చిన్నప్పటినుండీ భూకంపం ఎలా ఉంటుందో, జస్ట్ ఆ భావనని మాత్రం పొందాలని బలే సరదాగా ఉండేది. భూకంపం వల్ల వచ్చే పరిణామాలు వద్దు, ఊరికే ఆ అనుభవం మత్రం కావాలి. ఇది ఒక వింత కోరికగా ఉండేది నాకు. ఓసారి నేను పదో తరగతిలో ఉండగా అనుకుంటా...దీపావళి ఇంకో నాలుగురోజులలో వస్తుందనగా...ఓరోజు రాత్రి 8.00 అవుతుండగా ఇంట్లో సామానులు అదిరిపడ్దాయి. భూకంపం అనుకుని నేను, చెల్లి, అమ్మ బయటకి పరుగు....వెంటవెంటనే భయంకరమైన విస్ఫోటనాలు...వరుస ప్రేలుళ్ళు...అప్పుడర్థమయింది అది భూకంపం కాదని. మరో అరగంటలో వార్త మాదాకా వచ్చింది. అక్కడెక్కడో 5-6 కి.మీ దూరంలో ఉన్న టపకాయల దుకాణాల్లో అగ్నిప్రమాదం...వరుసగా 4-5 కొట్లు తగలబడిపోయాయి. ఎంత పెద్ద ప్రమాదమంటే దూరంగా ఉన్న మా ఇంట్లో సామానులు కదిలాయి. చాలా భయమేసింది, బాధేసింది. కాకపోతే భూకంపం కాదా అన్న చిన్న నిరాశ ఎక్కడో మనసులో తళుక్కుమంది. నా కోరిక అలాగే మిగిలిపోయింది.
జనవరి 19, 2011, ఢిల్లీ - ఇంట్లో ఒక్కర్తినే ఉన్నాను. పొద్దున్న లేచి ఆఫీసుకి బయలుదేరుతుండగా కడుపులో తిప్పుతున్నట్టు అనిపించింది...విరేచనాలు. ఇంక ఆఫీసుకి వెళ్ళే ఓపిక లేక సెలవు పెట్టేసాను. ముందురోజు బయట తిన్నదేదో పడలేదు. వాంతులు అవ్వనంతవరకూ ఫరవాలేదనుకున్నాను. ఆస్పత్రికి వెళ్లలేదు. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాను. కానీ మోషన్స్ తగ్గట్లేదు. పంచదార, ఉప్పు కలిపిన నీళ్ళు తాగాను. మా ఇంటికి ఒక అర కి.మీ దూరంలోనే పేద్ద ఆస్పత్రి...ఫరవాలేదు. పది నిముషాలలో వెళ్లిపోవచ్చు....వాంతి అవ్వలేదు కాబట్టి ధైర్యం. సాయంత్రం వరకు ఓ పది పన్నెండు అయ్యాయి...ఎక్కడలేని నీరసం. కాస్త గ్లూకోజ్ తాగి, మజ్జిగాన్నం తిని అలా హాల్ లో సోఫా మీదే పడుకుని టీవీ చూస్తున్నాను. నిద్ర పట్టట్లేదు...పొద్దున్నుండీ పడుకునే ఉన్నాను. సర్లే అని టీవీలో వస్తున్న అడ్డమైన సినిమాలు చూస్తున్నా. అర్థరాత్రి ఒంటిగంట...రెండు...ఉహూ, నిద్ర రావట్లేదు. రెండున్నర అవుతుండగా సోఫా, టీవీ దడదడలాడిపోయాయి. వేగంగా ఊగుతున్నాయి. భయమేసింది, ఒక అరక్షణం ఏమీ అర్థం కాలేదు. ఒక్క గెంతులో కిందకి దూకి బయటకి పరుగెత్తాను. మా ఇల్లు మూడో ఫ్లోర్ లో....తలుపు తీసి బయటకు వెళ్ళాక అనిపించింది చేతిలో సెల్ అయినా ఉంటే బావుంటుందని. మళ్ళీ లోపలికి వెళ్ళి ఎదురుగా కనిపించిన సెల్ తీసుకుని లేప్టాప్ కోసం చూసాను....