StatCounter code

Monday, November 21, 2011

శ్రీరామరాజ్యం

నేనూ శ్రీరామరాజ్యం చూసేసానోచ్. శనివారమే చూసాను కానీ "ఆ శని, ఆది వారాలు బ్లాగు/బజ్జు ఎవరు చూస్తారులే, సోమవారం తాజాగా రాద్దాం" అని ఊరుకుంటే...అయ్యబాబోయ్ అందరూ చూసేయడం, రాసేయడం కూడా అయిపోయింది. అయినాసరే నేను రాసి తీరుతాను...మీకూ చదవక తప్పదు. :P

కథ మనకు తెలిసినదే. దానిలో న్యాయాన్యాలు, వాదోపవాదాలు ఎరిగినవే. దాని గురించి మళ్ళీ రాయక్కర్లేదు. బాపూ ఈ సినిమాని ఎలా తీసారో చూద్దామని వెళ్ళాను. సినిమా నేను అనుకున్నంత గా లేదు....నాకు కొంచం నిరాశ కలిగినమాట వాస్తవం. చాలరోజులుగా వేచి చూస్తున్నాను దీని కోసం. వెళ్ళే ముందు పెద్దగా రివ్యూలు చదవలేదు. బాగుంది అన్న టాక్ మాత్రం విన్నాను. చాలా expectatios తో వెళ్లాను. కానీ కొంచం నిరాశ ఎదురయింది.....గొప్పగా లేదు, బాపూ చమక్కులున్నాయి కాబట్టి బానే ఉంది.

కానీ ఏంటో నాకు లవకుశ జ్ఞాపకాలను వీడిపోవడం దుస్సాధ్యమయింది ఎంత ప్రయత్నిచినా సరే. ముఖ్యంగా లవకుశలో పద్యాలు, పాటలు అన్నీ కంఠతా రావడంతో ఏ సీనులో ఏపద్యమొస్తుందో పాడేసుకుంటూ ఉన్నాను. బొమ్మ ఇప్పటిది, పద్యాలు-పాటలు ఆనాటివి అన్నట్టు అయింది నాకు. అతి ముఖ్యంగా "ఏ మహనీయసాద్వి, ప్రతిదినమేను తొలుదొల్త, ఇది మన ఆశ్రమమ్ము, హ్రీంకారాసంగర్భితానలశిఖాం, కన్నులారగ తొలిసారి కొలువుదీరి" లాంటి పద్యాలు గుర్తురాకపోవడం అసాధ్యం అనిపించింది.

కుశలవుల బొమ్మలు పోస్టర్లలో ఎక్కడా కనిపించనివ్వకుండా ఉత్సుకతని పెంచారు. నేను మొట్టమొదటినుండీ వేచి చూసినది వారికోసమే. అయితే చూసాకా కాస్త నిరుత్సాహమనిపించింది. ఆ లవకుశులతో పోలిస్తే ఈ కుశలవులు తేలిపోయారు. నటన బాగానే ఉందిగానీ ఏమిటో...నాకు అంత నచ్చలేదు. పైగా డబ్బింగ్ పిల్లలిద్దరికీ వేరే ఎవరిచేతనో చెప్పించినట్టు అనిపించింది. ఆంజనేయుడు చిన్నపిల్లాడుగా రావడం నచ్చింది. ఆ అబ్బాయి కూడా బాగా చేసాడు. రామ రామ పాట నాకెంతో నచ్చింది.

ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా నయనతార గురించి చెప్పుకోవాలి. ఆహా ఎంత ప్రసన్నత, ఏమి అందం, ఎంత ఒదిగిపోయింది ఆ పాత్రలో! నయనతార ఎంపికని అనుమానించినందుకు ఇప్పుడు లెంపలు వేసుకుంటున్నాను. అయితే అంజలి దేవితో పోలిక లేదు కానీ పాత్రకి న్యాయం చేసిందనే చెప్పాలి. కన్నెసీత గా భలే ముద్దుగా ఉంది. సాధ్వీమణిగా అంతకన్నా ఇంపుగా ఉంది. నయనతార నటనకి సగం మార్కులు, సునీత డబ్బింగ్ కి సగం మార్కులు ఇవ్వాలి.

