గతవారం కొత్తపాళీగారు "మూడు ప్రభంజనాలు" అని ఒక టపా పెట్టారు. ఆ మూడు ప్రభంజనాలు ఏమనగా
యండమూరి వీరేంద్రనాథ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మరియు ఇళయరాజా.
నేను సిరివెన్నెల గురించి రాసాను. అదే మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను కొన్ని సవరణలతో.
సిరివెన్నెలగారి పాటలంటే నాకు ఎంతో ఇష్టం. మొట్టమొదటగా నేను విన్నవి సిరివెన్నెల సినిమలోవే. అందులోనా "ఆదిభిక్షువువానినేమి అడిగేది" అనే పాట గొప్పగా అనిపించింది. చిన్నచిన్న పదాలతో గొప్ప భావాలను పొందుపరిచారు. నిందాస్తుతి అనేది ఒక ప్రక్రియ. దేవుని మీద భక్తి కన్న భాష మీద భక్తి ఎక్కువ నాకు. ఆమూలంగా ఈ పాట బాగా నచ్చింది. ఆ పాట విన్నప్పుడల్లా ఏదో తెలియని గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇది అని చెప్పలేను కానీ శక్తివంతంగా అనిపిస్తుంది. బహుసా అది భాష గొప్పతనమేమో మరి.
నన్ను బాగా ఉత్తేజపరిచిన పాట అంకురం సినిమాలో "ఎవరో ఒకరు ఎపుడో ఒపుడు".
"ఎవరో ఒకరు ఎపుడో ఒపుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు
మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుకవచ్చు వాళ్ళకు బాట అయినది"
......అన్న పదాలు నేను ఎప్పుడూ పాడుకుంటూ ఉంటాను. ఎందరో సంస్కర్తలు ప్రపంచం నలుమూలలా ఇలాగే ఆలోచించి ముందుకి కదిలి ఉంటారు. ఆ పద్ధతిలోనే నేను నా జీవితంలో ఎన్నో కొత్త పద్ధతులను ఆచరించాను. అవన్ని ఇప్పుడు రాయలంటే కష్టం కానీ ఏదో ఒకరోజు నా బ్లాగులో రాస్తాను.
తరువాత గాయం సినిమాలో "నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని" మరియు అలుపన్నది ఉందా ఎగిరే అలకు" అన్న పాటలు.
"నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ, ఎవ్వరు ఏమైపోనీ"
పాతరాతి గృహలు పాలరాతి గృహాలైనా, అడవినీతిమారిందా ఎన్నియుగాలైనా
వేట అదే, వేటు అదే, నాటి కథే అంతా,నట్టడువులు నడివీధికి నడిచొస్తే వింతా?
బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ"
నిన్ననే ఒక పోస్ట్ చూసాను (http://palavelli.blogspot.com/2010/05/blog-post.html) దళితులని ఇంకా తక్కువగా చూస్తూ, అంతరానితనాన్ని అవలంబిస్తున్న ఒక గ్రామం గురించి. ఆ పోస్ట్ చదివునప్పుడు నాకీపాటే గుర్తొచ్చింది. "వేట అదే వేటు అదే నాటి కథే అంతా".....నిజమేననిపించింది.
........ఎప్పుడైన వ్యవస్థలో ఉన్న కుళ్ళుని చూసినప్పుడల్లా ఈ పాట గుర్తు వస్తుంది నాకు. నేనేమీ చెయ్యలేనా అని బాధపడినప్పుడు "ఎవరో ఒకరు ఎపుడో ఒపుడు" పాట గుర్తొస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది.
అలుపన్నది ఉందా ఎగిరే అలకు, యదలోని లయకు,
నాకోసమే చినుకై విరిసి ఆకాసమే దిగదా ఇలకు
.....ఈ పాట విన్నప్పుడల్లా ఏవేవో లోకాలకి వెళ్ళిపోతూ ఉంటాను.
ఈ మధ్య వచ్చిన "మహాత్మ" సినిమాలో
"తలయెత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక తులలేని జన్మమ్మునాదని"
.......
