StatCounter code

Tuesday, April 17, 2012

సా..రీ...గా...మా..పాఆఆఆఆఆఆఅ....

అవి అత్యంత మధురాతి మధురమైన రోజులు....అనగా నా బాల్యము అన్నమాట :)
మా విజయనగరం సంగీతానికి పెట్టింది పేరు. మా ఇంటా, వంటా సంగీతమే..అందరూ బాగా పాడతారు. మా ఇంట్లో ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులున్నారు. చిన్న, చితక,ముసలి ముతక...అందరూ బాగా పాడతారు. నేను పుట్టకముందే నాకు సంగీతం నేర్పించాలని నిర్ణయం అయిపోయింది. నా మొదటి గురువు మా అక్క (పెద్దనాన్నగారి కూతురు - ఇప్పుడు ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు). అప్పట్లో సంగీతం అంటే ఎంత విసుగ్గా ఉండేదంటే....రోజూ క్లాసులు ఎలా ఎగ్గొట్టాలా అని ఆలోచించేదాన్ని. మనకి ముక్కులో గంగ, యమున అని రెండు జీవ నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఎప్పుడు. వాటి మిష పెట్టుకుని సంగీత పాఠాలు సుబ్బరంగా ఎగ్గొట్టేదాన్ని. మా అక్కకి పెళ్ళైపోయి విశాఖపట్నం వెళ్లిపోయింది.  హమ్మయ్య అని నేను గెంతేసాను. కానీ మా అక్క ఎందుకూరుకుంటుంది!....ఇంకో టీచర్ దగ్గర నన్ను పాఠానికి పెట్టేసి వెళ్ళింది. ఆ టీచరు దగ్గర ఓ నాలుగేళ్ళు కొంచం కుదురుగా సంగీత సాధన చేసాను. నేను శ్రద్ధగా, బాగా నేర్చుకున్నది ఆ నాలుగేళ్ళే! నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదుగానీ ఏమిటో ఆ టీచరు దగ్గర బాగా నేర్చుకున్నాను మరి! పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని...మా అక్క దగ్గర వెయ్యాల్సిన వేషాలన్నీ వేసి, వేరే టీచర్ దగ్గర సుబ్బరంగా నేర్చుకున్నాను. :)

నా జలుబు నన్ను వదలట్లేదు...గాత్రానికి ఇబ్బందిగా ఉంది. ఇలా లాభం లేదు, గాత్రం కంటే ఏదైనా వాయిద్యం నేర్పిస్తే మంచిది అని నాకు వయొలిన్ నేర్పిద్దామని నిర్ణయించారు. మా ఊరి సంగీత కాలేజీలో చేర్పిద్దామని ప్లాను. సంగీత కాలేజీలో మనకి తెలియని వాళ్ళు లేరు. అక్కడ అప్ప్లై చేసాము. అప్పుడు నేను 9th వెలగబెడుతున్నాను. అప్ల్లై చేసినవాళ్ళందరినీ ఒకరోజు ఇంటర్వ్యూకి పిలుస్తారు. గాత్ర సౌలభ్యం ఎలా ఉంది, నేర్పిస్తే ఏమైనా వస్తుందా రాదా అని పరీక్షిస్తారు. ఆ కాలేజీలో సన్యాసిరావుగారని గొప్ప వయొలిన్ విద్వాంసులు. ఆయనకి సంగీతం సర్కిల్ లో ఉన్న పేరు "పులి". కళ్ళు లేవు గానీ వయొలిన్ మాత్రం అద్భుతంగా వాయిస్తారు. ఆయన ఎవరికైనా పక్క వాయిద్యం వాయిస్తునారంటే పాడేవాళ్ళు భయపడతారు. అమ్మో పులే, జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకు పాడాలి అనుకుంటారు. అంత మహానుభావుడు. ఇదిగో ఈ ఇంటర్యూ ఆయనే చేస్తారన్నమాట. నాకు ఈ విషయం ముందే తెలిసి కాళ్ళల్లో వణుకు. ఆయనకి నేను పుట్టినదగ్గరనుండీ తెలుసు. మామూలుగా నాకు ఆయనతో మాట్లాడాలంటేనే భయం. ఎంతో ఆప్యాయంగా పలకరిచేవారు కానీ నేను భయపడుతూనే ఉండేదాన్ని. అలాంటిది ఆయన ఇంటర్వ్యూ చేస్తారని వినగానే పై ప్రాణాలు పైనే పోయాయి. అసలే ఇలాంటి పరీక్షలు ఎఱుగను..చిన్నతనం కూడాను.