కళ్ళ ఎదురుగా కనిపించలేదు, బయటకి పరిగెత్తాను. మెట్లు దిగబోతుండగా డౌటొచ్చింది, నిజమేనా? అని. మెట్ల దగ్గర ఎలాంటి కదలిక ఉన్నట్టు తోచలేదు. మళ్ళీ ఇంట్లోకి తొంగి చూసాను. టీవీ, సోఫా ఊగిపోతున్నాయి. డైనింగ్ టేబిల్ కుర్చీలు కదులుతున్నాయి. వెంటనే ఇంటికి తాళం పెట్టి మెట్లు దిగేసాను. మూడు అంతస్థులు దిగేసి చుట్టూ చూసేసరికి మా సొసైటీ అంతా ప్రశాంతమైన నిద్రలో ఉంది. అక్కడా అక్కడా 3-4 మనుషులు తిరుగుతున్నారు తప్ప అలికిడి లేదు. ఒక ఫ్లాట్ లో ఇద్దరు బాల్కనీ లో నిలుచుని కబుర్లు చెప్పుకుంటున్నారు. గార్డ్ దగ్గర ఇద్దరు-ముగ్గురు నిలుచుని మాట్లాడుతున్నారు. మరేమీ ఆలోచించకుండా గార్డ్ దగ్గరకి పరుగెత్తాను. వాళ్ళని అడిగాను ఇక్కడేమైనా భూకంపం వచ్చిందా అని? వాళ్లు అలాంటిదేమీ లేదు అన్నారు. నాకు చాలా భయమేసింది...ఇంటికి ఒంటరిగా వెళ్ళే ధైర్యం లేదు. దొంగ ఎవరైనా వచ్చి బాల్కనీలోకి దూకి తలుపులూ అవీ బాదాడా? ఈ ఊహ రాగానే మరింత గజగజ...అయినా మా సొసైటీలో దొంగతనాలు జరిగే అవకాశమే లేదు....చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకైనా మంచిదని ఆ మాటే గార్డ్ తో చెప్పి ఇంటివరకూ రమ్మన్నాను. అతగాడు నాతో ఇంటిలోపలకి వచ్చి, బాల్కనీలోకెళ్ళి అన్నీ చూసాడు. మళ్ళా ఇంట్లో వాడు, నేను ఇద్దరమే...ఇదే అలుసుగా తీసుకుని వాడేమైనా చేస్తాడేమో అని వంటింట్లోకెళ్ళి చిన్న కత్తి తీసుకుని వాడి వెనకాలే వెళ్ళాను. అతను పాపం అన్నీ చూసి "ఏమీలేదు మేడమ్, మీరు ఊరికే భయపడుతున్నారు...హాయిగా పడుకోండి" అని వెళ్ళిపోయాడు. బతుకుజీవుడా అని కత్తి వంటింట్లో పెట్టేసి, అతను వెళ్ళాక తలుపులు వేసుకుని కూర్చుని ఆలోచించడం మొదలెట్టాను...భ్రమా, భ్రాంతా, చిత్తచాంచల్యమా...ఏమిటి? పొద్దున్నుండీ ఉన్న నీరసం వల్ల మెదడులో ప్లేట్లు ఏమైనా కదిలి అలా అనిపించాయా? అలా అనుకోవడానికి మనసొప్పుకోవట్లేదు. నేను బాగా చూసాను, అన్నీ కదిలాయి. రెండోసారి కూడా చూసాను.....వస్తువులు కదలడం, కాళ్ళు కంపించడం...నేను ఫీల్ అయ్యాను...ఇది నిజం. ఇలా ఆలోచిస్తున్నకొద్దీ ముచ్చెమటలు పోసాయి. మర్నాడు ఎవరిని అడిగినా అలా మాకేమీ అవ్వలేదు అనే జవాబు. ఇంటికి ఫోన్ చేసి చెబితే నీ చిత్తచాంచల్యమే అని ఖరారు చేసేసారు. నాకు మాత్రం అదొక పెద్ద మిస్టరీ లా ఉండిపోయింది. నమ్మలేని నిజం...నా భ్రాంతి అనుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు. నా వెధవ బుర్రకి న్యూస్ పేపర్లు చూడాలన్న జ్ఞానం కలుగలేదు, రోజూ దీని గురించే ఆలోచిస్తూ కొన్నాళ్ళకి మరచిపోయాను (తాత్కాలికంగానే).
