StatCounter code

Tuesday, March 6, 2012

మా ఊరుకి పుస్తకాల పండగొచ్చిందోచ్చ్!

పుస్తకాలు పుస్తకాలు!
"అటు నేనే ఇటు నేనే" అన్నట్టు ఎటు చూసినా పుస్తకాలు!
ముందుకు వెళితే పుస్తకాలు, వెనక్కి చూస్తే పుస్తకాలు, పక్కకు జరిగితే పుస్తకాలు!

చంద్రుణ్ణి చూసి ఎగిసే అలల్లా మీదకి దూకుతున్నాయి!
తేనెపట్టు మీద రాయేసి కొట్టినట్టు ఝుమ్మన్ని మీదకు ముసురుతున్నాయి!
కలకండ చుట్టూ చేరిన చీమల్లా చుట్టుముట్టేస్తున్నాయి!
వలసపోయే పక్షుల్లా బారులు తీరి ఉన్నాయి!
ఉఛ్వాశనిశ్వాసల్లా ఎగసెగసి పడుతున్నాయి.
ఊపిరి సలపనివ్వకుండా ఉక్కిరిబికిరి చేస్తూ "నన్ను చదువు అంటే నన్ను చదువు" అని పోటీపడుతున్నాయి.

సుమారు 13 లక్షల పైచిలుకు పుస్తకాలు. 2500 స్టాల్స్ ...కనివినీ ఎరుగని రీతిలో పుస్తకాలు. బొమ్మలకొలువులో బొమ్మల్లా అందంగా అమర్చబడ్డాయి 20th Wolrd Boof Fair పుణ్యమా అని. ఢిల్లీ లో ప్రతీ రెండేళ్లకొకమాటు World Book Fair జరుగుతుంది. ఈసారి 25 ఫిబ్రవరి నుండీ 4 మార్చి వరకూ జరిగింది.


26 ఆదివారం మేము వెళ్ళేసరికి ఆ ప్రభంజనం చూసి మా ఊరి పైడితల్లి అమ్మవారి పండుగ గుర్తొచ్చిందంటే అతిశయోక్తి కదు. ఢిల్లీలో పుస్తకప్రియులు ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యమేసింది. ఈ  పండుగ గురించి ఏ రకమైన సమాచారం మాకు తెలీదు. పేపర్ లో చూసి ఆదివారం కదా అని బయలుదేరాం. అడుగుపెట్టగానే "మీకేమైనా సహాయం" కావాలా అని అడిగారు. ఒక Information book 20 రూపాయిలు కొనుక్కొమన్నారు. కొనుక్కుని చూసాం. కళ్ళు గబగబ తెలుగుని వెతికాయి. కనిపించింది కనిపిచింది....యాహూ తెలుగుకి మూడు స్టాల్సు ఉన్నాయట. ముందు అటుపోదాం అని Regional Books ఉన్న హాల్ కి వెళ్ళాము. అది హాలా! దానికదే ఓ పెద్ద భవనంలా ఉంది. ఎన్నెన్ని పుస్తకాలో! తెలుగుకి మూడు, తమిళానికి ఓ పది. మళయాళం, ఒడిసా, మరాఠీ...అబ్బ ఒకటేమిటీ అన్నీను! ఉర్దూ పుస్తకాలైతే ఫ్రీ గా పంచుతున్నారు. ఉర్దూకే అత్యధికం స్టాల్స్.