తెలుగు చాలా ఇష్టమైన నాకు ఈ పాట గొప్ప ఉత్తేజాన్ని, ఆత్మవిశ్వాశాన్ని కలిగించింది. ఎన్నిసార్లు విన్ననో నాకే తెలీదు.
మరొక అద్భుతమైన పాట
"అర్ధశతాభ్ధపు అజ్ణానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మవినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా, దానికి సలాముచేద్దామా...."
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా దాన్నే స్వరాజ్యమందామా"
అన్నిటికంటే గొప్ప పాట:
"ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏక్షణం, విస్మరించవద్దు నిర్ణయం. అప్పుడే నీ జయం నిశ్చయం రా"
మానవుడు తన ఉనికి కొసం ప్రకృతితోనూ, వ్యవస్థ తోనూ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉండాలి అనే విషయాన్ని సూచిస్తుంది. జీవించాలనే గొప్ప ఆశని కలిగిస్తుంది. ఈ పాట "పట్టుదల" అనే సినిమాకోసం రాసినది. కానీ సినిమాలో రాలేదు.
ఇంకా చెప్పాలంటే
"జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాది, సన్యాసి జీవితం నాది
మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై
రవినై, శశినై, దివమై, నిస్నీ
నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే భ్రమిస్తూ"
ఒంటరినై ప్రతి నిమిషం కంతున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాలా, హరిణాన్ని హరిణాల, చరణాల్ని చరణాల చలనాల కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని"
............
అహం బ్రహ్మాస్మి భావన.
రుద్రవీణలో "నమ్మకు నమ్మకు ఈ రేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి, మత్తులోన మెత్తగ తోసి కలలే వలగా విసిరే చీకట్లను"....గొప్ప పాట
కొత్త "మాయాబజార్" లో"కనివిని ఎరుగని ఈ కల, నిజమని పలికెను కోకిల,
ప్రతి ఒక అణువున నేడిలా, అవనికి వచ్చెను నవకళ,
అలరులు కురిసిన ఈ ఇల మెరిసెను నూతన వధువులా, తొణికిన తూరుపు వెలుగిలా పుడమికి అలరెను మేఖల"
నాకు నచ్చిన ఒంకొక మంచి పాట లిటిల్ సోల్డియర్స్ లోనిది
"సరేలే ఊరికో, పరేషానెందుకు?
చలేసే ఊరిలో జనాలే ఉందరా!
ఎడారి దారిలో ఒయాసిస్ ఉండదా!"
"కోకిలమ్మ ఆకలైనా ట్యూను మాత్రం మార్చదే
రామచిలక రాతిరైనా కీచురాయై కూయదే
అలాగే నీ పెదాల్లో నవ్వునెప్పుడు మారనీయకే ఏమైనా
కష్టమొస్తే కేరు చెయ్యక నవ్వుతో తరిమేయవమ్మా"
చిన్న చిన్న ఆగ్ల పదాలను కలిపి అవి కూడా తెలుగే అనే భ్రమని సృష్టించడంలో ఈయన దిట్ట. అలాంటి ప్రయోగమే ఇంకొక పాట
"భద్రం బికేర్ఫుల్ బ్రదరు
భర్తగ మారకు బేచులరు
షాదీమాటే వద్దు గురు
సోలో బ్రతుకే సో బెటరూ"
అలాగే మనీ సినిమాలో చిన్న చిన్న పదాలతో లోకం తత్వాన్ని చెప్పే పాట. డబ్బు పేరు పెట్టి మనుషుల స్వభావాలను చాలా గొప్పగా చెప్తారు.
