StatCounter code

Tuesday, January 31, 2012

ఏదో...ఏదో నవీన భావం!

అమరసందేశం అన్న సినిమాలో శ్రీ శ్రీ విరచితమైన ఈ పాట నాకు ఎంతో ఇష్టం. ఈ పాటకి ఏ.ఎం రాజ ప్రాణం పోసారు అనే చెప్పొచ్చు. గొప్ప సాహిత్యానికి గొప్ప కంఠం తోడైతే ఆ పాట జనరంజకం కాక ఇంకేమవుతుంది! శ్రీ శ్రీ సాహిత్యం లోని అందం, లోతు, పదాల ఎంపిక అద్వితీయంగా ఉంటాయి.



http://www.oldtelugusongs.com/cgi-bin/search2/search.pl?mucode=P0087

పల్లవి:
ఏదో ఏదో నవీన భావం
కదిలించే మధుర మధుర గానం

చరణం:
సుమదళాల పరిమళాల తేటలలో
మయూరాల ఒయ్యారాల ఆటలలో
ఎలతుమ్మెద నెరతెమ్మెఱ మాటలలో

ఏదో ఏదో నవీన భావం
కదిలించే మధుర మధుర గానం

చరణం:
తలిరుటాకు మెఱుగుబాకు పదనులో
తరంగాల తురంగాల కదనులో
ఘనసాధనకొనసాగిన అదనులో

ఏదో ఏదో నవీన భావం
కదిలించే మధుర మధుర గానం

ఏదో సరికొత్త భావం కవిని కదిలిస్తోందిట. ఆ నూతన భావోద్వేగం కవి నోట తియ్యని గానాన్ని పలికిస్తోందిట. ఆ నవీన చేతన విరిబాలలపరిమళాలలో, నెమళ్ళు ఒలికించే నాట్య హొయలులో, తుంటరి తూనీగ గుసగుసలలో కనిపిస్తోందిట.

మొదటి చరణంలో ఆ నవీన భావం ఎక్కడినుండి వస్తోందో చెబుతుంటే రెండవ చరణంలో ఆ భావం నుండి ప్రేరణ పొందిన తన మనసు ఎలా ఉందో వివరిస్తున్నాడు కవి.

తలిరుటాకు మెఱుగుబాకు పదనులో
చిగురాకు లాంటి తన హృదయం పదునైన కత్తిలా మారినప్పుడు

తరంగాల తుఱంగాల కదనులో
ఘనసాధనకొనసాగిన అదనులో
సముద్రంలోని అలలు గుర్రాల్లా కదం తొక్కుతున్నప్పుడు...అదీ ఎలాంటి కదనుట? అలాంటి ఇలాంటిది కాదు...ఘనసాధన కొనసాగిన అదనులో..అంటే గుర్రాలు తీవ్రమైన సాధన చేస్తున్నప్పుడు ఎలా కదం తొక్కుతాయో అలా ఆ అలలు ఉవ్వెత్తున ఎగసిపడితే ఎలా ఉంటుందో అలా ఉందిట అతని మనసు.

ఎంత అందమైన వర్ణన!

ప్రకృతిలోని మృదువైన, మనోహరమైన అంశాలనుండి ఉద్భవించిన నవీన భావాన్ని గ్రహిస్తూ అతని మనసు కదన వేగంతో దౌడు తీస్తున్న గుర్రాలని ప్రతిబింబించే సముద్రపు అలల్లా తేజోభరితమై, ఉత్తేజితమై ఉందిట.

ప్రకృతి శోభను తిలకించిన ప్రతీ మనసు పులకించి అవ్యక్తమైన ఆనందాన్ని నింపుకుంటుంది. కొత్త ఉత్సాహాన్ని పెంపొందించుకుంటుంది. మనసులో విరిసిన ఆ సరికొత్త కాంతి, దానికి ప్రేరణ అయిన అంశాలంత సున్నితంగా ఉండదు. ఉద్వేగ భరితంగా ఉంటుంది..పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. నిజమే కదూ! ఎంత చక్కని భావన! ఇంతటి చక్కటి భావాన్ని తన అందమైన మాటల్లో ఎంత మధురంగా పొదిగారో శ్రీశ్రీ!

పైపాటకు అర్థాన్ని నేను సరిగా వివరించలేదు అనిపిస్తే ఎవరైన సవరించవచ్చు. నేనూ నేర్చుకుంటాను!

