ఈరోజు ఎంతటి అశుభదినం...నాకు కన్నీళ్ళు ఆగట్లేదు. మా అభిమాన రచయిత ముళ్ళపూడి వారు ఇక లేరనే నిజం నన్ను వణికిస్తోంది. ఇన్నాళ్లు మనల్ని ఆయన కోతికొమ్మచ్చి ఆడించి ఇప్పుడేమో జాటర్ డమాల్ అనేసారు. నాకే ఇలా ఉంటే బాపూగారికి ఎలా ఉంటుండో ఊహించడం కూడా కష్టంగా ఉంది. అప్పుడెప్పుడో ఒకసారి "నా తెగులు" మృత్యుంజయ్ గారు బాపూ గారి బొమ్మ వేసి బ్లాగులో పెడితే సరిగ్గా రాలేదండీ...బహుసా బాపూగారిని ఒంటిరిగా వేసారు కదా రమణ గారిని పక్కనబెట్టకుండా అందుకే బాగా రాలేదేమో" అని నేను వ్యాఖ్య రాసాను. ఆయన కూడా దానికి ఒప్పుకున్నారు. బాపూ-రమణలని విడదీసి చూడడం మన కళ్ళకి అలవాటు లేదు. మనకే అలవాటు లేకపోతే బాపూగారికి ఎలా ఉంటుంది! ఈ కష్టాన్ని తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని బాపూగారికి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
క్రితసారి చెన్నై వెళ్ళినప్పుడు వారిరువురినీ కలవాలని ప్రయత్నించాను. వారు బిజీగా ఉండడం, నాకు టైం కుదరకపోవడంతో కలవలేకపోయాను.వచ్చేసారి వెళ్ళినప్పుడు తప్పకుండా కలవాలని ఒట్టుపెట్టుకున్నాను....ఇప్పుడిలా...మాటలు రావట్లేదు, దుఖం తన్నుకుని వస్తోంది. గుండెకోత కోసినట్టుగా ఉంది. అభిమాన ఉంటే ఇంత దుఖం వస్తుందా....నాకు తెలీదు. ఆయన నా మనసుకి ఇంత దగ్గరవారని....ఇంత అనురాగాన్ని నింపుకున్నానని నాకు ఈరోజు బాగా తెలుస్తోంది. భానిమతిగారు చనిపోయినప్పుడు ఏడ్చాను, మళ్ళీ ఇప్పుడు ఏడుపు ఆగట్లేదు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. మొదటిసారి భానుమతిగారిని కలుసుకోవాలని తీవ్ర నిర్ణయం తీసుకున్న ఒక నెల రోజులకే ఆవిడ పోవడం, ఇప్పుడు ఏప్రిల్ లో చెన్నై వెళ్ళేటప్పుడు బాపు-రమణలని కలవాలని ఒట్టుపెట్టుకోవడం...ఇలా జరగడం. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో...ఇంక నేను వారిని చూడలేను కదా.
రమణగారి మీద ఉన్న ప్రేమతో ఆయన పుట్టినరోజునాడు ఒక టపా కూడా రాసాను. ఆయన రమణీయాలు చదివి ఎంత ఉత్సాహాన్ని పొందానో నాకే తెలీదు. ఆయన రచనాశైలి అద్వితీయం. ఆ శైలికే నేను కట్టుబడిపోయాను. నేను ఈ సమయంలో చెయ్యగలిగినది ఒక్కటే ఆయన రచనలను చదవడం, వీలైతే కొందరిచేతైనా చదివించగలగడం. రమణ గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. బాపూ గారికి మనశ్శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆయన గురించి నేను రాసిన పోస్ట్ మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను.
ముళ్ళపూడి వెంకట రమణ గారి గురంచి తెలియనివారు ఆంధ్రదేశంలో ఉండరు. ఆయన గురించి అందరు అన్ని రకాలుగా చెప్పేసారు, పొగిడేసారు. ఇహ నేను కొత్తగా చెప్పాల్సిందేమీలేదు. ఈరోజు ఆయన జన్మదినం...ఆయనకెలాగూ ముఖాముఖి జన్మదిన శుభాకాంక్షలు తెలుపలేము కాబట్టి ఆయన కలము నుండి జాలువారిన హాస్య చతురోక్తులలో కొన్నింటిని తలుచుకోవడమే ఆయనకు నేను చెప్పగల జేజేలు.
