StatCounter code

Monday, September 27, 2010

చెక్కిన చేతులకు జోహార్లు-2

....అంత అలసటతో, నిస్సత్తువతో ఉన్న నాకు ఎదురుగా కనిపిస్తున్న కట్టడం బయటనుండి చాలా మమూలుగా అనిపించింది. ఇప్పుడు ఇది చూసే ఓపిక నాకు లేదురా మొర్రో అన్నా నన్ను లాక్కొచ్చారే అని మా వాళ్ళని కోప్పడ్డాను. మొదటి ద్వారం దాటి లోపలకి ప్రవేశించాము, ఏదో తెలియని పరిమళం ఆహా కాదు గొప్ప మట్టి వాసన ఆ గాలిలో ఉందనిపించింది. అడుగులు ముందుకువేస్తున్నకొద్దీ కొత్త ఉత్సాహం పరవళ్ళు తొక్కింది. రెండవ ద్వారం దాటగానే నా అలసటంతా మాయమయి నా మొహంమీద చిరునవ్వు, మొత్తం తిరిగి చూడాలన్న ఉబలాటం తొంగిచూసాయి. ఆ అద్భుత కట్టడమే తంజావూరులో ఉన్న "బృహదీశ్వరాలయం". తమిళ్ లో దాన్ని "పెరియ కోయిల్" అంటారు. అంటే పెద్ద కోవెల అని అర్థం. గుడి ద్వారాల పై చెక్కిన కళాకృతులు విస్మయం కలిగించాయి.


