StatCounter code

Friday, January 15, 2010

పెద్దపండగ-సంక్రాంతి

సంక్రాంతి పండగంటే నాకు చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టం. ఆ సంబరాలే వేరు. అందుకే దాన్ని పెద్ద పండగ అంటారు. పండక్కి ఎంచక్కా బడికి శెలవులిచ్చేస్తారు. హాయిగా పది రోజులు ఆడుతూ పాడుతూ గడిపేస్తూ ఉండేవాళ్ళం చిన్నతనంలో. పెద్దపండగ వస్తుందంటే నెల రోజుల ముందు నుండి హడావుడి మొదలవుతుంది.

అసలు ఈ పండగకి దేవుడితో కన్నా జీవుడితో సంభందాలు ఎక్కువ, అందుకే హ్రుదయానికి దగ్గరేమో. ధాన్యాలు ఇంటికి చేరేవేళ, కొత్త బియ్యం ఎసట్లో పొంగేవేళ, ఇంటి ముందు గొబ్బెమ్మలు కూర్చునేవేళ, పిన్నపెద్ద కలిసి ఆడేపాడేవేళ, సంక్రాంతి శోభలు ఇంటింటా విరజుల్లుతూ ఉంటాయి.

సంక్రాతికి సరీగ్గా నెలరోజులకి ముందు మా విజయనగరం మూడుకోవెళ్ళలో నెలగంటు పెట్టడంతో ఆరంభమయ్యేవి మా ఉత్సవాలు. అదేమి లెక్కోగానీ అప్పటునుండి సంక్రాంతివెళ్ళేవరకు ఇంటిముందు ముగ్గులు వెయ్యడం ఆనవాయితీ. ఈ ఆవాయితీ అంటే నాకు మహా పట్టింపు ఉండేది ఎందుకంటే చక్కగా ముగ్గులు పెట్టేసుకోవచ్చు నెలరోజులునూ. ఆ నెలరోజులు పెట్టే ముగ్గులకోసం 4-5 నెలల ముందు నుండి ముగ్గులు సేకరించేవాళ్ళం నేను మా చెల్లి కలిసి. ముగ్గుల పుస్తకాలు కొని, ఈనాడు పేపర్లో వచ్చే ముగ్గులను కట్ చేసి భద్రపరిచేవాళ్ళం. ఇక వాటిని కష్టపడి నేర్చుకోవడం, నేను వేస్తానంటే నేను వేస్తానని మా అక్కచెల్లెళ్ళం పోటీ పడడం జరిగేది. పోటీ నామమాత్రమే. పెద్దదాన్ని కనుక నేనే గెలిచేదాన్ని ఎప్పుడూ. 6 చుక్కలుతో ప్రారంభించి 12, 15 అలా 20 చుక్కల ముగ్గు వరకు వేసేదాన్ని. ఇంటిముందు పేడ కలిపిన నీళ్ళని కళ్ళాబి జల్లి(మా ఊర్లో అలాగే అంటారు) శుభ్రపరచడం మా ఎదురింటి పాలు పోసే ఆవిడ వంతు. ఆవిడ ఉదయం ఆ పని చేస్తే నేను సాయంత్రం మళ్ళీ మాములు నీళ్ళతో కళ్ళాబి జల్లి మొదలెట్టేదాన్ని ముగ్గులు. నాకు సాయం మా చెల్లి, నాన్నగారును. చుక్కలు పెట్టి ఎన్నిసార్లు చెరిపుంటానో నాకే తెలీదు. వంకరగా వచ్చాయని, ఎక్కువయ్యాయని, తప్పు పెట్టానని కారణాలు బోలెడు. అది సరిగ్గా పుస్తకం లో ఉన్నట్టు రాకపోతే నాకు నిద్ర పట్టేదికాదు. అసలు రాత్రంతా మరునాడు పెట్టబోయే ముగ్గు కోసం కలలుకనేదాన్ని. మా లంకవీధిలో నాదే పెద్దది, అందమయినది అయిన ముగ్గు అనిపించుకోవలని కోరిక. కానీ నాకంటే పెద్దవాళ్ళయిన భవాని, సుశీల, సునీత (పక్కింటి, ఎదురింటి అక్కలు) బాగా వేసేవారు. ఎవరు ఎలా వేసినా మా నాన్నగారు మాత్రం నా ముగ్గే బ్రహ్మాండం అనేవారు. ఆయన చెప్పినదాన్లో నిజం లేదని నాకు తెలిసినా, అలా ఆయనచేత అనిపించుకుంటే నాకదో తుత్తి. అలా మొదలయిన ముగ్గుల కథ, జనవరి 1 నాడు పెద్ద రంగులముగ్గు వెయ్యడంతో సగం పైగా మెట్లెక్కేసేది, చివరాఖరి మెట్టు సంక్రాంతి ముగ్గన్నమాట.

