హెలో రజత్, నేను ఫ్రాన్సిస్ ని మాట్లాడుతున్నాను, మీరెక్కడున్నారు?
హెలో ఫ్రాన్సిస్ మేము ఏరు దాటి వచ్చేసాము. ఎదురుగుండా చూడు ఏటిగట్టుకవతల కనిపిస్తాం?
అవును రజత్, మీరు కనిపిస్తున్నారు? ఏరు దాటి ఎలా రావాలి?
ఫ్రాన్సిస్ అక్కడెవరెవరున్నాను? మీరు ఎందుకింత లేట్ అయ్యారు. 5.00 గంటలకే రమ్మన్నాము కదా?
నేను, సౌమ్య మాత్రమే ఉన్నాం.ఇద్దరం టైం చూసుకోలేదు, లేట్ అయ్యాము, ఇప్పుడు 5.30 కదా అయ్యింది. ఇంకా చీకటి పడలేదుగా, మేము వచ్చేస్తాం.
అయితే మీరిద్దరు మెల్లిగా ఏరుదాటి రండి. ఏటిలో మోకాలులోతు నీరు ఉంది. పెద్ద పెద్ద రాళ్ళు పాకుడు పట్టి ఉన్నాయి. కాబట్టి చిన్న రాళ్ల మీద అడుగులు వేస్తూ రండి. మీరు త్వరగా వస్తే మమ్మల్ని చేరుకోగలరు.
అలాగే రజత్, ఇప్పుడే బయలుదేరుతున్నాం.
సౌమ్యా, మనం ఈ ఏరు దాటాలి. మెల్లిగా నడుద్దాం రా.
అలాగే ఫ్రాన్సిస్, పద. అమ్మో ఈ రాళ్ళేమిటి ఇంత పాకుడు పట్టి ఉన్నాయి. ఎక్కడ కాలు వేస్తే ఎక్కడ జారుతామో అని భయంగా ఉంది. జాగ్రత్తగా చూసుకుని నడువు......ఓరినాయనో ఇదెక్కడి గోల, పెద్దరాళ్ల మీదా కాలు వెయ్యలేము, చిన్నరాళ్ళు కాలికి గుచ్చుకుంటున్నాయి. నీళ్ళు లేకపోయినా అష్టకష్టాలు పెట్టే ఇలాంటి ఏరుని నేనెక్కడా చూడలేదబ్బా.
ఇది "కోసి నది" ట సౌమ్యా, ఉదయం ఆ కుర్రాడెవరో చెప్తుంటే విన్నాను. నీళ్ళు లేక నది చిన్నబోయి బావురుమంటూ ఏరయిందిట.
హమ్మయ్య ఎలాగోలా ఏరు దాటేసాం. ఏమిటి మన తక్షణ కర్తవ్యం?
ఏముంది ఎదురుగా ఉన్న అడవిలోకి వెళ్ళడమే.
ఇక్కడ రెండు దారులు కనిపిస్తున్నయే, ఏదారి చూసుకోవాలి.
కుడిచేతివైపు దారి నదికి సమాంతరంగా ఉంది, ఇది అడవికి దారి తియ్యదు. ఎడమచేతివైపే వెళ్ళాలి అనుకుంటా.
సరే పద, అమ్మో ఈ అడవి ఏమిటి ఇంత నిశ్సబ్దంగా ఉంది. ఇక్కడ అసలే పులుల సంచారం ఎక్కువట.
నాకూ భయంగానే ఉంది. ముందుకి వెళ్ళాలా వద్దా? సర్లే ఇంతవరకు వచ్చాము కదా, ముందుకే నడుద్దాం. అంతమంది జనాలు మనముందు వెళ్ళగా లేనిది మనం వెళ్ళలేమా...రా వెళదాం.
సరేకానీ, ఏమి జరిగితే అదే జరుగుతుంది, నడు. ఫ్రాన్సిస్ నువ్వు అడవులకు వెళ్తూ ఉంటావా?
