StatCounter code

Tuesday, February 23, 2010

కనివిని ఎరుగని ఈ కల...

ఆ మధ్య వచ్చిన కొత్త మాయబజార్ లోది ఈ పాట.
సినిమా బాగానే ఉంటుంది, అద్భుతం అని చెప్పను కానీ చూడదగినదే. ఈ సినిమా 2006 లో వచ్చింది.

చలంగారి కథ ఆధారంగా గ్రహణం సినిమా తీసి, నేషనల్ అవార్డ్ సంపాదించి, ఈ మధ్యనే అష్టా చమ్మ అనే కామెడీ సినిమా తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణే దీనికి కూడా దర్శకుడు. కాస్త పూరాణాలతో జతపడ్డ సినిమా ఇది. రాజా, భూమిక హీరోహీరోయిన్లు. S.P. బాలసుబ్రహ్మణ్యం కుబేరుడిగా, జయలలిత ఆయన భార్యగా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం నారదుడిగా వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.

కుబేరుడు ఆయన శాపాలు - మానవునికి సహాయం - శాప విమోచనం అన్న అంశాలతో ముడిపడి ఉంటుంది కథ. కుబేరుడు తన స్వార్ధానికి, కష్టాల్లో చిక్కుకుని ఉన్న మానవుని ఉపయోగించుకోజూస్తే ఆయన కూతురు, నారదులవారు, ఇంకొద్దిమంది గంధర్వులు ఒక మంచి మనిషికి ఎలా సహాయపడ్డారు అనేదే మూలాంశం.

సినిమా మాట ఎలా ఉన్నా ఇందులో ఉన్న ఆరు పాటలు ఆరు ఆణిముత్యాలు. సిరివెన్నెల సాహిత్యం గురించి వేరే చెప్పాలా. ఆయన సాహిత్య ప్రక్రియల గురించి చెప్పాలంటే ప్రత్యేకం గా ఒక పోస్ట్ రాయాలి. చక్కని సంగీతాన్ని అందించే కె.ఎం.రాధాకృష్ణన్ తన ఉనికిని మళ్ళీ చాటుకున్నారు.

ఈ పాటలు అంత పాపులర్ అయ్యాయో లేదో నాకు తెలీదు, ఎందుకంటే అప్పుడు ఇప్పుడూ కూడా టివీలోనూ, రేడియోనూ ఈ పాటలను చాలా అరుదు గా విన్నాను.

"ఇప్పటికింకా నావయసు నిండా పదహారే" అన్న పాటల మధ్యలో "వరలాస్యాల వైభోగాల వయసే తెగ తుళ్ళిపడగా" అని రాస్తే మరి హిట్ అవ్వదేమో నాకు తెలియదు.

ఇందులో నాక అన్నిటికన్నా నచ్చిన పాట...కుబేరుని కుమార్తె మొట్టమొదటిసారి భూలోకానికొచ్చినప్పుడు ఆ అందాలను చూసి పరవశించి పాడే పాట.


పల్లవి: కనివిని ఎరుగని ఈ కల, నిజమని పలికెను కోకిల,
ప్రతి ఒక అణువున నేడిలా, అవనికి వచ్చెను నవకళ,
అలరులు కురిసిన ఈ ఇల మెరిసెను నూతన వధువులా,
తొణికిన తూరుపు వెలుగిలా పుడమికి అలరెను మేఖల.

చరణం1: చెదిరే అలల ఝంకారాల ఝరులే జలకన్యకురులా,
హిమతీరాల సుమగంధాల తెరలే వలపుతిమ్మెరలా,
మధుమాసాల ఋతురాగాల జతులే వనరాణి శ్రుతులా,
అరవిందాల మకరందాల ఋతువే చిలిపితుమ్మెదలా,
విరిసిన హరివిల్లే రంగులవిరిజల్లై చిలకరించె భూమిపైన తొలకరులే.

