మాయాబజార్ గురించి మరొక్కసారి...
నిన్న బజ్జులో అందరం మాయాబజార్ గురించి తలుచుకుని కొంతసేపు ముచ్చటించి ఆనందించాం. అలా ముచ్చటిస్తుంటే అంతకుముందెప్పుడో మాయాబజార్ గురించి నవతరంగం లో నేను రాసిన వ్యాసం గుర్తొచ్చింది.
వ్యాసంలో ఉన్న కొన్ని తప్పొప్పులను సవరిస్తూ మళ్ళీ ఇక్కడ....
మాయాబజార్ కొత్తగా రంగులద్దుకున్నవేళ నూతనకళతో మిలమిలా మెరిసిపోతోంది. కొత్తవన్నెలద్దడానికి సరియయిన సినిమానే ఎంచుకున్నారు పెద్దలు. మాయాబజార్ సినిమా ఒక అపూర్వమైన, అనన్యసామాన్యమైన కళాఖండం. ఈ సినిమాకి కథ, కథనం ఒక ఎత్తయితే, పింగళి వారి మాటలు, పాటలు ఇంకో ఎత్తు. నటీనటుల కౌశల్యం సరేసరి. మాయాబజార్ సినిమా తెలుగు సినిమాలోకానికి పెద్దబాలశిక్షవంటిది అని “నరేష్ నున్న” అన్నారు. ఇది అక్షరాలా నిజం.
మాయబజార్ – పాండవులు లేని భారతం. ఈ విషయం, సినిమా ఓ పది సార్లు చూసాకయినా ఎవరికీ తట్టదేమో. నిజం, పాండవుల ప్రస్తావన లేకుండా జరిగే కథ. ఈ కథని పూర్వం "శశిరేఖాపరిణయం" అనే పేరుతో కర్నాటక రాష్ట్రంలో వీధి నాటకాలుగా ఆడేవారట. దానికి ఒక మహోన్నత్తమైన స్థానాన్ని కలిపించింది మాత్రం కె.వి.రెడ్డి-పింగళి ద్వయమనే చెప్పుకోవాలి. ఈ సినిమాకి కె.వి.రెడ్డి గారి దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఆయువుపట్టులయితే, పింగళి నాగేంద్ర గారి సాహిత్య చమత్కారాలు ప్రాణం పోసాయి.
లాహిరి లాహిరి లాహిరిలో పాట నోట నానని తెలుగు ప్రేక్షకులుండరని నా ప్రగాఢ విశ్వాసం. లాహిరి అంటే మాయ అని అర్థం. ఈ ఒక్క పాట ఆధారంగా చేసుకుని కథంతా రూపకల్పన చేస్తారు. "లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా, ఊగెనుగా, తూగెనుగా" అని మొదలెట్టి "రసమయజగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో, ఎల్లరి మనములు ఝల్లనజేసే చల్లనిదేవుని అల్లరిలో" అని ముగించడం పింగళివారికే చెల్లింది. ప్రేమ మాయలో జగమంతా ఓలలాడుతోంది అని ఆరంభించి, ఆ మాయకి కారకుడు శ్రీకృష్ణుడే అని ముగింపు పలకడం ఓ అద్భుతమైన ఆలోచన. మొత్తం కథని ఈ ఒక్క పాటలో చెప్పారనిపిస్తుంది. మాయబజార్ కథకి కీలకమైన వ్యక్తి శ్రీకృష్ణుడు, ఆయన మాయావిశేషంవల్లనే కథ అంతా నడుస్తుంది. ఈ విషయాన్ని ఒక్క పాటలోనే ఎంతో అందంగా పొదిగారు పింగళి.