ఏమిటా పిచ్చి ప్రశ్న? నేను అడవిలకి వెళ్ళడమేమిటి? అప్పుడప్పుడు మన వ్యవస్థలో మృగాలని చూడడం తప్ప నేనే అడవులజోలికీ పోలేదు.
అబ్బే భయంతో మాట అదే ప్రశ్న తడబడిందిలే...అంతే.
సరేలే, మరి నువ్వో? నేను అది, నేను ఇది అని చెప్పుకుంటావే, ఆడపులినంటావ్, ఆఫీసులో అందరిని భయపెడతావ్, ఇప్పుడిలా వణుకుతున్నావేమిటి?
అమ్మతోడు, జూ లో జంతువులని కూడా చూడడానికి భయపడతాను, నేను ఆడపులినేమిటి, అబ్బే ఉత్తుత్తినే, అవన్నీ ఏదో హాసికానికి అంతే తప్ప, అబ్బే చీ చీ అలా ఏం లేదు....ఆగు, ఏదో పులి గర్జిస్తున్నట్టు వినబడడంలేదూ.
నీమొహంలే రా...నాకూ కాస్త దడగానే ఉంది, చూద్దాం కాస్త ముందుకెళ్ళి...హ్మ్ ఇంక లాభంలేదు సౌమ్యా...ఇలా బిక్కుబిక్కుమని నడవలేము కానీ, ఉండు రజత్ కి మళ్ళీ ఫోన్ చేస్తాను.
సరే చెయ్యి....
(స్వగతం) నాజీవితంలో నేను పులిబారినపడి చస్తానని కలలో కూడా అనుకోలేదు. విధి ఎంత బలీయమైనది. ఏ పులి నాలిక మీద నా పేరు రాసి పెట్టి ఉందో. పులిలా బతికాను ఇన్నాళ్ళు, పోనీలే పులికే ఆహరమైపోతే మన పరువుకి తగ్గట్టుగా ఉంటుంది. ఈ గుండె దడ తగ్గాలంటే ఏం చెయ్యాలీ????????? ఆ....ఓ మాంచి పాటేసుకుందాం.
ఉప్పొంగెనే గోదావరీ ఊగిందిలే చేలో పులి,
ఈ అడవిలో అదిగో పులి, అయ్యిందిలే నా పని సరి.
చీ చీ చీ మళ్ళీ పులుల గోల
వేరే పాట, పాత పాటేసుకుందాం......హ్మ్ హ్మ్ ఆ ఆ
వివాహ భోజనంబు, పులికైన వంటకంబు
పులిగారినోట విందు ఒహొహో నేనే ఉందు
హమ్మ బాబోయ్ పాటలొద్దు, కామెడీగా ఉంటుంది మార్తాండని తలుచుకుందాం.
ఈ అడవిలో స్త్రీవాద పులులున్నాయా? ఇవి స్త్రీపులివాద అడవులు కావా?
వామ్మో వారినాయనో ఇదెక్కడి పులిగోలరా బాబూ....మార్తాండ ని కూడా మరిపింపజేస్తున్నాయి ఈ ఆలోచనలు. సర్లే ఓ మాంఛి తవిక రాద్దాం.
ఊరి చివర అడవి
అడవిలో పులి
పులి నోట్లో నేనూ
నా ఖర్మ.....మాంఛి తవికలు రాస్తానని నాకు ఎంతో పేరు ఉంది బ్లాగ్లోకంలో! నా కవితలకి మురిసిపోయి ముందుమాట రాస్తానని జూరాన్ మోహన్ కమిట్ అయిపోయారు కూడా, కానీ ఇప్పుడేమిటే ఇలా.....ఈ కుర్రడేమిటి ఫోను ఇంకా మాట్లాడుతున్నాడు.....బాబూ తొందరగా రా నాయనా, పులిగోల భరించలేకపోతున్నాను.
ఆ వచ్చేసాను సౌమ్యా, ఏమయింది పులి పులి అని ఏదో అంటున్నావు?