ఆలయ మొదటి ద్వారం

రెండవ ద్వారం

ద్వారం గోడలపై శిల్పాలు

ఆ ఆలయ పరిసరాల్లో ఏదో తెలియని గొప్పతనం, మత్తు ఉన్నాయి....అవును మరి ఆ పరిసరాలు మనల్ని వెయ్యేళ్ల వెనక్కి తీసుకునివెళ్ళిపోతాయిగా. దీన్ని తొలుత రాజరాజచోళుడు క్రీ.శ 1010 లో కట్టించాడు. తరువాత వచ్చిన రాజులు క్రీ.శ 11-14 శతాబ్దాల మధ్య కాలంలో మొత్తం ఆలయనిర్మాణాన్ని పూర్తి చేసారు. ఈ గుడి మొత్తం గ్రానైట్ తో కట్టినది. రెండు ద్వారాలు దాటి లోపలకి ప్రవేశించగానే ఆహ్లాదకరమైన ప్రాంగణం, పెద్ద పెద్ద ప్రాకారాలు (500/250 అడుగులు). మేము సాయంసంధ్యవేళ వెళ్లామేమో ఆ నీరెండ కి కోవెల ప్రాగణం అంతా మెరిసిపోతూ కనిపించింది. కోవెల ప్రాకారాలపైనా చిన్న చిన్న నంది విగ్రహాలు అమర్చబడి ఉన్నాయి, అవి గుడి చుట్టూరా ఉన్నాయి. గోడల అవతల నాటబడిన పెద్ద పెద్ద కొబ్బరిచెట్లు ప్రాకారాలపై నుండి కనిపిస్తూ కనులవిందు చేసాయి. విశాలమైన ప్రాంగణం, ఆహ్లాదకరమైన వాతావరణం, కనుసొంపైన కళాకృతులు...ఓహ్ అనిర్వచనీయమైన అనుభూతి, నిజంగా వర్ణనాతీతం.కాస్త నడిచి ముందుకెళ్ళాక నంది కనిపిస్తుంది. దాదాపు 12 అడుగుల ఎత్తు, 20 అడుగులు వెడల్పు, 25 టన్నుల బరువుగల బృహత్‌నంది. ఈ నందికి మండపాన్ని చోళరాజుల తరువాతి కాలంలో వచ్చిన నాయకర్ రాజులలో అగ్రగణ్యుడైన తిరుమల నాయకర్ కట్టించారట. చిన్నప్పుడు, నంది చెవిలో ఏవైనా మన కోరికలని చెబితే అవి నేరుగా శివును చెవికి చేరుతాయని ఒక నమ్మకం ఉండేది. మేము శివుని గుళ్ళకి వెళ్ళినప్పుడల్లా నా కోరికలన్నీ నంది చెవిలో తప్పనిసరిగా చెబుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ నమ్మకాలు తగ్గాయి కాబట్టి సరిపోయింది లేదంటే ఈ నంది చెవిలో చెప్పాలంటే నేను పెద్ద పెద్ద నిచ్చెనలు ఎక్కాల్సి ఉండేది :).
నందిని దాటుకుని ముందుకి నడిస్తే అసలు గుడి వస్తుంది. ఆలయగోపురం ఎత్తు 216 అడుగులు. ఆ గోపురం ఎత్తు, దాని మీదున్న రమణీయమైన శిల్పాలు కనులకు మిరిమిట్లుగొలిపాయి. దాని చుట్టూ తిరిగి ఎంతసేపు చూసినా తనివితీరలేదు. నేను 3-4 రౌండ్లు వేసాను, ప్రతీసారి కొత్తగా ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంది. ఆలశిఖరంపై 81 టన్నుల పద్మం ఉంది. అది గ్రానైట్‌తో చేసిన ఏకశిల, ముడుచుకున్న తామరపువ్వు ఆకారంలో ఉంటుంది. దాన్ని 200 అడుగుల ఎత్తు ఎలా ఎక్కించారో, అక్కడ ఎలా అమర్చారో ఇప్పటికీ అంతుబట్టని రహస్యం. BBC వారు the lost temples of India, the stroty of India అని డాక్యుమెంటరీలు తీసారు. అందులో వారు చెప్పిన ఒక ఊహ ఏమిటంటే...."ఆ గుడికి ఒక 15 మైళ్ళ దూరంలో ఒక క్వారీ ఉంది. అక్కడే ఈ పద్మాన్ని తయారుచేసి ఉంటారు. ఆ క్వారీ నుండి గుడి గోపురానికి సమాంతరంగా మట్టినిగానీ, కలపనిగానీ పేర్చి ఉంటారు. అలా పేర్చినదానిపై ఏనుగుల సహాయంతో ఆ 80 టన్నుల పద్మాన్ని చేర్చి ఉంటారు." ఇవన్నీ ఊహలేగానీ నిజంగా ఎలా చేర్చారో ఎవరికీ తెలీదు. ఆ టెక్నాలజీకి సంబంధించిన ఏ వివరాలు మనం భద్రపరచుకోలేదు. ఈరోజుకి భారతదేశంలో అత్యధికంగా 25 టన్నుల బరువుని మాత్రమే మోయవచ్చు. అంతకన్న ఎక్కువగా తీసుకెళ్ళకూడదని రూలు. మరి ఆ కాలంలో 80 టన్నులను ఏనుగుల చేత మోయిస్తూ అంత పైకి తెసుకెళ్ళడమంటే మాటలా! అటువంటి కళాకారులకు, అంతటి కళాపిపాస ఉన్న రాజులకు చేతులెత్తి మొక్కాలి కదా! ఆ BBC కి సంభందిచిన లింక్స్ క్రింద ఉన్నాయి. అందరూ తప్పక చూడండి.

http://www.youtube.com/watch?v=rVHQPWxmdAM

http://www.youtube.com/watch?v=BfhesYL_wp0

ఈ కింది లింక్స్ కూడా చూడండి, మంచి సమాచారం ఉంది.

http://www.youtube.com/watch?v=_QgFLDjKBAk

http://www.youtube.com/watch?v=Q52u4rs3_sI

ఈ వీడియోలు చూసాక అక్కడ ఆ గుళ్ళో రాజు గారు, ఆ శిల్పులు నడయాడుతున్నట్టు, నేను వారి పక్కనుండే నడిచివెళ్ళినట్టు ఏదో అనుభూతి కలిగింది.

