StatCounter code

Monday, December 10, 2012

నేను పులిని చూసానోచ్ చ్చ్ చ్చ్


ఎక్కడ??
అడవిలో

ఏ అడవిలో?
సరిస్కా అనే అడవిలో?

ఎప్పుడు?
మొన్న శనివారం

ఏమిటి కథ కమామిషు?
చెప్తా చెప్తా

పులిని..పెద్దపులిని....దగ్గరగా, 8-10 మీటర్ల దూరంలో...రెండు కళ్ళారా చూసాను. ("శివుని రెండు కళ్ళార చూసాను రామాహరి" లో రేలంగి ఎక్స్‌ప్రెషన్ ఊహించుకోండి)

మొన్న శనివారం సరిస్కా అనే అడివికి వెళ్ళాం. రాజస్థాన్ రాష్ట్రంలో, ఢిల్లీ కి జైపుర్ కి మధ్యలో ఉంది. డిల్లీ నుండి నుండి 200 km దూరంలో ఉంది. కార్ లో లాంగ్ డ్రైవ్ కి బయలుదేరాం. మధ్యలో దారి తప్పి సరిస్కా చేరుకోవడానికి ఆరున్నర గంటలు పట్టింది. సరిస్కా అనేది tiger reserve...ఒకప్పుడు 30 దాకా పులులు ఉండేవిట. కాలక్రమేణ అన్నీ చచ్చిపోయాయి. ఒక నాలుగేళ్ళ క్రితం రణతంబోర్ నుండి ఏడు పులులను తెచ్చి పెట్టారు. అవే ఉన్నాయి ప్రస్తుతానికి. 

మేము సరిస్కా చేరుకుని, మా కార్ అక్కడ పార్క్ చేసి...వాళ్ళ జిప్సీలో బయలుదేరాం. ఓపెన్ టాప్ జిప్సీ. డ్రైవర్, ఒక గైడ్, మేము, మాతో పాటు ఇంకో జంట (45-50 వయసువాళ్ళు).  ఈ అడవి ఆరావళి పర్వతాలు దిగువన ఉంది. మొత్తం 5 జోన్స్ ఉన్నాయి. మాములుగా అయితే రెండు జోన్స్ లోకి మాత్రమే ప్రవేశముంది. రెండో జోన్ లోకి వెళ్ళాక ఒక పక్క ఆరావళి పర్వతాలు, మరోపక్క వింధ్య పర్వతాలు కనిపించాయి. మొదటి రెండు జోన్స్ లో నీల్గాయ్, బోల్డు నెమళ్ళు తప్ప ఇంకేమీ కనిపించలేదు. నేను పులిని చూడాలి అని గోలపెడుతుండడంతో డ్రైవర్ మూడో జోన్ లోకి పోనిచ్చాడు బండిని. కనీసం ఒక్కటైనా క్రూరజంతువుని చూపిస్తానని గైడ్ నాకు భరోసా ఇచ్చాడు. దారి సరిగ్గా లేదు...అంతా గతుకులమయం. రాళ్ళు, రప్పలు, మట్టి, ఎగుడుదిగుళ్ళు...ఒళ్ళు హూనమైపోయింది.  పొదలని కట్ చేసుకుంటూ ముందుకి పోవాలి. ఏదైనా జంతువు కనిపిస్తుందేమో అని కళ్ళు పెద్దవి చేసుకుంటూ అన్ని వైపులా చూస్తూ ఉన్నాం..ఉహూ. కొన్ని జింకలు...చుక్కల జింక, దుప్పి, సాంబర్ జింక, నెమళ్ళు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. దట్టమైన అడవిలోకి జిప్సీ చొచ్చుకుపోతోంది. ఎటు చూసినా చెట్లు, పొదలు...పక్షుల కోలాహలం, జింకల కేకలు, తుమ్మెదల రొదలు. మా డ్రైవర్ కి అలుపొచ్చేసింది. గైడ్ ని కాసేపు బండి తోలమని చెప్పి తనొచ్చి మా పక్కన కూర్చున్నాడు. చిక్కటి దట్టమైన అడవిలోకి సాగిపోతోంది మా బండి. అకస్మాత్తుగా ఏదో పక్షి కూత వినిపించింది. అది వినగానే మా డ్రైవర్ గతుక్కుమన్నాడు. "call" వచ్చింది అన్నాడు. ఏం "call"? అని అడిగాం. అదేదో చీతల్ అనే పక్షిట. అది మిగతా జంతువులకు పిలుపునిస్తోంది....పులొస్తోంది పారిపోండొహో అని. దాని కూత వినగానే మా డ్రైవర్ కి కంగారేసింది. గైడ్ ని పక్కకు పొమ్మని తనే గబగబ బండిని నడపడం మొదలెట్టాడు. మా అందరికీ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. బండి వేగంగా ముందుకి పోతోంది.