ఆ రోజుకి ముందే ఒక వారం రోజులు కల్యాణి రాగంలో గీతాన్ని తీవ్రంగా సాధన చేసాను. బ్రహ్మాండంగా వచ్చేసినా కూడా భయం కొదీ విపరీతమైన సాధన చేసాను. ఆ రోజు రానే వచ్చింది. మా నాన్నగారితో పాటు సంగీత కాలేజీకి వెళ్ళాను. ఒక క్లాసు రూములో గురువుగారు కూర్చుని, వచ్చినవాళ్ళల్లో ఇద్దరిద్దరిని లోపలికి పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. నా వంతు వచ్చింది. నేను ఇంకో అబ్బాయి వెళ్ళాము. లోపలికెళ్లగానే "నమస్కారం మేషారు" అన్నాను. నా గొంతు పోల్చేసారు. "సౌమ్య, వచ్చావా...కూర్చో" అని పలకరించారు. నేను, ఆ ఇంకో అబ్బాయి కూర్చున్నాము. ఈ గండం గట్టెక్కేదెలాగో నాకు బోధపడలేదు. అసలు  ఆయన ముందు కూర్చుంటే నా గొంతు పెగులుతుందో లేదో అని భయం! లోపల్లోపల దేవుడికి దణ్ణాలు పెట్టేసుకున్నాను. మాఊరి చిన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో కొబ్బరికాయలు, పైడితల్లి అమ్మవారికి ప్రదక్షిణాలు, అయ్యకోనేరు గట్టు మీద ఆంజనేయస్వామికి రెండు రూపాయిలు మొక్కేసుకున్నాను (అప్పట్లో భక్తి విపరీతంగా ఉండేది). :) కల్యాణి గీతం పాడేసుకున్నాను మనసులో మరోసారి. ఈ తతంగమంతా మనసులోనే కానిచ్చేస్తూ నాతోపాటు వచ్చిన కుర్రాడిని చూసాను. నాకన్న కాస్త పెద్దవాడు. ఎక్కడో చూసినట్టే అనిపించింది. మా విజయనగరం చిన్న ఊరే కదా...దాదాపుగా జనాలందరూ బాగానే తెలుస్తారు. నేనేమో  దేవుడా దేవుడా దేవుడా...అనుకుంటూ ఉంటే ఆ కుర్రాడు మామూలుగా ఉన్నాడు. టెన్షన్ లేదు. నవ్వుతూ, అటు ఇటూ పరికిస్తూ ఆ గది తాలూక దూలాలు లెక్కబెడుతున్నాడు. ఇంతలో గురువుగారు మొదట ఆ అబ్బాయిని పిలిచారు. వెళ్ళి ఆయన ఎదురుగా కూర్చున్నాడు. మొదట పేరు, చదువు వివరాలు అడిగాక

"సంగీతం వచ్చా బాబూ?"

"రాదండీ, నేర్చుకోలేదు."

"అలాగా! పాటలు పాడుతూ ఉంటావా?"

"లేదండీ, పెద్దగా పాడను."

సరే పోనీ, ఏదైనా నీకు తెలిసిన ఒక పాట పాడు."

"సినిమా పాటలే వచ్చు."

"సరే నాయనా, అదే పాడు."

చికుబుకు చికుబుకు రైలే.....అదిరెను దీని స్టైలే!
చక్కనైన చిక్కనైన ఫిగరే....అది ఓకే అంటే గుబులే....

పైశృతిలో మొదలెట్టాడు. నాకు మొదట షాకు, తరువుత నవ్వు. మేషారి వైపు చూసాను. ఆయన మొహంలో ఏ భావమూ లేదు. వింటున్నారు. నాకు నవ్వాగట్లేదు. అసలేంటిది...పాట పాడమంటే అదేనా దొరికింది? జెంటిల్ మేన్ సినిమా అప్పుడే వచ్చింది. పాటలు ఒక ఊపు ఊపుతున్నాయి. అయితే మాత్రం! ఆ పాటా పాడతాడా అంతటి మహా విద్వాంసుడి ముందు? నాకు అంత నవ్వులోనూ కోపం కూడా వచ్చింది. ఏంటసలు బుద్ధి లేకుండా అని కొంచం విసుక్కున్నాను కానీ నవ్వాపుకోవడం నావల్ల కాలేదు. ఆ అబ్బాయి మాత్రం పూర్తిగా లీనమైపోయి పాటంతా పాడేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను నా టెన్షను, భయం అన్ని మర్చిపోయి పూర్తిగా రిలాక్స్ అయిపోయాను :D తెరలు తెరలుగా నవ్వొచ్చేస్తున్నాది. ఇంక అక్కడ కూర్చోలేక మంచినీళ్లకోసమని బయటకి వచ్చి పగలబడి నవ్వాను. బయట మా నాన్నగారు కూర్చున్నారు. ఏమయింది అని అడిగారు. ఆ పాట గురించి చెప్పి ఒకటే నవ్వు. కష్టపడి నవ్వాపుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను. ఆ కుర్రాడు పాట పూర్తిచేసాడు. గురువుగారు ఏమంటారో అని కుతూహలంగా చూస్తూ కూర్చున్నా. ఆయన మాత్రం గంభీరంగా "ఊ" అని మాత్రమే అనేసి ఆ అబ్బాయిని పంపించేసారు. 