రమణగారి భాష గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆయన రచనలే అందుకు సాక్ష్యాలు. ఆయన జీవితం ఒక ముళ్ళబాట, జీవితంలో కష్టాలను అలవోకగా అవేమీ పట్టనట్టు అలా అలా రాసేస్తారు, చదువుతున్న మనకే కన్నీళ్ళు ధారలా కారిపోతాయి. ఆయన గురించి ఒకచోట శ్రీరమణ అంటారూ...
"పచ్చని గోరింటలో అరుణిమలు దాగినట్లు
ముళ్ళపూడి నవ్వుల్లో ముళ్ళలాంటి వేదన"
బాపు-రమణ అంటే స్నేహం అని మనం నిర్వచనం చెప్పుకోవచ్చు.
రమణగారి మానసపుత్రుడు బుడుగు గురిచి తెలియనిదెవరికి?
రమణగారు బోలెడు రమణీయాలు రచించారు....సినీరమణీయం, కదంబరమణీయం, ఇలా ఎన్నో....వాటిల్లో కొన్ని రమణీయమైన గుళికలు......
ఒకసారి ముళ్ళపూడి వారికి అప్పు అవసరమై ఒక స్నేహితుడికి ఫోన్ చేసి అడిగారట.
రమణ: ఓయ్ కాస్త అప్పు కావాలోయ్
స్నేహితుడు: అలాగా, ఎప్పటికి కావాలి?
రమణ: మొన్నటికి
....ఇలా ఉంటుంది వీరి వ్యవహారం
...............................
రచయితల మీద వేసిన జోకు:
"నా కొత్త నవల మీద పత్రికలో విమర్శ వేయించండి" అంటూ రచయిత ఒక పుస్తకం అందించాడు. పుస్తకం బాగా నలిగి చిరిగిపోయింది.
"పబ్లిషర్ నాకు ఒక్కటే కాపీ ఇచ్చాడండీ, మా అబ్బాయి దాన్ని నలిపి చింపేశాడు, మరోలా అనుకోకండి," అన్నాడు రచయిత.
"అయితే ఇంకా విమర్శ ఎందుకు? మీ అబ్బాయి అభిప్రాయం తెలుస్తూనే ఉందిగా" అన్నాడు సంపాదకుడు.
"1960 లో తన ఋణానందలహరి పుస్తకం ఫస్ట్ ఎడిషన్ వెలువడింది. ఆ కాపీని ఇచ్చేటప్పుడు దానిపై అచ్చుతప్పులతో, అభినందనలతో అని రాసి మరీ సంతకం చేసి ఇచ్చారట ఆ గ్రంధకర్త శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ-కొంత వరకైనా పాప పరిహారం అవుతుందని."
....................................
ఎత్తిపొడుపులలో రమణ గారి చమత్కారం:
"ఆహా కోట్లార్జించినా మీలో ఆవగింజంత మార్పు కూడా లేదండీ, నాడెంతో నేడూ అంతే" అన్నడొక స్నేహితుడు.
"మార్పులేకేం. పూర్వం నేను పొగరుబోతుని, ఇప్పుడు నాది ఆత్మవిశ్వాసం. లోగడ మొండి రాస్కెల్ ని, ఇప్పుడు చిత్తశుద్ధి-దృఢసంకల్పం కలవాడిని. ఆ మధ్య జడ్డివెధవని, ఇప్పుడు సజ్జనుణ్ణి. లోగడ నోరు విప్పితే అవాకులు -చవాకులు దొర్లేవి, ఇప్పుడు చమత్కారంగా.....సరసంగా మాట్లాడుతున్నాను అంటున్నారు" అన్నాడు శ్రీమంతుడు.
..................................
దృష్టిలోపం:
ఒక కళాసృష్టి జరిగినప్పుడు
రసికుడు: అందులో మంచినీ, అందాన్ని వెతుకుతాడు
విమర్శకుడు: అచ్చుతప్పుల్నీ-తతిమా దోషాల్ని వెతుకుతాడు.
సెన్సారువాడు: బూతునే వెతుకుతాడు
.............................................