బాలకృష్ణకి, NTR తోనూ పోలిక రాక తప్పదు. బాలయ్యబాబు బాగా చేసాడు, నిజంగా. నాకు బాగా నచ్చినది అతని డైలాగ్ డెలివరీ. బాధతో, దుఃఖం తో గొంతు జీరబోయినట్టు పలికిన సంభాషణలు ఇంకెవ్వరివల్లా కాదు అనిపించింది. కొంత గాంభీర్యం, కొంత దైన్యం, కొంత నిస్సహాయత, కొంత బాధ...బాగా చూపించగలిగాడు. లవకుశలో NTR లో అన్నీ పరిస్థితులలోనూ గాంభీర్యమే కనిపిస్తుంది. కానీ ఈ రాముడిలో కొంత దైన్యం కనిపిచింది. అది సహజం కూడా. అలా పాత్రని రూపొందించడంలో బాపు గారిని మెచ్చుకోవాలి. కొన్ని చోట్ల రామారావు రూపు ని గుర్తు తెచ్చింది...NTR ని ఇమిటేట్ చేసినట్టూ అనిపించింది. ఒకచోట "చిరంజీవులారా" అని తమ్ములతో అన్నప్పుడు అచ్చు రామారావే కనిపించాడు. అది NTR ఆహార్యమే. కాకపొతే క్లోజప్ షాట్లలో బాలయ్య ని భరించడం నావల్ల కాలేదు. ముదిమి ఛాయలు మీదపడిన బాలయ్యని ఎందుకు అన్ని క్లోజప్ షాట్లలో చూపించారో అర్థం కాలేదు. దగ్గరనుండి చూస్తే మరీ ఇంకులో ముంచినట్టు మేకప్ ఎక్కువయిందనిపించింది. బాపూగారు ఈ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉండవలసినది. ఓ పదేళ్ళ క్రితం బాలయ్య ఈ సినిమా చేసుంటే ఆ రాముడి పాత్రకి పూర్తి న్యాయం చేసేవాడేమో! నవ్వొచ్చిన విషయం ఏమిటంటే వీపు మీద కాటుకమచ్చ పెట్టడం, అది కనిపించేలా రెండు షాట్లు తియ్యడం. :)

ఇళయరాజా సంగీతం మొదట్లో అంత గొప్పగా ఏమీలేదు అనిపించినా వినగా వినగా నచ్చింది. కానీ ఆడియోలో విన్న అన్ని పాటలూ సినిమాలో లేకపోవడం నిరుత్సాహపరిచింది. "కలయా, నిజమా" పాట ఎలా తీసుంటారో అని తెగ ఆశగా చూసాను...కానీ ఆ పాట సినిమాలో లేదు. :( నేపథ్య సంగీతంలో వయొలిన్ బిట్స్ చాలా వినసొంపుగా బావున్నాయి. పాత-కొత్త సంగీతాల కలయికలా ఉన్న నేపథ్య సంగీతం వీనులవిందుగా ఉంది. సీత సీమంతం పాట అనవసరమనిపించింది. జొన్నవిత్తుల సాహిత్యం చెప్పుకోదగ్గది. కానీ పద్యాలు లేని లవకుశని ఊహించడం కష్టమయింది.

వాల్మీకి పాత్రలో నాగేస్రావు గంభీరంగా కనిపించారు. ఆయన నటనని, ఆహార్యాన్ని శంకించే పనిలేదు గానీ...నాగయ్యగారిలో ఉన్న ప్రశాంతత కనిపించలేదు. నాకెందుకో ఏ విశ్వామితృడి పాత్రకో, పరశురాముడి పాత్రకో సరిపోతాడేమో అనిపించింది. కానీ ఇంత వయసులోనూ ఉచ్ఛారణలోని స్పష్ఠత, అభినయం మెచ్చుకోదగ్గది. అదే కంటితో బాలయ్యని (వశిష్టుడు) చూస్తే బాధేసింది. ఒకప్పుడు ఎంత చక్కగా డైలాగులు చెప్పేవాడు. ఇప్పుడు ఏదో నొక్కిపట్టినట్టు, వత్తి వత్తి కష్టపడి డైలాగులు చెబుతుంటే కష్టమనిపించింది. మిగతా పాత్రలలో అందరూ బాగానే సరిపోయారు.