ఈ దెబ్బతో నాకు ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వచ్చేసింది. మేరుపర్వతం పై అంచున కూర్చున్న భావం కలిగింది ఎందుకో! నాకు తెలుసు నేను పాడబోయే గీతం గురువుగారిని అలరిస్తుందని...నాకు సీటు ఖాయమని. ఇంక అంతే...ఎనలేని ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంగా, శ్రద్ధగా గీతం పాడాను. ముగించగానే మేషారు చిరునవ్వు నవ్వుతూ

"ఇంత బాగా పాడుతున్నావు, నీకు సీటు రాకపోవడమేమీటి! దీనికేనా మీ నాన్న అంత కంగారుపడిపోయాడు!" అన్నారు చనువుగా.

నాకు పట్టరాని ఆనందం కలిగింది. 

"వెళ్ళిరా, మళ్ళీ వారం నుండీ పాఠాలు మొదలవుతాయి....వచ్చేయ్" అన్నారు.

బయటకి హుషారుగా గెంతుకుంటూ వచ్చేసాను. మా నాన్నగారు కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు కాబోలు ఈ మాట విని చాలా సంతోషించారు.

తరువాతేముంది నేను సంగీత కాలేజీలో చేరడం ఒక సంవత్సరం వయొలిన్ వెలగబెట్టడం...పదో క్లాసుకొచ్చానన్న మిషతో ఎగ్గట్టడం అన్నీ అయిపోయాయి.

ఇంతకీ విషయమేమిటంటే ఆ అబ్బాయికి కూడా సీటు ఇచ్చారు. ఆ అబ్బాయి "చికుబుకు రైలే" అన్నా చక్కగా శృతిలో పాడాడని, నేర్పిస్తే సంగీతం వస్తుందని భావించి సీటు ఇచ్చారు. నేను, తను ఒకేసారి జాయిన్ అయ్యాం. క్లాస్ మేట్స్ అయిపోయాం. తను, నాకంటే ఏడాది పెద్దవాడు. మంచి కుర్రాడు. నన్ను "చెల్లి" అనేవాడు. ఇద్దరికి బాగా పరిచయం పెరిగాక నేనడిగాను "అదేం పాట, గురువుగారి ముందు ఆ పాటెలా పాడగలిగావ్? అని. "నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు. గురువుగారు అలా ఠక్కున ఏదైన పాడమని అడగగానే నాకేం గుర్తు రాలేదు, అంతకుముందురోజు రాత్రి విన్న ఈ పాట తప్ప" అన్నాడు. మా  క్లాసులో అదో పెద్ద జోక్ అయిపోయింది. అందరూ తలుచుకుని తలుచుకుని నవ్వేవాళ్ళం. ఆ అబ్బాయి మొదట్లో కొంచం ఉడుక్కునేవాడుగానీ తరువాత మాతోపాటు నవ్వేసేవాడు. ఆ తరువాత చాలా యేళ్ళు ఈ పాట పేరుతో ఆ కుర్రాడిని నేను ఏడిపించేదాన్ని. ఇప్పుడెక్కడున్నాడో ఏంటో! ఏం పాడుతున్నాడో! :P

ఇదే మా సంగీత కాలేజీ





P.S. అప్పట్లో సంగీతమంటే విసుకున్నానుగానీ ఓ ఇరవయ్యేళ్ళు వచ్చాక సడన్ గా సంగీతం మీద శ్రద్ధ పుట్టింది. కానీ అప్పటికి నేను నేర్చుకునే పరిస్థితి లేదు. ఏదో పాడుకుంటూ ఉండేదాన్ని. మా అక్క నా పాట విని "అయ్యో, ఎందుకే అప్పుడు శ్రద్ధగా నేర్చుకోలేదు?" అని బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ మొదలెడదామంటే ఇప్పటికీ కుదరట్లేదు. ఈ విషయం నాకెప్పుడూ బాధగానే ఉంటుంది....అయ్యో, అన్నీ చేతిలోనే ఉంచుకుని బుద్ధిగా, శ్రద్ధగా నేర్చుకోలేకపోయానే అని! :(

35 comments:

SHANKAR.S said...

సఆఆఆఆ......పఆఆఆఆఆ....సాఆఆఆఆ....మీ సంగీత ప్రస్థానం మొదటి రెండు మైలు రాళ్ళ దగ్గరే ఆగిపోయిందని తెలిసి బాధగా ఉన్నా సౌమ్యుడి గారి అదృష్టాన్ని మాత్రం అభినందించకుండా ఉండలేక పోతున్నాను చెల్లాయ్ గారూ :))))

ఫోటాన్ said...

>>> మనకి ముక్కులో గంగ, యమున అని రెండు జీవ నదులు ప్రవహిస్తూ ఉంటాయి <<<

హ హ హ హహ :)
మా హయాం లో నైలు నది ప్రవహించేది :))

ఫొటోస్ చాలా బాగున్నాయి, పోస్ట్ కూడా,, :))

మాలా కుమార్ said...