“చూపులు కలిసిన శుభవేళ పాట” మరో ఆణిముత్యం. “ఆలాపనలు, సల్లాపములు కలకలకోకిలగీతములే, చెలువములన్నీ చిత్రరచనలే, చలనములన్నీ నాట్యములే. శరముల వలనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే, ఉద్యానములో వీరవిహారమే, చెలికడనోహో శౌర్యములే”. ఇంత అందంగా, సంధర్భానికి అచ్చు గుద్దినట్టుగా రాయడం పింగళి వారు ఉగ్గుపాలతో నేర్చిన విద్య అనుకుంటాను. సాధారణంగా మనం ఎవరినైనా చాలరోజుల తరువాత కలిస్తే ముగిసిన కాలపు విశేషాలు ప్రస్తావించుకుంటాం. అన్నినాళ్ళలో ఏమేమి జరిగాయో చెప్పుకుంటాం. అలాగే ఎప్పుడో చిన్నప్పుడు విడిపోయిన శశిరేఖాభిమన్యులు యుక్తవయసులో కలుసుకోగానే వారి గతం గురించి ఒకరికొకరు ఈ ఒక్క పాటలో చెప్పుకునేలా చిత్రీకరించారు. రాకుమారి శశిరేఖ అంతఃపురంలో ఉంటూ సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటివి నేర్చుకుని ఉంటుంది. సాధారణంగా అంతఃపురంలో అమ్మాయిలు అవే చేస్తారు. మరి అభిమన్యుడు - వీరవిద్యలు అభ్యసించి ఉంటాడు. ఈ విషయాలు ఒకరికొకరు చెప్పుకోకుండానే గ్రహించినట్లు ఎంతో పొందికగా రాసారు పింగళిగారు. ఆమె ఆలాపనలు కోకిలగీతాలట, అందాలన్ని చిత్రరచనలట, నడకలే నాట్యమట. అంటే నువ్వు నేర్చుకున్నవన్నీ నాకు కనిపిస్తున్నాయిలే అని చెప్పకనే చెప్తున్నాడు అభిమన్యుడు. నీ బాణాల వేగము, శౌర్యప్రతాపాలను నేను గమనించానులే అని శశిరేఖ అన్యాపదేసంగా చెప్పినట్టు. ఎంత చక్కని ప్రయోగం!
“నీవేనా నను తలచినది”, “నీకోసమే నే జీవించునది” …ఈ రెండు పాటల్లోనూ ప్రేయసీప్రియులు వేరు వేరు ప్రదేశాలలో ఉంటారు. కానీ మొదటి పాట లో విడివిడిగా ఉన్నా కలివిడితనం, రెండవ పాటలో కలివిడిగా ఉండాలనుకున్నా విడివిడిగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. “విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురం కాదా”…..అంటే కలిసి ఉండడం ఒక భావన, విడిపోయి కూడా పరిమళించడం ఇంకొక భావన. ఇవన్నీ ఆలోచిస్తున్న కొలదీ గుబాళించే అనంతమైన సాహితీ సౌరభాలు.
అసలు ఏ పాట తీసుకున్న అందులో భావచాతుర్యం మిళితమై ఉంటుంది. మాయబజార్ సినిమా చూడకుండా పాటలు మాత్రమే వింటే మొత్త కథ అర్థమయిపోతుంది మనకి. అంత భావ సమామ్నాయం ఉంటుంది పింగళి వారి సాహిత్యంలో. మొదటిది “శ్రీకరులు దేవతలు” పాటలోనే ఈ సినిమాలో వచ్చే ముఖ్య పాత్రల పరిచయం జరుగుతుంది. దానితో కథ ఎవరు చుట్టూ తిరుగుతుందో మనకి తెలిసిపోతుంది. తరువాత “అల్లిబిల్లి అమ్మాయికి” పాటలో శశిరేఖాభిమన్యుల మధ్య ఉన్న సంబంధాన్ని చిగురింపజేస్తూ వాళ్ళిద్దరు ఒక దగ్గరలేరనే విషయం తెలియజేస్తారు. “నీవేనా నను పిలచినది” పాటతో వారి మధ్య ఉన్న ప్రగాఢ అనుబంధాన్ని పెంపుజేస్తారు. చూపులు కలిసిన శుభవేళ పాటవల్ల వాళ్ళిద్దరు మళ్ళీ కలిసారని తెలుస్తుంది. “లాహిరి లాహిరి పాట” సరేసరి, అంత తెలుస్తుంది అందులోనే. ‘భళి భళి భళి దేవా” పాటలో శ్రీకృష్ణుడి చక్రం కనిపిస్తుంది. ఘటోత్కచుడి పరిచయ పద్యంలో వారి పాత్ర, “శకుని ఉన్న చాలు” పద్యంలో వీరి పాత్ర ప్రస్పుటంగా గోచరిస్తుంది. “నీకోసమే” పాటలో వారు దూరమయ్యారని తెలుస్తుంది. “అహనా పెళ్ళియంట, వివాహ భోజనంభు” పాటల్లో మాయశశిరేఖగా ఉన్న ఘటోత్కచుని చాణతనం, “సుందరి నీవంటి” లో లక్ష్మణ కుమారుడి బేలతనం కనిపిస్తుంది. “విన్నావ యశోదమ్మ”, “దయచేయండి దయచేయండి” పాటలు, మధ్యలో జరుగుతున్న కథని మనకు చెప్పకనే చెబుతాయి.