ప్రధాన గుడి గోపురం
గోపురం పైన 80 టన్నుల ముకుళిత పద్మం


గుడి బయట కథ అయిపోలేదు, ఇంకా ముఖ్య విశేషాలు బోలెడున్నాయి. ముందు లోపలికి వెళ్ళి, శివుని దర్శించి మళ్ళీ బయటకి వచ్చి మిగతావి చూద్దామే, రండి మరి. లోపలకి వెళ్లగానే ఈశ్వరుడు దర్శనమిచ్చాడు. నిజంగా బృహదీశ్వరుడే, ఎంత పెద్ద లింగం! బాబోయ్, రెండు కళ్ళు చాలవు...నిజంగా కళ్ళారా చూసితీరవలసిందే. లింగాన్ని చక్కగా కన్నులపండువుగా అలంకరించారు. మేము వెళ్ళేటప్పటికి హారతి ఇస్తున్నారు.

బృహదీశ్వరుడు

నాకు మనసు మనసులో లేదు, ఏదో ఉద్వేగం, మనసు నిండినప్పుడు కలిగే ఆనందం....అటు బయట ఆలయ ప్రాంగణాన్ని చూడాలా, ఆలయం పై చెక్కిన కళాకృతులను చూడాలా, లోపల శివుని చూడాలా, బయట నందిని చూడాలా ఎన్నని చూడాలి, ఎన్నిసార్లు చూడాలి. అన్నిటినీ మళ్ళీ మళ్ళీ తనివితీరా చూసేయాలని ఆతృత, ఒకచోట నిలువలేకపోయాను. బయటకొచ్చి మళ్ళీ ప్రధాన గోపురం చుట్టూ మళ్ళీ చక్కర్లు కొట్టాను, ఎన్ని సార్లు చూసినా తనివితీరితేగా!


ఎంతో మనోహరంగా ఉంది కదా ఆలయప్రాంగణం. ఎన్నిసార్లు చుటూ తిరిగి చూసానో నాకే తెలీదు. కానీ అప్పటికి నాకు తెలీదు ఇంకా చూడవలసిన అద్భుతాలు ఆ గుళ్ళో చాలా ఉన్నాయని. ప్రధాన గోపురానికి కాస్త ఎడంగా ఎడమచేతివైపు వెళ్ళాం. అక్కడ వరుసగా లింగాలు ప్రతిష్టించబడి ఉన్నాయి. ప్రతీ లింగానికి చిన్న గదిలాంటిది కట్టబడి, ఆ గదికి ఊచలు పెట్టి ఉంచారు. అబ్బ ఈ ఊచలెందుకు పెట్టారో, దగ్గరకి వెళ్ళి చూడనీయకుండా అని కాస్త విసుక్కున్నాను అప్పుడు. మొత్తం లింగాలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టలేదుగానీ దాదాపుగా 50-60 ఉండొచ్చు. రకరకాల పరిమాణాల్లో ఉన్నాయి. ఇక్క్డ అతి ముఖ్యంగా చెప్పుకోవలసినది ఆ లింగాల వెనకాతల గోడల మీద వేసిన బొమ్మలు. అవేమి చిత్రాలు, అదేమి కళ, అదేమి సృష్టి!.....అన్నీ సహజసిద్ధమైన రంగులతో వేసినవి. శివుని రూపాలు, పురాణ కథలు ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఎప్పుడో వెయ్యేళ్ల క్రితం వేసిన రంగులు ఈనాటికీ చెక్కుచెదరక అలా ఉన్నాయంటే వేసిన ఆ మహానుభావులను ఏమని పొగడాలి! ఎన్నిసార్లు వేనోళ్ళకొనియాడినా సరిపోతుందా! ఆ చిత్రపటాల్లో ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ కెమికల్స్ తో వేసినవి లేవుట. అన్నీ నేచురల్ కలర్సే. అంత మంచి వర్ణాలను ఎలా సంపాదించారో, వాటి కలయికలో ఉన్న రహస్యాలేమిటో ఈనాటికీ ఎవరికీ తెలీదుట. తన్మయత్వంతో, అచ్చెరువుతో అలా కళ్ళు అప్పగించేసి ఓ 10-15 గదులు చూసినతరువాత అర్థమయింది వాటికి ఊచలు ఈ మధ్యనే పెట్టారని, అలా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని. ఎందుకంటే.....ఆ ముచ్చటైన చిత్రాల పక్కనే గోడల మీద "రాజేష్ లవ్స్ రమ, నాకు పరీక్షలో 100 మార్కులు రావాలి, ఓం నమశ్శివాయః, బోలెడు లవ్ సింబల్స్, బాణాల గుర్తులు, వాటికి అటు ఇటు అమ్మాయిల, అబ్బాయిల పేర్లు, తమిళ్ ఈజ్ గ్రేట్, నాయకర్ రాజులు తెలుగువారు...ఇలా అన్ని రకాలూ రాసేసారు మన జనాలు. ఆ చూడచక్కని చిత్రాల పక్కనే ఇవీ కనబడుతున్నాయి కంట్లో నలకల్లా. తమిళ ప్రభుత్వానికి మన పురజనుల క్రియేటివిటీ కాస్త ఆలశ్యంగా అర్థమైనట్టుంది. మరీ అంత సృజనాత్మకతని తట్టుకోలేక ఊచలు పెట్టేసినట్టున్నారు. సరే అసలు కథలోకి వద్దాం. మరి ఆ వి"చిత్రాల"ను మచ్చుకి కొన్ని మీరూ చూడండి.