"చక్రవర్తికీ వీధి బిచ్చగత్తికి బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు అయినా అన్నీ అంది మనీ మనీ
రోటీ కపడా రూము అన్ని రూపీ రూపాలే
సొమ్ములే శరణమ్మని చరణమ్మునమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మి ని లవ్వాడి కట్టుకోరా"
ప్రేమ పాటలు రాయడంలో ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి
"నా ప్రతి యుద్ధం నువు, నా సైన్యం నువ్వు
నా ప్రియశత్రు నువ్వు, నువ్వు
వెచ్చని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు, నచ్చే కష్టం నువ్వు"
"నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
"పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని
ఏతోడుకూ నోచుకోని నడకెంత అలుపో అని"
తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు,
తప్పని స్నేహం నువ్వు నువ్వు,
తియ్యని గాయం చేసే అన్యాయం నువ్వు, అయినా ఇష్టం నువ్వు నువ్వు"
"వెంటనే నీ మది, పొందనీ నెమ్మది
అని తలచే యద సడిని పదమై పలికి మంత్రం వేయనీ"
"భూమి కనలేదు ఇన్నాళ్ళుగా, ఈమెలా ఉన్న ఏ పొలికా
అరుదైన చిన్నారిగా, కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా"
"నేననీ నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒక్కరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా"
"ఉండుండి ఇలా ఉబికొస్తుందేం కమ్మానైన కన్నీరు, తీయనైన గుబులిది అంటే నమ్మేదెవ్వరు?
మధురమైన కబురందిందే కలతపడకు బంగారు, పెదవి తోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరు !"
"గంగలాగ పొంగిరానా ప్రేమసంద్రమా, నీలో కరిగి అంతమవ్వనా ప్రాణబంధమా!
అంతులేని దాహమవనా ప్రియప్రవాహమా, నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా"
"సమయమా చలించకే, బిడియమా తలొంచకే
తీరం ఇలా తనకు తానే వెతికి జతకి చేరే క్షణాలలో"
"పాదం కదలనంటుందా ఎదురుగా ఏమలుపుందో కాలం ముందే చూపందే
దూరం కరగనంటుందా తారలను దోసిట పట్టే ఆశలు దూసుకుపోతుంటే
లోతెంటో అడగనని పడవల్లే అడుగేస్తే దారీయను అంటుందా కడలైనా
తన కలలుగ మెరిసే తళుకులతీరం నిజమై నిలిచే నిముషం కోసం దిశలను తరిమే ఉరుమే ప్రేమంటే
నువ్వే తన ఐదోతనమని నోచే నోముంటే నిత్యం నీ జీవితమంతా పచ్చనిపంటవదా?
తానే నీ పెదవులపై చిరునవ్వై నిలిచే ప్రేముంటే ఆ తీపికి విషమైనా అమృతమైపొదా"
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.....
కొన్ని పదాల కలయిక, వాటి భావం కొత్తకొత్త అర్థాలని చెప్తూ ఉంటాయి.
ఉదాహరణకి
"నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే"
"ఆటనే మాట కర్ధం ...నిను నువే గెలుచు యుద్దం"
"వెక్కెక్కి ఏడ్చే కన్నీళ్ళు ఉప్పన
ఫక్కుమన్న నవ్వే ఒక తేనె ఉప్పెన"
"ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా
గుండెబావిలో వున్న ఆశతడి ఆవిరి అవుతున్నా"
ఇలా అడుగడుగునా, అణువణువునీ కదిలించే ఎన్నో ఆణిముత్యాలు సీతరామశాస్త్రిగారి కలం నుండి జారిపడ్డాయి. ఇంకా గొప్ప కవులు లేరని కారు, కానీ నాలో ఉత్తేజాని కలిగించింది పింగళిగారి తరువాత ఖచ్చితంగా సీతారామశాస్త్రిగారే.
మూడు దశాబ్దాలైనా "బూతు పట్టని కలం" సిరివెన్నెల మనం.....కాదంటారా?
29 comments:
నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా..
నీరసించినిలిచిపోతే నిమిషిమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా?
this is my all time fav.. i used to listen this particular song atleast 4-5 times a day in later part of 2008. Really mesmerizing words..
-Karthik
@కార్తీక్
మంచి పదాలని గుర్తుచేసావు. నెనర్లు !
నాకైతే "కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేమి అడిగేది?" అన్న ప్రయోగం ఎంత నచ్చిందో చెప్పే ప్రయత్నం చేయాలనే వుందిగానీ అసలు కంటే కొసరు ఎక్కువవుతుందని ఆపేస్తున్నా.
సింధూరంలో "అర్ధశతాభ్ధపు అజ్ణానాన్ని స్వతంత్రమందామా...."పాట గురించి రాయకపోయెసరికి మనసు కలుక్కుమంది..