ఇక పండక్కి రెండు జతల బట్టలు కొనుక్కోవడం,కొత్త గాజులు, కొత్త రిబ్బన్లు,రంగురంగుల సైడుపిన్నులు, కొత్త చెంకీ బొట్టుబిళ్ళలు, ముగ్గులకి రంగులు, చెంకీలు లాంటివి మా అమ్మ, నాన్నగార్లతో బజారుకి వెళ్ళి కొనుక్కోవడంతో భోగీ రానే వస్తుంది. భోగీ అంటే మా తాతగారికి చెప్పలేని భయం. మా ఇంటి దొడ్డి తలుపు, వీధి తలుపు చెక్కతో చేసినవి, చాలా బలహీనంగా ఒక తాపు తంతే పడిపోయేలా ఉండేవి. మా వీధి కుర్రాళ్ళు, పిల్లలు భోగీమంటలకోసం కర్రలు సేకరించేవాళ్ళు వారం రోజులముందునుండి. ఆ కుర్రాళ్ళెవరైనా అర్ధరాత్రి వచ్చి మా తలుపులెత్తుకెళ్ళిపోతారేమోనని ఆయన భయం. అందుకని భోగీ ముందురోజు తెల్లవార్లు ఆ తలుపులకి కాపలా కాసేవారు. ఎవరైనా ఎత్తుకుపోతే మళ్ళీ చేయించుకుందాంలెండి, వెళ్ళి పడుకోండి అని మా నాన్నగారు ఎన్నిసార్లు చెప్పిన ఆయన ఏ భోగీ కి వినేలేదు. ఆయనకి మనసంతా ఆ ఇల్లే. ఇల్లాలి కోరిక మేర తాతల నుండి వారసత్వంగా వస్తున్న ఇంటిని పోగొట్టుకోకూడదని, తను కొని నిలబెట్టుకున్న ఇల్లు అది. ఆ ఇల్లే ఆయనకి సర్వస్వం....ఆ ఇంట్లో పుట్టడం నా అద్రుష్టం.

