StatCounter code

Tuesday, June 28, 2011

రాధనురా నీ రాధనురా!

నిన్న మధురవాణి బ్లాగులో రాసిన కృష్ణా! నేను...నీ రాధని! అన్న టపా చూసాక నాకు పింగళి వారు రాసిన "రాధనురా నీ రాధనురా" అన్న పాట గుర్తొచ్చింది. ఇది పెళ్ళి చేసి చూడు (1952) సినిమాలోది.

రాధనురా నీ రాధనురా!

రాసలీలలా ఊసే తెలియని కసుగాయలకారాధనురా!
వలపున కుమిలే ప్రణయజీవులకు వల్లమాలిన బాధనురా!

రాధనురా నీ రాధనురా!

ఎంతో తెలిసిన వేదాంతులకే అంతు దొరకని గాధనురా!
మధురానగరి మర్మమెరిగిన మాధవ నీకె సుబోధనురా!

రాధనురా నీ రాధనురా!
రాధనురా
నీ దాననురా!

రాధ అనగానే నాకు బోలెడు సందేహాలు ఎప్పుడూ...అసలు రాధ ఎవరు? కొందరు రాధ కృష్ణుడి ప్రియురాలంటారు, అతని కన్నా పెద్దది అంటారు. రాధామాధవుల ప్రేమ అద్వితీయం అంటారు, ప్రణయానికి పర్యాయపదమంటారు. కృష్ణుడిని అనంతంగా ఆరాధించడమే రాధకి తెలిసిన పని అంటారు. రాధ పై కృష్ణుడికి అవ్యాజమైన ప్రేమ, ఎనలేని అనురాగం ఉంది అంటారు కానీ పెళ్ళి చేసుకోలేదంటారు....ఇటువంటి సందేహాలే ఎప్పుడూ. రాధ నాకు ఎప్పుడూ బోధపడలేదు. పింగళి వారి పాట విన్నాక రాధ నాకు ఇంకా చిక్కులు తెచ్చి పెట్టింది. అర్థమయింది అనిపిస్తూనే అంతు చిక్కకుండా ఉంది.

ఈ పాట పింగళిగారి సాహిత్య ప్రతిభని ఆవిష్కరిస్తుంది. రాధని ఒక్కొక్కరు ఒక్కో రకంగా భావిస్తుంటారు. ఈ భావన ని పింగళి వారు నాలుగు స్థాయిలలో చెప్పారు.

రాసలీలలా ఊసే తెలియని కసుగాయలకు ఆరాధనురా!

ఇక్కడ ఆరాధనురా...అంటే ఆరాధ(న)నురా అని అర్థం చేసుకోవాలి.
చిన్నపిల్లలు, రొమాన్స్ అంటే తెలియని లేత ప్రాయం ఉన్నవారికి రాధ ఆరాధన అట. రాధని చూసి అలా ఉండాలి జీవితంలో ఎప్పటికైనా అనుకుంటారు కదా. ఎంతో ఆరాధనగా రాధని తమలో మిళితం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ రాధ కాబట్టి ఆడవారు మాత్రమే అనుకునేరు. కాదు, అటువంటి అనురాగాన్ని తమలో నింపుకోవాలి అని ఆడ, మగ ఇద్దరూ అనుకుంటారు అప్పుడే రెక్కలు విప్పుతున్న నవ యవ్వనంలో.

వలపున కుమిలే ప్రణయజీవులకు వల్లమాలిన బాధనురా!

