StatCounter code

Wednesday, July 7, 2010

మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారి ముచ్చట్లు

నిన్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జన్మదినమట, నాకు ఈరోజు తెలిసింది. ఆలశ్యమైనా కూడా ఆయనకు నా బ్లాగు ముఖంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.

ఆయన గురించి కొన్ని విశేషాలు:

బాలమురళీకృష్ణగారు మా యూనివర్సిటీకి వచ్చారు ఓ 4-5 యేళ్ళ క్రితం. అదెలా అంటే మా యూనివర్సిటీలో తెలుగు విభాగానికి హెడ్ బేతవోలు రామబ్రహ్మంగారు. ఆయన, బాలమురళీకృష్ణ (MBK) గారు మంచి దోస్తులు. బేతవోలుగారి విన్నపం మీద MBK మా కేంపస్ లో ఓ వారం రోజులు గడిపారు. MBK ముఖతా ఒక సంగీత విభాగాన్ని కూడా మొదలెట్టాలనే ఆలోచన ఉండేది అప్పట్లో. వచ్చిన మొదటిరోజు మా విద్యార్ధులందరికి ఒక ఉపన్యాసం ఇచ్చారు. అందులో కొన్ని విషయాలు నన్ను అబ్బుర పరిచాయి, ఆహా అనుకున్నాను. మరికొన్ని విస్మయపరిచాయి, అదేమిటి ఇలా? అనుకున్నాను.

MBK సంగీత కచేరిలలో కొన్ని కొత్త పద్ధతులు ప్రవేశపెట్టారట. అవి నాకు బాగా నచ్చాయి. కచేరి మధ్యలో మృదంగం టర్న్ వస్తుంది. గాత్రం లో స్వరం అయ్యాక మృదంగం, వయొలిన్ టర్నులొస్తాయి. అప్పుడు చాలామంది కచేరీ నుండి లేచివెళ్ళిపోయి బయట కాసేపు విశ్రాంతి తీసుకునొస్తారు. నేను కూడా ఇది చాలాసార్లు గమనించాను కచేరీల్లో. ఒకసారి ముంబాయిలో MBK కచేరీ జరుగుతుండగా, మృదంగం టర్న్ వచ్చినప్పుడు ఆయన మైమరచి కళ్ళు మూసుకుని వింటున్నారట. అంత బాగా వాయిస్తున్నారట ఆ మృదంగ విద్వాంసులు. కాసేపయ్యాక కళ్ళు తెరిచి చూస్తే హాల్ లో ఓ పది మంది మాత్రమే ఉన్నారట. మిగతావారంతా హాల్ బయట పిచ్చాపాటీ వేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారట. ఇది గమనించిన వెంటనే ఆయన కచేరీ నిలిపివేసారట. మృదంగం ఆయన ఇంత అద్భుతంగా వాయిస్తుంటే ఎవరూ వినట్లేదేమిటి అని ఆలోచించారట. అప్పుడు ఆయనకి తట్టిన విషయం కచేరీలో "బ్రేక్" ఇవ్వడం. సినిమా చూస్తే భ్రేక్ ఇస్తారు. టీవీలలో బ్రేకులుంటాయి. క్లాసులో పాఠం చెప్తున్నప్పుడు కూడా బ్రేక్ తీసుకుంటారు. మరి కచేరీకి ఎందుకు బ్రేక్ ఇవ్వకూడదు, తప్పేమిటి? వింటున్న జనాలకి మధ్యలో విశ్రాంతి లేక ఇలా మృదంగం టర్నో, వయలిన్ టర్నో వచ్చినప్పుడు బ్రేక్ తీసుకుంటున్నారు. ఈ పక్కవాయిద్యాల విద్వత్తును గుర్తించలేకపోతున్నారు అని అనుకున్నవారై అప్పటినుండి తన ప్రతీ కచేరీకి మృదంగం టర్న్ ముందు బ్రేక్ ఇవ్వడం మొదలెట్టారట. అలా అయినా జనాలు పక్కవాయిద్యాలను పక్కనబెట్టకుండా విని ఆస్వాదిస్తారని.

నాకు కూడా చాలాసార్లు కచేరీలో బ్రేక్ తీసుకోవాలనిపించేది. నేనూ ఎన్నోసార్లు మృదంగం టర్న్ లో బ్రేక్ తీసుకున్నాను. వయొలిన్ నేను నేర్చుకున్నాను కాబట్టి, అదంటే నాకిష్టం కాబట్టి వయలిన్ టర్న్ వస్తే తాళం వేస్తూ శ్రద్ధగా వినేదాన్ని. మృదంగం టర్న్ కి మాత్రం బయటికెళ్ళిపోయేదాన్ని కాసేపు. నేనే కాదు చాలామంది అలా వెళ్లిపోయేవారు. ఆరోజు ఉపన్యాసంలో MBK ఈ విషయం చెప్పగానే ఉలిక్కిపడ్డాను నేను. నాకు కూడా ఈ బ్రేక్ కాన్సెప్టు చాలా నచ్చింది. కచేరీ చేసేవాళ్లందరూ దీన్ని పాటిస్తే బాగుందును అనుకున్నాను.

మరో నిఖార్సైన విషయం.....ఆరోజుల్లో కచేరీలు ఆడవాళ్ళకి నిషిద్దం. వాళ్ళు స్టేజీ ఎక్కకూడదు. ఇంట్లో కూర్చుని జోలపాటలు మాత్రమే పాడుకుంటూ గడపొచ్చు. ఒకవేళ ఎవరైనా ఆడవాళ్ళు ధైర్యం చేసి కచేరీ చేసినా వాటిని సంగీతంలో పెద్దలందరూ బేన్ చేసేవారట. ఆ కచేరీకి ఎవరినీ వెళ్ళనిచ్చేవారు కాదట. అటువంటి సమయంలో MBK కచేరికి తంబురా వెయ్యడానికి ఒక ఆవిడని కూర్చోమన్నారట. అదేదో చాలా పెద్ద కచేరీట, ప్రముఖులు, విద్వాంసులు అందరూ వచ్చారట. హాల్ అంతా జనంతో కిటకిటలాడిపోతున్నాదిట. ఆ కచేరీలో ఈవిడ తంబురా పట్టుకుని కూర్చోగానే అందరూ వ్యతిరేకించారట. MBK మాత్రం ఆవిడ తంబురా వేస్తేనే పాడతానన్నారట. పెద్దలందరూ సభ విడిచి బయటికెళ్ళిపోయారట. ఆడవాళ్ల పట్ల ఇటువంటి దృక్పధం మంచిది కాదు. వాళ్ళూ మగవాళ్లతో పాటు సమానంగా సంగీతం నేర్చుకోగల, పాడగల సత్తా ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి, ప్రోత్సహించాలి అని చెప్పి,ఎవరు విన్నా, లేకున్నా నేను కచేరీ చేస్తాను, ఆవిడే తంబురా వేస్తారు. ఇష్టం వచ్చినవాళ్ళు ఉండండి, లేకపోతే దయచేయండి అని చెప్పేసారట. ఈయన మాటని కొట్టేసి చాలామంది వెళ్ళిపోగా మిగిలిన 20-25 మందిని పెట్టుకుని కచేరీ చేసారట. ఇది ఒక పెద్ద issue అయి ఒక విప్లవంలా మొదలయ్యిందిట ఆ రోజుల్లో.

ఇలాంటి మంచి విషయాలు ఇంకా బోల్డు చెప్పారు ఆ ఉపన్యాసంలో.

