StatCounter code

Monday, February 27, 2012

సిద్ధాంతం

ముక్తేశ్వర్...సముద్రం మట్టం నుండి 800 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతం - హిమాలయాలలో భాగం. నైనితాల్ నుండి ఓ రెండుగంటల ప్రయాణం. కొండ పై కొనకి చేరుకుని, కారు దిగి చుట్టూ చూస్తుంటే ఇద్దరు ముగ్గురొచ్చారు "గైడ్ కావాలా" అంటూ. అక్కడ ఉన్నది చిన్న ముక్తేశ్వరుడి గుడి, దానికి ఓ పక్క రాళ్ళ గుట్టలు, మరో పక్క అడవి . ఇంతే కదా. ఏముంది చూడ్డానికి, గైడ్ ఎందుకు అనుకునేలోగా ఒకతను వచ్చి మా మనసులో మాటలు పసిగట్టినవానిలా "ఈ చుట్టుపక్కల చూడ్డానికి ఏముంది అనుకోకండి, మీకు తెలీదు కాబట్టి ఏమీ లేదు అనుకుంటున్నారు. ఈ ఏమీ లేని చోట మీకు నేను అన్నీ చూపిస్తాను" అని మాటలతో మేజిక్ చేసాడు సంతోష్ కుమార్ శర్మ. ఎంతడుగుతాడో అన్నట్టు పెట్టిన మా మొహాలు చూసి "150 ఇవ్వండి" అన్నాడు. చాల ఏక్కువేమో అని మేము సందేహంగా చూస్తుంటే "సరే 100 ఇవ్వండి" అన్నాడు. ఇతనికి మనసులో మాటలు తెలుసుకునే విద్య ఏమైనా వచ్చా అని సందేహమొచ్చింది. మా చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ ని లాక్కుంటూ "ఆ బ్యాగ్ నేను నా భుజానికి తగిలిచుకుంటానమ్మా, మీరు నడవలేరు దీనితో. మీరు హాయిగా, నేను చెప్పే విషయాలు వింటూ నా వెనుక రండి" అని వడివడిగా నడవడం మొదలెట్టాడు సంతోష్.

ఆ కొండ కి అదే చివర. ఆ గుడి చుట్టూరా ప్రకృతి సహంజం గా ఆవరించుకున్న పెద్ద పెద్ద బండరాళ్ళ కంచె. ఆ కంచె మీద జాగ్రత్త నడవకపోతే కింద లోయలో రెండు మూడూ కిలోమీటర్ల అట్టడుగున దొరుకుతాం. చెంగు చెంగుమని దూకుతూ, అవసరమైనప్పుడు ఆ రాళ్ళ చివరకి వెళుతూ, పడిపోతాడేమో అని మనల్ని కాస్త భయానికి గురిచేస్తూ ఏవేవో కథలు చెబుతూ ముందుకి సాగిపోతున్నాడు సంతోష్. అతని వెనుక పడుతూ, లేస్తూ అతను చెప్పే చిత్ర విచిత్ర కథలను ఆసక్తిగా వింటూ నడుస్తున్నాం. మా చేతిలో నుండి కెమేరా తీసుకుని "మీరు దీని సంగతి మరచిపోయి హాయిగా రండి. మీకు బ్రహ్మాండమైన, సహజమైన ఫొటోలు తీసే పూచీ నాది" అంటూ క్లిక్కుమనిపించాడు. అక్కడనుండి కనిపిస్తున్న పెద్ద పెద్ద హిమాలయ పర్వత శ్రేణులను ఒక్కోటిగా చూపిస్తూ, వాటి పేర్లు, వాటి వెనుక కథలు వివరిస్తూ ఉత్సాహంగా సాగుతున్న సంతోష్ ని చూస్తే భలే ఆశ్చర్యంగానూ, ఉత్సాహంగానూ అనిపించింది. మనిషికి ఎంత వయసుంటుందో అంచనా వేస్తూ, రోజుకి ఇతనికి ఎన్ని వందలు చేరుతాయో, ఇతని జీవితం ఎలా గడుస్తుందో, సంసారం ఎంత పెద్దదో అన్న లెక్కలు వేస్తూ నా ఆలోచనల్లో నేనుండగానే ఆ వెనకున్న అడవుల్లోకి తీసుకెళ్ళాడు. 800-900 యేళ్ళ దేవదారు వృక్షాలను చూపిస్తూ ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో ఎలాంటి రిసెర్చ్ జరుగుతుందో వివరించాడు. ఏ చెట్టు నుండి ఏ రకమైన ద్రవం/నూనె వస్తుంది. వాటిని ఏ యే ఔషధాల్లో వాడతారో వివరంగా చెప్పాడు. చాలావాటికి శాస్త్రీయ నామాలను కూడా చెప్పాడు. అక్కడ ఉన్న "ఏనిమల్ రిసెర్చ్ సెంటర్" గురించి, దానిలో జరిగే పరిశోధనల గురించి చెప్పాడు. ఆ తరువాత ముక్తేశ్వరుడి దర్శనం చేయించి స్థల పురాణం  కూడా చెప్పాడు.