అంతే...ఠక్కున బండి ఆగిపోయింది. నిశ్శబ్దం...ఆశ్చర్యం...ఎదురుగా పది మీటర్ల దూరంలో పులి. అటు తిరిగి ఉంది..మెల్లిగా నడుచుకుంటూ వెళుతోంది. పులిని తప్పించుకోవడానికే మేము పరిగెడుతుంటే ఎదురుగుండా కనబడింది. మాకు ఆనందం, భయం, ఆశ్చర్యం, thrilling... నేను పులి పులి అని అరిచేసాను. గైడ్ దెబ్బలాడాడు అరవొద్దు అని. అస్సలు  శబ్దం చెయ్యొద్దు. పులులకి మనుషుల గొంతు చాలా చికాకు కలిగిస్తుంది. అందరూ pin-drop సైలెంట్ గా ఉండాలి అని హెచ్చరికలు జారీ చేసారు. నేనైతే స్థాణువునైపోయాను. చెమటలు పట్టేసాయి. పక్కనే తన చెయ్యి పట్టుకుని నిల్చున్నాను. తన చేతుల్లో వణుకు తెలుస్తోంది నాకు. కదలకుండా బొమ్మల్లాగా...కళ్ళు పెద్దవి చేసుకుని, అచేతనంగా నిలబడి ఎదుగురుండా ఉన్న క్రూరజంతువుని చుస్తూ..అద్భుతం, అదొక వింత అనుభవం. జిప్సీ ఆపేసి మెల్లిగా వెనక్కి పోనిస్తునాడు. ఆ గతుకుల రోడ్డులో జిప్సి కదలట్లేదు. పులి ముందుకి తిరిగిందా...మమ్మల్ని చూస్తుంది. చూసిందా నా మీదకే పంజా విసురుతుందేమో...ఏమో, ఎవరిని లాకెళ్ళిపోతుందో !! రక్తం చల్లబడిందో, స్పర్శ తెలియకుండా పోయిందో, శరీరం గడ్డకట్టుకుపోయిందోగానీ...బిగుసుకుపోయి భయంతో, కళ్లలో ఒక రకమైన మెరుపుతో ఎదురుగా ఉన్న పులిని చూస్తూ నిల్చున్నాం. పులి వెనక్కి తిరగలేదు..మెల్లిగా నడుచుకుంటూ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. పులి ఎక్కడైతే పొదల్లోకి వెళ్ళిపోయిందో సరిగా అక్కడికే జిప్సీ పోనిచ్చి ఆపాడు...మళ్ళి వస్తుందేమో చూద్దామని. పులి లోపలికి వెళ్లగానే రెండు నీల్గాయ్‌లు, రెండు జింకలు అరుచుకుంటూ వేగంగా పరిగెత్తుకుంటు బయటకి వచ్చాయి. మా జిప్సీ వైపు వచ్చి అలా అటువైపు పొదల్లోకి పారిపోయాయి. ఒక అరగంట సేపు వేచి చూసాం. చుట్టూ పొదలు..ఏ మూలనుండి వచ్చి మీదపడుతుందో అని భయం. కానీ thrilling. మళ్ళి పులి బయటకి రాలేదు. బండి ముందుకి కదిలింది. ఎవరిలోనూ చలనం లేదు...మాటల్లేవు. ఆనందమో,ఆశ్చర్యమో,అద్భుతమో, భయమో !!! మెల్లిగా అందరికి తమ తమ స్పర్శలు స్వాధీనంలోకి రాసాగాయి.  జూ లో బంధించి ఉన్న పులిని చూడ్డం కాదు. అడవిలో స్వేచ్ఛా విహారం చేస్తున్న పులిని చూడాలి అన్న నాకోరిక తీరింది.