@ మృత్యుంజయ్ గారూ
భలే గుర్తు చేసారండీ సింధూరం పాటని. దాని గురించి కూడా రాదామనుకున్నాను, కానీ ఈ పాటల ప్రవాహంలో అది కొట్టుకుపోయినట్టుంది. ఇప్పుడే ఆ పాటని కూడా కలుపుతాను. గుర్తుచేసినందుకు చాలా చాలా Thanks!
త్వరలో ఇళయరాజా పాటల మీద టపా రాయండి. సిరివెన్నెల పాటలు అంటే ... వేసవి మల్లెల వెన్నెలే అని అర్ధం. ఎంత చెప్పినా తక్కువే.
ఇళయరాజా గారి మీద కూడా రాస్తాను స్వర్ణమాలికగారూ!
బాగా చెప్పారు, వేసవి మల్లెల వెన్నెలే !
Thanks for commenting.
రాజన్ నాగేంద్ర మరియు రమేష్ నాయుడు పాటలు కూడా రాయండి
నాకు చాలా నచ్చినపాట "ఆది బిక్షువు వాడి నేది కోరేది --బూడిదిచ్చే వాడి నేమి ఆడిగేది". ఎందుకు అంటే ఏమి చెప్పలేను. బహుశ గర్భావిత మైన భావ మేమో. గుర్తు చేసినందుకు థాంక్స్.
ఇంకో రెండు మంచి పాటలు -
1) 'కళ్ళు ' లోని పాట - 'తెల్లారింది లెగండోయ్'. సీతారామ శాస్త్రిగారు స్వయంగా పాడిన పాట.
"ఎక్కిరించు రేయిని చూసి ఎర్రబడ్డ ఆకాశం
ఎక్కుపెట్టి ఇసిరిందా సూరీడి సూపుల బాణం
కాలిబూడిదైపోదా కమ్ముకున్న నీడ
ఊపిరితో నిలబడుతుందా చిక్కని పాపాల పీడ
సెమట బొట్టు సమురుగా సూరీణ్ణి ఎలిగిద్దాం
ఎలుగుసెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దం
కాలం కట్టిన గంతలు తీసి
కాంతుల ఎల్లువ గంతులు ఏసి"
2) ఆనందం లో 'ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా ' పాట.
@ హరే కృష్ణ
మరి అన్నిటిమీద రాయడమంటే.....హ్మ్ కాస్త కష్టమే, ప్రయత్నిస్తాను తప్పకుండా
@లక్కరాజు గారూ
అవునండి, ఆ భావగర్భితమైన పదాలంటే నాకూ చాలా ఇష్టం.
@ Anonymous
అవునండి కళ్ళు లో అన్ని పాటలు చాలా బాగుంటాయి. చీకటి మీద ఒక పాట ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది.
ఆనందంలో అన్ని పాటలు బాగుంటాయి.
Adding some more :
Jalsa :
చలొరె చలొరె చల్ ..చలొరె చలొరె చల్ ..
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా, ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా ..
చంపనిదే బతకవని బతికేందుకు చంపమని నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ..
సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శత్రువనీ..
-----
కొత్త బంగారు లోకం :
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా..
నీ చిక్కులు నీవే ఎవ్వరో విడిపించరుగా..
@Badri
అవును, అవి కూడా చాలా మంచిపాటలు. Thanks!
ఏ పాట విన్నా, "ఇది ది బెస్ట్" అనిపించడమే సిరివెన్నెల ప్రత్యేకత. అన్నింటికంటే 'ఆదిభిక్షువు" పాట బాగుందనిపిస్తుంది. ఇంతలో "ఎవరో ఒకరు" పాట గుర్తొస్తే దానికి ఓటేయాలనిపిస్తుంది. మరో పక్క "అలుపన్నది ఉందా" తలపుకొస్తూ ఉంటుంది.
"నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని, అగ్గి తోటి కడుగు ఈ దగాకోరు ధర్మాన్ని" అంటూ మరోపాట రక్తాన్ని ఉరకలెత్తిస్తుంది.