జోస్యం
"మీరు డెబ్బైయేళ్ళు బతుకుతారండీ"
"ఏడిసినట్టే ఉంది, నాకు ఇప్పుడు డెబ్బైయేళ్ళే"
"చూసారా, నే చెప్పలే!"
..........................
ప్రముఖుల గురించి రమణగారి మాటల్లో
అమరావతి కథల గురించి చెప్తూ...
"అమరావతి కథలు ప్రేమతో, భక్తితో, ఆవేశంతో సత్యంగారి హృదయం లోంచి ఉప్పొంగాయి. జలపాతంలా ఉరికాయి. బాలకృష్ణవేణిలా పరిగెత్తాయి. స్వామి కోవెల దగ్గర కృష్ణలా భయభక్తులతో తలవంచుకుని నడిచాయి" అన్నారు.
సాలూరి రాజేశ్వరరావుగారి గురించి....
"నిఘంటువులో 'శ్రావ్యసంగీతం' అనే మాటకి అర్థం రాయటానికి మాటలు వెతికి చేర్చేబదులు రాజేశ్వరరావు అని టూకీగా రాస్తే చాలు"
యెస్.వి.రంగారావు గురించి....
"వెండితెరకి రాకుంటే రంగారావు ఏం చేసేవాడు? ఎప్పుడో అప్పుడు ఝామ్మని వచ్చేసేవాడు, అందుకు సందేహమేమిటి!"
కె.వి.రెడ్డి గురించి.....
కృతకమైన సాంఘికం కన్నా సహజమైన జానపదం లక్షరెట్లు మెరుగు. కె.వి. దగ్గర ఉంటే పది లక్షలు మెరుగు. దైవమిచ్చిన జానపదానికి మకుటంలేని రాజు కె.వి.
భానుమతి గురించి.....
చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షర క్రమాన పేర్లు ఎన్నికచేస్తే "బి" శీర్హిక కింద బహుముఖ ప్రఙ్ఞావతి భానుమతి పేరు చేరుతుంది"
రమణగారి గురించి ఇలా రాసుకుంటు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో....ఒక జీవితం చాలదు!
......... అశృనయనాలతో నివాళులర్పిస్తున్నాను.
11 comments:
ఏం చెప్పాలి ఎలా చెప్పాలి. తెలుగు వారు చేసుకున్న అదృష్టం ముళ్ళపూడి. సమకాలీన సాహిత్యం లో ముళ్ళపూడి ని మించిన హాస్య రచయిత లేరు.
ఆయన ఆత్మ కు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.
నిజంగా చీకటిరోజండీ.. ఆయన రచనలను పునశ్చరణం చేసుకోవడం తప్ప ఏమీ చేయలేని అశక్తులం..
మీ టపా బావుంది.
ఆయన ఆత్మ కు శాంతి కలగాలని,బాపు గారికి స్వాంతన చేకూరాలని ప్రార్థిస్తున్నాను
"హన్నా" అంటూ బెదిరించే బుడుగు బేలగా ఏడుస్తున్నాడు
"ప్రైవేట్" చెప్పేందుకు ఎవరూ లేక బాబాయ్ భోరుమంటున్నాడు
"సెగట్రీ" నీ ఆర్డర్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు
"అరుణ" 'అప్పు'డే ఋణం తీర్చుకోద్దంటోంది
"రాధా గోపాళం" రావా రమణా అని పిలుస్తున్నారు
సర్లే ఇవన్నీ వదిలేయి
అటు చూడు బాపు కళ్ళలో ...తన మనసు నీకు తెలీదని కాదు కానీ నువ్వు లేని బాపు ని చూస్తే ఆత్మ లేని శరీరాన్ని చూసినట్టు లేదూ? అయినా
నీ ఆత్మ బాపులో
బాపు ఆత్మ నీలో ఉన్నప్పుడు
తన అనుమతి లేకుండా
పరమాత్మను చేరే హక్కు నీకెక్కడ రమణా?
ఇన్నాళ్లుగ నీ రాతల్లో నువ్వొదిలిన
ఫన్నీలన్నీ ఇపుడు నువ్వు లేవంటూంటే
కన్నీళ్లు ఒక్కుదుటన ధారలవుతున్నాయి
విన్నావా ముళ్ళపూడి వెంకట రమణా
It's a tragic coincidence that Mullapudi and Anant Pai passed away on the same day.