చరణం2: శిఖిపించాల సఖిలా నేడు మనసే తొలిపురులు విడగా,
వరలాస్యాల వైభోగాల వయసే తెగతుళ్ళిపడగా,
పలు అందాల జగతీ చూసి పలుకే మరిమూగవోగా,
అతిలోకాల సౌందర్యాల లయలే ఇలనల్లుకోగా,
తన్మయమై నేనే ధన్యతనే పొందే తరుణమేదో ముందు నిలిపె క్షణములనే.

కనివిని ఎరుగని ఈ కల..... (పల్లవి)


శిఖిపించాల సఖిలా నేడు మనసే తొలిపురులు విడగా.... అనందంతో మనసే మయూరమై ఆడింది అని చెప్పేస్తే మనకి సిరివెన్నెలకి తేడా ఏటుంటది, సిరివెన్నెలన్నాక కాస్త కలాపోసనుండొద్దూ (రావు గోపాలరావు డవిలాగు)

వరలాస్యాల వైభోగాల వయసే తెగతుళ్ళిపడగా...కుబేరుని కుమార్తె కదా మరి

మధుమాసాల ఋతురాగాల జతులే వనరాణి శ్రుతులా,
అరవిందాల మకరందాల ఋతువే చిలిపితుమ్మెదలా......ప్రకృతి అందాలను ఇంతకంటే ఉన్నతంగా వర్ణిచడం సాధ్యామా !

అలరులు కురిసిన ఈ ఇల మెరిసెను నూతన వధువులా,
తొణికిన తూరుపువెలుగిలా పుడమికి అలరెను మేఖల...భావగర్భితమైన అంత్య ప్రాసలంటే ఇవి కావా!

ఈ పాట మొదటిసారి విన్నప్పుడు మాత్రం నేను ఇలా పాడుకున్నాను....
తన్మయమై నేనే ధన్యతనే పొందే తరుణమేదో ముందు నిలిపె క్షణములనే !













18 comments:

స్వర్ణమల్లిక said...

నేను ఈ పాట విన్నాను సౌమ్యా... సినెమా కుడా చూసాను.. నాకు నచ్చింది.

రవిచంద్ర said...

ఈ సినిమా పాటలన్నీ నా మొబైల్లో కొన్నప్పటి నుంచీ అలానే ఉన్నాయి. నాకూ అన్ని పాటలూ నచ్చాయి. సరోజ దళ నేత్రి అనే పాట, సిరి సిరి మువ్వల లాగా నువ్వు కిల కిల నవ్విన వేళ.. అనే పాట కూడా నాకు చాలా ఇష్టం.

నాగప్రసాద్ said...

ఈ సినిమా నేను చూశాను కానీ, అలవాటు ప్రకారం పాటలన్నీ ఫార్వర్డ్ చేసేశాను. :). ఈ సినిమా మళ్ళీ దొరుకుతుందేమో ట్రై చేస్తా. ఈసారి దొరికితే పాటలు మాత్రం విని సినిమా ఫార్వర్డ్ చేస్తా. :))

ఆ.సౌమ్య said...

అవును స్వర్ణమాలికగారు, సినిమా కూడా బానే ఉంటుంది


రవిగారూ నాకు కూడా సరోజ దళనేత్రి, సిరిసిరి మువ్వలలాగ, ఇంకా చెప్పలంటే ప్రేమే నేరమౌనా పాట కూడా చాలా ఇష్టం. అన్ని పాటల్లోనూ సాహిత్యపు విలువలు గొప్పవి.

ఆ.సౌమ్య said...

పెసాదు అంత కష్టపడిపోనక్కర్లేదు కాని పాటలు ఇక్కడ వినండి

http://www.musicindiaonline.com/music/telugu/s/movie_name.8686/

విజయ క్రాంతి said...

idi anyaayam ... naaku nacchina paatalu inkevarikee nacchakoodadu ....

- marthanda

హను said...

EE cinema chuSanu, kaani paaTala imtha madhuram ga vumTayi ani anukoledu, ee riju vimTaanu tappakumDaa

శ్రీనివాస్ పప్పు said...