ఇక పింగళివారి మాటలహేల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసమదీయులు, తసమదీయులు అన్న పదాలు ప్రతీ ఆంధ్రుని నోటా కొలువుదీరి ఉన్నాయంటే ఆశ్చర్యమేమీ కాదు. “పాండిత్యం కన్నా ఙ్ఞానం ముఖ్యం”, “శాస్త్రం ఏది చెప్పినా ఎప్పుడూ నిష్కర్షగానూ కర్కశంగానే చెబుతుంది, మనం సారాంశం గ్రహించాలి-అంటే శాస్త్రం ఎలా ఉన్నా ఒక సమన్వయం లో ఉంటుందన్నమాట” “ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి” లాంటి నగ్న సత్యాలను ఔచిత్యంగా చొప్పించారు. చినచేపను, పెదచేప, చినమాయను పెనుమాయ అది స్వాహా, ఇది స్వాహా అన్నదాన్లోనే బలహీనవర్గాల బాధలను నర్మగర్భంగా చర్చించారు. “పాండవుల ప్రతాపాల కన్నా, కౌరవుల ఐశ్వర్యాలు గొప్పవి కావు” – సామర్ధ్యాలకు, ఆస్తి అంతస్థులకు సాధారణ సమాజంలో పొంతన లేదన్న విషయాన్ని ఉటంకించారు. ఈ పదాలన్నింటిలోనూ బ్రహ్మాండమైన సాహిత్య స్ఫురణ, సామాజిక స్పృహ కనిపిస్తాయి.
“ఓహోహో నీవా, నీకు తెలియదూ నేనెవరో, తెలియనివారికి చెప్పినా తెలియదు” – అంటే నాకు నువ్వెవరో తెలుసు, నీకు నేను తెలియదూ, ఎదురుగుండా ఉన్న నన్నే గ్రహించలేకపొతే, చెప్తే మాత్రం తెలుస్తుందా…ఎంత సత్యం! నేను ఎవరో నీకు తెలీదు – అన్న దాన్లో ఎంత అర్థముందంటే, అహం బ్రహ్మాస్మి అంటే నేనెవరో తెలుసుకోవాలి, నువ్వెవరో తెలుసుకోవాలి.ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి దాన్లో ఒక కుర్చీ, మంచం, ఇలాంటివన్ని ఉంటాయి. వాటిని చూడగలగాలి, గ్రహించగలగాలి. చూడలేకపోతే, తెలుసుకోలేకపోతే ఎవరైనా చెప్పినా తెలియదు. ఎంత ఔచిత్యం పాటించారో ప్రతీ ఒక్క సంభాషణలోనూ. భావిస్తే ఎంతైనా గ్రహించవచ్చు ఆయన రాసిన మాటలలో. ఒక్క పొల్లు కూడా అనవసరంగా పడదు. ప్రతీ పదంలోను సాహిత్య సంపద, భావ చాతుర్యం గుబాళించి ఉంటుంది. పదాలు వాడడంలో ఆయన బ్రహ్మాండనాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎరుకకుండ వచ్చావు, ఎరుకలేకపోతావు- ఆధ్యాత్మికత- నేనున్నాని తెలుసుకోలేకపోతే నువ్వున్నావని తెలుసుకోలేవు అని భగవంతుడు చెబుతున్నట్టు – అద్భుతం కదూ. ఇంకా అగ్గిబుగ్గీకాకయ్యా, వీరతాడు వంటి పడికట్టు పదాలను తెలుగు ప్రజలనోళ్లలో నానేటట్టుగా చెక్కారు. “సభాపిరికి”, “అలమలం” లాంటి కొత్తపదాలు చక్కిలిగింతలు పెడతాయి. “నచ్చినా నచ్చకపోయినా పెళ్ళికూతురిని పెళ్ళి కొడుకు చూసి తీరాలి అది నా ప్రతిఙ్ఞ” అన్న ఒక్క వాక్యంలోనే లక్ష్మణ కుమారుడి బుద్ధిహీనత గోచరింపజేస్తారు.