మళ్ళీ...ఉగాది రోజు, 2011 - మా అత్తయ్య కొడుకు, ఆంధ్ర భవన్ లో ఉగాది వేడుకల్లో భాగంగా కచేరీ ఇవ్వడానికి వచ్చాడు. తను వయొలిన్ విద్వాంసుడు. ముందురోజు వరల్డ్ కపు ఫైనల్స్ మా ఇంట్లోనే చూసి మర్నాడు పొద్దున్నే వాడు ఏ.పీభవన్ కి, మేము ఆఫీసుకి. సాయంత్రం కచేరికి వస్తాములేరా అని చెప్పాము. సరే ఆరోజు పని అంతా త్వరగా పూర్తి చేసుకుని 5.30 కల్లా దుకాణం కట్టేసి ఏ.పీ భవన్ కి వెళ్ళాలని ప్లాను. 5.00 అవుతుండగా నా కళ్ళ ముందు ఉన్న మానిటర్ ఊగసాగింది. నేను కూర్చున్న కుర్చీ ఊగిపోతోంది. కిందకు దిగుదామంటే దిగలేకపోయాను. సిస్టం ఊగిపోతుంటే దానివైపు భయంగా చూస్తూ ఉన్నాను. అంతే, ప్రకంపనాలు ఆగిపోయాయి. ఒక్క నిముషంలో మళ్ళీ మొదలు...మానిటర్, కుర్చీ అదిరిపోతున్నాయి. ఎలాగోలా దూకి (కిందపడ్డంత పని జరిగింది) నా గదిలో నుండి బయటకి వచ్చేసరికి ఆఫీసులో అందరూ బయటకి వచ్చారు. గోలగోలగా ఉంది. భూకంపం అని అందరూ అరుపులు....నాకు ముచ్చెమటలు పోసాయి. కిందకి పరుగెడదామంటే మా ఆఫీసు ఐదో అంతస్థులో ఉంది. అందరూ గోలగోలగా అటూ ఇటూ పరిగెడుతున్నారు...మరో రెండు నిముషాల్లో అన్ని కంపనాలు ఆగిపోయాయి. అందరూ సర్దుమణిగారు. మరో ఐదు నిముషాలు వేచి చూసి ఇంక కంపనాలు రావు అని నిర్ధారించుకున్నాక "హమ్మయ్యా గండం గడిచింది" అనుకున్నాం. ఇంక అందరూ గుంపులు గుంపులుగా చేరి దీని గురించే మాటలు. అప్పుడు...సరిగ్గా అదే సమయంలో....నా సహ ఉద్యోగి అన్నాడు "మీకు గుర్తున్నాదా, జనవరిలో రాత్రి 2.00 గంటల ప్రాంతంలో ఇలాగే పెద్దగా వచ్చింది. పడుకున్నవాళ్ళం నేను నాభార్య భయపడి బయటకి పరుగెత్తాం" అని చెప్పాడు. ఆ అద్దీ...ఇప్పుడు క్లూ దొరికింది...వెంటనే నేను అడిగాను "జనవరి 19 కదా...రాత్రి 2.30 కి కదా...బాగా కంపనాలు వచ్చాయి కదా...చాలా భయం వేసింది కదా". "అవును" అని నలుగురైదుగురి సమాధానం. హమ్మయ్య అయితే ఆరోజు వచ్చింది భూకంపం అన్నమాట... నా చిత్తచాంచల్యమూ, భ్రాంతి కాదన్నమాట. ఎట్టకేలకు నా చిక్కుముడి విడిపోయింది. కానీ కాళ్ళలోంచి సన్నటి వణుకు వెన్నెముకకి పాకింది. అంటే...అంటే ఆరోజు నేను ఒక్కర్తినీ ఉన్నరోజు భూకంపం వచ్చిందన్నమాట...అది చిన్నదేకానీ భూకంపమేకదా! చాలా భయమేసింది. ఈరోజు...ఈరోజు కూడా భూకంపమే...వెర్రెక్కినట్టయింది...ఏం జరుగుతోంది. భూకంపం అన్న సరదా లేదు పాడు లేదు....అసలేం జరుగుతోంది ఇక్కడ. వెంటనే గూగలోడి సహాయం తీసుకున్నాను. తేలిన విషయమేమిటంటే "ఢిల్లీ లో ప్రకంపనాలు సర్వసాధారణం. ఎక్కడో పాకిస్థాన్ లోనో, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోనో భూకంపం వస్తే ఢిల్లీలో అదురుతుంది. రిక్టరు పై 5 నుండి 5.5 వరకూ నమొదయింది ఇంతవరకూ. 6 దాటితే ప్రమాదం సంభవించవచ్చు. 2009 లో ఒకసారి పెద్ద ప్రకంపనాలే వచ్చాయి. అప్పుడు కాస్త ఆస్థి నష్టం జరిగింది (అదే యేడాది నేను ఢిల్లిలో అడుగు పెట్టాను :P). ఇప్పటివరకూ వచ్చిన భూకంపాలలో అదే పెద్దది". ఇదంతా చదివాక భయం తగ్గిందో, పెరిగిందో తెలీని స్థితి....