మరి కొన్ని సరదా విషయాలు కూడా చెప్పారు. ఆయన నారదుడుగా వేసిన భక్తప్రహ్లాద సినిమా గుర్తందిగా అందరికీ. ఆ సినిమా సూపరు డూపరు హిట్టు అయ్యాక ఆయనకి 12 సినిమాలలో నారదుడి వేషం వేసే అవకాశం వచ్చిందిట. బాబోయ్ ఇలా అయితే నేను సినిమాల్లో పెర్మనంటు నారదుణ్ణుయిపోతాను ఎందుకొచ్చిన గొడవ అని అన్ని అవకాశాలను తోసిపుచ్చారట. ఆయనకి సినిమాలలో నటించాలని చాలా సరదాట. హీరోగా వెయ్యాలని ఉండేదిట. అవకాశమొస్తే చెయ్యడానికి రెడీగా ఉన్నారట. కానీ పాపం అన్ని నారదుడి వేషాలొచ్చాయి :). నాకయితే ఈ మాట విని ఎంత నవ్వొచ్చిందో చెప్పలేను......భక్త ప్రహ్లాదలో ఆయన పర్సనాలిటీ ఏమిటి, ఆయన ఎత్తెంత, మనిషి బక్కపలచగా, పొట్టిగా ఊదితే గాల్లో ఎగిరిపోయేలా ఉండేవారు...ఈయనకి హీరో వేషమెవడిస్తాడని ఎదురుచూసారో అని తెగ నవ్వుకున్నాను. భక్తప్రహ్లాదలో జోలపాట గుర్తుందా? గుర్తులేనివాళ్ళకి ఇదిగో లింకు.
నాకయితే ఈ రోజుకీ జోలపాటల్లో "సిరిసిరి లాలి, చిన్నారి లాలి" ప్రధమ స్థానంలోనే ఉంటుంది.

ఈయనకి సినిమాలలో డిష్యుం డిష్యుం ఫైటింగులు చాలా ఇష్టమట. కారణం అవి ఆయన చెయ్యలేరు గనక...ఏమిటో భలే విచిత్రంగా ఉంది కదా! ఈయనేమిటి ఫైటింగులిష్టముండడమేమిటి....ఎక్కడో ఏదో అసమతౌల్యంగా ఉన్నట్టనిపించింది. సంగీతం ముఖ్యంగా కర్నాటక సంగీతం నేర్చుకున్నవాళ్ళు ప్రధానంగా భక్తి, శాంతి లో కూరుకుపోయి ఉంటారు. మరి ఈయనకి ఈ హింసా పద్ధతులు నచ్చడమేమిటో నాకర్థం కాలేదు.

MBK 72 మేళ కర్తలలో కృతులు రచించారన్న విషయం లోకవిదితమే కదా. ఆయనొక సంగీత శిఖరాగ్రం, అంతే ఇంకా వేరే మాట లేదు. సంగీతంలో ఎన్నో రకాల ప్రయోగాలు చేసారు. ఆయన "హనుమా, వినుమా"...అని ఒక కీర్తన రాసారట. ఇందులో గమ్మత్తేమిటంటే స్వరంలో మధ్యమం వచ్చినచోటల్లా సాహిత్యంలో "మ" అనే అక్షరం వచ్చేట్టు రాసారట. ఇప్పుడు "హనుమ" లో "మ" వచ్చినదగ్గర మధ్యమం వస్తుంది.....అలాగే మొత్తం కీర్తనంతా ఉంటుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో చెప్పారు. చాలా కీర్తనలు పాడి వింపించారు. పెద్దవారవడం మూలానగాబోలు చాలా వాటికి సాహిత్యం, కొన్ని సార్లు స్వరం కూడా మరచిపోయేవారు. ఆయన శిష్యుడు మోహనకృష్ణ గారు అందిచేవారు మరచిపోయినప్పుడల్లా. ఇంకొక సరదా కలిగించిన విషయమేమిటంటే MBK కి తెలుగు నోటి ముందు ఉంటుంది. ఆయన చక్కగా తెలుగులోనే మాట్లాడతారు. కానీ ఉపన్యాసం ఇంగ్లీషులో ఇచ్చారనుకోండి తెలుగురాని వాళ్ళు కూడా ఉంటారని. కాకపోతే అవకాశం చిక్కినప్పుడల్లా సుబ్బరంగా తెలుగులోనే మాట్లాడేస్తారు. ఈ ఇంగ్లీషు ఉపన్యాసంలో కూడా అప్పుడప్పుడు తెలుగు వచ్చేస్తూనే ఉంది...భలే ముచ్చటేసింది విన్నంతసేపూ :D.


ఆ ఉపన్యాసం మొత్తం విన్నక నాకు చాలా సరదాగా, హాయిగా, గర్వంగా అనిపించింది. గర్వం ఎందుకనుకుంటున్నారా ఆయన ఉపన్యాసం డైరెక్టుగా వినే అవకాశం వచ్చింది కదా అందుకని :).

సరే ఆ రోజు ఆయన చెప్పిన విషయాల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ, ఆస్వాదిస్తూ, నవ్వుకుంటూ గడిపేసాను. మర్నాడు తెలిసిన విషయమేమిటంటే MBK తెలుగు డిపార్టుమెంటులో ఒక క్లాసురూములో మూడురోజులపాటు సంగీత పాఠాలు చెప్తారు, ఔత్సాహికులు వెళ్ళి నేర్చుకోవచ్చు అని. మరోమాట వినకుండా, పుస్తకం పెన్ను చేతబట్టి, పరిగేట్టుకొని వెళ్ళి క్లాసులో కూర్చున్నాను. కానీ ఆ పాఠం విన్నాక నాకు చెప్పలేనంత చిరాకు వేసింది. స్వరం చెప్పకుండా సాహిత్యం మాత్రమే చెబుతున్నారు. విసుగొచ్చింది. ఇంత పెద్దయన ఇలా పాఠం చెప్తున్నారేమిటి అనిపిచింది. ఓ పేద్ద పుస్తకం ఆయన దస్తూరీతో ఉన్నది పట్టుకొచ్చి అందులో చూస్తూ కీర్తన చెబుతున్నారు. ఆయన అంటూంటే వెనక మేము అనడం...అలా ఒక్కో కీర్తన మూడు సార్లు పాడించారు. మధ్యలో ఒక స్వరజతికి మాత్రం స్వరం చెప్పారు. కొంతమంది వర్ణాలు చెప్పమనడిగితే మధ్యలో కాస్త స్వరం చెప్పారు, అంతే. నాకయితే అస్సలు నేర్చుకోబుద్ధెయ్యలేదు. సరే ఇవాళ ఇలా చెప్పేరు కాబోలు రేపు చూద్దామని మర్నాడు వెళితే మళ్ళీ అదే తంతు. స్వరం లేకుండా సాహిత్యం చెబుతూ పాడించేస్తున్నారు. అక్కడ ఓ పాతికమంది విద్యార్ధులు చేరారు. నాలాగ మిడిమిడి ఙ్ఞానం ఉన్నవాళ్ళు కొందరయితే, రాగాలు, తాళాలు తెలిసినవారు ఇంకొందరు. మిస్సమ్మలో నాగేస్రావులా సపసలు తీసేసి పాట చెప్పండి అనేవాళ్ళు మరికొందరు. కానీ స్వరం చెప్పకుండా కీర్తన ఎలా నేర్చుకోవడం, నాకేమీ అర్థం కాలేదు. సాహిత్యం చెబితే స్వరం అల్లుకునేటంత సంగీత ఙ్ఞానమే ఏడిస్తే నేనెందుకు economics లో PhD చేస్తాను, చోద్యం కాకపోతే! నాకు తెలిసి నాలాగ మిడిమిడి ఙ్ఞానం ఉన్నవాళ్లే తప్ప అలా స్వరఙ్ఞానమున్నవాళ్ళు ఆ గుంపులో ఎవరూ లేరు. అవేవో ఊరికే పాటలు పాడుకున్నట్టు అందరూ పుస్తకాలలో సాహిత్యం రాసేసుకున్నారు, ఆయన వెనకే పాడుతున్నరు. అపశ్రుతులు చెవులకి కన్నం పెట్టేస్తున్నాయి. తాళాలు తప్పుతుంటే నా చెయ్యి బాధగా మూలిగింది. అలా ఒక వారం రోజులు చెప్పినా ఎవరికీ ఆ కీర్తనలు వచ్చే అవకాశమే లేదు. మరి అంత సమయం వెచ్చించి చేస్తున్న పని బూడిదలో పోసిన పన్నీరే కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తున్నారీయన అని అనిపించింది నాకు. లేచి అడుగుదామనుకున్నాను. కానీ తిరిగి ఆయన నీకేంతెలుసు అని ఓ రెండు ప్రశ్నలేసారనుకోండి, నేను అచేతనురాలినయిపోతా, ఎందుకొచ్చిన గొడవలే అని కిం అనకుండా కూర్చున్నాను. ఇంక మూడవరోజు వెళ్లనేలేదు.