తెలుగుకి విశాలాంధ్ర, విజయవాడ పబ్లిషర్స్, మంచిపుస్తకం వాళ్ళు స్టాల్స్ పెట్టారు. ఆ ఆదివారం నాటికి విశాలాంధ్రలో మాత్రమే పుస్తకాలు వచ్చాయి. మిగతావి ఇంకా రాలేదు. విశాలాంధ్రలో మంచి కలక్షన్ ఏమీ లేదు. అంటే మంచి పుస్తకాలు ఉన్నాయి. కానీ అక్కడున్నవి చాలామటుకు నా దగరున్నాయి. నాకు కావలసినవి పెద్దగా లేవన్నమాట. :) కానీ పెట్టారన్న సంబరంలో ఏవో కొన్నాను. విశాలాంధ్ర స్టాల్ పెట్టినాయన అనంతపురమునుండీ వచ్చారట- సోమశేఖరెడ్డిగారు.మొత్తం వారం రోజుల పడుగలో మూడురోజులు వెళ్ళాను నేను ఆస్టాల్స్ వైపు రెడ్డిగారు బాగా ఫ్రెండ్ అయిపోయారు. మంచి పుస్తకప్రియులు కూడాను. మేమిద్దరం చాలా పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడొక వింత సంఘటన జరిగింది. మొదటిరోజు నేను పుస్తకాలు చూస్తూ ఇది ఉందా అది ఉందా అని అడుగుతుంటే రెడ్డి గారు సరదాపడి మూలమూలలనుండి పుస్తకాలు తీస్తూ నాతో వాటి గురించి చర్చిస్తూ తిరిగారు. ఈలోగా ఓ పెద్దమనిషి అక్కడకు వచ్చాడు. ఓ 45 ఉంటుందేమో వయసు. ఊరికే కనిపించిన పుస్తకాలన్ని తిరగేస్తున్నాడు. నేను రెడ్డి గారు మాట్లాడుకుంటూ ఉంటే ఇతగాడు నావైపు తెరిగి "మీరు బాచదువుతారా పుస్తకాలు" అన్నాడు. "అవును" అన్నాను. "ఓ మంచి పుస్తకం" చెప్పండి అన్నాడు. ఎదురుగా రమణీయాలు కనిపిస్తే చూపించాను. "ఇవి బావుంటాయా! పి.వి నరసింహా రావు గారు ఏదో రాసారుట మీరు చదివారా" అన్నాడు. "అట, కానీ నేను చదవలేదు,నాకు తెలీదు" అన్నాను. మీ ఇంట్లో బోలడు పుస్తకాలున్నాయా! ఇవన్నీ ఏం చదువుతాం. చదివాక ఏం చెయ్యాలి. మా ఇంట్లో నేనొక్కడినీ ఉన్నాను, చదివేసాక ఏం చెయ్యను ఈ పుస్తకాన్ని. ఎన్నని కొనుక్కు చదువుతాము. అసలు ఏంటివన్నీ...ఏం పుస్తకాలు, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఏవైనా పుస్తకాలు కావాలంటే అడుగుతాను. మీ ఇంటికొచ్చి పుస్తకాలు చూస్తాను." అంటూ అతను మాట్లాడుతుంటే నేను, రెడ్డి గారు తెల్లబోయాం. ఏదో వింత జీవి వేరే గ్రహం నుండి దిగి వచ్చినట్టు అనిపించింది. చదివేసాక పుస్తకాన్ని ఏమి చెయ్యాలా! నాకు బుర్ర తిరిగిపోయింది ఈ ప్రశ్న చూసి. ఎంత కోపం వచ్చిందంటే "అసలు మిమ్మల్ని ఎవడండీ ఇక్కడకు రమ్మన్నాడు?" అని అడగాలనిపిచింది. పుస్తకాలు ఎందుకు చదావాలి అన్న దానిపై చిన్న లెక్చరు ఇద్దామా అని ఆలోచించాను రెండు నిముషాలు. కానీ నాకు అప్పుడు అంత ఓపిక లేదు. పైగా బోల్డు పని ఉంది, ఇంకా బోల్డు పుస్తకాలూ చూడొద్దూ! అందుకే చిన్నగా నవ్వేసి మెల్లిగా జారుకున్నాను అక్కడినుండి. ఆ జిడ్డు మనిషి అక్కడనుండి పోయాడు అని తెలిసాక మళ్ళీ వెళ్ళాను. :) విజయవాడ పబ్లిషర్లు మీద బోల్డు ఆశలు పెట్టుకుని మర్నాడు వెళ్ళానుగానీ ఆశ అడియాశ అయిపోయింది. ఏమీ లేవు అక్కడ. యండమూరి, యద్దనపూడి లేదంటే దేవుడి పుస్తకాలు, అదీ కాదంటే వంటల పుస్తకాలు. ఓ నమస్కారం పెట్టి "మంచి పుస్తకం" లో చూస్తే అన్నీ చిన్నపిల్లల పుస్తకాలే. సరదావేసి కొన్ని కొనుక్కున్నాను.