కానీ గుండెల్లోంచి భయం ఇంకా పోలేదు. నేను గైడ్ ని అడిగాను....ఇది చాలా పెద్ద సాహసం కదూ! పులి మీద పడితే ఏం చేస్తారు? ఇలా ఒపనె టాప్ జిప్సీ లో మీరు తీసుకురావడం, మేము వచ్చేయడం....అమ్మో తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది అని. గైడ్ అన్నాడు...మాకు పులి ఆనుపానులన్నీ బాగా తెలుసు, ఎప్పుడు మీదకి దూకుతుందో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో మేము అంచనా వెయ్యగలం. అంతే కాకుండా ప్రకృతి ఇచ్చే సహజమైన "calls" ని కూడా మేము గుర్తుపట్టగలం. మా దగ్గర చిన్న పిస్తోలు కూడా ఉంది అని. ఆ మాటలు విన్నాక కాస్త ధైర్యం వచ్చింది.  

ఇంకాస్త ముందుకి వెళ్ళాం. నాలో ఇంకా ఆశ చావలేదు..మళ్ళీ కనిపిస్తుందేమో. ఈసారి ముందునుండీ చూస్తానేమో అని చిన్న ఆశ. అందరికీ అదే ఆశ కాబోలు చుట్టూ పరికించి దీక్షగా చూస్తున్నాం. ఇంతలో ఆ గుబురుపొదల్లో ఏదో, దేన్నో తరుముతున్నట్టు అలజడి...నాకే కనబడింది...అది కుక్కో, నక్కో, తోడేలో నాకర్థం కాలేదు. కుక్క కాదనిపించింది. నక్క వేటాడదు. తోడేలే అయ్యుంటుంది అని నా బుర్ర వేగంగా పనిచేసింది. తోడేలు తోడేలు అని అరిచాను. అందరూ అటువైపు చూసారు. మా జీప్ కి దగ్గరగా, సమాంతరంగా పొదల్లో తోడేలు, ఒక చిన్న బుజ్జి జింకని తరుముతోంది. మెరుపు వేగంతో ఆ లేడి పొదల్లోకి మాయమైపోయింది. తోడేలు కాసేపు పరిగెత్తి పరిగెత్తి పక్షులను భయపెట్టింది. జిప్సీ తో సమాంతరంగా తోడేలు పరిగెడుతుంటే భలేగా అనిపిచింది. ఆక్షణంలో నాకు చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలు గుర్తొచ్చాయి. పంచతంత్రం కథలు కూడా గుర్తొచ్చాయి.

నీటి ఒడ్డున సేద తీరుతున్న మొసలిని చూసాం. చెట్టుపై కదలకుండా విగ్రహంవలే కూర్చున్న గుడ్లగూబని చూసాం.    అడవిదున్నల్లో ఒక రకాన్ని చూసాం.

కింగ్ ఫిషర్  పక్షి ని చూసాం. ఆహా ఏమి అందం...ఆ నీలం, ఆకాశమంత నీలం..అద్భుతమైన రంగు..ఎంత అందంగా ఉందని!!!! కళ్ళారా చూడవలసిందేగానీ మాటల్లో చెప్పలేము.

నెమలి కంఠం రంగుని, కింగ్ ఫిషర్ పక్షి రంగుని చూసాక ప్రకృతికి కైమోడ్చి జోహార్లు అర్పించడం తప్ప ఇంకేమి చెయ్యగలం!!!