పై స్థాయి దాటి ప్రేమలో పడ్డవారు/ఉన్నవారికి రాధ ఒక బాధ. ప్రణయానికి, విరహానికి తేడా తెలీనంత ప్రేమలో కూరుకుపోయి బాధపడుతుంటారట. దగ్గరగా ఉన్నప్పుడు ప్రణయం, దూరంగా ఉన్నప్పుడు విరహం రెండూ ఎంతో బావుంటాయి. "విరహం కూడా సుఖమే కాదా, విరహము చింతన మధురము కాదా" అని కూడా పింగళి వారే అన్నారు. "ప్రేమా, పిచ్చీ ఒకటే" అని అనురాగం సినిమాలో భానుమతి పాడతారు. ఇది ఆ స్థాయి అన్నమాట. ఇక్కడ ఆ"రాధ"న కాస్తా బాధగా మారుతుంది, అది తియ్యటి బాధ.

ఎంతో తెలిసిన వేదాంతులకే అంతు దొరకని గాధనురా!

తరువాతి స్థాయి....అన్ని తెలిసి, జీవిత సారం గ్రహించిన వేదాంతులకు రాధ అంతు తెలియని గాధ ట. ఇది నాకెలా అర్థమవుతున్నాదంటే...జీవితంలో ఎంతో ప్రేమని అనుభవించి, ప్రేమ పై తనివి తీరక...ఇంకా కావాలనుకుంటూ, ఎప్పటికీ సంతృప్తి కలగక వేదాంత ధోరణికి చేరి ఈ ప్రేమ కి అంతులేదా అనుకుంటారేమో! అప్పుడు వాళ్ళకి రాధ అలా అనంతంగా మాధవుణ్ణి ఎలా ప్రేమిస్తుందో అని సందేహంతో అంతులేని గాధ గా మిగిలిపోతుంది (ఇది నా కవి హృదయం)

మధురానగరి మర్మమెరిగిన మాధవ నీకె సుబోధనురా!

ఇది పతాక స్థాయి....మానవుని జ్ఞానానికి చిట్టచివరి మెట్టు అహం బ్రహ్మాస్మి అనుకోవడం (దీనిపై విశ్వాసం ఉన్నవారు).....అటువంటి స్థాయికి చేరుకున్నవాడు శ్రీకృష్ణుడే కాబట్టి...ఓ మాధవా, మధురా నగరం మూలమూలలా తెలిసినవాడవు నీకు నేను బాగా తెలిసినదానను...నా గురించి నీకు తప్ప ఎవరికీ గొప్పగా తెలీదు అంటోంది రాధ.

పింగళి వారు ఎంత చమత్కారులో కదా...కాదేదీ కవితకనర్హం అని...రాధని తీసుకుని మానవ జీవిత సారాంశాన్ని ఎంత చక్కగా చెప్పారో!

పాటను వినాలనుకునేవారు ఇక్కడ వినవచ్చు.

P.S: మధురా, ఈ పాటని గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చిన నీకు (నీ పోస్టుకి) ధన్యవాదములు. నీ పోస్టు చదివి తరువాత ఈ పాట విని, భావాన్ని ఆకళింపు చేసుకుని పరవశించాను. నిజం!


38 comments:

మధురవాణి said...

అబ్బ.. ఎంత బాగా చెప్పారు రాధ గురించి.. నాకు తెలీని ఒక మంచి పాటని కూడా పరిచయం చేసారు.
నాక్కూడా రాధంటే స్వచ్ఛమైన, నిస్వార్ధమైన ప్రేమకి ప్రతిరూపంలా, అంతులేని ప్రేమకి అర్థంలా కనిపిస్తుంది! :)
Great post.. Thanks! :)

మధురవాణి said...

అన్నట్టు, నా పోస్ట్ గురించి తలచుకున్నందుకు ఇంకో థాంక్స్ కూడా తీస్కోండి.. :)))

బులుసు సుబ్రహ్మణ్యం said...

ప్రేమా పిచ్చి ఒకటే నువ్వు నేనూ వేరే అనే పాట లైలా మజ్నూ లోదా? నాకు డౌటే.
ఆ సినిమా పేరు గుర్తు రావటం లేదు. "సన్నజాజి తీవలోయ్ సంపంగి పూవులోయ్ చిలిపి సింగారులోయ్ పాపలు సిరులోలికే చిన్నారులోయ్" అనే పాట కూడా అందులోదే అనుకుంటాను. ఏమో సరిగా గుర్తు లేదు. ఇటువంటప్పుడే పెద్దవాడిని అయిపోయాననిపిస్తుంది.