ఎలాగైనా MBK గారితో ముఖాముఖి మాట్లాడాలనిపించింది. బేతవోలుగారు మా చెల్లికి గైడు. అది అప్పుడు ఆయన దగ్గర Mphil చేస్తున్నాది. నేను దాన్ని గోకి, అది ఆయన్ని గోకితే మర్నాడు ఉదయం 10.00 గంటలకి నాకు అరగంట టైం దక్కింది MBK తో మాట్లాడడానికి. గబగబా రూముకొచ్చేసి ఆయనని అడగవలసిన ప్రశ్నలన్నీ రాసేసుని మళ్ళీ మళ్ళీ మననం చేసేసుకున్నాను. ఒకవేళ నేను ఏ ప్రశ్న అడిగితే ఆయన తిరిగి ఏ ప్రశ్నలేస్తారో ఊహించేసుకుని, వాటికి జవాబులు కూడా తయారు చేసేసుకుని రెడీగా కూర్చున్నాను. రాత్రి మళ్ళీ అన్ని చూసుకుని పడుకున్నాను.....చెప్పొద్దూ రాత్రంతా బాలమురళిగారే కలల్లో. రోజూ 9.00 అయినా పొద్దు మొహమెరగని నేను ఆరోజు ఆరింటికే లేచి, ఫలహారం కానిచ్చి, చక్కగా ముస్తాబయిపోయి ఎనిమిదింటికల్లా సైకిలు పట్టుకుని రెడీ అయిపోయాను. మరీ ఇంత తొందరగా వెళ్తే బావుండదులే అని చెప్పి, 9.00 వరకు అటూఇటూ కాలక్షేపం చేసేసి అప్పుడు వెళ్ళిపోయా తెలుగు డిపార్టుమెంటుకి. ఒక రకమైన ఉత్సాహం, ఒకరకమైన భయం, ఇంకో రకమైన బిడియం, మరో రకమైన ఆసక్తి మొత్తం కలగలిసి నాలుగు వర్ణాల ఇంధ్రధనస్సూలా మెరిసింది నా ముఖం (బాచెప్పానా? ;)). అక్కడే ఇంకో అబ్బాయి నాలాగే నాలుగు వర్ణాలతో మెరిసిపోతూ కనిపించాడు. విషయమేమిటని ఆరాతీస్తే అతనికీ 10.00 గంటలకే టైం ఇచ్చారట. ఇద్దరం కలిసి ఎనిమిది వర్ణాలయిపోయి ఏమైనా కామన్ ప్రశ్నలున్నయేమొ చూసుకుని ఉన్నవి కొట్టేసి, లేనివి మళ్ళీ మళ్ళీ బట్టీ పట్టేసి, వాచీ చూసుకుంటూ కూర్చున్నాం. ఇంతలో ఒక దుర్వార్త మాకు చేరింది. మా V.C కి అర్జంటుగా అప్పుడే టైం కుదిరిందిట. MBK ని అప్పుడే కలవాలని ముహూర్తం పెట్టేసారట. కాబట్టి ఆయన డిపార్టుమెంటుకి రావట్లేదు, ఆయన ఇచ్చిన టైములన్నీ కేన్సిల్ చేసేసుకున్నారు అని దుర్వార్త వచ్చింది. మా మొహాలు వివర్ణమయిపోయాయి. విభ్రాంతితో కూడిన బాధ వల్ల వచ్చిన ఏడుపుని దిగమింగుకుని రూముముఖం పట్టాము ఇద్దరమూ :(. ఇక ఆ ఆవేదనలోంచి తేరుకోవడం నా వల్ల కాలేదు. అందుకే నా రిసెర్చిని వారం రోజులకి వాయిదా వేసాను. చాలారోజులుగా బాగా పడుకోవాలనుకున్నాను, ఇప్పుడు ఈ బాధవల్ల ఆ టైం వచ్చిందని చెప్పి హాయిగా ముసుగుదీసాను. you see నేనెప్పుడూ ఇంతే, positive thinking ఎక్కువ. ఎలాంటి పరిస్థితినైనా సద్వినియోగం చేసేసుకుంటాను :P. అలా బాలమురళిగారిని కలిసే అవకాశం చేతిదాకా వచ్చి బాగా వెలిగిన తోలుగొట్టం విసిరేయకముందే అరచేతిలో చీదేసినట్టు చీదేసింది. దాంతో మనసు కాలగా వచ్చిన పొగ మెదడుని కమ్మేసి నన్ను నిద్రలో ముంచేసింది :).

ఇప్పుడు ఇంకో మంచి విషయానికొద్దాం. బాలమురళీకృష్ణ గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు కలిసి ఎంకిపాటలు పాడారన్న విషయం మీకు తెలుసా? అవును పాడారు, మామూలుగా కాదు అద్భుతంగా పాడారు. మచ్చుకి మీకు కొన్ని వినిపిస్తాను, వినండి.



అవండీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి ముచ్చట్లు.

64 comments:

శ్రీలలిత said...

సౌమ్యా,
ఆ మహానుభావునితో మీ ముచ్చట్లు ఎంత బాగున్నాయంటే మమ్మల్ని కూడా మీ చేయి పట్టుకుని తీసుకుపోయి ఆయన ముందు కూర్చోబెట్టినంత బాగున్నాయి. మీతో పాటు అన్ని అనుభవాలూ మేమూ అనుభవించాము. ధన్యవాదాలు.

krishna said...

మీరు అదృష్ట వంతులు సుమండి... చాలా మంచి అనుభవాలు వున్నాయి మీకు. అఫ్‌కోర్స్.. నాకు సంగీతం వినగలిగే చెవి లేదు.. ( అభిరుచి అని అర్ధం అన్నమాట). కానీ ప్రముఖుల తో అనుభవాలు .. బాగా రాసారు.

SRRao said...

సౌమ్య గారూ !
బాలమురళిగారి మీద మీరు రాసిన ముచ్చట్లు బాగానే వున్నాయి. పాపం ఏంటో ఆశ పడ్డారు ఆయన్ని కలవాలని. అలాగే నిన్న ఆయన మీద వ్యాసం రాద్దామని ఆశపడి డేటా పెట్టుకుని కూడా సమయం కుదరక రాయలేక పోయాను. మీరు రాసేసారుగా ! ఇప్పుడా బెంగ తీరిపోయింది. ఆయనకు శిరాకదంబం తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు.

ఆ.సౌమ్య said...

@ శ్రీ లలిత
నిజంగ అంత బాగా రాసానా అండీ. ధన్యవాదములు :D
హమ్మయ్యా మీరూ అనిభవించగలిగారు కదా, చాలా సంతోషం :)

ఆ.సౌమ్య said...

@ krishna
ఏదో అలా అలా కొన్ని జరుగుతూ ఉంటాయిలెండి జీవితంలో :P

అవునండీ ఆయన ఉపన్యాసం వినడం ఒకరకమైన అదృష్టమేనేమో, ఇంకా చాలా విషయాలున్నాయి, మరో టపాలో రాస్తా!

ధన్యవాదములు.

మధురవాణి said...

అయ్యయ్యో.. నేను మిస్సయిపోయానే ఆయన్ని చూడడం, ఆయన మాటలు వినడం :-( శ్రీలలిత గారన్నట్టు చాలా బాగా చెప్పారు. నేనూ అక్కడే ఉన్నట్టు కాసేపు భ్రమింపజేసారు. చాలా థాంక్స్! :-)

సుజాత వేల్పూరి said...

సౌమ్యా,
బాల మురళి దగ్గరా పాఠమా? ఎంత అదృష్టం?

ఆయన గురించి మాట్లాడాలంటే నాకేమీ తోచదు. అలా చూస్తూ కూచుంటా అంతే!
ఈ మధ్యనే రవీంద్ర భారతిలో ఆయన జుగల్బందీ కి వెళ్ళాను. మైగాడ్, చెప్పలేను! లేవు మాటలు !