భోగీనాడు తెల్లవారుఝామున నాలుగు గంటలకి లేచి మా లంకవీధిలో రామాలయం ముందు వేసే భోగీమంట దగ్గరకి వెళ్ళేవాళ్ళం. చెప్పొద్దూ, ఆ మంటలు నిజ్జంగా ఆకాశాన్ని తాకేవి ! ఒక వైపు చిన్న చలి, ఇంకో వైపు వెచ్చని మంటలు, ఒక చిన్న దుప్పటి కప్పుకుని ఆ మంటలముందు హాయి హాయి గా కూర్చుని చలి కాచుకునేవాళ్ళం. వీధిలోవాళ్ళంతా చేరి ఇంకా కర్రపుల్లలు వేస్తూ మంటని ఎగదోస్తూ ఉంటే ఆ అనుభూతే వేరు. అలా మెల్లిగా పొద్దెక్కాక, మంట కాస్త చల్లరాక, ఎవరింటి నుండి వాళ్లు గిన్నెలతో నీళ్ళు తెచ్చుకుని దాని మీద పెట్టి కాగనిచ్చేవారు. భోగీమంటల మీద మరిగిన వేడి వేడి నీళ్ళతో తలంటు పోసుకుంటూ ఉంటే ఆహా నా రాజా భలే ఉండేది. తరువాత కొత్తగా కొనుక్కున్న ఏ గీతాంజలి మిడ్డీయో, ప్రేమపావురాలు పంజాబి డ్రెస్సో లేదా మా అమ్మ కుట్టిన రంగురంగుల గౌనో వేసుకుని అద్దం ముందు వయ్యారాలుపోయేవాళ్లం. నేను ఏమి చేసిన పొగడడానికి మా నాన్నారు ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు. ఈ ప్రపంచంలో బట్టలంటే నీవేనమ్మా, అంత బ్రహ్మాండంగా ఉన్నాయి అనేవారు. నాకు, మాచెల్లికి ఈ విషయంలో పోటీ వచ్చేది కాదు. ఎందుకంటే అది చిన్నప్పటి నుండి మగపిల్లల బట్టలే వేసుకునేది. తరువాత అమ్మతో పాటు పూజలో కూర్చుని, పెద్దవాళ్ళ కాళ్ళకి దణ్ణం పెట్టి, వాళ్ళిచ్చే పదో పరకో బహుమానాలు పుచ్చుకుని ఊరిమీద పడేవాళ్ళం. ఇక కొత్త బట్టలు ప్రపంచానికి చూపించడం ఇంకొక కార్యక్రమం. ఎదురింటి ఆంటీగారింటికి, పక్కింటి అనసూయత్తగారింటికి, గేటింటి మామ్మగారి దగ్గరకి, వెనుకవీధి బంగారమ్మపిన్నింటికి పనిలేకపోయినా వెళ్ళేవాళ్ళం కొత్త బట్టలు చూపించడానికి. అందరు ఆహా, ఓహో అంటే తెగ మురిసిపోయేవాళ్ళం. కొత్త సినిమాలలో హీరోయిన్ లా తెగ ఫీల్ అయిపోయేవాళ్ళం.

ఇక మా పెద్దనాన్న,చిన్నాన్నగార్ల పిల్లలతో, హౌసీ, వైకుంఠపాళి, లూడో లేకపోతే బెచ్చాట, నేల బండ, దొంగాట, ఏడు పెంకులాట, బంతాటో ఆడుకునేవాళ్ళం. అమ్మ చేసిన కమ్మనైన బూర్లు, పులిహార పుష్టిగా తినేసి బారెడు సాయంత్రం అయ్యేదాక పడుకునేవాళ్ళం. సాయంత్రం అలా దొడ్డమ్మవాళ్ళింటికో, ఉమాత్త వాళ్ళింటికో వెళ్ళి కబుర్లు చెప్పి గడిపేసేవాళ్ళం. తరువాత సంక్రాంతి ముగ్గుకి సన్నాహాలు ప్రారంభించేవాళ్ళం. నేనెప్పుడు గొబ్బెమ్మలు పెట్టలేదు. కాని చెంకీలు, పువ్వులు జల్లేదాన్ని. నాకు మాచెల్లి, మాతమ్ముడు (మా పెద్దనాన్నగరి కొడుకు) రంగులద్దడంలో సహాయం చేసేవారు. రంగు, ముగ్గు గీతకి అటు ఇటు అవ్వకూడదు. సరిగ్గా ముగ్గులో పడాలి, అది నా రూలు. వాళ్ళిద్దరిలో ఎవరు తూచాతప్పక పాటించకపోయిన వాళ్ళకి ఉద్వాసన, నా చేత తిట్లు తప్పేవి కావు.