కాకపోతే సినిమాలో మెలోడ్రామా ఎక్కువైనట్లుగానూ, మధ్యలో కాస్త సాగతీతగానీ అనిపిచింది. పాత లవకుశలో ఏడుపు తక్కువ...కళ్ల నీళ్ళు సున్నితంగా చిందించడం తప్ప భోరున ఏడవడం లేదు. కానీ ఇందులో ఉంది. కుశలవులు అంతఃపురంలో రామాయణ గానం చేస్తున్నప్పుడు కౌసల్య మున్నగువారు భోరు భోరున విలపించడం కాస్త చికాకు కలిగించింది. వాళ్ళు రాజమాతలు...ఎంత కష్టంలోనైనా కొంత సంయమనం, గాంభీర్యం ప్రదర్శించడం అవసరం. దీనాలాపన అంతగా నప్పలేదు. అలాగే సీత పాత్రలో కూడా...చాలా చోట్ల ఏడుపు ఎక్కువయినట్టు అనిపించింది. మిగతా పాత్రలలో కూడా అక్కడకడా ఏడుపుని చొప్పించారు. ఏడవని పాత్ర ఏదీ లేదనుకుంటా. ఈ మెలోడ్రామా కొంత భరించలేకపోయాను.

ఇంక రమణ గారి డైలాగులకి వంక లేదు. బాపూగారి చమక్కులు మాత్రం మరోసారి గుర్తుచేసుకోదగ్గవి. నాకు బాగా నచ్చిన విషయం...చివరిలో సీత రామునికి నమస్కారం పెట్టే అంశం....సీతకి రామునిపై అవ్యాజ్యమైన ప్రేమ ఉంది కానీ మాటమాత్రమైనా చెప్పకుండా ఇలా విడిచిపెట్టాడే అన్న కోపం, అలక కూడా ఉన్నాయి. అలా లేకపోతే అసహజం. ఆ కోపాన్ని, అలకని బాపు గారు చిత్రించిన తీరు అనితరసాధ్యం. అలాగే ఆపద సమయంలో ఆదుకుని రక్షగా నిలిచిన వాల్మీకికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుని నమస్కరించే సన్నివేశం.....రామునికి, వాల్మీకికి నమస్కారాలలో తేడా ని గొప్పగా చూపించారు బాపూగారు. ఎంత అలక, కోపం ఉన్నా, తన తల్లి భూదేవితో వెళ్ళిపోతున్నప్పుడు చివరిసారిగా రాముని ప్రేమతో, ఆర్తితో చూసే సీతని చూస్తే నిజంగా ఏడుపొచ్చింది.

ఇక సీత కుటీరంలో ఒక రాతిపై రామబాణాన్ని ప్రతిష్ఠింపజేసి పూజిస్తుంటుంది. ఆ బాణం మొదట్లో విరిగిన తన గాజుని చంద్రవంకగా నిలిపి తమ అనురాగానికి సాక్ష్యాన్ని ఆ బాణంలో పొదగడం నన్ను విశేషంగా ఆకర్షించింది. రామబాణం, రాముని సీత - తిరుగులేనివి, చెక్కుచెదరనివి. ఈ రెండు విషయాలను ఒకే ఒక్క అంశంలో బంధించడం బలేగా ఉంది.

కౌటిల్య రాసినట్టు సీత చేతినుండి గాజులు ఊడిపడడం - ఆమె రాముని గూర్చి ఆలోచించి చిక్కిశల్యమైపోయినదనే విషయాన్ని అన్యాపదేశంగా వివరించడం...జయహో బాపు.

సింహాసనం ఎక్కబోతూ సీతను చిటికినవేలు పట్టుకుని సహా తీసుకెళ్లడం. సింహాసనం పై కూర్చున్న సీతను స్వయంగా లేపి సీత తో సహా రాజ్యపాలన సాగించబోతున్నట్టు రామరాజ్యం అనగా రాముడు సేవించిన రాజ్యం అని చెప్పడం. మొదట్లో సీత ఒడిలో తలపెట్టుకుని ఎలా కూర్చున్నాడో, మధ్యలో బంగారు సీత తొడిలో తలపెట్టుకుని అదే ఫోజులో కూర్చోవడం.....అంటే అదే మమతను, అనురాగాన్ని అనుభవిస్తున్నట్టు చూపించడం....బావుంది. సీతాలక్షణభరతశతృఘ్న సమేతంగా రాజ్యపాలన గావిస్తాను అని ప్రమాణం చేసినప్పుడు భరతలక్షణులు అవును అన్నట్టు తలూపడం లాంటి subtle expressions బాగా చిత్రీకరించారు.

"లేరుకుశలవుల సాటి" పాట పల్లవిని మాత్రం కుశలవుల చేత పాడించడం నచ్చింది. రాముడు, సీత మధ్య సరసం సున్నితంగా ఉంది. బాపు గారి postures తెలిసినవే కదా..చూడ్డానికి బావున్నాయి. సెట్టింగులు బావున్నాయి కానీ వనం లో జింకలు, నెమళ్ళని గ్రాఫిక్స్ లో పెట్టడం నచ్చలేదు. సహజమైనవాటిని వాడి ఉంటే బాగుండేది. పేటా తో గొడవ వస్తుందనో ఏమో అసహజంగా చిత్రీకరించారు. అవెందుకో కంట్లో ముల్లులా గుచ్చుకున్నాయి అక్కడక్కడా.