ఎడమ పక్కన కనిపిస్తున్న ఊచల వెనకాలే లింగాలు ఉన్నాయి

ఇది బృహత్‌నంది ఉన్న మండపం పై కప్పు మీద వేసిన చిత్రం

ఇలా మొత్తం అన్నీ చూసేసరికి రెండు గంటలు పట్టింది. నాకసలు కాళ్ళు నొప్పులూ లేవు, అలసటా లేదు. పైగా ఇంకో రెండు మూడు ఇలాంటి గుళ్ళైనా తిరిగేయగలనంత ఉత్సాహం, మనసు నిండిన సంతోషం. మనసుకి కలిగిన ఉత్తేజం శరీరపు నొప్పులను పోగొట్టింది. మొదట్లో ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మత్తుని కలిగించే మట్టి వాసన వచ్చిందని చెప్పాగా, అదేమిటో ఇప్పుడు తెలిసింది....అవును మట్టి వాసనే గత చరిత్రపు కళా వైభవాలను ఇముడ్చుకున్న మట్టి వాసన. గుండెలనిండా మరొక్కసారి గట్టిగా పీల్చుకున్నాను. అది నా జీవితంలో ఒక గొప్ప రోజు, మనకున్న గొప్ప శిల్పులను, చిత్రకారులను తలుచుకుని పులకించిన రోజు. వారెవరో, పేర్లేమిటో తెలీదు. కనీసం వారి మొహాలైనా ఎలా ఉంటాయో తెలీదు. కానీ ఈరోజు వారిని తలుచుకుని ప్రణామాలర్పిస్తున్నామంటే....వారు నిజంగా ధన్యజీవులు, కారణజన్ములు. ఎన్నటికీ మరచిపోలేని అనుభూతులను మిగిల్చింది బృహదీశ్వరాలయం. కానీ అంత సంతోషంలోనూ ఒక చిన్న బాధ, గుండెలో ఏమూలో కలుక్కుమంటున్న నొప్పి. అంతటి కళని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈరోజుకి మనం నిలుపుకోలేకపోయామే అని.

ఇలా నేను దీని గురించి విశదీకరించి రాయడానికి కారణం ఆ మధుర స్మృతులను మరొక్కసారి నెమరువేసుకోవడానికి, ఆ మన "గొప్ప" ని మీకందరికీ రుచి చూపించి, మిమ్మలనందరినీ అక్కడకు వెళ్ళేలా ప్రేరేపింపజేయడానికి. ఎక్కడకి వెళ్ళినా, వెళ్ళకపోయినా తంజావూరు వెళ్ళండి. జీవితంలో ఒక్కసారైన చూడల్సిన ప్రదేశం బృహదీశ్వరాలయం, మిస్ అవ్వకండి.