ఇక అసలు పండగ సంక్రాంతినాడు, ఇంటికి హరిదాసులొచ్చేవారు. ప్రతీ ఆదివారం మా ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చేవారు. ఆయనకి ఒక 50-60 మధ్యలో యేళ్ళు ఉండేవి. ఆయనకి బియ్యం వెయ్యడం అంటే మాకెందుకో చాలా సరదాగా ఉండేది. బియ్యం వేస్తే ఆయన మాకు విభూది పెట్టేవారు. ఆ విభూది పెట్టించుకోవడం భలే ఇష్టంగా ఉండేది. ఆయనకి సంక్రాంతినాడు ఎక్కువ బియ్యం డబ్బులు ప్రత్యేకం. ఇంకా హరిదాసులు, గంగిరెద్దులు మములే. గంగిరెద్దులు ఇంటికి వస్తే ఆ సన్నయి వింటూ, ఆ ఎద్దుల మీద ఉండే రంగురంగుల బట్టలను ఆహ్లాదంగా, విడ్డూరంగా చూసేవాళ్ళం. మా తమ్మూడువాళ్ళు వార్తాపత్రికలతో గాలిపటాలు తయారుచేసేవారు. వాటికి రంగురంగుల తోకలు అంటించడం మా వంతు. నాకు మాత్రం గాలిపటం ఎగరేయడం ఇప్పటికి రాలేదు. మహా అయితే నా ఎత్తు ఎగిరేది అంతే. ఆరోజు పిండివంటలు నాకెంతో ఇష్టమయిన బొబ్బట్లు, పులిహార లేదా పొంగలి. బాగా నెయ్యి వేసుకుని బొబ్బట్లు లాగించేసేదాన్ని. బొబ్బట్లతోపాటు అందులో పెట్టే పూర్ణం ముద్ద వేరేగా తినడం నాకింకా ఇష్టంగా ఉండేది. ఇక కనుమనాడు గారెలు తినకపోతే వచ్చే జన్మలో కాకి అయి పుడతారని చెప్పే నమ్మకాని నేను బలంగా విశ్వసించేదాన్ని, ఎందుకంటే గార్లంటే నాకు ప్రాణం మరి. ఆరోజు గార్లు, పెరుగు గార్లు, సేమ్యా పాయసం లేదా బెల్లం పరవాణ్ణం తిని హాయిగా బజ్జొనేవాళ్ళం. ముక్కనుమనాడు పెద్దగా విశేషాలు ఏమీ ఉండేవి కాదుగాని గత మూడు రోజులుగా జరిగిన సంగతులన్నీ ముచ్చటించుకునేవాళ్ళం. ఇక ఆ వారంతో ముగుసే శెలవుల తరువాత వచ్చే శనివారం, బడికి కొత్తబట్టలేసుకుని వెళ్ళి స్నేహితులందరికి చూపించడంతో సంక్రాతి సంబరాలు ముగిసేవి.

ఆరోజులు, ఆ ఆనందం మళ్ళీ రావు కదా !


ఇక ఈ 2010 సంక్రాంతి ముచ్చట్లు...
ఈసారీ వేసాను ముగ్గులు, కానీ కొత్తా రకంగా....ఈ వారాంతరంలో నేను టోక్యో వెళ్ళి సమర్పించబోయే పేపర్ కోసం తయారు చేసిన ppt slides, అవే నేను వేసిన ముగ్గులు.

భోగీపళ్ళు పోయించుకున్నాను మా డైరెట్టరు చేత...పేపర్ బాగా రాసానని పొగిడించుకున్నాను.

తిన్నాను బొబ్బట్లు, బూర్లు....మా ఆఫీసుకి దగ్గరగా ఉన్న తమిళతంబి చిదంబరం హొటేలు నుండి తెప్పించుకున్న పనీర్ ఇడ్లీలు, చోలే బటూరాలు.

ఇవాళ కనుమ, ఒక్క గారె ముక్కయినా తినలేదు...వచ్చే జన్మలో నాకు కాకి రూపు తప్పదు కాబోలు.

అసలు పండగ వచ్చిందనిగానీ, వెళ్ళిందనిగానీ ఊహే లేకుండా రెండురోజులు ఆఫీసులో పనితో సతమతమయిపోయాను. అయితే బాసు నుండి పొగడ్తలు, పేద్ద కాంఫరెన్సులో invited lecture, అది సమర్పించుకోగానే గొప్ప కీర్తి వస్తాయి. కానీ భోగీ మంటల ఆనందం, సంక్రాంతి ముగ్గుల సరదా, బొబ్బట్లు, గారెల రుచి ఏవీ?

ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములేవి తల్లీ లాగ

ఏవి తల్లీ నిరుడు ఎగసిన భోగిమంటలేవి తల్లి,
ఏవి తల్లీ నిరుడు వేసిన రంగుముగ్గులు ఏవితల్లీ,
ఏవి తల్లీ నిరుడు చేసిన పిండివంటలు ఏవి తల్లి.....కాకి జన్మను రూపు మాపే పెరుగుగారెలు ఏవి తల్లీ?