ప్రాసలలో ఆయన ఉద్దండపండితుడు. “పేరు చెప్పించి, బిరుదు విడిపించి శరణనిపించిరా” – పేరు చెప్పిస్తే చాలదు, బిరుదు విడిపించి అంటే వాడి పై గెలిచి, దాసోహమనిపించిరావాలి, అమృతం తాగుతున్నట్లనిపించడం లేదూ !
“ఏవడో నరుడు, నన్ను పొడి పొడి చేసాడు సురసూరలాడుతున్నాడు కుర్రాడు"
"వాడిని మసి చేసి, నుసి చేసి పిడికిలించి పట్టుకొస్తాం నాయకా” – ఇలాంటివన్నీ బహుముచ్చటగా ఉంటాయి.
ఘటోత్కచుని పరిచయపద్యం ఆయన పాండిత్య సంపదకు నిదర్శనం.
"అష్టదిక్కుంభికుంభాగ్రాలపై మనశుంభధ్వజముగ్రాలచూడవలదే,
గగనపాతాళలోకాలలోని సమస్తభూతకోటులునాకెమ్రొక్కవలదే,
ఏదేశమైన, నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాలజరుగవలదే,
హై హై ఘటోత్కచ, జై హే ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే
యేనె ఈయుర్వినెల్ల సాశించవలదే,యేనె ఐశ్వర్యమెల్ల సాధించవలదే
యేనె మనబంధుహితులకు ఘనతలెల్ల కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదే"
పింగళి వారి రచనా సామర్ధ్యం గురించి ఇలా ఎంత చెప్పుకున్నా అనంతమైన సముద్రంలో నీటిచుక్కే అవుతుంది. భావిస్తున్న కొలదీ అర్థం, పరమార్థం బోధపడుతుంది. ఇంతటి మహానుభావులు మన ఆంధ్రులకి వరం గా దొరికారు. వారికి శతకోటి, సహస్రకోటి ప్రణామాలు.
19 comments:
బాగా చెప్పారు సౌమ్యగారూ..
మా తాతయ్య అనేవారు.. భాగవతం ఎంత విన్నా తనివి తీరదు అని. నా మటుకు నాకు, మాయాబజార్ ఎన్నిసార్లు చూసినా/విన్నా నయనానందంగా/శ్రవణానందంగా ఉంటూనే ఉంటుంది.
ఇప్పుడు నేను కాస్త సొంతడప్పు వేసుకుంటానే?..
వీడియో On చేసి సౌండుని muteలో పెట్టి మాజాబజార్ సినిమా మొత్తం డైలాగులు, పాటలు, పద్యాలు, వీలయితే నేపధ్యసంగీతం కూడా చెప్పేయగలను/పాడేయగలను/నోటితోనే వాయించెయ్యగలను. :))))
సౌమ్య గారు...వెసుకొండీ రెండు వీర తాళ్ళూ..
మళ్ళా ఒక సారి నా కిష్టమైన మాయబజార్ చూపించారు.
super.....
బాగా చెప్పారు సౌమ్యా . మాయ బజార్ ఎన్నిసార్లు చూసిన ఎంతో బావుంటుంది.
మాయాబజారు నిజంగా మాయే. ఆంధ్ర ప్రేక్షక జనాన్ని మాయ చేసింది. అంతమంది అతిరధ మహా రధులు కలిసి ఇంకో సినిమా చేయలేదు అనుకుంటాను.
వివాహ భోజనంబు గురించి వ్రాయలేదేమిటి? మీ బ్లాగుస్పాట్ పేరే అదికదా.