దానిగోలెందుకులే ఇప్పుడు మన సంగతేమిటి. ఇంక ముందుకి వెళితే ఒక చిన్న రోడ్ వస్తుందిట, అది దాటి వెళితే అసలు అడవిట. ఇక్కడ కూడా పులులు తిరిగే చాన్సు ఉందిట. మన గుంపుతో పాటుగా ఇద్దరు గైడ్స్ ఉన్నారట. వాళ్ళలో ఒకరిని మనకి తోడుగా పంపిస్తానన్నారు. అంతవరకు మనల్ని ముందుకి కదలొద్దన్నారు. అంత మంచిదికాదుట.
హయ్యో, వారి నాయనో, అమ్మా...నేనెందుకు ఇక్కడికొచ్చానురో తండ్రీ... ఇలా పులులకి ఆహారమైపోతానురో నాయనో. ఈ బాధ కంటే చెరశాల కథ ఎంతో మేలు కదా.
మనసు గతి ఇంటే మనిషి బ్రతుకింతే
పులినోట మనిషికి విముక్తి లేదంతే
తల్లీ ఆపు నీ పాటలు, అసలే భయంతో చస్తూ ఉంటే...అదిగో ఎవరో వస్తున్నాట్టునారు చూడు.
ఎవరితను చేతిలో ఆ రాయేమిటి? ఆ రాయితో కొట్టి మనల్నేమైనా చేస్తాడా? పులికంటే ఈ మనిషి ఇంత భయంకరంగా ఉన్నాడేమిటి?
ఆగు వెనక్కి రా సౌమ్యా, చేతిలో రాయి తీసుకో....వాడో రాయి వేస్తే, మనం రెండు రాళ్ళు వేద్దాం.
ఆ ఆ భయపడకండి సార్, నేను గైడుని, మీ వాళ్ళు పంపించారు. దారిలో ఒక్కడిని వస్తూ ఉంటే పులి అలికిడి వినిపించి రాయి పట్టుకుని నడిచాను ఈ అడవిలో, అంతే.
ఒహ్ హమ్మయ్య బ్రతికించావు కదరాబాబు. సరే పద, ఎక్కడికెళ్ళాలో చెప్పు.
మేడం ఇప్పుడు టైం 6.00 అయింది, ఇంక అడవిలోపలకి వెళ్ళడం మంచిదికాదు. కానీ ఒక 2 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. అక్కడ "గ్రాస్ ఫీల్డ్" అని ఒకటుంది. అక్కడవరకు వెళ్ళి వెనక్కొచ్చేద్దాం.
సరే బాబు, నువ్వేది చెబితే అదే....పద
సార్ పులులు చాలా మంచివి సార్, అవును మేడం అవి మనల్ని ఏమీ చెయ్యవు. ముసలివి, రోగగ్రస్థమయినవి అయితే తప్ప మనుషులజోలికి అవి రావు. వాటికి లేళ్ళు, జింకలను వేటాడడమే సరదా. ముసలివి, రొగిష్టివి అయితే వేటాడలేవు కాబట్టి కాపుకాసి మనుషుల మీద పడతాయి.
ఒకవేళ ఇప్పుడు మనకి ఏ ముసలి పులో తగిలిందనుకో ఏమి చెయ్యాలి బాబూ?
ఊరుకోండి మేడం మీకన్ని భయాలే, నేనే భయపడి ఛస్తూ ఉంటే....ఏముంది ముసలి పులి రాకూడడని ప్రార్థిస్తూ వెళ్ళడం తప్ప వేరే ఏమీ చెయ్యలేం.
నాతండ్రే, ఎంత మంచి సలహా ఇచ్చావురా నాయనా....హా, నీకూ భయమేనా...అయితే ఇవాళ పులికి తమిళ్, తెలుగు...నువ్వే రాష్ట్రంవాడివి నాయనా?