మరికొన్ని చక్కని చిత్రాలు -బృహదీశ్వరాలయం

http://www.youtube.com/watch?v=ruGIkMAKq8k&feature=related


(ఇంకా ఉంది)

మరి కొన్ని అద్భుతాలకోసం కాస్త వేచి చూడాల్సిందే, తప్పదు మరి :)36 comments:

శ్రీనివాస్ పప్పు said...

చాలా చక్కగా వివరించారు.తప్పనిసరిగా చూసి తీరల్సిన వాటిలో ఒకటి ఈ బృహదీశ్వరాలయం.కిందటేడు అక్టోబర్ లో వెళ్ళాం మేము కూడా,అదొక మర్చిపోలేని అనిర్వచనీయమయిన అనుభూతి,వీలుచూసుకుని ఈ కింద లింకుమీదొక్క నొక్కు నొక్కి వీక్షించండి.
http://pappusreenu.blogspot.com/2009/11/blog-post_18.html

నీహారిక said...

ఫోటోస్ చక్కగా తీసి ఇలా మాకు కనువిందు చేసిన చేతులకు కూడా జోహార్లు.

Bulusu Subrahmanyam said...

ఇప్పుడు నాకు అనుమానం అసలు లేదు. మీఫొటోలు చాలా, చాలా బాగున్నాయి. మీరచనా విధానం కూడా బాగుంది. మీరు మామూలుగా సరదా గా రాసే శైలి కన్నా ఇది కొంచెం విభిన్నంగా అనిపిస్తోంది. కంగ్రాట్స్ ఫర్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్.

Krishnapriya said...

చాలా బాగుంది సౌమ్య.. తప్పక చూసి తీరాల్సిన ప్రదేశం అనిపిస్తోంది..

ఆ.సౌమ్య said...

@శ్రీనివాస్ గారూ
మీ వ్యాసం చూసానండీ. చక్కగా మొత్తం విషయాన్ని మూడు ముక్కల్లో రాసారు, బావుంది. నిజంగా బృహదీశ్వరాలయం దర్శించడం మరపురాని అనుభూతి. కామెంటినందుకు ధన్యవాదములు.

@ నిహారిక గారూ
ధన్యవాదములు. ఒకరు చేసినవి, చెక్కినవి నేను రాసి, తీసి చూపించానంతే, ఇందులో నా ప్రతిభ ఏమీలేదులెండి :)

ఆ.సౌమ్య said...

@సుబ్రహ్మణ్యం గారు
శతకోటి ధన్యవాదములు. హమ్మయ్య మీ సర్టిఫికేట్ వచ్చేసింది, ఇంకేం కావాలి నాకు :) ఇలాంటి వ్యాసాలలో హాస్యభరితంగా రాయడానికి ఏమీ ఉండదుగా అందుకే నా పైత్యం చొప్పించలేదు :D

@కృష్ణప్రియ గారూ
ధన్యవాదములు, అవునండీ జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన ప్రదేశం, వీలైతే తప్పక చూసిరండి.

ఆకాశరామన్న said...

మీరు ఇంకో విషయాన్ని రాయడం మరిచి నట్టున్నారు. దేవాలయాలన్నింటిలో ముఖద్వారం చాలా ఎత్తుగాను గర్భ గుడి మాత్రం చిన్నదిగానూ ఉంటుంది కానీ, ఇక్కడ దానికి రివర్స్. ముఖ ద్వారం కన్నా.. ఎత్తుంటుంది.

వేణూ శ్రీకాంత్ said...

చక్కగా పరిచయం చేసి ఫోటోలు కూడా చూపించినందుకు Thanks a lot సౌమ్య గారు, నేను చూడవలసిన ప్రదేశాల లిస్ట్ లో బృహదీశ్వరాలయం కూడా చేర్చుకున్నాను.

ఆ.సౌమ్య said...

@ఆకాశరామన్న
ఓహ్ అవును, నిజమే....మీరన్నట్టు గర్భగుడి గోపురం, ద్వారాల కన్నా ఎత్తులో ఉంటుంది. మంచి పాయింటు చెప్పారు, నెనర్లు.

ఆ.సౌమ్య said...

@వేణూ శ్రీకాంత్
ధన్యవాదములు, అవునండీ తప్పక చూడాల్సిన ప్రదేశం, వెళ్ళి రండి.