ఓ మూడు గంటలు అడవిలో విహరించి...జ్ఞాపకలన్నీ మూటగట్టుకుని వెనక్కి వచ్చేసాం.

జిం కార్బెట్ లో పులిని చూడలేదని నిరుత్సాహపడిన నాకు సరిస్కాలో పులి కనిపించింది. నార్త్ లో ఉన్న మూడు అడవుల్లో రెండు చూసేసాను. ఇంకా రణతంబోర్ మిగిలి ఉంది. దానికి కూడా ఎప్పుడో పెట్టాలి ముహుర్తం.

నా జిం కార్బెట్ అనుభవాలు
http://vivaha-bhojanambu.blogspot.in/2010/03/blog-post_31.html

To know more about Sariska
http://en.wikipedia.org/wiki/Sariska_Tiger_Reserve


34 comments:

రాజ్ కుమార్ said...

బాగు బాగు.... ఇలా అడవిలో చూడటం థ్రిల్లింగ్ లెండీ...నాకు కూడా పులి అంటే ఇష్టం.. కాకపోతే నేను పులిని మా ఊరి ధియేటర్ లో చూశాను. అదింకో రకమైన థ్రిల్ లెండీ. ఇంకా భయమేసింది ;)

పులిని మీరు చూశారు సరే... మాకు చూపించలేదేం??
ఎక్కడ పులి ఫోటో??

రాజ్ కుమార్ said...

అన్నట్టూ.. వెల్కం బ్యాక్.. చాలా కాలానికి మాయాశశిరేఖ నిద్రలేచినట్టుంది... ;) ;)

Anonymous said...

బాబోయ్..!! మీరు అంతా చెప్పి చివరలో ఎక్కడన్నా ... ఇది రాత్రి నాకు వచ్చిన కల అని రాసుంటారేమో అని వెతికా.. నిజంగానే చూశారన్న మాట.. :-O

Congrats :-)

kiran said...

ఒక్క క్రూర జంతువుని ఐన చూడాలి....బాబోయ్ ఇంత క్రురంగా ఎప్పుడు తయారయ్యారు...!!
But trip is quiet adventurous and memorable కదా ..అది చాలు...

Sravya Vattikuti said...

Great experience and nicely written !

Padmarpita said...

మీ కెమేరాలకళ్ళతో కలంపదునులో నేనుకూడా చూసానోచ్:-)

Chandu S said...

సౌమ్య గారూ, పకడ్బందీ స్క్రీన్ ప్లే తో సిన్మా చూపెట్టారు BGM తో సహా . సూపర్. మీరేం వ్రాసినా అందులో మీ మార్కు కనబడుతుంది. Totally enjoyed reading this post. ఆపకుండా చదివాను

చిలమకూరు విజయమోహన్ said...

మా ఇంట్లో రోజూ చూస్తూనే ఉన్నా :)

మాలా కుమార్ said...

మరి పులి ఫొటో ఏది ?

ఫోటాన్ said...

పులి ఫోటో లేకుండా, పులి టైటిల్ వాడారు.. :(
బాగుంది, చదువుతుంటే అక్కడ నేనే వున్నానేమో అన్న భావన కలిగించారు :)

Anonymous said...

నేను కూడ నిన్న పులిని చూసానోచ్.
లైఫ్ ఆఫ్ పై సినిమాలో!

ఇంతకుముందు బన్నేర్ ఘట్ట జూ లో చూసాను.
జునాఘడ్ వద్ద గిర్ సాంక్చురీలో సింహాలని కూడ చూసాను.

జయ said...