ఈ నిముషలో నాకర్థం కావట్లేదు....కీర్తి ద్వారా వచ్చే సంతోషం గొప్పదో, జీవితంలో వచ్చే చిన్నచిన్న ఆనందాలు గొప్పవో!

15 comments:

మాలా కుమార్ said...

మీ పాత , కొత్త సంక్రాంతి ముచ్చట్లు బాగున్నాయి .
సంక్రాంతి , కనుమ శుభాకాంక్శలు .

sowmya said...

Thanks మాలాకుమార్ గారు :)
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు !

కొత్త పాళీ said...

చాలా బాగా రాశారు, ముఖ్యంగా చిన్నప్పటి కబుర్లు. తాతగారి మనసునిండా ఆ తలుపుల తలపులే .. హ హ హ.
బిచ్చం వేస్తే వీబూధి పెట్టే సాధువొకాయన మా యింటిక్కూడా వచ్చేవాడు.

Wanderer said...

సంక్రాంతి అంటే... ముద్ద బంతి-కృష్ణ బంతి-ఊక బంతి-పెరుగు బంతి పూలు, గడ్డి చేమంతులు, చిట్టి చేమంతులు, బిళ్ళ చేమంతులు, గుమ్మడి పూలు, పసుపు కుంకాలు పెట్టిన గొబ్బెమ్మలు... ఊరంతంతేసి ముగ్గులు.... ఎర్రటి వెచ్చటి భోగి మంటలు... తియ్యని పుల్లని రేగిపళ్ళు... హరిదాసులు... గంగిరెద్దు మేళాలు... పేరంటాలు...


పొద్దున్న ముగ్గులో పెట్టిన గొబ్బెమ్మల్ని సాయంకాలం గోడకు కొట్టి పిడకలు చేసి వాటితో దండలు గుచ్చి భోగి నాడు భోగి మంటల్లో వేసేవారు. ఎవరి దండ పెద్దదోనని పోటీలు. అన్ని వీధులూ తిరిగి ఎవరి భోగి మంట పెద్దదో చూసొచ్చేవాళ్ళం. భోగి పళ్ళ పేరంటాలంటే యేడాదికి ఒక్కసారి దొరికే మహత్తర అవకాశం. రమణ గారి కథలో లాగ, భోగి పళ్ళలో డబ్బులు ఏరుకుని ఆ పెట్టుబడితో ధనవంతులమైపోయే పథకాలు ఎన్నెన్నో వేసుకునేవాళ్ళం రాత్రుళ్ళు దుప్పట్లో దూరి పడుకుని. ధనవంతులంటే ఏమో అనుకునేరు.... ఐదు పైసల లాటరీ షీటు మొత్తం కొనుక్కోగలిగినంత డబ్బుండటం, అంతే.

పొద్దున్న స్కూల్ కి వెళేప్పుడు ఇళ్ళ ముందు ముగ్గుల్ని చూసుకుంటూ, పెద్ద ముగ్గేదో, ఏది కష్టమైన ముగ్గో, ఏది రంగులు బావున్న ముగ్గో తేల్చి తీర్పు చెప్పుకుని అసెంబ్లీ కి ఆలస్యంగా వెళ్ళి దెబ్బలు తినేవాళ్ళం.

సంక్రాంతి సంబరాల్లో నాకన్నిటి కంటే బెస్ట్, సందె గొబ్బిళ్ళ పేరంటాలు. గొబ్బి ని మధ్యలో పెట్టి, చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ చుట్టూ తిరిగి, పూజ చేసి, తాళింపు శనగలు, పులిహార, లాంటి ప్రసాదాలు ఆకుల్లో పెట్టి ఇస్తే తినేసి, పక్క వీధిలో ఇంకో సందె గొబ్బిళ్ళ పేరంటానికి వెళ్ళిపోడం... అంతే. ఎంత చెప్పుకున్నా తనివి తీరదు.