సినిమా చూస్తున్నప్పుడు ఒక చిన్న సరదా సంఘటన జరిగింది. ముందే చెప్పానుగా లవకుశలో పద్యాలు నోటవెంట వచ్చేస్తున్నాయని. అతికష్టంచే బయటకి రాకుండా నోట్లో పాడుకుంటూ ఉన్నాను.

వాల్మీకి సీతని ఆశ్రమానికి తీసుకొచ్చి చూపిస్తూ ఇంకా డైలాగులు మొదలెట్టలేదు....అనుకోకుండా నా నోటివెంట "ఇది మన ఆశ్రమంబు ఇచట నీవు వశియింపుము లోకపావని" అని పైకే వచ్చేసింది. సరిగ్గా అదే పద్యాన్ని నా వెనుక వరుసలోనూ, ఆపై వరుసలోనూ ఇద్దరు అందుకున్నారు. ముగ్గురం ఒకేసారి బయటకి పాడేసరికి హాలంతా ఘొల్లున నవ్వులు. ఎంత తమాయించుకుందామన్నా నాలాగే మరికొందరికి లవకుశ వదలడం లేదన్నమాట అనుకున్నాను. :)

అయితే మనల్నే కాదు బాపు-రమణ గార్లని కూడా వీడలేదు. అందుకే ఒకచోట వాల్మీకి సీతను లోకపావని అని పిలుస్తారు (లక్ష్మి అని నామకరణం చేసినా సరే). అలాగే "లేరుకుశలవుల సాటి" పాట పాడించడం...మున్నగునవి. :)

మొత్తానికి సినిమా కాస్త నిరాశపరిచినా బాపు-రమణల కోసం, నయనతార కోసం, వైవిధ్యమైన బాలయ్యబాబు కోసం ఒకసారి చూడొచ్చు. నయనతార ఎక్కువ మార్కులు కొట్టేసింది.


38 comments:

..nagarjuna.. said...

కొంచెం అటుఇటుగా నాది కూడా మీ అభిప్రాయమే. పాత లవకుశ తో పోల్చటం కాదుగాని ఆ తరం నటులు తమ హావభావాలను పలికించినంత హుందాగా ఈ తరం నటులు పలికించరేమో.
నచ్చని మరొక అంశం రోదనలు. మనసును ద్రవింపజేసే వేదనను తెలియజెప్పటానికి ఏ కారణంతో రోదనను ఎంచుకున్నారో అంతుపట్టడంలేదు. ప్రతీ పాత్ర ఏడవటమే!

ఏదేమైనా ఈ కాలంలో మనవాళ్లు పౌరాణిక సినిమాలు తీయలేరు అనే నాలాంటోళ్ల అభిప్రాయాన్ని బాపు-రమణ చెత్తకుండీలో పడేట్టు చేసారు. హ్యాపీస్ :)

కృష్ణప్రియ said...

:) సౌమ్య,

మీలాగే నాయన తార తో సీత ఏంటి? సరిగ్గా చేయదు అనే ఒక సంశయం లో ఉన్నాను. మీరంతా ఇలాగ ఆవిడ ని పోగిడేస్తుంటే, చూసి తీరాలి అనిపిస్తుంది.

మీరు,మీ చుట్టుపక్కల వరసల్లో వారు పద్యాలెత్తుకున్నసీన్ కి :))))

శేఖర్ (Sekhar) said...

కుర్రవాడినవటం వల్లనేమో సినిమా కొంచెం ఓపిగ్గా చూడాల్సి వచ్చింది.హాల్ మొత్తం మీద 15 మందికి మించి లేము..అది కోడ ఒక కారణం ఏమో...
నాకు ఐతే సినిమా నచ్చింది....ఇలాంటి కాలం లో ఇలాంటి పౌరాణిక సినిమా రావటం నిజం గ మన అదృష్టం...
బాలకృష్ణ చేత బాపు గారు బాగా చేయించారు....సీత పాత్ర గురించి చెప్పకర్లేదు..నాకు బాలరాజు బాగా నచ్చాడు
రాజేంద్రప్రసాద్ సినిమా ఉంటది రాంబంటు అని బాపు గారిది...అందులో పిల్లవాడి లాగా ఇక్కడ బాలరాజు కోడ బాగా చేసాడు ...రాంబంటు ఎవరన్న చూడకపోతే ఇప్పుడు కోడ ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.