"వరలాస్యాల వైభోగాల వయసే తెగతుళ్ళిపడగా...కుబేరుని కుమార్తె కదా మరి"
మరే అసలే కుబేరుడు పైగా అతని కూతురాయే వరలాస్యాల వైభోగాలతో తుళ్ళిపడాల్సిందే. సిరివెన్నెల కలం ఆనందతాండవం చేసింది ఈ మొదటిచరణంలో "చెదిరే అలల ఝంకారాల ఝరులే జలకన్యకురులా" అంటూ,
తీరా పాట విన్నాక చూస్తే మళ్ళీ
"తన్మయమై నేనే ధన్యతనే పొందే తరుణమేదో ముందు నిలిపె క్షణములనే".
మంచి పాట రుచిచూపించారు సౌమ్య గారు.
ఈ సినిమాలో మర్చిపోలేని సన్నివేసాలు ఓ రెండు.
1.జయలలిత-బాలూల మధ్య నడిచే సన్నివేశాలు మొత్తం బహుపసందుగా ఉంటాయి "రసపట్టులో తర్కం కూడదన్నట్టుగానే".
2.చివరి సన్నివేశంలో ఆలీ నారదుడ్ని "నాదర్ మునీంద్రా నాదర్ మునీంద్ర" అంటూ పిలిచే పిలుపు దానికి ధర్మవరపు "నాదర్ మునీంద్రా ఖాదర్ మునీంద్రా కాదు నాయనా నారద మునీంద్రా" అని విశదీకరించడం మొత్తం సినిమాకే హైలైట్.

ఆ.సౌమ్య said...

విజయ క్రాంతిగారూ
తప్పై పోయిందండీ, నా మీద కథలు కవితలు రాసేయకండి, మీ పుణ్యముంటుంది
మీ 'ప్రావీణ్యం' మేమెరుగమా !

ఆ.సౌమ్య said...

@పప్పుసారూ
అవునండీ మిగతా పాటలు కూడా అంతే మధురం గా ఉంటాయి, వింటున్నకొద్దీ తేనెలూరుతూ ఉంటాయి.
హ హ హ నాదర్ మునీంద్ర...బాగా గుర్తు చేసారు. జయలలిత గారు చాలా అందంగా ఉంటారు ఈ సినిమాలో.

@hanu
తప్పకుండా, శ్రద్ధతో వినండి, చాలా బాగుంటాయి.

కత పవన్ said...
This comment has been removed by the author.
ఆ.సౌమ్య said...

అబ్బ చా, బలే సెప్పావులే ప్రవనూ :)

మాలా కుమార్ said...

ఇప్పుడే చూస్తున్నాను మీ బ్లాగ్ . మీ రాతలూ , గీతలూ బాగున్నాయండి .

ఆ.సౌమ్య said...

thanks Malakumar gaaru !

వేణూశ్రీకాంత్ said...

నాకూ ఈ సినిమా నచ్చిందండీ, మంచి పాయింట్ చెప్పాడు. పాటలు సాహిత్య పరంగా అద్భుతం.

vivek said...

"saroja dhalanethri,...edo lahiri..."...ee paata chaala baguntundi...okasari "padalani undi" program lo balu garu ee pallavi ni hum chesi mari pata gurinchi chepparu....manchi paatalni veliki thisi raasaru...bagundi..:)

Manasa Chamarthi said...

saroja dala nethri nijamgaane super song.

bhanumati gaari abhimaanini annaru..annintiloki meeke paata ishtam?

ఆ.సౌమ్య said...

@Maanasa
బాగా గుర్తు చేసారండీ, అసలు మాయాబజార్ (కొత్త)లో అన్ని పాటలు బాగుంటాయి.

అవునండీ, నాకు భానుమతిగారంటే చాలా ఇష్టం. ఏపాట బాగా ఇష్టమంటే చెప్పడం కష్టమేగానీ మలీస్వరి, విప్రనాయాయణ లో పాటలంటే ఎంతో ఇష్టం.
ముఖ్యంగా మనసునమల్లెల మాలలూగెనే, సావిరహేతవదీనా పాటలు.

కామెంటు రాసినందుకు Thanks