "లడకీ" అయింది. ఆ రెంటికీ ఉన్న వ్యత్యాసం ఆయనకి తెలీదు. ఆ గార్డ్ బిత్తరపోయి కోపం తెచ్చుకునే లోపలే, ఈ సంభాషణ అంతా వింటున్న మా అత్త పరిగెత్తుకునొచ్చి "బాబ్బాబూ కోప్పడకు, ఆయనకి హిందీ రాదు, ఆయన ఉద్దేశం వేపపుల్లలు కావలని" అని సర్దిచెప్పి పంపించారట.

ఇలాగే ఇంకోటి....ఒక మళయాళీ ప్రొఫెసర్ గారు, చెన్నై వెళ్ళారట ఒక నెలరోజులు ఏదో కోర్సు చెప్పడానికి. ఆయనకి ఒక గెస్ట్ హౌస్ ఇచ్చారు. ఒక పనమ్మాయి వచ్చి రోజు ఇంట్లో పనులన్నీ చేసి పెట్టేది. ఈ ప్రొఫెసర్ గారికి కాస్తంత తమిళ్ తెలుసు. మళయాళం, తమిళ్ రెండూ కలిపి ఏలాగోలా మాట్లాడేవారు ఆ పనమ్మాయితో. ఆయనకి రోజు సాయంత్రం 5.00 నుండి 6.00 వరకు యోగా చేసే అలవాటుంది. సరిగ్గా అదే సమయానికి ఈ పనిపిల్ల వచ్చి ఇల్లు, వాకిలి తుడవడం మొదలెట్టేది. ఆయనకి అది కాస్త చిరాకుగా ఉండేది. ఓరోజు ఆ అమ్మాయిని పిలిచి "నువ్వు సాయంత్రం రావొద్దు రోజూ 'రావెలె వా', వస్తే నీకు నాకు కూడా హాయిగా ఉంటుంది" అన్నారట. అంతే ఆ అమ్మాయి చేతిలో చీపురు కట్టని అక్కడే పడేసి పారిపోయిందిట. కాసేపయ్యాక ఓ నలుగురు పెద్దవాళ్ళని తీసుకుని వచ్చిందిట. వాళ్ళు ఈయన కాలర్ పట్టుకుని "ఏమిటిరా మా అమ్మాయిని రాత్రికి రమ్మంటావా" అని అడిగారట. ఆ ప్రొఫెసర్ గారు బిక్కచచ్చిపోయి నేనలా అనలేదు మొర్రో అని చెప్పి, పక్కనే ఉన్న వేరొక ప్రొఫెసర్ గారిని పిలుచుకొచ్చారట. ఆయన విషయమంతా గ్రహించి ఆ వచ్చినవాళ్ళకి సర్దిచెప్పి పంపించారట. ఇంతకీ సంగతేమిటంటే మళయాళంలో "రావలె" అంటే తెల్లవారుఝాము, పొద్దున్న అని అర్థం. అదే తమిళ లో "రావెలె" అంటే రాత్రి అని అర్థం. ఆ ప్రొఫెసర్ ఏమో "నువ్వు పొద్దున్నే వచ్చి ఇల్లు అదీ ఊడిస్తే ఇద్దరికీ సౌకర్యంగా ఉంటుంది" అని చెబితే, ఆ అమ్మయేమో "నువ్వు రాత్రికి వస్తే మనిద్దరికీ బావుంటుంది" అని అర్థం చేసుకుంది. దానితో లేనిపోని గొడవలు వచ్చాయి.
.......................

ఇతర భాషలతో వచ్చే గొడవలు ఇవైతే మన తెలుగుతోనే వచ్చే గొడవలు మరికొన్ని.