ప్రసీద said...

సౌమ్య గారు.. చాలా బాలన్స్ డ్ గా, బాగా రాసారు. ఇంత బాగా అందరూ చెప్తుంటే ఈ సినిమా తప్పకుండా వీలైనంత తొందరలో చూడాలని అనిపిస్తొంది. ముఖ్యంగా బాపూ గారి కొత్త సీత గురించి. మీరు అలా పద్యాలుకూడా పాడేసారన్నమాట. భలే :)

Srikanth M said...

రమణ గారు మరణం సినిమాలోని డైలాగుల మీద పడింది అంటున్నారు. కొన్ని డైలాగులు బావున్నాయి. కొన్ని అస్సలు బాగాలేవు అని టాక్..

పదేల్లకు ముందు బాల క్రిష్ణ ఇంత చక్కగా నటించ గలిగే వాడు కాదేమో నండి. అప్పుడు కనుక తీసుంటే ప్రేక్షకులు ఎన్ని వంకలు పెట్టుండే వారో.. :-D.

Raj said...

ఇది మరీ బాగుంది అండి... అదేదో సినిమాలో చెప్పినట్టు నాకు తాజ్ మహల్ అంటే ఇష్టమే కానీ నా ఇల్లు అలా ఎందుకు కట్టుకోలేదు అంటే దానికి సమాధానం ఉండదు అని....


పాత లవకుశ మన అందరికీ నచ్చినదే.. కానీ ఈ సినిమా కూడా అలా ఎందుకు తీయలేదు అంటే బాపు గారి దగ్గర కూడా సమాధానం ఉండదు... ఇప్పటి generation పిల్లలకి(1995 తర్వాత పుట్టిన వారికి) మీరు ఆ పాత లవకుశ సినిమా చూపించండి.. ఏం పద్యాలు అవి?? ఏం పాటలు అవి?? అంటారు.. వాటిలో ఎంతటి మహోన్నతమైన అర్ధం ఉన్నపటికీ సగటు ప్రేక్షకులకి అర్ధం కానంతవరకు వ్యర్ధమే కదా.. మనం అందరమూ అప్పటి లవకుశ సినిమాని ఆదరించి అర్ధం చేసుకున్న వాళ్ళమే కదా.. ఇప్పటి వాళ్లకి అర్ధమయ్యేలా బాపు గారు ఇలా తీసి ఉంటారు...

ఏది ఏమైనప్పటికి మీరు నిరాశ చెందిన హృదయంతో వ్రాసారు అనిపిస్తుంది... అలా కాకుండా మీకు లవకుశ సినిమా తెలియదు అని ఒకసారి అనుకొని మళ్ళి thinkఅండి చెప్తాను...

by the way.... బాలయ్య బాబు ఎగురుతున్నప్పుడు మా hallలో కూడా screen కదిలినట్టు అనిపించింది.. మీకు ఆ అనుభవాలు ఏమి లేవా?? :P

వేణూ శ్రీకాంత్ said...

బాగా రాశారు సౌమ్యా... లవకుశ తో పోల్చడం ఈ సినిమాకి ఇబ్బందికరమే. ఈ తరం ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని బాపూరమణలు చేసిన మార్పులు మెచ్చదగినవిగానే అనిపించింది. నయనతార+సునీత(డబ్బింగ్) కలపి సీతను చక్కగా మన కళ్ళముందు నిలిపారు బాపు.

Anonymous said...

ఈ సినేమా బాగుంది. ఎవరైన ఒకసారి తప్పక చూడవచ్చు.

* మాటలు కొన్ని అస్సలు బాగాలేవు అని టాక్.* మాటలలో లోపాలు వెదకే అంత పండితులు ఎవరో, వారు సినేమా చూడకుండా ఉంటే తెలుగు ప్రజలకి చాలా సహాయం చేసిన వారౌతారు.

శేఖర్ (Sekhar) said...

ఈ comparisions సినిమాల తో నే ఆగిపోతే బాగుండు..
నిజ జీవితం లో ఒకరి తో ఒకరు compare చేసుకొని జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళని చాల మంది ని చూసాను...

Hard to believe but true.... Comparison kill one day.

Kamal said...

bagundi mee review... marla movie kallaku kanipinchindi...

Kamal said...

bagundi mee review.. marla movie chusina flng kaligindi.. nene ememi anukunnano avanni raasaaru..

yaramana said...