అతను చెప్పినవన్నీ ఆసక్తిగా వింటూ, ఇన్ని విషయాల గురించి ఎంత అనర్గళంగా మాట్లాడుతున్నాడో అని ఆశ్చర్యపోతూ ఆ గుడి దగ్గర ఉన్న ఒక పెద్ద బండ రాయి మీద సేద తీరుతూ సంతోష్ తో మాటలు కలిపాము. సంతోష్ అక్కడకు దగ్గరగా ఉన్న ఒక గ్రామంలో నివసిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెదబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. చిన్న అమ్మాయి ఆరోక్లాసు చదువుతోంది. పెళ్ళయిన కొత్తల్లో, సంతోష్ ఢిల్లీ లో కొన్నాళ్ళు పనిచేసి నగర జీవితంలో మనశ్శాంతి లేక, రోజు గడవడానికి సరిపోయే డబ్బు రాక తన గ్రామానికి తిరిగి వచ్చేసాడు. అప్పటినుండీ ఈ గైడింగ్ వృత్తిని చేపట్టి జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ వృత్తిలో మంచి సీజన్లో రోజుకి అధికం 500-600 వస్తాయి. సీజన్ లేనప్పుడు 100 రావడం కూడా గగనమే. సంతోష్ కి తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన ఒక ఇల్లు ఉంది. తనబోటి వాళ్ళందరూ ఇలా వారసత్వం గా వచ్చిన ఇళ్ళను, పొలాలను అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో వ్యాపారలు చేసి లాభాలు గడించారు. వ్యాపారాలు చేసి దివాలా తీసినవారూ ఉన్నారు. వ్యాపారానికి తను పనికిరానని సంతోష్ కి నమ్మకంగా అనిపించిందిట, అందుకే అందులోకి దిగలేదు. ఉండడానికి ఇల్లు ఉంది, కానీ తిండానికి తగినంత తిండి మాత్రం రోజూ దొరకదు. ఈ పరిస్థితి చూసి ఎంతోమంది సలహాలిచ్చారుట...ఎన్నాళ్ళు ఇలా కష్టపడతావు? నీకున్న ఇల్లు అమ్మేసి వ్యాపరంలోకి దిగు, డబ్బు ఆర్జించి ఇళ్ళ పై ఇళ్ళు కట్టు. ఆస్థులు పెంచుకో అని. మనకి చేతగాని విషయములో చెయ్యి పెట్టి వేళ్ళు విరుచుకోవడం అన్నంత బుద్ధి తక్కువ పనింకోటుండదు, నేను నా ఇల్లు అమ్మను అని చెప్పేవాడట వాళ్లకి. 

