StatCounter code

Thursday, June 10, 2010

ముద్దు పేర్లతో వచ్చిన తంటా

మొన్న ముద్దుపేర్ల గురించి ఇక్కడ టపా రాసారు. అది చూసాకా మా ఇంట్లో ఉన్న ముద్దుపేర్ల విషయం గుర్తొచ్చింది. ఈ ముద్దుపేర్లు వింటే ఎంత నవ్వొస్తుందంటే.....తినబోతూ రుచెందుకు, మీరే చదివి నవ్వుకోండి.

మా అమ్మ వాళ్ల పెద్దక్కకి "అమ్మాయి" అని ముద్దు పేరు పెట్టారు. ఆవిడకి మా అమ్మకి ఒక 20 యేళ్ల తేడా ఉంటుంది. ఆవిడ అలా అలా అందరికీ అమ్మాయయిపోయారు. మా అమ్మకి "అమ్మాయక్క" మాకేమో "అమ్మాయి దొడ్డమ్మ". ఈవిడ అసలు పేరు నాకిప్పటికీ తెలీదు.

అలాగే ఆవిడ కొడుకుకి "బాబు" అని ముద్దు పేరు. ఈ అబ్బాయికి మా అమ్మకి ఒక యేడాదే తేడా. ఇహ అందరూ ఆయన్ని బాబు అని పిలవడం మొదలెట్టారు. మరి మాకేమో ఆయన "బాబు అన్నయ్య - బాబన్నయ్య".

అలాగే మా కజిన్ వాళ్ల తమ్ముడిని చిన్నప్పుడు నోరు తిరక్క తమ్ముడుకి బదులు "తమ్మూ" అని పిలవడం మొదలెట్టింది. అదే తన ముద్దుపేరయిపోయింది. అందరు తనని "తమ్మూ" అని పిలుస్తారు. మేమేమో "తమ్మూ అన్నయ్య" అంటాము.

మా పెద్దమావయ్య ముద్దుపేరు "బాబ్జీ". మేమంతా "బాబ్జీ మావయ్య" అంటాము. ఆయన అసలు పేరేంటో నాకిప్పటికీ తెలీదు. అలాగే మా మూడో మావయ్యకి ముద్దు పేరు "పెద్దబాబు", నాలుగో మావయ్య ముద్దు పేరు "చిన్నబాబు". కాబట్టి వాళ్ళిద్దరూ మాకు "పెద్దమావయ్య" "చిన్నమావయ్య" అయ్యారు. పెద్దమావయ్య అంటే అందరికన్నా పెద్దవారా అని ఫ్రెండ్స్ అడిగితే కాదు కాదు మూడో మావయ్య, కానీ ఆయన పేరు పెద్దబాబు అని వివరణ ఇచ్చుకోవాల్సొచ్చేది ప్రతీసారీ.

అలాగే మా కజిన్స్ ఇద్దరి ముద్దు పేర్లు "బుజ్జి", "అమ్మలు". వాళ్ళని మేము "బుజ్జక్క" "అమ్మలక్క" అని పిలుస్తాం. బుజ్జక్క సంగతి ఫరవాలేదుగానీ అమ్మలక్క దగ్గరే వచ్చింది తంటా. అలా పిలిస్తే అమ్మలక్క ఏమిటే "అమ్మలక్కలు లో ఆవిడ ఒకరా" అని ఫ్రెండ్స్ అంతా తెగ నవ్వేవారు. నాకింకొక "బుజ్జి బావ", "బుజ్జన్నయ్య" కూడా ఉన్నారు సుమండీ.

మా నాన్నగారి అత్తలకి ముద్దు పేర్లు "చిట్టి", "చిన్ని". వాళ్ళేమ్మో "చిట్టత్తయ్య, చిన్నత్తయ్య" అని పిలిస్తే మేమేమో "చిట్టిమామ్మగారు, చిన్నిమామ్మగారు" అని పిలుస్తాం.

మా నాన్నగారి మావయ్యల ముద్దుపేర్లు "చిట్టి", బంగారం". మా నాన్నగారికి వాళ్ళు "బంగారం మావయ్య", "చిట్టి మావయ్య". మాకేమో "బంగరాం తాతయ్య", "చిట్టి తాతయ్య". ఈ తాతయ్యల తమ్ముడిని వీళ్ళు "తమ్ముడు" అని పిలిచేవారు. కాబట్టి ఆయన ముద్దుపేరు "తమ్ముడు" అయింది. సో ఆయన మా నాన్నగారికి "తమ్ముడు మావయ్యా", మాకేమో "తమ్ముడు తాతగారు".