అయితే వయొలిన్ నేర్చుకున్నారన్నమాట! పాఠాలు కూడా చెప్తానంటే నేను చేరతా!

కృష్ణ,
సంగీతం వినే చెవి అందరికీ ఉండాల్సిందే! ఉంటుంది కూడా! కాకపోతే అభిరుచుల తేడా! కొందరికి సినిమా సంగీతం ఇష్టమైతే, మరికొందరికి శాస్త్రీయం,మరికొందరికి ఇన్స్ట్రుమెంటల్..మరి కొందరికి అన్నీ...(నాలాగ):-))

Wit Real said...

మనకి లొల్లాయి పదాలు తప్ప ఇట్టాంటి పాటలంత అర్థంగావు గాని, ఎవుడో ఫ్రెండ్ సెప్పగా తెల్సిందేమంటే, ఆయన మృదంగం బ్రేకు, వయొలిన్ బ్రేకు ఇచ్చేది కుంచెం సుక్కేసుకోడానికంట!

సత్తెపెమానికంగా నాకైతే తెల్వ! కానీ అయన పక్క ఒక సెంబు గలాసు వుంటాయి (మంచి నీళ్ళు అయ్యుందచ్చు... స్వారీ!;)

Anonymous said...

బావుందండీ. ముఖ్యంగా మీ నాలుగు వర్ణాలు, ఎనిమిది వర్ణాలు జోక్ బలే నచ్చింది.

ఆ.సౌమ్య said...

@ SRRao గారూ,
అయ్యో పాపం మీరు నాలాగే అన్నమాట....మిస్ అయ్యారు :P
ఫరవాలేదులెండి, మాయాశశిరేఖయినా, శిరాకదంబమయినా మనమంతా ఒకటే...తెలుగు బ్లాగర్లం. అందరం కలిసే శుభాకాంక్షలు తెలుపుదాం :)
కామెంటు రాసినందుకు ధన్యవాదములు.

@ మధురవాణి
బాధపడకు, మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తుందిలే. అయినా నేను కళ్ళకి కట్టినట్టుగా చెప్పనన్నావుగా, ఇంకెందుకు బెంగ :D
thanks!

ఆ.సౌమ్య said...

@ సుజాత గారు,
అవునండీ అదృష్టమే....కానీ నాకే ఆ పాఠం బుర్రకెక్కలేదు :)

ఆయనని చూస్తే అలా తోచకుండా ఉంటుందనే నేను అడగదలచుకున్నవన్నీ బట్టీ పట్టి వెళ్ళా, కానీ ఆయనని కలిసే అదృష్టం కలగలేదు :(

అమ్మో పాఠాలు చెప్పేటంత పాండిత్యం నాకు లేదండీ. ఇంట్లో మా అక్క (మండా సుధారాణి)ఉంది కాబట్టి కాస్త సంగీతం అబ్బింది, అంతే. కావాలంటే అలంకారాలవరకు నేర్పుతా, ఫీజు మాత్రం ఘనంగా ఇవ్వాలండోయ్ :P

కృష్ణ కి మీరు చెప్పిన మాట నిజమేనండి. నేనూ మీ కేటగిరీయే, బావున్నవన్నీ వింటా ఆనందంగా :)

ఆ.సౌమ్య said...

@ Wit Real
ఏమోనండీ ఆ విషయాలన్నీ నాకు తెలీవు. నిజానిజాలు తెలియకుండా నేను ఏమీ అనను. చుక్కేసుకుంటే పాడడం కష్టమని మాత్రం తెలుసు. చాలామంది విద్వాంసులు పాడుతున్నప్పుడు పక్కన మంచినీళ్ళు పెట్టుకుంటారు.

@ Anonymous
నా జోకులు నచ్చాయా, thank you :)

Anonymous said...

ఈ పోస్ట్ సంగతేమో కానీ ఆ విశ్వప్రేముకుడి దయ వల్ల మీ పోస్ట్ లో స్మైలీ లు మాత్రం సూపర్ గా ఉన్నాయండీ

krishna said...

@ సుజాత గారు,
ఒక డెసిబిల్ స్థాయి దాటాక నాకు ఏ శబ్దం అయినా తల నెప్పిగానె అనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి కచేరిలలో :-( బహుశా ఇదేమన్నా లోపం కావచ్చు అని అనిపిస్తుంది నాకు. ఈ మధ్యన వచ్చిన ఆడియో పరికరాలు, డి.టి.ఎస్. ఎఫెక్టులు ( ఏ రికార్డులలో అయినా ఇప్పుడు వుంటాయి.) ఇంకా ఇబ్బంది పెడతాయి. మంద్ర స్థాయిలో, పై పిచ్ కి పోకుండా సంగీతం అరుదు కదండి . బహుశా మానుఫాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా!

..nagarjuna.. said...

తీయని జ్ఞాపకాలను పంచారు.... :)
ఆడవాళ్లు కచేరిలు చేయకూడదని ఉన్నట్టు నాకిప్పటి వరకు తెలియదు..కాని ఓ సందేహం యెమ్మెస్.సుబ్బలక్ష్మి గారు అప్పట్లో కచేరిలిచ్చేవారు కదామరి !(?)

మా కాలేజీలో ప్రోగ్రాం ఇవ్వడానికి పోయినేడాది హరిప్రసాద్‌ చౌరాసియా గారొచ్చారు. సంగీతంలో ఆవగింజంతకూడా తెలియదు కాని ఆయన మురళిగానం వినడానికి వెళ్ళా. వింటున్నంతసేపు చెవిలో అమృతం పోసినట్టనిపించింది. మధ్యమధ్యలో ఆయన వెసే చమక్కులు ఆశ్చర్యమనిపించాయి. అంతపెద్దానేమిటి అంత సరదాగా ఉండడమేమటి అని.
ఓ సారి ఇలా అన్నారు "పూర్వం కృష్ణుడు మురళిగానం చెస్తే గోపికలు పారశ్యంలో మునిగిపోయేవారంట అయినా వారికి మురళిని వాయించడం నేర్పలేదు. నేను మాత్రం నా దగ్గరకొచ్చే అమ్మాయిలకు నేర్పుతుంటాను" అని

నేను said...

బాలమురళీకృష్ణ గారి పాటలు వినాలని ఎప్పట్నుండో అనుకుంటున్నా. ఆయన సినిమా పాటలు ఎమన్నా పాడి ఉంటే ఆల్రెడీ విన్నానేమో తెలీదు. రేపు వింటా :-)


మనకి సినిమాలు చూసినపుడు అలవాటు పాటలు వచ్చినపుడు ఈ బ్రేక్ తీసుకోవడం.
నేను ఆశ్చర్యపడిన విషయం ఏంటంటే, మొన్నీమధ్య మా ఊర్లో (సీకాకుళం కాదు :)) అనుష్కా రవిశంకర్ కచేరి జరిగింది. ఆ కచేరికి 500 మంది దాకా వచ్చారు (దేశీలు 25 మంది మాత్రమే). ఒక 10 మంది మాత్రమే మధ్యలో వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా రాగానికి రాగానికి మధ్య బ్రేక్ లోనే వెళ్ళారు. మిగిలిన వాళ్ళు చాలా నిశ్శబ్ధంగా ఉన్నారు(ప్రతి రాగం పూర్తవగానే చప్పట్లు కొట్టారనుండి). కచేరి పూర్తయినపుడు నిముషాలు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆమె ఫుల్ ఖుష్ అయ్యి ఇంకొక రాగం వినిపించింది.

ఆమె ఆలపించిన వాటిల్లో నాకు బాగా నచిన రాగం : http://www.youtube.com/watch?v=ouAWJvYPHqk

ఈ నెలలో ఎ ఆర్ రెహమాన్ వస్తున్నాడు. సినిమా పాటలు వుంటాయి కాబట్టి దేశీలు బానే వస్తారు. సో మన వాతావరణం వుంటుంది అనుకుంటున్నా :)

Btw concert ని కచేరి అనేశా ok కదా.

ఆ.సౌమ్య said...