పోనీలెండి కొంతైనా నేర్చుకున్నారుకదా . అంతే ప్రాప్తమనుకోవాలి .
పోస్ట్ బాగుంది.

buddhamurali said...

ఇంకెందు కాలస్యం మళ్లీ మొదలు పెట్టండి సంగీత సాదన. పదవీ విరమణ తరువాత కూడా తమకు నచ్చిన కళను నేర్చుకొనే వారు , చదువుకునే వారు చాలా మంది ఉన్నారు .

శేఖర్ (Sekhar) said...

అతను దొరికితే బాగుండు...అనిపించింది చదివాకా....

మీరు ఈ టపా రాస్తున్ననత సేపు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా ఆ రోజులని తలుచుకొని...గుడ్ good

Ravi said...

ఇప్పుడు నేర్చుకుంటే మాత్రం ఏమైంది?
బిజీ అంటారా? అది ఎప్పుడూ ఉండేదే.
మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చాలా బాధ్యతలు ఉన్న పదవిలో ఉండి కూడా వీణ నేర్చుకున్నారట

సన్నజాజి said...

బాగా రాసారు సౌమ్యగారు. కొన్ని అంతేనండీ. దొరకకుండా పొయెదాకా వాటి విలువ తెలీదు. మా నాయనమ్మ,ముగ్గురు అత్తయ్యలు ఎంతో బాగ సంగీతం నేర్చుకుని పాడేవారు. మా నాన్నగారు వయొలిన్,హార్మొనియం వాయిస్తారు,సంగీతంలొ మంచి పట్టు వుంది. నాకు అబ్బితేగా! చిన్నప్పుడు నేర్చుకోకపొవటానికి టాన్సిల్స్ తరచూ ఇంఫెక్ట్ అవటం ఒక కారణం.

కానీ పిల్లలకి మాత్రం ప్రయత్నపూర్వకంగా నేర్పించాలని ఆరాటం. చిన్నప్పుడు వాళ్ళకి తెలీదు.

జ్యోతిర్మయి said...

ఇప్పుడు మళ్ళీ మొదలెట్టెయ్యండి సౌమ్యగారూ. ఆసక్తి వుంటే మిగలిన విషయాలు అడ్డురావు.

రసజ్ఞ said...

అంతే సౌమ్య గారూ మన దగ్గర ఉన్నప్పుడు మనకి విలువ తెలియదు. మా పిన్నులిద్దరూ సంగీత విద్వాంసులు, వీణలో డిప్లోమ కూడా చేసి ఎన్నో కచేరీలిచ్చారు. నేను గాత్రం ఏదో వెలగపెట్టా కొన్నేళ్ళు కానీ వీణని మాత్రం ముట్టుకుంటే ఒట్టు. ఈ తీగలకి వెళ్ళు కోసుకుపోతున్నాయే వద్దే అని ఒకటే ఏడుపు. అన్నట్టు నాకెప్పటినుంచో ఒకటే సందేహం అసలు ముందు సరిగమలు నేర్పటప్పుడు మాయామాళవ గౌళ రాగమే ఎందుకు మొదలెట్టాలి తేలికగా మోహనతో మొదలెట్టచ్చుగా (నాకు మోహన ఇష్టం లెండి!)???? అని! మీ టపా కేవ్వ్వ్ చాలా బాగా వ్రాశారు.

మరువం ఉష said...

సౌమ్యా, నాది నృత్యం లోకి దూకి సంగీతం వదిలేసిన తంతు. :) కానీ, మీ సహ విద్యార్థి 'అన్న' గారిలా సినిమా పాటల్లో దిట్టననుకోండి. అది వేరే విషయం. కలిసి సాధన మొదలుపెడ/దామా/తారా? ;)

రవిచంద్ర, సాయం వేళల్లో కలాం గారి వీణా సాధన సమయాన ఆ స్వరాలు వింటూ అక్కడే పచ్చికలో తిరుగాడిన భాగ్యం నాది. నేను రక్షణ శాఖలో శాస్త్రవేత్తగా ఉన్నపుడు, ఆయనకి సమీపాల్లో మెసిలే సమయాలు దక్కాయి.

కొత్తావకాయ said...

బాగున్నాయి సరిగమల కబుర్లు. :)

సంగీత కాలేజీ గోపీచందనం రంగులో ఉంటేనే బాగుంటుంది. కదూ! :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>> "అయ్యో, ఎందుకే అప్పుడు శ్రద్ధగా నేర్చుకోలేదు?"

అయ్యో అంత మాట అనేసారా ఆమె?
డిల్లీ రావాలంటే భయంగానే ఉంది మరి..... దహా.

Anonymous said...

మహారాజా కళాశాల మహారాణీ అన్నమాట మీరు... :)

సుజాత వేల్పూరి said...

ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో ఇలాంటి కఠోర సాధనలు విసుగు పుట్టిస్తాయి కానీ, వాటి విలువ తెల్సే సరికి చేతి వేళ్ళ సందుల్లోంచి జారిపోయిన కాలం వెక్కిరిస్తూ కళ్ళ ముందు నిల్చుంటుంది.కానీ సంగీతానికి వయసుతో పని లేదు కాబట్టి ఇప్పుడైనా కాస్త తీరిక చూసుకుని (సృష్టించుకుని)మళ్ళీ ప్రారంభించ వచ్చు!

రాజ్ కుమార్ said...

ఇలా సంగీతం నేర్చుకున్న వాళ్ళనీ, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నోళ్ళనీ చూస్తే అసూయగా ఉంటాదండీ...
దానికి ఇంట్రస్ట్ తో పాటూ చాలా ఉండాలనుకుంటా... అప్పటికీ ఇంటర్లో ఫ్లూట్ కొనుక్కొని సరిగమల వరకూ ఊదటం మొదలెట్టానా..? రెండ్రోజ్లు బా వాయిస్తున్నావని అన్నారు. ఆ తర్వాత "ఆపరా.. దరిద్రుడా.. తలనొప్పొచ్చేస్తుందీ.పొయ్యి లో గొట్టంతో గాలూదుతున్నట్టూ తెగ ఊదేస్తున్నావ్ గానీ" లాంటి డైలాగ్స్ తో నాలోని ఫ్లూటీస్ట్ ని తొక్కేశారండీ.. తొక్కేశారు.
[ఇది మనకి రాదులే అని నేనే ఆగిపోయా..]

ఆ అబ్బాయ్.. చికుబుకు రైలే పాడేడు కదా.. నేను చిన్నప్పుడూ "పుణ్యభూమి నాదేశం నమోనమామీ...." అని పాడేవోణ్ణీ ;)

అయితే బాలమురళి గారి చేత క్లాసులు మాత్రమే అనుకున్న్నా.. చిన్నప్పటీనుండీ నేర్చ్కున్నారా? బాగు బాగు.

మనసు పలికే said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

నా సంగీత సాధన గుర్తొచ్చింది సౌమ్య గారూ :)) టపా చాలా బాగుంది. నిజంగా, వయొలిన్ వాయించడం భలేగా ఉంటుంది కదూ. నా వరకైతే అదొక మరపురాని అనుభూతి. ఇప్పటికీ ఇంకా నేర్చుకోవాలని ఉంటుంది.:))

Lakshman .M. V. said...

మీ టపా చాలా బాగుంది. సంగీత కళాశాల చిత్రాలు చాల బాగున్నాయి, ఇంకా వుంటే పోస్ట్ చేయండి. మీ సంగీత ప్రయాణం మళ్ళీ కొనసాగాలని ప్రార్ధిస్తూ...

చాణక్య said...

సౌమ్యగారూ పోస్ట్ సూపర్! సంగీతకళాశాల ముందు నుంచి నడిచినప్పుడల్లా అప్రయత్నంగా అలా లోపలికి తొంగి చూస్తుంటాను. ఎంత మంది సంగీత పారంగతులకు జన్మనిచ్చిన మహాతల్లి అనిపిస్తుంది. విజయనగరవాసులు తరాలపాటు గర్వంగా చెప్పుకోదగ్గ సంపద మన సంగీత కళాశాల.

శ్రీనివాస్ పప్పు said...

పోస్ట్ సూపర్.మహరాజా సంగీత కళాశాల పేరు వింటేనే ఒళ్ళు పులకరించిపోతుంది,అందులో రూపు దిద్దుకున్న కళాకారులూ అంతే అదృష్టవంతులు.

సిరిసిరిమువ్వ said...

ఇప్పుడు మాత్రం ఏమయింది..మళ్లీ మొదలెట్టు సౌమ్యా...నీకు ఆసక్తి ఉంది కాబట్టి చెయ్యగలవు..ఈ బిజీ.బిజీ జీవితాలు ఎప్పుడూ ఉండేవే!

తృష్ణ said...

నిన్న హడావుడిలో చదవటం కుదరలేదు...మీ టపా నన్ను ఎన్నో పాత జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళింది..

నాది ఇంచుమించు ఇదే కథ..ఇంట్లో అందరూ సంగీతం పాడేవాళ్ళే. నేను మా స్కూల్ కాయిర్ గ్రూప్ లో ఉండేదాన్ని..కాలేజీలో లీజర్ పిరియడ్ వస్తే పాడమని నా చుట్టూ చేరేవాళ్ళు అంతా.. విజయవాడలో నేను బాలమురళిగారి శిష్యులు శ్రీ డి.వి.మోహనకృష్ణగారి వద్ద నేర్చుకున్నాను కొన్నాళ్ళు..మంచి గురువు దొరకటం కూడా అదృష్టం అని అప్పుడు తెలీదు..:((కొన్ని వర్ణాలు అయ్యాకా .. సంగీతం విలువ తెలియక వెళ్లటం మానేసాను...ఇప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా మా పాపకు సంగీతం నేర్పిస్తూ, దానితో పాటూ ఇంట్లో గొంతు కలుపుతున్నా..!