మా అమ్మ తరపు చుట్టాలో ఒకావిడ పేరు "బేబీ". ఆవిడనందరూ "బేబక్క, బేబొదిన" అని పిలుస్తారు.

మా ఫ్రెండు పేరు వింధ్య వాసిని. మేము దాన్ని ముద్దుగా "వివా" అని పిలిచేవాళ్ళం. వాళ్లింటికి తరచూ వెళ్ళేవాళ్ళం. మేము వీవా అని పిలుస్తూ ఉంటే వినడం అలవాటయిపోయి, తన పిన్ని కొడుకులు "వీవా అక్క" అని పిలిచేవారు చాలారోజులు. మెల్లిగా తరువాత మానిపించారనుకోండి.

మా ఇంట్లో నేను మా చెల్లిని "చెల్లీ" అనే పిలుస్తాను. దానితో అది మా కజిన్స్ అందరికీ చెల్లిగానే ఫేమస్ అయిపోయింది. అందరూ దాన్ని చెల్లీ అనే పిలుస్తారు. అది నన్ను "అక్కా" అనే అంటుంది. కానీ నన్నెవ్వరూ అక్కా అనరు. మరీ చిన్నవాళ్లు అక్కా అంటారుగానీ నాకంటే 1-2 యేళ్ళు చిన్నవాళ్ళు అక్కా అనరు, పేరు పెట్టి పిలుస్తారు. దాన్ని మాత్రం ఎంతపెద్దవాళ్లైనా చెల్లీ అంటారు. ఒక్కోసారి మా నాన్నగారు, అమ్మ కూడా "చెల్లీ ఇలా రావే, చెల్లీ అది తేవే" అని అనేస్తూ ఉంటారు.

24 comments:

స్వర్ణమల్లిక said...

బాగున్నాయి సౌమ్య గారు మీ(ఇంటి) ముద్దుపేర్లు. ఇవన్నీ దాదాపు ప్రతి ఇంటిలోను కనిపిస్తూనే ఉంటాయి. మా అమ్మమ్మ గారి ఇంట్లో అయితే బాబు, పాపాయి, బుజ్జి, పసి, బన్ని, అనేవి - అత్తగారి ఇంట్లో అమ్మలు, పాపలు, డంబి, సన్నీ, పెద్దాడు, చిన్నాడు, జానీ, హనీ ఇలాంటివి ఉన్నాయి. ఇవి వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పిలిస్తే బానే ఉంటాయి కానీ పెళ్ళయి పిల్లలు పుట్టి రక రకాల వరసలు చేరాక మాత్రం కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటాయి. ఇంకా ఇవాళ తరం ముద్దు పేర్లు విచిత్రంగా ఉన్నాయి సుమండీ. బబ్బి, బున్ను, అప్పు, పప్పి ఇలా...... అసలు ముద్దు పేరు అవసరమా? అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు.

sowmya said...

బబ్బి, బున్ను, అప్పు, పప్పి........హ హ హ భలే ఫన్నీగా ఉన్నాయండీ.
అదే నాకు అనిపిస్తూ ఉంటుంది అసలీ ముద్దుపేర్లు ఎందుకా అని. నావరకైతే నాకు అంత నచ్చవు ఈ ముద్దుపేర్లు. అసలు పేరు పెట్టుకున్నదే పిలవడానికైనప్పుడు ఇంకో కొసరు పేరెందుకు అని.

హరే కృష్ణ . said...

వింధ్యవాసి అనే పదం విజయనగరం జిల్లా గజిపతినగరం మండలం లో ఉన్న గ్రామము
చాలా ఊరిపేర్లు మనిషి పేర్లు గా ఉంటాయి
దీని గురుంచి మార్తాండ బాగా చెప్పగలడు ఏమో కదా
అన్నవరం సింహాచలం తిరుపతి ఇలా అన్నమాట

చాలా సరదాగా బావుంది మీ టపా

మధురవాణి said...

హహ్హహ్హా.. భలే ఉన్నాయండీ మీ ఇంట్లో ముద్దుపేర్లు.. ఇంక అసలు పేర్లతో అవసరమే లేదన్నమాట! ;-)

సుజాత said...

నాకూ ఒక బాబన్నయ్య,ఒక తమ్మన్నయ్య,ఒక బేబి పిన్ని,బుజ్జత్త,చిట్టిపెద్దమ్మ,బాబిగాడుబావ ఉన్నారండీ సౌమ్యా!