కానీ అస్తమానం ఇలా వస్తుంటే ఎలా? సరే అక్కడ మా వాడి కచేరీ మొదలయిపోతుందేమో అని ఆఘమేఘాలమీద పరిగెత్తాం ఏ.పీ భవన్ కి. మేము వెళ్లేసరికి ఇంకా గంట టైము ఉంది అన్నాడు. ఈ భూకంపం ధాటికి మా వాడు బెదిరిపోయాడు. వాళ్ళ ట్రూపు మూడో అంతస్థులో ఉందిట. రెండో అంతస్థులో కూచపూడి నృత్యం చెయ్యడానికి వచ్చిన ట్రూపు ఉంది. మావాడు అప్పుడే స్నానం చేసి వచ్చి తువ్వాలుతో ఉన్నాడు. కంపనాలు రాగానే కిందకి పరుగో పరుగు అలా తడి తువ్వాలుతోనే. ఆ నృత్యకళాకారులలో అమ్మాయిలు అప్పుడే డాన్సు బట్టలు వేసుకుంటున్నాను. ఈ దెబ్బకి వాళ్ళు జడిసిపోయి అలా సగం సగం బట్టలతోనే కిందకి పరుగులుట. కాస్త కుదుటపడ్డాక అందరూ ఎవరి గదులకి వాళ్ళు చేరుకున్నారు. మొత్తానికి ఏ.పీ భవన్లో అల్లకల్లోలమైపోయింది. మా వాడు ఒకటే వణుకు...మేము వాడికి పరిస్థితి వివరించి చెప్పాం. "మీరిక్కడుండొద్దు...వచ్చేయండి మనవైపుకి...మీ గురించి ఇలా భయపడుతూ మేము ఉండలేము...ఈ ఉద్యోగాలు వద్దు పాడూ వద్దు" అని వాడు ఒకటే గోల. ఎలాగోలా వాడికి సర్దిచెప్పి కచేరీ మొదలయ్యేలోగా వాడిని కూల్ చేసి పంపించాం స్టేజి మీదకి. ఆ రోజు రాత్రి వార్తలలో ఈ విషయం చెప్పారుట. అమ్మావాళ్లు ఫోను..."ఏమయింది, మీరంతా బాగానా ఉన్నారా?" అని. అందరికి భయం లేదని సర్దిచెప్పాం. మర్నాడు పేపర్లో వార్త...నిన్న సాయంత్రం ఢిల్లీలో కొన్ని ప్రాంతాలలో భూకంపం అని.
ఇంక అది మొదలు నెలా పదిహేను రోజులకో, నెలకోసారో చిన్న చిన్న ప్రకంపనాలు తెలుస్తూనే ఉన్నాయి. నాకు ఎక్కడ ఏ శబ్దం వచ్చినా, గిన్నెలు కదిలినా...ఇంట్లో వస్తువులు కదిలినా నాకు ఇదే భయం. పనిమనిషి ఇల్లు తుడుస్తుంటే టీవీ కదిలింది...పేపరు చదువుకుంటున్నదాన్ని భయంతో దిగ్గున లేచి నిల్చున్నా. నా గుండె ఎప్పుడు అలర్ట్ గా ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న కదలిక కనిపించినా నేను అలర్ట్ అయిపోతాను. పరిస్థితి ఎలా తయారయిందంటే గాలికి పేపరు కదిలినా నా మెదడు అలర్ట్ అయిపోతుంది. కానీ ఎన్నాళ్ళని? చాలా విసుగొచ్చేస్తోంది. నా భయానికి, విసుగుకి తోడు....1. ఇల్లు -మేముండే ప్రాంతాలలో ఈ ప్రకంపనాలు ఎక్కువగా తెలుస్తాయట. 2. ఆఫీసు - మా ఆఫీసు "L" షేప్ లో రెండు పెద్ద బిల్డింగుల మధ్య ఒక వారధిలా ఉంటుంది ఐదో అంతస్థులో. L లో అడ్డగీతేమో ఒక బిల్డింగులో ఉంటుంది. నిలువు గీత వారధిలా ఉంటుంది. ఆ నిలువు గీత కి సరిగ్గా మధ్యలో నా సీటు. వారధిలా ఉండడం వల్ల కంపనాలు ఎక్కువగా తెలుస్తాయి. నా ఖర్మకి ఈ ఎక్ష్ట్రా ఫెసిలిటీస్ ఒకటి. మొన్ననే ఓ 4-5 రోజుల క్రితం ఆఫీసులో కుర్చీలు, టేబిళ్ళూ దడదడ...నేను గజగజ! ఇప్పుడు కాస్త అలవాటయిందిగానీ తీవ్రత ఎంత ఉంటుందో తెలీదు కాబట్టి ప్రతీసారి వణుకు మొదలయి కాసేపట్లో సర్దుకుంటుంది.
ఏ ముహూర్తాన భూకంపం ప్రకంపనాల్ని అనుభవించాలని కోరుకున్నానో...అడ్డు ఆపు లేకుండా తెలుస్తున్నాయి. తథాస్తు దేవతలు ఉంటారని ఇందుకే అంటారు కాబోలు!