ఇంత గొప్ప సాహిత్యానికి మంచి సంగీతాన్ని అందించినవారు ప్రసాదరావు, కేల్కర్ అట. వీరు స్వరపరచిన ఇంకే సినిమా నాకు తెలీదు. కానీ అమరసందేసంలో మాత్రం మంచి మంచి పాటలున్నాయి. వినాలనుకున్నవారు ఇక్కడ వినొచ్చు.

http://www.sakhiyaa.com/amara-sandesam-1954-%E0%B0%85%E0%B0%AE%E0%B0%B0-%E0%B0%B8%E0%B0%82%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/



21 comments:

y.v.ramana said...

పాట బాగుంది.

క్లాసికల్ టచ్ ఎక్కువైంది.

ఆ రోజుల్లో అంతేనేమో!

థాంక్యూ!

ఆ.సౌమ్య said...

@ రమణ గారూ
క్లాసికల్ టచ్ సంగీతానికి? సాహిత్యానికా?
ఏదైనా కూడా ఆరోజుల్లో అంతే కదండీ :)
Thank you!

శశి కళ said...

చాలా బాగా వ్రాశారు...పాట కూడా చాలా బాగుంది...మంచి టేస్ట్....

y.v.ramana said...

పాట పాడిన విధం (కాబట్టి సంగీతమే అనుకోవాలేమో) క్లాసికల్ గా ఉంది.

A.M.రాజా ఇంత బేస్ వాయిస్ లో పాడగా ఎప్పుడూ విన్లేదు. అద్భుతంగా పాడాడు.

నాది కేవలం మీ బ్లాగులో వాగుదాం అన్న ఉత్సాహమే!

కావున నా కామెంట్ మీరు సీరియస్ గా పట్టించుకోకండి.

ఆ.సౌమ్య said...

@ శశి కళ గారూ thanks! :)

ఆ.సౌమ్య said...

@ రమణ గారూ
అయ్యో భలేవారే! మీ అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికే కదా నేను బ్లాగులో పెట్టినది. లేదంటే నేను డైరీలో రాసుకునేదాన్ని. :)

ఆ సంగీతం క్లాసికల్ గా ఉంది...బహుసా అందుకే నాకు నచ్చిందేమో :)

Raja rocks! :D

రాజ్ కుమార్ said...

నేను ఇంకా పాట వినలేదు.
లిరిక్స్ చదివాను. శ్రీశ్రీ గారి స్టైల్ లోనే ఉన్నాయ్. అబ్బా చాలా పదాలు అర్ధం కాలేదే అనుకున్నా. కిందకొచ్చాక మీరు రాసిన భావం చూసి హమ్మయ్య అనుకున్నా.

పాటవినొచ్చి మళ్ళీ స్పందిస్తాను ;)నాకు గుర్తున్నంత వరకూ మీరు సినిమా పాట గురించి వ్యాఖ్యానం రాయటం ఇదే మొదటిసారనుకుంటా? good start :)

ఆ.సౌమ్య said...

@ రాజ్
:) Thanks!
పాట విను, ఇంకా బావుంటుంది.

>>నాకు గుర్తున్నంత వరకూ మీరు సినిమా పాట గురించి వ్యాఖ్యానం రాయటం ఇదే మొదటిసారనుకుంటా?<<
అలా అనేసావేంటి రాజ్! ఒక్కసారి నా బ్లాగులో కుడి పక్కనున్న వర్గాల్లో "పాటలు-సాహిత్యం" అన్న దాని మీద ఒక్క క్లిక్కు క్లిక్కు...ఎన్ని రాసానో కనిపిస్తుంది. :)
ఇంతకుముందు చాలా రాసాను. దీనికిముందు "రాధనురా నీ రాధనురా" పాటకి వివరణ రాసాను. చూడలేదా?
http://vivaha-bhojanambu.blogspot.in/2011/06/blog-post_28.html

రాజ్ కుమార్ said...

సోరీ..;)
ఇప్పుడే చూశా.. ... రాధనురా పోస్ట్ నాకు గుర్తు లేదు. మిగిలినవన్నీ చదివాను.
మరి నాకెందుకిలా అనిపించిందంటారూ? ;) ప్చ్.. మరిచిపోయాను. నా జుత్తు తో పాటూ మెమొరీస్ కూడా రాలిపోయి పోతున్నాయో ఏమో.. ;(

కామేశ్వరరావు said...

"తలిరుటాకు మెఱుగుబాఁకు అదనులో"

ఇది "తలిరుటాకు మెఱుగుబాఁకు పదనులో" అనుకుంటా.

