StatCounter code

Tuesday, July 23, 2013

సేల్ సేల్ ఆఖరు సేల్

పక్కింటి పంకజం అత్తయ్య కి "సేల్" అంటే మహా పిచ్చి. అందునా "ఆఖరు సేల్" అంటే మరీను. పొద్దున్న లేచిన దగ్గరనుండీ ఏ పేపర్ లో ఏ సేల్ ఉందా అని చూడడమే పని. రోజూ మధ్యాన్నం భోజనాలయ్యక తీరిగా బయలుదేరుతుంది బజారుకి. ఆ షాపు, ఈ షాపు చూసుకుంటూ, ఆఖరు సేల్స్ ఏమైనా పెడతారేమో కనుక్కుంటూ, "సేల్" కనబడితే కొనుక్కుంటూ ఆనందపడిపోతుంటుంది. ఈ ఆఖరు సేల్ పిచ్చి ఒక వస్తువుకి అని పరిమితం కాదు. వంటింట్లో చెంచాల దగ్గరనుండీ ఆరువారాల నగలవరకూ ఏదైనా సరే "ఆఖరు సేల్" లో చవగ్గా కొంటే ఆ మాజాయే వేరు అంటుంటుంది. ఆఖరు, చివర లాంటి మాటలు ఆవిడకి వీనులవిందుగా ఉంటాయి.

వాళ్ళమ్మాయి సరదాపడి సాయంత్రం మూరెడు మల్లెపూలు కొనుక్కుందామంటే "వద్దమ్మాయ్, ఇప్పుడైతే మూరెడు నాలుగు రూపాయిలంటుంది. రాత్రి పూలావిడ ఇంటికెళిపోయేటప్పుడు ఇటువైపే వస్తుందిగా అప్పుడు పిలుద్దాం. రూపాయికి నాలుగు మూరలు ఇస్తుంది" అంటుంది. నిజంగానే పూలావిడ ఆఖరుబేరమని, అమ్మకుండా ఉంచేస్తే మర్నాటికి పూలు వాడిపోతాయని రూపాయికి నాలుగేమిటి, ఐదడిగినా ఇచ్చేసేది. చూసావా నా కిటుకు అన్నట్టు ఆనందంతో కళ్ళెగరేస్తుంది పంకజం అత్తయ్య.

పిల్లలకి స్కూళ్ళు తెరిచి కొత్త పుస్తకాలు కొనేటప్పుడు "ఏడుకొండల స్టోర్స్" కి పరిగెట్టింది. పాత లేపాక్షి నోట్సులు స్టాకు ఉండిపోయాయని "సేల్" పెట్టారు వాళ్ళు. ఒక్కో వంద పేజీల నోటుబుక్కు ఐదురూపాయలు. సంబరపడిపోతూ పిల్లాడికి పది, అమ్మాయికి పది కొని పడేసింది. ఆ పాత పుస్తకాలను చూసి "అమ్మా, అప్పుడే మధ్యకుట్టు విడిపోతోంది" అని ఏడుపు మొహం పెట్టిన పిల్లలతో "వెధవల్లారా, చవగ్గా వస్తే చేదు మీకు. సూకరాలెక్కువ, అన్నిటికీ పేచీ పెడతారు. ఆ దబ్బనం దారం ఇటు పడేయండి. ఒక్క కుట్టు కుట్టి పెట్టానంటే మళ్ళీ బయటకు రావడానికి కాగితాలు భయపడి చావాలి" అని కసిరేసింది. 

వదినా, మా అమ్మాయిని ఆషాఢం అయ్యాక అత్తారింటికి పంపాలి. మా పిల్లకి, వాళ్ళవాళ్ళకు బట్టలు పెడదామనుకుంటున్నాం అంటూ వచ్చింది వెనకింటి పార్వతి. "అబ్బెబ్బే అప్పుడే కొనకు పార్వతీ, ఆషాఢం సేల్ పెడతారు చందన బ్రదర్స్, RS బ్రదర్స్ వాటిల్లో. అప్పుడు చవగ్గా వస్తాయి చీరలు గట్రా. నీకేం తెలీదు నువ్వుండు. నేను సరిగ్గా సేల్ చూసి నీకు చెప్తాగా. మనిద్దరం వెళ్ళి బట్టలన్నీ కొనుక్కొద్దాం" అంది చీరల షాపింగ్ ని ఊహించుకుంటూ ఆనందంగా.