'మాయా బజార్' మళ్ళీ చూపించేశారుగా..
నాకు కలర్ కన్నా నలుపు-తెలుపే నచ్చిందండీ.. నేనక్కడే ఆగిపోయినట్టున్నాను!!
వీడియో On చేసి సౌండుని muteలో పెట్టి మాజాబజార్ సినిమా మొత్తం డైలాగులు, పాటలు, పద్యాలు, వీలయితే నేపధ్యసంగీతం కూడా చెప్పేయగలను/పాడేయగలను/నోటితోనే వాయించెయ్యగలను. :))))
రవి కిరణ్ గారూ,
super...అసలు మీకు పడాలి వీరతాళ్లు.
Alamalam soumya garoo, alamalam. Meere oka maya sasirekha gaaru. Andulonu meeru MAYABAZAR gurinchi chepte inkaa alamalam. (sorry for using Tenglish, ar i am viewing d blog in mobile)
Ninna vyakhya rastoo oka vishyam marbhepoyanu. Ee tapaa to "ASta nikumbhi kumbhagraalapai ..." antoo KOTTAVAKAI ruchi gurtu chesaaru. Mallee aa jaadee (jaada) teesi manasaaraa navvukunnanu. Mahilaa manuliddarikee (mayaa-sasirekha, Hidim... Sorry, kottavakay gaarike. Peru teliyadugaa... Flow lo alaa vachesindi) alamalaalunnoo, veerataallunnooo..... yam marbhepoyanu. Ee tapaa to "ASta nikumbhi kumbhagraalapai ..." antoo KOTTAVAKAI ruchi gurtu chesaaru. Mallee aa jaadee (jaada) teesi manasaaraa navvukunnanu. Mahilaa manuliddarikee (mayaa-sasirekha, Hidim... Sorry, kottavakay gaarike. Peru teliyadugaa... Flow lo alaa vachesindi) alamalaalunnoo, veerataallunnooo.....
చాలా బాగున్నదండి మీ టపా. ఈ సినిమా నభూతొనభవిష్యతి. నాకు అన్ని పాటలు కళాఖండాలుగా కనపడతాయి, వినపడతాయి ఒక్క లాహిరి లాహిరి పాటలొ తప్ప. ఈ ఒక్క పాటలొనే పదాలు దొరకక మళ్ళీ మళ్ళీ వాడి వ్రాసారా అనిపిస్తుంది. పోలిక సరి కాదు గానీ, నాకు "ఏమెట్టి, ఏమెట్టి, టీ టీ టీ పాట గుర్తుకి వచ్చినదెందుకో ఇప్పుడు. ;) ఊగెనుగా, తూగెనుగా, లాహిరి పదములు ఒక్కసారి మాత్రమే వాడి వుంటే బాగుండేదేమో.
బులుసు గారు, అన్నిటిగురించి రాయాలంటే ఒక్క టపా సరిపోదండి, ఒక పెద్ద పుస్తకమే వ్రాయాలేమో?
వివాహభొజనం గురించి చాలామంది వ్రాసేరు కాని ఎప్పటికి నోరూరిస్తునే వుంటుంది.
మాయాశశిరెఖగారు, మీరు మరొక వీర తాడు వేసుకుని త్వరలొనే ఆలొటు కూడ పూర్తి చెయ్యండి.
-- బుజ్జిగాడు
ఆ.సౌమ్యగారు, మీ బ్లాగు పేరుని సార్ధకం చేసుకుంటూ.. మాయాబజార్ గూర్చి అద్భుతంగా రాశారు. బ్రహ్మచారి అయిన పింగళి నాగేంద్రరావు చక్కని ప్రేమ పాటలు రాయటం విశేషమే! ఈ సినిమా గూర్చి డి.వి.నరసరాజు చాలా విషయాలు రాశారు. కె.వి.రెడ్డి చేతిలో పూర్తి స్క్రిప్ట్ ఉంచుకుని కూడా చక్రపాణిని ఒప్పించటానికి చాలాకాలం కష్టపడ్డాడని చదివి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ సినిమాని డా.కె.వి.రమణారెడ్డి కూడా మీలాగే చక్కగా విశ్లేషించారు. తెలుగు సినిమాల్లో మాయాబజార్ కి ఈ నాటికీ వన్నె తరగలేదు. దానికి మంచి ఉదాహరణ.. మీ వంటి యువ బ్లాగర్లు ఈ సినిమా గూర్చి చర్చించుకోవటమే.