ఒక మంచి పాట గుర్తు చేశారు. థాంక్యూ. ఘంటసాల వారి గొంతు ఎంత మధురం గా ఉందో.

బుద్దా మురళి said...

నాకు అంతగా తెలియదు కానీ కొన్నింటిని అలా ఆస్వాదించాలి అంతే . లోతుల్లోకి వెల్ల వద్దు.అలానే రాధను ప్రేమ తత్వానికి ప్రతిరూపంగా చూడండి రాధా పై మీకు మరింత ప్రేమ పెరుగుతుంది . ప్రేమలో మాత్రం రాధ అందరికన్నా దొడ్డ మనసు అని చెప్పవచ్చు. రాధను ప్రేమ మూర్తి గానే చూడండి ఎంత బాగా నచ్చుతుందో .

మంచు said...

ఒకమాట అడుగుతా ఎమీ అనుకొవద్దు :-))
మీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఒక్క వ్యాక్యం లొ ఇంత అర్ధం ఉందా అనిపిస్తుంది. ఈ లెక్కన నాకు తెలుగు 10% కూడా తెలీదన్నమాట. మీరు ఇలాంటివి తరచూ రాస్తే మాకు చాలా ఉపయోగం అని నా అభిప్రాయం :-))

కొత్తావకాయ said...

బాగుంది పిల్లా! మంచి పాట గుర్తు చేసావ్. పాటని విశదీకరించి, సాహిత్యాన్ని విశ్లేషించి పండితపామరజనులను సమానంగా ఒప్పించి మెప్పించేలా నీలో రీసెర్చ్ స్కాలర్ రాసిన మరో పేపర్ ఈ టపా.(Isn't that a feather in ur cap? :)) మధురవాణి గారిది భావుకత. నీది విశ్లేషణాను.
సంగతేమిటంటే.. రాధ చాలా సంక్లిష్టమైన విషయం. మొన్న మనం మాట్లాడుకున్న "ఓ విషయమంత." అనుభవేకవేద్యమే కానీ తరచి చూసి తెలుసుకొనేంత సులభం కాదు.
ఇక పాటల విషయానికొస్తే నీకీ పాట ఎలా భలేగా గుర్తొచ్చిందో కానీ, నాకు రాధ అనగానే గుర్తొచ్చేవి భానుమతి "నేనె రాధనోయీ గోపాలా, సావిరహే.. తవదీనా" (ఎందుకో, భానుమతి రాధగా నా ఊహ కి అందదు. నా కళ్లకు ఆవిడ స్వాధీన పతిక కానీ విరహిణి కాదు.)
ఇంకో పాట సత్యం స్వరరచనలలో మణిపూస "రాధకు నీవేరా ప్రాణం."

బుధ్ధా మురళి గారికి ఓ ఓటు. రిగ్గింగ్ చెయ్యొచ్చంటే మరోటి కూడా!

కొత్తావకాయ said...

"ప్రేమ పిచ్చి ఒకటే" పాట లైలా మజ్ఞూ లో కాదు. అనురాగం. అది పెంపుడు కొడుక్కి పాడే పాట అనుకుంటా. చరణంలో వస్తుంది చూడూ.."కధ చెపుతాను ఊ కొడతావా.. జో కొడతాను బబ్బుంటావా.. అది ఇది కాదని, అమ్మను కానని అల్లరి చేస్తావా.. " అని. బులుసు గారు కరెష్ట్.

kiran said...

సౌమ్య గారు - నేను ఎప్పుడు ఈ పాట వినలేదు...
మీరు ఎంత బాగా వివరించారో...భలే నచ్చింది...:)
రాధ - symbol of love గా ముద్ర పడిపోయింది మరి చిన్నప్పటినుండి..:)

మాలా కుమార్ said...