శివరంజని said...

అయ్యో సౌమ్యా ఎంతో అవకాశం ఉండి కూడా నేర్చుకోలేకపోయావా ..... అబ్బా నాకు చిన్నప్పటినుండీ చాలా ఇంటరెస్ట్ పాటలంటే ....మాది బాగా పల్లెటూరు కావడంతో అక్కడ సంగీతం మాష్టారులు ఎవ్వరు లేరు

విజయనగరం అంటే ఊరా ? నేను ఇంకా జిల్లా మాత్రమే అనుకున్నా ఇన్నాళ్ళూ .. నా నా అజ్ఞానాన్ని మన్నించు :)))))))

శశి కళ said...

ఏమి పర్వాలేదు...మళ్ళా నేర్చుకో సౌమ్య...నాది గ్యారెంటీ....ఏమి కధనం ...కేక...

Kottapali said...

Nice.
క్లైమాక్స్ కొంచెం యాంటీ క్లైమాక్స్ అయింది - ఆ చికుబుకు కుర్రాడు ఇప్పుడేదో పేద్ద గాయకుడు అని చెప్తారేమో అని ఎదురు చూశాను.
సంగీతం నేర్చుకోకపోవడం ఇప్పటికీ నా జీవితంలో పెద్దలోటుగా భావిస్తుంటాను. రిటరిమెంటు అంటూ ఉంటే .. అప్పుడైనా .. మనిషి ఆశాజీవి!
బైదవే, శ్రీమతి మండా సుధారాణి గారు సుమారు 5-6 ఏళ్ళ కిందట అమెరికా పర్యటించినప్పుడు రెండు కచేరీలు విన్నాను. తెలుగు జాతి గర్వించదగిన విద్వాంసుల్లో ఒకరామె. చెన్నై సర్కిల్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారని వినికిడి.

Kottapali said...

@ రసజ్ఞ - very valid point. That is exactly what they do in Hindustani. They start with Bhopali. మాయామాళవగౌళలో స కి, రి కి అసలు ఎడం తెలియదు కొత్తల్లో.

@తృష్ణ .. పాపానికి ప్రాయశ్చిత్తంగానా? హ హ హ. ఎన్ని జన్మల పుణ్యఫలమో అనుకోండి, పాప సంగీతం నేర్చుకుంటున్నందుకు. :)

ఆ.సౌమ్య said...

@ శంకర్ గారూ
హహహ...ఏదో కొద్దికాలానికి తప్పించుకున్నాడు. మళ్ళీ మొదలెడతాగా :))

@ ఫోటాన్
thanks హర్ష!
నైలు నది...హహహ అంటే నువ్వూ మన బాపతేనన్నమాట :)

@ మాలగారూ
thanks అవునండీ...ఇప్పటికి అదే ప్రాప్తం :)

ఆ.సౌమ్య said...

@ బుద్ధ మురళీ గారూ
అదే అనుకుంటున్నానండీ, కానీ ముహూర్తం కుదరట్లేదు. త్వరలో పూనః ప్రారంభిస్తాను !

@ శేఖర్
అవును, ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి. భలే ఆనందం గా అనిపించింది. కానీ ఇంకో పక్క బాధగా కూడా అనిపించింది అలా సంగీతాన్ని వదిలేసినందుకు :(

@ రవిచంద్ర
అవునుట. వాళ్ళందరే నాకు inspiration!

ఆ.సౌమ్య said...

@సన్నజాజి
ధన్యావాదములు! నాకూ అచ్చు ఇదే టాన్సల్స్ సమస్య ఉండేది. జలుబు దానితో శ్రద్ధ లేకపోవడం అన్నీను. మీ పిల్లలకి తపక నేర్పించండి. చిన్నప్పుడు వాళ్ళు కొంచం ఇష్టపడకపోయినా కొన్నాళ్ళ తరువాత ఎంజాయ్ చెయ్యడం మొదలెడతారు.

@జ్యోతిర్మయి గారూ
ఆసక్తి కొండంత ఉందండీ...టైమే గోరంత కూడా దోరకట్లేదు. కాని మొదలెట్టాలనే పట్టుదల ఇప్పుడిప్పుడే కాస్త పెరుగుతోందిలెండి :)

@ రసజ్ఞ
హహహ్హహ మీరూ, నేనూ ఒకటే బేచన్నమాట. :))
మొహన కంటే మాయామాళవగౌళ నేర్చుకోవడం సులువు కదండీ. మొదట్లో అన్ని స్వరాలు పాడడం సులువువుతుంది. మోహన, కల్యాణిలాంటివాటిఓ కొన్ని స్వరస్థానాలు వదిలేసి పాడడం కష్టమౌతుంది కదా అందుకే మాయామాళవగౌళ తో మొదలెడతారు.

ఆ.సౌమ్య said...