మరోసారి, మరోసారి అని ఎన్ని సార్లు చూసినా తనివితీరని చిత్రాన్ని మరోసారి చూపించింత పని చేసారు. ధన్యవాదాలు.
మరో dailog మరిచిపొయారు.
రసపట్టు లొ తర్కం కూడదు. ...
ఎక్కడిదొ చెప్పండి చూద్దాం
కాముధ
@రవికిరణ్ గారూ
అమ్మో మీరు అసాధ్యులు సుమండీ...నేపధ్య సంగీతంతో సహా అంటే...మీ అభిమానానికి జోహార్లు!
ధన్యవాదములు!
@it is sasi world let us share
అబ్బో రెండు వీరతాళ్ళే థాంక్సులు థాంక్సులు! :)
@రవికిరణ్ గారూ
అమ్మో మీరు అసాధ్యులు సుమండీ...నేపధ్య సంగీతంతో సహా అంటే...మీ అభిమానానికి జోహార్లు!
ధన్యవాదములు!
@it is sasi world let us share
అబ్బో రెండు వీరతాళ్ళే థాంక్సులు థాంక్సులు! :)
@ శైలు
అవును, ఎన్నిసర్లు చూసినా తనివి తీరదు, బోర్ కొట్టదు.
@ బులుసుగారూ
మరే మాయే..అందుకే లాహిరి లాహిరి అని పాడారు!
వివాహభోజనంబు....వడ్డిస్తున్నాను కదా, మళ్ళీ వేరే చెప్పడం ఎందుకని :)
@మురళి గారూ
ధన్యవాదములు!
నాకూ కొత్త మాయాబజార్ పెద్దగా నచ్చలేదు. చాలా మంచి సీన్లు కట్ చేసేసారు. కాకపోతే సావిత్రిని రంగులలో చూడడం చాలా బావుంది.
@పక్కింటబ్బాయి (ఇల్లు మారాడు)
కదా...రవికిరణ్ గారికే వేసేద్దాం వీరతాళ్ళు :)
ధన్యవాదములు!
@ లక్షణ్ గారూ
ధన్యవాదములు! మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మీ అలమలం, వీరతాళ్ల గురించి కొత్తవకాయ్ కి కూడా చెబుతా!
@చాతకం
అయ్యో, అంతమాటనేసారేంటండీ లాహిరి లాహిరి గురించీ? పింగళి గారికి పదాలు దొరక్కపోవడమా...చాన్సే లేదు. కావాలనే అలా రాసి ఉండొచ్చండీ!
మీ వీరతాడుకి ధన్యవాదములు!
ఇంకా రాయలను ఉందండీ...రాస్తాను!
@ yaramana గారూ
ధన్యవాదములు! చాలా సంతోషం.
అవునండీ మాయాబజార్ ఎప్పటికీ వన్నె తరగని సినిమా. ఎప్పటికీ తెలుగు జాతి సగర్వంగా చెప్పుకునే సినిమా.
కె.వి. రమణారెడ్డి గారు రాసిన పుస్తకమేంటో చెప్పగలరా? వీలైతే చదువుతాను.
@ కాముధ గారు
బలే వారే...మాయాసశిరేఖని నాకే క్విజ్ పెడుతున్నారా! హన్నన్నా :)
అవునండీ అది మంచి డైలాగు...ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. అసలు మాయాబజార్ గురించి ఒక్క వ్యాసంలో సరిపెట్టడం అంటే అత్యాశే కదా!
ధన్యవాదములు!
నాకు ఇది చదవంగానే సినిమా చూడాలనిపించి తెచ్చుకుని చూసేస..సూపరు..:)
naaku koodaa nalupu telupu version maatramE baagunTundi . marcus bartley photography lOni goppadanaM teliyaalanTE B&W maatramE besT.
Post a Comment