@ నాగార్జున
ధన్యవాదములు.
పూర్వకాలంలో ఆడవాళ్లకి అన్ని నిషిద్ధమే కదండీ. MS గురించి కొన్ని కథనాలు విన్నాను. ఆవిడ కుటుంబం గుడిలో నాట్యాలు చేసే కుటుంబమని, కాబట్టి వాళ్ళకి పాడడానికి, నాట్యం చెయ్యడానికి ఎప్పుడూ అనుమతి ఉంటుందని. అందుకే కంచిలో శంకరాచార్య, MS గారిని ఆవిడ భర్త కల్కి గారిని గుడిలోకి రానివ్వలేదని, పాదాభివందనమైనా చేస్తామంటే ఆయన కాళ్ళు కూడా ముట్టుకోనివ్వలేదని చెప్తారు. ఇందులో నిజానిజాలు నాకూ తెలీవు, నేను అక్కడా ఇక్కడా విన్నదే తప్పా.

ఓహ్ హరిప్రసాద్ చౌరాస్య గారి గురించి చెప్పేదేముందండీ...ఈ ప్రపంచంలో ఆయన ఒక అద్భుతం. సిరివెన్నెల సినిమా గుర్తుందా? అందులో మొత్తం సినిమాకు వేణువు వాయించినది చౌరాస్యా గారే. హైదరాబాదులో ఒకసారి ఆయన కచేరీ వినే అవకాశం వచ్చింది, కానీ వెళ్ళలేకపోయాను. మీరు అదృష్టవంతులు, డైరెక్ట్ గా ఆయన కచేరీ విన్నారు.


@ Anonymous
అవునండీ విశ్వప్రేముకుడిగారికి జై అలాగే బద్రికి, శ్రీనివాస్ కి కూడా జై. వాళ్ళ ధర్మామా అని నా బ్లాగు స్మైలీలతో కళకళలాడిపోతోంది.

ఆ.సౌమ్య said...

@ బద్రి గారు
బాల మురళీ కృష్ణ గారు పాడినవి చాలామటుకు నెట్ లో ఉన్నాయండి, లో కూడా ఉన్నాయి. తప్పకుండా వినండి.

ఓహ్ అనుష్కా రవిశంకర్ కచేరీ విన్నారా, wow great! చాలా బాగా వాయిస్తారు ఆవిడ.
మీ ఊర్లో అంతమంది ఆవిడ కచేరీని ఆదరించారంటే గొప్పేనండీ. ఏ సంగీతమైనా చెవులకి ఇంపుగా ఉంటే చాలు ప్రజలు ఆదరిస్తారు. మీరిచ్చిన లింకు విన్నాను. అబ్బ అందులో వయలిన్ ఎంత బాగా వాయించారండీ, సూపరు...లింక్ ఇచ్చినందుకు చాలా చాలా thanks.

ఓహో రెహమాన్ జయహో టూర్ మీ దేశంలో కూడా ఉందా, నేను ఒకసారి hyd లో రెహమాన్ కచేరీ విన్నా. నాకు రెహమాన్ అంటే చాల ఇష్టం. మీరు తప్పకుండా ఆ కచేరీ విని బాగ ఎంజాయ్ చెయ్యండి.

హ హ హ concert ని తెలుగులో కచేరీ అనే అంటారండీ, కాబట్టి మీరు రైటే.

Wit Real said...

>> చుక్కేసుకుంటే పాడడం కష్టమని మాత్రం తెలుసు.

That may be incorrect.
My guitar instructor plays the best after a couple of shots.

Researchers find that the basic developmental social anxiety (fear, guilt, shyness etc.) is an inhibitor of creativity.

so, if we deliberately numb this anxiety, then the creative juices flow.

Its like, to write a super hit cinema song you need పెన్నులో సిరా చుక్క, పొట్టలో సారా చుక్క

Anonymous said...

అదృష్టవంతులు సౌమ్యా మీరు. బాగా రాస్తున్నారు కూడా. అభినందనలు.
- :)

శివరంజని said...

సౌమ్య గారు శ్రీ లలిత గారు చెప్పింది నిజమేనండి...చాలా బాగా చెప్పారు ... చదువుతుంటే మేము కూడా అక్కడే ఉన్నట్టే అనిపించింది . వయొలిన్ నేర్చుకున్నారన్నమాట! పాఠాలు కూడా చెప్తానంటే నేను చేరతా!అయితే నా ఫీజ్ మాత్రం సుజాత గారి దగ్గరే తీసుకోండి

ఆ.సౌమ్య said...

@ Wit Real
ఈ రిసెర్చి గురించి నాకు తెలీదుగానీ చుక్కేసుకుంటే గాత్రధర్మం తప్పుతుందని నా ఉద్దేశ్యం. గళం సహకరించకపోవచ్చు.

ఆ.సౌమ్య said...

@ శివరంజని
మీకు నచ్చినందుకు ధన్యవాదములు...ఆ అనుభూతుని కలిగించగలిగాను కదా, సంతోషం.

బావుందడీ, ఏదో సామెత చెప్పినట్టు పాఠాలు మీకు, ఫీజు సుజాతగారికీనా...సచ్ దాల్స్ వోంటు బాయిలూ (ఆ పప్పులేం ఉడకవ్):P

@ Anonymous
ధన్యవాదములు. ఇలాంటివి జరిగినప్పుడే మనకీ అదృష్టరేఖ ఉంది కాబోలు అనిపిస్తూ ఉంటుంది.

మీకు నచ్చినందుకు సంతోషం. మీరు పేరు కూడా రాసి ఉంటే బాగుండేది.

స్నిగ్ధ said...

సౌమ్య గారు,

చాల బాగా రాసారండీ...మీది చదువుతూంటే నేను కూడా మీ పక్కన ఉన్నట్లు ,నేను కూడా ఇంటర్వూ కి ప్రశ్నలు తయారు చేసుకున్నానుకొండీ...

ఓహ్...మీరు వయొలిన్ కూడా వాయిస్తారన్నమాట...మీలో ఇన్ని కళల అపరిచతమ్మలు ఉన్నారన్నమాట...ఒక సారేమో నటనాపరిచతమ్మని బయటకి తెచ్చారు...ఇంకో సారి మీలో ఉన్న చిత్రకారిణిని బయటకి తెచ్చారు...ఇప్పుడు మీలొ దాగిన సంగీతపరిచతమ్మని బయటకి తెచ్చారు...

మీరు కేకండీ...

మీ నాలుగు వర్ణాలు మరియు ఎనిమిది వర్ణాల కాన్సెప్ట్ బాగుందండీ...:)

సచ్ దాల్స్ వోంటు బాయిలూ (ఆ పప్పులేం ఉడకవ్):P --ఇదైతే కేక...

గురువు గారు మరి వయొలిన్ ఎప్పుడు నేర్పుతున్నారు??

ఆ.సౌమ్య said...

@ స్నిగ్ధ
హ హ హ ఆ ప్రశ్నా పత్రాలనీ జాగ్రత్తగా దాచేసుకోండి, ఎప్పుడైనా MBK ఎదురొస్తే ఠక్కు ఠక్కున అడిగేయొచ్చు :)

ఇక అపరిచితమ్మలంటారా...మీరు మరీ నన్ను మునగచెట్టెక్కించేస్తున్నారు. నాకు అంత దృశ్యం లేదండీ. ఏదో లలిత కళల్లో కాస్త ప్రవేశముంది అంతే తప్ప ప్రావీణ్యత లేదు.

ఆహా మీరు కూడా శిష్యరికం చేస్తానంటారా...ఇదేదో భలే ఉందే, economics లేదూ పాడు లేదు, అవన్ని తుంగలో తొక్కి బ్లాగులో వయలిన్ పాఠాలు మొదలెట్టొచ్చేమో నేను. మంచి కామెడీగా ఉంటుంది కదా అలా చేస్తే :P

నా పోస్ట్ మీకు నచ్చినందుకు చాల సంతోషమండీ. మీరిలాగే ఎప్పటికప్పుడు నన్ను పొగిడేస్తూ ఉత్సాహపరిచారంటే విజృభించేస్తా ;)

Thank you so much!