భలే ఉంది, మీ అనుభవం. పులిని ముందునుంచి చూడలేదా?:) నేను కేరళలో చూసాను. కాకపోతే మేము బోనులో ఉన్నాము...అది హాయిగా తిరుగుతోంది:))))

కమనీయం said...
మీ బ్లాగు,ఫొటోలు బాగున్నవి.చాలాకాలం కిందట అనుభవం.నా చిన్నప్పుడు మా నాన్నగారు రంపచోడవరంలో కొన్నాళ్ళు పనిచేసారు.అక్కడ కొన్ని క్వార్టర్సు, గిరిజనుల గుడిసెలు కొన్ని మాత్రం ఉండేవి.అడవి దట్టంగాఉండేది.పులులు ,ఇతర అడవి జంతువులు ఇప్పటికన్నా ఎక్కువ ఉండేవి.5,6,బళ్ళు కలిసి ( పులులభయంవలన) వెళ్ళేవి.ఒకసారి అలా వెళ్ళుతూ ఉంటే --- లేతవెన్నెలలో ,మట్టి దారికి అద్దంగా పడుకునిఉంది.-- ఒక పెద్దపులి.20 అడుగులదూరం నుంచి చూసాము. బళ్ళవాళ్ళు ముందే తెచ్చుకున్న డబ్బాలు,డొక్కులతో పెద్దగొడవ చేసారు.కాస్సేపటికి పెద్దపులి మెల్లగా లేచి దారిపక్క అడవిలోకి దర్జాగా నడుస్తూ వెళ్ళిపోయింది.నేను,మా అక్కయ్య పొద్దుట పక్కనేఉన్న వాగు దగ్గరికి వెళ్ళి ఆడుకొనేవాళ్ళం.సాయంత్రం మాత్రం ఎక్కడికీ కదల నిచ్చేవాళ్ళు కాదు.రాత్రులు అప్పుడప్పుడు దూరంగా పులి గర్జనలు వినిపిస్తూ ఉండేవి.మా క్వార్టర్సు దగ్గరలో లేళ్ళు పరిగెత్తుతూ ముచ్చటగా కనిపించేవి.పులినిగాని.ఇతర అడవి జంతువుల్నిగాని చూస్తే అడవిలోనే చూడాలిగాని సర్కస్ లోను ,జూ లోను కాదు.

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>> నేనంటే నేనే....భారతవీరకుమారిని నేనే,

కి కి కి కి...........దహా.

ఫోటోలు బాగున్నాయి.

జలతారువెన్నెల said...

Thrilling soumya gaaru!

కృష్ణప్రియ said...

సౌమ్య,

:) చాలా బాగుంది. కళ్ళకి కట్టినట్టు రాశారు..
@ చిలమకూరు విజయ మోహన్ గారు,
LOL

Anonymous said...

పులిని చూసేసరికి కెమెరా షేక్ అయిందా? సరదాకే లెండి. లైవ్ లో పులిని ఫొటో తీయడం కష్టమే. నైస్ ఎక్స్ పీరియెన్స్. అన్నట్టు... రణతంబోర్ అనుకుంటా... ఒక్కసారి చెక్ చేయండి.

చాతకం said...


భయంతో దిమ్మతిరిగి మైండు బ్లాక్ అయితే ఇంకెక్కడ ఫొటో అండీ?
కథ,స్రీన్ ప్లే, దర్శకత్వం బాగుంది, సైన్మా తీయటమే తరువాయి :)
ఆ విజయ మోహన్ గారి కామెంటు ఇంటి పులి చూస్తే మీదపడి నమిలెయ్యదూ ?

ఆ.సౌమ్య said...

@రాజ్
అవును, భలేగా అనిపించిందిలే. థియేటర్ లో పులిని చూసావా...హహహ తెలిసిందిలే అదేం పులో! నాకు భయమేసింది ;)

పులికి ఫొటో తియ్యడమొకటి...కాళ్ళు చేతులు వణుకుతుంటేనూ :)

అవునవును మాయాశశిరేఖ నిద్ర లేచింది :)) మళ్ళీ పడుకుండిపోకుండా జాగ్రత్తపడాలి ;)


@ శ్రీకాంత్
హహహ కల కాదు..నిజంగానే చూసాను. thanks :)

ఆ.సౌమ్య said...