ఆ తర్వాత ఇంగ్లీషు మీద పడ్డాం. అవేం పుస్తకాలురా నాయనా...తెలుగంటే ఏవి చదవాలో ఏవి వద్దో, నాకేవి నచ్చుతాయో ఏవి నచ్చవో....ఒక జ్ఞానం ఉంది. కానీ ఇవో! ఏవో కొన్ని చాలా ఫేమస్ పుస్తకాలు తప్పితే పెద్దగా తెలీదే :(  సరే చూద్దం అని అడుగుపెట్టాం. అబ్బ అబ్బ అబ్బ...కళ్ళు చెదిరిపోయేలా పుస్తకాలు. అన్నీ చదవాలనిపిస్తుంది. ఏది చదవాలో తెలీదు. ఇది బావుంటుందా...ఏమో కొనేసాక బాగోకపోతే! ఒకవేళ కొనకపోతే మంచి పుస్తకం మిస్ అయిపోతామేమో! అని ఒకటే పీకులాట.

ప్రగతి మైదాన్ అన్న స్థలంలో జరిగింది ఈ పండుగ. ఆ మైదానం మా విజయనగరమంత ఉంటుందేమో అనిపించింది. అందులో మొత్తం 16 హాల్స్. Pages, Oxfor, Penguin, Pacific, Goodwell, Cambridge, Just Read, Om Books, Flipcart....చిన్న చితకా, ముసలి, ముతక అన్నీ రకాల పబ్లిషర్స్ ఉన్నారు. ఆదివారం నాడు మేము రెండు స్టాల్స్ చూసేసరికి మాకు మొహం తిరిగిపోయింది. ఇంకా 14 చూడాలా అని అనుకుంటేనే కళ్ళు తిరిగాయి. ఇంక లాభం లేదని ఆరోజుకి దుకాణం కట్టేసాము. మర్నాడు వెళితే జనం కాస్త తక్కువ ఉన్నారు. కొంచం హాయిగా ఇంకో రెండు హల్స్ తిరిగాము. కొన్ని బుక్స్ కొన్నాము. 

ముఖ్యంగా చెప్పుకోవలసినది Nationla Book Trust గురించీ, Sahitya Academy గురించీ. NBT లో పుస్తకం ధర చాలా చౌక. 20-30 రూపాయలనుండీ ఉన్నాయి పుస్తకాలు. మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. సాహిత్య అకాడమీలో కూడా చాలా భాషల పుస్తకాలు ఉన్నాయి. నేను తెలుగువి కొన్ని కొన్నాను. 


ఈ పండుగకి ఒక ప్రత్యేకత ఉంది. "150 యేళ్ళ రవీంధ్రనాథ్ ఠాగూర్", "100 యేళ్ళ ఢిల్లీ" సంబరాలు జరుపుకుంటున్నాయి. రవీంద్రనాథ్ రచనలు, ఢిల్లీ కి సంబంధించిన రచనలు అనేకం ఉన్నాయి. వీటికి ఎక్కువ స్టాల్స్ కేటాయించారు. 

అలాగే నేను చూసిన అత్యధిక స్టాల్స్ ఓషో వి. ప్రతీ హాల్ లోనూ ఓషో రచనలు, సీడీలతో స్టాల్స్ ఉన్నాయి. అంతేకాకుండా శ్రీలంక, భూటాన్ అంటూ విదేశీ భాషల పబ్లిషర్స్ కి కూడా కొన్ని స్టాల్స్ కేటాయించారు. పిల్లలపుస్తకాలకి మాత్రం ఇది నిజమైన పండుగ. Children Pavilion అని వాళ్లకు ప్రత్యేకంగా ఒకటి పెట్టారు. ప్రతీ హాల్ లోనూ చాలా ఎక్కువ Children's Books ఉన్న స్టాల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎన్నెన్ని పుస్తకాలో! అంబేద్కర్ కి కొన్ని ప్రత్యేకంగా స్టాల్స్. అన్నాహజారే కి ఒకటి. చిన్న, పెద్ద పబ్లిషర్స్ మాత్రమే కాకుండా రోడ్డు సైడ్ పుస్తకాలు అమ్మేవాళ్లలాంటివాళ్లున్నారు. వీళ్లకి స్టాల్స్ ఉండవు. ఏమూల జాగా కనిపిస్తే అక్కడ వాళ్ళ పుస్తకాలు పెట్టేసుకుంటారు. ప్రతీ పుస్తకమూ 100 రూపాయిలు మాత్రమే. చాలా పుస్తకాలు సెకండ్ హేండువి. నాకు హైదరాబాదులో కోటీ సెకండ్ హేండ్ బుక్స్ మార్కెట్ గుర్తొచ్చింది. వీళ్ల దగ్గర కూడా 100 కి కొన్ని పుస్తకాలు కొన్నాము. 