నేను కూడా కొందరికి అమ్మలక్క,కొందరికి అమ్మలు పిన్ని,కొందరికి అమ్మలత్త,మరికొందరికి అమ్మలు! అమ్మమ్మని అయ్యాక అమ్మలు అమ్మమ్మ అనిపిలుస్తారో ఏమిటో!

sowmya said...

@ హరే కృష్ణ
thanks :)

@ మధురవాణి గారు
హ హ హ అదేనండీ...అసలు పేర్లతో అవసరమే రాదు

sowmya said...

@ సుజాత గారు
బాబిగాడు బావ....ఇది మాత్రం అదుర్స్, నేను రాసినవాటికంటే ఇది ఎంతో బావుంది....బాబిగాడుబావేంటండీ బాబూ, నాకు నవ్వాగట్లేదు....హహహహహ

హి హి అయితే మీ ముద్దు పేరు అమ్మలన్నమాట...."అమ్మలు అమ్మమ్మ"....మీ మనవలు మనవరాళ్ళు ఎంత నవ్వుకుంటారో మరి :)

శేషు said...

బాగున్నాయి మీ కుటు౦బసభ్యుల ముద్దుపేర్లు.

మా అమ్మవాళ్ళ చెళ్ళిలు ననూ అబి అని పిలుస్తారు
నేను మా పెద్ద పిన్ని వాళ్ళ పెద్దమ్మాయిని పుల్లమ్మ అని చిన్నమ్మాయిని ఏల్లమ్మ అని మా రో౦డో పిన్ని వాళ్ళ పెద్దమ్మాయిని పిపుళ్ళి అని చిన్నమ్మాయిని గు౦డక్కయ్ అని పిలుస్తు౦టాను.

venuram said...

nice post... :) :)

sowmya said...

@ శేషు గారూ
హ హ హ....మీరు పెట్టిన పేర్లు బావున్నాయి.
thanks!

@ రాజ్ కుమార్
thanks!

radhika said...

బాగుందండీ ముద్దుపేర్లగొడవ.అప్పుడు తొందరగాపేర్లు పేట్టక పోతే ముద్దు పేరుపెట్టేవారు .ఇప్పుడు పుట్టగానే పెట్టేయడంవలన ముద్దుపేర్లతో పిలవడం చాలా వరకూ తగ్గిందనుకుంటున్నాను .
మా ఇంట్లోనూ ముద్దుపేర్లు ఉన్నాయండి .మా పెద్దక్క బుజ్జి,నాపేరు నాని,మాచెల్లి చంటి,మాచిన్నక్కని చిన్నప్పుడు చిన్ని అనేవారు .నా అసలు పేరు ఇప్పటికీ చాలామందికి తెలియదు .మా అమ్మని పాప అంటారు .మేము మాత్రం మాపిల్లలకి ఏముద్దుపేరూ పెట్టలేదు మాచిన్నక్క వాళ్ళమ్మాయినే సిరి అంటాము.

రాధిక(నాని ) said...

నాకు హైస్కూల్ కి వెళ్ళేవరకూ పేరులేదు నానీ అనే ముద్దుపేరే .ఇప్పటికీ చాలామందికి నా అసలు పేరు
తెలియదు .

sowmya said...

@ నాని గారూ ;)
హ హ హ....మీకూ ముద్దుపేరు ఉందీ.అయితే మీరు కూడా పెద్దయ్యక "నాని అమ్మమ్మ" అయిపోతారన్నమాట :)

కామెంటు పెట్టినందుకు thanks!

krishna said...

బాగున్నాయి సౌమ్య గారు... కానీ కొన్ని ముద్దు పేరులు బయట చెప్పుకోవడానికి కూడా కొందరు సిగ్గు పడతారు...ఆట పట్టిస్తారని. పండు.. పన్ను.. ఇలా. నాకు ఒక ముద్దు పేరు వుంది. చిన్నప్పుడు మా స్కూలులో వారికి తెలిసి ఆట పట్టిస్తే ఏడ్చుకునేవాడిని. హై స్కూలుకి వచ్చాక, కాలేజీలో ఎవరికి తెలియక అది మరుగు పడి పోయింది లక్కీగా...
కానీ ఇప్పటికి ఇంట్లో వారికి అదే పిలుపు... చుట్టాలలో కూడా అదే పిలుపు...హ్మ్ ఏమి చేస్తాము.
అన్నట్టు మా అక్కకి నేను తమ్ముడిని కాను.. తంబిని ..హహహహ్హ తమిళ తంబి అన్న మాట... మేమెదో తమిళులు అనుకుంటారు అది విన్నా వారు. తమ్ముడు కాస్త తమ్మీ గా.. ఆ తమ్మీ కాస్త తంబిగా స్థిర పడిపోయింది...

sowmya said...