Kalpana Rentala said...

సౌమ్య,

విశిష్టమైన అందమైన బృహదీశ్వరాలయం గురించిచక్కగా పరిచయం చేశారు .కామెంట్లలో ఎవరో చెప్పినట్లు ఈ వ్యాసం మీ స్టైల్ కి భిన్నంగా సందర్భోచితం గా వుంది.

ఇక ఈ ఆలయాన్ని ఎప్పుడూ చూడకపోయినా ఒక నాటి సుందర స్వప్నం నాకు ఈ ఆలయామ్. నృత్యం వచ్చిన వాళ్ళకు తంజావూరు అన్నా, బృహదీశ్వరాలయం అన్నా అదో గొప్ప ఆకర్షన.అక్కడ ఏటా విశిష్టమైన నృత్యోత్సవాలు జరుగుతాయి. వాటిల్లో నృత్యం చేయాలని ఒక చిన్ననాటి కోరిక. అది బహుశా వచ్చే జన్మ లోనైనా తీరుతుందేమో... అక్కడ నృత్యం చేయకపోయినా నృత్య ప్రదర్శనలు చేసిన స్వప్నసుందరి లాంటి కళాకారుల ఫోటోలు చూడటమే ఆ కాలం లో ఒక అదృష్టం.

ఆ.సౌమ్య said...

@కల్పనగారూ
ధన్యోస్మి, మీరు కూడా మార్కులిచ్చేసారు, నాకింకేం కావాలి. :)

అవునండి, నాట్యకళాకారులకు ఇది ఒక సుందర స్వప్నం. బృహదీశ్వరాలయంలో ఎప్పుడూ నృత్యం సాగుతుండేదని, భరతనాట్యం ఇక్కడే బాగా అభివృద్ధి చెందిందని చెబుతారు. మీరు నాట్యం చేస్తారా, నాకు తెలీనే తెలీదండీ, భలే. మీ స్వప్నం సాకారం కావాలని మనసారా కోరుకుంటున్నాను.

Jaabili said...

Sivudu bhale unnadandi..

భాను said...

ee kathanam mariyu photolu chekkina mee chetulaku abhinandanalu

కొత్త పాళీ said...

fantastic.
thank you.

కొత్త పాళీ said...

చక్కటి ఫొటోలతో కనువిందుగా మీ అనుభవాల్ని పంచారు. నెనర్లు.

ఆ.సౌమ్య said...

@జాబిలి
ధన్యవాములు, అవునండీ నాకూ శివుడు నచ్చాడు.

@భాను గారు
Thank you so much!

ఆ.సౌమ్య said...

@కొత్తపాళీ గారూ
మీ రెండు కామెంట్లకి శతకోటి ధన్యవాదములు. నేను పుష్ఠిగా పుచ్చుకున్న కనువిందు లో మీకూ కాస్త పంచిపెట్టాలనే అభిలాష, అది నెరవేరినందుకు సంతోషం :)

శ్రీరాం said...

సౌమ్య,

మీకు టపా చాలా చక్కని సమాచారంతో , అంతకంటే మంచి మంచి చిత్రాలతో, 'వివరణాత్మకంగా' వున్నది.

ఆ.సౌమ్య said...

@ శ్రీరం గారు ధన్యవాదములు. నా బ్లాగులో ఇదే మీ మొదటి కామెంటు అనుకుంటా :)

సుజాత said...