కొందరు రచయితలు ఒక్కోపాట రాయడానికి హోటల్ రూముల్లో కూచుని ఎన్ని తిప్పలు పడ్డారో రాస్తూ ఉంటారు. ఈయనకు అటువంటి తిప్పలున్నాయో లేవో గానీ ప్రతి పాటా అలా.... అలా ఆశువుగా అలవోగ్గా రాసేస్తారనిపిస్తుంది. అంత ఈజ్ తో,భావుకతతో, పాండిత్యంతో రాసే రచయిత సిరివెన్నెల.
వేటూరిలా "రెండువైపులా"పదునున్న కత్తిలా "వేరే" పాటలు సిరివెన్నెల రాయకపోవడం ఆయన నిబద్ధతో కాదో నాకు తెలీదు కానీ నచ్చే విషయం. (నాకు వేటూరి పాటలూ చాలా ఇష్టం. యమహా నగరి పాట అంత బాగా ఎవరు రాయగలరు?)
ఆయన కలం బూతు పాటలు రాస్తే అభిమానుల గుండెల్లో ఆయనకు గ్రహణం పడుతుంది.
సుజాత గారూ
మీరు చెప్పినది నిజమేనండీ, సిరివెన్నెలవారి ఏ పాట విన్నా గొప్ప గా ఉంటుంది. ఆయన పాట వినగానే ఇది సిరివెన్నెలది అని ఇట్టే తెలిసిపోతుంది. సిరివెన్నెల ముద్ర ఉంటుంది ఆ పాటలమీద.
వేటూరి చాలా గొప్ప రచయితే, చాలా గొప్ప పాటలు రాసారు, కానీ "ఆకలేస్తే అన్నం పెడతా" అని కూడా రాసారు. అలాంటి పాటలు విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ సిరివెన్నెలతో ఆ బాధ కూడా లేదు, అందుకే నేను ఆయన వీరాభిమానిని.
Thanks!
పాటలు అనేవి ముఖ్యంగా పెట్టుబడిదారి వర్గాల కుట్ర. మీరు కనుక జాగర్తగా పరిశీలించారు అంటే అర్థం అవుతుంది. రెండు కూడా 'ప' అనే శబ్దం తో ప్రారంభం అవుతుంది.
బుచోడుగారూ ఎవరిని భయపెట్టడానికి ఈ వేషం? :D
అవునండో నిజమే, పెట్టిబడి దారీ వ్యవస్థకి, పాటలకి లంకె ఉన్నట్టే అనిపిస్తోంది మీరు చెప్తూ ఉంటే :)
చాలా వివరంగా రాశారు :-) బాగుంది. చివర ఒక్క లైన్ తో కంక్లూజన్ మరింత బాగుంది. ఎప్పటికీ పట్టదనే అనుకుంటున్నాను :-) నాకు వేటూరి గారు కూడా ఇష్టమే :-) కాస్త కష్టపడి మంచిని ఏరుకో గలిగితే చాలు :-)
ధన్యవాదాలు వేణూ శ్రీకాంత్ గారూ,
అదే సిరివెన్నెలతో ఆ ఏరుకునే బాధ లేదు కాబట్టి ఓ మెట్టు పైన ఉన్నారు :)
వేటూరి కంటే ఒక మెట్టు పైకి అంటున్నారు, కాని వేటూరే అందరికంటే ఎవరికీ అందనంత పై మెట్టులో ఉన్నారు , ఇక సిరివెన్నెల గురించి ఎంత చెప్పిన ఇంక చెప్పాలనిపిస్తుంది, ఇక బూతు పాటల గురించి అయితే ఒక సారి " ధర్మక్షేత్రం " సినిమాలో " పెళ్ళికి ముందు ఒక సారి.." అన్న పాట వినండి..
@కమల్
ఈ ధర్మక్షేత్రంలో పాట నేను వినలేదు. చాలావరకు ఎవరికీ ఈ పాట తెలీదనుకుంటాను. ఒకవేళ ఉన్నా, ఎప్పుడైనా బాగా ఉడికిన అన్నంలో కూడ పంటికింద రాయి తగులుతుంది కదా, ఇదీ అలాగన్నమాట :)
Thanks!
మూడు దశాబ్దాలైనా "బూతు పట్టని కలం" సిరివెన్నెల మనం.....కాదంటారా?