ఓపిగ్గా సినిమా చూసి..
అంత కన్నా ఓపిగ్గా రివ్యూ రాశారు!
నాకు ఈ సినిమా చూసే ధైర్యం లేదు.
కాబట్టి సినిమా గూర్చి రాసేదేమీ లేదు.
మీ రివ్యూ బాగుంది!

సుజాత said...

సౌమ్యా, లవకుశ మన రక్తం లో జీర్ణించుకుపోయింది! అందుకే పద్యాల కోసం మనసు ఆక్రోశించింది. రాముడు, లవకుశులు కలుసుకోగానే "స్త్రీ బాల వృద్ధుల జంపకూడదటంచు నే గొంకు చుంటి" అని గొణుగుతూనే ఉన్నాను. ఇది హైద్రాబాదు కాబట్టి నాతో ఎవరూ శృతి కలపలేదనుకో! అలాగే సీత లలితా దేవి పూజ మొదలు పెట్టగానే "హ్రీంకారాసన గర్భితానల శిఖాం" అని మొదలెట్టాను.

ఏమిటో నాక్కూడా చివరికి అసంతృప్తిగా అనిపించింది.

మల్లాది లక్ష్మణ కుమార్ said...

సౌమ్య గారూ, మీరు మాయాబజారు లోనే పీహెచ్ డి చేసారనుకున్నా లవకుశ లో కూడానా... భలే భలే

Anonymous said...

ఈ సినేమాని ఇంకొక సారి చూడండి. అప్పుడు అర్థమౌతుంది ఈ సినేమా ప్రత్యేకత ఎమీటో! చూడబోతే సినేమా అంతా పాత లవకుశ తో పోల్చుకొంట్టూ చూసినట్లు ఉన్నారు. ఈ సినేమా పాతదానికన్నా బాగుంది. పాత వాటిలో పాటలు విని విని మనకు మనసుకో ఒక గొప్ప సినేమాగా నిలచి పోయింది. రెండవసారి చూస్తున్నపుడు నాకు మొదటిసారి చూసినప్పటికన్నా బాగ ఉన్నాదని పించింది.

Sridhar said...

paatha seesalo paatha neeru.
ala vundi meeru cheppedi.

meeru padyalu paadandi.
mana pillalu happygaa talalu vooputaaru.

NTR lavakusha ni malli alaane poems tho, alaanti shots tho teesthi,
inka manam ekkadunnam,

ADI VUTTA REMAKE AVUTUNDI,
Re-energize cheyyalante meeru vaade cell phone laaga
idi kuda alantide.

mee New generatioins ki NTR lava kusha ni ivvandi? meeru convince cheyyagalara ?

Sorry, katuvugaa matladithe, aiyanaa
kaani idi nijam.

ee generation lo malli lava kusha ni without Bapu+Ramana+Ilayaraja tho thappithe theeyalemu.

Anonymous said...

మొదటి పాట జగదానంద కారక చాలు PVR రూ 200/- టికేట్ గిట్టుబాటు కావటానికి

గీత_యశస్వి said...

mee review choodagaane parigethanu cinemaki. compare chesukokunda choosthe baagundi. kaani naatho vachhina friend enduku meeru first half antha edchaaru ani adigindi, asalu seetharaamulu vidipothunte edupu raani ameni nenu vinthaga choosanu. ame nannu. loko bhinna ruchi.

కొత్తావకాయ said...

"లేరు కుశలవుల సాటి.." అని పాడినప్పుడూ, "లోకపావనీ" అని సంబోధించినప్పుడూ మాత్రం మనసు తృప్తిపడింది సుమీ! అప్పుడర్ధమయింది "లవకుశ" కి మనసెంత కట్టుబడిపోయిందో!

AVUNAA said...

lavakusha to polchukokunte ee cinema super. KALAYA NIJAMA paata memu choosaamu. Hanumanthudu paade paata idi. Lavakushulu puttaka mundu nundi unna baala raju lavakushulu perigi peddavaarainaa tanu peragaka povadam viseshame..KALADHAR

kiran said...

ఒక సినిమా ని ఇంత వివరంగా వివరిస్తార..వచ్చిన తెలుగంత ఉపయోగించి..ఉండండి నేను చూసొచ్చి పద్యాలు పాడుతా

AVUNAA said...

COMMENTS TELUGULO PAMPAALANTE ELAA

ఆ.సౌమ్య said...

@ AVUNAA

లేఖిని వాడండి. లేఖినిలో తెలుగు రాయవచ్చు. ఇందులో టైప్ చేసుకున్నాక ఆ content ని copy చేసి మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ paste చేసుకోవచ్చు.
http://lekhini.org/

Chandu S said...