నవ్వు తెప్పించిన ఒక విషయం ఏమిటంటే రిలయన్స్ కూడా ఇందులోకి దిగింది. అచ్చు కూరగాయలు అమ్మినట్టే ఒకటి కొంటె రెండు ఫ్రీ అని. మూడు కొంటే ఐదు ఫ్రీ అని. కొన్నిటి మీద 30% డిస్కౌంట్, కొన్నిటి మీద 10%...ఇలా రకరకాల options పెట్టారు. రిలయన్స్ షాపింగ్ మాల్ లో ఉన్నట్టే. నవ్వొచ్చింది అది చూసాక. :)

ఈ పండుగలో పుస్తకాలే కాకుండా రకరకాల కార్యక్రమాలు జరిగాయి. రోజూ సాయంత్రం ఏవో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. రోజూ ఏదో ఒక పుస్తకావిష్కరణ సభ. రచనావ్యాసంగం గురించీ, పుస్తకాల గురించీ ఏదో ఒక Workshop, Seminar జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ పండుగకి "వందేళ్ళ భారతీయ సినిమా" అన్నది కూడా ప్రత్యేకం. సినిమా గురించి రకరాకల Workshops జరిగాయి. How to Read a Cinema? అనే work shop కి వెళ్ళాము. చాలా అద్భుతంగా ఉంది. అది విన్నాక సినిమాలు తియ్యడం ఇంత కష్టమా అనిపించింది. సినిమాకోసం ప్రత్యేకంగా ఒక హాల్ ఉంది. అందులో సినిమాలకి సంబంధించిన పుస్తకాలన్నీ ఉన్నాయి. ఎక్కువ హిందీ సినిమాల గురించి. తరువాత బెగాలీ సినిమాల గురించి. కొంచం తమిళ సినిమాల గురించి. అంతే. మిగతా భాషల్లో సినిమాలు ఇటువంటి రచనలకు నోచుకోలేదు గాబోలు! రోజూ ఏదో ఒక సినిమా వేసేవారు సాయంత్రం పూట. పథేర్ పాంచాలి, చారుశీల - సత్యజిత్ రే సినిమాలు రెండూ చూద్దాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదు :(. మాల్గుడీ డేస్ కాసేపు చూసాం :) 

మేము వరుసగా మూడు రోజులు సాయంత్రం అక్కడకి వెళ్ళడం పుస్తకాలు చూడడం, ఏవో కొనుక్కోవడం, కొనుక్కోవలసినవటి గురించి ఆలోచించడం ఇదే పని మాకు. :) చివరి రోజులు కదా అని మళ్ళీ 3 మార్చి శనివారం నాడు వెళ్ళాం. ఆరోజైతే ఇసుక వేస్తే రాలనంత జనం. మాకు చాలా విసుగొచ్చింది. కొందరిని చూస్తే వీళ్ళు అసలు అక్షరాస్యులేనా అనిపించేది. వాళ్ల వాలకం అలా ఉండేది...నిజంగా వీళ్ళకి చదవడం, రాయడం వచ్చా అని సందేహమొచ్చింది. పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు తండోపతండాలుగా వచ్చేసారు. పిక్నిక్ కి వచ్చినట్టు వచ్చేసారు. మేము వెళ్ళినట్టే! :)

ఇంతా చేస్తే మేము నాలుగు రోజులు వెళ్ళి చూసినవి మొత్తం 5 హాళ్ళు...అంతే! అవి చూసేసారికే మాకు తల ప్రాణం తోకకొచ్చింది. నిజం చెప్పాలంటే, ఒకానొక సమయంలో పుస్తకాలంటే విరక్తి వచ్చేసింది. బాబోయ్ ఈ పుస్తకాలు నాకొద్దు అని దూరంగా పారిపోవాలనిపించింది. :)

అలా సరదా సరదాగా సాగిపోయింది మా ఊర్లో పుస్తకాల పండుగ! ఇంతమంచి పండుగలో మేము పాల్గొనగల్గినందుకు చాలా ఆనందంగా అనిపించింది. 

మేము కొన్న పుస్తకాలు....