మాది బెంగాల్ మేడం
ఒహో అలా అయితే తమిళ్, తెలుగు, బెంగాల్ రుచి తెలుస్తుందన్నమాట. ఆహ ఆ అదృష్టపులి ఎక్కడ కాపుకాచి ఉందో !
మేడం ఇదే గ్రాస్ ఫీల్డ్, అక్కడ చూడండి జింకల గుంపు.
హాయ్, అవును భలే జింకలు....అబ్బ ఎన్ని ఉన్నాయో. కనీసం 15-20 ఉంటాయి కదూ.
అవును సౌమ్యా ఉంటాయి, భలే అందంగా ఉన్నాయి కదా.
మేడం దగ్గరకెళ్లకండి. అన్ని జింకలున్నాయంటే ఖచ్చితంగా పులి సమీపంలోనే పొంచి ఉంటుంది.
హబ్బ మళ్ళీ ఇదో ఫిట్టింగా...సర్లే దూరం నుంచే ఓ ఫొటో తీసుకుంటాను.
సార్ 6.30 దాటింది, వెనక్కి తిరిగి వెళ్దాం....మళ్ళీ చీకటి పడితే అడవిలో కష్టం.
అవును పద పద, రా సౌమ్యా.
సరే పదండి. సార్ గట్టిగా మాట్లాడుతూ నడుద్దాం. ఎక్కువ శబ్దం చేస్తే పులులు భయపడతాయి.
సర్లేకానీ. అవును నువ్వెన్నాళ్లనుండీ ఇక్కడ పని చేస్తున్నావు? పులిని ఎన్నిసార్లు చూసావు? ఇంతకీ నీ పేరేమిటి?
నేను రెండేళ్ళ బట్టీ ఇక్కడ ఉన్నాను. నా పేరు మిక్కీ. మాది డార్జిలింగ్ సార్. పులిని చాలాసార్లు చూసాను. పులి దగ్గర్లో ఉంటే నేను పసిగట్టేయగలను సార్.
పోనీలే నాయనా ఆ మాత్రం భరోసా ఇచ్చావు అంతే చాలు. ఈ అడవు నుండి బయటపడితే అదే పదివేలు.
....................
ఇలా మాట్లాడుతూ నడుస్తుండగా పెద్ద శబ్దం చేసుకుంటూ ఏదో మా మీదకి దూకింది....అంతే పై ప్రాణాలు పైనే ఎగిరిపొయాయి. తరువాత ఏమి జరిగిందో నాకు తెలియలేదు. కానీ జైంట్ వీల్ లో తిరుగుతున్నాట్టు అనిపించింది. కిందకి మీదకి ఊగుతున్నట్టనిపించింది. తలకిందులుగా వేలాడుతున్నానా అని అనుమానం వచ్చింది. ఈ ఊగిసలాటల నడుమ కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా స్వర్గం కనిపించింది. ఆహా అద్భుతం! అంటే నన్ను తిన్న పులి నరకానికి, నేను స్వర్గానికి అన్నమాట...భలే భలే.... తంతే బూర్లగంపలో పడ్డట్టు, పులినోటి నుండి స్వర్గంలోకి జారిపడ్డాను. పులి నోరు స్వర్గానికి దారి అని తెలుసుకోలేకపోయాను. శెభాష్, ఎంతైనా ఆడపులిని, పెట్టిపుట్టాను కదా. ఏమిటీ, ఎవరూ కనిపించట్లేదు ఇక్కడ?
ఇంతలో ఫెడేల్ అని శబ్ధం......దవడ వాచిపోయింది. ఎవరో నన్ను చాచిపెట్టి కొట్టారు. బుగ్గ కందిపోయి మంట గా అనిపించింది. కళ్ళంట నీళ్లు తిరిగాయి. "చావకుండా స్వర్గానికి రావడానికి నువ్వేమైనా త్రిశంకుడికి చెల్లెలివి అననుకున్నవా, వెళ్ళు వెళ్ళు, పగటికలలు కన్నది చాలు" అంటూ ఓ స్వరం ఘర్జించింది. ఒక్క తోపు, అంతే ఎక్కడ పడ్డానో తెలియలేదు.