ఈ పాట పెళ్ళి చేసి చూడులోదా ! ఈ మద్య తెగ గుర్తొస్తుంటే ఎందులోదా అని తెగ ఆలోచిస్తున్నాను .
రాధ గురించి బాగా రాశారు .

శ్రీనివాస్ పప్పు said...

మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆ"రాధ"నా గీతి పలికింది
జీవన రాగమై బృందావన గీతమై....

అని వేటూరి గారి ఉవాచ.

ఆ.సౌమ్య said...

@ మధురా
ధన్యవాదములు. ఇందులో నేను చెప్పేది ఏముంది...అంతా పింగళి వారి మహిమ. ఎంత బాగా చెప్పారో కదూ!

@బులుసు గారూ
మార్చేసానండీ, ఆ పాట అనురాగం సినిమాలోది....ఎందుకో భానుమతి, ప్రేమ పాట అనగానే లైలామజ్ఞు గుర్తొచ్చింది, ఇంకేమీ ఆలోచించకుందా రాసేసానన్నమాట. మీరు సందేహం వెలిబుచ్చిన వెంటనే మళ్ళీ చెక్ చేసుకుని కరక్ట్ చేసేసాను. ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@ బుద్ధ మురళీ గారూ
అంతేనంటారా! రాధని నేనెప్పుడూ పెద్దగా పట్టించుకోలేదండీ. ఇదిగో ఇలా పాటలు విన్నప్పుడు, కథలు చదివినప్పుడు ఓ సందేహం తళుక్కున మెరుస్తుందన్నమాట. ధన్యవాదములు!

తృష్ణ said...

good analysis soumya gaaru..!

ఆ.సౌమ్య said...

@ మంచు గారూ
హహహ...ఏదో మీ అభిమానం!
ఏమీ లేదండీ ఒకదాన్ని భావిస్తుంటే అర్థాలు అలా తళుక్కున మెరుస్తుంటాయి అన్నమాట...అయినా, మీకు తెలుగు రాకపోవడమేమిటి...చుంబరస్కా అనే కొత్త పదాలు కూడా కనిపెడుతుంటే :D

సర్లెండి మీ కోసం తరచూ రాస్తుంటా :)
ధన్యవాదములు!


@కిరణ్
thanks a lot, మంచి పాట కదూ!

ఆ.సౌమ్య said...

@ కొత్తవకాయ్
రిసెర్చ్ కాలర్ రాసిన మరో పేపరా...హా నువ్వు పొగొడితే అది నా టోపీలో మరో ఈక కాక ఇంకేమవుతుంది చెప్పు :D

అవునే రాధ మహా క్లిష్టం....అందుకే నాకెప్పుడూ బోలెడు సందేహాలు, అనుమానాలు...అసలు కృష్ణుడికైనా అంతుచిక్కిందో లేదో డౌటే సుమీ :)

అవునేవ్...అవీ మంచి పాటలు...బలే గుర్తు చేసావు. అదేమిటో నాకు రాధ అంటే ఎప్పుడూ ఈ పాటే గుర్తొస్తుంది, వేరేవి ఏవీ రావు. సావిరహే నా ఫేవరెట్ పాట...నువ్వన్నట్టు భానుమతిని రాధ స్థానంలో ఊహించకోలేముకాబట్టి ఆ పాట గుర్తు రాలేదనుకుంటా

ఆ పాట అనురాగంలోనిదని తరువాత గుర్తొచ్చింది....మార్చేసా వెంటనే!

ఆ.సౌమ్య said...

@ మాలా కుమార్ గారూ
అవునండీ ఆ సినిమాలోదే. పాత పాటల గురించి మీకెప్పుడు డౌటు వచ్చినా నన్ను అడగండి...ఠక్కున చెబుతా :)
ధన్యవాదములు!