తెలుగు:
సాహిత్య అకాడమీ: కాళోజీనారాయణరావు - పేర్వారంజగన్నాథం, శాస్తి - కాన్హుచరణ్ (ఒడియాఅనువాదం)
తాపీ ధర్మారావు: ఇనుపకచ్చడాలు, రాలు-రప్పలు, దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు?
శరత్‌ సాహిత్యం: దేవదాసు, శ్రీకాంత్, చరిత్రహీనులు
సహవాసి: పంచతంత్రం, బేతాళకథలు, అమ్మ
గణిత విశారద - అవసరాల రామకృష్ణారావు
నామిని ఇస్కూలు పుస్తకం
రైలుబడి - టెట్సుకో కురొయనాగి (తెలుగుఅనువాదం)
జరుక్‌శాస్త్రి పేరడీలు
అనువాద సమస్యలు - రాచమల్లు రామచంద్రారెడ్డి
ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వారుస్వామి
డా.బాబాసాహెబ్ అంబేద్కర్ - చాగంటి తులసి
కాదంబరి - రావూరి భరద్వాజ
మధురాంతకం రాజారాం కథలు - రెండు భాగాలు
గోనగన్నారెడ్డి - అడివి బాపిరాజురచనలు
సిప్రాలి -శ్రీశ్రీ
దక్షిణభారతంలో దేవాలయాలు - వాకాటి పాండురంగారావు (అనువాదం)
కథాసరిత్సాగం - జగన్నాథశర్మ
భమిడిపాటి కామేశ్వరరావు - నాటకాలు
రంగుటద్దాలకిటికీ - ఎస్.నారాయణస్వామి
పండితపరమేశ్వరశాస్త్రి వీలునామా - గోపీచంద్
కథాసరిత్సాగము - జగన్నాథశర్మ
కృష్ణశాస్త్రి సాహిత్యం: వ్యాసావళి - వ్యాసాలు, కృష్ణపక్షము
రాహుల్సాంకృత్యాయన్: ఓల్గానుండిగంగవరకు, మనిషికథ, ప్రాక్పశ్చిమదర్శనాలు

English:
The Summons & The King of Torts - John Grisham
Life of Pi - Yann Martel
Why I am an Athiest? - Bhagat Singh
Indian Food: A Historical Companion - K. T. Achaya
The Monk Who Sold his Ferrari - Robin Sharma
Fall of Gaints - Ken Follet
Piccadilly Jim - Wodehouse
Freedom Struggle - Bipin Chandra
A History of South India - K. A. NilakanthaSastri
The Alchemist - Paulo Coelho
The Immortal of Meluha& The Secret of Nagas - Amish
The Dairy of a Young Gilr - Anne Frank
Twilight in Delhi – Ahmed Ali
The Davinci Code – Dan Brown

ఇంకా చాలా తమిళ పుస్తకాలు :)


31 comments:

A Homemaker's Utopia said...

అబ్బ పుస్తకాల పండుగ గురించి కళ్ళకు కట్టినట్లు చెప్పారు..మంచి మంచి పుస్తకాలు మీ ఇంటికి వచ్చేసాయి..All the best for your reading..Enjoy..:-)

మాలా కుమార్ said...

అబ్బో చాలా కొన్నారే ! మొత్తానికి పుస్తకాల పండగని ఎంజాయ్ చేసారన్నమాట . విష్ యు హాపీ బుక్ రీడింగ్ . ఎంజాయ్ .

C.ఉమాదేవి said...

పుస్తకమంటేచాలు ఎలాగైనా చదివితీరాలనే రోజులు మావి.పుస్తకం మనతో మాట్లాడుతుంది.మనల్ని ఓదారుస్తుంది.మనలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. సాహిత్యమెందుకు చదవాలి అని నేను రాసిన వ్యాసం వీలైతే చదవండి.మీ పుస్తకసంబరం అంబరాన్ని అందుకుంది.

Chandu S said...

ఏది రాసినా మీ శైలి ప్రత్యేకం.

శశి కళ said...

railu badi nakento ishtamaina book sowmya...nuvvu chadivavu anuko nuvvu kooda daani favourate ayipotavu...nice post

జయ said...

మీ ఊరికి కాదండి మీ ఇంటికే పుస్తకాల పండుగొచ్చింది. రాబోయె ఉగాది పండుగ పచ్చడి రుచి మీ రకరకాల పుస్తకాల్లో చూపించారు. ఇంకేం మొదలెట్టేయండి మరి. All the best. Have a nice time. Enjoy yourself.