@ ఉష గారూ
హహహ్హ మొదలెడదాం....సందేహమేల! ఎప్పుడో చెప్పండి సాధన మొదలెట్టేద్దాం :)
ఇప్పుడు నా పరిస్థితీ సినిమా పాటల దగ్గరకే వచ్చేసిందిలెండి...గమకాలు అవీ పలకడం కష్టమౌతోంది కూడాను :))

వావ్..కలాం గారి వీణాసాధన వినేవారా...భలే! హాయిగా ఉండి ఉంటుంది కదండీ మీకు!

@ కొత్తావకాయ్
అవును, పసుపు రంగే బావుంది. అన్నట్టు మన స్కూలులో పాటల పోటీలు గుర్తున్నాయా నీకు? ఒకసారి రామసుధకి మొదటి బహుమతి, నాకు రెండు, నీకు మూడో/నాలుగో వచ్చినట్టున్నాయి కదూ!

@ బులుసుగారూ
హహహ మరే అంత మాటే :))
అబ్బెబ్బే మిమ్మల్ని ఆట్టే ఇబ్బంది పెట్టను ఢిల్లీ వస్తే.....ఒక్క పది, ఢెభై పాటలు మాత్రం పాడతాను :D

ఆ.సౌమ్య said...

@ సుజాత గారూ
భలే చెప్పారండీ...ఇప్పుడలాగే వెక్కిరిస్తోంది కాలం నన్ను :(

@ఫణీంద్ర గారూ
హహహ మహారాణి ని కాదుగానీ ఆ రాజ్యంలో ఒకర్తిని :))


@ రాజ్
ఆయ్ నేను కూడా కొన్నాళ్ళు ఫ్లూట్ తో కుస్తీపడ్డాను. వయొలిన్ ఎలాగూ పోయింది కదా అని వేణువులు కొనుక్కుని ఊదడం మొదలెట్టాను. నా సొంతం గా ప్రారంభించాను. బాగానే వచ్చింది. నేను మొట్టమొదట వాయించినది ఏమిటో తెలుసా?? జనగణమణ...అంతే జైహింద్ కొట్టేసాను అప్పుడే :)))

ఆ.సౌమ్య said...

@ అప్పు
నువ్వు కూడా వయొలిన్ నేర్చుకున్నావా?? మరి చెప్పావు కాదేం. అయితే ఈసారి హైదరాబాదులో మనవాళ్ళందరికీ మనిద్దరి వయొలిన్ వినిపిద్దాం ఏం :))

@సంఘమిత్ర గారూ
ధన్యవాదములు! నా కోసం ప్రార్థిచినందుకు thanks. ఇంకా చాలా విశేషాలున్నాయండీ. మళ్ళీ రాస్తాను.

@చాణక్య
thanks! కదా అసలు మన ఊరు, సంగీత కాలేజీ అవన్నీ తలుచుకుంటేనే ఏదో శక్తి ఆవహిస్తుంది కదా! మనం అదృష్టవంతులం కదూ! :))

ఆ.సౌమ్య said...

@ పప్పుసారూ
అవును, అలాంటి కళాశాలలో అడుగుపెట్టడమే ఓ వరం! :)

@ వరూధిని గారూ
అవునండీ, మొదలెట్టాలి..త్వరలో!

ఆ.సౌమ్య said...

@ తృష్ణ గారూ
సేమ్ పించ్...నాలాగే అన్నమాట. అవును చేతిలో ఉన్నప్పుడు వాటి విలువ తెలీదు :)
పోనీలెండి మీ అమ్మాయికి నేర్పిస్తున్నారుగా...చాలా సంతోషం!

@ శివరంజని
నువ్వు చిన్నపిల్లవని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటునావు :))
విజయనగరం జిల్లాయే తల్లీ. ఊరు కూడా ఉంది. జిల్ల హెడ్ క్వార్టర్స్ పేరు కూడా విజనగరమే...అదే మా ఊరు. :))

ఆ.సౌమ్య said...

@ శశికళ గారూ
thanks...నేర్చుకుంటానండీ :))

@ నారాయణ స్వామి గారూ
అబ్బే లేదండీ...నాకు తెలిసీ ఆ కుర్రాడు సంగీతం మానేసుంటాడు :))
తప్పక నేర్చుకోండి...సంగీతం ఏ వయసులో నేర్చుకున్నా పొందాల్సిన ఆనందం పొంది తీరుతాము.

స రి గ మ అని వరుసగా నేర్చుకుంటేనే పోను పోను స కి మధ్యలో రి వదిలేసి గ ని శృతిలో అనగలుగుతాము. అందుకే మాయామాళవగౌళ తో మొదలెడతారనుకుంటా!

ఏల్చూరి మురళీధరరావు said...