"అమ్మా...నా సిద్ధాతం ఒకటేనమ్మా! ఆస్థులు కూడబెట్టడం కాదు, నా పిల్లలని బాగా చదివించాలి. వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి అదే నా లక్ష్యం, నా సిద్ధాంతం. ఆస్థులు కూడబెట్టి ఏమి చేస్తాము? పిల్లలకి మించిన ఆస్థి ఇంకేముంటుంది! వాళ్ళు వృద్ధిలోకి రావడానికి నా రక్తమాంసాలు పణంగా పెట్టి కష్టపడతాను. వాళ్ళు చదువుకుని మా వంశంలో ఇంత చదువుని నింపితే చాలు. అదే నాకు ఆస్థి. ఇప్పటికి జీవితంలో నేను ఏర్పరచుకున్న సిద్ధాతం ఇదే. దీన్ని అనుసరించడానికే రేయింబవళ్ళు కష్టపడుతున్నాను." 

అని మెరిసే కళ్ళతో చెబుతున్న సంతోష్ వెనుక ఆ ముక్తేశ్వరుడు వచ్చి నిలబడ్డాడా అనిపించింది నాకు. గుండె నిండిపోయింది. కళ్ళలో తడి చేరింది.  అతని ముఖంలోని దృడనిశ్చయాన్ని, కళ్ళలో కనబడిన నిజాయితీని మనస్పూర్తిగా అభినందించాం.

సంతోష్ కుమార్ శర్మ పిల్లలిద్దరూ బాగా చదువుకుని, వృద్ధిలోకి వచ్చి వాళ్ళ నాన్న సిద్ధాంతాలని, ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తూ అతనికి ఇవ్వవలసిన దానికంటే కాస్త ఎక్కువే ఇచ్చి సెలవు తీసుకున్నాము. 

35 comments:

శేఖర్ (Sekhar) said...

మొదట్లో కొంచెం కంగారు పడ్డాను మీరు క్షేమమా కాదా అని.......కొండా ,గుట్ట ,అడివి అంటే...

మంచి మనిషి పరిచయం బాగుంది...... ధన్యవాదాలు

సుజాత వేల్పూరి said...

మంచి పోస్టు! చాలా బాగుంది!

మాలా కుమార్ said...

సంతోష్ సిద్దాంతం బాగుంది .

ఈ ముక్తేశ్వర్ ఎక్కడ ?

పల్లా కొండల రావు said...

ఏ రాద్ధాంతమూ లేని సిద్ధాంతమిది ! పోస్టు రాసిన విధానం బాగుంది !!

Anonymous said...

GOOD TRAVEL EXPERIENCE

వనజ తాతినేని/VanajaTatineni said...

సంతోష్ ఆశయం బాగుంది. మంచి పోస్ట్. చాలా బాగా చెప్పారు.

Murthy said...

Good one. I have been Mukteswaram the one which is located in East Godavari near Inavilli. Is it the same Mukteswaram you mentioned.

కొత్తావకాయ said...

"సౌమ్య రాసిన ట్రావెలాగ్ కబుర్లలోనే ప్రయాణం చేయించి తీసుకొచ్చేస్తుందని" సంబరపడుతూ వచ్చిన నాకు చిన్న నిరాశ ఎదురయింది కానీ చివరి దాకా చదివేసరికి అది పక్కకు వెళ్ళిపోయింది. మంచి టపా పిల్లా! :)

మనసు పలికే said...

ఈరోజు చదివిన మొదటి టపా మీది సౌమ్య గారూ. మనసుని నింపేశారు ఒక మంచి విషయాన్ని పంచుకుని.
నైనిటాల్, ముక్తేశ్వర్ మమ్మల్ని కూడా తిప్పి అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని, చెట్లు చేమలు, లోయల్ని మీ భావుకత్వంతో వర్ణించి మాకు కూడా చూపిస్తారు అనుకున్నా టపా మొదలు పెట్టిన విధానం చూసి. అంత కంటే ఎక్కువ సంతోష్ సిద్ధాంతం ప్రభావితం చేసినట్లుంది కదూ:) టపా చాలా బాగుంది సౌమ్య గారు. సంతోష్ తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను.