సుజాత said...

ఇవన్నీ దాదాపుగా నా దగ్గరున్నాయి కానీ NBT వాళ్లవి తెలుగువి ఏం కొన్నావు?
అన్నట్టు ఆ వింత మనిషి ఈ సారి కనిపిస్తే నా దగ్గరికి పంపు!

kri said...

John Grisham, Robin Sharma
Paulo Coelho, Anne Frank, Dan Brown, Ken follot
మంచి సెలెక్షన్ .

Surabhi said...

Sowmya gaaru,
I envy you for your opportunity to go to book fair.
I read every post in your blog but I guess this is my first comment in your blog. I like your thoughts, style and analysis. In dec I was there in Delhi and while thinking of people I know in delhi, you came in to mind as if I know you very well, then realised that I only know you thru your writings. I used to read alot but I have a habit of not coming out of the book for days. Then I also had other responsibilities too which slowed down my reading.
I Wish you to have nice time with your books and find sometime to post your thoughts on the books you read.

Surabhi

రాజ్ కుమార్ said...

హహహ్ మరీ.. అన్ని వేల స్టాల్స్ లో , అన్ని లక్షల పుస్తకాలు చూస్తే విరక్తి వస్తాదేమో లెండీ...

ఆ వింత జీవి పేరేమిటీ?? ఏ "జిల్లా" నో కనుక్కోక పోయారా? ;)

అన్ని పుస్తకాలు కొనేశారా??? సూపరండీ మీరు ;)

ఈ రేంజ్ లో పుస్తకాల సంత జరుగుతుందని తెలీదు సుమండీ..

Anonymous said...

am jealous of you

కొత్తావకాయ said...

పుస్తక ప్రదర్శన అంటే మన గురజాడ గ్రంథాలయం దగ్గర జరిగేదే గుర్తొస్తుంది. ఆన్లైన్ ఎన్ని కొన్నా పుస్తక ప్రదర్శనలో తిరుగుతూ, పుస్తకాలు చేతిలోకి తీసుకుని ఒకట్రెండు పేజీలు తిప్పి చదువుతూ కొనుక్కునే అనుభూతే వేరులే. కుళ్ళొచ్చేస్తోంది పిల్లా నీ మీద. :( సర్లే! హేపీ రీడింగ్. :)

రసజ్ఞ said...

హు హు హు ఇలా ఊరించటం మీకు భావ్యంగా లేదు! హమ్మో అన్నీ కొన్నారా? మీకు తీరికేక్కడ ఉంటుందబ్బా ఇన్ని చదవటానికి? బాగా చదివేసి నాలా కొనుక్కుని చదవలేని వాళ్లకి ఆ సారాన్ని మీ బ్లాగులో పెడితే చదివి ఆనందిస్తాం. శీఘ్రమేవ పుస్తకాల రీడింగు పూర్తిరస్తు ;)

జ్యోతిర్మయి said...

అన్నీ చదివేసి చక్కటి సమీక్షలు వ్రాసేయండి. ఎదురుచూస్తూ ఉంటాము.

Anil said...

"చదివేసాక పుస్తకాన్ని ఏమి చెయ్యాలా!"
చెప్పండి, మీరు పుస్తకాలు కొనుక్కున్నారు. చదివి పారేసారు. చదివిన తరువాత వాటిని ఏంచెయ్యాలి?

ఛాయ said...

పుస్తకాల పండగ..
కళ్ళకు కట్టినట్టుందిగా...

Zilebi said...

>>ఏమీ లేవు అక్కడ. యండమూరి, యద్దనపూడి లేదంటే

ప్చ్... పాపం యండమూరి, యద్దన పూడి వారు ఈ స్థాయి కి వచ్చేసారన్న మాట కాల గతి లో ...

౨. >>>ప్రగతి మైదాన్ అన్న స్థలంలో జరిగింది ఈ పండుగ. ఆ మైదానం మా విజయనగరమంత ఉంటుందేమో

హన్నా... ఈ ఈజీ నగరం వాళ్ళు ప్రగతి మైదానం లో కూడా ఈజీ నగరాన్ని వదలరు సుమీ !!

౩. చదివేసాక పుస్తకాన్ని ఏమి చెయ్యాలి ?