Enimidi said...

>>సచ్ దాల్స్ వోంటు బాయిలూ>> :)

స్నిగ్ధ said...

మునగ చెట్టు ఏమీ ఎక్కించలేదండీ...నిజం గానే చాలా బాగా రాస్తున్నారు...

ఇందుకెకాలస్యం మొదలు పెట్టెయ్యండీ పాఠాలు...

నేను రెడీ.. :)

లలిత కళలంటే నాక్కూడా ఆసక్తేనండీ...

ఆ.సౌమ్య said...

@ స్నిగ్ధ
మీ అభిమానానికి కృతఙ్ఞురాలిని :)
ఉండండుండండి ఇంతటి మహత్తరకార్యం అలా వీజీగా మొదలెట్టేస్తే ఎలా...ముహూర్తం, రిబ్బను కట్టింగు అన్ని ఉండాలిగా... రిబ్బను కటింగుకి MBK నే పిలిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ;) అన్ని నిర్ణయించి మీకు కబురుపెడతా, వచ్చేయండేం :P


@ ఎనిమిది
మీ నవ్వు చూస్తే అర్థమయిపోయిందండీ, నా వాక్య ప్రయోహం మీకు నచ్చిందని. ధన్యవాదములు :)

Anonymous said...

ఒక దూలం కొనూక్కొని రంపం తో కటింగ్ చేయించండి ఓపెనింగ్ కి

స్నిగ్ధ గారిని పిలవద్దు :(

ఆ.సౌమ్య said...

@ Anonymous
MBK పెద్దయన కదా, మరీ దూలాలు, రంపాలంటే కష్టమండీ. మీరేదైనా రిబ్బను కటింగు ప్లాన్ చేస్తే దూలాలు, రంపాలతో చెయ్యండి ఏం!

నేను ఈసారికి సింపుల్ గా పురికోసు, బ్లేడు అని డిసైడయిపోయా

స్నిగ్ధ గారినెందుకు పిలవొద్దండీ? పాపం ఆవిడేం అపకారం చేసారు మీకు ?

Anonymous said...

స్నిగ్ధ గారు ఒక్క మీ బ్లాగులోనే కామెంట్లు రాస్తున్నారు
మా కడుపు రగిలిపోతోంది
అందుకే ఆవిడని పిలవద్దు

Anonymous said...

I too attended that in DST. Simply fantastic..tarvaata net lo aayan paatalu download chesi tuppu vadile varakuu vinnaa..hmm. Tarvaata kuudaa okasaari vachaaru..but first time I njoyed it much.Meeru interview miss avatam B'luck. May be u get another chance some time.

తార said...

మీరు బాలమురళి గారి గురించి రాయాలి అనుకున్నారా? ఆయనతో మీ అనుభవాల గురించి రాయాలి అనుకున్నారా?
ఏది ఎమైనా, మీ గురించి వ్రాసిన వాక్యం అవసరమో లెదో మళ్ళీ ఒక సారి చూసుకోండి. తరువాత, మీరు చెప్పిన విషయాలు చాలా ఆయనే సునీత ఝుమ్మంది నాదంలో చెప్పారు.

ఇక ఆ ఆవేదనలోంచి .. ఇక్కడి నుంచి ఆ పెరా చివరి వరకు అనవసరం అనిపించింది, పెద్దవారి విషయాలు చెప్పేటప్పుడు మన స్వ-చతుర్లు నప్పవెమో.
నేను దాన్ని గోకి, అది ఆయన్ని గోకితే... ఈ బాష నాకు నచ్చలేదు.

ఆ.సౌమ్య said...

@ Anonymous
హ హ అదా మీ బాధ, ఎవరు బాగా రాస్తే వాళ్లకే కామెంటు పెడతారు, అంతే కదా :P అసలు మీరిలా పేరు లేకుందా కామెంట్లు రాస్తే మీరున్నారని ఎవరికి తెలుస్తుందంట?

ఆ.సౌమ్య said...

@ తార
నేను ముందే చెప్పేసానుగా బాలమురళీగారితో నా అనుభవాలు అని. ఇక్కడ ముచ్చట్లు అని ఎందుకన్నానంటే అవి ఆయన జీవితంలో జరిగిన ముచ్చట్లు, మనకీ ముచ్చటగా ఉన్నాయి కాబట్టి. మీకెందుకు అంత కంఫ్యూజన్ వచ్చింది?

బహుసా ఆయన ఝుమ్మంది నాదంలో ఇవన్నీ చెప్పే ఉండొచ్చు. ఆయన తన జీవితం గురించి ఎవరితో చెప్పినా, ఎక్కడ చెప్పినా మారదు కదా. మొన్న సాక్షిలో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు కూడా నాకు తెలిసిన చాలా విషయాలు ఆయన రిపీట్ చేసారు. గతం మారదు కదా ఎవరికైనా.

ఇంక స్వ-చతుర్లు అంటే...అవి నా భావనలే కదా. అవి మీకు "నప్పలేదు" అనిపించినా నాకు "తప్పలేదు, తప్పులేదు" అనిపించింది.

ఇంక మీకు నచ్చని వాక్యం...ఇంత పెద్ద వ్యాసం రాసినప్పుడు 1-2 నచ్చనివి, 2-3 బాగా నచ్చినవి దొర్లుతూ ఉంటాయి మరి.

కానీ ఒకటి మాత్రం నాకు నచ్చింది, నిర్భయంగా మీ అభిప్రాయాలు చెప్పారు. ఇలగే ఎప్పుడూ విమర్శలు, ప్రశంసలు అందిస్తారని ఆశిస్తున్నాను.ధన్యవాదములు.

ఆ.సౌమ్య said...

@ కృష్ణ చైతన్య
ఓ మీరు కూడా ఉన్నారా అప్పుడు.great!
చాలా బాగా మాట్లాదారు కదండీ ఆ వేళ.
మీ నోటి చలవన నాకు మళ్ళీ అవకాశం వస్తే అంతకన్నా ఇంకేం కావాలి.
కామెంటు రాసినందుకు ధన్యవాదములు.

తార said...

మీరు మీ బ్లాగ్ ని ఎలా చూసుకున్నా, నేను మాత్రం మీ టపాలని రచనల్లాగానే చూస్తాను, మీరు (బహుశా నేను ఎక్కువ ఆశిస్తున్నానెమో అనిపిస్తుంది నాకే) తగినంత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయకుండా రాస్తున్నారు అని అనిపించటం వలన తప్పులు దొర్లుతున్నాయని వాటిని ఎత్తి చూపించవల్సివస్తున్నది, ఇదే ప్ర.నా గురించి ఐతే అసలు గొడవే లేదు, కానీ గొప్పవాళ్ళ గురించి రాసే టప్పుడు తగు జాగ్రథలు తీసుకోవాలి లేదంతే అది సాహిత్యావలోకనంలో మైదానం ఐపోతుంది.
ఇక నా పాత కామెంటుకి వస్తే అది మీ పై విమర్శ కాదు, మీటపా పై.
--నేను ముందే చెప్పేసానుగా బాలమురళీగారితో నా అనుభవాలు అని.
కదనంలో క్లారిటీ లేదు, అంటే ఫ్లో కొంచం గజిబిజిగా వున్నది అని ఆ ప్రశ్న వేశాను, అంటే అది చెప్పే విదానం కొంచం మెరుగుపర్చుకోమని సూచన.
--బహుసా ఆయన ఝుమ్మంది నాదంలో ఇవన్నీ చెప్పే ఉండొచ్చు.
(ఝుమ్మంది నాదంలో కుదా) చెప్పారు అని మీకు చెప్పాను అంతే,
--అవి మీకు "నప్పలేదు" అనిపించినా నాకు "తప్పలేదు, తప్పులేదు" అనిపించింది.
స్వ చతుర్లు మంచిదే కానీ అది విషయాన్ని పుర్తిగా పక్కదారి పట్టించకూడదు, మధ్య మధ్యలో ఒకటి అరా వాక్యాలు అంటే పర్లేదు, అవి అవసరమేమో కుడా టపాని ఇంకా రక్తి కట్టించటానికి కానీ ఒక పెరా అంటే అది పుర్తిగా పక్కదారి పట్టినట్టే,
--ఇంత పెద్ద వ్యాసం రాసినప్పుడు 1-2 నచ్చనివి, 2-3 బాగా నచ్చినవి దొర్లుతూ ఉంటాయి మరి.
బాషా ప్రధానం అండి, గొప్పవారి గురించి చెప్పేటప్పుడు మన బాష కుడా సరిగా వుండాలి, లెదంటే అది చలా ఎబ్బేట్టుగా వుంటుంది.