ఈ సౌత్ లో ఉన్న శిల్ప సంపదను పూర్తిగా ఆస్వాదించాలంటే ఒకటి రెండు ట్రిప్పులు కాదు! పిచ్చెత్తినట్టు వాటి చుట్టూనే ఒక ఏడాదన్నా తిరిగితే కొంత తృప్తిగా ఉంటుందేమో కదూ సౌమ్యా! అప్పటికి కూడా ఏదో కొంత చూశామని తప్పించి, పూర్తిగా ఆస్వాదించలేం! కేవలం డబ్బు కోసం పని చేయడం కాదు, కళ పట్ల ఎంత దాహం ఉంటే అంత శ్రద్ధగా, సౌందర్య్మ్ ఉట్టి పడేట్లు చెక్కుతారు? అక్కడ తమ కళకు గుర్తింపు రావాలన్న కోరిక కనపడదు చూశారా.?..కళను , అంచులు చూసే తపనతో సృష్టించిన సౌందర్య ప్రభంజనమే తప్ప దీన్ని ఎంతమంది చూసి మెచ్చుకుంటారో కదా అన్న స్పృహే ఉన్నట్లు కనపడదు ఆ కళాకారులకు! ఇలాంటి కళను చూసిన ఆనందం ఎక్కువైపోయి, దాన్ని భరించడానికి ఇంత చిన్న మనసు చాలదేమో అనిపిస్తుంది! ఏమంటారు?

గోనె పట్టా ముక్క పెయింట్ లో ముంచి కాన్వాస్ మీద అద్దినట్లు మొన్నీమధ్య ఒకాయన మోడరన్ ఆర్ట్ వేసి... ప్రదర్శనకు పెట్టిందే కాక, దాన్ని ప్రసవించడానికి ఎన్ని పురిటి నొప్పులు పడ్డాడో చెప్తుంటే నా మట్టి బుర్రకు ఏమీ అర్థం కాలా!

ఆ.సౌమ్య said...

@ సుజాత గారూ,
అవి చూస్తున్నప్పుడు నా మనసులో కలిగిన భావాలను కరక్టుగా అచ్చుగుద్దినట్టు అలాగే చెప్పారు మీరు. అవును నెలల తరబడి వాటిని దర్శిస్తూ ఉంటేనేగానీ మనసు చల్లారదు. "సౌందర్య ప్రభంజనం" ఈ మాట నాకు చాలా నచ్చింది. వారికున్న కళాతృష్ణ అటువంటిది. ఎవరో చూస్తారు, మెచ్చుకుంటారన్న స్పృహేంటండీ, అర్జునునికి పక్షి కన్ను తప్ప మరేదీ కనిపించనట్టు వారికి అక్కడ చెక్కుతున్న శిల్పాలు తప్ప మరేమీ కనిపించి ఉండవు. నిజం, ఆ కళని చూసిన ఆనందం లో నాకయితే పిచ్చెక్కుతుందేమో అని కూడా అనిపించింది. మీరన్నట్టు మనసు చిన్నదయిపోయి భరించలేక నవనాడుల్లోకి పాకింది ఉద్వేగం.

సవ్వడి said...

సౌమ్య! సూపర్.. ఎక్సలెంట్..
నిజంగా ఆ చేతులకు జోహార్లు.....
వెంటనే తంజావూరు చూసేయాలని ఉంది. అలా చూస్తూ మమేకమైపోవడమంటే నాకు చాలా ఇష్టం. I feel it by your writings..ధర్మ సందేహం: Economics లో Modelling గురించి కాస్త వివరిస్తావా.....

ఆ.సౌమ్య said...

@సవ్వడి
ధన్యవాదములు, నా రచన మిమ్మల్ని ఆ గుడికి తీసుకుని వెళ్ళగలిగిందంటే నా ప్రయత్నం ఫలించినట్టే. :)

ఇస్‌స్‌స్ సారీ కృష్ణా, పనులతో బిజీ అయి మీ డౌటు సంగతే మరచిపోయాను పూర్తిగా. త్వరలోనే మీ ధర్మ సందేహం తీరుస్తాను. :D

భాస్కర రామి రెడ్డి said...

సౌమ్యా,ఒట్టి ఫొటోలు పెట్టి నాలాగా చేతులు దులుపుకోకుండా ఓపిగ్గా బృహదీశ్వరాలయ చరిత్రతో సహా బాగా వ్రాసారండి.

ఆ.సౌమ్య said...