29 comments:
నాకూ ఓ మూడుసార్లు భూకంపం అనుభవమయింది. నాకయితే భూకంపం వచ్చినప్పుడు సరదాగానే ఉంది...మరీ ఎక్కువగా వస్తే ఎలా ఉండేదో కాని చాలా తక్కువ మోతాదులోనే వచ్చింది. ఏదేమయినా ఇలాంటి సూచలను కనిపించినప్పుడు పెద్ద అంతస్థుల భవనాలలో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.
స్ల్క్దఫ్జ్స;ల్డ్క్ఫ్ ౩ప్ర ఫ్క్ద్ఫ్;గ్క్గ్/జి వ్జెఒఎ/[ఏ[రివ్క్ర్[ ర్వేకే [ర్ట్ల్వతోట్ ఒవ్త్ప్వ వ్పోవోప్
అయ్యయ్యో ఇదేంటిది కీబోర్డు వణికిపోతోంది. అబ్బే భూకంపం కాదు లెండి. మీ పోస్ట్ చదివిన తర్వాత కీ బోర్డు వణికిన కీ కంపం :))). అయినా అదేం దిక్కుమాలిన సరదాఅండీ మీకు భూకంపాలు చూడాలని? ఇంకా నయం అగ్ని పర్వతం పేలుతుంటే దగ్గరనుంచి ఫోటో తీయాలని, సునామీలో స్విమ్మింగ్ చేయాలని, సాంబారులో పొటాషియం సైనైడ్ వేసుకు తినాలని, బాంబ్ బ్లాస్టింగుల మధ్య పావ్ భాజీ టేస్ట్ చేయాలని అనిపించలేదు. ఇప్పుడు మామూలుగా రాసేసినా ఆ టైం లో మీ మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించగలను. ఇది టైపు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడో మీ చేతుల్లో సన్నగా వణుకు ఉండే ఉంటుంది. పోన్లెండి క్షేమంగా ఉన్నారుగా అది చాలు.
సౌమ్య గారూ,
మీకొక "అయ్యో"(ఇంకే పదమూ తోచట్లేదు నాకు..సానుభూతి లంటివి పెద్ద పదాలైపోతాయేమో అని అనుమానం )
శంకర్ గారూ,
మీకేమో ఒక :)
2009 లో ఒకసారి పెద్ద ప్రకంపనాలే వచ్చాయి. అప్పుడు కాస్త ఆస్థి నష్టం జరిగింది (అదే యేడాది నేను ఢిల్లిలో అడుగు పెట్టాను ).
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్
అసలు కారణం తెల్సింది కదా.
శంకర్ గారూ మీ కామెంట్ మాత్రం సూపర్.
చాలా సంవత్సరాల క్రితం ఒకసారి హైదరాబాద్ లో కూడ వచ్చిందండి భూకంపం.బాగా గుర్తుంది ఇప్పటికీ నిద్రలో లేచి బయటికి వచ్చేశాము
@ సౌమ్య, :-(
@ SHANKAR.S, :-)
superb rasaru....
ఓ సారి నేనూ , మా మరిదిగారు సికింద్రాబాద్ లోని నటరాజ్ థియేటర్ కు సినిమా కు వెళ్ళాము . మేము సినిమా నుంచి వస్తుంటే మా లేన్ లో అందరూ బయట నిలబడి వున్నారు . ఏమిటబ్బా మా కోసం అందరూ బయట నిలబడ్డారా అనుకున్నాము కాని కాదు భూకంపం వచ్చిందిట !. రెండో సారి మేమిద్దరమూ సినిమా కు వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ అదే సీను . ఈ సారీ భూకంపం వచ్చింది అన్నారు . ఇహ అంతే అప్పటి నుంచి మేమిద్దరం కలిసి సినిమా కు వెళ్ళటం మానేసాము :) ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ హైద్రాబాద్ లో భూకంపం వచ్చినట్లు వినలేదు :)
hmmm......
సౌమ్య గారూ,
మరేంటనుకున్నారు. మనం ఏ కోరిక కోరుకున్నా తీరిపోతుందట. ఇప్పటికి పుణ్యం చాలకుంటే ఆ పుణ్యం సముపార్జించుకున్నాకా తీరిపోతుందట మరి మీ పుణ్యం ఏ లెవల్లో ఉందో గానీ ఒకటికి పది సార్లు తీరుతోంది. జాగ్రత్తండోయ్..... . ఇలాంటికోరికలు కోరుకునేప్పుడు.