మీరు పెద్దవారి గురించి రాసినప్పుడు, అంతా ఐపోయాక, మరొకసారి, ప్రతి వాక్యం ఇలా కాకుండా ఇంకా బాగా రాయగలను అని చూడండి, అప్పుడు ఇంకా మంచి టపాలు పడతాయి.

స్నిగ్ధ said...

ఇప్పుడే కామెంట్స్ చూస్తున్నాను.."ఒక్క నిమిషం స్నిగ్ధ గారిని పిలవొద్దు" అన్న దాన్ని చూసి..అయ్య బాబొయ్ ఎవరినైనా హర్ట్ చేశానా అని అనిపించింది...తరువాత కామెంట్స్ చూసి కొంచెం కుదుటపడ్డాను..

@anonymousగారు ..అదేమి లేదండీ..సౌమ్య గారి బ్లాగ్ కి మాత్రమే మరి కొన్ని వాటిలో కూడా కామెంట్స్ పొస్ట్ చేస్తున్నాను...మీ బ్లాగ్ ఇవ్వండీ...మీ దాన్లో కూడా పోస్ట్ చేసేస్తా...

ఆ.సౌమ్య said...

@తార
మీ సూహచనలకి ధన్యవాదములు.
నాకేదో గొప్ప ప్రావీణ్యముందని మీరు భావిస్తున్నరేమో...నాకు అంత సీను లేదండీ, ఏదో రాస్తా అంతే....మీకు కాస్త ఎక్కువే ఆశిస్తున్నారు :P

"తగినంత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయకుండా రాస్తున్నారు"......ఇది నిజమే, బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఏమీ చెయ్యలేదు, అప్పటికప్పుడు ఆయన జన్మదినమని తెలిసింది, వెంటనే రాసాను. దేనిగురించయినా వెంటనే రాసేయగలను అని నాకు కొంచం గీర ఎక్కువలెండి, అది కాస్త తగ్గించుకుంటాను ఇకమీదట :)

ఈసారి టపా రాస్తున్నప్పుడు మీ సలహాలు, సూచనలు తప్పక గుర్తుపెట్టుకుంటాను. చాలా చాలా thanks!

Anonymous said...

స్నిగ్ధ మరియు సౌమ్య గార్లు ఇద్దరూ అక్క చేల్లిల్లులా అన్యోన్యంగా మాట్లాడుకొని
అజ్ఞాత మీద మూకుమ్మడి దాడి చేస్తారా

స్నిగ్ధ గారే మంచోరు
సౌమ్య గారు అయితే నిర్దాక్షిణ్యంగా చీమల్ని చంపేస్తారు జీవ హింస మహా పాపం

Anonymous said...

సౌమ్య గారికి బాగా తెలిసి ఉండి కూడా తను ఫాలో అవ్వని బ్లాగు నాదే
సౌమ్య గారు మీకు చెప్తారు
మీరు నా బ్లాగులో కామెంట్ రాయండి స్నిగ్ధ గారు

ఆ.సౌమ్య said...

@ Anonymous
బాసూ తమరెవరో కూడా నాకు తెలీదు. పేరు చెబితే ఫాలో అవుతానో అవ్వనో చెప్పేస్తాగా...అయినా ఈ కామెంటుతో మీరెవరో కాస్త వెలుగుతోంది కానీ ఖచ్చితంగా తెలియట్లేదు. మీ పేరు ఇక్కడ చెప్పడం ఇష్టం లేకపోతే నాకు మైల్ చెసెయండి, ఓ పని అయిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా స్నిగ్ధ కి చెప్పేస్తా మీ బ్లాగు గురించి, ఏమంటారు?

స్నిగ్ధ, నేనూ అన్యోన్యంగా ఉన్నామా...అదే కాదు ఎల్లప్పుడూ అందరూ కోరుకునేది...బ్లాగుల్లో అన్యోన్యత, స్నేహభావం మంచివే కదా, అవి మేము సాధించాము :)

నా నిర్దక్షిణ్యత్వం మీకిప్పటికి తెలిసిందా, చాలా సంతోషం :P

Anonymous said...

నేను మీ బ్లాగ్నిఫాలో అవుతున్నాను మీరే కావట్లా

స్నిగ్ధ said...

సౌమ్య గారు...anonymousగారు మెయిల్ చేస్తే అలా ఫార్వర్డ్ చెయ్యండీ..తను మీకు తెలుసంటున్నారు కదా...

@anonymous గారు తప్పకుండా మీ బ్లాగ్లో కామెంట్స్ పోస్ట్ చేస్తాను...ముందు మీ బ్లాగ్ పేరు ఇవ్వండీ...

ఆ.సౌమ్య said...

@ Anonymous
ఓరినాయనో మళ్ళీ ఇదొకటా..మీరు నా బ్లాగు ఫాలో అవుతున్నరని నాకెలా తెలుస్తుంది చెప్పండి, మీరు మరీను :P అయినా ఎందుకొచ్చిన దాగుడుమూతలివన్నీ...పేరు చెప్పేస్తే పోలే !

@స్నిగ్ధ గారు
తప్పకుండానండి, ఆయన మైల్ చేస్తే మీకు వెంటనే fwd చేసేస్తా.

Anonymous said...

ఇద్దరూ ఒకే ఇంట్లో పిల్లలు లా చక్కగా ముద్దుగా మాట్లాడుకుంటున్నారు మళ్ళీ గారు అని పిలుచుకుంటారు ఏమిటో ఈ స్నేహం

Anonymous said...

followers లిస్టు లో ఉన్నాను అక్కడ చూడండి

మరువం ఉష said...

విషయాలకి థాంక్స్..ఇక ఈకలు విషయంలోకి..
>> సంగీత ఙ్ఞానమే ఏడిస్తే నేనెందుకు economics లో PhD చేస్తాను, చోద్యం కాకపోతే

నేను అంగీకరించను. ఈ రోజుల్లో పూర్తిగా లలితకళని ప్రొఫెషనో/జీవితాన్ని అల్లుకునే పడుకుపేకగానో తీసుకునేవారు ఎంత శాతం? మన బ్లాగుల్లోనే ఎంతో ప్రతిభావంతులున్నారు..త్వరలో మీరూ వారిని చేరాలని ఆశిస్తూ.. :)

>> ఈయనకి ఈ హింసా పద్ధతులు నచ్చడమేమిటో నాకర్థం కాలేదు.

మీరు మనిషి హక్కుని ప్రశ్నిస్తున్నారు..అన్యాయం. ఏమి మల్లుయోధులు శాఖాహారులు లేరా? అలాగే ఇదీను.

>> నాలుగు వర్ణాల ఇంధ్రధనస్సూలా మెరిసింది నా ముఖం

మరి నిరాశ కమ్మిన వివర్ణవిల్లు కాలేదా చివరాఖరుకి? ;)

ఆ.సౌమ్య said...

@ Anon
బాబూ,అమ్మా నా ఫాల్లొవర్స్ లిస్ట్ లో 23 మంది ఉన్నారు, ఎవరినని అనుమానించను.
తమరికిలా నాతో దోబూచులాడడం మహా సరదాగా ఉన్నట్టుందే !
కొంపదీసి తమరు మా చేమంతిగారు కాదు కదా

మేమంతే, స్నేహమంటే అలాగే ఉంటుంది, తమరికి అర్థం కాదులెండి :P

ఆ.సౌమ్య said...