@ Krishna
అన్ని వివరాలు చెప్పి ముద్దుపేరు చెప్పనేలేదు....అదేమిటో కూడా చెప్పేస్తే బాగుంటుంది కదా, నేను మిమ్మల్ని ఏడిపించనులెండి, ఒట్టు, నిజ్జం ;)

అయితే మీరు భవిష్యత్తులో "తంబి మావయ్య" అవుతారన్నమాట :)

tara said...

ఇదెక్కది అన్యాయం మీ బ్లాగ్ సోదరుని ముద్దు పేర్లు ఎక్కడా?

నాకు తెలిసిన ముద్దు పేర్లు కొన్ని
నాదెండ్ల సూర్యం, సూర్యకళ ఛెన్నమనేని,బలిజేపల్లి క్రాంతి కుమార్, మవోయిస్ట్, సూర్య చంద్ర రెడ్డి, దివాకర్, గణేష్, చెరశల శర్మ, నాదెండ్ల, మార్తాండ, డాక్టర్ వీణ, ...................., వాజెమ్మ, జేజమ్మ, దద్దమ్మ,.......... అమ్మో ఇంక నా వల్ల కాదు చిక్కోళం వెళ్ళి అన్న దగ్గిర డి టీ పీ చేయించుకొస్తాను ఒక పదివేలు ఖర్చు ఐనా

తిక్క తింగరోడు said...

సాధారణంగా మంచి బ్లాగులు వ్రాసే మీరు ఇలాంటి తొక్క విషయాలమీద ఈ మధ్య వ్రాస్తున్నారేంటి?

sowmya said...

@ తిక్క తింగరోడు
నాకూ కాస్త తిక్క ఎక్కి

Anonymous said...

ఈ పోస్ట్ రాయడంలో ప్రవీణ్ సహాయం తీసుకున్నారా? ముఖ్యంగా ఆఖరి పేరా అయితే ప్రవీణే రాసినట్టుంది. ఆయన దినచర్య ఇలాగే చెప్తాడు.

sowmya said...

@ Anonymous
నా లాస్ట్ పారా మీకు దినచర్యలా ఎలా అనిపించిందో.....బహుసా మీరు ప్రవీణ్ లాగ చదివుంటారు.
ప్రవీణ్ కెప్పుడైనా ఇన్ని పాజిటివ్ కామెంట్లు రావడం చూసారా?
మీకు ప్రవీణ్ కి, ఇతరులకి తేడా తెలియట్లేదంటే మరి మీ పరిస్థితి....నాకనుమానంగానే ఉంది.

తిక్క తింగరోడు said...

హె... హె...... తిక్క కాదండి, బ్లాగనేర్చిన లక్షణం!! :-)

"అసమాన సమాజంలో వేశ్యా వృత్తిని లీగలైజ్ చెయ్యడం ........", దేవుని రూపం !" లాంటి విశ్లేషణాత్మక బ్లాగులు వ్రాసిన మీ టపాలకి వచ్చిన వ్యాఖ్యలు చూసాను, ఇలాంటి టపాలు తొ(తి)క్కలకు రుచించవు.
కాంతికణం అని ఆ మధ్య సైన్సు వీరుడొకడు బ్లాగ్లోకంలోకి వచ్చాడు. సైన్సు మీద బ్లాగడమే కాకుండా, "ప్రాచీనులు విఞానులా....." అంటూ ఏదో బ్లాగాడు, అంతే, మన తో(తి)క్క (*)లు వ్యాఖ్యలతో బాదేశారు. అంటే కాంతికణం అస్సలు కనబడడంలేదు. ఎక్కడ పోయిందో ఏమిటో?. "వాస్తు విఞానం" పై హేతువాద దృష్టితో టపా చేసే ఫ్రొఫెసర్ కొడాలి బెదిరి ఎక్కడికి పోయారో తెలియదు. "సైన్సు విఙ్ఞానం", "సైన్సు కబుర్లు" లాంటి బ్లాగునెంతమంది చదువుతారో తెలియదు. వ్యాఖ్యలు తక్కువ కనపడతాయి. "చెరసాల శర్మలాంటి" వారికి బ్లాగ్శతృవులెక్కువ.