మా విజయనగరంలో సంగీత కళాశాల ఉంది. అది ద్వారం వెంకటస్వామి నాయుడిగారి కోసం విజయనగరం రాజులు కట్టించి ఇచ్చిన కళాశాల. చాలా పేరుమోసిన పాఠశాల అది. అక్కడ వినాయక నవరాత్రులలో రోజూ పొద్దున్న, సాయంత్రం కూడా కచేరీలు జరుగుతాయి. పెద్దపెద్దవాళ్ళందరూ వస్తారు. ఆ తొమ్మిది రోజులూ ఉదయం వెళ్ళినా వెళ్ళకపోయినా సాయంత్రం మాత్రం కచేరీ వినడానికి కచ్చితంగా వెళ్ళేవాళ్ళం. నాకు పన్నెండేళ్ల వయసున్నప్పుడనుకుంటా....వినాయక నవరాత్రులలో ఓరోజు ఓ పెద్దాయన (X) కచేరీ జరగాల్సి ఉంది. మరో పెద్దాయన (Y) ఆ కచేరీకి వ్యవహారకర్తగా వచ్చారు. ఈ Y అనే పెద్దాయన కర్ణాటిక సంగీతంలో చాలా చాలా గొప్పాయన. ఇంచుమించు బాలమురళీకృష్ణకి సరిసమానంగానో, ఓ పిసరు తక్కువగానో ఉండగలిగినంత పెద్దాయన. ఈయన పేరు తెలీకుండా ఎవరూ సంగీతం నేర్చుకోరు. అంత గొప్ప వ్యక్తి. ఆ కచేరీ చేసే X కూడా చాలా గొప్పవారు. సరే సాయంత్రం 6.00 గంటలకి కచేరీ మొదలవ్వాల్సి ఉంది. ఆరోజు మధ్యాన్నం నుండి ముసురు పట్టుకుంది. అలా ధారాపాతంగా వర్షం పడుతూ ఉంది. మేము ఆ చినుకుల్లోనే తడుసుకుంటూ 6.00 కల్లా సంగీత కాలేజీ కి చేరిపోయాం. పెద్దాయన కచేరీ కదా హాల్ నిండిపోయిఉంది. 6.00 అయింది, 7.00 అయింది కచేరీ చెయ్యాల్సిన X గారు రాలేదు. ఆరోజుల్లో కార్లు లేవు. మా ఊర్లో ఆటోలు కూడా ఉండేవి కాదు. రిక్షాలే గతి. ఆ పెద్దాయన రిక్షాలోనే రావాలి కచేరీ చెయ్యడానికి. 8.00 అవుతున్నా వర్షం తగ్గే జాడ కనిపించలేదు. ఇంతలో ఆయన దగ్గరనుండి ఫోన్ వచ్చింది. "ఇంక నేను రాలేను. కచేరి జరగకున్నందుకు చింతిస్తున్నాను" అని. ఈ వ్యవహారకర్తగా ఉన్న పెద్దయన (Y) వెంటనే మైక్ అందుకని "వర్షాభావం వల్ల X గారు రాలేకపోయారు, అంత పెద్దాయన కచేరీని వినలేకపోతున్నందుకు మీ అందరితోపాటూ నేనూ చింతిస్తున్నాను" అని చెప్పారు. సభలో చిన్నగా నవ్వులు ప్రారంభమయ్యాయి. నాకు గొప్ప ఆశ్చర్యమేసింది. అంత పెద్దాయన, సంగీతంలో కీర్తనలు రాసారూ, సంగీతసాహిత్యాలపై మంచి అవగాహన, పట్టు కలిగిన వ్యక్తి, ఆయన కూడా ఇలా తప్పుగా మాట్లాడారా అని ఆశ్చర్యపోయాను. వర్షాభావం అంటే వర్ష లేకపోవడం. బయట హోరున వాన కురుస్తుంటే వర్షాభావమేమిటీ అని కొందరు జోకులు వేసుకోవడం ఆరంభించారు. ఎంత పెద్దవాళ్ళైనా అప్పుడప్పుడు తప్పులో కలువేస్తారన్నమాట అనుకున్నాను నేను.

అంతంత పెద్దవాళ్ళకే ఈ భాషాకష్టాలు తప్పలేదు. ఇక TV-9 సంగతేముంది చెప్పండి. ఆమధ్య అంటే ఓ 6-7 నెలల క్రితం టీవీ-9 లో వార్తలు చూస్తున్నా. ఎక్కడో జరిగిన ప్రమాదం గురించో, కొట్లాట గురించో...నాకు సరిగ్గా గుర్తిలేదు. వార్తలు చెబుతూ "ఇది ఎలా జరిగి ఉంటుంది అన్నదానిపై స్పష్టమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి" అన్నాడు. ఆహా ఊహాగానాలకి స్పష్టత ఏమిటిరా నీ పిండాకూడు అని వాడి పీక నొక్కి వేరే చానెల్ పెట్టుకున్నాను. చూసారా ఊహగానాలకి స్పష్టతట. నేను దీని తరువాత ఏ టపా వెయ్యబోతున్నానో మీరు స్పష్టంగా ఊహించి నాకు చెప్పండేం :).