ఇవన్నీ కాదు కానండీ, కాలేజీ రోజుల్లో రాత్రి కొంచం ఆలస్యంగా పడుకుంటే, ఉదయాన్నే ఇంట్లో వాళ్ళు నన్ను లేపేటప్పుడు 'భూకంపంవస్తోందేమో' అనుకుంటూ ఉలికిపడి లేచేవాడిని.. ఆ స్థాయిలో నిద్ర లేపేవాళ్ళన్న మాట.. (అంతకు తగ్గితే నేను లేచే వాడిని కాదనుకోండి, అది వేరే విషయం) ..బాగుంది మీ టపా.. ముఖ్యంగా దేశ రాజధానిలో లో మొదటి పెద్ద భూకంపం.. :))
పోస్ట్ సగం వరకూ సస్పెన్స్ భలే మైన్టైన్ చేశారండీ. ఏదో థ్రిల్లర్ నవల చదివినట్టూ ఫీలయ్యాను. ;) బాగా నేరేట్ చేసారు.
మూడో ఫ్లోర్ నుండీ దూకేశారా? కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ ;) ;)
నాకు ఇప్పటివరకూ అనుభవం అవ్వలేదు గానీ సునామీ వచ్చినప్పుడూ.. పొద్దున్న ఆరుగంటల సమయం లో అప్పటీకి ఇంకా న్యూస్ తెలియలేదు. ఆ టైం లో సోఫా లో నిద్రపోతున్నారు మా మావయ్య. సోఫా ఊఊఊఊ ఊగిపోతుంటే ఆయన ఇలాగే గోల చేసాడూ. మేమేమో అంతా నీ భ్రమ అన్నాం. తర్వాత టీవీలో చూసి అవాక్కయ్యాం.. ;)
మీ సరదా ఇంత పని చేసిందేమిటండీ? ;) శంకర్ గారూ మీ కమెంట్ అరుపులు...;)
హ్హహ్హహ్హా! మీరు ఢిల్లిలో అడుగుపెడితే కంపించినట్టే... నేను అమెరికాలో అడుగుపెట్టిన రెండురోజులకి భూమి కంపించింది. కాని మనం బిందాస్ గా సోఫాలో పడుకుని నిద్రోతున్నాం! ఇంట్లో ఎవరూ లేరు.. ఒక్కదాన్నే... అసలు నేను పడుకుంటే... భూకంపం వచ్చినా లేవనని అప్పుడు అర్ధమయ్యింది. పాపం మా చందు, మా చందు ఫ్రెండ్స్[వాళ్ళింట్లో ఉన్నప్పుదే వచ్చింది...] ఎంత కంగారుపడిపోయారో... నేను ఎక్కడ భయపడిపోతానో అని. ఫోన్లమీద ఫోన్లు... 'భయపడ్డవా? లేదులే' అనుకుంటూ ;) నాకసలు భూకంపం వచ్చిందనే సంగతే తెలీదు. భలే నవ్వొచ్చిందీ :))) భూకంపాన్ని కూడా లెక్కచేయని నా నిశ్చల నిద్రని చూసి :) ఎంతైనా నేను గ్రేట్ కదా :))
ఏదో విధం గా మీ కోరిక తీరినందుకు సంతోషం. మేము అస్సాం లో ఉండేటప్పుడు భూకంపాలు బాగా అలవాటు అయిపోయాయి. చిన్న చిన్న వాటికి బయటకు కూడా వచ్చేవాళ్ళము కాము. మీ భయం గురించి వింటే జాలిగా ఉంది.
శంకర్ గారూ మీరు కేక, కెవ్వు, సూపర్.
నాది కూడా బులుసుగారి మాటే!.. మొత్తానికి మీ కోరిక తీరింది.
"నా ఖర్మకి ఈ ఎక్ష్ట్రా ఫెసిలిటీస్ ఒకటి." .. అదిరింది
వామ్మో ఏంటి సౌమ్య గారూ.. ఇదేదో హార్రర్ సినిమా చూస్తున్నట్లు ఉంది నాకు. భూకంపాన్ని అంత దగ్గరగా చూసారా..? అదీ అన్ని సార్లు..?
ఏమో భూకంపం ఎలా ఉంటుందో నాకైతే తెలీదు కానీ, మీ టపా చదువూన్నంత సేపూ భయం భయంగా ఊహించుకుంటూ ఉన్నాను, అప్పటి మీ పరిస్థితి ఎలా ఉండి ఉంటుందా అని..
బావుందమ్మాయీ! "కోరెకా తీరెగా.. జీవితమూ సఫలమూ.." అని పాడేస్కో! వంతుకు వరి గంజి కాదు కానీ ఈ కాలిఫోర్నియాలోనూ భూకంపాలు ఎక్కువేనటమ్మోయ్. లిస్టులో రెండోదిట. మొదటిది అలాస్కా ట. విన్నాను ఎక్కడో! ఎప్పుడొస్తుందో! ఏమో పాడు. భయపెట్టి చంపావ్. :(
@ వరూధిని గారూ
ధన్యవాదములు!