చదివాకండీ, బ్లాగాడాలండీ, బ్లాగాడాకండీ, కామెంటాలండీ, కామెంటాకండీ, రీ-కామెంటు, బ్లాగాడా లండీ.. ఆ పై అండీ, పుస్తకాలని 'ఖాయిలాం కడై' కి వేసేయాలండీ !!

పులో కొల్హో ది కొత్త పుస్తకం ALEPH కొనలేదాండీ ?

చీర్స్
జిలేబి.

ఆ.సౌమ్య said...

@ A Homemaker's Utopia
ధన్యవాదములు! బోల్డు పుస్తకాలు కొనేసానండీ. ఇప్పుడు అవి చదివేవరకూ బెంగే నాకు :)


@ మాల గారూ
మరే, మరే..బాగా ఎంజాయ్ చేసాము. thank you!

ఆ.సౌమ్య said...

@ ఉమాదేవి గారూ
మీ వ్యాసం తప్పక చదువుతానండీ. మొన్న పుస్తకాల పండుగ చూసొచ్చాక "ఈ కాలంలో వాళ్ళకి పుస్తకం చదవాలనే జిజ్ఞాస తగ్గింది" అన్నది తప్పేమో అనిపించిందండీ. ధన్యవాదములు!

@ శైలజ గారూ
thank you :)

ఆ.సౌమ్య said...

@ శశి కళ గారూ
రైలుబడి గురించి బ్లాగుల్లో ఎవరో రాస్తేనే చదివి, కొన్నాను. మీరే రాసారా అది? Thank you!

@ జయ గారూ
హహహ బాగా చెప్పారు, మా ఇంటికే పండగొచ్చినంత సంబరపడ్దాను నేను. Thank you! :)

ఆ.సౌమ్య said...

@ సుజాత గారూ
మీ దగ్గర లేని పుస్తకమా చెప్పండి! :)
NBT వాళ్ళ దగ్గర తెలుగు పుస్తకాలు లేవు. నేను కొన్నవన్నీ ఇంగ్లీషువే.
సాహిత్య అకాడమీ లో తెలుగు పుస్తకాలు కొన్నాను.

@ kri
Thank you! కొనేసాను. ఇప్పుడు చదవడం మొదలెట్టాలి అన్నీ :)

ఆ.సౌమ్య said...

@ సురభి గారూ
మీ కామెంటు చూసి చాలా సంతోషమేసింది. నా బ్లాగు, నా రాతలు మీకు నచ్చినందులు సంతోషం.
డిల్లీ వచ్చి నన్ను గుర్తు చేసుకున్నారా....wow, how lucky I am! :)
You made my day! Thank you so much.
ఈసారి నుండీ నా బ్లాగు చదవడమే కాదు కామెంట్లు కూడా తప్పకుండా రాస్తారని ఆశిస్తున్నా.
నేను చదివినబుక్స్ గురించి తప్పకుండా రాయడానికి ట్రై చేస్తానండీ.
Thanks for the wishes!

@రాజ్
ఆ జీవి ఏజిల్లావాడో తెలీదు బాబు. అసలు వేరే గ్రహమేమో అని నా డౌటు. :P
ఇలాంటి book fairs జరుగుతాయని నాకూ తెలీదు. ఇదే మొదటిసారి. తల తిరిగిందనుకో!

ఆ.సౌమ్య said...

@ కొత్తావకాయ
నువ్వు ఇంకొంచం కుళ్ళుకునే మాట చెప్పానా. ఆ మధ్య మన ఊరెళ్ళాను కదా అప్పుడు గురజాడ గ్రంధాలయం దగ్గర ఉన్న పుస్తక ప్రదర్శనకి వెళ్ళి బోలెడు పుస్తకాలు కొనుక్కున్నానోచ్చ్.
ఇలాంటి ప్రదర్శనలు ఎన్ని జరిగినా,ఎంతగొప్పగా జరిగినా మన ఊరు పుస్తక ప్రదర్శన రూటే వేరు కదా :)

@ రసజ్ఞ
కుళ్ళుకోండి కుళ్ళుకోండి బాగా :))
ఓపిక, తీరిక కొత్తగా చేసుకునేదేం లేదండీ. ఏదో ఒకటి చదవకుండా పడుకుంటే నిద్ర పట్టదు. ఈ మధ్య కలంలో మరీ అలవాటయిపోయింది. :)Thank you!

ఆ.సౌమ్య said...