వహ్వా! ఏమి చెప్పారండీ
మీరిందులో చెప్పారో లేదో నేనంత గమనించలేదు కానీ,
ఖడ్గం సినిమాలోని "ముసుగు వెయ్యొద్దు మనసు మీద" పాటలో కొన్ని అద్భుతమైన లైన్లున్నాయి
@గీతాచార్య
అవునండీ ముసుగువెయ్యొద్దు మనసు మీద పాట బాగుంటుంది. కానీ ఆ పాటలో ఉన్న సంగీతపు రణగొణ ధ్వనులలో ఆ సహిత్యం విలువ కొట్టుకుపోయింది.
నెనర్లు !
మంచి టపా రాసారు సౌమ్య గారు. అయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎన్ని పాటలు ఉదహరించినా ఇంకా ఏదో వదిలేసామే అనుకుంటాము.
ఆయన రాసిన గొప్ప గొప్ప పాటలు గురించి అందరు చెప్పారు. నేను వాటి గురించి మళ్ళీ మాట్లాడడం అనవసరం కాని, ఎక్కువ మందికి గుర్తు ఉండని మంచి పాటలు చాలా ఉన్నాయి.
"ఎంత వరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు"
"సరిపోదోయ్ బ్రతకడం నేర్చేయ్ జీవించడం
గమనం గమనించడం పయనంలో అవసరం"
"మావయ్యంటారు వరసై పసి వారు (చంద్రుని గురించి)
మచ్చను చూస్తారు వయసెదిగిన వారు
తెలివి తెర వేసి తెలిసి వెలి వేసి
తరిమి కొడితే అలా అలా అంతెత్తున నిలిచాడు"
"ఒకటీ రెండంటూ విడిగా లెక్కెడితే తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడు అంకెలు ఎన్నంటే
పక్కన నిలబెడుతూ కలుపుకు పోతుంటే లేక్కలకైన లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే
నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే కోట్ల ఒకట్లై ఎవరి ముసుగులో వాళ్ళుంటామంతే
నువ్వు నేను కలిపి మానమని అనుకున్నామంటే ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒకటే "
పైన ఒక వ్యాఖ్య లో మీరన్నట్టు ఆయన ప్రతి పాట లోను అయన ముద్ర ఉంటుంది. సాహిత్య పరంగా అంతగా ప్రాముఖ్యత లేని , సరదాగా సాగిపోయే ఒక మామూలు పాట లో కూడా ఏదో ఒక మూల ఒక ఆయన ముద్ర కనిపిస్తుంది.
ఉదాహరణ హరేరాం చిత్రం లో 'ప్యార్ కర్నా సీఖో నా..' పాటలో
" ఆశ పుడితే ఆగుతుందా
రాసకార్యాలున్నాయంటే
మూత పెడితే దాగుతుందా
జ్వాల ఆరదే జో కొడితే"
నా బ్లాగు లో "సిరివెన్నెల విరిజల్లులు" పేరుతొ ఆయన మీద అభిమానాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాను. నా బ్లాగు పేరు సిరివెన్నెల అని పెట్టుకోవడానికి కారణం కుడా అయన మీద అభిమానమే.
వ్యాఖ్య పేరుతొ వ్యాసం రాసేసానేమో... టాపిక్ అలాంటిది మరి :)
సాయి ప్రవీణ్ గారూ మీ వీరాభిమానిత్వం అర్థమయింది :) మంచి పటలు సూచించారు. ఎన్ని చెప్పుకున్న ఇంకా కొత్తవి గుర్తువస్తూనే ఉంటాయి. అదే సిరివెన్నెల గొప్పతనం.
కామెంటు రాసినందుకు Thanks!
adurs,mootam sirivennela ni blog llo ki dimpesaru aithe :-)
@సావిరహే
అంత అభిమానం మరి. ధన్యవాదములు :)
బాగుందండి టపా. నాకు వేటూరి, సిరివెన్నెల ఇద్దరి సాహిత్యం చాలా ఇష్టం.
శిశిర గారూ
ధన్యవాదములు!
నాకూ వేటూరి గారి పాటలు ఇష్టమే....కొన్నిటికి మినహాయింపు ఉంది.
Post a Comment