కళ్ళు తెరిచి చూస్తే నా పక్కనా ఫ్రాన్సిస్ కూడా ఇంచుమించు అదే అవస్థలో ఉన్నాడు. ఇటువైపు మిక్కీ చాలా ఆతృత గా మా ఇద్దరినీ చూస్తున్నాడు. అంటే నేను బతికే ఉన్నాను. గొప్ప ఆనందం గా అనిపించింది....అనిర్వచనీయమైన ఆనందం.... మార్తాండ బ్లాగు మూసేసినప్పుడు కలిగే ఆనందం.
ఏమయింది ఒక్కసారిగా? అంత శబ్దం చేస్తూ మనమీదకొచ్చిపడినదేమిటి?
ఏమిటి మేడం భయపడ్డారా? అది నెమలి. మనల్ని చూసి భయపడింది. ఆ చెట్టు మీద నుంది ఈ చెట్టు మీదకి ఎగరబోయి మనల్ని తాకుతూ వెళ్ళింది అంతే.
హేవిటీ నెమలా..మరి అంత శబ్దం వచ్చిందేమిటి? పెద్ద నెమలి మేడం, రెక్కల శబ్దం అది....
అవునా...పులి కాదన్నమాట...ఛ నెమలిని మిస్ అయ్యాము కదా, ప్చ్.....
బాధపడకండి మేడం రేపు పొద్దున్నే మనం అసలైన అడవిలోకి వెళ్తాం కదా, అప్పుడు బోల్డు నెమళ్ళను చూద్దురుగానీ..
హేవిటీ మళ్ళీ అడవా నేను రాను బాబోయ్ !
................
అలా అన్ననే తప్ప వెళ్ళడం మానలేదు. మేము క్రితం వారాంతలో కోర్బెట్ నేషనల్ పార్క్ (Corbett National Park) కి వెళ్ళాం. మా ఇన్స్టి ట్యూట్ లో అందరం కలిసి ఓ 40 మందిమి వెళ్ళాము. ఇది హిమాలయాలకి దిగువన ఉంది.దీని గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ నొక్కండి.
నిజంగా అడవి ఒక అద్భుతం. అక్కడ ఉన్న రకరకాల చెట్లు, వాటి రంగులు అమోఘం. మాటల్లో చెప్పనలవికాని అనుభవం. రకరకాల జంతువులని చూసాము. మొదట్లో, అడవిలో జంతువులని చూసేదేమిటి జూ లో ఎన్ని సార్లు చూడలేదూ అనుకున్నాను. కానీ ఆ అనుభూతి వేరు. నాలుగు గోడల మధ్య బంధించి ఉన్న జంతువులో లేని స్వేచని అడవిలో జంతువులలో అణువణువునా చూసాను. వాటి ప్రతీ కదలికలోనూ స్వేచ్చా వాయువుల ఆస్వాదన కనబడింది. నాకు స్వేచ్ఛ విలువ మరింత తెలిసింది.
పులిని చూద్దామని ఎంతో ఆశగా ఎదురుచూసాము. ఈసారి టాప్ లెస్ జీపులో, గుంపుగా వెళ్ళాము కాబట్టి అంత భయపడలేదు. కానీ మాకు నిరాశే మిగిలింది. 164 పులులలో ఒక్క పులీ కనబడలేదు. దాని అడుగుజాడలు మాత్రం కనిపించాయి. మా జీపుకి ముందు వెళ్ళిన జీపు టైరు గుర్తుల మీద పులి పంజా గుర్తులు కనిపించాయి. అంటే మేము ఒక 10-15 నిముషాల తేడాతో పులిని మిస్ అయ్యాము అన్నమాట. కానీ మా స్నేహితులు, వేరే జీపులో ఉన్నవాళ్ళు చూసారు. మేము ఆ గుర్తులు చూసి పులినే చూసినంత సంబరపడిపోయాము.