@భాస్కర్ గారు,
ధన్యవాదములు...చెప్పాను కదండీ, ఆ మధుర స్మృతులను నెమరువేసుకోవడం, మీ అందరికి రుచి చూపించడం నాకో సరదా, ఆనందం. అది మీ అందరికి నచ్చినందుకు సంతోషంగా ఉంది:)

అన్నట్టు ఎక్కడో చేతులు దులిపేసుకున్నానన్నారు, ఎక్కడ దులుపుకున్నారేమిటి, లింక్ ఇవ్వరూ? ఫొటోలు చూస్తాను :D

oorodu said...

nenu kooda choosanandi Brihadeeswaraalayam. Chala baaga raasaru. Aa gnyaapakaalannee malli gurtu chesaru...

Ee aalayaaniki inko pratyekatha kooda undantandoy.. Aa gopuram needa nela meeda padanE padadanta. Memu ratri velladam tho aa vishayam pukaaro kaado nirdhaarinchuko leka poyamu. Meekemaina teliste cheppandi...

ఆ.సౌమ్య said...

@ఊరోడు
ధన్యవాదములు. మీరు కూడా చూసారా, చాలా బావుంటుంది కదండీ.
గోపురం నీడ గురించి నాకు తెలీదండీ, నేను ఎప్పుడూ వినలేదు కనుక వెళ్ళినప్పుడు గమనించలేదు. ఎవరికైనా తెలుస్తుందేమో కనుక్కుందాం. తెలిస్తే గనక మీకు తప్పక చెబుతాను.

మనలోమనమాట: ఇంతకీ మీరే ఊరోడండీ? :D

హరే కృష్ణ said...

అధ్బుతంగా వివరించారు
తప్పక చూసి తీరాల్సిన ప్రదేశం అనిపిస్తోంది..

ఆ.సౌమ్య said...

@ హరేకృష్ణ
ధన్యవాదములు, అవునూ తప్పక చూడాల్సిన ప్రదేశమే

karthik said...

ఈ సీరీస్ మొత్తం చదివాను సౌమ్యా.. చాలా బాగా రాశావ్..నేను తమిళనాడు ట్రిప్ వెళ్ళాలని 2003 నుంచీ అనుకుంటున్నాను.. ఇప్పటివరకూ కుదరలేదు.. అప్పట్లో వెళ్ళేందుకు డబ్బులు ఉండేవి కావు.. ఇప్పుడు చూడటానికి తోడు రామంటున్నారు..గుళ్ళను చూడటానికి పోదాం అంటే అదేదో వింత అయినట్టూ పైకీ కిందకీ చూసి మొగలి రేకులు సీరియల్ చూసినట్టు మొహం పెడుతున్నారు..

karthik said...

దాదాపు నెల రోజులుగా అనుకుంటున్న నీ బ్లాగు తవ్వకాలు ఈ రోజు అయిపోయాయి.. :)

ఆ.సౌమ్య said...

@కార్తీక్,
అబ్బ కార్తీక్ ఎంత ఓపికగా చేసావ్ తవ్వకాలు! :D....thanks a lot. :)

తోడు లేకపోతేనేమి నువ్వొక్కడివే వెళ్ళిరా....కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు, మిస్ కాకు.

Ennela said...

Saumya garu,
mee 'sunisitamaina' drustiki naa johaarlu.....oka tapaa wrastunnanu.. andulo add cheyyataaniki konni thoughts vachchaayi mee post chadivaaka....kritajnatalu...
ennela

Ennela said...

sorry,
follow-up comments kosam mallee wrastunnanu...
thanks
ennela

ఆ.సౌమ్య said...

@ఎన్నెల
ధన్యవాదములు, నా టపా మీకు కొంత స్ఫూర్తినిచ్చిందంటే అంతకన్నా ఆనందమేముంటుంది చెప్పండి. :) నాకు ఇలాంటి కళలు అవీ అంటే ప్రత్యేకమైన అభిమానం, అందుకని వాటిమీద కొంచం ఎక్కువ దృష్టిపెడుతూ ఉంటాను. మీరేదో పోస్ట్ రాస్తానన్నరుగా, తప్పకుండా పోస్ట్ రాయండి, నేనూ చదువుతాను.

మీ బ్లాగు పేరు చాలా హాయిగా ఉందండీ.....ఇదే మొదటిసారి మీ బ్లాగు చూడడం, మీ పోస్టులు కొంచం తీరికగా చదువుతాను!