కొంచం వస్తే సరదాగానే ఉంటుంది కానీ ఎక్కువగా, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే మాత్రం భయం గుండెల్లో పట్టేసింది :(
మేము జాగ్రత్తగా, అలర్ట్ గా ఉంటున్నాం...thanks!
@ శంకర్ గారూ
హహహహ మీరు కేక...చచ్చాననుకోండి నవ్వలేక :)
అంత పెద్ద పెద్ద కోరికలు లేవు...ఏదో సింపుల్ గా భూకంపం మాత్రం ఫీల్ అవ్వాలనుకున్నా....ఇప్పుడు కరువు తీరా ఫీల్ అయ్యా!
అవునండి ఆరోజు మాత్రం మళ్ళీ బతుకుతాననుకోలేదు...అంత భయమేసింది.
@ రిషి గారూ
:)))
మరే అయ్యో నే!
@ పప్పుసారూ
పట్టేసారా...అనుకున్నా, ఎవరో ఒకరు ఈ మాటంటారని :)
@ లత గారూ
అదే hyd లో వచ్చిందని అందరూ చెబుతున్నారు, జాగ్రత్తండీ!
@ కృష్ణ ప్రియ గారూ....మీరలా ఏడుపుమొహం పెట్టకండి...నాకింకా బెంగ ఎక్కువైపోతుంది :(
హిహిహి just kidding
@ Praveen Kumar B
అంటే నా భయాన్ని బాగా చెప్పాననా? thank you
@ మాల గారూ
హహహ ఎంత నవ్వానో మీ కామెంటు చూసి...బలేవారండీ మీరు!
అయితే మరి తరువాత కలిసి సినిమా చూడలేదా?
@ sunita గారూ
అవును హ్మ్
@ పక్కింటి అబ్బాయి గారూ
బుద్ధి వచ్చిందండీ....మరెప్పుడూ ఇలాంటి వింత కోరికలు కోరను :)
@ మురళీ గారూ
హహహ అయితే కుంభకర్ణుడి శిష్యులన్నమాట...ఇంచుమించుగా నేనూ అంతేలెండి ఒకప్పుడు. ఇప్పుడు చీమ చిటుక్కుమనకపోయినా తెలివి వస్తున్నాది
@ రాజ్
అవునా, అంత బాగా నెరేట్ చేసానా! thank you :)
మూడో ఫ్లోర్ నుండి దూకడం కాదు అబ్బాయీ...సోఫా మీదనుండి దూకాను.
సునామీ వచ్చినప్పుడు మీ ఇంటిలో అలజడి తెలిసిందా? నిజమా?
@ ఇందు
హహహ నువ్వూ, నేనూ ఒకే జాతి అన్నమాట...మనమెక్కడ అడుగు పెడితే అక్కడ భూకంపాలు సృష్టిస్తాం.
హిహిహి...అయితేనువ్వూ కుంభాకర్ణుడి శిష్యురాలివే! కానీ అంత నిశ్చల నిద్ర ఉండడానికి అదృష్టం ఉండాలి..నిజం!
@ బులుసుగారూ
ఆహా బాగా తీరిందిలెండి కోరిక :)
అవునా, అస్సాం లో కూడా ఈ తీవ్రత ఎక్కువా? అలాగే నాకూ కొన్నాళ్ళకి అలవాటయిపోతుందేమోలెండి ఇక్కడ ఢిల్లీలో.
@ రవి కిరణ్ గారూ
ఆహా కరువు తీరా తీరింది :)
thank you
"పొద్దున్నుండీ ఉన్న నీరసం వల్ల మెదడులో ప్లేట్లు ఏమైనా కదిలి అలా అనిపించాయా? అలా అనుకోవడానికి మనసొప్పుకోవట్లేదు"
- అదిగో అదీ సౌమ్య, అసామాన్య!
మీరు ఇక్కడ ఇంత భూకంపం పుట్టిస్తున్నారని నిజంగా నాకు తెలియదు. ఆలస్యంగా చూశాను, కానీ, అది విషం కాలేదు...మరో సారి, మీ వచనం హాయిగా వుంది, ఇంత భూకంపంలోనూ!
@ అప్పూ
అవును, చాలా బాగా ఫీల్ అయ్యా ఆ తీవ్రతని...చెప్పాగా ఏ ఆకు కదిలినా భయమేస్తుందని అంత లా ఫీల్ అయ్యాను :(
కొన్నాళ్ళకి అలవాటయిపోతుందేమోలే!