@కిర్నా
హిహిహి సాధు జంతువులతో బోరుకొట్టి క్రూరజంతువుని చూడాలని కంకణం కట్టుకున్నా :))
yeah quite an adventurous trip

@శ్రావ్య
thanks a lot :)

ఆ.సౌమ్య said...

@పద్మార్పిత గారూ
మీకు కూడా చూపించానా...హమ్మయ్య నా శ్రమ ఫలించింది :) thanks

@శైలజ గారూ
thanks a ton. హహహ BGM కూడా వినిపించిందా :))
అది సరేగానీ ఈ గారు ఎక్కడ నుండొచ్చిందండోయ్ కొత్తగా?? తీసేయండి, బాలేదు :)

ఆ.సౌమ్య said...

@ విజయమోహన్ గారు
హహహ..ఉండండుండండి మీ కామెంటు మీ ఇంటికి పోస్ట్ చేస్తా :)

@ మాల గారూ
ఇంకెక్కడి పులి ఫొటో !! మనం తీసుకుంటామంటే మాత్రం అది మనకి ఫోజిస్తుందా! ;)

@ఫోటాన్
అదే మరి, ఫొటో చూపించకుండా పులిని చూపిద్దామని :))

ఆ.సౌమ్య said...

@bonagiri గారూ
నేను కూడా life of Pi సినిమా చూసానోచ్ :)
బన్నేరుఘట్ట లో మీరు బోన్ లో ఉంటారు కదండీ. ఇక్కడ అలా కాదు. నేను, పులి కూడా స్వేచ్చగా ఉన్నాం :)

@ జయ గారూ
పులిని చాలాసార్లు చుసానండి. జూ లలో చూసాను. కానీ అడవిలో చూడ్డం ఇదే మొదటిసారి :)

ఆ.సౌమ్య said...

@కమనీయం గారు
thank you
అమ్మ బాబోయ్..అలా దారికడ్డంగా కనిపిస్తే ఎంత భయమేస్తుందో కదండీ! భలే ఉంది మీ అనుభవం. కరక్ట్...చూస్తే అడవిలోనే చూడాలి. జూలో, సర్కస్ లో పులులు నీరసంగా, బక్కచిక్కిపోయి కళావిహీనంగా ఉంటాయి.

@బులుసుగారూ
నవ్వితే నవ్వండి :)
thank you

ఆ.సౌమ్య said...

@వెన్నెల గారు
yes, very thrilling. thank you :)

@కృష్ణప్రియగారూ
thanks :)

ఆ.సౌమ్య said...

@ఫణి గారు
హహహ కెమేరా షేక్ అవ్వడమా..కాళ్ళు చేతులు కదిలితేగా! :)
కరక్టేనండీ రణతంబోర్. thank you. పోస్ట్ లో కూడా కరక్ట్ చేస్తాను.

@చాతకం గారు
అద్ది..బాగా చెప్పారు. కళ్ల ఎదుట పులి కనిపిస్తుంటే కెమేరా గిమేరా జన్తా నై :)
thanks...హహహ అయితే సైన్మా తీసేద్దామా! మరి నిర్మాతో! :))

మధురవాణి said...

అప్పుడెప్పుడో ఒకసారి ఈనాడు ఆదివారం పుస్తకంలో నేనొక వ్యాసం చూసాను. మీలాగే నార్త్ ఇండియాలోనే ఎదో అడవిలో ఇలాగే ఓపెన్ టాప్ జిప్సీ లో వెళ్లి దగ్గర నుంచి సింహాన్ని చూసి వచ్చిన వాళ్ళు రాసారు ఆ వ్యాసం. అది చదివినప్పుడు ఒళ్ళు జలదరించింది. వామ్మో.. వీళ్ళ ధైర్య సాహసాలు బంగారం గానూ.. ఇలాంటి హాబీలు, ధైర్యాలు ఉన్న జనాలు కూడా ఉంటారా, చాలా గొప్పోళ్ళు అని చాలా ఇదిగా అనుకున్నాను. మీ బ్లాగ్లో మొదటిసారి ఆ జిమ్ కార్బెట్ పోస్ట్ చదివినప్పుడు ఇదే గుర్తొచ్చింది. మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. అలాంటి వైవిధ్యమైన హాబీలు, బోల్డంత గుండె ధైర్యం ఉన్నవాళ్ళు నాకు తెలిసిన వాళ్లలోనే ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు. భలే అనిపిస్తుంది ఇప్పుడు.. :)
మీరు పులిని చూసినప్పుడు ఎంత థ్రిల్ ఫీలయ్యారో గానీ నేను మాత్రం మీ పోస్టు ఒక్కో లైనూ గుండె చిక్కబట్టుకుని చదివి చివరికొచ్చేసరికి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను.. :D
Thanks for sharing your thrilling experience with us.

జ్యోతిర్మయి said...

పులిని ఎదురుగా చూడడమే. అదొక్కసారి వెనక్కి తిరిగితే ఏమయ్యేది...ఆ క్షణంలో మీ పరిస్థితి తలచుకుంటేనే భయంగా వుంది. బాగా వ్రాశారు.

ఛాయ said...

అమ్మో పులి... చలికాలంలో వణుకు పుట్టించారుగా ( వణుకు పులివల్ల )

Anonymous said...

మన విజయనగరం పరువుని నిలబెట్టారు. ఆన్నట్టు నేనూ పులిని చూసాను. జూలో.

నవజీవన్ (NAVAJEEVAN) said...

మొత్తానికి పులి మిమ్మల్ని ఏమి చేయలేదు కదా ! పులి గురించి ఇంతకు ముందు "అన్వేషణ " సినిమాలో , బాలివుడ్ లో "కాల్" అనే సినిమాలో బాగా విశ్లేషించి చెప్పారు. అట్లాగే మీ సరస్కా లోని పులి గురించి ముచ్చట కూడా చాల బాగుంది ..ఆ పులి ని ఫోటో తీస్తే బ్లాగు లో పెడితే బాగున్ను అండి! మొత్తానికి మీ పులి పోస్టు ఆసక్తిదాయకంగా ఉంది.

Lakshmana Malladi said...

నిద్ర లేచాను అన్నారు, మీరూ నాలాగే నిద్దరోతున్నారు శశిరేఖ గారూ!!! చక్కని మీ టపాలని చదువుదామని చాలా యెదురు చూస్తున్నాను. మధురవాణి గారూ, పద్మార్పిత గారూ కవితలు, భక్తీ పారవశ్యం లో పడ్డారు, మంచి సరదా హాస్య కబుర్ల కోసం కొత్తావకాయ గారు, మీరూ మిగిలారు.

యెంత పులి కనిపించి బిగిసిపోతే మాత్రం స్వేచ్చగా తిరిగే పులి ఫోటో మాకందరికీ చూపించకుండా కేవలం చదవటం లోనేముగించారు.

ఆ.సౌమ్య said...

హహ లక్షణ్ గారూ....నేనూ అదే అనుకుంటున్నాను కొత్త పోస్ట్ వేసి చాలారోజులయ్యిందని :))

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ said...

సౌమ్య గారూ, చిన్న మాట

తెలుగు భాషను అజంత భాష అంటారు, అంటే తెల్గులోని పదాలన్నీ అచ్చుతోనే అంతమవుతాయి, ఉదాహరణకి పాలు, నీళ్ళు, వెన్న, మజ్జిగ, అన్న, అక్క ఇలాగనమాట. పాల్, నీళ్ అనేలా పదాలు తెలుగులో లేవు. అలాగే ఇటాలియన్ భాషలోకూడా పదాలన్నీ అచ్చుతోనే అంతమవుతాయి. కనుక తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు.
హిందీలో చూడండీ, భాయ్, బెహన్, రాం అని అచ్చులుకాకుండా పదాలు హల్లులతోనే అంతమయ్యేయి గమనించేరా. అదీ భోగట్టా.