@పప్పుసారూ
మంచి పాటని గుర్తు చేసారు
ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

తృష్ణ గారూ
Thank you so much!

వేణూ శ్రీకాంత్ said...

బాగుంది సౌమ్య.. పాట నాకు కూడా తెలియదు ఇపుడే వినడం.. చాలా బాగుంది.

ఆ.సౌమ్య said...

@వేణూ
ధన్యవాదములు.
ఈ పాట సినిమాలో పెట్టలేదనుకుంటా...ఆడియోలో మాత్రం ఉంది...చాలా మంచి పాట, కానీ రావలసినంత గుర్తింపు రాలేదని నా అభిప్రాయం.

శ్రీనివాస్ పప్పు said...

super

నేస్తం said...

మొన్నేచదివాను పోస్ట్ ... ప్రతి వ్యాఖ్యం చాలా బాగా వివరించారు :)

కృష్ణప్రియ said...

అందమైన పాట పరిచయం అందం గా చేసారు.. నైస్.

కానీ.. చుమ్బరస్కా నేను కనిపెట్టిన పదం.. క్రెడిట్ మంచు గారికి మీరు కూడా ఇచ్చారా? అన్యాయం!

Rao S Lakkaraju said...

ఎన్నాళ్ళకో మళ్ళీ పాట విన్నాను. పాత స్మృతులు బయటకి వస్తున్నాయి. థాంక్స్ ఫర్ పోస్టింగ్.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ said...

నిజానికి (నాకు తెలిసినంత వరకు) భాగవతంలో ఎక్కడా రాధా-మాధవుల ప్రణయం గురించిన ప్రస్తావనే లేదు. జయదేవ గారి గీత గోవిందం కన్నా ముందు వచ్చిన ఏ పురాణాల్లోనూ రాధ గురించి విస్తారంగా ఎక్కాడ చెప్పలేదు. అసలు వారి మధ్య ప్రణయాన్ని సృష్టించినవారు జయదేవ గారే అన్నది నా భావన. ఈ ప్రభందమే వారి ప్రేమకు నాంది. ఆ పైన మన హైందవ సంస్కృతికి రాధా-మాధవ కావ్యాలూ, గేయాలూ ఎన్నెన్ని వచ్చాయో.

వారి మధ్య ప్రేమ ఉనిందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఆ ప్రేమలోని గొప్పతనాన్ని ఆస్వాదిద్దాం...

జై జయదేవా! జై జయదేవా!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ said...

చెప్పడం మరిచాను, పింగళి వారి పాటకు మీరిచ్చిన వివరణ బహుబాగుగానున్నది. ఈ కోణాల్లో ఇదివరకెప్పుడూ వినలేదు ఈ పాటను, నెనర్లు!

ఆ.సౌమ్య said...

నేస్తం
ధన్యవాదములు!

పప్పుసారూ
thank you

ఆ.సౌమ్య said...

@కృష్ణప్రియ గారూ
ధన్యవాదములు!

అయ్యయ్యో అది మీరు కనిపెట్టిన పదామా!....అపరాధం అపరాధం...నేను పొరబడ్డాను...అయితే క్రెడిట్స్ అన్నీ మీకే.

నా బ్లాగు ముఖంగా చెప్పేస్తున్నా...మంచుగారిది కాదు ఆ పదం, కృష్ణప్రియగారిది...ఈ లెక్కన మంచుగారికి అంత తెలుగు రాదు :D

@లక్కరాజు గారూ
ధన్యవాదములు! మీకు సంతోషం కలిగిందంటే మాకూ సంతోషమే!

ఆ.సౌమ్య said...

@భాస్కర్ గారూ
మంచి విషయం చెప్పారు. మన కవుల ప్రతాపమంతా రాధపై చూపించారన్నమాట....మొత్తనికి రాధని ప్రణయానికి ప్రేమకి పునాదిగా చేసేసారు. :)
నా విశ్లేషణ నచ్చినందుకు ఆనందంగా ఉంది...ధన్యవాదములు!