ఆ.సౌమ్య said...

@ శేఖర్
అబ్బే, ఏం కాలేదు. బానే ఉన్నాం :)
thanks!

ఆ.సౌమ్య said...

@ సుజాత గారూ
ధన్యవాదములు!

@ మాల గారూ
Thanks, ముక్తేశ్వర్ దిగువ హిమాలయాల్లో ఉందండీ. నైనిటాల్ నుండి పైకి పోవాలి.

ఆ.సౌమ్య said...

@ కొండల రావు గారూ
అవును ఏ రాద్ధాంతమూ లేదు :)
ధన్యవాదములు!

@ puranapandaphani గారూ
Thank you!

ఆ.సౌమ్య said...

@ DSR Murthy gaaruu
Thank you! తూ.గో లో ఉన్న ముక్తేశ్వరం కాదండీ. హిమాలయాల దగ్గర ఉన్న ముక్తేశ్వరం. పోస్ట్ లో రాసాను కదా...ఇది నైనితాల్ దగ్గర ఉంది.

ఆ.సౌమ్య said...

@ కొత్తవకాయ
Thanks పిల్లా. ఇది ట్రావెలాగ్ లాగ రాయలేదులే. సంతోష్ గురించి చెబుదామనే! :)

ఆ.సౌమ్య said...

@ అప్పూ
నువ్వూ పప్పులో కాలేసావా....హహహ్హ just kidding
ఇది ట్రావెలాగ్ లాగ రాయలేదు, సంతోష్ గురించి చెప్పడానికి ఆ కథ అంతా రాయలసి వచ్చింది. నచ్చిందా...thanks! :)

ఫోటాన్ said...

సంతోష్ సిద్ధాంతం బాగుంది.. మీ టపా కూడా... :)

Anonymous said...

ఆ సంతోష్ గురించి చదువుతుంటే హిందీ సినిమాలలోని 'అలోక్‌నాథ్' గుర్తొచ్చాడు.

శశి కళ said...

avunu aasti kooda betti yemi chestamu...vaalla pillalaku naa asheessulu

Anonymous said...

డిల్లి లో అపార్ట్ మెంట్లకు సెక్యురిటిగా గార్డ్ల, కాల్ సెంటర్ వాహనాలు తోలేవారి లో ఉత్తరాంచల్ చెందిన శర్మలు, యు.పి, బీహార్ కి చెందిన మిశ్రాలు ఎక్కువగా ఉంటారు. వీరితో కంపేని వారు పగలు రాత్రి చచ్చే చాకిరి చేస్తూంటారు. కొన్నిసార్లు కాల్ సెంటర్ వాహనాలు తోలేవారు ఉదయం 9 గం||నుంచి రాత్రి 11గం|| వరకు ఆపకుండా వాహనాలను తోలుతారు. వీరి తో మాటలు పెట్టుకొంటే వారి పిల్లలకి ఎమైనా ఉద్యోగాలు ఇప్పించగలరా అని అడుగుతారు. అందులో కొంతమంది పెద్ద చదువులు చదివి ఉండరు. ఎమీ జవాబు చెప్పాలో అర్థం కాదు. పెద్ద చదువులు చదివితే వారికి మన సహాయం అవసరం లేదు కదా! వారికి వచ్చే జీతం తో ఎలా కుటుంబం నడుపుతారో (అదీ డిల్లి లాంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉన్న సిటిలో ) ఆ దేవుడికే ఎరుక.

టపాకు సంబందం లేని వ్యాఖ్య అనిపిస్తే, తొలగించండి.

ఆ.సౌమ్య said...