@ఉష గారూ
ధన్యవాదములు.
మీ నోటి చలవ వలన నేను ఆ ప్రతిభావంతుల స్థాయికి చేరితే అంతకన్నా ఏం కావాలండీ :)

మనిషు హక్కు అదీ ఇదీ అంటే..మీరు మరీ అలా పెద్ద ఈకలు పీకితే నేనేమీ చెప్పలేను :O

"మా మొహాలు వివర్ణమయిపోయాయి."....రాసాను కదండీ వివర్ణాలవిల్లు గురించి. మీరు నా పోస్ట్ సరిగ్గా చదవకుండా ఈకలు పీకుతున్నారు, ఇది తొండి,నేనొప్పుకోనంతే ఆ :P

సవ్వడి said...

సౌమ్య! మీకు చాలా విషయాలు తెలుసు. ఈ టపాలో రాసినవన్నీ నాకు తెలియని విషయాలే..
MBK గారి గురించి బాగా చెప్పారు.
ఇంతవరకూ ఏ కచేరీకి వెళ్లలేదు. మృదంగాలకు, వయెలిన్ లకు ఎంజాయ్ చెయ్యగలనో లేదో నాకు సందేహమే!

ఆ.సౌమ్య said...

@సవ్వడి
ధన్యవాదములు, నాకు తెలిసిన విషయాలను నలుగురితో పంచుకోవడం కోసమే ఈ టపా రాసాను. అది ఫలించినందికు ఆనందంగా ఉంది.
Thank you!

సి.ఉమాదేవి said...

ఒకనాటి ఆకాశవాణి శ్రోతలకు (టి.వి లేని రోజుల్లో)బాల మురళీకృష్ణ,శ్రీరంగం గోపాలరత్నంగార్ల గానామృతం నిత్య స్మరణీయమే!పాట రాదు,వాయిద్యమేమీ రాదు కాని శిరస్సు మాత్రం ఫణిరాజు పడగలా వూగేది.అదీ వారి అమోఘ గాన మహిమ.నా బాల్యపు అనుభూతులు గుర్తుకుతెచ్చిన సౌమ్యగారికి ధన్యవాదాలు.

ఆ.సౌమ్య said...

C. ఉమాదేవి గారూ
వారిద్దరూ కలిస్తే వేరే చెప్పాలాండీ....మీరన్నట్టు తల ఫణిరాజు పడగలా ఊగాల్సిందే!ధన్యవాదములు.

కొత్త పాళీ said...

బాలమురళి అనుభవాలు బాగున్నాయి. సెంట్రల్ వివిలో మన క్లాసుకాని కళా పాఠాలు నేర్చుకోడానికి వెళ్ళడం నాకూ అనుభవమే (నేను వివి విద్యార్ధిని కాదు.) :)
బాలమురళి చాలా హాయిగా మాట్లాడుతారు అభిమానులతో, ఏమాత్రం భేషజం లేకుండా.

కొత్త పాళీ said...

@ నాగార్జున, సౌమ్య
స్త్రీలు వేదికనెక్కి కచేరీలు చెయ్యడం లేదు అప్పట్లో నిజమే, దేవదాసీలయితే తప్ప.
సుబ్బలక్ష్మి ఆ కుటుంబంలో పుట్టినవారే. అంచేత చిన్న వయసునించీ ఆమె తల్లి (మదురై షణ్ముగవడివూ) ఆమెకి ప్రదర్శనలివ్వడంలో తరిఫీదు ఇచ్చి ప్రోత్సహించారు. పదహారేళ్ళ వయసులోనే సుబ్బలక్ష్మి పేరుపొందిన గాయని, అప్పటికే చాలా గ్రమఫోను రికార్డులు కూడా ఇచ్చారు. సుమారు 18 ఏళ్ళ వయసులో సదాశివం గారిని ప్రేమించి తల్లి ఇష్టనికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకున్నారు. కల్కి కృష్ణమూర్తిగారు వారిద్దరికీ ప్రాణస్నేహితులు, పైగా వియ్యంకులు. కల్కిగారి కూతుర్ని సుబ్బలక్ష్మి సదాశివంలా పెంపుడు కుమారునికి వివాహం చేశారు. కంచి పరమాచార్యుల వద్ద సుబ్బలక్ష్మి దంపతులకి సాదర సత్కారాలు లభించేవి. ఎమ్మెస్ యునైటెడ్ నేషన్‌స్ లో కచేరీ చేసినప్పుడు, ప్రత్యేకంగా ఆ సందర్భంకోసం పరమాచార్యులు మైత్రీంభజత అనే సంస్కృత కృతి రచించి ఇచ్చారు.

ఎమ్మెస్ కి సమకాలికులైన మరో ఇద్దరు గొప్ప గాయనీమణులు - ఎమ్మెల్ వసంతకుమారి, డి.కె. పట్టమ్మాళ్, బ్రాహ్మణ కుటుంబాల నించి రావడంవల్ల కచేరీలు చెయ్యడంలో సంఘాన్నించి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నారు. వారికున్న గాత్ర మాధుర్యం, వారి గురువుల దయ (వరుసగా జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం, పాపనాశం శివన్), వీరి పట్టుదల - ఎట్టకేలకు వారిద్దరినీ కూడా కర్నాటక సంగీతంలో తారలనుగా నిలిపాయి. కర్నాటక రంగస్థలం మీద ఈ మువ్వురు సాధించిన విజయం తరువాతి కాలంలో స్త్రీలు కచేరీలు చెయ్యడానికి దారి చేసింది.

ఆ.సౌమ్య said...

@కొత్తపాళీ గారు
ధన్యవాదములు
సుబ్బలక్షి గారు దేవాదాసీ కుటుంబం నుండి వచ్చారు అని తెలుసు. ఆ మాటనకేల గుళ్ళలో నాట్యం చేసేవారు అన్నాను. మీరిచ్చిన సమాచారం బావుంది. అయితే స్వరం లేకుండ మీరూ పాఠాలు నేర్చుకున్నరన్నమాట...బావుంది :)

Venugopal said...

Thanks Soumya garu, for posting few things about great MBK.

నేస్తం said...

మొన్నెపుడో చదివా ఈ పోస్ట్ ...కామెంట్ లేట్ అయ్యింది రాయడం.. చాలా బాగారాసారు..బాల మురళి గారి మౌనమే నీ బాష పాట అంటే చాలా ఇష్టం నాకు..మంచి విషయాలు పంచుకున్నందుకు థెంక్స్

కొత్త పాళీ said...

@ సౌమ్య .. నేను నేర్చుకున్నది సంగీతం కాదు.

ఆ.సౌమ్య said...

@ వేణుగోపాల్
ధన్యవాదములు

@ నేస్తం గారూ
నేను రాసిన విషయాలు మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదములు.

@కొత్తపాళీ గారు
అవునా!

సుభగ said...

బాలమురళి గారి ముచ్చట్లు మాకు వినిపించినందుకు ధన్యవాదాలండి. అసలు అలాంటి వ్యక్తులను చూస్తేనే ఎంతో స్పూర్తిదాయకంగా ఉంటుంది.
మా కాలేజిలో ఒకసారి హరిప్రసాద్ చౌరాసియా గారి కార్యక్రమం ఏర్పాటు చేసారు. అది హాజరు అయిన తర్వాత నాలుగు రోజుల వరకు జనాలకు ఏదో ఒక ట్రాన్స్ లో ఉన్నట్టే అయిందిట.
అప్పటి నా తెలివితక్కువ వల్ల పరీక్షలున్నాయని ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు :-( :-(

..nagarjuna.. said...

@కొత్తపాళి గారు: కొత్త విషయాలను తెలియపరచినందుకు కృతజ్ఞతలు

vivek said...

Bagundhi...
MBK gari fan aynandhukemo gani,..miku aayana class chepthunte nacchaledhu ani anadam enduko naku nacchaledhu{me opinion miru chepparankondi}..aa class lo miru undatame adrustam kada....!!!??!!

Aayana chala intrws chusanu..aayanadi chinna pillavani mansthathvam anpinchindi...so,fights,songs nacchadam lo peddha vintha em untundi....edaina Kala ne kada,anni answadistharu aayana!!

comin to ur writin style...nirmohamatanga,miku thochindi raasaru...madyalo konni prayogalu bagunnay...overall,its gud!