It a double shock for me, who grew up reading Budugu, Tinkle and Amar Chitra Katha.
May their souls rest in peace.
ముళ్ళపూడి వారు నవ్వించడమే కాదు ఏడిపించగలరు కూడానని కోతికొమ్మచ్చి చదువుతుంటే అనిపించింది. తనూ వాళ్ళమ్మా కుళ్ళిపాయలు కొనుక్కుని ఎండబెట్టి పచ్చడి చేసుకుతినడం, ఎలాగైనా బతికితీరాలనే పట్టుదలతో కలం సేద్యం చేసుకునే అతనికి హీరోలూ డైరెక్టర్లూ అని తేడా లేకుండా అవసరం తీరగానే టోపీ పెట్టడం ... ఇలా. వాళ్ళమ్మ గారు చెప్పిందట - తను చనిపోతే ఎవరూ ఏడవకూడదనీ, పెళ్ళిలా ఆనందించమనీని. అలాంటప్పుడు పరిపూర్ణ జీవితాన్ని తను కోరుకున్నవిధంగా జీవించుకున్న రమణ గారిని స్మరించుకోవడమంటే నవ్వితే నవ్వండీ, బొమ్మా బొరుసూ, కోతి కొమ్మచ్చీ పుస్తకాల్ని ఓ పాతిక సార్లు పారాయణ చెయ్యడమే సరైనది. ఏడుపులూ ధుఖాలూ కాదు.
ముళ్ళపూడి వారు నవ్వించడమే కాదు ఏడిపించగలరు కూడానని కోతికొమ్మచ్చి చదువుతుంటే అనిపించింది. తనూ వాళ్ళమ్మా కుళ్ళిపాయలు కొనుక్కుని ఎండబెట్టి పచ్చడి చేసుకుతినడం, ఎలాగైనా బతికితీరాలనే పట్టుదలతో కలం సేద్యం చేసుకునే అతనికి హీరోలూ డైరెక్టర్లూ అని తేడా లేకుండా అవసరం తీరగానే టోపీ పెట్టడం ... ఇలా. వాళ్ళమ్మ గారు చెప్పిందట - తను చనిపోతే ఎవరూ ఏడవకూడదనీ, పెళ్ళిలా ఆనందించమనీని. అలాంటప్పుడు పరిపూర్ణ జీవితాన్ని తను కోరుకున్నవిధంగా జీవించుకున్న రమణ గారిని స్మరించుకోవడమంటే నవ్వితే నవ్వండీ, బొమ్మా బొరుసూ, కోతి కొమ్మచ్చీ పుస్తకాల్ని ఓ పాతిక సార్లు పారాయణ చెయ్యడమే సరైనది. ఏడుపులూ ధుఖాలూ కాదు.
మీ టపా బావుంది. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.
మి టపా బాగుంది మళ్ళపూడి గారి ఆత్మకు శాంతి
కలగాలని ఆశిస్తున్నాను .
సౌమ్యా, మీరు ముళ్ళపూడి గారిని బాగా గుర్తు చేసుకున్నారు. బాగుంది. మొదట ఈ వార్త చూడగానే నాకు మొదట బాపు గారే గుర్తుకొచ్చారు. ఎంత కష్టం, ఎంత కష్టం.. బాపూ మీకెంత కష్టం అని మనసంతా బాధతో నిండిపోయింది.
ముందు నుంచే ఆయన రచనలంటే అభిమానం ఉన్నా, ఈ మధ్య బ్లాగుల్లో కొందరు కలిసినప్పుడు వళ్ళూ చూపించిన ఆప్యాయతని చదివాక వాళ్ళిద్దరి మీద ఇంకా అభిమానం పెరిగింది. నాకు కూడ ఈసారి ఇండియా వచ్చినపుడు వాళ్ళని కలవాలని కోరిక పుట్టింది. కానీ ఇప్పుడయితే ఒక్కరినే వెళ్ళి కలవాలని ఆశ పోయింది.
రమణుడు లేని బాధ నుండి బాపూగారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ...
Post a Comment