@ ఫోటాన్
thanks! :)

@ బోనగిరి గారూ
:))

ఆ.సౌమ్య said...

@ శశి కళ గారూ
కదా! మీ ఆశీస్సులు కూడా అందుకుని వాళ్ళు ప్రయోజకులైతే చాలు :)

@శ్రీనివాస్ గారు
హ్మ్ అవునా!

శ్రీధర్. దు said...

సంతోష్ గారి సిద్దాంతం నచ్చింది. దూరదర్శన్లో "అమరావతి కథలు" చూసినట్టు మీ నేరేషన్ కూడా బావుంది.

ఆ.సౌమ్య said...

@ శ్రీ గారు
ధన్యవాదములు! నా నెరేషన్ నచ్చినందుకు సంతోషం! :)

nsmurty said...

Touching Account.

Actually I visited your blog on some other purpose, after reading your comment (Am I right?) on the digital archive for Toru Dutt. I read there that you were looking for women writers of pre-independent era. If that was not you please ignore this letter. If that was, I am equally interested in their works. can you send me a blank mail: nsmurty4350@gmail.com. so that I can furnish you other details. Sorry for the inconvenience.

ఆ.సౌమ్య said...

@ nsmurty garu
Thank you!
I think you have mistaken me for V.B.Sowmya. She must have commented about Women writers in Telugu. The below is her blog. You may talk to her there.
http://vbsowmya.wordpress.com

By the way, are you also from Vizianagaram?

Thank you so much for visiting my blog!

y.v.ramana said...

పోస్ట్ బాగుంది.

ఇప్పుడు ఆంధ్రాలో కూడా మెజారిటీ దిగువ మధ్యతరగతి వారు సంతోష్ లాంటి ఆలోచనలతోనే ఉన్నారు గదా.

పిల్లల చదువులకి ఆస్థులు కూడా అమ్మేస్తున్నారు. మనకేది లేదో అదే చాలా విలువైనదని అనుకుంటాం.

ఆ.సౌమ్య said...

@ రమణ గారూ
అవును మీరు చెప్పినది నిజమే!
మధ్యరతగతి వాళ్ళు చదువుకే ఎక్కువ ప్రాముఖ్యనిస్తున్నారు. కానీ దానికోసం పిల్లలని టార్చర్ పెట్టడమే ( ముఖ్యంగా మన రాష్త్రంలో ఇంజనీరింగు అనీ, మెడిసిన్ అనీ) కొంచం బాధాకరమైన విషయం.

రాజ్ కుమార్ said...

ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కదండీ...ముక్తేశ్వరుణ్ణీ, ఆ పరిసరాలనీ డామినేట్ చేసినట్టున్నాడు ఆయన.
లేకుంటే మీరన్నట్టూ ముక్తేశ్వరుడేనేమో...
బాగుందండీ

శ్రీనివాస్ పప్పు said...

మంచి ఆశయ సాధన కోసం సంతోష్ సిద్ధాంతం నచ్చింది.

రమణ said...

మనసుకు హత్తుకుంది.

గిరీష్ said...

సంతీష్ కుమార్ శర్మ గారు తను అనుకున్న వన్నీ నెరవేరాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.. మనస్సుకు హత్తుకునే టపా సౌమ్య గారు, అభినందనలు.

మధురవాణి said...

Good one Sowmya! :)

ఆ.సౌమ్య said...

@ మధుర
Thanks! సంతోష్ కే క్రెడిట్స్ అన్నీ :)

శివరంజని said...

good పోస్టు! చాలా బాగుంది!సంతోష్ కుమార్ శర్మ పిల్లలిద్దరూ బాగా చదువుకుని, వృద్ధిలోకి వచ్చి వాళ్ళ నాన్న సిద్ధాంతాలని, ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తూ న్నా.

ఆ.సౌమ్య said...

@ శివరంజని
Thanks పిల్లా! :)