బిగ్ బజార్ లో పాతసామాన్లకి కొత్త సామాన్లు ఎక్స్చేజ్ ఆఫర్ ఉందిట విన్నావా అక్కయ్యా అంటూ చెల్లెలు పరిగెత్తుకొచ్చింది. అక్కకున్న పిచ్చిలో సగం చెల్లికీ ఉంది. "అవునా! మెల్లిగా చెబుతావేం! ఇవాళే వెళ్ళి చూద్దాం పద. ముందు ఇంట్లో పాతసామాన్లేమున్నాయో అన్నీ మూటగట్టాలి, రా, రా " అంటూ వంటింట్లోకి తోవదీసింది. ఇదంతా చూస్తున్న మావయ్య "ఎందుకు ఇప్పుడిదంతా!! మనింట్లో అన్ని వస్తువులూ బాగానే ఉన్నాయిగా. ఆ మధ్యనేగా మిక్సీ అవీ కూడా కొన్నాం" అని చిరాకుపడుతుంటే "అవునే! పాతవి ఏవైనా తీసుకుంటారటే చెల్లాయ్? మీ బావ కూడా మహా పాతవాడేనేవ్" అంది కనుచివర్లనుండీ మావయ్యని చూస్తూ. అంతే ఇంక కిక్కురుమనలేదు ఆయన.

బాటా లో షూస్ "సేల్" పెడితే చవగ్గా వచ్చాయి కదా అని రెండు కొనుక్కొచ్చింది తన సైజుకి ఒకటి, వాళ్ళాయన సైజుకి ఒకటి. "ఇవెందుకు, మనెమెప్పుడైనా ఇలాంటివి వేసుకుని ఎరుగుదుమా!!" అని మావయ్య ఆశ్చర్యపోతుంటే "ఇన్నాళ్ళు వేసుకోకపోతేనేం, ఇప్పటినుండీ వేసుకుందాం. పదండి రేపొద్దున్నుండి ఇద్దరం వాకింగ్ కి వెళదాం" అంది. అసలు బాటా చెప్పులంటే అత్తయ్యకి ఎంత మక్కువో, ఆ చివర్న ఐదుపైసలు తగ్గిస్తున్నందుకు.

టీవిలో కార్ టూల్ కిట్ ఐదువేలది వెయ్యికే అమ్ముతాం అని ప్రకటన వస్తే ఠక్కున ఆర్డరు చేసేసింది. 'మనకి కారు లేదు కదమ్మా" అని పిల్లలు అంటే "ఏం కొనకపోతామా, ఎప్పటికైనా!! పడుంటుంది!" అంది. కొంటే కార్ తో పాటు టూల్ కిట్ ఇస్తారుగా అని అందామనుకుని అత్తయ్య మొహం చూసి జడిసి మాటలు మింగేసాడు మావయ్య.

అది ఇదీ అని లేదు ఏది పెడితే అది "సేల్" అయితే చాలు. ఆఖరి రోజైతే మహదానందం...అప్రతిహతంగా ఆవిడ "సేల్" బాట పడుతూ ఉంటుంది.

ఇవాళ పొద్దున్నే హడావుడిగా హ్యాండ్‌బ్యాగ్ తీసుకుని ఎక్కడికో పరిగెడుతోంది. మధ్యాన్నం అయితేగానీ ఇల్లు కదలదుగా, ఇవాళ పొద్దున్నే ఎక్కడికి బయలుదేరిందబ్బా అనుకుంటూ "అత్తోయ్. ఎక్కడికా పరుగు?" అని కేకేసా. 

"ఇదిగో అమ్మడూ, నీకెన్నిసార్లు చెప్పాను ఎక్కడికి అని అడగొద్దని? అలా అడిగితే వెళ్తోన్న పని అవ్వదే, అశుభం". విసుక్కుంది కోపంగా. 

"అబ్బా, సర్లే అత్తయ్యా అడిగినవాళ్ళకి జవాబు ఇచ్చేస్తే అశుభం కాస్త శుభం అవుతుందిట చివరి నిముషంలో" అన్నాను. "చివరి" అన్నమాట వినగానే అత్తయ్య శాంతించింది. 

"ఊ, సర్లే, ఇంట్లోపిల్లలాంటిదానివి కాబట్టి ఊరుకుంటున్నా. అదికాదే టెలిగ్రాములదుకాణం ఎత్తేస్తున్నారట. ఇవాళే "ఆఖరు సేల్" ట. చవగ్గా వస్తాయని ఓ నాలుగు టెలిగ్రాములు తెచ్చుకోవడానికి వెళ్తున్నా" అంటూ ఉరకలేసింది పంకజం అత్తయ్య.