@ జ్యోతిర్మయి గారూ
అలాగే ట్రై చేస్తాను thank you :)

@ అనిల్ గారూ
చదివి చచ్చినా పారేయనండీ. ఇష్టపడి కొనుక్కున్నవి అదెలా పారేస్తానూ!
నా దగ్గరె బ్ హద్రంగా ఉంచుకుంటాను. మళ్ళీ మళ్ళీ చదువుకుంటాను. నా తరువాతి తరానికి ఆ రుచినందించే ప్రయత్నం చేస్తాను. అదీ కుదరకపోతే ఏ లైబ్రరీకో ఇచ్చేస్తాను. అంతే తప్ప పారేస్తానా! తప్పు తప్పు!

ఆ.సౌమ్య said...

@ ఛాయ గారూ
అంత బారాసానా! :)
ధన్యవాదములు!

@ Zielebi గారూ
1. వాళ్ళు ఏ స్థాయి రచయితలోగానూ నా దృష్టిలో మాత్రం వాళ్ల స్థాయి అదే.
2. హిహిహి ఇజీనారాన్ని ఎలా మరచిపోతామండి. పీల్చే ప్రతీ శ్వాసలోనూ ఉంటుంది.
3. ఇంతకీ ఏం చెయ్యమన్నారు? ;)

లేదండీ ఆ పుస్తకం కొనలేదు. మొదట కొన్నది చదివాక అది కొంటాను.

శ్యామలీయం said...

ఇదంతా చదివాక నా అందమైన బాల్యం గుర్తుకు వచ్చి బాధో సంతోషమో యేదో మొత్తానికి కుదిపేస్తోంది.
నా హైస్కూలుదశకు ఆశ్రయమిచ్చిన కొత్తపేట లోని లైబ్రరీలో ఒక్కపుస్తకంకూడా మిగలకుండా ఆబగా చదివేసిన రోజులు యెంతబాగుండేవో. అలాగే నాకు బహుమతిగా వచ్చిన పుస్తకాలను స్కూలు వార్షికోత్సవకార్యక్రమం ముగిసి యింటికి పోయేలోగా చదివేసే ఆత్రుతకూడా మరల గుర్తుకు వచ్చింది. నా అల్లరి తట్టుకోలేకే కాబోలు నాకు పుస్తకాలు చదవటం అలవాటు చేసిన మా నాన్నగారు గుర్తుకు వచ్చారు. నన్ను పుస్తకాలపురుగని వెక్కిరించే నా ప్రియాతిప్రియనేస్తం మా పిన్ని గుర్తుకువచ్చింది. ఈ జ్ఞాపకాల ప్రవాహంలో ఆనందంగా కొట్టుకుపోతున్నాను. మీ పుణ్యాన యీ రాత్రికి యిక నిధ్రకు సెలవే!

శేఖర్ (Sekhar) said...

Good experience Sowmya Ji...

మధురవాణి said...

ఓ ఓ ఓ ఓ ఓ.. ఎన్నేసి పుస్తకాలో....
ఈ పుస్తకాలన్నీ మీరు చదివాక మాక్కూడా పరిచయం చెయ్యండి మరి.. :)

శివరంజని said...

పుస్తాకాల గురించి రాయలంటే నువ్వే రాయాలి సౌమ్యా .. పిండివంటల గురించి రాస్తే నోరూరునట్టుగా పుస్తకలా గురించి నువ్వు రాసిన విధానం చూస్తుంటే మనసు ఆగడం లేదు అర్జెంట్గా ఆ కొన్నా పుస్తాకలు ఎక్కడ పెడతావో తెలుసుకోవాలి అని ఉంది

ఆ.సౌమ్య said...

@ శ్యామలీయం
చాలా సంతోషమండీ. అన్నిటికన్నా అతి మధురమైనది బాల్యం. మీ బాల్యం పుస్తకలాతో నిండి ఉండడం గొప్ప విశేషం!


@ శేఖర్
Thanks!...yeah it was excellent!

ఆ.సౌమ్య said...

@ మధుర
Thanks...అలాగే తప్పకుండా రాస్తాను :)

@ శివరంజని
Thanks అమ్మాయి...నన్ను పడేసావు నీ కామెంటుతో :)
హహహ నా పుస్తకాలు ఎక్కడ పెడతానో కనుక్కోవడమెందుకు? నేనే చెబుతాను. వచ్చి తీసుకుంటావా మరి? ;)