మీ రివ్యూ బాగుందండీ. నాకు బాగా నచ్చింది.

ఆ.సౌమ్య said...

@ నాగార్జున
నువ్వన్నది కరక్టే...నాతో ఏకీభవించినందుకు ధన్యవాదములు!

@కృష్ణప్రియ గారూ
నయనతార కోసమైనా ఒకసారి చూడొచ్చు. తప్పకుండా చూడండి :)

@శేఖర్
నాకూ కొంచం సాగతీతగానే అనిపించింది.
అవును రాంబంటు గుర్తుంది నాకు...బానే ఉంటుంది సినిమా
thanks

ఆ.సౌమ్య said...

@ Srikanth M
డైలాగుల విషయం లో...హ్మ్ ఏమో మరి, నాకైతే అలా అనిపించలేదు!
ఇంక బాలకృష్ణ విషయంలో...అంటే ఈ పదేళ్ళలో బాలకృష్ణ నటన నేర్చేసుకున్నాడంటారా? నాకు డౌటే. సహజంగా తనకి కొంత నటన ఉంది. మంచి డైరెక్టరు చేతిలో పడాలి అంతే...అది పదేళ్ల ముందు అయినా, ఇప్పుడైనా.

@రాజేంద్ర
లవకుశ తో పోలిక తప్పదండీ. ఒకవేళ అలా పోల్చకపోయినా నేను ఇలాగే అనుకుంటాను. సాగతీత, ఏడుపులు....చికాకుగానే అనిపించాయి.
మరోమాట, ఈ తరం వారికి పద్యాలు అవీ అర్థం అవ్వవు అంటే నేనొప్పుకోలేనండీ!

మనోజ్ఞ said...

సినిమా బావుంది అనిపించినా, ఎందుకో నాకు మొదటి నుంచి సినిమా సాగతీసినట్టు అనిపించింది. అందరి కంటే నాకు బాలరాజు పాత్ర బాగా నచ్చింది. (నయనతార కాకుండా) ఆ కుర్రాడు ఎవరో బాగా చేసాడు. కలయా, నిజమా పాట సినిమాలో ఎందుకు లేదు. నేను చూసానే. సీతని రాముడు అడవిలో వదిలేశాడని వాల్మీకికి ఆనంజనేయుడు చెప్పినప్పుడు ఆ పాట ఉంటుంది. హనుమంతుడు ఆ పాట పాడినట్టు చూపిస్తారు.

Kuppili Pavan Rohit said...

మీరు క్విల్‌ప్యాడ్ వాడారా? చాలా బాగుంటుంది. నాకు సినిమా చాలా నచ్చింది. ఇప్పటి తరం వాడిని . అప్పటి లవకుశ అర్థం అవుతుందో లేదో. మీ బ్లాగ్ చాలా బాగుంది. :)
www.quillpad.in

kallurisailabala said...

సౌమ్య గారు నేను రివ్యూ రాస్తే కొంచం అటు ఇటు గా ఇలాగే ఉంటుంది.అన్ని పాయింట్స్ కవర్ చేసారు.

మనసుకి నచ్చలేదు.
ప్రయత్నం నచ్చింది అని చెప్పాలి ఈ మూవీ గురించి.
బహుశా మీరు అన్నట్టు లవకుశ ప్రభావం అయి ఉంటుంది.

ఎందుకో ఒకటి అనిపిస్తుంది కొన్ని క్లాసిక్స్ జోలికి వెళ్ళకుండా ఉంటె బాగుండు ఎవరయినా సరే..
గుండమ్మ కధ, మిస్సమ్మ, ఏకవీర, మల్లీశ్వరి, ఆ కోవలోనే లవకుశ ...
వీటిని ఎవ్వరు మళ్లి తీయద్దు అని ఒక రూల్ ఉంటె బాగుండు అని ...

కాకపోతే బాపుగారు, నాగేశ్వర రావు గారు ఆ వయసులో ఎంతో శ్రమకోర్చి ఈ మూవీ తీయడం...మాత్రం మెచ్చుకుని తీరాలి.

మొత్తం మీద మీ పోస్ట్ బావుంది.
కన్నెసీత గా భలే ముద్దుగా ఉంది.
నిజ్జం అండీ ...ఇక్కడ నాకు నాయన తార కనబడలేదు. కన్నె సీత అనిపించింది.