కాబట్టి చెప్పోచ్చేదేంటంటే....., పైన చెప్పిన విషయాల పై టపాలు వ్రాస్తే చదివే చదవరుల కన్నా శత్రువులెక్కువ పెరుగుతారు. బ్లాగులో చిరకాలం నిలిచి వుండాలంటే..., "మూడనమ్మకాలు గొప్పవనీ", "జ్యోతిశ్శాస్త్రం ముందు సైన్సు ఏం పనికి రాదని", "మాఇంటి పెరట్లో కుక్క పిల్లలు పెట్టిందని" వ్రాస్తే, చదువరులు ఆహా..... ఓహో...అంటూ...ఆకాశానికెత్తుతారు.

కాంతికణం, ప్రొఫెసర్ కొడాలి వాళ్ళలాంటి పిరికివాళ్ళ వల్ల ఒరిగేది ఏమిలేదు గాని, మీలాంటి "బ్లాగనేర్చిన" వాళ్ళ కాస్త ప్రయోజనం ఉంది. తొక్క విషయాలమీద ఒకటి రెండు బ్లాగులు వ్రాస్తూ, పాఠకులను పెంచుకుంటూ... మధ్యలో ఒక్కోసారి విశ్లేషణాత్మక టపాలతో మందుపాతర పేలుస్తారు......హేట్సాఫ్ & కీపిటప్

sowmya said...

@తిక్క తొంగరోడు
మీ విశ్లేషణ బావుందండీ. నేను పూర్తిగా మీతో ఏకీభవిస్తాను. బ్లాగ్లోకంలో జరిగేది ఇదే. ఏ రకమైన అభివృద్ధి గురించి మాట్లాడకుండా, వెనకడుగేస్తూ మా తాతులు నేతులు తాగారు అని పొగుడుకుంటూ ఉంటే బ్లాగ్లోకంలో నిర్భయంగా ఉండొచ్చు.

హ్మ్ ఇంతకీ మీరనేది ఏమిటంటే నాకు లౌక్యం ఎక్కువ అని అంతేనా ;) పొనీలెండి నాలాంటి లౌక్యుల వల్ల ప్రయోజనం ఉంది అని ఒప్పుకున్నారుగా, అంతే చాలు. చాలా సంతోషం.

నా సంగతలా ఉంచండి. మరి కాతికిరణం, కొడాలి లాంటి వాళ్ళు విశ్లేషణాత్మల బ్లాగులు రాస్తున్నప్పుడు మీవంటివారేం చేసారు? అందరు వచ్చి బాదేసారు అన్నారే, మరి మీలాంటి వాళ్ళందరూ దాన్ని ఎందుకు ఎదుర్కోలెదు???????
ఇలా వచ్చి నన్ను దెప్పిపొడిచేకంటే ఆరోజు మీరు వాళ్ళని అడ్డుకుని ఉంటే ఈరోజు విశ్లేషణాత్మక పోస్టులు రాసే బ్లాగర్లకి ఈ గతి ఉండేదికాదుగా.

హ్మ్ మిమ్మల్ని నిరాశపరచనులెండి. నా తరువాతి పోస్ట్ కాస్త ఘాటైందే....మీరే చూస్తారుగా నాకు ఎలాంటి కామెంట్లొస్తాయో. అప్పుడు మీరేం చేస్తారో నేనూ చూస్తాను. ఇది ఒక రకమైన coincidence అనే చెప్పుకోవచ్చు. నేను ఒక ఘాటైన పోస్ట్ రాస్తున్న సమయంలో మీరొచ్చి ఇలా అడగడం బావుంది :)

స్థితప్రజ్ఞుడు said...

ఈ తిక్క తింగరోడు ఎవరో గాని సరిగ్గా చెప్పారు.....

ఆయనకు అనిపించినట్టే నాకు అనిపించింది సుమండీ...

ఈవిడేంటి...ఇలా సోది రాసారు...అని...కానీ నిజమే కదా...బ్లాగ్ అంటేనే సోది...మళ్లీ ఆ సోది లో మంచి సోది కావాలంటే కొంచెం కష్టమే మరి......కానీ నాకో విషయం తెలిసింది....మన బ్లాగ్ కి బాగా ప్రాచుర్యం రావాలంటే...

వీర సోది రాస్తూ ... మధ్య మధ్యలో మంచి సోది రాయాలన్నమాట....:)

ఆ.సౌమ్య said...

@ స్థితప్రజ్ఞుడు
సూక్ష్మం గ్రహించారు. అదే నేను మీకు చేసే తత్వోపదేశం...మరి అలా ఫాలో అయిపోండీ :P