ఆ.సౌమ్య said...

@ కామేశ్వర్రావు గారూ
అబ్బ! ఈ పాట వింటున్న ప్రతీసారి నాకీ డౌటు వచ్చేదండీ..అదను అని రెండు సార్లు వాడారు? శ్రీ శ్రీ కి పదాలు కరువా? అని తెగ అనిపించేది. కానీ నాకెప్పుడూ పదను అని వినిపించలేదు, అదేమిటో! పదను అన్నదే కరక్టు...ఇప్పుడే మార్చేస్తాను. సరి చేసినందుకు ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@ రాజ్
పర్లేదు...అప్పుడప్పుడూ అలా జరుగుతుంటుంది :)

చాణక్య said...

నేను ఈ పాట వినలేదు. సాహిత్యం మాత్రం శ్రీశ్రీగారి స్థాయిలోనే ఉంది.

>>తలిరుటాకు మెఱుగుబాఁకు పదనులో
తరంగాల తురంగాల కదనులో
ఘనసాధనకొనసాగిన అదనులో

ఇటువంటి వర్ణన శ్రీశ్రీకి మాత్రమే సాధ్యమేమో అనిపిస్తుంది. పాట ఎంత బాగుందో మీ వివరణ కూడా అంత బాగుంది. :)

ఆ.సౌమ్య said...

@ చాణక్య
Thanks!
గొప్పదనమంతా శ్రీ శ్రీ దే :)

www.apuroopam.blogspot.com said...

తలిరుటాకు మెరుగు బాకు పదనులో..తరంగాల తురంగాల కదనులో..ఈ మాటలు ఒక్క శ్రీశ్రీ యే వ్రాయగలడు. తలిరుటాకుల్లో మెరుగు బాకు పదనునీ తరంగాల్లో తురంగాల కదనునీ ఊహించడం మహాకవులకే సాధ్యం.శ్రీశ్రీ ఎక్కడైనా మరో లోకపు దారుల్ని వెతుక్కోగలడు. మనల్నీ నడిపించగలడు.మంచి పాటని పరిచయం చేసారు.ఈ పాట సాహిత్యానికి ఇంతకంటె వివరణ ఇవ్వడం ఎవరికైనా కష్టమే.

www.apuroopam.blogspot.com said...

తలిరుటాకు మెరుగు బాకు పదనులో..తరంగాల తురంగాల కదనులో..ఈ మాటలు ఒక్క శ్రీశ్రీ యే వ్రాయగలడు. తలిరుటాకుల్లో మెరుగు బాకు పదనునీ తరంగాల్లో తురంగాల కదనునీ ఊహించడం మహాకవులకే సాధ్యం.శ్రీశ్రీ ఎక్కడైనా మరో లోకపు దారుల్ని వెతుక్కోగలడు. మనల్నీ నడిపించగలడు.మంచి పాటని పరిచయం చేసారు.ఈ పాట సాహిత్యానికి ఇంతకంటె వివరణ ఇవ్వడం ఎవరికైనా కష్టమే.

వేణూశ్రీకాంత్ said...

బాగుంది సౌమ్యా మంచి పాట పరిచయం చేసినందుకు థాంక్స్..

ఆ.సౌమ్య said...

@ గోపాల కృష్ణ గారూ
>>శ్రీశ్రీ ఎక్కడైనా మరో లోకపు దారుల్ని వెతుక్కోగలడు. మనల్నీ నడిపించగలడు.<<
బాగా చెప్పారండీ. ధన్యవాదములు!

@ వేణు
thanks :)

Chandu S said...

పాట వింటూ, మీరు వ్రాసింది చదివాను. మీరు వ్రాసింది చదివితే బాగా అర్ధమవుతుంది. ఈ పాట ఇదే మొదటి సారి వినడం.
ఆ మధ్యెప్పుడో రాధనురా అని వ్రాశారు. అది కూడా మీరు వ్రాసింది చదివితే బాగుంది పాట.

నెలకో పాట ఇలా అర్ధం తో సహా వ్రాయకూడదూ.

ఆ.సౌమ్య said...

@ శైలజ గారూ
ధన్యవాదములు! :)
ఇందులో నా గొప్పేమీ లేదండీ...అవి అంత మంచి పాటలు.
నెలకోసారా :))
ప్రయత్నిస్తానండీ.

Vasu said...

adbhutamgaa undi.
sree sree patala, kavitala nadaka enta bavuntundo..

Music dances in his lyrics.