12 comments:

Unknown said...

సేల్ సేల్ ఆఖరు సేల్ అంటూ నవ్వొచ్చేటట్లు టపా లిఖించి కొసమెరిపించారు!

శిశిర said...

హహ్హహ్హ.. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారో. కొసమెరుపు బాగుంది.

వేణూశ్రీకాంత్ said...

హహహహ బాగుందండీ :-))

Unknown said...

మీ బ్లాగు ని "పూదండ" తో అనుసంధానించండి.

www.poodanda.blogspot.com

రాజ్ కుమార్ said...

ఓహ్.. మీ బ్లాగ్ గుర్తుందన్న మాట మీకు.
బోణీ ఇదే అనుకుంటా ఈ సంవత్సరానికి.. వెల్కం బ్యాక్.

మొన్న ఇదే ఉద్దేశ్యంతో టెలీగ్రాంస్ తెచ్చుకోడానికి వెళితే ఎవరో ఒకావిడి ఇప్పుడే టోకున కొనుక్కొని పట్టుకుపోయారు అన్నారు. ఈ పంకజం అత్తయ్యగారేనా.. ? ఓకే ఓకే ;)

Unknown said...

హహహ:) సూపర్ సౌమ్యా? భలే సబ్జెక్ట్ కొసమెరుపు ఇంకా విజిల్:))నేను ఇప్పుడున్న ఫ్లాట్స్ కొచ్చేదాకా చీరల మార్కెట్ అంతరించిపోయిందనే అనుకున్నా:)) అన్ని ఏజిల వాళ్ళూ కంఫర్ట్ కే ప్రాధాన్యత ఇచ్చే దశకొచ్చారు కదా అని. కానీ ఇక్కడ చూస్తే ఓరి నాయనో, ఒక్కోళ్ళు ఒక్కో నడిచే బట్టల కొట్టు.కనీసం షాప్ వాడన్నా సేల్ బెట్టి అవగొట్టుకుంటాడు వీళ్ళు ఇల్లంతా ఆ సేల్ వస్తువులతో నింపేస్తున్నారు:))మంచి కధా వస్తువు...ఇంకా ఇంకా రాయి:)) మేము ఎదురు చూస్తుంటాం చదవడానికి:)))

సుజాత వేల్పూరి said...

చాలా రోజులకి నీ బ్లాగ్ పోస్టు.

కొసమెరుపు కసక్ ! సేల్ జాడ్యం ఇక్కడ (అమెరికా)లో కూడా విపరీతం. మొన్నెప్పుడో భూమి అంతరిస్తుందంటే అన్ని షాపుల్లోనూ Lands End sale పెట్టారు.

"చవక" "ఉచితం" అనే మాటలు కనిపితే ఒళ్ళూ పై తెలీదుగా చాలా మందికి..:-))


ఛాయ said...

ఆ`సాంతం` చదివించారు.మెచ్చుకోలు, అభినందనలూ... చివరగా నాకామెంటు పెట్టుకోండి.

బంతి said...

ha ha superu :)

నిషిగంధ said...

:))) అందరూ అన్నట్టు చివరిది సూపర్!

జీవితంలో నేను మర్చిపోలేని సేల్ ఒకానొక పురాతన కాలంలో చందన బ్రదర్స్ వాడి ఆషాడం సేల్.. షాప్ బయటనించి ఆ జనాన్ని చూస్తే నాకు అనుమానం వచ్చింది, వాడు పెట్టింది చీరల సేలా లేక బంగారం ఫ్రీగా ఇస్తున్నాడా అని! ఆమ్మో, మన ఆడాళ్ళతో ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ చీరల షాపులో మాత్రం కాదని నాకారోజు బాహా అర్ధం అయింది! :))

పనులెప్పుడూ ఉంటాయని కానీ కాస్త తరచుగా రాస్తుండమ్మా... బ్లాగుల్లో కాస్త కళ నింపండి మళ్ళీ!

Zilebi said...


'చివరాఖరి సేల్ టపా నా ఈ టపా మీది ఈ సంవత్సరానికి ?

(ఎక్కడి కి పోయేరు ఇన్నాళ్ళు - ఏ చివారఖరి సేల్ లో నూ మీరు కనబడ లేదే అని అనుకుంటూ న్నా !)

జిలేబి

Unknown said...

pankajam attayya sale picchi funnygaa undi.totalgaa post adubutamgaa undi
http://www.googlefacebook.info/