శ్రీ సౌమ్యగారికి
నమస్సులతో,

మీరు “అచ్చతెలుగు పదాలు” అని వ్రాసిన వ్యాసాన్ని, ఈ అధునాతన విజయనగరం సంగీత కళాశాల జ్ఞాపకాలను, ప్రసక్తానుప్రసక్తంగా మీరు వ్రాసిన వ్యాసాలు మఱికొన్నింటిని చదివి చాలా ఆనందించాను. విజయనగరం సంగీత కళాశాలలో చదువుకొన్న విద్యార్థులు, బోధించిన ఉపాధ్యాయులు, పాలకవర్గ సభ్యులు, శ్రీ ఘంటసాల గారి కుటుంబం, అక్కడి సెమినార్లలో పాల్గొన్నప్పుడు కలిసిన విద్వాంసులు, కవులు - జ్ఞాపకానికి వచ్చి ఎంతో సంతోషం కలిగింది.

మీ రచనలలో ఒక తెలుగుతనంతో నిండిన ఆత్మీయత, నిండైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నాయి. అందుకు మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు.

క్రీస్తుశకం 16-వ శతాబ్దంలో ఒకనాడు నన్నయగారు వద్దనుకొన్న అచ్చతెలుగు ఉద్యమం తెలుగులో పుట్టి - పూర్తిగా విఫలమైపోయింది. మీరు పేర్కొన్న పదాలలోనూ అనేకం “అచ్చ”తెలుగు లేదా “ద్రావిడ”పదాలు కావు. “ప్రొద్దు” అన్నది సంస్కృతంలోని “బ్రధ్న” శబ్దభవం. తల్లి మనికి కంటె పిల్ల ఉనికి నచ్చితే – అది కేవలం మీ వ్యక్తిగతమైన అభిమానం. కన్నడ కావ్యాలలో “శుభోదయం” 12-వ శతాబ్ది నాటికే రూఢమై ఉన్నది. “మేలిపొద్దు” (లు ఎందుకు?) చక్కటి పదబంధం. అది శుభోదయం కంటె మీకు ఎక్కువగా నచ్చడం కేవలం మీ అభిరుచివిశేషం మాత్రమే.

సంస్కృతం “పరాయి” అని; ద్రావిడభాషలు “మనవి” అన్న ఆలోచన బిషప్ కాల్డ్వెల్ కల్పించినంత దాకా మన తెలుగువారికి రాలేదు. ఆయన ప్రతిపాదించినంత మాత్రాన అది శాశ్వతసత్యం కానక్కరనూ లేదు. “ద్రవిడభాష నుంచి ఆర్యభాషను వేరుచెయ్యడం” వల్ల తమిళులు సాధించినదేమీ లేదు. తమిళ భాష సంస్కృతానికి దూరంగా బ్రతకాలనుకొని – విస్తృతమైన ఆ భాషాసాహిత్యాల ప్రభావానికి సుదూరంగా ఉంటూ ఎంత కోల్పోయిందో - శతాబ్దాల తరబడి వారి శూన్యసాహిత్యమే చెబుతుంది. పంచకావ్యాలలోనే దేశీయత కలిగిన శిలప్పదిగారం, మణిమేగలై లను నిలుపుకొని; సంస్కృతప్రభావం కలిగిన వలయాపతి, కుండలకేశి, జీవకచింతామణి కావ్యాలను వద్దనుకొన్నారు. ఆ నష్టం ఎవరిది? వాళ్ళకు వెయ్యేళ్ళ తర్వాత పుడితే ఏమి? తెలుగులో ప్రతి యాభైయేళ్ళకూ ఒక మహాకవి, ఒక యుగపురుషుడు ఉండగా – సుమారు ఒక వేయి సంవత్సరాలు వాళ్ళు ఏ ప్రభావశీలి రచనా లేకుండానే నిష్కామంగా లఘురచనలతో కాలం గడపవలసి వచ్చింది.

వ్యవహారంలో కాని; శిష్టసాహిత్యంలో కాని – ఏది సారవంతమో, ఏది విశ్వతోముఖమో – ఆ ప్రయోగం వాడుకలో నిలుస్తుంది. వ్యక్తుల ఉద్యమాలు, వైయక్తిక ఉద్యమాలు భాషను ఎక్కువ కాలం ప్రభావితం చేయవనేది చారిత్రిక సత్యం. ఒకవేళ చేసివుంటే ఆ భాషకు అపకారమే జరుగుతుంది కాని లాభం చేకూరదు. వేఱొక ఇంటిపేరు కలిగిన వధువు వివాహం అయిన తర్వాత మనయింటికి వచ్చి మనలో కలిసిపోయి, మనందరి అభిమానాన్నీ చూరగొన్నట్లే - సంస్కృతం నుంచి వచ్చి మనదైన తెలుగు పదం కూడా మనకు అంతే ఆదరణీయం.

మీరు ఢిల్లీలో ఉన్నారని తెలిసి ఎంతో సంతోషం కలిగింది. నేనూ ఇక్కడే ఉంటూ భాషాభిమానంతో కొంత కృషిచేస్తున్నందువల్ల – అభినందనపూర్వకంగా వ్రాయాలనిపించింది.

సర్వ శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావు