StatCounter code

Wednesday, January 27, 2010

ఎవరి పేగులు?

నా చిన్నప్పుడు అంటే నేను ఆరో, ఏడో చదువుతున్నప్పుడు (సరిగ్గా గుర్తులేదు), మా విజయనగరంలో NCS హాల్ కి సీతారామకల్యాణం (1961) సినిమా వచ్చింది. బంధుపరివారమంతా ఓ పదిమందిమి కలిసి సినిమాకి వెళ్ళాము. సినిమా బావుంది, ఎన్టీవోడు విజృంభించేస్తున్నాడు. రావణుడి పాత్రలో ఒదిగిపోయాడు. వీరలెవెల్లో సాగిపోతోంది సినిమా. రావణుడు, శివుని దర్శనం కోసం కైలాసానికెళ్ళి, శివుని కానలేక, నంది చేతిలో భంగపడి ఓ అద్భుతమైన పాట అందుకుంటాడు. ఘంటసాల జీవం పోసిన "కానరార, కైలాసనివాస..." పాట అది. పాట బాగా పాడేసినా శివుడు కనికరించకపోవడంతో, శివస్తోత్రం అందుకుంటాడు. "జయద్వదభ్రవిభ్రమ..." అంటూ భీకరంగా ఘంటసాల పాడేస్తూ ఉంటే కైలాసంలో శివుడు శివతాండవం ఆడేస్తూ ఉంటాడు. అయినా రావణుడికి కనిపించడు. అప్పుడు ఎన్టీవోడు "పరమశైవాచార..." అనే పద్యం ఎత్తుకున్నాడు. అదీ అయిపోయింది. ఉహూ శివుడు కనికరించలేదు. హాల్ అంతా ఉత్కంఠతో చూస్తున్నాది. సగం మంది సీట్లపై లేచి కూర్చున్నారు. ఏంజరుగుతుందో ఏమో అని అందరు ఊపిరి బిగపట్టి కూర్చున్నారు. ఘంటసాల గాత్రానికి, ఎన్టీవోడి నటనకి జనాలు జోహార్లర్పిస్తూ, నందిని తిట్టుకుంటూ శివుడు త్వరగా దర్శనమివ్వాలని ముక్తకంఠంతో ప్రార్థిస్తున్నారు. చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది హాల్ లో. అప్పుడు వినిపించింది వెనుక వరసలో నుండి ఒక ఆడావిడ గొంతు

"ఇప్పుడు చూడు పేగులు తీసి వాయిస్తాడూ"

వెంటనే భయతో వణికిపోతూ మరో ఆవిడ గొంతు

"ఎవరి పేగులు?"

అంతే అంత సీరియస్సు సీనులోనూ జనాలు ఘొల్లున నవ్వారు.

అవతల రావణాసురుడు పేగులు తీసి వాయించడం (తన పేగులే సుమండీ), శివుడు ప్రత్యక్షమవ్వడం జరిగేపోయింది ఈ లోపల. మా ఇంట్లో ఇంకో నెలరోజులవరకు ఇదే టాపిక్ నవ్వుకోవడానికి.

ఇలాంటి సంఘటనే మొన్న మగధీర చూసినప్పుడు జరిగింది.

కాలభైరవుడికి, విలన్ కి మధ్య పోటీ వచ్చినప్పుడు, యువరాణి వస్త్రం తీసి గుర్రాల మీద పడేసి,దాన్ని తెచ్చి ఇచ్చినవారికే మిత్రవింద దక్కుతుంది అని ప్రకటిస్తారు కదా. ఆ సీను జరుగుతోంది. అప్పుడు కూడా నేను చిన్నప్పుడు సీతారామకల్యాణం సినిమా లో అనుభవించిన నిశ్శబ్దమే ఉంది హాల్ లో. విచిత్రంగా అదే NCS హాల్ ఈసారి కూడా. కాలబైరవుడే గెలుస్తాడు అని తెలిసినా (చిరంజీవి కొడుకు కదా గెలవక చస్తాడా, గెలవకపోతే ఛస్తాడు డైరక్టరు), ఎలా గెలుస్తాడా అని పరమ వీరావేశంతో జనాలు చూస్తున్నారు, నేను కూడా అనుకోండి. ఈసారీ వినిపించింది గొంతు వెనుక వరుసలోంచి, కాకపొతే ఆరెడేళ్ళ చిన్నపిల్లది.

"ఆ గుర్రాలు ఎటెళ్ళాయో వీళ్ళకేం తెలుస్తుంది, మరీ విచిత్రంగా ఉంది, ఈ పందెం ఏమీ బాలేదు. మా స్కూల్ లో అయితే....."

ఇక వేరే చెప్పాలా, మా నవ్వులు ఆగేలోపు మిత్రవింద ఒంటిపై వస్త్రం ఉంది.
























16 comments:

చైతన్య.ఎస్ said...

హ హ .. బాగుంది.

'కొన్నీ' సినిమాలు ఇలా రన్నింగ్ కామెంట్రి ఉంటేనే చూడగలం.. ఇంకా ఎంజాయ్ కూడా.


పైన మీరు చెప్పిన సినిమాలు కావు లెండి వెరేవి ;)

karthik said...

ఎవరి పేగులు!! martanda range question..
ఎంటీవోడు వినుంటే అడిగిన వాళ్ళ పేగులు కూడా బయటికి తీసేవాడు :) :)

ఆ.సౌమ్య said...

అవును చైతన్య...కొన్ని సినిమాలకి వచ్చే ఇలాంటి రన్నింగ్ కామెంట్స్ ని బాగా ఎంజాయ్ చేస్తాము, జీవితాతం గుర్తుండిపోతాయి కూడా

హ హ హ నిజమే కార్తీక్ :D

నాగప్రసాద్ said...

ఈ టపాను నేను ఆల్రెడీ ఎక్కడో చదివాను. మీరే ఏ బ్లాగులోనైనా ఈ టపాను కామెంటుగా రాశారా? బహుశా "జూరాన్ సినిమా"లో చదివాననుకుంటా.

ఆ.సౌమ్య said...

లేదు, ప్ర.పీ.స.స లోనే ఒకసారి ప్రస్తావించాను దీని గురించి

ఆ.సౌమ్య said...

తప్పకుండా జీవనిగారు, మీరు చేసే మంచి పనికి మా సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది

శ్రీనివాస్ పప్పు said...

"ఇప్పుడు చూడు పేగులు తీసి వాయిస్తాడూ"

భలే భలే ఎవరి పేగులూ?హ్హహ్హహ్హ

చాలా ఏళ్ళ క్రితం అదేదో సినిమా పేరు గుర్తులేదుకానీ అందులో చివరి సీన్లో నిధిని కాజెయ్యడానికి హీరో విలన్ అందరూ అక్కడికి చేరుకుంటారు.ఆ నిధి కొన్ని చెక్క డ్రమ్ముల్లో దాచి ఉంటుంది.ఏం జరుగుతుందో అని హాలంతా నిశ్శబ్దంగా ఉంది.అంతలో విలన్ తాలూకా వాళ్ళెళ్ళి ఆ డ్రమ్ముల మీద మూత ని తీస్తారు వెంటనే అందులోంచి పాములు బయటికి వస్తుంటాయి.అంతే కింద క్లాసులోంచెవడో ఒరే పాములురోయ్ అంటూ పెద్ద కేక పెట్టాడు,అసలే సెకండ్ షో టైం అందులో టూరింగ్ టాకీసు ఇక చూస్కో నా సామిరంగా జనాలంతా బాబోయ్ పాముల్రోయ్ అంటూ హాల్లోంచి పరుగులే పరుగులు.జన్మలో మర్చిపొలేం ఇలాంటివి...

ఆ.సౌమ్య said...

హ హ హ బావుంది శ్రీనివాస్ గారు. ఇలాంటిదే మా నాన్నగారు ఒకటి చెప్పారు నాకు.
ఆయన చిన్నప్పుడు, సినిమాలు కొత్తగా వచ్చిన రోజులవి. స్క్రీన్ మీద గుర్రం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే...ఒకతను 'బాబోయ్ గుర్రం మీదకొచ్చేస్తున్నది నాయనోయ్' అని ఒకటే పరుగుట హాల్ బయటకి. అతనిని చూసి మిగతా జనాలు కూడా లగెత్తారట.

చైతన్య said...

హ హ్హ్హ బాగుంది :)
చిన్నప్పుడు ఆ పాట చూడాలంటే భయమేసేది... ఆ పేగుల సీన్ వలన!

శ్రీనివాస్ said...

ఆ రోజుల్లో జాన్ లిక్విడ్ సాలిడ్ అనే అయన కూడ శ్రీకాకులంలో ఒక సినిమా తీయలనుకుని సినిమా తెహాల్ కి వెళ్లడం జరిగింది ఆ హాల్ లో పల్లీలు అమ్మే వారు కూడ ఉన్నారు నేను వారి వద్ద పల్లీ కొన్నాను అయితే ఆ పల్లీలు ఎవరికీ ఇవ్వలేదు.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

@Vikatakavi :)

ఆ.సౌమ్య said...

మీరు మరీనండీ శ్రీనివాస్ గారూ :)

వేణూశ్రీకాంత్ said...

హ హ ఎవరి పేగులూ ? సూపర్ అండీ.. మీరు చెప్పిన విధానం మరీ బాగుంది :)

శ్రీనివాస్ మీ ’ప్రావిణ్య’త చూస్తుంటే ముచ్చటేస్తుంది :) మరీ అంత అభిమానమా !!

ఆ.సౌమ్య said...

Thank you Srikaant ji :)

Sandeep P said...

హ హ - బాగున్నాయండి - మీ అనుభవాలు :)

ఆ.సౌమ్య said...

@sandeep
Thanks!