@ కొత్తవకాయ్
హహహ నువ్వు రాకుండానే భయ్పడుతున్నావా...నా తల్లే!
ఏం కాదులే భయపడకు...నన్ను చూసి ధైర్యం తెచ్చుకో!
@ అఫ్సర్ గారూ....ధన్యోస్మి :)
హహహ విషం కాలేదు కాబట్టి మంచి ఆలశ్యమే...పర్లేదు.
ధన్యవాదములు!
బాబోయ్ అసలు మీకు భూకంపం చూడాలి అని ఎలా అనిపించిందండి..?
మొత్తానికి చూసారు..కానీ ఇప్పుడు కొత్త కంగారు మొదలయ్యిందన్నమాట...!!
జాగ్రత్త మరి..
మనలో మనమాట....ఒక్క రోజు వాంతులు...విరోచనాలకే..బ్రెయిన్ లో plate లు కదిలిపోతాయ.. :O
అవేమన్న స్టీల్ plate లు ..ప్లాస్టిక్ plate లా :D
ఎంత సేపు నవ్వానో..:)
అసలు విషయమేంటంటే లక్షల సంవత్సరాల కిందట ఆఫ్రికా నుండి విడివడిన భరతఖండం ఈశాన్యంగా కదులుతూవచ్చి ఆసియాను అతుక్కున్నది చాలక "పదండి ముందుకు పడండి తోసుకు" అని గుడ్డిగా దాన్ని తోసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంది. ఈ తోపుడు వల్ల అంచులు పైకి ఉబ్బిన భాగమే హిమాలయాలు. అందుకే వీటి ఎత్తు కూడా పెరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అంచులు (tectonic plate boundaries) ఉన్న ప్రతిచోటా భారీ భూకంపాలు, అగ్నిపర్వతాలు సర్వసాధారణం. పసిఫిక్ మహాసముద్రంలోనైతే ఈ అంచులు వృత్తాకారంలో కలిసిపోయి ఉన్నాయి. ఆ వృత్తాన్నే ముద్దుగా అగ్ని వలయం (Ring of Fire) అంటారు. విలయాలకు అది నిలయం. భూకంపాల విషయంలో దక్షిణభారతీయులు అదృష్టవంతులైతే అగ్నిపర్వతాల విషయంలో యావద్భారతదేశమూ పుణ్యభూమే అనుకోవాలి. ఎందుకంటే మనకున్న ఒకే ఒక్క Plate Boundary దక్షిణ భారతదేశానికి దూరంగా హిమాలయాల్లో ఉండడం వల్ల కొంపలు కూలేంత భూకంపాలు దక్షిణ భారతదేశంలో అరుదుగా మాత్రమే వస్తాయి. అంతపెద్ద ప్లేట్ బౌండరీ ఐనా హిమాలయాల్లో అగ్నిపర్వతాలెందుకు లేవో భూభౌతిక శాస్త్రవేత్తలకే అర్థం కాలేదింకా. ఢిల్లీలో మాత్రం ప్రతిరోజూ భూప్రకంపనలు వస్తూనే ఉంటాయి. నీరవ నిశీధిలో ఇవి స్పష్టంగా తెలుస్తాయి. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రతిరాత్రీ పొద్దుపోయాక మా రూమ్మేట్లు "tremors, tremors" అని అనుభూతి చెందేవాళ్ళు. నేను అంత సున్నితం కాకపోవడం వల్ల నాకు అరుదుగా మాత్రమే తెలిసేవి. ఏమైనా హిమాలయాల్లో భారీ భూకంపాలు వచ్చే ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంది. పైగా ఉత్తరభారతదేశంలో నేల కూడా మెత్తటిది. (అక్కడ ఒకప్పుడు సముద్రముండేది. హిమాలయాల్లో నుంచి ప్రవహించే నదులు తెచ్చి పడేసిన మట్టితో పూడిపోయి విశాలమైన మైదానం ఏర్పడింది.) కాబట్టి జరగబోయే ప్రమాదాన్ని ఊహించవచ్చు. భూకంపాలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందు తెలుసుకోండి.
@ త్రివిక్రం గారూ
చాలా మంచి విషయాలు పంచుకున్నారు. thanks. దక్షిణ భారతం అంత సుఖం లేదు ప్రకృతి వైపరీత్యాల విషయంలోనైనా, యుద్ధాలు, శతృవుల విషయంలోనైనా. కదా!
ఢిల్లీ లో భూకంపాలు (చిన్న మొతాదులో) అతి సహజం అని అర్థమయిపోయిందిలెండి. మీరన్నట్టు జాగ్రత్తలు తెలుసుకుని మసులుకుంటున్నాం. thanks a lot!
Post a Comment