Lakshmi P. said...

నేను సాదారణంగా పాటలు వినను, కానీ ఈ పాట విన్నాను చాల బాగుంది.మా అమ్మాయికి పాటలు అంటే చాల ఇష్టం.

వేణూరాం said...

సూపరు పోస్ట్.. అప్పుడెప్పుడో మాయా బజార్ గురించి రాసినప్పుడు ఎంత బాగా వివరించారో అంతబాగా రాశారు ఇప్పుడు కూడా..! (ఇలాంటి పోస్ట్ లు చదివినప్పుడు నాకనిపిస్తుందీ.. నాకు తెలుగు కూడా సరిగా రాదని ;) ;) ) నేను ఆ పాట ఇంకా వినలేదండీ.. వినొచ్చి మళ్ళీ చెబుతాను..

ఆ.సౌమ్య said...

@రాజ్
thanks a lot... ఏదో నీ అభిమానంగానీ నీకు తెలుగు రాకపోవడమేమిటి...పంచులు ఇరగదీస్తావుగా. :)

@Lakshmi గారూ
ధన్యవాదములు. మరి మీ అమ్మయికి ఈ పాట వినిపించారా లేదా?

శివరంజని said...

sooooooooooooooper చెప్పారు రాధ గురించి...........నాకు తెలుగు కూడా సరిగా రాదని నాకు తెలుగులో ఏ డౌట్స్ వచ్చినా నిన్ను అడుగుతుంటా

ఆ.సౌమ్య said...

@శివ రంజని
Thanks a lot! ఓ తప్పకుండా నీకేదైనా డౌటు ఉంటే అడుగు...నా చాతనయినంతలో చెబుతా!

Afsar said...

సౌమ్య:
అయ్యయ్యో! మిస్ అయిపోయాను ఈ మంచి వ్యాసం!

అన్నట్టూ, మీరు భుజంగరాయ శర్మ గారి "దీపమాలిక" చదివారా? రాధ అంతరంగంలోకి అది కొత్త దీపకాంతి.

ఆ.సౌమ్య said...

@ అఫ్సర్ గారూ
హమయ్య...మీరు చదివి టిక్కు కొడితే నాకు అదో తుత్తి. :)
లేట్ అయినా పర్లేదండీ...చదివారుగా, అదే ఆనందం!
దీపమాలిక? చదవలేదండీ...ఈసారి కొని చదువుతాను.

ధన్యవాదములు!

చాతకం said...

చాలా బాగా విశ్లేషించారు. నాకు మటుకు రాధ మనిషి కాదు [?], అది ఒక కాన్సెప్త్. ;)

ఆ.సౌమ్య said...

@ చాతకం
ధన్యవాదములు!
మీరన్నది కరక్టే రాధ ప్రేమకి సంబంధించిన లోతైన కాన్సెప్ట్!

yaramana said...

ఆ.సౌమ్య గారు,

పాటని లోతుగా విశ్లేషించారు. చక్కగా కూడా రాశారు. పాత పాటల కబుర్లలో మీది VAK.రంగారావు కేటగిరీ.

ఈ పాట సినిమాలో కూడా బాగుంటుంది. మాస్టర్ కుందుకి జి.వరలక్ష్మి రాధ వేషం వేస్తుంది. కుందు డ్యాన్సుకి రామారావు పాడుతుంటే, జోగారావు తబలా వాయిస్తాడు. పాట చివర్లో పోస్ట్ మన్ వేషంలో పద్మనాభం కనిపిస్తాడు.

(ఈ సినిమాలోనే రంగారావు పనివాడిగా కూడా పద్మనాభం కనిపిస్తాడు. పాత సినిమాల్లో ఇలా రెండు వేషాల్లో కనబడుతుండేవారు.)