వాల్మీకి పాత్రలో నాగేస్రావు గంభీరంగా కనిపించారు. ఆయన నటనని, ఆహార్యాన్ని శంకించే పనిలేదు గానీ...నాగయ్యగారిలో ఉన్న ప్రశాంతత కనిపించలేదు.

కౌసల్య మున్నగువారు భోరు భోరున విలపించడం కాస్త చికాకు కలిగించింది. వాళ్ళు రాజమాతలు...ఎంత కష్టంలోనైనా కొంత సంయమనం, గాంభీర్యం ప్రదర్శించడం అవసరం.

లవకుశలో పద్యాలు...
మావారు ముందే చెప్పారు ...పద్యాలు పాటలు పాడటాలు లేవు అని..కాని నోరు , మనసు రెండు ఊరుకోలేదు.

మా ప్రక్కనే ఒక వృద్ధ జంట కూర్చున్నారు.
అవిడ లవకుశ లో పద్యాలూ అవి సందర్భానుసారం అందుకోవడం ...వెంటనే నేను, ఇంకా కొందరు అందుకోవడం...
మొత్తానికి ఒక మంచి అనుభవం...లవకుశ గుర్తుచేసుకుంటూ శ్రీ రామ రాజ్య్యం చూడటం.

2k said...

eppatlo ee cineema teeyadam chaala kastam kaani balayya ki hatsap super mana pillalaki manamu chupinchavalachina cineema
k.k.chowdary
guntakal

2k said...

super hitttttttttttttttttttttttt

ఆ.సౌమ్య said...

అందరికీ
జవాబులివ్వడానికి కాస్త ఆలస్యమైంది క్షమించండి.

ఆ.సౌమ్య said...

@ వేణు
సీతని చక్కగా కళ్ళముందు ఉంచారు నిజమే :)
thanks

@unknown
Thanks for your comment!

@శేఖర్
ఒక సినిమాని మళ్ళీ తీసినప్పుడు కంపేరిజన్ లేకుండా ఉండడం అన్నది అసాధ్యం. ఇంక నిజ జీవితంలో మీరు చెబుతున్న విషయాల గురించి..ఏమో మరి!

ఆ.సౌమ్య said...

@ Kamal
thanks a lot

@ రమణ గారూ
ధన్యవాదాములు!

@సుజాత గారూ
హహహ మీకూ నాలాగే అన్నమాట..పద్యాలు వదల్లేదు :)

ఆ.సౌమ్య said...

@ లక్ష్మణ్ గారు
హహహ ఇదో చిన్న సైజు phd లెండి. :) Thanks!

@unknown
I respect your opinion...thanks for commenting!

@Sridhar
ఈ new generation వాళ్ళకి అర్థం కాకపోవడం...ఇదేమిటో నాకర్థం కావట్లేదండీ. అయినా ఈ సినిమాలో పద్యాలు లేకపోవడం నేనొక లోపంగా చెప్పలేదు. నాకు పద్యాలు గుర్తుకు వచ్చాయి అని మాత్రమే చెప్పాను. ఈ సినిమాలో నాకు అసంతృప్తినిచ్చిన విషయాలేమిటో నా పోస్టులోనే వివరించాను.
thanks for the comment

ఆ.సౌమ్య said...

@ unknown
Thanks for the comment

@ గీత గారు
అవునండీ లోకో భిన్న రుచిః :)
Thank you

@కొత్తావకాయ
నిజమే...ఈ సినిమా చూస్తున్నప్పుడే ఇంకా బాగా అర్థమయ్యింది లవకుశ ఎంతలాగా మనసులో నిలిచిపోయిందో!

ఆ.సౌమ్య said...

@ కళాధర్ గారు
కొన్ని సినిమా హాళ్ళలో కొన్ని పాటలు, కొన్ని సీన్లు కట్ చేసారుటండీ...అందుకే మాకు ఆ పాట లేదు. Thanks for the comment!

@ కిరణ్
అయిందా చూడడం, పద్యాలు ఎప్పుడు పాడతావు? చెప్పు ఒక కచేరీ పెట్టిద్దాం :)

@ శైలజ గారూ
ధన్యవాదములు :)

ఆ.సౌమ్య said...

@ మనోజ్ఞ
అవును, నాకూ అలాగే అనిపిచింది!

@ రోహిత్ గారు
Thanks a lot
quill pad ఏమిటో తెలీదండీ..ఈసారి చూడాలి.

@ శైలు
ఓపిగ్గా అంత పెద్ద కామెటు రాసినందుకు thanks.
అయితే మనిద్దరికీ ఒకేలా అనిపించిందన్నమాట :)

@ k.k.chowdary
thanks for the comment!