ఈ యేడు పండగ సందడి అంతా ఙ్ఞాపకాలే. పొద్దున్న కోల్డ్ సిరియల్, మధ్యాన్నం సాండ్విచ్, సాయంకాలం ఆఫీసు నుంచి లేట్ గా ఇంటికి చేరి ఉన్న ఓపికని పోగుచేసుకుని చేసుకున్న నూడుల్స్ - చిన్నప్పటి సంక్రాంతి పిండివంటలని గుర్తు చేసుకుంటూ వీటినే తినేసాను "అహ నా పెళ్ళంట" లో కోటా శ్రీనివాసరావు లాగ.

manu said...

పాపం అక్క....పండుగకొద్దామనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుంది...దాని ఆశలన్నీ కాన్ఫరెన్స్ రూపంలో జపాన్ ఎగిరిపోయాయి. కాని నేను మాత్రం ఫుల్ ఎంజాయ్. ముగ్గులు పెట్టాను...భోగి మంటలు వేశాను...పిండివంటలు తిన్నాను...అమ్మావాళ్ళతో గడిపాను. ఎక్ దిన్ కా రాజాలాగ ..తీ దిన్ కా రాణినై మా అక్క మీద కసి తీర్చుకున్నాను.(ఇంతకుముందు నన్ను ముగ్గులు పెట్టనివ్వలేదు సరికదా పైగా సరిగ్గా రంగులు వేయలేదని తిట్టింది అందుకని)

manu said...

సంక్రాంతి భోజనంబు..వింతైన వంటకంబు...అవన్నీ నాకే చెల్లు..అహహ..అహహ..

వేణూ శ్రీకాంత్ said...

పాత సంగతులు బాగున్నాయి, కొత్త సంగతులు "ఉందిలే మంచి కాలం ముందు ముందునా" పాట గుర్తుచేస్తున్నాయ్. Good post :-)

sowmya said...

thanks కొత్తపాళీగారు
మీవంటి పెద్దల మెప్పు పొందదం నా అద్రుష్టం

sowmya said...

@ wanderer
అవునవును పిడకల దండల గురించి మరిచేపోయాను నేను, బాగా గుర్తు చేసావు.
అవును ఎవరిది పెద్దముగ్గో చూసుకుంటుంటో వెళ్ళేవాళ్ళం.
మరచిపోయిన విషయాలు గుర్తు చేసినందుకు thanks

హ హ నీకు కూడా పాత ఙ్ఞాపకాలతోనే గడిచిందా సంక్రాంతి...we are sailing in the same boat
శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఉందిలే మంచికాలం ముందుముందున, తిందాము బొబ్బట్లు నందనందనా :)

sowmya said...

Thanks శ్రీకాంత్ గారు
ఉందిలే మంచికాలం అనుకుంటూనే ఎదురుచూస్తున్నాం వచ్చే యేడాది సంక్రాంతి కోసం :)

sowmya said...

@manu
అనుభవించవే, ఇప్పుడూ నీ టైం నడుస్తున్నాది...నాకు వస్తుందిలే అమ్మ చేతి పిండివంటలు తినే కాలం త్వరలో

Anonymous said...

kummesaru sowmya garu
mana pra pee sa sa members antha chala sincere ga follow avuthunnaru kuda very nice except me
super post

Jo

sowmya said...

ha ha ha.....thanks Jo !

స్థితప్రజ్ఞుడు said...

ఆహా...మీరు కేకండీ సౌమ్యగారు...

ఈ టపా మీ తపాలన్నిన్టిలోకీ బెస్ట్ టపా....

నాకు చాలా బాగా నచ్చేసింది.....

"ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములేవి తల్లీ లాగ
ఏవి తల్లీ నిరుడు ఎగసిన భోగిమంటలేవి తల్లి,
ఏవి తల్లీ నిరుడు వేసిన రంగుముగ్గులు ఏవితల్లీ,
ఏవి తల్లీ నిరుడు చేసిన పిండివంటలు ఏవి తల్లి.....కాకి జన్మను రూపు మాపే పెరుగుగారెలు ఏవి తల్లీ?"

ఇది చదివి నేను తెగ ఫీలైపోయాను.....

ఆ.సౌమ్య said...

@ స్థితప్రజ్ఞుడు
చాలా చాలా ధన్యవాదములు.
మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.