ఇక్కడి రంగులు వర్ణనాతీతం. పచ్చదనం యొక్క స్వచ్ఛత ఏమిటో తెలిసింది.సెలయేటి నీరు అమృతంగా అనిపించింది. కొమ్మకొమ్మకీ తీర్చిదిద్దినట్టు ఉన్న వర్ణాలు అనేకానేకం. పసుపు,ఎరుపు,గులాబి రంగుల మేళవింపు కనులకు మిరిమిట్లుగొలిపింది. అక్కడికి దగ్గరగా ఉన్న పల్లె ప్రజలు ఈ అడవితల్లి బిడ్దలు. అమ్మ ఒడిలో దక్కే అమృతాన్ని అణువణువునా ఆస్వాదిస్తున్నారు. అక్కడ ఉన్న అందమైనా ప్రకృతిని నా బుల్లి కెమేరాలో బంధించడానికి విశ్వప్రయత్నం చేసాను. కానీ సాధ్యమా! వీలైనంత పొందుపరిచాను. ఆ అడవిని వీడి వస్తూ ఉంటే తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి.
ఆకులో ఆకునై
పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా.....
(ఆలశించిన ఆశాభంగం, నేడే చూడండి....అడవి ఫొటోలు టపాకి కిందన, పైన ఉన్న స్లైడ్ షో లో)
8 comments:
అనిర్వచనీయమైన ఆనందం.... మార్తాండ బ్లాగు మూసేసినప్పుడు కలిగే ఆనందం
ha..ha.... eepost chadivaka naaku kooda.. :) :)
bavundanDI.
కధ కాని కధ(మీరు చెప్పింది).నిజం కాని నిజం(మీ కధలో మీరు కన్న కల...నిజమయితే ప్చ్).ఆశ కాని ఆశ(మార్తాండ బ్లాగు మూసెయ్యడం...హుం ఎంతాశ)
మొత్తానికి అడివి ఒక అనిర్వచనీయమయిన అనుభూతిని మిగిల్చింది మీకు మీ ప్రయాణంతో మాకు మీ బొమ్మలకధతో.అదీ విషయం.
ఈ ఫోటోలు అన్నీ మీరే తీశారా
పులిని చూడలేకపోయ్యరా pcch :(
ఫోటోలు చాలా బాగున్నాయి సౌమ్యగారు.
Thanks Raj kumar and Aparna
అవునండీ హరేకృష్ణగారూ, అన్ని ఫొటోలూ నేనే స్వయంగా నా చేతులతో తీసాను. మీకెందుకంతనుమానమొచ్చిందీ?
అవునండీ, చివరఖరికి పులిని చూడకుండా వెనుదిరగాల్సివచ్చింది.
@శ్రీనివాస్ గారూ
హ హ హ....ఆశ కాని ఆశే మరి, వెర్రి ఆశ...హి హి హి
నా కథనం మిమ్మల్ని కదిలించినందుకు ఆనందంగా ఉంది...Thanks !
..miru 1st lo rasina dhanilo me version lo unna dialogues chala comedy ga,expressive ga unnay...ade vidhanga francis,guide vi kuda unte inka bagundedhemo,..vallani kevalam info cheppe sadhanalu ga upayogincharu...anduvalla koncham flow miss ayindhanpinchindi,narration lo break vahcindi....but me dialogues matram chala bagunnay,..esp swargam ankunna episode,marthanda blog,paatalu,kavithvam,musali puli...nice attempt..
btwn,..very nice pics..aa adavi maku kuda chupinchinandhuku thanks!!!
Thanks Vivek,
ఇది కథ కాదు అని ముందే చెప్పగా.
వాళ్ళ తరపునుండీ అంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోయాను మరి.
ఈసారి ఫ్లో తప్పకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను.
Thanks you so much for your suggestions, really !
Post a Comment